మృతజీవులు – 14

-కొడవటిగంటి కుటుంబరావు

ఆ పెట్టె లోపలి వివరాలు ఇవి: దాని నడిమధ్యనే సబ్బుపెట్టె ఉన్నది. సబ్బుపెట్టెకు ఎగువగా మంగలి కత్తులుంచటానికి ఆరేడు సన్నని అరలున్నాయి. ఇసకా, సిరాబుడ్డి ఉంచటానికి చదరపు అరలున్నాయి. కలాలూ లక్కముక్కలూ పెట్టుకొనేటందుకు గుంటచేసిన చెక్క ఉన్నది. చిన్నచిన్న వస్తువులు పెట్టుకొనేటందుకు మూతలున్నవీ, లేనివీ అనేక అరలున్నాయి; వాటినిండా విజిటింగు కార్డులూ, అంత్యక్రియల కార్డులూ, థియేటరు టిక్కెట్లూ, జ్ఞాపక చిహ్నాలుగా దాచుకున్న అనేక ఇతర వస్తువులూ ఉన్నాయి. పై భాగంలోని అరలను కావాలంటే పైకి తీయవచ్చు.

స్టాంపు కాగితం క్రయవిక్రయ దస్తావేజులు రాసుకోవటానికే తప్ప కోర్టు పిటీషనులు రాయటానికి పనికిరాదని అతను ఆమెకు వివరించి చెప్పి, ఆవిడ తృప్తి కోసం రూబులు విలువ చేసే కాగితం ఒకటి తీసి ఇచ్చాడు. తాను రాసే ఉత్తరం పూర్తి కాగానే ఆమెను సంతకం చెయ్యమన్నాడు.

వాటి కిందగల భాగం నిండా కాగితాల బొత్తులున్నాయి. దాని తరవాత ఒక రహస్యపు సొరుగులో డబ్బున్నది. ఇది పెట్టె పక్కభాగంలోకి అమర్చి ఉన్నది. దీన్ని చిచీకవ్ ఎప్పుడు బయటికి లాగినా మళ్ళీ ఎంత త్వరగా లోపలికి తోసేవాడంటే అందులో ఎంత డబ్బున్నదీ స్పష్టంగా తెలిసేది కాదు. అతను ఒక కలం తీసి చెక్కుకుని రాతపని చేస్తూ ఉండగా ముసలావిడ లోపలికి వచ్చింది.

ఆమె అతని పక్కనే కూచుంటూ, “పెట్టె ఎంత బాగుందీ! దీన్ని కొన్నది మాస్కోలోనేనా?” అని అడిగింది.

“అవును, మాస్కోలోనే”, అన్నాడు చిచీకవ్ రాసుకుంటూనే.

“నాకు తెలుసు. అక్కడి పనితనం బాగుంటుంది. ఆ కిందటేడు మా చెల్లెలు పిల్లలకని అక్కణ్ణుంచి చలికి వేసుకునే బూట్లు తెచ్చింది; ఎంతమంచి సరుకు! ఇప్పటికింకా చెడలేదు. అబ్బో, మీ దగ్గర ఎన్ని స్టాంపు కాగితాలో!” అంటూ ఆమె పెట్టెలోకి చూసి, “నాకు ఒకటి రెండివ్వరాదూ, మహా ఇబ్బంది పడిపోతున్నాను. ఏదైనా కోర్టు పిటీషను రాసుకోవాలంటే కాగితం లేదు” అన్నది.

స్టాంపు కాగితం క్రయవిక్రయ దస్తావేజులు రాసుకోవటానికే తప్ప కోర్టు పిటీషనులు రాయటానికి పనికిరాదని అతను ఆమెకు వివరించి చెప్పి, ఆవిడ తృప్తి కోసం రూబులు విలువ చేసే కాగితం ఒకటి తీసి ఇచ్చాడు. తాను రాసే ఉత్తరం పూర్తి కాగానే ఆమెను సంతకం చెయ్యమన్నాడు. అతను కమతగాళ్ళ జాబితా కూడా అడిగాడు. ఆవిడ వద్ద జాబితాలేమీ లేవు గానీ, అన్నిపేర్లూ ఆవిడకు తెలుసు. వాటిని ఆవిడ చేత చెప్పించుకుని రాసుకున్నాడు. కొందరు కమతగాళ్ళ ఇంటిపేర్లూ, మారుపేర్లూ చూస్తే అతనికి ఆశ్చర్యం వేసింది. అవి వినపడేసరికి అతను రాయటం మానివేసి ఆగాడు. ప్యోతార్ సవిల్యేవ్ నె-ఉవఝియె-కరీత (తొట్టెను లక్ష్యపెట్టని) అనే పేరు అతనికి విడ్డూరంగా కనిపించి “ఎంత పొడుగు పేరు!” అన్నాడు. ఇంకొకడి పేరు చివర కీరోవీ-కీర్పిచ్ (కాకి యొక్క ఇటుక) అని ఉన్నది. ఇంకోడిపేరు ఇవాన్ కలిసో (చక్రం). అతను రాయటం ముగించి దీర్ఘంగా ఊపిరి పీల్చేసరికి వెన్నతో వేయించిన వంటకాల వాసన కమ్మగా తగిలింది.

“భోజనానికి రండి”, అన్నది ముసలావిడ. చిచీకవ్ చుట్టూ చూసేసరికి బల్లనిండా వండిన కుక్కగొడుగులూ, ‘పై’లూ బజ్జీలూ, జున్ను అచ్చులూ, అట్లూ, రకరకాల భక్ష్యాలూ అంతు లేకుండా ఉన్నాయి.

“కొంచెం కోడిగుడ్డు, పై తీసుకోండి!” అన్నది ముసలావిడ.

చిచీకవ్ పైని సమీపించి సగానికి పైగా తినేసి, చాలా బాగుందన్నాడు; ఆవిడతో అంత సతమతమైన మీదట అది నిజంగానే రుచిగా ఉన్నది.

“కొంచెం అట్లు” అన్నదావిడ.

చిచీకవ్ మూడు అట్లు తీసుకుని కలిపి మడిచి, కరిగించిన వెన్నలో ముంచి, నోట్లో పెట్టుకుని, బల్లమీద పరచిన గుడ్డతో పెదవులూ, చేతులూ తుడుచుకున్నాడు. ఇలా మూడుసార్లు చేసినాక అతను తన బండీని సిద్ధం చేయవలసిందిగా ముసలావిడకు కబురు చెయ్యమన్నాడు. నస్తాస్య పెత్రోవ్న ఈ పనిమీద ఫితీన్యను పంపుతూ అలాగే మరికొన్ని అట్లు పట్టుకు రమ్మన్నది.

వేడి వేడి అట్లు రాగానే వాటిని ఆరగిస్తూ చిచీకవ్ “మీ అట్లు చాలా బాగున్నాయి సుమండీ!” అన్నాడు.

“అవును మావాళ్ళు బాగా వేస్తారు. కాని వచ్చిన చిక్కల్లా ఏమిటంటే పంటలు పాడయాయి. పిండికి ధర బొత్తిగా లేదు… సరేగాని మీరెందుకలా తొందరపడుతున్నారు? ఇంకా గుర్రాలు సిద్ధం కాందే!” అన్నదామె, చిచీకవ్ తనటోపీ తీసుకుంటూండటం చూసి.

“సిద్ధమవుతాయండి. మావాళ్ళు చప్పున చేసేస్తారు.”

“సరే అయితే, సర్కారు కంట్రాక్టుల మాట మరవకండి”

“మరవను మరవను”, అంటూ చిచీకవ్ బయటి నడవా లోకి వచ్చాడు.

“మరి ఊరబెట్టిన పందిమాంసం కొనరూ?” అన్నదావిడ వెంటవస్తూ.

“కొనకేం? తప్పక కొంటాను, తరవాత”

“ఈస్టరు కల్లా పంది మాంసం తయారవుతుంది.”

“కొందాం, అన్నీ కొందాం, పంది మాంసం కూడాను”

“ఒకవేళ మీకు ఈకలు కావలసి ఉంటాయేమో? సెంట్ ఫిలిప్స్ ఉపవాసం నాటికి ఈకలు కూడా ఉంటాయి.”

“అలాగే, అలాగే” అన్నాడు చిచీకవ్.

“నేను చెప్పలేదూ? మీ బండి ఇంకా రాలేదు” అన్నది ఇంటావిడ మెట్లు దిగి వచ్చాక.

“వస్తుంది, ఇప్పుడే వస్తుంది. రహదారికి ఎలా వెళ్ళాలో మటుకు కాస్త చెప్పండి”.

“ఎలా చెప్పడం? చాలా కష్టం. ఎన్నో మెలికెలు తిరగాలి. మీకు దారి చూపించటానికి ఒక పిల్లదాన్ని వెంట పంపిస్తే బాగుంటుందేమో. తోలేవాడి ప్రక్కన దానికి చోటుంటుందనుకుంటాను.” అన్నది ముసలావిడ.

“ఎందుకుండదూ?”

“సరే, మీవెంట ఒక చిన్నపిల్లను పంపిస్తాను. దానికి దారి తెలుసు; ఏం లేదు గాని దాన్ని మాత్రం ఎత్తుకుపోకండి. కొందరు వర్తకులు లోగడ నా పిల్లదాన్ని ఎత్తుకుపోయారు.”

చిచీకవ్ ఎన్నడూ అలా చేయననేసరికి మనసు కుదుటపడి కరబోచ్క తన ఆవరణలో నడిచే తంతు గమనించసాగింది. ఇల్లుచూసే మనిషి సామాన్ల కొట్టునుంచి తొట్టెలో తేనె తీసుకువస్తూండటమూ, గేటు వద్దకు ఒక కమతగాడు వచ్చి ఉండటమూ ఆవిడ కళ్ళబడ్డాయి. ఆమె మనస్సు క్రమంగా తన నిత్యజీవితంలో నిమగ్నం కాసాగింది. కాని ఈ కరబోచ్కను గురించి మనం ఇంత వివరంగా చెప్పుకోవలసిన అవసరం ఏమున్నది? కరబోచ్క సతిని, మానిలవ్ సతిని వారి జీవితాల మంచిచెడ్డలను గురించి ఇక కట్టిపెడదాం. లేకపోతే, ఒకేదాన్ని గురించి అదేపనిగా ఆలోచించటం వల్ల సరదాగా కనిపించినది కాస్తా విచార కారణమవుతుంది. ఆ తరువాత మన బుర్రలోకి ఏమి ఆలోచనలు వస్తాయో భగవంతుడికే ఎరుక – ఈ లోకపు రివాజే ఇంత. మనకు ఇలా కూడా అనిపించవచ్చు; మానవ పరిపూర్ణత దృష్టిలో కరబోచ్క సతి నిజంగా హీనస్థితిలో ఉన్నదా? ఎక్కడో దివ్య భవనాంతఃపురాలలో, సువాసనలు వెదజల్లే ఇనపమెట్లూ, వాటికి తళతళలాడే రాగిగుబ్బలూ, ఖరీదైన చెక్కసామానులూ, తివాసీలూ గలచోట కూచుని, పుస్తకం పట్టుకుని ఆవులిస్తూ, గొప్పవాళ్ళ సందర్శనం కోసమూ, చమత్కార సంభాషణలకోసమూ ఎదురుచూసే గొప్ప ఇల్లాలికీ, ఈమెకూ మధ్య నిజంగా ఎక్కువ వ్యత్యాసం ఉన్నదా?

అక్కడ ఆవిడ తన తెలివితేటలు ప్రదర్శించి, మననం చేసుకుని ఉంచిన భావాలను వెళ్లగక్కుతుంది: ఆ భావాలు ఆమె సొంతం కావు; ఆమె ఇంటికిగాని, ఎస్టేటుకుగాని సంబంధించినవి కావు – ఆవిడకు ఇల్లు చక్కబెట్టటం గురించిగాని, వ్యవసాయం గురించిగాని, అణుమాత్రం కూడా తెలియదు గనక, అవి ఎలాగూ అధ్వాన్నం గానే అఘోరిస్తూంటాయి;

ఆవిడకు తెలిసిన భావాలేవంటే, ఫ్రాన్సులో రగులుతున్న రాజకీయ విప్లవం గురించో, కేథలిక్కు మతంలో సరికొత్త ఫ్యాషనులను గురించో, నగరంలోని గొప్పవాళ్ళు ఒక వారంపాటు ప్రచారంలో ఉంచేవి. చాలు, చాలు. ఎందుకిదంతా తడపటం? ఎంతో విశృంఖలానందం అనుభవిస్తున్న క్షణంలో కూడా, అకస్మాత్తుగా ఆ ఉత్సాహమంతా ఇగిరిపోతుందెందుకు? అంతలో మన నవ్వు తుడిచిపెట్టుకుపోయి అదే మనుషుల మధ్య మనం ఇంకొక మనిషి అయిపోతాం, మన ముఖాన ఏదో వింత కవళిక వచ్చేస్తుంది.

చిట్టచివరకు బండి రావటం చూసి “అదుగో బండి! అదుగో బండి!” అన్నాడు చిచీకవ్. “ఇంతసేపు ఏంచేశావురా, వెధవా? నిన్నటి నిషా దిగలేదా ఏం?”

దీనికి సేలిఫాన్ జవాబివ్వలేదు.

“సెలవిప్పించడమ్మా! అన్నట్టు ఆ పిల్లది ఏది?”

మెట్ల దగ్గర నిలబడి ఉన్న పదకొండేళ్ళ పిల్లను ముసలావిడ, “ఒసే పెలగేయా!” అని పిలిచింది. ఆ పిల్ల గౌను వేసుకున్నది, కాళ్ళనేమీ లేవు. కాని మందంగా బురదపట్టి ఉండటం చేత అంత దూరం నుంచి చూస్తే బూట్సు అనిపించేటట్టున్నది. “బాబు గారికి దారి చూపించు” అన్నదావిడ దానితో.

సేలిఫాన్ చెయ్యిపట్టుకుని, బండి మెట్టుపైన కాలుమోపి దాని నిండా బురద చేసి, పైనెక్కి ఆ పిల్ల సేలిఫాన్ పక్కన ఎత్తుగా కూర్చున్నది. అది ఎక్కినాక చిచీకవ్ ఆ మెట్టుపైనే కాలుపెట్టేసరికి, అతను బక్కవాడు కానందున బండీ కుడిపక్కకు వంగబడింది. అతను “అమ్మయ్య” అంటూ లోపల కూచుని, “వెళ్ళొస్తామండమ్మా!” అన్నాడు.

గుర్రాలు కదిలాయి.

సేలిఫాన్ దారిపొడుగునా మాట్లాడలేదు; తన దృష్టి పూర్తిగా గుర్రాలమీదే ఉంచాడు. తాగినప్పుడుగాని, ఇంకా ఏదైనా తప్పు చేసినప్పుడు గాని అలా ప్రవర్తిస్తాడు. గుర్రాలకు అద్భుతంగా పోషణ జరిగింది. వాటి మెడ పట్టీలలో ఒకదానికి చిరుగు ఉండి, లోపల కుక్కిన దూది బయటికి వెళ్ళుకొచ్చేది; దాన్ని చక్కగా కుట్టి బాగుచేశారు. దారిపొడుగునా వాడు మాటా, పలుకూ లేకుండా గుర్రాలను కొరడాతో కొడుతూ వచ్చాడు; మామూలుగా గుర్రాలకు చేసే హితబోధ చెయ్యలేదు. హితబోధలు చేసేటప్పుడు పగ్గాలు సడలి ఉండేవి; కొరడా గుర్రాల వీపుల మీద నామకార్థం సంచరిస్తూండేది. అందుచేత మచ్చలగుర్రం హితబోధలు లేకపోవటానికి నొచ్చుకుని కూడా ఉండవచ్చు. ఈసారి వాడు నోరు తెరవలేదు. తెరిస్తే సంక్షేపంగా “పదవే కాకీ, పాకుతున్నావేం?” అనటమూ, కోపంతో కూడిన అదిలింపులూ మాత్రమే జరిగింది. ఎర్రగుర్రానికీ అసిసరుకూ కూడా మామూలు ప్రియభాషణలు లేని లోటు కనబడింది. మచ్చలగుర్రం డొక్కలమీద కొరడా దెబ్బలు చురుకుగా తగులుతున్నాయి. “ఇలా కొడుతున్నాడేమిటి? మొత్తనికి దెబ్బ ఎక్కడ కొట్టాలో తెలుసు. ఊరికే వీపు మీద కొట్టక, నసాళం అంటే చోటు కనిపెట్టి మరీ కొడుతున్నాడు; చెవుల మీదా పొట్టమీదా అంటిస్తున్నాడు.” అని అది అనుకున్నది, చెవులు ఆడిస్తూ.

పచ్చని పొలాల మధ్య వానకు తడిసి నల్లగా ఉన్న రోడ్డు కేసి కొరడా చాచి చూపిస్తూ, సేలిఫాన్ తన ప్రక్కన కూచుని ఉన్న పిల్లతో కర్కశంగా “కుడివేపు తిరగాలా?” అన్నాడు.

“కాదు కాదు, నేను చూపిస్తా” అన్నది పిల్లది.

బండి రోడ్డును సమీపించే సమయంలో “దారిఎటు?” అని సేలిఫాన్ అడిగాడు.

“ఇటూ!” అన్నదా పిల్ల చేత్తో చూపిస్తూ.

“భలేదానివే! అది కుడివేపు కాదూ? దీనికి కుడిచెయ్యేదో ఎడమచెయ్యేదో కూడా తెలీదు” అన్నాడు సేలిఫాన్.

ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ, భూమి బురదగా ఉండటం చేత చక్రాల తిరుగుడుకు బురద లేచి బండి అంతా పడటం చేత బండి బరువెక్కింది. అదీగాక నేల జిగురు గల రేగటి నేల. ఈ చిక్కులుండటం చేత వాళ్ళు రహదారి చేరేసరికి మిట్టమధ్యాహ్నమయింది. ఆ పిల్ల వెంట రాకపోతే వాళ్లకు అది సాధ్యపడి ఉండదు. ఎందుకంటే గోతంలోంచి కుమ్మరించిన ఎండ్రకాయలు వెళ్ళినట్టుగా పక్కదారులు చెల్ల చెదురుగా ఉన్నాయి; వాటిలో చిక్కుకుని సేలిఫాన్ నిష్కారణంగా దారి తప్పి ఉండేవాడు. త్వరలోనే పిల్లది దూరాన మాసినట్టు కనబడే ఇంటిని చూపి, “అదే రహదారి” అన్నది.

“ఆ ఇల్లేమిటి?” అన్నాడు సేలిఫాన్.

“భోజనశాల” అన్నది పిల్లది.

“ఇక మేం పోగలం. నీవు ఇంటికి పరిగెత్తి వెళ్ళు”

వాడు బండి ఆపి, దిగటానికి పిల్లకు సహాయం చేస్తూ, “నీ కాళ్ళ బురద పాడుగానూ!” అని గొణుక్కున్నాడు.

చిచీకవ్ దాని చేతిలో ఒక రాగి డబ్బు పెట్టాడు. ఎత్తుపెట్టె మీద ఎక్కి బండి ప్రయాణం చేసినందుకు మురిసిపోతూ అది ఉఇంటిదారి పట్టింది.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.

One Response to మృతజీవులు – 14

  1. mohanrao says:

    editor garu vaddera chandi dasu gurinchi edaina publish cheyandi

Comments are closed.