ఫిబ్రవరి నెలలో:

అతిథి:
PVSS శ్రీహర్ష (బ్లాగు)

వ్యాసాలు:
ప్రేమ…కథ -ఇస్మాయిల్ (బ్లాగు)

స్త్రీహృదయ రహస్యోపనిషత్తు -పప్పు నాగరాజు (బ్లాగు)

సరదా:

         -జ్యోతి (బ్లాగు)
చిన్నితెర చిరునవ్వులు
లవర్స్ లాఫింగ్ క్లబ్
నోరూరించే ఆహ్వానపత్రిక

బ్లాగు:

        -చదువరి (బ్లాగు)
2006 ఉత్తమబ్లాగులపోటీ

కబుర్లు:

సినిమా:
        -సుగాత్రి (బ్లాగు)
సినిమాలెలా తీస్తారు?-2

సమీక్ష:
అతడు అడవిని జయించాడు -చదువరి (బ్లాగు)

కవిత:
అప్పుడప్పుడూ… -రాధిక(బ్లాగు)

Posted in ఇతరత్రా | Comments Off on ఫిబ్రవరి నెలలో:

దాంపత్యోపనిషత్తు

గతవారం డాక్టరు గారు చెప్పిన ప్రేమ…కథ విన్నారు. ఆ ప్రేమాయణమంతా పెళ్ళి అనే అడంగుకు చేరడానికే కదా? పెద్దలు కూడా ‘పెళ్ళిచేసుకుని, ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్ ఎల్లరు సుఖములు బడయాలోయ్‘ అనే కదా అన్నారు? ఆ సుఖములు బడసే మార్గం (ష్…మగవాళ్ళకు మాత్రమే) నాగరాజు గారు వివరిస్తున్నారు స్త్రీహృదయ రహస్యోపనిషత్తు లో…

పొద్దు

Posted in ఇతరత్రా | 1 Comment

స్త్రీ హృదయ రహస్యోపనిషత్తు

nagaraj-with-cigar.jpgతెలుగుబ్లాగులు చదివేవారిలో సాలభంజికల గురించి తెలియనిదెవరికి? ఈ బ్లాగులో ఒక్కో టపా చదువుతూ ఉంటే ఎక్కడా వెనుదిరగనవసరం లేకుండానే విక్రమార్కసింహాసనంపై ఒక్కో మెట్టూ ఎక్కుతున్న అనుభూతి కలుగుతుంది. “వాక్యం రసాత్మకం కావ్యం” అంటే ఏంటో బోధపడుతుంది. ఆ బ్లాగు రాస్తున్న పప్పు నాగరాజు గారు సుఖమయదాంపత్యరహస్యాలు చెప్తున్నారిక్కడ.

———-

ఈ మధ్య బ్లాగ్రాణులూ, బ్లాగమ్మలూ మెగుళ్ళ మీదేస్తున్న జోకులూ, వాటికి బ్లాగ్పాపలు రాసే అవేదనతో కూడిన కామెంట్లూ చదువుతూంటే, పాపం నాకు చాలా జాలేసి, పోనీలే ఈ ముద్దుగుమ్మలకి మనం కొద్దిగా జ్ఞాన భిక్ష ఎందుకు పెట్టకూడదూ అనే ప్రమాదకరమైన అలోచనొకటి మదిలో మెరిసింది. చెప్పేస్తే, బ్లాగయ్యలూ, బ్లాగ్బాబులూ – “ఓరోరీ నమ్మకద్రోహీ – వేదకాలం నుంచీ పరిరక్షించుకొంటున్న మన రహస్యాలన్నీ ఇలా బట్ట బయలు చేసేస్తావా, పురుష ప్రపంచానికింత ద్రోహం చేస్తావా” అని నన్ను వెలేస్తారేమో అని భయం. అయినా కూడా, బ్లాగ్సోదరీమణుల మీద నాకున్న అభిమానం కొద్దీ కొంచెం రిస్కు తీసుకోక తప్పటం లేదు మరి.

చూడండి అమ్మలూ – మీరేంటి, ఇంకా పన్నెండో శతాబ్దంలోనే ఉండిపోయేరు? మా మగాళ్ళంతా ఈ-టివి ధారావాహికల్లో కథానాయకుల్లాగ, ఆ అనంతమైన ధారలని నిర్విరామంగా సృష్టించే ఆ-టీవీ అధినేతలాగా సుద్ద ముద్దలూ, ముద్ద పప్పులూ అనుకొంటున్నారా? మేం చాలా తెలివిమీరిపోయేమండీ.

“నువ్వు చేసిన వంట మా అమ్మ చేసినట్టులేదు” అనే తెలివితక్కువ వెధవాయిలెవ్వరూ ఇప్పుడు లేరు. అలాగని, ఏది చేసినా కిమ్మనకుండా తినేస్తాం అనుకున్నారా? ఇప్పుడో కొత్త రూటు కనిపెట్టేం. “ఇది బానేఉంది కాని అమ్మడూ, మీ అమ్మగారు చేసే ఇడ్లీలైతే మల్లిపూల దొంతర్ల లాగుంటాయి” అంటాం – నస పెట్టడానికి ఎవరమ్మైతే ఏంటి? “మా” ని, “మీ” గా మార్చీగానే, పాపం, ఆ అమాయకురాలి మొహం చింకి చాటలా అయిపోయి, తెగ సంబరపడిపోయి, అంతకన్నా ఎక్కువగా ఇన్-స్పైర్ అయిపోయి, వాళ్ళింటికి ఫోను చేసేసి, వాళ్ళమ్మ దగ్గరనుంచి ఆ రెసెపీ రహస్యం ఏదో కనేసుకొంటుంది. రెసిపీ ఎక్కడ నుంచి వస్తే మనకేంటి – కమ్మటి భోజనం కావాలి, కాని? అయితే, “మా” అంటే ఎందుకంత ఉక్రోషమో, “మీ” అంటే ఎందుకంత సంబరమో మాత్రం నాకింత వరకూ అర్ధం అయ్యి చావలేదు.

అలాగే బట్టలుతకడం కూడాను. “నీ కెందుకోయ్ ఈ శ్రమ అంతా, ఆ బరువేదో నేను మోస్తాను కదా” అని, స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళలా, ఆ వాషింగ్-మెషిన్ మీట నొక్కేసే బరువు మన నెత్తినేసుకొంటే – బోలెడు లాభాలు. ఇంటి పనేదో చేసేస్తున్నాం అన్న క్రెడిట్ కొట్టీయ్యొచ్చు, ఆ పైన, దుప్పట్లూ, చీరలూ, లంగాలూ, గలేబులూ మొదట లోడులో కుక్కేసి, మన చొక్కాలు, పేంట్లకోసం “స్పెషలు” లోడొకటి తీరుబడిగా వేసుకోవచ్చు – గుండమ్మ కథ లో రమణారెడ్డి డబుల్-రోస్ట్ పెసరట్టులాగ.

మనకంటే, ఆవిడ రెండాకులు ఎక్కువే చదివింది కాబట్టి, మన దూరాలోచనలన్నీ ఓ క్రీగంట కనిపెడుతూనే ఉంటుంది కదా. “మరీ హద్దు మీరిపోకు బాసూ” అని మనకి చెప్పడానికి ఒకోసారి “ఏంటి నీ బట్టలకి స్పెషల్-లోడేసేవా? మా బాబే – మగ బుద్ది – పో…నిచ్చుకొన్నావు కాదు” అంటూ, కళ్ళోసారి చక్రాల్లా తిప్పి, మూతోసారి మిరపకాయలా విరిచి, ముక్కోసారి చిక్కుడుకాయలా చిక్కి, చీర కొంగు బొడ్లో దోపి, కయ్యానికి కాని కాలు దువ్విందనుకోండి – తడబడిపోయి, తెల్లమెఖం పెట్టక్కర్లేదనిన్నీ, కొంచెం సెన్స్-ఆఫ్-హ్యూమర్ ఉపయోగించి -“సందేహింపకుమమ్మా, రఘురాము ప్రేమనూ” అని పాటెత్తుకొని – “ఒకే బాణలి, ఒకటే లోడు, రెండు లేవులే నా విరిబోణీ” అని పేరడీ పాడేసి, అక్కడ “నా” దగ్గర ముక్కుతో సాగదీసి, అవసరమైన దానికన్నా ఓ మూడు గమకాలు ఎక్కువే పలికిస్తే, స్త్రీ హృదయం లబ లబ లాడిపోతుందనిన్నీ, అసలు విషయం మరిచిపోతుందనిన్నీ మేం కనిపెట్టేసాం. ఒకవేళ, కోపం పోయినా, ఇంకా కినుక పోక ఆవిడ కూడా (మనకెంత సెన్సాఫ్-హ్యూమరుంటుందో, అంతకన్న అవిడకి ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది – ఇది రూలు) – “రఘుకులేశుడే ధర్మము వీడి రెండు లోడులే వేసిననాడు” అనందుకుందనుకోండి, ఆవిడని అక్కడే ఆపేసి, “అమ్మణ్ణీ, అలాటి కర్ణ కఠోరమైన మాటలు నీ నోట రాకూడదు, నా చెవిన పడకూడదు” అని చల్లగా జారుకొనే ప్రయత్నం చెయ్యాలనిన్నూ, అప్పుడావిడ “మరి నేను కట్టిన పేరడీ కూడా వినవా, ప్లీజ్” అంటూ, ఆవిడేంటి, అవిడ తల్లో జేజెమ్మ కూడా మన కాళ్ళబేరానికొచ్చేస్తుందనిన్నూ కూడా మాకు బాగా తెలుసు. ఆవిడకేదైనా చెప్పాలనిపిస్తే, చెప్పేదాకా ఓర్చుకోలేదు కదా?

కొద్దిగా సమయస్ఫూర్తీ, ఇంకొంచెం స్నేహరసం పండించేమంటే, సంసారసాగరం అంతా ఆవిడొక్కర్తే అవలీలగా ఈదేస్తుందనిన్నూ, ఆ శక్తి సామర్ధ్యాలన్నీ ఆవిడకి భగవంతుడు పుట్టుకతోనే ప్రసాదించేడనిన్నూ, అందుకని మనం చక్కగా ఒడ్డున కూచుని చదరంగం ఆడుకోవచ్చుననిన్నూ కూడా మాకు అర్ధమైపోయింది. ఒకవేళ ఎప్పుడైనా, నెలకోసారి ఆవిడ కాని కించిత్ అలసిపోతే, ఓ శనివారం ఉదయం మనమే బ్రేక్-ఫాస్ట్ లోకి ఉప్మా చేసేసి, లంచులోకి కూరలు తరిగేసి, అదే చేత్తో ఆవిడ పుట్టింటి వాళ్ళ పొగడ్తలనే సొరకాయలు కూడా సున్నితంగా కోసేస్తే – (ఇది మాత్రం చాలా కష్టమైన పని – నాలాంటి వాళ్ళకైతే మరీ కత్తి మీద సామే – పుట్టింటి వాళ్ళ ప్రసక్తి రాగానే, అందులోనూ పొగడ్తలంటే – ఆవిడ ఒళ్ళంతా చెవులు చేసుకొని వింటుంది – మనం చెప్పే ప్రతి అక్షరం అక్షరం మధ్యలో ఉన్న చీకటి పొరల్లోకీ, పదం పదం మధ్యలో ఉన్న సందుగొందులన్నింటిలోకీ టార్చిలైటేసి మరీ వెతుకుతుంది – ఏమైనా సెటైరుందేమోనని) – ఆ కష్టమంతా రాత్రికి తప్పకుండా పండుతుందనిన్నీ, ఆదివారం ఉదయం, ఆ పండిన పళ్లన్నీ మన కిష్టమైన పూరి-కూర రూపంలో మన పళ్లెంలోకొచ్చేస్తాయనిన్నూ కూడా మాకు చాలా చాలా బాగా తెలుసు.

వాన పడుతున్నప్పుడు, మాకు పకోడీలు తినాలనిపించిందనుకోండి – “పకోడి చెయ్యి” అని అర్డరివ్వటం మా తాతల పద్దతి, “పకోడీలు చేస్తావేంటి” అని అభ్యర్దించటం మా తండ్రులనాటి పాత చింతకాయ పచ్చడి. ఇప్పుటి దారి వేరు. కొంచెం సేపు కిటికీలోంచి వర్షాన్ని తిలకించి, ఆవిడనొకసారి పిలిచి, “అమ్మలూ, నీకు గుర్తుందా – మనం ఓ సారి ఊటీలో ఇలాగే వర్షం పడుతుంటే, హోటలువాడి ప్రాణాలు కొరికి వాడి చేత వేడి వేడి పకోడీలు చేయించుకొని, రూము బయట బాల్కనీలో ఒక పక్క తడసిపోతూ, పకోడీలు తిన్నాం గుర్తుందా” అని మధుర స్మృతోటి ఆవిడ మదిలో రేకెత్తిస్తే – “ఇప్పుడు చెయ్యనా” అంటూ, మన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా, పిండి కలిపేస్తుందన్న పరమ రహస్యం మాకు ఈ మధ్యనే ఎరుకలోకొచ్చింది.

ఇక పోతే, యజుశ్శాకాధ్యాయిల ఆపస్థంభ (ఆపధ్దర్మ) సూత్రాలు:

సిగరెట్టు కొనుక్కోడానికి బయటకెళుతున్నప్పుడు “ఏమైనా కావాలా” అని తలుపు దగ్గరనుంచే ఓ కేకేసి పారిపోతే, మనం పుస్తకం చదువుకొంటున్నప్పుడు పనులు చెప్పరని మాకు తెలుసు.

చిన్నదాని చిత్తంలో కొత్త చీరనే ఓ చిత్రం పడిందనుకోండి – ఆ చీర బీరువాలోకి వచ్చేదాకా మరాగదు కదా? ఆవిడ చీర కొనుక్కుంటే మన సొమ్మేం పోయిందీ, ఏమీ పోదు, కాని చిక్కేమిటంటే – “మనం ఈ శనివారం షాపింగుకెళ్తున్నాం” అని అల్టిమేటం వేసిందనుకోండి మేడంగారు – అక్కడే ఇబ్బందంతా. ఆవిడ గారితో పాటు ముప్పై షాపులు తిరిగే ఓపికెవరికుందీ? దీనిక్కుడా కొన్ని చిట్కాలున్నాయి. “రావడానికి నాకేం అభ్యంతరం లేదనుకో. కాని, నేనొస్తే, నీ కాళ్ళకడ్డం పడడం తప్పించి ఇంకేం ప్రయోజనం లేదు, అదే, నువ్వూ, మీ ఫ్రెండు శారదా కలసి వెళ్ళేరనుకో – చక్కగా మీక్కావలిసిన సెలక్షన్లు చేసుకోవచ్చూ, చీరలతో పాటు డొక్కులో-డోరు కర్టెన్లో కూడా కొనుక్కోవచ్చూ, కాఫీడేలో కాస్సేపు కూర్చొని కబుర్లూ చెప్పుకోవచ్చు” అని విశ్వనాథ్ సినిమాలో స్క్రీన్-ప్లేలాగా, అందంగా వర్ణించి, ఊరించి, ఆఖరికి – “నీకెందుకు- శారదా వాళ్ళాయన్నీ, పిల్లలని నేను చూసుకొంటాను కదా” అని మాష్టరుప్లానొకటి ఆవిడ బుర్రలోకెక్కించేం అనుకోండి – అది పారితే (పారటం అనేది చీర ముఖ్యమా, మనతో షాపింగు ముఖ్యమా అనే దానిమీద ఆధారపడుంటుంది) – మనకెన్ని లాభాలో చెప్పలేం. ఆ శారదని షాపింగుకి పిలవాలంటే, శనివారం వాళ్ళని లంచుకి పిలవాలి కదా – పప్పన్నంతో బాటు, పాయసమో, పులిహోరో కూడా మనకి దక్కుతుంది, ఆడాళ్ళిద్దరూ బయటకి పోతే, నేషనల్ జియోగ్రాఫిక్ వారి పులులూ, సింహాలూ, మొసళ్ళ వీడియోలు పిల్లల మొహాన కొట్టి, ఆ శారదా వాళ్ళాయనతో మనం ఎంచెక్కా చదరంగం ఓ రెండెత్తులేసుకోవచ్చు.

ఇలాంటివే ఇంకా చాలా ఉన్నాయి గాని, అన్నీ చెప్పడం కుదరదు.

అసలు సిసలు పూర్ణ పురుష రహస్యం (రేమాండ్ కంప్లీట్ మాన్ సీక్రెట్):
స్త్రీ హృదయం అర్ధం చేసుకోవటం ఏమంత కష్టం కాదని మేం కనిపెట్టేసేం – అందులో ప్రేమానురాగాలు తప్పించి ఇంకేం ఉండవని, తోడిన కొద్దీ అవి ఊరుతుంటాయనీ, తోడకపోతే, అవి గడ్డకట్టే ప్రమాదం ఉందనే చిదంబర చిదానంద చిన్మయ రహస్యం మాకెరికే.

అందుకని అమ్మాయిలూ, మేం అంతా ఎప్పుడో – ఈ సంసారం అనే వైకుంఠపాళీలో పాములన్నీ దాటేసి, నిచ్చెనలన్నీ ఎక్కేసి పరమపదం చేరుకొని, అక్కడ వాలుకుర్చీలో కూర్చొని – హాయిగా – చుట్టకాల్చుకొనే అంత ఎత్తుకి ఎదిగిపోయేం. మీరెప్పుడైనా అక్కడికి చేరినా, అక్కడ కూడా మీ చేత పకోడీలేయించుకోడానికి ఓ అరకేజీ శెనగపిండీ, పావుకేజీ ఉల్లిపాయలూ, మిగతా సామగ్రీ అంతా ముందునుంచే సిద్దం చేసుంచేం కూడా. మీరుకూడా అక్కడకొచ్చేమాటైతే, మేం ఎలాగూ ఎదో ఒకటి – ఉప్పో, మిరపకాయో – మరచి పోతాం అని మీకు తెలుసు కదా – అవి పట్టుకొని వచ్చేయండేం?

మీ మనసుల్లోని లోతులు మేం ఎప్పుడో కనిపెట్టేశాం కాని, మా బుర్రల్లోని “ఎత్తులు” కనిపెట్టేంత ఎత్తు మీరింకా ఎదగలేదు. ఆంచేతా – మేమెప్పుడూ మీకన్నా ముందే. ఆ చంద్రిగాడిని చంకనెత్తుకొని మీ సూరిగాడి చుట్టూ చక్కర్లు కొట్టక తప్పదు మరి మీకు – అందుకే భూమాత అనే ఓ బిరుదు మీ తలకెత్తేం కూడా.

బ్లాగ్బాబులూ – ఇది స్త్రీ హృదయ రహస్యమనే ఓ ముఖ్యమైన ఉపనిషత్తు. ఇందులో అతివలకర్ధం కాకుండా మీకు మాత్రమే అర్ధమయ్యే రహస్యాలున్నాయి కదా? ఇవన్నీ చాలామందికి ఇప్పటికే తెలుసనుకోండి, ఒకవేళ తెలియక పోతే – మీకు కావాలంటే నిరభ్యంతరంగా ఉపయోగించుకోండి – కాపీరైటు సమస్యలేం లేవు.

అయితే ఒక చిన్న, అతి ముఖ్యమైన సలహా – ఈ సీక్రెట్సన్నీ చాలా చక్కగా పనిచేస్తాయి, మేమంతా చాలా సార్లు టెస్ట్ చేసేం కూడా, కానీ, వీటిని ప్రయోగించాలంటే – టైమింగ్ చాలా ఇంపార్టెంటు. క్రికెట్టులో సిక్సరు కొట్టాలంటే – టచ్, టైమింగ్ ఎంత అవసరమో – ఈ సూత్రాలు పనిచెయ్యాలన్నా అంత టైమింగవసరం, లేకపోతే క్లీన్-బౌల్డు అయిపోతారు. అంత కంటే ముఖ్యం – మీ ఆవిడని మీరు మనసారా ప్రేమించాలి, ఆ సంగతి ఆవిడ పూర్తిగా, సంపూర్తిగా, పరిపూర్తిగా నమ్మాలి. లేకుంటే – ఈ అస్త్రాలన్నీ అతి దారుణంగా బెడిసి కొడతాయి. కాబట్టి తస్మాత్ జాగర్త.

ఈ అస్త్ర విద్య మీ సొంతం కావాలంటే మీరొక వ్రతం పాటించాలి – ఆ వ్రతం పేరు అసిధారా వ్రతం.

ఆ వ్రతవిధానంబెట్టిదనగా:

మీరావిడ మెడలో తాళి కట్టిన మరుక్షణం నుంచి మిమ్మల్ని ఆవిడ చాలా గుడ్డిగా నమ్ముతుంది. ఎంత గుడ్డిగా నమ్ముతుందంటే, పెళ్ళైన మర్నాడే, విమానం ఎక్కి మీతో అమెరికా రావటానికి కూడా ఆవిడ ఒక్క క్షణం కూడా సందేహించదు. ఏ కొంచెం మీరు పప్పులో కాలేసినా – ఆవిడ నమ్మకం చెదిరిపోతుంది, ఒకసారి చెదిరిందా – మీరు దాన్ని తిరిగి జీవితంలో సంపాదించలేరు. మీరేదో పెద్ధ వెధవ పనిచెయ్యక్కర్లేదు – చాలా చిన్న వెధవ పని చేసినా చాలు ఆ నమ్మకానికి గండి పడటానికి. మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచేటంతలో తీరని నష్టం వాటిల్లుతుంది.

ఆవిడ మీమీదుంచిన గుడ్డి నమ్మకమే – మీ మెడకానించిన కత్తి వాదర. ఆ నమ్మకం చెదరగొట్టుకోకుండా జీవించడమే మనకి కత్తిమీద సాము. ఇదే అసిధారావ్రతమంటే. వరలక్ష్మీ వ్రతాలు, మంగళగౌరీ వ్రతాలు, అట్లతద్ది నోములూ లాటి సుళువు వ్రతాలన్నీ ఆవిడ చేస్తుంది – ఈ అసిధారావ్రతం మట్టుకు మీరు ఆచరించవలసిందే – తప్పదు.

అందుకని, నటించకండి – నటించి ఆడదాన్ని, అందులోనూ కట్టుకొన్నదాన్ని ఎప్పుడూ నమ్మించలేరు. సమయస్పూర్తి అంటే, సమయానికి తగ్గ కాకమ్మ కథలు చెప్పడమని కాదు నా ఉద్దేశ్యం – మనకున్న అనురాగాన్ని సరియైన సమయంలో, సరియైన మోతాదులో, శ్రుతి మించకుండా, తాళం తప్పకుండా వ్యకపరచడమే ఆనంద సాంగత్య రాగం. ఈ రాగంలోని సప్త స్వరాలు: సంస్కారం, అనురాగం, గౌరవం, అభిమానం, ప్రేమ, ఆదరణ, నమ్మకం, స్నేహం.

మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, నేనింతకు ముందు చెప్పిన అస్త్రవిద్యా రహస్యాలన్నీ ప్రయోగోపసంహారాలతో సాంగోపాంగంగా అభ్యసించి, మీరు కూడా మిగతా మా అందరిలాగే – వైకుంఠపాళీలో పాములన్నీ దాటేసి, నిచ్చెనలన్నీ ఎక్కేసి – పరమపదం చేరుకోండి. అక్కడ మనమంతా ఎంచక్కగా చీట్లపేకో, చదరంగమో ఆడుకోవచ్చు.

మా అవిడో బ్లాగిన్సిపెక్టర్ లెండి – అప్పుడప్పుడూ నా బ్లాగు తనిఖీ చేస్తుంటుంది. అందుకే, అవిడ కళ్ళ బడకుండా – దీన్ని పొద్దులో పాతరేస్తున్నాను, ఇదీ దూరాలోచనంటే, ఏమనుకున్నారు మా పవరూ? “మేం చెప్పేస్తాం కదా” అని మీరు చంకలు గుద్దుకోనక్కరలేదు. ఒకవేళ ఆవిడ కంటబడినా అంత నష్టమేం లేదు – మావి అక్షయ తూణీరాలు.

-పప్పు నాగరాజు (http://salabanjhikalu.blogspot.com)

Posted in వ్యాసం | 28 Comments

ఈ నెలలో వచ్చిన బ్లాగు సోదరుల పెళ్ళిరోజులు మరియు పెళ్ళిళ్ళ సందర్భంగా జ్యోతిగారి సరదా పెళ్ళిపత్రిక సరదా శీర్షికలోను, బ్లాగుల పోటీల సందర్భంగా 2006 ఉత్తమ బ్లాగుల పోటీ వ్యాసాన్ని బ్లాగు శీర్షికలోను చూడగలరు.

పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on

నోరూరించే ఆహ్వాన పత్రిక

jyothi.bmpఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు గత అక్టోబరులో మొదలుపెట్టిన వంటల బ్లాగు మూడు నెలలు తిరక్కుండానే వంద టపాలు పూర్తిచేసుకుంది. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శీర్షిక: సరదా.

జ్యోతిగారి సరదా బ్లాగు http://vjyothi.wordpress.com/ .

——————–

ఈ నెలలో ప్రేమలు, పెళ్ళిళ్ళు, పెళ్ళిరోజులతో మన బ్లాగులోకం కళకళ లాడుతోంది.అందుకే ఈ ప్రత్యేకమైన పెళ్ళి పత్రిక.

sweets.jpg

శ్రీరస్తు *********** శుభమస్తు *********** అవిఘ్నమస్తు

వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక

స్వస్త్రిశ్రీ చాంద్రమాన శ్రీ వ్యయనామ సo|| ర ఫాల్గుణ బ|| నవమి ఆదివారము తేది 25.2.2007 ఉ|| గం|| 10.17 ని|| లకు రోహిణీ నక్షత్ర యుక్త మేషలగ్న పుష్కరాంశ సుముహూర్తమున

మా కనిష్ట పుత్రుడు

చి|| మసాలాదోసె

కు

చి||ల||సౌ|| బంగాళదుంపఖుర్మా

తో

(మ||రా|| శ్రీమతి & శ్రీ టొమాటో శర్మగారి ద్వితీయ పుత్రిక)

వివాహము జరిపించుటకు దైవజ్ఞులు నిర్ణయించినారు.కావున తామెల్లరు బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి,మాచే నొసగబడు భోజన తాంబూలాదులు స్వీకరించి మమ్మానందింప చేయ ప్రార్ధన.

కల్యాణ వేదిక:
పులిహోర ఫంక్షన్ హాల్, రవ్వలడ్డు రోడ్,
బాదుషా ఊరు, జాంగ్రీ జిల్లా, జామూన్ రాష్ట్రం

విందు:
26.2.2007 సోమవారం
చక్రపొంగలి గార్డెన్స్, సమోసా రోడ్
మైసూర్పాక్ ఊరు, జిలేబి జిల్లా, పూతరేకు రాష్ట్రం

ఇట్లు
శ్రీమతి వడ శర్మ
శ్రీ ఇడ్లీ శర్మ

(శ్రీమతి & శ్రీ పూరీ శర్మ,శ్రీమతి & శ్రీ దోసె రెడ్డి,మరియు బంధుమిత్రుల అభినందనలతో)

Posted in వ్యాసం | Tagged | 2 Comments

2006 ఉత్తమ బ్లాగుల పోటీ

2006 సంవత్సరానికి భారతీయ బ్లాగుల్లో ఉత్తమమైన వాటిని ఎన్నుకునే పోటీలో రెండో అంకం మొదలైంది. ఇండీబ్లాగీస్ వారు నిర్వహిస్తున్న ఈ పోటీ, నామినేషన్ల స్థాయిని దాటి రెండో అంకం లోకి ప్రవేశించింది. నిర్ణేతల సంఘంలో తెలుగు బ్లాగులను పరిశీలించినవారు వీవెన్, మురళీధర్ జూపూడి.

పోటీలో నామినేషను పొందిన తెలుగు బ్లాగులు:

  1. : నిరుటి పోటీలో మేటి, నేటి పోటీలోనూ అదే ధాటి. బ్లాగులోని ప్రతి జాబూ తనకు తానే సాటి
  2. : సూటిగా, వాడిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా ఉండే బ్లాగు
  3. దీప్తిధార: బ్లాగు వార్తలు, నెల్లూరు, అడవులు, పక్షుల గురించిన బ్లాగ్ధార
  4. గుండెచప్పుడు: తెలంగాణ కథలు, అభివృద్ధి కథల వెనక అసలు కతలు, వెతలు
  5. నా మదిలో..: కంప్యూటరు, ఇంటర్నెట్టు, సినిమాలు.. ఆ మదిలో
  6. కలగూరగంప: ఓ కుమారుడు రాస్తున్న తండ్రి జీవిత కథ
  7. కల్హార: ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. మహిళాబ్లాగరులు రాసేవాటిలో నుంచి నామినేటైన ఏకైక బ్లాగు
  8. చదువరి: భాష, సమాజం, రాజకీయాలు, మీడియాల గురించి ఆవేదన. పదునైన వాగ్బాణాలు, వ్యంగ్య హాస్యోక్తులు
  9. ప్రసాదం: గిలిగింతల హాస్యంతో కూడిన బ్లాగు. ప్రసాదం లాగే కొద్ది కొద్దిగా పెడతారు
  10. సత్యశోధన: భాషతో దున్ని, ఎరువేమీ లేకుండా (ఎరువు ఏమీ లేదు, అంతా స్వంతమే!) హాస్యాన్ని పండించే బ్లాగ్భూమి
  11. శ్రీకృష్ణదేవరాయలు: చిరు నుండి గురు దాకా, ‘రాయల’సీమ నుండి బుష్షుసీమ దాకా.., భూమ్మీదా, గాల్లోనూ
  12. తెలుగుజాతీయవాది: చిక్కని భాష, పదునైన భావాలు, లోతైన విశ్లేషణతో తెలుగు జాతీయవాద ఆవిష్కరణ
  13. తెలుగుదనం: తెలుగు వారల, తెలుగు వార్తల పట్టివేసే నెట్టు జాలరి, ఈ బ్లాగరి
  14. అవీ-ఇవీ: విషయ వైవిధ్యం, భాషా వైదుష్యం, సాహితీ సంపత్తి,.. ఇన్నేల? అవీ, ఇవీ.. అన్నీ
  15. విహారి: పలు విషయ నికుంజముల విహారి,ఈ బ్లాగరి.

బ్లాగరులకు పరీక్ష మొదలైంది. ఈ పదిహేను బ్లాగుల్లోంచి ఒకదాన్ని ఎన్నుకోవడమంటే కత్తి మీద సామే! అన్నీ మంచివే, చదవచక్కని బ్లాగులే. పై జాబితాలో చేరదగిన బ్లాగులు ఇంకా ఉన్నాయనేది మనకు తెలుసు. బహుశా పోటీ నిబంధనలకు అనుగుణంగా లేనందువల్లనో, మరో కారణం చేతో అవి ఈ జాబితాలో చేరకపోయి ఉండాలి.

    మంచి బ్లాగును ఎన్నుకునేందుకు కొలబద్ద ఏమిటి?
    బ్లాగుల మంచిచెడ్డలను కొలిచే కొలబద్దలు ఏమీ లేనప్పటికీ కొన్ని అంశాలను పరిశీలించి మంచిదాన్ని ఎంచవచ్చు. అలాంటి అంశాల్లో కొన్ని:

    1. విషయ పుష్టి
    2. స్వతంత్ర రచన లేక పునఃప్రచురణ
    3. శైలి, భాష
    4. విషయ వైవిధ్యం

    పోలింగు విధానం:

    • http://poll.indibloggies.org/index.php?sid=1 లింకుకు వెళ్ళండి.
    • మీ పేరు, ఈమెయిలు అడ్రసు వగైరాలను ఇచ్చి నమోదు చేసుకోండి. వెంటనే మీకో ఈమెయిలు వస్తుంది.
    • ఆ ఈమెయిలు లోని లింకును అనుసరించి వెళ్తే, బ్యాలెటు పేజీకి చేరుకుంటారు.
    • భారతీయ బ్లాగుల్లో వివిధ విభాగాల్లో మంచివాటిని ఎన్నుకునే పేజీ మొదటిది కాగా, వివిధ భాషా బ్లాగుల్లో మీరు మెచ్చిన దానికి వోటేసే పేజీ రెండోది.
    • అయితే సైన్సు, టెక్నాలజీ బ్లాగులకు వోటెయ్యాలంటే మాత్రం పై పేజీల్లో కుదరదు. దాని కోసం http://poll.indibloggies.org/index.php?sid=2 లింకుకు వెళ్ళి విడిగా నమోదు చేసుకోవాలి. మళ్ళీ మీకో మెయిలూ, దానిలో ఓలింకూ వస్తాయి. ఆ లింకును పట్టుకుని పోతే సంబంధిత బ్లాగుల బ్యాలెటు పేజీకి చేరుకుంటారు. ఏదో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రత్యేక ఏర్పాటు చేసారట.
    • పోలింగుకు చివరితేదీ: ఫిబ్రవరి 20.
    • ఇప్పటికే వోటేస్తే సరి, లేకపోతే వెయ్యండి మరి!
    • ఒక్క గమనిక.. ఇది 2006 బ్లాగుల పోటీ. ఆ ఏట వచ్చిన బ్లాగు టపాలనే పరిగణించండి.

    ఉత్తమ తెలుగు బ్లాగుకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని తేనెగూడు సమర్పిస్తోంది.

    పొద్దు

    ఇటీవలి టపాలు:

    ప్రేమ…కథ

    కబుర్లు

Posted in జాలవీక్షణం | Tagged | Comments Off on 2006 ఉత్తమ బ్లాగుల పోటీ

పొద్దు పాఠకులకు మహాశివరాత్రి కానుకగా ప్రముఖ తెలుగు బ్లాగరి డాక్టర్ ఇస్మాయిల్ సుహేల్ పెనుగొండ (చింతు) చెప్తున్న ప్రేమ…కథ, దాంతోబాటే కబుర్లు అందిస్తున్నాం.

ప్రేమ…కథ

కబుర్లు

పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on

కబుర్లు

సత్యం వద…: జర్మనీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు దొరక్కుండా వచ్చి ఇంట్లో దాక్కున్నాడొకతను. అతనెక్కడున్నాడో తెలియదని వాళ్ళావిడ బుకాయిస్తుంటే మూడేళ్ళ కూతురు కలగజేసుకుని తన తండ్రెక్కడున్నాడో చూపించి అరెస్టు చేయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజమే చెప్పాలని కూతురికి బోధించిన ఆ తండ్రి అందుకు బాధపడలేదు. పైగా కూతురు తన మాటలు బాగా వంటబట్టించుకున్నందుకు సంతోషిస్తున్నానన్నాడు.

*******************

తొందరగా పడుకుని తొందరగా నిద్రలేవాలని మనవాళ్ళు ఎప్పట్నుంచో చెప్తున్నారు. మనం వింటేనా? రాత్రి పూట ఎక్కువసేపు మేలుకుంటే మెదడులోని జ్ఞాపకాల కేంద్రమైన hippocampus పనితీరు దెబ్బతింటుందని, అందువల్ల ఎక్కువగా మేలుకునే పిల్లలు చదువులో వెనుకబడుతారని ఇటీవలే ఒక పరిశోధనలో కూడా తేలింది.

*******************

కొండకు రంగేయిస్తున్న ఫెంగ్ షుయ్? నైరుతి చైనాలో Lao Shou  పర్వత సమీపాన గల గ్రామస్థులకు అధికారులు ఆ కొండకు ఆకుపచ్చ రంగులెందుకు వేయిస్తున్నారో అర్థం కాలేదు. మరే కారణమూ కనబడక ఆ ఊరి వాస్తు(ఫెంగ్ షుయ్)ను మార్చడానికేమోనని ఊహిస్తున్నారు!

*******************

ఈసారి అమెరికాలో ఉన్నవాళ్ళు మంచుతో బాగా ఇబ్బందిపడ్డారు. కానీ నేపాల్ రాజధాని ఖాట్మండులో 63 సంవత్సరాల తర్వాత కురిసిన మంచును చూసి చిన్నా పెద్దా అందరూ ఎంతగానో సంబరపడ్డారు. నడివయసు తల్లులు కూడా తమ పిల్లలతో కలిసి సరదాగా మంచులో ఆటలాడుకున్నారు.

*******************

వాతావరణంలో చోటుచేసుకునే స్వల్ప మార్పులను సైతం ఎప్పటికప్పుడు నిశితంగా పసికట్టి, భూమికి చేరవేసేందుకు వీలుగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మూడు ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది.

*******************

దేశంలో ప్రాథమిక విద్యా స్థాయిలో చిన్నారులకు ప్రైవేటు ట్యూషన్లు చెప్పించడం సిగ్గుచేటని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ అభిప్రాయపడ్డారు.

*******************

ధైర్యే సాహసే లక్ష్మీ: హైదరాబాదులో ఒకామె తన మెళ్ళోని గొలుసు లాగబోయిన దొంగ మొహం మీద చాచికొట్టేసరికి వాడు లబోదిబోమంటూ కారులో పారిపోబోయి, ఆమె తన చొక్కా పట్టుకుని విడవకుండా వెంటబడేసరికి దిక్కుతోచక కారుతో గోడను గుద్దేసి, చివరికి కారునొదిలేసి పారిపోయాడు.

*******************

పొమ్మనలేక… పొగబెట్టడమనే సామెత ఉంది మనకు. ఆ ఇటాలియన్ వనితకు ఆ సామెత తెలుసో లేదో మనకు తెలియదు గానీ ఆమె మాత్రం తన మొగుడు అదేపనిగా సిగరెట్లు ఊది పారేస్తూ ఉంటే తనను పొమ్మన్నట్లే భావించి మొగుణ్ణొదిలేసింది.

*******************

కొసమెరుపు: ఈమధ్య తెలుగు బ్లాగరులు ఇనుమడించిన ఉత్సాహంతో బ్లాగుతున్నారు.

Posted in వ్యాసం | Tagged | 3 Comments

ప్రేమ…కథ

ismile1.jpg“తెలుగు భాషాభిమాని, రాయలసీమ ముద్దుబిడ్డ! వృత్తి రీత్యా వైద్యుణ్ణి, ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిమానిని!” ఇది I’smile గారు తన బ్లాగులో రాసుకున్న పరిచయవాక్యం. అంతే కాదు, ఈయన ప్రేమ విజేత కూడా! మనకు ప్రేమ గురించి కొన్ని రహస్యాలు/ముచ్చట్లు చెప్పడానికొచ్చారు. చెవులొగ్గండి మరి:
————-
‘ప్రేమ’…ఈ రెండక్షరాల వెనుక ఉన్న భావాన్ని తెలియజెప్పటానికి ఎందరెందరో కవులు, రచయితలు, కళాకారులు, శాస్త్రజ్ఞులు ఎంతగానో తపనపడ్డారు, మథనపడ్డారు. ఇంతకూ “ప్రేమ అంటే ఏమిటి?” అన్నది మనకు పదహారు వేల వరహాల ప్రశ్న (మిలియన్ డాలర్ల ప్రశ్న!) లాగానే మిగిలిపోయింది. ఓ ప్రేమికుడిగా నాకున్న అనుభవం సముద్రంలో నీటి బొట్టంత అయినా…అందరిలాగే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చేసే చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.
ప్రేమ, ఇష్టం, ఆత్మీయత, అనురాగం, స్నేహం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో భావాలలో ప్రేమను చూసుకోవచ్చు. భావకవిత్వంలో సొబగులన్నీ ఈ ప్రేమ సిరాతో వచ్చినవే! ప్రేమను అనుభవించి పలవరించాలి అన్నాడొకాయన. చలం ప్రేమలేఖల్లో ఈ పలవరింతలను చూస్తాం ఇలా…

“నీ రూపమగోచరము, నీ స్వభావము మనోభావాని కతీతము. కాని నీ కన్న నాకు హ్రుదయానుగతమేదీ లేదు. నీ నామ మనుసృతము.కలలో విన్న గానం వలె ప్రతి నిమిషమూ నా చెవుల ధ్వనిస్తోంది. నా వేపు నడిచొచ్చే నీ మృదు పాద రజము అస్తమయ మేఘాలకి రంగు వేస్తోంది. నన్ను వెతుకుతో వచ్చే నీ అడుగుల చప్పుడు నా హృదయంలో ప్రతి నిమిషం ధ్వనిస్తోంది, నా పరమావధి నీవు.నీ వుండ బట్టి, ఈ ప్రపంచ మింత సుందరమూ, హృదయాకర్షమూ…” – చలం.

ప్రేమ కోసం అజరామరమైన ప్రేమమందిరాన్ని నిర్మించాడొక ప్రేమచక్రవర్తి…
ప్రేమ కోసం మరణాన్ని సంతోషంగా ఆహ్వానించాడొక ప్రేమపిపాసి…
ప్రేమ కోసం మరణాన్ని జయించాడొక ప్రేమసాహసి…

ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఈర్ష్య తప్పకుండా ఉంటుంది. ఈర్ష్య మనిషికి స్వభావసిద్ధంగా వచ్చిన సహజ గుణమంటాడు ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. అలా అయితే ప్రేమ కూడా అలాంటి సహజ గుణమేనా? మరైతే కొంత మందిలో కలిగే భావతీవ్రత అందరిలోనూ ఉండదేమి? ప్రేమ కూడా మన జన్యువులు నిర్దేశించే ఓ క్రియా? ఇందులో నిజమెంత? తెలుసుకుందాం రండి.

‘ఆక్సిటోసిన్’ ఈ పేరెప్పుడైనా విన్నారా? మన శరీరంలో స్రవించే హార్మోనుల్లో ఇదీ ఒకటి. ఇది మెదడులోని హైపోథలామస్ అనే భాగం నుంచి స్రవిస్తుంది. ప్రేమకు ఈ హార్మోనుకు సంబంధం ఏమిటంటారా-మనకు తెలిసి మొదటిసారి ప్రేమను ఎప్పుడు అనుభవిస్తాం? తల్లి ఒడిలో అని అందరికీ తెలుసు. అక్కడే ఉంది అసలు కిటుకంతా!

బిడ్డ తల్లిపాలు తాగుతున్నప్పుడు ఆ స్పందన చనుమొనలలోని నరాల ద్వారా మెదడుకు అంది అది ఆక్సిటోసిన్ ను రక్తంలోకి పంపి, రక్తం ద్వారా రొమ్ములోనికి చేరే ఈ హార్మోను అందులోని కండరాలను ప్రేరేపించి సంకోచింపజేసి చనుబాలను బయటకు పంపుతుంది. ఇది శరీరధర్మ శాస్త్రంలో చదివిన లాక్టేషన్ చక్రం. కానీ ఇదే హార్మోను తల్లికి, బిడ్డకు మధ్య బంధాన్ని(బాండింగ్) పటిష్టపరచడంలో సాయపడుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఇదే కాక తల్లిపాలల్లో రోగనిరోధకశక్తి పెంపొందించే కొన్ని రకాల స్రావాలు ఉంటాయి అందుకే తల్లిపాలు శ్రేష్ఠమనేది.

ఇందుకు కారణం మన మెదడుపై కూడా ఈ ఆక్సిటోసిన్ చూపే ప్రభావం. మెదడులో కొన్ని చోట్ల ఈ హార్మోను గ్రాహకాలు(రిసెప్టార్స్) ఉన్నాయని పరిశోధనలు నిరూపించాయి. అంటే ఆ గ్రాహక కణాలు స్పందిస్తే ప్రేమ పుట్టుకొస్తుందని తేల్చారు. అలా అయితే ఈ హార్మోనుని మనకిష్టమైన వాళ్లకిచ్చి మన మీద ప్రేమ కలిగించుకొంటే అనే చిలిపి ఊహలు అప్పుడే కొందరికి వచ్చుంటాయి. అక్కడికే వస్తున్నా!

తొలిచూపులోనే ప్రేమలో పడడం కొందరికి అనుభవమే. మరి ఇక్కడ పని చేసే మంత్రం ఏది? యవ్వనంలో ఉన్నప్పుడు మన శరీరంలో హార్మోనులు పరవళ్లెత్తుతూంటాయి. ఏదైనా అందమైన పువ్వునో, అందమైన నవ్వునో చూసినప్పుడు మనస్సులో చిన్న సంచలనం కలుగుతుంది. అలాగే అందమైన వ్యక్తిని చూసినా మనలో కలిగే ఆ భావతీవ్రతకు సిగ్గు, బిడియం, ఆలోచన అనే కొన్ని అడ్డుకట్ట వేస్తాయి. కానీ వయస్సు తోడు కోరుకొనే యవ్వనంలో ఇదే భావసంచలనం కలిగితే అప్పుడు ఆ భావాలకు ఈ ఆక్సిటోసిన్ తోఢైతే ఆ వ్యక్తి మీద కలిగే ఆరాధనా భావం కలకాలం ఉంటుందని మనం అనుకోవచ్చు.

మరి ఈ ప్రేమలు-దోమలు కుట్టకుండా బుద్ధిగా పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకొన్న వారి సంగతేంటని అడిగేరు…దానికీ సమాధానం ఉంది. ఈ ఆక్సిటోసిన్ కామోద్దీపనం జరిగినప్పుడు కూడా ఎక్కువ పాళ్లలో రక్తంలో ఉంటుందని నిరూపణ ఉన్నది. అలా అని ఇలాగే వారి మధ్య అనుబంధం ఏర్పడుతుందని కాదు, ఇదీ ఓ కారణం అని శాస్త్రరీత్యా చెపుతున్నారు. ఇదే ఆక్సిటోసిన్ కాన్పు జరిగే సమయంలో గర్భసంచిలోని కండరాలు సంకోచింపజేసి ప్రసవం సులువుగా అయ్యేట్టు చేస్తుంది. ప్రసవవాన్ని వేగవంతం చేసేందుకు ఆసుపత్రులలో గర్భిణులకు సెలైన్ సీసాలలో ఎక్కించే సూదిమందు ఇదే!

మరీ ఇలా ప్రేమని మందుల వ్యవహారంలా మార్చేస్తున్నాడేంటీ అనుకొనేరు. ప్రేమ కలగడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు శాస్త్రజ్ఞులు చేసిన ప్రయత్నం మీకు పరిచయం చేసి ప్రేమకున్న మరో పార్శాన్ని తెలియజెప్పానంతే. ఇక భావనాత్మక ప్రేమ (రొమాంటిక్ లవ్) ఎప్పటి నుంచో ఎందరి హృదయాలనో పిండి వేస్తూ వచ్చింది. దాని గురించి మరెప్పుడైనా!
– డా.ఇస్మాయిల్ సుహేల్ పెనుకొండ (చింతు)(http://krishnadevarayalu.blogspot.com)
Posted in వ్యాసం | 8 Comments

ఈరోజు జ్యోతి గారి సరదా శీర్షికలో ‘ప్రేమికుల రోజు స్పెషల్’, దాంతోబాటే సుగాత్రి రాసిన సినిమా వ్యాసం మూడో భాగం వెలువరిస్తున్నాం. గత నెలలో సుగాత్రి రాసిన ‘సినిమాలెలా తీస్తారు?’ వ్యాసానికి ఇది కొనసాగింపు.

సరదా
సినిమా

పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on