![]() |
శోధకుడు |
పొద్దున్నే లేసినాడు కాదరయ్య అంటూ పొడుచుకొచ్చిందో బ్లాగు 2006 జూలైలో. ‘తెల్లారేసరికి భట్టుపల్లెలో ఆయనో ఘంటసాల, ఆయన పేరు కాదరయ్య‘ ఐనట్టుగా, ఆ బ్లాగు పొడిచీ పొడవగానే ఆయన ప్రసిద్ధుడూ, ప్రసిద్ధులకు ఆత్మీయుడూ అయిపోయాడు. “చాలా బాగా రాశారు”, “మనసున ఉన్నదున్నట్టు అక్షరాలుగా పరచ గలగటం మీకు చేతయ్యింది..”, “గమ్ముగా ఉండాది!” అంటూ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు తోటి బ్లాగర్లు. “ఏం కాదరయ్యా బాగుండా..?” అంటూ ఆత్మీయంగా పలకరించారు, ఎప్పటి నుండో ఎరిగున్నవారిలాగా. “నాకు తప్ప అందరికీ తెలిసినట్టుందే ఈయనెవరో” అని సీనియర్లు ఆశ్చర్యపడిపోయారు కూడా.
యర్రపురెడ్డి రామనాధరెడ్డి అనే రానారె అనే బ్లాగరి పుట్టాడు.
యర్రపురెడ్డి రామనాధరెడ్డి అనే బ్లాగు చిన్ననాటి జ్ఞాపకాల మాల. ఒక్కో పువ్వునూ ఏరి కూర్చుతూ సొంపైన దండను తయారు చేస్తున్నాడు, రానారె. జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి.. చక్కగా ఓ గాథలా చెప్పగలిగే సత్తా అందరికీ ఉండదు. ఈ విద్యలో రానారె ప్రవీణుడు. మనసుకు హత్తుకుపోయేలా చెప్పగలడు. రాయలసీమ మాండలికంలో రానారె శైలి, చెయ్యితిరిగిన కథకులకేమీ తీసిపోదు.
పరకాయ ప్రవేశం చేసి రాస్తాడు గామోసు.. పదేళ్ళ పిల్లవాడి భావాలు చాలా సహజంగా ఉండి మనసును హత్తుకుంటాయి. తనను తాను శోధించుకుంటూ రాస్తున్నట్టనిపిస్తుందీ బ్లాగు. నాలుగు నల్ల లారీలు, ఆరు యర్ర లారీలు అనే జాబులో ఓ పిల్లవాడి (తానే!) మనసును మనముందు పరుస్తాడు. బళ్ళో ఉన్న పిల్లవాడికి తోటలోకొచ్చిన లారీని చూడాలని ఉత్సాహం, ఎప్పుడు బడి ఒదుల్తారా లారీని చూద్దామా అని వాడి తహతహ. ‘యట్టనోగట్ట మజ్జాన్నమాయ’ -రెండు మాటల్లో చెప్పేస్తాడు వాడి ఆరాటాన్ని. ‘ఎదురొమ్ము నిండా గాలిబీల్చి ముంచేతులు నడుంపైన బెట్టుకొంటి.’, ‘నేనెవుర్నో తెలిసినిట్టు లేద”నుకోని, “మేం ఈ తోటగల్లోళ్లం.” అంటి.’ – ఇలాంటి వాక్యాలు చదువుతూ ఉంటే పిల్లవాడు మనముందే నిలబడినట్టు ఉంటుంది. ఈ బ్లాగులోని మేటి జాబు ఇది
దీపావళి వెలుగుల పండగ అయినప్పటికీ, పండగ పేరిట ప్రజలు చేసే మోతలు కొందరికి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో ఈ జాబులో రాసాడు. “వుండుండి వచ్చే టపాకాయల శబ్దానికి నిదురలోనే వులిక్కిపడే చిన్న పిల్లాణ్ణి చూస్తే అవి పేల్చినవాణ్ణి కోసి ఆ మాంసంతో ఊరగాయ పెట్టాలనిపిస్తుంది నాకు.” అంటాడు.
వేదికనలంకరించిన పెద్దలు ఈ బ్లాగులోని మంచి జాబుల్లో ఒకటి. బడిలో ప్రతిభా ప్రదర్శనలో బహుమతులందుకుని వచ్చిన తనకు, సూక్తి రూపంలో తన తండ్రి ఇచ్చిన బహుమానం గురించి నెమరు వేసుకుంటాడీ జాబులో. సహజంగానే బ్లాగరులు రానారె తండ్రిని అభినందించారు. రానారెపై తండ్రి ప్రభావాన్ని సూచించే జాబుల్లో ఇది ఒకటి.
బూతుమాటలకు బ్లాగుపీఠం ఎక్కించాలన్నా రానారెకు సాధ్యమే! బ్లాగరులు బహుథా మెచ్చిన జాబుల్లో ఇది ఒకటి.
![]() |
రానారెకు మనిషి అంటూ మరో బ్లాగు కూడా ఉంది. వివిధ విషయాల గురించి రాస్తూ ఉంటాడిందులో. సమాజం, రాజకీయాలు, తాత్వికత, సినిమాలు, ఇతర కళలు, చెనిక్కాయల్లాంటి పద్యాలూ, జీడిపప్పుల్లాంటి 30 మాత్రల గూగులమ్మ పదాలు మొదలైన వాటన్నిటికీ ఈ బ్లాగులో చోటుంది.
రానారె బ్లాగులకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. తన జాబుల్లో కొన్ని పదాలకు అర్థం తెలియడం కోసం నిఘంటువుల లింకులు పెడుతూ ఉంటాడు. తన మాండలికంలో రాసే మాటల అర్థాలు తెలియని పాఠకుల కోసం పత్రికా భాషలో సమానార్థకాలను కూడా ఇస్తూంటాడు.
రానారె బ్లాగుల్లో హాస్యానికీ చోటుంది. కడుపుబ్బ నవ్వించేటంతలా రాయడు గానీ, మృదువుగా, గిలిగింతలు పెట్టేలా, చమత్కారాలతో రాస్తూ ఉంటాడు. చిన్నతనంలో సావాసగాళ్ళతో కలిసి చేసిన చిలిపి పనుల గురించి రాసిన ఈ జాబు చూడండి. బిగ్ బెండ్‌లో వాతావరణం మునుపెన్నడు లేనంత ఇబ్బందికరంగా ఎందుకుందంటే తాను అడుగుపెట్టడమే దానికి కారణమని జొకేసుకుంటాడు తనమీదే!
చక్కటి భాషతో, భావాలతో ఉండే రానారె బ్లాగులు చదువుతూంటే హాయిగా ఉంటుంది. మనసు తడిపేస్తూ ఉంటాయని పాఠకులన్నారు. ఈ బ్లాగుల్లో ఉండే కొన్ని మాటలు, పదబంధాలు కొత్తగా ఉన్నా, మొదటిసారే విన్నా.., అలా గుర్తుండి పోతాయి –మోజులు మోజులుగా కురిసే వాన లాంటివి.
ఛాయా’గ్రహణమొర్రి’, కంపశయ్య, లాంటి పదప్రయోగాలు రానారె బ్లాగుల్లో ఎన్నో!
అయితే అక్కడక్కడా చురకలూ వేస్తూంటాడు. కడపజిల్లా కరవుసీమ అయినా ఆశ్రితులనెప్పుడూ పోనాడలేదట! ఈ చురక తన మనిషి బ్లాగులోని ట్రావెలాగుడు-1 లోది.
రానారె పాటగాడు కూడా. చిన్నప్పుడు కోటి కోటి పాటలను పాడి, బహు మతులు పోగొట్టి బహుమతులు రాబట్టాడు. రానారెకూ ఆకాశవాణికీ అవినాభావసంబంధమేదో ఉన్నట్టే అనిపిస్తుంది. ఆకాశవాణి ప్రసక్తి రానారె రచనల్లో తరచూ వస్తూంటుంది. తానేకాదు, తన బ్లాగులోని కాకులు కూడా ఆకాశవాణికి శ్రోతలే!
(ప్రస్తుతం సంగీతం నేర్చుకుంటున్నట్లు వినికిడి!) గతంలో తానే స్వయంగా ఓ పద్యాన్ని పాడి, తన బ్లాగులో వినిపించాడు. చిన్నప్పుడు తాను పాడిన కాదరయ్య పాటను వినిపించాలన్న బ్లాగరుల కోరికను మాత్రం తీర్చలేదింతవరకూ!
-కథకుడు, కవీ కూడా. చిన్ననాటనే మొట్టమొదటి కథ రాసి, ఆకాశవాణిలో మొదటి బహుమతి కూడా పొందాడు. ఆయన రాసిన రెండో కథ నత్వం శోచితుమర్హసి ఈమాటలో ప్రచురితమయింది. ఒక ఎద్దు స్వగతాన్ని, ఆపై దాని “ఆత్మ”గతాన్ని కథగా మార్చి చక్కటి కథనంతో నడిపించాడీ కథను. పక్షులు కూడా రానారె బ్లాగులో పాత్రలే. ఈ జాబులో కాకులతో మనుషులకు బుద్ధి చెప్పిస్తాడు. ఈ మాటలను చూడండి.. “ఒక్క నిముషం కాకులన్నీ అవ్వ చెప్పిన మాటను నెమరు వేసుకొన్నాయి. సులభంగా ఆ మాటలను వాటి రక్తంలోకి జీర్ణించుకొన్నాయి. మనుషులకు అంత జీర్ణశక్తి లేదు పాపం.”
తెలుగు నుడికారంపై ఆయన పొద్దులో రాసిన రెండు వ్యాసాలు (మొదటిది, రెండోది) పెద్దల ప్రశంసలు పొందాయి. భాష విషయంలో రానారె బహు పట్టుదల మనిషి. “రాసాడు”, “రాశాడు” అనే మాటలవిషయంలో తెలుగుబ్లాగు గుంపులో మంచి ఆసక్తికరమైన చర్చ నడిపించాడు. అచ్చు తప్పుల్ని క్షమిస్తాడు గానీ, అచ్చోసిన తప్పుల్ని చూసి తట్టుకోలేడు రానారె! ఈతబర్రల పూజకి ఎనకాడ్డు ఈ జాబు చూడండి మీకే తెలుస్తుంది. అలాగే ఇదీ చూడండి. దీపావళిని దివాలి అని అనరాదని చెబుతూ.. “దీపావళి అనలేని దక్షిణాది వాడంటే నాకు కంపరం.” అని రాస్తాడు.
బ్లాగులు రాసినా, పద్యాలల్లినా, కథల్జెప్పినా.. బేసిగ్గా రానారె భాషా ప్రియుడు. రుచులూరే భాష కోసమే ఆయన రచనలను చదవొచ్చు. ‘ఓహో, అంతర్జాలంలోనూ సరుకున్నవా రున్నట్టున్నారే’ అని పెద్దలు ఇటుకేసి దృష్టి సారించేలా చెయ్యగలిగే బ్లాగరుల్లో రానారె ఒకడు. ఆయన రచనలు అచ్చులోనూ వచ్చి, తగు గుర్తింపు లభించాలని కోరుకుంటున్నాం.
-పొద్దు