సుధాకర్ రాసే తెలుగు బ్లాగు శోధన 2006లో ఇండిబ్లాగర్స్ నిర్వహించిన పోటీల్లో, 2005లో భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో బ్లాగు. ఇవికాక ఆయన తక్కువ తరచుగా రాసే బ్లాగులు ఇంకో రెండున్నాయి. పొద్దులో సుధాకర్ నిర్వహిస్తున్న శీర్షిక వివిధ.
————————
బ్లాగు అన్నదే సొంత భావాలను ఆలవోకగా, ఇష్టం వచ్చిన శైలిలో రాసుకుపోయేది. మరి అలాంటి పదార్ధానికి ఈ ప్రవర్తనా నియమావళి ఏమిటో అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ మనం ఒక్క సారి బ్లాగును అందరికి చదవటానికి వీలుగా అందుబాటులో (public blog) వుంచామంటే, ఒక్క సారిగా మనపై కొన్ని బరువు బాధ్యతలు పడతాయి. అవే మన ప్రవర్తన, సంయమనం మొదలయినవి. మన బ్లాగులో రాసే విషయాన్ని అభిమానించే వారు, చదివి నొచ్చుకునే వారు, శభాష్ అనే వారు మొదలుకుని, బూతులు తిట్టే వారు కూడా మన బ్లాగావరణంలో వుంటారని మనకు పదే పదే గుర్తుచేసేదే ఈ బ్లాగరుల ప్రవర్తనా నియమావళి.
దీనిని మొదట రాసినది Tim O’Reilly.(ఇతడు web 2.0 అనే పదాన్ని మొదట వాడిన ఖ్యాతి మూటగట్టుకున్నవాడు కూడా). దీనిని ప్రస్తుతం Draft దశలో వుంచారు. ప్రస్తుత బ్లాగుల ప్రపంచాన్ని పరిశోధిస్తూ, దానికి కొత్త విషయాలను జత చెయ్యటానికి నిర్ణయించారు. ఆ ప్రతి ప్రకారం ప్రతి బాధ్యతాయుతమైన బ్లాగరు ఈ క్రింది విధంగా తన బ్లాగును నిర్వహించాలి.
“మనము ఇప్పటి వరకు బ్లాగులను పరివిధాలుగా అస్వాదించాము, అభిమానించాం. ఎందుకంటే అవి నిక్కచ్చిగా , నిజాయతీగా వుండే విషయ సంవాదాన్ని మనకు అందిస్తాయి. కానీ నిజాయతీ ఎప్పుడూ అనాగరికతకు మరో అర్ధంగా నిలవదు. నిలవకూడదు. మనము క్రింద పేర్కొన్న బ్లాగరుల ప్రవర్తనా నియమావళిని ఒక మంచి భావ వ్యక్తీకరణకు, మంచి సంస్కృతికి దోహదపడే విధంగా తయారు చేద్దాం. తద్వారా ఆరోగ్యకరమైన బ్లాగు సంవాదాలను ప్రోత్సహిద్దాం .
# మనం వాడిన భాషకు, పదాలకు మరియు మనం అనుమతించిన వ్యాఖ్యలకు మనదే పూర్తి భాధ్యత. మనం నాగరికతతో కూడన విషయాన్ని ప్రోత్సహించుతాం . అనాగరిక విషయాలు మన బ్లాగులో చోటు చేసుకుంటే, వ్యాఖ్యలలో వుంటే వాటిని తీసి వెయ్యటం మన భాధ్యత . అనాగరిక విషయాలను క్రింది విధంగా వర్గీకరించవచ్చు.
1. తిట్టటం , వుద్దేశ్యపూర్వకంగా కించపరచడం, అజ్ఞాతంగా కించపరచటం, బెదిరించడం వంటివి .
2. అబద్దాలు , తప్పుడు సమాచారం ఇవ్వటం, వుద్దేశపూర్వకంగా సమాచారాన్ని మార్చి రాయటం , ఇంకొక వ్యక్తిని తప్పుగా చిత్రించటం
3. కాపీ హక్కులు , వ్యాపార హక్కులను ఉల్లంఘించటం
4. రహస్యంగా వుంచవలసిన దానిని బట్టబయలు చెయ్యటం
5. ఇతరుల వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవటం, వారి వ్యక్తిగత విషయాలపై రాయటం
పైన పేర్కొన్న అనాగరిక విషయాలను సమయం, సందర్భం బట్టి విచక్షణ వుపయోగించి గుర్తించవలసి వుంటుంది . అలానే అవి పైన పేర్కొన్న విషయాలకు మాత్రమే పరిమితి కావు. మనం ఏదైనా విషయాన్ని, వ్యాఖ్యను తొలగించే ముందర దానిని ఎందుకు తొలగించవలసి వచ్చిందో చెప్తాము.
# మనం వ్యక్తిగతంగా ఎవరితోనైనా దేనిని చర్చించమో, ఎలాంటి అభిప్రాయం వెల్లడించమో , అది మనం మన బ్లాగులో కూడా వెల్లడించం, చర్చించము .
# పది మందిలో వ్యక్తీకరించేటప్పుడు వ్యక్తిగతంగా చర్చించుతాం
1. బ్లాగావరణంలో తోటి బ్లాగరులతో కానీ, ఇంకొకరితో గానీ సమస్యలు, అభిప్రాయబేధాలు వచ్చినపుడు దానిపైన ప్రతిస్పందించే ముందర వారితో వ్యక్తిగతంగా మాట్లాడటమో, వ్యక్తిగత సంవాదమో చేస్తాము.
# ఒకరు మన తోటి బ్లాగరుపై అనాగరికంగా, అసమంజసంగా దాడి చేస్తున్నట్లు అనిపిస్తే చర్య తీసుకుంటాము .
ఎవరైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కానీ, అభ్యంతరకరమైన, అనాగరికమైన బ్లాగులు రాస్తూ వుంటే, ఆ బ్లాగరుతో వ్యక్తిగతంగా గానీ, పాఠకముఖంగా గానీ వాటిని మార్చమని విన్నపం చేస్తాము. అలా కాక వ్యాఖ్యలు ఒక బెదిరింపు క్రింద మారి, ఆ బ్లాగరు అస్సలు ఖాతరు చెయ్యకుండా, లేదా బ్లాగు ముఖంగా క్షమాపణ చెప్పకపోతే తరువాత జరిగే న్యాయపరమైన చర్యలకు అందరూ సహకరిస్తాము.
# అనామక వ్యాఖ్యలను అనుమతించం
వ్యాఖ్యలను చేసేవారు తప్పని సరిగా తమ ఈ-మెయిల్ చిరునామా, తమ అసలు పేరు గానీ, మారు పేరు గానీ వుపయోగించేలా చూసుకోవాలి.
# వ్యాఖ్యల దాడి చేసే వారిని మనం పట్టించుకోకూడదు.
వ్యాఖ్యల దాడిని పట్టించుకోకూడదు. అవి మరీ అభ్యంతరం, వ్యక్తిగతం అయితే తప్ప. వ్యాఖ్యల ద్వారా దాడి చేసే వారితో ప్రతి వ్యాఖ్యానం మొదలు పెట్టడం పందితో మల్లయుద్ధం చెయ్యటమే అవుతుంది. ఆ యుద్ధంలో ఇద్దరికీ బురద అంటుకుంటుంది. పందికి బురద ఇష్టం, మీకు అయిష్టం. అది గుర్తుపెట్టుకోండి.
అంతేకాక ఏ విషయాన్ని అయినా అహ్వానించే బ్లాగర్లకు “ఏ విషయం అయినా” అనే ఒక బ్యాడ్జి వుండాలని నిర్ణయింపబడింది. ఇది వ్యాఖ్యలు చేసే వారికి వారు ఒక ఎల్లలు లేని ప్రదేశంలో అడుగుపెడుతున్నారని సూచిస్తుంది. అదే కాక ఈ బ్యాడ్జితో పాటు దిగువ చూపిన విధంగా సందేశం వుండాలి.
“ఇది ఒక స్వేచ్చాపూరితమైన, అనియంత్ర్రిత చర్చా వేదిక. ఈ వేదికపై చర్చలకూ , పాఠకులు చేసే వ్యాఖ్యలకూ నేను బాధ్యత వహించనని తెలియచేస్తున్నాను. ఇక్కడ విషయ సంవాదాలు వేడెక్కినప్పుడు కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, అవమానకర సందేశాలు కనిపించవచ్చు. మీ సొంత పూచీమీద ఈ బ్లాగ్వేదికను సందర్శించండి”
వ్యాఖ్యలపై సంపూర్ణ నియమావళిని ఇక్కడ చదవ వచ్చు : http://civilities.net/CommResp-Proposal
ఈ వ్యాసానికి మాతృక : http://radar.oreilly.com/archives/2007/04/draft_bloggers_1.html