అభినవ భువనవిజయము – అంతర్జాలములో అపూర్వ కవిసమ్మేళనము

రానారె

గత రెండేళ్లుగా బ్లాగావరణం అనుకూలించడంతో పలుప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీగానే పద్యాల వర్షాలు కురుస్తున్నాయన్న సంగతి పాఠక శ్రేష్ఠులైన తమకు తెలిసిందే. చెదురుమదురుగా కురుస్తూవుండిన ఈ వర్షాలకు సర్వధారి ఉగాది ఋతుపవనాల ఆగమనంతో కొత్త ఉత్సాహం తోడయింది.

సరిగ్గా నెల రోజుల క్రితం నాతో – “ఈ పద్య కవులతో ఓ భువన విజయం నిర్వహిస్తే ఎలా ఉంటుంది?” అన్నారు పొద్దు సంపాదకులు సిముర్గ్. దిగ్గజాలవంటి వీరంతా ఒక వేదిక మీద కలిస్తే అది భువనవిజయమే అవుతుందనిపించి ప్రయత్నిస్తానన్నాను.

అలనాడు శ్రీకృష్ణ పరమాత్మ భయంకర వర్షపాతము నుంచి గోపకులను రక్షించడానికి గిరిధరుడైతే – అభినవ గిరిధరుడు మాత్రం పాఠకులను తమ పద్యాల వానలో ముంచెత్తుతున్నారు. ‘ఏమయ్యా ఇది’ అన్నాడని పొద్దుమిత్రునిపై ఒక కుండ పోయించాడు.

ఆ పొద్దుమిత్రుడేమి తక్కువవాడు కాడు. గతంలో ఒక్కసారి పద్యాల వాన కురిపించాడు. మన రాష్ట్రరాజకీయము, రాజధాని, భాష మొదలైన విషయాలపై చురుగ్గా స్పందించే ఈ బ్లాగ్వరుడొకమారు భాగ్యనగర రహదారులపై వ్రాసిన చమత్కృతి నిండిన చిన్న పద్యాలు ఎందరినో మురిపించాయి.

సీతారాముల కళ్యాణం జరిపించేసి, ఒక పెద్ద సమస్యనుంచి ఆ రాముని రక్షించిన దిట్ట ఈ శ్రీరాముడు. సంగీతసాహిత్యాలపై చక్కని అభిరుచిగలవాడితడని ఈయన వ్రాసే సంగతులూ సందర్భాలూ చదివినవారికి ఠక్కున తెలుస్తుంది.

అందం అరసున్నాలలో వుందని నమ్మిన ఆధునికభావాల కలబోత మరొకాయన. సృజనాత్మకత, చతురత, చొరవలతోపాటు, మాతృభాషపై పట్టుసాధించడానికి అతడు పడుతున్న శ్రమ తోడయి, (శకటరేఫము మరియు అరసున్నలతో సహా) “రాకేశ్ ఱాఁక్స్” అనిపించి అభిమానులను సంపాదించిపెట్టింది.

శ్రీనివాస్ చలం: ఛందస్సు అనగానే కాళిక వేయినాలుకలతో తమ ముందు ప్రత్యక్షమైనట్లు భయపడి ఆమడదూరం వెళ్లినవారందరికీ ఇతనో వికటకవి. ఈ కవిగారుమాత్రం ఎదురుగా నిలబడి ‘దురదుంటే ‘కంద’మునకుండాలి కత్తిపీటను నేను, నాకెందుకు!’ అని నేరుగా అడిగాడు. ఛందోదేవత ఆయనను అనుగ్రహించింది.

రాకేశ్వరుని ప్రభావంతో తయారయిన మరో పద్యకవి బ్లాగేశ్వరుడు. అంతకు ముందెప్పటినుంచో తెవికీలో ఆయన పేరు మాటలబాబు. అంటే సరస్వతీ పుత్రుడేనన్నమాట.

నాలుగు తెలుగు ముక్కల పసకు కాసింత పాండిత్యం కూడా కలిస్తే వాగ్విలాసమే. హనుమంతునిముందు కుప్పిగంతులా అన్నట్టు, వాగ్విలాసుల గురించి నే చెప్పడమెందుగ్గానీ, ఇదిగో ఆయన విలాసానికి మీరే వెళ్లి చూసి రండి!

తెలుగు బ్లాగావరణంలో మనకందరికీ పరిచయమున్నవారు, సంస్కృతాంధ్రభాషాజ్ఞానం కలవారు ‘లలితకవి’ బిరుదాంకితులు. వీరు వ్రాసే చురుకైన, పరిశీలనాత్మకమైన బ్లాగువ్యాసాల్లోని భాషాపుష్టి పాఠకులందరికీ విదితమే.

ఇంకో పెద్దాయనున్నాడు – ఒక సమస్యకు రెండు పద్యపూరణలు చేయడంతో రంగప్రవేశం చేసి, ‘తూగులయ్య’ తప్పతాగినా తప్పటడుగులు వేయనీయకుండా ఒంటిచేత్తో నడిపిస్తూ, ఇంకోచేత్తో ‘ఆశుపద్యాలవైపు అడుగులేయండ’ని నవ్యపద్యకారులను నడిపిస్తున్న కవిరాజర్షి విశ్వామిత్రుడు. మాట, టపా, పదము, పద్యము – ఏదైనా సరే చమత్కారాన్నీ శ్లేషనూ కలిపి ‘దంచుతూ’ వుంటాడీయన.

—————————————————————————————————————-

జాలంలో ఇలా భువన విజయం నిర్వహించాలనే ఆలోచనా, దానికి తగిన ప్రయత్నమూ, అప్పుడే పద్య సందేశాలు పంపుతున్న సభ్యుల ఉత్సాహమూ .. నాకు ఆనందాతిశయంతో నోట మాట రావటల్లేదు.

సరిగ్గా నెల రోజుల క్రితం నాతో – “ఈ పద్య కవులతో ఓ భువన విజయం నిర్వహిస్తే ఎలా ఉంటుంది?” అన్నారు పొద్దు సంపాదకులు సిముర్గ్. దిగ్గజాలవంటి వీరంతా ఒక వేదిక మీద కలిస్తే అది భువనవిజయమే అవుతుందనిపించి ప్రయత్నిస్తానన్నాను. ఏ కళకయినా, ముఖ్యంగా సాహిత్యానికి – కథ, కవిత, పాట, పద్యం – ఇట్లా ఏదైనా సరే, అభిమానించి, తమ శ్రమను వెచ్చించి, ప్రోత్సహించే కళారాధకుడిగా మనకు సుపరిచితులయిన కొత్తపాళీగారిని ఈ అభినవ భువనవిజయానికి రాయలవారిగా పట్టాభిషేకం చేయమన్న ఆలోచన సిముర్గ్ గారిదే. ఆచరణ మాత్రమే నాది. ఈ ప్రయత్నానికి వేగంగా స్పందించి, నన్ను ఉత్సాహపరచిన కవి మిత్రులకూ, ‘ఇక మీదే భారం’ అనగానే సంతోషంగా నిర్వహణ భారాన్నంతా బాధ్యతాయుతంగా మోసిన కొత్తపాళీగారికీ నేనెంతో రుణపడ్డాను. ఈయనే రాయలెందుకయ్యాడని అడగాలనిపిస్తే ఒకసారిటు చూసిరండి. బ్లాగావరణంలో పద్యకర్తల ఆవిర్భావానికి, పద్యగంగా ప్రవాహానికీ ఈయనే భగీరథుడు.

కలియుగంలో ధర్మం ఒక్క పాదంపై మాత్రమే నడుస్తూ వుండవచ్చును గానీ, ఈ ఆధునికయుగంలో తెలుగుపద్యం మాత్రం నాలుగుపాదాలా హాయిగా నడక సాగిస్తూవుంది – అనే నమ్మకం కలిగిన నవకవుల నూతన యత్నాల సమ్మేళనమే ఈ అభినవ భువనవిజయం. సభకు అధ్యక్షత వహించమని కొత్తపాళీ గారిని అభ్యర్థిస్తూ నేను పంపిన విద్యుల్లేఖ, ఆ తరువాతి ఉత్తర ప్రత్యుత్తరాలను మీ ముందుంచుతున్నాం. ఈ ప్రయత్నం ఎంత హృద్యంగా సాగిందో మీరే చూడండి.

—————————————————————————————————————-

కొత్తపాళీగారూ,
రాబోయే ఉగాది సందర్భంగా మీ ఆధ్వర్యంలో మనదైన చిరు భువనవిజయాన్ని ఏర్పాటు చేసుకుందామని మహామహులైన మన బ్లాగ్దిగ్గజాలను అడిగి సమ్మతిని పొంది మీ సమక్షానికి వస్తున్నాము. మా సంభాషణను ఒకసారి పరికించండి.
************

ప్రియమైన మిత్రదిగ్గజములారా, మీ అందరికీ రానారె నమస్కార బుల్లెట్లు. మిమ్మల్ని ఒక మాట అడుగుదామని వచ్చాను. ఉగాది వస్తోంది కదా (ఏప్రిల్ 7న), ఆ సందర్భంగా మనమంతా కలిసి ఒక చిన్న భువనవిజయాన్ని ఏర్పాటు చేద్దామని. గతంలో ఒకసారి మన బ్లాగుల్లో పద్యాల తుఫానొచ్చింది, మీకు గుర్తుండే వుంటుంది. టపాలే కాదు వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలు కూడా పద్యాలే అయినాయి. బ్లాగుల్లోని ఆనాటి వాయుగుండానికి కేంద్రం మిషిగన్‌కు కొన్ని మైళ్లదూరంలో కేంద్రీకృతమై వుండినదనే సంగతి కూడా మనకు ఎరుకే. ఔను కొత్తపాళీగారే. ఈ కొత్తదేవరాయలు గారి సారధ్యంలో మనం తలా ఒక పద్యాన్ని అల్లి ఉగాది ‘పొద్దు’న పద్యతోరణం కడదామన్నది ఆలోచన. పద్యాలు రాయగల బ్లాగుకవుల సమ్మేళనానికి మీ “సరే” కావాలి. “ఓకే” అయినా ఫరవాలేదు. పొద్దు సంపాదకులు మీ అంగీకారంతో ఈ ప్రస్తావనను రాయలవారి సముఖానికి చేర్చడానికి వేచి వున్నారు. ఏమంటారు?

************

ముందుగా గిరిగారు ఇలాస్పందించారు – “సరే. ఏదైనా ప్రత్యేకాంశం అనుకొంటున్నారా (ఉగాది కాబట్టి ఉగాది గురించో..) లేకపోతే ఎవరికి నచ్చినది వారు వ్రాయవచ్చా.”

నా జవాబు – “తొలిస్పందన ఎవరినుంచీ వస్తుందా అని ఎదురు చూస్తున్నా 🙂 నిర్వహణ ఎలాగన్నది కొత్తపాళీగారికే వదిలేద్దామని అనుకోవడం. ఆయనను అడిగేముందు మిమ్ములనందరినీ ఒకమాట అడిగి సరేననిపించుకుందామని ఈ వేగు పంపడం.”

************

వికటకవిగారు ఒక సలహా ఇచ్చారు – “రానారె, నలుగురూ ఉన్నారు కాబట్టి ఒకే అంశం అని కాకుండా ఉగాది, తెలుగుతనం, బ్లాగుల్లో తెలుగు వగైరా కాస్త పరిధి పెద్దదిగా ఉంటే నాబోటివాళ్ళకి (ఒకటి కుదరకపోతే మరొకటి పట్టుకోటానికి) కూడా కాస్త వీలుగా ఉంటుందని నా ఆలోచన. అదీగాక అందరూ ఒకే అంశంపైన పద్యాలని రాస్తే ప్రజలకు కూడా “ఒకే అంశమా” అనిపిస్తుందేమో అని మరో ఆలోచన. ఏమంటారు?”

నేనన్నాను – “అలాగే కానిద్దాం. అందరమూ పద్యాలు రాయడమే లక్ష్యం. సూచనలన్నీ రాయలవారికి చేరవేద్దాం.”

************

మహదానందాన్ని కలిగిస్తూ తాడేపల్లిగారు – “రానారె గారి ప్రతిపాదనకు నా ఒప్పుదలను తెలియజేస్తున్నాను. ఏదైనా ప్రాస్తావికాంశాన్ని ఎంపిక చేసినా సరే ! చెయ్యకపోయినా సరే !”

************

వెంటనే చదువరిగారు – “బావుంది ఆలోచన! నేను సై! ఎలా.., ఎప్పుడు? నాదో సూచన -పద్యాలు రాసి పంపించడంతో పాటు, అందరం చాటులోనో, టాకులోనో చేరి ఆశువుగా పద్యాలు చెప్పే అంశం కూడా చేర్చవచ్చునేమో! తలా ఓ పద్యమో, పాదమో చెప్పడం.. ఇలాగో మరోలాగానో!ఆలోచించండి!”

************

గిరి గారి సూచన – “తలో పాదము రాయడం చాలా మంచి ఆలోచన..ఎవరికి నచ్చిన పద్యాలు వారు రాసుకోవచ్చు కానీ ఒక గొలుసు పద్యం ఉంటే చాలా బావుంటుంది..రాఘవకి నాకు అలా రాయడం కొంచెం అలవాటు ఉంది కూడా :)”

************

శ్రీరామ్‌ రంగంలోకి దిగారు – “బ్రహ్మాండమైన ఆలోచన. నా శాయశక్తులా ప్రయత్నించగలవాడను 🙂 ”

************

రాకేశ్వరులవారు మెల్లగా కాలుమోపారు – “The chain is as strong as the weakest link అన్న మాట గుర్తుపెట్టుకుని, ఈ వీక్లింగ్/క్ కూడా సైఁ అంటున్నాడు 🙂 ”

రాకేశుని మాటలతో నేనూ జాగ్రత్తపడ్డాను – “రాకేశా, వీక్లింగ్/క్ శ్లేషను తెచ్చిపెట్టావు, ఇలాంటిదొకటి చాలదా నీవంతు పద్య(పాద)ము రక్తికట్టడానికి!? 🙂 అప్పుడెపుడో ఒక ఆటవెలది, రెండు కందాలు ప్రయత్నించి “కవి”ననిపించేస్కున్నాను గానీ నేనూ వీకువీరుణ్ణే. ప్రస్తుతానికి గిరి, వికటకవి, తాడేపల్లి, చదువరి, శ్రీరామ్, రాకేశ్వరగార్లనుంచి ఒప్పుదలలు వినిపించాయి. సంతోషం. ఊకదంపుడుగారు, రాఘవ, బ్లాగేశ్వరగారు కూడా ఔనంటారని చూస్తున్నాము.”

************

ఈ వీక్లింక్ కూడా సైఁ అంటున్నాడు … అని కందపద్యంలో చెబుతూ తరువాతెవరొచ్చారో చెప్పాలా!!? 🙂

కం.
ఊకొట్టెద సంతసముగ,
ఆకట్టుకొను ఘనసభకు ఆహ్వానింపన్
ఊకెక్కడ దంపమనిన
నాకేమిలె, ముందునిలువ నలుగురు శ్రేష్టుల్!!!

ఆయన్ను చూసి, నేనూ గురువులూ, లఘువులూ, గణాలూ లెక్కపెట్టుకుంటూ అన్నాను – “అదీ మొనగాడు! ఊకదంపుడుగారూ, మీ ప్రవేశంతోనే మన భువనవిజయానికి ఒక ఊపు తెచ్చారు.

కం.
ఊకయను పేరె గానీ
కేక! తమరి చతురత గని, క్షేపము గొని, నే
నూ కందము వ్రాసితి మరి
రాకయె పోవునా విలసిత రాఘవు డింకన్!?

వాగ్విలాసులు రాఘవుల వాక్కులకై ఎదురు చూస్తూ

ఒక శబరుడు, [:-)]
–రానారె”

************

నా గణాల లెక్క పూర్తయ్యీకాకనే – రాఘవగారు – “మిత్రులారా, బాగు బాగు… నా “సరే” కూడా జేర్చి తిరిగి లెక్కపెట్టవలసినది. గిరిగారన్నట్టుగా పద్యపూరణంజేస్తే వొకే పద్యంమీద మాటముద్రలందరివీ పడతాయి కదా. యోచన బాగానే వున్నట్టనిపిస్తోంది, యెంతమటుక్కు కుదురుతుందో జూడాలి. అన్నట్టు వికటకవులకు వొక ప్రత్యేకాంశమంటూ వుంటుందా యెక్కడైనా? మీరసలే టకటకవులాయె.

బాగుంది! నేనొక్ఖడినేనా పద్యం వ్రాయనిది 😛 కాస్కోండి మరి — (అంటూ ఈ కందశంఖం పూరించారు)

కం.శ్రీద్యుమణివంశజు దలచి
ఖద్యోతనసమప్రకాశ కవిగణమునకున్
పాద్యమునీయుచు విడచిన
పద్యాస్త్రమ్మిదె సరసుల పద్యరణముకై. “

************

రాఘవగారి ప్రశ్నకు వికటకవుల జవాబు – ” 🙂 ఈ సాఫ్టువేరు విభాగంలో పడి ప్రతి పనికీ “ఇది పనిచేయకపోతే, మరో మార్గమేమిటీ” అనుకుంటూ ఓ బ్యాకప్ ప్లానుకి అలవాటుపడిపోయాం. నిజానికి సొంత ఆలోచనకంటే, ఫలానా దానికి రాయవయ్యా అంటేనే ఓ సవాలుగా రాయవచ్చునేమో. కానీ ముందు చెప్పినట్లుగా “అలా అలవాటుపడిపోయామండీ. ***ఏమాటకామాటే, నేను మరో బలహీనపు లంకెని.” (అంటూ ఈయనా జాగ్రత్తపడ్డారు:-))

రాఘవగారన్నారు – “అలాగైతే వికటకవీశా మీకు నచ్చిన (యేదో వొక) విషయం మీదనే వ్రాయొచ్చు గదా… మీరు జెప్పేదేదైనా మాకు సమ్మతమే 🙂 బ్లాగేశ మీయొక్క అంగీకృతివినని భువనవిజయమెట్లు పూర్తియగును?”

************

ఆ ప్రకారంగా (బ్లాగేశ్వరులవారిని మాట్లాడించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే వుండగా) అందరం మీ ఆస్థానానికి వచ్చాం. ఇక నిర్వహణభారం మీదే!

భవదీయులైన
బ్లాగుదిగ్గజములు మరియు వారి మిత్రుడు.

—————————————————————————————————————-

కొత్తపాళీగారినుండి అంగీకారం వచ్చేలోపు, తాడేపల్లిగారు పంపిన ఆణిముత్యాల్లాంటి ఈ రెండు పద్యాలు చూడండి.

చll
కలమును వాడిఖడ్గముగ కై ధరియించి కవిత్వయుద్ధమున్
సలుపుట కెందఱో సుకవి సత్తములిక్కడ సిద్ధమైరహో !
గెలుపులు మాత్రమందఱివి ; కేవలయుద్ధములట్టులౌనె ? యీ
తొలి కవితాసదస్సు మన తోడి జనావళిఁ బ్రోత్సహించుతన్.
కంll
అందఱమున్ గృహకవులమె ;
కొందఱును సభాకవిత్వ కోవిదు లిఁట లే ;
రందువలన వగపు వలదు ;
చెందింతము రక్తి మనదు శక్తి కొలఁదిగాన్.

“సుకవిసత్తములిక్కడ సిద్దమైరహో!” అని ప్రకటిస్తూ, “అందరినీ గెలిపించే యుద్దమిది. ఇలాంటియుద్ధం మరొకటేదయినా వుందా!?” అని దీని వైశిష్ట్యాన్ని చాటుతూ, “వగపు వలదు … చెందింతము రక్తి మనదు శక్తి కొలఁదిగాన్” అనే మాటలతో శక్తినీ ఉత్సాహాన్ని నింపారు.

—————————————————————————————————————-

అంతలో కొత్తపాళీ గారి నుండి అంగీకారం అందింది, “ఔత్సాహిక తెలుగు కవిసంఘానికి అభివాదములు, అభినందనలు. జాలంలో ఇలా భువన విజయం నిర్వహించాలనే ఆలోచనా, దానికి తగిన ప్రయత్నమూ, అప్పుడే పద్య సందేశాలు పంపుతున్న సభ్యుల ఉత్సాహమూ .. నాకు ఆనందాతిశయంతో నోట మాట రావటల్లేదు. వయసులో, జ్ఞానంలో, ప్రతిభలో నాకంటే అధికులెందరో ఉండి, ఈ సభకి నన్ను అధ్యక్షత వహించమండం నిజంగా నా అదృష్టం. దీన్ని తెలుగు భారతి ఆజ్ఞగా వినమ్రంగా శిరసావహిస్తున్నాను.” … అంటూ నిర్వహణకు సంబంధించి తమ ప్రణాళికను ప్రకటించారు. ఆ ప్రణాళిక ప్రకారం మార్చినెల రెండవ ఆదివారం అందరూ తమ తమ పూరణలతో సిద్ధమై సమావేశం కావాలని నిర్ణయించడం జరిగింది. కవులంతా అన్ని సమస్యలు, దత్తపదులు, దత్తాంశములనూ ప్రయత్నించనవసరం లేదు. తమకు నచ్చిన వాటిని పరిష్కరించవచ్చు.

సభాప్రాంగణం? ఇంకెక్కడ, వీవెన్ నిర్మించిన కూడలిలోనే. అభినవ భువనవిజయం కోసం ప్రత్యేకంగా నిర్మించిన సాహిత్య మండపంలో. ఈ సందర్భంగా వీవెన్‌కు మా అందరి తరఫున మరియు, ‘పొద్దు’ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.

ఆహూతులైన ముఖ్య అతిథులుగా సాలభంజికల భోజరాజు నాగరాజుగారి చేరికతో ఆద్యంతమూ చతుర సంభాషణలతో, మార్చి 16న విజయవంతంగా నిర్వహింపబడిన భువనవిజయాన్ని వీలైనంత యథాతథంగా మీ ముందుకు తెస్తున్నాం – ఏప్రిల్ 7, సర్వధారి ఉగాది నాడే!

————-

రానారె పొద్దు సంపాదకవర్గ సభ్యుడు, పద్య కవి. అభినవ భువన విజయంలో పాల్గొన్న కవులలో ఒకరు. ‘భట్టు’పల్లికి చెందిన రానారె భట్టుమూర్తిగా ఈ కవిసమ్మేళనంలో పాల్గొన్నారు.

This entry was posted in కవిత్వం and tagged , , . Bookmark the permalink.

6 Responses to అభినవ భువనవిజయము – అంతర్జాలములో అపూర్వ కవిసమ్మేళనము

  1. అవును. నాదో సందేహం. రాయలవారి భువన విజయానికి , visitors and women not allowed అన్న రూలేమన్నా ఉందా??
    మాకు ఒక ఆహ్వానం పడేస్తే , గమ్మున ఓ మూల కూర్చుని వినేవాళ్ళం (చూసేవాళ్ళం) కదా .. పూల దండలో దారానికి కూడా తావి అబ్బినట్టు, మాకు కాస్త కవిత అనే వాసన అంటుకుని ఎదో వంటలో, చీరలో, ఎదీ కాకుంటే మా వారి మీదో కనీసం రెండు లైన్ల కవితలన్నా రాసుకునే అదృష్టం కలిగేది కదా??ప్చ్..

  2. malathi n. says:

    బాగా చెప్పారు జ్యోతిగారూ,
    విని ఆనందించడానికి సిద్ధంగా వున్న, కొండోకచో శభాసు శబాసంటూ హుషారివ్వగల చూపరులని కూడా లెక్కలోకి తీసుకోవాలన్న మీప్రతిపాదనని సమర్థిస్తున్నాను.

  3. కామేశ్వర రావు says:

    అంతర్జాలమునందు పద్యకవితాహ్లాదమ్ము గూర్పంగ మీ
    రంతా పాల్గొని కొత్తరాయల ప్రశస్తాధ్వర్యమం”దా.భు.వి.”న్
    వింతౌరీతిన జేసిరా భళిభళీ! వేడ్కన్ విశేషమ్ములా
    ద్యంతమ్మారయ వేచిచూతు నవవర్షారంభ ప్రాక్సంధ్యకై

    ఆ.భు.వి – ఆధునిక భువన విజయం

  4. జ్యోతి గారూ, మాలతి గారూ,
    నిర్వహణ, ఎడిటింగ్, కూడలి కబుర్ల అప్లికేషన్ సామర్థ్యం తదితర సాంకేతిక ఇబ్బందులవల్ల వీక్షకులు లేకుండానే కవిసమ్మేళనం జరపవలసి వచ్చినందుకు మాకూ బాధగానే వుంది. ముందు ముందు జరపబోయే సమ్మేళనాల్లో ఈ విషయాలను పరిశీలనలో ఉంచుకుంటాం.

  5. Posted for Sri M.V. Subbarao

    భువనవిజయం పద్యాలు చదివాను. చాల బాగున్నాయి. ఆందులో ఒకటి ‘కలమును వాడి ఖడ్గముగ…’ చదివినప్పుదు వెంటనే ‘కులమును వాడి ఖడ్గముగ…’ (వాడి= పదునైన)అని పేరడీ స్ఫురించింది ఇప్పుడు చాలామంది వాడుతున్నారు గదా !

  6. yasapala says:

    సుబ్బారావుగారూ, ఐడియా భలేగా వుంది. పేరడీని పూర్తిగా వినిపించండి సార్ 🙂

Comments are closed.