పాట

-ఝాన్సీలక్ష్మి కొత్త

ఎక్కడో దూరాన
గంధర్వ గానంలా
శింజినీరవంలా
అందెలరవళిలా
ఓ పాట

ఉదయాలు దాటుకుని
హృదయాలు దోచుకొని
ఆది నాదంలా
అనంత కావ్యంలా
సాగుతూ ఈ పాట

పడవ సరంగుల తెరచాప
వాలులో
పల్లకీ బోయీల పదగమనం లో
రోలు రోకళ్ల దంపుళ్ల లో
కూలి పడుచుల గొంతుల లో
కొనసాగే ఈ పాట

దేవతార్చన వేళ భక్తి పాట
వయసు తొలి పొద్దులోవలపు
పాట
వయసు మళ్లిన వేళ తత్వాల
పాట
పసికందు నిదురించ జోల
పాట
లోకాల పాలింప లాలి పాట

మేఘ గర్జనల గమకాల తో
మెరుపు విరుపుల తురుపుల
తో
దిగంతాలలో దివ్య పరిమళం
చిలుకుతూ కొనసాగుతూనే
వుంటుంది

సుప్త చేతనల్ని
శ్రుతిమయం చేస్తూ
తప్త భావనల జలతరంగిణి లా
జీవన మర్మాల్ని
కదిలిస్తూ
జీవ సమాధుల్ని ఛేదిస్తూ
అవిశ్రాంతంగా సాగుతూనే
వుంటుంది

పాటలో పదమునై
పదములో గళమునై
గళములో గానమై
పాటలో లీనమై
పరీవ్యాప్త మైనవేళ

వినగలను
వినాకర్ణేంద్రియరహితనై
దర్శించగలను
నయనరాహిత్యనై
ఇహ పరాలన్ని మరచి
పాటలో పరిమళించిన
మంత్రద్రష్టనో
ఈ సువిశాల ఇలాతలాన
ఎల్లలే లేని అవిభక్తనో
జనన మరణ చక్రభ్రమణంలో
విడివడిన విముక్తనో

—-

కొత్త ఝాన్సీలక్ష్మి గారు తన గురించి తాను ఇలా అంటున్నారు: “సామాన్య గృహిణిగా కాలం గడిచిపోయింది. ఒడిదుడుకుల జీవన పయనంలో ప్రశాంత తీరాల్ని వెతుక్కుంటున్న బాటసారిని. ఎపుడో వూహ తలుపు తట్టినపుడు ఈ కలం కాగితాన్ని పరామర్శిస్తుంది. సంగీత సాహిత్యాలంటే మక్కువ. మంచి పుస్తకం చదవాలనేది నా కోరిక.”

Posted in కవిత్వం | 6 Comments

మందిమన్నియమ్ -2

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

tbs.bmp

“మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు.

ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు.

ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది రెండోది:

సూత్రము – 11 : పరిపాలనముపై నిరాయుధులైన సాధారణ పౌరుల నియంత్రణము.

వృత్తి :

నిరాయుధులనఁగా గాయపఱచుటకున్ను చంపుటకున్ను ఉద్దేశింపఁబడిన సాధనములను వృత్తి ధర్మముగా ధరింపనివారు. సాధారణ పౌరులనఁగా సైనికేతరులని ప్రకరణగతార్థము.

(అ) నాగరికత యొక్క ప్రారంభదశలందు శారీరికబలము గలిగి యాయుధములను ధరించి పోరాడఁగలిగినవారిదే రాజ్యాధికారము. ప్రజాస్వామ్యమునాగరికత యొక్క పరాకాష్ఠకుఁ జెందిన వ్యవస్థ కావున నిందులోఁ గండ బలమున కంటెను బుద్ధిబలముపైననే ఊనిక హెచ్చు. కనుక దేశీయమైనపరిపాలనమున కాయుధధారణ మక్కఱలేదు. పరిపాలనమునకుఁ గలనిర్వచనము మారుటచేఁ గలిగిన స్థితి యిది. ప్రజాస్వామ్యమునందుఁ బరిపాలనమనఁగా దేశసమస్యల పరిష్కారమే తప్ప తదన్యము కాదు.

(ఆ) వైయక్తికమైన సాయుధ పోరాటకలిమి పరిపాలనావకాశమునకుఁబ్రాథమికార్హత కాకపోవుట వలనఁ బ్రజాస్వామ్యమునందు సైనికేతర వృత్తుల వారికిన్ని, మఱియు సాంప్రదాయికముగా నబలలుగాఁ బరిగణింపఁబడినస్త్రీలకున్ను సైత మధికార పగ్గములను జేపట్టుట కవకాశము లభించును.

(ఇ) సైనికుల పని శత్రుసైన్యముల బారినుండి దేశమును గాపాడుట. వారికుద్యోగమున్ను, పనియు రెండును ఉన్నప్పుడు వారుత్తమసైనికులనిపించికొందురు. ఉద్యోగము మాత్రమే యుండి, పనిలేనప్పుడు వారు ప్రజాస్వామ్యమునకు విపత్కారులగుదురు.

సూత్రము – 12 : అధికారమును వికేంద్రీకరించును.

వృత్తి :

ప్రజాస్వామ్యమునందు ఏ యధికారమున్ను ఎల్లప్పుడున్ను ఏ యొక్కవ్యక్తి చేతిలోఁ గాని, ఏ యొక్క కుటుంబము చేతిలోఁ గాని యుండదు.

(అ) ప్రజాస్వామ్యమునందు జరుగునట్టి మిక్కుటమైన శ్రమవిభజనమువలనఁ బ్రత్యేక నైపుణ్యములకుఁ బ్రాధాన్యమేర్పడును. అందుచేత నెవరుచేయఁదగిన పని వారికే యప్పగింపఁబడును. కనుక నొకే సమయములోయొకే ప్రభుత్వము క్రింద వేఱువేఱు అధికారకేంద్రములేర్పడును.

(ఆ) ప్రభుత్వపరముగా సర్వసమానత్వ సూత్రము నంగీకరించుట వలననెల్ల ప్రాంతములవారికిన్ని, వర్గములవారికిన్ని పరిమితమైన స్వయంపాలనావకాశమును గల్పించు నిమిత్తము కూడఁ గొన్ని యధికారములు వికేంద్రీకరింపఁబడును.

(ఇ) వికేంద్రీకరణము వలన నిరంకుశత్వము తగ్గును. నాయకులకున్నుఅధికారులకున్ను శ్రమబాధ్యతలు తగ్గును. ఏ యొక్కరి నిమిత్తమున్నువ్యవస్థను స్తంభింపఁజేయు నవసరముండదు. వికేంద్రీకరణము వ్యవస్థయొక్క గెలుపోటముల కందరిని సమష్టిగా బాధ్యులను జేయును. కనుకలాభనష్టములు ఏ యొక్క వ్యక్తివో కాక యవి సమానముగా నెల్లరికిని చెందును.

(ఈ) కాని దీని మూలమునఁ బ్రజలు ఒకే పని కొఱకుఁ బదిమంది నాశ్రయించు నగత్యమేర్పడును.

సూత్రము – 13 : ప్రజలలోఁ బరిజ్ఞానమును బెంపొందించును.

వృత్తి :

ప్రజాస్వామ్యమునం దెల్లరిని భాగస్వాములుగాఁ జేయవలెనన్నచోనెల్లరికిని రాజకీయ విషయముల గుఱించి యెంతయోకొంత పరిజ్ఞానమావశ్యకము. కనుక రాజకీయాధికారము కావలసినవారే తమ స్వార్థమునిమిత్తమైనను దానిని బ్రజలలోఁ బెంపొందింప సమకట్టెదరు. రాజకీయాధికారము కొఱకు జరుగు కుమ్ములాటలలో రాజకీయములతోఁ బాటువాని కంటె మిక్కిలి వేఱైన ప్రస్తావనములు సైతము బయల్పడును గావునఁబ్రజలు మునుపటి వలె వాని పట్ల తూష్ణీంభూతులై యుండరు.

సూత్రము – 14 : ప్రజలను సశక్తులుగాఁ జేయును.

వృత్తి :

ప్రజాస్వామ్యము బలహీనులకుఁ జేయూత. గొంతెత్తలేనివారికిగొంతు. అణఁగారిన వర్గముల కుద్ధరణము. పేదల కాశాకిరణము. ధనికులకురాజభయము నుండి విముక్తి. సంప్రదాయములకు రక్షణము. నవ్యతలకుస్వాగతాచరణము.

దాఁపఱికములకు భరతవాక్యము. జ్ఞాన విజ్ఞాన ప్రసారమునకు నాందీవాక్యము. యుద్ధములకు స్వస్తివాచనము. దేశదేశముల నడుమ మైత్రీబంధమునకు శ్రీకారము. ఇది యొక మార్గదర్శక సూత్రము.

::మూడవ ప్రస్తావనము – ప్రజాస్వామ్య దోషములు::

సూత్రము – 15 : ప్రాయికముగా వణిఙ్నాయకము.

వృత్తి :

(అ) ప్రజాస్వామ్యమునందుఁ బెక్కురు నాయకులు తమ జీవనోపాధిని బట్టి తఱచుగాఁ బూర్తికాలిక వ్యాపారులు గాని, అంశకాలిక వ్యాపారులు గానిబహిరంగ వ్యాపారులు గాని, ప్రచ్ఛన్న వ్యాపారులు గాని, భూతపూర్వ వ్యాపారులు గాని, వర్తమాన వ్యాపారులు గాని అగుదురు.

(ఆ) సత్యాసత్య సమ్మిళితమును, షుమారుగా సమానమూల్యకమును,అన్యోన్య సమ్మతిపూర్వకమును, శాసనబద్ధమును, వస్తుద్రవ్యాదానప్రదానాత్మకమును అగు జీవనాధార కార్యకలాపము వాణిజ్యము.

(ఇ) తాను స్వయముగాఁ బనిచేసి పారితోషికమందుకొనుట వ్యాపారముకాదు. కాని యితరుల కొఱకితరులచేతఁ బనిచేయించి వారి పారితోషికమునందు వాటాఁ గైకొనుట మట్టుకు వ్యాపారమే యగును.

(ఈ) పెట్టుబడి, ఉత్పాదన, అమ్మకము, లాభము, నష్టము మొద లగువానితో సంబంధముండుటచే రైతులు కూడ వ్యాపారులే.

(ఉ) ప్రజలకు నాయకత్వము వహింపఁగోరువారు సేవకవృత్తిలో నుండుటనాయకత్వ లక్షణమునకు వ్యాఘాతమగుటచే వారు మొదటఁ దమ కుటుంబముల జరుగుబాటు విషయమున స్వతంత్రులగుట తప్పనిసరి కనుక వ్యాపారము చేయుట విధాయకము.

సూత్రము – 16 : ప్రచారాశ్రితము.

వృత్తి :

(అ) ఇచ్చటఁ బ్రచారమనఁగా నూరువాడలయందుఁ జాటుట. ఇది వాంగ్మూలముగాను, వ్రాఁతపూర్వకముగాను, ముద్రిత సామగ్రి ద్వారమునను, దృశ్య శ్రవణ మాధ్యమముల సహాయముతోడను బలువిధములుగా జరుగవచ్చును.

(ఆ) ప్రజాస్వామ్యమునందుఁ బ్రజల యభిప్రాయములను మలచియు, రూపుదిద్దియు, దారిమళ్ళించియు వారి యంగీకార యోగ్యతను బడయుటచేతనే దమ లక్ష్యములను సాధించికొనుట వీలుపడును గావున నీ వ్యవస్థలోఁబ్రతివారును రంగస్థలి నెక్కిన నటులవలెనె ప్రవర్తింతురు. ఇందు నాయకులు, ప్రజలు, ప్రభుత్వములు, వ్యాపారులు, కవులు, కళాకారులు, పండితులు, స్త్రీ లు, పురుషులు, గురువులు, శిష్యులు, చిన్న, పెద్ద యను వ్యత్యాసము లేనేలేదు.

(ఇ) ప్రజాస్వామ్యమునందుఁ బదునైన యాయుధములతో యుద్ధములు జరుగక పోయిననుఈ విధముగాఁ బ్రచార యుద్ధములు మాత్రము ఎడతెఱపి లేక నిరంతరాయముగా జరుగుచునే యుండును. వానియందు నెగ్గిన వాఁడు మాత్రమే ప్రజాస్వామ్యమునందుఁ దాను కోరికొన్న రంగమునం దాధిపత్యమును సంపాదింపఁగలుగును. సాధారణముగా ద్రవ్యపుష్టియు మందిమార్బలమును మొదలుగాఁ గల సాధన సంపత్తి లేనివాఁడీ పోరునం దోడిపోవును.

(ఈ) అందుచేతఁ బ్రజాస్వామ్యమునందు సైతము ప్రజామోదమును బడసిన ప్రతి యభిప్రాయమును సత్యము కాకపోవచ్చును. మానవ ప్రకృతియెట్టిదనఁగాఁ బ్రతిదినమున్ను జెవిలో నిల్లు కట్టికొని పోరినచో నెంత మొండివాఁడైనను ఏదోయొక బలహీన క్షణమునందుఁ దప్పుడుమాటలకుఁ దలయొగ్గవచ్చును.

సూత్రము – 17 : ధనమే యోగ్యతా ప్రమాణముగాఁ గలది.

వృత్తి :

(అ) ప్రజాస్వామ్యమునందు లావుగా డబ్బు గడించినవారే నాయకులున్ను, పాలకులున్ను అగుదురు కావున వారి దృష్టాంతమును బట్టి యశేష ప్రజాబాహుళ్యము సైతము మానవుని శ్రేష్ఠతానిర్ధారణ నిమిత్తమతఁడు గడించిన ధనరాశినే కొలబద్దగాఁ గైకొనును. తన్మూలకమున ధనార్జన కుపకరించు విద్యలకే యగ్రాసనము లభించును. ఒకరి ప్రాచీనవారసత్వము గాని, సంస్కృతిసంప్రదాయములు గాని, గుణోత్తరత గానిప్రజాస్వామ్యమునందుఁ బాటిగాఁ దీసికొనఁబడవు. అ విధముగాఁ బ్రజాస్వామ్యమునందు ధనప్రమాణమొక్కటియే తక్కుంగల యెల్ల యెగుడుదిగుళ్ళను ఊచమట్టుగాఁ జదును చేసివేయును.

(ఆ) అందువలన సమాజములోఁ గొంత వైవిధ్య భంగము కలుగును. కనుకలభ్యమగు వనరులపైన ఒత్తిడి హెచ్చును.

(ఇ) ఈ హేతువు వలన సైతము ప్రజాస్వామ్యమున్ను సమసమాజ భావనయున్నుఁ బరస్పరము అసమన్వేయములు.

సూత్రము – 18 : శాసన బహుళము.

వృత్తి :

ప్రజాస్వామ్యమునందు రాజకీయముల కెక్కుడు ప్రాధాన్య మేర్పడుటచేఁ బ్రజల మనోవాక్కాయముల వక్రగతి నియంత్రణమునకు రాజకీయశాసనముల పైననే మిక్కిలి యాధారపడుదురు. వానిని బ్రజలెన్నికొన్ననాయకులు రూపొందించి యుండుటచే నవియే ప్రామాణికములని భావింతురు. తద్ద్వారా మత ధార్మిక సంస్కృత్యాచార వ్యవహారాదికములైన సాంప్రదాయిక నియంత్రణములకుఁ దొలుతఁ గల ప్రాబల్యము క్షీణించి యవిసైతము రాజకీయములకు విధేయము కావింపఁబడుటచే నవి పూర్వమునియంత్రించిన ప్రతి విషయమును లిఖిత శాసనముల ద్వారా మరల నియంత్రించుటకుఁ బ్రయత్నము చేయఁబడును. కనుకఁ బ్రజాస్వామ్యమునందు అంతకు మున్నెన్నడు నెఱుఁగనన్ని పరస్సహస్ర శాసనములు ప్రోఁగువడును.

సూత్రము – 19 : సంఘ సంస్కరణలకు దూరము.

వృత్తి :

(అ) ప్రజాస్వామ్యమునందుఁ జెప్పువాఁడున్ను, వినువాఁడున్ను అని యిరుతెఱఁగుల మనుష్యులుండరు గనుకనున్ను, బ్రాయికముగా నంద రును ఇతరులకుఁ జెప్పువారే కనుకనున్ను సంఘసంస్కరణాది కార్యకలాప ములు బోత్తిగా ఫలింపవు. ఏ హితవచనమైనను అది చెప్పువారి యొక్క యనాధికారిక స్వాభిప్రాయముగాఁ జూడఁబడును గావున నెంతకాలము గడచినను సంస్కరణవాదుల గుంపులే తప్ప సంస్కరింపఁబడిన సమాజము మాత్రము కనఁబడదు.

(ఆ) దీనికి మూఁడు పర్యవసానములు గలవు. ఒకటి – ప్రజాస్వామ్య మేర్పడుటకు ముందున్న కాలమున కంటె ఛాందసముగాఁ దమ తమ నమ్మ కములకున్ను వ్యవస్థలకున్ను కట్టుబడి బిగిసికొనిపోయిన యభిప్రాయ ములు గల వర్గములు పెరిగిపోవుట.

(ఇ) రెండు – అందరున్ను ప్రభుత్వమునో ప్రజాప్రాతినిధ్య సభలనో నిష్పాక్షిక మధ్యవర్తులుగా భావించి తమ నమ్మకములపై శాసనములు చేయునధికారమును వానికిఁ గట్టఁబెట్టుట.

(ఈ) ఈ ప్రకరణమునందలి 2, 7, 15, 16, 17 సూత్రములతోఁ గలిపి యీ సూత్రమును జదువునది. ఫలితార్థముగాఁ , నెక్కడెక్కడఁ బ్రజాస్వామ్యము గలదో అక్కడెల్ల హింసాకాండ ద్వారమున వార్తలకెక్కుచుఁ బ్రభుత్వములపైన నొత్తిడి తేరఁజూచు నుగ్రవాదగుంపులు పెచ్చరిల్లును. సాధారణముగా నొక దేశమవలంబించు జాతీయవాద సిద్ధాంతములలోని లోపములే యుగ్రవాదరూపమున బయల్పడుచుండును.

సూత్రము – 20 : అతిమృదూకరణము.

వృత్తి :

ప్రజాస్వామ్య వ్యవస్థ పౌరుల యొక్క హక్కులకిచ్చు నభయమున్నుమఱియు భద్రతయుఁ గాలక్రమమున వారిని మితిమీఱిన మృదుస్వభావులుగా మార్చివేయును.

(అ) ప్రజాస్వామ్యమునందు రక్తపాత రహితముగాఁ బ్రభుత్వములు మారుట, సమస్యలకు శాసనబద్ధమైన సత్వర పరిష్కార మార్గముల లభ్యత, సార్వత్రిక విద్యావిధాన మూలమున నితరుల హక్కులను గౌరవించుచుఁ దమహక్కుల నానందముగా ననుభవించుట, ఏ విషయముపై నైనను సహేతుకమైన తర్క వితర్కముల సహాయమున నితరులను ఒప్పించుట, శరీరముతోఁగాక మనస్సుతో మాత్రమే పనిచేయుట మొదలగు నాగరిక దర్జాల కలవడినప్రజలు తద్విరుద్ధమైన యనుభవముల నిచ్చు సంభావ్యత గల పరిస్థితులుప్పతిల్లినచో దిగ్భ్రాంతులై వాని కెదురొడ్డుటకు మానసికము గాను, శారీరికముగాను సన్నద్ధులు కాక దిగఁజాఱిపోవుదురు.

(ఆ) నిసర్గ కర్కశత్వము మిక్కిలి ముఖ్యమైన లక్షణము. ఈ లక్షణ మప్పుడప్పుడు పాపాచరణమునకుఁ ద్రోవసూపినను, జాతి యొక్క మనుగడయనేక విధములుగా దానిపైననే యాధారపడి యున్నది. మనుష్యులలోనిర్భీకమైన చొఱవకున్ను, పరాయివారి నెదిరించుటకున్ను, క్రొత్త భూములాక్రమించుటకున్ను, స్వభూములను గాఁపాడికొనుటకున్ను, సాహసోపేతమైన కొంగ్రొత్త పథకములను జేపట్టుటకున్ను ప్రేరణభూతమైనదదియే. ప్రజాస్వామ్య మూలమునఁ బౌరులు తమ తొల్లింటి నిసర్గ కర్కశత్వమునుగోల్పోయిన పిమ్మట ననాగరిక బర్బర జాతుల దాడులకుఁ దాళఁజాలకతమ దేశ మును వారి కప్పగించి పలాయనము చిత్తగించుటో లేదా, వారికి దాసోహమని శరణు వేఁడుటో చేయుదురు.

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

(“నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం.” అనే తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుబ్లాగులోకానికి సుపరిచితులు. ఆయన విద్యాభ్యాసం అనేక తెలుగు పట్టణాలలో సాగింది. తర్వాత ఆయన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. చేశారు. మన భాష-సంస్కృతుల పట్ల ఆయనకున్న అభిమానం, వాటిలో ఆయనకున్న అభినివేశం చాలా గొప్పవి. తెలుగు సాహిత్యం బ్లాగులో సుమతీశతకం గురించి విపులంగా రాశారు. ఆసక్తి గలవారికి తన బ్లాగులో సంస్కృతపాఠాలు కూడా నేర్పారు. తెలుగుపదం గుంపులో ఆయన అనేక కొత్తపదాలను తాను సృష్టించడమేగాక అలా సృష్టించాలనుకునేవారికి మార్గదర్శకాలను సైతం రూపొందించారు. ఇవేగాక ఆయన చాలా రచనలు చేశారు. వాటిలో ఎక్కువభాగం అముద్రితాలు. వాటిని త్వరలో తన బ్లాగు ద్వారా అంతర్జాల పాఠకుల ముందుకు తీసుకురాబోతున్నారు.)

Posted in వ్యాసం | Tagged | 2 Comments

మందిమన్నియమ్ ప్రారంభం

ప్రజాస్వామ్యంలోని గుణదోషాలను చర్చిస్తూ ప్రముఖ తెలుగు బ్లాగరి తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన గ్రంథం “మందిమన్నియమ్” లోని ఆరవ ప్రకరణం ఇప్పటికే తెలుగు నెజ్జనుల్లో కొందరు చదివారు. ఆ గ్రంథంలోని అంశాలపై విస్తృత చర్చ జరగడానికి వీలుగా దాన్ని మరింత మందికి అందుబాటులోకి తేవడానికి పొద్దు సంకల్పించింది. నేటి నుంచి ఆ గ్రంథంలోని ప్రకరణాలతో, మరిన్ని రచనలతో పొద్దు మరింత తరచుగా అప్డేట్ అవుతుంది.

ఈరోజు మందిమన్నియమ్ తో బాటు కొ.కు. గారి మృతజీవులు పదవ భాగం; దేశంలోనే అపూర్వమనదగ్గ శ్రీకాకుళం కథానిలయం నిర్వాహకుల్లో కూడా ఒకరైన ప్రముఖ కథా, నవలారచయిత వివినమూర్తి గారు కథానిలయం గురించి రాసిన వ్యాసం; కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి వ్యాసం విశ్వంలో మనిషి స్థానం; ప్రముఖ తెలుగు కవి ’స్నేహమా’ బ్లాగు గురించి చెబుతున్న మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు అందిస్తున్నాం.

ఈ నెల రచనలు:

మందిమన్నియమ్ – 1
మృతజీవులు – 10
కథానిలయం
మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు
విశ్వంలో మనిషి స్థానం
అక్టోబరులో వికీ ప్రాజెక్టుల ప్రగతి
అక్టోబరు గడి సమాధానాలు
నవంబరు గడిపై మీమాట
కౌంతేయులు (అతిథి)
కార్పొరేట్ ఆ(కా)సుపత్రి! (కవిత)

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

నెజ్జనులకు సూచనలు (అతిథి)
కుటుంబరావు కథల్లో వాస్తవికత (వ్యాసం)
మృతజీవులు – 9 (మృతజీవులు)
నేనూ మీ లాంటి వాడినే (కథ)
జగజ్జేత ఆనంద్! (వ్యాసం)
గడి (గడి)
ఆగస్టు గడి సమాధానాలు (గడి)
అక్టోబరు గడిపై మీమాట (గడి)
చిన్ని చిన్ని బాధలు (కథ)
క్రెడిట్ కార్డులు (వివిధ)
మృతజీవులు – 8 (మృతజీవులు)
సెప్టెంబరు వికీపీడియా విశేషాలు (వికీ)

Posted in ఇతరత్రా | Comments Off on మందిమన్నియమ్ ప్రారంభం

కథానిలయం

-వివిన మూర్తి

మనకు గ్రంధాలయ ఉద్యమాలు వచ్చాయి. అవి అనేక ఊళ్లలో గ్రంధాలయాలు తెచ్చాయి. ప్రభుత్వాలు సైతం పౌరుల గ్రంధపఠనం వారి అక్షరాస్యత, విద్యావ్యాప్తిలలో భాగంగా భావించి గ్రంధాలయాలకు నిధులు కేటాయించాయి. అవి గ్రంధ సేకరణ, భద్రతలకు ప్రయత్నించాయి. స్వచ్ఛంద సంస్థలు నడుం కట్టాయి. దాతలు విరాళాలు అందించారు. ఈ గ్రంధాలయాలు ఆరంభ లక్ష్యాలను చాలావరకు సాధించగలిగాయి. వినోదంకోసం చదివేవారికి ఇతర వినోదసాధనాలు అందుబాటులోకి రావటం, ఆసక్తిగా, ఆబగా చదవగలిగిన వయసులో పిల్లలకు పాఠ్యపుస్తకాలకు వెచ్చించాల్సిన సమయం అపరిమితంగా పెరిగిపోవటం వంటి పరిణామాలతో గ్రంధాలయాల వినియోగం తగ్గింది. ఒకప్పుడు జీవికనిచ్చిన అణా లైబ్రరీలూ, సర్క్యులేషన్ లైబ్రరీలూ అవి ఆధారపడిన పుస్తకాలు ఏ కోవకి చెందినవైనా కనుమరుగవసాగాయి. భద్రపరచటానికి అవసరమైన స్థలం, సంకల్పబలం, సాధనాలు కొరవడటంతో అనేక పత్రికలు పుస్తకాలు కాలగర్భంలో కలిసిపోసాగాయి. కనీసం అంగబలం, అర్ధబలం కల పత్రికలు సైతం తమ పత్రికలనైనా భద్రపరచటానికి గట్టిగా పూనుకోలేదు.

ఈ స్థితిలో-
ప్రసిద్ధ కథారచయిత శ్రీ కాళీపట్నం రామారావుగారికి ఒక ఆలోచన కలిగింది. ఒక కథ రాయటానికి ఒక వ్యక్తి కనీసం కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు వారాలు నెలలు శ్రమ పడతాడు. ఆ శ్రమ ఫలితానికి ఆయువు ఎన్నాళ్లు? అచ్చైన పత్రికని బట్టి ఒక రోజు, ఒక వారం, ఒక పక్షం, ఒక మాసం. ఆసక్తీ, శక్తీగలవారు పూనుకుని పుస్తకరూపంలో రూపంలో తెస్తే, తెచ్చుకుంటే కొన్నేళ్లు. ఇలా ఈ శ్రమంతా వృధాపోవలసిందేనా? నన్నింతవాడిని చేసిన కథాప్రక్రియలోని శ్రమనైనా కనీసం కొంతకాలమైనా భద్రపరచలేనా? అని ప్రశ్నించుకున్నారు.
అలా పుట్టింది 1996లో శ్రీకాకుళంలో కథానిలయం. గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు కథ వెలువడిన ఫిబ్రవరి 22వ తేదీన కథానిలయం ప్రారంభమయింది. రామారావు గారి సాహిత్య సంపాదనలో ప్రతి పైసా ఈ కథానిలయానికి అందించారు. అనేక మంది సాహిత్యాభిమానులు, రచయితలూ చేయివేసారు. రామారావుగారి సొంత పుస్తకాలు కథానిలయానికి తొలి పుస్తకాలు అయాయి. మొదటి సభలో పాల్గొన్న గూటాల కృష్ణమూర్తి గారు లండన్ నివాసి. చాలాకాలంగా బ్రిటిష్ లైబ్రరీతో సంబంధం ఉన్నవారు. ఆయన ఆనాటి సభలో ఉపన్యసిస్తూ – ఇలా ఒక ప్రక్రియకు లైబ్రరీ ఏర్పడటం ప్రపంచం మొత్తంమీద ఇదే ప్రప్రధమం. – అన్నారు. రామారావుగారి అవిరామ కృషితో వందలాది మంది సాహిత్య సేకరణకర్తలు కథాసంపుటాలూ, సంకలనాలూ, పత్రికల మూలాలుగాని, ఫొటో నకళ్లు గాని సమకూర్చారు.

2007 నవంబరు నాటికి రమారమీ 450 పత్రికల 7000ల సంచికలు, 3000కి పైగా కథాసంపుటాలూ, సంకలనాలూ కథానిలయం సేకరించగలిగింది. వీటితోబాటు దాదాపు 1000 మంది రచయితలు తమ వివరాలను, తమ కథల నకళ్లను( దొరికిన వాటిని) అందించారు. ఇవికాక ఈ కథల కాల నేపధ్యాన్నీ సమాజ నేపధ్యాన్నీ అధ్యయనం చేసేందుకు వీలుగా ఆత్మకథలు, జీవిత కథలు, సామాజిక చరిత్రలు, ఉద్యమ చరిత్రలు కూడా సేకరించబడుతున్నాయి. ఆయా కథలు వెలువడిన వెంబడే వచ్చిన స్పందనలు, ఆ మీదట విమర్శకుల తూనికలు వగైరా సమాచారమంతా పోగుచేయటానికి కృషి జరుగుతోంది. దీనికి తోడుగా రచయితల గొంతులను , ఛాయాచిత్రాలను, జీవిత వివరాలను కూడా సేకరించి భద్రపరచాలని ఆలోచన ఉంది. ఈ పనులు కూడా మొదలయాయి.

ఈ సమాచారానికి వినియోగం ఉండాలి. అందుకోసం-
ఇదంతా క్రోడీకరణ జరగాలి. ఇక్కడ ఏముందో వినియోగదారులకు అందాలి. దీనికోసం పని మొదలయింది. పుస్తకాల విభజన జరుగుతోంది. ఇది మామూలు గ్రంధాలయాల పద్దతుల కన్న కాస్త విభిన్నంగా జరగవలసి ఉంది. చేస్తూ చేస్తూ ఒక క్రమం ఏర్పడవలసి ఉంది. తొలికథ నుండి ఇంత వరకూ వచ్చిన కథలలో కనీసం 50 -60 శాతం కథలకైనా డేటాబేస్ ఏర్పడాలి. ప్రస్తుతానికి 30000ల కథలతో డేటాబేస్ మొదలయింది. ఇది 10వ శాతం కన్న మించదు. కథానిలయం వద్దనున్న కథలను ఎక్కించగలిగినా 30 శాతానికి చేరవచ్చు.

పోతే-
ఈ కృషికి వినియోగదారులెవరు?
విశ్వవిద్యాలయాలలోని పరిశోధక విద్యార్ధులు, సాహిత్యాభిమానులు, రచయితలు, విమర్శకులు, ఎందరో కథానిలయం సేవలను వినియోగించుకోడం మొదలెట్టారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కథానిలయం సేకరణ, సహకారాలతో “ కథాకోశం” తీసుకు వచ్చింది.

ఇకపైన –
ఇతర విశిష్ట గ్రంధాలయాలలోని పత్రికల డిజిటలైజయిన డిస్క్ ల సేకరణ సాగుతోంది. వేటపాలెం గ్రంధాలయం నుంచి దాదాపు 300ల సీడీలు లభించాయి. మరికొన్ని గ్రంధాలయాల్లోని పాత పత్రికలను స్కా న్ చేయటానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇది ముగిసాక కథానిలయం లోని పత్రికలతో కలిపి డిజిటలైజ్ చేసి డిస్క్ ల రూపంలో భద్ర పరచాలన్నది ఆలోచన. వాటికి తగిన సెర్చ్ ఇంజన్ కూర్చి నెట్ ద్వారా ప్రపంచంలోని తెలుగు వారందరికీ అందుబాటులోకి తేవాలన్నది కడపటి లక్ష్యం.
—————–
వివినమూర్తిగారు ప్రసిద్ధ కథా, నవలా రచయిత. ఆయన రాసిన చాలా కథలు, హంసగీతం నవల చాలా ప్రసిద్ధిని పొందాయి. ఆయన ప్రస్తుతం కథానిలయం నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. అంతేకాదు, ఆయన తెలుగు వికీపీడియన్ కూడా.

Posted in వ్యాసం | 3 Comments

మృతజీవులు – 10

మూడవ ప్రకరణం

ఈ లోపుగా చిచీకవ్ బండిలో కూచుని సంతృప్తిని అనుభవిస్తున్నాడు; బండి కొంతసేపుగా రహదారి వెంట నడుస్తున్నది. అతని ముఖ్యాశయమూ, ధ్యేయమూ ఏమిటో మనం క్రిందటి ప్రకరణంలో తెలుసుకున్నాం. అందుచేత అతని మనసు ఆ విషయంలోనే నిమగ్నమై ఉండటంలో వింతేమీ లేదు. అతను వేసుకుంటున్న అంచనాలూ, చేస్తున్న ఊహలూ సంతృప్తికరంగా ఉన్నట్టు అతని ముఖమే చెబుతున్నది, ఎందుకంటే ఆ ముఖంలో అప్పుడప్పుడూ తృప్తితో కూడిన చిరునవ్వు తాండవిస్తున్నది. అతను తన ఆలోచనలలోనే ముణిగి ఉండడం చేత తన బండీవాడు చేస్తున్న పనిని గమనించలేదు. మానిలవ్ నౌకర్లు వాడికి చక్కని ఆతిథ్యం ఇచ్చారు, ఆ ఆనందంలో వాడు కుడివైపున నడుస్తున్న మచ్చల పగ్గపు గుర్రానికి బుద్ధులు నేర్పుతున్నాడు, ఈ బూడిద రంగు మచ్చల గుర్రం మహా దొంగది, అది బండిని లాగుతున్నట్టు అభినయిస్తున్నది; నిజంగా లాగుతున్నవి మధ్యనున్న ఎర్రగుర్రమూ, రెండో చివర ఉన్న పగ్గపు గుర్రమూనూ. బ్రౌను రంగుగా ఉన్న ఈ గుర్రాన్ని పన్నులు వసూలు చేసే అసిసరు వద్ద కొన్నారు, అందుకని దానిపేరు అసిసరు అయింది. ఈ రెండు గుర్రాలూ సంతోషంతో బండి లాగేవి, అందుచేత వాటి సంతోషం వాటి కళ్ళలో కనిపించేది.

బండీ వాడు, సేలిఫాన్, తాను కూచ్చున్న చోట లేచి నిలబడి మచ్చల గుర్రాన్ని కొరడాతో కొడుతూ “నీ దొంగ వేషాలు నా దగ్గరా? నీ సంగతి చెబుతానుండు! నీ పని నువు చూసుకోలే, జర్మను భడవా. ఎర్రగుర్రం చూడు, పెద్దమనిషి, దాని పని అది చేస్తుంది. దానికో గుప్పెడు దాణా ఎక్కువ వెయ్యాలనిపిస్తుంది. ఎందుకూ? అది పెద్దమనిషి తరహా గుర్రం. అసిసరు కూడా మంచి గుర్రమే… ఏం తల మహా ఆడిస్తున్నావ్? చెబుతున్నదేమిటో వినాలే మొద్దూ! నేను నీ మంచికేగా చెబుతానూ!… ఆఁ, ఎక్కడికా పోవటం? రాక్షసీ! పాపిష్టి బోనపార్ట్!” అంటూ కొరడాతో కొట్టాడు.

తరువాత వాడు మూడు గుర్రాలనూ ముద్దుగా సంబోధిస్తూ తలా ఒక చురకా అంటించాడు-శిక్షించటానికి కాదు, తన సంతోషం తెలపటానికి. ఈ విధంగా తాను తృప్తిపడి వాడు మళ్ళీ మచ్చల గుర్రంతో సంభాషణ సాగించాడు: “నీ సంగతి ఎవరూ తెలుసుకోలేరనుకుంటున్నావు గామాలు. కాదు, గౌరవం సంపాదించుకోవాలంటే సరిగా నడుచుకోవాలి. మనం ఆగామే ఆ భూస్వాముల ఇంట చూడు, చాలా మంచివాళ్ళు. మంచివాళ్ళతో మాట్లాడటం నాకెప్పుడు ఇష్టం. మంచివాడితో నాకెప్పుడు పేచీలేదు. అటువంటివాడితో స్నేహం చెయ్యొచ్చు. ఒకడితో కలిసి ఓ కప్పు టీ తాగాలన్నా, ఓ ఫలహారం చెయ్యాలన్నా, వాడు మంచివాడైతే నాకెంతో సంతోషంగా ఉంటుంది. అసలు మంచివాణ్ణి అందరూ గౌరవిస్తారు. మన యజమాని చూడరాదూ, ఎందుకంటే ఆయన జారును కొలిచాడు, తెలిసిందా? చర్చి కౌన్సిలు సభ్యుడు…”

సేలిఫాన్ ఈ విధంగా ప్రారంభించి చాలా గొప్ప విషయాలు తరిచాడు. వాడి మాటలు ఆలకించినట్టయితే చిచీకవ్ కు తనను గురించి ఎన్నో వివరాలు తెలిసి ఉండేవి. కాని అతను తన ఆలోచనల్లో ఎంతగా నిమగ్నుడై ఉన్నాడంటే పిడుగుపడిన చప్పుడు వినబడినదాకా అతనికి బాహ్య ప్రపంచం గురించి గమనం లేదు. అప్పుడాయన చుట్టూ కలయజూశాడు. ఆకాశమంతా మబ్బు కప్పి ఉన్నది. రోడ్డుమీద దుమ్ములో వాన చిలుకుతున్నది. ఇంతలో మరింత సమీపంగా ఇంకొక పిడుగు పడింది, ధారాపాతం హెచ్చింది. మొదట్లో పక్కవాటంగా కొట్టే బండిని ఈ వైపునా, ఆ వైపునా బాదింది, తరవాత నిటారుగా పడుతూ బండి కప్పు మీద టపటప చప్పుడు చెయ్యసాగింది. చివరకు నీటిబొట్లు పైనుంచి కారి మన కథానాయకుడి ముఖంపై పడసాగాయి. ఆయన అటూ ఇటూ ఉన్న తోలు తెరలు పైకెత్తి, సేలిఫాన్ తో బండిని వేగంగా తోలమన్నాడు. సేలిఫాన్ చేస్తున్న ప్రసంగం నడిమధ్యలో ఆగిపోయింది. ఇది తాత్సారం చేసే సమయం కాదని తెలుసుకుని, వాడు తన ఆసనం కింది పెట్టెలోనుంచి బూడిద రంగుగల చింకిదుస్తు ఒకటి తీసి మీదవేసుకుని, పగ్గాలు చేతబట్టుకుని గుర్రాలను అదిలించాడు. అవి అతని ప్రసంగం వింటూ నడవటం దాదాపు మానేశాయి. తాను రెండు అడ్డదార్లే దాటాడో, మూడే దాటాడో సేలిఫాన్ కు జ్ఞాపకం రాలేదు. ఒక్కసారి తాను వచ్చిన రహదారి జ్ఞాపకం చేసుకుని, చాలా అడ్డదార్లు దాటిపోయినట్టు నిశ్చయించుకున్నాడు. క్లిష్ట పరిస్థితిలో రష్యను అయినవాడు ఆటే ఆలోచించకుండానే కర్తవ్య నిర్ణయం చేస్తాడు గనక వాడు ఈసారి అడ్డదారి రాగానే అది ఎక్కడికి పోయేదీ ఆలోచించకుండా కుడి వైపుకు తిరిగాడు.

వానేమో గంటల తరబడి కురిసేటట్టు కనబడింది. రోడ్డుమీది దుమ్మంతా బురదగా మారింది. గుర్రాలకు బండిని లాగడం అంతకంతకూ కష్టమవుతున్నది. సబాకవిచ్ ఉండే గ్రామం ఎంతకూ రాకపోవడం చూసి చిచీకవ్ ఆందోళన పడసాగాడు. ఆయన అంచనా ప్రకారం వాళ్ళు ఎప్పుడో చేరుకుని ఉండవలసింది. తోలుతెరలలో ఉన్న గుండ్రని అద్దాల కిటికీల గుండా అతను బయటికి చూడసాగాడు. కాని ముఖం ఎదట అరిచెయ్యి కనిపించనంత చీకటిగా ఉంది.

అతను చివరకు తల బయటికి పెట్టి, “సేలిఫాన్”, అని కేక పెట్టాడు.

“ఏం బాబుగారూ?” అన్నాడు సేలిఫాన్.

“ఎక్కడన్నా గ్రామం కనబడుతుందేమో చూడూ!”

“లేదు బాబూ. ఎక్కడా ఏమీ కనబడటం లేదు.” తరవాత వాడు కొరడా ఝళిపిస్తూ మొదలూ చివరా లేని దండకం ఒకటి ప్రారంభించాడు. అందులోకి సమస్తమూ వచ్చాయి; రష్యా అన్నిమూలలా గుర్రాలను వేగంగా పరుగెత్తించటానికి సాధారణంగా ఉపయోగించే ప్రోత్సాహ వాక్యాలూ, విశేషణాలూ నోటికి ఎలా వస్తే అలా ఏకరువు పెట్టాడు. చిట్టచివరకు వాడు వాటిని సెక్రెటరీలని కూడా అన్నాడు.

ఇంతలో బండీ అన్నివైపులకూ ఒరుగుతూ ఉండటము, తాను పడుతూ ఉండడం చిచీకవ్ గమనించాడు. దీనినిబట్టి బండీ ఒకవేళ రహదారి విడిచిపెట్టి కొత్తగా దున్నిన పొలాలకు అడ్డం పడిందేమోనన్న అనుమానం కలిగింది. ఈ సంగతి సేలిఫాన్ కు కూడా తెలిసినట్టే ఉందిగాని వాడు పైకేమీ అనలేదు.

“ఒరే వెధవా, నన్ను ఏరోడ్డున తీసుకుపోతున్నావురా?” అని చిచీకవ్ అడిగాడు.

“నేనేం చేసేది బాబూ? ఈ వాన చూడండి. చీకట్లో చమికీ కూడా కనిపించడం లేదంటే నమ్మండి.”

వాడిలా అంటూండగానే బండీ ఒరిగి, చిచీకవ్ పడకుండా ఉండటానికి రెండు చేతులూ పట్టుకోవాల్సి వచ్చింది. సేలిఫాన్ కైపులో ఉన్నాడని ఇప్పుడే అతనికి స్ఫురించింది.

“జాగర్త, జాగర్త! పడిపోగలం!” అని అతను కేకపెట్టాడు.

“లేదు బాబూ. నేను తమర్ని పడనిస్తానా? పడనివ్వటం తప్పు కాదూ? ఆ మాత్రం నాకు తెలీదా? ఏమయినా సరే తమర్ని పడనివ్వను,” అన్నాడు సేలిఫాన్.

తరవాత వాడు బండిని మరలించసాగాడు. ఆ తిరగడంలో బండి పక్కకు ఒరిగింది. చిచీకవ్ దభీమని బురదలో బోల్లపడిపోయాడు. సేలిఫాన్ గుర్రాలను ఆపాడు; వాడాపకపోయినా అవి ఆగేవే, చచ్చేట్టు అలసి ఉన్నాయి. ఈ అనుకోని సంఘటనతో వాడి మతి కాస్తా పోయింది. వాడు తాను కూచుని ఉన్న పెట్టె మీదనుంచి దిగి, చేతులు నడుముకు పెట్టుకుని బండి కేసి చూశాడు. ఈ లోపల వాడి యజమాని బురదలో నుంచి పైకి లేవటానికి యత్నిస్తున్నాడు. “హారి దీని తస్సాదియ్యా? ఒరగనే ఒరిగిందే!” అన్నాడు సేలిఫాన్.

“నువు చెడతాగావు!” అన్నాడు చిచీకవ్.

“లేదు బాబుగారూ. ఎలా తాగుతానూ? తాగటం ఎంత తప్పు! నాకు తెలీదూ? ఒక స్నేహితుడితో ముచ్చటించాను, ఎందుకంటే బుద్ధిమంతుడితో మాట్లాడటం మంచిపనే, అందులో తప్పేమీ లేదు-ఇద్దరమూ ఫలహారం చేశాం. ఫలహారం చెయ్యటంలో కూడా తప్పేమీ లేదు; ఎందుకంటే బుద్ధిమంతుడితో ఏదైనా ఫలహారం తీసుకోవచ్చు.”

“కిందటిసారి నువు తాగినప్పుడేం చెప్పాను? మరిచిపోయావా?” అన్నాడు చిచీకవ్.

“లేదు దొరా, ఎలా మరిచిపోతానూ? నా డ్యూటీ నాకు తెలుసు. తాగరాదని నేనెరుగుదును. ఒక బుద్ధిమంతుడితో మాట్లాడుతూ కూచున్నాను. ఎందుకంటే..”

“బుద్ధిమంతుడితో మాట్లాడకుండా ఒళ్ళు చిట్లగొట్టేస్తాను.”

సేలిఫాన్ దేనికైనా సమ్మతించటానికి సిద్ధపడి, “దొరగారి ఇష్టం ఏదైతే అదీ. కొట్టటమైతే కొట్టేదేమరి. నేనెందుకు వద్దంటానూ? కొట్టాల్సి వస్తే కొట్టొద్దుమరీ? అందుకేగా తమరు యజమాని అయిందీ? కొట్టకపోతే కమతగాళ్ళు చెప్పినమాట వింటారా? వాళ్ళని దారిలో ఉంచాల్సిందే. కొట్టాలిసుంటే కొట్టాలిసిందే మరి” అన్నాడు.

ఈ వాదనకు ఏమనాలో యజమనికి అంతుబట్టలేదు. ఈ సమయంలో దేవుడు వాళ్ళకి సహాయం వచ్చినట్టయింది. ఎక్కడో కుక్కలు మొరిగాయి. చిచీకవ్ అది విని పరమానందంతో సేలిఫాన్ ను గుర్రాలను వేగంగా తోలమన్నాడు. రష్యను బండివాళ్ళకు పసిగట్టే శక్తి ఉన్నది, అది వాళ్ళకు కళ్ళలాగా ఉపకరిస్తుంది. అందుకే వాళ్ళు కళ్ళు మూసుకుని బండి తోలినా చివరకు ఎక్కడో ఒకక్కడ వచ్చి చేరుకుంటారు. అందుకే కన్ను పొడుచుకున్నా కనబడని చీకటిలో బండిని సేలిఫాన్ నేరుగా ఒక గ్రామానికి తోలి, బండి తాలూకు కర్రలు ఒక కంచెకు తగిలి, బండి ఇకముందుకు పోవడానికి లేనిచోట ఆపాడు. వర్షధారల తెరగుండా చిచీకవ్ కు ఇంటి కప్పులాంటిది కనబడింది. అతను సేలిఫాన్ ను గేటు ఎక్కడ ఉన్నదీ చూసి రమ్మని పంపాడు. వాడికది ఒకంతట కనిపించకపోయి ఉండును. కాని రష్యాలో ఇంటికాపలా, కుక్కలవంతు గనక కుక్కలు ఒక్కసారిగా మొరిగి గేటు ఎక్కడ ఉన్నదీ తెలియజేసేసరికి, వాడు రెండు చెవులలోనూ వేళ్ళు దూర్చుకోవలసి వచ్చింది. ఒక చిన్న కిటికీ నుండి వచ్చే వెలుతురు మసక మసకగా కంచె దాకా వస్తూండటం చేత మన ప్రయాణీకులకు గేటు కనిపించింది. సేలిఫాన్ గేటు మీద బాదేసరికి ఏదో కప్పుకున్న ఆకారం గేటులోనుంచి తొంగిచూసి, ఆడ గొంతుతో, “ఎవరా తలుపు కొట్టేది? ఎందుకంత చప్పుడు చేస్తున్నారు?” అని అడిగింది.

-కొడవటిగంటి కుటుంబరావు

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 10

విశ్వంలో మనిషి స్థానం

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

మనిషిని ప్రపంచంలో అత్యున్నతజాతికి చెందిన ప్రాణిగా భావిస్తారు. తక్కిన ప్రాణుల్లో కొన్ని “ఉన్నతమైనవీ”, కొన్ని తక్కువజాతివీ అనే భావన ఉంది. నిజానికి ఈ హెచ్చుతగ్గులకు ఆధారా లున్నాయని చెప్పలేము. ఎందుకంటే పోల్చటానికి మన భూగ్రహంమీద తప్ప మరెక్కడా ప్రాణులున్న దాఖలాలే లేవు. తాత్వికధోరణిని అవలంబిస్తామనుకునేవాళ్ళు సామాన్యంగా ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఏ ఆదిశంకరుణ్ణో ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే నిజమైన జ్ఞానాన్ని పొందడానికి సమకాలీనమూ, ఆధునికమూ అనిపించే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని తీరాలి కనక మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చుంటే జరగదు. ఖగోళ పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్న ఈ రోజుల్లో భూమి సూర్యుడి చుట్టూ తిరిగే అనేక గ్రహాల్లో ఒకటని అందరికీ తెలుసు. ఇటువంటి సమాచారం దృష్ట్యా విశ్వంలో భూమిదీ, దానిమీద మనుషులదీ స్థానం ఎటువంటిదో చూద్దాం.

నక్షత్రసముదాయాలు
అంతరిక్షంలోని నక్షత్రసముదాయాలు

సూర్యుడు పాలపుంత అనే గేలక్సీలో ఒక నక్షత్రం. ఈ నక్షత్ర సముదాయం చాలా పెద్దది. దాని కొలతలకి కిలోమీటర్లు చాలవు. కాంతి సంవత్సరాలు కావాలి. సెకండుకు 186 వేల మైళ్ళు ప్రయాణించే కాంతి కిరణాలు ఒక సంవత్సరం పాటు ప్రసరిస్తే తొమ్మిదిన్నర లక్షల కోట్ల కిలోమీటర్లు వెళతాయి. అందువల్ల ఒక కాంతి సంవత్సరం అంటే దాదాపు పది లక్షల కోట్ల కిలోమీటర్లు. ఈ లెక్కన చూస్తే సర్పిలాకారంలో ఉండే పాలపుంత అడ్డకొలత లక్ష కాంతి సంవత్సరాలు. దీని ఒక అంచునుంచి రెండో అంచుకు చేరడానికి కాంతికే లక్ష సంవత్సరాలు పడుతుంది. ఇది మధ్యలో ఇడ్లీలాగా ఉబ్బి ఉంటుంది. కేంద్రంవద్ద దీని మందం పదివేల కాంతి సంవత్సరాలు. భూమి చుట్టుకొలత 40 వేల కిలోమీటర్లు మాత్రమే కనక మనిషికి ఈ దూరాలు ఊహించరానంత పెద్దవి. ఈ బ్రహ్మాండమైన చక్రం ఒకసారి గుండ్రంగా తిరగడానికి 20 కోట్ల సంవత్సరాలు పడుతుంది. విశ్వంలో పాలపుంతవంటి గేలక్సీలు దాదాపుగా వందకోట్లున్నాయి. ఒక్క పాలపుంతలోనే సుమారు వందకోట్ల నక్షత్రా లున్నాయి. వాటిలో చిన్నవీ, మన సూర్యుడి కన్నా చాలా పెద్దవీ అనేకం. సూర్యుడు ఒక సగటు సైజు నక్షత్రం. పాలపుంత వెలపలి అంచులు రెండు వంపు తిరిగిన బాహువుల్లా ఉంటాయి. అందులో ఒక అంచున వెతికితే కాని కనబడనంత సామాన్యమైన నక్షత్రం “కోటి ప్రభలతో వెలిగే”మన సూర్యుడు.

పాలపుంత
పైనుంచి చూసినప్పుడు పాలపుంత దృశ్యం

మన పాలపుంత గేలక్సీకి సమీపంలో ఇతర నక్షత్ర సముదాయాలు ఇరవై ఉన్నాయి. ఇవన్నీ ఒక జట్టు. ఇవన్నీ కలిసికట్టుగా కదులుతూ ఉంటాయి. “మన” జట్టుకు చెందినదైన మృగశిర రాశిలోని ఆండ్రోమెడా గేలక్సీ పాలపుంతలాగే పెద్దది. ఇదికాక చిన్నవి కొన్ని ఉన్నాయి. ఇలాంటి మరొక గుంపు కన్యారాశిలో ఉంది. అందులో వేలకొద్దీ గేలక్సీలున్నాయి. మరొక విశేషమేమిటంటే ఇటువంటి “స్థానిక” జట్లు కొన్ని మహాసముదాయాలుగా కనిపిస్తాయి. ఈ మహాసముదాయాలలో కొన్నిటి అడ్డకొలత 30 కోట్ల కాంతి సంవత్సరాలు ఉంటుందని తెలుస్తోంది. కారణమేమిటో సరిగ్గా తెలియదుగాని విశ్వంలోని పదార్థరాశి అంతా ఇలా మహాసముదాయాల రూపంలో వ్యాప్తమై ఉంది. పైన చెప్పినట్టుగా వీటిలో చిన్నచిన్న జట్లూ, ఒక్కొక్క జట్టులోనూ చిన్నా, పెద్దా గేలక్సీలూ, గేలక్సీల్లో వందల కోట్ల నక్షత్రాలూ, వాటిలో కొన్నిటి చుట్టూ తిరిగే గ్రహాల్లో కొన్నిటి మీద జీవరాశి పెరిగే పరిస్థితులూ కనిపిస్తాయి.

“పై”నుంచి మన పాలపుంతను ఎవరైనా చూడగలిగితే సూర్యుణ్ణి గుర్తుపట్టడమే కష్టం అవుతుంది. విశ్వం సంగతి అలా ఉంచి, మన పాలపుంతలోనే మన సూర్యుడికి గాని, మనకు గాని ప్రత్యేకమైన స్థానం ఏదీ లేదనేది స్పష్టం. “సృష్టి”లో మనం చాలా గొప్పవాళ్ళమనుకునేవారికి అహం ఏదైనా ఉంటే అది అసమంజసమనే అనాలి.

ఒక శతాబ్దం క్రితం దాకా మనిషికి కాలినడకా, మచ్చిక జంతువులూ, తెరచాప పడవలే రవాణాకు పనికొచ్చాయి. దూరాలని “జయించడం” ఆధునిక పరిణామమే. అయినా “పృథివి దాటితే” అన్నీ ఇబ్బందులే. మన సౌరకుటుంబం “పెరడు”ను దాటడానికే ఆధునిక రోదసీనౌకలకు దశాబ్దాల సమయం పడుతోంది. మనకు చాలా దగ్గరలో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారై మనకు నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరాన ఉంది. సాంకేతిక అభివృద్ధి ద్వారా కాంతి వేగంలో పదోవంతు సాధించినా ఈ ప్రయాణానికి నలభై సంవత్సరాల పైనే పడుతుంది. అందుకనే భవిష్యత్తులో జరిగే రోదసీ ప్రయాణాల్లో వెళ్ళేవారు కాపరాలు చేసి, పిల్లల్ని రోదసిలోనే కని, పెంచి, నావికులుగా తయారు చెయ్యడం తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఒక తరంవారికి సాధ్యమయే పనులుకావు.

ప్రకృతి అంటే భయం ఏర్పడడానికి కారణాల్లో మనిషికి తొలినుంచీ తనకున్న పరిమితులని గురించిన అవగాహన ముఖ్యమైనది. ముందు తన పరిసరాల గురించీ, తరవాత మొత్తం భూమి గురించీ, విజ్ఞానం అభివృద్ధి చెందుతున్నకొద్దీ విశ్వం గురించిన సమాచారం తెలుసుకున్న మానవుడికి విశ్వంలో తన ఉనికిని గురించిన జిజ్ఞాస ఎక్కువ అవుతోంది. తన “అల్పత్వం” తెలిశాక “వినయ భావన” కలుగుతోంది. ఎందుకంటే కొన్ని భౌగోళిక పరిస్థితుల్లో తలెత్తిన జీవపరిణామం మనిషి రూపాన్నీ, ఆయుర్దాయాన్నీ, శక్తియుక్తులనీ నిర్దేశించిందనేది మరిచిపోరాదు. భూమ్యాకర్షణ శక్తిని అధిగమించి రోజువారీ కదలికకూ, పనులకూ తగినంత బరువూ, కండరాల బలమూ మనిషికి ఉన్నాయి. ఒకటిన్నర రెండు మీటర్ల నిడివి కలిగిన శరీరాలూ, డబ్భై ఎనభై ఏళ్ళ జీవితకాలమూ ఉన్న మనుషులకు బుద్ధివికాసం ద్వారా సాధించిన సాంకేతిక పరిజ్ఞానంతో తప్ప స్వతహాగా గ్రహాంతర యానాలు చేసే సామర్య్థం లేదు. తొలిదశల్లో గెలీలియో మొదలుకొని అనేకమంది శాస్త్రవేత్తలు టెలిస్కోప్‌ల సహాయంతో అంతరిక్షంలోకి చూసి వివరాలు సేకరించారు. 1957లో స్పూత్నిక్‌ ప్రయోగంతో సోవియట్‌ యూనియన్‌ రోదసీ యుగాన్ని ప్రారంభించింది. 1977లో అమెరికా ప్రయోగించిన వొయేజర్‌2 నౌక ప్రస్తుతం సౌరకుటుంబం పొలిమేరలు దాటి అంతరిక్షంలోకి వెళిపోతోంది.

స్పూత్నిక్‌
స్పూత్నిక్‌ ప్రయోగం

ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం ఇతర గ్రహాల్లో ప్రాణులూ, బుద్ధిజీవులూ ఉన్నారా అనే ప్రశ్నే. ఈ అన్వేషణకు నాసా 1992 నుంచీ ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మనకు తెలిసిన పద్ధతిలో జీవపరిణామం జరగడానికి వాతావరణంలోనూ, ఉష్ణోగ్రతలోనూ కొన్ని పరిమితులూ, నీరు ద్రవరూపంలో ఉండే పరిస్థితులూ అవసరం అవుతాయి. అవన్నీ ఇతర నక్షత్రాల గ్రహ సముదాయాల్లోనూ జరిగే అవకాశం ఉంది. సూర్యుడికీ, భూమికీ ప్రత్యేకత ఏమీ లేదనుకున్నాక ఇలాంటి నక్షత్రాలూ, వాటి చుట్టూ తిరిగే గ్రహాల మీద జీవరాశి పుట్టడానికి అనువైన పరిస్థితులు కలగడం అసాధ్యమేమీ కాదని శాస్త్రజ్ఞుల నమ్మకం. శక్తివంతమైన టెలిస్కోప్‌ల సహాయంతో ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల్లో భూమిని పోలినవి ఉన్నాయని స్పష్టమైంది. అక్కడికి వెళ్ళిరావడం ఇప్పట్లో అసాధ్యం కనక ఈ జిజ్ఞాస పరిశీలనల స్థాయిలోనే మిగిలింది. భూమికి వెలపల మనకు “తోడు”గా ఎవరైనా ఉన్నారా అనేది తేలితే జీవపరిణామం గురించిన మన అవగాహనకు చాలా లాభం కలుగుతుంది. మనకు అతి సమీపగ్రహమైన కుజుడి మీద సూక్ష్మజీవుల కోసం వెతుకులాట అందుకే.

మరి భూమి మాటేమిటి? చల్లని సాయంత్రాలు హాయిగా ఆరుబయట పచ్చికలో కూర్చుని,అస్తమిస్తున్న సూర్యుణ్ణీ, మిలమిలలాడ సాగుతున్న నక్షత్రాల్నీ చూసి, కవులేకాదు, సామాన్యులు కూడా పరవశిస్తారు. ఆహా,ఎంత రమణీయంగా ఉందీ ప్రకృతి! సరిగ్గా మన మనసుకూ, శరీరానికీ ఆహ్లాదం కలిగించేందుకే సృష్టించబడిందా ఈ లోకం? అప్పుడప్పుడూ, వానలూ, వరదలూ,కరువులూ వస్తూనే ఉన్నా మొత్తంమీద మన బతుకులు “చల్ల”గానే సాగిపోతున్నాయికదా! మనమే కాదు, పక్షులూ, జంతువులూ అన్నీ బాగానే ఉన్నాయి.

మనకు అన్నివిధాలా సౌకర్యంగా అనిపించే పరిస్థితులు “అదృష్టవశాత్తూ” ఏర్పడలేదనీ, ఉన్న పరిస్థితులు సుఖంగా అనిపించే ప్రాణికోటి మాత్రమే భూమి మీద మనగలుగుతోందనీ విజ్ఞానం చెపుతుంది. మనం పీల్చే గాలీ, చూడగలిగిన వెలుతురూ, తాళగలిగిన ఉష్ణోగ్రతా యాదృచ్ఛికంగా ఏర్పడలేదు. వీటికి తట్టుకోలేని ప్రాణులు ఏవైనా పుట్టినా త్వరలోనే అంతరించిపోయి ఉంటాయి. భూమికి ఉన్న ఆకర్షణ శక్తిని అధిగమించి అవయవాలను కదిలించలగలిగే శక్తి మన కండరాలకు ఉంది. వాటి శక్తికి మించిన బరువు మనకు లేదు. నేలమీద నడిచే పెద్దపెద్ద ఏనుగుల కన్నా నీటిలో ఈదే తిమింగలాలు పెద్దవి కావడంలో ఆశ్చర్యం లేదు. అలాగే ఎగిరే పక్షులు తేలికగానే ఉంటాయి. ఈ పరిణామాలకు వెనక ఉన్న భౌతిక కారణాలు మనకు తెలియనివి కావు. మనిషి ప్రమేయం లేకుండా జరిగిన ఈ “సృష్టి” వెనకాల “రహస్యాలు” ఏవీ ఉన్నట్టు కనబడదు.

అనంతం అనిపించే విశ్వాంతరాళంలో పాలపుంత గేలక్సీలో సూర్యుడు అనబడే ఒకానొక నక్షత్రం చుట్టూ భూమీ, ఇతర గ్రహాలూ తిరుగుతున్నాయి. సూర్యుడితో సహా ఈ “సౌరకుటుంబం” అంతా ఒకేసారిగా సుమారుగా 470 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. సమీపంలో ఒక సూపర్నోవా పేలడంతో ఆ ప్రాంతంలో వ్యాపించి ఉండిన వాయువులన్నీ పోగుపడి, గురుత్వాకర్షణ కారణంగా ఒక “సౌరమేఘం”గా రూపొంది ఉంటాయి. ఒకే వేగంతో గుండ్రంగా, చక్రంలాగా తిరగసాగిన ఆ బ్రహ్మాండమైన మేఘానికి నడిబొడ్డున సూర్యుడు నక్షత్రమై వెలగడం మొదలైంది. ఆ దరిదాపుల్లో ఉన్న వేడిమికి కాస్త సాంద్రంగా ఉండే సిలికేట్లు కూడా ఏర్పడలేకపోయాయి. సూర్యుడి సరసనే ఉన్న బుధగ్రహపు కేంద్రంలో ఇనుము ఉంది కాని, మీద భూమిమీద ఉన్నంతగా సిలికేట్లు కనబడకపోవటానికి కారణం ఇదే కావచ్చు. చంద్రుడి మీదా, కుజుడి మీదా ఉన్నవి రాళ్ళూ రప్పలేనని తేలింది. సూర్యుడికి దూరాన, శీతలప్రాంతాల్లో వాయువులన్నీ గడ్డకట్టి గురువుతో మొదలుకొని వెలపలి గ్రహాలుగా రూపొందాయి. ఆ మధ్య గురుగ్రహం మీదకు పారాషూట్‌తో దింపిన అంతరిక్ష పరికరం అంతకంతకూ సాంద్రమైన విషవాయువుల్లో ప్రవేశించి, కాసేపటికి వేడిమికి మాడి మసై పోయింది. గురువు కేంద్రంలో ఘనపదార్థం ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.

సూర్యుడికి దూరాన, శీతలప్రాంతాల్లో వాయువులన్నీ గడ్డకట్టి గురువుతో మొదలుకొని వెలపలి గ్రహాలుగా రూపొందాయి. ఈ సౌరకుటుంబం ఏర్పడిన తొలిదశలో బయటి గ్రహాలు ఇంకా రూపుదిద్దుకోలేదు. ప్లూటో కక్ష్య ప్రాంతాల్లో ఘనీభవించిన వాయువుల ముద్దలు అప్పుడప్పుడూ తోకచుక్కలూ, ఉల్కల రూపంలో సూర్యుడికేసి విసురుగా వచ్చిపడుతూ ఉండేవి. ఈ తాకిడి రానురాను తగ్గినా పూర్తిగా ఆగిపోలేదు.

భూమి
తొలి దశలో భూమి ఊహాచిత్రం

ఆ యుగంలో భూగ్రహం మీద ఇటువంటివి అడపాదడపా పడుతూ ఉండడం వల్లనే నీరూ, జీవకోటి ఆవిర్భావానికి దారితీసిన జీవరసాయన పదార్థాలూ దిగుమతి అయాయని కొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. అంతకుముందు భూమి సెగలు కక్కుతూ, వేడిగా ఉండేది. గ్రహంగా ఏర్పడ్డప్పుడు అంత వేడి లేకపోయినా, సూర్యుడిలాగే భూమియొక్క పదార్థరాశి గురుత్వాకర్షణవల్ల సంకోచం చెందింది. ఆ కారణంగానూ, అప్పటికి ఇంకా రేడియోధార్మికత పూర్తిగా క్షీణించని బరువైన అణువులు ఎక్కువగా ఉండడంవల్లనూ భూమి వేడెక్కసాగింది. అందువల్ల నికెల్‌, ఇనుమువంటి బరువైన లోహాలతో కూడుకున్న కేంద్రం ద్రవరూపాన్ని సంతరించుకుంది. ఆ కారణంగా భూమివంటి గ్రహాలకు అయస్కాంతక్షేత్రం ఏర్పడింది. మన కాళ్ళకు తగిలే భూపటలం అనబడే పెచ్చూ (క్రస్ట్‌), దాని కింద మేంట్‌ల్‌ అనే పొరా విడిగా ఏర్పడ్డాయి. లోపలున్న వేడిమివల్ల నష్టం కలగనటువంటి జీవరాశి పుట్టుకొచ్చింది. ఎందుకంటే జీవరసాయనిక పదార్థాలు ఉష్ణోగ్రతలో కలిగే పెద్ద మార్పులకు తట్టుకోలేవు. ఈ రోజుల్లో గ్రీన్‌హౌజ్ వాయువుల ప్రభావాన్ని గురించిన ఆందోళన అందుకే.

ఇక వాతావరణం సంగతి. మొదట్లో తేలికైన వాయువులన్నీ వేడెక్కిన భూమి అంతర్భాగంనుంచి క్రమంగా అగ్నిపర్వతాలనుంచి బైటికి రాసాగాయి. వీటిలో నైట్రొజన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌వంటివి రోదసిలోకి వెళిపోకుండా భూమ్యాకర్షణవల్ల వాతావరణపు పొరగా ఏర్పడ్డాయి. నీటి ఆవిరి వర్షంగా కురిసి సముద్రాలూ, మహాసముద్రాలూ ఏర్పడడానికి దారితీసింది. కురిసిన చోట ఉండిన లవణాలు నీటిలో కరిగి సముద్రాలన్నీ ఉప్పునీటితో నిండాయి. కార్బన్‌ డయాక్సైడ్‌ శిలలతో రసాయనికంగా కలవగా కార్బొనేట్లు ఏర్పడి ఉంటాయి. అవి నీటిలో కరిగి లవణాలుగా రూపొందాయి. ఈనాడు అగ్నిపర్వతాలనుంచి వెలువడే వాయువుల్లో ఆక్సిజన్‌ ఉండదు.

ఇదే పరిస్థితి అప్పుడూ ఉండేదని అనుకుంటే ఈ రోజుల్లో కనబడుతున్న 21 శాతం ఆక్సిజన్‌ ఆ తరవాత ఇతర మార్పుల కారణంగా గాలిలో చేరింది నీటిలో తొలిగా అవతరించిన మొక్కలు సూర్యరశ్మి వల్ల కిరణసంయోగం ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ ఉండేవి. ఇది క్రమంగా పెరిగి, సుమారు 57 కోట్ల సంవత్సరాల కిందట నీటిలోనూ, గాలిలోనూ ఎంతగా కలిసిందంటే ఆక్సిజన్‌ను పీల్చి బతకగలిగిన జంతువులు పుట్టుకురావడం ఆ తరవాతనే సాధ్యమైంది. మరికొంతకాలానికి, అంటే 40 కోట్ల సంవత్సరాల కిందట, గాలి పీల్చే భూచరాలు కూడా ఆవిర్భవించాయి.

దీనివల్ల తేలుతున్నదేమంటే ప్రాణుల ఆవిర్భావానికి అడ్డు తగలనివీ, దోహదపడేవీ అనేక పరిస్థితులు ఒక్కసారిగానో, క్రమంగానో కలిసిరావడంవల్ల ఇతర గ్రహాలకు భిన్నంగా ఒక్క భూమి మీద మాత్రమే జీవాలు పుట్టుకురాగలిగాయి. సరిగ్గా ఇటువంటి పరిస్థితులే మరే గ్రహం మీద ఒనగూడినా జీవరాశి ఉద్భవించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కుజగ్రహంమీద ఒకప్పుడు నీరు ఉండేదని ఖచ్చితంగా తెలుస్తోంది. ఆ కాలంలో జీవకణాల పుట్టుకకు దారితియ్యగలిగిన పరిస్థితులు ఉండేవేమోనని శాస్త్రవేత్తలు ఆశగా అన్వేషిస్తున్నారు. ఉల్కల్లోనూ, తోకచుక్కల్లోనూ సేంద్రియ (ఆర్గానిక్‌) కణాలున్నాయని వారు అనుమానిస్తున్నారు. భూమికి వెలపల ఎక్కడ జీవకణాలు దొరికినా అది అద్భుతమైన విషయంగా అనిపిస్తుంది.

భౌతికవాద దృక్పథం ఉన్నవారికి మాత్రమే ప్రకృతిని గురించీ, మనుషుల స్థానం గురించీ సరైన అవగాహన ఏర్పడుతుంది. ఆ తరవాత మనందరికీ జీవవైవిధ్యాన్నీ, పర్యావరణాన్నీ కాపాడుకోవడమనేది ఎంత అవసరమో ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం ఉండదు.
————–
కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) గారి వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.

Posted in వ్యాసం | 9 Comments

మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు

బ్లాగులపై సమీక్షలు చూసాం. కాని బ్లాగును సమీక్షిస్తూ బ్లాగరికి మరో బ్లాగరి రాసిన లేఖ చూసామా? ఇదిగో చూడండి.. ప్రముఖ బ్లాగరి రాధిక, “స్నేహమా” పేరిట గల తన బ్లాగులో (http://snehama.blogspot.com) కవితలు రాస్తూ ఉంటారు. ఆ కవితలకు స్పందించిన మరో ప్రముఖ బ్లాగరి, కవి జాన్ హైడ్ కనుమూరి, కవయిత్రికి రాసిన ఆత్మీయ లేఖ ఇది. చదివి మీ ఆత్మీయ అభిప్రాయాలు రాయండి.

జాన్ హైడ్ కనుమూరి (http://johnhaidekanumuri.blogspot.com/)

రాధిక గారికి,

కవిత్వమనేది హృదయాంతరాళాలలో దాగివున్న జలనిధి. బయటకు రావడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది. ఆ ప్రయత్నం నిత్య జీవితంలో జరుగుతూనే వుంటుంది. కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు, కొందరి ప్రభావం తటస్థించడం ద్వారా అది బయట పడుతుంది. అలా వస్తూ అది ప్రవాహమౌతుంది. ఆ ప్రవాహానికి దిశ, లక్ష్యాలను నిర్ణయించడానికి ఒక క్రమశిక్షణాత్మకమైన పరిశ్రమ అవసరమౌతుంది. ఈ ప్రవాహంలో వెలువడే కవిత్వం ఒక అంత:సూత్రాన్ని పాటిస్తూ తెలియకుండానే ధ్వని సమన్వయం చేసుకుంటుంది. ఇలా జరగటానికి బాల్యము, జన్మస్థలాలు, పరిసరాలలోని పెద్దల స్ఫూర్తి, చదువు నేర్చుకున్న మూలాలు దోహదంచేస్తాయి. స్పందించే హృదయం కొనుక్కుంటేనో, సాధన చేస్తేనో వచ్చేది కాదు. సహజసిద్ధంగా గోరుముద్దలు, లాలిపాటలతో మొదలై శ్రమైక జీవనంనుంచి అంతరంగాలలో పాదుకుంటుంది.

ప్రస్తుత సాహిత్యం, విప్లవసాహిత్యమే సాహిత్యమన్న స్థితినుంచి, వివిధ ధోరణులు విభిన్న వర్గాలుగా విడిపోతున్న దశ, ఏ వాదాలు దేనికి మార్గదర్శకంగా నిలుస్తాయోననే సందిగ్ధత ఓ ప్రక్క, మరో ప్రక్క కెరీర్ ఓరియెంటేషన్ పెరిగి ఇంటర్ మీడియట్ స్థాయినుంచే తెలుగును వదిలేస్తున్న నేటి విద్యావిధానాలు, కార్పొరేట్ చదువులు వీటన్నిటి మధ్య యువత కవిత్వాన్ని ఆస్వాదిస్తున్నదా అనే పరిస్థితి. వలసలు, వలసలవల్ల ఏర్పడే “డయస్పోరా” మరో ప్రక్క.

తెలుగునాట విరివిగా కవిత్వం వస్తున్నది, కవిత్వ పుస్తకాలు వస్తున్నాయి కాని అమ్మకాలు లేవు. అసలు ఇవి ఎంతవరకూ యువతకు చేరుతున్నాయి అనేది పెద్ద ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కవి, అందులోనూ యువకవుల పుట్టుక చాలా సందిగ్ధంగా వున్నదశలో రాబోయేకాలంలో కొత్తకవులు పుడ్తారా అనేదికూడా ప్రశ్నే.

ఇలాంటి భిన్నత్వం మధ్య మీరు కవిత్వం రాస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను కవిత్వాన్ని చదువుతున్నప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో వుంచుకొని చదవటం అలవాటయ్యింది

  • చదవగానే వచ్చే తక్షణ స్పందన
  • అక్షరాలలో అంత:సూత్రం ఏమైనా కనిపిస్తుందా
  • అక్షరాలు ఏమైనా మోసుకొని వస్తున్నయా (ప్రతీకలు)
  • వీటిల్లోంచి నాకు(ఇప్పటికి) ఏమైనా పనికివస్తుందా

ఇలా కొన్ని విషయాల దృష్టితో చదువుతుంటాను. అందులో కొన్ని తాత్కాలిక ఆనందానిస్తాయి, కొన్ని ఆలోచింపచేస్తాయి, కొన్ని వెంటాడుతుంటాయి . అలాంటివి మీ కవిత్వంలో నాకు కొన్ని కనిపించాయి.

ఎక్కువగా అన్నీ ఒకలాగే వుండటంవల్ల అన్ని కవితలూ కోట్ చెయ్యటం లేదు. ప్రత్యేకమని నాకు అనిపించినవే వుదహరిస్తున్నాను. కవిత్వంలో ఇలాగే వుండాలనే నిర్దిష్టాలు ఏవీలేవు. నేను చెప్పినవే ప్రమాణాలు కాదు. నాకు అనిపించినవి మాత్రమే చెప్పడానికి ఒక ప్రయత్నం, అది మీకు ముందుముందు వుపయోగ పడాలని ఆశ.

కవిత్వం రాయడమే కాకుండా బ్లాగుల్లో వుంచడం, దానికి సందర్భోచితంగా ఫోటోలు జోడించడం, బ్లాగు తెరవగానే పాట వినిపించడం, ఇలా మీరు కంప్యూటరు టెక్నాలజీని వినియోగించుకోవడం నాకు బాగా నచ్చిన ఆంశాలు. కవితకు బొమ్మ వేసి ముద్రించడం పత్రికల్లో పద్ధతి. ఫోటోను పొందుపరచడం బ్లాగుల్లో సౌలభ్యం. మీరు ప్రతీ కవితకు ఓ ఫోటోను జతచేస్తారు. ఫోటోను ఎన్నుకుని కవిత రాసినా, రాసినదానికి ఫోటో వెదుక్కుని పెడ్తున్నా ప్రకృతి సౌదర్య స్పృహ అంతర్గతంగా మీలోదాగి వుంది (ఈస్తటిక్ సెన్స్అంటారు).

ఈ కవిత్వాన్ని ఎన్నిసార్లు చదువుతున్నా చిత్రమైన అనుభూతి కలుగుతుంది. అది చాలాసార్లు నదిలోనో, సముద్రానికో స్నానం కోసం వెళ్ళినప్పుడు చిరుకెరటాల మధ్య మోపే మొదటి అడుగు పొందే నీటి స్పర్శలాంటిది. లోపలికెళ్ళేకొద్దీ ఆ స్పర్శ, అనుభూతి మారిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా మొదటిపాదం పెట్టాల్సి వచ్చినప్పుడు అదే అనుభూతి, అదే స్పర్శ..

బహుశ: మొత్తం కవితల్లో వస్తువు ఇంచుమించు ఒకటే అవటం వల్ల ఇలా అనిపించవచ్చు.

మీరు, మీ స్నేహితులు పంచుకున్నదేదైనా అందులో దాగివున్నది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమే మీచేత ఇన్ని అక్షరాలను మాలలుగా తోరణాలను అల్లిస్తుంది.

మీ కవిత్వంలో కనిపించిన అనుభూతులు పాతబడిపోయిన కవిత్వమని తలుస్తారు కాని అందులోంచి ఒక కొత్త వ్యక్తీకరణ కనిపిస్తుంది. అనుభూతిని చెప్పటంలో తాజాతనం కనిపిస్తూ వుంటుంది. ఆ తాజాతనం ఎవ్వరినైనా ఆకర్షిస్తుంది. జ్ఞాపకాలనో, అనుభవాలనో, అనుభూతులనో తట్టిలేపుతుంది.

బేలతనం, అమాయకత్వ లక్షణాలను తొలగించుకోవల్సిన, బయటపడవల్సిన అవసరం వుంది.

కవిగాని, రచయితగాని దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల అంశాలనుండి ప్రభావితమై, దాని ప్రభావం రచనల్లో అంతర్లీనంగానైనా కనిపిస్తుంది అని విమర్శకులు చెపుతారు. ఆ కోణంలో చూస్తే కన్నీళ్ళు, ఒకలాంటి నిస్పృహ, ఎడబాటు ఎక్కువగా కనిపిస్తాయి మీ కవితల్లో.

ఆలోచనలను ఎక్కువగా పోజిటివ్ వైపు మళ్ళించడం కనిపిస్తుంది. అది మిగతావాటిని అధిగమిస్తుంది కూడా.

ఐతే కొన్నిచోట్ల వాస్తవ విరుద్ధమైన పదాలు వున్నాయి.

ఉదా : చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటే

చప్పున మెదిలిన నచ్చినవాడి రూపం ఇది పరస్పర విరుద్ధభావన. గమనించండి.

ఇందులో చీకటి వాస్తవం. చీకటి భయానికి, తెరమాటుతనానికి, వికృత చేష్టలకు , చెడ్డతనానికి …. ప్రతీక.

  • అది తెచ్చే చుట్టం అలాగే వుంటుంది కానీ మంచిగా ఎలా వుంటుంది?
  • పూర్ణిమ వున్నప్పుడు చీకటికి తావులేదు, చీకటి ఆక్రమించినపుడు వెన్నెలకు చోటు లేదు

వెన్నెల సాహిత్యానికి, ఇరుమనసుల కలయిక పడే విరహానికి ప్రతీక. వెన్నెల ప్రేమికుల మధ్య కొత్తసంగీతాన్ని తెస్తుంది.

కన్నీరు కవితలో ఇలా అంటారు:

“ఈ బరితెగించిన బాధని చూడు
కనుల సరిహద్దును దాటి
చెంపలను తడుపుతుంది
కనికరంలేని కన్నీళ్ళు
ఎంత ఆపినా ఆగట్లేదు

సంతోషమా
నువ్వొచ్చి కట్టడి చెయ్యొచ్చుగా!”

సంతోషం ఎలావస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, దేనివల్ల వస్తుందో తెలియనప్పటికీ ఆహ్వానించడం ద్వారా ఒక దృశ్యంగా సాగిపోతున్న ఒరవడి నుండి కవితా రూపం, అనుభవాలు మారిపోతాయి.

కొన్ని కవితల్లో మిమ్మల్ని మీరు స్థిరీకరించుకుంటున్నారు:

“అలుపుతీర్చే చిరుగాలి

అలిగి సుడిగాలైతే

చిగురుటాకులా వణికిపోతున్నాను.

కానీ..

ఈ సుడిగాలి జడివాన కురిస్తే

సాహిత్యపు మొలకలెత్తిస్తుంటే

ఆ ధారల్లో తడిసి మురిసిపోతాను గానీ

ఎండుటాకులా దూరంగా ఎగిరిపోను”

….’చిరుగాలి కోపానికి’ కవితలో

కొన్ని కవితల్లో మీరు అర్థం చేసుకుంటున్న కవిత్వ నిర్వచనాన్ని వ్యక్తీకరిస్తున్నారు. “కవిత” అనే కవితలో

“మనసులోని భావాలు

మాటలుగా చెప్పలేని వేళ
అవి కలై … అలలై
అనుభూతుల తుఫానులు చెలరేగి
యెద తీరాన్ని తాకినప్పుడు
మది లోతుల్లో పలికేదే కవిత”

అంటారు. అనుభూతులకు, ఆలోచనలకు భిన్నంగా వాడిన పదాలు ‘అందం’ కవితలో “అదృష్టం”, ఆమె కవితలో “విధి”.

అనుభూతులు, ఆలోచనలను అందరూ ఏదో వొకప్పుడు అంగీకరిస్తారు కాని పై పదాలు అన్నివేళలా అందరికీ ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇలాంటి పదాల వెనుక మతం వస్తుంది. అది భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంది.

నాకు బాగా నచ్చిన కవిత:

రేపటి ఉదయం

ఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయాయో
నా కన్నీళ్ళల్లో ఎన్ని కలలు జారిపోయాయో
మనసు మెదడుతో యుద్ధం చేస్తుంది
ఫలితమే ఈ నిదురలేని రాత్రి
అయితేనేమిలే…
పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నాను
అందుకే ఇప్పుడు
నా పుస్తకాన్ని సరికొత్తగా ప్రారంభిస్తున్నాను
ఓ నిరాశా…
ఈ రాత్రి మాత్రమే నీది
రేపటి ఉదయం…నాది….

కన్నీళ్ళు, మనసు యుద్ధం, సరికొత్త ప్రారంభం, కమాండ్ – శాసించడం

నాది అని సొంతం చేసుకొనే దృక్పథం సరికొత్త ఆవిష్కారాలకు దారి చూపిస్తుంది. నిదురలేని రాత్రిని యుద్ధంతో పోల్చడంలో నేటి జీవన పరిస్థితి “struggle for existence ” కనిపిస్తుంది. ప్రతీ వోటమిలోనుంచి గెలుపుకు మార్గాలను వెతుక్కోవచ్చు అని నిరూపించిన వాళ్ళు ఎందరో వున్నారు. జారిపోయిన, పారిపోయిన కాలం నుంచి పాఠాలను నేర్చుకున్నప్పుడే ప్రతి ప్రారంభం నిర్మాణానికి, నిర్మించుకోవడానికి దారి తీస్తుంది – అది జీవితమైనా, జీవనమైనా, సమాజమైనా.

నిరాశను శాసించడం ద్వారా ఆశను పట్టుకోవడం బాగుంది.

“ఇప్పటికైనా” కవితలో స్త్రీవాదం కనిపిస్తుంది.

అదిమిపెడుతున్న ఆశలు పైకి చెప్పాలనుకోవడం మార్పుకోసం ఎదురు చూడటమే. శిశువుగా శ్వాసించడం కేకతోనే ప్రారంభం.

కేక/శబ్దం నిశ్శబ్దాన్ని చీలుస్తుంది. తరంగ తరంగాలుగా భావం బయటపడుతుంది. ప్రపంచం మొత్తంమీద మాట్లాడగల్గిన (prominent personalities) వాళ్ళను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు.

“వర్షించడానికి సిద్ధంగా

ఎన్నేళ్ళ భావాలో?

ప్రవాహంలా

ఎన్నెన్ని కన్నీళ్ళో?”

ఇది చదువుతున్నప్పుడు మా అమ్మ గుర్తుకువచ్చింది. ఆరు కానుపులు, ఏడుగురు పిల్లలు, చాలీచాలని ఆర్థిక వెసులుబాటు, రెండు మూడు సంవత్సరాలకోసారి బదిలీలు. తన వ్యకిగత ఆశలకు, ఆలోచనలకు ఎప్పుడూ వూపిరి దొరకలేదు. తనకొచ్చిన వుద్యోగావకాశాలు సంసారం, బాలింత సూలింతల మద్య నలిగిపోయాయని అంటుండేది. బహుశ కన్నీళ్ళై ప్రవహిస్తే మనసుకు వూరట కలుగుతుందేమో? మరి సమస్య మాటేమిటి? ఆశల సంగతేమిటో…. పెద్దప్రశ్న. ఇది ఒక్కరిదీ ఇద్దరిదీ కాదు. బహుశ స్త్రీలందరిదీనేమో.

కన్నీళ్ళ ప్రవాహాలవటం కొత్తదారుల్ని తెరుస్తుంది

వర్షిస్తే కొట్టుకుపోయినవి ఎన్నో.

మాట్లాడాలి ఇకనైనా…అనే భావాన్నిస్తుంది

“అతడు” కవితలో

“చాలా చెప్పాలనుకున్నాను అతనికి

కాని ఏమిచెప్పాలో తెలియని పరిస్థితి”

యవ్వనంలో తప్పని భావాలైనా ప్రేమకూ ఆకర్షణకూ మధ్య తేడా తెలవకుంటే సమన్వయం కష్టమే. సత్యభామదీ ఇదే మనస్తత్వం. కాని ఆమె ప్రౌఢ. కృష్ణుడితో తగవులాడుతుంది. అలక బూనుతుంది. కోపిస్తుంది, కలహిస్తుంది. పరిపరి విధాల తలపోస్తుంది. అది కృష్ణునిపై ఇంకా ప్రేమను పెంచుతుంది.

“నిశీధిలో నేను” కవితలో పోజిటివ్ అలోచనలు అనిచెప్పానే అది ఈ కవితకు వర్తిస్తుంది. కవిత బాగున్నట్లు అనిపించినా ప్రతీకాత్మకంగా చూస్తున్నప్పుడు పరస్పర విరుద్ధంగా అనిపిస్తాయి.

చీకటి తెరలను దాటుకుని ఇపుడే
ఉషోదయపు వెలుగుల్ని చూస్తున్నాను.
నిశీధిలో నియంత బ్రతుకు అయినా…
ఉషస్సు చూడలేక
తలను వంచిన ఈ క్షణం
ఇపుడు నాకు నచ్చుతుంది.
మబ్బులు సూర్యుణ్ణి ముసురుతున్నాయి
నా మనసుని కాదు.
ఇక ఎప్పటికీ కాదు
అప్పుడే పుట్టిన పసి పాపలా నా మనసు………

ఇందులో పరస్పర విరుద్ధమైన భావాలు వున్నాయి. ఒకసారి తలను వంచితే సమర్థిస్తునట్టూ, అంగీకరించినట్టూ, మోసుకుపోతున్నట్టూ అవుతుంది. అది నచ్చితే దాన్నుంచి బయటకు ఎప్పుడూ రావాలనిపించదు. తలను ఎత్తినప్పుడే, లక్షణాలు నచ్చనప్పుడే ఛేదించే మార్గాలను అన్వేషణ చేస్తుంది మనసైనా, బ్రతుకైనా. ఉషోదయపు వెలుగుల్ని చూడటం ఒక శుభపరిణామం.

మబ్బులు ముసిరేది నా మనసును కాదు అని చెప్పడం పాజిటివ్ ఆలోచన. ఆ అలోచనలు నిర్మలంగా, స్వచ్ఛంగా, అప్పుడే పుట్టిన పసి పాపలా వుండటం మీ కల్పనా చాతుర్య ప్రతీక.

“జీవితం” కవితలో

కన్నీళ్ళ అనుభవాలు చెబ్తూ నిర్వచనం దిశగా మారిపోయారు.

ఏదో అసంతృప్తి కనిపిస్తుంది.

ఇలాంటిదే మరొకటి “మదికోరిన మరణం”

ఇంకా ఎదురు చూస్తూనే వున్నాను నువు వస్తావని
నాకు తెలుసు నీవు రావని ..రాలేవని
తిరిగి రాని సుదూర తీరాలకు తరలిపోయావని
అయినా నిరీక్షిస్తున్నాను ఎందుకో..నువు వస్తావని
నీదైన ప్రతి జ్ఞాపకం మది లో మెదులుతుండగా
మధురమైన భావాలను కలిగిస్తుంది
అసలు నువులేవన్న మాటనే మరిచిపోతున్నాను
మది కరిగించే నీ చిరునవ్వు కనులముందు కనిపిస్తూనే వుంది
నాపై వెన్నెల జల్లులు కురిపిస్తూనే వుంది
ఒంటరినై వున్నపుడు నీ వెచ్చని స్పర్శ,
ఓదార్పుగా తీయని పలకరింపు తాలూకు భావన
ఇప్పటికీ నువ్వు వున్నావన్న అనుభూతిని కలిగిస్తున్నాయి
ఆ తలపులే …నీవు నా వెంటే వున్నావన్న ధైర్యాన్ని ఇస్తున్నాయి
అయినా………….నీవు లేని నా కల సయితం ఊహించలేను
నీ నీడగా మారిన నా మనసుతో పాటూ నేనూ వస్తున్నాను
నిను చూడాలని..నీ దరి చేరాలని
ఈ లోకానికి చివరి వీడ్కోలు పలుకుతూ…
నీ దరి చేరబోతున్న నేను

ఇందులో కన్నీళ్ళు, నల్లని అనుభవాలు పిండాలని ప్రయత్నించారు.

మనసుభాష: ఈ కవిత దగ్గరకు వచ్చేసరికి మీ కవితా ప్రయాణం రూపుదిద్దుకుంది. నిశ్శబ్ద సంగీతాన్ని ఇందులో ఇమడ్చగలిగారు. అద్భుతమైన చిత్రీకరణ కూడా.

ఏకాంత వనం లో
ఆమె – నేను
మౌనం గల గలా
మాట్లాడేస్తుంది.
మనసులు ఏమి అర్థం చేసుకున్నాయో
కన్నులు ఏమి భాష్యం చెప్పుకున్నాయో
చిత్రంగా..
చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకున్నాయి

“ఈ తరం” కవితలో..

“అలారం మోతలతో

ఉలికిపాటు మెలకువలు

అలసిన మనసులతో

కలలులేని కలత నిదురలు”

నిజంగా ఈ తరానికి ప్రతీకే. జీవన శైలి ప్రతిబింబిస్తుంది.

“ఓ భావన” కవితలో

ఒక అందమైన భావనకి వేవేల రూపాలు
అమ్మ-నాన్న
అన్న-చెల్లి
అతడు-ఆమె
నువ్వు-నేను…ఇలా ఎన్నో
అన్ని మనసుల మధ్యా ఉన్న
ఒకే వారధి ప్రేమ
అమృతం తాగిందేమో ఈ ప్రేమ
నిత్యం యవ్వనంతో వుంటుంది
అందరినీ తనలో నింపేసుకుంటూ
అందరినీ తనతో కలిపేసుకుంటూ…
మురిపిస్తూ[పసిపాపై]-మరిపిస్తూ[అమ్మై]
కవ్విస్తూ[ప్రేయసై]-లాలిస్తూ[నాన్నై]
బాధిస్తూ[అసూయై]-ఓదారుస్తూ[నేస్తమై]…ఇలా
ఎన్నో అనుభూతుల్ని అందిస్తూ.. మిగిలింది
చిరంజీవిగా ఈ ప్రేమ

[] పెట్టకుండా రాసుంటే బాగుంటుందేమో

పసిపాపనై మురిపిస్తూ
అమ్మై మరిపిస్తూ నాన్నై లాలిస్తూ
ప్రేయసినై కవ్విస్తూ
అసూయై బాధిస్తూ
నేస్తమై ఓదారుస్తూ

– ఇలా

ఎన్నో అనుభూతుల్ని అందిస్తూ
మిగిలింది చిరంజీవిగా
ఈ ప్రేమ.

ఆమె

తనొక జ్ఞాపకమై వుంటానంది
నేను వద్దన్నాను
తనొక అనుభూతిగా మిగులుతానంది
నేను కుదరదన్నాను
గుండెల్లో నిలుస్తానుగా అంది
సదా కళ్ళెదుట వుండమన్నాను
గతమై నా వెనుక వుంటానంది
జతగా నా పక్క నడవమన్నాను
జన్మంటూ వుంటే నీ కోసమే అంది
నీతోటే నేనంటూ..ఈ జన్మకి వీడ్కోలన్నాను
మొదట ఓదార్చింది–తరువాత వివరించింది
బ్రతికి సాధించమంది
సాధించి దానిలో తనను బ్రతికించమంది
కళ్ళు తుడుచుకున్నాను
నాకు దారి చూపుతూ..అనుక్షణం విధిని గుర్తుచేస్తూ
ఎదురుగా నా లక్ష్యం రూపంలో ఆమె

తన రాక కోసం
నచ్చిన నెచ్చెలి చెప్పే
తొలకరి చినుకుల్లాంటి ముద్దు మాటల్లో
ముద్దగా తడిసిపోవాలని
తొలి వేకువ నుండి ఎదురుచూస్తుంటాను.
ఒంటరిగా కాదులెండి
తోడుగా ఆమె తలపులు.
తను ఒకసారి వచ్చి వేల వసంతాలను
కానుకిచ్చి వెళుతుంది.
అనుభూతుల వానలో తడిపి
ఆరేలోపు వచ్చేస్తానంటుంది.
నాకు మాత్రం
మనసు కన్నులతో చెప్పిన ముచ్చట్లతో
రేయి కలలా సాగిపోతుంది.
నెచ్చెలి తెచ్చే
నవ్వుల కోసం ఎదురుచూపుల్లో
మళ్ళా వెన్నెల వచ్చేస్తుంది.

అద్భుతమైన కవితలు. మీది కాని స్వరూప స్వభావాన్ని వ్యక్తీకరిండం: ఇది వ్యక్తిగతానికి భిన్నం. సఫలమయ్యారు. ఈ కవిత్వాన్ని చదువుతూ తక్కువ రాసానేమో అని ఒకసారి, ఎక్కువ రాసానేమో అని ఒకసారి అనిపిస్తుంది. సామాజిక, ఆధ్యాత్మిక, భావాత్మక, ప్రగతిశీల, అభ్యుదయ, స్త్రీవాద కవిత్వాన్ని ముమ్మరంగా మీరు రాయాలని అభిలషిస్తున్నాను.

లేఖల గురించి ఓ మాట:

ఉత్తరాలు తరిగిపోని సంపద లాంటివి. దానికి కవిత్వం అద్దటం ఒక మహత్తర ప్రక్రియ. ఉత్తరాలు ఏకాంతం నుండి సమూహాల్లోకి, సమూహాల నుండి ఏకాతంలోకి వంతెనను నిర్మిస్తాయి. ఎవరి వంతెనకు వాళ్ళ నేపథ్యమే చిత్రాన్నిస్తుంది. నిర్మించడమే. మీరు మీ వంతెనను ప్రదర్శనకు పెట్టారు. సుమారు రెండు కిలోమీటర్లున్న రాజమండ్రి వంతెనలా. లండన్ లోని వంతెనపైనో, హౌరా వంతెనపైనో విహరిస్తున్నట్టు అక్షరాల వంతెన పైనుండి ఎవరికివారే మరో కొత్త వంతెన నిర్మించుకోవాలి.

బాల్యంలో తొక్కుడు బిళ్ళ ఆడినట్టు, యవ్వనంలో దాచి దాచి చదువుకున్నట్టు మనస్సులో కట్టుకున్న కొత్త ఫొటో ఫ్రేములా అనిపించాలి. అలా అనిపించాయి నాకు. ఈ అనుభూతులు మీ అక్షరాల మధ్య దాగివున్నాయి వెలికితీయండి.

పుస్తకంగా చేయతగ్గ కవిత్వం ఇందులోవుంది. విరివిగా రాయండి. బ్లాగులే కాకుండా ఇతర పత్రికల్లో కనిపిస్తారని ఆశిస్తూ..

అభినందనలతో…..

జాన్ హైడ్ కనుమూరి
13-75, శ్రీనివాస నగర్ కాలనీ,
రామచంద్రపురం,
హైదరాబాదు – 502 032.
సెల్ : +9912159531

జాన్ హైడ్ కనుమూరి (http://johnhaidekanumuri.blogspot.com/)

వీరు రాసిన ‘హృదయాంజలి’ కవితాసంపుటి మార్చి 2004 లో శ్రీ మునిపల్లె రాజు గారిచే ఆవిష్కరించబడింది. వీరు రాసిన ‘హసీనా’ గురజాడ రాసిన ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ తర్వాత స్త్రీ సమస్యలతో వచ్చిన దీర్ఘ కవిత అని వాడ్రేవు చినవీరభద్రుడు గారి అభిప్రాయం. వీరి ‘అలలపై కలలతీగ‘ కవితాసంపుటి ఫిబ్రవరి 2006లో విడుదలైంది. వీరి గురించి మరిన్ని వివరాలతో బాటు, వీరు రాసిన కవితలు కొన్ని వీరి బ్లాగులో చూడవచ్చు.

Posted in వ్యాసం | 9 Comments

మందిమన్నియమ్ -1

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

tbs.bmp “మందిమన్నియం ” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు. ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది మొదటిది:

6. పర్యాలోకన ప్రకరణము

మొదటి ప్రస్తావనము – ప్రజాస్వామ్య నిర్వచనములు

సూత్రము – 1: ప్రజాస్వామ్యము.

వృత్తి:

ఇది యధికారసూత్రము. ఇఁకముందు చెప్పఁబోవు నిఱువది యాఱు (26) వెనువెంటి సూత్రములకు దీని నన్వయించికొనునది. ప్రజాస్వామ్య మనఁగా నిచ్చటఁ బ్రాతినిధ్య ప్రజాస్వామ్యమునే గ్రహింపఁదగును.

సూత్రము – 2: ఏకదేశముల యందనిర్దిష్టులైన సంఖ్యాధికులకుఁ గల మాటచెల్లుబాటు.

వృత్తి:

(అ) ఏకదేశములనఁగా భాగములు. ఇచ్చట నేక దేశములనఁగా మొత్తము వ్యవస్థ కాక ప్రత్యేకములైన వేఱువేఱు విషయములున్ను, సమస్యలున్ను.

(ఆ) అనిర్దిష్టులనఁగాఁ బేరుచేతఁ గాని వర్గముచేతఁ గాని పేర్కొనఁబడని వారు. ప్రజాభిప్రాయసేకరణ జరుగు ప్రతి సందర్భమునకున్ను వీరు మారుచుందురు. వీరు ప్రతిసారియు నూకుమ్మడిగా నొక్క విధముగానే సమ్మతాసమ్మతములను దెలుపు సంభావ్యత లేదు.

(ఇ) సంఖ్యాధిక్య నిర్ణయ పద్ధతి దేశదేశమునకున్ను వారేర్పఱించికొన్న రాజ్యాంగముల ననుసరించి భేదించుచుండును. కొన్నియెడల నది నూటి కేఁబది యొక్కపాళ్ళు. మఱికొన్నియెడల నది నూటి కఱువదియాఱు చిల్లర పాళ్ళు. ఇంకొన్ని యెడల డెబ్బదియైదుపాళ్ళుగాఁ గాని యెనుబదిపాళ్ళుగాఁ గాని యున్నది.

(ఈ) సంఖ్యాధికు లెందరున్నప్పటికిన్ని వారి వ్యతిరేకులు కొందరుండుట తప్పదు. కాఁబట్టి తాము కూడ బలపడు వరకు వారెదురుచూడక తప్పదు.

సంఖ్యాధికులచేత గెలిపింపఁబడినవారు తమను గెలిపించినవారి బాగోగులను మాత్రమే పట్టించికొందురు కావునఁ బ్రజాస్వామ్యమునం దెల్లప్పుడును పైవారి దుర్విచక్షణమునకు బలియగు వర్గమొకటి యుండును.

(ఉ) ఒక కుటుంబముగాని, రాజకీయపక్షము గాని యెన్నికలలో గెలిచినంత మాత్రమునఁ బ్రజాసమస్యలపై వారికున్న సకల వైఖరులకున్ను లేదా భావజాలమునకున్ను ప్రజామోదము లభించినట్లు కాదు. ప్రాయికముగా నప్పటప్పటికిఁ బ్రజల దృష్టి కత్యవసరమని తోఁచిన యొకటి రెండు విషయములపైనఁ గాని, రెండుమూఁడు విషయముల పైనఁ గాని వారి వైఖరి నచ్చుటచే గెలి
పించినారని భావించుట సమంజసము. అట్లు గెలిపించినంత మాత్రమున యావత్తు దేశమును గాని, వ్యవస్థను గాని వారికి సమస్తహక్కు భుక్తములతో సహా శాశ్వతముగా వ్రాసి యిచ్చినట్లు కాదని తాత్పర్యము.

(ఊ) ప్రత్యేకముగాను మఱియు నాధికారికముగాను బ్రకటించిన కొన్ని విశేష సందర్భములలో మినహా, రాజ్యాంగ ప్రకారము నిర్ణీత కాలవ్యవధానమును బట్టి జరుగు సార్వత్రిక యెన్నికలు సాధారణ పరిపాలన ప్రక్రియలో భాగమే యగును దప్ప వ్యవస్థ యొక్క భవిష్యము నటో యిటో తేల్చి వేయు స్తోమత వానికి లేదు. అట్టి విధముగా వానిని గుఱించి వ్యాఖ్యానించుటయు మరియు నెన్నికలలోఁ గాని, యటుముందుఁ గాని యటుపిమ్మటఁ గాని యట్టి విధముగాఁ బ్రచారము సేయుటయు సమంజసములు కావు. ఏలనఁ బ్రాతినిధ్య ప్రజాస్వామ్యమునఁ బ్రజలు నేరుగా విధాన నిర్ణేతలు కాఁజాలరు.

సూత్రము – 3: ప్రజల కొఱ కే ప్రభువులు పరిపాలించుట.

వృత్తి:

ప్రజల యభీష్టము నెఱిఁగి పరిపాలించుటయే ప్రజాస్వామ్యమని సూత్రహృదయము. అయితే, అనింద్యమైన యెన్నికల ప్రక్రియవంటి యొక బహిరంగ వ్యక్తీకరణ ము లేకయే ప్రజాభీష్టమును గాని, ప్రజాప్రయోజనమును గాని నిర్దుష్టముగాఁ దెలిసికొనుట యెట్టి పరిస్థితులలోను సాధ్యము కాదు.

(అ) ప్రజలును బ్రభువులును అచ్చుమచ్చుగా నొకటి కారు. ప్రభువులు ప్రజలయందుండి ప్రభవించినవారే అయినను, ఒక్కసారి ప్రభుత్వ పీఠాధిష్ఠితులైన పిదప వారున్ను, వారి రాజకీయ సమర్థకులున్ను, ప్రజల కంటె వేఱై న జనవర్గమగుదురు. ప్రజాస్వామ్యమునఁ బరిపాలకులు అన్నివేళలఁ బ్రజలచేతఁ బ్రత్యక్షముగాఁ గాని, పరోక్ష ముగాఁ గాని యెన్నిక కానంత మాత్రము చేత వారి పరిపాలన యొక్క ప్రజాస్వామ్య ముద్రకు లోపము రాదని భావము.

(ఆ) ప్రజలే ప్రభువులని చెప్పి ప్రజలకున్ను ప్రభువులకున్ను తేడా పాటింపకపోవుట భ్రమప్రమాదజనితము. అంతేకాక మిక్కిలి హానికరము కూడ. రాజఱికమునందు వలెనె ప్రజాస్వామ్యమునందును ఒక పాలకవర్గముండుట నిజము. అధికారములో స్వయముగా నున్నను లేకపోయినను రాజకీయ సిద్ధాంతాది వైరుద్ధ్యముల కతీతముగాఁ బాలకవర్గ మెల్లప్పుడును బాలకవర్గమే. ఇది గమనింపనిచో సామాన్యప్రజల కొరకుఁ బ్రత్యేకింపఁబడిన యెల్ల లాభములను మరియు సదుపాయములను బ్రజలలో భాగమని పేరుబెట్టికొని పాలకవర్గముల సంబంధీకులే హస్తగతము జేసికొందురు.

రెండవ ప్రస్తావనము – ప్ర జాస్వామ్య గుణములు

సూత్రము – 4: మరియుఁ బ్రజాశ్రేయమును, బ్రజాభీష్టమును.

వృత్తి:

పృథగ్వ్యవహారముచేత నివి యన్యోన్యము పర్యాయ పదములు కావు.

సూత్రము – 5: బహుళ ప్రకారము.

వృత్తి:

ప్రత్య క్షము, పరోక్షము, ప్రాతినిధ్యము, పరోక్ష ప్రాతినిధ్యము, రాజఱిక ప్రజాస్వామ్యము, ప్రజామోదిత రాజఱికము, అధ్యక్ష ప్రజాస్వామ్యము, స్థానిక ప్రజాస్వామ్యము, ఏకపక్ష ప్రజాస్వామ్యము, బహుపక్ష ప్రజాస్వామ్యము, లిఖిత స్మృతి బద్ధము, అలిఖిత స్మృతి బద్ధము, వారసత్వ ప్రజాస్వామ్య ము, నైష్పత్తిక ప్రజాస్వామ్యము, శిష్టప్రజాస్వామ్యము, సార్వత్రిక ప్రజాస్వామ్యము అని ప్రజాస్వామ్యపుఁ బనితీరుపెక్కు తెఱఁగులు. వీనిలో మూఁడు, నాలుఁగు తెఱఁగు లొక్కటిగా సమ్మేళించుటయుఁ దఱచు.

సూత్రము – 6: ఒక లౌకిక రాజకీయ వ్యవస్థ.

వృత్తి:

(అ) వ్యవస్థ యనఁగాఁ గొన్ని ప్రాఙ్ నిశ్చిత లక్ష్యములను నెఱ వేర్చుటకై కొన్ని పరిసర పరిస్థితులను దృష్టిలో నుంచుకొని రూపొందించిన పూర్వాపర వచో వ్యాఘాత విరహితమైన నియమముల తార్కిక క్రమము.

(ఆ) ప్రజాస్వామ్యము తనవంటి అనేక ఇతర పాలన వ్యవస్థలలో ఒకానొకటి. ఇతర వ్యవస్థల కంటె దానికి గుణాధిక్య మిచ్చట పేర్కొనఁబడలేదు. కాని రాజు లేనంతమాత్రమున ప్రజాస్వామ్యమనఁగా నరాజకము కాదని తాత్పర్యము.

(ఇ) ఒక్కొక్క విధమైన ప్రజాస్వామ్యమునం దొక్కొక్క తెఱఁగు ఆర్థిక నమూనా వృద్ధిసెందును. కాని ప్రజాస్వామ్యము స్వయముగాఁ దానొక యార్థిక వ్యవస్థ కాదు.

(ఈ) దాని యొక్క యావత్తు సులక్షణ, విలక్షణ, అవలక్షణముల తోడను ఆమోదించి యనుసరించుటకు సిద్ధపడినప్పుడు ఏ వ్యవస్థ యైనను లోక కళ్యాణమునే చేయునని యెఱుఁగునది.

(ఉ) ఒకానొక దేశమునందు ప్రజాస్వామ్యము శాసనబద్ధమగు ప్రజాపాలన వ్యవస్థగాఁ బ్రకటింపఁబడినప్పటికిన్ని అచ్చటి రాజకీయేతర వ్యవస్థలకు -అనఁగాఁ గుటుంబము, విద్యాభ్యాసము, కళలు, శాస్త్రశోధన, మతము, వాణిజ్యము, శాంతిభద్రతల పరిరక్షణ, దైనందిన ప్రజా పాలనవ్యవహారములు మున్నగువాని అంతర్గత విషయములలో మట్టుకుఁ బ్రజాస్వామ్య సూత్రములు పూర్తిగాఁ గాని పాక్షికముగాఁ గాని వర్తింపకపోవచ్చును. కాని రాజకీయ వ్యవస్థ యొక్క స్వరూప స్వభావముల ప్రభావము సమాజమునందలి యెల్ల యితర వ్యవస్థలను కొద్దిగానో గొప్పగానో స్పృశింపక మానదు. అనఁగా సమూలమైన వ్యవస్థాగత మార్పులయందుఁ గాని జమాఖర్చుల సంస్కరణముల యందుఁ గాని ప్రజాస్వామ్య సూత్రములను సంపూర్ణముగాఁ బాటింప వలనుపడును.

(ఊ) లౌకికమనఁగాఁ బంచేంద్రియైకవేద్యమై మనందరి యొక్క నిత్య జీవితములయందును మిక్కిలి భేదింపని సారూప్యములతో ననుభవము లోనికి వచ్చుచు నీ యిహలోకమునకు-అందునా మనము నిర్మించికొన్న యీ మానవ సమాజమునకు మాత్రమే ప్రసక్తమైనట్టిది. ఏతద్ భిన్నములైన విషయములకుఁ బ్రజాస్వామ్య సూత్రములు వర్తింపవు.

సూత్రము – 7: పలు జనాంగములున్నచోట బహుళము.

వృత్తి:

(అ) జనాంగ మనఁగాఁ బ్రధాన జనవర్గముగాఁ గాక మొత్తము జనావళియం దేకదేశమై యుండునది. అట్లయ్యుఁ దన యొక్క స్వకీయమైన బ్రతుకోజ గలిగినది. అక్కారణమునఁ దన్నుఁ బ్రత్యేకమని యెంచికొనుచు నన్నివేళలఁ బ్రధాన జనవాహినితో నేకీభవింపనిది.

(ఆ) అట్టి చిన్నచితక జనాంగములు పెక్కు ప్రోఁగువడిన దేశమునందుఁ బ్రజాస్వామ్యము సఫలము కావచ్చును. లేదా, విఫలము కావచ్చును. పాక్షికముగా సఫలము కావచ్చును. లేదా, అసలు లేకయే పోవచ్చునని భావము.

(ఇ) ఇందులకుఁ గతనమేమఁగా – బ్రజాస్వామ్యము ప్రాథమికముగాఁ దలకాయల లెక్కయే గనుక, ననేకములైన చిఱుజనాంగములు కలఁగూడి నూటి కేఁబదియొక్క పాళ్ళ బలమును సమకూర్చికొని తక్కుంగల నలుఁబది తొమ్మిది పాళ్ళ బలము గల జనాంగములను దరచుగాఁ గ్రిందువఱచెదరు.

వారు వెనువెంటనే యే విధముగాఁ గాని ప్రతికరింపలేకపోయినను, ఈ పరిణామము పట్ల లోలోపల సహజముగాఁ గినిసి యుందురు. కనుక, జనాంగముల నడుమ వైషమ్యములు నానాటికిన్ని హెచ్చును. దీని ఫలితముగాఁ బ్రభుత్వ వ్యవస్థ స్తంభించిపోవు నవకాశము తఱ చుగా నేర్పడఁగలదు.

(ఈ) ఇంతేకాక, ఆయా జనాంగముల ప్రత్యేక సంప్రదాయముల కనురూపముగా వేఱువేఱు విధములైన శాసనముల నేర్పఱించుటచే శాసనములకే విలువ లేని పరిస్థితి తలయెత్తును గావునను, ఆయా శాసనముల కాయా జనాంగముల పెద్దలు సందర్భానుసారము తమకుఁ దోఁచినయట్లు వక్ర భాష్యములు చెప్పు నవకాశముండుట వలనను ఒక దినుసు అరాచకము చోటుచేసికొనఁగలదు.

(ఉ) పలు జనాంగములున్న దేశపు సమస్యలు దుస్తరమగు సముద్రము వలె మొదలును దుదియు లేనియట్లు పైకి అనంతములై కానవచ్చును. జాతిపరమైన సమస్యలు నిజముగా నున్నను, లేకపోయినను, లేక యుపేక్షింపఁ దగినంత స్వల్పముగా మాత్రమే యున్నను, ఆ ప్రస్తావన రాజకీయ వాదులచే వారి వైయక్తిక జనాకర్షణ నిమిత్త మెడనెడ లేవనెత్తఁబడి పెద్దదిచేయఁబడి తఱచుగాఁ బెనుకల్లోలములకు దారితీయును. పర్యవసానముగాఁ బ్రజాస్వామ్యమునందుఁ బౌరుల నమ్మిక పదేపదే వమ్ము కావింపఁబడును.

సూత్రము – 8: సేవాప్రధానము.

వృత్తి:

(అ) ఇచ్చట సేవ యనఁగా – జీవనాధార భూతమైన ధనలాభము నిమిత్త మొక యజమానుని దగ్గరఁ గాని, యొక్కసారే పెక్కురు యజమానుల దగ్గరఁ గాని, తాత్కాలికముగాఁ గాని, శాశ్వతముగాఁ గాని, యిష్టపూర్వకముగాఁ గాని, అనిష్టపూర్వకముగాఁ గాని పనిసేయుట. ఇది ప్రేమస్నేహాది మనోద్వేగములచేఁ బ్రేరితమై చేయు స్వచ్ఛందసేవ కంటె మిక్కిలి భిన్నమైనది.

(ఆ) అధికారములున్ను, విధులున్ను, హక్కులున్ను ఎట్లున్నప్పటికిన్ని ప్రజాస్వామ్యమునం దొకరి కొకరు సేవకులనియేజెప్పఁబడుదురు. ఎట్లనఁగా

– వినియోగదారునకు వ్యాపారి సేవకుఁడు. శిష్యునకు గురువు సేవకుఁడు.
నాయకులు ప్రజలకు సేవకులు. రోగికి వైద్యుఁడు సేవకుఁడు.
యజమానులమని మాత్ర మెవ్వరును జెప్పికొనరు.

సూత్రము – 9: ఒక క్రమోన్నతి విధానము.

వృత్తి:

ప్రజాస్వామ్యము మానవులు క్రమక్రమముగా నున్నత తరగతికిఁ జేరికొనుటకు దోహదించు నొక రాజకీయ విధానము.

(అ) ఇంతకు ముందు చెప్పినట్లు ప్రజాస్వామ్యము తన స్వభావరీత్యా సమసమాజముతో సంవదింపదు గనుక దీనియందును ఎల్ల యితర సాంప్రదాయిక సమాజములందు వలెనె ధనపరముగాను హోదాపరముగాను వందలాదిగా హెచ్చుతగ్గులు కలవు. భేదమేమనఁగా – సాంప్రదాయిక సమాజములలో నున్నతి యనునది జన్మసిద్ధము. ప్రజాస్వామ్యములో మాత్రము కర్మసిద్ధము. అనఁగాఁ గొన్ని తెఱఁగుల వృత్తులున్ను ఉద్యోగములున్ను హెచ్చు తరగతికిఁ జెందినవనియు, మరికొన్ని తెఱఁగుల వృత్తులున్ను ఉద్యోగములున్ను నీచతరగతికిఁ జెందినవనియు నొక సుస్థిరాభిప్రాయము ప్రజాస్వామ్యమునందు సైతము ప్రచురముగా నుండును. కాని, యే యుద్యోగము గాని, వృత్తి గాని యెవ్వరికిని శాశ్వతము గావింపక పోవుట వలనఁ దన్మూలకమైన గౌరవాగౌరవములు ఆ వృత్త్యుద్యోగముల తోడనే సమసిపోవును.

ప్రజాస్వామ్యములో నవి యొక మనుష్యుని యొక్క యావత్తు శేషజీవితమును గాని యాతని వంశపరంపరను గాని ప్రభావింపఁ జాలవు.

(ఆ) కనుకఁ బ్రజాస్వామ్య మార్థిక తరగతుల నడుమను, వృత్త్యుద్యోగముల నడుమను ఉన్న యగాధమైన వ్యత్యాసములను దొలఁగించు పనికిఁ బూనికొన దు కాని, యొక యార్థిక తరగతి నుండి మఱియొక యార్థిక తరగతికి బదలాయిల్లు హక్కు నొసంగుటకు మాత్రము పూచీపడును. అట్లు మారుటకావశ్యకమైన ప్రయత్నము జేయవలసినదియు, సంభార సామగ్రులను సమకూర్చికోవలసినదియు సామాన్య పౌరుఁడే.

(ఇ) ఎవ్వరు గాని పుట్టుకతోడనే యితరుల కంటె గొప్పవారను విషయమును గాని, పుట్టుకతోడనే యితరులతో సమానమను విషయమును గాని ప్రజాస్వామ్య మంగీకరింపదు గనుక, పుట్టిన తరువాత గొప్పవారగుటకై ప్రయత్నము చేయు నవకాశము నెల్లరికిన్ని సమానముగాఁ గల్పించును. అందుచేత వృత్త్యుద్యోగముల రీత్యా నిమ్నతరగతిగా నెంచఁబడిన యొక కుటుంబము వేఱువిధమైన వృత్త్యుద్యోగముల నవలంబించి యున్నత తరగతిగా గురుతింపు నొందు స్వేచ్ఛను బ్రజాస్వామ్యము ప్రసాదించును.

(ఈ) ప్రజాస్వామ్యము పైవిధముగాఁ గల్పించిన యవకాశమును వివిధ వయస్సులవారు వివిధ సమయములందుపయోగించికొనుచుందురు గనుక యా దిశగా ముందు ప్రయత్నము జేసినవారికి సాందర్భికమగు ప్రాధాన్యమిచ్చు నిమిత్తము హోదాలలో నొక సోపానక్రమ మేర్పఱింపఁబడును.

సూత్రము – 10: తక్కువ హింసాపేక్షము.

వృత్తి:

ప్రజాస్వామ్య పద్ధతులలోఁ బరిపాలనము సేయుట కెక్కువ బలప్రయోగ మక్కఱ లేదు.
(అ) ప్రజాస్వామ్యమునందు సైత మెంతోకొంత శాసనవిరుద్ధమగు బలప్రయోగము తప్పదు. ఈ బలప్రయోగమున్ను, శాసనప్రకారము విధించు దండన ప్రక్రియయున్ను నొక్కటియే యని భావింపరాదు.

(ఆ) దండనభయము లేనిచోట నేరపూరితమైన యరాచకము తాండవించును. దండించుటయే మఱుఁగునఁ బడినప్పుడు సకారణముగాను, శాసన ప్రకారముగాను దండించినప్పటికిన్ని అది యొక యమానుషకృత్యమైనట్లును, నేరస్థులు దయనీయులైనట్లును, బ్రభుత్వమే దుర్మార్గమైనట్లును జూడఁబడును.

(ఇ) పై సూత్రము దేశపు టంతర్గత పరిపాలన వ్యవహారములను గూర్చి మాత్రమే. విదేశ వ్యవహారముల యందన్ననో, దౌత్యము విఫలమైనప్పుడు యెంతటి ప్రజాస్వామిక దేశమైనప్పటికిన్ని తప్పనిసరిగా హింసకున్ను, బల ప్రయోగమునకున్ను పాల్పడును.

(ఈ) ప్రజాస్వామ్యమునందలి యితర వ్యవస్థలయందీ సూత్రము బహుళముగా నన్వేయము.

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

(“నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం.” అనే తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుబ్లాగులోకానికి సుపరిచితులు. ఆయన విద్యాభ్యాసం అనేక తెలుగు పట్టణాలలో సాగింది. తర్వాత ఆయన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. చేశారు. మన భాష-సంస్కృతుల పట్ల ఆయనకున్న అభిమానం, వాటిలో ఆయనకున్న అభినివేశం చాలా గొప్పవి. తెలుగు సాహిత్యం బ్లాగులో సుమతీశతకం గురించి విపులంగా రాశారు. ఆసక్తి గలవారికి తన బ్లాగులో సంస్కృతపాఠాలు కూడా నేర్పారు. తెలుగుపదం గుంపులో ఆయన అనేక కొత్తపదాలను తాను సృష్టించడమేగాక అలా సృష్టించాలనుకునేవారికి మార్గదర్శకాలను సైతం రూపొందించారు. ఇవేగాక ఆయన చాలా రచనలు చేశారు. వాటిలో ఎక్కువభాగం అముద్రితాలు. వాటిని త్వరలో తన బ్లాగు ద్వారా అంతర్జాల పాఠకుల ముందుకు తీసుకురాబోతున్నారు.)

Posted in వ్యాసం | Tagged | 2 Comments

గడి నింపితే బహుమతి!

ఈసారి వికీ శీర్షికలో రవి వైజాసత్య వికీపీడియాతోబాటే వికీ సాఫ్టువేరుపై ఆధారపడి పనిచేసే ఇతర వికీమీడియా ప్రాజెక్టులైన విక్షనరీ, వికీసోర్స్, వికీవ్యాఖ్య (wikiquote), వికీబుక్స్ ల గురించి వివరిస్తున్నారు.

ఈనెల గడికి రెండు ప్రత్యేకతలున్నాయి. ఈ గడిని కూర్చినది భైరవభట్ల కామేశ్వరరావు గారు కావడం ఒక విశేషమైతే ఈ గడిని తప్పుల్లేకుండా పూరించినవారికి ఒక బహుమతిని ఇవ్వాలని నిశ్చయించడం ఇంకొక విశేషం. గడువు (భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 6వ తేదీ రాత్రి 12 గంటలు) లోపల సరైన సమాధానాలు పంపిన వారిలో ఒకరికి 500 రూపాయలు విలువచేసే పుస్తకం ఒకటి AVKF ద్వారా పంపిస్తాం. ఒకరికంటే ఎక్కువ మంది సరైన సమాధానాలు పంపినట్లైతే బహుమతి విజేతను లాటరీ ద్వారా నిర్ణయిస్తాం. పొద్దు పత్రిక నిర్వాహకులు, గడి కూర్పరి, వారి కుటుంబసభ్యులు బహుమతికి పరిగణించబడరు.

షరా: బహుమతి విజేత పుస్తకాన్ని అందుకున్న నాటినుంచి నెలరోజుల లోపల ఆ పుస్తకంపై సమీక్ష రాసి, పొద్దుకు పంపవలసి ఉంటుంది.

ఈ నెల రచనలు:

అక్టోబరులో వికీ ప్రాజెక్టుల ప్రగతి
అక్టోబరు గడి సమాధానాలు
నవంబరు గడిపై మీమాట
కౌంతేయులు (అతిథి)
కార్పొరేట్ ఆ(కా)సుపత్రి! (కవిత)

మరిన్ని విశేషాలు త్వరలో…

Posted in ఇతరత్రా | 1 Comment

అక్టోబరు గడి సమాధానాలు

అక్టోబరు గడి – వివరణలు:

అక్టోబరు గడికి సమాధానాలు పంపినవారు:

ఒక తప్పుతో: భైరవభట్ల కామేశ్వరరావు, కొత్తపాళీ, శ్రీరామ్.

నాలుగు తప్పులతో: జిజ్ఞాసి.

అందరికీ అభినందనలు!

సంపాదకీయంలో పేర్కొన్నట్లే ఈ నెల (నవంబర్) గడికి గడువు (భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 7వ తేదీ రాత్రి 12 గంటలు) లోపల సరైన సమాధానాలు పంపిన వారిలో ఒకరికి 500 రూపాయలు విలువచేసే పుస్తకం ఒకటి AVKF ద్వారా పంపిస్తాం. ఒకరికంటే ఎక్కువమంది సరైన సమాధానాలు పంపినట్లైతే బహుతి విజేతను లాటరీ ద్వారా నిర్ణయిస్తాం. పొద్దు పత్రిక నిర్వాహకులు, గడి కూర్పరి, వారి కుటుంబసభ్యులు బహుమతికి పరిగణించబడరు.

బహుమతి విజేత పుస్తకాన్ని అందుకున్న నాటినుంచి నెలరోజుల లోపల ఆ పుస్తకంపై సమీక్షరాసి పొద్దుకు పంపవలసి ఉంటుంది.

1

*

2 వా

3 తా

4 పి

5

తిం

6

7జే

హం

*

8

గు

నా

*

*

తం

*

9

గం

*

9 స్వ

రం

*

*

10

11 కాం

గి

*

12

13

తి

*

14 ళం

*

పా

*

*

15

*

*

డు

*

16 చిం

తా

17

ణి

*

నం

*

18

19 గు

20 మో

ము

21 కో

తా

*

ణి

*

22

*

23

వీ

*

24 పా

కు

*

25 ప్ర

26

రు

27 డా

*

*

*

28 చూ

లు

*

*

29 వా

గా

లి

*

రు

*

*

పు

*

30 హిం

31 దో

ళం

*

లం

*

32 గా

చి

33

34 పా

లు

35

బూ

*

*

*

36

ను

రా

ము

*

రా

*

37 చు

బు

38 కం

*

40

గా

*

*

*

41

ళి

*

లు

*

42 చి

కు

మి

గి

లే

ది

అడ్డం:

2 జీర్ణమంత్రం మూకదొరా దండాలయ్యా (3+4+3) – వాతాపి గణపతిం భజేహం (వాతాపి జీర్ణం అనే జీర్ణ మంత్రమున్నది కదా)
8 రాముడు-భీముడు లో మామగారితో రేలంగి వేడికోలు సరసం (3) (తగునా) తగునా ఇది మామా పాట నుంచి
9 ఒక్కరిటు జరిగినా చాలు అందరికీ చాలేంత చోటు (2) జరగం లోంచి ర జరిగితే మిగిలేది జగమే కదా?
10 భాషకి అక్షరమెంతో, పాటకి ఇదీ అంతే (2) – స్వరం
11 శుద్దసావేరి తల్లి బంగారు (4) – శుద్ధ సావేరి, కనకాంగి రాగానికి జన్యం
13 ఎటుచూసినా ఒకటేనట. నమ్మింపజూసేది వాస్తవం కాదట (౩) (నటన )
17 అంత చింతలేల విదుషీమణీ అంతా నాటకమేనని మాకెరికేలే – (4) చింతామణి నాటకం
19 చిర్నవ్వుల కోదండపాణి ముఖారవింద దర్శనం కోసం ఆభేరికెంత ఆరాటమో (4) నగుమోము కనలేని నా జాలి తెలిసి అనే ఆభేరిలో త్యాగరాజ కృతి
22 ప్రగల్భాలు పలికేవాళ్ళూ, ప్రభుత్వమూ కూడా చేసేదిదేనా? (2) కోత
24 విశ్వనాధవారితో ఇదే చిక్కు – కథలో ఇద్దరు వీరులు, పేరు మాత్రం… (4) (ఏకవీర)
25 మొదల్లేని వేపాకు (2) పాకు
26 ఊరికే పంతాలకిపోయుండకపోతే స్వారోచిషమనువుకి తాతయ్యుండవలిసినవాడే కదా? మీరేమంటారు? (4) (ప్రవరుడా)
30 అచ్చతెనుగులో మలయమారుతం (4) (వాడగాలి) – వాడగాలంటే మలయమారుతం
31 మనసులోగుట్టుతెలుసుకోడానికి త్యాగయ్య రిషభాన్నెందుకు పరిత్యజించడం? (3) (హిందోళం) – హిందోళంలో రిషభముండదని శంకరాభరణం సినిమా చూసినవాళ్లందరికీ తెలిసిందే, హిందోళంలో మనసులోని మర్మము తెలుసుకో అనే త్యాగరాజ కృతొకటి ఉంది.
33 ఈనగాచి నక్కలపాలు చేస్తే ఈ జంబుకాలెలా కనిపిస్తాయి? (5) (గాచినపాలు) ఈనగాచినక్కలపాలు లోంచి, నక్కలు పోతే మిగిలింది గాచినపాలే కదా?
36 వాగ్ధాటి కోసం వస పోస్తే బూకరించి ఊరుకుంది (3) (వసబూ)
37 ఎన్ని రాగాలు నేర్చినా, ఈ రాగం ఒంటపట్టకపోతే జ్ఞానోదయం కాదని త్యాగరాజ ఉవాచ, ఒకటి నిలువు సాక్షిగా(5) (అనురాగము), అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు అని సరస్వతి రాగంలో త్యాగరాజ కృతినాధారంగా.
38 బతిమాలడానికి ప్రియుడికైతే గడ్డం పట్టుకోవాలి, మరి ప్రియురాలికైతే?(3) (చుబుకం)
40 ఈ సోదరుల కోసమే జగన్నాధ రధచక్రాలని భూమార్గం పట్టించడం (2) (దగా)
42 బుచ్చీ, ఆఖరుకేంబాపుకొన్నావయ్యా బాబూ?(4+4) (చివరకు మిగిలేది)

నిలువు:

1 పురాణాల్లో ఈమె బ్రహ్మ మానసపుత్రిక కావొచ్చుగాని, సంగీతంలో మట్టుకు బృహస్పతి కుమార్తె (4) (సరస్వతి) – కర్ణాట సంగీతంలో సరస్వతి రాగం వాచస్పతి రాగానికి జన్యం, వాచస్పతి అంటే బృహస్పతి.
2 కీలు తెలిస్తేగాని ఇది పెట్టడం సాధ్యంకాదు మరి (2) (వాత) – కీలెరిగి వాత పెట్టాలి కదా?
3 ఇలాంటి దురలవాటును మధ్యలో ఆపేసినా మంచిదే (2) (తాగు), తాగుడు ని మధ్యలో ఆపేస్తే తాగు వస్తుంది కదా?
4 ఈ శూలపాణి వృత్తి రీత్యా వైద్యడైనప్పటికీ, ఆంధ్రదేశంలో పేరెన్నికగన్న సంగీత శాస్త్ర కళానిధి (5) (పినాకపాణి) – పినాకపాణిగారు సంగీత శాస్త్రంలో పేరెన్నిక గన్న గొప్ప లక్ష్య లక్షణవేత్త, నేదునూరి, నూకల చిన సత్యనారాయణ, బాలమురళి వంటి వారికి గురువు, కాని వృత్తి రీత్యా ఈయన వైద్యుడు.
5 ఆకసాన విహరించేది తోకముడిచింది (3) (పతంగి) – పతంగిక లో క పోయింది కదా మరి.
6 ఇదికూడా మన సంగీతంలో ఒక సంప్రదాయమే (3) (భజన)
7 దీని మోత వినబడితే ప్రసాదానికి పిలుపొచ్చినట్టే. (3) (జేగంట)
12 చూడగా ఇది కాంతల కంటికింపు గొలిపేది (3) (కాంచనం)
14 ప్రేమలో పడ్డానికి ఈ రెండూ ఉంటే చాలు: గుప్పెడంత హృదయమూ, పిడికలంత … (3) (నడుము)
15 పాటలో లయ చెదిరి, ఇది కూడా తిరగబడ్డట్టుంది (2) (తాళం)
16 ముప్పైఆరు నిలువు విషాదరాగమా, అంచాత సయించదుటే, చూడగా బోతే అచ్చంగా విరుద్దం (4,3) (కనకన రుచిరా) (కనకన్+అరుచి అని విడగొట్టితే వచ్చిన తిప్పలు మరి, ఇది వరాళి రాగంలో త్యాగరాజ కృతి, పంచరత్నాలలో ఒకటి)
17 గోపన్న పుణ్యమా అని, సీతమ్మవారికి మిగిలిన ఆభరణమిదొక్కటే (3) (చింతాకు) (సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా అని రామదాసు ఎకౌంటు పుస్తకాలు ఒప్పచెప్పాడు కదా మరి)
18 రతనాల వీణదండె, తిలక్ రాసిన ఓ కథపేరు (5) (మణిప్రవాళం) (ప్రవాళం అంటే వీణదండె)
20 గర్వం ఎక్కువై నీల్గితే ఇలాగే తలక్రిందులౌతారు (2) (వీగు)
21కాడిబరువు మోసేది: కొలిస్తే మూర, తలిస్తే? (2) (మోర)
22 కోవాపాలు లో ఇమిడింది తియ్యదనంకాదు (3) (కోపాలు)
23 జనులు నాలుక్కాలాల పాటు చల్లగా ఉండాలంటే, రైతన్న మరో రెండుకాలాలు ఎక్కువే శ్రమపడాలి… (4) (ఆరుగాలం)
27 ఎండాకాలంలో ఇది తింటే ఒ.కె, కాని తగిల్తేనే కష్టం (2) (వడ)
28 హల్లో, బార్బరా స్ట్రైసాండ్ పెళ్లిల్ల పేరయ్యగా నటించిన హాలివుడ్ సంగీతరూపకం పేరేమిటండీ? (2) (డాలి), హల్లో డాలి అనే హాలివుడ్ సినిమా ఆధారంగా.
29 ఇవి కలవకపోతే ప్రేమ పుట్టదు, ఇవి జరగకపోతే పెళ్ళి కుదరదు (3) (చూపులు)
31 ఎంత సింహమైనా అనవసరంగా దీనికి పాల్పడదు కదా? (2) (హింస)
32 ఇదేం చిత్రం – ఒక్కడైతే పిల్లలని ఎత్తుకు పోతాడట, మరి ఇద్దరుంటే మాత్రం పిల్లలాడుకొనే ఆట (4) (దోబూచులు)
33 నూనే తీసే యంత్రంలో పత్రం పడ్డది.. (4) (గానుగాకు)
34 మగడు ఆభరణమొకటివ్వగ, ముదిత మెల్లగ నవ్వగ (2) (నగ)
35 ఇది కూడా శంకరాభరణమే (2) (పాము)
36 పెళ్ళికొడుకుల బృందం పాడేదీ విషాద రాగంట (3) (వరాళి)
37 ఈ అమృతాన్ని పెదవులతో తేలిగ్గా గ్రోలండి (3) (అదర) – అధరంలో ఒత్తు పీకేస్తే మరి తేలికైనట్టేకదా?
39 చెప్పుకొన్న కథలన్ని చేరుకొనే చోటు (2) (కంచి)
41 ఆఖరిగడికాధారం మొదటిదే (2) (ఆది) (నిలువు 1 ఆధారం ఒక నది పేరును సూచిస్తున్నందున ‘నది’ని కూడా సరైన సమాధానంగానే పరిగణించాం.)

Posted in గడి | Tagged | 3 Comments