నా దృష్టిలో ఈ-తెలుగు సంఘం

veeven.pngతెలుగుబ్లాగర్ల గుంపులో క్రియాశీల సభ్యుడు. లేఖిని మరియు కూడలి సృష్టికర్త మరియు నిర్వాహకుడు. ఇవి రెండూ లేకపోతే చాలామంది తెలుగుబ్లాగరులకు పొద్దు గడవదు. తెలుగువికీపీడియాలో నిర్వాహకుడు, ఆంగ్ల వికీపీడియాలో కూడా సభ్యుడు. ఈ మితభాషి మాటలను పొదుపుగా వాడుతూ e-తెలుగు సంఘం గురించి ఇలా వివరిస్తున్నారు:

————————-

ఈ-తెలుగు సంఘం యొక్క

ప్రాథమిక ధ్యేయం: కంప్యూటర్లు మరియు వెబ్ లో తెలుగు వాడకాన్ని పెంపొందించడం.
గమ్యం:సాధారణ (ఇంగ్లీషు అంతగా రాని) వినియోగదారుడు కూడా కంప్యూటర్లు మరియు వెబ్ ని తన అవసరాలకి భాషాపరమైన ఇబ్బందిలేకుండా వాడుకోగలగాలి.

గమ్యాన్ని చేరుకునేందుకు సవాళ్ళు/అడ్డంకులు, వాటినెదుర్కోవడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు, ఇతరత్రా:

సంకేతలిపులు – యూనికోడ్ వ్యాప్తి – ఫాంట్లు:

ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, మొదలైన సైట్లు ఒక్కోటి ఒక్కో సంకేతలిపి (encoding) ని ఉపయోగిస్తున్నాయి. ఆయా సైట్లకి వెళ్ళి చూడడం తప్పించి, వాటి నుండి విషయాన్ని సంగ్రహించి గూగుల్ న్యూస్ లాంటి చోట్ల చూసే అవకాశం లేదు. (తెలుగుబ్లాగులన్నీ, వెబ్ పత్రికలు కొన్ని యూనికోడ్ని వాడుతున్నాయి. ఫలితంగా అన్నింటినీ ఒకేచోట సంకలనం చెయ్యడానికి సాంకేతికంగా మార్గం సులభమయ్యింది. ఆ ప్రయోజనాన్ని బ్లాగర్లు, వాటి చదువరులు అనుభవిస్తున్నారు.)

వెబ్ లో చాలా సమాచారముంది. మనక్కావలసిన సమాచారం కోసం మనం శోధనాంత్రాల (search engines) పై ఆధారపడతాం. యూనికోడ్ వాడని సైట్లలోని సమాచారాన్ని శోధనాంత్రాలు అర్థంచేసుకోలేవు. కనుక వాటిని వెదికిపట్టుకునే అవకాశం అంతంతమాత్రమే. (ఉదాహరణకి “చంద్రబాబు నాయుడు” అని గూగుల్ లో వెదకండి. తెలుగు వార్తా పత్రికలనుడి మీకు ఒక్క ఫలితమైనా కనిపిస్తుందా? కానీ ప్రతీరోజూ అన్ని పేపర్ల లోనూ ఈ పేరు ఒక్కసారైనా వస్తుంది.) వివిధ వెబ్ సైట్లు వాడే సంకేతలిపులని అర్థంచేసుకొనేలా శోధనాంత్రాలని తయారుచేయడమనేది చాలా కష్టం. వీటన్నింటినీ యూనికోడ్ వాడేలా చూడడమే మంచి ఉపాయం. లేకపోతే,
తెలుగు వార్తాపత్రికల వెబ్ మార్కెట్టుని యాహూ, MSN తెలుగు లాంటి పెద్దచేపలు మింగేస్తాయి.

యూనికోడ్ వాడటానికి ఉన్న పెద్ద అడ్డంకి మనకి తగినన్ని వైవిధ్యమైన యూనికోడ్ తెలుగు ఫాంట్లు లేవు. ఉన్న వాటిలో కొన్ని తప్ప మిగతావి అంత సాంకేతిక నాణ్యతతో లేవు.

చివరి వినియోగదార్లకు కంప్యూటర్లలో తెలుగెలా చూడాలి మరియు రాయలి అన్నది మనం తెలియజేయాలి. వెబ్ సైటు యజమానులు మరియు తయారీదార్లకు యూనికోడ్ వల్ల లాభాలు తెలియజెప్పి, ఆచరణలో ఉన్న సాంకేతిక ఇబ్బందులకు పరిష్కారాలు సూచించాలి.

స్థానికీకరణ:

చాలా ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులలో స్థానికీకరణ కోసం ప్రత్యేక జట్లు ఉంటాయి. తెలుగులో తప్పనిసరిగా ఉండాలి అన్న ఉపకరణాల ప్రాజెక్టులలో మనం స్వచ్ఛందంగా తోడ్పడాలి. (ఫైర్ ఫాక్స్, స్వేచ్ఛ లినక్స్, గూగుల్ ఉత్పాదనలు, మైక్రోసాప్ట్ ఉత్పాదనలు, వర్డ్ ప్రెస్, ఓపెన్ఆఫీస్, తదితరాలు ఉదాహరణలు.) ఈ
ప్రాజెక్టులన్నిటిలోనూ ఎంతో కొంత ప్రయత్నం జరిగింది. మనం మరింత చొరవగా స్పందించి ఈ ప్రక్రియల్ని వెగిరపరచాలి.

స్థానికీకరణలో ప్రధాన సవాలు–UIలో వాడేందుకు మంచి సరళమైన తెలుగుపదాలు ఉద్భవించాల్సిఉంది. వీటి ప్రామాణీకరణ కొరకు భాషా కోవిదుల సహాయంతో మనం ప్రయత్నించాలి.

వికీపీడియా మరియు ఇతర వికీమీడియా ప్రాజెక్టులు:

వికీపీడియా యొక్క విలక్షణత మీకు తెలుసు. ప్రపంచంలోని విజ్ఞానాన్నంతటినీ ఒకే చోట చేర్చే మహా ప్రయత్నమది. మిగతా భారతీయ భాషలతో పోలిస్తే మనమే ముందున్నా, మన జనాభాలో పదిశాతం మాట్లాడేవారుకూడా లేని భాషలు మనకంటే రెట్టింపు వ్యాసాలు కలిగిఉన్నాయి. వికీపీడియా మరియు ఇతర వికీమీడియా ప్రాజెక్టుల గురించి ప్రజలో అవగాహన పెంచి వికీ ప్రయత్నానికి తోడ్పడేలా చేస్తే, తెలుగులో కూడా మంచి విజ్ఞాన సంపద పోగవుతుంది. ఇదంతా భావితరాలకు కూడా అందుబాటులో ఉంటుంది.

తెలుగుబ్లాగర్ల చైతన్యవంతమైన కృషివల్ల వెబ్‌లో తెలుగు గతమెన్నడూ లేనంతగా వెలుగుతోంది. ఈ-తెలుగు సంఘ ఆవిర్భావంతో ఈ ప్రక్రియ వేగం పుంజుకొని మరింత ఫలవంతమౌతుందని ఆశిస్తున్నాను.

-వీవెన్ (http://veeven.wordpress.com)

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

9 Responses to నా దృష్టిలో ఈ-తెలుగు సంఘం

  1. ఇంత ముఖ్యమైన విషయం చెప్పారు. ఈ-తెలుగు సంఘానికి లింక్ ఇవ్వడం మరచినట్టున్నారు.

  2. మంచి ఆలోచనలు … అందరూ ఆలోచించ వలసినవి.

  3. ఈ వ్యాసం ఈ-తెలుగును అందరికీ పరిచయం చేస్తుంది. వీవెన్ గారికి కృతజ్ఞతలు.
    కానీ ప్రాధమిక ధ్యేయం మరీ చిన్నదిగా ఉంది అని నాకు అనిపించింది (కేవలం నా అభిప్రాయమే). ఒకసారి ఇంటర్నెట్టులో తెలుగు వాడకం ఒక క్రిటికల్ మాస్ కి చేరితే ఆ తరువాత పని తానంతట తానే చేసుకుపోతుంది. కానీ ఆ దశకు ఎన్నాళ్లకు చేరుతుంది? రెండు మహా అయితే మూడేళ్ల కంటే ఎక్కువ పట్టదని నా అంచనా. కానీ ఈ-తెలుగు సంఘం అలా కాదు కాస్త పటిష్టంగా నిలబెట్టడానికే రెండేళ్లు పడుతుంది. మనం పటిష్టంగా నిలబడే సరికే మనం చేయవలసిన పని పూర్తవుతుందని నా అనుమానం. మనం ప్రాధమిక దశలో ఉన్న తెలుగు ఉపయోగాన్ని పెంచటానికి కాటలిస్టుగా పనిచేయ్యటం మనం ఇప్పుడు అర్జంటుగా చేయవలసిన పనే కానీ..దీర్ఘకాలిక లక్ష్యంగా తెలుగు సాహిత్యాన్నంతా అందరికీ అందుబాటులో ఉండేలా యూనీకోడ్లో ఇంటర్నెట్లో ఉచితముగా లభించేలా చేయటము లాంటివి తీసుకోవాలని నా అభిప్రాయం.

    తెలుగు వ్యాప్తి పెంచటం, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరటానికి కావలసిన పరికరాలను సిద్ధం చేసుకోవటం ఇప్పటి పనులు.

  4. ఈ తెలుగు విశ్వ విద్యాలయం ఏమి చేస్తుంటుందో! ఇలాంటి పనులు వాళ్ళెందుకు చేయరో! వాళ్ళకు మంచి పండితులు అందుబాటులో వుంటారు అనువాదం చెయ్యడం సుళువు కదా?

    –ప్రసాద్
    http://blog.charasala.com

  5. వాళ్లేదైనా చేసేదాకా మనం ఆగలేం. వాళ్లూ మనకు సహకరిస్తే బాగుంటుంది..కానీ ప్రభుత్వ పనులంటే బోలెడన్ని ఉట్టిమాటలు..సవాలక్ష తతంగాలు. అయినా మనం వాళ్ల మద్దతూ కోరదాం..ఏమో గుఱ్ఱమెగరావచ్చు.

  6. Sowmya says:

    non-unicode content ని కూడా వెదికే search engine లు కూడా వస్తున్నాయి కదండీ. అప్పుడు వారు మేము యూనికోడు వాడము, మా ఫాంట్లు కూడా searchable అంటే ఏమంటారు?

  7. కిరణ్ says:

    ఇప్పుడు గూగుల్ తెలుగులొ కుడా న్యూస్ ను విడుదల చేసిoది.
    గూగుల్ న్యూస్ తెలుగు ను మీరు ఇక్కడ చూడవచ్చు – http://news.google.com/news?ned=te_in

    –కిరణ్.

  8. gopal says:

    అక్షర నమస్సులు…
    e – తెలుగు పూర్తి వివరాల కోసం గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాను.
    మొన్న ఈ-తెలుగు స్టాలు కి వచ్చినా కలవ లేక పోయాం.
    మీ ఫోన్ నో. కోసం ప్రయత్నించినా ఫలితం లేక పోయింది.
    ఈ-తెలుగు కార్యక్రమాల వివరాలు, ఫొటోస్ పంపండి. స్పెషల్ artical గా వేయాలన్నది మా ప్రయత్నం
    ప్లీజ్ నా మెయిల్ ఐ డి కి మీ ఫోన్ no పంపండి . పర్సనల్ గా మాట్లాడితే beter..
    గోపాల్
    జౌర్నలిస్త్
    hyd

Comments are closed.