నేను-ఆనందం

తొలి పొద్దులో గరిక పూవుపై
మంచు తాకి మైమరచింది నేనేనా?
ముంగిట ముగ్గుకి రంగులద్ది
మురిసిపోయిన మనిషి నేనేనా?
వాన చినుకుల్లో కలిసి తడిసి
అలిసిపోయిన మనసు నాదేనా?
రేకులు రాలుతున్న పూవును చూసి
చెక్కిలి జారిన కన్నీరు నాదేనా?
ఏది అప్పటి సున్నితత్వం?
ఏది అప్పటి భావుకత్వం?
వయసు పెరిగేకొద్దీ
మనసు చిన్నదయిపోతుందా?
ధనం వచ్చేకొద్దీ
ఆనందం విలువ పెరిగిపోతుందా?
-రాధిక(http://snehama.blogspot.com)
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

3 Responses to నేను-ఆనందం

  1. అద్భుతంగా వుంది.
    “వయసు పెరిగేకొద్దీ
    మనసు చిన్నదయిపోతుందా?”
    ఈ అనుమానం నాకూ ఎప్పటినుంచో వుంది. నా కాలేజీ రోజుల్లో నేనూ రాస్తూ వుండిన కవిత్వం నాకు ఇప్పుడు అందడం లేదు. అందమైన సృష్టిని చూసినప్పుడు నాలో రేగే ఆనంద పారవశ్యపు హద్దులు రోజురోజుకీ చిన్నవైపోతున్నాయి. రోహిణీ ప్రసాద్ గారయితే ప్రతి స్పందనకూ మెదడులో జరిగే కొన్ని చర్యల ఫలితమే నంటారు. మరి ఆ విధంగా చూస్తే వయసు పెరిగే కొద్దీ, అనుభవాలు గడించే కొద్దీ మెదడుకు స్పందించే గుణం మొద్దుబారుతుందేమో!
    “ధనం వచ్చేకొద్దీ
    ఆనందం విలువ పెరిగిపోతుందా?”
    ధనార్జనకీ ఆనందానికి సంబందం ఒక హద్దు వరకూ అనులోమానుపాతంలో వున్నా ఆ తర్వాత అది ఆనందానికి ఏ విధంగానూ తోడ్పడదు, పైగా బాధలు పెంచొచ్చు కూడా!
    –ఫ్రసాద్
    http://blog.charasala.com

  2. సరిగ్గా ఇలాంటి అనుమానమే నాకూ వచ్చి, బాల్యపు జ్ఞాపకాలపై తడిసిన కంబళి లాంటి బాధ్యతల ముసుగు పడి ముగ్గిపోకముందే ఒక్కొక్కటీ జాగ్రత్తగా తవ్వితీసి తళతళలాడేట్టు మెరుగుపెట్టి భద్రంగా బ్లాగస్థం చేస్తున్నాను. తవ్వేకొద్దీ వస్తున్నాయి. నాకోసం రాసుకుంటున్నవే నాకూ తృప్తినిచ్చేవి. నేనెందుకు బ్లాగుతున్నాననే అస్పష్టమైన ఆలోచనకు మీ కవిత మెరుగుపెట్టింది. హృద్యమైన కవిత.

  3. దేవి says:

    చాలా బాగా చెప్పారండీ! పదాల సందుల్లోనుంచి భావం జారిపోకుండా చక్కగా పట్టేస్కుంటారు మీరు.

Comments are closed.