2006 ఉత్తమ బ్లాగుల పోటీ

2006 సంవత్సరానికి భారతీయ బ్లాగుల్లో ఉత్తమమైన వాటిని ఎన్నుకునే పోటీలో రెండో అంకం మొదలైంది. ఇండీబ్లాగీస్ వారు నిర్వహిస్తున్న ఈ పోటీ, నామినేషన్ల స్థాయిని దాటి రెండో అంకం లోకి ప్రవేశించింది. నిర్ణేతల సంఘంలో తెలుగు బ్లాగులను పరిశీలించినవారు వీవెన్, మురళీధర్ జూపూడి.

పోటీలో నామినేషను పొందిన తెలుగు బ్లాగులు:

  1. : నిరుటి పోటీలో మేటి, నేటి పోటీలోనూ అదే ధాటి. బ్లాగులోని ప్రతి జాబూ తనకు తానే సాటి
  2. : సూటిగా, వాడిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా ఉండే బ్లాగు
  3. దీప్తిధార: బ్లాగు వార్తలు, నెల్లూరు, అడవులు, పక్షుల గురించిన బ్లాగ్ధార
  4. గుండెచప్పుడు: తెలంగాణ కథలు, అభివృద్ధి కథల వెనక అసలు కతలు, వెతలు
  5. నా మదిలో..: కంప్యూటరు, ఇంటర్నెట్టు, సినిమాలు.. ఆ మదిలో
  6. కలగూరగంప: ఓ కుమారుడు రాస్తున్న తండ్రి జీవిత కథ
  7. కల్హార: ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. మహిళాబ్లాగరులు రాసేవాటిలో నుంచి నామినేటైన ఏకైక బ్లాగు
  8. చదువరి: భాష, సమాజం, రాజకీయాలు, మీడియాల గురించి ఆవేదన. పదునైన వాగ్బాణాలు, వ్యంగ్య హాస్యోక్తులు
  9. ప్రసాదం: గిలిగింతల హాస్యంతో కూడిన బ్లాగు. ప్రసాదం లాగే కొద్ది కొద్దిగా పెడతారు
  10. సత్యశోధన: భాషతో దున్ని, ఎరువేమీ లేకుండా (ఎరువు ఏమీ లేదు, అంతా స్వంతమే!) హాస్యాన్ని పండించే బ్లాగ్భూమి
  11. శ్రీకృష్ణదేవరాయలు: చిరు నుండి గురు దాకా, ‘రాయల’సీమ నుండి బుష్షుసీమ దాకా.., భూమ్మీదా, గాల్లోనూ
  12. తెలుగుజాతీయవాది: చిక్కని భాష, పదునైన భావాలు, లోతైన విశ్లేషణతో తెలుగు జాతీయవాద ఆవిష్కరణ
  13. తెలుగుదనం: తెలుగు వారల, తెలుగు వార్తల పట్టివేసే నెట్టు జాలరి, ఈ బ్లాగరి
  14. అవీ-ఇవీ: విషయ వైవిధ్యం, భాషా వైదుష్యం, సాహితీ సంపత్తి,.. ఇన్నేల? అవీ, ఇవీ.. అన్నీ
  15. విహారి: పలు విషయ నికుంజముల విహారి,ఈ బ్లాగరి.

బ్లాగరులకు పరీక్ష మొదలైంది. ఈ పదిహేను బ్లాగుల్లోంచి ఒకదాన్ని ఎన్నుకోవడమంటే కత్తి మీద సామే! అన్నీ మంచివే, చదవచక్కని బ్లాగులే. పై జాబితాలో చేరదగిన బ్లాగులు ఇంకా ఉన్నాయనేది మనకు తెలుసు. బహుశా పోటీ నిబంధనలకు అనుగుణంగా లేనందువల్లనో, మరో కారణం చేతో అవి ఈ జాబితాలో చేరకపోయి ఉండాలి.

    మంచి బ్లాగును ఎన్నుకునేందుకు కొలబద్ద ఏమిటి?
    బ్లాగుల మంచిచెడ్డలను కొలిచే కొలబద్దలు ఏమీ లేనప్పటికీ కొన్ని అంశాలను పరిశీలించి మంచిదాన్ని ఎంచవచ్చు. అలాంటి అంశాల్లో కొన్ని:

    1. విషయ పుష్టి
    2. స్వతంత్ర రచన లేక పునఃప్రచురణ
    3. శైలి, భాష
    4. విషయ వైవిధ్యం

    పోలింగు విధానం:

    • http://poll.indibloggies.org/index.php?sid=1 లింకుకు వెళ్ళండి.
    • మీ పేరు, ఈమెయిలు అడ్రసు వగైరాలను ఇచ్చి నమోదు చేసుకోండి. వెంటనే మీకో ఈమెయిలు వస్తుంది.
    • ఆ ఈమెయిలు లోని లింకును అనుసరించి వెళ్తే, బ్యాలెటు పేజీకి చేరుకుంటారు.
    • భారతీయ బ్లాగుల్లో వివిధ విభాగాల్లో మంచివాటిని ఎన్నుకునే పేజీ మొదటిది కాగా, వివిధ భాషా బ్లాగుల్లో మీరు మెచ్చిన దానికి వోటేసే పేజీ రెండోది.
    • అయితే సైన్సు, టెక్నాలజీ బ్లాగులకు వోటెయ్యాలంటే మాత్రం పై పేజీల్లో కుదరదు. దాని కోసం http://poll.indibloggies.org/index.php?sid=2 లింకుకు వెళ్ళి విడిగా నమోదు చేసుకోవాలి. మళ్ళీ మీకో మెయిలూ, దానిలో ఓలింకూ వస్తాయి. ఆ లింకును పట్టుకుని పోతే సంబంధిత బ్లాగుల బ్యాలెటు పేజీకి చేరుకుంటారు. ఏదో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రత్యేక ఏర్పాటు చేసారట.
    • పోలింగుకు చివరితేదీ: ఫిబ్రవరి 20.
    • ఇప్పటికే వోటేస్తే సరి, లేకపోతే వెయ్యండి మరి!
    • ఒక్క గమనిక.. ఇది 2006 బ్లాగుల పోటీ. ఆ ఏట వచ్చిన బ్లాగు టపాలనే పరిగణించండి.

    ఉత్తమ తెలుగు బ్లాగుకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని తేనెగూడు సమర్పిస్తోంది.

    పొద్దు

    ఇటీవలి టపాలు:

    ప్రేమ…కథ

    కబుర్లు

This entry was posted in జాలవీక్షణం and tagged . Bookmark the permalink.