అందం చందం – సౌందర్యానికి సలహాలు

jyothi.bmpఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది.చివర్లో ఆమె ఎక్కుపెట్టిన ప్రశ్నలకు సమాధానాలివ్వడం మరువకండి.

——————–

కుచ్చుటోపి – సచిత్ర వారపత్రిక

షోకు – నాజూకు (సౌందర్య సలహాల శీర్షిక)
నిర్వహణ: రంభ మరియు ఊర్వశి (ప్రముఖ బ్యూటీషియన్లు)

1. కుర్ర చూపుల వీరయ్య (మొర్రిపాలెం)
ప్ర. నా వయసు 81.. 18 లా కనిపించాలంటే ఏం చేయాలి?
జ. ఏం చెయక్కరలేదు. 63 ఏళ్ళు వెనక్కి వెళితే సరి.

2. మచ్చల పిచ్చయ్య (రచ్చపాడు)
ప్ర. పుట్టుమచ్చలు పోవాలంటే ఏం చేయాలి?
జ. మనం పోవాలి.

3. నిక్కుల నీరజ (కక్కులూరు)
ప్ర. నా వయసు 50 దాటింది. తలపై రెండు మూడు వెంట్రుకలు నెరవడం వల్ల బెంగతో నిద్రపట్టడం లేదు.ఏం
చేయమంటారు?
జ. ‘స్లీప్వెల్’ నిద్రమాత్రలు రోజొకటి జీవితాంతం వాడండి.

4. నంకా వెంకాయమ్మ (ఢంకావారిపాలెం)
ప్ర. నా జుట్టు సగం తెల్లగాను, సగం నల్లగాను ఉంటుంది. జుట్టంతా ఒకే రంగులో ఉండాలంటే ఏం చెయ్యాలి?
జ. నల్లజుట్టుకు తెల్ల రంగుకాని, తెల్ల జుట్టుకు నల్ల రంగుకాని మీ అభిరుచి బట్టి వేసుకుంటే జుట్టంతా ఒకే రంగులో ఉంటుంది.

5. సన్నపాటి సన్యాసమ్మ (చీకుచింతలపాడు)
ప్ర. నా బుగ్గలు పీక్కుపోయి, చప్పి దవడలు కనిపిస్తున్నాయి.బుగ్గలు బూరెల్లా కనిపించడానికి ఏం చేయాలి?
జ. రేయింబవళ్ళు ‘బబుల్గమ్’ నములుతూ ఉండాలి.

6. గారపాటి బూరయ్య (జోరీగలపట్నం)
ప్ర. గారపట్టి అసహ్యంగా కనిపిస్తున్న నా పళ్ళూ టూత్పేస్ట్ ప్రకటనలో మోడల్ అమ్మాయి పళ్ళూ మెరిసినట్టు
తళతళా మెరవాలంటే ఏం చేయాలి.
జ. గోదావరి ఇసుకతో గంటకోసారి తోమండి.

7. ధగధగల ధనమ్మ (నిగనిగలూరు)
ప్ర. ముసలితనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
జ. పడుచువయసులోనే పరమపదించాలి.

8. షోకేసుల లోకేషు (రాకాసిపేట)
ప్ర. చుండ్రు పోవాలంటే ఏం చేయాలి?
జ.ఒండ్రు మట్టితో తల రుద్దాలి.

9. నిద్రలేమి భద్రమ్మ (రుద్రవరం)
ప్ర.కళ్ళచుట్టూ నల్ల వలయాలు పోవాలంటే ఏం చేయాలి?
జ.రేయింబవళ్ళూ మెలకువ లేకుండా నిద్రపోవాలి.

10.వట్టితల చిట్టయ్య (లొట్టలూరు)
ప్ర. బట్టతలపై జుట్టు మొలిచే ఉపాయం చెప్పండి
జ. జుట్టు మొలిచేవరకు పట్టు వదలకుండా బట్టతలపై పుట్టతేనె మర్దించండి.

——————–

నేనే ప్రశ్నలు అడగడం, నేనే జవాబులు రాయడం, మీరు చదవటం – అస్సలు బాలేదు. సో.. ముచ్చటగా మూడు ప్రశ్నలు అడుగుతున్నాను. జవాబులు మీరు చెప్పండి. ఉత్తమ జవాబుకు అభిషేక్, ఐశ్వర్యల పెళ్ళికి ఆహ్వానం. చెత్త జవాబుకు అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానం. సరేనా!..

1. పెళ్ళికి ము౦దు, వెనకా తన భర్త గురించి భార్య ఏమనుకుంటుంది?
2. అమెరికా అద్యక్షుడు జార్జి బుష్ కు బిన్ లాడెన్ కలలో కనబడితే, బుష్ ఏమంటాడు?
3. ఉద్యోగాలన్నీ స్త్రీలకే రిజర్వు చేస్తే ?

త్వరపడండి……..ఆలసి౦చిన ఆశాభంగం.

——————–

జ్యోతి వలబోజు (http://vjyothi.wordpress.com)

Posted in వ్యాసం | Tagged | 7 Comments

తెలుగు ఫాంట్ల తయారీ పోటీ

ఉత్తమ తెలుగు ఫాంట్ల తయారీకై ప్రముఖ నెజ్జనుడు రవి వైజాసత్య నడుం కట్టారు. అత్యుత్తమ ఫాంటు తయారు చేసిన వారికి 10,000 రూపాయలు బహుమతిగా ప్రకటించారు. ఎంపికైన ఫాంటును అందరికీ అందుబాటులో ఉండేలా, సార్వజనికంగా (పబ్లిక్ డోమెయినులో) విడుదల చేస్తానని కూడా ప్రకటించారు. చరసాల ప్రసాదు ఆయనకు తోడుగా నిలిచి రెండో బహుమతిగా 5000 రూపాయలు ప్రకటించారు. పోటీకి చివరి తేదీ వంటి ఇతర వివరాలు ఇంకా నిర్ణయించవలసి ఉంది. ఈ విషయమై తెలుగుబ్లాగు గుంపులో – http://groups.google.com/group/telugublog/browse_thread/thread/2ea7c3169af43c5 – చర్చ జరుగుతూంది.

రవి, ప్రసాదు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో కొనియాడదగ్గది. నెట్లో తెలుగు వ్యాప్తికి ఇది ఎంతో దోహదపడే చర్య. వారిద్దరినీ పొద్దు అభినందిస్తూంది.

Posted in ఇతరత్రా | 7 Comments

వివిధ -కొత్త శీర్షిక

చెప్పినట్లుగానే ఓ కొత్త శీర్షిక, ఓ కథ, ఓ సమీక్షతో మీ ముందుకొచ్చాం.

నెట్లోనూ, బయటా వెలుగులోకి వచ్చే కొంగొత్త విషయాలను పొద్దులో ప్రచురించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ వివిధ అనే విభాగాన్ని మొదలు పెడుతున్నాం. ప్రముఖ నెజ్జనుడు సుధాకర్ ఈ శీర్షికను నిర్వహిస్తారు.

స్వాతికుమారి కవయిత్రిగా సుపరిచితులు, సుప్రసిద్ధులు. మార్పుకోసం ఆమె ఈసారి కాలాన్ని నిద్రపోనివ్వను అనే కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు.

ఈ సారి చావా కిరణ్ ఓ కథను చెబుతున్నారు. టీ టవర్స్ కథలో మనలను కొన్ని శతాబ్దాల పాటు ముందుకు తీసుకెళ్తున్నారు. శుభప్రయాణం!

వచ్చే శనివారానికి మరో కొత్త శీర్షిక, ఓ బ్లాగు సమీక్షను మీ ముందుకు తెస్తాం!

పొద్దు

Posted in ఇతరత్రా | 1 Comment

టీ టవర్స్

చావా కిరణ్! పరిచయమక్ఖర్లేని ప్రముఖ తెలుగు నెజ్జనుడు. ఎంతో మంది తెలుగుబ్లాగరుల ప్రేరకుడు, మార్గదర్శి. చావా కిరణ్ కు ఇంటర్నెట్లో సొంత పత్రిక నడిపిన అనుభవం కూడా ఉంది. తొలి తెలుగు బ్లాగరి కూడా అయిన చావా కిరణ్ పొద్దు కోసం రాసిన పెద్ద కథ టీ టవర్స్:

—————-

(మొదటి భాగం)

“అందరూ జాగ్రత్తగా వినండి!” అంటూ తన కళ్ళకి ఉన్న – ఉండీ లేనట్టున్న కళ్ళజోడు సర్దుకున్నాడు శేష్ బ్రదర్. రికార్డింగు పరికరాలన్నీ సరిగ్గా ఉన్నాయోలేదో చివరిగా పరిశీలించి తన ఎదురుగా ఉన్నవారివైపు చూసినాడు. పదిమంది ఉద్యోగులు లేత ఎరుపురంగులో ఉన్న డ్రస్సు వేసుకుని ఆసక్తిగా చూస్తున్నారు. మరో మూలన తన కొడుకు, వాడి స్నేహితులు మొత్తం ఏడుగురు నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్నారు.

“టీ టవర్స్ ” అని పిలవబడుతున్న ఈ మూడు బిల్డింగులూ పురాతన శకం 50, అనగా క్రీస్తు శకం 2150 నాటికి నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మొదట వీటిని “తెలుగు టవర్స్” అని పిలిచేవారు. చూడండి ఇప్పటికి కూడా ఆ పాత గ్రానైట్ రాయిపై అదేపేరు ఉన్నది. తరువాత తరువాత ఎలా మొదలయిందో ఏమో తెలియదుకానీ, “ట్రై టవర్స్” అని పిలవసాగినారు. వీటిని పురాతన శకం 150లో నిర్మించడం మొదలుపెట్టి ముందే చెప్పుకున్నట్టు పురాతన శకం 50 నాటికి పూర్తి చేసినారు. వీటికి మణిపూసలు అని ముద్దు పేరు కూడా ఉన్నది. బహుశా మణికొండ అనే ప్రాంతములో ఉండటం వల్ల కాబోలు!

మొదట దీనిని ప్రభుత్వం, ప్రయివేటు భాగస్వామ్యం క్రింద కట్టించారు. తరువాత ఓ పది కంపెనీల వరకూ చేతులు మారాయి. దీనిని కొన్న చివరరి కంపెనీ దివాళా తియ్యడం- ఇంత పాత దానిలోకి ఎవ్వరూ అద్దెకు రాకపోవడం వంటి కారణాలవల్ల గత యాభై సంవత్సరాలుగా ఇది ఖాళీగానే ఉన్నది. ప్రస్తుతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని back to nature కార్యక్రమంలో భాగంగా దీనిని పడగొట్టిఈ స్థలంలో సహజాటవి పెంపకం చేపట్టదలచింది.

ఈ టీ టవర్స్ తెలుగు ప్రాంత ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించాయి. మొదట వీనిలోకి చేరిన ప్రముఖ కంపెనీల్లో రోసాఫ్ట్ చెప్పుకోదగినది. అది అతి త్వరలోనే ప్రపంచపు నంబర్ వన్ కంపెనీగా రూపొంది ఇండియాని ప్రపంచంలో అగ్రభాగాన నిలపడంలో తనవంతు పాత్రను నిర్వహించింది.

ఆ తరువాత శతాబ్దంలోని మేటి కంపెనీల్లో ఒకటయిన పికోడియా కూడా ఈ బిల్డింగులనుండే తన కార్యక్రమాలు నిర్వహించినది. ఈ సమయంలోనే వీటిని రీడిజైనింగ్ చేసి మోడర్నైజ్ చేసారు.

తరువాతి శతాబ్దం చిన్న చిన్న కంపెనీల బూమ్ లో చాలా చిన్న కంపెనీలు ఈ బిల్డింగులో నుండే నడచాయి. వీటిలో ప్రతి అంతస్తులోనూ కనీసం నాల్గు కంపెనీలు నడిచాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో తెలుగు ప్రాంతంలోని కంపెనీల్లో నాల్గవ వంతు ఈ మూడు బిల్డింగులనుండే నడిచాయని ఓ అనధికార లెక్క. దీనికి ముఖ్యకారణం అద్దెలు తక్కువ ఉండటం అనుకుంటాను!

గత రెండు శతాబ్దాలుగా మాత్రం దీని అదృష్టం ఏమీ బాగోలేదు. ఎటువంటి మోడర్నైజేషన్ లేదు. దానికి తోడు మూడు యుద్ధాల్లోనూ శతృవులు దీనిని నాశనం చెయ్యడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలం అయినారు.

ఈ కాంట్రాక్టు మన కంపెనీకి రావడం గర్వకారణం మనందరికీ! మనము మన పని చక్కగా చేస్తామని ఆశిస్తూ శలవు తీసుకుంటున్నాను… క్షమించాలి, మరొక్క విషయం లంచ్ అందరికీ ఇక్కడే ఏర్పాటు చేయబడింది. దయచేసి లంచ్ తీసుకునే వెళ్లవలసినదిగా మనవి.

**************************************************

లంచ్ అందరికీ వెండి ప్లేట్లల్లో సర్వ్ చేయబడినది. వెండి ప్లేట్లలో తినడం ఆరోగ్యానికి మంచిదని ఎవరో ఎప్పుడో చెప్పినారట, అప్పటినుండీ ప్రతి హై క్లాస్ ఫంక్షన్లోనూ వెండి ప్లేట్లు తప్పనిసరి అయినాయి.

“బాగుంది కదా!” అంటూ ప్రశ్నించింది వినారి.

“సూపర్!” అంటూ బదులిచ్చినాడు చక్రర్.

శేష్కుమార్ మొఖం పికోడియా లైట్లా వెలిగిపోయింది.

“ఏం బాగోలేదు!”

అందరూ ఆ గొంతు వినవచ్చినవైపు – భూచాతి వైపు చూసినారు.

శేష్కుమార్ – “సారీరా! ఏం కావాలో చెప్పరాదూ? తెప్పిస్తాను” అంటూ
స్నేహితునివైపు అపరాధ సహితంగా చూసినాడు.

“సారీరా! నా ఉద్దేశ్యం లంచ్ గురించి కాదు, ఫుడ్ చాలా బాగుందిరా ముఖ్యంగా సీఫుడ్!”

“మరేం భాగోలేదురా? ” నవ్వుతూ బోస్ కూడా వాళ్ళతో జాయిన్ అయినాడు.

” ఈ టీ టవర్స్ కూల్చివేయడం – బాగోలేదురా”

“ఎందుకు?” మరళా బోసే ఆశ్చర్యంగా అడిగినాడు.

“ఎందుకేమిటిరా? నువ్వే విన్నావుకదా! మన తెలుగు ప్రాంత అభివృద్ధిలో ఈ టవర్స్ పోషించిన పాత్ర, ఇండియా అభివృద్ధిలో ఈ ప్రాంతము పోషించిన పాత్రను గురించి. ఇంకా ఈ టవర్స్ మూడు యుధ్ధాలను తట్టుకుని నిలబడ్డాయి, ఇవి మన జాతీయ చిహ్నాలు, జాతీయ సంపద, శతృవులే నాశనం చేయలేకపోయినారు, మనము ఇప్పుడు తీరిగ్గా నాశనం చేసుకుంటున్నాము. ”

“నిజమే అబ్బాయ్! – ఇది మన జాతీయ చిహ్నమే!”
“మీరు ఎప్పుడు వచ్చినారంకుల్?” అప్పుడే చూస్తున్న శేష్బ్రథర్ వైపు కొద్దిగా గిల్టీగా అంతలోనే ధైర్యం తెచ్చుకుని భూచాతి అడిగినాడు.

“నువ్వు బాగోలేదన్నప్పుడే వచ్చినాను – కానీ నువ్వే ఓ సారి చూడు, ఇది ఏ క్షణమైనా కూలిపొయ్యేట్టు ఉన్నది, పండుటాకులా రాలిపోవడానికి సిధ్ధంగా ఉన్నది. ఇప్పుడు మనం చేస్తున్నది దీనిని కూల్చివేయడం కాదు దీనికి శాశ్వతత్వాన్ని కల్పించడము. దీనిలోని ప్రతి అంగుళమూ, ప్రతి అణువూ డిజీగ్రాఫ్ తీయబడుతున్నది, లంచ్ తరువాత డిమో ఉన్నది, మీరు కూడా వచ్చి చూడండి” అని కొద్దిగా గ్యాప్ తీసుకుని “ఇంతకీ లంచ్ ఎలా ఉన్నది?”

“సూపర్” అందరూ ఒకే గొంతుతో అన్నారు.

నవ్వులు, నవ్వులు, నవ్వులు !!!

“డిమోగ్రాఫ్ !”
“వావ్! సూపర్ గా ఉన్నది కదా!”

“అవును, నిజంగా టీ టవర్స్ చూస్తున్నట్టే ఉన్నది.”

“అంతే కాదు, దీనిని ఏ సైజుకు కావాలంటే ఆ సైజుకి పెంచుకోవచ్చు. ఇప్పుడు
బిల్డింగులన్నీ కూల్చేసిన తరువాత మరలా ఇదే ప్లేసులో బిల్డింగులు ఉన్నాయి
అనేట్టు చెయ్యవచ్చు.”

“మీరు?” అంటూ శేష్ అడిగినాడు.

“నేను సుమీజు!” – “ఈ ఆపరేషన్ టెక్నికల్ ఇన్చార్జిని”

“నైస్ టూ మీట్ యూ సుమీజు” అంతూ అందరూ చేతులు కలిపినారు.

“గైస్ టైం అప్” అన్నాడు భూచాతి.

“వాట్ నెక్స్ట్?” అంటూ శేష్ ప్రశ్నించినాడు. (అతనికి ఇంకా ఇక్కడే ఉండాలని, స్నేహితులకు తన నాన్న పని మొత్తం దగ్గరుండి చూపించాలని ఉన్నది.)

“ఇక్కడినుండి వినారి ఇంటికి వెళ్ళి – కొత్త ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ చూసి ఆంటీ కేఫ్ తాగి అక్కడినుండి మిడిల్ సాగర్ రేస్కి వెళ్ళి చీర్స్ చెప్పి – చలో! తరువాత మూన్ రైజ్ అవుతాడు మన పని స్టార్ట్ అవుతుంది.”

(మిడిల్ సాగర్ రేస్ గురించి గుర్తు చేయగానే షేష్కుమారే ముందు కదిలినాడు! )

“చలో!”

“చలో!”

“చలో!”

అందరూ ఎవరి బైస్కిల్ వారు ఎక్కి బయలుదేరినారు.

సుమీజు పిల్లలు వెళ్ళింది చూసి డిజిగ్రాఫ్ వైపు కదిలి సీరియస్గా పనిలో మునిగి పోయినాడు.

**********************************

సూర్యుని కాంతిలో మిడిల్సాగర్ మెరిసిపోతోంది. అక్కడక్కడా పెరిగిన పూలు మరింతగా శోభిస్తున్నాయి. సాగర్ చుట్టూ పెంచబడిన పూలనుండి వచ్చేవాసన మత్తుగా గమ్మత్తుగా ఉన్నది. మొత్తం రెండు వందల వరకూ జనాలు ఉన్నారు. సాగర్
చుట్టూ ఉన్న షెల్టర్స్ లో కూర్చుని మట్లాడుతూ, తింటూ రేస్ కోసరం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఇంతలో వినా “ఇటు, ఇటు” అంటూ వినిపిస్తే తిరిగి చూసింది.

అప్పటికే వచ్చేసిన మిత్ర బృందం నవ్వుతూ పిల్చింది వాళ్ళు అక్యుపై చేసిన షెల్టర్వైపు.

“మరళా నేనే లాష్టా?”

“లేదులే మన రాజ్గారింకా రాలే!” భూచాతి నవ్వుతూ ఓ మొక్కజొన్న పొత్తు అందించినాడు.

“నేను రేసులో పాల్గొనే వాళ్ల గురించి మాట్లాడుతున్నాను”

“ఉండమ్మా! ఎప్పుడో ఒకప్పుడు మేమూ గెలుస్తాము” ఆయాసపడుతూ బైస్కిల్ పక్కకి నెట్టి కూలబడ్డాడు సుక్రోర్.

ఏదో అందామని వినారి నోరు తెరిచినది.

“ఇట్స్ స్టార్టింగ్” అంటూ బోస్ లేచి ముందుకు వెళ్ళినాడు.

గట్టిగా ఓ గంట మోగిన శబ్దం వినిపించినది. తరువాత ఇంకోటి, మూడవ గంట మోగగానే, లార్డ్స్ హిల్ నుండి మెరుపు వేగంతో “బయ్” మంటూ యాటోగ్లైడర్స్ బయలుదేరి చూస్తున్న వాళ్ళకు ఏమి జరుగుతున్నదో అర్థం అయ్యేసరికే మిడిల్
సాగర్ చివరినుండి బయ్ బయ్ మంటూ ఐదు బోట్లు బయలుదేరినాయి. సాగర్ చుట్టూ తిరిగి నాలుగు చోట్లా ఉన్న ఫ్లాగ్స్ తీసుకుని బోట్లు వదిలేసి రెండు ఫ్లాగ్స్ సాగర్ రెండు మూలలా ఉంచి చకచకా సాగర్ మరో మూలకి ఈదసాగినారు.

చూస్తున్న వాళ్ళు అప్పటికి తేరుకుని క్లాప్స్, ఈలలు, అరుపులూ ఎంకరేజిమెంటూ

రెడ్ రెడ్ రెడ్ అని ఒకరు
గ్రీన్ గ్రీన్ గ్రీన్ అని మరొకరు

రెడ్ రెడ్ రెడ్ అని సుక్రోర్
రెడ్ రెడ్ రెడ్ అని బోస్

గ్రీన్ గ్రీన్ గ్రీన్ గో గో గో అని భూచతి, వినారి

గట్టిగా అరవసాగినారు. మిగతావారు కాంగా తింటూ చూడసాగినారు.

ఈత సాగర్ చివరకు వచ్చేసరికి యెల్లోని గ్రీన్ ఓవర్టేక్ చేసి రెండో ప్లేసులోని వచ్చినాడు.
రెడ్ ఫస్టు ప్లేసులోనూ, గ్రీన్ సెకండ్ ప్లేసులోనూ, యెల్లో థర్డ్ ప్లేసులోనూ, వైట్ ఫోర్త్ ప్లేసులోనూ బ్లాక్ ఫిఫ్త్ ప్లేసులోనూ ఈదసాగినారు.

సాగర్ చివరకు వచ్చి ఐదురంగులూ రెట్టించిన వేగంతో బైస్కిళ్ళు తొక్కుతూ లార్డ్స్ హిల్ వైపు వెళ్లసాగినారు. కొందరేమో అటువైపు చూడసాగినారు, మరికొందరేమో సాగర్ మధ్యలోని వీడీ వైపు చూడసాగినారు.

బైస్కిళ్ళు లార్డ్స్ హిల్ దగ్గర పడేసి తాళ్ళు పట్టుకుని కొండపైకి ఎక్కసాగినారు. జనాలు అందరూ చేతిలో ఉన్నవికూడా తినడం, త్రాగడం మర్చిపోయి కనురెప్పలు కూడా వేయడం మర్చిపోయి ఉత్సాహంగా, ఉత్సుకంగా లార్డ్స్ హిల్ వైపు చూడసాగినారు.

కొన్ని నిమిషాల్లో గ్రీన్ కలర్ లార్డ్స్ హిల్ నుండి ఫైరు చెయ్యబడినది. కొద్దిసేపట్లో రెడ్, తరువాత బ్లాక్!

హే! గ్రీన్ గ్రీన్ గ్రీన్ అంటూ వినారు, భూచతి కొద్దిసేపు గంతులు వేసినారు. సుక్రోర్, బోస్లు కాంగా మిగిలిన వాళ్లతో కూర్చున్నారు.

హడావుడి అంతా సద్దుమణిగింది. జనాలంతా ఒక్కొక్కరే వెళ్ళిపోయినారు. సూర్యాస్తమయం కావచ్చింది.

“బుద్ధా దగ్గరకు వెళ్దామా?” అంటూ అడిగింది వినారి.

“ఇప్పుడా?” అడిగాడు షేష్కుమార్

“చూడు – ఎంతందంగా ఉన్నాడో – వెనక సూర్యుడు, ఆ మేఘాలు” అంటూ విహారి
పూర్తిచేయబోయే లోపులోనే,

“అవును, యుద్ధంలో బాంబులు వేసిన సాయంత్రంలా ఉంది” అంటూ భూచతి పూర్తి చేసినాడు.

“నీకెప్పుడూ యుద్ధాల గొడవేనా? చూడు స్వర్గం నుండి ఎవరో దిగివస్తున్నట్టు లేదూ?” వినారి గట్టిగా ప్రశ్నించింది.

“సరే నీ కళా హృదయానికి జేజే ! కానీ చాలా పనుందిరా ఇప్పుడు వర్క్ హౌస్కి వెళ్లకపోతే రేపు క్లాస్కి వెళ్ళలేనురా!” అంటూ వినారి చెయ్యి పట్టుకుని లాలనగా అడిగినాడు బోస్.

“అయితే సండే!” – అంటూ వినారి ప్రపోజ్ చేసినది.

“సండే ఓకే” – బోస్ వెంటనే అన్నాడు, ఎక్కడ తన మనసు మారిపోతుందో అన్నట్టు.

“నాకూ వోకే!”

“వోకే”
“వోకే”
“వోకే”
“వోకే”

ఏడుగురూ బైస్కిల్స్ తీసి ఆటోరైడ్ ఆన్ చేసి రివ్వున వెళ్లసాగినారు ఒకరికి పోటీగా ఒకరు ఖాళీ అయిన రోడ్లపై.

అందరూ అర్థగంటలో బోస్ వాళ్ళింటికి చేరుకున్నారు. వాళ్ళింట్లో థర్డ్ ఫ్లోర్నే వర్క్ హవుజ్ గా మార్చుకున్నారు. పెద్ద హాలు, నాలుగు బెడ్రూములు (వాటిలో ఒకటి హాలు కన్నా పెద్దది) ఉన్న విశాలమైన పోర్షను అది. అందరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు – బోస్ సెకండ్ ఫ్లోరుకు, అమ్మాయిలు ముగ్గురూ ఓ గదిలోకి, అబ్బాయిలు ఎవరి గదిలోకి వాళ్ళు -వెళ్ళి పది నిమిషాల్లో హాల్లోకి వచ్చినారు.

“నాకెందుకో ఈ ఇల్లు చూస్తుంటే మన వర్క్ హవుస్ కోసమే కట్టినారేమో అనిపిస్తుందిరా!” అంటూ ఒక యాపిల్ తీసుకోని అలాగే కొరుక్కుని తినసాగినాడు సుక్రోర్!

“నీ ముందు తినేవి ఏవైనా పెట్టనీ అదే నీ వర్క్ హవుస్ కదరా ” అంటూ షేష్ మరో యాపిల్ పట్టుకున్నాడు.

“అరె అరె నేనొక్కన్నే ఏదో బుట్టడు యాపిల్స్ తింటున్నట్టు చెప్తావేం?”

“బుట్టడు తిన్నావని నేనన్నానా?”

“మరి?”

“ఏదో అర బుట్టడు!!”

“ఏయ్!” అంటూ యాపిల్ విసిరేసినాడు.

దాన్ని కాస్తా బోస్ అప్పుడే పైకి వస్తూ క్యాచ్ పట్టినాడు.

“గుడ్ క్యాచ్. ” అంటూ వినారి బయటకొచ్చింది.

“ఏమిటి ఇష్యూ?” బోస్ అడిగినాడు. యాపిల్ మళ్ళా బుట్టలో పెడుతూ.

“ఏం లేదురా, ఈ ఇల్లు మన వర్క్ హవుజ్ కి సరిగ్గ సరిపొయ్యేట్టు ఉంది కదా అంటున్నా, వీడేమో టాపిక్ యాడికో తీసుకుని పోతున్నాడు.”

“సరే మీ గొడవ రోజూ ఉండేదేగా? వినారీ! ఓ మంచి కవిత చెప్పరాదూ!” అంటూ భూచాతి కూడా జాయిన్ అయినాడు వీళ్ళతో.

“అసలు వినారి అంటే అర్థం ఏమిటి?” అంటూ సుక్రోర్ అడిగినాడు.

“వినారి అంటే నాకు తెలీదు – ఎవరి కన్నా తెలుసా?” అనే సరికి అందరూ అడ్డంగా
తల ఊపినారు, వినారితో కలిపి.

“అయితే వికీ నడుగుదాం” అంటూ బోస్ గట్టిగా “వికీ!” అని పిల్చినాడు.

వాళ్ల మధ్యలో డిజీగ్రాఫ్ రూపంలో వికీ ప్రత్యక్ష్యం అయినది.

“హాయ్ బోస్”
“యెల్లో ఫ్రెండ్స్! ” అంటూ అందరినీ పలకరించినది.

“హెలో వికీ ! “అంటూ అందరూ హాయ్ చెప్పినారు.

“వినారి అంటే అర్థం ఏమిటి?” అంటూ షేష్ ప్రశ్నించినాడు.

“వినారి కి నా డాటాబేసులో ఎటువంటి అర్థాలూ లేవు, కానీ ఈ పేరు చాలా పాపులర్ లాగున్నది. మొత్తం నా డాటాబేసులో వేలాది మందికి ఈ పేరు ఉన్నది. ”

“వాటిలో మొదటి పేరు ఎవరిది?” చాలా ఉత్సాహంగా వినారి ప్రశ్నించినది.

” అది మొదటి యుద్ధంలో ఒక సైనికురాలిది”

“నిజమా? ఆ కథా కమామిషు ఏమిటి?”

“గైస్! రూల్ త్రీ ఆఫ్ వికీ! ” అంటూ భూచాతి అడ్డు వచ్చినాడు.

[[[ ఒక టాపిక్ కోసం వికీని పిల్చి అలా అడుతుతూనే వెళ్తున్నారని కొన్ని రూల్స్ పెట్టినారు వికీని ప్రశ్నలు అడగటంలో – అందులో రూల్ నంబర్ త్రీ ఏమిటంటే ఒక ప్రశ్న – దానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగవలెను వేరే ఎటువంటి, ఎంత ఇంటరెస్టింగు ప్రశ్నలు వచ్చినా అప్పుడు అడగకూడదు, తరువాతనే అడగవలెను.]]]

“ఆల్రైట్, గుర్తున్నది” అంటూ వినారి సోఫాలో వెనక్కి వాలిపోయినది.

“అయితే వినారికి నీకు మీనింగ్ తెలీదంటావ్?” అంటూ బోస్ మరొక్కసారి ప్రశ్నించినాడు.
“యస్ బాస్!”

“థాంక్యూ” అంటూనే వికీ వెళ్ళిపొయినది.

“వినారికి నేను అర్థం చెపుతాను” అంటూ షేష్ కల్పించుకున్నాడు.

“సొల్లు” అన్నాడు భూచాతి కొద్దిగా వ్యంగ్యంగా.

“వినారి అంటే వీర నారి” అన్నాదు శేష్ ఆ వ్యంగ్యాలు పట్టించుకోకుండా.

“నువ్వు నిజంగానే కవివైపోతున్నావురోయ్! ” అంటూ బోసు వినారివైపు చూసినాడు.

వినారి కొద్దిగా గర్వంగా ఫీలు అయినది, కానీ తన మనసులో ఆ మొదటి వినారి గురించే ఆలోచిస్తుంది.

నేను కూడా ఒకర్థం చెపుతానంటూ భూచాతి కూడా మొదలుపెట్టినాడు. “వినా అంటే లేకుండా అని అర్థం. రి అంటే ఏమిటి అని ఇప్పుడు ప్రశ్న, రి కి ఎటువంటి అర్థాలు ఉన్నట్టు లేవు, కానీ రు అంటే బహువచన ప్రత్యయం, కాబట్టి రి అంటే
ఏకవచనం అనుకుంటే రి = అతను, మగాడు అనుకుంటే వినారి అంటే మగ తోడు లేకుండా అన్ని పనులూ చేసేది అని అర్థము.”

“బాగానే పెన్ను పెట్టావే” అన్నాడు బోస్.

“అవునూ.., రేపటి వారం అసైన్మెంటు సంగతేమిటి?” అంటూ సుక్రోర్ అడిగాడు. అసలే వాడికి అసైన్మెంటులంటే చాలా టెన్షన్ టెన్షన్.

“నేనయితే పవర్టీస్ ఆఫ్ వర్ల్డ్” అని అసైన్మెంటు చేద్దామనుకుంటున్నాను, అని భూచాతి తన టాపిక్ చెప్పినాడు.

“అనుకూంటూనే ఉన్నా నీవు ఇలాంటిదేదో చెపుతావని – నేను మాత్రం ‘మిడిల్ సాగర్ రేస్ ‘ గురించి వ్రాద్దాము అనుకుంటున్నాను. ” అని బోస్ తన టాపిక్ చెప్పినాడు.
“నా టాపిక్ కూడా రడీ ! – ఇండియా ముందున్న సవాళ్ళు” అని ఇన బాల డిక్లేర్ చేసినది.

“నాకయితే ఏమీ అయిడియాలు రావడంలేదు ఏమన్నా చెప్పండిరా బాబు” అంటూ సుక్రోర్ వేడుకున్నాడు.

“హీరోస్ ఆఫ్ వార్ త్రీ – అని ఏదన్నా వ్రాద్దామనుకుంటున్నాను ” అచిన కూడా తన టాపిక్ చెప్పేసింది. సుక్రోర్ బాదగా చూసి తీవ్రంగా ఆలోచించసాగినాడు.

“పోనీ నువ్వు యాపిల్ పై వ్రాయరాదూ?” అని భూచాతి ఓ విరుపు విరిసినాడు.

“ఇదేదో బాగానే ఉన్నదే, నా టాపిక్ ఆపిల్!” అంటూ సుక్రోర్ వెంటనే ఒప్పుకున్నాడు.

“బ్లాక్ డెత్ టూ – నా టాపిక్ కూడా రడీ” అంటూ షేష్ అనౌన్స్ చేసినాడు.

“ఐడియా!” అంటూ సుక్రో మరలా అరిచినాడు.

“ఏమిట్రా అది?”

“బ్లాక్ డెత్ టూ ఉన్నదంటే, బ్లాక్ డెత్ వన్ కూడా ఉన్నట్టే కదా, అదే నా టాపిక్.”

“బాగు బాగు అప్పుడు మనిద్దరం కలసి పని చెయ్యవచ్చు ” అంటూ షేష్ క్లాప్స్ కొట్టినాడు చిన్నగా.

“ఇంకెవరో మిగిలినట్టునారు?” అనగానే అందరూ వినారివైపు చూసినారు.

“స్టిల్ తింకింగ్” అనగానే అందరూ ఆశ్చర్యపొయినారు.

“ఇంకా ఆలోచిస్తున్నవా?”

“అవును”
ఇంతలో షేష్ కి డిజీ కాల్ వచ్చినది. దాన్ని చూడగానే షేష్ కొద్దిగా కంగారు పడ్డాడు, కొద్దిగానే సుమా! ఫ్రెండ్సంతా ఏమిటి అన్నట్టు చూసినారు కొద్దిగా కంగారుగా. “ఏం లేదురా, డాడ్ సైట్లో ఏదో యాక్సిడెంట్ జరిగిందంట, డాడ్ మరియూ ఎంప్లాయిస్ అంతా బాగానే ఉన్నారు, కానీ ఎవరో బాగా ఇంజూర్డ్ అంట! నేను వేరేవాళ్ళ ద్వారా వింటే కంగారు పడ్తానేమో అని ముందే చెప్పినారు” అని చెప్పినాడు.

కానీ అది అంత తేలిగ్గా తీసుకోవలసిన విషయం కాదని మరుసటి ఉదయానికి కానీ వారికి తెలీలేదు.

(సశేషం)

Posted in కథ | 2 Comments

కాలాన్ని నిద్రపోనివ్వను

ఆచార్య ఎన్.గోపి రాసిన “కాలాన్ని నిద్రపోనివ్వను” కవితాసంపుటిపై స్వాతికుమారి సమీక్ష ఇది:

————-

పోయిన ఆదివారం పొద్దు పోక పుస్తకాల అర నుండి ఆచార్య యన్ గోపి గారి “కాలాన్ని నిద్రపోనివ్వను” తీశాను. “తంగేడు పూలు” కవితా సంపుటితో మొదలైన గోపి గారి సాహిత్య ప్రయాణం “చిత్ర దీపాలు” చేత పట్టుకుని “వంతెన” మీదుగా సాగి సాహిత్య అకాడెమీ అవార్డ్ అనే “మైలు రాయి” దాటింది. ఆయన అలోచనల్నే కాదు కాలాన్ని కూడా నిద్ర పోనివ్వనని ప్రతిజ్ఞ చేసి రాసినట్టున్నారు ఈ పుస్తకం.

మనలో చాలామంది అనుకునేలానే చచ్చిపోతున్న ఉత్తరం గురించి అక్కడ ఇలా ఉంది.

“ఫోన్లలో ఏముంది హృదయ నిశ్శబ్ధం తప్ప
నిన్నూ నన్నూ ఉద్వేగ రేఖపై నిలిపిన ఈ ముత్యాల వంతెనను ఎవరు కూల్చేశారు ప్రియా”
ఆసక్తి రెట్టింపవగా స్థిమితంగా చదవటం మొదలెట్టాను.

జీవితంలో ఎదగాలని అందరికీ ఉంటుంది కానీ “నిచ్చెనలో ఏ మెట్టూ సుఖంగా ఉండదు” అని మరోసారి గుర్తు చేశారు.

ఎన్నాళ్ళో కలిసి ఉంటుంటాం కానీ మనం నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నామా?
“మనుషుల మధ్య ప్రవహించే ఎడారుల గురించే బాధ”

కవిత్వం నిజంగా అంతా విస్తృతమా అనిపించేలా
“పద్యాల్లో పట్టనంత పెద్ద ప్రపంచం ఉంటుందా
జీవితం ఇరుకైనప్పుడు మైదానాల్ని మరింత విశాలం చేసేదే కవిత్వం” అని భరోసా ఇచ్చి,
“నీ అహం నా సహనం పై బరువును మోపుతుంది” అని పాత విషయమే ఐనా సరికొత్త సమీకరణంలో చెప్పారు.

“కన్నీళ్ళు బాల్యం వైపు పరిగెడతాయి
ఎండుటాకులకు కూడా పచ్చని జ్ఞాపకాలుంటాయి”
చిన్ననాటి రోజులు గుర్తొస్తే మనందరికీ ఇలాగే అనిపిస్తుంది కదూ..

మూర్తీభవించిన ఏకాంతాన్ని కదిలించటం ఎలా?
“గాలిని ముక్కలుగా కోసే గడ్డిపోచలు ఘనీభవించిన ఏకాంతాన్ని కరిగిస్తాయి”

వెన్నెల ఏ కవిని మాత్రం ఆకర్షించలేదు?
“చంద్రుడ్ని ఎన్ని సార్లు రుద్దినా అరిగిపోడు వెన్నెల గంధం వస్తూనే ఉంటుంది” అని ఈయన చంద్రుణ్ణి గంధపు చెక్కగా మార్చేశారు.

అత్యద్భుతమైన క్షణాల్లో మాటలు మాత్రం ఒక్కోసారి మెదలకుంటాయి.. భావావేశం ఏదైనా కానీ..
“అపూర్వ సంగమాలు అనివార్య వియోగాలు ఏవీ తిరిగి చేతికందవు
చచ్చుబడి పోయిన మాటల్ని గురించే బాధ”

విషాదాల్లోకెల్లా విషాదం ఆప్తుల మరణం. అది కూడ ఈయన కవితకి అనుభవం.
“తనకి తెలియదు. తన మరణం క్షణమైతే మా మరణం క్షణక్షణమని”.

“వర్షమంటే నాకు మేఘాల తాళపత్రాలపై లిఖిస్తున్న మహా గ్రంధంలా ఉంటుంది”
ఇంకోచోట వర్షం గురించి ఇలా గంభీరం గా అనేసి,
ఇదంతా ఎందుకు రాస్తున్నారంటే “కలతగా ఉంది, కవిత్వం సోకినట్టుంది” అని సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు.

స్వాతికుమారి (http://swathikumari.wordpress.com)

“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అనే స్వాతికుమారి బ్లాగు కల్హార ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట.

Posted in వ్యాసం | Tagged | 5 Comments

మెథుసెలాహ్: మనందరికి ముత్తాత చెట్టు

Sudhakarసుధాకర్ రాసే తెలుగు బ్లాగు శోధన 2006లో ఇండిబ్లాగర్స్ నిర్వహించిన పోటీల్లో, 2005లో భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో బ్లాగు. ఇవికాక ఆయన తక్కువ తరచుగా రాసే బ్లాగులు ఇంకో రెండున్నాయి. పొద్దులో సుధాకర్ నిర్వహిస్తున్న శీర్షిక వివిధ.

————————

మన తెలుగు బ్లాగులలోనే ఎవరో పురాణాలలో ఒకొక్కరికి ఆయుష్షు అన్నేసి సంవత్సరాలేంట్రా బాబు అని ఆశ్చర్యపడ్డారొకసారి . నిజానికి నాకు కూడా ఆ అభూత కల్పనలు చదివితే నవ్వు వస్తుంటుంది. వేల సంవత్సరాలు బతికిన పురాణ పురుషుల కథలు నిజమేనా అనిపిస్తూ వుంటుంది.

అయితే ఒక్క సారి ఇప్పుడు మనం చెప్పుకో బోయే వృక్షరాజం తాలుకా కథ చూస్తే కళ్ళు, నోరు తెరుచుకోక మానవు .

ఈ వృక్ష రాజం పేరు మెథుసెలాహ్. ఒక బ్రిష్టల్ కోన్ పైన్ చెట్టు . ఈ పేరు ఎందుకు పెట్టారంటే బైబిల్ లో ఎక్కువ కాలం (దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల కాలం) బతికిన పురుషుడి పేరే ఇది. అయితే ఈ చెట్టు మాత్రం అతని రికార్డుని కాలితో తన్నింది. ప్రస్తుతం దాని వయస్సు ….4767 సంవత్సరాలు. అక్షరాల నాలుగు వేల సంవత్సరాల పైమాటే. ఇప్పుడు తెరుచుకున్న నోరు మీరు మూసుకోమని మా విన్నపం . 🙂

ఈ వయస్సును ఆ చెట్టు కాండపు వలయాలను మైక్రోస్కోప్ లో పరిశీలించి లెక్క కట్టారు.

ఈ చెట్టు తాత గారుండేది : అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం లో, వైట్ మౌంటైన్స్ పైన …సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో… అయితే ఇది వుండే ఖచ్చితమైన ప్రదేశాన్ని అత్యంత గోప్యంగా వుంచారు, ఆ చెట్టు యొక్క పవిత్రత, విలువలను కాపాడేందుకు . అయితే అక్షాంశాలు, రేఖాంశాలు (N 37° 22.724 W 118° 09.941) మాత్రం చూచాయగా తెలుపబడ్డాయి. ఇవి ఒక పెద్ద అడవిని సూచిస్తాయి . అందులో నాలుగు వేల సంవత్సరాలు దాటిన చెట్లనేకం వున్నాయి. అందుకో ఎక్కడో ఒక చోట మన మెథుసెలాహ్ ఠీవిగా బతుకుతుంది. ఈ మధ్యనే సర్ రిచర్డ్ అటెన్ బరో షో (డిస్కవరీ ఛానల్ ) లో అతను ఈ చెట్టుని అతి దగ్గర నుంచి చూపాడు. ఆ స్థాయి వున్న వారే ఆ చెట్టు దగ్గరకు పోగలరని అర్ధం అయింది కదా?

ఇక, ఈ బ్రిష్టల్ కోన్ పైన్ చెట్ల గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం…

ఆయిష్షు అయితే ఎక్కువేమో గానీ, ఈ చెట్లు ఆజానుబాహువులు మాత్రం కావట. ఇవి ఒక రకంగా అడవులలో పెరిగే మరుగుజ్జు వృక్షాలు. వంద సంవత్సరాలలో మహా అయితే ఒక ఇంచి కాండం పెరుగుతుందంట. ఇలా ఎందుకవుతుందంటే.. పది , పదిహేను వేల అడుగుల ఎత్తులో, ఆ చలి గాలులలో, పనికి రాని మట్టిలో ఆ మాత్రం పెరగటమే ఒక గొప్ప. ఆ ఎత్తులలో పెరిగేవి కేవలం ఈ జాతి చెట్లు మాత్రమే. డార్విన్ మహాశయుని సిధ్ధాంతం ప్రకారం అన్నింటిని తట్టుకుని వుండటం వలనే అన్ని సంవత్సరాలు బ్రతక గలిగాయన్నమాట .methuselah.png

మనం ఇక్కడ చెప్పుకుంటున్న వృక్షరాజం తాలుకా జీవితంలో జరిగిన కొన్ని విశేషాలు ఒక డైరీలో రాస్తే?

మెథుసెలాహ్ పుట్టుక : గ్రేట్ పిరమిడ్లు కట్టడం పూర్తి అయ్యింది (2600 BC)

600 వ పుట్టిన రోజు : స్టోన్ హెంజ్ కట్టడం పూర్తి అయ్యింది (2000 BC)

800 వ పుట్టిన రోజు : కంచు యుగం మొదలవుతోంది (1800 BC)

1100 వ పుట్టిన రోజు : మధ్య అమెరికాలో మాయా నాగరికత వేళ్ళూనుకుంటోంది (1500 BC)

1300 వ పుట్టిన రోజు : మోసెస్ హీబ్రులను ఈజిప్టు నుంచి ఇజ్రాయెల్ కు తరలించాడు . (Ten Commandments – 1300 BC)

400 వ పుట్టిన రోజు : గ్రీకులు ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్నారు ( 1194 BC)

1800 వ పుట్టిన రోజు : ఇనుప యుగం మొదలయ్యింది ( 800 BC)

2100 వ పుట్టిన రోజు : గౌతమ బుధ్ధుడు బౌధ్ధమతాన్ని భారతదేశంలో స్థాపించాడు , ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టారు ( 528 BC)

2500 వ పుట్టిన రోజు : ప్రఖ్యాత రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ పుట్టాడు . (128 BC)

2600 వ పుట్టిన రోజు : జీసస్ క్రైస్ట్ పుట్టాడు .

3200 వ పుట్టిన రోజు : మొహమ్మద్ ఇస్లామ్ మతాన్ని స్థాపించాడు ( 610 AD)

4370 వ పుట్టిన రోజు : క్రిష్టఫర్ కొలంబస్ అనే వాడు ఇండియాని వెతుకుతూ అమెరికాని కనిపెట్టాడు . (1492 AD)

4400 వ పుట్టిన రోజు : అమెరికా స్వాతంత్ర్యం పొందింది .

4766 వ పుట్టిన రోజు : తెలుగు బ్లాగర్లు కోకొల్లలుగా బ్లాగులు రాయటం మొదలు పెట్టారు . (2006 AD)

ఈ వృక్షరాజం వున్న అడవిని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇప్పుడు చెప్పండి. మనం దేవుళ్ళని చెప్పుకునే వారికే తాత లాంటిది ఈ చెట్టు . ఇదే చెట్టు మన దేశంలో వుండి వుంటేనా… ఈ పాటికి పూర్తిగా దాని చుట్టూతా దారాలు, పసుపు , మట్టి, రిబ్బన్లు , వుయ్యాలలు, గుడులు గట్రా కట్టి, చంపి పారేసి వుండే వాళ్లం కదా 😉

Posted in వ్యాసం | Tagged | 2 Comments

పొద్దుకు కొత్తరూపు

ఈసారి కూడా అతిథితో బాటు మరి రెండు రచనలు అందిస్తున్నాం. అవి:

1. రానారె రాసిన వ్యాసం (ఇది మీ అంచనాలకు ఒక మెట్టు పైనే ఉంటుందని హామీ ఇస్తున్నాం)
2. జ్యోతిగారి సరదా శీర్షికలో పాపం…ఆంధ్రాపోరడు

ఇక ఈసారి మన అతిథి…వీవెన్ e-తెలుగు సంఘం గురించి వివరిస్తున్నారు.

 ఈ వారాంతంలో మరిన్ని మంచి రచనలు మిమ్మల్ని పలకరించనున్నాయి. ఒక కొత్త శీర్షికను కూడా ప్రారంభించనున్నామని తెలుపడానికి సంతోషిస్తున్నాం.

ఇటీవలే పొద్దు రూపురేఖలు మార్చాం. పై రచనల గురించే కాకుండా కొత్త రూపు గురించి కూడా పాఠకులు తమ అభిప్రాయాలను తెలుపవలసిందిగా కోరుతున్నాం.

-పొద్దు

Posted in ఇతరత్రా | 4 Comments

తెలుగు నుడికారము

రానారెయర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు. పొద్దు పొడుపు ఆయన రచనతోటే జరగడం మాకు గర్వకారణం. అడిగినదే తడవుగా తెలుగు నుడికారంపై చిన్న పరిశోధనలాంటిది చేసి ఈ వ్యాసం రాసిచ్చిన రామనాథరెడ్డి గారికి కృతజ్ఞతలతో ఈ వ్యాసాన్ని మీకందిస్తున్నాం. ఆస్వాదించండి.

——————–

‘తిక్కన పద్యమొక్కటి చక్కగ చదివిన చాలు
తెలుగుజాతి నుడికారము తెలిసికొన్న యటౌను’ -దాశరథిగారి ఒకానొక పద్యం నుండి.

‘శంరకంబాడి సుందరాచారి గారు రవీంద్రుని గీతాంజలిని అనువదించారు. మూలం లోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది.’ -తెలుగు వికీపీడియా.

‘పత్రికల్లో కృతకమైన పదాలు వాడుతున్నారు. టి.వి లలో దారుణమైన సంకర భాష వచ్చేసింది. తెలుగు నుడికారం తగ్గిపోయింది. ఆర్థం తెలియకుండానే పద ప్రయోగాలు చేసేస్తున్నారు.’ -డాక్టర్‌ కాచినేని రామారావుగారు, ఈమాట డాట్ కాం నుండి.

పల్లెటూళ్ళలోనూ సినిమాతనం, సినిమానుడికారం, సినిమాతెలుగు…’ -ఒక పెద్దాయన గమనించిన విషయం.

‘క్రింద వరసలొ కూర్చున్న మా శాస్త్రి అయ్యా అప్పారావు గారూ కాస్త ఆ గొవర్థనం కిందకి దించండి అని అరిచాదు. జనం ముసిముసి నవ్వులు చిందించారు ‘హై! హాయ్!!’ ల మధ్య ఆ అచ్చ తెలుగు నుడికారం విని ఎన్నాళ్ళయిందో!’ -ప్రొఫెసర్ అశోక్‌గారి బ్లాగు నుండి.

‘శబ్దం, అర్థం, అభివ్యక్తి, నుడికారం, వాక్య నిర్మాణం అనేవి అనువాదాల తులనాత్మక విశ్లేషణలో ప్రధాన రంగాలుగా తేలాయి. Half corved poetry in stone (The black pagoda)అనే దాన్ని ‘సగం చెక్కిన శిల్పమ్ము పగిది నాదు పద్యమియ్యది’ (1996-పలుకు చిలుక) అని అనువదించాను. poetry in stone అనే నుడికారం అనువాదకుడికి అందలేదని సమీక్షకుడు తెలియజేసాడు. ఇది సమీక్షకుడి బాధ్యత. కృతజ్ఞతలతో స్వీకరించాను.’ -ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు.

ఇలా ‘నుడికారము’ అనే మాట మనకు అప్పుడప్పుడూ వినబడుతూ ఉంటుంది. ‘తెలుగు నుడికారపు సొగసు’ను గురించి రాయమని పొద్దు సంపాదకులు నన్ను కోరినపుడు, ‘నాకంత సీనుందా’ అనుకొన్నాను తెలుగు సినీనుడికారంలో. నుడికారంమంటే ఏమిటో నాకు బొత్తిగా తెలియదా అంటే మనసొప్పుకోలేదు. కొంత తెలుసు. తెలియకపోవడమేమిటి, ఆంధ్రదేశపు పల్లెటూళ్లలో పెరిగినోళ్లందరికీ ఆ నుడికారం సహజంగా అబ్బుతుంది. ఇలా అనుకొన్నాక ‘నాకు తెలిసిన నుడికారం ఏమిటి? మావూళ్లో ఎవ్వరూ నుడికారాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడుకోఁగా వినలేదే!’ అని ప్రశ్నించుకొని బ్రౌణ్యములో వెతికితే ‘వాచకము, మాట, రచనము, మాటచమత్కారము’ అనే అర్థాలు కనిపించాయి. నుడువు అంటే చెప్పు(ము) అని అర్థం. నుడి అంటే మాట. సుమతీ శతక కారుడు బద్దెన ఏమన్నాడో చూడండి –

శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులుఁ బుట్ట నుడివెద సుమతీ!

సకల జనులు ‘ఔరా’ అనేలా నోరూరగా చవులు (రుచులు) పుట్టేలా చెబుతానన్నాడు. అన్నంతపనీ చేసి చూపాడు. ఇక్కడ ఔరా అనడం నుడికారపు సొగసు. దీనర్థం వివరించ నక్కరలేకుండానే మనందరికీ తెలుసు. ఈ శతకం నిండా మాటల చమత్కారాలెన్నో చూడవచ్చు మనం. మచ్చుకు ఈ పద్యం చూడండి:

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ

నుడికారమనేది పద్యాలకు, కావ్యాలకూ, గ్రంథాలకూ, కవులకూ, పండితులకే పరిమితంకాదు. నుడికారపు ముడిసరుకు సామాన్యమానవుడు మాట్లాడే భాషే. పైన నేనుదహరించినది ఛందస్సూ యతి ప్రాసలతో అందంగా అమరిన పద్యమే కావచ్చు, కానీ అందులో వాడబడిన మాటలు అది రాయబడిన కాలంనాటి జన సామాన్యం రోజూ మాట్లాడేవే. ‘ఈ నా కొడుక్కు మిడిమేలం జాస్తి’, ‘యాల కొడకా అంత మిడిమేలం నీకు’ లాంటి మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా తొందరపాటుతో అనాలోచితంగా ప్రవర్తించినా, ఎవరికైనా త్వరగా కోపం వచ్చినా, ఎవరైనా క్షణికావేశాన్ని దాచలేక వ్యక్తపరచి తప్పుచేశాడనిపించుకొన్నా వాణ్ణి ఈ పద్ధతి మార్చుకోమనే పెద్దల బుజ్జగింపు మాటలు ఇవి. పద్యంలో ‘మిడిమేలం’ అనేది ఆ దొరయొక్క విశేషణం. అట్లాంటి వాడి కొలువున పనిచేసి అగచాట్లుపడే బదులు ‘మడిదున్నుక బ్రతుకవచ్చు’ అన్నాడు – అదీ ఎలాగంటే – మాంచి వడిగల ఎద్దులను కాడి గట్టి. వడి అంటే వేగము, హుషారు. కాడి అంటే ఎద్దులను జంటగా కూర్చి నడపడానికి వాటి మెడమీద వేసే కొయ్య. మామూలుగా కాడి అంటేనే జత ఎద్దులు అనే అర్ధం వాడకలో ఉంది. కాడిగట్టు అంటే ఎద్దులను జతగా కూర్చి సిద్దం చెయ్యమని అర్థం. వడిగల ఎద్దులతో మడిదున్నుతుంటే ‘ఇంకొంతసేపు పనిచేద్దాం అనిపిస్తుంది అంటారు. అది అనుభవైకవేద్యం.

మడి దున్నుకు బ్రతకవచ్చని ఎందుకన్నాడు? కువైట్‌కో సౌదీకో పొమ్మనొచ్చు. లేదూ – డిగ్రీ పాసయి ఏదైనా కాల్‌సెంటర్లో చేరమని చెప్పొచ్చు. అలా ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అలా చెబితే తెలుగు నుడికారం దెబ్బతింటుందని కాదు, బద్దెనకాలం నాటికి సేద్యమే గౌరవప్రదమైన మరియు ప్రధానమైన వృత్తి కనుక, వడిగలిగిన కాడెద్దులంటే చెప్పుకోదగిన ఆస్తి కనుక. దీన్నిబట్టి మనకేమర్థమౌతుంది? నుడికారం జన జీవనంలో నుండి, వారి మాటల్లోనుండి వస్తుంది. సమాజపు జీవనవిధానం, అక్కడి వాతావరణ పరిస్థితులు, జనబాహుళ్యంచేత ఆమోదింపబడిన పద్ధతులు ఆచారాలు, ఆటపాటలు ఇవీ వారి మాటల్లో కనబడతాయి వినబడతాయి. ఒక భాషయొక్క నుడికారమనేది ఆ జాతికి సంబంధించినది. అందుకే ‘తెలుగుజాతి’ నుడికారమన్నాడు దాశరథి (వ్యాసం ప్రారంభం చూడండి). వారి మాటలలో దొర్లే చమత్కారాన్నే మనం ‘నుడికారం’ అంటాం. నుడికారమనేది ముందు ప్రజల నాలుకల నుండి ఉద్భవించి, ఆ తరువాతనే కావ్యాలలోకి చేరింది. కాబట్టి నుడికారమనేది పండితులకంటే ముందు పామరుడి సొత్తు. మాటల్లోని చమత్కారం అర్థంకావాలంటే ఆ మాటలు పుట్టిన సమాజంలో పుట్టి పెరగాల్సి వుంటుంది. ఆ సంస్కృతిని ఒంటబట్టించుకోవలసి వుంటుంది.

ఇప్పుడు సరదాగా తెనాలి రామకృష్ణ సినిమాలోని ఒక సన్నివేశాన్ని చూద్దాం.

శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులం గల్గి దు
ర్భర షండత్వ బిలప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్‌ మానినన్‌
నర సింహ క్షితిమండ లేశ్వరుల నెన్నన్వచ్చు నీ సాటిగా
నరసింహక్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!

భువనవిజయంలో శ్రీకృష్ణదేవరాయలవారిని శౌర్యమునుగూర్చి అల్లసాని పెద్దన చెప్పిన చెప్పిన పద్యం ఇది. పద్యం చెప్పడం పూర్తవగానే సభికులంతా భేష్ భేష్ అంటూండగా, తెనాలి రామకృష్ణుడు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటాడు. వికటకవిని కారణం అడుగుతాడు రాజు. ‘తోక ముడిచి బిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి రాదంటూనే, రాజకంఠీరవా! అని తాతగారు సంబోధిస్తుంటే నాకు నవ్వొచ్చింది’ అంటాడు. రాజకంఠీరవమంటే సింహరాజమని అర్ధం. ఆ మాటకు పెద్దన నొచ్చుకోక నవ్వుతూ ‘మంచి పట్టేబట్టావ్ మనవఁడా! ఏదీ నువ్వొక పద్యం చెప్పు’ అంటారు. ఆ మనవడు రాయలవారి శౌర్యాన్ని వర్ణిస్తూ చెప్పిన అద్భుతమైన మత్తేభం –

కలనన్‌ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మం
డల భేదంబొనరించి ఏగునెడ, తన్మధ్యంబునన్‌, హార కుం
డల కేయూర కిరీట భూషితుని శ్రీనారాయణుం గాంచి, లో
గలగం బారుచునేగె, నీవ యను శంకన్‌ కృష్ణరాయాధిపా!

ఇక్కడ మనం గమనించవలసిన మాట – ‘మంచి పట్టేబట్టావ్ మనవఁడా’. బహుశా ఆనాటి మల్లయుద్దాల నుండి వచ్చి ఉండొచ్చు ఈ ‘పట్టుబట్టడ’మనే నుడి. Good catch అనేది ఇదే సందర్భంలో ఆంగ్లేయులకు నుడి. బహుశా మల్లయుద్ధాలకన్నా బంతితో ఆడే ఆటల నుండి వారికీ నుడికారం వచ్చి ఉండొచ్చు. ఇందుకు నాకే ఆధారమూలేదు. ఇంగ్లీషువారి నుడికారం ప్రధానంగా వారికి నౌకాయానంపట్ల ఆటలపట్ల ఉన్న మక్కువతో ముడిపడిందిట. ఇది పరిశోధనా వ్వాసం కాదు. ఈ విషయం మీద నాకు కలిగిన అవగాహనకు సంక్షిప్త రూపం ఈ వ్యాసం. తప్పులుంటే మన్నించి, తెలిసిన పెద్దలెవరైనా నాకు మొట్టికాయలు వేసి నన్ను సరిదిద్దవలసిందిగా సవినయంగా అర్థిస్తున్నాను.

తెలుగు నుడికారం మన వ్యావసాయిక జీవితాలనుండి పుట్టింది.’వీడు మాట్లాడితే రాళ్ల చేలో గుంటక తోలినట్టుంటుంది’ అంటాం – విరామం లేకుండా లొడలొడా మాట్లాడేవాడిని చూసి విసుగొచ్చినపుడు. ‘గుడ్డెద్దు చేలోబడినట్టు ఊరికే గడగడా బట్టీబడితే సదువులు అబ్బవు నాయినా’ – ఒక ప్రణాళికగానీ ఆలోచనగానీ లేకుండా విపరీతంగా కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులను చూసి సానుభూతితో అనే మాట ఇది. ‘ఏమి నాయినా బొత్తిగా నల్లకప్పేసినావు’ అనేవారు నేను ముక్కావారిపల్లె హాస్టలు నుండి ఇంటికొచ్చినప్పుడు. అంటే చిక్కిపోయి అనారోగ్యంగా ఉన్నానని అర్థం. ఆవులు, ఎద్దులు ఆరోగ్యంగా ఉంటే నిగారింపుతో ఉంటాయి. వాటికేమాత్రం నలతగా ఉన్నా చర్మంలో ఆ నిగారింపు పోతుంది. వెంటనే తగిన వైద్యం చేయాలన్నమాట. ఇదీ నల్లకప్పు వేయటం అనే మాటకు మూలం.’ఈ సారి రోంత ఈకేసినాడబ్బోవ్ మీవోడు’ అన్నారు నేను కొంత కండబట్టేసరికి. ఈక వెయ్యడమనే ఈ మాటకు మూలం మన పల్లెల్లో కోడిపుంజుల మీద ఉండే మోజు. బొమ్మెలుగా ఉన్న కోళ్లు బాగా తిని నిగారించే కొత్త ఈకలను సంతరించుకొని పందేనికి సిద్ధమౌతాయన్నమాట.అదీ ఈకెయ్యడమంటే. కోడిపుంజుల పోట్లాట చూసే వుంటారు. సమ ఉజ్జీలైతే ఒకదాన్నొకటి తన్నుకొని తన్నుకొని అలసిపోతాయి. ఒకో సారి చచ్చిపోతాయి కూడా. ఒకోసారి కొంతసేపు పోరాడి రెండిటిలో ఒకటి తోక ఈకలను పైకెత్తేసి అపజయాన్నంగీకరిస్తుంది. ఆ అంగీకరించడంలోకూడా కొంత డాంబికముంటుంది. ఆటల్లో ఓటమినొప్పుకోక మొండిగా ఎదురుతిరిగే వాని చేతగానితనాన్ని – ‘వాడు కొప్పు ఎత్తేసినాడు, వదిలేయండ్రా’ అని ఎగతాళి చేస్తారు పల్లెల్లో. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో!

మన రాష్ట్రప్రభుత్వానికి, ‘మార్గదర్శి’కి మధ్య నడుస్తున్న వ్యవహారం మనకందరికీ తెలిసిందే. ఆమధ్య ఒక ఆదివారం ఆంధ్రజ్యోతి ‘సరదాగా…’ శీర్షికలో రాజగోపాల్‌గారి వ్యంగ్య రచననుండి ఒక భాగం ఇక్కడ చదవండి – ‘పిచ్చివాడా! వరల్డ్‌ బ్యాంకైనా దివాలా తీస్తుందేమో కానీ మార్గదర్శి దివాలా దియ్యదు గాక తియ్యదు. మా చైర్మన్‌ రామోజీరావు గారంటే ఏమనుకున్నావు? నిప్పులాంటి నిజాయతీ ఆయనది. నాకు ఆయన మీద బోలెడంత నమ్మకం ఉంది. పైగా, ప్రతిపైసాకి నాదీ పూచీకత్తు అని చెప్పారు … వినలేదా?’
‘పైస లెవడిక్కావాలిబే … రూపాయిల సంగతి చెప్పు’ అన్నాడు యాదగిరి.
వెంకట్రావుకి ఒళ్ళు మండింది. ‘ఛప్‌ .. నోర్ముయ్‌! నీ కసలు తెలుగు నుడికారం తెలీదు. దానర్థం అదే … అయినా, అంత అవసరమైతే తన ఆస్తులన్నీ అమ్మేసైనా ఖాతాదారుల డిపాజిట్లు చెల్లిస్తానని మా చైర్మన్‌ గారు హామీ ఇచ్చారు … నేను నమ్ముతున్నాను. కందకి లేని దురద కత్తిపీట కెందుకన్నట్టు ఏ డిపాజిట్లూ లేని వాడివి … మధ్యలో నీకెందుకూ బెంగ?’
యాదగిరికి నుడికారం తెలియకపోవడానికి కారణం అతను పైసలకాలం నాటి మనిషికాకపోవడం కావచ్చు.

నేను పైన ఉదహరించిన నుడికారాల నేపథ్యాన్ని గనక వివరించి ఉండకపోయినట్లయితే, కొంతమందికి ఆ మాటల్లోని చమత్కారం అర్థమయ్యేదికాదు. ఈనాడు కంప్యూటర్లో ఈ వ్యాసం చదువుతున్నవారిలో చాలామందికి వ్యవసాయం, పశువులు, కోళ్లూ, పల్లె వాతావరణం వంటి అనుభవాలు లేకపోవడమే ఇందుకు కారణం. వారి సంస్కృతి కాస్త వేరు. వారి జీవన విధానం వేరు. రాబోయే తరాలుకూడా వ్యావసాయిక జీవనానికి దూరంగా పట్టణాల్లో సినిమాలు, టీవీలూ, ఇంగ్లీషు చదువులు, ఇతరభాషలవారి ఇరుగు పొరుగు, పోటీలు, వాటాలు అంటూ పరుగులమయమైన జీవనవిధానానికి అలవాటు పడి, ఆ వాతావరణానికి సంబంధించిన మాటలు నేర్చుకొంటూ ఉండటంతో వారి నుడికారం కూడా మారుతూ ఉంది. ముందే చెప్పుకొన్నాం కదా నుడికారం సంస్కృతి నుండి పుడుతుందని. ఈ నాడు తెలుగు నుడికారము తగ్గిపోయింది అంటే ఆశ్చర్యమేముంది? ఈనాటి మన ఆర్థిక రాజకీయ జీవనానికి ఆంగ్లం నేర్వడం తప్పనిసరి. ఈ మార్పు తప్పేమీ కాదు, తప్పేదీ కాదు. అయితే ఈమధ్య ‘అయ్యయ్యో’ అనవలసినచోట ‘oops’ అంటూంటారు కొందరు తెలుగువాళ్లు. ఇలా అనడం ఎక్కువ మందికి జుగుప్సాకరంగా అనిపిస్తే oops తెలుగులో కొత్త నుడికారం కాబోదు. ‘భాష జీవనది లాంటిది’ అన్న మాటను ఈ మధ్య చాలాచోట్ల చదివాను. కొన్ని దశాబ్దాలక్రితం బహుభార్యత్వం సంఘంలో సాధారణ విషయమైనప్పుడు ‘సవతిపోరు’ అనే మాటకు అర్థం వివరించాల్సిన పని ఉండేదికాదు. కానీ కొంతకాలానికి ‘నాకీ సవతి పోరు తప్పేలా లేదు’ అన్న మాటకు అర్థం తెలియకపోతే ఆశ్చర్యపడనక్కరలేదు.

నుడికారము ప్రాంతానికీ ప్రాంతానికీ మారుతుంది అంటారు. భాష ఒకటే అయినప్పటికీ ప్రాంతాన్ని బట్టి, ప్రజల జీవనాన్ని బట్టి నుడికారము మారుతుంది. కోస్తా తీరప్రాంతాలలో సముద్రానికి, చేపలుపట్టడానికి సంబంధించిన నుడికారం అక్కడి జాలరుల మాటల్లో వినబడుతుంది. కేరళవారి నుడికారములోనూ ఈ ప్రభావమే కనిపిస్తుందని నా మలయాళీ మిత్రుడొకరు ఉదాహరణలతో సహా వివరించారు. ‘నా బంగారు తండ్రీ!’ అని పిల్లల్ని ముద్దుచేయడం అచ్చతెలుగు నుడికారం. ఇంగ్లీషువారు ఇలాంటి మాట వాడరనుకుంటాను. అలాగే ‘ఔరా కొడుకా, అబ్బ ఏముందిది, అన్నన్నా ఎంతమాట, అమ్మా ఆశదోశ…’ ఇలాంటివెన్నో తెలుగువారి నుడులు. ఒకే మాటకు సందర్బాన్నిబట్టి అర్థాలు మారిపోవడం ఇంకో చమత్కారం. ఒక ఉదాహరణకు ‘పుట్టి’ అనే పదాన్ని చూడండి – ‘పుట్టి బుద్ధెరిగాక ఇలాంటి విచిత్రం చూడనేలేదు’, ‘వాణ్ణి నమ్మితే నీ పుట్టి మునుగుతుందంతే’, ‘పుట్టి రాగులు రెండుపుట్లు సజ్జలు’. మన పాటల్లో కనిపించే ‘నే చినదాన – వేచిన దాన’, ‘వందనాలు – వంద వందనాలు’, ‘ఈ వనమున నా జీవనమే’ లాంటి ఎన్నోమాటలగారడీలూ తెలుగుజాతి నుడికారపు సొగసులే.

చాన్నాళ్లకిందట ఆంధ్రభూమి వారపత్రికలోని భగవాన్‌గారి ఒక కార్టూను – బట్టలు సర్దేసుకుని ఇల్లువిడిచి శాశ్వతంగా వెళ్లడానికి పెట్టెతోసహా సిధ్దమైన తన భర్త కాళ్లమ్మటబడి కన్నీరుమున్నీరవుతూ ఆ అర్థాంగి అంటుంది – ‘ఛీ పాడు! పొండీ! అని సరదాగా అన్నానండీ. వా…’. నుడికారం తెలియకపోతే ఇలాగే ఉంటుందిమరి. ధర్మదాత సినిమాలో కొడుకులందరూ ముదిమిలోని తండ్రిని ఒంటరిని చేసి వెళ్లిపోయినపుడు వచ్చేపాట -‘ఎవ్వడికోసం ఎవడున్నాడు, పొండిరా పొండి’. వాళ్లెప్పుడో వెళ్లిపోయారుకదా, ఈయనేమిటి మళ్లీ ‘పొండిరా పొండి’ అంటాడు అనే ఆలోచన మనకురాదు. ఎందుకంటే ‘నన్ను విడిచి వెళ్లారు కదూ, అలాగే కానివ్వండ్రా’ అన్న ఆ పెద్దమనిషి ఆవేదన మన మనసుకు అందుతుంది కాబట్టి. ఆ నుడికారం మనకు తెలుసు.

విలాసంగా బ్రతికిన కవిసార్వభౌమ శ్రీనాధుడు చరమాంకంలో కష్టాల పాలయి రేనాడులో జొన్నకూడు తినలేక, బాధలోనే ఆనందాన్ని వెతుక్కోవలసిన పరిస్థితిలో ఆయన నోట జాలుసారిన ఈ చాటువు చూడండి –

గరళము మ్రింగితినంచును
పురహర గర్వింపబోకు. పో!పో!పో!
బిరుదిప్పుడు కానవచ్చెడి.
మెరిసెడి రేనాటి జొన్నమెతుకులు తినుమీ!

కార్టూనులోని అర్థాంగిలాగ ఇక్కడ శ్రీనాథుడు కూడా శివుని ‘పో!’ అని మూడు మార్లు అంటున్నాడు. కష్టాలలో ఉన్న తనకు సాయంరాలేదనే బాధాపూరితమైన కినుక అది. ఆ కినుకలోనే సవాలు విసురుతున్నాడు – గరళకంఠుడనే బిరుదుంది కదా నీకు, అదేమంత గొప్పసంగతికాదు, ఈ జొన్నమెకుతులు తిను నీ బిరుదు అప్పుడు కనబడుతుంది అని. పురము అంటే లోకమని అర్థం. హరుడంటే శివుడు. శివుణ్ణి త్రిపురాంతకుడంటారు. అలాగే వసుంధరా దాస్ పాడిన’షక లక బేయ్‌బి’ పాట చివరలో ‘ఏయ్ పోవయ్యా, అడియోస్, అమీగో!’. చివరివరకూ ‘ఆశ నీకు లేనే లేదా, నువ్వు మీసమున్న చెట్టుచేమవా’ అంటూ కవ్వించి, ఇక లాభంలేదని చివరగా చిన్న అలకాస్త్రం ప్రయోగించడమన్నమాట. అందుకే ‘వీడ్కోలు, చెలికాడా!’ అంటుంది స్పానిష్ భాషలో.

ఒక్కటి మాత్రం నిజం. తెలుగు నుడికారం తగ్గిపోతోంది అనే బదులు మారుతోంది అనవచ్చేమో. తెలుగు తెలుగుగానే ఉన్నరోజులలో అచ్చతెనుగు నుడికామే ఉండేది. తెలుగు సంస్కృతభరితం అయ్యాక కూడా అది అచ్చతెనుగు నుడికారంగానే చలామణి అయింది. ఉదాహరణకు ‘రామసక్కని బంగారు బొమ్మ’. రామః అన్నది సంస్కృతపదం. ఇది స్త్రీలింగ పదమని తెలుసుకొని ఆశ్చర్యపోకండి. అయితే ఆంధ్ర, కళింగ, వంగ, మగధ లాంటి ఎన్నో దేశాలుగా వివిధ ప్రాంతీయ భాషలను కలిగి విడివడియున్న మనలను, సంస్కృతాధారమయిన ఆర్షధర్మం ఒక్కటిచేసింది అంటారు. అంటే మన ఆధ్యాత్మిక వ్యవహారాలకు సంస్కృతం తప్పనిసరి. కావున అది ప్రాంతీయభాషలలో కలగలిసిపోయింది. ఈనాడు మన అర్థిక, రాజకీయ లావాదేవీలకు ఆంగ్లము తప్పనిసరైంది. కొన్ని అచ్చతెలుగుమాటల, కొన్ని సంస్కృతం కలిసిన తెలుగుమాటల స్థానాన్ని ఇప్పుడు ఆంగ్లం ఆక్రమించింది. మంచినీళ్లడిగే బదులు డ్రింకింగ్‌వాటరడుగుతున్నాం మరి. ఈ వాక్యం చివర ‘మరి’ లేకపోతే ఆమాట కాస్త చప్పగా ఉంటుంది గమనించారా, ఇదీ నుడికారమే మరి. నుడికారం తగ్గడమో మారడమో తనంతట తానుగా జరగడంలేదు, మనమే మార్చేస్తున్నాం.

తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జి.ఎన్.రెడ్డి గారి తెలుగు పర్యాయపద నిఘంటువులో – లోకోక్తి, లోకహితోక్తి, శాస్త్రము, శ్లోకము, సౌమ్యము లతోపాటు అడుగు, ముప్పదిరెండు అనేవి కూడా పర్యాయపదాలుగా చెప్పబడ్డాయి.

తమాషాకు ఒక సంగతి చెబుతానిక్కడ. ‘సండే అయితేనేంలాభం, ఎండమండిపోతోంది’ అని బాధపడతాం మనం. ఒక తెలుగువాడు ఆదివారాన్ని సండే అంటుంటే ఆదిత్యునికి మండదామరి. రవివారాన్ని సండే అంటే మంట రాజుకోదూ! ఇంగ్లీషువాడు ‘సన్’డే అంటుంటే ‘సన్‌’కు సంతోషమేగా. తర్కించకండి – చెప్పానుకదా తమాషాకంటున్నానని. ఈ విషయంలో కన్నడ సోదరులనుచూసి నేర్చుకోవాలి. మనం నాజూకుగా ఆంగ్లం వాడే చోట వారు కన్నడపదాలువాడి తాము కన్నడిగులమని తమ ఉనికినిచాటడం నా రెండున్నరేళ్ల బెంగళూరు వాసంలో గమనించాను. సమ్ ఇండియన్స్ ఆర్ మోర్ బ్రిటిష్ దాన్ ద బ్రిటిష్ అన్న మాటకు గర్వించక, సంస్కృతి మూలాలను చిన్నచూపుచూసే మన ఆత్మసౌందర్యాన్ని ఆంగ్లేయులే ఎద్దేవా చేస్తున్నారని గ్రహించవద్దూ మనం!?

**** **** ****

తప్పులను సరిదిద్ది ఈ వ్యాసమును రాసే ధైర్యాన్ని నాకు ప్రసాదించిన పెద్దలు, శ్రేయోభిలాషులు శ్రీ రావూరి భరద్వాజ గారికి సవినయ వందనములు, కృతజ్ఞతలతో… -రానారె.

Posted in వ్యాసం | Tagged | 43 Comments

పాపం ఆంధ్రా పోరడు

jyothi.bmpఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు గత అక్టోబరులో మొదలుపెట్టిన వంటల బ్లాగు మూడు నెలలు తిరక్కుండానే వంద టపాలు పూర్తిచేసుకుంది. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శీర్షిక: సరదా.

జ్యోతిగారి సరదా బ్లాగు http://vjyothi.wordpress.com/

———————

ఒక సినిమా పాటకు అనుకరణ:

పోను పోనంటూనే పోరడూ పోరడూ
అమెరికా పోయిండే పోరడూ పోరడూ
వద్దు వద్దంటూనే గుంటడూ గుంటడూ
డాలర్ల వెనకురికే గుంటడే గుంటడూ || పోను ||
కంప్యూటర్లే బోగస్సని కుచ్చుటోపి పెడతాయని
కహానీలు ఇన్పించే పోరడు
కలల్లోన తేలిపోతు కోటికి పడగెత్తాలని
కొలంబియా పోయిండే పోరడూ
ఔనా అయ్యో పరేషాన్ అవుతాడే
పాపం పసివాడే పోరడూ || పోను ||

వున్నదేదో అమ్ముకుని ఊరినంత వదులుకుని
వర్జీనియా దారిపట్టే పోరడూ
దిమాఖంత ఖరాభైంది దిగులుచెంది దీనంగా
వీధులెంట తిరిగినాడే పోరడూ
ఔరా అతిగా ఆశపడి అల్లాడెనే
అమెరికాలో ఆంధ్రావాడే పోరడూ || పోను ||

-జ్యోతి వలబోజు (http://vjyothi.wordpress.com)

Posted in వ్యాసం | Tagged | 3 Comments

నా దృష్టిలో ఈ-తెలుగు సంఘం

veeven.pngతెలుగుబ్లాగర్ల గుంపులో క్రియాశీల సభ్యుడు. లేఖిని మరియు కూడలి సృష్టికర్త మరియు నిర్వాహకుడు. ఇవి రెండూ లేకపోతే చాలామంది తెలుగుబ్లాగరులకు పొద్దు గడవదు. తెలుగువికీపీడియాలో నిర్వాహకుడు, ఆంగ్ల వికీపీడియాలో కూడా సభ్యుడు. ఈ మితభాషి మాటలను పొదుపుగా వాడుతూ e-తెలుగు సంఘం గురించి ఇలా వివరిస్తున్నారు:

————————-

ఈ-తెలుగు సంఘం యొక్క

ప్రాథమిక ధ్యేయం: కంప్యూటర్లు మరియు వెబ్ లో తెలుగు వాడకాన్ని పెంపొందించడం.
గమ్యం:సాధారణ (ఇంగ్లీషు అంతగా రాని) వినియోగదారుడు కూడా కంప్యూటర్లు మరియు వెబ్ ని తన అవసరాలకి భాషాపరమైన ఇబ్బందిలేకుండా వాడుకోగలగాలి.

గమ్యాన్ని చేరుకునేందుకు సవాళ్ళు/అడ్డంకులు, వాటినెదుర్కోవడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు, ఇతరత్రా:

సంకేతలిపులు – యూనికోడ్ వ్యాప్తి – ఫాంట్లు:

ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, మొదలైన సైట్లు ఒక్కోటి ఒక్కో సంకేతలిపి (encoding) ని ఉపయోగిస్తున్నాయి. ఆయా సైట్లకి వెళ్ళి చూడడం తప్పించి, వాటి నుండి విషయాన్ని సంగ్రహించి గూగుల్ న్యూస్ లాంటి చోట్ల చూసే అవకాశం లేదు. (తెలుగుబ్లాగులన్నీ, వెబ్ పత్రికలు కొన్ని యూనికోడ్ని వాడుతున్నాయి. ఫలితంగా అన్నింటినీ ఒకేచోట సంకలనం చెయ్యడానికి సాంకేతికంగా మార్గం సులభమయ్యింది. ఆ ప్రయోజనాన్ని బ్లాగర్లు, వాటి చదువరులు అనుభవిస్తున్నారు.)

వెబ్ లో చాలా సమాచారముంది. మనక్కావలసిన సమాచారం కోసం మనం శోధనాంత్రాల (search engines) పై ఆధారపడతాం. యూనికోడ్ వాడని సైట్లలోని సమాచారాన్ని శోధనాంత్రాలు అర్థంచేసుకోలేవు. కనుక వాటిని వెదికిపట్టుకునే అవకాశం అంతంతమాత్రమే. (ఉదాహరణకి “చంద్రబాబు నాయుడు” అని గూగుల్ లో వెదకండి. తెలుగు వార్తా పత్రికలనుడి మీకు ఒక్క ఫలితమైనా కనిపిస్తుందా? కానీ ప్రతీరోజూ అన్ని పేపర్ల లోనూ ఈ పేరు ఒక్కసారైనా వస్తుంది.) వివిధ వెబ్ సైట్లు వాడే సంకేతలిపులని అర్థంచేసుకొనేలా శోధనాంత్రాలని తయారుచేయడమనేది చాలా కష్టం. వీటన్నింటినీ యూనికోడ్ వాడేలా చూడడమే మంచి ఉపాయం. లేకపోతే,
తెలుగు వార్తాపత్రికల వెబ్ మార్కెట్టుని యాహూ, MSN తెలుగు లాంటి పెద్దచేపలు మింగేస్తాయి.

యూనికోడ్ వాడటానికి ఉన్న పెద్ద అడ్డంకి మనకి తగినన్ని వైవిధ్యమైన యూనికోడ్ తెలుగు ఫాంట్లు లేవు. ఉన్న వాటిలో కొన్ని తప్ప మిగతావి అంత సాంకేతిక నాణ్యతతో లేవు.

చివరి వినియోగదార్లకు కంప్యూటర్లలో తెలుగెలా చూడాలి మరియు రాయలి అన్నది మనం తెలియజేయాలి. వెబ్ సైటు యజమానులు మరియు తయారీదార్లకు యూనికోడ్ వల్ల లాభాలు తెలియజెప్పి, ఆచరణలో ఉన్న సాంకేతిక ఇబ్బందులకు పరిష్కారాలు సూచించాలి.

స్థానికీకరణ:

చాలా ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులలో స్థానికీకరణ కోసం ప్రత్యేక జట్లు ఉంటాయి. తెలుగులో తప్పనిసరిగా ఉండాలి అన్న ఉపకరణాల ప్రాజెక్టులలో మనం స్వచ్ఛందంగా తోడ్పడాలి. (ఫైర్ ఫాక్స్, స్వేచ్ఛ లినక్స్, గూగుల్ ఉత్పాదనలు, మైక్రోసాప్ట్ ఉత్పాదనలు, వర్డ్ ప్రెస్, ఓపెన్ఆఫీస్, తదితరాలు ఉదాహరణలు.) ఈ
ప్రాజెక్టులన్నిటిలోనూ ఎంతో కొంత ప్రయత్నం జరిగింది. మనం మరింత చొరవగా స్పందించి ఈ ప్రక్రియల్ని వెగిరపరచాలి.

స్థానికీకరణలో ప్రధాన సవాలు–UIలో వాడేందుకు మంచి సరళమైన తెలుగుపదాలు ఉద్భవించాల్సిఉంది. వీటి ప్రామాణీకరణ కొరకు భాషా కోవిదుల సహాయంతో మనం ప్రయత్నించాలి.

వికీపీడియా మరియు ఇతర వికీమీడియా ప్రాజెక్టులు:

వికీపీడియా యొక్క విలక్షణత మీకు తెలుసు. ప్రపంచంలోని విజ్ఞానాన్నంతటినీ ఒకే చోట చేర్చే మహా ప్రయత్నమది. మిగతా భారతీయ భాషలతో పోలిస్తే మనమే ముందున్నా, మన జనాభాలో పదిశాతం మాట్లాడేవారుకూడా లేని భాషలు మనకంటే రెట్టింపు వ్యాసాలు కలిగిఉన్నాయి. వికీపీడియా మరియు ఇతర వికీమీడియా ప్రాజెక్టుల గురించి ప్రజలో అవగాహన పెంచి వికీ ప్రయత్నానికి తోడ్పడేలా చేస్తే, తెలుగులో కూడా మంచి విజ్ఞాన సంపద పోగవుతుంది. ఇదంతా భావితరాలకు కూడా అందుబాటులో ఉంటుంది.

తెలుగుబ్లాగర్ల చైతన్యవంతమైన కృషివల్ల వెబ్‌లో తెలుగు గతమెన్నడూ లేనంతగా వెలుగుతోంది. ఈ-తెలుగు సంఘ ఆవిర్భావంతో ఈ ప్రక్రియ వేగం పుంజుకొని మరింత ఫలవంతమౌతుందని ఆశిస్తున్నాను.

-వీవెన్ (http://veeven.wordpress.com)

Posted in వ్యాసం | Tagged | 9 Comments