-ఆదినారాయణరెడ్డి
సుట్టిల్లు, సైక, దక్షిణం పక్క కొంత బిడువు జాగా, దీని రక్షణకు పారి గోడ – ఇదీ మాసాకలైవోరి గృహ ప్రాంగణం. మా పల్లెలో చాలా ఇళ్ళన్నీ ఇంతే. మాకు కూడా ఓ బోడిమిద్దె, రెండు సైకలు, రెండు పశువుల కొట్టాలు ఉండేవి.
మా సాకలైవోరి సుట్టింట్లో రెండు వాడలు, రెండు కుండల దొంతులు, రెండు నీళ్ళ కడవలు, నాలుగు మూకట్లు, రెండు ముంతలూ, పొంతబాన, కొన్ని బోకులు, సంగటిసట్టి, కూరబొప్పి, తెడుగట్టె, గుత్తికట్టె. చూరులో దూర్చిన (చొప్పించిన) సూరకత్తి, వాడల సందున భద్రంగా దాపెట్టిన ఒక కొడవలీ, ఇంకా భద్రంగా పాతగుడ్డలోచుట్టి దాపెట్టిన ఒక యాట కొడవలీ (ఇది తమ రైతులు దేవర్లకు మొక్కుకున్న మొక్కుబడి కింద పొట్టేండ్లనో, మేకపోతులనో, దున్నపోతులనో తలలు నరకటానికి ఉపయోగిస్తారు), పైన వాసానికి వేలాడదీసిన ఒక కుందేటి వల, పొయ్యిగడ్డ మీద ఒక బుడ్డీ, చిన్న దండెం, సైకలో – సౌడు బోసుకోవడానికి మట్టితో కట్టిన సుమారైన గాదె, అందులోనే పల్లెలనుండి తెచ్చిన మైల గుడ్డల మూటలు, గాదెనానుకొని ఎత్తుటరుగు, మిగిలిన స్థలమంతా తోకపిరికెడు మందాన పరచిన శుభ్రమైన ఇసుక. ఇదీ మా సాకలైవోరు ఇల్లు. ఆ పరచిన ఇసుకలో మాబడి.
తరగతుల విభజనలేదు. ఐవోరు ఉత్తరదిక్కు గోడకానుకొని దక్షిణదిక్కుకు మల్లుకోని కూర్చుండేవాడు. గోడకానుకొని ఓనమాల వాళ్ళు ఐవోరికి శానా దగ్గరగా. వాళ్ళ పక్కన కాదీర్గాలు, కావత్తులవాళ్ళు తూర్పువైపుకు, పద్యాలు,అమరం-గజేంద్రమోక్షం, ఉత్తర రామాయణం సదువుకొనేవాళ్ళు పడమర వైపు తిరిగి ఎదురెదురుగా కూర్చుంటే వీళ్లమధ్యలో ఐవోరు. ఐవోరికి ప్రత్యేకంగా కుర్చీలాంటిది యేమీలేదు. పిల్లోళ్ళతోపాటు ఇసకమీదనే కూచునేవాడు.
అక్షరాభ్యాసం ఇసుకలో ఓనమాలతో ప్రారంభం. ఐవోరు తాను ఇసుక మీద ‘ఒ’ రాసి, రెండుచేతులూ జోడించి దానిని చూపిస్తూ పిల్లోడు లేక పిల్ల చేత ఆ అక్షరాన్ని ‘ఒ’ అంటూ గట్టిగా తాను పలికి పలికించే వాడు. తర్వాత ఆ శిశువు వేలును తనచేతితో పట్టుకొని గట్టిగా పలుకుతూ పలికిస్తూ దిద్దించే వాడు.అలా అరుస్తూ దిద్దుకుంటూ కొండరు పిల్లలు అలాగే నిద్రబోయేవారు. బట్ట గానీ ఈతచాప గానీ అరుగుమీద పరిచి ఆబిడ్డను ఐవోరు పడుకో బెట్టేవాడు. ఆదారిన ఎవ్వరైనా వెళుతూంటే ఆ బిడ్డ తాలూకు ఇంటివాళ్ళకు చెప్పి పంపే వాడు. సాయత్రం తాము నేర్చుకున్న అక్షరాన్ని (అక్షరాలను) పిల్లలు రాసి రెండు చేతులూ జోడించి వొంగి చూపిస్తూ గట్టిగా పలుకుతూ అప్పజెప్పాల. కాదీర్ఘాల వరకు కూడా ఇసుకలోనే. తర్వాత పలకా బలపం. అవి కొనిచ్చే స్తోమతు లేని తల్లిదండ్రులు కూడా మాపల్లెలో ఉండే వారు. “అట్టే ఇస్కెలోనేరాపీ ఐవోరా” అనేవారు. “ఈసారి సంత గొదికీ తెచ్చాలే” అంటారు. సంతలేమో గడిచిపోతూ ఉంటాయి గానీ పలకా బలపం మాత్రం కొనలేరు. కొంతమంది సంపాదించింది కల్లుకు ధారవోసి కొనరు. అప్పుడు పిల్లల అమ్మగారు మొగునికి తెలీకుండా కొంత దాచిపెట్టుకొని తెచ్చిచ్చేవారు.
కాదీర్గాలు-కావత్తులు అయినతర్వాత ‘యెంతదయో దాసులపై’, ‘ఓయమ్మ నీకుమారుడు’ వంటి చిన్నచిన్న పద్యాలు, తర్వాత అమరం, గజేంద్ర మోక్షం, ఉత్తరరామాయణం చెప్పించే వాడు. అన్నమ్యాలప్పుడు (ఉదయం 9:30-10 మధ్య) పిల్లలందరినీ ఇళ్ళకు పొమ్మని తాను సాకిరేవుకుపోయి, ఇంటివాళ్ళు పల్లెలనుండి తెచ్చిన మైల బట్టలు కొన్ని ఉతికి, వారు పల్లెల్నుంచి పెట్టించుకొచ్చిన సంగటి తిని, మళ్ళీ మద్యాన్నం గాకముందే (11-30లోగా) బడికొచ్చేసేవాడు.
కొందరు పిల్లలు తమ జతలోనివారు గజేంద్రమోక్షం ఉత్తరరామాయణం స్థాయికెదిగినాగానీ తామేమో కావత్తులదగ్గరే వుండేవారు. వారి తల్లిదండ్రు లు “మావోణ్ణి బాగాకొట్టు ఐవోరా! నువ్వు కొట్టకనే మావోనికి సదువురాలా! మాయైవోరు మమ్మల్నెట్ట గొట్టేవోడనీ! అట్టగొడితేనేగదా సదువొచ్చేది?” అని ఐవోరికి ఉచిత సలహా లిచ్చేవారు.దెబ్బలు తినడంలో అప్పటికే రాటుదేలిన వారైనా ఆ పిల్లలు వాళ్ళ నాయననిచ్చిన సలహాతో యాడ మల్లా ఐవోరు సావగొడతాడో నని భయంతో బిక్కుబిక్కు మంటూ అందరివైపూ బెదురు చూపులు చూసేవారు. ఐవోరు కులస్తులు కొందరు వరసైనవారు బడికి వచ్చి తమపిల్లలకు ఏమి నేర్పించాలో ఐవోరికి చెప్పేవారు. ఒకనాడు ఒకతను వచ్చి ఐవోరితో చెప్పిన మాట: “ఐవోరా ఐవోరా!మావోనికి నేను ఊలేసేదీ–కన్నుగొట్టేదీ– నేరిపిచ్చినా గానీ నువ్వు ‘జొన్న చేనుకాడ సొగసుకత్తెను జూసి’ పజ్జెం నేర్పిచ్చు”.
సాయంత్రం నాలుగు బారల పొద్దుందనంగా ఒక్కొక్కరినీ ఆపొద్దు నేర్చు కున్నిందంతా అప్పగించమనే వాడు. ఇసుకలో అక్షరాలు నేర్చుకున్న పిల్లలు ఐవోరు రాసిచ్చిందంతా చెరిపేసి, ఐవోరు ముందు రాసి, రెండుచేతులూ జోడించి అక్షరాలను చూపిస్తూ గట్టిగా చెబుతూ అప్పగించేవారు. కాదీర్గాలూ, కావత్తులు అన్నీ అప్పగించుకొనేవాడు. తర్వాత పద్యాలు నేర్చుకున్న పిల్లలు గట్టిగా ఒక్కొక్క పాదమూ అప్పగిస్తూ వుంటే మిగిలిన చిన్నా పెద్దా పిల్లలందరు కూడా సత్తువకొద్దీ పలకాల. ఈపనంతా రెండుబారల పొద్దుందనంగా ఐపోతుంది. తర్వాత పాటలు పాడే వాళ్ళు ఎవరైనావుంటే పాడేవారు. మిగిలినవాళ్ళు పలికేవారు. మళ్ళ కొంతసేపు ఏవో ఆటలాడుకొన్నతర్వాత ఇండ్లకు పొమ్మనేవాడు.
ఉదయాన్నే ముందుగా వచ్చిన వారికి “శ్రీ” అనీ రెండవ వారికి “చుక్క” అనీ వ్రాసుకుంటారు. ఆ తర్వాత వచ్చే సంఖ్యను బట్టి ఒకటి రెండు వరుసగా వేసు కుంటూ పక్కన వారివారి పేర్లను వ్రాసుకుంటూ పోయే వారు. “శ్రీ-,చుక్క”వారికి దెబ్బలు పడవు. తక్కినవారికి సంఖ్యను బట్టి ఈత బెత్తంతో అన్ని దెబ్బలు వారి అర చేతిమీద సున్నితంగా కొట్టేవాడు ఐవోరు. ఆయన బడిలోకొచ్చిన తర్వాత వచ్చిన వారికి మరీ ఆలస్యంకింద పరిగణించి కొంచెం గట్టిగానే కొట్టేవాడు. చదువులో మొద్దుగా వుండేవారికైతే ఈశిక్షలు మరి కొంత ఎక్కువగానే వుండేవి. మరీ ఆలస్యంగా వచ్చే పిల్లలు ఐవోరు చేత దెబ్బలు తప్పించుకోవడానికీ, కనీసం తగ్గించుకోడానికి వారిపెద్దలను వెంట పిల్చకచ్చుకొనేవారు. ముఖ్యంగా అవ్వ, తాతలే ఎక్కువగా వచ్చి “ఐవోరా మావానికి కడుపు నొప్పిగా వున్నింద”నో “సద్దైపోయింటే ఉడుకు జేసిపెట్టేటప్పటికి రోంత పొద్దెక్కింది కొట్టగా కైవోరా ఐవోరా” అని ప్రాధేయపడేవారు. ఈశిక్షలు అన్నమ్యాలప్పుడు అన్నానికి వదిలేటప్పుడు అమలు జరుగేవి.
ఇంతకీ ఐవోరికిచ్చే జీతం నెలకు — ఓనమాల వాళ్ళు బొట్టూ, కాదీర్గాలూ కావత్తుల వాళ్ళు అర్ధణా, పాఠము, పద్యాలవాళ్ళు అణా, గజేంద్రమోక్షమూ ఉత్తర రామాయణము వాళ్ళు అడ్డగ. కొందరైతే “సరేపో ఐవోరా నీజీతానికొచ్చింది తిప్పలు. నిన్నట్నించి పొయ్యిలో పిల్లి లెయ్యల్యా. నువ్వేయేమైనా వుంటే యీ” అనేవాళ్ళు. ఇచ్చినా యీకున్నా పిల్లల్ని బడికి రావద్దని గానీ, ఎండలో నిలబెట్టడం గానీ చేసేవాడు గాదు. చదువు చెప్పడంలో ఏమాత్రమూ నాణ్యత తగ్గించేవాడు కాదు.
ఆట విడుపు రోజులలో (పున్నానికీ-అమావాస్యకీ) ఆటిడుపు పద్యం ఒకటి ఆ స్థాయి పిల్లలకు రాసిచ్చే వాడు. వారు దానిని రాత్రికి నేర్చుకొని మరునాడు అప్పజెప్పాల. ఐతే రాసిచ్చిన వెంటనే వారు గట్టిగా చదవడం మొదలు బెట్టే వారు. వీలైనంతవరకూ అప్పటికప్పుడే నేర్చేసుకొనేవారు. ఆటవిడుపు రోజు ఈడిగపల్లె పిల్లలు కొందరు ఇంటిలోని వేట కుక్కలను తీసుకొచ్చేవారు. ఆపిల్లలూ ఐవోరూ కలసి వేటకువెళ్ళేవారు. ఉడుములు, ఎంటవలు, ముంగిసలూ, ఉడతలూ వీలైతే కుందేళ్ళనూ వేటాడేవారు.
నేను ఆ బడిలో అచ్చులైనా పూర్తిగా నేరుకున్నానో లేదో నాకు సరిగా గుర్తు లేదు. తర్వాత నన్ను వీరబల్లె పేటకు ఎలిమెంటరీ స్కూలుకు పంపించినారు మాపెద్దలు. నా జీవితంలో అసంఖ్యాకంగా మానసిక ఒడిదుడుకులు, అనారోగ్యాలూ, కొన్ని సార్లు కోమా లోకి పోవడాలు జరిగినాయి. టీ బీ మెనంజిటీస్ అని ఒకజబ్బు వచ్చి మెదడు పైపొర కొద్దిగా తినేసిందని డాక్టర్లు చెప్పినారు. దానివలన చాలా జ్ఞాపకాలు లేకుండాపోయినాయి. కానీ నేను మా సాకలైవోరు బడిలో పలికి నేర్చుకున్న పద్యాలు ఇప్పటికీ అక్షరంకూడా పొల్లుపోకుండా గుర్తున్నాయి. ఉదాహరణకు ‘యెంతదయో దాసులపై’, ‘బంగారు పూలదుప్పటి’, ‘ధగధగ మెరయు కిరీటము’, ‘ఓయమ్మ నీకుమారుడు’, ‘జొన్న చేను కాడ’ వంటి చిన్నచిన్న పద్యాలే గాకుండా ఒక పెద్ద పద్యం
దిటముగ రావణాసురుని దివ్య వనంబున చూస్తి రాఘవా
కటకట యేమి తెల్పుదును కాంత యవస్థలు చిత్తగింపుడీ
చిటికెన వ్రేలి యుంగరము సీతకు కంకణమాయె భూవరా!
కూడా నాకు జ్ఞాపకముంది. ఇది ఏ రామాయణం లోదో ఎవ్వరు రాశారో మాత్రం ఇంతవరకూ తెలియదు. చిన్నపిల్లలు కొత్త సంగతి యేదైనా నేర్చుకోవడానికి మా సాకలైవోరి బళ్లో వుండినటువంటి సానుకూల వాతావరణం ఒక ముఖ్యావసరమనుకుంటాను.
అసంఖ్యాకమైన కారణాలతో నాచదువు పాడైపోయింది. ఎన్నో వడిదుడుకుల అనంతరం వైవాహిక జీవితం – పిల్లలు కలగడం జరిగింది. వాళ్లు ఓనమాలు దిద్దడం కూడా సాకలైవోర్ల చేతులమీదుగానే జరిగింది. ఏ కొంచమైనా విజ్ఞాన సంపద ఇప్పుడు మాకుందంటే దానికంతా మూలం తన ఆశీర్వాద హస్తంతో మాకు విద్యాభ్యాసం ఆరంభించిన మా సాకలైవోరు(లు). వాళ్లకు మేమెప్పటికీ కృతజ్ఞులమే.
————
కొన్ని పదాల వివరణలు:
- సైక: రెండంకణాల కొట్టం
- పారి: ప్రహరి
- వాడలు: కొన్నిచోట్ల వీటిని కాగులు అని అంటారు
- పొంతబాన: పొయ్యి గడ్డకు యడం పక్కన ఇది ఉంటుంది. దీని నిండుగా నీళ్ళుంటాయి. దీనికీ మరో గడ్డకు మధ్యన కుండ పెట్టి వండు కుంటారు. వంటతోపాటు ఈ బానలో నీళ్ళు కూడా వేడెక్కుతాయి.
- బోకులు: పాత్రలు
- సంగటిసట్టి: కుండ
- కూరబొప్పి: కూర వండుకునే మట్టిపాత్ర
- తెడుగట్టె: సంగటి కెలుక్కొనే తాడికర్ర
- గుత్తికట్టె: పుల్లగూర రుద్దుకొనేందుకు… నాగరీకులు దీనిని పప్పుగుత్తి అని అంటారు
- బుడ్డీ: కిరసనాయిలు దీపం
- అడ్డగ: రెండణాలు-రూపాయిలో 8వ వంతు
ఆదినారాయణరెడ్డి గారు ఒక సామాన్య మధ్యతరగతి రైతు. పీ.యూ.సీ వరకూ చదువుకున్నారు. పాఠశాల విద్యకు అంతటితో స్వస్తి చెప్పవలసి వచ్చినా సామాన్యశాస్త్రం, చరిత్ర, ఆధ్యాత్మికాంశాలపట్ల ఆసక్తి కనబరుస్తారు. తనకు చదువు నేర్పిన పంతులుగారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు!