అభినవ భువనవిజయము -7- గూగులమ్మ పదాలు

(<< గత భాగము)

‹కొత్తపాళీ› ఇప్పుడు మన భట్టు కవిగారు కొన్ని గూగులమ్మ పదాల్ని రాలుస్తారు. దత్తపదులు ఇవీ:

  1. స్పార్కు మార్కు డార్కు
  2. డేటు బూటు పాటు
  3. తీర్పు నేర్పు కూర్పు
  4. మాల్సు కాల్సు ఫాల్సు
  5. టెక్కు నిక్కు లుక్కు
  6. చెంత చింత వింత

‹కొత్తపాళీ› భట్టుకవి సిద్ధమేనా?
‹భట్టుమూర్తి›

ఉర్విజనులకు స్పార్కు
నూత్న వర్షపు మార్కు
వుండబోదిక డార్కు
ఓ గూగులమ్మా!

 

తాత చేయును డేటు
తొడిగి సూటూబూటు
పడతి దొరకుటె పాటు
ఓ గూగులమ్మా!

‹నాగరాజు› భట్టుమూర్తి, మా పాట్లు భలే కనిపెట్టావే, సెభాస్.
‹రాకేశ్వరుడు› మీరు మరీ సార్…
‹విశ్వామిత్ర› ఆ తాతకి జాలపు డేటింగ్ తెలీదేమో; బావుంది
‹భట్టుమూర్తి› ఈ తాతకు తెలుసుగా 🙂 ఇదెలా వుందో చెప్పండి…

పిట్ట పోరున తీర్పు
పిల్లి జూపిన నేర్పు
బెమ్మ దేవుని కూర్పు
ఓ గూగులమ్మా!

‹నాగరాజు› చాలా బావుంది.
‹విశ్వామిత్ర› చాల బావుంది,
‹చదువరి› ఇది బెస్టు
‹విశ్వామిత్ర› ఇది డేటింగ్‌కి కూడ పనికొస్తుందేమో, తాతకు చెప్పాలి
‹కొత్తపాళీ› విశ్వామిత్ర, 🙂

మయుని మించిన మాల్సు
స్వీటు గొంతుల కాల్సు
నయా’గారపు ఫాల్సు
ఓ గూగులమ్మా!

‹విశ్వామిత్ర› నయా’గారపు’ బావుంది హిందీ అర్థము కూడ. పైగా పోనులో సరసాలు, ఇప్పుడే మొదలు. మయుడికి తెలీదు.

తెలుగు బ్లాగుల టెక్కు
జాలమందున నిక్కు
వేసుకో ఓ లుక్కు
ఓ గూగులమ్మా!

‹భట్టుమూర్తి› (టెక్కు = Grace, charm, elegance) (నిక్కు = అతిశయించుచున్నది, వర్ధిల్లుచున్నది)
‹కొత్తపాళీ› వీవెనుడి టెక్కునిక్కుల మహిమ. బ్లాగు బ్లాగు. భట్టుమూర్తి, చివరిది… చెంత చింత వింత

ప్రణయ జీవుల చెంత
వర్ణ భేదపు చింత
మనుజ లోకపు వింత
ఓ గూగులమ్మా!

‹రాకేశ్వరుడు› భట్టుమూర్తి, లోకపు అతి విడ్డూరమైన వింతను ముప్పైతొమ్మిదిమాత్రలలో భలే బాగుగా బంధించారు
‹విశ్వామిత్ర› దీని మీద, మూడు వేల సినిమాలు వచ్చి ఉంటాయి, ఒక్కొక్కటీ మూడు గంటలు, ఇలా మూడు ముక్కల్లో చెప్పేది మటుకు భట్టుమూర్తే.
‹భట్టుమూర్తి› ధన్యోస్మి.

(అపరిచిత(!) అతిథులు “మొల్ల” ఆగమనం)
‹విశ్వామిత్ర› భువనవిజయ సభకి మొల్ల రావటం ఇదే తొలిసారి కాదు
‹నాగరాజు› అవును, నిజమే, ఆమె తెనాలి రామలింగడి కాలంలోనిదే కదా?
‹విశ్వామిత్ర› అవునండి

————–

(తరువాయి భాగము >>)

——————-

సంకలనం: రానారె

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

5 Responses to అభినవ భువనవిజయము -7- గూగులమ్మ పదాలు

  1. ఆర్యా !
    క:- ముద్దుల మన యాంధ్రమ్మును
    గద్దెను నిలుపంగ గోరి, గౌరవమొప్పన్
    ప్రొద్దెరుగక శ్రమియించెడి
    పొద్దుకు నే నంజలింతు . పొగడుదు నెలమిన్.
    మీ పొద్దు బ్లాగులో అభినవ భువన విజయము 9 భాగాలూ ఇప్పుడే చూచాను.
    అత్యద్భుతంగా వున్నాయి. సందేహం లేదు.నిర్వాహకులకూ, ప్రకాశకులకూ, కవివతంసులకూ,
    నా అభినందనలు.
    బంగారానికి పరిమళమూ, మృదుత్వమూ, ఉంటే ఎలాగుంటుందో ఊహించుకుంటేనే మనసు ఆనంద పారవశ్యం పొందుతుందికదా ! మీరు చూపిన యీ అభినవ భువన విజయము మేలిమి బంగారమే. ఏమాత్రం సందేహం లేదు.
    ఐతే ఈ పద్యామనే బంగారానికి పదముల పొందిక, ఛందము, యతి ప్రాసలూ, సౌకుమార్యాన్ని, పరీమళాన్ని, సమకూరుస్తాయి. ” లక్షణ బద్ధము కాకుండా లక్షణ విరుద్ధములైతే పుత్తడిని యిత్తడిగా మార్చేస్తాయి. అటువంటివున్నాయేమో ఎవరికి వారు వారి రచనలను పరిశీలించుకొని తెలుసుకో గలిగితే రాబోయే దశమికి నిర్వహించబోతున్న భువనవిజయం అత్యద్భుతంగా ఉండేటట్టు నిర్వహించ వచ్చు. ఎవరి దోషం వారికి తెలుసుకోవాలనున్నా వారికి తెలియకపోవచ్చు. గుర్తించిన వారినుండి తెలుసుకోవచ్చు. మీరు కవాలనుకొంటే నేను గుర్తించినవి తెలియజేయ గలను. ఇలా వ్రాయొచ్చో వ్రాయ కూడదో నాకు తెలియదు. ఐనా తెలిసినది తెలియ జెప్పాలి కాబట్టి మీదగ్గర నాభావాన్ని వ్యక్తం చేశాను. తప్పయితే మన్నించ గలరు.
    నమస్తే.
    చింతా రామ కృష్ణా రావు.
    {ఆంధ్రామృతం బ్లాగు}

  2. చింతా రామ కృష్ణా రావు గారూ, ధన్యవాదాలు.ఇక్కడివారంతా విద్యార్థులే. మేలు చేసేవి సద్విమర్శలే కదా. మీ విమర్శలకు సుస్వాగతం.

  3. శ్రీ రానారే గారూ ! నమస్తే.
    మీ సహృదయతను అభినందిస్తున్నాను. మొదటి భువన విజయం చూచి నేను వ్రాసినది విమర్శ కాదు. ముందు జాగ్రాత్తకు కొన్ని సూచనలు మాత్రమే. మనల్ని మనం కాక మరవరు సరి చేస్తారు? అందుకే పరస్పరం సన్మార్గ సూచకులం కావాలి.
    ఇక్కడ నాదో సూచన. సుస్వాగతం అనే ప్రయోగం కంటే “స్వాగతం” అని లేదా “స్వాగతం సుస్వాగతం ” అనే ప్రయోగాలు యుక్తంగావుంటాయి. భాష భ్రష్టు పట్టకుండా చూడవలసిన బాధ్యత భాషాభిమానం గల ప్రతి ఒక్కనిపైనా ఉంది. మన పరిధిలో మనం పరస్పర అవగాహనతో సరి చూసుకొందాం.
    ఆ:-కాల గమనమందు కలుషిత మైపోవు
    కమ్మ నైన తెలుగు. కవి వరేణ్య !
    దోషములను గనిన భాషాభిమానులు
    తెలిపి, భాష విలువ నిలుప వలయు..
    అకుంఠిత సేవా తత్పరా! అభినందనలు.
    చింతా రామ కృష్ణా రావు.
    {ఆంధ్రామృతం బ్లాగ్}

  4. రామకృష్ణగారూ,

    సుస్వాగతం అనడంలో తప్పుందని ఇంతకు ముందు కూడా (సాహిత్యం గుంపులో అనుకుంటాను) ఎవరో చెప్పారండి. అయినా నేనా అలవాటు మానలేదు. సుస్వాగతం అనడం ఎందుకు తప్పో మీరొకసారి వివరించగలిగితే సంతోషం.

  5. గిరి says:

    రానారె, సు + ఆగతం స్వాగతం అవ్వడం వల్ల స్వాగతానికి ఇంకో సు ప్రిఫిక్సక్కర్లేదని…

Comments are closed.