మందిమన్నియమ్ -4

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

tbs.bmp

“మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు.

ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు.

ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది నాలుగోది:

———

సూత్రము – 31 : ప్రజాస్వామ్యము శాంతికాలైకవర్తి.

వృత్తి :

శాంతి యనఁగా రెండు కల్లోలములకు మధ్య నుండు వ్యవధానము. దేశమునందు శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు గాని, యుద్ధముచెలరేఁగినప్పుడు గాని, ఆర్థికముగాఁ బెనుసంక్షోభమునందు మునిఁగినప్పుడు గాని ప్రజాస్వామ్య సూత్రములు పూర్తిగాఁ గాని పాక్షికముగాఁ గానిప్రవర్తింపకపోవచ్చును. అనఁగాఁ బ్రజాస్వామ్యము వలన శాంతి నెలకొనకపోవచ్చును గాని శాంతి వలనఁ బ్రజాస్వామ్యము నెలకొనవచ్చును.

ఐదవ ప్రస్తావనము: ప్రజాస్వామ్యపు మునువలయికలు

సూత్రము – 32 : ప్రజాస్వామ్యమునకు వలసినది.

వృత్తి :

ఇది యధికారసూత్రము. ఇఁకముందు చెప్పఁబోవు పదునైదు సూత్రములకు దీని నన్వయించికొనునది.

సూత్రము – 33 : ఒక యఖండ భూభాగపుఁ బ్రజలయందురాజకీయ ఏకాంగ భావన.

వృత్తి :

రాజకీయ ఏకాంగమనఁగా – నొక్క విధమైన ప్రభుత్వపు టేలుబడిలో నొక్క విధమగు చట్టములకు సుదీర్ఘకాలముపాటు లోఁబడి యున్న చరిత్రగలిగి, తత్కారణముచేఁత మిగత దేశముల కంటెను, రాజ్యముల కంటెను విలక్షణముగా గుఱుతింప శక్యమైన అవిచ్ఛిన్నమైన ఏకాండీ రాజ్యము. తాముఉమ్మడిగా నట్టివారమను భావన గల ప్రజలున్నచోటఁ బ్రజాస్వామ్యమును నెలకొలుపుటకును, నిర్వహించుటకును ఆస్కారము గలదు.
(అ) ఈ సూత్రమున కంతరార్థము – అఖండ రాజకీయ ఏకాంగ భావనయు, సరూప ఏకజాతీయతా భావనయు నొక్కటే యని కాదు.
(ఆ) తామొక సామ్రాజ్యమను భావన రాజకీయ ఏకాంగ భావన కాదు.
(ఇ) ఒకే యాక్రామకుని క్రింద నున్న భూభాగములు రాజకీయ ఏకాంగములని యెంతకాలముగాఁ బ్రచారము సేసినను అవి ఎట్టి పరి స్థితులలోను రాజకీయ ఏకాంగములు కాఁజాలవు.
(ఈ) అఖండ రాజకీయ ఏకాంగ భావనయుఁ బ్రజాసమైక్యమును ఒకటికావు.
(ఉ) అఖండ రాజకీయ ఏకాంగ భావన యున్నంతమాత్రముచేతనే ప్రజాస్వామ్య మేర్పడునట్టి సంభావ్యత హుళక్కి.

సూత్రము – 34 : స్వయం శాసకత్వము.

వృత్తి :

(అ) దీనినే సార్వభౌమాధికారము, సర్వసత్తాకత్వము మొదలయినపేరులతోఁ గొందరు వ్రాఁతరులు వ్యవహరించుచున్నారు. స్వయంశాసకత్వమనఁగా – నంతర్గత పరిపాలన మొదలుకొని విదేశవ్యవహారముల వరకు,మఱియు ధనసంపాదన మొదలుకొని దేశమునందున్న ప్రాకృతిక వనరులమీఁద నేకాధిపత్యము వరకు, నేరస్థులను శిక్షించుట మొదలుకొని శత్రుదేశములను ద్రిప్పికొట్టుట వరకుఁ గల యన్ని విధములైన స్వతంత్రచర్యలకున్నుగల హక్కుస్వామ్యములు. ఇట్టి స్వయంశాసకత్వము రాజకీయ పరిపాలనపరమైన స్వాతంత్య్రము ద్వారానే సాధ్యము.
(ఆ) ఎంత యనవద్యముగా నిర్వహింపఁబడినను, స్వయంశాసకత్వమునకునోఁచికొనక పరాయిదేశపుఁ బ్రభావము నందున్న దేశములో జరుగు నెన్నికలకున్ను మఱియు నవలోడనములకున్ను విశ్వసనీయత హుళక్కి.

సూత్రము – 35 : దేశభాషా ప్రాబల్యము.

వృత్తి :

దేశమునందలి యత్యధిక ప్రజాసామాన్యము తన నిత్యజీవితమునందుఁ బ్రచురముగా వ్యవహరించు భాషలోను, శైలిలోను గాక, తద్భిన్నమైనవానిని విస్తృత పరిపాలనా వసరములకున్ను న్యాయస్థాపనకున్ను వినియోగించు ప్రభుత్వములు ప్రజలచేత నెన్నికైనప్పటికిన్ని అనుష్ఠానమునందుమట్టుకుఁ బ్రబల నిరంకుశ ధోరణి గలవియై ప్రజాపీడనకు యథేచ్ఛగాఁబాల్పడును. ఏల ననఁగాఁ – పరభాషా పాండిత్యము ప్రజలలో నధిక సంఖ్యాకుల కుండదు గనుకను, వారు పరిపాలన విషయముల నాకళించికొనుటకొరకు మధ్యవర్తుల భాష్యములపై నాధారపడు నిమిత్తము తమ ధనమునుసమయమును వెచ్చించుట కిష్టపడరు గనుకను, నంతిమముగాఁ బరిపాలనవిషయములకు స్వచ్ఛందముగా దూర మగుదురు. కావున దేశభాషా వ్యవహారమున్ను సత్పరిపాలనమున్ను వేఱు కావు.

సూత్రము – 36 : శీఘ్ర వాస్తవ సార్వజనిక సమాచార సర్వస్వపుస్వతంత్ర స్వేచ్ఛా సంచయన వినిమయ వ్యవస్థలకు శాసనామోదము.

వృత్తి :

(అ) శీఘ్ర సమాచారము : తెలిసినదానిని జరుగుచున్నదానితోసరి పోల్చికొని చూచి పర్యాలోచించిన మీఁదటనే యే నిర్ణయమైనను దీసికొనుటసాధ్యపడును. కావునఁ బ్రజాభీష్టమును మఱియుఁ బ్రజాశ్రేయో నాణ్యతనుసమాచార లభ్యతయే తీర్చిదిద్దును. ఆ సమాచారము కట్టిటీవలిదైననే యుపకరించును.
(ఆ) వాస్తవ సమాచారము : సమాచారము గాలివార్తలుగాఁ గాని, కింవదంతులుగాఁ గాని, నీలాపనిందలుగాఁ గాని కాక, శాస్త్రీయమైన మరియుబహిరంగమైన సరిచూడ్కికి వలనుపడు విధమున నుండవలెను.
(ఇ) సార్వజనిక సమాచారము : సమాచారము కేవలము ప్రభుత్వము చేతిలోఁ గాని, యెవరో కొందరు పరపతి గల పెద్దమనుషుల చేతిలోఁ గాని,మేధావుల చేతిలోఁ గాని బందీ కాక, యాబాలగోపాలమునకున్ను నందుబాటులో నుండఁదగును.
(ఈ) సమాచార సర్వస్వము : సమాచారమనునది యేదోయొక ప్రత్యేకవిషయమును గూర్చి కాక, యావన్మానవ జీవిత పరిధి నావరించిన సకలసబ్బండు విషయములను గుఱించినదై యుండఁదగును.
(ఉ) స్వతంత్రత యనఁగా – ఇతరుల శక్తిసామర్థ్యముల మీఁదను, వారిసాధన సంపత్తుల మీఁదను నాధారపడకుండుట.
(ఊ) స్వేచ్ఛ యనఁగా – ఇతరుల సంకల్పబలమునకున్ను , వారిచ్చుననుమతులకున్ను లోఁబడకుండుట.
(ఋ) సమాచార సంచయన కార్యకలాపము మఱియు వినిమయము చట్టరీత్యా సంపూర్ణముగాఁ గాని, పాక్షికముగాఁ గాని నిషిద్ధమైనప్పుడు ప్రజాస్వామ్యము పనిచేయదు.
(ౠ) సమాచార వ్యవస్థలు ప్రభుత్వము చేతిలోఁ గీలుబోమ్మలైనప్పుడు ప్రజాస్వామ్యము పనిచేయదు.
(ఎ) సమాచార వ్యవస్థలను కనుగొననట్టివియు, వానిని వాడికొనుటయెరుఁగ నట్టివియు నైన సమాజములయందుఁ బ్రజాస్వామ్యముండదు.

సూత్రము – 37 : సదసద్వివేకము గల జనబాహుళ్యము.

వృత్తి :

దేశపౌరులందరును కనీసము బడిచదువుల వరకైనను గడతేఱి నఒవారై కుటుంబము, మతము, దేశము, రాజకీయము, వృత్తి మొదలగునన్ని విషయములందును బ్రాథమిక పరిజ్ఞానమును సంపాదించినప్పుడువారు ప్రజాస్వామ్యవ్యవస్థను సక్రమముగా వినియోగపఱచికొనఁగలుగుదురు. అట్లే ప్రజాస్వామ్యమునకు వారున్ను లెస్సగా నుపయోగపడుదురు.ఇచ్చట బాహుళ్యమనుటచేఁ – బ్రజలలోఁ గొంద రవివేకులై యున్నను సైఁపవచ్చునని తాత్పర్యము.

సూత్రము – 38 : ఉదార సంస్కృతి సంప్రదాయములు.

వృత్తి :

(అ) ఒక దేశము ప్రజాస్వామ్యమును దన పరిపాలన వ్యవస్థగా నవలంబించుటకు ముందా దేశము నందు మతసంస్కరణములున్ను, సంఘసంస్కరణములున్ను, వైజ్ఞానిక సాంకేతిక పరిశోధన-ఆవిష్కారములున్ను కనీసము రాజకీయ సంస్కరణములైన జరిగిన చరిత్ర యుండవలెను. వీనిలోదేనిని గాని యెఱుఁగని దేశములలోఁ బ్రజాస్వామ్య మేర్పడదు. అథవా, ఏర్పడినను నిలువఁబడదు.
(ఆ) ఉదారత్వమనఁగా – భిన్నాభిప్రాయ మామోదయోగ్యము కాకపోయినను సహించుట, అనమ్మతి కోర్చుట, విభిన్నాభిరుచులను, అలవాట్లనుఈసడించికొనక ఆదరించుట, క్రొత్తభావములను బరిశీలించుటకు సిద్ధముగా నుండుట, వ్యక్తీకరణములను స్వాగతించుట, విమర్శనములను సోపపత్తికములైన ప్రతివిమర్శనముల తోడనే యెదుర్కొనుట, ప్రభుత్వ వ్యవహారములందే కాక, వివిక్త వ్యవహార ములందు సైతము తెఱుపుడుతనము నవలంబించుట, న్యాయ్యమైన పోటి నాహ్వానించుట మొదలయినవి. ఇవి దొరతనమువారు బళ్ళలోఁ బాఠ్యావళి యందు భాగముగాఁ బ్రవేశపెట్టిన పాఠముల వలనఁగాక యా దేశమునందుఁ దరతరములుగా వచ్చుచున్న మత సంస్కృతిసంప్రదాయముల ద్వారమునఁ బ్రజలకు సంక్రమించినచోఁ గడుం గడు లెస్స.
(ఇ) సంస్కృతియనఁగా – ఒక మానవజాతి వందలాది సంవత్సరమలుగాసంపాదించిన జీవితానుభవ మాధారముగాఁ బరస్పర విరుద్ధావసరములనుబరిణతితో సమన్వయించికొనుచు బ్రతుకఁగలిగిన యొక జీవనకళ.

సూత్రము – 39 : యథాపరాధ దండనము.

వృత్తి :

(అ) అనఁగాఁ – దప్పునకుఁ దగిన తప్పనిసరి శిక్ష. నేరస్థులను దగినట్లు సకాలములో శిక్షింపని యెడల ననతికాలములో యావద్ వ్యవస్థయునేరపూరితముగాఁ బరిణమించును. నేరస్థులు స్వయముగా నాయకులగుదురు. అట్లగుటం జేసి ప్రజలు నెమ్మదిగా మందిమన్నియమునందునమ్మిక కోల్పోవుదురు. కనుకఁ బ్రజాస్వామ్య మేర్పడుటకు ముందునుండియే నేరస్థుల పట్ల దయలేని సంస్కృతిదేశమునం దుండవలెను.

సూత్రము – 40 : స్వతంత్ర ప్రజాస్ఛౌుంములు.

వృత్తి :

ప్రజాస్వామ్య మేర్పడుటకు ముందునుండియు దేశములో ననధికారులు నెలకొల్పి నడుపుచున్న స్వచ్ఛందసంస్థలు కొన్ని యుండవలె ను.అట్టివి సంగీత కచ్చేరిలో ప్రధాన వాద్యమునకుఁ బ్రక్కవాద్యముల వలెఁ బ్రజాస్వామ్య గాంధర్వపు శ్రావ్యత నినుమడింపఁజేయును. ప్రభుత్వ మన్నింటఁదానే యయి నడుపు దేశ మునం దెన్నికల వ్యవస్థ యెంత యద్భుతముగానున్నను, అచ్చటఁ బ్రజాస్వామ్యము పాక్షికమే యగును.

Posted in వ్యాసం | Tagged | Comments Off on మందిమన్నియమ్ -4

తూర్పూ పడమర

కొవ్వలి సత్యసాయి
      ………………….. ……….                

కొత్తపాళీ గారిని రానారె చేసిన ఇంటర్వ్యూను ప్రచురించిన తరువాత బ్లాగరులు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనను అమలు చేసాం. కొరియా కబుర్లతో నెజ్జనులను అలరించిన కొవ్వలి సత్యసాయి గారిని, కొత్తపాళీ గారిని కబుర్లు చెప్పుకోమన్నాం. గూగుల్ టాక్‌తో ప్రాక్పశ్చిమాలకు వారధి నిర్మించి వారిద్దరూ మాటలు కలిపారు. వారి కబుర్లలో మొదటి భాగం వినండి.

———

సత్యసాయి: good morning/evening
కొత్తపాళీ: I’m here now
సత్యసాయి: నేనుసైతం
కొత్తపాళీ:
సత్యసాయి: మీ ప్రశ్నలు చూసా
కొత్తపాళీ: చెప్పండి.
సత్యసాయి: ఇద్దరం ఆప్రశ్నలకి సమాధానం చెబితేబాగుంటుంది.
కొత్తపాళీ: అలాగే ..
కొత్తపాళీ: ఒక సంభాషణ లాగానూ సాగితే బాగుంటుంది.
సత్యసాయి: ఆనక నేను కొన్ని ప్రశ్నలుమిమ్మల్ని అడగాలని ఉంది.
సత్యసాయి: అవును
కొత్తపాళీ: తప్పకుండ అడగండి.
కొత్తపాళీ: మీరు ఏ సంవత్సరంలో మొదటి సారి కొరియా వెళ్ళారు?
సత్యసాయి: నేను కొరియా అంటే తూర్పు, మీరు అమెరికా అంటే పశ్చిమం
కొత్తపాళీ: yup
సత్యసాయి: 2005 ఫిబ్రవరి చివర నేను కొరియాలో అడుగు పెట్టా
కొత్తపాళీ: సకుటుంబ సమేతంగానా?
సత్యసాయి: కాదండి, ఏకో నారాయణలా
కొత్తపాళీ: దిగటం ఏవూళ్ళో దిగారు మొట్టమొదట?
సత్యసాయి: సౌల్ లో
సత్యసాయి: అప్పుడు అక్కడ శీతాకాలం
కొత్తపాళీ: మీరు పనిచేసిన విశ్వవిద్యాలయం (వివి) కూడా అక్కడేనా?
సత్యసాయి: అవును. విమానాశ్రయానికి 60 కిమీ దూరంలో
కొత్తపాళీ: విమానం దిగాక మరీ ఎక్కువ ప్రయాణం లేదన్న మాట
సత్యసాయి: దాని పేరు కోన్ కుక్. అంటే జాతిపునర్నిర్మాణం అని అర్ధం
కొత్తపాళీ: అదేలేండి, మీ ఈమెయిలు సంతకంలో చూశాను.
కొత్తపాళీ: ఈ వెధవ అమెరికా వచ్చాక అమెరికనులకి లాగానే ఏ దేశం ఎక్కడ ఉందో సరిగ్గా గుర్తొచ్చి చావదు, ద. కొరియా అంటే శీతాకాలం మంచుకురిసే చలిగా ఉంటుందా?
సత్యసాయి: అక్కడ శీతాకాలంలో -220 డి. సెంటీగ్రేడ్ దాకా పోతుంది
కొత్తపాళీ: దిగంగానే ఎలా అనిపించింది? విమానాశ్రయంలో సిస్టంసూ అవీ ఎఫిషియెంట్ గా ఉన్నాయా?
సత్యసాయి: అంతా కొత్త కొత్తగా. ఆఁ
సత్యసాయి: మీ అప్పటి ఫీలింగ్స్ గుర్తున్నాయా?
కొత్తపాళీ: నేను దిగి చాలా ఏళ్ళయింది కదా, అందుకని స్పష్టంగా గుర్తు లేదు. నేను దిగడం ఫిలడెల్ఫియా నగరంలో అక్టోబరు నెల మొదట్లో.
కొత్తపాళీ: అంతా వింతగా ఉండటం, కుతూహలంగా ఉండటం గుర్తుంది.
సత్యసాయి: విశ్వవిద్యాలయం (వి.వి.) నుండి ఒకావిడ, ఒక రిటైర్డు ప్రొఫ్. వచ్చారు.
సత్యసాయి: ఆయన పేరు కిం. (kim)
కొత్తపాళీ: కిం అనేది చాలా కామన్ పేరు అనుకుంటా. నేను చదివిన వివిలో నా లాబులోనే పనిచేసే సహవిద్యార్ధి ఉండేవాడు “హహ్” అని
సత్యసాయి: అవును 50 శా. కిమ్ములే
సత్యసాయి: తర్వాత పార్కులు (Park)
కొత్తపాళీ: వివిలో కాస్త ఎవడన్నా ఇంట్రస్టు చూపిస్తే చాలు, వాడికి ఇండియా గొప్పతనం గురించి సుత్తి కొట్టేస్తుండేవాణ్ణి. 
సత్యసాయి: మీరు వెళ్ళిన నాటికి అక్కడ ఇండియా గురించి బాగానే తెలిసుండాలే?
కొత్తపాళీ: అప్పట్లో అంత తెలీదు. ఇది 1990లో.
కొత్తపాళీ: ఇప్పుడైనా జనాంతికంగా తెలిసేది అపోహలే, నిజాలు కాదు.
కొత్తపాళీ: అలాగా? కొరియా వాళ్ళకి చింతన ఎక్కువన్న మాట, పేరులోనే ప్రశ్నార్ధకాన్ని పెట్టుకున్నారు కదా? 
సత్యసాయి: హ… హ.. హ..
సత్యసాయి: నేను అక్కడి వాళ్ళకి కిం అంటే అర్ధం చెప్పేవాడిని. వాళ్ళు నిజంగా ప్రశ్నార్ధకాలే
కొత్తపాళీ: ఎందుకలా??
సత్యసాయి: వాళ్ళ పురోగతి, వాళ్ళకి తమ వారసత్వం అంటే ఉన్న గర్వం (అభిమానం) – రెండు విభిన్న తత్వాల మేళవింపు
సత్యసాయి: they describe their country- where modernity meets tradition- అని వర్ణించుకొంటారు.
కొత్తపాళీ: బాగుంది. పాతనీ కొత్తనీ కొంతవరకూ మేళవించుకో గలిగారన్నమాట.
సత్యసాయి: అమెరికా లాంటి దేశాలు 200 యేళ్ళలో అధిక శ్రమ ప్రయాసలతో సాధించిన ప్రగతి వీళ్ళు 40-50 యేళ్ళల్లో అవలీలగా పొందారు
కొత్తపాళీ: వివిలో మీ మొదటి రోజు ఎలా గడిచింది. భాష ఇబ్బందులూ, సంస్కృతి ఇబ్బందులూ ..
సత్యసాయి: నేను ఆ దేశం గురించీ, అక్కడి నాజీవితం గురించీ ఏరకమైన ఆశలూ( ఎక్స్పెక్టేషన్) లేకుండా వెళ్ళా. కాబట్టి అక్కడ ఇమడడం పెద్ద కష్టం కాలే
కొత్తపాళీ: బహుశా మనది కాని దేశం ఎక్కడికి వెళ్ళినా అది మంచి ఫిలాసఫీ అనుకుంటా ఫాలో అవడానికి
కొత్తపాళీ: రెం. ప్ర. యుద్ధంలో జపాను చేతిలో వీళ్ళు చాలా బాధలు పడ్డారేమో కదా?
సత్యసాయి: 33 యేళ్ళచెర
కొత్తపాళీ: 33 ఏళ్ళ చెర ఏంటి, జపానుకా??
సత్యసాయి: కొరియాకి
సత్యసాయి: ఇప్పటికీ వాళ్ళు పడినబాధల జ్ఞాపకాలు వీళ్ళని వెంటాడుతున్నాయి
కొత్తపాళీ: యుద్ధ మెమోరియల్ లాంటివేమైనా ఉన్నాయా?
సత్యసాయి: యుద్ధసమయంలో జపాను సైనికుల వినోదం కోసం కొరియన్ ఆడవాళ్ళని శిబరాల వద్ద చెర పట్టి ఉంచారట
కొత్తపాళీ: చాలా అమానుష కృత్యాలు జరిగాయి ఆ సమయంలో ..
సత్యసాయి: ఇప్పటికీ ఆ ఆడవాళ్ళకి నష్టపరిహారం విషయం నలుగుతోనే ఉంది. వీళ్ళకీ, జపానుకి చాలాయేళ్ళు సంబంధాలు లేవు.
కొత్తపాళీ: సరే హిస్టరీ వదిలెయ్యండి, వ్యక్తిగత అనుభవంలోకి వద్దాం మళ్ళీ.
కొత్తపాళీ: మీ మొదటి రోజుల అనుభవాలు చెప్పండి. వివిలో అందరూ ఇంగ్లీషు మాట్లాడుతారా?
కొత్తపాళీ: బయట కూరగాయలూ, పచారీ ఎలా కొనుగోలు చేసే వారు? అమెరికా లాగా పేద్ద సూపర్ మార్కెట్లా?
సత్యసాయి: మనుషులు మన ఈశాన్య భారతీయుల్లాగా ఉంటారు. భాష కొరుకుడు పడదు. ఆంగ్లం చాలా తక్కువమంది మాట్లాడతారు. వాళ్ళకి సిగ్గు ఆంగ్లంలో మాట్లాడడానికి. ఇండియాలో అందరూ ఇంగ్లీషులో ఘనాపాఠీలని నమ్మకం
కొత్తపాళీ: అలాగని మన ఇండియన్లకి కూడా నమ్మకమే కదా? 
సత్యసాయి: మనకి మాతృభాషమీదే పట్టు లేదు- ఇంకా ఆంగ్లంలో కూడానా
కొత్తపాళీ: మొదట్లో you speak Englih well అని ఇక్కడ వాళ్ళంటే పొంగి పోయేవాణ్ణి.
కొత్తపాళీ: తరవాత్తరవాత వొళ్ళు మండడం మొదలెట్టింది.
సత్యసాయి: ఎందుకలా
కొత్తపాళీ: ఇప్పుడెవరన్నా అలాగంటే “So do you! అని ఆశ్చర్యంగా మొహం పెడతా. 
కొత్తపాళీ: ఒక రకంగా అది కూడా డిస్క్రిమినేషనే కదా
సత్యసాయి: ఐసీ
కొత్తపాళీ: మరి ఎలా మేనేజ్ చేశారు?
సత్యసాయి: మునగ కుండా ఉండడానికి ఒక గడ్డి పరకైనా చాలు కదండీ
కొత్తపాళీ: అంటే?? అర్ధం కాలే!
సత్యసాయి: ఎవరో ఒకరిద్దరికి ఇంగ్లీషొచ్చు- దాంతో పని జరిపించేసా.
సత్యసాయి: అన్నట్లు ఆ వివి లో 8-10 దాకా భారతీయులున్నారు
కొత్తపాళీ: అలాగా? చదువుకుంటూ? ఉద్యోగానికై?
సత్యసాయి: రెండూ. అందులో పండా అనే ఆయన ఒకరు. మొదటిరోజే కలిసాడు
కొత్తపాళీ: మీరు పాఠం కూడా చెప్పేవారా? కేవలం పరిశోధనేనా?
సత్యసాయి: రెండూనూ. పాఠం అసలు. పరిశోధన కొసరు.
కొత్తపాళీ: విద్యార్థులు ఆసక్తిగా ఉండేవాళ్ళా?
సత్యసాయి: చాలామర్యాదస్తులు. అర్ధంకాకపోయినా ఊరుకునేవారు.
కొత్తపాళీ:
సత్యసాయి: మాకు మంచి బంధం కలిసింది. ముఖ్యంగా కొందరు నేను చెప్పిన కోర్సులన్నీఅటెండయ్యారు.
కొత్తపాళీ: అటువంటి అనుబంధం బలే తృప్తినిస్తుంది కదా!
కొత్తపాళీ: అవును, నాకు పరిచయమైన ఇద్దరూ చాలా మర్యాదస్తులు.
కొత్తపాళీ: అమెరికన్లు అంతా కలుపుగోలుగా ఉంటారనుకుంటామా?
కొత్తపాళీ: కాస్త స్నేహం కలిస్తే గానీ ఫ్రీ గా మాట్లాడరు.
కొత్తపాళీ: మీ శ్రీమతీ, చిరంజీవులూ ఎప్పుడు చేరారు?
సత్యసాయి: వాళ్ళు సెలవలకొచ్చారు
సత్యసాయి: నెలా, నెలాచొప్పున 2 నెలలు – 2 సార్లు
కొత్తపాళీ: అలాగా? చాలా సంతోషం.
సత్యసాయి: మా ఆవిడ మొదట రానంది, అమెరికానో, యూరోపో సరే కానీ కొరియాలో ఏముందీ అని
కొత్తపాళీ: ఏం చెప్పి ఒప్పించారు?
సత్యసాయి: అప్పటికే నేను కొరియాతో ప్రేమలో పడ్డా. కొరియన్ తో కాదు -గమనించండి. 
కొత్తపాళీ: అదే అనబోతున్నా.
కొత్తపాళీ: అక్కడ మనుషుల్లో కానీ, సమాజంలో కానీ మీకు బాగా నచ్చిన లక్షణం ఏవిటి?
సత్యసాయి: అమెరికా, యూరోపుల గురించి విన్నాం, ఫోటోలు చూస్తోనే ఉన్నాం
కొత్తపాళీ: నాకు అమెరికాలో బాగా నచ్చింది వీళ్ళు తమ దేశాన్ని గురించి పడే తాపత్రయం.
కొత్తపాళీ: అంతే కాక, స్థానిక సంస్థలకి (అంటే మునిసిపాలిటీ, గ్రామ కౌన్సిల్) వంటి వాటికి ఉండే ప్రాముఖ్యత.
సత్యసాయి: అక్కడ ప్రతీదీ మన ఊహకి అందుతుంది కానీ కొరియా గురించి మనకి తెలియక పోవడం వల్ల మనం బాగా ఆనందించవచ్చని…
కొత్తపాళీ: ఒక ఉదాహరణ చెప్పండి.
సత్యసాయి: ఇక్కడికి వచ్చి చూసాకా ఆవిడ – బలే ఇంప్రెస్సయి పోయి వదలలేక వదలలేక వెళ్ళింది
కొత్తపాళీ: అలాగా? చాలా సంతోషం.
సత్యసాయి: ఇక్కడ మన సంస్కృతిఛాయలు కనిపిస్తాయి. (ఓరియంటల్).
సత్యసాయి: అమెరికాలోని అభివృద్ధి సౌకర్యాలు సరేసరి
సత్యసాయి: ఇక్కడ చాలా బౌద్ధాలయాలున్నాయి. నేను చాలా వాటిని చూసా.
కొత్తపాళీ: బౌద్ధాన్ని జనం ఇంకా ఫాలో అవుతున్నారా? సంతోషం.
కొత్తపాళీ: నగరంలో కార్లు విపరీతంగా ఉంటాయా? ప్రతి వాళ్ళకీ కారుంటుందా?
సత్యసాయి: ప్రతీ ఇంటికీ రెండు, మూడు కూడా
కొత్తపాళీ: రోడ్లు పార్కింగు తదనుగుణంగా అభివృద్ధి చెందినాయా?
సత్యసాయి: యే… (అంటే కొరియాలోఅవును అని)
సత్యసాయి: అక్కడి వాళ్ళలో నాకు ముఖ్యంగా నచ్చినది – సమయపాలన, ఇతరుల సమయాన్ని కూడా గౌరవించడం, తమ దేశంపట్ల గౌరవం
కొత్తపాళీ: అవును, అటువంటి ప్రవర్తన నేనూ ఇక్కడ గమనించా.
సత్యసాయి: అక్కడ మొదటి రోజు హాస్టల్లో పార్టీఇచ్చారు- తాజామనుషుల (freshmen party) గౌరవార్ధం
సత్యసాయి: నా సహోద్యోగి నడిగా శాకాహారముందా అని
కొత్తపాళీ: ఆహాఁ
సత్యసాయి: ఆవిడ నాదగ్గర పెట్టిన కర్రీలోపలికి తీసుకు పోయి
కొత్తపాళీ: అందులోంచి ముక్కలు ఏరేసి తెచ్చిందా? 
సత్యసాయి: తిరిగి వచ్చి అది మాంసాహారం నీకు వేరే వస్తుంది అని చెప్పింది
సత్యసాయి: ఆనక అచ్చం అలాంటిదే తీసుకు వచ్చి ఇది శాకాహారం అని ఇచ్చారు.
కొత్తపాళీ: అందులోంచి ముక్కలు ఏరేసి తెచ్చిందా?
సత్యసాయి: తెలీదు- కానీ నేను ఆవిడ మీద నమ్మకముంచి (వేరేగతిలేక) తినేసా. బానే ఉంది. కాస్త కడుపు నిండింది.
కొత్తపాళీ: ప్రాణ విత్త మాన భంగమందు లాగా .. 
సత్యసాయి: ఆచారం మీద ప్రేమ తక్కువా, బ్రతకడం మీద ఎక్కువా అవడంతో అడపా దడపా రెస్టారెంటులకి వెళ్ళా వాళ్ళతో:-)
కొత్తపాళీ: మీ ఫిలాసఫీ నచ్చింది నాకు
సత్యసాయి: నా శాకాహారం అందరికీ మంచి టాపిక్
సత్యసాయి: మాంసాహరం తినేవాళ్ళు కూడా అక్కడ తినడం కష్టం
కొత్తపాళీ: అలాగా? చేపలూ, ఆక్టోపస్సులో పెట్టి ఇది శాకాహారమే అని నమ్మించే ప్రయత్నం చెయ్యలేదా ఎవరూ?
సత్యసాయి: ఆరకంగా కొంటె తనం లేదు- కానీ వాళ్ళకి కాన్సెప్ట్ తెలియక చేపలు శాకాహారం అనుకునే వారు
కొత్తపాళీ: మాకు వివి పక్కల రోడ్ల మీద భోజన ట్రక్కులు ఉండేవి.
సత్యసాయి: అక్కడ ఆరోజుల్లో మన భోజనం దొరకేదా
కొత్తపాళీ: పక్కనే ఉన్న పెన్సిల్వేనియా వివిలో అయితే ఒక భారత భోజన ట్రక్కు కూడ ఉండేది
సత్యసాయి: అదృష్టం
కొత్తపాళీ: ఆఁ, నేను వచ్చేప్పటికి మన భోజనం విరివిగానే దొరుకుతుండేది.
కొత్తపాళీ: మేముండే చోటికి దగ్గర్లోనే ఒకటికి మూడు భారత పచారీ కొట్లు ఉండెవి.
కొత్తపాళీ: ఇక్కడ బిబింబాప్ అని ఒక కొరియన్ వంటకం పెడతారు.
సత్యసాయి: అవును అది నా ఫేవరెట్. అందులో ముఖ్యంగా నువ్వుల నూనెవాడతారు. కూరముక్కలతో కావాలంటే యాచే బిపింబాప్ అని అడగాలి
కొత్తపాళీ: నాక్కూడా చాలా ఇష్టం, ఏనార్బర్లో ఉన్న కాలంలో
కొత్తపాళీ: ఇక్కడి వెర్షను వెజ్జీనే డీఫాల్టు. మాంసం కావాలంటే ఏది కావాలో అది సెపరేటు. ఇంచుమించు ఓరియెంటల్ రెస్టరాంట్లన్నిట్లో ఇదే పద్ధతి.
సత్యసాయి: బాప్ అంటే అన్నం అని
కొత్తపాళీ: ఓ, అలాగా? నా nickname Nasy అంటే ఇండోనీష్యన్ భాషలో అన్నం ట!
కొత్తపాళీ: సుషి కూడా బాగా తింటారా అక్కడ?
సత్యసాయి: సుషి అంటే
కొత్తపాళీ: సుషి అంటే పచ్చి చేపల ముక్కల్ని తరిగి వడ్డించే జపనీయ పద్ధతి. దానికంతా ఒక పెద్ద కళ, శాస్త్రం ఉంది – ట.
సత్యసాయి: అవును విన్నా
సత్యసాయి: తాజా చేపలు తినడం కోసం జనాలనే సముద్రం లోపలికి తీసుకెళ్తారని విన్నా.
కొత్తపాళీ: అటువంటి పిచ్చ ఇక్కడ oysters, crabs & lobsters కి ఉంటుంది.
కొత్తపాళీ: మీరేదో అడుగుతానన్నారు, అడగండి.

(మిగతాది వచ్చేవారం)

Posted in వ్యాసం | Tagged | 2 Comments

ఎడిటింగ్ – ఒక ప్రస్తావన

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

ఉపోద్ఘాతం

సెకండుకి ఇరవై నాలుగు నిశ్చల చిత్రాలను తెరపై ప్రదర్శించి, ప్రేక్షకుల కళ్ళకు కదిలే బొమ్మలు చూస్తున్నట్టుగా భ్రమ కలిగించడమే సినిమా లేదా చలన చిత్రం అనే ప్రక్రియ అని ఈ రోజుల్లో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. మొట్ట మొదట ఈ ప్రక్రియ కేవలం దైనందిన దృశ్యాలను కెమెరా ద్వారా రికార్డు చేసి తెరపై ప్రదర్శించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్ళకు స్టేజిపై ప్రదర్శించే నాటకాలనూ, సర్కస్ ప్రదర్శనలనూ కెమెరాలో రికార్డు చేసి ఒక్కో ప్రదర్శననూ ఎన్నోసార్లు, ఎన్నో ప్రదేశాల్లో ప్రదర్శించే అవకాశం కలుగచేసింది ఈ ప్రక్రియ. కాకపోతే ఒక సారి కెమెరా రికార్డు చేయడం మొదలుపెట్టాక అవిఛ్ఛిన్నంగా ఎంతసేపు కావాలంటే అంతసేపు రికార్డు చేయడం కుదరదు. ఆరోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఒకే సారి పది నిమిషాలకంటే ఎక్కువ నిడివి కల ఘట్టాన్ని రికార్డు చేయడం కుదరదు. అందుకు కారణం ఒక పిల్ము రీలు కేవలం పదినిమిషాల నిడివి కలిగి వుండడమే. మొదట్లో ఇది ఒక అంతరాయం అనిపించినప్పటికీ రాను రాను ఈ అడ్డంకే సినిమా అనే ప్రక్రియ ఒక కళ గా రూపొందడానికి దోహదం చేసింది. పదినిమిషాలకు మించిన ఒక ఘట్టాన్ని ఏకబిగిన చిత్రించడం సాధ్యం కాదు కనుక రెండు లేదా మూడు దఫాలుగా చిత్రీకరించి, ఆ రీళ్ళను ఒక దాని తర్వాత ఒకటిగా అనుసంధించి, నిరంతరంగా ప్రదర్శించడం ద్వారా పైన పేర్కొన్న సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.

అయితే ఈ ప్రక్రియలో వారు సినిమాలోని ఒక ఘట్టాన్ని ఏకబిగిన చిత్రీకరించక్కర్లేదని, ఒక్కోఘట్టాన్ని వివిధ పాత్రల దృష్టికోణంలో చిత్రీకరించి వాటిని ఒక పధ్ధతి ప్రకారం అనుసంధానించడం ద్వారా ప్రేక్షకుల్లో కొత్త అనుభూతలను కలుగచేయొచ్చని తెలుసుకున్నారు. మరో విశేషమేమిటంటే రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరిగే ఘట్టాలను ఒక పధ్ధతి ప్రకారం మిళాయించడం ద్వారా ప్రేక్షకుల్లో ఉత్కంఠతను కలుగచేయొచ్చనీ తెలుసుకున్నారు. ఈ ప్రక్రియనే ఎడిటింగ్ అని పేర్కొన్నారు.


ఉదాహరణ:

ఒక ప్రదేశంలో ఇద్దరు దొంగలు దొంగతనం చేసే ఘట్టం జరుగుతుందనుకోండి.కానీ వారు దొంగతనం చేస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు వీరికోసం పోలీసు స్టేషన్ నుంచి జీపులో బయల్దేరడం మరో ఘట్టం గా ఊహించుకుంటే. ఎడిటింగ్ అనే ప్రక్రియ ద్వారా దొంగలు ఇంట్లోకి జొరబడడం, ఆ తర్వాత పోలీసులు హడావుడిగా పోలీసుస్టేషన్ నుంచి బయటకు రావడం, దొంగలు చీకట్లో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోని బీరువా దగ్గరగా నడవడం, పోలీసు జీపు వేగంగా రోడ్డు పై ప్రయాణిస్తుండడం, దొంగలు బీరువా తాళం తెరవడంలో సతమతమవడం, వేగంగా వెళ్తున్న పోలీసు జీపుకి ఒక గొర్రెల మంద అడ్డురావడంతో సడన్ బ్రేక్ వేయడం, దొంగలు బీరువా తాళం తెరవడం, పోలీసులు దొంగతనం జరిగే ప్రదేశానికి చేరుకోవడం ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా రెండు వేర్వేరు సన్నివేశాలను సమీకరించి ఏకీకరించడం అనే భావన కేవలం ఎడిటింగ్ వల్లనే సాధ్యమవుతుంది. అందుకే ఎడిటింగ్ అనేది సినిమా అనే ప్రక్రియకు అత్యంత ఉపయోగకరమైనదీ మరియు ఆసక్తి కరమైనదీ కూడా.

గతంలో పొద్దులో ప్రచురించిన మరో వ్యాసంలో ప్రస్తావించబడిన ఒక ఉదాహరణ ద్వారా మరో సారి ఇక్కడ ప్రస్తావించడం ద్వారా ఎడిటింగ్ యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకోవచ్చు.

“సినిమాలో ఎడిటింగ్ యొక్క పాత్రను తెలుసుకోవాలంటే Lev Kuleshov చేసిన ప్రయోగం గురించి మనం తెలుసుకోవాలి. ముందు ఒక పాత్రలో వుంచిన వంటకాన్ని చూపించి ఆ తర్వాత ఒక వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి ఆకలి గొన్న వాడిగా బాగా నటించాడని చెప్పారట. ఆ తర్వాత ఒక అందమైన అమాయి చిత్రం చూపించి ఆ వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి కాంక్ష కలిగిన వాడిగా బాగా నటించాడని చెప్పారట. అలాగే ఒక చనిపోయిన వృధ్ధ స్త్రీ శవపేటిక చూపించి ఆ తర్వాత ఆ వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి శోకం కలిగిన వాడిగా బాగా నటించాడని చెప్పారట. నిజానికి పైన ఉదహరించిన మూడు దృశ్యాలలోనూ చూపిన వ్యక్తి మొహంలో ఎటువంటి హావభావాలు లేనప్పటికీ అంతకు ముందు చూసిన దృశ్యానితో అనుసంధానించి చూడబట్టే ప్రేక్షకులు ఒకే దృశ్యాన్ని మూడు రకాలుగా అనువదించుకునారని Lev Kuleshov తన ప్రయోగం ద్వారా నిర్ధారించారు.”

ఎడిటింగ్ లోని వివిధ అంశాలు:

ఎంపిక:

ఒక ఎడిటర్ ముఖ్యంగా చేసే పనుల్లో ఒకటి ఎంపిక. ఒక సన్నివేశాన్ని వేర్వేరు కోణాల్లో, వేర్వేరు పాత్రల దృష్టికోణాల్లో, చిత్రీకరిస్తారని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఒక సన్నివేశాన్ని వేర్వేరు సార్లు, టేక్ ల రూపంలో కూడా చిత్రీకరించడం కూడా జరుగుతుంది. ఒక సన్నివేశంలో ఒక నటుడు సరిగ్గా నటించకపోవచ్చు, లేదా దర్శకుడు అనుకున్నట్టుగా లైటింగ్ కుదరకపోవచ్చు, లేదా అదే సన్నివేశాన్ని మరో రకంగా చిత్రీకరించొచ్చనే భావన దర్శకునికి కలుగ వచ్చు. పైన పేర్కొన్న కారణాలచేత ఒకే సన్నివేశం వేర్వేరు సార్లు (ఒక్కోసారి నలభై, యాభై సార్లు కూడా) చిత్రీకరించాల్సి రావొచ్చు. అయితే వీటన్నింటిలో మనకి సినిమాలో కనిపించేవి కొన్ని మాత్రమే. అయితే వాటన్నింటిలో దేన్ని సినిమాలో చేర్చాలో, ఏది చెత్తబుట్టలోకి చేరాలో మాత్రం ఎంపిక చేసేది మాత్రం ఎడిటర్ మాత్రమే. వినడానికి ఈ ఎంపిక సులభంగానే అనిపించినా ఒక్కోసారి ఇది అత్యంత కష్టంతో కూడుకున్న పని.

ఉదాహరణకు Apocalypse Now అనే సినిమా కోసం రికార్డు చేసిన సినిమా రీలు నిడివి దాదాపు వంద గంటల పైనే. కానీ ఆ వంద గంటల నుంచి మనం తెరపై చూసేది కేవలం మూడు గంటలు మాత్రమే. అంతటి నిడివి గలిగిన footage నుంచి మూడు గంటల సినిమాని తయారు చేయడంలో ఎడిటర్ Walter Murch పాత్ర ఎంతో వుందని ఆ చిత్ర దర్శకుడు Francis Ford Coppolla నే స్వయంగా ఒప్పుకుంటారు. అన్ని సినిమాల్లో ఇలాంటి పరిస్థితి వుండకపోవచ్చు. కానీ ఎలాంటి సినిమాకి ఐనా ఎంత లేదన్నా కనీసం రెండు లేదా మూడు టేక్‌ల నుంచి ఒక దాన్ని ఎన్నుకోవడమనే బాధ్యత ఎడిటర్ మీదే వుంటుంది. అయితే ఆ ఎంపిక కేవలం నటీనటుల నటన మీదే ఆధారపడివుండదు. ఎన్నుకున్న షాట్ అంతకుముందు షాట్ లోని లైటింగ్‌కి సరిపోయేలా వుండాలి. అలాగే అంతకుముందు షాట్, మరియు తర్వాత వచ్చే షాట్ లతో ఎన్నుకున్న షాట్ జ్యామితి నియమాలకు అనుగుణంగా కూడా వుండాలి.

ఉదాహరణకు మొదటి షాట్లో ఇద్దరు దొంగలు పారిపోతున్నట్టుగా తెర ఎడమవైపునుంచి కుడివైపుగా పరిగెడ్తున్నట్టుగా చూపించి, ఆ తర్వాతి సీన్లో పోలీసులు వీరిని వెంటాడుతూ తెర కుడివైపుగా నుంచి ఎడమవైపుగా పరిగెట్టడం చూపించడం చాలా తప్పు. అలా చేస్తే దొంగలు, పోలీసులు ఎదెరెదురుగా పరిగెడ్తున్నట్టుగా ప్రేక్షకుల్లో భావన కలుగుతుంది. అలాగే ఒక షాట్ ని ఎంపిక చేసేటప్పుడు ఎడిటర్ దృష్టిలో వుంచుకునే మరికొన్ని అంశాలున్నాయి. అవే పొందిక, అవిఛ్ఛిన్నిత, మరియు లయ.

పొందిక :

సినిమా అనే ప్రక్రియ ఉధ్బవించిన రోజుల్ల్లో ఒక సన్నివేశంలో ఒక పాత్ర మాట్లాడుతున్నప్పుడు మరో పాత్రవైపు కెమెరా మళ్ళిస్తే సినిమా హాల్లోని ప్రేక్షకులు గొడవ చేసేవారని విన్నాను. అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ప్రేక్షకులు అలా చేయడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. ఏ పాత్రైతే సంభాషిస్తుందో ఆ పాత్ర కనిపించకుండా మాటలు వినిపించడం అప్పట్లో కొత్త కావడమే అందుకు కారణం. కానీ రాను రాను సినిమా చూడ్డానికి అలవాటు పడిన ప్రేక్షకులు అలాంటి వాటిని జీర్ణించుకోవడం సాధ్యమైంది. ఒక వ్యక్తి చేసే సంభాషణే కాకుండా అది వినే అవతలి పాత్ర స్పందన కూడా అవసరమైనప్పుడు పైన చెప్పినట్టు సన్నివేశాన్ని చిత్రీకరించినా ఇప్పుడు ప్రేక్షకులు అర్థం చెసుకోగలరు. కానీ ఆ సన్నివేశంలో లేని పాత్ర అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమైతే మాత్రం ప్రేక్షకులు తికమక పడడం జరిగే అవకాశం వుంది. అందుకే ఎడిటర్ తను ఎన్నుకునే షాట్లు ఒకదానితో ఒకటి పొందికగా అమర్చడం జరుగుతుంది.

అవిఛ్చిన్నిత :

పాత రోజుల్లో వచ్చిన చాలా సినిమాల్లో ప్రస్తుతాన్నుంచి గతంలోకి వెళ్ళే flashback సన్నివేశాల్లో రింగులు రింగులు తిరుగుతూ ఒక సన్నివేశాన్నుండి మరో సన్నివేశానికి వెళ్ళడం చూసేవుంటారు. అలా చేయడానికి ముఖ్య కారణం ప్రేక్షకుల మదిలో స్థాన భ్రంశం అకస్మాత్తుగా కలిగినట్టుగా కాకుండా నెమ్మదిగా ఆ విషయాన్ని తెలియపర్చడం కోసమే. అంటే అక్కడ పాత్రలు, మరియు ప్రదేశంలో జరిగిన పరివర్తన అకస్మాత్తుగా కాకుండా అవిఛ్ఛిన్నంగా జరుగుతుందన్న మాట. ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఆ ప్రక్రియ దాదాపుగా అంతమైనప్పటికీ ఈ పరివర్తన మాత్రం కొత్త పధ్ధతుల్లో ప్రేక్షకులకు తెలియచేస్తున్నారు. ఉదాహరణకు ఒక పాత్ర యొక్క కంట్లోకి zoom చెయ్యడం ద్వారానో, లేదా వర్తమానంలోని సన్నివేశంలో ఆకాశం వైపుకి కెమెరా మళ్ళించి తిరిగి గతంలో జరిగే సన్నివేశం ఆకాశం వైపునుంచి కెమెరాను నేలకు మళ్ళించడం ద్వారానో సమయం మరియు స్థలాలలో జరిగిన మార్పుని ప్రేక్షకులలో భ్రమింపచేస్తారు. వాడిన ప్రక్రియ ఏదైనప్పటికీ అందులోని ఆశయం మాత్రం ఒక్కటే: ప్రేక్షకులలో అవిఛ్ఛిన్నమైన అనుభూతిని కలుగచేయడమే!

లయ :

సినిమాలు రకరకాలు. కొన్ని నేర ప్రధానంగానూ, కొన్ని హాస్య ప్రధానంగానూ, కొన్ని ప్రేమ ప్రధానంగానూ నడుస్తాయి. అయితే అన్ని రకాల సినిమాలనూ ఒకేలాగా ఎడిట్ చేయడం కుదరదు. జైలు నుంచి పారిపోయిన నేరస్థుని పట్టుకునే కథ ప్రధానంగా నడిచే సినిమా వేగంగా వుండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అలాగే ఒక కుటుంబంలో జరిగే కలతల ఆధారంగా జరిగే కథలో నడక నెమ్మదిగా వుండాలని కోరుకుంటారు ప్రేక్షకులు. గత వందేళ్ళకు పైగా వచ్చిన సినిమాలను చూడగా ఏర్పడిన collective consciousness అది. అందుకే ఒక్కో రకం సినిమాలో ఒక్కో రకమైన వేగం వుండేలా ఎడిటర్ భ్రమ కలిగిస్తాడు. నేరస్తుడిని వెంటాడి పట్టుకునే సినిమాలో చివరి సీను ఊహించుకుందాం. చాలా ఏళ్ళుగా దొరకని నేరస్తుడిని ఎలాగో వెంటాడి బాగా ఎత్తైన ఒక కట్టడం మీదకు చేరుకుంటారు పోలీసులు. అక్కడ నేరస్తుడికి పారిపోయే మార్గమే లేదు. ఆ ఎత్తైన కట్టడం నుంచి దూకడమా, లేదా పోలీసులకు దొరకడమా? అలాగే పోలీసులకూ అతన్ని ప్రాణాలతో పట్టుకుంటేనే ఉపయోగం. ఇలాంటి సన్నివేశం బాగా ఎడిట్ చేస్తే ప్రేక్షకుల్లో అత్యంత ఉత్కంఠతను కలుగ చేయవచ్చు.ఉదాహరణకు ఈ కింది షాట్లు చూడండి:

1) పోలీసులనుంచి పారిపోయి అలసిపోయిన నేరస్థుడు చివరి అంతస్థు చేరి పిట్టగోడ మీది నుంచి క్రిందికి చూడడం.

2) అప్పుడే చివరి అంతస్తుకు చేరుకున్న పోలీసులు.

3) పోలీసులను చూసి కలవరపడ్డ నేరస్తుని రియాక్షన్ (క్లోజప్)

4) అతని రియాక్షన్ చూసి “దొరికావు రా, ఇప్పుడెక్కడికి పోతావు” అన్నట్టుగా ఇన్స్పెక్టర్ మొహంలో నవ్వు (క్లోజప్)

5) ఎత్తైన కట్టడం నుంచి క్రిందికి చూస్తున్న నేరస్థుడు.

6) నేరస్థుడు క్రిందికి చూసినట్టుగా అతని దృష్టి కోణం లోని ఒక షాట్.

7) మళ్ళీ ఇన్స్పెక్టర్ నవ్వు.

8 ) ఇప్పుడు నవ్వడం నేరస్థుని వంతు.

9) అతని నవ్వుకు కారణం అర్థం కాని ఇన్స్పెక్టర్ మొహంలో మార్పు.

10) ఏం చెయ్యాలో అర్థం కాక తల గోక్కుంటున్న కానిస్టేబుల్.

11) అప్పుడే అటుగా కావ్ కావ్ మంటూ ఎగురుతూ వెళ్ళిన ఒక కాకి

12) లాంగ్ షాట్ లో అందరూ కనిపించేలా ఒక నిశ్శబ్దం

పైన పేర్కొన్న 12 షాట్లను నిమిషం సేపట్లో చకచకా వచ్చేలా ఏర్పరిస్తే కథా గమనం వేగం అందుకుంటుంది.

అలాగే సంసారంలోని బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని ఒక పొడవాటి కట్టడం చేరుకున్న ఒక పాత్ర, అతన్నక్కడి నుంచి దూకకుండా ఆపే మరో పాత్ర మధ్య ఈ రకమైన నడక అవసరం లేదు. ఇక్కడ ప్రేక్షకుల్లో కలిగించాల్సింది ఉత్కంఠత కాదు, సానుభూతి, జాలి లాంటి భావాలు. అలాంటి అభిప్రాయం కలిగేలా ఈ సన్నివేశాన్ని వేగం తగ్గించి ఎడిట్ చేయడం జరుగుతుంది. ఇలా ఒక్కో రకమైన సినిమాకు ఒక్కో రకమైన లయ ఎడిటింగ్ ద్వారా కలుగచేయొచ్చు. లయతో పాటు సినిమాలోని వేగాన్ని పెంచడానికీ తగ్గించడానికీ ఎడిటర్ కి ఉపయోగపడే మరో సాధనం సమయాధిపత్యం.

సమయాధిపత్యం :

తన ప్రేయసి కోసం ట్యాంక్ బండ్ పై ఎదురు చూస్తుంటాడు రాము. సీత ఎంతకీ రాదు. నాలుగు గంటలు కాస్త ఐదవుతుంది. ఐదు కాస్తా ఆరవుతుంది. గంటలు గంటలు గడుస్తూనే వుంటాయి కానీ ఆమె జాడే వుండదు. అతనలా ఎదురుచూస్తూనే వుంటాడు. ఇదే సీను సినిమాలో చిత్రీకరించాలనుకుంటే ప్రేక్షకులు రాము లాగే మూడు నాలుగు గంటలు స్క్రీన్ నే చూస్తూ వుండలేరు కనుక, రాము అక్కడ అంత సేపు ఎదురు చూసినట్టుగా భ్రమింపచేస్తారు. దర్శకుడు ఈ సీను చిత్రీకరించేటప్పుడు కూడా గంటల గంటలు ఈ సీను చిత్రీకరించడు. ఇక్కడ కేవలం ఎడిటింగ్ ద్వారా సమయాన్ని కుదించడమా, లేదా పొడిగించడమా అనేది జరుగుతుంది. ఉదాహరణకు పైన సీన్లో మొదట ట్యాంకు బండు దగ్గర అసహనంగా నిల్చున్న రాముని చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతున్న గడియారాన్ని ఒక దాన్ని చూపించి మరో సారి అసహనంగా నడుస్తున్న రాముని చూపించి, మళ్ళీ గడియారం చూపించి, కట్ చేసి చీకట్లో లైటు కింద అసహనంగా వాచీ చూసుకుంటున్న రాముని చూపించినప్పుడు చాలా గంటలు గడిచిన భావం ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాగే ఒక వ్యక్తి హత్య చెయ్యడానికి ఒక గదిలో చీకట్లో నక్కి వున్న హంతకునికి కాలం ఎంత నెమ్మదిగా గడుస్తుందో చూపించడానికి అలారం వాచీలో సెకండ్ల ముళ్ళు టిక్ టిక్ మంటూ కదలడం ఒక ఐదు సెకండ్ల పాటు చూపించినా చాలు సమయం నెమ్మదిగా కదుల్తుందని ప్రేక్షకులకి అర్థమవుతుంది. ఈ విధంగా ఎడిటర్ సమయాధిపత్యం సాధించి ప్రేక్షకులలో కలిగించాల్సిన భావాలను కలుగచేయడంలో ఉపయోగపడతాడు.

కొత్తపధ్ధతులు :

ఎడిటింగ్ అనే ప్రక్రియలో రష్యన్ దర్శకులు, మరియు ఎడిటర్ లు కనుగొన్న కొత్త పధ్ధతులు వేరొకరెవ్వరూ చేయలేదు. ఉదాహరణకు మోంటేజ్ అనే ఎడిటింగ్ ప్రక్రియ రష్యన్ లు కనుగొన్నదే. ఈ ప్రక్రియలో ఒక దానితో సంబంధం లేని కొన్ని షాట్లను వరుసగా అమర్చి చూపించడం ద్వారా వాటన్నింటిలో లేని కొత్త అర్థాన్ని ప్రేక్షకులు గ్రహించగలిగేలా చెయ్యడం ఈ ప్రక్రియ యొక్క గొప్పతనం. ఉదాహరణకు మన పాత సినిమాల్లో ఏదైనా బీభత్సమైన సన్నివేశం జరిగినప్పుడు, ఎగురుతుతున్న పక్షులు ఆగి పోవడం, ఎగిసే అలలు నిలిచిపోవడం లాంటి దృశ్యాలు ఒక దాని తర్వాత ఒకటి చూపించడం జరిగేది. ఆ చిత్రాలకూ, జరిగే సన్నివేశానికీ సంబంధం లేకపోయినప్పటికీ ఆ చిత్రాల ద్వారా జరిగిన విధ్వంసానికి లోకం క్షణం పాటు ఆగిపోయిందనే భావన మనలో కలుగుజేస్తుంది.

ఇప్పటివరకూ ఎడిటింగ్ గురించి చెప్పుకున్న అంశాలన్నీ శాస్త్రీయంగా అవలంబిస్తున్న పధ్ధతులే. కానీ ఫ్రాన్సు దేశంలో ఎగసిన నవతరంగపు సినీ ఉద్యమం కారణం ఉధ్బవించిన ఒక ఎడిటింగ్ ప్రక్రియ సినిమా అనే ప్రక్రియనే కొత్త మలుపు తిప్పింది. అదే జంప్ కట్. ఈ ప్రక్రియ లేనంతవరకూ ఎడిటర్ ప్రేక్షకులలో అవిఛ్ఛిన్నతా భావాన్ని కలుగచేయడమే బాధ్యతగా భావించినప్పటికీ ఈ జంప్ కట్ అనే ప్రక్రియ ప్రేక్షకుల ఎప్పటికప్పుడు అచ్చెరువు చెందేలా వుపయోగించడం మొదలయ్యింది. మొదట్లో ఈ ప్రక్రియ నాణ్యవంతంగా ఉపయోగించినప్పటికీ రాను, రాను అర్థం పర్థం లేకుండా ఉపయోగిస్తూ పోవడంతో చాలా సార్లు దుర్వినియోగం కూడా అవుతోంది. ఈ ప్రక్రియ గురించి వివరించాలంటే మరో వ్యాసమే అవుతుంది. మరో సారి ఈ ప్రక్రియ గురించి తీరిగ్గ తెలుసుకుందాం.

ఎడిటింగ్ ఒక కళ గా:

చాలా సార్లు ఎడిటింగ్ అనేది యాంత్రికంగా చేసే పనిలా చాలా మంది భావించినప్పటికీ ఎడిటింగ్ ప్రక్రియల్లో ఎంతో మంది చేసిన కృషి కారణంగా నేడు దీనిని ఒక కళగా భావించే వాళ్ళూ చాలామంది వున్నారు. ఒక మంచి ఎడిటర్ నాణ్యత లోపించిన దర్శకుని సినిమాని కూడా అపురూపంగా తీర్చిదిద్దిన సందర్భాలెన్నో వున్నాయి. ఒక ఎడిటర్ కేవలం ఫిల్ము ముక్కలను ఒక దగ్గరగా చేర్చే కూర్పరే కాదు సినిమాకి ఒక రూపమిచ్చే దేవుడు కూడా. అన్నింటికంటే ముందు ఎడీటర్ అనేవాడు అత్యంత మేధావంతుడై వుండాలి. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు ఎలా దోపిడీ చేయాలో పథకం పన్నుతూ మాట్లాడే సన్నివేశం తీసుకుందాం. ముందుగా క్లోజప్ లో ఇద్దరు వ్యక్తులని చూపించి వారు గుసగుసలతో తమ పథకాన్ని ఒకర్తో ఒకరు చెప్పుకోవడం చూపించి ఆ తర్వాత లాంగ్ షాట్ లో వారిద్దరూ పోలీస్ స్టేషన్ లో వున్నట్టు, వారిని చూసి ఇన్స్పెక్టర్ “ఏంట్రా గుసగుసలాడుతున్నారు?” అని కోపంగా కేకలెయ్యడం చూపిస్తే, ఆ వ్యక్తులపై ప్రేక్షకులకు “ఔరా! ఎంత ధైర్యం వీళ్ళకి, పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం ప్లాన్ చేస్తున్నారు” అనిపిస్తుంది. అలాగే ముందు లాంగ్ షాట్లో పోలీస్ స్టేషన్ చూపించి ఆ తర్వాత వారి సంభాషణ చూపితే, ఆ వ్యక్తులపై ప్రేక్షకులకు “ఛీ, వీళ్ళకు సిగ్గు లేదు, దొంగ బుధ్ధి పోనిచ్చుకున్నారు కాదు” అనిపిస్తుంది. అయితే దర్శకుడు పైన రెండు సీన్లు చిత్రీకరిస్తాడు కానీ ప్రేక్షకుల్లో ఏ భావం కలిగించాలో అన్నది మాత్రం చాలా వరకూ ఎడిటర్ మీదే ఆధారపడుతుంది. ఒక్కోసారైతే ఎడిటర్ తీసుకున్న నిర్ణయం కారణంగా సినిమా కథంతా మారిపోయి, ఆ మార్పు బావుందనిపిస్తే సినిమా మిగిలిన భాగం రీషూట్ చేసిన సందర్భాలు కూడా వున్నాయి.

ముగింపు:

నిజానికిది ముగింపు కాదు. సినిమా అనే ప్రక్రియను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఎడిటింగ్ గురించి తెలుసుకోవడం మొదటి మెట్టు. ఎలా అయితే ఒక ఉత్పలమాల పద్యాన్ని యతి ప్రాసలు తెలియని వారికంటే, తెలిసిన వారు ఎలా ఆస్వాదించగలుగుతారో, శృతి, లయ, మనోధర్మ లాంటి అంశాలు తెలియని వారికంటే తెలిసిన వారు శాస్త్రీయ సంగీతాన్ని ఎలా ఆనందించగలుగుతారో, అదే విధంగా ఎడిటింగ్ గురించి తెలుసుకున్న వాళ్ళు సినిమా చూసే విధానమే మారిపోతుంది. కేవలం సినిమాలోని కథను మాత్రమే కాకుండా, సినిమా ప్రక్రియలోని ప్రతి సున్నిత అంశాన్ని స్పృశించ గలుగుతారు, పూర్తి స్థాయిలో ఆనందించగలుగుతారు.

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

(ఇంగ్లాండ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వెంకట్ సిద్దారెడ్డి సినిమా పట్ల తనకున్న ఆసక్తి రీత్యా పొద్దులో సినిమా శీర్షిక నిర్వహిస్తున్నారు. తన సొంత వెబ్‌సైటు http://24fps.co.in లో సినిమాల గురించి రాస్తున్నారు. మంచి సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు రావాలనేది ఆయన కల.)

Posted in వ్యాసం | Tagged | 6 Comments

మహీధర నళినీమోహన్

-వి.బి.సౌమ్య (http://vbsowmya.wordpress.com)

vbsowmya.JPG
నాకు బాగా చిన్న వయసులో నసీరుద్దీన్ కథలతో పరిచయమై, తరువాత్తరువాత చిన్న చిన్న గణిత చిట్కాలు, పిల్లలతో ఆడించే ఆటలతోనూ పరిచయమై… ఆ తరువాత – “ఎందుకు?” అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు చాలా ప్రశ్నలకి జవాబు చెప్పినప్పుడు, నాలో తెలుసుకోవాలి అన్న ఒక జిజ్ఞాసను కలిగినప్పుడు, కలుగుతున్నప్పుడు నేను ఎవరిని తలుచుకుంటాను అంటే – నళినీమోహన్ నీ, ఆయన పుస్తకాలని నాకు పరిచయం చేసిన మా నాన్ననీ. ఎవరీ నళినీమోహన్? నళినీమోహన్ గారి పూర్తి పేరు మహీధర నళినీమోహన్.

mahidhara.JPG
మహీధర నళినీ మోహన్
(en.wikipedia.org నుండి)

ప్రసిద్ధ రచయిత మహీధర రామమోహనరావు గారు వీరి తండ్రి. రచయితగా కాక శాస్త్రవేత్తగా నళినీమోహన్ గారి గురించి చెప్పుకోవలసింది చాలా ఉంది. అయితే, ఆ సమాచారమంతా వికీ పేజీలో ఉంది. ప్రస్తుతం ఈ వ్యాసం రాయడంలో నా ఉద్దేశ్యం రచయితగా ఆయన ఎంత బాగా రాస్తారో, ఆ రచనలు నాకు సైన్సును తెలుసుకోవడానికి ఎంత ఉపయోగపడ్డాయో తెలియజేయడం. వ్యక్తిగత అనుభవమే అయినా కూడా, ఈయన రచనలు తెలిసినవారు తక్కువమంది ఉన్నారేమో అన్న అనుమానం చేతనూ, తెలుగులో ఇలాంటి రచనలు అప్పట్లోనే వచ్చాయి అని తెలీనివారికి తెలపాలన్న ఆరాటం చేతనూ రాస్తున్నాను ఈ వ్యాసాన్ని.

నళినీమోహన్ గారు వృత్తిరీత్యా అంతరిక్ష శాస్త్రవేత్త. ఫిజిక్స్ లో డాక్టరేటు కలిగిన మనిషి. ఆ తరహా మనుష్యుల్ని నిజజీవితంలో కలిసిన ప్రతిసారీ నాకు ఎదురైన అనుభవం.. వాళ్ళు మాట్లాడేది పైనుంచి వెళ్ళడమే. చాలా మంది మేధావులు ఇలా చెప్పడమే చూసాను, విన్నాను నేను. కానీ, నళినీమోహన్ గారు అలా కాదు. కృష్ణబిలాల గురించి చెప్పినా, కెప్లర్ సిద్ధాంతం చెప్పినా, రాకెట్టు కథ చెప్పినా, గురుత్వాకర్షణ శక్తి అదీ ఇదీ అని ఈక్వేషన్లు గీసినా – ఏమి చేసినా కూడా అది అందరికీ అర్థమయ్యేలానే ఉంటుంది. అదీ ఆయన శైలి లోని సరళత్వం. విషయం తెలిసి ఉండటమే కాదు, అది అర్థమయ్యేలా చెప్పగలగడం ఓ గొప్ప కళ. ఆ కళలో నళినీమోహన్ గారు నిష్ణాతులు. ఆయన వ్యాసాలు మనతో కబుర్లు చెబుతున్నట్లు ఉంటాయి. చిన్నపిల్లలు కథ చెప్పమంటే అనగనగా అనుకుంటూ మొదలుపెడతామే, అలా మొదలౌతాయి. తరువాత విషయం లోకి నెమ్మదిగా వెళతాయి. అక్కడ కూడా మనకు ఏదో శాస్త్రీయ విషయాల మీద వ్యాసం చదువుతున్నట్లు ఉండదు. ఆ భాష ఎలా ఉంటుంది అంటే, ఎక్కడికక్కడ మన నానుళ్ళూ, సామెతలూ వాడుతూ ఉంటారు -ఆ క్లిష్టమైన విషయాలు మనకు అవగతం కావడానికి. ఎక్కడో కొన్ని చోట్ల తప్పితే, ఈ వ్యాసాల్ని సాంకేతిక పరమైన చదువులు చదవని వారు కూడా అర్థం చేసుకోగలరు. చేసుకోవడమే కాదు, తెలీని మరొకరికి విశదీకరించనూ గలరు.

ఇంతా విని నేనేదో ఈయన రచనల్ని కాచి వడబోశాననుకోకండి. నేను ఈయన రాసిన పిల్లల రచనలు తప్ప ఏదీ పూర్తిగా చదవలేదు. కానీ, తరుచుగా ఆయన రాసిన వ్యాసాలు – వివిధ పుస్తకాల్లోవి – చదువుతూ ఉంటాను. ఊహ తెలిసిననాటి నుండి నళినీమోహన్ గారి ఏకలవ్య శిష్యురాలినే నేను. నా వ్యక్తిగత పరిణామంలో నళినీమోహన్ గారి పాత్ర మరువలేనిది. ఎప్పుడన్నా కాస్త తీరిగ్గా ఉంటే, నళినీమోహన్ గారి “ఆకాశంలో ఆశ్చర్యార్థకం” పుస్తకమో, లేక “ప్రపంచానికి ఆఖరు ఘడియలు” పుస్తకమో తీస్తాను. ఒక వ్యాసం చదివే సరికి మళ్ళీ నా మనసంతా ఆయన పట్ల ఓ విధమైన ఆరాధనాభావంతో ఓ పక్క నిండిపోతుంది. ఓ పక్క పరిశోధన పట్ల ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఓ పక్క నేను తెలుగునేలపై పుట్టడం ఎంత అదృష్టం – ఇలాంటి ఒక రచయిత రచనలు చదవ గలుగుతున్నాను! అనిపిస్తుంది. ఇవన్నింటితో పాటు నాకు తరువాతి క్షణం నుంచి ఆకాశాన్ని చూసినా, ఖాళీగా ఉన్న ఓ బహిరంగ ప్రదేశాన్ని చూసినా ఆయన వాక్యాలు కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. ఈ వ్యాసాల వల్లనే నాకు నక్షత్రాల మీద ఆసక్తి కలిగి నేను ఏ నక్షత్రం ఎక్కడుంటుంది, ఆకాశం ఏ రోజుల్లో ఎలా ఉంటుంది వంటి విషయాలను గురించి క్రమంగా తెలుసుకోగలిగింది. ఈయన రచనలొక్కటే కాదనుకోండి… కానీ, ఈయన రచనలు పరిచయం కాకుంటే మాత్రం నేను నేనుగా ఉండేదాన్ని కాదు. ఇప్పుడు తెలిసిన కాస్త కూడా తెలిసి ఉండేది కాదు. ఈ పుస్తకాలు – ఏకబిగిన పూర్తిగా చదవడానికి కాదు, జీవితాంతం మీ లైబ్రరీ లో పెట్టుకుని – మీరు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలూ కూడా – సమయం చిక్కినప్పుడు తీరిగ్గా కూర్చుని అప్పుడప్పుడూ చదువుతూ ఉండడానికి, మీ ప్రపంచం గురించిన జ్ఞానం మీరు పెంపొందించుకుంటూ ఉండడానికి. “నిప్పుకథ”, “కేలెండర్ కథ”, “పిడుగుదేవర కథ” వంటివి కాస్త ఒక వయసు వారిని ఉద్దేశించినవేమో అనిపిస్తుంది నాకు. పైన చెప్పిన “ఆకాశం లో…”, “ప్రపంచానికి…” వీటి తరువాతి లెవెల్ ఏమో అని అనిపిస్తోంది. ఎందుకంటే, ఈ రెండింటినీ ఇప్పుడు చాలా ఆసక్తితో చదువుతున్నాను నేను. ఒకానొకప్పుడు నేను పదిహేను పదహారేళ్ళప్పుడు చదవలేకపోయినట్లు గుర్తు.

పుస్తకాలు బోలెడున్నాయి. నళినీమోహన్ గారి పుస్తకాలు ప్రత్యేకం. ఎందుకంటే చెప్పదలుచుకున్న విషయాన్ని ఏ పాయింటూ వదలకుండా మానవ భాష లోనే చెప్పడం.

ఇంతటి మేధావి నళినీమోహన్ గారు వృద్ధాప్యంలో ఆల్జీమర్స్ తో కొన్నాళ్ళు బాధపడ్డాక దాదాపు రెండేళ్ళ క్రితం మరణించారు. ఆ వార్త పేపర్ లో చదివిన రోజు నాకు కలిగిన బాధని మాటల్లో చెప్పలేను. నా సొంత మనిషి ఎవరో దూరమైన భావన కలిగింది, ఆయనెలా ఉంటారో తెలీకపోయినా కూడా. ఈ రెండేళ్ళలో ఎన్నిసార్లు ఆయన్ని తలుచుకున్నానో లెక్కలేదు. ఆయన స్మృతికి నేను చేయగలిగేది ఏమన్నా ఉంది అంటే అది ఒకటి – ఆయన పుస్తకాలని నా తరం పాఠకులకు పరిచయం చేయడం.

ఈయన పుస్తకాలు ఇప్పుడు ముద్రణ లో ఉన్నాయో లేదో, అసలు ఆ పుస్తకాల గురించి ఎవర్ని సంప్రదించాలో అయితే నాకు తెలీదు. ఎవరికన్నా తెలిస్తే తెలుపగలరు.
———————-

తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి.

Posted in వ్యాసం | 10 Comments

సమీప దూరాలు

స్వాతికుమారిగారు ఈ సమీపదూరాలని మాకు పంపినప్పుడు – దీనిని ఏ శీర్షికలో ప్రచురించాలి అనే సమస్య వచ్చింది. కవిత శీర్షికలో వెయ్యాలంటే – ఇది కవితగాదు, వ్యాసంలో వెద్దామంటే ఇది వ్యాసమూ గాదు. అలాగని తిరస్కరించడానికీ మనసొప్పలేదు. అందుకని ఆవిడనే అడిగాం – ‘ఏ శీర్షికలో వెయ్యమన్నారు’ అని? దానికావిడ – “రసాత్మకమైన భావమేదైనా కవిత్వమే గదా? ఇది కవిత కాకపోవచ్చుగాని, నా దృష్టిలో కవిత్వమే” అన్నారు.
నిజమే – రాగ, తాళాలు లేనంతమాత్రాన కోయిల కూత పాటగాకపోతుందా?
— సంపాదకులు

—————-

సమీప దూరాలు
-స్వాతికుమారి

.

తెలి మంచులో తెల్లవారుఝామునే తడిసిపోయే పసి మల్లె మొగ్గ త్వరలో ధనుర్మాసానికి వీడ్కోలు చెప్పాలని తెలియక చలి లో తుళ్ళి పడుతుంటే…
అరె నీహారిక కళ్ళలోకే వచ్చిందేమిటి!

నూనెలో రంగులు కలిపి గచ్చు మీద పగలంతా ముగ్గులు పెట్టాను. ఇంకా తడి ఆరలేదు ఏదోక రోజు నువ్వు చూసి ముచ్చట పడకపోతావా అనే ఆశలానే. రామాలయంలో తిరుప్పావై వినడానికి వెళ్ళిన వాళ్ళు చెరువు గట్టున స్నేహితుల్తో ఆటలాడుకున్న పిల్లలు కూడా తిరిగొస్తున్నారు. వేణ్ణీళ్ళ కాగు కింద తుక్కు పుల్లలు ఎగదోస్తూ చిరు చలికి ముడుచుకు కూచుని వీధి గుమ్మం వైపు తదేకంగా చూస్తూ ఆ ద్వారబంధాల పక్కన నీ చెప్పులుంటే ఈ సాయంత్రం ఎంత ఉల్లాసంగా ఉండేది అనుకుంటాను.

ఒక చుక్క తేనె కోసం ఈ నాలుగు పూలమొక్కల మధ్యే వేల మైళ్ళు తిరిగే తేనెటీగల్లాంటి జ్ఞాపకాలు. సన్నజాజుల్లో లేని విశేషం పారిజాతాల్లో ఏముందని అడిగితే.. నీ తెల్లని అరచేతి మధ్య గోరింట చుక్కని తలపించటం కాబోలు అని నీ సమాధానం గుర్తొచ్చి సిగ్గుని కోపం లోకి అభినయించబోయి భంగపడి నవ్వుతాను. ఈ పరిమళపు పూతలన్ని ఏమంటున్నాయి? వసంతాలకేం.. వచ్చి పోతుంటాయి, మరో హేమంతానికైనా నువ్వు తోడురాకూడదూ అని కదా! ప్రేమంటే ఇంత వేదనని ఎవరు నమ్ముతారు?

ఈ నిశ్శబ్ధ ఏకాంతం, ఈ మౌనం ఇన్ని సంగతులు చెబ్తాయే! బహుశా ఏమీ లేదని చెప్పటానికే మాటలు అవసరపడతాయి. నీరెండలో నిశ్చలంగా మెరిసే కోనేటి నీరు కూడా మట్టి కుండలో చేరాక రూపు మార్చుకున్నట్టు..ఈ వియోగంలో ఎంత అందమైన దృశ్యం కూడా నాలో విషాదాన్నే నింపుతుందెందుకు. ఐనా సౌందర్యం విషాదం పరస్పరం లీనమయ్యి లేవని ఎవరు మాత్రం అనగలరు.

ఎడారిలో ఓ గడ్డి పరక సైతం కాస్త అనువు దొరగ్గానే మొలకెత్తుతుందట. ఆ మాత్రం భాగ్యం కూడా ఈ కన్నీటి చుక్కకి లేదు కదా. పగళ్ళూ రాత్రులూ గుండెను పగిలించుకుంటూ, అతికించుకుంటూ గొంతు చాటున దుఃఖాన్ని అపేసి నడుస్తుంటే.. వంతెన దాటుతున్నంత సేపూ వెంటపడి వచ్చే వెన్నెలని విసుక్కోక ఏం చెయ్యను ?

—————-
swathi.bmp“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అంటారు, స్వాతికుమారి. ఆమె బ్లాగు, కల్హార, ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. ఈమధ్య తప్పనిసరై బ్లాగులకు, కవితలకు దూరంగా ఉంటున్న ఆమె, పొద్దు కోసం ఈ కవితను పంపారు.

Posted in కవిత్వం | 12 Comments

‎భరతనాట్యం – ఒక సంభాషణ

తెలుగు బ్లాగరుల్లో బహుముఖ ప్రతిభాశాలి కొత్తపాళీ. ఆయన చాలాకాలంగా అంతర్జాలంలో కథలు, కవితలు, పద్యాలు రాస్తున్నారు. ఇంకోవైపు తెలుగుకావ్యాలను ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు. మరోవైపు సినిమాలు, లలితకళల పట్ల తరగని ఆసక్తిని, అభినివేశాన్ని కనబరుస్తున్నారు. అంతేకాదు, ఆయన దశాబ్దంపైగా భరతనాట్య సాధన చేస్తున్నారు. నాట్యశిక్షణకు సంబంధించి ఆయన తన స్మృతులు – అనుభూతులను పొద్దు సంపాదకుడు రానారెతో పంచుకున్నారు:


కథలు, కవితలు, పద్యాలు, అనువాదాలు, బ్లాగు వ్యాసాలు రాయడంతో పాటు మీరు నాట్యం కూడా చేయగలరనే సంగతి మొన్నామధ్య ఒకానొక బ్లాగుముఖంగా బయటపడింది. ఆ తరువాత ఇటీవలి మీ నాట్య బృంద ప్రదర్శన గురించి మీ బ్లాగులో చూశాం. మీరు శిక్షణ పొందినది ఏ నృత్య సంప్రదాయంలో?

నేను నేర్చుకున్నది, నేర్చుకుంటున్నది భరతనాట్యం. ఈనాడు భరతనాట్యమనే పేరిట ప్రదర్శించబడుతున్న నృత్యంలోనే వివిధ సాంప్రదాయ రీతులున్నాయి, పండనల్లూర్ బడి అనీ, తంజావూర్ బడి అనీ, ఇలాగ. గత వంద, నూటయాభై ఏళ్ళ కాలంలోని గురువులు ఏయే ఊళ్ళనించి వచ్చారో ఆ పేరిట ఈ సాంప్రదాయాల్ని పిలుస్తున్నారు. మా గురువుగారు నేర్పేది కళాక్షేత్ర సాంప్రదాయం.

మీరు అభ్యసిస్తున్న కళాక్షేత్ర సంప్రదాయపు ప్రత్యేకతలు ఏమిటి?

మిగతా భరతనాట్య సాంప్రదాయాలతో పోలిస్తే కళాక్షేత్ర పద్ధతి పదునుగా ఉంటుంది. ఒక భంగిమ కానీ , కదలిక గానీ శిల్పానికి జీవం పోసినట్టు ఉంటాయి, మితిమీరిన మెత్తదనం ఉండదు. ఆడపిల్లలు చేసినప్పుడు కూడా వయ్యారం కంటే ఒక మాదిరి వీరరసం కనిపిస్తుంది . అఫ్కోర్సు ఈ పద్ధతి నచ్చని వాళ్ళు మరీ మిలిటరీ కవాతులాగుంటుందని విమర్శిస్తారు 🙂 కళాక్షేత్ర నించి ఉత్తీర్ణులై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నర్తకులు , గురువులు, ఆనంది, సీ. వీ. చంద్రశేఖర్, శాంత మరియు వీ.పీ . ధనంజయన్ జంట, లీలా శాంసన్, నవ్‌తేజ్ జోహార్ ప్రభృతులు కళాక్షేత్ర పద్ధతిలోని ముఖ్యాంశాలని నిలుపుకుంటూనే తమకి అనుగుణమైన మార్పులు చేసుకున్నారు . ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే .. అలరిప్పు చేస్తే చాలు, అది కళాక్షేత్ర పద్ధతి అని తెలిసిపోతుంది. ఈ పద్ధతే సరైనదని ఏం లేదు. ఇది మా పద్ధతి, అంతే 🙂
ఇది బృంద ప్రదర్శనలకి బాగా ఉపయోగిస్తుంది. పదిమంది ఒకే జతిని చేస్తున్నప్పుడు ఆ మాత్రం పదును లేకపోతే అది బలంగా అనిపించదు. అన్ని నాట్య సాంప్రదాయాల్లోనూ పద్ధతుల్లోనూ శిల్పాకృతికి ఒక ప్రాముఖ్యత ఉన్నాగానీ, అదెక్కడో మరుగున పడిపోతూ ఉంటుంది . కళాక్షేత్ర పద్ధతిలో ఈ శిల్పాకృతి చాలా ముఖ్యం. భంగిమలు సరేసరి, కదలికలు కూడా కదులుతున్న యోగాసనాల వలె ఉంటాయి. నీకు తెలుసో లేదో, మన సాంప్రదాయంలో యోగమూ, నాట్యమూ రెండూ పరమశివుని దగ్గర్నించే ఆవిర్భవించాయి. రెంటికీ మూలం శివుడే.

మునుపటి మీ మాటల్లోని అంశాన్నే నేనూ ప్రస్తావించదలిచాను. లయకారుడు శంకరుడు అందరికీ తెలిసిన సంగతే. శివతాండవం అందరికీ తెలిసిన పదమే. భారత సంస్కృతిలో నృత్యానికి ప్రతీక (Icon) ఒక పురుషుడు. పాశ్చాత్య నృత్యరీతులను నేర్చుకోవడానికి చూపే ఉత్సాహాన్ని భారతీయ యువకులు తమవైన నృత్యసంప్రదాయాలను నేర్చుకోవడానికి చూపడం లేదన్నది ఒక సాధారణ భారతీయునిగా నాకు కలిగిన అభిప్రాయం. మీరేమంటారు?

ముఖ్య కారణం ఉపాధి లేమి కావచ్చు. ఎంతో నిష్ఠతో ఏళ్ళతరబడి నేర్చుకుని, కళలో నిష్ణాతులై, తామే స్వయంగా కొత్త అంశాలు సృజించే స్థాయికి రావాలంటే ఎంత కృషి ఉండాలి? ఆ కృషికి తగిన ఫలమేది? మగ నృత్య కళాకారులకి అవకాశాలు రావడం కష్టమైపోతున్నదని పలు వేదికల్లో స్పష్టమైంది. మగవాడు నాట్యంలో వృత్తిపరంగా రాణించాలంటే ఒక కళాకారిణిని పెళ్ళాడి భార్యాభర్తలుగా ప్రదర్శనలివ్వటమే మార్గం.

“నేను చూసిన అతి మనోహరమైన ముగ్ధ గోపిక, బట్టతలతో ముడతలు పడ్డ మొహంతో సుమారు డెబ్భయ్యేళ్ళ ముసలాయన,” అంటారు మా గురువుగారు దివంగత ఒడిస్సీ నాట్యాచార్యులు శ్రీ కేలూచరణ్ మహాపాత్రుల గురించి. అంతెందుకు, వేదాంతం సత్యనారాయణ శర్మగారి భామవేషం ఆయనకి యాభై దాటిన వయసులో చూశాను;

వేదాంతం సత్యనారాయణశర్మ
వేదాంతం సత్యనారాయణశర్మ
(www.engr.mun.ca నుండి)

శ్రియ, ఇలియానాలు పాఠం నేర్చుకోవచ్చు లావణ్యంలో వొయ్యారంలో. నవ్‌తేజ్ సింగ్ జోహార్ అని కళాక్షేత్రంలో మాగురువుగారి సహాధ్యాయి. ఆరడుగుల పొడుగు, పల్చగా రివటలా ఉంటారు, నిండైన బవిరి గడ్డం మీసాలు, కత్తెర వెయ్యని తలకట్టుతో అచ్చమైన సర్దార్జీ .. దగ్గిర దగ్గిర యాభయ్యేళ్ళ వయసుంటుంది. ముత్తుస్వామి దీక్షితుల కృతి “మీనాక్షి మేముదం దేహి” కి నాట్యం చెయ్యడం చూశాను. ఒక్కొక్క భంగిమలో తానే మీనాక్షి అయిపోయాడాయన .. అప్పుడు మనకళ్ళెదుట కనబడేది కొద్దిగా నెరిసిన వెంట్రుకలతో బవిరిగడ్డంతో ఉన్న నడివయసు సర్దార్జీ కాదు, ఒక కంట హొయలు కురిపించి సమ్మోహన పరిచే దివ్య శృంగార మూర్తి, మరో కంట కృపారసమొలుకుతూ ఆపన్నులను గాచే మాతృమూర్తి .. నీకు తెలుసో లేదో .. మన దేవతా మూర్తులందరిలోకీ మీనాక్షి అమ్మవారిది మూర్తీభవించిన శృంగార రూపం. అందుకే మంత్ర యోగనిష్ఠా గరిష్ఠుడైన దీక్షితులవారు కూడా ఆమెని అంత శృంగార భరితంగా కీర్తించారు. ఆర్.ఎస్. సుదర్శనం గారి అద్భుతమైన కథ మధుర మీనాక్షి చదివావూ? ఈ నడివయసు సర్దార్జీ తనలో అటువంటి మోహన మూర్తిని ప్రత్యక్షం చేసేశారు. అదీ కళంటే! పండిత్ దుర్గాలాల్ అని కథక్‌లో నిష్ణాతుడు. చిన్నవయసులోనే రోడ్డు ప్రమాదంలో పోయారు; గొప్ప కళాకారుడు. ఇలా కొందరు లేకపోలేదు, సోలోగా విజయం సాధించిన వాళ్ళు.

ఈ సంప్రదాయాన్నే ఎంచుకోవాలనే ఆసక్తి ఎప్పుడు ఎలా కలిగింది? అసలు మీరు నృత్యం చేయగలరు అనే నమ్మిక మీకెప్పుడు కలిగింది? అప్పటి నుంచి, నాట్యం నేర్చుకునే అవకాశం కోసం ఎంత కాలం పాటు వేచి వుండవలసి వచ్చింది?

నా విషయంలో ఇదంతా రివర్సుగా జరిగింది. నాకు చిన్నప్పణ్ణించీ సంగీతమో, మృదంగమో నేర్చుకోవాలని మహా కోరికగా ఉండేది. అది వీలుకాలేదు. విజయవాడలో కౌమార దశలో అనేక నృత్య ప్రదర్శనలు చూశాను. మా ఇంటికి దగ్గర్లోనే ఒక మంచి కూచిపూడి నాట్యాచార్యుల కుటుంబం ఉండేది (వీరి పెద్దబ్బాయి ఆనందభైరవి చిత్రంలో చూపించే ఒక నృత్య పోటీలో శివతాండవం అద్భుతంగా ప్రదర్శించారు). ఎప్పుడూ నృత్యం నేర్చుకోవాలి అనే కోరిక కలగలేదు. అంచేత, నేనూ చెయ్యగలనా అనే ప్రశ్న వచ్చే అవకాశమే లేదు. అదీ కాక, నృత్యం ఆడపిల్లలు నేర్చుకునేది అనే అపోహకూడా ఉండేది ఆ రోజుల్లో, చాలా మంది అద్భుతమైన పురుష నర్తకులని చూశాక కూడా.
ఎనార్బరులో ఉండగా ఒక స్నేహితురాలిని డాన్సు క్లాసునించి తీసుకెళ్ళడానికి మొదటిసారి మా గురువుగారింటికి వెళ్ళాను. వారింటి ముందు గదిలో నేర్పిస్తారామె. నేను కారు దిగి ఇంటి వేపు నడుస్తున్నాను. పెద్ద కిటికీ లోంచి క్లాసు కనిపిస్తోంది. ముగ్గురు అమ్మాయిలు (పెద్ద వాళ్ళే, పిల్లలు కారు) మూడు కాలాల్లో ఒక నాట్టడవు చేస్తున్నారు. ఆ దృశ్యం ఎంతో బాగుంది. అక్కడే ఆగిపోయి క్లాసు ముగిసే దాకా ఒక పది నిమిషాలు చూస్తుండి పోయాను. టీచరు గారు క్లాసు ముగించి ఇంటి తలుపు తియ్యగానే, నా మొదటి ప్రశ్న “మీరు పురుషులకి కూడా నేర్పిస్తారా?” .. ఆ క్షణంలో నా వయసూ, ఉద్యోగం, సంఘంలో నా పరువూ, ఇవేవీ నాకు గుర్తు రాలేదు. ఇది నేను చెయ్యలేనేమో అనే సందేహమే కలగలేదు. ఆ తరవాత .. సుమారు ఆరు నెలలకి కలిగింది సందేహం, ఉత్సాహంతో మొదలెట్టాను గానీ, కొనసాగించగలనా అని. ఇదిగో, చూస్తూ చూస్తూనే పదేళ్ళవుతోంది.

మీ నాట్యాభ్యాస ప్రవేశం చాలా ఆసక్తికరంగా వుంది. ఆరు నెలల పాటు తిరిగి చూడకుండా అంతగా మిమ్మల్ని ఆకట్టుకొన్న అంశాలేమిటి? ఆ తరువాతి ప్రస్థానం కూడా (మీ పరిధిలో లేని ఇబ్బందులను పక్కనబెడితే కేవలం మీ వరకూ) అంతే ఆసక్తికరంగా సాగుతూ వుందా? ఇక్కడ మీ గురువుగారి గురించి చెప్పవలసి వస్తే ఆ సంగతి కూడా వివరంగా చెబితే సంతోషిస్తాను.

ఆరు నెల్ల పాటు ఆకట్టుకున్నది ప్రత్యేకంగా ఏం లేదు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు, ఆంధ్రులు ఆరంభ శూరులు అని సామెతలున్నాయి గదా, ఆ చందమనుకో. ఆర్నెల్లు తిరిగే సరికి ఆ శూరత్వం కాస్తా కరిగి నీరవుతుంది. ఏమాట కామాట చెప్పుకోవాలి. మా గురువుగారి బోధనా పద్ధతి ఆసక్తి కలిగించేట్టే ఉంటుంది. మామూలుగా ఇండియాలో డాన్సు టీచర్లెవరైనా మొదలెట్టిన ఆర్నెల్లు అడవులు (basic steps) తప్ప ఇంకేవీ చెప్పరు. మా గురువుగారు మొదటి తరగతి నించే కొద్దిగా అభినయం, చిన్న చిన్న అడవులు కలిపి ఒక బుజ్జి జతిగా కూర్చి అలాంటి బుజ్జి జతులతో ఒక బుల్లి కీర్తన నేర్పించడం .. ఇలా చేసేవారు. వీటిని ఆమె ప్రత్యేకంగా రూపొందించుకున్నారు. అందుకని ఆసక్తి బాగానే ఉండేది.

ఆర్నెల్ల తరవాత భయం పుట్టే సంఘటన ఏవిటంటే అలరిప్పు ఎదురైంది. అలరిప్పు సాంప్రదాయ భరతనాట్యంలో మొట్టమొదటి అంశం., మూడు, మూడున్నర నిమిషాలు ఉంటుంది. చూడ్డానికి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కానీ చాలా కష్టమని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. ఒక మనిషి అలరిప్పు ఎలా చేశారో చూసి ఆ మనిషి నాట్య కౌశలం అంచనా వేసెయ్యొచ్చు. అప్పటిదాకా ఏదో ఆడుతూ పాడుతూ లాగించేశాను, కానీ అలరిప్పుతో ఆ రోజులు చెల్లిపోయాయి. ఇంక ఖచ్చితంగా సాధన చెయ్యక తప్పలేదు. అలా ఒక రెణ్ణెల్లు కష్టపడ్డాను. ప్రతి వారమూ ఇంక మానేస్తా అనుకునే వాణ్ణి. ఆ తరవాత అకస్మాత్తుగా అలరిప్పు చెయ్యడం సులభం ఐపోలేదు గానీ, కష్టపడి సాధన చెయ్యటంలోని ఆనందం అనుభమయ్యింది. అంశం పూర్తి కాగానే రొప్పుతూ కూలబడిపోకుండా అలరిప్పు ఒక మాదిరిగా చెయ్యటానికి నాకు ఆర్నెల్లు పట్టింది. పర్ఫెక్టుగా చెయ్యటం .. పదేళ్ళ తరవాత ఇంకా సాధన చేస్తూనే ఉన్నాను.

మీ గురువుగారికి జన్మతః భారతదేశంలో ఏ సంబంధమూ లేదు. ఆమె గురించి తెలుసుకోవాలనుంది.

ఆవిడ పేరు మార్సియా. మిషిగన్లో పుట్టి పెరిగారు. మొరాకోలో పీస్ కోర్ వాలంటీరుగా పనిచేస్తుండగా, తొలిసారి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాట రికార్డు విన్నారక్కడ ఒక ఫ్రెంచి దేశస్థుని వద్ద. దానితో సమ్మోహితులయ్యారు. అప్పటికే ఆమె విశ్వవిద్యాలయంలో ఆధునిక నాట్యంలో పట్టాపొంది ఉన్నారు. ఈ సంగీతానికి సంబంధించిన నాట్యం ఏదన్నా ఉందా అని ఆ స్నేహితుణ్ణి అడిగి భరతనాట్యం గురించి తెలుసుకున్నారు. పీస్ కోర్ పని పూర్తయ్యాక అట్నుంచి అటే భూమార్గంపై వివిధ దేశాలు దాటుకుని ఢిల్లీ చేరుకున్నారు. చెన్నైలోని కళాక్షేత్ర ప్రతిష్ఠ తెలుసుకుని చెన్నై చేరారు. చేతిలో ఉన్న డబ్బులైపోయినై. మరుసటేడుకి సీటు సంపాయించుకుని ఈలోపల కొన్ని నెలలు జపానులో ఇంగ్లీషు టీచరుగా పని చేసి కాస్త డబ్బు సంపాయించుకుని కళాక్షేత్రలో నమోదయ్యారు. ఇంతలో పెళ్ళి, పిల్లలూ. సంసారం నిర్వహిస్తూనే, అభ్యాసం కొనసాగించి ఐదారేళ్ళ డిప్లొమా కోర్సు తరవాత మరో రెండేళ్ళ పాటు సీనియర్ గురువుల దగ్గిర ఉన్నత విద్య నభ్యసించారు. ఆ సమయంలోనే హిందూ మతం పట్ల ఆకర్షితులై ఆర్యసమాజం ద్వారా మతం స్వీకరించి తన పేరు మాధవి అని మార్చుకున్నారు. మిషిగన్ విశ్వవిద్యాలయంలో భరతనాట్య పాశ్చాత్య ఆధునిక నాట్యాల పై తులనాత్మక సిద్ధాంత వ్యాసం సమర్పించి ఎమ్మెస్ పట్టా పొందారు. 96 నించీ ఏనార్బరులో వృత్తి రీత్యా రియలెస్టేట్ ఏజెంటుగా పని చేస్తూ “సాధనా నాట్య పాఠశాల” నెలకొల్పి నా బోంట్లకి నేర్పిస్తున్నారు. సాంప్రదాయకమైన అంశాలతో పాటు వర్తమాన సామాజిక ఇతివృత్తాలతో నాట్యాంశాలను, రూపకాలను రూపొందించడం పట్ల ఆమెకి ఆసక్తి మెండు. స్వతహాగా పాశ్చాత్య పద్ధతిలో మంచి గాయని. అందుకని ఆంగ్ల కవిత్వానికి తానే పాశ్చాత్య బాణీలు కట్టి పాడతారు. విశ్వకవి రవీంద్రుల పద్యాలు కొన్నిటికి ఆమె చేసిన నాట్యరచనలు బహు హృద్యంగా ఉంటాయి. సృజనాత్మకత, బోధనా శక్తి, హాస్య చతురత, దయ సమపాళ్ళలో కలిసిన వ్యక్తిత్వం. మనమేమన్నా కొంచెం పొగిడితే .. నా గురువులు నాకు పెట్టిన భిక్షే మీకు పంచుతున్నాను అంటారు.

నా నాట్యాభ్యాసంలో ఆ తరవాత జరిగిన ఒక ముఖ్య పరిణామం ఏవిటంటే మా గురువుగారు నాకు మంచి స్నేహితులయ్యారు. తన దగ్గిరకి వచ్చే విద్యార్ధులందరికీ ఆమె సరి సమానంగానే ప్రేమాభిమానాలు ఇస్తూ ఉన్నా నేనంటే కొంత ప్రత్యేక అభిమానం ఉందనుకుంటున్నాను. బహుశా ఒక్కణ్ణే మగ విద్యార్ధిని, అందరికంటే వయసులో పెద్దవాణ్ణీ కావటం వల్ల కావచ్చు. ఏదేమైనా, నేను నీరస పడ్డప్పుడు తానే మరి కొంత ఓపిక వహించి, నన్ను ఉత్సాహ పరిచి మళ్ళీ లేపి నిలబెట్టారు. ఒక్క మాట చెప్పాలంటే .. ఆమె నా గురువు కాకపోయి ఉంటే నేను నాట్యంలో ఇంత దూరం కొనసాగే వాణ్ణి కాదేమో. అటువంటి గురువుగారు దొరకటం నా అదృష్టం.

బాగుంది. గురువుగారికి ప్రియశిష్యుడవటం ఒక వరం. పదేళ్లపాటు ఒక శిష్యుడు ఒకే గురువు వద్ద శిక్షణ పొందడం సాధారణ సమాజంలో చాలా అరుదు. ఈ సుదీర్ఘమైన అనుబంధంలో అపురూపమైన ఘటనలుగా మీరు భావించేవి …?

అంత అరుదైన విషయమేమీ కాదు. రంగప్రవేశంతోటే విద్యార్జన పూర్తికాదు. రంగప్రవేశమంటే హైస్కూలు పూర్తయినట్టు. అప్పుడే అసలు విద్యార్జన మొదలవుతుంది. నాట్యాన్ని వృత్తిగా స్వీకరించ దలచిన వాళ్ళు అక్కణ్ణించి ఉన్నత విద్య నభ్యసిస్తారు. మాగురువుగారు తన గురువైన ఆనంది వద్ద ఇలాగే 1996 వరకూ (పదేళ్ళకి పైనే) అనేక విడతల్లో ఉన్నత విద్య కొనసాగించారు. కొంతమంది ఉన్నత విద్య కోసం వేరే గురువుల దగ్గిరికి వెళ్ళటమూ ఉంది. గురువు దగ్గిర ఎంత విద్య ఉంది, అది నేర్పాలన్న ఇఛ్ఛ గురువుకెంత ఉంది, అనేవి కూడా ముఖ్యమైన విషయాలే, శిష్యుల కుతూహలంతో పాటుగా. ఆనంది వంటి గురువుల దగ్గిర ఉన్న విద్య అపారం. పాతకాలపు గురుకుల పాఠశాల లాగా కొందరు శిష్యులు అహర్నిశలూ గురువునే అంటిపెట్టుకుని ఉండి తేనెటీగల్లా ఆ మాధుర్యాన్ని పీల్చుకుంటూ ఉంటే ఆ విద్య ఏమన్నా తరువాతి తరాలకి అందుతుందేమో. అటువంటి గురువులూ, శిష్యులూ తెరమరుగై పోతున్నారు. ఇక మనకు మిగిలేవి Made for TV అరగంట నాట్య కార్యక్రమాలే.

మేమిచ్చిన ప్రదర్శనలన్నీ అపురూపమైన అనుభూతులే. ఏడాదికొకసారి మే జూలై మధ్యలో ఆ ఏడాది శిష్యులు కొత్తగా నేర్చుకున్న అంశాలతో ఒక ప్రదర్శన ఇప్పిస్తారు. ఇస్మాయిల్ తన బ్లాగులో పెట్టిన ఫొటో 2005 కార్యక్రమానిది. ఇది కాకుండా ఆయా సందర్భాలను బట్టి కొన్ని ప్రత్యేకమైన ఆంశాలని తయారు చేస్తుంటారు. అమెరికా ఇరాక్‌ని ముట్టడించినప్పుడు యుద్ధానికి వ్యతిరేకంగా ఒక అంశాన్ని తయారు చేశారు. అరేబియా, ఇరాన్, భారత దేశాలనుండి ముగ్గురు కవయిత్రులు రాసిన పద్యాలు మూడింటిని ఏరి, వాటి ఆంగ్లానువాదాలను ఒక పాటగా కట్టి దానికి నృత్య కల్పన చేశారు. చాలా శక్తివంతమైన కవిత్వం; Shall I attack these people? అనే ఆత్మ పరిశీలనతో మొదలై .. Wherever there’s a war, there are borders .. I have a torch in one hand and a bucket of water in the other .. I shall set fire to heaven and put out the flames of hell, so that voyagers to God can lift the veil and see the real destination ..” ఇలా సాగుతుంది ఏడు నిమిషాల పాట. దాన్ని మొదటిసారి స్థానిక మ్యూజియం వారి ఆహ్వానంపై 2004లో నలుగురు కళాకారులతో ప్రదర్శించారు. అప్పణ్ణించి ప్రతి ప్రదర్శనలోనూ నర్తిస్తూనే ఉన్నాం, ప్రతి సారీ అది చూసినవాళ్ళు (అమెరికన్లు, భరతనాట్యం గురించి ఏమీ తెలీనివాళ్ళు) తమలో ఏదో భావ వీచిక కదిలిందని చెబుతూనే ఉన్నారు.

ఇలా సాంప్రదాయకమైన శబ్దం, వర్ణం, తిల్లానా వంటి అంశాలతో పాటు వర్తమాన సామాజిక సందర్భాలకి అనుగుణమైన కొత్త అంశాలు నేర్చుకుని ప్రదర్శించటం చాలా ఉత్తేజం కలిగిస్తూ ఉంటుంది. ఇటీవల ప్రదర్శించిన ఆనంది, మలోరాల జీవిత గాధల ప్రదర్శన కూడా పూర్తిగా ఆంగ్లంలో ఉంది. దీనిలో నాట్యంతో పాటు కథ చెప్పటం, మూకాభినయం, ఆధునిక నృత్యం వంటి ప్రక్రియలని కూడా ఉపయోగించారు. క్లాసులో ఉనంతసేపూ ఆమె గురువు, మేము శిష్యులం. ఓపిగ్గా, దయతో ప్రోత్సహిస్తూ , కొండొకచో కించిత్ కోపంతో మందలిస్తూ పాఠం చెబుతారు. కానీ ప్రదర్శన దగ్గిర పడేప్పటికి తానొక డైరెక్టర్ ఐపోతారు. మేమంతా ఇక శిష్యులం కాదు, అందరూ కలిసి కళాకారుల బృందం. ఈ స్టెప్పు ఇలా చెయ్యాలి అనే సూచనలు ఉండవు; అది అప్పటికే అందరూ నేర్చి ఉండాలి. మనం పోషించే పాత్ర రక్తి కట్టాలి, తద్వారా ప్రదర్శన రక్తి కట్టాలి. ఈ ప్రక్రియలో అందరమూ భాగస్వాముల మవుతాం.

ఒక బృందంలో భాగంగా కాక వ్యక్తిగత ప్రదర్శనలు కూడా చేసి వుంటారు. అవునా?

వ్యక్తిగతంగా చేసినవి lecture demonstrations మాత్రమే. పూర్తి స్థాయి ప్రదర్శనలు ఇచ్చినవి ఎప్పుడూ నా సహాధ్యాయ బృందంతోనే. మాతృదేశానికి వచ్చినప్పుడు మదురైలో ఒక బడిలోనూ, విజయవాడలో ఒక బడిలోనూ demonstrations ఇచ్చాను. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు.

నాట్య బృందంతో ప్రదర్శనం, ఒకే వ్యక్తి చేసే నాట్య ప్రదర్శనం; రెంటిలో మీరు దేన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు?

రెంటిలో అనుభూతిలో తప్పకుండ తేడా ఉంటుంది, కళాకారుడికీ తేడా తెలుస్తుంది, ప్రేక్షకులకీ తేడా తెలుస్తుంది. ఒకే వ్యక్తి ప్రదర్శనలో మనోధర్మానికి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. బాధ్యత కూడ ఎక్కువే .. అంత పెద్ద స్టేజి మీద ఒక్క మనిషే ఉన్నప్పుడు అంతటా తానే అయి కనిపించాలి, ఒక కృతిని అనువదించడంలో అనేక పాత్రలు తనలోనే వ్యక్తం కావాలి. అవలంబంగా సంగీతం ఉన్నా, అది కంటికి కనబడదు గనక ప్రేక్షకుల దృష్టి అంతా తనపైనే కేంద్రీకరించి ఉంటుంది. అదొక అగ్ని పరీక్షే.

కొత్తపాళీ
నాట్యప్రదర్శనలో కొత్తపాళీ

బృంద ప్రదర్శనల్లో రకరకాలు ఉంటాయి. కూచిపూడి సాంప్రదాయంలో బహుళ ప్రాచుర్యం పొందినది నృత్య నాటకం. కొంత కాలంగా భరతనాట్యంలో కూడా ఈ ప్రక్రియ ఉపయోగిస్తున్నారు. ఇందులో ప్రతిపాత్రకీ ప్రత్యేక వేషధారణ ఉంటుంది. ఒక నటుడు ఒక పాత్రనే పోషిస్తాడు. పాత్రకి తగిన వేషధారణ విడిగా లేకుండా అందరు నటులూ సుమారు ఒకే లాంటి వేషధారణలో ఉండి సందర్భానికి తగినట్టు వేర్వేరు పాత్రల్లో నటించడం రెండో రకం. అక్టోబరులో మేము చేసిన ప్రదర్శన ఇలాంటిది. ఉదాహరణకి ఆనంది కథలో నేను కథ చెప్పేవాడిగా, ఆనంది తండ్రిగా, మామగారిగా, గురువుగా, శిష్యుడిగా కనిపిస్తాను. అలాగే మిగతా నటులు కూడా. పాత్రకీ పాత్రకీ నడుమ వేషధారణ మారదు. హావభావాల ద్వారానే దృశ్యంలో ఎవరు ఎవరో తెలుస్తుంది.

ఇక మూడో రకంలో అందరు నటులూ ఒకే జతిని, ఒకే అభినయాన్ని చెయ్యడం. దీనివల్ల ఒక amplification effect వస్తుంది. యాభై వయొలిన్లు ఒకే సారి మోగే సింఫొనీ ఆర్కెస్ట్రా ధ్వని లాంటి ఎఫెక్టు ఇది. బృందంలో నాట్యం చేసేప్పుడు, ఈ మూడు రకాల్లో ఏదైనా, మన స్వాతిశయాన్ని కొంత అదుపులో పెట్టుకుని తోటివారితో సమైక్యత సాధించినప్పుడే ప్రదర్శన రక్తి కడుతుంది. మన వ్యక్తిగత బాధ్యత కాస్త తగ్గినా, ఇది ఇంకో రకమైన బాధ్యత. నా మట్టుకు నేను రెండిటినీ ఆస్వాదిస్తాను.

పదేళ్ల విద్యార్జనలో మీరు నైపుణ్యం సాధించినట్లుగా మీ గురువుగారు మెచ్చిన విభాగం ప్రత్యేకంగా ఏదైనా వుందా?

ఒక పలానా అంశమనీ, ఒక పలానా అడవు అని కానీ ఏం లేదు. సాధన సమయాల్లోనూ , ప్రదర్శన సమయాల్లోనూ ఏదన్నా బాగా చేస్తే ప్రశంసించి వెన్ను తడతారు. అంతవరకే. అసలు మనకే తెలుస్తుంది ఆ అంశంలో ఆ క్షణం బాగా రసం పండిందని. అది కాకుండా అసలు నాట్యం బాగా చేస్తానని ఒక మంచి అభిప్రాయమే ఉంది మా గురువుగారికి . ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. మిగతా లలిత కళల మాట ఎలా ఉన్నా సంగీతంలోనూ, నాట్యంలోనూ 35% పాసు మార్కు, 50% పాసు మార్కు అనుకోవడానికి లేదు. 100% వచ్చి తీరాల్సిందే. రాగం, తాళం, జతులు అన్నీ సరిగ్గా పడవలసిందే . అది కనిష్ఠావసరం. అటుపైన కళాకారుడు ఆ కళని తనలో జీర్ణించుకుని తనదైన శక్తితో దానికి ఒక రూపమిచ్చి ఆవిష్కరిస్తాడు. అదే మనోధర్మం. మన సంగీత నాట్య సాంప్రదాయాలకి పట్టుగొమ్మ. అదే మోహన రాగం, అదే నను పాలింప కృతి ఒక బాలమురళీ కృష్ణ ఒక వోలేటి వెంకటేశ్వర్లు పాడితే వినే అనుభూతి పూర్తిగా వేరేగా ఉంటుంది. అలాగే నాట్యంలో కూడా. నేను మా గురువు గారి నించే నేర్చాను. నా సహాధ్యాయినులు మార్తా, సోనాలీ కూడా నాతో పాటే నేర్చారు. నలుగురమూ ఒకే సాంప్రదాయాన్నించి వచ్చి ఒకే కృతిని అభినయించినా .. అడవులూ ముద్రలూ ఒకలానే ఉంటాయి, కానీ కలిగే భావం వేర్వేరుగా ఉంటుంది.
రెండో విషయం: కళాకారులకి పంకాలూ విసనకర్రలూ వెర్రి తలలు వేస్తున్న రోజులివి. నిజానికి కళాకారుని ప్రతిభ క్షణికమే. ఒక అంశాన్ని చేసినప్పుడు అప్పుడు రక్తి కట్టిందా లేదా అనేదే ప్రధానం. ఈ పరీక్ష , ఈ అనుభూతి ఎప్పుడూ నిత్యనూతనమే. అందుకని కళాకారుడెప్పుడూ ఈ అంశం, ఈ కళ నా సొంతమేలే అని ఉపేక్ష వహించే వీలులేదు . కళని నిలబెట్టుకోవాలి అంటే నిరంతర సాధన కొనసాగవలసిందే.

మీరు ఇంత వరకూ రూపకల్పన చేసిన లేదా దర్శకత్వం వహించిన ప్రదర్శనలున్నాయా?

ఇదివరకు తెలుగు సమితుల్లో నాటికలు రూపకాలు వేసినప్పుడు ఉండేవి, నేనే రాసి, దర్శకత్వం వహించటం, అన్నీ. నాట్యంలో నాకింకా అంత శక్తి రాలేదు. దానికి కొంత తపస్సు అవసరం. ఏదో ఒక పాటకి, ఒక కీర్తనకి కొన్ని అడవులు, కొన్ని ముద్రలు (చేతులతో పట్టే భంగిమలు) కూర్చి నాట్య రచన చెయ్యొచ్చు; అదేం పెద్ద విషయం కాదు గానీ కృతి మొత్తంగా ఒక కళాత్మకమైన సౌందర్యానుభూతి (aesthetic fulfillment) ఉండాలి. అది సాధించటానికి కావాలి తపస్సు.

కుతూహలం కొద్దీ అడుగుతున్నాను; మీ ప్రదర్శనలకు ప్రేక్షకులు ఎవరు? వారి నేపథ్యాలు సాధారణంగా ఏమైవుంటాయో తెలుసుకోవాలనుంది.

ముఖ్య ప్రేక్షకులు మిత్ర పరివారాలే 🙂
ఏనార్బర్ నగరంలో సామాజిక వాతావరణం మిగతా అమెరికన్ సమాజానికి భిన్నంగా ఉంటుంది. చిన్న ఊరు, పెద్ద విశ్వవిద్యాలయం, చుట్టూతా బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక రంగం వలన ఆర్ధికంగా బలమైన మధ్యతరగతి వర్గం, ఇవన్నీ కలిసి కళలకాణాచిగా రూపుదిద్దాయి ఈ నగరాన్ని. జనాభా కూడా అంతర్జాతీయమే. విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలవారు దేశ విదేశాలకి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందుచేత ప్రజలకి కొంత అంతర్జాతీయ చైతన్యం ఉంది. తమకి అనుభవం కాని కొత్త కళారూపాల్ని ఆహ్వానించి ఆస్వాదించే తత్త్వం ఉంది.
మా గురువుగారు పాల్గొనే ఇతర కార్యక్రమాల ద్వారా ఆమెకి ఏర్పడిన స్నేహితులు మా ప్రదర్శనల గురించి తెలుసుకుని హాజరవుతుంటారు. గత మేలో జరిగిన కార్యక్రమానికి స్థానిక దినపత్రిక వర్ణ చిత్రం వేసి మరీ ప్రదర్శన వివరాలు ప్రచురించింది. అలా అమెరికను ప్రేక్షకుల నిష్పత్తి ఎక్కువే మా ప్రదర్శనల్లో. వీరిలో చాలా మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారతీయ సంస్కృతితోనో, లేక ప్రాచ్య మత, సాహిత్య, కళల సాంప్రదాయాలతోనో ఏదో కొంత పరిచయం ఉంటుంది. చాలా మంది యోగా చేస్తుంటారు. బౌద్ధ ధ్యాన అనుయాయులు కూడా ఎక్కువే. మరి కొందరు ఆచార్యులు, విద్యార్ధులు భారతదేశానికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని అధ్యయనం చేస్తున్నవారున్నారు.
ఇక మా నాట్య బృంద సభ్యుల కుటుంబాలు మిత్రులు సరేసరి. వాళ్ళ ప్రోత్సాహం మాకు శ్రీరామ రక్ష.

————

నాట్య కళతో పరిచయము లేని నాకు, మీతో సంభాషణ ఆ కళను అభ్యాసం చేయడంలోనూ ప్రదర్శించడంలోనూ వున్న కృషిని గురించి కొంతైనా అవగాహన కలిగించింది. కళను మరింతగా ఆస్వాదించేందుకు ఇలాంటి అవగాహన అవసరమనుకొంటాను. కళాకారుని ప్రతిభ క్షణికమేనంటున్న మీ నుండి మరిన్ని సంగతులను అడిగి తెలుసుకోవాలనుంది. త్వరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశిస్తాను. ఆలోగా నేను “నను పాలింప..” కృతిని ఆ ఇద్దరి గాత్రాల్లో వినడమున్నూ, ఆర్.ఎస్. సుదర్శనం గారి మధుర మీనాక్షి కథనూ చదవడమున్నూ చేసి వుంటాను. 🙂 నాట్యంలో మీ ప్రవేశం, మీ గురువుగారు, సహాధ్యాయ బృందం, ప్రేక్షకులు, మదురై, విజయవాడలలోని బడుల్లో మీ అనుభవాలు ఓపికగా తెలియజేశారు. ధన్యవాదాలు. నాటికలకే కాక నాట్య రూపకాలకు కూడా దర్శకత్వం వహించగల శక్తినిచ్చే తపస్సు మీకు సాధ్యం కావాలని కూడా ఆకాంక్షిస్తూ… శెలవు.

———-

రానారె నుడికారం గురించి యర్రపురెడ్డి రామనాథరెడ్డి పొద్దులో రాసిన వ్యాసాలు ప్రసిద్ధి చెందాయి. పదాలు, పద్యాలు, కథల్లో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. తాను గురువుగా భావించే కొత్తపాళీని పొద్దు కోసం ఇంటర్వ్యూ చేశారు.

Posted in వ్యాసం | Tagged | 3 Comments

మందిమన్నియమ్ -3

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)

tbs.bmp

“మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు.

ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు.

ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది మూడోది:

సూత్రము – 21 : విశ్వాసాధారితము.

వృత్తి :

ప్రజాస్వామ్యము తమ నాయకులయందుఁ బ్రజలు పెట్టికొను గ్రుడ్డివిశ్వాసము మీఁద నాధారపడి వడచును.

(అ) ప్రజాస్వామ్యమునం దెన్నికైన నాయకులు ఏతీరునఁ బరిపాలింపవలెనను విషయముపైన నే విధమైన సంప్రదాయములు గాని, మార్గదర్శకములుగాని, నియంత్రణములు గాని యుండవు.

(ఆ) లభ్యమగుచున్న వివిధ దేశ రాజ్యాంగములు , ఏదైన తభావతు జరిగినప్పుడు న్యాయస్థానము నాశ్రయించుట కుపయోగపడు విధముగా వ్రాయఁబడినవే గాని తభావతులు జరుగకుండను, శాసనబద్ధముగాఁ దెలివిగా జరుగు తభావతులను నిరోధించు విధముగాను వ్రాయఁబడినవి కావు. అవి హెచ్చుపాలు ప్రభుత్వోద్యోగుల సావధానమునకున్ను, బడిపిల్లల భక్తిశ్రద్ధలకున్ను ఉద్దేశించినవే తప్ప నాయకుల సావధానమున కుద్దేశించినవి కావు. నాయకుల తప్పులకుఁ బ్రభుత్వము లప్రతిష్ఠ పాలైన సందర్భములలో సైతము ప్రభుత్వములనే మూకుమ్మడిగా బాధ్యము సేయు విధముగా శాసనములు రూపొందింపఁబడినవి తప్ప తప్పుడు నిర్ణయములకు నిజముగాఁదెఱవెనుక బాధ్యులైనవారిని వ్యక్తిగతముగా నిలువఁదీయుటకున్ను, శిక్షించుటకున్ను సౌలభ్యము లేదు. అక్కారణమునఁ బ్రభుత్వమునందున్న ప్రతికాపథగామియు యావత్తు ప్రభుత్వము నంతులేని వ్యాజ్యముల పరంపరయందు వాదిగాను, బ్రతివాదిగాను ద్రోసి తాను మాత్రము తప్పించికొనును. వ్యక్తిగతముగా నిలువఁదీయుటకు సౌలభ్యమున్న కొద్దిపాటి సందర్భములలో సైతము పదవీత్యాగమే కఠోరశిక్షగా భావింపఁబడును. తమతప్పుడు నిర్ణయముల వలన దేశమునకు జరిగిన యే నష్టమునకున్నునాయకులు గాని, వారి పక్షములు గాని ద్రవ్యరూపముగాఁ బరిహారముచెల్లించి క్షమాపణ వేఁడికొను సంప్రదాయము ఏ దేశపుఁ బ్రజాస్వామ్యమునందును లేదు.

(ఇ) ఎన్నిక కాకముందు తాము చేసిన వాగ్దానములను నాయకులు ఎన్నికైనతరువాత నుల్లంఘించినను, ముందుగాఁ జెప్పియుండని పనులు చేసినను,వారు అధికారమునం దున్నంతకాలమున్ను ప్రజలు మౌనముగా సైఁచితలవంచికొని యనుసరింపవలెను.

(ఈ) ఒకానొక విధానమును విస్తృత ప్రజానీకమునందు సుదీర్ఘ చర్చకుఁబెట్టకయే కేవలము ప్రజలెన్నికొన్న కొందరు ప్రతినిధులు సమర్థించిరన్నయొకే యొక కారణముచేత దానినిఁ జట్టముగాను బ్రభుత్వాజ్ఞగాను బ్రభుత్వము ప్రకటింపఁదలఁచినచో దానికెట్టి యాటంకమున్ను లేదు. ఇష్టములేనివారు న్యాయస్థానము నాశ్రయింపవచ్చును. కాని యొకవంక ప్రాఁతవ్యాజ్యములు పచ్చిగా నుండఁగానే మరియొక వంక భవిష్యత్తులోఁ బ్రభుత్వమట్టీ యప్రజాస్వామిక చర్యలను ఆమ్రేడింపదను హామీ మాత్రము లేదు.అదియును గాక, ప్రతినిధిసభల ద్వారమున జారీయగు కొన్ని చట్టములకుసంబంధించి మంచిచెడులను సమీక్షించుట సర్వోన్నత న్యాయస్థానములవిచారణపరిధికి సైత మతీతమైనది. కనుక వారున్ను నిస్సహాయులు.

(ఉ) రాజకీయవాది యొక్క యెల్ల యుద్దేశ్యములున్ను అనుమానములకతీతముగా శుచియే నని ప్రజలు నమ్మవలెను.

సూత్రము – 22 : కల్లోలభరితము.

వృత్తి :

ప్రజాస్వామ్యమునందు హింసలేకపోయినను బ్రజోద్యమములమూలమున నశాంతి తరచు.

(అ) పాలకులు తమయంతఁ దాము ప్రాప్తకాలజ్ఞులై ప్రజలకేది యత్యవసరమో ప్రయత్నపూర్వకముగా నెఱిఁగి తదనురూపమైన చర్యలు గైకొనుటయీ కాలమునందు జరుగదు కనుక సమస్యల తీవ్రతను బయల్పఱచు నిమిత్తము ప్రజలు తఱచుగా నుచ్చైః స్వరులై వీథినఁ బడుచుందురు.

(ఆ) ఇది మిక్కిలి యభ్యాసమైపోవుటచేత నట్లు వీథినఁ బడఁజాలనివారినిబ్రభుత్వముకూడ సరకుగొనదు. అందువలన వీథులకెక్కి సంఖ్యాబలమును బ్రదర్శింపలేనివారిని దక్కుంగల ప్రజలు కూడ లక్ష్యపెట్టరు.

(ఇ) కనుక వీథుల కెక్కుట సుసంగతమైనను, గాకపోయినను బలప్రదర్శననిమిత్తమున్ను, ప్రత్యర్థుల తోడి పోటి నిమిత్తమున్ను, నాయకత్వ సిద్ధి నర్థించియుఁ బెక్కుమంది తఱచుగా వీథులకెక్కుచుందురు.

(ఈ) ఊఱక వీథుల కెక్కుట వలనఁ బ్రయోజనము లేదు గనుక నెవరినోయొకరిని విమర్శనవిషయముగాఁ గొని సునిశితమైన దూషణములకుఁబాల్పడుచుందురు. ౌ్ఛలితార్థముగాఁ బ్రజాస్వామ్యమునం దొండొరులకుగౌరవమిచ్చుపుచ్చుకొను సంస్కృతియన్ననో మిక్కిలి యడుగంటి యుండును.

సూత్రము – 23 : విలంబన మయము.

వృత్తి :

విలంబనమనఁగా జాప్యము. ప్రజాస్వామ్యమునందుఁ బ్రతి నిర్ణయమున్ను మరియు దాని యనుష్ఠానమున్ను మిక్కిలి జాప్యమగును.

(అ) ప్రజాస్వామ్య మేకకాలములో బహునాయకత్వము నంగీకరించు వ్యవస్థగనుక నే యొక్క నాయకుని మాటను గాని పాటిగాఁ గొని పనిసేయుటజరుగదు. అట్లు తతౖఉక్షణమే పాటిగాఁ గొనఁదగినంత నమ్ముబాటు కూడనే యొక్క నాయకునికిని ఉండదు.

(ఆ) అందువలనఁ బ్రతిపాద న పరంపరలున్ను, వానిపై సుదీర్ఘ చర్చలున్ను,పరిశీలన విచారణములున్ను మినహా, దత్క్షణ నిర్ణయములుండవు.

(ఇ) చర్చలు ముగిసి, యొక నిక్కచ్చి తీరుమానమునకు వచ్చిన సందర్భముల యందును ఆది యనుష్ఠానరూపమును సంతరించికొనుట దుర్ఘటము. ఏల ననఁగాఁ, బ్రజాస్వామిక ప్రభుత్వ వ్యవస్థ యందధికార కేంద్రములనేకము. అధికారుల పరముగాను, నాయకుల పరముగాను ఒక తీరుమానమనేక స్థాయిలను, దశలను గడచి, బాలారిష్టములను దాఁటికొని, తుదకువిజయవంతముగా నెఱవేఱినచో నది యొక గొప్ప యదృష్టముగా నెంచవలసి యున్నది. పెక్కు సందర్భములయందుఁ పుణ్యకాలము తీఱి తీరుమానములకుఁ కాలదోషము పట్టుటయే యనివార్యమగును.

(ఈ) ఈ కతనఁ బ్రజాస్వామ్యపుఁ బనితీరు మిక్కిలి యసమర్థముగా నుండును.

సూత్రము – 24 : ఒక సుస్థిరమైన యస్థిరత.

వృత్తి :

ప్రజాస్వామ్య మస్థిరత్వమునకు దారితీయును.

(అ) ప్రజాస్వామ్యమునందుఁ బ్రజాస్వామ్యము మినహా తక్కుంగల వెల్లయునశాశ్వతమే. ప్రజాస్వామ్యమునం దత్యున్నతాధికారము కూడఁ బ్రతి కొంతవ్యవధానమునకున్ను చేతులు మారుచుండుటచేఁ బ్రభుత్వములు తరచుగామరణించుచుండును. వానితోఁ బాటుగా వాని యొక్క యెల్ల సిద్ధాంతములున్ను, పథకములున్ను, చేపట్టులున్ను మరణించును. కనుక సమాజమునం దస్తవ్యస్తతయు, అల్లకల్లోలమున్ను మిక్కిలి తఱచగును.

సూత్రము – 25 : ప్రజలను ఈకోళ్ళుగాఁ జూచును.

వృత్తి :

ఈకోలనఁగా సమ్మతి. అట్టి సమ్మతిని దెల్పుచు ముద్రవేసిన కాగితములు కూడ ఈకోళ్ళే. ప్రజాస్వామ్యమునందుఁ బ్రభుత్వముల దృష్టిలోఁబ్రజలకు మనుష్యప్రతిపత్తి కంటె ఈకోళ్ళ ప్రతిపత్తి యెక్కువ. అనఁగాఁదమకు ఈకోలిచ్చి తమ యధికారమును నిలువఁబెట్టఁగల వర్గములనే వారుపరిగణనములోనికిఁ దీసికొందురు.

సూత్రము – 26 : సర్వస్వాధికార ధోరణికి దారితీయును.

వృత్తి :

ప్రజాస్వామ్యము యావత్తు ప్రజానీకమును బ్రభుత్వము నెన్నికొనుటలో భాగస్వాములను జేయును గనుకఁ బ్రతి పౌరునికిని ప్రభుత్వమునెన్నికొనుటలోఁ దన స్వంత కార్యాచరణ పథకమొకటి యుండును. ప్రభుత్వమెన్నికైన పిదప దాని నాచరణములోనికిఁ దేరవలసినదని పౌరులు ప్రభుత్వముపై నొత్తిడి తెచ్చెదరు. అట్లు ప్రభుత్వ మెవరికిఁ గావలసిన యభీష్టపరిపూర్తి వారికిఁ జేసిపెట్టు ప్రక్రియలో భాగముగా నెల్ల రంగములను మరియువిషయములను దన యధికారపరిధిలోనికిఁ దెచ్చికొని స్వాధీనము జేసికొనును. కనుకఁ బ్రజాస్వామ్యములోఁ బ్రభుత్వము జోక్యము చేసికొనని విషయమనునదేదియు నుండదు. అందుచేతఁ బ్రజాస్వామ్య ద్వారమున నధికారపీఠమును గైవసము జేసికోఁదలఁచు నియంతలకీ పరిస్థితి మిక్కిలి సంతోషకరముగా నుండును.

సూత్రము – 27 : సమన్వయ విచ్ఛేదకము

వృత్తి :

ప్రజాస్వామ్యమునందు ఖచ్చితమైన శ్రమవిభజన మూలమునఁబ్రత్యేక నైపుణ్యములకు మిక్కిలి ప్రాధాన్యమేర్పడుటచే వివిధరంగములుకొందరు మహానిపుణుల యొక్కయు ననుభవజ్ఞులైన యధికారుల యొక్కయు స్వంత సామ్రాజ్యములుగా మారిపోవును. కనుక వారి యాజ్ఞలనునెఱవేర్చుటే తప్పఁ దాము చేయుచున్న పనుల మంచిసెబ్బరల గురించిలోఁతుగా యోచించు నవకాశము సామాన్యుల కుండదు. మంచిసెబ్బరలవివాదము తమ కప్రస్తుతమనియు, వాని విషయమును దమ పైవారెఱుఁగుదురనియు, జీతము దీసికొనుచున్నందుకుఁ దమ కర్తవ్యమును దాముప్రభుత్వముపట్ల సక్రమముగా నెఱవేర్చుటయే చాలు ననియు వారు వాదించెదరు. అందుచేతఁ బ్రజాస్వామ్య ద్వారమున నధికార పీఠమును గైవసము జేసికోఁదలఁచు నియంతలకీ పరిస్థితి తద్దయు సంతోషకరముగా నుండును.

సూత్రము – 28 : ప్రజాస్వామ్యమునందుఁ బ్రజాభీష్ట నిర్వర్తనము బహుళము.

వృత్తి :

బహుళ మనఁగాఁ – బ్రజాభీష్టము నది కొన్నిసారులు సంపూర్ణముగా నెఱవేర్చవచ్చును. కొన్నిసారులు కొంతవరకు మాత్రమే నెఱవేర్చవచ్చును. కొన్నిసారులు బోత్తిగా నెఱవేర్చకయే పోవచ్చును. మఱికొన్నిసారులు ఆశించినట్లు కాక, రూపాంతరముగా నెఱవేర్చవచ్చును.

సూత్రము – 29 : ప్రజాస్వామ్యమునందు శిక్షలు సుతారము.

వృత్తి :

ఇదిప్రజాస్వామ్యమునందు నేరస్థులకు శిక్షలు పడుట తక్కువ. పడినను అవి కఠినముగా నుండవు.

(అ) న్యాయాధికారులతో సహా యెవ్వరున్ను వైయక్తిక భావోద్వేగములకులోను గానంత మునీశ్వరులు కారనిన్నీ, ఎట్టి పొఱపాటును సేయనంతదైవాంశ సంభూతులు మొదలే కారనిన్నీ ప్రజాస్వామ్యము నమ్మును. కాఁబట్టినేరము స్మృతిశాస్త్ర ప్రకారము సాంకేతికముగా ఋజువైనను మఱియొకప్రక్కనింది తుఁడు తనపై నారోపింపఁబడిన తప్పు బోత్తిగాఁ జేసియుండకపోవునవ కాశము కూడఁ గలదని ప్రజాస్వామ్యవాదులు భావించెదరు. అదియేనిజ మగుచో నిందితునికిఁ గఠినశిక్ష విధించుట ౌ్ఛూరాతిౌ్ఛూరమగునన్యాయమే యగును. నూఱుగురు దోషులు తప్పించికొన్నను మేలే గాని,ఒక్క నిర్దోషి కైనను శిక ్ష పడరాదని చెప్పెదరు. కనుక నరుదైన సందర్భములలోమినహా, నెంత పెద్ద నేరమునకైనను బ్రజాస్వామ్యమునందుఁ జెఱసాలయేవిధింపఁబడును.

(ఆ) ౌ్ఛలితార్థముగా వాస్తవికాచరణమునందు దోషులందరును దప్పించికొనుచుందురు. నిర్దోషులున్ను నిర్ధనులున్ను మాత్రమే చెఱసాలలయందు మ్రగ్గుచుందురు.

(ఇ) శిక్షలు కఠినము కాకపోఁబట్టి యొక నేరస్థుఁ డదే నేరము నెన్నిసారులైనను జేయవచ్చును. కావలసినన్ని సారులు చెఱసాలకుఁ బోవచ్చును.మఱల బయటకు రాను వచ్చును.

(ఈ) ఆ నేరస్థులను దమతమ పనుల నిమిత్తము ఉపయోగించికొనుపెద్దలుందురు గనుక నిట్లు చెఱసాలకుఁ బోవుచుండుటయు మగుడ బయటకు వచ్చుచుండుటయు నొక లాభసాటి వ్యాపారముగాఁ బరిణమించును.తఱచుగా నేరములు చేసి చెఱసాలకుఁ బోవువారి యసమాన శౌర్యప్రతాపములకు జనసామాన్యము వెఱతురు గనుక కొందరికీ చెఱసాల యనుభవము వారి కీర్తికిరీటములోఁ గలికితురాయి వలె గర్వకారణమగును.

(ఉ) పర్యవసానముగా యావత్తు సమాజమున్ను నేరపూరితమై భయముగొల్పుచుండును.

::నాలుఁగవ ప్రస్తావనము: ప్రజాస్వామ్యపుఁ బరిమితులు::

సూత్రము – 30 : ప్రజాస్వామ్యము పెద్ద భూభాగములకుఁ బెద్దగానప్పదు.

వృత్తి :

చిన్న దేశమనఁగా –

(అ) ఏ భూభాగపు నడిబోడ్డు నుండి యొక రౌతొక యుత్తమాశ్వముపై బయలుదేరి యిఱువది (20) ఘడియల వ్యవధానము లోపల నేదో యొక పొలిమేరను జేరఁగలుగునో యట్టి భూభాగమున్ను, మఱియు దాని నాశ్రయించికొని కాపురముండు జనసందోహపు మొత్తమున్ను. ఘడియ యనఁగా సరాసరి దినప్రమాణమునం దఱువదవ వంతు.

(ఆ) అట్లఱువది (60) ఘడియల వ్యవధానము లోపలఁ జేరఁగలుగుచోనది పర్యాప్త పరిమాణము గల దేశము.

(ఇ) అంతకు మించిన విరివి గల పెద్ద దేశములలోను, సామ్రాజ్యములలోను బాక్షిక ప్రజాస్వామ్యము మాత్రమే ఉనికి యందుండుట కవకాశము గలదు.

Posted in వ్యాసం | Tagged | Comments Off on మందిమన్నియమ్ -3

మృతజీవులు – 12

“సరేనమ్మగారూ! అంటూ ఫితీన్య పరుపుమీద దుప్పటి పరచి దిళ్ళు పెట్టింది.

“ఇదుగో మీపక్క. హాయిగా నిద్రపోండి. ఇంతకూ మీకేమీ అక్కర్లేనట్టేనా? రాత్రిపూట మడమలు ఒత్తించుకోవటం మీకు అలవాటున్నదా? మావారు అలా కాని నిద్రపోయేవారు కారు”, అన్నది ఇల్లుగలావిడ.

అతిథి కాళ్ళు వత్తడాన్ని కూడా నిరాకరించాడు. ఇంటావిడ వెళ్ళిపోగానే అతడు దుస్తులు విప్పి, పైనా లోపలావేసుకున్నవన్నీ ఫితీన్యకు ఇచ్చేశాడు. ఆమె అతనికి గుడ్‌నైట్ చెప్పి తడిబట్టలతో నిష్క్రమించింది. అతను దాదాపు కప్పు ఎత్తున ఉన్న పక్కను చూసి సంతోషించాడు. ఈకలను కొట్టడంలో ఫితీన్య చాలా నిపుణురాలే. అతను ఒక కుర్చీ వేసుకుని దానిమీదుగా పక్కమీదికి ఎక్కేసరికి అది అతని బరువుకు ఇంచుమించు నేలకు అంటుకున్నంత పని చేసింది. పరుపులో నుంచి ఈకలు చిమ్మి గది నాలుగు మూలలా పడ్డాయి. అతను కొవ్వొత్తి ఆర్పేసి, రజాయి మీదకు లాక్కొని, ఉండ చుట్టుకుని పడుకుని, క్షణంలో నిద్రపోయాడు. అతను మరుసటి ఉదయం నిద్ర లేచేసరికి బాగా పొద్దెక్కింది, ఎండ అతని కళ్ళలో పడుతోంది. కిందటి రాత్రి గోడలమీదా, కప్పు కిందా మాటుమణిగి నిద్రపోయిన ఈగలు ఇప్పుడతన్ని పరిశోధిస్తున్నాయి. ఒకటి అతని పెదవి మీదా, మరొకటి చెవిమీదా కూచున్నాయి. మూడోది అతని కంటిమీద వాలే ప్రయత్నంలో ఉన్నది. ఇంకొకటి అవివేకంగా అతని ముక్కు రంధ్రం సమీపంలో వాలి, శ్వాసతోపాటు లోపలికి వెళ్ళిపోగా అతనికి తుమ్ములు పట్టుకున్నాయి – అందుకే అతను నిద్రలేచాడు.

ఇప్పుడు గది అంతా చూస్తే పటాలన్నిటిలోనూ పక్షుల బొమ్మలు కావని తేలింది. వాటిలో ఒకటి కటూజవ్ చిత్తరువు. మరొకటి తైలచిత్రం, అందులో ఒక ముసలాయన మొదటి పాల్ పరిపాలన నాటి యూనిఫాం వేసుకుని ఉన్నాడు. గడియారం మళ్ళా బుసకొట్టి పదికొట్టింది. ఒక ఆడమొహం తలుపులోంచి తల లోపలికి పెట్టి, అతను సుఖంగా నిద్రపోగలందులకై ఉడుపులు సాంతం తీసేసి ఉండడం గమనించి, చప్పున మాయమయింది. అతను కొంచంసేపు ఆలోచించాక గాని ఆ మొహం ఇల్లుగల ఆవిడదని జ్ఞాపకం రాలేదు. అతను షర్టు తొడుక్కున్నాడు. ఆరబెట్టి బ్రష్ చేసిన అతని ఉడుపులన్నీ అతని పక్కనే ఉన్నాయి. అతను దుస్తులు షరించి అద్దం ముందు నిలబడి ఎంత గట్టిగా తుమ్మాడంటే, సరిగా సమయానికి కిటికీ దగ్గరికి వచ్చిన ఒక టర్కీ కోడి తన భాషలో “నీ ఇల్లు బంగారం కానూ!” అని కాబోలు అరిచి పారిపోయింది. చిచీకవ్ దాన్ని “ఫూల్” అని తిట్టాడు. భూమికి ఆటే ఎత్తులేని కిటికీ వద్దకు వెళ్ళి అతను బయటికి చూచాడు. కిటికీ అవతల ఉన్నది కోళ్ళ ఆవరణ లాగా కనబడింది. ఇరుకుగా ఉన్న ఆవరణలో అన్ని రకాల పక్షులూ, జంతువులూ ఉన్నాయి. కోళ్ళకూ, టర్కీ కోళ్ళకూ లెక్కలేదు. వాటిమధ్య ఒక పుంజు కళ్ళు ఎత్తెత్తి వేస్తూ, పచార్లు చేస్తూ, నెత్తి మీది కుచ్చు ఆడిస్తూ, తల పక్కకుపెట్టి ఏదో ఆలకిస్తున్నట్టుగా ఉన్నది.

అక్కడ ఒక ఆడపందీ, దాని పిల్లలూ ఉన్నాయి. అది ఒక కుప్పను కుళ్ళగించుతూ, మధ్యలో అటుగా వచ్చిన ఒక కోడిపిల్లను కబళించి, ఏమీ ఎరగనట్టు ఎప్పటిలాగే పుచ్చతొక్కులు తింటున్నది. ఈ కోళ్ళదొడ్డి కంచె అవతల కూరల మళ్ళలో కాబేజీలూ, ఉల్లీ, ఉర్లగడ్డలూ, బీటురూట్ వగైరా అనేక కూరలూ మొక్కలున్నాయి. ఈ మళ్ళమధ్య అక్కడక్కడా యాపిల్ చెట్లూ, ఇతర చెట్లూ ఉన్నాయి; వాటిని పక్షులు పాడుచెయ్యకుండా వలలు అడ్డం కట్టారు. పిచ్చుకలూ, తీతువు పిట్టలూ మందలు మందలుగా ఇక్కణ్ణుంచి అక్కడికీ, అక్కణ్ణుంచి ఇక్కడికీ ఎగురుతున్నాయి. వాటికోసమే అక్కడక్కడా గడలపైన చేతులుచాచి ఉన్న దిష్టిబొమ్మలను కూడా ఉంచారు. కూరమళ్ళ అవతలగా కమతగాళ్ళ గుడిసెలున్నాయి. అవి బారులు తీరిలేక, ఇష్టం వచ్చినట్లుగా కట్టి ఉన్నాయి. కాని చిచీకవ్ చూసినదాన్నిబట్టి, ఇళ్ళు బాగుండడంచేత కమతగాళ్ళ ఆర్థికస్థితి బాగానే ఉన్నట్టు కనబడింది. కప్పుమీది చెక్కలు పుచ్చినచోటనల్లా కొత్త చెక్కలు వేసి ఉన్నాయి. ఒక్క గేటు కూడా ఒరగబడిలేదు. అతనికేసి తిరిగి ఉన్న ఇళ్ళ ఆవరణల్లో ఒకదానిలో ఒక కొత్తబండి ఉన్నది, మరొకదానిలో రెండు కూడా ఉన్నాయి.

“ఏం, ఈవిడకు మంచి ఊరే ఉందే!” అనుకుని అతను ఆవిడతో దీర్ఘంగా మాట్లాడి ఆమెతో మరింత బాగా పరిచయం చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. ఆవిడ లోపలికి తొంగి చూసిన తలుపు సందులగుండా చూస్తే అవతలి గదిలో టీబల్ల వద్ద ఆమె కనిపించింది. అతను స్నేహ సౌహార్దాలు ఉట్టిపడేలాగా ఆమెను సమీపించాడు.

“గుడ్మార్నింగ్, బాబుగారూ. చక్కగా నిద్రపోయారా? అన్నదామె కూర్చున్న చోటి నుండి లేస్తూ. ఆమె రాత్రి ధరించిన దుస్తుల కంటె మంచివి ధరించి ఉన్నది. ముదురు రంగు గౌను తొడిగింది, నెత్తికి కుళాయి లేదు, మెడకు మాత్రం ఇంకా ఏదో చుట్టుకుని ఉన్నది.

“చాలా బాగా నిద్రపట్టింది, మీరెలా నిద్రపోయారు?” అంటూ అతను ఒక వాలుకుర్చీలో కూచున్నాడు.

“బాగా నిద్రపోలేదు”

“అదేం?”

“నాకు నిద్ర పట్టదు, నడుమునొప్పి. మోకాలికి ఎగువగా ఒకటే సలుపు.”

“పోతుందమ్మా, పోతుంది. దాన్ని గురించి ఆలోచించకండి.”

“పోతే కావలసిందేమిటి? కొవ్వేసి తోమి కర్పూరతైలం పట్టించాను. మీరు టీతో ఏం తీసుకుంటారు? ఆ సీసాలో ఇంట్లో కాచిన సారా ఉన్నది?”

“మరేమండీ? ఒక చుక్క ఇంటి సారాకూడా తీసుకుందాం!” అన్నాడు చిచీకవ్.

చిచీకవ్ స్నేహభావంగానే ఉన్నప్పటికీ మానిలవ్ వద్దలాగా మొహమాటానికి పోకుండా స్వేచ్ఛగా ప్రవర్తించడం పాఠకులు గ్రహించే ఉంటారు. రష్యాలో మేము మిగతా దేశాల కన్న ఇతర విషయాలలో వెనకబడి ఉన్నప్పటికీ ప్రవర్తన విషయంలో అందరికన్నా ముందుకు వెళ్ళామనాలి. మా ప్రవర్తనలు చూపే విచక్షణ వివరించటానికి సాధ్యపడదు. అందులో ఉండే స్వారస్యం జర్మనువాడికిగాని, ఫ్రెంచి వాడికిగాని అర్థం కాదు. వాళ్ళు కోటీశ్వరుడితోనూ, పొగాకు అమ్మేవాడితోనూ ఒకే గొంతుతో, ఇంచుమించు ఒకేభాష మాట్లాడుతారు, మనసులో కోటీశ్వరి పట్ల దాస్యభావమే ఉన్నప్పటికీనూ. మా పద్ధతి అదికాదు; మాలో ఎంత తెలివిగలవాళ్ళున్నారంటే వాళ్ళు మూడువందల కమతగాళ్ళు గలవాడితో మాట్లాడినట్టు రెండువందల మందే కలవాడితో మాట్లాడరు; మూడువందలు గలవాడితో మాట్లాడినట్టు ఐదువందలు గలవాడితో మాట్లాడరు; ఐదువందలు గలవాడితో మాట్లాడినట్టు ఎనిమిది వందలు గలవాడితో మాట్లాడరు. పది లక్షలమంది గలవాడివరకూ ఎక్కడికక్కడే తేడా ఉంది. మాటవరసకు ఒక ప్రభుత్వ కచేరీ ఉందనుకుందాం – ఇక్కడ గాదు, ఎక్కడో ఇంకో లోకంలో – ఈ కచేరీకి ఒక పెద్ద అధికారి ఉన్నాడనుకుందాం. ఈ మనిషి తన కిందివాళ్ల మధ్య కూచుని ఉండగా గమనించండి – అతన్ని చూసి బిత్తరపోతాం. దర్జా, హుందా… ఆ మొహంలో ఎన్ని కళలు! బ్రష్ తీసుకుని అతని చిత్తరువు వేయవచ్చు. సాక్షాత్తూ సృష్టికర్తే, మూడు మూర్తులా సృష్టికర్త! గరుత్మంతుడల్లే గంభీరంగా మసలుతాడు. ఇంత గరుత్మంతుడూ తన గది విడిచి తన పై అధికారి గదికి చంకలో కాగితాలు పట్టుకుని వెళ్ళేటప్పుడు లచ్చుకలాగా అయిపోతాడు. ఉత్తప్పుడుగాని, ఏదైనా పార్టీ జరిగే చోటగాని తనచుట్టూ ఉన్నవాళ్ళు తనకన్న తక్కువ హోదా గలవాళ్ళయితే సృష్టికర్త సృష్టికర్తలాగే ఉంటాడు, తనకంటె ఒక్క పిసరు హెచ్చు హోదా గలవాళ్ళుంటే చాలు అంతలో అద్భుతంగా మారిపోతాడు; ఈగ అయిపోతాడు, ఈగకన్న కూడా హీనం, నలుసుగా మారిపోతాడు! అతన్ని చూసి మనం, “ఇతను ఇవాన్ పెట్రోవిచ్ ఎందుకయింది? ఇవాన్ పెట్రోవిచ్ ఇంకా ఎత్తుగా ఉంటాడు, వీడెవడో సన్నగా, పొట్టిగా ఉన్నాడు; ఇవాన్ పెట్రోవిచ్ బలంగా, గంభీరధ్వనితో మాట్లాడుతాడు, ఎన్నడూ నవ్వడు; వీడు చూడబోతే ఏం మాట్లాడుతున్నదీ తెలియనంత సన్నగా మాట్లాడుతూ, నవ్వుతున్నాడు కూడానూ” అనుకుంటాం. కాని దగ్గరికి వెళ్ళిచూస్తే ఇవాన్ పెట్రోవిచే! మనం అప్పుడేమనుకుంటామంటే, “ఓహో!…” అది అలా ఉంచి మన కథలో పాత్రల సంగతి చూసుకుందాం.

-కొడవటిగంటి కుటుంబరావు

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 12

మనుషులూ, మాటలూ

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

తక్కిన ప్రాణులను “నోరులేని జీవాలుగా” పరిగణించడం మనకు అలవాటు. భౌభౌలూ, కావుకావులూ మన వాక్పటిమకు సాటిరావు. కుక్కలనూ, పిల్లులనూ పెంచుతున్నవారు వాటితో మాట్లాడతారుగాని ఆ సంభాషణ అంతా ఏకపక్షమే. అందుకే తమకున్న రోగ లక్షలాణెటువంటివో వివరించలేనివారు పశువుల డాక్టర్‌వద్దకు వెళ్ళాలనేది ఒక జోక్‌. చిలక పలుకులు నిజమైన మాటలు కావు. మాటలంటే కేవలం ధ్వనులు చెయ్యడంకాదు; వాటి వెనక ఆలోచనలూ, ఉద్దేశాలూ ఉంటాయి. మాటలు పలకగలగడమూ, భాషల ఆవిర్భావమూ మనుషులు సాధించిన ప్రత్యేక విజయాలు. ఇందుకుగాను నోటి నిర్మాణంలోనూ, మెదడు పరిణామంలోనూ కొంత అభివృద్ధి జరగాలి.

మనుషుల శరీర నిర్మాణం దృష్య్టా సుమారు 30, 40 వేల సంవత్సరాల క్రితం దాకా భాషలు మొదలవలేదని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రాచీన మానవ అవశేషాలనుబట్టి తొలి భాషలు ఎప్పుడు మొదలయి ఉంటాయో శాస్త్రజ్ఞులు ఊహించగలుగుతున్నారు. అరుపులూ, కూతలూ, పెడబొబ్బలూ పెట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లేవీ అవసరం కావుగాని, మాటలు మాట్లాడడానికి నోట్లో నాలుక అష్టవంకరలూ తిరగగలిగి ఉండాలి. నాలుక కండరాలను నియంత్రించడానికి మెదడు కొంత శ్రమపడాలి. అందుచేత పదాలు ఉచ్చరించడానికి నాలుకనూ, మెదడునూ కలిపే నరాలు ప్రవేశించే మార్గం తగుమాత్రం పెద్దదిగా ఉండాలి. పుర్రెకు అడుగున ఈ సదుపాయానికై ఏర్పాటయిన రంధ్రం చింపాంజీ, గొరిల్లాలవంటి నరవానరాలకు మనకన్నా చిన్నదిగా ఉంటుంది కనకనే అవి మాట్లాడలేవు. అంతేకాక నాలుక స్వేచ్ఛగా తిరగడానికి వాటి దంతాల మధ్య మనుషులకున్నంత స్థలం ఉండదు.

ఆధునిక మానవుల ఆవిర్భావం జరుగుతున్నప్పుడు వారి శరీరాల్లో (ముఖ్యంగా, మెదడుకు సంబంధించిన నాడీవ్యవస్థలో) కొద్దిపాటి మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మనుషులు రెండు కాళ్ళమీద నడవడం మొదలుపెట్టాక వారి చేతులూ, చేతి వేళ్ళూ నైపుణ్యాన్నీ, ప్రత్యేకతనూ సంతరించుకోసాగాయి. ఇందుకు అనుగుణంగా వారి మెదడులోని కొన్ని భాగాల్లో అపూర్వమైన అభివృద్ధి జరిగింది. వీటిలో నుదుటి వెనక ఉండే బ్రోకా కేంద్రం ఒకటి. ఇది పెద్దది కావడం వల్ల పెదవులూ, నాలుకా బాగా తిరగగలిగాయి. పదాలను ఉచ్చరించడానికీ, వాటిని విని, అర్థం చేసుకోవడానికీ తగిన పరిణామాలు జరిగాయి.

జంతువులూ, పక్షులూ అవసరమైనప్పుడు శబ్దాలు చేస్తూ సంకేతాలు పంపగలవు. జత కట్టడానికో, సాటి ప్రాణులను హెచ్చరించడానికో, కోపమూ, బాధా వ్యక్తం చెయ్యడానికో రకరకాల చప్పుళ్ళు చెయ్యగలవు. కానీ అవన్నీ పరిమితంగా, వాటి అవసరాలకు మించకుండా ఉంటాయి. కోతులలాగా చెట్లకు అంటిపెట్టుకోకుండా విభిన్న పరిస్థితులలో జీవించసాగిన మానవజాతి మనుగడకు భాష ఉపయోగం జీవపరిణామంలోనూ, మానసిక అభివృద్ధిలోనూ అత్యవసరం అయిపోయింది. సముదాయాలుగా జీవిస్తూ, పరస్పరం సహకరించుకోసాగిన తొలి మానవుల జీవనశైలి జటిలం అవుతున్నకొద్దీ భాష అవసరం పెరిగింది.

మొదటగా ఒక్కొక్క వస్తువుకూ సంకేతాలు ఏర్పాటు చేసుకోవలసివచ్చింది. రోజువారీ సంఘటనల వైవిధ్యం పెరుగుతున్నకొద్దీ ఈ శబ్దాల మధ్య పొరబాట్లూ, అపార్థాలూ తలెత్తకుండా ఉండడానికని క్రమంగా వేరు వేరు పదాలవంటివి ఏర్పాటు చేసుకోక తప్పలేదు. ఒకవంక మెదడులో ఉచ్చారణకు సంబంధించిన అభివృద్ధి జరుగుతూ ఉంటే మరొకవంక తాము వింటున్న ఒక్కొక్క పదానికీ అర్థాలు స్ఫురించడం, ఆ పదం వర్ణిస్తున్న వస్తువునో జంతువునో ఊహించుకోగలగడం కూడా మనుషులకు సాధ్యమైంది. జంతువులలాగా కాకుండా “ఫలానా పరిస్థితిలో ఫలానా సంఘటన జరిగితే ఏమౌతుంది” అనే ఆలోచనలు తలెత్తడానికీ, వాటి గురించి సాటివారితో మాటల ద్వారా చర్చించడానికీ అవకాశాలు పెరగసాగాయి.

స్వరపేటిక పోలిక
నాలుక వంపు, నోటి పైకప్పు ఆకారం, స్వరపేటిక స్థానం
వగైరాల్లో తేడాలు 1. మనిషి, 2. చింపాంజీ

ప్రాణుల్లో నోరు ఆహారానికై ప్రధానంగా ఉద్దేశించబడిన అవయవం. శబ్దాలూ, మాటలూ ఆ తరవాత మొదలైన ప్రక్రియలు. మాట్లాడడానికి జీవపరిణామ క్రమంలో స్వరపేటికలో తగిన మార్పులు జరగాలి. జపాన్‌లోని కొందరు పరిశీలకులు ఈ మార్పులు ఆహారం మింగడానికి సంబంధించినవని భావిస్తున్నారు. మన గొంతులోని ఆహారనాళిక శ్వాసనాళికకు సమీపంలోనే ఉంటుంది. అందుకనే తక్కిన జంతువులతో పోలిస్తే మనుషుల్లో ఆహారం శ్వాసనాళికకు అడ్డంపడే ప్రమాదం ఎక్కువ. ఊపిరి తీసి వదిలేందుకని ఏర్పాటైన శ్వాసకోశవ్యవస్థ పరిణామక్రమంలో మాటల ఉచ్చారణకు పనికొచ్చి ఉంటుంది.

స్వరపేటిక నిర్మాణంలో చింపాంజీలకూ, మనుషులకూ పెద్దగా తేడాలు లేవు. ఈ రెండు జాతుల్లోనూ స్వరపేటిక గొంతుకు దిగువ భాగాన ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇది జరగడానికి కొంతకాలం పడుతుంది కనకనే పసిపిల్లలకు మాటలు రావు. నియాండర్తాల్‌ మానవుల స్వరపేటిక నిర్మాణం నేటి పసిపిల్లలను పోలి ఉండేదనీ, అందుకనివారు మాట్లాడగలిగేవారా అన్నది సందేహాస్పదమనీ భావిస్తున్నారు. ఎటొచ్చీ చింపాంజీల్లో నాలుక వెనకభాగపు కండరాన్ని పట్టి ఉంచే ఎముక స్థానం తేడాగా ఉండడంవల్ల అవి మాట్లాడలేకపోయాయని ఈ పరిశీలకుల ఉద్దేశం. ఆధునిక మానవుల్లో స్వరపేటిక ప్రాంతం దీర్ఘంగా సాగి ఉంటుంది కనక మాట్లాడడం వీలవుతోంది. ముఖ్యంగా అచ్చులు పలకడానికీ, అవసరమైనప్పుడు ముక్కుతో అనునాసికాలు మాట్లాడకుండా ఉండడానికీ ఏర్పాట్లున్నాయి. అందువల్లనే మనుషులు రకరకాల పదాలు ఉచ్చరించగలరు.

మనుషులకు భాష విషయంలో శారీరకంగా ప్రత్యేకత ఉంటే దానికి జన్యుపరమైన కారణాలుండాలి. మాట్లాడడంలో ఇబ్బందులకు గురవుతున్నవారిమీద ఇటీవల జరిపిన పరిశోధనల వల్ల అందుకు సంబంధించిన ఒక జన్యువు గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది. ఒక కుటుంబంలో వంశ పారంపర్యంగా కనబడుతున్నఈ వింత రుగ్మత గురించి పరిశోధనలు చేశారు. వాటివల్ల తేలినదేమిటంటే ఫాక్స్‌పీ2 (FOXP2) అనబడే ఈ జన్యువులోని డీఎన్‌ఏ క్రమంలో మ్యుటేషన్‌ కారణంగా ఒకే ఒక్క మార్పు జరిగితే ఈ సమస్యలు తలెత్తుతాయి. పిండదశలో ఇవి మొదలవడంతో మెదడులో మాటలు పలకడానికి తోడ్పడే నరాలు దెబ్బతినడం, ఇతర సమస్యలు ఏర్పడడం జరుగుతుంది. ఈ కారణంగా బాధితులకు నోటినీ, పెదవులనూ, తక్కిన ముఖభాగాలనూ సరిగ్గా కదిలించడంలో ఇబ్బందు లున్నట్టుగా తెలిసింది. స్పష్టమైన ఉచ్చారణలోనూ, వ్యాకరణపరమైన వాక్య నిర్మాణంలోనూ లోపాలు కలిగాయి.

ఈ జన్యువు మనలోనేకాక సేంద్రియ పదార్థాల్లోనూ, చుంచులూ, గొరిల్లాలూ, చింపాంజీలవంటి ప్రాణుల్లోనూ కూడా ఉంటుంది. దీనివల్ల ఒక రకమైన ప్రోటీన్‌ నిర్మాణం జరుగుతుంది. ప్రోటీన్లన్నీ అమినో ఆసిడ్లతో తయారవుతాయి. ఉదాహరణకు విభిన్నజాతులుగా ఏడున్నర కోట్ల సంవత్సరాల క్రితమే వేరుపడిన చుంచులకూ, వానరాలకూ 715 అమినో ఆసిడ్లలో ఒక్క అమినో ఆసిడ్‌ తేడాగా ఉంటుంది. మనుషులకు 60 లక్షల సంవత్సరాల క్రితం బంధువులుగా ఉండిన గొరిల్లాలూ, చింపాంజీ వగైరాలకూ మరి రెండు అమినో ఆసిడ్లు తేడాగా ఉంటాయి. కానీ ఈ జాతులన్నిటిలోనూ ఉండే ఆర్జినీన్‌ అనే ఒక అమినో ఆసిడ్‌ వ్యాధిగ్రస్తులలో మ్యుటేషన్‌వల్ల హిస్టిడీన్‌ అనే అమినో ఆసిడ్‌గా మారిపోవడంతో మాటలకు సంబంధించిన ఒక రుగ్మత కలుగుతుందని తెలిసింది.

ఇదేదో భాషకూ, వ్యాకరణానికీ సంబంధించిన జన్యువు కాకపోవచ్చుగాని మ్యుటేషన్‌ జరిగినప్పుడు ఈ మార్పు మనుషులలో మాటలపై ప్రభావాన్ని కలిగిస్తుంది. మనుషుల లక్షణాలన్నీ కేవలం జన్యువులమీదనే ఆధారపడవు. వారి జీవనవిధానం తక్కిన జంతువులకు భిన్నంగా కొనసాగడంతో వారి జన్యువుల్లోని ప్రోటీన్ల ప్రభావక్షేత్రాల్లో మార్పులు కలిగి, వారికి ప్రత్యేకతను కలిగిస్తాయి. శారీరక లక్షణాలూ, పరిసరాల ప్రభావమూ రెండిటికీ ఇందులో ప్రాముఖ్యత ఉంటుంది. మొత్తంమీద మాటల గారడీ మనిషిజాతికే పరిమితమైనది.

వీటన్నిటి ఫలితంగా చదవడం, రాయడం అనేవి మానవ సంస్కృతిలో ప్రధానమైన అంశాలు అయిపోయాయి. ఈ రెండిటికీ అవసరమైన లిపీ, తక్కిన రాత పరికరాలూ తయారవడానికి ముందుగా భాషలు మొదలయాయి. చదవడం, రాయడం పసితనం నుంచీ అలవాటైన మనవంటివారికి నిరక్షరాస్య సమాజం గురించి ఊహించుకోవడం కూడా కష్టమనిపిస్తుంది. కాని మానవచరిత్రలో ముందుగా భాషా శబ్దాలూ, ఆ తరవాత ఎన్నో వేల సంవత్సరాలకు వాటన్నిటినీ అక్షరబద్ధం చేసే పద్ధతులూ వచ్చాయి.

నాగరికత అనేది సుమారుగా క్రీస్తుకు 9 వేల సంవత్సరాల కిందట మొదలైందనుకుంటే లిపి మొదలైన దాఖలాలు మరొక అయిదారు వేల ఏళ్ళ దాకా కనబడవు. అప్పటిదాకా మనుషులకు శబ్దాలతోనే పని గడిచిపోయింది. భాషలన్నీ మాట్లాడడం, వినడాలకే పరిమితం అయి ఉండేవి. అతి ప్రాథమిక స్థాయిలో నోటి మాటల సంకేతాలుగా మొదలైన భాషలు త్వరలోనే తొలి మానవజాతులకు ముఖ్యమైన జీవితావసరం అయిపోయాయి. నిత్యజీవితంలో ప్రతి వస్తువుకూ, స్థలానికీ, ప్రతి భావనకూ, చర్యకూ, ఉద్దేశానికీ పదరూపం ఏర్పడింది.

తమ సాటివారితో అవసరార్థం ఎప్పటికప్పుడు సంభాషించుకోవటానికే ఆరంభమైనప్పటికీ భాషలన్నీ భూత భవిష్యద్వర్తమానా లన్నిటికీ ఉపయోగపడగలిగిన స్థాయికి ఎదిగాయి. ఇందులో ముఖ్యంగా అనుభవాలకు రూపకల్పన చెయ్యడం వీలైంది. జరిగిపోయిన విషయాలనూ, అవసరమైనవీ, గుర్తుంచుకోవలసినవీ అనిపించిన చారిత్రక సంఘటనలనూ నమోదు చెయ్యటానికి కథలూ, గాథలూ తయారు కాసాగాయి. లిపీ, రాత పరికరాలూ మొదలవని ఆ యుగంలో ఇవన్నీమౌఖిక రూపంలోనే మొదలై కొనసాగాయి.

శ్రుతీ (వినదగినవి), స్మృతీ (గుర్తుంచుకోవలసినవి) అనే రూపాల్లో మనదేశపు తొలి సాహిత్యమంతా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజుల్లో సీడీ రామ్‌లూ, హార్డ్‌ డిస్క్‌ల సంగతి పల్లెటూరివాళ్ళకు కూడా తెలుస్తుందేమో కాని ఆనాడు గ్రంథాలూ, పుస్తకాల గురించి ఎవరికీ తెలియదు. మొత్తం మీద ప్రపంచమంతటా మానవ నాగరికతలోని తొలి దశలలో భాషలన్నీ నోటిద్వారా శ్రవణ రూపంలోనే ప్రాచుర్యం పొందాయి.

రాముడి రాజాస్థానంలో లవకుశులు రామాయణగాథను గానంచేసి వినిపించారని మన పురాణాల్లో ఉంది. అసలు రామాయణ, మహాభారతాల్లోని సంఘటనలన్నీ అతిప్రాచీనకాలానికి చెందినవనీ, గాథలుగా ప్రచారంలో ఉన్న ఈ పురాణాలకు వాల్మీకి తదితరులు సాహిత్యరూపా న్నిచ్చారనీ కొందరి అభిప్రాయం. ఇందులో నిజమెంతో తెలియకపోయినా పురాణశ్రవణం అనేది పురాణ పఠనంకన్నా చాలా పాత సంప్రదాయం. ఎటొచ్చీ తొలియుగాల్లో పుస్తకం చూసి ఉదహరించకుండా కంఠస్థం చేసిన వివరాలనే చెప్పేవారు. మన దేశంలోనే కాదు; ప్రపంచమంతటా పురాణాలన్నిటినీ గాథల రూపంలోనే వినిపించేవారు. అక్షరాస్యత పెరిగిన ఇన్ని వేల సంవత్సరాల తరవాత కూడా మనవాళ్ళలో ఇటీవలి దాకా హరికథలూ, బుర్రకథలూ మొదలైనవన్నీ దృశ్య, శ్రవణ రూపాల్లో జనాదరణ పొందాయంటే ఈ సంప్రదాయం ఎంత పాతదో అర్థమౌతుంది.

గతంలో జరిగిన సంఘటనల గురించీ, ఆనాటి వీరులూ, మేధావులూ పొందిన అనుభవాల గురించీ నలుగురూ విని, నేర్చుకుని, స్ఫూర్తినీ, జ్ఞానాన్నీ సంపాదించడానికి ఇటువంటి సమావేశాలు జరుగుతూ ఉండేవి. సమాజానికి పనికొచ్చే నీతులూ, బోధలూ అన్నిటినీ చక్కగా వర్ణిస్తూ, తమ ప్రదర్శనను ఒక కళగా నేర్చుకుని గానం చెయ్యగలిగినవారికి ప్రత్యేకస్థానం ఉండేది. స్పష్టమైన ఉచ్చారణా, బాగా మోగే కంఠస్వరమూ, మంచి జ్ఞాపకశక్తీ, ఆకట్టుకోగలిగిన శైలీ మొదలైనవన్నీ ఈ ప్రదర్శకులకు అవసరమయేవి.

గ్రీస్‌కు ఉత్తరాన ఉన్న బాల్కన్‌ ప్రాంతంలో పురాణాలను గానం చేసే పద్ధతి ఆధునిక యుగంలో కూడా కొనసాగుతూ ఉండేది. ఆ విధంగా సంప్రదాయరీతిలో పాడుతున్న వ్యక్తి చుట్టూ శ్రోతలు చేరి కూర్చుని తమకు పరిచితమైన పురాణగాథలని తమకు పరిచితమైన పద్ధతిలో వినబడే పాటల ద్వారా ఆస్వాదిస్తారు. వీటిలో ఒక్కొక్క ప్రదేశానికీ సంబంధించిన సంప్రదాయాలుండేవి. అలాగే అంత్యక్రియల వంటి సందర్భాలకు తగిన పద్ధతిలో గానం జరిగేది. ఇటువంటి రకరకాల పాటలనూ, గాథలనూ కూర్చే సంప్రదాయాలు కూడా తరతరాలుగా అందించబడేవి. వీటి ఇతివృత్తాల నిర్మాణమూ, కథనరీతులూ వేటికవిగా వివిధ సంప్రదాయ పద్ధతుల్లో ఉండేవి. కొన్ని మామూలు సంఘటనల వర్ణనలైతే మరికొన్ని గంభీరంగానూ, లోతైన అర్థాలు కలిగినవిగానూ వినిపించబడేవి. ప్రాచుర్యం పొందుతున్నకొద్దీ శ్రోతలను ఆకట్టుకునే విధంగా వీటిలో సాహిత్యపు సొగసులూ, కవిత్వపు అందాలూ చోటుచేసుకున్నాయి.

ప్రఖ్యాత గ్రీక్‌ కవి హోమర్‌ క్రీ.పూ. ఎనిమిదో శతాబ్దంలో ఇలియడ్‌, ఓడిసీ మొదలైన గొప్ప పురాణాలను రచించాడు. అప్పటికే నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం జరిగిన కాంస్య యుగపు సంఘటనలను అతను గ్రంథస్థం చేసినట్టుగా చెపుతారు. ఆనాడు టర్కీలోని ట్రోయ్‌ నగరాన్ని గ్రీక్‌ సేనలు పదేళ్ళపాటు ముట్టడించి నాశనం చేసిన వైనం, అందులో ముఖ్య పాత్రధారి అయిన ఒడీసియస్‌ అనే గ్రీక్‌ వీరుడు మళ్ళీ స్వదేశానికి చేరుకోవటానికి పదేళ్ళ పాటు పడిన కష్టాలూ అన్నీ ఈ పురాణాల్లో లభిస్తాయి. ఈ గాథలను శతాబ్దాలపాటు గాయకులు పాటలు కట్టి పాడి వినిపించేవారనీ, అవి వినడం వల్లనే వాటి గురించి హోమర్‌ రాయగలిగాడనీ అంటారు. హోమర్‌ కూడా గొప్ప గాయకుడే.

హోమర్

హోమర్ విగ్రహం

ఆ రోజుల్లో పురవీధుల్లోనైనా, రాజాస్థానాల్లోనైనా శ్రోతల ఎదుట ప్రాచీనకాలపు వీరుల, వీరాంగనల గురించిన గాథలను పాడి వినిపించడం ఆచారంగా ఉండేది. ఇటువంటి రచనల్లో నిజంగా జరిగినది ఏమిటో, గాథలుగా వర్ణించినవారు స్వకపోల కల్పితంగా చేర్చినది ఎంతో చెప్పడం కష్టం. ప్రేక్షకుల ఎదుట గానం చేస్తున్నవాడు చిలవలూ, పలవలూ కల్పించి, ఉన్నదాన్ని మరికాస్త జనరంజకంగా చెయ్యడానికి ప్రయత్నించి ఉండవచ్చు. గట్టి సాక్ష్యాధారాలేవీ లేని పరిస్థితిలో కొన్ని తరాలపాటు మార్పులూ చేర్పులూ సంతరించుకుంటూ అందివచ్చిన ఈ వివరాలకు లిఖితరూపాన్ని ఇస్తున్నప్పుడు నిజనిర్థారణకై కవి చెయ్యగలిగినది ఏమీ ఉండకపోవచ్చు. మన పురాణాల్లో కూడా తరుచుగా కనబడే ఈ రకపు అద్భుతరసం, అతిశయోక్తులూ, అభూతకల్పనలూ వాటిలోని వాస్తవికతను వెనక్కి నెట్టినప్పటికీ, శ్రోతల ఊహాశక్తిని ప్రభావితం చేశాయి. అపోహలనూ, మూఢనమ్మకాలనూ కూడా పెంచాయి.

ఆఫ్రికా సాంప్రదాయాలు ఆఫ్రికా సాంప్రదాయాలు
ఆఫ్రికా సంప్రదాయాలు

అయితే పుస్తకాలూ, గ్రంథాలూ అవతరించని కాలంలో ప్రాచుర్యంలో ఉండిన మౌఖిక సంప్రదాయానికి కొంత ప్రత్యేకత ఉంది. ప్రాచీనకాలపు చరిత్రను గురించిన వివరాలు లభ్యమయేది అటువంటి “పుక్కిటి” పురాణాల్లోనే. ఎందుకంటే ప్రతిచోటా పురాతత్వ అవశేషాలూ, రాళ్ళమీద చెక్కిన శాసనాలూ దొరకవు. అలాంటప్పుడు జరిగిపోయిన విషయాల గురించిన వివరాల కోసం ఆదిమ సంప్రదాయాల్లో కూడా వెతుక్కోవాలి. ఉదాహరణకు ఉత్తర అమెరికాలోని తొలి మానవుల చరిత్రను గురించి మనకు తెలిసినది చాలా తక్కువ. అయితే కొన్ని ఆధారాలు అక్కడి ఆదిమ తెగలు ఈనాటికీ చెప్పుకునే గాథల్లోకనిపిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలో నాగరికత ఏనాడూ ఉండేది కాదనడం పొరపాటని ఇటీవలి పరిశీలకులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటువంటి గాథల ఆధారంగా అక్కడ కూడా ప్రాచీన రాజవంశాల వివరాలున్నట్టుగా తెలుస్తోంది.

ఒకవంక ఆదిమజాతులన్నీ ఈ గాథలని పూర్తిగా నిజమని నమ్ముతూ అదే నిజమైన చరిత్ర అని భావిస్తూ ఉంటే సంప్రదాయరీతుల్లో అధ్యయనం చేసే చరిత్రకారులు మాత్రం ఇటువంటి సాక్ష్యాధారాలను కొట్టిపారేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రతి విషయానికీ కేవలం లిఖితరూపంలో దొరికే సాక్ష్యాల మీదనే ఆధారపడక, పురాణగాథలుగా చలామణీ అవుతున్న సంప్రదాయాల్లోని ఆధారాలను కూడా పరిగణించడం తప్పులేదన్న భావన బలపడుతోంది. పురాతత్వ పరిశోధకులకు ఇతరత్రా లభిస్తున్న సాక్ష్యాలకు ఈ వివరాలు తోడైనట్టుగా కనిపిస్తోంది. వీటిలో నమ్మదగినవి ఏమిటో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంమీద ఒకే రకమైన మాటల్లో రాసిపెట్టినవాటికీ, కేవలం నోటితో పలికినవాటికీ తేడా ఉంటుందని అనుకోవడం ఎంతవరకూ సమంజసమో చెప్పడం కష్టమే.

—————–

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.

Posted in వ్యాసం | Tagged | Comments Off on మనుషులూ, మాటలూ

వార్షికోత్సవ వేళ..

గత సంవత్సరం డిసెంబరు నెల మొదటివారంలో ప్రారంభమైన పొద్దుకు ఏడాది నిండి, రెండో యేట అడుగు పెడుతున్న సందర్భంగా ఈ సంవత్సరకాలంలో పొద్దు సాధించిన ప్రగతి, అలాగే ఈ పత్రికను పెట్టినప్పుడు మాకు మేం నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటిని మేం ఎంతవరకు అందుకోగలిగాం అనే అంశాలను స్పృశిస్తూ ఒక సింహావలోకనం:

పొద్దు ఎందుకు పెట్టాం?

బ్లాగరులలో రకరకాల విషయాలపై బ్లాగులు రాస్తూ ఉన్నవారు ఉన్నారు. చక్కటి సాహిత్య చర్చలు, సామాజిక విషయాల చర్చలు మొదలైనవెన్నో జరుగుతున్నాయి. “ఇలాంటి ఆసక్తి కరమైన విషయాలను ఒకే చోట సంఘటితం చేస్తే ఎలా ఉంటుంది?” అనే ఆలోచనే పొద్దుకు మూలం.

ఎలా పెట్టాం?

పత్రిక పెట్టాలన్న ఆలోచన చదువరిది. దాని గురించి ఆయన మాటల్లోనే విందాం:
ఆలోచన వచ్చిందే తడవుగా త్రివిక్రమ్ తో అన్నపుడు ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ‘సరే పెట్టేద్దాం’ అన్నారు. త్రివిక్రమ్ తో అనడానికి ఒక కారణం ఉన్నది. అప్పటికే తెలుగు బ్లాగర్ల సంఘం తరపున మేమిద్దరం పరిచయస్తులమే. ఆయన సాహిత్యాభిలాషి అనీ, బాగా చదువుతారనీ నాకు తెలిసింది. పైగా సెప్టెంబరు 2006 లో నెట్లో తెలుగు వ్యాప్తి విషయమై ఆయన క్షేత్ర స్థాయిలో కొంత కృషి చేసారు. ధర్మనిధి పురస్కారాల కార్యక్రమంలో అంతర్జాలంలో తెలుగు గురించి తెలియజేస్తూ ఆయన కరపత్రాలు పంచిపెట్టారు. ఆపనిలో నేనూ కొంత సాయం చేసాను. ఆ విధంగా మా సాన్నిహిత్యం పెరిగింది. ఈ కారణాల వలన, పొద్దు ఆలోచన వచ్చినపుడు, త్రివిక్రమ్ పేరు చాలా సహజంగా స్ఫురణకు వచ్చింది.

పత్రికకు ఏం పేరు పెట్టాలనే విషయమై చర్చ చేసాం. చాలా పేర్లు అనుకున్నాం..

* పల్లకి
* కానుక
* మేఘదూత
* మెరుపు
* కబురు
* కబుర్లు
* వెలుగు
* పొద్దు
* వేకువ

చివరికి పొద్దుతో స్థిరపడ్డాం. వెంటనే పేరు నమోదు చేసాం. ఇక..

పొద్దును ఎన్నాళ్లకొకసారి తీసుకురావాలి?

మిగతా పత్రికలు నెలకో రెణ్ణెల్లకో ఒకసారి వస్తూ ఉన్నాయి. పొద్దు అలాకాక, తాజా విశేషాలు, వ్యాసాలతో ఎప్పటికప్పుడు తాజాగా ఉండాలని తీర్మానించాం. పొద్దుకు రచనలు పంపేవాళ్ళు చాలామంది సొంతగూళ్ళున్న బ్లాగర్లు. ఏ రచయితకైనా, తన రచనని వీలైనంత త్వరలో పాఠకుల దగ్గరకు తీసుకుపోవాలనుంటుంది – బ్లాగులలోనైతే, వెంటనే పెట్టుకోవచ్చు కూడా. అందుకే, పొద్దులో మేం – రచన మాకు అందిన వెంటనే, వీలయినంత త్వరగా దానిని పరిశీలించి, ప్రచురిస్తున్నాం. అంతర్జాలంలో పత్రికకున్న సౌకర్యాలలో ఇదొకటి. ఇటు పాఠకులకి కూడా – మొత్తం రచనలన్నీ ఒక్కసారే చదవనవసరం లేకుండా, ఎప్పుడు వెలుగుచూసినవి అప్పుడే చదువుకోవచ్చును కదా? కాబట్టి, పొద్దు, పదహారణాల ఇంటర్నెట్ పత్రిక, రియల్ టైము పత్రిక. ఇది e-పత్రిక, మీ పత్రిక.

మరి, అందుకవసరమైన రచనలను సేకరించడం ఎలా? బ్లాగరులు, ఇతర నెజ్జనులు, నెజ్జనులు కాని సాహితీకారుల నుండి వ్యాసాలు, కథలు మొదలైన వాటిని సేకరించాలని తీర్మానించాం. నెజ్జనులపై మేం పెట్టుకున్న ఆశలు ఈ సంవత్సరంగా వమ్ము కాలేదు. చక్కని వ్యాసాలు, కవితలతో పొద్దును తీర్చిదిద్దగలుగుతూనే ఉన్నాం.

పొద్దు గురించి వీవెన్ తో చెప్పినపుడు తన వంతు సాయం చేస్తానని మాటిచ్చారు. అలాగే ఆయన ఎంతో సాయం చేసారు. పొద్దును సర్వరులో స్థాపించి, దానికోసం తన సర్వరులో కొంత స్థలాన్ని కేటాయించారు. పలు మూసలను పరీక్షించారు. పొద్దు కోసం ఆయన తీసుకున్న శ్రమకు గాను ఆయనకు నెనరులు తెలియజేస్తే పరాయి వాడైపోతారు కాబట్టి ఆ పని చెయ్యడం లేదు.

ఈ ఏడాదిలో ఏమేం చేసాం?
చెయ్యాలనుకున్నవన్నీ చెయ్యలేకపోయినా కొన్నైనా చెయ్యగలిగాం. పొద్దు శీర్షికల్లో మాకు బాగా సంతృప్తి కలిగించినది, గడి! తెలుగులో మొట్టమొదటి ఆన్ లైను గళ్ళ నుడికట్టు, గడి! పొద్దుకు ఆ ఘనత ఉంది. ఆన్ లైనులోనే నింపి పంపగల గడి ఇప్పటికీ ఇదొక్కటే! గడి రూపకల్పనలో సాంకేతిక సహాయమందించిన సంపత్ కు, గడి కూర్పరులు సిముర్గ్, కొవ్వలి సత్యసాయి, భైరవభట్ల కామేశ్వరరావు గార్లకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

ఏమేం చెయ్యాలనుకున్నాం? ఏమేం చేశాం?

మొదట అనుకున్నవాటిలో కొన్నింటిని అమలుచెయ్యలేకపోయాం. వాటిలో కొన్ని: భాష, నుడి, పద్యం, ప్రపంచ సాహిత్యం. మొదటిదాంట్లో తెలుగు భాషా-సాహిత్య చరిత్ర, వాడుకభాషలో వస్తున్న మార్పులు, తరచుగా దొర్లే తప్పులు, పరభాషా ప్రభావాలు మొదలైన అంశాల గురించి తెలిసినవారెవరిచేతైనా రాయించాలనుకున్నాం. అలాగే తెలుగు భాషకే ప్రత్యేకమైన లక్షణాలు, తెలుగు నుడికారం – సామెతలు, నానుడుల గురించి నుడి శీర్షిక నిర్వహించాలనుకున్నాం. సంవత్సరకాలం గడిచినా ఇవి రెండూ కార్యరూపం దాల్చలేదు.

త్వరలో వీటిని మొదలుపెట్టగలమనే అనుకుంటున్నాం. అలాగే పద్యలక్షణాల గురించి కూడా ఒక శీర్షిక పెట్టాలనుకున్నాం. ప్రపంచ ప్రసిద్ధ గ్రంథాలను పొద్దు పాఠకులకు పరిచయం చెయ్యాలనుకున్నాం. మాకున్న పరిమితుల వల్ల అవి రెండూ మొదలు కాలేదు. ఐతే త్వరలోనే ప్రపంచ జానపద కథలను అందించే ఆలోచనలో ఉన్నాం.

ఇక పొద్దులోని శీర్షికల గురించి:

అతిథి: రానారెతో మొదలైన ఈ శీర్షిక పొద్దుకే ఒక ప్రత్యేక అలంకారం. ఈ శీర్షికలో వైజాసత్య, శ్రీహర్ష, వీవెన్, విహారి, ఉప్పలపాటి ప్రశాంతి, తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం, సుగాత్రి లాంటి ప్రముఖ బ్లాగరులు, వికీపీడియనులే కాకుండా కొలిచాల సురేశ్, కొడవటిగంటి రోహిణీప్రసాద్, నెల్లుట్ల వేణుగోపాల్ లాంటి ప్రముఖ పత్రికా సంపాదకులు, రచయితలు కూడా పాల్గొన్నారు.

వ్యాసాలు: ఒకవైపు తెలుగు నుడికారం, స్త్రీ హృదయ రహస్యోపనిషత్తు, అన్నదాత బోర్లాగ్, బానిసత్వం నాటి నుంచీ నేటి వరకూ, మసకతర్కం, ప్రేమ…కథ, ఎర్రకోట, ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు లాంటి విభిన్నమైన వ్యాసాలు, మరోవైపు కొడవటిగంటి రోహిణీప్రసాద్, వివినమూర్తి, శారద మొదలైన ప్రముఖుల వ్యాసాలు అందించగలుగుతున్నాం.

బ్లాగు: తెలుగులో వైవిధ్యమైన బ్లాగులను పరిచయం చేసే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ శీర్షిక కొందరు బ్లాగరుల శైలులను అనుకరిస్తూ చేసిన పేరడీతో నెజ్జనులను ఎంతగానో అలరించినా తర్వాత కుంటుబడింది. ఈ శీర్షిక క్రమం తప్పక నడవాల్సిన అవసరముంది – మరీ ముఖ్యంగా కొత్త బ్లాగులు, కొత్త పాఠకులు ఎక్కువౌతున్న ఈరోజుల్లో. మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు బ్లాగుసమీక్షల్లో ఒక వినూత్న ప్రయోగం. కొవ్వలి సత్యసాయి గారి నేనెందుకు బ్లాగుతున్నాను? ఈ శీర్షికలోని మరో విభిన్న రచన.

వికీ: వైజాసత్య ఈ శీర్షికలో పొద్దు పాఠకులకు తెవికీ, అనుబంధ ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు విలువైన సమాచారం అందిస్తున్నారు.

సరదా: వలబోజు జ్యోతి నిర్వహించిన ఈ శీర్షిక పాఠకుల నుంచి మంచి ఆదరణ పొందింది.

వివిధ: సుధాకర్ ఈ శీర్షికను తనదైన శైలిలో విభిన్నంగా నిర్వహిస్తున్నారు.

కబుర్లు: ఈ శీర్షికను పునరుద్ధరించవలసి ఉంది.

సినిమా: సుగాత్రి ప్రారంభించిన ఈ శీర్షికను వెంకట్ అనితర సాధ్యమైన రీతిలో నిర్వహిస్తున్నారు.

కథలు: ‘యునిక్ స్పెక్’ సుధీర్ కొత్తూరి, అర్చన, సౌమ్య, చావా కిరణ్ ల కథలు, కొల్లూరి సోమశంకర్ అనువాద కథ అందించగలిగాం. ఇక మీదట ఈ శీర్షికలో ప్రసిద్ధ రచయితల కథలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం.

కవితలు: రాధిక, సుధీర్ కొత్తూరి, చావా కిరణ్, కృష్ణదాస కవిరాజు, స్వాతికుమారి, జాన్ హైడ్ కనుమూరి, లలితా ముఖర్జీ, రవికిరణం, చందుపట్ల శ్రీధర్, కొత్త ఝాన్సీలక్ష్మి, అసూర్యంపశ్యల కవితలు అందించాం.

సమీక్ష: సగటున రెండు నెలలకొక సమీక్ష చొప్పున చుక్క పొడిచింది, అతడు అడవిని జయించాడు, దర్గామిట్ట కథలు, కాలాన్ని నిద్రపోనివ్వను, కథ 2005, కడప కథ పుస్తకాలపై సమీక్షలు అందించాం.

ఇవే కాకుండా కొడవటిగంటి కుటుంబరావు అనువాద నవల మృతజీవులు ను, తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం రచన మందిమన్నియమ్ ను ధారావాహికలుగా ప్రచురిస్తున్నాం.

ఇటీవలి కాలంలో పొద్దు సంపాదకవర్గం బలోపేతమయింది. ప్రముఖ నెజ్జనులైన సిముర్గ్, రానారె సంపాదకవర్గంలో చేరి పొద్దుకు హంగు చేకూర్చారు. సిముర్గ్ ఇటీవలి వరకు పొద్దు సంపాదకవర్గ సలహాదారుగా ఉన్నారు.

చివరగా…

పత్రికా నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానం గానీ, అనుభవం గానీ లేని కేవల ఔత్సాహికులం మేం. ఐనా సరే సంకోచించక ముందడుగేశాం. మా ప్రయత్నం గురించి తెలుసుకున్న వివినమూర్తి, వసుంధర, మొదలైన పెద్దలు మమ్మల్ని అభినందిస్తూ ప్రోత్సహించారు. వారికి మా ధన్యవాదాలు. పత్రికానిర్వహణలో తమ అమూల్య సలహాలు, సూచనలు అందిస్తున్న కేతు విశ్వనాథరెడ్డి, కొడవటిగంటి రోహిణీప్రసాద్, ఇంకా సాంకేతిక సహకారాన్ని అందివ్వగలమని ముందుకు వచ్చిన ఈమాట సంపాదకులు కొలిచాల సురేశ్, పద్మ ఇంద్రగంటి గార్ల సహకారం మరువలేనిది.

ఇప్పుడు తెలుగులో ఎందరో బ్లాగరులు చక్కటి శైలీ, శిల్పాలు ఉపయోగించి, మంచి విషయాలమీద రాస్తున్నారు. వీరిలో కొందరికైనా, బ్లాగర్లనుంచీ రచయితలుగా ఎదిగే అవకాశముంది. ఆ ప్రయత్నంలో మా వంతు కృషి చెయ్యాలన్నదే పొద్దు ఆశయాల్లో ఒకటి. అందుకే, ఔత్సాహిక రచయితల రచనలే పొద్దులో ఎక్కువ, వీలయినంత వరకూ, మా కందిన రచనలని – మేం పరిశీలించి, క్రియాశీలకమైన సూచనలు ఇచ్చాం. కొన్ని సార్లు, రచనని మెరుగు పరచడానికి మేమిచ్చిన సూచనలు, రచన కంటే ఎక్కువగానే ఉండేవి. (పొద్దుకి ఒక రచన అందాక, దానిని సమీక్షించి, పరిశీలించి ప్రచురించడానికి గాని, తిరస్కరించడానికి గాని గరిష్ఠంగా రెండువారాలు పడుతుంది.)

ఇక ప్రత్యేకంగా చెప్పుకోవలసింది పొద్దు పొడుపుల్లో తెలుగు బ్లాగర్ల పాత్ర. తెలుగు బ్లాగర్ల ప్రోత్సాహం, సహకారం లేకపోతే ఈ పత్రిక ప్రారంభమయేదే కాదు. వారందరికీ వందనాలు. పొద్దు ప్రధానంగా తెలుగుబ్లాగరుల గుండెచప్పుడు. ఇది నిరంతరం తెలుగుబ్లాగరులవాణిని వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు బ్లాగుల్లో మంచి వాసిగల రచనలెన్నో వస్తున్నాయి. ఇవి అంతర్జాలానికే పరిమితం కారాదు. తెలుగు బ్లాగరుల రచనలు మరింత ఎక్కువమంది పాఠకులకు చేరువయేలా బయటి పత్రికల్లో కూడా వెలుగుచూడాలనేది మా కోరిక. అందులో భాగంగా కొన్ని పెద్దపత్రికలతో కంటెంట్ షేరింగ్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది పొద్దు. అంటే పొద్దులో ప్రచురితమయ్యే రచనలు బయటి పత్రికల్లో కూడా వచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం.

ఇప్పటి వరకూ ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఇకముందూ అందిస్తూ పత్రికను ఉన్నత స్థాయికి చేర్చేందుకు సహకరించవలసినదిగా పాఠకులను కోరుతూ, కింది కొత్త విశేషాలను అందిస్తున్నాం, ఆస్వాదించండి.
1. గడి
2. అతిథి శీర్షికలో నవయువకుని విజయగాథ
3. ఆరుద్ర రచించిన తెలుగు కలాలు వ్యాసం
4. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన విషాద సంధ్య కవిత
5. పులికంటి కృష్ణారెడ్డికి నివాళి
6. మధురాంతకం రాజారామ్ కథల గురించిన స్పందన
7. మృతజీవులు – 11

-పొద్దు

Posted in సంపాదకీయం | 12 Comments