సూటిగా, వాడిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా – చరసాల ప్రసాద్

నెలనెలా వచ్చే బ్లాగు జాబుల్లోంచి అత్యుత్తమమైన మూడు జాబులను సమీక్షిస్తామని చెప్పాం. దానికి ముందు, మంచి బ్లాగులనే ఏకంగా సమీక్షించదలచాం. ఆ వరుసలో మొదటిది ఇది.మొదటగా ఏ బ్లాగును సమీక్షిద్దామని ఆలోచించినపుడు, పొద్దు సంపాదక వర్గం తలపుకు వచ్చింది అంతరంగమే! మా సమీక్షపై మీ సమీక్షలను ఆహ్వానిస్తున్నాం.

———————————————————–

చరసాల రేణుకా ప్రసాద్ చరసాల ప్రసాద్ గా తెలుగు బ్లాగరులకు సుపరిచితుడు. తొలినాళ్ళలో వర్డుప్రెస్సులో ఉన్న తన బ్లాగును స్వంత డొమెయినులోకి మార్చిన తరువాత కొత్త అడ్రసు http://blog.charasala.com/ అయింది. బ్లాగుస్పాటులో నా పలుకు అనే మరో బ్లాగు ఉండేది. అక్కడ ఆయన కలం పేరు స్పందన. అయితే ప్రస్తుతం అందులో రాయడం లేదు.

అంతరంగం తన బ్లాగు పేరు. నిర్మొహమాటం ఆయన జాబుల తీరు. కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాలను మనముందు పరుస్తాడు, చరసాల. చరిత్ర, రాజకీయాలు, తాత్వికత, ఆధ్యాత్మికత, సామాజిక విషయాలు మొదలైన ఎన్నో విషయాలపై విస్తృతంగా రాస్తాడు. తెలుగు బ్లాగుల్లో ఎన్నదగిన వాటిలో అంతరంగం ఒకటి. సమాజం పట్ల బాధ్యత, ఆర్థికంగా, సామాజికంగా అడుగున ఉన్న ప్రజల పట్ల ప్రేమ, సహానుభూతి ఆయన రచనల్లో కనిపిస్తాయి. సమాజ హితం గురించిన ఆలోచనలు ఆయన బ్లాగుల్లో తరచూ దొర్లుతూ ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి.

క్రిములూ, కీటకాలూ, మన్నూ, ఆకాశం, అగ్ని, నీరు, సముద్రాలూ, కొండలూ అన్నీ, అన్నీ ఎదో విధంగా ఇతరులకు ఉపయోగపడుతున్నాయి…ఒక స్వార్థపరుడైన మనిషి తప్ప. ఉదయాన లేచిన దగ్గరినుండీ పరుగే పరుగు కాస్తంత సమయం దొరుకుట లేదు, పరచింతనకీ, పరోపకారానికి! పరసేవ చేయలేని జీవతము జీవించడమెందుకూ?అన్నయ్యకో లేఖ ( http://www.charasala.com/blog/?p=40) అనే జాబులో ఆయన రాసినదిది..అదే జాబులో మరోచోట ఇలా అంటాడు.. “ఇన్ని బాధల మద్యా, ఆకలి కేకల మద్యా నవ్వుతూ బతకడం కంటే వారి మద్యనే ఆ బాధల్ని అనుభవిస్తూ చావడం మంచిదేమొ!

ఉత్తమ జీవితమా X వ్యర్థ జీవితమా? ( http://www.charasala.com/blog/?p=81) జాబు చరసాల ఆలోచనా పటిమను తెలియజేస్తుంది. Quality life పేరిట అమెరికాలో ఎంత వృధా జరుగుతుందో రాసాడు.

చరసాల రచనల్లో కొట్టొచ్చినట్లు కనపడేది, లోతైన విశ్లేషణ. చాలా సునిశితంగా ఉంటుంది ఆయన చూపు. పొలంలో నాన్న చూడకుండా, పుచ్చకాయలు పండాయో లేదో చూసేందుకు కాయ కాయకూ గాట్లు పెట్టిన నాటికే ఈయనకా సునిశిత దృష్టి అలవడినట్లుంది. (ఆ జాబులో – http://www.charasala.com/blog/?p=89మా నాన్నకు ఇంట్లో పిల్లలు గుర్తున్నట్లే ఎక్కడ ఏ పళ్ళు ఉన్నాయో కూడ తెలుసు.” అంటూ ఆయన రాసిన వాక్యం గమనించదగినది. ఇలాంటి ముచ్చటైన పోలికలు బ్లాగులో ఎన్నో కనిపిస్తాయి.)

ఈ సందర్భంలో రిజర్వేషన్లపై ఆయన జాబులను ఉదహరించి తీరాలి. ఈ అంశంపై ఒకటి కంటే ఎక్కువ జాబులే రాసాడాయన. ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలూ రాసాడు. ఈ అంశంపై జూన్ 2006 లో ఆయన ఓ జాబు – http://www.charasala.com/blog/?p=22 -రాసాడు. కుల ప్రతిపదికన రిజర్వేషన్లను ఆర్థికాధారిత రిజర్వేషన్లుగా మార్చాలంటూనే, కుల ప్రాతిపదికపై రిజర్వేషన్లను సమర్ధిస్తూ చక్కటి వాదన చేసాడు. ఆయన వాదన పాఠకుడిని ఆలోచింపజేస్తుంది.

“క్షత్రియ వంశములో పుట్టినవాడే రాజు కావాలి. బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడే పురోహితుడు కావాలి. వైశ్యుడే వ్యాపారం చేయాలి. కుమ్మరే కుండలు చేయాలి. కమ్మరే కమ్మలి పని చేయాలి. చాకలే గుడ్డలు ఉతకాలి. మాదిగే చెప్పులు కుట్టాలి. ఇలాంటివి ఎన్నో అనాదినుండీ కుల రిజర్వేష్న్లుండగా ఇప్పుడు మాత్రమే వాటికి విరుద్దంగా ఇన్ని ఆవేశాలు, ప్రదర్సనలు ఎందుకు?”

ఆ తరువాత, మరో బ్లాగులో వచ్చిన జాబుకు సమాధానంగా రిజర్వేషన్ హక్కు – దేశం తుక్కు తుక్కు” (http://www.charasala.com/blog/?p=95) పేరుతో ఇదే అంశంపై మరో జాబు రాసాడు. చాలా పదునైన విమర్శ ఇది. ఎంతో పరిశీలన ఉంటే గానీ సాధ్యం కాదీ రచన. అంతరంగంలోని అత్యుత్తమ జాబుల్లో ఇది ఒకటి.

చరసాల తన బ్లాగులో ఎక్కువగా చర్చించిన మరో అంశం.. ఆధ్యాత్మికత. దేవుడున్నాడా అనే విషయంపై ఆయనకు నిశ్చితాభిప్రాయాలున్నాయి. తన అభిప్రాయాలను చక్కగా తెలియజెప్పగలిగే భాష కూడా ఉంది. దేవుడి పుట్టుక”, భక్తి అంతా మూర్ఖత్వమేనా? “, ఆధ్యాత్మికం” మొదలైన ఎన్నో జాబులు ఈ అంశంపై రాసాడు. వీటిలో ఆధ్యాత్మికం ( http://www.charasala.com/blog/?p=74) ఎన్నదగినది. అసలు పునర్జన్మలంటూ ఉన్నాయా? లాంటి ప్రశ్నలు తానే వేసి, సమాధానాలు రాసాడు. చాలా చక్కటి జాబు అది, అత్యుత్తమ జాబుల్లో మరోటి.

అయితే, తెలంగాణా రాష్ట్రోద్యమం గురించిన విశ్లేషణలో మాత్రం లోతుగా వెళ్ళి పరిశీలించినట్లగపడదు. ఇది ఆయన సహజ రీతికి విరుద్ధం. వేరుపడడం అనేది సమంజసమా కాదా అనే విషయంపై చర్చించారు గానీ, నిజంగా తెలంగాణ వివక్షకు గురయిందా అనే విషయంపై అంతరంగం స్థాయి చర్చ కనపడదు. (అయితే ‘బ్లాగరి తాను తీసుకున్న అంశపు ప్రతి కోణాన్నీ కూలంకషంగా చర్చించాలని ఆశించరాదు, ఎంతవరకు చర్చించాలనేది బ్లాగరి ఇష్టం’ అనే అంశాన్ని మేము గుర్తిస్తున్నాం.)

చరసాల ఆలోచనా శక్తికి, పరిశీలనా పటిమకు మరో తార్కాణం.. అక్రమంలో క్రమం ( http://www.charasala.com/blog/?p=116)! “ బొంగరం తిప్పినపుడు అది మొదట్లో బాగానే స్థిరవేగంతో తిరుగుతున్నట్లు అనిపించినా క్రమక్రమంగా దాని వేగాన్ని పోగొట్టుకొని చివరికి పడిపోతుంది. అది తిరిగిన మొత్తం కాలంలో ఒక చిన్న డెల్టాX కాలం లో అది స్థిరవేగంతో తిరిగినట్లే అనిపిస్తుంది అంతమాత్రాన అది ఎప్పటికీ స్థిరవేగంతో తిరిగినట్లు కాదుకదా!” సృష్టిలో క్రమమనేది లేదనే తన వాదన కోసం చరసాల ఈ పోలిక చూపుతాడు. ఇలాంటి పోలికలు మరికొన్ని ఉన్నాయా జాబులో. – అత్యుత్తమ జాబుల్లో ఇంకోటి.

చరసాల తన అభిప్రాయాలను చాలా నిక్కచ్చిగా రాస్తాడు. అయ్యప్ప గుడిలోకి ఆడవారిని అనుమతించని సాంప్రదాయాన్ని నిరసిస్తూ ఇలా అంటాడు.. ” నామట్టుకు నేనైతే ఆ గుడి చాయలకే నా జీవితం లో వెళ్ళను. ఏదో కవి అన్నట్లు “ఈ లోకానికే ప్రవేశద్వారం అమ్మ” ఆ అమ్మకే లేని ప్రవేశం మనకు అవసరమా?” ముంబై రైళ్ళలో బాంబు పేలుళ్ళు జరిగిన మరుసటి రోజునుండే జనజీవితం మామూలై పోవడం (దాని గురించి పత్రికలు డబ్బా గొట్టడం) జరిగిన సందర్భంలో, మన కర్మ సిద్ధాంతాన్ని నిరసిస్తూ రాసిన ఒక వ్యంగ్య రచన (http://www.charasala.com/blog/?p=44) ఆయన లోని కోపాన్ని, అవేశాన్ని తెలియజేస్తుంది. గన్యా, డెంగీ ల గురించి రాస్తూ ( http://www.charasala.com/blog/?p=105), శుచీ శుద్ధీ లేని మన అలవాట్లను తూర్పార పడతాడు.

సీరియస్ విషయాలకు నెలవైన అంతరంగం, చీర గురించిన ఓ సరదా జాబుక్కూడా ( http://www.charasala.com/blog/?p=38) చోటిచ్చింది. పిల్లవాడి ఉయ్యాల దగ్గర్నుండి, దాచీ దాచకుండా అందాన్ని ప్రదర్శించేంత వరకు చీర ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఈ జాబులో చరసాల వర్ణించాడు. మనం మరిచిపోతున్న పదాలు (http://www.charasala.com/blog/?p=11) పేరుతో ఆయన రాసిన ఓ జాబును ఇక్కడ ఉదహరించడం తప్పనిసరి. దొంతి, కపిల, కుప్పె వంటి అరుదైన పదాలను గుర్తు చేస్తూ రాసిన ఈ జాబు అంతరంగంలో మరో విలక్షణమైన జాబు.

బ్లాగుల వ్యాప్తిలో వ్యాఖ్యల కెంతో ప్రాముఖ్యత ఉంది. బ్లాగుల్లో రాసే వ్యాఖ్యలు బ్లాగరికెంతో ఉత్సాహాన్నిస్తూ, మరిన్ని జాబులు రాసేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. చరసాల బ్లాగు రాయడంలోనే కాక, ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలు రాయడంలోనూ ముందుంటాడు. మంచి జాబంటూ ఎక్కడైనా కనిపిస్తే అక్కడ చరసాల వ్యాఖ్య కనబడకుండా ఉండదు. ఇతరుల బ్లాగుల్లోని జాబులకుత్తేజితుడై, స్పందనగా తన బ్లాగులో జాబులు రాసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలు రాసేటపుడు కూడా తన అభిప్రాయాలను చాలా సూటిగా వెలిబుచ్చుతాడు! ‘మీ జాబు బాగుంది’, ‘బాగా రాసారు’, ‘అద్భుతంగా ఉంది’.. ఇలాంటి పొడి వ్యాఖ్యలు కాకుండా జాబును విపులంగా చర్చిస్తూ రాస్తూ ఉంటాడు.

చరసాల బ్లాగులో నచ్చని విషయం ఒకటుంది.. అప్పుతచ్చులు! అక్కడక్కడా పంటి కింద రాళ్ళలా తగులుతూ ఉంటాయి అచ్చుతప్పులు. ముఖ్యంగా కారం కారంగా పడుతూ ఉంటుంది.. RTS లో రాసేప్పుడు దొర్లుతూ ఉండే దోషాలివి. సాధారణ బ్లాగుల్లో ఇలాంటి చిన్న తప్పుల్ని పట్టించుకోకపోదుమేమో గానీ, అంతరంగం లాంటి శ్రేష్టమైన బ్లాగుల్లో వాటికి స్థానం లేదని మా అభిప్రాయం!

సాఫ్టువేరు ఇంజనీరుగా అమెరికాలో ఉంటున్న చరసాల, ఇలాగే రాస్తూ మరిన్ని మంచి రచనలను అందిస్తారని ఆశిస్తున్నాం.

-పొద్దు (editor@poddu.net)

This entry was posted in జాలవీక్షణం and tagged . Bookmark the permalink.

8 Responses to సూటిగా, వాడిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా – చరసాల ప్రసాద్

  1. చరసాలగారి బ్లాగు వాసి గురించి బ్లాగర్లందరికీ తెలిసినదే అయినా, ఈ విశ్లేషణ బంగారానికి గోడచేర్పులాగా ఆయన టపాల్లోని అందమైన లోయల్ని మా కనులముందుంచింది. మంచి విశ్లేషణ.

  2. చరసాల బ్లాగు విశ్లేషణ బహు బాగు! విలక్షణమైన, విషయపుష్టి ఉన్న ఒక మంచి బ్లాగుని గురించి చక్కగా సమీక్షించారు. చరసాల జాబులు ఆయనలోని బహుముఖ ప్రజ్ఞకి అద్దం పడతాయి.

  3. నా బ్లాగును నఖశిఖ పర్యంతమూ పరిశీలిస్తేనే గదా ఇంత చక్కటి విశ్లేషణ సాధ్యమయ్యేది! నేనే మరిచి పోయిన నా బ్లాగులను మళ్ళీ గుర్తు చేసినందుకు సంతోషంగా వుంది.
    తెలంగాణా విషయం మీద నా వాదన సూటిగా స్పష్టంగా లోతుగా (పొద్దు అన్నట్లు అంతరంగం స్థాయి) లేదంటే అందుకు కారణం అస్పష్టంగా వున్న నా అంతరంగమే! అందరూ కలిసే వుండాలన్న ఆరాటం, అయితే విడదీయడానికి ఈ రాజకీయులు తెస్తున్న విజాతి సిద్దాంతాలూ, తెలంగాణా సమస్య మీద లోతైన అవగాహనా లేమి, అన్నీ కలిసి తెలంగాణ విషయం మీద పెద్దగా చర్చించలేకపోవడానికి కారణాలు.
    ఇక అచ్చు తప్పుల విషయానికి వస్తే ( శ X ష ) నేను RTSను తప్పుబట్టను. కొన్నికొన్ని పదాల్లో శ/ష వాడటంలో నాకు అనుమానం వస్తుంది. అదే సరైందేమొనని రాసేస్తాను. ఇది నాకు అలవాటైన పొరపాటు. ఈ విషయంలో ఏది సరైందో నేను నేర్చుకోవాల్సి వుంది. మీ పళ్ళ కింద రాళ్ళు పడకుండా వుండటానికి ముందు ముందు శ్రమిస్తాను.
    పొద్దులో బ్లాగు సమీక్షకు మొదటి బ్లాగుగా నా బ్లాగును ఎన్నుకున్నందుకు పొద్దుకు కృతజ్ఞతలు.
    ఇదే వాడి, వేడి ఇకముందూ కొనసాగాలని, పొద్దు ప్రతిపొద్దూ పొడవాలని మనసారా ఆకాంక్షిస్తూ …
    –ప్రసాద్
    http://blog.charasala.com

  4. radhika says:

    చరసాల గారి బ్లాగు విశ్లేషణ చాలా బాగుంది.ఏకొత్త పోస్టు వున్నా దానిలో మొదట వుండే స్పందన చెరసాల గారిదే.కొత్త బ్లాగరులను ప్రోత్సహించడం లో ఆయన ముందు వుంటారు.బ్లాగుల సమీక్షలో ఆయన బ్లాగు ముందు వుండడం లో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.ఏదేమయినా పొద్దు అన్ని శీర్షికల్లో ఇలానే మంచి విషయాలనే చర్చిస్తారని ఆశిస్తున్నాను.

  5. అన్నట్లు ఇంకో విషయం మరిపోయాను. చరసాల గారు వేరే వాళ్ళ బ్లాగులపై వ్యాఖ్యలువ్రాసి ప్రోత్సహించడం ఒక ఎత్తైతే, తన బ్లాగులపై ఇతరుల వ్యాఖ్యలకు తప్పనిసరిగా పేరుపేరునా ప్రతిస్పందించడం ఇంకోఎత్తు.

  6. ప్రసాద్ గారు బహు ముఖప్రజ్ఞాశాలి. చరాసాల బ్లాగుని మొదటి బ్లాగు గా చెప్పడం సర్వదా అభినందనీయం. ప్రతి బ్లాగులోను మొదటి వ్యాఖ్య తనదే అయుంటుంది అనడం అతిశయోక్తి కాదేమో. అది కూడా సందర్భ సహితంగా వుంటుంది. మూడు ముక్కల సమాధానాలు రాయడం ఇష్టముండదు. దాన్ని బట్టి తెలుస్తుంది తను ఎంత లోతుగా ఆలోచిస్తారో. తన సమయాన్ని చాలా మొత్తం తెలుగు మీదే వెచ్చిస్తారనుకుంటా. ఈ బ్లాగ్ సంఘం మొదలయితే ఆయన ప్రముఖ పాత్ర పొషిస్తారని ఆశిస్తున్నాను.

    విహారి
    vihaari.blogspot.com

  7. ప్రసాద్ గారు బహు ముఖప్రజ్ఞాశాలి. చరాసాల బ్లాగుని మొదటి బ్లాగు గా చెప్పడం సర్వదా అభినందనీయం. ప్రతి బ్లాగులోను మొదటి వ్యాఖ్య తనదే అయుంటుంది అనడం అతిశయోక్తి కాదేమో. అది కూడా సందర్భ సహితంగా వుంటుంది. మూడు ముక్కల సమాధానాలు రాయడం ఇష్టముండదు. దాన్ని బట్టి తెలుస్తుంది తను ఎంత లోతుగా ఆలోచిస్తారో. తన సమయాన్ని చాలా మొత్తం తెలుగు మీదే వెచ్చిస్తారనుకుంటా. ఈ బ్లాగ్ సంఘం మొదలయితే ఆయన ప్రముఖ పాత్ర పొషిస్తారని ఆశిస్తున్నాను.

    విహారి
    vihaari.blogspot.com

  8. అత్యధ్భుతమైన విశ్లేషణ …వేనవేల విధాల ప్రశంసకు అర్హమైనది. ప్రసాద్ గారి బ్లాగుని మధించి, శోధించి, గుండెలోతుల్లోనుంచి ఉబికిన అభిప్రాయాలకు/ఆలోచనలకు అక్షరరూపమే ఈ సమీక్ష అనిపించేలా చేయగలిగిన సమీక్షకుని శ్రమకు నా హృదయపూర్వక అభినందనలు… ఒక బ్లాగు గురించి సమీక్ష ఎలా ఉండాలి లేక ఎలా ఉంటే బాగుంటుందో అన్నదానికి ఈ సమీక్ష నిస్సందేహంగా ఒక కొలమానం….

    జ్యోతి గారి ‘ఆహ్వానం’ అనే టపాలో ‘సమీక్ష ఎలా ఉండాలి, ఉంటే బాగుంటుందో’ అని అడిగిన వాటికి నేను వ్రాసిన ‘సూచనలు, సలహాలు అనే వ్యాఖ్య’ కు రాధిక గారు ఈ సమీక్షను తను చదివిన వాటిల్లో నచ్చిన సమీక్ష ఇది ఒక్కటే అని ప్రస్తావించినప్పుడు, తన వ్యాఖ్యల మీద ఉన్న నమ్మకంతో పొద్దులోకి వచ్చి వెదికి పట్టుకున్న ఈ లంకెను చదివిన తరువాత వారి వ్యాఖ్యలపై ఉన్న నమ్మకం ఒక వంద రెట్లు పెరిగింది …అందుకు రాధిక గారికి ధన్యవాదములు… ఈ లంకెను వెదికి పట్టుకోవటానికి పడిన కష్టం క్షణంలో వెయ్యోవంతు కాలంలో మటుమాయమయ్యింది…అందుకు ఈ సమీక్షకునకు/సమీక్షకురాలకు మరొక్కసారి ధన్యవాదములు.

Comments are closed.