అభినవ భువనవిజయము -8- దత్తపది పదకొండు

(<< గత భాగము)

‹కొత్తపాళీ› మరో దత్తపదికి వెళ్లే ముందు… చదువరి, మీరు దీన్నెత్తుకోండి … “మనుజుడై పుట్టి దేవుడు మాయజేసె”

‹చదువరి›

తేటగీతి.
వెరపు పుట్టించు ట్రాఫికు వెతల దీర్ప
మనుజుడై పుట్టి దేవుడు మాయ జేసె
భాగ్యనగరాన తన మాయ సాధ్యపడక
దారులందు జిక్కి యచటె స్థాణువయ్యె

‹నాగరాజు› చదువరీ – శెభాష్. మీ పద్యాలన్నిటిలోకి ఇదే ఆణిముత్యం.
‹కొత్తపాళీ› చమత్కారం పలు విధాల ప్రభవించింది.
‹విశ్వామిత్ర› మంచి వ్యంగ్యం, రోడ్డు మధ్యన విగ్రహాల మీద.
‹భట్టుమూర్తి› దేవుని మాయకు లొంగనిది మన నగర ట్రాఫిక్కు. ఇది నాకు చాలానచ్చిన పద్యాల్లో ఒకటి.
‹రాకేశ్వరుఁడు› వాహ్ వాహ్ … భాగ్యనగరాన తన మాయ సాధ్యపడక.. నిజమే….

‹కొత్తపాళీ› ఈ పద్యం వెనకాల పద్యం చెప్పటం సాహసమే .. కానీ మన భట్టుమూర్తి ఏమీ తక్కువ వాడు కాదు
‹భట్టుమూర్తి› దేవుడు గతంలో ఎన్నో అవతారాలెత్తి భూమికొచ్చినాడుగానీ… సహనము, సత్యము అనే ఆయుధాల మహత్తును తెలియజేయడానికి మరల మహాత్ముని రూపాన పుట్టినాడని ఈ పూరణ చేసినాను. చిత్తగించండి.

తేటగీతి.
దనుజులను దునుమాడి మోదముగూర్ప ధరణిఁ
మును జనుమ లెన్నియో దాల్చె గాని, సహన
మను సబళ సత్య’మాహాత్మ్య’మలర, మరల
మనుజుడై పుట్టి దేవుడు, మాయ జేసె!!

‹భట్టుమూర్తి› సబళము అంటే శక్తి అనే ఒక ఆయుధం
‹విశ్వామిత్ర› మలర, మరల శబ్ద చమత్కారం బావుంది
‹భట్టుమూర్తి› ఆహా… విశ్వామిత్రా… మీరొక్కరూ పద్యం మీద చూపు నిలిపి, చమత్కారాన్ని అభినందించినందుకు నేను సంతోషంతో కళ్లనీళ్లపర్యంతమయ్యాను. 😉 తేటగీతికి ప్రాసకూడా కుదిరింది చూడండి 🙂

రాఘవగారి పూరణ చూడండి –

తే.గీ. మన్నుఁ దినలేదు గనుమని వెన్నుఁడనుచు
సకల భువన చరాచర జగముఁ సూపి
తిరిగి తల్లి యశోదను తృటిఁ మరల్పఁ
మనుజుడై బుట్టి దేవుఁడు మాయఁ జేసె

———————————————————————————————————————–

‹కొత్తపాళీ› రాకేశ్వరా … “కంచం మంచం పంచె సంచీ”లతో (పద్యం) సిద్ధమేనా?

‹రాకేశ్వరుఁడు› మంచం మీద కూర్చున్నాను … కంచంలో తింటున్నాను … పంచెలు సంచిలో వున్నాయి
‹కొత్తపాళీ› కానియ్యి మరి .. సంచులు విప్పు 🙂
‹నాగరాజు› కొత్తపాళీ – ఇంకానయం పంచెలు విప్పమనలేదు. అందులోనూ, గే గేయాలు కూడా పాడాడిప్పుడే
‹కొత్తపాళీ› 🙂
‹భట్టుమూర్తి› గేయాలు అంటే సరిపోలా! గేగే ఎందుకు? 🙂
‹నాగరాజు› భట్టుమూర్తి – అవునుకదా – సరిపోతుంది. మా బాగా సరిపోతుంది.
‹రాకేశ్వరుఁడు› నాగరాజు, మీరు నిజంగా మరీ సార్

‹రాకేశ్వరుఁడు› విశ్వామిత్రులంతటి భావము లేక నేను శబ్దములను నమ్ముకొని వ్రాసిన నర్సరీ రైము ఇదిగో…
‹విశ్వామిత్ర› ఇంకేం! దంచు … 🙂

‹రాకేశ్వరుఁడు›

ఉ. కంచము కంచు దెందులుకు కాయలు పండ్లును గ్రోలువానికిన్
మంచము మంచి దెందులకు మల్లె వనంబున నిద్రబోవుచోఁ
పంచెలు పట్టు వెందులకు వ్యాఘ్రపు దోలు ధరించు వానికిన్
సంచుల సొమ్ము లెందులకు సంకెల దెంచిన యోగమూర్తికిన్


powered by ODEO
‹నాగరాజు› రాకేశ్వరుఁడు – వావ్, ఏం చెప్పావయ్యా, పోతన గారి ‘బాలరసాలసాల నవపల్లవకోమల’ పద్యం గుర్తుకు తెచ్చావ్.
‹విశ్వామిత్ర› “మంచము మంచి దెందులకు మల్లె వనంబున నిద్రబోవుచోఁ ” – బావుంది

‹విశ్వామిత్ర› అయ్యో, యోగ మూర్తికి మల్లె వనమెందుకూ? అడవి గాసిన వెన్నెల లాగా!
‹రాకేశ్వరుఁడు› విశ్వామిత్ర, “మంచము మల్లె దెందులకు మంచి వనంబున నిద్రబోవుచోఁ” అని చదువుకోగలరు.
‹నాగరాజు› వనంబున అనేకంటే, మనంబున అన్నాకూడా బావుంటుందేమో (మంచి మనస్సుతో అని)
‹విశ్వామిత్ర› రాకేశ్వరుఁడు, బావుంది మార్పు.
‹భట్టుమూర్తి› ఈ పద్యం మటుకు తాళబద్ధంగా పాటలా-గే వుంది.
‹చదువరి› రాకేశ్వరుఁడు, పద్యం బావుంది. పాడుకునేలా!

‹రాకేశ్వరుఁడు› ఇందులో ఉత్పలమాల మామూలు యతి 10వ అక్షరం కదా, నేను దానికి తోడు నాలుగో అక్షరానికి కూడా కుదిర్చాను. ప్రాస – ప్రతిపాదంలోనూ రెండో అక్షరంతోబాటు ఎందులకు అని ఆరు ఏడు అక్షరాలలో కూడా కుదిరింది 🙂

——————————————————————————————————————————————–

‹కొత్తపాళీ› విశ్వామిత్ర, మీ వంతు. మొదలెట్టండి.
‹విశ్వామిత్ర› ఈ దత్త పదినే?
‹కొత్తపాళీ› అవును

‹విశ్వామిత్ర›

ఉ.
కంచము బల్లనెక్కినది కాళులు వంగక యవ్వనంబునే
మంచము నెత్తుటే మరచి “మంచపు టిల్ల”ని పేరు బెట్టిరే,
పంచెలు కట్ట పాపమగు, పండుగ నాడును ప్యాంటుషర్టులే
సంచుల నిండుగా ధనమె చాలను నవ్యయుగమ్మిదేగనన్

‹నాగరాజు› విశ్వామిత్ర – చాలాబావుంది.
‹చదువరి› విశ్వామిత్ర, వృత్తం చాలాబావుంది
‹రాకేశ్వరుడు› చాలా మంచి అంశాన్ని ‘దంచారు’
‹భట్టుమూర్తి› మంచి కాన్సెప్టు
‹భట్టుమూర్తి› “పంచెలు కట్ట పాపమగు, పండుగ నాడును ప్యాంటుషర్టులే,” ఇంట్లో పెద్దలు తిట్టినట్టుంది 🙂
‹రాకేశ్వరుఁడు› భట్టుమూర్తి, తిట్టక మరి ??
‹కొత్తపాళీ› భట్టుమూర్తి, తిట్టు కాదుగానీ వ్యంగ్య విమర్శ ఉద్దేశం కాబట్టి తప్పుకాదు.
‹భట్టుమూర్తి› నాది విమర్శకాదు. మెచ్చుకోలే 🙂 అంటే … మెచ్చుకోలుయేనని.

‹కొత్తపాళీ› చదువరి మహాశయా, మీరు కానివ్వండి
‹చదువరి› కందము.

కొంచెపు సుఖమే పరమని
పంచెలు ఎగగట్టు కొనుచు పాతక జనులే
కంచము మంచము లమ్ముకు
సంచులతో సరుకు దెచ్చి సానులకిత్తుర్

‹భట్టుమూర్తి› వరెవ్వా! ఇదీ ఆ పక్షమే 😉
‹చదువరి› 🙂 అంటారా లేదా అని చూస్తున్నా!
‹కొత్తపాళీ› ముచ్చటగా కందంలో మూట గట్టారు .. చదువరి, మీకు అల్ల “సాని” పెద్దన అని బిరుదిస్తున్నాము 🙂
‹భట్టుమూర్తి› “అల్ల” అంటే హైదరాబాదులో 🙂
‹కొత్తపాళీ› భట్టుమూర్తి, 🙂
‹రాకేశ్వరుఁడు› భట్టుమూర్తి, చదువరిగారు సైతం మన పక్షానికి దిగారు 🙂
‹విశ్వామిత్ర› “సరుకు” దెచ్చి సానులకిత్తుర్ … నాగ రాజు గారు, మీ అభిప్రాయం ఓ రెండు ముక్కలు కొత్తపాళీ గారికి ఆనక తెలియజేయండి, ముందు ముందు పనికి వస్తుంది.
‹నాగరాజు› చదువరీ – రసిక శిఖామణీ, అందుకే మరి మీకు అన్ని తిప్పలు పాపం. 🙂

‹కొత్తపాళీ› చదువరి, ఇదే వరస రాజకీయ రణరంగ బీభత్సాన్ని రెండు పద్యాల్లో వర్ణించండి
‹చదువరి›

నీతికి తావెలేదు యవినీతికి అందరు పాతనేస్తులే
హేతువు లేనెలేదు సభ యందున జేసెడి రచ్చరచ్చకున్
నేతల దృష్టియంత పలు దిక్కుల యాస్తులు కూడబెట్టుటే
తాతయె గాదు, ఏకముగ ధాతయె వచ్చిన దిక్కుతోచదౌ

‹విశ్వామిత్ర› చాల బావుంది
‹భట్టుమూర్తి› స్వామీ.. పద్యపు చివరి పాదానికి నన్ను దాసుణ్ణి చేశారు 🙂
‹చదువరి› రెండోది …

రాజినామము పెట్టివచ్చిరి రాష్ట్రసాధకు లెల్లరున్
మోజుమీరగ పార్టిపెట్టగ బూరలూదిరి కొందరున్
పేజికొక్కటి స్కామురోదన పేపరాటవి మోగెలే
రాజకీయపు పాతకాపుల రచ్చకొంచము హెచ్చగా

‹భట్టుమూర్తి› “వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడొ తెల్పుడీ” … బాణిలో పాడుకోవచ్చు. క్రికెట్లో చివరి ఓవర్లలో బ్యాటింగ్ చూస్తున్నట్టుంది చదువరిగారి పద్యాలు కురుస్తుంటే. 🙂
‹కొత్తపాళీ› సెబాసు .. (మత్త)కోకిల కంఠం విప్ఫారు
‹కొత్తపాళీ› పేపరాటవి .. బహు బాగు
‹చదువరి› అరణ్య రోదనయని..
‹నాగరాజు› చదువరిగారికి సానులు, స్కాముల మీద పేటెంటుంది కాబోలు.
‹కొత్తపాళీ› నాగరాజు, మందు మీద కూడా
‹కొత్తపాళీ› అఫ్కోర్సు దోమల మందే ననుకోండి

‹కొత్తపాళీ› నాయనా భట్టుమూర్తి… ఈ దత్తపది నీకు – “మరక పరక చురక తరక” … ఇంకో దత్తపది “మలుపు, కలుపు, తెలుపు, నిలుపు”
‹భట్టుమూర్తి›

సీసము.
భ్రమరకము లూగ భామరో నీ మోము
జలదాల దోగాడు చందమామ!
అంబర యానంబున కనుక్రమమును గ-
ప రకమగు నీ యరాళ వేణి
జలదాల మాలయో జఘనంపు లీలయో!!
చురకత్తి నీ చూడ్కి చొచ్చె నెడదఁ!!!
తమలపాకుల వేళ తనివారు యీ వేళ
తరకటించగనేల తలిరుబోణి!!!!
తేటగీతి.
మేటి జవరాల మనకిది మేలి మలుపు
చెలగి సుఖముల బడయగ చేయి కలుపు!
తెలుపు ప్రణయజీవ యానపు తీయఁదనము
నిలుపుకొంద మీ రేయిని నిత్యముగను!!


powered by ODEO

భ్రమరకము – Hair curled upon the forehead, ముంగురులు
జలదము – Cloud మేఘము
అనుక్రమము – Method, order
రకమైన – Graceful, elegant,
నిత్యము – Always, continually, constantly
తరకటించు – To argue
బ్రౌణ్య నిఘంటు నిర్వాహకులకు ధన్యవాదాలు. 🙂

‹molla› శభాష్!
‹నాగరాజు› ఏదీ – మరొక్కసారి. ఒకదానికంటే, మరొకటి ఇంకా మెరసిపోతున్నాయి.
‹విశ్వామిత్ర› ఇదిగదా, బ్రహ్మచారి పక్షపు పద్యమంటే!
‹చదువరి› ఒక్కొక్క పదమూ రెండు సార్లు వచ్చినట్టుంది కదా!!
‹కొత్తపాళీ› దత్తపది మాటలని వేరే పదాల్లో పొదగాలన్న ఆలోచనా, పొదిగిన తీరూ అద్భుతం.
‹కొత్తపాళీ› చదువరి, ఇందాకే చెప్పాను గదా ఆయన ప్రతీదీ నొక్కి చెబుతాడని!
‹చదువరి› కొత్తపాళీ, ఔనౌను!
‹చదువరి› జలదాల అంటే..?
‹నాగరాజు› చదువరి – జలదమంటే మేఘము.

‹నాగరాజు› భట్టుమూర్తి – జలదాల అంటే మేఘం అనే అర్థంలోనే వాడావుగా ఇక్కడ?
‹భట్టుమూర్తి› ఔనండి
‹రాకేశ్వరుఁడు› అర్థాలు కావాలి…

‹నాగరాజు› రాకేశ్వరా – ముంగురుల మధ్య నీ మోము, మబ్బులలో చందమామలా ఉంది అని మొదటి పాదానికి అర్థం.
‹భట్టుమూర్తి› ధన్యవాదాలు

‹చదువరి› సీసం జటిల పదాలతో జటిలంగా ఉంది. తేటగీతి తేటగా, చక్కగా ఉంది.
‹విశ్వామిత్ర› భట్టుమూర్తి, చాల బావుంది
‹కొత్తపాళీ› చాలా సరసంగా ఉంది
‹molla› ఈ భట్టుమూర్తిగారికో భూషణాంబని చూడాల్సి ఉందనుకుంట
‹నాగరాజు› మొల్ల – ఆయన చూసుకొన్నట్టున్నారు అప్పుడే.
‹కొత్తపాళీ› molla, అందుకే సరసత ఇలా పొంగుతోంది
‹రాకేశ్వరుఁడు› భట్టుమూర్తి, భట్టుమూర్తికి , సత్యభామని అంటగట్టాల్సిందే…
‹molla› త్వరలో 🙂
‹కొత్తపాళీ› రాకేశ్వరుఁడు, భట్టు మూర్తి హీరోయిన్ను సత్యభామ కాదు, గిరిక.

‹కొత్తపాళీ› ఇంకా మంచి పద్యాలు చాలా ఉన్నాయి కానీ సందర్భోచితంగా ఇంకో నాలుగు చెప్పుకుని సభ ముగిద్దాము ఇప్పటికి.

—————–

(తరువాయి భాగము >>)

——————-

సంకలనం: రానారె

Posted in కవిత్వం | Tagged | 3 Comments

అభినవ భువనవిజయము -7- గూగులమ్మ పదాలు

(<< గత భాగము)

‹కొత్తపాళీ› ఇప్పుడు మన భట్టు కవిగారు కొన్ని గూగులమ్మ పదాల్ని రాలుస్తారు. దత్తపదులు ఇవీ:

  1. స్పార్కు మార్కు డార్కు
  2. డేటు బూటు పాటు
  3. తీర్పు నేర్పు కూర్పు
  4. మాల్సు కాల్సు ఫాల్సు
  5. టెక్కు నిక్కు లుక్కు
  6. చెంత చింత వింత

‹కొత్తపాళీ› భట్టుకవి సిద్ధమేనా?
‹భట్టుమూర్తి›

ఉర్విజనులకు స్పార్కు
నూత్న వర్షపు మార్కు
వుండబోదిక డార్కు
ఓ గూగులమ్మా!

 

తాత చేయును డేటు
తొడిగి సూటూబూటు
పడతి దొరకుటె పాటు
ఓ గూగులమ్మా!

‹నాగరాజు› భట్టుమూర్తి, మా పాట్లు భలే కనిపెట్టావే, సెభాస్.
‹రాకేశ్వరుడు› మీరు మరీ సార్…
‹విశ్వామిత్ర› ఆ తాతకి జాలపు డేటింగ్ తెలీదేమో; బావుంది
‹భట్టుమూర్తి› ఈ తాతకు తెలుసుగా 🙂 ఇదెలా వుందో చెప్పండి…

పిట్ట పోరున తీర్పు
పిల్లి జూపిన నేర్పు
బెమ్మ దేవుని కూర్పు
ఓ గూగులమ్మా!

‹నాగరాజు› చాలా బావుంది.
‹విశ్వామిత్ర› చాల బావుంది,
‹చదువరి› ఇది బెస్టు
‹విశ్వామిత్ర› ఇది డేటింగ్‌కి కూడ పనికొస్తుందేమో, తాతకు చెప్పాలి
‹కొత్తపాళీ› విశ్వామిత్ర, 🙂

మయుని మించిన మాల్సు
స్వీటు గొంతుల కాల్సు
నయా’గారపు ఫాల్సు
ఓ గూగులమ్మా!

‹విశ్వామిత్ర› నయా’గారపు’ బావుంది హిందీ అర్థము కూడ. పైగా పోనులో సరసాలు, ఇప్పుడే మొదలు. మయుడికి తెలీదు.

తెలుగు బ్లాగుల టెక్కు
జాలమందున నిక్కు
వేసుకో ఓ లుక్కు
ఓ గూగులమ్మా!

‹భట్టుమూర్తి› (టెక్కు = Grace, charm, elegance) (నిక్కు = అతిశయించుచున్నది, వర్ధిల్లుచున్నది)
‹కొత్తపాళీ› వీవెనుడి టెక్కునిక్కుల మహిమ. బ్లాగు బ్లాగు. భట్టుమూర్తి, చివరిది… చెంత చింత వింత

ప్రణయ జీవుల చెంత
వర్ణ భేదపు చింత
మనుజ లోకపు వింత
ఓ గూగులమ్మా!

‹రాకేశ్వరుడు› భట్టుమూర్తి, లోకపు అతి విడ్డూరమైన వింతను ముప్పైతొమ్మిదిమాత్రలలో భలే బాగుగా బంధించారు
‹విశ్వామిత్ర› దీని మీద, మూడు వేల సినిమాలు వచ్చి ఉంటాయి, ఒక్కొక్కటీ మూడు గంటలు, ఇలా మూడు ముక్కల్లో చెప్పేది మటుకు భట్టుమూర్తే.
‹భట్టుమూర్తి› ధన్యోస్మి.

(అపరిచిత(!) అతిథులు “మొల్ల” ఆగమనం)
‹విశ్వామిత్ర› భువనవిజయ సభకి మొల్ల రావటం ఇదే తొలిసారి కాదు
‹నాగరాజు› అవును, నిజమే, ఆమె తెనాలి రామలింగడి కాలంలోనిదే కదా?
‹విశ్వామిత్ర› అవునండి

————–

(తరువాయి భాగము >>)

——————-

సంకలనం: రానారె

Posted in కవిత్వం | Tagged | 5 Comments

అభినవ భువనవిజయము -6- అభినయ తారలు

(<< గత భాగము)

‹కొత్తపాళీ› విశ్వామిత్ర కవులకిది పిలుపు. “చార్మి, ఇలియానా, జెనీలియా, భూమిక”, ఈ నాలుగు పదాలనీ మీకు నచ్చిన ఛందంలో ఒక పొగడ్తగా పద్యం చెప్పండి!
* విశ్వామిత్ర ఇక్కడ లేరు (టైమవుట్)
‹కొత్తపాళీ› అరెరే .. విశ్వామిత్రుల వారికి స్టేజి ఫియరుగానీ వచ్చిందా ఏవిటి, సమయానికి?
‹చదువరి› విశ్వామిత్రకు కరెంటు పోయినట్టుంది!
‹గిరి› విశ్వామిత్ర గారికి మరెవరో అప్సరస దొరికినట్టుంది
‹కొత్తపాళీ› రాఘవ, పోనీ ఈ దత్తపది మీరు మొదలు పెట్టండి. గిరి, తరువాతి వంతు మీదే
‹రాఘవ› లోగడ వ్రాసినదిది…

చం.
జగతిని యెన్నడూ నిలువజాలవు చార్మిభూమికల్, సదా
నగజమనోహరున్ మదిని నమ్ముచు నిల్లియనాచరించుచూ
మృగధరునామమందు నువు మిక్కిలి మక్కువనొందు భక్తుడై
మిగిలిన రోజె నీలియరవిందసమర్చితుఁ దర్శనంబగున్.

చార్మిక అంటే చర్మ సంబంధిత, భూమికల్ అంటే సింగారాలు, ఇల్లియ అంటే ఉపవాసము. ఈ ప్రపంచంలో పైకి కనబడేవి శాశ్వతం కాదు. శాశ్వతమైన శివసాయుజ్యం పొందాలంటే నిరంతరం శివనామజపం చేస్తూ ఉపవాసదీక్షతో నమ్మికతో కొలవాలి – అని భావము.

‹రాకేశ్వరుడు› అద్భుతం రాఘవ గారు. శివునికి అంటగట్టారు మన కథానాయికలను
‹రాఘవ› అదే… ఆయన మాత్రమే వదుల్చుకోగలడు
‹గిరి› రాఘవ, మీ పద్యంలో రోజ, జనీలియా పెనవేసుకు కనబడుతున్నారు
‹రాఘవ› అదీ గిరంటే… రోజా కనబడిందీ
‹విశ్వామిత్ర› ఆవిడ రాజకీయ తీర్ధం పుచ్చుకుంది, జోలికెళ్లటం అంత మంచిది కాదు

‹కొత్తపాళీ› గిరీ, మీరు మొదలు పెట్టండి
‹గిరి› నాది చాలా ముక్కుసూటి ప్రయత్నం

సీ. అలనాటి అందాల తెలుగువెలుగునకు,
అద్దమ్ము పట్టిన అతివలెవరు?
సావిత్రి, జమునయు, జానకి, అంజలి,
పదహారణాలకు పసిడి పేర్లు
బోల్డైన ఈనాటి బ్యూటిఫుల్ తెలుగుకు
తెరపైన వెలుగిచ్చు దీప్తులెవరు?
ఇలియాన ఛార్మి జెనీలియ భూమిక,
దిగుమతికేవీరు తీపిపేర్లు
తే.గీ. నాటి నాయికామణులకు సాటివచ్చు
తేట తెలుగుపలుకులలో పాటవమ్ము
పైట జార్చుటె నేర్చిన పైడిబొమ్మ
పైట జార్చుటె నేర్చిన పైడిబొమ్మ
లిట్టి నాయికారత్నాల కెట్లు వచ్చు

‹రాఘవ› వహ్వా
‹గిరి› పైట రెండు సార్లు జారింది, తప్పువల్ల, గమనించ గలరు
‹రాకేశ్వరుడు› వాహ్ వా వాహ్ వా….గిరి, కొన్ని తప్పులు ఒప్పులకంటే మథురం
‹కొత్తపాళీ› గిరి, 🙂 🙂 😀
‹విశ్వామిత్ర›కేల వచ్చు” అంటే చెయ్యి ఊపగానే వస్తుందనా?
‹భట్టుమూర్తి› హహ్హ్హ్హ్హహ్హహ్హ
‹కొత్తపాళీ› విశ్వామిత్ర, హ హ్హ
‹కొత్తపాళీ› వాళ్ళని సీసంలో పోత బొయ్యడమే మీ చమత్కారానికి తార్కాణం! 🙂
‹రాఘవ› కొత్త నాయికలని ఛావగొట్టి చెవులు సీసంతో మూసేసారు కదా!

‹కొత్తపాళీ› విశ్వామిత్ర, మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు తెరమరుగయ్యారు .. మీరూ కానివ్వండి ఈ దత్తపది
‹విశ్వామిత్ర› ఓ మాటు కృష్ణదేవరాయలకు దిగులు పట్టుకుంది ట, నేనే పాటి రాజుని అని, భువన విజయం లో ఉన్నా, మరే సభలో ఉన్నా, ఈ చీకు గుర్తుకు వచ్చేదిట. అలా ఉన్న రోజులలో ఓ సాయంవేళ ఉద్యానవనంలో ఉన్న రాజుగారితో తాతాచార్యులన్నారుట- “ఊరకే ఆకాశంలో అటూ ఇటు తిరిగే చంద్రుడు, దుర్యోధనుడు, ఇంద్రుడు రాజులా? మీరు రాజు గానీ” యని.

ఉ//
ఈశ,విచారమీతెరగు ఏర్పడ పాటియె? రాజె నీలియా
కాశపు దారిబోవుటను? కానక బంధుల, భూమికాశయై
……..
……..


‹రాఘవ› విశ్వామిత్రా, ఓ విశ్వామిత్రా… తర్వాత యేమిటి
‹కొత్తపాళీ› బాగు బాగు … కానివ్వండి
‹రాకేశ్వరుడు› భూమికాశ పడి ఏంచేశాడతను
‹రాఘవ› మళ్ళీ ఊడిందా కరెంటు?
‹చదువరి› విశ్వామిత్రునికి మళ్ళీ ఇబ్బందనుకుంటా!

‹గిరి› అయ్యో, నలుగురున్నారని మేమొస్తే ఇద్దర్నే ఇచ్చి ఆపేస్తే ఎలా
‹చదువరి› గిరి, 🙂
‹కొత్తపాళీ› గిరి, buy one, get one free కి ఇది వ్యతిరేకం!
‹రాకేశ్వరుడు› ఇలియానా చేత కూడా ఐటెం నెంబరు వేయించాలి
‹చదువరి› లాభంలేదు, విశ్వామిత్రుడు తన స్వంత పవరు ప్లాంటు పెట్టుకోవాలేమో!

‹విశ్వామిత్ర›

ఉ.
ఈశ,విచారమీతెరగు ఏర్పడ పాటియె? రాజె నీలియా
కాశపు దారిబోవుటను? కానక బంధుల, భూమికాశయై
నాశము చందగా పతియె? నాతుల కౌగిలియా?నతండు మౌ
నీశుని భార్యనైనవిడ నేర్వక రాజెబొ? రాజు రాయలౌ.

‹కొత్తపాళీ› విశ్వామిత్ర, హమ్మయ్య ఇంక నేనే రంగం లోకి దిగుదా మనుకుంటున్నా
‹రాఘవ› శభాష్
‹నాగరాజు› సూపర్ – మూడు పద్యాలు అదిరాయి.
‹చదువరి› పద్యం చాలా బావుంది.
‹రాఘవ› నాగరాజు, అదిరాయన్నారు, పద్యాలున్న చోట భూమి కంపించిందా?
‹నాగరాజు› మీలాటి వాళ్ళ ముందు ఉన్నప్పుడు – నా తల ఎప్పుడూ భూమి మీదే ఉంటుంది మరి
‹కొత్తపాళీ› ఈ దత్త పది మీద మంచి చమత్కారాలు రేగినై

————

(తరువాయి భాగము >>)

——————-

సంకలనం: రానారె

Posted in కవిత్వం | Tagged , | Comments Off on అభినవ భువనవిజయము -6- అభినయ తారలు

అభినవ భువనవిజయము -5- రాజశేఖరుండు రాజ్యమేలె

(<< గత భాగము)

‹కొత్తపాళీ› చదువరీ మీ పూరణ వినిపిస్తారా?
‹చదువరి› కొత్తపాళీ, అలాగే!

అ.వె.

ఉదయ భాను రీతి ఉజ్వలమ్ముగ లేచి
మేళ్ళు జేతు మనుచు కీళ్ళు విరిచె
అస్తమయపు వేళ అవినీతి మసకేయ
రాజశేఖరుండు రాజ్యమేలె

‹విశ్వామిత్ర› “ఉదయభాను” – అంటె యాంకరమ్మ కాదు గదా?
‹నాగరాజు› చదువరిగారికి ఎప్పుడూ “పొద్దు” తలంపులే కాబోలు.
‹రాకేశ్వరుడు› బాగుంది
‹గిరి› ఆయన వచ్చినప్పుడు ఉదయభానుని వలె ప్రకాశించి, పదవీకాలం ముగుస్తున్న అస్తమయాన మసకబారిన రీతి.
‹భట్టుమూర్తి› చదువరి బ్లాగుల్లాగే పదునుదేరిన పద్యం
‹గిరి› చదువరి, కీళ్ళు ఎందరివో విరిచిన మాట నిజమే
‹చదువరి› ఇక్కడ.. మేళ్ళు అనే మాట… రాజా తప్ప మరొకరు వాడరు. అదాయన ట్రేడ్ మార్కు!
‹విశ్వామిత్ర› “ఉదయ భాను” అనగానే -ఇక్కడ కూడ వాణిజ్య విరామమా? (ట్రేడ్ మార్క్)
————————————————————————————

‹కొత్తపాళీ› చదువరి తరవాత గిరిధర కవి
‹గిరి› ఇక నా పూరణ (కొత్తపాళీ గారి అనుమతితో)

ఉ.
గుంటలు పడ్డదారులకు కొంపలు కూలవు, కూలి చెత్తతో
పెంటయి పోవువీధులకు పేటలు కాలవు, కాలి బూడిదౌ
పంటకి ఆత్మహత్యలకు పాల్పడ నేటికి? విజ్ఞులెప్పుడూ
వెంటయి రాని కీర్తికని వెంపరలాడి ధనమ్ము వీడరే?
ఆ.వె.
ఇట్టి నీతి నమ్మి యింటిని చక్కగా
దీపముండగానె దిద్దదొడగె
పురజనులను మరచి పూర్తిగా, నివ్విధి
రాజశేఖరుండు రాజ్యమేలె

‹రాకేశ్వరుడు› బ్రహ్మాండం … వృత్తం!
‹నాగరాజు› వీరేశలింగం గారి రాజశేఖరచరిత్ర మీదకి ఎవరి కన్నూ పడ్లేదా?
‹భట్టుమూర్తి› ఆ రాజశేఖరుడు రాజు కాదు గదా!
‹నాగరాజు› కాదా – ఏమో నాకు తెలీదు.
‹కొత్తపాళీ› నాగరాజు, అదీ కాక … ఈ సమస్యకు పూరణను ప్రస్తుత రాష్ట్ర పాలన మీద చెప్పాలని నియమం విధించాము.

————————————————————————————-‹కొత్తపాళీ› తరువాత భట్టుమూర్తి
‹భట్టుమూర్తి› నేనూ ఒక ఆటవెలది చెబుతున్నాను ఈ సమస్యపై

ఆ.వె.
ప్రాజ్యమాయె నిలను రాజీవ నామము
యిందిరమ్మ యిండ్లు నిందలాయె
పూజ్యమై నిలువఁగ ప్రోజెక్టు నాణ్యత
రాజశేఖరుండు రాజ్యమేలె

‹శ్రీరామ్‌› భళా!
‹నాగరాజు› వారెవ్వా, ఎత్తుగడలోనే శ్లేష. (ప్రాజ్యము=విస్తారము, బహుళము)
‹భట్టుమూర్తి› ధన్యోస్మి

————————————————————————————

‹రాకేశ్వరుడు› నాగరాజు, మన మిద్దరం ఒక ఒప్పందం కుదుర్చుకుందాం.. నాకు ఛందస్సు తెలుసు గాని సాహిత్యం తెలియదు.. మీకు ఛందస్సు తెలియదనుకుంటా.., మీరు కథలు చెప్పండి నేను వాటిని పద్యాలలోఁ పెడతాను (వచ్చే యుగాది భువన విజయానికి)
‹నాగరాజు› రాకేశ్వరుఁడు – వచ్చే ఉగాదికి నాకు ఛందస్సు తెలియవచ్చుగా?
‹రాకేశ్వరుడు› ఒక వేళ తెలియక పోతే … అని…
‹గిరి› నాగరాజు గారు, వచ్చే ఉగాదికి రాకేశ్వరుఁడు సాహిత్యమూ నేర్వవచ్చు!
‹నాగరాజు› రాకే్శ్వరుడికి ఇప్పుడు సాహిత్యం ఏమీ తక్కువలేదు కదా – కనీసం నా ఛందోపరిజ్ఞానంతో పోలిస్తే.
‹కొత్తపాళీ› రాకేశ్వరా… మీది యింకో పూరణ …
‹రాకేశ్వరుడు› పనిలో పనిగా నాది కూడా వినండి…

ఆవె.
రాజకీయమిటుల రాష్ట్రముఁ జీల్చెను
ధరలుఁ దాకెఁ దివిని ధాత్రి వీడి
గుత్తెకాండ్లు గూడి గుళ్ళను దోచిరి
రాజ్యశేఖరుండు రాజ్యమేలెఁ

‹రాకేశ్వరుడు› రాక-ఈశ్వరుండు రాత రాసెఁ
‹చదువరి› బావుంది. గుత్తేదార్లు (కాంట్రాక్టర్లు) గుళ్ళో లింగాల్నే మింగగలరు, ఇక గుళ్ళెంత!
‹గిరి› గుత్తెకాండ్లు గూడి గుళ్ళను దోచిరి – బావుంది, గూళ్ళన్నా గుళ్ళన్నా సరిపోతుంది
‹రాకేశ్వరుడు› పాపం అందరూ తిడతారని తెలిస్తే నేను పొగుడుతూ పద్యం వ్రాసేవాడినే
‹భట్టుమూర్తి› గుత్తెకాడు పదాన్ని వాడుకలో పెట్టారు బాగుంది
‹విశ్వామిత్ర› దోచిరి/ ‘మింగిరి’ అనవచ్చు
‹రాకేశ్వరుడు› మింగిరి బాగుంది
‹రాకేశ్వరుడు› అన్నట్టు ఈ సమస్యకు అలా వ్రాసుకుంటూ పోవచ్చు అనంత ఆటవెలది… ప్రస్తుత రాష్ట్ర పాలనకి.
‹కొత్తపాళీ› రాకేశ్వరుఁడు, అవును మరి ఆట వెలదులకు లోతెక్కువకదా.
‹రాకేశ్వరుడు› అవును, రాఘవమూర్తులు ఏరి? ఆయన చెప్పిన పద్యం చూడండి –

ఆ.వె. కంటకంబులుంటె కనిపెట్టి మెల్లిగా
ముళ్ళదారులందు వెళ్ళు రీతిఁ
రాజశేఖరుండు రాజ్యమేలెఁ గనుక
పట్టు కొఱకు చూడవలయు మనము.

‹కొత్తపాళీ› ఆహా…బాగుబాగు. రాజకీయ ఘాటు ఎక్కువైందేమో… ఒక దత్త పది వేసుకుందామా?
‹రాకేశ్వరుడు› దత్త పదకొండు వేసుకుందాం 🙂

————

(తరువాయి భాగము >>)

——————-

సంకలనం: రానారె

Posted in కవిత్వం | Tagged | Comments Off on అభినవ భువనవిజయము -5- రాజశేఖరుండు రాజ్యమేలె

అభినవ భువనవిజయము -4- మందుగొట్టి మగువ మంచమెక్కె

(<< గత భాగము)

‹కొత్తపాళీ› ఈ మన భట్టుపల్లె మూర్తి కవి … నేను చెప్పడమెందుకు, మీరే ఆలకించండి
‹భట్టుమూర్తి› 🙂

భట్టుపల్లె యనెడి భాగ్యసీమ నాది
పట్టుగొమ్మ పసిడి పద్య ములకు
అట్టి మట్టి నుండి అంకురించితి గాన
భట్టుమూర్తి యండ్రు భావుకముగ

‹గిరి› భట్టుమూర్తి, అదిరింది – ఆటవెలదా?
‹భట్టుమూర్తి› ఔను 😉
‹కొత్తపాళీ› భట్టుమూర్తి, భేషు .. ప్రాసకూడ కుదిరిందే ముచ్చటగా.
‹చదువరి› భట్టుమూర్తి, చప్పట్లు
‹భట్టుమూర్తి› ధన్యవాదాలు.

‹కొత్తపాళీ› ఎంతైనా భట్టుమూర్తి కవి దృష్టే వేరు. భట్టుమూర్తి కవిరాయా “మందుగొట్టి మగువ మంచమెక్కె” రాసుకోండి!
‹భట్టుమూర్తి› సరి, నేను సమస్య పూరణకొస్తాను. ప్రేమించిన యువకుడిని పెళ్లాడిందో యువతి. పెళ్లయ్యాక వాడు బాధ్యతలను మరచి వ్యసనపరుడైనాడు. ఒకనాడామె విసిగిపోయి, తాగినమైకంలోవున్న మగనిపై కోపం అతిశయించిపోయి కొంగుబిగిస్తే, ఆలి భంగిమలో రౌద్రరసానికి బదులు ఆ మగడు శృంగారాన్ని మాత్రమే చూసి లొట్టలు వేస్తుండగా, ఆ మూర్ఖుణ్ణి కొట్టి అలిగి మంచమెక్కుతుందీ మగువ. (‘మందు’డు అంటే మూర్ఖుడు)

సీసము:
చెలికాడనన్నాడు చెలివి నీ వనినాడు;
మనువు కుదరఁగానె మరచినాడు
మనసైన చినవాడు మదిని దోచినవాడు;
మారెనెందుకొ నన్ను చేరగానె
సరసాలవేళనే సంసారి యగు! వాడు,
సురశాల యలవాటు మరగినాడు
సమభోగ మనగానె సగభాగ మనువాడు;
సంతు బాలింపంగ చెంతలేడు
ఆటవెలది:
యెందుకీ మగడని యెక్కిళ్లనిడచుచు
క్రోధ మతిశయింప, కోక బిగియ-
గట్టిన తనుఁజూచి లొట్టలే యుచునున్న
మందుఁ గొట్టి, మగువ మంచ మెక్కె.

‹రాకేశ్వరుడు› చాలా బాగుంది అంత్య ప్రాస బాగా కుదిరింది
‹విశ్వామిత్ర› ఓహో వీడు కూడా తూగులయ్య అన్నమాట
‹చదువరి› గొప్పగుంది సీసం!
‹రాకేశ్వరుడు› భట్టుపల్లె రైలుబండిలా …
‹గిరి› భట్టుమూర్తి, అంత్య ప్రాసకూడా కుదిర్చి బాగా చెప్పావు
‹చదువరి› పాడుకొనేలా…
‹కొత్తపాళీ› భట్టుమూర్తి, సెహబాష్‌. పేరు నిలబెట్టారు
‹విశ్వామిత్ర› “సంతు బాలింపంగ చెంతలేడు ” -చాల బావుంది. (సంతు = సంతానం)
‹భట్టుమూర్తి› ధన్యవాదాలు…
‹విశ్వామిత్ర› ఈ మంచం అలక మంచమా?
‹భట్టుమూర్తి› అలకమంచమే… ఎంతైనా ప్రియుడుకదా

————————————————————————————

‹కొత్తపాళీ› గిరిధర కవీ .. మీ పూరణ?
‹గిరి› భట్టుమూర్తి, అప్పుడు ఆ మగవాడు కూడా మంచ మెక్కాడట… నా పూరణ వినండి

ఆ.వె.
ఇంటి నుండి తరిమె, ఇల్లాలు కోపించి
బుజ్జగించి వెంట వుండకుండ
సానికొంపకేగి సచ్చినోడు, దొరలా
మందు కొట్టి, మగువ మంచమెక్కె

‹కొత్తపాళీ› గిరి, మగువకి షష్ఠీ తత్పురుష కలిపారన్న మాట. (దొరలా మందుగొట్టి, మగువ (యొక్క)మంచమెక్కె)
‹విశ్వామిత్ర› షష్టీ తత్పురుషలో నాకు తెలిసిందొక్కటే, “లోన్”, ఎప్పుడూ బాంకు వారి చుట్టూ తిరుగుతూ ఉంటాను 🙂 (షష్టీవిభక్తి -కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్)
‹నాగరాజు› విశ్వామిత్ర – 🙂
‹కొత్తపాళీ› విశ్వామిత్ర, సెబాసు!
‹కొత్తపాళీ› చదువరి కవివర్యా మీది తరువాయి
‹చదువరి›

ఆ.వె.
మగని గురక పోటు తగని దోమల కాటు
కునుకు రాకపోయె కునికె రేయె
నిదుర సుఖము గోరి, నిర్జింప దోమల
మందు కొట్టి మగువ మంచమెక్కె

‹గిరి› చదువరి, దోమల మందు బానే కొట్టించారు కానీ మగనికా దోమలకా తేల్చలేదు
‹కొత్తపాళీ› బలె బలె
‹రాకేశ్వరుడు› మాడరన్ను వుమన్ను అన్న మాట ! బాగు బాగు
‹చదువరి› గిరి, రెండు మందులు గొట్టింది.. ఒకటి దోమలకు, రెండో రకం తనకు!
‹రాకేశ్వరుడు› చాలా రకాల మందులున్నట్టున్నాయి… అన్నీ మ్రింగాక అజీర్తి చేయదుగా

————————————————————————————

‹కొత్తపాళీ› విశ్వామిత్ర, .. మీరూ?
‹విశ్వామిత్ర›

ఆ.వె.
పండుగయని బోయి పడతి పుట్టింటికే
తిరిగి వచ్చి నంత, తిరుగు క్రిముల
చెదల, పురుగు పుట్ర బొద్దింక లనుజంప
మందు కొట్టి మగువ మంచ మెక్కె.

‹కొత్తపాళీ› బాగుంది విశ్వామిత్ర! తాడేపల్లి లలిత కవి గారి పూరణ కూడ బహు సొగసుగా వుంది.

ఆ.వె.
పడతి కోరినట్టి పట్టుచీరెను దన
జనని నడిగి మగఁడు కొని యొసంగె
నంతఁ గుంది యలిగి యా చీరెఁ బతిముఖ
మందు కొట్టి మగువ మంచమెక్కె.

‹గిరి› తాడేపల్లి వారు కొట్టించిన మందు బాగుంది
‹భట్టుమూర్తి› ఇది మంచి సంసారపక్షపు పద్యం… 🙂
‹రాకేశ్వరుడు› భట్టుమూర్తి, విశ్వామిత్రులదేమైనా సంసార పక్షాన తక్కువా? 🙂

‹నాగరాజు› ఎవరూ – సుందరకాండ వైపు పోవటం లేదేంటీ? హనుమంతుడు, అక్కడ చాలామంది మందుగొట్టి మంచమెక్కిన మగులని కాంచాడుగా?
‹రాకేశ్వరుడు› అందుకే మీరు పద్యాలు నేర్చి వ్రాయాలి, నాలాంటి పురాణ పూజ్యాన్ని తీసుకొచ్చి వ్రాయమన్న బూతు పద్యాలే వస్తాయి (వాస్తవికత పేరిట)
‹విశ్వామిత్ర› నాగరాజు గారు, రాక్షస కాంతలతో సరసం ఆటే మంచిది కాదని
‹కొత్తపాళీ› నాగరాజు, అసలే రాక్షసి .. ఆపైన మందు గొట్టింది! ఇక రాఘవగారి పూరణ చూడండి –

ఆ.వె.
ఇతరదేశములలొ అతివాదమన్నిటన్!
చదువు ధనములైన జబ్బులైన.
పగలు కష్టపడుచు పనిజేసి తరువాత
మందు కొట్టి మగువ మంచమెక్కె.

————————————————————————————

* Sriram సాహిత్యంలో చేరారు
‹విశ్వామిత్ర› రార మాయింటి దాక
‹నాగరాజు› శ్రీరామ్ – వనవాసంలో అజ్ఞాతవాసం కూడానా?
‹Sriram› అయ్యా! మేష్టారూ!! ఈ సారికి ఇలా క్షమించెయ్యండి.
‹విశ్వామిత్ర› పోయిన రాముడి విగ్రహాలు కనుగొన్న తర్వాత త్యాగయ్య పాడుకున్నాడుట. మాదీ అదే పరిస్థితి కదా అందుకని “రార మాయింటి దాక ” అన్నాను
‹నాగరాజు› శ్రీరామ్ – ఇప్పుడు మీరు కవులు, నేను కేవలం ప్రేక్షకుడిని, అదీకాకుండా పేరుకి తమ్ముడిని – కాబట్టి, మిమ్మలని నేనెలా క్షమించగలను, మీ రాకే పరమానందం

‹రాకేశ్వరుడు› Sriram, తెలుగు పేరు … దయమాడి
(కన్నడభాషలో దయమాడి అంటే దయచేసి అని)
‹Sriram› నేను కూడా ప్రేక్షకుడినే…
‹చదువరి› Sriram, మీ దయ ఇంకా మాడలేదు
‹రాకేశ్వరుఁడు› Sriram, ఈ ఒక్క రోజుకీ ఆంగ్లము కానలేము .. స్వల్పముగా దయమాడి
‹నాగరాజు› శ్రీరాములవారి దయ ఎప్పుడూ “మాడ”దు.

————————————————————————————–

‹కొత్తపాళీ› రాకేశ్వరా .. కానివ్వండి
‹రాకేశ్వరుడు›

సీ.
చారు మీగడ గంజి జావలు సద్దన్న
మవి వీడి మత్తుగా మందు గొట్టెఁ
భూమిక యెందుకు భోజనమునకైన
పావలా వడ్డీకి పైడి రాగఁ
ఆ జానపదు లేవి? మోజె నీలి యసహ్య
చిత్రాల పై బడె సిగ్గు లేక
గడన పడతి యొక్క కౌగిలి యానం
మున కుల పడతిని తాను మరచెఁ
ఆవె.
నమ్మి వాణ్ణి తాను, అమ్ముకున్నాడోటు;
రాజశే ‘ఖరుండు’ రాజ్యమేలెఁ
సదువులేక బతుకు సతికిల బడ్డాది;
మందు తాగి మతియె మంచ మెక్కె

‹రాకేశ్వరుడు› మతి నిదురించినదని అర్థం. భూమిక ఎందుకు=భూమి+ఇక ఎందుకు. గడన పడతి = వెలయాలు.
‹గిరి› మందు, మగువ, మగడు అన్నిటినీ సమపాళ్ళలో కలుపుతున్నట్టున్నాడు రాకేశ్వరుడు
‹గిరి› రాకేశ్వరుఁడా, ఈడ్చి తన్నేస్తున్నావు
‹కొత్తపాళీ› సెబాసు రాకేశ్వరా .. ఒక పక్క రాజకీయ వ్యాఖ్యానం, ఇంకో పక్క సాంఘిక దుస్థితి వ్యాఖ్యానం .. అమోఘం. రాకేశ్వరుడు … ఒక్కో సమస్యకీ ఒకో పద్యం ఏమి రాస్తాములే అని .. పనిలో పనిగా దీనిలోనే చార్మి, భూమిక, జెనీలియ, ఇలియానలను కూడ ఇరికించి .. ఆ దెబ్బతోనే రాజశేఖరుని రాజ్య పాలనమ్మీద వ్యాఖ్య కూడా ఝళిపించాడు.
‹నాగరాజు› వావ్ – రాకేశ్వరా – సూపర్, డూపర్. ఇప్పటిదాకా విన్న పద్యాలన్నీ ఒక ఎత్తు, ఇదొక్కటీ ఒక ఎత్తు. నీ ఎత్తుగడ భలే ఉంది. వేసుకో వీరతాళ్ళు.

‹కొత్తపాళీ› ఒకటేమి సరిపోతుంది .. మూడు సమస్యలు భేదించాడు కాబట్టి మూడన్నా వెయ్యాలి!
‹విశ్వామిత్ర› నా తరఫున ఒకటి
‹చదువరి› రాకేశ్వరా, నాదోటి
‹భట్టుమూర్తి› నాదొకటి

‹గిరి› చాలా బావుంది నీ పద్యం
‹Sriram› మంచి పూరణ్
‹రాకేశ్వరుడు› నిజం చెప్పాలంటే, నాకు సొంతగా అవిడియాలు రావు.. కాబట్టి ఆటవెలది పూరణకి సమయమూ శక్తి లేక ఇలా చోరించడం జరిగింది
‹విశ్వామిత్ర› శ్రీరామా, తెరపేరు అంగ్లము; మాట్లాదేది కన్నడమూ హిందీ, ఏమిటయా ఇది?
‹చదువరి› విశ్వామిత్ర, 🙂
‹Sriram› గురువుల ఆజ్ఞ్. రామలింగడి పాత్ర్. కాస్త వినోదం కోసం.

* Sriram, ‘శ్రీరామ్‌’గా పేరు మార్చుకున్నారు

‹గిరి› రాఘవ కానరాడేం

‹కొత్తపాళీ›సరే ఎలాగూ రాజశేఖరుడి రాజ్యంలో ప్రవేశించాము కాబట్టి .. అలా వెళదాం

—————-

(తరువాయి భాగము >>)

——————-

సంకలనం: రానారె

Posted in కవిత్వం | Tagged | Comments Off on అభినవ భువనవిజయము -4- మందుగొట్టి మగువ మంచమెక్కె

అభినవ భువనవిజయము -3- కోకిల కంఠము విప్పి పాడగన్

(<< గత భాగము)

‹కొత్తపాళీ› గిరిధర మహాశయా, ఇంకో సమస్య… కోడిని తిన్నవాడు తన కోకిల కంఠము విప్పి పాడగన్
‹గిరి› కొత్తపాళీ గారు, నన్ను ఈ సమస్య చాలా కష్టపెట్టిందండీ

ఉ. పాడగ పాటగాడు అలవాటుగ పాటలు వంటవండుతూ,
మాడెను కోడికూర, రుచి మాడెను, మాడు ముఖమ్ము వేసెగా
కోడిని తిన్నవాడు, తన కోకిల కంఠము విప్పి పాడగన్
పాడిన పాటగాడు, నులిపైత్యము మానెను తిన్నవాడికిన్

‹కొత్తపాళీ› గిరి, పద్యానికి కాస్త వివరణ ఇస్తే బావుంటుందేమో
‹రాకేశ్వరుడు› పాట పాడి పైత్యం మాన్పించాడట మహా గాన గంధర్వ నల వంటకాఁడు
‹విశ్వామిత్ర› అవును గిరిగారు, ఆ కోడిని తిన్న తరువాత, నోరు పెగులు తుందా?
‹కొత్తపాళీ› విశ్వామిత్ర, అందుకే గిరిగారు తెలివిగా వంట వాడితో పాడించారు .. తిన్నవాడితో కాకుండా
‹నాగరాజు› కోడా అంటే వెస్టర్న్ మ్యూసిక్ లో ఒక రకమైన ఫినాలే – ఈ రూటులో రావటానికి ఆస్కారం ఉందా?
‹కొత్తపాళీ› అద్భుతమైన ఆలోచన

————————————————————————————

‹కొత్తపాళీ› గిరి గారికే ఇంకో సమస్య ..ప్రేమను తాకగా మగడు పేలెను వానికి గూబ గుయ్యనన్
‹గిరి› ఉ.

భామను సెక్సుబాంబనుచు పత్రికలన్నియు ముద్రవేయగా
కాముకుడయ్యె పేరుగల గౌరవనీయుడు భామ పొందుకై
ఆమెను చేరబోవ మిథునార్తిన, తెల్సెను ‘బాంబు’కర్థముల్,
ప్రేమను తాకగా మగడు పేలెను వానికి గూబ గుయ్యనన్

‹భట్టుమూర్తి› సూపరు 😉
‹రాకేశ్వరుడు› బాగుంది పూరణ … హాస్యాన్ని గురులఘువులతో బహుబాగా బంధిస్తున్నారు
‹కొత్తపాళీ› గిరి, బాగుంది జిలుగుల మతాబా కాస్తా లక్ష్మీ అవుటులా పేలిందన్న మాట
‹నాగరాజు› వారెవ్వా – గిరి, అదరగొట్టారు.
‹విశ్వామిత్ర› ఈ భామ కూడా సినీ భామే నా?
‹చదువరి› బాగుంది

————————————————————————————-

‹కొత్తపాళీ› చదువరి, మీదీ ఒక పూరణ …
‹చదువరి›

ఉ. సోమరి కాడు, కేవలము శోధన చేయును నల్లి జీవితం
చీమలు చచ్చునేమొయని చిన్నగ బోవును పోతరాజులా
భామలు ఎట్టులోర్చెదరు భారము మోయని ఇట్టి భర్తలన్?
ప్రేమను తాకగా మగడు, పేలెను వానికి గూబ గుయ్యనన్

‹భట్టుమూర్తి› ఇదికూడా సంసారపక్షపు పద్యమే 😉
‹గిరి› భట్టుమూర్తి, ఇదీ ఓ సంసారమే?
‹రాకేశ్వరుడు› నిరుద్యోగుల జీవితానికి నిలువుటద్దం పట్టారు. అలానే నల్లిపరిశోధక వృత్తి కూడా చాలాబాగుంది.
‹కొత్తపాళీ› అంటే నీతి.. నిరుద్యోగి పెళ్ళిచేసుకో కూడదనా?
‹నాగరాజు› ఇంపొటెంటు అనడానికి చదువరిగారి సంస్కారం ఒప్పుకొంది కాదు, శ్లేషలో సూచించారు, వేటూరి డబులు మీనింగ్ పాటలా ఉంది.

————————————————————————————-

‹కొత్తపాళీ› విశ్వామిత్రులుంగారు తరువాయి

‹విశ్వామిత్ర›

సోమరొకండు ద్రావుటను, సోలియె హాయిగ నిద్ర బోయియున్
కాముడు పోరిడన్, మిధున కామితు డయ్యియె రాత్రియందు ఏ
ఝామునొ మెల్లగా జనియె, “జక్కని యాలని”, ఆమెచెల్లినే
ప్రేమను తాకగా మగడు పేలెను వానికి గూబ గుయ్యనన్

‹భట్టుమూర్తి› ఓహో… ఇదీ ఆ పక్షమే 🙂
‹విశ్వామిత్ర› ఒక తూగులయ్య చిత్తుగా తాగి నిద్రబోయి, ఆ రాత్రి కాముని పోరు పడలేక యే జాములోనో మత్తులో పెళ్లామనుకొని మరదలిని తాకాడుట.
‹చదువరి› తస్సదియ్యా.., తూగులయ్యా!
‹చదువరి› నిజంగానే తాగేడంటారా!!? 😉
‹కొత్తపాళీ› మళ్ళీ తాగుడొచ్చీందీ .. మందు మహిమ ఇంకా వదల్లేదన్న మాట
‹గిరి› చదువరి, బావుంది అట్టి వెధవాయిలకి గూబలు పేలాల్సిందే

‹విశ్వామిత్ర› కాముడు పోరిడన్, మిధున కామితు డయ్యియె రాత్రియందు ఏ
‹రాకేశ్వరుడు› కానీయండి విశ్వామిత్రా .. వన్సుమోరు…
………..
………..
‹భట్టుమూర్తి› ఈ సారి మేనక వచ్చిందేమో 😉
‹రాకేశ్వరుడు› లేదు విశ్వామిత్రులు యుగాలైనా ఊర్వశిని మరచిపోలేకున్నట్టున్నారు… వారికి పదే పదే తపోభంగమగుచున్నది
‹చదువరి› 🙂 🙂

————————————————————————————-

‹కొత్తపాళీ› మన విశ్వామిత్రులు కోడిని సమస్యని తనదైన శైలిలో పూరించారు .. ఏదీ మొదలెట్టండి విశ్వామిత్రా
‹విశ్వామిత్ర›

ఉ.
వేడిమి లెక్కసేయకనె వేయిప్రదర్శన లివ్వబూనియే
వాడలు వాడలే జనుచు పాడుచు నుండ విరామమెంచకే,
వాడికి దగ్గుబట్టినది, వైద్యుని జూసియె, యాంగ్ల ఔషధౌ
“కోడిని” (codeine) తిన్నవాడు తన కోకిల కంఠము విప్పె పాడగన్!

‹కొత్తపాళీ› ఇంగ్లీషు యూ లివ్ లాంగా 🙂 🙂
‹చదువరి› 🙂
‹నాగరాజు› విశ్వామిత్ర – బాగుంది.
‹రాకేశ్వరుడు› విశ్వామిత్ర, ఆంగ్లానికి తెలుగు పొటేసి దంచడంలో మీకు మీరే సాటి.
‹భట్టుమూర్తి› పోటేసి… 🙂
‹విశ్వామిత్ర› ధన్యోస్మి

———-

(తరువాయి భాగము >>)

——————-

సంకలనం: రానారె

Posted in కవిత్వం | Tagged | Comments Off on అభినవ భువనవిజయము -3- కోకిల కంఠము విప్పి పాడగన్

అభినవ భువనవిజయము -2- నరవర నిన్నుబోలు లలనామణి

(<< గత భాగము)

‹కొత్తపాళీ› గిరిధర కవీంద్రా, ఈ సమస్య నెత్తుకోండి: “నరవర నిన్నుబోలు లలనామణి నెందును గానమీ యిలన్”
‹గిరి› కొత్తపాళీగారూ ఇదిగో

చం.
విరటుని కొల్వులో వలలుఁ వేషము వేసిన, ఓ మహా బలీ,
తరుణిని కావ కీచకుని నైల్యమునుండి, ధరించి చీరలన్
మరుగున నిల్వ, పెచ్చెనట వాంఛలు వానికి, నీవు కాంతవే?
నరవర, నిన్నుబోలు లలనామణి నెందును గానమీ యిలన్


powered by ODEO

‹కొత్తపాళీ› భీమునికే చీరకట్టారన్న మాట! బాగుంది
‹రాకేశ్వరుడు› గిరి, పద్యం చాలా బాగుంది. “పెచ్చెనట వాంఛలు వానికి” అన్నారు, మీకు కూడా నరవరులను చూసి వాంఛలు పెచ్చిన స్వానుభవాలు వున్నాయని నా సందేహం. లేక పోతే ఇంత అద్భుతమైన పద్యమా!
‹గిరి› రాకేశ్వరుఁడు, అంతటి ‘కీచాక’చక్యం కలుగలేదు ఇంకా. మీ పూరణ ప్రారంభించండి మరి.
‹కొత్తపాళీ› లలిత కవిగారిది ఇంకో పురాణ పూరణ ఉన్నది . అది కానిచ్చి రాకేశ్వరుని ఆధునిక పూరణ విందాము.

————————————————————————————-

‹కొత్తపాళీ› లలితకవి గారి పూరణ ఇదిగో…

చం.
పరశువు నెత్తి క్రోధమున భార్గవరాముఁడు రా నెఱింగి స
త్వరముగఁ జీరె నా దశరథావనినాథుఁడు తాల్చె ; వస్త్రముల్
సరిపడకున్న దోర్బలవిశాలునకున్ నగి పల్కిరంగనల్ ;
నరవర నిన్నుబోలు లలనామణి నెందును గానమీ యిలన్.

(పరశురాముడు తనను చంపవస్తున్నాడని తెలిసి దశరథుడు చీరలో దాగుకొనబోగా, ఆతని శరీరానికి చాలీచాలని ఆ వస్త్రాలను చూచి అక్కడి ఆడవారు నవ్వి … అన్నారట)


powered by ODEO
‹విశ్వామిత్ర› “నగి పల్కిరంగనల్ ” బావుంది, వీరికిదే పని, రామాయణ కాలం లోనూ, భారత కాలం లోను.
‹రాఘవ› మరేఁ! ఇప్పుడు కూడానేమోనండి.
‹నాగరాజు› కొత్తపాళీ – ఈ పురాణ కథ నే విన్నది కాస్త వేరుగా ఉంటుంది.
‹కొత్తపాళీ› నాగరాజు, చెప్పండి.
‹నాగరాజు› పరశురాముడు కొత్తగా పైళ్ళైన రాజులని చంపేవాడు కాదుట. అందుకని, దశరథుడు, రాజర్షి వస్తున్నాడని తెలియంగానే, పక్కనున్న స్త్రీ మెళ్ళో తాళి కట్టేసేవాడట. అలా, దశరథునికి మూడువందలమంది భార్యలు అని ఓ కథ.
‹కొత్తపాళీ› నాగరాజు, అవునుట. అలాగే గాజులు తొడుక్కున్న కథ కూడా విన్నాను. కవి నిరంకుశుడుగదా, గాజులు తొడుక్కున్నాక ఇదేం భాగ్యమని చీరగూడా కట్టేశారు.
‹గిరి› నాగరాజు, మీరు చెప్పిన దశరథుని కథవల్ల ఆయన్ని ‘వరనర‘ అని సంబోధించవచ్చేమో పద్యంలో.
‹నాగరాజు› గిరి – సూపర్. బాగుంది చమత్కారం.
‹రాఘవ› వరనర… హ్హహ్హహ్హ
‹కొత్తపాళీ› వరుడైన నరుడు
‹రాఘవ› నయ్యం… వానర అనలేదు
‹కొత్తపాళీ› రాఘవ, అబ్బే ప్రాస భంగం అవుతుంది. (పద్యం నాలుగు పాదాల్లోనూ రెండో అక్షరం ‘ర’కారం కావాలి కదా)
‹రాకేశ్వరుడు› కొత్తపాళీ, లలితకవిగారి పద్యఁవంటే నాలాంటి బండబుద్ధులకు కొంత వివరణ కావలిసిందే మఱి …
‹భట్టుమూర్తి› ఈ సమస్యమీద ఈ రెండు పద్యాలూ మాగొప్పగా వచ్చాయి
‹రాఘవ› అవును పద్యాల్రెండూ బావున్నై
‹నాగరాజు› నాకు పద్యాలు చెప్పటం రాదుగాని, నేనైతే ఖడ్గతిక్కన మీద చెప్పుండేవాడిని.
‹విశ్వామిత్ర› మంచి ఊహ నాగరాజు గారూ
‹రాఘవ› వచనమైనా చెప్పచ్చునేమో
‹గిరి› నాగరాజు, పద్యంలో ఎందుకండీ సుబ్బరంగా వచనంలోనే శెలవీయండి
‹రాకేశ్వరుడు› పురాణ జ్ఞానలేమి నా పతనానికి దారితీసేటట్టుందిక్కడ
‹నాగరాజు› వైరికి వెన్నిచ్చి ఇంటికొచ్చిన ఖడ్గతిక్కనకి భార్య మంచం అడ్డుపెట్టి, పసుపు, చీరె పెట్టిందట స్నానానికి. అదీ కథ.
‹విశ్వామిత్ర› ఇంకో మాటేమంటే, అతని తల్లి కోడలికి వత్తాసు పలకటం
‹నాగరాజు› విశ్వామిత్ర – అవును అది కూడా ఉంది. ఆయన తల్లిపేరు గుర్తుకు రావట్లేదు. భార్య మాంచాలేగా?
‹కొత్తపాళీ› ఖడ్గ తిక్కన .. మంచి ఆలోచనే కానీ ఆయన రాజుకాడు, పోనీ క్షత్రియుడు కూడా కాడు
‹విశ్వామిత్ర› నే సమస్య చూసి బృహన్నలకు అంట కడతారనుకున్నాను … కాని ఎవరూ కట్టలే

————————————————————————————‹కొత్తపాళీ› రాకేశ్వరుఁడు, సమయాభావం కాకుండా మీ అత్యాధునిక పూరణ మొదలు బెట్టండి
‹రాకేశ్వరుఁడు› ఇక నా వంతేనా… నాకైతే పరీక్షలలోఁ కూడా ఇంత భయం వేయలేదు 🙁 నాకు పురాణాలు తెలియవు, పొట్ట చీల్చితే కనబడే ఒకటీ రెండూ పురాణాలు సినిమా పురాణాలే… అందుకే ఊర్మిళ, అమీర్ ఖాన్ లను తలచుకొని నా అధునాతన కాలాల నేపథ్యంలో పద్యం
‹రాఘవ› శభాష్
‹గిరి› రాకేశ్వరుఁడు, చప్పట్లు, ఈలలు
‹రాకేశ్వరుడు›

చం.
అరవిరి యందగత్తెలు తన కానరు, యీడది వచ్చి పడ్డనూ
ఉరిమిళ నన్యు లిష్టపడె నొక్కడు మాత్ర మమీరుఁ గాంచెనే
మరి యొక నాడు నన్ను గని బల్కెను మోజుగ రామనాథుడున్
“నరవర నిన్నుబోలు లలనామణి నెందును గానమీ యిలన్”

‹కొత్తపాళీ› ఎవరీ రామనాథుడు ఏమీ కథ?
‹రాకేశ్వరుడు› రామనాథుడని ఒక కల్పిత వ్యక్తి…
‹కొత్తపాళీ› ఆహా
‹రాకేశ్వరుడు› అతను గే… ఇది అతని గాధ !
‹విశ్వామిత్ర› ఉరి-మిళ?
‹రాకేశ్వరుడు› ఊర్మిళ
‹రాఘవ› ఆహా, ఉరుముతుందని వ్యుత్పత్తి చెప్పుకుంటే సరి

‹రాకేశ్వరుడు› మాత్రమ్ + అమీరుని గాంచెను. అతను రంగీలా సినిమాకి వెళ్లినప్పుడు అందరూ ఊర్మిళను చూస్తుంటే ఇతను మాత్రం అమీర్ ని ఇష్టపడ్డాడు అని…
‹గిరి› గేల కళ్ళకి మొగవాళ్ళు కూడా ఆడ వారిలా కనబడతారని మీ భావమా
‹రాకేశ్వరుడు› ఆడవారి కంటే కూడా నువ్వు అందంగా వున్నావు అని రమనాథుడి భావం
‹రాఘవ› ఇందాక రామనాథుడన్నారు. ఇప్పుడే రమానాథుడా

‹విశ్వామిత్ర› సంభవామి యుగే -యుగే ( యు ఆంగ్లము)
‹రాఘవ› విశ్వామిత్ర, మిమ్మల్ని ఏమనాలో తెలీట్లేదు
‹రాకేశ్వరుడు› విశ్వామిత్ర, నాకు మాటలు రావట్లేదు
‹చదువరి› విశ్వామిత్ర, మీకు అందనిదేమీ లేదండి
‹కొత్తపాళీ› విశ్వామిత్ర, అవును, అవసరమైతే అదికూడా సంభవమే! 🙂

‹నాగరాజు› అవునూ, పురూరవుడు కూడా కొంతకాలం ఆడ రూపంలో ఉన్నాడుగా?
‹రాఘవ› శిఖండి కూడా
‹కొత్తపాళీ› నాగరాజు, పురూరవుడు కాదు, యయాతి. రాకేశ్వరుడి పద్యం చూడండి .. పూర్తిగా వేరే మెట్టు ఎక్కించాడు
‹నాగరాజు› కొత్తపాళీ – రాకేశ్వరుడి పద్యం బావుంది, కాని పూర్తిగా అర్థంకాల్యా.
‹రాకేశ్వరుడు› నాగరాజు, మీరు పురాణాల దృష్ట్యా ఆలోచిస్తున్నారు. నేను పద్యం వ్రాసింది నేటి కాలంలో ఒక అబ్బాయి గురించి.

‹భట్టుమూర్తి› రామనాథుడంటే … ఎందరో స్త్రీలకు నాథుడు…అట్టివాడు కూడా ఈ నరవరుని జూచి ..ఎందును గానలేదని.. మోజుపడ్డాడు. అంచేత, వాడు గే.. కానవసరంలేదు. “… వానిజూచి మగవారలైన మరుల్గొనెడు మరో మరుడు మనోహరుడు…” అన్నాడు శ్రీరాముని గూర్చి శ్రీశ్రీ .
‹విశ్వామిత్ర› భట్టుమూర్తి గారూ, ఆ ముక్క విశ్వామిత్రుడే చెప్పాడు, వాల్మీకం లో.
‹గిరి› భట్టుమూర్తి గారికి రామనాధుని గురించి వివరం బాగానే తెలుసుననుకుంటా 🙂
‹రాకేశ్వరుడు› భట్టుమూర్తి, రామనాథుడు అంటే .. రాముడు (పురుషుడు)నికి నాథుడు – అంటే గే అని!
‹భట్టుమూర్తి› రామ అంటే స్త్రీ.

(తరువాయి భాగము)

——————-

సంకలనం: రానారె

Posted in కవిత్వం | Tagged | Comments Off on అభినవ భువనవిజయము -2- నరవర నిన్నుబోలు లలనామణి

అభినవ భువనవిజయము -1- ప్రార్థనతో ప్రారంభము

ప్రియమయిన పాఠకమహాశయులారా,

ఆ ప్రకారముగా… ఈ అభినవ భువనవిజయములో పాల్గొన్న కవులలో దాదాపు అందరూ కొత్తగా ఛందస్సును తెలుసుకొని, పద్యరచన నభ్యసిస్తున్న విద్యార్థులేయైనా, ఆశువుగా పద్యం చెప్పగల సమర్థులు వీరిలో లేకపోలేదు. అయితే, మంచి నాణ్యమైన పద్యాలను సృష్టించగల సౌలభ్యం కోసం కవులందరికీ కొద్ది రోజుల సమయం ఇవ్వబడింది. తామల్లిన పద్యాలతో ఒకరిద్దరి మినహా కవులందరూ ఉత్సాహంగా నిర్ణీత సమయానికి సిద్ధమయ్యారు. అధ్యక్షుల తొలిపలుకులతో సభ ప్రారంభమయింది. చిత్తగించండి…

‹కొత్తపాళీ› సర్వధారి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ అభినవ భువన విజయానికి విచ్చేసిన కవిపుంగవులకు స్వాగతం.
‹కొత్తపాళీ› గణపతిని తల్చుకుని సభ మొదలు పెడదాం. ఈ స్తుతి లలిత కవి శ్రీ తాడేపల్లి వారి రచన.

సీ. నిశ్శేష విజ్ఞాన నిధికాది గురువని,
గురువులు స్ఫురియింపఁ గొలుతు నిన్ను
నెల్ల సురలలోన నేకైక లఘువని,
లఘువులు తోప స్తోత్రంబొనర్తు
ఛాందసాగ్రేసరుఁ డందరిలోనని,
ఛందముల్ తట్టఁగా సన్నుతింతు
వర్తులాకృత మోదకార్తుండని తలంచి,
వృత్తముల్ కుదురఁగా వినుతి సేతు

తే.గీ.
మూషకుల్ మా తలంపుల మ్రుచ్చిలింప
కుండ నీ మూషికమునకు దండమిడుదు
కందములకెల్ల పెనుమూలకందమైన
గణపతికి మ్రొక్కెదన్ సాధుగణములొదవ.

గురు లఘువుల్తో మొదలు పెట్టి కంద వృత్తాల్ని కలుపుకుని కవికుల కంద మూలంగా గణపతిని స్తుతించారు ‘లలితకవి’ గారు.

‹భట్టుమూర్తి› ఏకైక లఘువు, ఛాందసాగ్రేసరుడు, మోదకార్తుండు, పెను మూల కందము – గణపతినిలా ఎందుకన్నారో!?

‹కొత్తపాళీ›

ఏకైక లఘువు – దేవతలలోకెల్లా పొట్టివాడు
ఛాందసాగ్రేసరుఁడు – ఛందస్సులు (వేదములు) చదివినవారిలో అగ్రేసరుఁడు. వేదపండితులలో కెల్లా గొప్పవాడు.
మోదకార్తుఁడు – ఉండ్రాలకై (అవి తినుటకై) ఆతురత గలవాడు.
కందము = మూలము
పెను-మూల-కందము = మూలములకే పెద్దమూలము
(వ్యంగ్యార్థం : కందపద్యాలకు ప్రేరణమైనవాడు)

‹రాకేశ్వరుడు› అద్భుతం. చాలా బాగుంది. శుభారంభము.

‹భట్టుమూర్తి› ఆహా! ఇప్పుడు… అర్థం తెలిశాక పద్యం బ్రహ్మాండంగా వుందనిపిస్తోంది. తాడేపల్లి మాస్టారూ, మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు.

‹రాఘవ› కళ్ళు తెరవచ్చా కొత్తపాళీ గారూ 🙂
‹కొత్తపాళీ› రాఘవ కవీంద్రా .. మీ కళ్ళు మళ్ళీ మూయిస్తున్నాం! కానివ్వండి మరి
‹రాఘవ› ఆగండాగండి… అన్నట్టు ఎక్కడోగానీ కవి అంటే కనబడకుండా వినబడేవాడని చదివాను… ఇప్పుడు కవి అంటే కనబడుతూ వినబడనివాడని చెప్పాలేమో!

‹రాఘవ› ఇక… సరస్వతీస్తుతి

ఉ. ఫుల్లసరోరుహాక్షి విభవోన్నతకీర్తి విధాతృనాయికా
తొల్లిట సన్నుతింతుఁ సితతోయజ కుంద మరాళ చంద్ర శం
ఖోల్లసితాస్యవైన నినుఁ గూర్పగఁ బద్యములెన్నొ వాణి నీ
చల్లని చూపువెన్నెలలె చాలును మాకుఁ మహాసరస్వతీ.

‹రాఘవ› .
‹గిరి› రాఘవ, చివర్లో ఓ చక్కని చుక్కను వదిలేసుకున్నారేమీ! బావుంది, విధాతృనాయికా ప్రయోగం నచ్చింది. రెండవ పాదం చివరనుంచి మూడవ పాదం మొదలు – కాస్త వివరించాలి.
‹కొత్తపాళీ› హమ్మయ్య చల్లని చూపుతో సరిబెట్టారు.
‹రాఘవ› శ్వేతపద్మాసనా, శ్వేతగన్ధానులేపనా… అని కొలువబడే తెల్లని తల్లి కాబట్టి, యా కున్దేన్దుతుషారహారధవళా అన్నదారిలో, సితతోయజ (తెల్లతామర) కుంద (మల్లె) మరాళ (హంస) చంద్ర శంఖ ఉల్లసిత (ప్రకాశించే) ఆస్య (ముఖము). ఏమండీ… అలా చల్లని చూపుతో సరిబెట్టారు అన్నారు?
‹కొత్తపాళీ› ఎక్కడ కాటుక కంట నీరు పెట్టిస్తారో అని భయపడ్డాను .. ఎంతైనా “చంటి” వారు కదా!
‹రాఘవ› సగోత్రీకులమే గానీ… పోతన గారెక్కడండీ… ఏదో జానపదులం అంతే
‹విశ్వామిత్ర› మీరు జ్ఞానపదులు కూడ
‹రాఘవ› ఇంకా నయం. జాణపదులన్నారు కాదు 😉
‹విశ్వామిత్ర› ఆ విషయం ఇక్కడ అందరకీ తెలిసిందే అని ప్రస్తావించ లేదు

‹కొత్తపాళీ› సరస్వతీ దేవి ముఖం చంద్రునిలా ఉంది అంటూ చూపు వెన్నెల కురిపించడం – బాగా రక్తి కట్టింది.
‹విశ్వామిత్ర› “సాధు గణములొదవ”, “జల్లని చూపులు” బాగు బాగు
‹రాకేశ్వరుడు› ఉత్పలమాలలోఁ ఉత్పలాన్ని పలు మార్లు తలచి ఆనందింపజేసారు రాఘవా.

‹నాగరాజు› మహాసరస్వతీ అంటే?
‹రాఘవ› మహాకాళి, మహాలక్మి అన్నప్పుడు మా సరస్వతికేం తక్కువండీ, మహాసరస్వతే…
‹గిరి› మహబాగా చెప్పారు
‹భట్టుమూర్తి› రాఘవ, గడుసైన సమాధానం.

‹కొత్తపాళీ› వికటకవి గారు ఇష్టదేవతా ప్రార్ధనగా శ్రీరామచంద్రుని మీద ఒక కందం పంపారు.

అల దేవప్రముఖుల కో
ర్కెల దీర్పగ నీవు పుట్టి ఇల రాముడవై
జలజాక్షి జానకిం పెం
డిలియాడి ముదంబు గూర్చి విలసిల్లు మికన్

‹కొత్తపాళీ› చూశారా రాఘవా, ఎంత రామచంద్రుడైనా జానకి చెట్టబట్టితే గాని విలసిల్లడుట!
‹విశ్వామిత్ర› అవునండి, అయనను సీతా పతి అంటారు గాని, మా జానకీదేవిని “రామయ్యభార్య” అని పిలవరు ఊరూ వాడా.
‹రాఘవ› విశ్వామిత్ర, బావుంది మీ వరస… అమ్మాయి (ధరణిజ) పుట్టింట్లో అల్లుణ్ణే గదా కూతురి మొగుడనేది!
‹రాకేశ్వరుఁడు› రాంప్యారీ అనే పిలుపు లేకపోలేదు.
‹విశ్వామిత్ర› అది నా తాంబూలంలో ఓ విశేషం రాకేశా.

—————–

(తరువాయి భాగము >>)

——————-

సంకలనం: రానారె

Posted in కవిత్వం | Tagged | 3 Comments

ఉగాది సంపాదకీయం

-స్వాతికుమారి

“ఈ నెలలో ఐదు శుక్రవారాలొచ్చాయి.”

“ఈ మంత్ లో ఫయివ్ ఫ్రైడేస్ ఉన్నాయి” అని కాకుండా పై విధంగా ఏ చదువుకున్న తెలుగువాడైనా అంటే ఆశ్చర్య పోవటమో, ముసిముసిగా నవ్వటమో, అలా అన్న వ్యక్తితో కొంచం చనువుంటే “are you alright?” అని మేలమాడ్డమో వీటిల్లో ఏదో ఒకటి తోటి తెలుగువాడి ప్రతిస్పందనగా ఎదురయ్యే స్థితిలో ఉంది ప్రస్తుతం తెలుగు జాతి.

దైనందిన జీవితంలో తెలుగు:

ఈ సమస్య సామాజిక పరిణామంత పెద్దదైనప్పటికీ, పరిష్కారం మాత్రం ప్రతివ్యక్తి/సంస్థ తనకి తాను అమలు చేయగలిగిన చిన్న మార్పుల ద్వారా సాధ్యమౌతుంది.

ఏ భాషైనా జీవనది లాంటిది. ఎన్నో పిల్లకాలువ లొచ్చి నదిలో కలుస్తుంటాయి. అలానే కలిశాయి. బస్సు, రైలు లాంటి ఎన్నో పదాలను తెలుగు భాష లోకి సాదరంగా అహ్వానించాం. తెలుగు భాషకి అన్యభాషా పదాలని తనలో కలుపుకొనే వెసులుబాటు ఉంది. కాబట్టి -మన భాషలో ఇలాటి అన్యభాషా పదాలు వచ్చి చేరాయి, చేరుతూ ఉంటాయి, మన భాషలో లీనమైపోతుంటాయి. ఇదే విధమైన సహజ పరిణామక్రమం కొనసాగి ఉంటే ఇది మనకు ఇంతటి ఆందోళన కలిగించి ఉండేది కాదు.

కానీ ప్రపంచీకరణ, సమాచార/సాంకేతిక విప్లవ ప్రభావమో మరేమో కానీ గత కొన్నేళ్ళుగా తెలుగు భాష పిల్లకాలువల్ని కలుపుకోవటం మాని తనే వెళ్ళి ఒక మహాప్రవాహంలో కలిసి ఇంగ్లీషులో ఐక్యమైపోయే దిశగా మళ్ళింది. ఈ సంపాదకీయం మొదట్లోచెప్పిన ఉదాహరణే ఇందుకు సాక్ష్యం. ఇదేమీ ఉన్నట్టుండి వచ్చి పడిన ఉపద్రవం కాదు. దాదాపు ఒక రెండు దశాబ్దాలుగా ఈ మార్పు చాలా స్పష్టంగా తెలుస్తున్నా, దానిని అభివృద్ధిగా భావించి నిర్లక్ష్యం చెయ్యటం వల్లే ప్రస్తుతం సగం పైగా ఇంగ్లీషుతో సంకరమైపోయిన తెలుగు భాషను మాత్రమే మనం వినగలుగుతున్నాం.

అసలు ఈ పరిస్థితికి కారణాలను అన్వేషిస్తే ఈ కింద చెప్పినవి ముఖ్యంగా కనపడతాయి.

  1. విదేశాలలో మంచి ఉద్యోగావకాశాలు ఉండటం వల్ల ఆ దిశగా సిద్ధం చేసే ఆంగ్లమాధ్యమం లోని చదువే గొప్పదని మధ్యతరగతి వర్గంలో బలపడ్డ అభిప్రాయం.
  2. వ్యావహారిక, మాండలిక, పుస్తక స్థాయిల్లోని తెలుగు తర్వాత ఇంగ్లీషులో మాట్లాడ్డమే మెరుగైన నాగరికతా చిహ్నంగా పల్లెటూరినుంచి నగరానికి వలస వచ్చాక తమ జీవన విధానంలోని అభివృద్ధిని తెలియజేసే సాధనంగా భావించడం.
  3. గత కొన్నేళ్ళుగా ఇక్కడ విస్తృతంగా ఉద్యోగాలు కల్పిస్తున్న విదేశీ సంస్థలలో తెలుగువాళ్ళు పని చేయటంవల్ల భాష లోనూ, ఆచార వ్యవహారాల్లోనూ పొడసూపే మార్పులకి సర్దుబాటవటం కోసం సొంత భాష, సంస్కృతులను నిర్లక్ష్యం చెయ్యటం.
  4. ఎటువంటి ఉద్యోగాల్లోకైనా అభ్యర్ధుల ఇంగ్లీషు సామర్థ్యాన్ని ఆశించినట్టు, మాతృ భాషా జ్ఞానాన్ని ఏ సంస్థలూ అడగకపోవటం. ఇందువల్లే చాలామంది, తెలుగురాకపోతే నాకొచ్చే నష్టం ఏమిటి అని ప్రశ్నించగలుగుతున్నారు.

ఇలాంటివే మరికొన్ని కారణాలు.

ఐతే ఇక్కడ సమస్య ఇతర భాషలు నేర్చుకోవటం కాదు. మాతృభాష వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదనే నిర్ణయానికి వచ్చి, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యటం. మరోలా చెప్పాలంటే నాకు తెలుగు సరిగ్గా రాదు అని గర్వంగా చెప్పుకోగలగటం. ఐతే మాతృభాష మట్టిగలిసిపోనీ గాక – మనకొచ్చే జీతమేమైనా తగ్గుతుందా, అసలు మనకి తెలుగు రాకపోతేనేం? వేరే భాషతో కలగాపులగం చేస్తేనేం? అనే ప్రశ్నలకి ఆర్ధిక లాభనష్టాల భాషలో సమాధానం ఇవ్వటం కష్టమే. కాకపోతే మాతృభాషని మర్చిపోవటంవల్ల మన ఆత్మని, అస్తిత్వాన్ని కించపరచుకున్న వాళ్ళమౌతాము. ఎన్నో గొప్ప భావవ్యక్తీకరణలను, సాహితీ సంపదను, సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించలేని మూఢులమౌతాము.

ఇంతకీ మనందరం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఇతర భాషలను నేర్చుకోవటంద్వారా జ్ఞానాన్ని పెంచుకోవటం, భాషేతరులతో సత్సంబంధాలు, అభివృద్ధి – ఇవి మాత్రమేలక్ష్యాలు. కానీ రోజువారీ జీవితంలో వాటికి మాతృభాషని మించిన ప్రాధాన్యం ఇవ్వటం (అవసరం లేని సందర్భాల్లో కూడా) నిశ్చయంగా ఇతరుల దృష్టిలో (వాస్తవంగా కూడా) మనని మనం దిగజార్చుకోవటమే.

ఈ సమస్య సామాజిక పరిణామంత పెద్దదైనప్పటికీ, పరిష్కారం మాత్రం ప్రతివ్యక్తి/సంస్థ తనకి తాను అమలు చేయగలిగిన చిన్న మార్పుల ద్వారా సాధ్యమౌతుంది.

1. ఎదుటి వ్యక్తి తెలుగువాడే అయినప్పుడు అంకెలు, వారాల వంటి వాటిని, ఇతర సాధారణ సంభాషణల్లోని పదాలను తెలుగులోనే చెప్పటం అలవాటు చేసుకోవాలి.
2. అభ్యర్ధుల ఇంగ్లీషు సామర్ధ్యాన్ని పరీక్షించే సంస్థలు మాతృభాషలో కనీస అవగాహన ఉండటం కూడా ఒక తప్పనిసరి అర్హతగా గుర్తించాలి.
3. మనలో, మన వాళ్ళలో తగ్గిపోతున్న (తెలుగు) చదివే అలవాటును మనకు మనంగా పునరుద్ధరించుకోవాలి. ఏ విషయాన్నైనా మాతృభాషలో చదివి అర్ధం చేసుకోవటంవల్ల ఆలోచనా విధానం, అవగాహనా శక్తి తప్పక మెరుగౌతాయి.

పైన చెప్పినవాటితో పాటు ఇతర మార్గాల్లో తెలుగు భాష పునరుద్ధరణ కోసం ఇప్పటికే కొంత కృషి జరుగుతోంది. ఈ మధ్య కాలంలో అంతర్జాలంలో ఎందరో తెలుగువారు బ్లాగుల ద్వారా, చర్చావేదికల ద్వారా మరుగున పడ్ద సాహిత్యాన్ని, భాషా విజ్ఞానాన్ని అందరితోపంచుకొని తమ తోటి వారికి అవగాహన కల్పించగలిగారు. వర్ధమాన రచయితలకు కూడా ఇవి మంచి వేదికలుగా మారాయి. ఇదిలా ఉండగా మరికొందరు ఔత్సాహికులు ఆన్‌లైన్ పత్రికల ద్వారా భాషాభివృద్ధిని, ప్రాచీన సాహితీ ప్రక్రియల్నీ ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా ఆశాజనకమైన పరిణామం. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ‘పొద్దు’ వినూత్న శైలిలో ‘భువన విజయం’ పేరిట దేశ విదేశాల్లోని తెలుగువారితో ఆన్‌లైన్ కవి సమ్మేళనాన్ని నిర్వహించింది. దీనిని ఉగాది పర్వదిన సందర్భంగా పాఠకులకు సవినయంగా సమర్పిస్తున్నాం.

భావితరాల కోసం తెలుగు:

మనకి మనం భాష ప్రాముఖ్యతని, అవసరాన్ని, గొప్పతనాన్ని గుర్తించటం వల్ల కొంతవరకూ ఉపయోగం ఉన్నా.., అంతకన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు రాబట్టాలంటే మనపిల్లలకు ఈ వారసత్వాన్ని అందించటం ముఖ్యం. మాతృభాషలో కనీస జ్ఞానం సంపాదించక పోయినా ప్రాథమిక స్థాయి నుండి వృత్తి విద్యల వరకూ ఏదైనా పూర్తిచెయ్యగల విద్యావిధానాన్ని అనుమతించిన ప్రభుత్వాల్ని తప్పుపట్టేకన్నా, ఎవరి పిల్లల విషయంలో వారికి ఆచరణసాధ్యమైన సూత్రాలు కొన్నిటిని పాటించవచ్చు.

– పిల్లలకి ఇంగ్లిష్ ఒక్కటే కాదు, ఇంకో డజను భాషలు నేర్పినా తప్పు లేదు. కాని ఆ నేర్చుకునే భాషల్లో తెలుగు కూడా (!) ఉండేలా చూడాలి.
– పిల్లల్ని బళ్ళో వేసేప్పుడు తెలుగు మాట్లాడితే ఫైన్ తరహా నియమాల్లేకుండాచూసి, కనీసం రెండో, మూడో భాషగా ఐనా తెలుగు నేర్పేచోట చేర్చటం.
– పిల్లలకి తెలుగు కథలు, పద్యాలు వంటివి నేర్పటం. (ముందు మనంనేర్చుకోవాలి). సామెతలు, జాతీయాల వంటివి మనం వాడటం ద్వారా వాళ్ళకి ఆసక్తిని కలిగించి భాషనే కాక, లోక జ్ఞానాన్ని కూడా నేర్పిన వాళ్ళమౌతాము.
-వారి వయసుకు, స్థాయికీ తగ్గ పుస్తకాలను ఎప్పటికప్పుడు కొని చదివిస్తూ, ఆ చదివిన దాని సారాన్ని వాళ్ళు తిరిగి మనతో చర్చించేలా అలవాటు చెయ్యాలి. పిల్లలకు ఇచ్చే బహుమతుల్లో పుస్తకాలు, డైరీలు ఉండేలా చూస్తే అవి విలువైన వస్తువులనే అభిప్రాయం కలగటమే కాకుండా భాషను చదవటమూ తిరిగి రాయటం మీదా కూడా పట్టు సాధించగలుగుతారు.
– మంచి సాహిత్యం, అర్ధం ఉన్న పాటలను వినిపించటం, భాషా ఉచ్చారణ చక్కగా ఉండే టీ వీ కార్యక్రమాలను చూపించటం ద్వారా వారికెన్నో కొత్త పదాలను,వాడుకను నేర్పవచ్చు. మంచి భాషాభిరుచిని పెంపొందించవచ్చు.

చిన్నారులకి ఏం నేర్పినా భాషలోని మాధుర్యాన్ని వారు అస్వాదించి అర్ధంచేసుకునేలా మానసికంగా సిద్ధం చెయ్యటం అవసరం. లేదంటే, ప్రపంచమంతా వేరేలా ఉంటే తమని మాత్రం మనం తెలుగు నేర్చుకొమ్మని నిర్బంధిస్తున్నామనే భావన వాళ్ళకి కలగొచ్చు. వ్యక్తిగతంగా తల్లిదండ్రుల బాధ్యతగానే కాక, ఒక సామాజిక బాధ్యత గల పత్రికగా ఈ దిశగా పొద్దు వైపు నుంచి మేము కొన్ని ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నాం. పిల్లల్లో తెలుగు పుస్తక పఠనాభిరుచిని పెంపొందించడంలో తల్లిదండ్రులకు సాయపడే దిశలో మా ఆలోచనలు సాగుతున్నాయి. మా ఆలోచనలు అమలు జరిపే దశకు చేరుకున్నాక, వీటి వివరాలను ప్రకటిస్తాం.

మా ఈ ప్రయత్నాలన్నిటికీ ఎప్పటిలానే పాఠకుల, రచయితల తోడ్పాటు, ప్రోత్సాహం ఉంటాయని మా పూర్తి నమ్మకం. ఇదంతా మనందరం కలిసి సాధించవలసిన ఒక మహోన్నత లక్ష్యం.

————

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యుల్లో ఒకరు.

Posted in సంపాదకీయం | 11 Comments

అభినవ భువనవిజయము – అంతర్జాలములో అపూర్వ కవిసమ్మేళనము

రానారె

గత రెండేళ్లుగా బ్లాగావరణం అనుకూలించడంతో పలుప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీగానే పద్యాల వర్షాలు కురుస్తున్నాయన్న సంగతి పాఠక శ్రేష్ఠులైన తమకు తెలిసిందే. చెదురుమదురుగా కురుస్తూవుండిన ఈ వర్షాలకు సర్వధారి ఉగాది ఋతుపవనాల ఆగమనంతో కొత్త ఉత్సాహం తోడయింది.

సరిగ్గా నెల రోజుల క్రితం నాతో – “ఈ పద్య కవులతో ఓ భువన విజయం నిర్వహిస్తే ఎలా ఉంటుంది?” అన్నారు పొద్దు సంపాదకులు సిముర్గ్. దిగ్గజాలవంటి వీరంతా ఒక వేదిక మీద కలిస్తే అది భువనవిజయమే అవుతుందనిపించి ప్రయత్నిస్తానన్నాను.

అలనాడు శ్రీకృష్ణ పరమాత్మ భయంకర వర్షపాతము నుంచి గోపకులను రక్షించడానికి గిరిధరుడైతే – అభినవ గిరిధరుడు మాత్రం పాఠకులను తమ పద్యాల వానలో ముంచెత్తుతున్నారు. ‘ఏమయ్యా ఇది’ అన్నాడని పొద్దుమిత్రునిపై ఒక కుండ పోయించాడు.

ఆ పొద్దుమిత్రుడేమి తక్కువవాడు కాడు. గతంలో ఒక్కసారి పద్యాల వాన కురిపించాడు. మన రాష్ట్రరాజకీయము, రాజధాని, భాష మొదలైన విషయాలపై చురుగ్గా స్పందించే ఈ బ్లాగ్వరుడొకమారు భాగ్యనగర రహదారులపై వ్రాసిన చమత్కృతి నిండిన చిన్న పద్యాలు ఎందరినో మురిపించాయి.

సీతారాముల కళ్యాణం జరిపించేసి, ఒక పెద్ద సమస్యనుంచి ఆ రాముని రక్షించిన దిట్ట ఈ శ్రీరాముడు. సంగీతసాహిత్యాలపై చక్కని అభిరుచిగలవాడితడని ఈయన వ్రాసే సంగతులూ సందర్భాలూ చదివినవారికి ఠక్కున తెలుస్తుంది.

అందం అరసున్నాలలో వుందని నమ్మిన ఆధునికభావాల కలబోత మరొకాయన. సృజనాత్మకత, చతురత, చొరవలతోపాటు, మాతృభాషపై పట్టుసాధించడానికి అతడు పడుతున్న శ్రమ తోడయి, (శకటరేఫము మరియు అరసున్నలతో సహా) “రాకేశ్ ఱాఁక్స్” అనిపించి అభిమానులను సంపాదించిపెట్టింది.

శ్రీనివాస్ చలం: ఛందస్సు అనగానే కాళిక వేయినాలుకలతో తమ ముందు ప్రత్యక్షమైనట్లు భయపడి ఆమడదూరం వెళ్లినవారందరికీ ఇతనో వికటకవి. ఈ కవిగారుమాత్రం ఎదురుగా నిలబడి ‘దురదుంటే ‘కంద’మునకుండాలి కత్తిపీటను నేను, నాకెందుకు!’ అని నేరుగా అడిగాడు. ఛందోదేవత ఆయనను అనుగ్రహించింది.

రాకేశ్వరుని ప్రభావంతో తయారయిన మరో పద్యకవి బ్లాగేశ్వరుడు. అంతకు ముందెప్పటినుంచో తెవికీలో ఆయన పేరు మాటలబాబు. అంటే సరస్వతీ పుత్రుడేనన్నమాట.

నాలుగు తెలుగు ముక్కల పసకు కాసింత పాండిత్యం కూడా కలిస్తే వాగ్విలాసమే. హనుమంతునిముందు కుప్పిగంతులా అన్నట్టు, వాగ్విలాసుల గురించి నే చెప్పడమెందుగ్గానీ, ఇదిగో ఆయన విలాసానికి మీరే వెళ్లి చూసి రండి!

తెలుగు బ్లాగావరణంలో మనకందరికీ పరిచయమున్నవారు, సంస్కృతాంధ్రభాషాజ్ఞానం కలవారు ‘లలితకవి’ బిరుదాంకితులు. వీరు వ్రాసే చురుకైన, పరిశీలనాత్మకమైన బ్లాగువ్యాసాల్లోని భాషాపుష్టి పాఠకులందరికీ విదితమే.

ఇంకో పెద్దాయనున్నాడు – ఒక సమస్యకు రెండు పద్యపూరణలు చేయడంతో రంగప్రవేశం చేసి, ‘తూగులయ్య’ తప్పతాగినా తప్పటడుగులు వేయనీయకుండా ఒంటిచేత్తో నడిపిస్తూ, ఇంకోచేత్తో ‘ఆశుపద్యాలవైపు అడుగులేయండ’ని నవ్యపద్యకారులను నడిపిస్తున్న కవిరాజర్షి విశ్వామిత్రుడు. మాట, టపా, పదము, పద్యము – ఏదైనా సరే చమత్కారాన్నీ శ్లేషనూ కలిపి ‘దంచుతూ’ వుంటాడీయన.

—————————————————————————————————————-

జాలంలో ఇలా భువన విజయం నిర్వహించాలనే ఆలోచనా, దానికి తగిన ప్రయత్నమూ, అప్పుడే పద్య సందేశాలు పంపుతున్న సభ్యుల ఉత్సాహమూ .. నాకు ఆనందాతిశయంతో నోట మాట రావటల్లేదు.

సరిగ్గా నెల రోజుల క్రితం నాతో – “ఈ పద్య కవులతో ఓ భువన విజయం నిర్వహిస్తే ఎలా ఉంటుంది?” అన్నారు పొద్దు సంపాదకులు సిముర్గ్. దిగ్గజాలవంటి వీరంతా ఒక వేదిక మీద కలిస్తే అది భువనవిజయమే అవుతుందనిపించి ప్రయత్నిస్తానన్నాను. ఏ కళకయినా, ముఖ్యంగా సాహిత్యానికి – కథ, కవిత, పాట, పద్యం – ఇట్లా ఏదైనా సరే, అభిమానించి, తమ శ్రమను వెచ్చించి, ప్రోత్సహించే కళారాధకుడిగా మనకు సుపరిచితులయిన కొత్తపాళీగారిని ఈ అభినవ భువనవిజయానికి రాయలవారిగా పట్టాభిషేకం చేయమన్న ఆలోచన సిముర్గ్ గారిదే. ఆచరణ మాత్రమే నాది. ఈ ప్రయత్నానికి వేగంగా స్పందించి, నన్ను ఉత్సాహపరచిన కవి మిత్రులకూ, ‘ఇక మీదే భారం’ అనగానే సంతోషంగా నిర్వహణ భారాన్నంతా బాధ్యతాయుతంగా మోసిన కొత్తపాళీగారికీ నేనెంతో రుణపడ్డాను. ఈయనే రాయలెందుకయ్యాడని అడగాలనిపిస్తే ఒకసారిటు చూసిరండి. బ్లాగావరణంలో పద్యకర్తల ఆవిర్భావానికి, పద్యగంగా ప్రవాహానికీ ఈయనే భగీరథుడు.

కలియుగంలో ధర్మం ఒక్క పాదంపై మాత్రమే నడుస్తూ వుండవచ్చును గానీ, ఈ ఆధునికయుగంలో తెలుగుపద్యం మాత్రం నాలుగుపాదాలా హాయిగా నడక సాగిస్తూవుంది – అనే నమ్మకం కలిగిన నవకవుల నూతన యత్నాల సమ్మేళనమే ఈ అభినవ భువనవిజయం. సభకు అధ్యక్షత వహించమని కొత్తపాళీ గారిని అభ్యర్థిస్తూ నేను పంపిన విద్యుల్లేఖ, ఆ తరువాతి ఉత్తర ప్రత్యుత్తరాలను మీ ముందుంచుతున్నాం. ఈ ప్రయత్నం ఎంత హృద్యంగా సాగిందో మీరే చూడండి.

—————————————————————————————————————-

కొత్తపాళీగారూ,
రాబోయే ఉగాది సందర్భంగా మీ ఆధ్వర్యంలో మనదైన చిరు భువనవిజయాన్ని ఏర్పాటు చేసుకుందామని మహామహులైన మన బ్లాగ్దిగ్గజాలను అడిగి సమ్మతిని పొంది మీ సమక్షానికి వస్తున్నాము. మా సంభాషణను ఒకసారి పరికించండి.
************

ప్రియమైన మిత్రదిగ్గజములారా, మీ అందరికీ రానారె నమస్కార బుల్లెట్లు. మిమ్మల్ని ఒక మాట అడుగుదామని వచ్చాను. ఉగాది వస్తోంది కదా (ఏప్రిల్ 7న), ఆ సందర్భంగా మనమంతా కలిసి ఒక చిన్న భువనవిజయాన్ని ఏర్పాటు చేద్దామని. గతంలో ఒకసారి మన బ్లాగుల్లో పద్యాల తుఫానొచ్చింది, మీకు గుర్తుండే వుంటుంది. టపాలే కాదు వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలు కూడా పద్యాలే అయినాయి. బ్లాగుల్లోని ఆనాటి వాయుగుండానికి కేంద్రం మిషిగన్‌కు కొన్ని మైళ్లదూరంలో కేంద్రీకృతమై వుండినదనే సంగతి కూడా మనకు ఎరుకే. ఔను కొత్తపాళీగారే. ఈ కొత్తదేవరాయలు గారి సారధ్యంలో మనం తలా ఒక పద్యాన్ని అల్లి ఉగాది ‘పొద్దు’న పద్యతోరణం కడదామన్నది ఆలోచన. పద్యాలు రాయగల బ్లాగుకవుల సమ్మేళనానికి మీ “సరే” కావాలి. “ఓకే” అయినా ఫరవాలేదు. పొద్దు సంపాదకులు మీ అంగీకారంతో ఈ ప్రస్తావనను రాయలవారి సముఖానికి చేర్చడానికి వేచి వున్నారు. ఏమంటారు?

************

ముందుగా గిరిగారు ఇలాస్పందించారు – “సరే. ఏదైనా ప్రత్యేకాంశం అనుకొంటున్నారా (ఉగాది కాబట్టి ఉగాది గురించో..) లేకపోతే ఎవరికి నచ్చినది వారు వ్రాయవచ్చా.”

నా జవాబు – “తొలిస్పందన ఎవరినుంచీ వస్తుందా అని ఎదురు చూస్తున్నా 🙂 నిర్వహణ ఎలాగన్నది కొత్తపాళీగారికే వదిలేద్దామని అనుకోవడం. ఆయనను అడిగేముందు మిమ్ములనందరినీ ఒకమాట అడిగి సరేననిపించుకుందామని ఈ వేగు పంపడం.”

************

వికటకవిగారు ఒక సలహా ఇచ్చారు – “రానారె, నలుగురూ ఉన్నారు కాబట్టి ఒకే అంశం అని కాకుండా ఉగాది, తెలుగుతనం, బ్లాగుల్లో తెలుగు వగైరా కాస్త పరిధి పెద్దదిగా ఉంటే నాబోటివాళ్ళకి (ఒకటి కుదరకపోతే మరొకటి పట్టుకోటానికి) కూడా కాస్త వీలుగా ఉంటుందని నా ఆలోచన. అదీగాక అందరూ ఒకే అంశంపైన పద్యాలని రాస్తే ప్రజలకు కూడా “ఒకే అంశమా” అనిపిస్తుందేమో అని మరో ఆలోచన. ఏమంటారు?”

నేనన్నాను – “అలాగే కానిద్దాం. అందరమూ పద్యాలు రాయడమే లక్ష్యం. సూచనలన్నీ రాయలవారికి చేరవేద్దాం.”

************

మహదానందాన్ని కలిగిస్తూ తాడేపల్లిగారు – “రానారె గారి ప్రతిపాదనకు నా ఒప్పుదలను తెలియజేస్తున్నాను. ఏదైనా ప్రాస్తావికాంశాన్ని ఎంపిక చేసినా సరే ! చెయ్యకపోయినా సరే !”

************

వెంటనే చదువరిగారు – “బావుంది ఆలోచన! నేను సై! ఎలా.., ఎప్పుడు? నాదో సూచన -పద్యాలు రాసి పంపించడంతో పాటు, అందరం చాటులోనో, టాకులోనో చేరి ఆశువుగా పద్యాలు చెప్పే అంశం కూడా చేర్చవచ్చునేమో! తలా ఓ పద్యమో, పాదమో చెప్పడం.. ఇలాగో మరోలాగానో!ఆలోచించండి!”

************

గిరి గారి సూచన – “తలో పాదము రాయడం చాలా మంచి ఆలోచన..ఎవరికి నచ్చిన పద్యాలు వారు రాసుకోవచ్చు కానీ ఒక గొలుసు పద్యం ఉంటే చాలా బావుంటుంది..రాఘవకి నాకు అలా రాయడం కొంచెం అలవాటు ఉంది కూడా :)”

************

శ్రీరామ్‌ రంగంలోకి దిగారు – “బ్రహ్మాండమైన ఆలోచన. నా శాయశక్తులా ప్రయత్నించగలవాడను 🙂 ”

************

రాకేశ్వరులవారు మెల్లగా కాలుమోపారు – “The chain is as strong as the weakest link అన్న మాట గుర్తుపెట్టుకుని, ఈ వీక్లింగ్/క్ కూడా సైఁ అంటున్నాడు 🙂 ”

రాకేశుని మాటలతో నేనూ జాగ్రత్తపడ్డాను – “రాకేశా, వీక్లింగ్/క్ శ్లేషను తెచ్చిపెట్టావు, ఇలాంటిదొకటి చాలదా నీవంతు పద్య(పాద)ము రక్తికట్టడానికి!? 🙂 అప్పుడెపుడో ఒక ఆటవెలది, రెండు కందాలు ప్రయత్నించి “కవి”ననిపించేస్కున్నాను గానీ నేనూ వీకువీరుణ్ణే. ప్రస్తుతానికి గిరి, వికటకవి, తాడేపల్లి, చదువరి, శ్రీరామ్, రాకేశ్వరగార్లనుంచి ఒప్పుదలలు వినిపించాయి. సంతోషం. ఊకదంపుడుగారు, రాఘవ, బ్లాగేశ్వరగారు కూడా ఔనంటారని చూస్తున్నాము.”

************

ఈ వీక్లింక్ కూడా సైఁ అంటున్నాడు … అని కందపద్యంలో చెబుతూ తరువాతెవరొచ్చారో చెప్పాలా!!? 🙂

కం.
ఊకొట్టెద సంతసముగ,
ఆకట్టుకొను ఘనసభకు ఆహ్వానింపన్
ఊకెక్కడ దంపమనిన
నాకేమిలె, ముందునిలువ నలుగురు శ్రేష్టుల్!!!

ఆయన్ను చూసి, నేనూ గురువులూ, లఘువులూ, గణాలూ లెక్కపెట్టుకుంటూ అన్నాను – “అదీ మొనగాడు! ఊకదంపుడుగారూ, మీ ప్రవేశంతోనే మన భువనవిజయానికి ఒక ఊపు తెచ్చారు.

కం.
ఊకయను పేరె గానీ
కేక! తమరి చతురత గని, క్షేపము గొని, నే
నూ కందము వ్రాసితి మరి
రాకయె పోవునా విలసిత రాఘవు డింకన్!?

వాగ్విలాసులు రాఘవుల వాక్కులకై ఎదురు చూస్తూ

ఒక శబరుడు, [:-)]
–రానారె”

************

నా గణాల లెక్క పూర్తయ్యీకాకనే – రాఘవగారు – “మిత్రులారా, బాగు బాగు… నా “సరే” కూడా జేర్చి తిరిగి లెక్కపెట్టవలసినది. గిరిగారన్నట్టుగా పద్యపూరణంజేస్తే వొకే పద్యంమీద మాటముద్రలందరివీ పడతాయి కదా. యోచన బాగానే వున్నట్టనిపిస్తోంది, యెంతమటుక్కు కుదురుతుందో జూడాలి. అన్నట్టు వికటకవులకు వొక ప్రత్యేకాంశమంటూ వుంటుందా యెక్కడైనా? మీరసలే టకటకవులాయె.

బాగుంది! నేనొక్ఖడినేనా పద్యం వ్రాయనిది 😛 కాస్కోండి మరి — (అంటూ ఈ కందశంఖం పూరించారు)

కం.శ్రీద్యుమణివంశజు దలచి
ఖద్యోతనసమప్రకాశ కవిగణమునకున్
పాద్యమునీయుచు విడచిన
పద్యాస్త్రమ్మిదె సరసుల పద్యరణముకై. “

************

రాఘవగారి ప్రశ్నకు వికటకవుల జవాబు – ” 🙂 ఈ సాఫ్టువేరు విభాగంలో పడి ప్రతి పనికీ “ఇది పనిచేయకపోతే, మరో మార్గమేమిటీ” అనుకుంటూ ఓ బ్యాకప్ ప్లానుకి అలవాటుపడిపోయాం. నిజానికి సొంత ఆలోచనకంటే, ఫలానా దానికి రాయవయ్యా అంటేనే ఓ సవాలుగా రాయవచ్చునేమో. కానీ ముందు చెప్పినట్లుగా “అలా అలవాటుపడిపోయామండీ. ***ఏమాటకామాటే, నేను మరో బలహీనపు లంకెని.” (అంటూ ఈయనా జాగ్రత్తపడ్డారు:-))

రాఘవగారన్నారు – “అలాగైతే వికటకవీశా మీకు నచ్చిన (యేదో వొక) విషయం మీదనే వ్రాయొచ్చు గదా… మీరు జెప్పేదేదైనా మాకు సమ్మతమే 🙂 బ్లాగేశ మీయొక్క అంగీకృతివినని భువనవిజయమెట్లు పూర్తియగును?”

************

ఆ ప్రకారంగా (బ్లాగేశ్వరులవారిని మాట్లాడించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే వుండగా) అందరం మీ ఆస్థానానికి వచ్చాం. ఇక నిర్వహణభారం మీదే!

భవదీయులైన
బ్లాగుదిగ్గజములు మరియు వారి మిత్రుడు.

—————————————————————————————————————-

కొత్తపాళీగారినుండి అంగీకారం వచ్చేలోపు, తాడేపల్లిగారు పంపిన ఆణిముత్యాల్లాంటి ఈ రెండు పద్యాలు చూడండి.

చll
కలమును వాడిఖడ్గముగ కై ధరియించి కవిత్వయుద్ధమున్
సలుపుట కెందఱో సుకవి సత్తములిక్కడ సిద్ధమైరహో !
గెలుపులు మాత్రమందఱివి ; కేవలయుద్ధములట్టులౌనె ? యీ
తొలి కవితాసదస్సు మన తోడి జనావళిఁ బ్రోత్సహించుతన్.
కంll
అందఱమున్ గృహకవులమె ;
కొందఱును సభాకవిత్వ కోవిదు లిఁట లే ;
రందువలన వగపు వలదు ;
చెందింతము రక్తి మనదు శక్తి కొలఁదిగాన్.

“సుకవిసత్తములిక్కడ సిద్దమైరహో!” అని ప్రకటిస్తూ, “అందరినీ గెలిపించే యుద్దమిది. ఇలాంటియుద్ధం మరొకటేదయినా వుందా!?” అని దీని వైశిష్ట్యాన్ని చాటుతూ, “వగపు వలదు … చెందింతము రక్తి మనదు శక్తి కొలఁదిగాన్” అనే మాటలతో శక్తినీ ఉత్సాహాన్ని నింపారు.

—————————————————————————————————————-

అంతలో కొత్తపాళీ గారి నుండి అంగీకారం అందింది, “ఔత్సాహిక తెలుగు కవిసంఘానికి అభివాదములు, అభినందనలు. జాలంలో ఇలా భువన విజయం నిర్వహించాలనే ఆలోచనా, దానికి తగిన ప్రయత్నమూ, అప్పుడే పద్య సందేశాలు పంపుతున్న సభ్యుల ఉత్సాహమూ .. నాకు ఆనందాతిశయంతో నోట మాట రావటల్లేదు. వయసులో, జ్ఞానంలో, ప్రతిభలో నాకంటే అధికులెందరో ఉండి, ఈ సభకి నన్ను అధ్యక్షత వహించమండం నిజంగా నా అదృష్టం. దీన్ని తెలుగు భారతి ఆజ్ఞగా వినమ్రంగా శిరసావహిస్తున్నాను.” … అంటూ నిర్వహణకు సంబంధించి తమ ప్రణాళికను ప్రకటించారు. ఆ ప్రణాళిక ప్రకారం మార్చినెల రెండవ ఆదివారం అందరూ తమ తమ పూరణలతో సిద్ధమై సమావేశం కావాలని నిర్ణయించడం జరిగింది. కవులంతా అన్ని సమస్యలు, దత్తపదులు, దత్తాంశములనూ ప్రయత్నించనవసరం లేదు. తమకు నచ్చిన వాటిని పరిష్కరించవచ్చు.

సభాప్రాంగణం? ఇంకెక్కడ, వీవెన్ నిర్మించిన కూడలిలోనే. అభినవ భువనవిజయం కోసం ప్రత్యేకంగా నిర్మించిన సాహిత్య మండపంలో. ఈ సందర్భంగా వీవెన్‌కు మా అందరి తరఫున మరియు, ‘పొద్దు’ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.

ఆహూతులైన ముఖ్య అతిథులుగా సాలభంజికల భోజరాజు నాగరాజుగారి చేరికతో ఆద్యంతమూ చతుర సంభాషణలతో, మార్చి 16న విజయవంతంగా నిర్వహింపబడిన భువనవిజయాన్ని వీలైనంత యథాతథంగా మీ ముందుకు తెస్తున్నాం – ఏప్రిల్ 7, సర్వధారి ఉగాది నాడే!

————-

రానారె పొద్దు సంపాదకవర్గ సభ్యుడు, పద్య కవి. అభినవ భువన విజయంలో పాల్గొన్న కవులలో ఒకరు. ‘భట్టు’పల్లికి చెందిన రానారె భట్టుమూర్తిగా ఈ కవిసమ్మేళనంలో పాల్గొన్నారు.

Posted in కవిత్వం | Tagged , , | 6 Comments