సంగీత సాహిత్యాలలో అపారమైన పరిజ్ఞానమున వారిలో తెలుగుబ్లాగులు రాస్తున్నవారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన బ్లాగరి కొత్తపాళీ. ఈసారి కథ-2005 వార్షిక కథాసంకలనంపై ఆయన రాసిన సమీక్షను సమర్పిస్తున్నాం. అలాగే స్వాతికుమారి వేసవి విశేషాలు, సరదా శీర్షికలో జ్యోతిగారి కనబడుట లేదు ప్రకటన చూడగలరు.

గడి గురించి ఒకమాటః గతనెల కంటే ఈసారి గడికి మంచి స్పందన లభించింది. గడిని ప్రకటించిన కొద్ది గంటల్లోనే దాదాపు పూర్తిగా నింపి పంపారు సత్యసాయిగారు. ఇప్పటికే మరికొన్ని సమాధానాలు అందడాన్ని బట్టి చూస్తే పొద్దు పాఠకులు అందిస్తే అల్లుకుపోగల సమర్థులని నిరూపితమైంది. గడిని పూరించినవాళ్ళు ఆ గడిలో తమకు బాగా నచ్చిన ఆధారాలకు వివరణలను పంపితే సమాధానాలతో బాటు ప్రచురించగలం. అలాగే ప్రస్తుతమున్న రీతిలో గడి పూరించడం కష్టమని మీరు భావిస్తున్నట్లైతే సులువైన ఆధారాలతో ఇంకో గడిని అందించడానికి ప్రయత్నిస్తాం. మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.

-పొద్దు

Posted in ఇతరత్రా | 3 Comments

కనబడుట లేదు

jyothi.bmpఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. వీర వెంకట అలమేలు మంగతాయారు దీక్షితులు గారి భర్త మీకెక్కడైనా కనిపిస్తే వాళ్ళావిడకు తెలియజేయడం మాత్రం మరవకండేం?

——————–

కనబడుట లేదు

అందరికీ నమస్కారం. నాదొక విన్నపం. గత వారం రోజులనుండి మా శ్రీవారు కనబడటం లేదు. గొడవేం లేదండి. పత్రికలలో ప్రకటన చూసి వారి ‘బట్ట తలపై హృతిక్‌రోషన్‌లా జుట్టు మొలిపించుకోండి’ అని, ఇంకా అదేదో సినిమా చూసి ‘నాకూ ఆదివారం సెలవు కావాలి’ అని అన్నా అంతే. కోపంతో ధుమధుమలాడుతూ వెళ్ళిపోయారు. ఇలా అడగడం తప్పా చెప్పండి? రెండ్రోజుల్లో తిరిగొస్తారులే అని ఊరుకున్నా. ఎక్కడికెళ్ళారో ఆచూకీ తెలీటంలేదు.ఆయన పేరా? అమ్మో భర్త పేరు ఎలా చెబుతారండి? పాపం కాదూ? ఆయన ఫోటో సరియైనది లేకపోవడంవల్ల ఆయనకు సంబంధించిన వివరాలు ఇస్తున్నాను.

* ఇంట్లో ఎప్పుడూ సీరియస్‌గా ఉన్నా, బయటికెళ్తే మాత్రం అందరితో సరదాగా జోకులేస్తూ,నవ్విస్తూ, నవ్వుతూ ఉంటారు. ఎంటో మరి?

* ఎప్పుడైనా వంట బాగాలేకపోతే కోపంతో చిందులు తొక్కుతారు. బాగుంటే మాత్రం ‘బాగుంది’ అనరు. కామ్‌గా తినేసి వెళ్ళిపోతారు.

* నా పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటివి ఆయనకు గుర్తుండవు. పనిపాటాలేని నాలాంటివారే ‘సెంటిమెంటల్ ఫూల్స్’ గా ఉంటారని ఆయన అభిప్రాయం.

* స్నేహితులతో ఎన్ని గంటలైనా సరదాగా మాట్లాడగలరు, భార్యతో మాత్రం పదినిమిషాలు మాట్లాడటానికి టైం లేనంత బిజీ మనిషి.

* నీకీ చీర బావుంది, నువ్వంటే ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉన్నావు లాంటి అనవసరపు మాటలంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు.

* నేను చేసిన పలావ్ నచ్చదు కాని పక్కింటోళ్ళు ఇచ్చిన పచ్చగడ్డి పచ్చడి మాత్రం పరమాన్నంలా మిగల్చకుండా తినేస్తారు.

* కష్టపడి పది రూపాయలు సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ ఇంట్లో తిని కూర్చుని, ఇరుగు పొరుగు అమ్మలక్కలతో సొల్లు కబుర్లేసుకునేవారికి ఏం తెలుస్తుంది లాంటి డైలాగులు రోజుకొకసారైనా అంటుంటారు.

* మొత్తం మీద “తినడానికి”… “పడుకోవడానికి” మాత్రమే ఇల్లు ఉన్నది అన్నట్టు ప్రవర్తిస్తారు.

పై లక్షణాలున్న వ్యక్తి కనబడితే పట్టుకొచ్చి నాకు అప్పచెప్పండి. ప్లీజ్. మీకు రానుపోనూ ఆటో కాని బస్ చార్జీలు కాని ఇస్తాను.

ఇట్లు

వీర వెంకట అలమేలు మంగతాయారు దీక్షితులు

హైదరాబాదు

– జ్యోతి వలబోజు (http://vjyothi.wordpress.com)
Posted in వ్యాసం | Tagged | 18 Comments

నా వేసవి విశేషాలు

swathi.bmp“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అనే స్వాతికుమారి బ్లాగు కల్హార ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. స్వాతికుమారి ఈసారి తన వేసవిజ్ఞాపకాలు మీతో పంచుకుంటున్నారు:

————-

చూస్తుండగానే వేసవి మళ్ళీ వచ్చేసింది.

నవ వసంతం చైత్రానికి మావి చిగురు తాంబూలం అందించి
తానున్నంత సేపూ కోకిలమ్మ తో కబుర్ల కచేరీ చేయించి
కొద్దిగా ఎండ చురుక్కుమనగానే గుబురు వేపాకుల పందిరి వేసి
సాయంత్రమవుతుంటే మలయ సమీరాల వింజామరలు వీచి
మాపటి వేళ మరుమల్లె సుగంధాల అత్తరు నిద్రని కానుకిచ్చి
ఇలా మనకి వేసవి ని వదిలి వెళ్ళబోతుంది.

వైశాఖమంటే మండే ఎండలు, చల్లని నీళ్ళు.
పల్లెటూళ్ళలో కొత్తావకాయ పచ్చళ్ళు,తాటాకు పందిళ్ళు, పెళ్ళి సందళ్ళు.
పిల్లలకైతే వేసవి సెలవలు, అమ్మమ్మల వూళ్ళు, కొత్త ఆటలు, స్నేహాలు.
ఎండల్లో ఆడొద్దని, వడదెబ్బని అమ్మ చెప్తే అది తమని మోసం చెయ్యటానికి
చెప్పే అబద్ధమని గట్టి నమ్మకం తో రెట్టించిన ఉత్సాహం తో వీధుల్లోకి
పరుగులు.

ఇక సిటీల్లో ఐతే సమ్మర్ కాంప్ లు, ఎగ్జిబిషన్ లు.
మొత్తం మీద చివరికి ఏ మార్పూ లేనిది మాత్రం కంప్యూటర్ పక్షులకి
ప్రాజెక్ట్ లూ, చావు గీతలు( deadline లు లెండి) వీటిల్లో ఏం తేడా లేదు.
బాధ్యత పెరిగేది మాత్రం ఎంట్రన్సు సెట్లు రాసే నిమ్మిత్తం తెగ రుద్దబడే
రేపటి పౌరుల మీదే.

నా మటుకు నాకు కొన్నేళ్ళ క్రితం వరకు(ఉద్యోగమూ, వివాహమూ కాకముందనమాట)
ఎండాకాలం అంటే మనసు నిండే కాలం.
సరికొత్త ప్రేమ లో ఒక రోజు విరహం తరువాత ప్రియ సఖి ని కలవబోయే చెలికాడి
మనః స్థితి లా ఉండేది సంవత్సరాంత పరిక్షలు రాస్తున్నన్ని రోజులూ. ఆఖరి
పరిక్ష పూర్తయిన మరుక్షణం ఆఘ మేఘాలు, వురుకులు పరుగులు ఈ రెంటిలొ ఏది
ముందైతే దాని మీద సర్వోత్తమ గ్రంధాలయానికో, ఇంట్లోని పుస్తకాల అరకో
చేరేవరకి స్థిమితం దొరకదు. విజయవాడ లో ఉన్న కారణం గా ప్రతీ ఆంగ్ల
సంవత్సరాది కి పుస్తక ప్రదర్శన లో కొన్న పుస్తకాలన్నీ
తమ మౌన తపో భంగం కోసం ట్రంకు పెట్టె లో ఎదురు చూస్తూ ఉండేవి మరి.

కొత్తవాసన తో పొందికగా పేజీ ల అమరిక లో సర్దుకుని కూర్చున్న పుస్తకాన్ని
మొదటిసారి తెరిచి చూసే ఆనందానికి సాటేది. ముందుగా కొన్ని రోజులు గుబురు
మీసాల గురజాడ తాత మాటలన్ని విని పెద్దాయన్ని పంపించెయ్యగానే ఏ కొంటె
రామలింగడొ, బీర్బలో ఎక్కడ తెలివిగా మాటనేస్తారో అని వాళ్ళ కధలోసారి
ఆలకించి కొద్దిగా నిద్ర లోకి జారుకుంటే ఒక గబ్బిలపు కవితా రొద తో మళ్ళీ
అక్షరాల మెలకువ.

పెద్దన పెద్దరికాన్ని చూసి కొద్దిగా బిడియ పడినా, యండమూరి కాల్పనికాన్ని
తీవ్రంగా ఆరాధించినా, చలం కలం ధాటి కి అయోమయపడినా, శ్రిశ్రీ ని తిలక్ ని
పుస్తక స్నేహితులు గా పొందినా దీనంతటికీ కారణం తను చిరిగిన చొక్కా
వేసుకున్నా నేను కోరిన పుసకాన్ని కొనిచ్చి “నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ
విద్యతే” అని చెప్పిన నాన్న చలవే.

స్వాతికుమారి (http://swathikumari.wordpress.com)

Posted in వ్యాసం | 12 Comments

కథ 2005 సమీక్ష

సాహిత్య సంగీతాలని అభిమానించే కొత్తపాళీ సాంప్రదాయ తెలుగు సాహిత్యాన్ని యువతరానికి పరిచయం చేసే ఉద్దేశంతో Classical Poetry (http://telpoettrans.blogspot.com) బ్లాగుని మొదలు పెట్టారు. యువబ్లాగరుల ఉత్సాహం ఇచ్చిన ఉత్తేజంతో సాహిత్య, సంగీత, చలనచిత్రాల చర్చ కోసం విన్నవీ కన్నవీ (http://vinnakanna.blogspot.com) బ్లాగునీ, ఇతర చర్చల కోసం కొత్తపాళీ (http://kottapali.blogspot.com) బ్లాగునీ నిర్వహిస్తున్నారు.

————

ఆంధ్రులు ఆరంభ శూరులు అని ఒక అపవాదు. కథాసాహితి వాళ్ళ పట్టుదల ఈ అపవాదుని వమ్ము చేస్తుంది. తెలుగులో సృజనాత్మక సాహిత్య ప్రచురణ ఏ మాత్రం లాభసాటి కాకుండా పోయిన ప్రతికూల వాతావరణంలో పదహారేళ్ళ పాటు క్రమం తప్పకుండా, ప్రచురణ విలువల్లో రాజీపడకుండా ప్రతి ఏడాదీ ఒక ఉత్తమ కథల సంకలనం తీసుకురావటం నిజంగా గొప్ప విషయం. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ ఈ కథారథ చోదకులు.

ఏమైనా, చిన్నప్పుడు నెలనెలా చందమామ కోసం చూసినట్టు ఇప్పుడు ప్రతి ఏడూ కథాసాహితి వాళ్ళ సంకలనం కోసం ఎదురు చూడ్డం, పుస్తకం చేతికి అందగానే అందులో ఎవరెవరి కథలున్నాయో ఆత్రంగా చూసేసి, ఆ తరవాత ఒక్కో కథా – చందమామ చదివినట్టే ప్రచురించిన వరుసలో కాకుండా – నింపాదిగా ఒక నెలరోజులపాటైనా ఆస్వాదించటం నాకు అలవాటైపోయింది.

నిజం చెప్పొద్దూ, ఈ 2005 సంకలనాన్ని నేను కొంచెం భయం భయంగానే అందుకున్నా. 2003, 2004 సంవత్సరాల సంకలనాలు చదివినప్పుడు అసలు తెలుగు కథంటేనే నీరసం పుట్టింది. ఈ సంకలనాల మీద కోపమొచ్చింది, ఇన్ని వందల కథలు ప్రచురితమవుతుంటే వీళ్ళకి ఇంతకంటే మంచి కథలు దొరకలేదా అని. ఆ భయమూ కోపమూ ఎగిరి చక్కా పోయాయి కథ 2005 చదవగానే. హమ్మయ్య, పర్లేదు, మంచి తెలుగు కథలింకా పుడుతున్నయ్యి అని ఒక ధైర్యమొచ్చింది మళ్ళీ.

కథ 2005 లో పదమూడు కథలున్నాయి. అన్ని కథలూ నాకు నచ్చాయి కొంచెమెచ్చు తగ్గుగా. ఒక్కొక్క కథనీ లోతుగా విశ్లేషించాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ఇది సమీక్షే కాని విమర్శ కాదు గనక కొన్ని కథల్ని మాత్రం స్థాలీపులాక న్యాయంగా రుచి చూపిస్తాను.

నా ఉద్దేశంలో ఈ సంకలనానికి తలమానికం వివినమూర్తిగారి “జ్ఞాతం”. కులాంతర వివాహం చేసుకున్న మోహన్ – వసుధ దంపతుల ఒక్కగానొక్క కొడుకు సుమన్ బెంగుళూరు ఐటీ రంగంలో పని చేస్తూ సహోద్యోగి సౌమ్యని ప్రేమించాడు. సాంప్రదాయ కుటుంబం నించి వచ్చిన సౌమ్యకి తనకేం కావాలో బాగా తెలుసు. ఈ పెళ్ళి జరుగుతుందా? ఈ పెళ్ళి జరగాలంటే ఎవరు దేన్ని త్యాగం చెయ్యాలి? ఎవరు ఎన్ని మెట్లు దిగి రావాలి? క్రితం తరం వారి ఆదర్శాలు ఈ తరం యువతకి అర్థం లేని, అర్థం కాని అనవసరపు త్యాగాలా? సంక్లిష్టమైన కథా వస్తువు చెయ్యి తిరిగిన రచయిత చేతిలో తీగలా సాగి వలలాగా అల్లుకుంటుంది. రచయిత మన చెయ్యి పట్టుకుని మెలికలు తిరిగే దార్ల వెంబడి మనల్ని ఒడుపుగా నడిపిస్తారు. యుక్తిగా అల్లిన సన్నివేశాలు సజీవమైన పాత్రల నిర్దిష్టమైన వ్యక్తిత్వాల్ని ఆవిష్కరిస్తాయి. చదవటం సుళువుగా జరిగిపోతుంది. చూస్తుండగానే కథ చివరికొచ్చేస్తాం. కానీ ఏం జరిగిందో అర్థం చేసుకోవటానికి కథంతా మళ్ళీ చదవాల్సిందే.

ఇంకొక ఎన్నదగిన కథ ఖదీర్ బాబు (మన బ్లాగరులు అభిమానించే దర్గామిట్ట కతల రచయిత) రచన “కింద నేల ఉంది”. ముందే చెబుతున్నా – ఈ కథ దర్గామిట్ట కతల్లాగా ఉండదు. అనేక రకాలుగా తన అస్తిత్వాన్ని కోల్పోయిన ఒక తల్లి తన ఒక్కగానొక్క కొడుకైనా మనిషిగా బతకాలని తాపత్రయ పడి ఆ అస్తిత్వపు మూలాలకోసం వెతకడం ముఖ్య కథాంశం. ‘నేల విడిచి సాము చెయ్యటం’ అని మనలో వాడుక – మూలాలు మరిచి పోవద్దు అని అదొక సున్నితమైన హెచ్చరిక. మన మూలాలు నేలలోనే ఉన్నయ్యి అని కథ పేరుతోనే సూచించిన రచయిత వర్తమాన జీవితంలో ఎన్ని విధాల మనం ఆ మూలాలకి దూరమవుతున్నామో కథలో పాత్రల ద్వారా సహజంగా, సమర్ధవంతంగా చెప్పించారు. కథకుడు జరుగుతున్న కథలో లీనం కాకుండా ఒక సాక్షిలాగా కథ చెప్పటంతో మనమొక డాక్యుమెంటరీ చూస్తున్నట్టు ఉంటుంది.

వర్ధమాన రచయిత సుంకోజి దేవేంద్రాచారి కథ “కొమ్మిపూలు” ఒక్క తాపుతో మనల్ని బాల్యపు బూరెల బుట్టలో పడేస్తుంది. ఈ బూరెలకి పిండి అయినవారి ఆప్యాయతలూ, పల్లెల్లో మాత్రమే వికసించే ప్రకృతి అందాలు అయితే బెల్లపు పాకంలా ఈ బూరెల్ని పట్టి ఉంచేది తియ్యటి చిత్తూరు మాండలికం. ఆ తీపి, ఆ రుచి అనుభవైక వేద్యం, మీరే రుచి చూడండి – ఇంతకంటే నేనేం చెప్పలేను.

భారత యుద్ధంలో పాండవులూ, వాళ్ళ ఒక్కగానొక్క మనవడూ తప్ప మిగిలిన వాళ్ళంతా చచ్చారు కాబట్టి పీడా వొదిలింది. ఏ కౌరవుల సామంతుల కొడుకో మిగిలి ఉన్నాడనుకోండి – ఏమై ఉండేది? తండ్రి తనది కాని యుద్ధంలో వీరస్వర్గ మలంకరించాడు. విధవరాలైన తల్లిని లోకం వీరపత్ని అని కీర్తిస్తుంది. అయినవాళ్ళు ఆ కీర్తనని అందుకుని ఇక వీరమాతవు కూడా కావాలె .. నీ కొడుకుని వీరుణ్ణి చెయ్యి అని ఊదర కొడతారు. ఇకా ఆ వీర వలయం అలా అవిఛ్ఛిన్నంగా సాగుతుంటుంది. ఆ వలయంలో చిక్కుకున్న వాళ్ళకి వీరులనే కీర్తి తప్ప విముక్తి లేదు, గెలుపు అంతకంటే లేదు. ఈ విష వలయాన్ని ఛేదించిన ఒక వీర వనిత కథ “వీరనారి”. త్రివిక్రమ్ బ్లాగుటపాల్లో కవిగా, కథకుడిగా మనకి చిరపరిచితుడైన సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ కథ రాశారు. బతుకుని నిలబెట్టేదే నిజమైన వీర గుణమని కొత్త నిర్వచనమిచ్చే వీరనారిని సృష్టించి ఫాక్షనిస్టు మారణ ఝంఝామారుతానికి చేతులడ్డు పెట్టి జీవనజ్యోతిని వెలిగించారు రచయిత.

రావి శాస్త్రిని గుర్తుచేసే పదునైన వ్యంగ్యం సువర్ణముఖి రాసిన “పరమవీరచక్ర”లో, రాయిగా రూపాంతరం చెందుతున్న టీవీ రిపోర్టర్ల మనసుల మీద ఫోకస్ మునిసురేష్ పిళ్ళె రాసిన “రాతి తయారి”లో, మంచి చెడులను ఆలోచించనివ్వని యవ్వనపు ఉధృతం వారణాసి నాగలక్ష్మి రచన “ఆసరా”లో కనిపిస్తాయి. కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం (జాన్సన్ చోరగుడి), బైపాస్ రైడర్స్ (బాషా. జి.), బతికి చెడిన దేశం (అట్టాడ అప్పల్నాయుడు), నెమలినార (బి. మురళీధర్), బృంద (కాశీభట్ల వేణుగోపాల్), రెండంచుల కత్తి (కె.ఎన్. మల్లీశ్వరి) ఈ సంకలనంలోని ఇతర కథలు. వస్తువులో మంచి విస్తృతి కనబడుతోంది – పల్లెల్లో మనుగడ, మహానగరాల్లో యాంత్రిక జీవనం, అస్తిత్వాల కోసం వెతుకులాట, పెనుగులాట, ఇలా. కథ చెప్పే పద్ధతులూ విలక్షణంగా ఉన్నై, విశ్లేషణాత్మకంగా కొన్ని, సాక్షీభూతంగా కొన్ని, వ్యంగ్య వైభవంతో కొన్ని. కథల, పాత్రల దృక్కోణాల్లోనూ తగినంత వైశాల్యముంది. ఇక భాషలో బోలెడు వైవిధ్యముంది – అటు సువర్ణముఖి గారి శీకాకోళం నించీ ఇటు సుంకోజి గారి చిత్తూరు దాకా.

“కథాశిల్పం” రచనకి కేంద్ర సాహిత్య ఎకాడెమీ పురస్కారం అందుకున్న ప్రముఖ రచయిత, విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారి వ్యాసం “రాయలసీమలో కథా విస్తరణ” ఈ సంకలనానికి కొసమెరుపు. మొత్తమ్మీద తెలుగు కథనీ, ప్రత్యేకించి రాయలసీమ కథనీ సన్నిహితంగా ఎరిగిన పండితులు శ్రీ వల్లంపాటి. చారిత్రక నేపథ్యాన్ని తీర్మానించి, వివిధ రాజకీయ సామాజిక పరిస్థితులలో సీమలో ఏ కథకులు ఎలాంటి కథలు రాశారో స్థూలంగా చర్చించారు. ఎవరైనా సాహిత్య విద్యార్థులు రాయలసీమ కథలని లోతుగా పరిశోధించ దల్చుకుంటే ఈ వ్యాసాన్ని మొదటి మెట్టుగా వాడుకోవచ్చు. శ్రీ వల్లంపాటి ఈ సంవత్సరారంభంలో కన్ను మూశారు. తెలుగు కథాప్రియులకు ఈ వ్యాసమే వారిచ్చిన చివరి బహుమతి కావచ్చు.

కథా సాహితి వారి దృఢ సంకల్పానికి కొన్ని సంవత్సరాలుగా ఆర్ధిక బలం చేకూర్చటం తెలుగు ఎసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) వారు చేస్తున్న ఒక మంచి పని. ప్రతి కథతో పాటు రచయిత ఛాయాచిత్రం, చిన్న పరిచయం, చిరునామా, కథ మొదటి ప్రచురణ వివరాలు ఇవ్వటం బాగుంది. ఆదివారం వార్త, ఆదివారం ఆంధ్రజ్యోతి, రచన లంటి ఆంధ్రదేశ పత్రికలతో పాటు అంతర్జాల అమెరికా పత్రికలు (సుజనరంజని, తెలుగు నాడి), సావనీర్లు (తెలుగు పలుకు 2005 తానా సావనీర్) ఈ కథలకి మూలస్థానాలు కావటం తెలుగు కథల విస్తృతినీ సంపాదకుల శోధనా పరిధి విశాలమవటాన్ని సూచిస్తోంది. బ్లాగుల ఆగమనంతో మంచి కథలకోసం అంతర్జాలాన్ని విశాలంగా శోధించాల్సిన బాధ్యత ఇంకా పెరుగుతుంది సంపాదకులకి రానున్న సంవత్సరాల్లో.

ఈ పుస్తకం ఇక్కడ దొరుకుతుందిః http://www.avkf.org/BookLink/view_titles.php?cat_id=4996

కొత్తపాళీ(http://kottapali.blogspot.com/)
Posted in వ్యాసం | Tagged | 6 Comments

గడి మీద గడి, ఆత్మకథా విహారి

గడిని ఆదరించిన మీకందరికీ ధన్యవాదాలు. వెబ్ లో తొలి తెలుగు గళ్ళనుడికట్టు ప్రయత్నం విజయవంతమైంది. ప్రజాదరణకు మించిన విజయం ఏ ప్రయత్నానికైనా ఏముంటుంది చెప్పండి! పూర్తిగా సరైన సమాధానాలు పంపిన వారు లేకున్నప్పటికీ చాలా దగ్గరగా వచ్చిన వారున్నారు. ప్రశ్నాపత్రం కూర్చిన వారి కంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసినవారే ఘటికులన్న విషయాన్ని మేం మరువం. పూర్తి చేసి పంపినవారికీ, దాదాపు పూర్తి చేసినా పంపనివారికి -అందరికీ మా అభినందనలు! ఇకనుండి కొంత వరకు పూర్తి చేసినా పంపగలిగే వీలును కలుగజేస్తున్నాం. ఒక్కొక్కరు ఎన్ని సార్లైనా గడిని పంపవచ్చు. చిట్టచివరగా మాకందిన పరిష్కారాన్ని పరిగణన లోకి తీసుకుంటాం.

గత గడికి పరిష్కారాన్ని, పరిష్కర్తల పేర్లనూ ఇచ్చాం. వాటితోపాటు సమాధానాలకు వివరణ కూడా జతచేసాం. నుడికట్టుతో పరిచయం లేనివారికి, దాన్ని పూరించడం లోని కిటుకులు తెలియని వారికి ఇది ప్రయోజనకరంగా ఉండి, గడి పూరణకై వారిని ప్రేరేపిస్తుంది అని మా నమ్మకం. మొదటి గడి దాటి రెండో గడి లోకి ప్రవేశిస్తూ ఏప్రిల్ నెల గడిని సమర్పిస్తున్నాం.

ఈ నెల మా అతిథి – బ్లాగు విహాయస విహారి, దోనిపర్తి భూపతి విహారి. చక్కటి హాస్యాన్ని రాస్తారాయన. కొలరాడో తెలుగు సంఘంలో సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బుడిబుడి అడుగుల నుండి వడివడి నడకల దాకా తన బ్లాగు ప్రస్థానం ఎలా సాగిందో చెబుతున్నారాయన. అలా ప్రతి ఒక్కరూ తాము బ్లాగులెలా మొదలెట్టామో రాసుకుంటూ పోతే తెలుగు బ్లాగు చరిత్ర తయారై పోతుంది.

త్వరలో మరిన్ని కొత్త వ్యాసాలతో వస్తాం. అంతవరకూ అతిథిని పలకరించి గడినో పట్టు పట్టండి. ఈ నెల ఓ కొత్త ప్రయోగం చేసి, మీముందుకు తీసుకు రానున్నాం. ప్రస్తుతం దానిపైనే పని చేస్తున్నాం.

Posted in ఇతరత్రా | Comments Off on గడి మీద గడి, ఆత్మకథా విహారి

ఏప్రిల్ గడిపై మీ మాట

ఏప్రిల్ గడి గురించి మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 29 Comments

మార్చి గడి సమాధానాలు – వివరణ

ముందుమాట:

తెలుగులో గతంలో ఆరుద్ర, శ్రీశ్రీ లాంటి మహామహులు గళ్ళనుడికట్లు తయారుచేసేవాళ్ళు. అవి కట్టుదిట్టంగా, చాలా చమత్కారాలతో నిండి ఉండేవి. ఆ స్థాయిలో తయారుచేసేవాళ్ళు లేకనో, పత్రికల అనాదరం వల్లో తర్వాత ఆ తరహా గళ్ళనుడికట్లు కనుమరుగైపోయాయి. ఒక్క రచన పత్రికలో మాత్రం దాదాపు పదేళ్ళ కిందట నేను ఆ పత్రిక చదవడం మొదలుపెట్టినప్పుడు ఆరుద్ర, శ్రీశ్రీ గళ్ళనుడికట్ల శాంపిల్స్ చూసే భాగ్యం నాకు కలిగింది. అప్పట్లో ఆ పత్రికలోని పజిలింగ్ పజిల్ ఛాలెంజింగ్ గా ఉండేది. (ఆ శీర్షికను డా. ఎన్.సురేంద్ర గారు అచ్చం ది హిందూ తరహాలోనే నిర్వహించేవారు. అప్పట్లో రచన పాఠకులు కొంత మంది అచ్చం ఇప్పటి పొద్దు పాఠకుల్లాగే “ఇది మరీ పజిలింగ్ గా ఉంది. ఎంతమాత్రమూ కొరుకుడుపడలేదు.” అని గోలపెట్టేవారు. 🙂 )

మేము పొద్దు పత్రిక పెట్టాలనుకున్నప్పుడే అనుకున్నాం.. గడి ఈ పత్రికకు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని. గడిని పూరించడానికి పొద్దు పాఠకుల్లో చాలా మందే తీవ్రప్రయత్నాలు చేశారు. కానీ ఈ తరహా గళ్ళనుడికట్టు తెలుగు నెటిజనులు, బ్లాగరులలో ఎక్కువమందికి పరిచయం లేనిది. అందువల్ల చాలా తక్కువ సమాధానాలు వచ్చాయి. ఐతే వీటినెలా పూరించాలో హింట్స్ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇకమీదట గడి పూరించడం ‘ఇంత’ కష్టం కాబోదు. అలాగే గడిని పూర్తిగా నింపకపోయినా అసంపూర్తి సమాధానాలను సైతం పంపగలిగే అవకాశం కల్పించనున్నాం కాబట్టి కొత్తపాళీ గారి లాగ ఎక్కడో ఒకటీ అరా తప్ప దాదాపు పూరించగలిగినవారు కూడా పంపుతారని ఆశిస్తున్నాం.

ఇక సమాధానాలు పంపినవారు – విజేతలు:

దాదాపు ఆల్ కరెక్టు సమాధానాలు పంపినవారు: పప్పు నాగరాజు గారు, చిట్టెళ్ళ కామేశ్ గారు, జ్యోతి వలబోజు గారు.
వీరు కాక ఆల్ కరెక్టుకు అల్లంత దూరంలో నిలచిన వీరబల్లె వీరుడు రానారె.

సమాధానాలు

సి రా గు వా ము కా మా
ని రు వి
ణీ రం తూ గు డు గు డు గుం చం భా
ప్రి బా డు షా
ష్టి బా టు లు సు భి
దూ సో పా మా
తి రు తి రు తి దే స్థా నం
కు వు పం
కి ని మా కో లా లం
సా ద్ర లా లం లే
కం కా సి
జం ఘా శా స్త్రి వి కీ పీ డి యా

అడ్డం:
1 రసికాగ్రేసరా! మాకాపాటి రసికత లేదా? (5+5+2) రసికరాజ! తగువారము కామా?
6 అడ్డం తిరిగిన అమ్ములపొది (3)
ఈ ఆధారంలో రెండుభాగాలున్నాయి: వాటిలో ప్రధానమైనది అమ్ములపొది. అంటే తూణీరం. (“మావి అక్షయతూణీరాలు” అని సాలభంజికలు నాగరాజు గారు ధిలాసా ప్రకటించడం మీకు గుర్తుండే ఉంటుంది.) ఇక్కడ ఆ తూణీరానికేమైంది? అడ్డం తిరిగింది! గళ్ళనుడికట్టు ఆధారాల్లో అడ్డం తిరగడం, అస్తవ్యస్తం కావడం, చెల్లాచెదరు కావడం లాంటివి కనిపిస్తే సమాధానం కోసం అక్షరాలను తారుమారు చెయ్యాలన్నమాట. ఏ అక్షరం ఎక్కడ పడాలో తెలుసుకోవడానికి 1 నిలువు, 2 నిలువు ఆధారాలను చూసుకుంటే సమాధానం ణీతూరం అని తెలుస్తుంది.
7 ఇది చిన్నప్పుడు ఆడుకున్న ఆట. “…గుర్తున్నదా?” అని గుర్తుచేస్తుందొక సినిమా పాట(6)
సమాధానం గుడుగుడుగుంచం. వివరణ అవసరం లేని ఆధారం. 🙂
10 జట్టిజాములోని పూర్వార్థానికి ప్రకృతి(2) ఇది కనుక్కోవడం చాలా కష్టం…అనుకోనవసరం లేదు. తెలుగువికీపీడియాలో జట్టిజాం అనే వ్యాసం లో చూస్తే తెలిసిపోతుంది. సమాధానం యష్టి .
11 వికీపీడియనులకందిస్తుందిది తోడ్పాటు(2)
వికీపీడియనులందరికీ తెలుసు – సమాధానం బాటు (bot) అని. మరిన్ని వివరాలకు ఎన్వికీ చూడండి.
12 రంగస్థలమ్మీద నూటపాతికేళ్ళ అమృతధార(3) రంగస్థలం అనగానే తెలుగువారికి స్ఫురించవలసింది ప్రపంచప్రఖ్యాత సురభి నాటకసమాజం. సురభి నాటకసమాజం పుట్టి నూటపాతికేళ్ళైంది. పైగా సురభి అంటే అమృతం.
15 కోటలో వెయ్యబోతే తోక కత్తిరించి పంపారు!(2)
కోటలో పాగావెయ్యడం అనేదొక నానుడి. ఇక్కడ కోటలో వెయ్యబోయింది పాగా అన్నమాట. తోక (పదం చివరి దీర్ఘం) కత్తిరిస్తే పాగ
17 పాత చందమామలను డిజిటైస్ చేస్తున్నది (4+4+4)
తిరుమల తిరుపతి దేవస్థానం
20 కినిసిన సినిమా పత్రిక కునుకేసింది శాశ్వతంగా(3)
ఈ ఆధారంలో ప్రధానమైన భాగం సినిమా పత్రిక. అదేమో శాశ్వతంగా కునుకేసింది అంటే మూతపడిందట. మూతపడిన సినిమాపత్రికల్లో కినిమా ఒకటి. (ఈ పత్రిక సంపాదకులు కొ.కు.) కినిసిన అని ఇచ్చింది ఆ పేరును సూచించడానికే!
22 సగం కూల్‌డ్రింకు, సగం విషం కలిసి సృష్టించిన కలకలం (4)
కోకకోలా అనేదొక కూల్ డ్రింకు, హాలాహలం అంటే విషం. దాంట్లో సగం కోలా. దీంట్లో సగం హలం. కలిస్తే కోలాహలం. కలకలమంటే అదే కద?
26 పేరలుకంజెందిన లలనామణి కోపాన్ని తగ్గించే మార్గం (3) బుజ్జగింపు అనుకుంటే మనక్కావలసింది దానికున్న సమానార్థకాల్లో లాలన అని సూచించడానికే లలనామణి అని ఇచ్చింది.

28 ఏమీ లేనప్పుడు మొదట చూడ్డం ఎందుకే? (2) “ఏమీ లేనప్పుడు” లోని పదాల మొదట చూస్తే ఏ,లే ఉన్నాయి. కలిపితే ఏలే. ఏలే అంటే ఎందుకే అనే కదా? అదే సమాధానం. గమ్మత్తుగా లేదూ?
32 పానుగంటివారి “సాక్షి”గా ఈ ఉపన్యాసకర్త వాగ్ధాటికి ఎదురులేదు (5) జంఘాలశాస్త్రి
33 ఇందులేనిదెందుగలదు? (5)
దీనికి స్టాండర్డు సమాధానం మహాభారతం. కానీ కాలం మారింది. ఇప్పుడు అన్నీ వికీపీడియాలోనే ఉన్నాయిష. 😉

నిలువు:

1 తాంబూలాదులు ఈమె తెచ్చి ఇస్తేగానీ రాసేమూడ్ రాదట పెద్దన్నగారికి (8) రమణీప్రియదూతిక (“నిరుపహతిస్థలంబు…”అంటూ మొదలయ్యే ఈ పద్యాన్ని ఈ పేజీలో చూడవచ్చు.)
2 ఈ రాళ్ళు బరువెక్కువై తిరగబడ్డాయి (3) తూనిక రాళ్ళు బరువు తూచే రాళ్ళే కాదు బరువైనరాళ్ళు కూడా. తిరగబడ్డాయి అంటే కిందినుంచి పైకి రాయాలి.
3 ఇదుంటే జ్వరమంత సుఖంలేదు(5) జరుగుబాటుంటే జ్వరమంత సుఖంలేదు అని సామెత
4 అస్పష్టంగా వినిపించే ఆమ్రేడితాలు (5) అస్పష్టంగా వినిపించేవి గుసగుసలు. ఒకే పదం వెంటవెంటనే రెండుసార్లు వస్తే అదే ఆమ్రేడితం.
5 కకావికలైనా చెదరని రంగు (2) కకావికలు లో కావి అనే రంగు దాగుంది. అది ఏ మాత్రం చెదరలేదు. చూశారా?
8 చూడ నల్లగుండు గుండ్రముగా నుండు (2) గుండు
9 మనకున్నదే..మా భాభి షానం కూ ఉంది (5) భాషాభిమానం
13 చంద్ర (2) చంద్రుడికే సోముడని పేరు. సోమవారం ఆయన పేరునుంచే వచ్చింది.
14 గురువుగారూ! పొరబడకండి. అది కంకరనేల (3)
గరువు అంటే కంకరనేల. గురువు గారినిందులోకి లాగింది ఈ పదాన్ని సూచించడానికే! గళ్ళనుడికట్టు ఆధారాల్లో వచ్చే “పొరబాటు” దాదాపు ఒకేలా ధ్వనించే పదాలను సూచిస్తుంది.
15 దీన్ని తలాపిడికెడు పంచబోతే చెల్లాచెదరైంది (4) తిలాపాపం తలాపిడికెడు అని ఒక నానుడి. పంచబోయిన తిలాపాపం చెల్లాచెదరైతే? ఏమౌతుందో తెలుసుకోవాలంటే అడ్డం ఆధారాలను బట్టి అక్షరాల అమరికను మార్చుకోవలసిందే!
16 బలాఢ్యులుపయోగించిన పూర్వకాలపు ఆయుధమే! (2) ఆ ఆయుధం గద. ఆయుధమే అంటున్నాం కాబట్టి సమాధానం గదే అవుతుంది
18 కులమా? కాదు. అటుదిటైన ఈ దేవి మంచి నర్తకి (3) కులమా లోని అక్షరాలను అటూఇటూ చేస్తే వచ్చే లకుమా + దేవి కర్పూరవసంతరాయలు అనే కావ్యంలోని గొప్ప నర్తకి పేరు.
19 జాగ్రత్త, వివాదాలం మేం! తలగొరిగి, సాచిన చేతులు నరికేస్తే వదుల్తామా? (3) వివాదాలం అనే పదంలో తల అంటే మొదటి అక్షరమైన వి ని తొలగించి మిగిలిన అక్షరాలకుండే దీర్ఘాలను తీసేస్తే (సాచినవాటిని నరికేస్తే) మిగిలేది వదలం. వివాదాలు ఒకంతట వదలవు కదా?
21 సుఖమెరుగని అవస్థ (2) అవస్థలు నాలుగు:

  1. జాగ్రత లేక మెలకువ,
  2. నిద్ర లేక సుషుప్తి,
  3. స్వప్న,
  4. ఈ మూడింటికీ అతీతమైన తురీయ.

ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదని సామెత.
22 కోనంగీ! ఈ చోటికి వెళ్ళదలిస్తే చొక్కా విప్పి వెళ్ళు! (2) అంగీ అంటే చొక్కా. కోనంగీ అంగీ విప్పితే మిగిలేది కోన. అదే పోదలచిన చోటు.
23 కలం పట్టిన చెయ్యి ఇది పట్టడం కష్టమే!(2) సమాధానం హలం (నాగలి)
24 ఈ దేశం మసిలేనిదయా(4) మసిలేనిదయా ను మసి + లేనిదని విడదీసి అర్థం వెదక్కూడదు. ఆ పదంలో దాగున్న దేశం మలేసియా .
25 సమాజం ఎలా నడచుకొన్నా దీని నడక మాత్రం చక్కనిది (3) సామజం (ఏనుగు) సామజ వర గమన అనే పోలిక సుప్రసిద్ధం కదా? అలాగే హంసగమనం (రాయంచ నడక), ఇభరాజగమనం (మళ్ళీ ఏనుగే), నెమలి నడకలాంటి నడకలు కూడా ఉన్నాయి. సామజం అనే సమాధానాన్ని సూచించడానికే ఆధారంలో సమాజం ప్రస్తావన.
27 తలతిరిగి పూలు పూసింది! (2) తల తిరిగితే (వ్యతిరేకదిశలో చదివితే) లత అవుతుంది. పూలు పూసేది లతే కదా? అదే సమాధానం.
29 ఆహారంలో మాంసం కానిది పైకి పెరుగుతుంది (2) మాంసం కానిది శాకం. (మాంసాహారం – శాకాహారం) శాకాలన్నీ పైకే పెరుగుతాయి. కానీ ఇక్కడ పైకి పెరగడమంటే కింది నుంచి పైకి రాయమని అర్థం.
30 దానమిచ్చింది అవి కాదు, ఇవి కాదు (2) ఈవి అంటే దానమిచ్చింది అని అర్థం.

14 నిలువు, 30 నిలువులలో ఉన్న పొరబాటు, కాదు లాంటి indicator పదాలు దాదాపు ఒకేలా ధ్వనించే పదాలను సూచిస్తాయి. (గురువు-గరువు, ఇవి-ఈవి).

31 ఉన్నదున్నట్లు పీకాలనుకుంటే తలతిప్పండి (2) ఉన్నదున్నట్లు చేస్తే అది కాపీ. తల అంటే [‘పీకాలనుకుంటే’ అనే పదం మొదట్లో ఉన్న రెండక్షరాలు] ‘పీకా’. దీన్ని తిప్పితే వచ్చేదీ కాపీయే!
—————————————————————
ఇంకోమాట: గళ్ళనుడికట్లలో నకారం పొల్లును విడి అక్షరంగా లెక్కించరు. ఉదాహరణకు ఫంక్షన్ అని రాయడానికి రెండు గళ్ళే ఇస్తారు.
***

మీకు ఇంగ్లీషు క్రాస్‌వర్డ్ పజిల్ పట్ల ఆసక్తి ఉన్నట్లైతే ఆర్కుట్ లో మీకోసం ఒక అద్భుతమైన కమ్యూనిటీ ఉంది. అక్కడ మీ చేత ‘ఆహా!’ అనిపించే ఆధారాలు – సమాధానాలు, వందలు కాదు వేలకొద్దీ (అవసరమైనవాటికి వివరణలతో సహా) ఉన్నాయి. చమత్కారం వాటి ప్రధాన ఆకర్షణ. మీరు చమత్కారప్రియులైతే తనివితీరా ఆస్వాదించవచ్చు. (రుచి మరిగారంటే మీకు ఎప్పటికీ తనివితీరదు. తర్వాత నన్ను తిట్టుకుని లాభం లేదు. ఇప్పుడే చెప్తున్నా.)

ది హిందూ క్రాస్‌వర్డ్ గురించి రీడర్స్ ఎడిటర్ కె.నారాయణన్ మరిన్ని వివరాలందిస్తున్నారిక్కడ.

Posted in గడి | Tagged | 7 Comments

ఖైదీ నంబరు 300

విహారి
ఈ నెల మా అతిథి – బ్లాగు విహాయస విహారి, దోనిపర్తి భూపతి విహారి. ఈయన బ్లాగు చిక్కటి హాస్యానికి ఓ చక్కటి మజిలీ. కొలరాడో తెలుగు సంఘంలో సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బుడిబుడి అడుగుల నుండి వడివడి నడకల దాకా తన బ్లాగు ప్రస్థానం ఎలా సాగిందో చెబుతున్నారీ ఆత్మకథా విహారి. ఆలకించండి.

————-

పోయిన ఆగస్టు నెలలో అనుకుంటా గూగుల్లో తెలుగు గురించి కాస్త వెతుకుతుంటే తెలుగు బ్లాగర్ల గుంపు పేరు కనపడింది. ‘ఆహా, ఏదో తోక దొరికింది. దాన్ని పట్టుకుని వెళితే మంచి తెలుగు మేత దొరుకుతుంది’ అని దాన్ని వెంబడించాను. అది తీసుకెళ్ళి తెలుగు కోసం తపన పడుతున్న కొంత మంది వున్న గుంపులో పడేసింది. ‘మన తెలుగు కోసం ఓ బ్లాగర్ల గుంపు కూడా వుందా?’ అనుకొని, ‘ఇంకొంచెం తవ్వితే ఇంకెన్ని వుంటాయో?’ అని పలుగు, పార ఎత్తుకొని తవ్వితే తెలుగు సాహిత్యం అంటూ ఇంకో గుంపు పలుగుకి తగిలింది. దాన్ని పట్టుకెళ్ళి నాకిష్టమైన గుంపు పెట్టెలో పెట్టేశా. తవ్వుతున్న కొద్దీ “తెలుగు మిత్ర”, “ఫ్రెండ్స్ ఫ్రం ఆంధ్రా” లాంటివి తగిలాయి. అన్నీ తీసుకెళ్ళి నా పెట్టెలో పెట్టేశా.

‘అన్నీ పెట్టెలో పెట్టుకుంటే ఏం లాభం? వాటిని కాస్త వాడుకోవాలి’ అని మొదట తెలుగు బ్లాగర్ల గుంపులో ఓ చెయ్యి పెట్టా. పెట్టిన తరువాత నా చెయ్యిమీద “ధభేల్” మని ఓ ముద్రేశారు. ఏంటా అని చూస్తే చేతిమీదో నంబరు …..నంబరు 300. అంటే నేను మూడువందల నంబరు ఖైదీ నన్నమాట (ఖైదీ నని ఎందుకన్నానో తరువాత చెబుతా). ఇక ఎటూ నంబరొచ్చేసింది కదా ఎదో ఒకటి చేద్దామని జెండా పండగ నాడు రాజకీయ నాయకులకు గాంధీ గుర్తొచ్చినట్టు అప్పుడప్పుడూ లింగు లిటుక్కుమని అందులో “నేను వున్నాను” అని కేకలు పెట్టే వాడిని. ఆ కేకలు విని తోటి సభ్యులు “నీకు రెక్కలొచ్చాయ్ వెళ్ళి నీ గూడు కట్టుకో”, అన్నట్టు “నీకు కేకలు పెట్టడం బాగానే వచ్చు. వెళ్ళి నీ బ్లాగులో పెట్టుకో. ఇది నీ ఇంటిముందు మర్రి చెట్టు కాదు నీ వాగుడు వింటానికి” అన్నారు.

“మీరు బ్లాగు పెట్టుకోమంటే పెట్టేసుకుంటానా? నేను సెలెబ్రిటీనే కాదు లెజెండ్ లా బ్లాగెలా పెట్టుకుంటా?” అని నోటి నాలుకకు (కాల నాళికలా అనిపిస్తే మీరు సినిమా వజ్రోత్సవాలను బాగా ఫాలో అయ్యారని అర్థం) తాళం వేసి కొన్నాళ్ళు బ్లాగు పరిశోధన చేశా. అప్పుడప్పుడూ, ఎవరి బ్లాగుల్లో వాళ్ళు పెడుతున్న కేకలు చూసి నేను కూడా “పొలి కేక”, “గావు కేక” పెట్టుకుంటూ బ్లాగుల్లో కామెంట్స్ రాయడం మొదలు పెట్టా. ఎక్కువగా రాజకీయాల మీద, బాష మీద, తెలంగాణా మీద, రిజర్వేషన్ల మీద రాసిన వ్యాసాలు బాగా ఆకర్షించేవి. వాటికి నా సమాధానం “డింగో డింగు” అంటూ ఇచ్చేవాడిని. అప్పట్లో నాకు తెలిసిన బ్లాగుల పందిరి కూడలి, తెలుగు బ్లాగర్స్ వుండేవి. వాటిని సందు దొరికినప్పుడల్లా కొత్త బ్లాగుల కోసం “ఫ్రెష్ కావే..ఫ్రెష్ కావే” అని ఎలుక తోక తో కొట్టే వాడిని. పాపం ఎలుక అలిసి పోయేదే కానీ కొత్తవి అంత తొందరగా వచ్చేవి కాదు. ఇప్పుడయితే ఆ ఎలుక ముదిరిపోయిన వీధి రౌడీలాగా నిర్లక్ష్యంగా “ఏ! ఇప్పుడొస్తున్న బ్లాగులు చాలవూ? ఒక్క రిఫ్రెష్ కే ఇన్ని వస్తున్నాయ్ వెళ్ళి వాటి సంగతి చూసి రా, మాటి మాటికి నా జోలికి వస్తే నా ఓనర్ విఘ్నరాజు కు చెప్పి నీ తాట తీయిస్తా” అని బెదిరిస్తోంది.

కొన్నాళ్ళకు “ఝుమ్మంది నాదం..బ్లాగంది పాదం” , “నన్ను ఎవరో చిలికిరి..కలికిరి..కెలికిరి…బ్లాగులోని మత్తు మందు చల్లిరి” , “పరువమా బ్లాగు పరుగు తీయవే..” లాంటి సందేశాలు అశరీరవాణి వినిపించడం మొదలు పెట్టింది. అంటే నాకు ఇక బ్లాగులు రాసే వయసొచ్చేసింది అన్నమాట. ఇంకేం కొత్త కాపురం, “ఇదీ నా మది” అని ఓ బ్లాగుకు ఓపెనింగ్ సెరెమనీ చేసేసి బ్లాగుల గుంపులో పెట్టేసి, కూడలి లో పెట్టమని వీవెన్ కో లేఖ, తెలుగు బ్లాగర్లో పెట్టమని చందూకో లేఖ పెట్టేశా. ఎప్పుడో రాసుకున్న, రాజుకున్న కొన్ని కవితల్ని అందులో పెట్టేసి చేపల కోసం వల వేసిన జాలరి ఎదురు చూసినట్టు కామెంట్ల కోసం ఎదురు చూడ్డం మొదలయింది. ఒక్కొక్కరు ఒక్కోరకంగా సమాధానం రాయడం మొదలయింది. బాగా నచ్చిన కామెంట్లను నాలుగయిదు సార్లు చదువుకుని కిత కితలు పెట్టుకునేవాడిని. ‘ఇక ఇలా కాదు నాకు తెలిసిన వన్నీ బ్లాగెయ్యాలి’ అని ఇంకో బ్లాగు “నాటకాలు” అని మొదలు పెట్టా. అందులో రెండు టపాలకంటే ఎక్కువ రాయడానికి కుదర్లేదు. మామూలుగా మూడంకె వేసి బజ్జుంటారు. కానీ నేను మాత్రం రెండంకె వేసి గుర్రెట్టా. కొన్నాళ్ళు బండిని లూప్ లైన్లో పార్క్ చేసి వచ్చే పొయ్యే బ్లాగు రైళ్ళను మళ్ళీ చూడ్డం మొదలయింది. కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్ళు బాగా ఆకట్టుకున్నాయి. నేనూ అలా రాద్దామని ప్రయత్నించా. మన బొగ్గింజనుకు అంత సీను లేదు అని తెలిసింది. సరేలే ఎక్కడ బడితే అక్కడ ఆగిపోయే “దొంగల బండి” లా ఎందుకు తయారవకూడదు? కిందా మీద పడి, దీర్ఘంగా హ్రస్వంగా, లోపలికి బయటకి, భూమ్మీదా మేఘాల మీద (కార్లో స్పీడుగా అని) అలోచించి..చించి మెదడుకు చిల్లు పెట్టుకుని ఎక్కడెక్కడో వన విహారం, జల విహారం, వాయు విహారం చేసి బ్లాగుకో నామధేయం నా పేరులోనుండే “విహారి” అని పెట్టేశాను. ఇక విహరించడం మొదలయింది.

అలా నేను విహరిస్తూ వుండగా…వుండగా ఈ బ్లాగర్లు ఎప్పుడూ అలుపూ సొలుపూ లేకుండా పొద్దూ పాడూ తెలీకుండా బ్లాగేస్తున్నారు.వీళ్ళకు కొంచెం పొద్దులు తెలియ చేసి బ్లాగులంటే ఇలా వుండాలి అని తెలియ చెప్పడానికి ఓ “పొద్దు” పొడుచుకొచ్చింది. అందరి మన్ననలు పొందుతూ దూసుకు పోతోంది.అలా తెల తెల వారుతున్నట్లు రోజు పొద్దు పొడుస్తూ సద్దుమణుగుతూ వుండగా ఋతువులు మారాయి. వసంతమొచ్చింది. వికసించే పుష్పాలెక్కువయ్యాయి తేనెటీగల సరాగాలు తోడయ్యాయి. అలాంటి తేనెటీగల కోసం తమిళంలో వున్న “తెన్ కూడు” తెలుగులో కూడా “తేనె గూడు” లా వెలిసింది. ఉచితంగా బాజా వాయించే వాళ్ళుంటే పెళ్ళికి సిద్ధం అన్నట్లు అన్ని బ్లాగు తేనెటీగలు అక్కడ కూడా వాలి మకరందాన్ని చేరుస్తున్నాయి. ఇవన్నీ చూసి శ్రీ కృష్ణ దేవరాయలు “ఏను తెలుగు వల్లభుండ..” అని గర్జిస్తే దేశంలోని పండితులు అందరూ వినమ్రంగా నిలబడి రండి “వైద్య కవి గారూ”(సూదేస్తాని బెదిరించాడ్లే..కత్తుల్లేవుగా) అని తెలుగు పెత్తనమిచ్చి తెలుగు గుబాళింపులు దేశీ పండిట్ లో విరజిమ్మాలని ఆహ్వానించారు. మన తెలుగు బ్లాగర్ల ప్రపంచంలో ఇదొక అధ్యాయం.

టపాలు రాసే కొత్తలో ప్రతి దానికి ఉత్సాహపడి పోవటం. టపా రాసిన వెంటనే వాటికి కామెంట్లు వచ్చాయేమోనని ఆత్రంగా చూడ్డం. ఒక్క కామెంటు వచ్చినా వంద సార్లు చదువుకుని కొత్తవున్నాయేమో అని ఎలుక ఎడమ ముక్కుని చావబాదటం. కొన్ని ఎక్కువగా రాగానే చొక్క గుండీలు తీసేసి లుంగీ ఎగ్గట్టి “ఎస్..నేనే నంబెర్ వన్” అని ఎన్టీఆర్ పాట పాడేసుకోవడం (మగ వాళ్ళయితే). ఆడవాళ్ళయితే కొప్పు ముడేసి కొడవలికి సాన పెట్టి “లేచింది..నిద్ర లేచింది మహిళా లోకం” అని పాడేసుకోవడం. ఆ ఉత్సాహంలో ఇంకో టపా దాని నెత్తి మీద రాయటం అందరికీ అనుభవంలో కొచ్చే విషయాలు.

అనుభవంలోకి వచ్చే ఇంకో విషయం. మొగుళ్ళు పెళ్ళాలను గుర్రుమని చూడ్డం. పెళ్ళాలని మొగుళ్ళు గుర్రుమని చూడ్డం. పెళ్ళి కాని వాళ్ళను వాళ్ళ ఫ్రెండ్స్ వదిలేసి సినిమాలకు వెళ్ళి పోవడం. ఎందుకంటే బ్లాగొక వ్యసనం. ఎవరో చెప్పినట్టు ఇది “మధుర వ్యసనం”. కాకపోతే జలగ లాగ ఓ పట్టాన వదలదు. బాగా అతుక్కు పోయిన వాళ్ళను “బ్లాగ్ జలగ” అంటారు. ఎవరో ఎక్కడో అన్నారు “బ్లాగిలం” అని కూడా. ఇది ఎంతగా చుట్టేస్తుందంటే ఆఫీసు నుండి ఇంటికెళ్ళే ముందు ఓ సారి కూడలిని రౌండేసి వస్తే కానీ తృప్తి వుండది. అలాగే ఇంటికెళ్ళగానే లాప్టాప్ లో పొద్దున తెరిచి వుంచిన కూడలిని ఓ సారి ఓ F5 (refresh button) అంటే గానీ మనసూరుకోదు. (ఓ F5 అనగానే ముళ్ళపూడి వారి అప్పారావు డైలాగు -“ఓ ఫైవుంటే ఇస్తావూ” గుర్తొస్తోందా?) అందరూ బ్లాగులకు ఖైదు అయిపోతారు. అందుకే అన్నా “ఖైదీ” అని. నేను ఖైదీ నంబరు 300.

ఇంకో రెండు మూడేళ్ళకు ఓ పెళ్ళయిన జంట మన ముందుకొచ్చి “ఆ బ్లాగులో ఆయన టపా చూసి నేను పడిపోయా” అని ఆవిడ,
“ఆ టపాకు ఈ సమాధానం చూసి ఈవిడను నేను లేపా” అని ఆయన చెప్పే రోజులు. తమ బ్లాగు ప్రేమ కథలు చెప్పి “ఈ బ్లాగు మమ్మల్ని కలిపింది కాబట్టి మా బుడ్డోడు/బుడ్డిది పుట్టిన రోజు సందర్భంగా ఈ బ్లాగుల సంఘానికి ఓ వెయ్యిన్నూటపదార్లో లేక లక్షా నూటపదార్లో ఇస్తాం” అని చెప్పే రోజులు వస్తాయి. (బ్రహ్మచార్లూ గాల్లో రింగులు రింగులు వేసుకొని విహరిస్తున్నారా…కాస్త ఆగండి)

తెలుగు బ్లాగర్లు ఇప్పుడు అయిదొందలు దాటారు. బ్లాగులేమో ఓ మూడొందలు వున్నాయి. రాసే టపాలు లెక్కకు మిక్కిలిగా వుంటున్నాయి. ఇప్పుడు చదివిన టపాలకు ఎంత బాగున్నా కామెంట్లు రాసే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. భ్లాగులను ఓ పళ్ళ తోటతో పొలిస్తే, రెండు నెలల క్రితం వరకు ఏ చెట్టు ఎక్కడుందో ఏ పండు ఎక్కడుందో ఏ చెట్టుకు ఎలాంటి కాయలు కాసేవో తెలిసేది. ప్రతి చెట్టూ, దాని పుట్టు పూర్వోత్తరాలూ తెలిసేవి. ఇప్పుడు ఇలాంటి ఫలాలను అందించే బ్లాగులు ఎక్కువయి పోయాయి. ఎన్ని ఆరగించాలో ఎలా అరిగించుకోవాలో తెలియడం లేదు. ఒకరికొకరు పోటీగా రాసేస్తున్నారు. ఇంతగా మన “తెలుగులు (తెలుగు వాళ్ళు)” లాగుతున్నారంటే దానర్థం మన తెలుగుకు మంచి రోజులు వున్నట్టే.

ఇక్కడ నాకు ఇరవై ఏళ్ళ క్రితం చదివిన జోకు గుర్తుకు వస్తోంది.
“సిడ్నీ షెల్టాన్ తెలుగు నేర్చుకుంటే ఎలా ఫీలవుతాడు”
“తెలుగు లో నేనిన్ని కథలు ఎప్పుడు రాశానబ్బా” అని ఆశ్చర్య పోతాడు.

కాపీ అయితే నేమి, సృజనాత్మకత అయితే నేమి, సాహిత్య పరిశోధన అయితేనేమి తెలుగులో రాసే వాళ్ళు కొల్లలుగా పుట్టుకు వస్తున్నారు ఈ పరుగులు పెట్టే ఆధునిక జీవితంలో.

ఓం బ్లాగ్వ్యసనం ప్రాప్తిరస్తు !!!

విహారి (http://vihaari.blogspot.com/)

Posted in వ్యాసం | Tagged | 18 Comments

మార్చి నెలలో పొద్దుపొడుపులు

అతిథి:
నా దృష్టిలో ఈ-తెలుగు సంఘం -వీవెన్ (బ్లాగు)

వివిధ:
మెథుసెలాహ్: మనందరికి ముత్తాత చెట్టు -‘శోధన’ సుధాకర్ (బ్లాగు)

వ్యాసాలు:
తెలుగు నుడికారము -రానారె (బ్లాగు)

బానిసత్వం నాటి నుంచీ నేటి వరకూ -చరసాల (బ్లాగు)

కథలు:
టీ టవర్స్ -చావా కిరణ్ (బ్లాగు)

తరగతి గదిలో -సౌమ్య (బ్లాగు)

సరదా:
పాపం ఆంధ్రా పోరడు -జ్యోతి (బ్లాగు)

అందం చందం – సౌందర్యానికి సలహాలు -జ్యోతి (బ్లాగు)

సరదా ప్రశ్నలు -జ్యోతి (బ్లాగు)

సమీక్ష:
కాలాన్ని నిద్రపోనివ్వను -స్వాతి (బ్లాగు)

విశేషం:
తెలుగు ఫాంట్ల తయారీ పోటీ -చదువరి (బ్లాగు)

బ్లాగు:
నిశిత ‘శోధన’ -చదువరి (బ్లాగు)

గడి:
గడి

కబుర్లు:
కబుర్లు

Posted in ఇతరత్రా | Comments Off on మార్చి నెలలో పొద్దుపొడుపులు

ఒక కథ, ఒక వ్యాసం

వి.బి.సౌమ్య ప్రయోగాత్మకంగా రాసిన “తరగతి గదిలో” అనే కథ, బానిసత్వం గురించి చరసాల ప్రసాద్ గారి వ్యాసం అందిస్తున్నాం. వీటిపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.

-పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on ఒక కథ, ఒక వ్యాసం