-ఆదినారాయణరెడ్డి
మనపెద్దలు మనకు పూజలు, సేవలు, జపాలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, యోగాలు, ధ్యానాలు మొదలైన వెన్నో భగవత్ ప్రీత్యర్థం ఉపదేశించారు. కానీ భగవంతుడు ఏమిటి? ఆయనను ప్రసన్నం చేసుకునే మనం–అంటే వాటిని నిర్వహించే “నేను” అనుకొనే ఎవరికి వారైన మనమంతా ఏమిటి? అంటే మన సిసలైన ప్రామాణిక స్వరూపం ఏమిటి? ఈ”నేను”ను మనపూర్వులు ఎవరెవరు ఏయే విధంగా తెలియజేశారు? ఈ విషయంలో నాకు కల్గిన అతి పరిమితమైన జ్ఞానాన్ని తమ ముందు సమర్పించుకుంటున్నాను. పాఠకులైన తామందరూ తమకు గల అపార జ్ఞానాన్ని నాతో పంచుకొని నాకు మరింత తెలుసుకునే అవకాశమిస్తారని ఆశిస్తున్నాను.
|
“నేను అనగా నా శరీరము” అని భావించడం సరియైన సమాధానము కాదు. శరీరము ఏర్పడక మునుపు దాని నిర్మాణము యొక్క ఆవశ్యకతకు ప్రేరేపణ ఏమిటి? కొందరు చెప్పవచ్చు.. తల్లిదండ్రుల శారీరిక సంపర్కమే కదా? అని. అది కొంతవరకు మాత్రమే సరియైనది. తల్లిదండ్రుల పరంపర, పంచ భూతాల పరంపర, ఖగోళం లోని మొత్తం పాలపుంతల పరంపర ఇవన్నీ కూడా సృష్టింప బడటానికి మూల శక్తి ఒకే ఒక్కటి. దానినే “అహం” అని ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతలో చెప్పారు.
అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత మేవచ!!
అని.ఇంత వరకూ దీనికి అర్థం చెప్పిన చాలామంది – “అన్ని ప్రాణులలోనూ నేనే స్థితమై ఉన్నాను. ప్రాణులయొక్క మొదలు, మధ్య, అంతమూ (అంతం చేయువాడను),అంటే– సంహరించు వాడను నేనే” అని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా చెప్పారు. భూతానాం అన్నపదానికి ప్రాణులు అన్న అర్థాన్ని తీసుకున్నారు.
అయితే, “భూతానాం” అంటే “పంచభూతాలకూ” (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములన్నింటికీ) అని అర్థం చేసుకుంటే … భూమికి పరిమితి ఉంది. నీటికి పరిమితి ఉంది. అలాగే వాయువుకు, అగ్నికీ పరిమితం వుంది. అంతు లేనిదీ ఆరంభం కూడా లేనిదీ ఒక్క ఆకాశం మాత్రమే. కానీ శ్లోకంలో చెప్పినదేమిటంటే ఆకాశానికి కూడా అంతం “నేను” అని. దానినే “అహం” అనీ “ఆత్మ” అనీ అన్నారు. అంటే— అనంతమైనదీ, సర్వ బహ్మాండాలనూ తనలో స్థితం చేసుకున్నదీ అని —మనం అనుకొనే ఆకాశం “నేను” ముందు పరిమితమే!
“భూతానామంతమేవచ” అనగా ఆకాశంతో సహా పంచభూతాలు సమస్తమూ “అహం” (ఆత్మ/నేను) లో ఉన్నాయి అని అర్థం. అంటే పంచభూతాల సృష్టికర్త ఈ “నేను”. శ్రీకృష్ణపరమాత్మ చెప్పినట్లుగా గీతలో పేర్కొనబడిన ఈ సత్యం … వాస్తవంగా వ్యాసమహర్షిచే సంకలనమైన ఉపనిషత్తుల సారం. (కృష్ణుణ్ణి బ్రహ్మాండ కుక్షింభరుడుగా, పరమాత్మగా భావించేవారికి ఈ భావం మింగుడుబడక పోవచ్చు. ఐతే కృష్ణుడు కూడా సాందీపని అనే గురువు వద్ద విద్య నభ్యసించిన ఒక శిష్యుడే అని తెలుసుకుంటే ఈ సమస్యకు సమాధానం లభిస్తుంది. ఈ శిష్యుడు తాను చదివి, గ్రహించిన చదువులలోని సారాన్నంతా సమయం వచ్చినప్పుడు అర్జునునకు ఉపదేశించి, పరమగురువుగా వెలుగొందినాడు. కానీ దీనినంతా మనకు ప్రసాదించినది మాత్రం సత్యమెరిగిన వ్యాసభగవానుడే) అందుకే కాబోలు సరస్వతీపుత్ర బిరుదాంకితులైన స్వర్గీయ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒకసారి ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసంగిస్తూ, “వ్యాసమహర్షి ఆకాశం మొత్తాన్ని తన పిడికిట్లో ఇముడ్చుకున్న మహనీయుడు” అని కీర్తించారు.
ఇదే విషయాన్ని అదిగురువు శంకరాచార్యులు మరికొంత వివరంగా తెలియ జేశారు. అదేమిటంటే…నేను ఏదికాదు? నేనేమిటి? అనేదానికి పరిపూర్ణ వివరణ.
నచ శ్రోత్ర జిహ్వే నచఘ్రాణ నేత్రే !
నచవ్యోమ భూమి ర్నతేజో నవాయుః
చిదానంద రూపశ్శివోహం శివోహం !!
అనగా మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అంటే వీటి యొక్క చైతన్యము (Consciousness) … ఇవి “నేను” కాదు. జ్ఞానేంద్రియములైన చెవి, నాలుక, ముక్కు, కన్ను – వీటియొక్క జ్ఞాన సంపత్తి “నేను” కాను. భూతసముదాయాలైన ఆకాశము, భూమి, తేజస్సు (అగ్ని), గాలి — ఇవేవి నేను కాను.
మరి నేనెవ్వరు అంటే … యే బంధానికి సంబంధము లేని శాశ్వత ఆనంద స్వరూపమైన శివాన్ని. ఈ గురువుగారు తనదైన శైలిలో “నేను”(ఆత్మ) “శివం” అన్నారు.
పితానైవ మే నైవమాతా న జన్మ!
నబంధుర్నమిత్రం గురుర్నైవ శిష్యా
చిదానందరూప శ్శివోహం శివోహం!!
సిసలైన “నేను”కు తల్లి, తండ్రి, బంధువులు, మిత్రులు, జాతిభేదం లేదు. ఎందుకంటే అసలు జన్మే లేదు కాబట్టి – మృత్యువు కానీ, దాని వలన భయము కానీ లేవు. పుట్టలేదు. కానీ ఉంది. అదీ “నేను”-“అహం”-“శివం” “ఆత్మ” .
అజో నిత్యశ్శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే
జన్మలేదు. మరణములేదు. భూత భవిష్యత్తులు లేవు. నిత్యము, శాశ్వతము, పురాతనమైనది ఆత్మ.
సర్వ నేనులు కూడా “నేను” (ఆత్మ) యందే ఆది, మధ్య, అంత్యములను పొందినట్లు భ్రాంతి కలుగుతుందేకానీ–వాస్తవం మాత్రం “నేను” లో జరిగే పరిణామక్రమమే!
ఒక ప్రార్థన ఉంది –
సమస్త మంత్ర వాచ్యాయా విశ్వైక పతయే నమహా
– అని. ‘అంతం లేని వాడు’ అనే పేరు గల్గిన వాడు అని ఒకర్థం. ‘ఇన్ని పేర్లు అని చెప్పడానికి వీల్లేనన్ని పేర్లు గలవా’డనేది మరో అర్థం. (రెండర్థాలూ సమంజసమే)ఇక అన్ని ఆకారములూ తనే. అన్యము లేదు. అంతా తనే. అన్నీ తనే. ఒక్కటే–.మహా కవి పోతన అంటాడు. “సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవు నే శరణంబు వేడెదన్” అని.(భాగవతం లోని గజేంద్ర మోక్షం ఘట్టం లోనిది) అన్నిమంత్రాలు కూడా తనే. ఈ అనంత విశ్వ పతి ఒక్కడే. ” నమహా ఆంటే–వందన మాచరిస్తున్నా నని కాదు.(“మహా”మమ కారం “న” లేదు. అంటే నేనన్నది లేదు). ఈ తాత్ కాలిక నేను అన్నది లేదు. ఉన్నదొక్కటే. ఈ అవగాహనే ఈ మంత్ర పరమార్థం. అలా కాకుండా నేను వందన మాచరిస్తున్నాను-అంటే మన శరీరం లోని ఒకానొక పరమాణువు మనకు నమస్కరించి నట్లుగా –అది మనకొక గుడి కట్టిస్తానని మొక్కు కున్నట్లుగా అదొక జోక్ గా ఉంటుంది.
పద కవితా పితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్యులవారు.”భావము లోన బాహ్యము నందును” కీర్తనలో “అచ్యుతు డితడే ఆదియు నంత్యము” “హరిలోనివే బ్రహ్మాండంబులు”అంటారు.”బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే” అంటూ విశద పరుస్తారు. మరో రచనలో “పురుడు లేదుర నీకు పురుషోత్తమా” అంటారు -ఇలా వివిధ రీతుల్లో అనంత విశ్వశక్తి యొక్క ఏకత్వాన్ని వివరించడం జరిగింది.
జ్ఞానోదయానంతరం గౌతమబుద్ధుడు కూడా అంతా శూన్యం నుండే ఏర్పడిందనే చెప్పాడు. తెలిసో తెలియకో సాధువులనిపించుకున్న వారు వూతపదంగా చెప్పే మాట “అంతా మిథ్య” అని. ఇందు లోని పరమార్థ మేమిటో సైన్సు ప్రకారం నిరూపించ వచ్చునేమో కొంత పరికించి చూద్దాం. అనంత విశ్వంలోని ఏ పదార్థమైనా మూలకాలు లేకుండా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి మూలకము కూడా ఎలెక్ట్రాన్స్ , న్యూట్రాన్స్, ప్రోటాన్స్ (వీటిని ENP అందాం) అనే ఈ మూడూ ఆయా నిష్పత్తుల సమ్మేళనముతో ఏర్పడిందని కూడా ప్రపంచ శాస్త్రవేత్తలందరూ నిరూపించి ఏ అభిప్రాయ భేదాలూ లేకుండా వున్నారు కదా! మరి మూలకాలకు మూలమైన ENP ల వుత్పత్తికి మూలం ఏది?
ఇంతవరకూ నిర్దిష్టంగా ఎవ్వరూ కనుగొన్న దాఖలాలు లేవు. ఎన్ని ఆవిష్కరణలు జరిగినా మూలము ఇదీ అని నిరూపించగలిగినా…. అన్నింటికీ మూలం మాత్రం అనంతమహా శూన్యమనే చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో మన అనుభవంలో గోవు జనితం గోవు, మేక జనితం మేక, మనిషి జనితం మనిషి, అలా దేనికి పుట్టింది ఆ జాతికి చెందుతుంది. కాబట్టి ప్రతి నిర్మాణానికీ మూలమైన ENP లు మహా శూన్య జనితాలైనప్పుడు. సర్వస్వానికీ మాతృక అనంత మహా శూన్యమే కదా! ఆవిధంగా మన అనుభవం ప్రకారం చూసినా గానీ శూన్య జనితాలైన సర్వస్వమూ కూడా శూన్యమే కదా! “అంతా మిథ్య” అన్నమన పూర్వుల మాట కేవల నిరాశావాదం కాదనీ, సాలోచనగానే వారు ఈ నిర్ణయానికి వచ్చివుంటారని మనం గ్రహించాలి.
ఆదినారాయణరెడ్డి గారు ఒక సామాన్య మధ్యతరగతి రైతు. పీ.యూ.సీ వరకూ చదువుకున్నారు. పాఠశాల విద్యకు అంతటితో స్వస్తి చెప్పవలసి వచ్చినా సామాన్యశాస్త్రం, చరిత్ర, ఆధ్యాత్మికాంశాలపట్ల ఆసక్తి కనబరుస్తారు. ఒక పల్లెటూర్లో, ఇప్పటిదాకా కంప్యూటర్ అంటే తెలియని ఒక వ్యక్తి, టెక్నాలజీ నేర్చుకొని ఇంత పూనికగా రాయడం e-తెలుగు సంఘానికి ఘనవిజయమే!