ఏప్రిల్ గడి – వివరణ

-సిముర్గ్, త్రివిక్రమ్

ఏప్రిల్ గడికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇంతగా అభిమానించి, ఆదరించిన పాఠకులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. గడిని ఎంతగానో అభిమానించి, అందరినీ ప్రోత్సహించిన కొత్తపాళీగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గడిమీద చాలా పెద్ద ఎత్తులో చర్చలు జరిగాయి. కొన్ని చర్చలు చదువుతున్నప్పుడు ఆశ్చర్యంతోను, ఆనందంతోను ఒళ్ళు పులకరించింది. ఈ గడి మూలంగా – వరూధిని కథ, పుష్ప లావికలు, అనిరుద్ధుని కథ, మాంధాత గురించి కొన్ని చర్చలు జరగడం – గడి కూర్పర్లగా మాకు చాలా ఆనందానిచ్చింది.

మూడురోజుల పాటు అహోరాత్రాలు కష్టపడి గడి తయారుచేస్తే గంటలో పూరించి పంపించారు సత్యసాయిగారు. సుమారుగా అన్ని కరెక్టుగా పంపినవారు కూడా చాలామందే ఉన్నారు. మీ సత్తా చూస్తూంటే, అసలు ఆధారాలే అవసరం లేనట్లుంది!!

గడి తయారుచేయడంలో ఇంకా తప్పటడుగులేస్తున్న మమల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు, జరిగిన ఒక పొరపాటుని సహృదయంతో అర్ధం చేసుకొన్నందుకు కూడా మేం మీకందరికీ ఋణపడి ఉంటాం. మీ ఆదరాభిమానాలు, సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తాం – మీ అంచనాలకి తగ్గకుండా గడి స్థాయిని ఇలాగే ఉంచడానికి కూడా మా శాయశక్తులా కృషి చేస్తాం.

సమాధానాలు

1గా డి   2గం 3ద 4గో ళం   5ము 6డే
      7గా డి   గు   8చ క్కె
9త్రి 10పు 11తా ళం   12అ పూ ర్వం    
  ష్ప     13గం డా లు       14స
15చా లా దొ రా       16ద 17మం  
18ప తి   19కు 20మా రు 21డో   22స్కం ధా 23వా రం
24కిం   25మీ మే షా 26లు   27త డి  
    28ద వా     క్కు       29జాం
నీ   30ధో నీ   31డి 32మ   33వ 34రం  
35రు 36త   37టి 38బి   39మ రో రూ పం   వం
    40బొ క్క 41సం     ధి   42ది తు
43రా వి చె ట్టు   ధి   44అ ని రు ద్దు డు

ఆల్ కరెక్టు సమాధానాలు పంపినవారు: శ్ర్రీరామ్

ఒకటి, అరా తప్పులతో: సత్యసాయి కొవ్వలి, కొత్తపాళీ, సిరిసిరిమువ్వ, కామేష్.

రెండు మూడు తప్పులతో: జ్యోతి, స్వాతి కుమారి.

వీరందరికీ అభినందనలు!!

ఏప్రిల్ గడి కూర్చిన పద్దతి గురించి:

గడి కూర్చడంలో రెండు మూడు నియమాలు పాటించ వలసి ఉంటుంది:

  • సుమారుగా ఎనభై శాతం పదాలు అందరికీ అందుబాటులో ఉన్నవై ఉండాలి.
  • కనీసం, ఒకటి లేక రెండు అంతగా వాడుకలో లేని పదాలో, కొత్తపదాలో, ఏదైనా విషయానికి సంబంధించినవో అయ్యుండాలి. ఈ సారి స్కంధావారం, వరూధిని, మాంధాత, జాంబవంతుడు అనే పదాలు ఈ కోవకి చెందినవి.
  • కీలకమైన పదాలకు (యాంకర్ వర్డ్స్) ఇచ్చే ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ సారి గడిలో “తామరాకు మీద నీటిబొట్టు, మీనమేషాలు, గోగుపూలు, త్రిపుటతాళం, వరూధిని” – అనే పదాలు కీలకమైన ఆధారాలు. అంటే, ఈ పదాలు పూరిస్తే, మిగతా గడంతా సులభంగా పూరించవచ్చు. ఇటువంటి పదాలకిచ్చే ఆధారాలు ఖచ్చితంగా, స్పష్టంగా ఉండాలి. ఒకసారి పదం స్ఫురిస్తే – అది కరక్టో, కాదో పూరించేవారికి ఏ అనుమానమూ లేకుండా తెలియాలి, అలాగే, తప్పుగా పూరిస్తే – ఇది కరక్టుకాదు అనే అనుమానం రావాలి. సాధారణంగా కీలకమైన పదాలు – కనీసం నాలుగక్షరాలైనా ఉండాలి. ఒక్కోసారి – పది, పన్నెండు దాకా కూడా ఉండొచ్చు. కీలకమైన పదాలు కాబట్టి, ఆధారాలు నర్మగర్భంగా ఉంటాయి.
  • మిగతా పదాలకు, ఆధారాలతో – తికమక పెట్టొచ్చు కాని, కావాలని తప్పుదారి పట్టించకూడదు.
  • గడిలో ఉన్న పదాలన్నీ అర్ధవంతమైన పదాలవ్వాలన్న నియమం ఏమీ లేదు. ఆధారం నుంచి, ఆ పదాన్ని ‘తయారు’ చేసుకోగలిగితే చాలు. అలాగే ఆధారాలన్నీ లాజికల్ గా ఉండాలన్న నియమేమీ లేదు. ఉదాహరణకి, మార్చిగడిలో “పాతిపంలా” అనే పదం ఉంది. ఈ పదానికి అర్థమేమీ లేదు. చెల్లాచెదురైన తిలాపాపంలోంచి పుట్టిన పదమది. అలాగే, ఈ సారి గడిలో పుష్పలాతిక, తనవి, దితు, రుత, అనిరుద్దుడు లాటి పదాలు. ఈ పదాలకి అర్దంలేదు. అవి తిరగబడ్డ పదాలలోంచి, తోకలు, ముఖాలు కత్తిరించిన పదాలలోంచి పుట్టేయి. ఈ గడితో పాటుగానే అవి కడతేరతాయి కూడా.

ఇంగ్లీషులో టాల్కెన్ లాటి మహానుభావులు మొత్తం గడంతా నిఘంటువులలో లేని కొత్త పదాలతోనే కూర్చేవారట – అలా అని ఎవరో చెప్పగా విన్నాం. అలాంటి గడులు తయారు చెయ్యడమూ, అవి పూరించడమూ – గడికట్లలో పరాకాష్ట. వీటిని మించిన రాఘవపాండవీయం తరహా గడులు కూడా ఉండేవి – అంటే, ఒకే గడికి, ఒకే ఆధారాలతో – కనీసం రెండు రకాలైన సమాధానాలుండటం. ఈ సంవత్సరాంతానికైనా అలాటి గడి ఒకటి తయారు చెయ్యాలనే ఆలోచన మాకుంది.

ఈసారి గడిలో పుష్పలాతిక, అనిరుద్దుడు మీద చాలా చర్చ జరిగింది. పుష్పలాతిక అనే పదానికిచ్చిన ఆధారం తప్పుతోవ పట్టించేదిగా ఉండటం – మావల్ల జరిగిన తప్పు. ఆధారంగా ఇచ్చిన వాక్యార్థం – పుష్పలావిక అనే పదాన్ని సూచిస్తోంది. ఇది పొరబాటు – అందుకు మన్నించగోరతాం. పుష్పలాతిక అనే అర్ధంలేని పదం గడికోసం పుట్టించవచ్చు, అందులో తప్పులేదు, కాని ఆధారం ఇంకో పదాన్ని సూచించకూడదు. పూల వ్యాపారం చెయ్యాలనుకొని తికమక పడుతున్న కలావతి అనో, ఈ కలావతి ది పూల వ్యాపారంలాటిదే అనో అనుంటే సరిపోయేది. పుష్పలావిక, పవి అన్న పూరణలూ, పుష్పలాతిక, పతి అన్న పూరణలూ – రెండు కరెక్టుగానే భావించటం జరిగింది.

ఇక అనిరుద్దుడు గురించి: దీనికిచ్చిన ఆధారం “అలాంటి రుద్దుడు వద్దే అనంటే ఉష కెందుకో అంత కోపం”.
తెలియని వారికోసం: అనిరుద్ధుడు కృష్ణుడి మనుమడు. ఉష బాణాసురుడి కూతురు. అనిరుద్ధుడిని ప్రేమించిన ఉష, తండ్రికి ఇష్టంలేకపోయినా, నిద్రపోతున్న అనిరుద్ధుడిని మంచంతో సహా లేపుకుపోయి పరిణయమాడింది. ఇదీ అసలు కథ. రుద్దుడు అనే మాటకి (వత్తులేని ద తో) జనాంతికమైన అర్దం – సుత్తికొట్టడం, నసపెట్టడం, క్లాసుపీకడం అని. నీ రుద్దుడు ఆపు బాబూ అంటే ఎవరికైనా కోపం రావటం సహజం. ఇచ్చిన వాక్యార్థం ఇలాటి భావనతో సరిపోతుంది. (రుధ్ధుడు అని వాడితే వాక్యార్ధం కుదరదు). ఇక్కడ ఉషకి కోపం రావటానికి రెండో కారణం – తన ప్రియుడి పేరుని తప్పుగా పలికినందుకనే ధ్వని కూడా ఉంది. (బాణాసురుడు వద్దు అన్నందుకు ఉషకి కోపం రాలేదు కదా, ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకొంది). అందుకని ఇది డబుల్-మీనింగ్ వాక్యం.

ఇక, మిగతా ఆధారాలకి వివరాలు:

  • తోక తెగిన గార్దభం ఉత్తరాదిలో ప్రయాణ సాధనం: గార్దభం అంటే గాడిద. తోక – అంటే చివరి అక్షరం – తీసేస్తే మిగిలేది గాడి. ఉత్తరాది భాషైన హిందీలో గాడి అంటే బండి, ప్రయాణసాధనమే కదా?
  • పన్నిన ఉచ్చు అంటే ఇచ్చిన ఆధారం. తియ్యగా ఉండేది చక్కెర.
  • ‘త్రిపుటతాళాన్ని’ వాడుక తెలుగులోకి ముక్కకుముక్కానువాదం చేస్తే వచ్చేది ‘మూడుపేజీల బీగం’. ఇది ఆధారమైనప్పుడు అది సమాధానమౌతుంది.
  • తూర్పు కానప్పుడు పడమరా కాదా – ఇదేదో కొత్తగా ఉందే. పూర్వం అనేమాటకు తూర్పు అనే అర్థం కూడా ఉంది. కొత్తది అనే అర్థమొచ్చేమాట ‘అపూర్వం’.
  • గొడ్ల గుంపు ఇంటిదారి పట్టింది. గొడ్లగుంపు అంటే మంద. ఇంటిదారి పట్టిందంటే వెనుదిరిగిందని అర్థం.
  • దుష్ట మన్మధుడో, కొడుకో (కుమారుడో): మారుడు అంటే మన్మధుడు . దానికి ‘కు’ చేరిస్తే దుష్ట మన్మదుడయ్యాడు కదా ?
  • సుబ్బారావా, దండులో చేరాడుకదా – యుద్ధ శిబిరంలో వెతకండి (స్కంధావారం ) – దండు విడిచిన చోటు, యుద్ధ శిబిరాన్ని స్కంధావారం అంటారు. స్కంధుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, రావా అనే అక్షరాల ద్వారా వారం అనే అక్షరాలని స్ఫురించటానికి ఈ ఆధారం ఉపయోగ పడుతుంది.
  • పాపకేమయ్యింది – అలా గుక్క పెట్టి ఏడుస్తోంది (కింక): ఇది పూరించేవారిని కొద్దిగా తికమక పెట్టడానికిచ్చిన ఆధారం. ఆధారం – పాపకేమయ్యింది అని అడుగుతోంది, కాని సమాధానం మాత్రం ‘గుక్క తిప్పుకోకుండా పెద్దగా అరవడం – కింక’ అనేది . రెంటికీ మద్య లంకె అంత స్పష్టంగా లేదు. అయితే ‘కిం’ అంటే ఎందుకు, ఏమిటి అనే అర్దాలున్నాయి కదా?
  • లెక్క తేలటం లేదా – ఇంటి ముందు మేక, ఇంటి చివర చాప – ఇప్పుడు చెప్పండి (మీనమేషాలు ): సందిగ్ధంలో పడి, అటూ ఇటూ తేల్చుకోకుండా, తాత్సారం చెయ్యడాన్ని మీనమేషాలు లెక్కపెట్టటం అంటారు. ఇక్కడ మీనం మొదట, మేషం చివర ఉన్నాయి, కాని ఆధారంలో మాత్రం మేక ముందు, చేప చివర ఉన్నట్టుగా చెప్పబడింది. ఇది కూడా తికమక పెట్టడానికే అయినప్పటికీ, తప్పులేదు. మీన మేషాలు లెక్కపెట్టటం అంటే – పంచాగం, తిధి, వార, వర్జ్యాలు లెక్కపెడుతూ కూచోటం. జ్యోతిష్యంలో, జాతక చక్రంలో మొదటి ఇల్లు మేషానిది, చివరి ఇల్లు మీనానిది కాబట్టి, ఆధారంలో తప్పులేదు.
  • దవా అంటే మందు. దవ్వు అంటే దూరం.
  • పరిగెత్తడానికి రోజూ లీటరు పాలుతాగుతాడు (ధోనీ): ఇది కూడా తికమక పెట్టే ఆధారమే. స్పష్టంగా ఉండాలంటే – పరిగెత్తి పాలు తాగడం కాదు, పరుగులు తియ్యడానికే రోజుకి లీటరు పాలు తాగుతాడు అనుండాలి. క్రికెట్టులో పరిగెత్తరు, పరుగులు తీస్తారు. అయితే, ఇది కీలకమైన “తామరాకు మిద నీటిబొట్టు” కి సంబందించినది కాబట్టి , ఇప్పటికే, దాన్ని సాధించటానికి చాలా ఆధారాలున్నాయి కాబట్టి, కొంత తికమక పెట్టడం భావ్యమే.
  • గాయత్రి అనేది అత్యంత పవిత్రమైన వేదమంత్రం
  • ముద్దుగుమ్మకి ముచ్చటే – కాని ముద్దుకి ప్రతిబంధం (ముక్కెర): వీరాభిమన్యు సినిమాలో “ముక్కుకి ముక్కెర అందం, కాని ముద్దుకి అది ప్రతిబంధం” అనే పాటుంది కదా. ఆ పాదాన్ని కుదించి ఇక్కడ ఇవ్వటం జరిగింది.
  • రోజుకోచోట మకాం పెట్టే వాడికిది పోర్టబుల్ హోం – కొద్దిగా ఇరుకైపోయింది (డేర) డేరా అనే పదంలో రా కి దీర్ఘం లేదు అని సూచించటానికి ఇరుకైపోయింది అనిచ్చేం
  • మరాకు తాను = తా(ను)మరాకు. మంచి ముత్యం = నీటిబొట్టు – వెరశి తామరాకు మీద నీటిబొట్టులా ఉండడమంటే fully detached గా ఉండడమని అర్థం. కలిసున్నా రాగద్వేషాలు లేనిది వారికే!
  • ఆటంకమా? = అడ్డా?. చివర్లో తేలిపోతే అడా
  • ఒకప్పుడు ఏ కృష్ణవేణిదో – ఇప్పుడు గొప్పావిడ కొప్పులో వరాల మూట (సవరం): కృష్ణవేణి అంటే నల్లని కురులు గలది అని కదా, ఆ కురులు ఇప్పుడు ఇంకకరి కొప్పులోకెక్కాయి. సవరం అనే మాట స్ఫురింప చెయ్యడానికి వరాలమూట అనే పదం వాడడం జరిగింది. దీనికి మొదట గోడెక్కిన వాల్జడ అనిద్దాం అనుకొన్నాం. మరీ సులభమైపోతుందేమో అనిపించి, అలా మార్చ వలసి వచ్చింది.
  • రావణుడిచేతిలో ఓడిపోయి వాడికి శాపం పెట్టిన రాముడి పూర్వీకుడు – ముందులో కొంచెం తగ్గాడు (అందుకే ఓడాడేమో) (మంధాత): మాంధాత మీద ఈ మధ్య బ్లాగులలో ఒక టపా వచ్చింది. అయితే, ఇక్కడ ‘మా’ కి దీర్ఘం కోసేశాం కదా, అందుకే ముందులో కొంచెం తగ్గాడు అనడం.
  • బ్రహ్మకొడుకు విష్ణుమూర్తికి మావగారెలా అవుతాడండీ – జంబలకడిబంబ కాకపోతే (జాంబవంతుడు): విష్ణుమూర్తి కొడుకు బ్రహ్మ. మరి బ్రహ్మకొడుకు విస్ణుమూర్తికి మావగారెలా అవుతాడు? జాంబవంతుడు బ్రహ్మ కొడుకు. కృష్ణుడికి పిల్లనిచ్చుకొన్నాడు (జాంబవతి) కాబట్టి, విష్ణుమూర్తికి మావగారు. జాంబవంతుడు అనే పదం స్ఫురింపజెయ్యడానికి జంబలకడిబంబ అనే పద ప్రయోగం.
  • పాములకి పెద్దమ్మ మరి – గౌరవంగా పాదాలనుంచీ పైకి చూడండి. కశ్యప ప్రజాపతి పెద్దభార్య వినత, గరుత్మంతుడు-అనూరుల తల్లి. రెండో భార్య కద్రువ సంతానమే పాములు. ఇక్కడ “పాదాల నుంచి పైకి” అన్నా, 13 నిలువులో “కిందనుంచే చూడండి” అన్నా అర్థం ఒకటే.
  • తెలుగులో మొట్టమొదటి అధునిక కథానికగా ప్రసిద్ధిపొందింది గురజాడ రాసిన “దిద్దుబాటు”.

ఇదీ ఏప్రిల్ గడి కథా కమామీషు. ఆధారాలు కొంత నర్మగర్భంగా ఉన్నప్పటికీ, పెద్ద పెద్డ పదాలని పూరించటానికి వీలుగా చాలా చిన్న పదాలున్నాయి కాబట్టి, నిజానికి ఏప్రిల్ గడి మరీ అంత కష్టమైన గడేం కాదు.

ఎలాంటి గడి పెట్టినా – మేం చేసేస్తాం అని మీరు విసిరిన సవాలుని సవియనంగా స్వీకరిస్తూ – ఇదిగో మే నెల గడిని సమర్పించుకుంటున్నాం. ఇది ఏప్రిల్ గడి కన్నా ఒక అరమెట్టు ఎత్తులోనే ఉంటుందని, గత రెండు గడుల లాగే, ఇది కూడా మీ ఆదరాభిమానాలని చూరగొంటుందని ఆశిస్తాం.

ఇటువంటి గడులు తయారు చెయ్యడంలో మాకింకా అనుభవం లేదు కాబట్టి, ఎక్కడైనా తప్పులు దొర్లితే, సహృదయంతో క్షమించమని కూడా మా మనవి.

Posted in గడి | Tagged , | 5 Comments

ఏప్రిల్ నెలలో పొద్దుపొడుపులు

అతిథి:
ఖైదీ నంబరు 300 -విహారి (బ్లాగు)

వివిధ:
మీలో మీ బాసుకు నచ్చని వికారాలు -‘శోధన’ సుధాకర్ (బ్లాగు)

కవిత:
ఈ తరం -రాధిక (బ్లాగు)

వ్యాసాలు:
నా వేసవి విశేషాలు -స్వాతికుమారి (బ్లాగు)

సరదా:
కనబడుట లేదు -జ్యోతి (బ్లాగు)

ఆడాళ్ళూ మీకు జోహార్లు -జ్యోతి (బ్లాగు)

సమీక్ష:
కథ 2005 సమీక్ష -కొత్తపాళీ (బ్లాగు)

బ్లాగు:
బ్లాగుల పేరడీ – 1 -చదువరి (బ్లాగు)

బ్లాగుల పేరడీ – 2 -చదువరి (బ్లాగు)

గడి:
గడి

కబుర్లు:
కబుర్లు

Posted in ఇతరత్రా | Comments Off on ఏప్రిల్ నెలలో పొద్దుపొడుపులు

పేరడీ, కబుర్లు

పేరడీ మొదటి అంకాన్ని ఆదరించిన మీకందరికీ కృతజ్ఞతలతో రెండో అంకానికి తెర తీస్తున్నాం. కొత్తపాళీ గారి సూచన మేరకు ఈసారి బ్లాగరి పేరు ఇవ్వడం లేదు.
దీనితోపాటే కబుర్లు కూడా చెబుతున్నాం.

Posted in ఇతరత్రా | 1 Comment

బ్లాగుల పేరడీ – 2

బ్లాగుల పేరడీ – 1 కి విపరీతమైన స్పందన వచ్చింది. పేరడీల గురించి అప్పుడే చెప్పాం “ఎవరి మీదైతే పేరడీ రాశామో వాళ్ళు మెచ్చుకున్నప్పుడే ఆ పేరడీ విజయవంతమైనట్లు” అని. ఆ తొలి విడత పేరడీ ప్రయోగం ఒక్క రానారె విషయంలో తప్ప మిగిలిన అందరి విషయంలో ఆయా బ్లాగరుల ప్రశంసలు పొందింది. రానారె ‘ఇది నా స్టైలు కాదు’ అని నేరుగా చెప్పకపోయినా ‘ఇంకొకరి చేత రాయించవలసింది’ అన్నారు. తేడా ఎక్కడొచ్చిందో చరసాల గారు అక్కడే చెప్పేశారు – “రానారె అయితే పెదపంతులు అనేదానికి బదులు పెదయ్యవారు అనేవారేమొ” అని.

ఇక ఈసారి మరికొందరు బ్లాగ్వరుల బ్లాగుల పేరడీలు ఇస్తున్నాం. వీటితో పాటు కొందరి వ్యాఖ్యలు కూడా!

మొదట ఏ పేరడీ ఏ బ్లాగుదో కనుక్కోమని పాఠకులను కోరాం. ఐతే అలా కనుక్కోవలసిరావడం పాఠకుల రసాస్వాదనకు భంగం కలిగిస్తున్నందున ఏ పేరడీ ఏ బ్లాగుదో చెప్పేస్తున్నాం. ప్రయత్నించినవారందరికీ అభినందనలు!
—————————————————–

1. చీమను చంపితే తప్పేంటి?: రాత్రి నన్ను చీమ కుట్టింది. సహజంగానే నేను దాన్ని చంపేసి ఊడ్చేసాను. సృష్టిలో ప్రతి జీవికీ ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది. ఒక చెంపను కొడితే రెండోదాన్ని చూపించే రోజులు పోయాయి. దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను – ఇదే నేటి సూత్రం. నిజానికి ఇది నేటి సూత్రం కాదు, అతి పురాతన సూత్రం. జీవులు పుట్టినప్పటి నుండి పాటింపబడుతున్న సిద్ధాంతం. ప్రకృతి జీవికి నేర్పిన పాఠం. కాదనేందుకు మనమెవరం? అశోకుడు కళింగులపై దండెత్తితే వాళ్ళు లొంగిపోయారా? చచ్చేదాకా పోరాడలేదా? అలెగ్జాండరుతో పురుషోత్తముడు యుద్ధం చెయ్యలేదా? హిట్లరు దెబ్బను కాసుకునేందుకు దాదాపు యూరపు మొత్తం ఏకమై ఎదుర్కోలేదా? పాకిస్తాను నుండి ఎదురవనున్న పోటీని ఎదుర్కొనేందుకు భారత్ బాంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా నిలబెట్టడం, చైనా టిబెట్ ను ఆక్రమించడం, అమెరికాను వియత్నామ్ మట్టికరిపించడం, సద్దామ్ నుండి వచ్చే ముప్పును నివారించేందుకు బుష్షు ఇరాక్ ను అక్రమించడం.. ఇవన్నీ ఆ కోవలోవే! చీమను మనం చంపకపోతే అది మనలను కుడుతుంది. మన మంచం మీదకు చీమలు చేరితే దాన్ని ఎండలో వేసి చీమలను మాడ్చేస్తామా లేక జీవకారుణ్య సిద్ధాంతం వాడి దిండూ దుప్పటి తీసుకెళ్ళి కింద పడుకుంటామా? ఒకవేళ అలా పడుకున్నా అక్కడికి వచ్చి కుట్టకుండా ఉంటాయా? నన్ను కుట్టిన చీమను చంపక వదలను, అది నా పద్ధతి! లేకపోతే అదీ మళ్ళీ కుడుతుంది నన్ను.

అమెరికా నుండి ఉత్తరం ముక్క

2. చీమకాటు – బాసుపోటు: చీమ ప్రసక్తి రాగానే నాకు రెండేళ్ళ కిందట జరిగిన విషయం గుర్తుకు వస్తుంది. నేను హైదరాబాదులో ఓ MNC కంపెనీలో పనిచేసే రోజులవి. మా పెద్దాయన (అంటే మా బాసులెండి) కూడా అందరితోపాటే ఆఫీసు కాంటీనులో తినేవాడు. నేను మా కోటిగాడు మాత్రం ఆయన తిన్నాకో, తినేముందో వెళ్ళి తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయనతో మాత్రం తినేవాళ్ళం కాదు. ఆయన కంట పడేవాళ్ళమే కాదు. ఎందుకంటే.. యాసుకు యెనకా, పెద్దాయనకు పక్కనా ఉండొద్దంటారు కదండీ.. అందుకన్నమాట! పైగా మా కోటిగాడికి ‘బాస్వరం’ ఉంది. బాస్వరం అంటే బాసును చూస్తే జ్వరం రావడం అనే రోగం అన్నమాట. ఇన్ని బాధలు ఉండగా ఆయనకు ఎదురవడం ఎందుకు చెప్పండి. పొరపాటున మేం తింటూ ఉండగా ఆయన వచ్చాడనుకోండి.. తప్పించుకోడానికి కూడా మా కోటిగాడో మార్గం కనిపెట్టాడు. క్యాంటీనులో టేబులు తుడిచే రంగాగాడు మేము తింటున్నంతసేపూ వరండాను ఓకంట కనిపెట్టి ఉండి బాసు వస్తూంటే వెంటనే చెప్పేవాడు. మేం ఛక్ మని మా మా పళ్ళేలు తీసుకుని వంటగదిలోకి పోయి అక్కడే తినేసి, అట్నుంచటే దొడ్డిదారిన వెళ్ళిపోయేవాళ్ళం. “వీళ్ళిద్దరూ క్యాంటీనులో ఎప్పుడూ కనబడరెందుకబ్బా” అనేది మా పెద్దాయనకు పెద్ద పజిలు.

ఓ సారిలాగే మేం తింటూ ఉండగా పెద్దాయన రానే వచ్చాడు. రంగాగాడు మాకు చెప్పేసరికి కాస్త ఆలస్యమైంది. మేం పళ్ళేలు సర్దుకుని వంటగదిలోకి పారిపోయేలోగా ఆయన డైనింగు హాల్లోకి ఎంటరైపోయాడు. మేం వంటగదిలోకి పారిపోవడం చూడనే చూసాడు. గభాలున ఆయన కూడా వంటగదిలోకి పరుగెత్తుకొచ్చాడు. అది చూసిన మేము చటుక్కున సరుకుల బస్తాల చాటుకు వెళ్ళి మాయమై పోయాము. పాపం తెగ వెతికాడు గానీ మేం కనపడలా! మరి, మేమా మజాకానా!? పళ్ళేల్లో మిగిలింది అక్కడే తినేద్దామని కోటిగాడి చెవిలో గుసగుసగా అన్నాను. తొడ మీద ఛర్రుమంది. పీకల్దాకా కోపమొచ్చింది నాకు. “ఎందుకురా గిచ్చుతావు” అని గుసగుసగా అరిచాను. “నన్ను రెండు తొడలమీదా గిచ్చి, తిరిగి నన్నే అంటావా” అని వాడు పేద్దగా అరిచాడు. ఈలోగా తొడలమీదే కాక వీపు, కాళ్ళు చేతులు మొదలైన శరీర భాగాలన్నిటి మీదా గిచ్చడం మొదలైంది. ఒక మనిషికి ఒకే సారి అన్నిచోట్ల గిచ్చడం సాధ్యం కాదు కాబట్టి, అప్పుడు మా ఇద్దరికీ అర్థమైంది, మేము చీమల పుట్ట మీదే కూచ్చున్నామని. చెరో పొలికేక పెట్టుకుంటూ పళ్ళేలు గిరాటేసి, సరుకుల బస్తాల వెనక నుండి బయటికి వచ్చాం. ఎదురుగా నడుమ్మీద చేతులు పెట్టుకుని, కాళ్ళు విడదీసి పెట్టి, నిటారుగా ఆరడుగుల ఎత్తున నిలుచున్న మా పెద్దాయన, మొహమ్మీద ఘోరమైన పజిలింగు లుక్కుతో – అదేదో సినిమాలో మెల్కోటే లాగా!

“క్మాన్ ప్రసాద్, వాట్స్ రాంగ్ విత్యూ గైస్?” అని అంటున్నాడు. చీమల బాధలో మాకవి వినబడితేనా? వెంటనే ఆయన్ని ఓ పక్కకు నెట్టేసి, పరిగెత్తుకుంటూ పోయి అక్కడి బాత్రూములో దూరి ఒళ్ళంతా కడుక్కున్నాక కూడా తపన పూర్తిగా తీరలేదు. చీమకాటు కంటే బాసుపోటే నయమని అప్పుడు అర్థమైంది మాకు!

ప్రసాదం

3. చీమ చతురత: మొన్నొక రోజున రాత్రి భోంచేసాక మంచమ్మీద మేను వాల్చి, చిదానందంగా బాలమురళిగారి గంధర్వ గానాన్ని వింటూ అలౌకికస్థితిలో ఉన్నాను. బయట వర్షం పడుతోంది. కాస్సేపటి కిందటి వరకు హోరున కురిసిన వర్షం ఇప్పుడు చిరుజల్లుగా పడుతోంది. గదిలో నుండి బయటికి ప్రసరిస్తున్న వెలుతురులో చినుకులు తళతళా మెరుస్తున్నాయి. తెరచిన కిటికీల్లోంచి చల్లని తెమ్మెరలు. గదిలో మంద్రంగా “ఎందరో మహానుభావులు..” ఈ జీవితానికిది చాలు అనిపించేంటంత హాయి. మంచాన్ని కిటికీకి దగ్గరగా జరుపుకుని బయటకు చూస్తున్నాను. కిటికీలో గ్రిల్లుకు బయటి వైపున వాన నీళ్ళు నిలిచి ఉన్నాయి. ఆ నీళ్ళలో..

ఓ అశ్వత్థ పత్రం తేలుతూ ఉంది. ఆ ఆకు మీద – ఓ చీమ! చిన్నప్పుడు చందమామ పుస్తకంలో సృష్టి పుట్టుక గురించి చదివిన కథ గుర్తుకు వచ్చింది. నిజానికి గుర్తుకొచ్చింది కథ కాదు, ఆ కథకు శంకర్ వేసిన బొమ్మ – ఓ పెద్ద మర్రి ఆకు మీద పసి బాలుడు కాలు మీద కాలు వేసుకుని పడుక్కుని ఉన్న బొమ్మ! వటపత్రశాయి అయిన శ్రీమహావిష్ణువు! అచ్చు అలాగే ఈ రావి ఆకు మీద చీమ! భగవానుడి పదకొండో అవతారం కాదు గదా ఈ చీమ!! నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. సీడీప్లేయరు లోంచి “వటపత్రశాయికీ వరహాల లాలీ..” అంటూ సుశీల గారి గొంతు ప్రవహిస్తూంది.

చీమ నీళ్ళ బారిన పడకుండా కాపాడుదామని, ఆకును జాగ్రత్తగా నీళ్ళలోంచి బయటికి తీసి, కిటికీ ఈవలకు తెచ్చి, మంచమ్మీద పెట్టాను. సీడీ ప్లేయరు సీడీని మార్చేసింది. “ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ..” గది నిండా ఘంటసాల గళం. ఈ పాట వింటున్నప్పుడల్లా ఘంటసాల గారు నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారా అని అనిపిస్తూ ఉంటుంది. పాటలో లీనమైతే అలాగే ఉంటుందేమో! ఎంత చురుకైనదో ఈ చీమ, నేనా పాట గురించి ఆలోచిస్తూ ఉండగానే చకచకా నడుస్తూ ఆకు దిగింది, పక్క మీద పరుగెడుతూ నేను చూసుకునే లోపు నా కాళ్ళ దగ్గరకు వచ్చేసింది. నా కాలి కిందపడి అది నలిగిపోతుందేమో అని తప్పుకునే లోగా నన్ను కుట్టనే కుట్టింది. సరిగ్గా మోకాలు మీద అది కుట్టిన చోట తీవ్రమైన బాధ! చీమ ఎక్కడుందా అని చూసాను. కనబడితేగా!

వెనక్కి వాలి, దిండుకు చేరి మోకాలును రుద్దుకుంటూ ఉండగా పాట మారింది.. బాలూ గారు పాడుతున్నారు “బ్రోచేవారెవరురా..”

శ్రీకారం

4. చీమ కుట్టింది. కానీ ఎవరిని?: రాత్రి నన్ను చీమ కుట్టింది. మామూలుగా ఎవరికైనా పై వాక్యంలో ప్రముఖంగా కనిపించే భాగం “చీమ కుట్టింది” అనేదే! అయితే ఆ వాక్యాన్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. “నన్ను” అనే మాటను గమనించండి.

కుట్టడం చీమ సహజ గుణం. ప్రతీ జీవికీ స్వాభావికమైన గుణాలు కొన్ని ఉంటాయి అని ఓషో చెప్పారు. బుద్ధుడూ, ఏసూ, కృష్ణుడూ కూడా అదే మాటను అనేక రకాలుగా, అనేక భాషల్లో చెప్పారు. కాబట్టి చీమ కుట్టడం విశేషమెఏమీ కాదు, అది స్వాభావికమే! మరి విశేషమేంటో చెప్పుకోబోయే ముందు, చీమ కాటుకు పర్యవసానాలు చెప్పుకుందాం.. చీమ కుడితే ఏమౌతుంది? నెప్పి పుడుతుంది. రుద్దు కుంటాం, దద్దురొస్తుంది, మందు రాసుకుంటాం. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోతుంది. ఈ బాధలన్నీ ఎవరికి? కుట్టించుకున్నవారికి, కుట్టిన చీమకు కాదు! కాబట్టి మొదట రాసిన వాక్యంలో ప్రముఖమైన పదం ఏమిటి? “నన్ను” అనే మాట! ఈ “నా” అనే భావనే ప్రమాదకరమైనది. కేవలం కొన్నాళ్ళు నివసించడానికి ఆత్మ ఎంచుకున్న తొడుగే ఈ దేహం! ఈ దేహానికి కలిగే బాధలను తనవిగా ఆత్మ భావించరాదు. వచ్చేటపుడు ఒట్టిచేతుల్తోటే వచ్చాం, పోయేటపుడు అలాగే పోతాం. కానీ, మధ్యలో వచ్చే ఈ “నా” అనే భావనలే మనకు ఎంతో చెరుపు చేస్తాయి. చీమ “నన్ను” కుట్టింది అని అనుకోబట్టే కదా మనకు నెప్పి పుట్టేది?! అదే చీమ కుట్టింది అని మాత్రమే అనుకుంటే నెప్పి పుట్టేదా? లేదు! అంచేత నేను, నా, నన్ను అనే భావనలను విడనాడితే చీమ కుట్టిన నెప్పి మనకు ఉండదు అని నేను భావిస్తున్నాను. చీమ కుట్టకుండా జాగ్రత్త పడేవాడు ఉత్తముడు, కుట్టాక నన్ను కాదులెమ్మనుకునేవాడు మధ్యముడు, కుట్టింది బాబోయ్ అని ఏడ్చేవాడు అధముడు. నేను చెప్పాల్సింది చెప్పాను, వినకపోతే విననివాళ్ళ ఖర్మ.

తెలుగునేల

5. చీమ కుట్టింది – పీడాబోయింది:
చీమ నన్నూ కుట్టింది. కానీ బ్లాగులు రాయలేదే! వికీపీడియాలో రాసుకుపోయాను. తాగుబోతు లాగా వికీబోతును నేను. చీమకాటుకు సరైన మందు వికీపీడియాలో రాయడమే..
“భవిష్యత్తులో చీమ కుట్టకుండా ఉండాలంటే, ఒకవేళ కుట్టినా నెప్పి పుట్టకుండా ఉండాలంటే, ఒకవేళ పుట్టినా వెంటనే తగ్గిపోవాలంటే, ఒకవేళ తగ్గకున్నా ఆసుపత్రి పాలు గాకుండా ఉండాలంటే, ఒకవేళ పాలైనా, ప్రాణహాని లేకుండా ఉండాలంటే..వికీపీడియాలో వ్యాసాలు రాయండి. ఫలితం కనబడకపోతే ఇంకా రాయండి, ఇంకా ఇంకా రాయండి.”

క్రికెట్ పిచ్చిగాళ్ళను ఎర్ర చీమల చేత కుట్టిస్తే బాగుంటుంది. క్రికెట్ కాటుకు చీమ దెబ్బ! అన్నమాట. మనవాళ్ళు క్రికెట్ లో ఓడిపోయారనే బాధను ఈ విధంగా తేలిగ్గా మర్చిపోవచ్చు.
చీమ కాటుకు గురైన దురదృష్టవంతులు మన బ్లాగరులు కాగా, వారి బ్లాగులకు బలైన అభాగ్యుణ్ణి నేను. వారి టపాలు చదివి నాకు తోచిన కొన్ని వ్యాఖ్యలు రాస్తున్నాను.

1. చీమ కుడితే నెప్పి పుట్టక ఏం పుట్టుద్ది? రోట్లో చెయ్యెట్టి వేలు నలిగిందని వాపోతే ఎలా?
2. ఆడదైనా, మగదైనా చీమ చీమే, ఏది కుట్టినా నెప్పి ఒకటే. నిప్పు మనదే గదా అని చేత్తో పట్టుకుంటే కాలకుండా ఉంటుందా?
3. తన దాకా వస్తే గానీ తెలియదట! చీమ కుడితే పుట్టే నెప్పి అందరికీ ఒకటే, అందరూ అబ్బా అనే అంటారు!
4. చీమ కుడితే శారీరక బాధ మాత్రమే ఉంటుందనుకున్నాను, ఇలా పిచ్చి వాగుడు కూడా ఉంటుందనుకోలేదు
5. కంప్యూటరు లేనివాళ్ళు ఈ స్క్రీనుషాట్లను ఎలా తెరవాలో కూడా రాస్తే బాగుండేది.

ఈ బ్లాగులన్నీ చదివాక నాకో సినిమా టైటిలు తట్టింది, చూడండి. (పక్కది టాగ్ లైను!)
చీమ కాటుకు బ్లాగు దెబ్బ – నెప్పి తగ్గకపోతే మీ ఖర్మ!

పూతరేక్స్

6. Ant’s bite:
మా ఉషాకిరణ్ పిల్లలు మరీ తెలివి మీరి పోతున్నారు. ఇవ్వాళ ఓ విశేషం జరిగింది. తనను పక్కన ఉన్నవాడు గిచ్చాడని ఒకబ్బాయి ఫిర్యాదు చేసాడు. వాడేమో ‘లేదు టీచర్, నేను గిచ్చలేదు, వాణ్ణి చీమ కుట్టింది’ అని అన్నాడు. ఇద్దరూ నాయెదటే వాదించుకున్నారు కాసేపు. అయినా చీమ కుడితే గిచ్చినట్లు ఎందుకుంటుందిరా, నువ్వు గిచ్చే ఉంటావు అని అన్నాను. దానికి వాడు “మీకు తెలీదు టీచర్, రెండూ ఒకలానే ఉంటాయి” అని వాదించాడు. నాకు నోట మాట రాలేదు. అప్పుడు గట్టిగా వాదించలేక పోయాను గానీ, మరుసటి రోజు క్లాసులో వాడికి గట్టిగా చెప్పగలిగాను, ఆ రెండూ ఒకేలా ఉండవని. ఏమైందంటే..

ఆ రాత్రి.. సాయంత్రం ఆ పిల్లవాడు అన్నమాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎంత ధైర్యం ఈ కాలం పిల్లలకు? మీకు తెలీదు అని టీచరుతోటే వాదించగలుగుతున్నారు. అయినా, వాడన్నట్లు చీమ కుట్టడం, గిచ్చడం ఒకేలా ఉంటాయా? నా ఆలోచనలు చీమల వైపు మళ్ళాయి. సరిగ్గా ఆ క్షణంలో చీమ కుట్టిన నెప్పి అనుభవం లోకి వచ్చింది నాకు. కుడి కాలి చిటికెన వేలుమీద కుట్టిన చోట మొదలైన నెప్పి నిదానంగా ఒళ్ళంతా పాకుతూ ఉంటే స్పష్టంగా తెలుస్తూంది నెప్పి నడక. శరీరమంతా గోక్కోవాలన్నంత తహతహ. గిచ్చితే పుట్టే నెప్పి ఈ నెప్పిలో సహస్రాంశమైనా ఉండదు. నిన్నటి క్లాసులో ఆ పిల్లవాడికి చీమే గనక కుట్టి ఉంటే కప్పెగిరి పోయేలా ఏడ్చి ఉండేవాడు. ఆ రెండు నెప్పులకీ పోలికే లేదని తెలిసి వచ్చింది.

సౌమ్య

7. చీమలను చూచి నేర్చుకుందాం -1 : నిన్న నన్ను చీమ కుట్టింది. విశేషమేమిటంటే మన దేశంలో ఉన్నన్ని రకాల చీమలు బహుశా మరే దేశంలోను లేవని చెప్పొచ్చు – హిందీ దేశం, తమిళ దేశంతో సహా. ఎర్రచీమలు, గండుచీమలు, నల్ల చీమలు, కరెంటు చీమలు, ఆకుచీమలు, చలిచీమలు, వాన చీమలు, ఎండచీమలు ఇలా అనేక రకాల చీమలున్నాయి మనకు. వీటన్నిటిలోను పలనాడు, కడప, వరంగల్లు ప్రాంతాల్లో కనిపించే ఎర్ర చీమలు బహు ప్రమాదకరమైనవి. ఇవి కుడితే తేలు కాటును మించి నెప్పి పుడుతుంది. అయితే చీమలను తినడం వలన కళ్ళకు మంచిదని కొందరు అంటారు. అంత తెలివి తక్కువ వాదన మరొకటి ఉండదని నా ఉద్దేశ్యం. ఎప్పుడో తెలుగు జాతి సమైక్యంగా లేని రోజుల్లో హిందీ దురహంకార సామ్రాజ్యవాదులు ప్రవేశపెట్టిన భావజాలమిది. ఇటువంటి ప్రమాదకర ధోరణిని విడనాడవలసిన అవసరాన్ని తెలుగు జాతి గుర్తించాలి. ఇకపోతే చీమల నుండి తెలుగుజాతి నేర్చుకోవాల్సింది బోలెడుంది. ముఖ్యంగా వాటి లోని సమైక్య భావం, క్రమశిక్షణ. తెలుగు వారు వాటి సమైక్యతలో లేశమాత్రం అలవర్చుకున్నా నేడీనాడు హిందీ వారికి సామంతులుగా ఉండాల్సిన ఖర్మ పట్టేది గాదు. కనీసం, తనదారికి అడ్డొచ్చిన వారిని కుట్టి పారేసే వాటి పొగరు మనకు ఉన్నా బాగుండేది. చీమల నుండి మనం నేర్చుకోవాల్సినవి మరింత వివరంగా తరువాతి టపాలో..

తెజావా

8. ఎందుక్కుట్టావు?:
ఎందుకిలా చేసావు?
నీకేం అపకారం చేసాను?

నా గదిలో ఓ మూలన
నీకోసం బహు వీలున
ఇచ్చానో జాగాను
చక్కని పుట్టను కట్టుకోను

నా మంచంలో, కంచంలో
అప్పచ్చుల టిఫినుల్లో
పంచదార డబ్బాలో,
ఏడ తిరిగినా, ఏమి చేసినా
ఇదేమని నిన్ననలేదే!

ఐనా, ఎందుకీ పని చేసావు?

నా దారిన నేపోతూ
పొరపాటున నీ కడ్డొస్తే
చిటికెన వేలును కొరికేసావే
కృతఘ్నతకు తెరతీసావే!

చీమత్వాన్నొదిలేసి
మనిషిలా మారిన ఓ చీమా!
నీలోని స్వార్థాన్ని చంపేసి
కృతజ్ఞతను కప్పుకుని
మళ్ళీ చీమగ ఎప్పుడు పుడతావు?
..ఎప్పుడు పుడతావు?

రాధిక

9. చీమకాటు ఎంతో ఘాటు: అసలేమిటీ చీమల గొప్ప? పిపీలికా ఘాతం నాక లోక విహరణం అని భర్తృహరి అంతటి వాడే చెప్పాడు. చీమల కాటు ఎంత ఘాటో ఇక వేరే చెప్పాలా?అయితే చీమ కాటు వలన కలిగేదాన్ని నెప్పి అని అనరాదని చాలా మందికి తెలియదు. నేనీ విషయాన్ని మరో బ్లాగులో వివరించాను. అయితే కుట్టడం అని మనం అనుకుంటున్నది అసలు కుట్టడమే కాదని, అది ముద్దాడడమని కూడా చదివాను. ఈమధ్యే శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిందట. సైన్సు పేరిట ఏం చెప్పినా నమ్మాలని ఈ శాస్త్రవేత్తలు అనుకుంటారు. అన్నీ తమకే తెలుసనీ అనుకుంటారు. సైన్సుకు తెలిసింది పిపీలికమంత, తెలియనిది బ్రహ్మాండమంత. తెలియనిదాని గురించి తెలుసుకోవాలంటే మన శాస్త్రాలు చదవడం తప్ప మరో మార్గం లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న సత్యం వీళ్ళెరుగుదురా అని నా సందేహం!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

10. చీమ కాటుకు మందూ మాకూ: మా సుభాస్ రాసుకుంటాడని పలకా, బలపం కొనిచ్చాను. బలపాన్ని వాడే కొత్త పద్ధతులు కనిపెట్టాడు వాడు. ఎక్కడ కంత కనబడితే అక్కడ బలపాన్ని దూర్చడం మొదలుపెట్టాడు. ముందు ముక్కులో పెట్టుకున్నాడు, కష్టమ్మీద దాన్ని బయటికి తీసాను. కాసేపటి తరువాత చూస్తే హాల్లో మూలన ఏదో చిన్న కంతలో దూర్చాడు. తీసిద్దాం కదా అని వేలు అందులో పెట్టాను. అది చీమ ఇల్లని నాకు తెలిసేలోగా కసుక్కున వేసేసింది ఓ చీమ. వెంటనే అమృతాంజనం రాసుకున్నాను. చప్పున తగ్గిపోయింది. చీమకుడితే అమృతాంజనం అంతటి మందు మరోటి లేదు. అమృతాంజనం అందుబాటులో లేకపోతే జిందా తిలిస్మాత్ వాడొచ్చు. నాకీ సంగతి మా నాయనమ్మ చెప్పింది. ఈ సంగతి బ్లాగు వీరులందరికీ వెంటనే చెబుదామనిపించి ఆఫీసుకు వెళ్తూ కారులో ఇది రాస్తున్నాను.

శ్రీక్ష్ణదేవరాయలు

11. చీమలొస్తున్నాయి, మీ రక్తం పట్రండి!: అసలా కుట్టిన చీమ ఏ దేశందా అని గమనించి చూసాను.. మతి పోయింది నాకు. తలమీద నక్షత్రాలు, నడ్డి మీద అడ్డగీతలు..అది అమెరికా చీమని చూడగానే తెలిసిపోతూనే ఉంది. అమెరికా వాడు ఇక్కడికొచ్చి కాసిని డబ్బులు విదిల్చి, మన దగ్గరి నుండి రక్తం తీసుకు పోయే దాని కోసం జెనెటికల్లీ ఇంజనీర్డ్ చీమలను తెచ్చాడు. ఇక మన చంద్రబాబు, వయ్యెస్సులు- వాడు మనకేదో మహోపకారం చేస్తున్నాడని నెత్తిన కూచ్చోబెట్టుకుంటున్నారు. మన బంగారం మంచిదైతే గదా, కంసాలిని అనేందుకు!

గుండెచప్పుడు

12. ఆడచీమలు, మగ అహంకారం: పొద్దున నేను చేసిన పచ్చిమిరపకాయ హల్వా ఎంత రుచిగా ఉందో చెప్పలేను. చీమలకు కూడా బాగా నచ్చినట్లుంది; తెగ చేరాయి దాని చుట్టూ! హల్వా రుచి చూడగానే ఏంటో మరి, పిచ్చెక్కినట్టు ఒకటే పరుగులు! ఆ పరుగులకు నేను అడ్డం వచ్చానని కాబోలు.. కసుక్కున వేసేసాయి, ఒకదాని వెంట మరోటి. నెప్పి అదిరిపోతోంది.
అసలు చీమ కుట్టింది, కుట్టింది అని అంటారే గానీ, చీమ కుట్టాడు అని అనరేంటి? కుట్టేవన్నీ ఆడచీమలే, మగచీమలసలు కుట్టవనా? ఎంత వలపక్షమో చూడండి.. మనిషి కంటే హీనజీవులైన జంతువులన్నిటినీ ఆడ, మగ తేడా లేకుండా స్త్రీలింగంలోనే సంబోధిస్తాం. అంటే హీనజీవులను స్త్రీ లింగాలుగా గుర్తించినట్లే కదా! ఇదీ స్త్రీజాతి పట్ల మగవాడికున్న గౌరవం!

సరే, అంతా చదివారు గదా, ఇక కింద నేనడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
1. చీమలు ఆడవాళ్ళనే ఎక్కువ కుడతాయి ఎందుకు?
2. ఓ ఇంట్లోని చీమల పుట్టలో ఆ ఇంటి ఇల్లాలు వేలు దూర్చింది. అయినా చీమలు కుట్టలేదు. ఎందుకని?
3. నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి ప్రపంచంలో ఉన్న చీమలెన్ని ?
4. కుక్కలు భౌ, భౌ మంటాయి, పిల్లులు మ్యావ్, మ్యావ్ అంటాయి. మరి చీమలు ఏమంటాయి?
5. ఆడ చీమ జీవితకాలమెంత?
6. చీమలు గతజన్మలో ఏ పాపం చేసి ఉంటాయి?

జ్యోతి

13. చీమల పాలైన వీకెండ్: వీకెండ్ల పనీ గినీ ఏముండదు గదాని, లేటుగ నిదర లేసిన. పొద్దుగాలే లేచి చేసెడిదేముంది? లెగిసీ లెగవంగనే ఇదుగో నా బ్లాగుల రాసుడు మొదలు బెట్టిన. కంప్యూటర్ల నేను ఇట్ల టైపు చేస్తనే ఉన్న, పక్కనుండి ఏదో లైను కదులుత కానొచ్చింది. ఏందా అని చూసినా..వందలాది చీమలు. మందలుగా చీమలు. ఏడికెల్లి వచ్చినై అన్ని చీమలు? ఒక్కదానెన్క ఇంకోటి- సైనికుల మల్లె!? వస్తనే ఉన్నై, లైను తెగుతనే లేదు. అమెరికాల చీమల్ని చూసుడు ఇదే మొదటిసారి. వరంగల్ల, హన్మకొండల ఇంతకన్న పెద్ద చీమల్ని చూసినా గానీ.. హమ్మా!కుట్టింది చీమ.

జేప్స్

14. చీమలే లేని దేశంలో..: నిజానికి ఝరియాలో చీమలనేవి కంటికి కనబడవు. అబ్బే సమస్య కళ్ళది కాదు, చీమలదే! ఇక్కడ చీమలస్సలు లేవు! అయితే ఒకప్పుడు ఇక్కడ కూడా పుట్టలు పుట్టలుగా, గుట్టలు గుట్టలుగా చీమలు ఉండేవట. వాటితో రకరకాల వంటలు చేసుకు తినేవారట – చీమల వేపుడు, చీమ బిరియానీ, చీమావకాయ, చీమల ఉప్మా, ఎర్రజీమల పులుసు, చీమ నూడుల్సు – ఇలా రేపుమాపు చీమలనే తినేవాళ్ళట. ఆ తాకిడికి, దేశంలోని చీమలన్నీ అయిపోయి, చీమజాతే అంతరించిపోయిందట. ఇది మా చీమాయణం! అంచేత నాకు చీమ కుట్టలేదు!

ఆహా, చీమలు లేని ఝరియాకు కోరి వలస పోదామా అని పాడుకుంటూ బట్టలు సర్దేసుకోకండి.. అవి లేకున్నా వాటి తాతల్లాంటి దోమలు ఉన్నాయిక్కడ. ఈ దోమలే రెండింటి పనీ చేసేస్తూ ఉంటాయి. రేయనకా, పగలనకా శ్రమిస్తూ, జనాన్ని కుట్టేస్తూ ఉంటాయి. ఇక్కడివాళ్ళకు కళ్ళు ఉబ్బెత్తుగా ఎందుకుంటాయో మీకు తెలుసా? రాత్రి పూట ఈ దోమల దెబ్బకు నిదర్లుండవు కదా. అందుకని పాపం నిద్ర కోసం మొహం వాచిపోయి, అలా కళ్ళు వాచిపోయి ఉంటారన్న మాట. ఇప్పుడు చెప్పండి, ఝరియాకు ఎప్పుడొస్తారు?

సత్యశోధన

15. జనరేషను కాటు: ఏంటసలు ఈ పెద్దల దాష్టీకం? ప్రతీదానికీ మీ కుర్రకారు ఇలా అనకూడదు, అలా రాయకూడదు అని strictures పెడతారేమిటి? తల దువ్వుకుంటే తప్పు, దువ్వుకోకపోతే తప్పు, నూనె రాసుకుంటే తప్పు, రంగేసుకుంటే తప్పు. లుంగీలు కట్టుకుంటే తప్పు, లాగులు తొడుక్కుంటే తప్పు. మొన్నటికి మొన్న.. ఆఫీసు canteenలో చీమకుట్టింది. “హబ్..బా, చీమ కుట్టిందిరా” అని ఓ కేక పెట్టి, కుట్టిన చోట రుద్దుకున్నాను. నెప్పి పుడితే ఆ మాత్రం అనరా, రుద్దుకోరా!!? పక్క table దగ్గర కూచ్చున్న మా HR Manager అది విన్నాడు. అంతే ఇక క్లాసు మొదలు.. “చీమ కుట్టినంత మాత్రాన అలా అరవాలా, ఆ మాత్రం ఓర్చుకోలేక పోతే ఎలా? ఎందుకు పనికొస్తారయ్యా మీ కుర్రాళ్ళు? అదే మా generation లో అయితేనా.. తేలు కుట్టినా కిక్కురుమనే వాళ్ళం కాదు” అంటూ వాయించేసాడు. చీమ కుట్టిన బాధ కంటే ఈ వాయింపు బాధ ఎక్కువైపోయింది. (అసలు వీడో దొంగై ఉండాలి. దొంగలు తేలు కుడితే అరవరుగా!)
అన్నట్టు, నాకో పెద్ద తేలు కావాలండి, చిన్న పనుంది. ఎక్కడ దొరుకుతుందో కాస్త చెబుతారా?

ప్రవీణ్

16. చీమ కాటుకు కందం వేటు: చీమ కుట్టడం అనేది గొప్ప విషయం కాదు. అది అరుదూ కాదు. అసలు చీమ కుట్టినంత మాత్రాన మిన్ను విరిగి మీదేమీ పడిపోదు. కాకపోతే ఏ నడివీపునో కుడితేనే కాస్త కష్టంగా ఉంటుంది. వీలుగా ఉన్నచోట కుడితే మరేం ఫరవాలేదు. అడిగారూ? నాకు తెలుసు, వీలు అంటే ఏంటని మీరడుగుతారని! ఇప్పుడు చూడండి.. రాత్రి నన్నో చీమ కుట్టింది. అదృష్టవంతుడు అంబులెన్సు కింద పడ్డట్టు, చక్కటి వీలైన చోటే కుట్టిందా చీమ. సరిగ్గా కుడి మోకాలు మీద కుట్టింది. కూచ్చున వాణ్ణి కూచ్చున్నట్లే ఉండి, చేత్తో కుట్టిన చోట రుద్దుకున్నాను. కనీసం వంగునే పని కూడా లేదు. అదే ఏ వీపు మీదో కుట్టిందనుకోండి.. వీపును గోడకేసి రుద్దుకోడం తప్ప మరో మార్గం లేదు కదా! అదన్నమాట “వీలు” అంటే! అయితే ఒకటి.. అందింది కదా అని ఓ.. గోకేస్తే కందుద్ది. నైసుగా, సుతారంగా రుద్దుకోవాలన్నమాట. ‘కుట్టడం చీమ లక్షణం, గోకడం మనిషి గుణం’ అని అనకండి, గోకినపుడు కందడం చర్మధర్మం మరి!

అందింది గదా అని పడేసి గోకడం, కందింది గదా అని లేహ్యాలు నాకడం – ఇవన్నీ ఏమీ చెయ్యకండి. హాయిగా ఓ కందం అందుకోండి. నెప్పీ గిప్పీ వీజీగా మటుమాయ మౌతాయి. కందం అంటే ఏంటి, అదెలా రాయాలి, కందంలో అందమెక్కడుంది.. లాంటి ప్రశ్నలడిగారో – వెయ్యి నూట పదారు గుంజీళ్ళు తియ్యాలి, మీ ఇష్టం! మచ్చుకో కందం..

చీమల బాధకు తాళక
కోమల చర్మము గోటితొ గోకకు సుమ్మీ!
విమలత చిందే జత కం
దములల్లుము బాధ కలుగదు బ్లాగ్వీరా!

కొత్తపాళీ

17. చీమకాటుః చీమ కుట్టడం చాలా సహజం, దానిమీద ఈ టీవీ చానెళ్ళన్ని అంత సమయాన్ని ఎందుకు వృధాచేస్తున్నాయి? మరో విషయమే లేదా? చీమల గురించే చెప్పవలసి వస్తే, చీమలు కుట్టడం గురించి కాదు, చీమల పుట్టల గురించి చెప్పొచ్చు కదా? మన టీ.వి. వాళ్ళకి అంత ఆలోచనక్కెడది?

చీమల పుట్టలు, తేనెల తుట్టల వెనక చాలా మర్మం ఉంది. ఒకప్పుడు మనుషుల్లాగనే చీమలు, తేనెటీగలు కూడా చాలా గొప్ప, గొప్ప నగరాలు, సామ్ర్యాజ్యాలు స్ఠాపించేయట. కాని, ఏంత సేపూ, తిండిగురించి, బౌతికావసరాల మీదే శక్తి అంతా కేంద్రీకరించటం వల్ల, కాల క్రమంలో – ప్రకృతికి వాటి వల్ల ప్రయోజనం లేకపోయింది. చివరకి, చీమలకి, తేనెటీగలగీ మద్య చెలరేగిన ప్రపంచ యుద్దాలలో వాటి అస్తిత్వాన్ని పోగొట్టుకొని, ఇదుగో, ఇప్పుడు – అతి సూక్ష్మ రూపాలతో బతుకులీడుస్తున్నాయి.

అందుకే వాటికి, ఇప్పటికీ ఒకప్పటి క్లిష్టమైన సాంఘిక వ్యవస్త ఉన్నప్పటికీ, ఎంతసేపూ తిండి సంపాదించటం మీదనే ధృష్టి అంతా. పూర్వ జన్మ వాసనలు ఇంకా పోలేదు – అందుకే చీమలూ, తేనెటీగలూ – కొద్దిగా అలజడి జరిగినా, వాటి పుట్ట దగ్గరకి ఎవడైనా పోయినా – వెంటనే దండయాత్ర ప్రకటించెస్తాయి – మనుషుల్లాగనే.
We must remember that super specialization leads to anthills and beehives.

శోధన

వ్యాఖ్యల పేరడీ:

1. mee blaagu eMtO baaguMdaMDi. cheema kuDitae neppi puDutuMdani cakkagaa teliyajeppaaru. -రాధిక

2. అయితే అమృతాంజనం రాస్తే చీమ కుట్టిన నెప్పి తగ్గుతుందంటారు! కానీ మా భట్టుపల్లె పిలకాయలు అట్ల అనుకోగా నాకెప్పుడు వినబళ్ళా, చెవినబళ్ళా. -రానారె

3. త్రివిక్రమ్, మంచి విషయాలే చెప్పావయ్యా! చీమలకే పళ్ళుండి ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తోంది. -కొత్తపాళీ

4. చీమ కుడితే నెప్పి పుట్టడం అనేది భ్రమ మాత్రమే! నెప్పి నాలుగు రకాలని బంధకుని బాధా శాస్త్రం ఘోషిస్తోంది. కీటక ఘాతం, శస్త్ర ఘాతం, నిందా ఘాతం, ప్రణయ ఘాతం -ఇవీ ఆ నాలుగు. కీటకం కుడితే పుట్టేదీ, ఆయుధం తగిలినపుడు కలిగేదీ, నిందించినపుడు పొందేదీ, ప్రణయంలో రేగేదీ అయిన నాలుగు నెప్పులే లోకంలో ఉన్నాయి. చీమ కీటకం కాదు (ఎందుక్కాదో మరోసారి వివరిస్తాను) అంచేత అది కుడితే పుట్టేది నెప్పి కాదు. కాబట్టి ఇకపై చీమ కుట్టింది, నెప్పి పుట్టింది అంటూ రాయొద్దని బ్లాగరులకు మనవి. -బాలసుబ్రహ్మణ్యం

5. ఝరియా దోమలు ఎంత మర్యాదగా ఉంటాయో మీరింతగా చెప్పాక కూడా వస్తామా? అన్నట్టు పొద్దు లో పెట్టిన మీ ఫోటో మీరు ఝరియా వెళ్ళక ముందుది అనుకుంటాను. అవునా సార్? -జ్యోతి

6. మీ వాదన నాకు అర్థం కాలేదండీ. ఇప్పుడు రానారె, ఇస్మాయిల్ ల సంగతే చూడండి.. చీమ వాళ్ళ దగ్గరికి వచ్చి కుట్టలేదు. పాపం వాళ్ళే చీమల పుట్టలో వేలు పెట్టి మరీ కుట్టించుకున్నారు. మరి శివుడు ఆజ్ఞ ఇవ్వడమే నిజమైతే ఆజ్ఞ ఎవరికి ఇచ్చినట్లు, ఏమని ఇచ్చినట్లు? కుట్టమని చీమలకా? లేక కుట్టించుకొమ్మని రానారె, ఇస్మాయిల్ లకా? -స్పందన

7. యత్ర పిపీలికం నాస్తి తత్ర రమంతి దేవతా! -ఒరెమూనా

8. కంప్యూటరు లేకుండా స్క్రీనుషాట్లు తెరిచే వీలు ప్రస్తుతానికి లేదు. కాబట్టి చీమకాటుకు నివారణ మార్గం లేనట్లే! అంచేత, కంప్యూటరు లేని వాళ్ళు చీమల జోలికి వెళ్ళకూడదు. వెళితే, వాళ్ళ ఖర్మ!
-ప్రవీణ్

9. గండు చీమలు కుడితే పేపర్లల్ల మంచిగ హెడ్డింగులు బెట్టి రాస్తరు. కరెంటు చీమలు కుడితే అస్సలు రాయరు. ఎందుకంటే గండు చీమలు అంధ్రల ఉంటయి, కరెంటు చీమలు తెలంగాణల మాత్రమే ఉంటయి, అందుకని! -జేప్స్

10. కడుపుబ్బ నవ్వుకున్నానండి. పొట్ట చెక్కలయ్యిందనుకోండి. బస్తాల చాటు నుండి బయటికి రాగానే మీ బాసు ఎదుట పడిన సీను తలచుకుంటే నాకూ సరిగ్గా “శ్రీవారికి ప్రేమలేఖ” లోని మెల్కోటే యే గుర్తొచ్చాడండి. పాత ఉద్యోగంలో ఉన్నపుడు మావారిక్కూడా అలాంటి బాసే ఉండేవాడు. ఆ విషయమూ గుర్తొచ్చింది. అయినా బాసు పక్కన కూచ్చోడం మంచిది కాదనుకుంటే సుబ్బరంగా ఏ వెనకో కూచ్చోవచ్చు గదా, అలా పారిపోయి కష్టాల్లో పడే బదులు? -సిరిసిరిమువ్వ

11. బాగా రాసారు. కానీ ప్రతీదానిలోనూ రాజకీయాలను చొప్పించడం వలన మీ బ్లాగు మరీ మొనాటనస్ గా అవుతోందని నా అభిప్రాయం! ఈ సలహా ఇచ్చే చొరవ నాకుందని అనుకుంటున్నాను.. -సి.బి.రావు

Posted in జాలవీక్షణం | Tagged , | 22 Comments

కబుర్లు

ఆడవాళ్ళు ఎలాంటి మగవాళ్ళ పట్ల ఆకర్షితులౌతారన్నది మగవాళ్ళకు ఎప్పటికీ అర్థం కాదు. పోనీ, ఆడవాళ్ళు ఎలాంటి మగవాళ్ళను పెళ్ళాడ్డానికి ఇష్టపడతారు: అందగాళ్ళనా?ఆస్తిపరులనా? లేక వేరే ఏవైనా అంశాలకు ప్రాధాన్యతనిస్తారా? ఈ విషయం తెలుసుకోవడానికి ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంక్‍షైర్ వాళ్ళొక సర్వేక్షణ జరిపారు. నవమన్మథులను, వృత్తి ఉద్యోగాల్లో దిగ్విజయంతో దూసుకెళ్తున్నవారిని పెళ్ళాడడానికి ఆడవాళ్ళు అంత ఆసక్తి చూపరని ఆ సర్వేక్షణలో తేలిందట! అలాంటివాళ్ళు పెళ్ళాలను పట్టించుకోకుండా పనిలో నిమగ్నమవడమో, లేక పరస్త్రీలకు దగ్గరవడమో చేస్తారేమో…నని అమ్మాయిల అనుమానమట! హూ…ఆడవాళ్ళు మగవాళ్ళకు ఎప్పటికి అర్థమౌతారో!! ఏమైనా దీన్నిబట్టి చూస్తే పెళ్ళీడు కుర్రాళ్ళు పనిరాక్షసులవడం, అందంగా ముస్తాబవడం అంత మంచిది కాదేమో? 😉 పెళ్ళికి సిద్ధమౌతున్న తెలుగు బ్లాగులోకపు యువకులూ! వింటున్నారా?

వేలిముద్రలకు బదులు: జర్మనీలో దొంగతనానికెళ్ళిన ఒక దొంగ దురదృష్టవశాత్తూ సంఘటనాస్థలంలో ఒక వేలు తెగ్గొట్టుకున్నాడు. “ఒక వేలు పోతే మాత్రమేం…’వేలు’ వస్తున్నప్పుడు?” అని తెగినవేలి సంగతి పట్టించుకోకుండా అందినకాడికి మూటకట్టుకుని హడావుడిగా పారిపోయాడా దొంగ. తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వేలిని చూసి తెగ ఆశ్చర్యపోయారు, ఆ పైన సంబరపడిపోయారు: “సాధారణంగా దొంగలు నేరం జరిగినప్రదేశంలో వేలిముద్రలు వదిలి వెళ్తుంటారు. ఈయనెవరో ఏకంగా వేలినే వదిలేసిపోయాడు” అని ఆనందంగా ప్రకటించేసి, ఆపైన నేరుగా వెళ్ళి దొంగను అరెస్టు చేశారు. బహుశా ఇప్పుడా దొంగ నాలుక కూడా తెగేలా కొరుక్కుంటున్నాడో ఏం పాడో?

పదోన్నతి కావాలా? ముందిది చెప్పండి: “తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి?” అని ఛీత్కరించాడు వేమన. చైనాలోని ఒక కౌంటీ ప్రభుత్వం అలాగే అనుకుందేమో దీన్ని తమకు తోచిన రీతిలో ఆచరించి చూపబోతోంది. ఎక్కడైనా ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలంటే పనితీరు చూస్తారు. కుదరకపోతే సీనియారిటీ చూస్తారు. కానీ చైనాలోని ఛాంగ్యువాన్ అనే కౌంటీలోని ఉద్యోగులకు మాత్రం వాళ్ళు తమ తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటున్నారనేదాన్ని బట్టి పదోన్నతిని నిర్ణయిస్తారట. ఎంత మంచి ఆలోచనో కదా? ఇందుకోసం ప్రత్యేకంగా నియమితులైన దర్యాప్తు అధికారులు ఉద్యోగుల స్నేహితులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగువారు – అందర్నీ అడిగి వాస్తవాలు కనుక్కుంటారట. ఆ వాస్తవాల్లో భాగంగా సదరు ఉద్యోగులు కుటుంబసంబంధాలకు ఎంత విలువిస్తారనే కాక వాళ్ళకు తాగుడు, జూదం లాంటి అలవాట్లేమైనా ఉన్నాయా అని కూడా ఆరా తీస్తారట.

భూమ్మీద పోటీ – అంతరిక్షంలో పరుగు:

భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమ్మీద జరిగే పరుగు పందెంలో రోదసి నుంచి పాల్గొని చరిత్ర సృష్టించారు. ఆమె ఏప్రిల్ ౧౬న జరిగిన బోస్టన్ మారథాన్ లో భూమ్మీద బోస్టన్ నగరంలో ౨౪,౦౦౦ మంది పరుగులు తీస్తున్న సమయంలోనే భూమి చుట్టూ క్షణానికి ఐదు మైళ్ళకంటే ఎక్కువ వేగంతో తిరుగుతూ భూమిని రెండుసార్లు చుట్టేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ట్రెడ్ మిల్ మీద రెండువైపులా లాప్-టాప్ కంప్యూటర్లలో భూమ్మీద జరుగుతున్న బోస్టన్ మారథాన్ పోటీలను వీక్షిస్తూ ఏకధాటిగా ౪ గంటలా ౨౪ నిమిషాల్లో ౨౬ మైళ్ళు పరిగెత్తారు. చిన్నపిల్లలు శారీరక దార్ఢ్యాన్ని పెంపొందించుకోవాలని, వ్యాయామం క్రమం తప్పక చెయ్యాలని ఆమె అన్నారు.వ్యాయామం చెయ్యడం చిన్నపిల్లలకే కాకుండా కలనయంత్ర ‘ గీకు’లకు కూడా అవసరమే కదా?

సమానత్వం వర్ధిల్లాలి:

పెళ్ళైన ఒక మగాడు పెళ్ళికానమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకోవడం నేరం కాదట కానీ పెళ్ళైన మహిళ పెళ్ళికాని మగాడితో సంబంధం కలిగి ఉండడం మాత్రం నేరమట. దానికి శిక్షగా జరిమానా గానీ, ఒక సంవత్సరం జైలుశిక్షగానీ విధిస్తారట. ఇదెక్కడి న్యాయం అనుకుంటున్నారా? ఇటీవలి వరకు ఉగాండాలో అమల్లో ఉన్న చట్టం అలాగే ఉండేది. వాళ్ళకూ అలాగే అనిపించిందేమో ఆలస్యంగానైనా తప్పు దిద్దుకున్నారు. కొంతమంది మహిళాన్యాయవాదులు పోరాడి ఆ చట్టాన్ని రద్దు చేయించారు.

పోలియో చుక్కల తీర్థం: బీహారులోని దేవాలయాల్లో పూజారులు చిన్నపిల్లలకు తీర్థప్రసాదాలకు బదులుగా పోలియో చుక్కలు వేస్తున్నారట. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రజలు-ప్రభుత్వాలు కలిసి ఉద్యమస్ఫూర్తితో నిర్వహించిన మహాయజ్ఞం పోలియో చుక్కల కార్యక్రమం. అంతకు ముందు నుంచే టి.బి.ని అరికట్టడానికి DOTS లాంటి కార్యక్రమాలైతే ఉన్నాయి గానీ కనీసం టి.బి. కేసులను గుర్తించే ప్రయత్నమైనా పూర్తిస్థాయిలో జరగలేదు. పోలియో గురించి ఇంత చేసినా బీహారులో నిరుడు 650 పైగా పోలియో కేసులు బయటపడడం ఆందోళన కలిగించే విషయం. దీనికి కారణం పేదరికం కాదు – అవిద్య, అజ్ఞానం, అపోహలు, మూఢనమ్మకాలు. ఆరోగ్య కార్యకర్తలను నమ్మని ప్రజలు పూజారులను సులభంగా నమ్ముతారు. దాంతో బీహారులోని ఆరోగ్యశాఖ అధికారులు వందలాది మంది పూజారులకు పోలియో చుక్కలు వేయడంలో శిక్షణ ఇచ్చి వాళ్ళచేత పిల్లలకు పోలియో చుక్కలు వేయిస్తున్నారు.

మరో మేరీ సెలెస్టే:1872లో పోర్చుగల్ తీరంలో ఒక ఓడ కనబడింది. అది వింత కాదు కానీ ఆ ఓడలో ప్రయాణీకులుగానీ, ఓడసిబ్బందిగానీ ఒక్కరుకూడా లేరు. అదే వింత అనుకుంటే వారి జాడ ఇంతవరకు కనబడకపోవడం మరీ వింత. ఆ ఓడ పేరు Mary Celeste. గతవారంలో ఆస్ట్రేలియా తీరంలో ఒక పడవ కనబడింది. దాంట్లో కూడా అచ్చం Mary Celeste లాగే ఒక్క మనిషి లేరు. కానీ ఇంజిన్ నడుస్తోంది, టేబుల్ మీద భోజనం సిద్ధంగా ఉంది, లాప్-టాప్ కంప్యూటర్ ఆన్ లోనే ఉంది, రేడియో, జి.పి.ఎస్. కూడా పనిచేస్తున్నాయి! ఇవన్నీ అమర్చిపెట్టుకున్నవాళ్ళేమయారోనని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెదుకులాట కూడా మొదలుపెట్టింది. రోజులు గడిచినా పోయినవారి జాడ మాత్రం తెలియలేదు! తెలుస్తుందన్న ఆశలు కూడా వదిలేసుకున్నారు.

కాఫీ సబ్బు: కాఫీ తాగనవసరం లేకుండా కేవలం స్నానం చేసినంతనే కాఫీ తాగిన ఫలితం కలిగేలా చేసే కొత్తరకం సబ్బు తయారైంది. ఆ సబ్బుతో స్నానం చేస్తే చాలు – రెండు కప్పుల కాఫీ తాగిన ప్రభావం కలుగుతుందట. అందుకోసం ఆ సబ్బులో కెఫీన్ కలిపి ప్రత్యేకంగా తయారుచేశారు. అలాగని ఆ సబ్బును చప్పరిద్దామనుకునేరు 😉

గాడిద గత్తర?: డల్లాస్ లో ఒక పెద్దమనిషి ఒక గాడిదను పెంచుకుంటున్నాడు. ఆ గాడిద భరించలేనంత బిగ్గరగా ఓండ్ర పెడుతోందని ఇంకొకాయన ఫిర్యాదు చేశాడు. దాంతో తన గాడిదగాత్రం మీరే విని నిజానిజాలు తేల్చండని ఆయన తన గాడిదను నేరుగా కోర్టులోని న్యాయమూర్తుల ఎదుటికి తెచ్చాడు. ఆ గాడిద చాలా అమాయకంగా, నెమ్మదస్తురాల్లా కనిపించి, న్యాయమూర్తులను ఆకట్టుకుంది! న్యాయమూర్తి కేసు కొట్టేయకముందే వాది, ప్రతివాదులు రాజీ కొచ్చారట.

పురాతన వృక్షం: 38 కోట్ల సంవత్సరాల క్రితం బ్రతికిన Wattieza జాతికి చెందిన చెట్టు అవశేషాలను 2004 జూన్ లో న్యూయార్క్ లోని ఒక క్వారీలో కనుగొన్న శాస్త్రవేత్తలు ఆ పురాతన వృక్షపు అవశేషాలను జాగ్రత్తగా ముక్కముక్కా పేర్చి దాని అసలు రూపురేఖలను కనుగొనే ప్రయత్నం చేశారు. ఆ అవశేషాలు 200 కిలోగ్రాముల బరువున్నాయట. 8 మీటర్ల ఎత్తున్న ఆ చెట్టు అవశేషాలను ముక్కలు ముక్కలుగా వెలికితీసి అతికించారు. దీంతో ఫెర్న్ అనే ఈకాలపు మొక్కతో ఈ చెట్టుకు గల పోలికలు స్పష్టంగా తెలిశాయని శాస్త్రవేత్తలు సంతోషిస్తున్నారు.

చింపాంజీకి పౌరహక్కులు!: వర్ణచిత్రాలనిష్టపడుతుంది, సందర్శకులను ముద్దాడుతుంది, టీవీలో వైల్డ్ లైఫ్ కార్యక్రమాలను ఆసక్తిగా చూస్తుంది. అద్దంలో అందం చూసుకుంటుంది, దాగుడు మూతలాడుతుంది, చక్కిలిగిలి పెడితే కిలకిలా నవ్వుతుంది. వీటన్నిటినీ మించి ఇప్పుడు తనకు బహుమతిగా వచ్చిన 3,400 ఆస్ట్రియన్ డాలర్లకు సొంతదారు. ఎవరో కాదు ఆస్ట్రియాలో ఉన్న 26ఏళ్ళ Hiasl అనే చింపాంజీ. ఇప్పుడు ఆ చింపాంజీకి పౌరహక్కులు వర్తింపజేయాలని కొంతమంది ఉత్సాహవంతులు కోర్టుకెక్కారు. న్యాయస్థానమేమంటుందో వేచి చూడాలి.

ఎంత కష్టం! ఎంత కష్టం!!:సరిహద్దులు-అడ్డుగోడలసలే లేని ఆకాశమార్గాన హాయిగా ఎగురుకుంటూ చైనా నుండి థాయిలాండుకొచ్చి జబ్బుపడిన పక్షి తను పుట్టిపెరిగినచోటికి తిరిగి వెళ్ళే దారి మూసుకుపోతే ఎంతకష్టం? పరాయిదేశంలో చచ్చేంత జబ్బు చేసి కోలుకున్న ఆ పక్షి ఇప్పుడు సరిగ్గా దిక్కుతోచని స్థితిలోనే ఉందేమో? థాయిలాండు వాళ్ళేమో అపస్మారకస్థితిలో ఉన్న ఒక ఏడాది వయసు రాబందుపిల్లను గమనించి దాన్ని శ్రద్ధాసక్తులతో ఆరోగ్యవంతురాల్ని చేశారు. ఇప్పుడు దాన్ని విమానంలో తిరిగి చైనాకు పంపేద్దామంటే చైనా వాళ్ళు ఆ పక్షికి థాయ్లాండులో ఏ బర్డ్ ఫ్లూ ఐనా సోకిందేమో అన్న అనుమానంతో అందుకొప్పుకోలేదట.

పైలటు తిడితే…ఫ్లైటు క్యాన్సిల్!: అమెరికాలోని లాస్ వేగాస్ నుంచి డెట్రాయిట్ వెళ్తున్న విమానంలో పైలట్ ఒక ప్రయాణీకుడిని తిట్టాడని నార్త్ వెస్ట్ ఏర్ లైన్స్ వారు ఆ పైలట్ ను దింపేసి విమానాన్ని రద్దు చేశారు.

ప్రయాణీకులు విమానం ఎక్కుతూ ఉండగా పైలట్ తన సెల్ ఫోన్లో మాట్లాడుతూ కాక్ పిట్ లోనుంచి బయటికి వచ్చి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. అతడి మాటలు (అచ్చమైన బూతులు) విమానమెక్కుతున్న ప్రయాణీకులకు స్పష్టంగా వినబడుతూ ఉన్నాయి. అతడు బయటికి రాగానే అవేం మాటలని ఒక ప్రయాణీకుడు ప్రశ్నించడంతో ఆ పైలట్ కోపం తెచ్చుకుని తిట్టాడు. దాంతో అధికారులు ఆ పైలటును ఫ్లైటు దింపేసి విమానాన్ని రద్దు చేశారు. తప్పు చేసిన పైలటు ఇంటికెళ్ళాడు సరే! మరి తామెళ్ళవలసిన విమానం రద్దై ప్రయాణీకులు ఇబ్బంది పడలేదా?

Posted in వ్యాసం | Tagged | 6 Comments

ఒక ప్రయోగం

మీలో మీ బాసుకు అసలు నచ్చని పది వికారాలు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారా? వివిధలో సుధాకర్ వాటి గురించే చెప్తున్నారు.
రాధిక గారి కవిత ఈ తరం గురించి చెప్తోంది.
ఇక సరదా శీర్షికలో జ్యోతి గారు ఈసారి ఆడాళ్ళ గురించి మగాళ్ళు చేసిన పరిశోధన ఫలితాలు చెప్పకుండా ఊరిస్తున్నారు.
ఇక ఈసారి ప్రత్యేక ఆకర్షణ, పైన చెప్పిన ప్రయోగం బ్లాగుల పేరడీలు.

పేరడీ అంటే జరుక్‌శాస్త్రి, జరుక్‌శాస్త్రి అంటే పేరడీ అన్నంతగా పేరడీలకు ప్రసిద్ధి పొందిన వెనుకటితరం కవి జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి. తర్వాత శ్రీరమణ పేరడీలు చాలా ప్రసిద్ధి పొందాయి.

వాళ్ళతో పోలికలు లేకపోయినా తెలుగు బ్లాగుల మీద పేరడీలు ప్రచురించే ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నం ఎలా ఉందో మీ అభిప్రాయాలు చెప్పండి. ప్రస్తుతం కొందరు బ్లాగరుల మీదే రాసినా అతిత్వరలో మరికొంతమంది బ్లాగులపై పేరడీలు రానున్నాయి. ఒక పేరడీ చాలని ఘనాపాఠీల మీద రెండేసి పేరడీలు కూడా రావచ్చు. కొందరు బ్లాగరులు రాసే వ్యాఖ్యలకు కూడా పేరడీలు సిద్ధంగా ఉన్నాయి. ఎవరి మీదైతే పేరడీ రాశామో వాళ్ళు మెచ్చుకున్నప్పుడే ఆ పేరడీ విజయవంతమైనట్లు. ఈ పేరడీలు మీకెంతవరకు నచ్చాయో, మిమ్మల్నెంతగా గిచ్చాయో తెలియజేయండి.

Posted in ఇతరత్రా | 2 Comments

బ్లాగుల పేరడీ – 1

తమను చీమ కుడితే తెలుగు బ్లాగరుల్లో ఒక్కొక్కరూ ఆ విషయాన్ని గురించి తమ తమ బ్లాగుల్లో ఏమని రాస్తారనే ఒక చిలిపి ఊహే ఈ బ్లాగుల పేరడీ. మరికొందరు బ్లాగరుల బ్లాగులు, వ్యాఖ్యలపై పేరడీలు త్వరలో…

అంశం: చీమకుట్టింది

వీవెన్:

చీమ కుట్టింది, నెప్పి పుట్టింది.

పప్పు నాగరాజు

చీమాయణం:
మన బ్లాగు వీరులందరూ చీమలమీద రాసిన టపాలు చదివేక నాకు కూడా చీమ-కుట్టింది. అదే, చీమలమీద ఓ టపా రాయలనే దుర్భుద్ది పుట్టింది.మనం మనుషులం కాని మాకులం కాదుగదా – నెప్పి తెలియకపోవడానికి. చీమో, దోమో, నల్లో, బల్లో – కుడితే నొప్పి తెలియని మానవుడుంటాడా. సరిగ్గా ఇది రాస్తున్నప్పుడే నన్ను చీమ కుట్టి నాకు నెప్పి పుట్టింది. ఇంత నెప్పి పుడుతోందేమా అని చూద్దును గదా అది చీమ, ఆడ చీమ!. నేనే పాపం చేసేనని అది నన్ను కుట్టింది? ఇది గిట్టనివారి కుట్ర కాదుగద? చీమల్లో కూడా ఆడచీమలు కుడితే నెప్పి ఎక్కువగా ఉంటుందని రసవాదంలో రాసేరు. కానీ ఇదేంటి, మరీ ఇంత నెప్పి పుడుతోంది? అయితే ఆడచీమలు కుట్టేది ఆపేక్షతోనే గానీ కసితో కాదని, వాటి మనసులో ప్రేమకే తప్ప పగకు తావు లేదని మగ పురుగులు గ్రహించాలి. నేను చీమ కుట్టినచోట మా ఆవిడ చేత కాపడం పెట్టించుకోవడానికి పోతున్నా.

అంచేత రెండో భాగం వచ్చేవారం.

చదువరి:

మిగిలిన చీమలన్నీ ఒక వరుసలో పడి క్రమశిక్షణగా పోతుంటే ఈ చీమొక్కటే అడ్డదారులు వెతుకుతూంది. నేనప్పుడే అనుకున్నా.. ఇదేదో రాజకీయ చీమ లాగుందే అని. దానికి బుద్ధి చెబుదామని వేలడ్డం పెట్టా. ఇంకేముంది, అసలే రాజకీయ చీమ, పైగా దాని తప్పుడు పనులకు అడ్డం వచ్చాను కదా.. కసుక్కున కుట్టేసింది. వామ్మో అని వేలు పిసుక్కునే లోగా, కిసుక్కున ఓ నవ్వు నవ్వి, మాయమై పోయింది. హబ్బ, ఇంకా నెప్పదరగొడుతోంది.

రానారె:

మా ఈరబల్లె బళ్ళో పిలకాయలకు నేనే లీడర్నని చెపినా గదా, అందుకని మా పెదపంతులు గారు నన్ను పిల్చుకోని “ఒరే రామనాథమూ, రేపు మనమెళ్ళే విహారయాత్రలో పిలకాయలనూ నివ్వే జాగ్రత్తగా చూసుకోవాల. వాళ్ళ సంగతి నీకే అప్పజెప్తా ఉండా” అని చెప్పినాడు. ఇగ జూసుకో నా రాజా, నాకు ఇమానమెక్కినట్లా అయిపోయినాది. యాత్రకెళ్ళే ఆ పొద్దు నాకు యమా ఉశారుగా ఉండాది. పిలకాయలంతా మనం చెప్పినట్టల్లా ఇనుకుంటారు గదా, ఎందుకుండదు మరి? మా క్లాసులో ఉండే ముని రత్నం గాడికి నేనంటే మా ఉక్రోశం, వాణ్ణి కాకుండా నన్ను లీడర్ను జేసినారని. యాత్రలో తమాశైన విషయం జరిగింది. పిలగాయలంతా ఓ చోట గుమిగూడి ఉన్నారు. ఏంది జేస్తా ఉండారు అని అడుగుతా నేను ఆడికి బోయినా. మా ముని గాడు ‘ఒరే రామూ ఈ బొక్కలో నా ఉంగరం పడి పోయినాదిరా, నాకు రాడం లేదు, తీసిపెట్టవా’ అని అన్యాడు. మీరంతా తప్పుకోండిరా అని నేను ముందుకెళ్ళి ఆ బొక్కలో నా వేలు పెట్టినా. ఏమి చెప్పమంటారు? చీమ కసుక్కున కుట్టింది. కళ్ళనీళ్ళు దిరిగినాయి గానీ, నేను లీడర్ని గదా, అందుకని నీళ్ళను కళ్ళ లోకి తోసేసుకుని, ఉచ్చ బోసుకుందామని చెట్టు చాటుకు బోయి, తనివిదీరా ఏడ్సినా. పిలగాళ్ళంతా నవ్విన ఇదానం తలుసుకుంటే ఇప్పటికీ ఏడుపొస్తాది నాకు.

విహారి:

నిన్నా కుట్టేసినాది, మొన్నా కుట్టేసినాది ఎర్ర చీమా,

దీనికి పొయ్యే కాలం రానూ, దీని ఆయువు మూడీ పోనూ.

– విలాప విహారి

శోధన:

ఎంతసేపూ చీమ కుట్టిందని మన గోల మనదే గానీ అసలా చీమను ముందు బాధపెట్టి అది తిరగబడి మనలను కుట్టేవరకు పరిస్థితిని తీసుకొచ్చిందెవరు అని ఆలోచించరేం? అసలు ఒక చీమకు మనిషంతవాణ్ణి కుట్టాలంటే ఎంత సాహసం కావాలి? ప్రాణాలు పోగొట్టుకునేంత వెర్రి సాహసం ఎవరైనా ఎప్పుడు చేస్తారు? ప్రాణాధారమైనదాన్నో లేక ప్రాణం కంటే విలువైనదాన్నో కోల్పోయినప్పుడే కదా? అది ఆలోచించకుండా మనలను చీమ కుట్టిందో అని గోలపెట్టడం ఒఠ్ఠి బాధ్యతారాహిత్యం. తాను చీమకు చేసిన అన్యాయానికి పశ్చాత్తాపపడకుండా గోలపెట్టే హక్కు చీమకాటు తిన్న మనిషికెవరిచ్చారు? లోపం మనలోనే ఉంది. ఆ లోపాన్ని గురించి ఆలోచించకుండా చీమకుట్టిందని బాధపడడం పిచ్చిపని.అబ్బా……..! చీమ నన్ను కూడా కుట్టింది బాబోయ్!

ఒరెమూనా:

ఓ రోజు
ఓ రాజు
ఓ కంత
ఓ చీమ
ఓ కాటు
ఓ కేక

ఆ వేలెవరిది?
ఈ అరుపెందుకు?


కోహం?
అహం బ్రహ్మస్మి
అహం విష్ణుహు
అహమేవా ఈశ్వరహ
??

యు.వెంకటరమణ:

చీమ కుట్టడం, దద్దుర్లు రావడం, మందు పూయడం, దద్దుర్లు తగ్గిపోవడం ఎలా ఉంటుందో ఈ పోస్టు వివరంగా తెలియజేస్తుంది. ఇక్కడున్న స్క్రీనుషాట్లను ఒకదాని తరువాత ఒకటి చూసుకుంటూ వెళ్ళండి.ఈ టపాలో మామూలు ఎర్రచీమకాటు గురించి వ్రాసాను. నల్లచీమకాటుకు, గండుచీమకాటుకు, కొరివిచీమకాటుకు విడిగా టపాలు వ్రాస్తాను.
గమనిక: ఈ స్క్రీనుషాట్లలో దద్దుర్లు మాత్రమే కనిపిస్తాయి, నెప్పి కనబడదు. ఇవి అన్ని ఆపరేటింగు సిస్టముల్లోను కనిపిస్తాయి. మీకేమైనా సందేహాలుంటే, చీమ
మిమ్మల్ని కుట్టాక నాకు రాయండి.

అంతరంగం:

చీమల్లోని ఐక్యత, భావ సమైక్యతను గమనిస్తే నాకు అబ్బురమనిపిస్తుంది. తమకు కలిగిన నాడు దాచుకుని లేనినాడు వాడుకునే వాటి అలవాట్లను చూసి మనమెంతో నేర్చుకోవాలని నాకు అర్థమైంది. పెద్దా చిన్నా తారతమ్యం లేకుండా కలిసిమెలిసి బతికే వాటి జీవిత విధానం చూసి.. మనుషులు కూడా అలా భేదభావాల్లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా బతకొచ్చు గదా అని ఆలోచనల్లో మునిగి పోయాను. ఇంతలో వేలు ఛర్రు మనిపించి ఉలిక్కి పడి చూస్తే ఏముంది.. ఓ చీమ కసుక్కున కొరికి పారిపోతోంది. హు.. వీటిలో మనుషుల లక్షణాలూ ఉన్నాయని తెలుసుకుని ఎంతో బాధపడ్డాను. అది కుట్టిన నెప్పి కంటే మనుషులకు తీసిపోని దాని ప్రవర్తన నాకెంతో బాధ కలిగించింది.

కల్హార:

చీమ కుట్టిన వెన్నెల వేళ

వెన్నెల జారుతూంది
జలతారు దారాల్లా

వెన్నెల తాగి
బరువెక్కిన కనుదోయి
మత్తులో మూసుకుపోయి
తీయని హాయిని అనుభవిస్తున్నాయి

సరిగ్గా అప్పుడు
చీమకుట్టిన చప్పుడు
చురుక్కుమన్నది చిటికెనవేలు
తళుక్కుమన్నవి కంటి కొసలు

కుట్టింది వేలినైతే
కంటి కెందుకో ఈ ప్రసవవేదన!

చీకటి కారుతూంది
కన్నుల కాటుకలా

అవీ-ఇవీ:

రాత్రి చీమ నన్ను ముద్దు పెట్టుకుంది. చీమ కుట్టడం విన్నాం గానీ ముద్దు పెట్టుకోవడమేమిటీ అని అనుకుంటున్నారా? కుట్టేందుకు అసలు చీమకు పళ్ళే లేవని మీకు తెలుసా? పళ్ళే లేకపోతే కుట్టడమేమిటి? కుట్టడమని మనమేదైతే అనుకుంటున్నామో అది కుట్టడం కాదు, అది మనలను ముద్దు పెట్టుకుంటున్నదన్నమాట! నిజం!! ముద్దుపెట్టుకున్నపుడు చీమ మీసాలు మనకు గుచ్చుకుని చురుక్కుమనిపిస్తాయి. దాన్ని మనం కుట్టడంగా అపోహ పడుతున్నాం. ఈ విషయాన్ని ఈ మధ్యే పరిశోధించి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలకు హిందూలో వచ్చిన ఈ లింకు చూడండి. కాబట్టి ఇకపై చీమ పుట్టలో వేలు పెట్టినపుడు వేలు చురుక్కు మంటే అది కుట్టిందని ఆక్రోశించకండి.. తన ఇంట్లోకి ఆహ్వానిస్తూ మిమ్మల్ని ముద్దెట్టుకుందని గ్రహించండి.

దీప్తిధార:


నేను ఇందాకటి టపాల్లో రాయడం మర్చిపోయాను. నేను బ్లాగు సమావేశాలకు హాజరవడం మొదలుపెట్టినప్పుడు లేదుగానీ నెల్లూరుకెళ్ళొచ్చాక ప్రతిసారీ నన్ను సమావేశస్థలిలో చీమలు కుడూతూనే ఉన్నాయి. అసలు నన్ను కుడుతున్నది లోకల్ చీమలు కాదు.

అవి రైల్లో నాతోబాటు ఇక్కడికొచ్చిన నెల్లూరు చీమలే. ఇది ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నానంటే నెల్లూరు చీమలు కుడితే కుట్టినచోట మొదటగా మంట పుడుతుంది. ఆ తర్వాత రుద్దిన కొద్దీ చిన్న దద్దు లేస్తుంది. చీమ కుట్టిన ప్రతిసారీ నాకు అచ్చం అలానే జరుగుతోంది.

అడవిలో అర్ధరాత్రి కూడా నాకు ఇలాంటి అనుభవాలు చాలానే కలిగాయి. ఇది చీమల మీద నేను రాయబోయే 10 టపాల్లో మొదటిది. చీమల గురించి ఇన్ని టపాలు రాయడానికి ఇంకో కారణం కూడా ఉంది. మా ఇంటిపేరు ‘చీమ’కుర్తి.

(గమనికః ఈ రచనలో వాడిన ఫోటోలు flickr.com నుంచి తీసుకోబడ్డాయి.)
బ్లాగుల పేరడీ 2 కూడా చూడండి

Posted in జాలవీక్షణం | Tagged , | 54 Comments

మీలో మీ బాసుకు నచ్చని వికారాలు

Sudhakarసుధాకర్ రాసే తెలుగు బ్లాగు శోధన 2006లో ఇండిబ్లాగర్స్ నిర్వహించిన పోటీల్లో, 2005లో భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో బ్లాగు. ఇవికాక ఆయన తక్కువ తరచుగా రాసే బ్లాగులు ఇంకో రెండున్నాయి. పొద్దులో సుధాకర్ నిర్వహిస్తున్న శీర్షిక వివిధ.

————————

మీ బాసుకు మీలో నచ్చని పది వికారాలు..ఇవీ…

బాస్ ని తిట్టుకోని వారు, పేర్లు పెట్టని వారు వుంటారంటే ఆశ్చర్యమే. ప్రతి ఒక్కరికి తన పై అధికారిలో నచ్చని చెత్త లక్షణాలు చాలా వుంటాయి. అయితే ఒక్కసారి అవతలి ఒడ్డు నుంచి మన వైపు చూస్తే ఎలా వుంటుంది?

ఇటీవల గార్డియన్ పత్రిక ఒక విశేష వ్యాసాన్ని ప్రచురించింది. అదేంటంటే మీ బాస్ కు నచ్చని పది లక్షణాలు ఏమిటి ? అని . అంటే ఇక్కడ బాస్ కోసం పని చెయ్యమని ఉద్దేశం కాదు. ఒక వుద్యోగం చేసేటప్పుడు వుండకూడని లక్షణాలను ఏరటమే ఈ వ్యాసం తాలుకా లక్ష్యం . అవి ఏమిటో చూద్దాం.

౦౧. ఆలస్యం

ఆలస్యాన్ని అస్సలు సహించలేరంట బాసులు. “బస్సు లేటయింది”, ” ఇస్త్రీ బట్టలు లేవు”, “పాప ఏడ్చింది” ఇలాంటివి వింటే కంపరమెత్తిపోతుందంట . ఎందుకంటే ఇవే విషయాలను మీలానే చాలా మంది అమాయకపు మొహాలతో చెప్తూ వుంటారు. అవి విని వినీ బాసుకు మండక ఇంకేమవుతుంది? ఆడ బాసులకైతే మరీ అరికాలి మంట నెత్తికెక్కుతుంది.

౦౨. ప్రయత్న లోపం

ప్రతీ దానికి బాస్ చెపితే చేద్దాం అని గోళ్లు గిల్లుకుంటూ కూర్చునే వారంటే బాసులకు తెగ అసహ్యం అంట. ప్రతీ పనికి సలహాలు అడగటం, వారిని CC లో పెట్టి మెయిల్లు రాయటం కూడా చాలా అసహనాన్ని కలిగిస్తుంది. వీడొక చవట అనుకునే ప్రమాదం వుంది.

౦౩. విపరీత ప్రయత్నం

సీతను చూసి రమ్మంటే, లంకను కాల్చి వస్తే రాముడు సంతోషించాడేమో గానీ, బాసులకు వొళ్లు మండుతుందంట. ఒకటి చెయ్యమంటే వంద పనులు చేసి అసలుకే ఎసరు తెచ్చేవారంటే ఎవరికయినా కాలుతుంది కదా మరి.

౦౪. విపరీతమైన అసంతృప్తి, చెవులు కొరుక్కోవటం

ఎన్ని సదుపాయాలు కలిగించినా “ఇలా వుంటే బాగుండేది, అలా వుంటే బాగుండేది” అనటం, వెనుక చెవులు కొరుక్కోవటం అస్సలు నచ్చదు.

౦౫. అవిశ్వాసపాత్రులు

ఏ బాసుకూ నచ్చని వాళ్ళు విశ్వాస పాత్రంగా కనిపించని వారు. అంటే ఎదురు ప్రశ్నించేవారు కాదు గానీ , వెనుక వెనుక గోతులు తవ్వేవారన్న మాట .

౦౬. చురుకుదనం లేక పోవటం , ఆసక్తి చూపకపోవడం

పైనవే కాక, ఈ పని నాది కాదులే అని అంటీ ముట్టనట్లు వ్యవహరించటం, సమావేశాలలో నిద్ర పోవటం లాంటివి పరమ చిరాకు.

౦౭. స్నేహం

బాసులతో మితి మీరిన స్నేహం వారికి నచ్చదు. ఆ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని తన తల మీదకెక్కడ ఎక్కుతారో అని ప్రతీ బాసుకు భయం వుంటుంది . హద్దులలో వుంటేనే బాసుకు మీరంటే ఇష్టం.

౦౮. ఆలవోకగా అబద్ధాలు

ఎన్ని సాకులైనా చెప్పి మీరు ఆఫీస్ మానెయ్యొచ్చు కానీ మీరు చెప్పిన సాకులు, అబద్ధాలు మీ బాసు నమ్ముతాడనుకోవటం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటమే .

౦౯. చిన్నపిల్లలా?

చిన్నపిల్లల్లా ప్రతీ దానికి రిపోర్టు చెయ్యటం, అది బాగులేదు, ఇది ఇలా లేదు అని ఫిర్యాదులు చెయ్యటం లాంటివి బాసులకు చాలా చిన్న పిల్లల లక్షణాలుగా కనిపిస్తాయి. అవి వాళ్ళకు నచ్చవు కూడా.

౧౦. అసలుకే ఎసరు

మిమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి, ఇరకాటాలనుంచి రక్షించే బాసులు, వాళ్ల సీటు మీద మీ కన్ను పడిందని తెలిస్తే మాత్రం క్షమించరు. మీరైనా అంతే కదా? ఏమంటారు ?

ఇవండీ బాసు పురాణంలో కొన్ని ప్రధాన విషయాలు…త్వరలో వుద్యోగులు అసహ్యించుకునే బాసులు ఎలా వుంటారో చూద్దాం .

-సుధాకర్ (http://sodhana.blogspot.com)
Posted in వ్యాసం | Tagged | 6 Comments

ఈ తరం

తెలుగు బ్లాగులు చదివేవారికి రాధిక గారి కవితలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యవలసిన పనిలేదు. స్పందించే హృదయం గల రాధిక గారు వ్యాఖ్యలు రాయని బ్లాగూ ఉండదు. చాన్నాళ్ళ తర్వాత రాధిక గారు పొద్దుకు పంపిన కవిత “ఈ తరం”:

—————

అలారం మోతలతో
అలసట తీరకనే ఉలికిపాటు మెలకువలు
అలసిన మనసులతో
కలల కమ్మదనమెరుగని కలత నిదురలు

పోగొట్టుకున్నదాన్ని పోల్చుకోలేరు
పొందుతున్నదాన్ని పంచుకోలేరు
ఎందుకింత భారమయిన బిజీ జీవితాలు?
తృప్తి తెలియని చింతా చిత్తాలు?

పగలంతా క్షణాలకు విలువకట్టుకుంటూ
రాత్రంతా ఆనందాలకు అర్ధాలు వెతుక్కుంటూ….
ఇక ఇంతేనా ఈ తరాలు?
మార్పు తెచ్చేనా భావితరాలు!

-రాధిక (http://snehama.blogspot.com)
Posted in కవిత్వం | 5 Comments

ఆడాళ్ళూ మీకు జోహార్లు

jyothi.bmpఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ఆడాళ్ళ గురించి మగాళ్ళు చేసిన పరిశోధన ఫలితాలు చెప్పకుండా ఊరిస్తున్నారు.

—————

నా స్నేహితుడు ఈ మధ్య పరిశోధన చేసి పి.హెచ్.డి. తీసుకున్నాడని తెలిసి అతనిని కలిసా. అతను అ.భా.భా.బా. సంఘం సెక్రటరీ అంట, మన విహారి లాగా. అతను తీసుకున్న విషయం ఏంటంటే “భార్యామణులతో బాధలు”. అతని ప్రొఫెసర్ కూడా బాధితుడే కాబట్టి రెండు నెలల్లో డాక్టరేట్ పుచ్చుకున్నాడు. అతని పరిశోధనలో రాసిన కొన్ని విషయాలు నిజమే అనిపించింది. అవి ఇక్కడ ఇస్తున్నాను. ఈ ప్రశ్నలకు వాళ్ళు ఎవో సమాధానాలతో తమను తాము సర్దిచెప్పుకున్నారు. నేను మన పాఠకులు ఏమంటారో అని ప్రశ్నలుగానే ఇచ్చా. మగాళ్ళందరూ ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నందుకు ఇది చదివి గంతులెయ్యండి. పండగ చేసుకోండి.

*. ఆడవాళ్ళు కొంటె పని చేస్తే సరదాగా చేసారంటారు. అదే మగవారు చేస్తే ఏదో ఉందనే అంటారు . ఈ భేదం ఎందుకు?

*. జుట్టును కొత్త స్టయిల్‍లో వేసుకున్నారు. సరే. ఇంకా అద్దంలో అటూ ఇటూ చూడటమెందుకు?

*. పెళ్ళిలో ఒకసారి వేసుకున్న డ్రెస్ ఇంకొకళ్ళ పెళ్ళిలో ఎందుకు వేసుకోరు?

*. బీరువానిండా బట్టలున్నాయి. అయినా ఏదీ కట్టుకోవడానికి మనసొప్పదు. ఎందుచేత?

*. శాస్త్రీయ సంగీతం, మోడర్న్ ఆర్ట్స్ గురించి తెలియనప్పటికీ ‘వాహ్వా, వాహ్వా’ అనడం ఎందుకు?

*. ఇంట్లో ఎన్నో బకెట్లున్నా, ఫ్రీగా దొరికే బకెట్ లేదన్న బాధ ఎందుకు?

*. పర్సులో పెట్టుకోవడానికి ఏమీ లేకపోయినా భుజానికి తగిలించుకుని వెళ్ళడం ఎందుకు?

*. చక్కగా తయారై ఇంటి నుంచి బయటికి వెళ్ళేముందు అత్తతో ” అత్తయ్యా ! మా అమ్మదగ్గరికి వెళ్ళి రానా?” అని కోడలు ఎందుకు అడుగుతుంది?

*. “ఏవండి! నేను చాలా రోజులుగా పుట్టింటికి వెళ్ళడం లేదని అందరూ అడుగుతున్నారు. నేనేం చెయ్యను?” అని భార్య ఎందుకు అడుగుతుంది?

*. పాలగిన్నెలో పాలు తీసి మిగిలిన మీగడను కూడా ఎందుకు తీస్తుంది?

*. రోడ్డుపై నడిచేటప్పుడు భర్త చేయి ఎందుకు పట్టుకుంటుంది? చేయి పట్టుకుని కూడా అడుగులో అడుగేస్తూ ఎందుకు నడుస్తుంది?

*. ఆడవాళ్ళ అలవాట్లు గురించి అడిగినప్పుడు కానీ, ‘ఆంటీ ‘ అని పిలిచినప్పుడు కానీ ఎందుకు కోప్పడుతుంది?

*. వేడి వేడి టీ తీసుకుని, చల్లారాక తాగుతుంది. ఇలా ఎందుకు చేస్తుంది?

*. తాను అందంగా ఉన్నానన్న విషయం రోజూ వినాలని ఎందుకనుకుంటుంది?

*. వంట చేసిన ప్రతిసారీ ‘ఎలా ఉంది?’ అని ఎందుకు అడుగుతుంది?

*. నాలుగు నెలలపాటు కప్‍బోర్డును సామాన్లతో నింపుతుంది. ఆ తరువాత అవన్నీ పాత సామాన్లవాడికి వచ్చిన ధరకు అమ్మేస్తుంది. ఇలా ఎందుకు చేస్తుంది?

*. దీపావళి వస్తుందనగానే ఇంటిలోని ప్రతిమూల, గోడలు, బూజులు అన్నీ శుభ్రం చేస్తుంది. ప్రతీ రోజూ శుభ్రం చేయవద్దని ఎవరైనా చెప్పారా?

*. ఇంట్లో పిల్లలని ఎత్తుకుంటుంది. మార్కెట్‍కుగానీ, రోడ్డుపైకి వెళ్ళినప్పుడుగానీ భర్త చేతికి పిల్లలను ఎందుకు ఇస్తుంది?

*. పాలను మరిగించడానికి పొయ్యి మీద గిన్నెను పెట్టి అక్కడే నిలబడి, తీరా పాలు మరుగుతున్నప్పుడు వేరే పని ఎందుకు చేస్తుంది?

*. మాటి మాటికి అద్దంలో మొహం చూసుకోవడమెందుకు? మొహం మారిపోయిందనా ?

*. పుట్టింటివాళ్ళు రాగానే కూరలు ఎందుకు బాగా రుచిగా వండుతారు? అన్నం ఎందుకు మాడిపోదు ?

*. మాట్లాడకుండా కూర్చుంటే మాట్లాడమని అంటుంది. మాట్లాడుతుంటే నోరు మూసుకోమంటుంది . ఎక్కువగా కోప్పడితే కోపం తెచ్చుకుంటుంది. ఎక్కువగా ప్రేమిస్తే అనుమానిస్తుంది . ఎందుకు?

*. పొరుగింటివాడిని గర్ల్‍ఫ్రెండ్‍తో తిరుగుతుండగా చూసి, భర్తపై ఓ కన్నేసి ఉంచడంలోని అర్ధం ఏమిటి ?

*. తన భర్త పేరు చెప్పి బయట అందరిని భయపెడుతూ ఆ భర్తనే ఇంట్లో భయపెట్టడం ఎందుకు?

*. భర్త జీతం మాత్రం మొత్తం కావాలి. పనిని మాత్రం కుటుంబంలో అందరూ పంచుకోవాలి . ఎందుకు?

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com)
Posted in వ్యాసం | Tagged | 5 Comments