కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) గారి వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు. పొద్దులో ఈనెల అతిథి వ్యాసం రాయమని కోరగానే అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వ్యాసాన్ని సమర్పిస్తున్నాం.
—————–
చరిత్ర అంటే ఏమిటి? మనలో చాలామందికి స్కూలు రోజులనుంచీ హిస్టరీ అంటే అయిష్టత ఏర్పడుతుంది. ఎందుకంటే చరిత్ర అంతా ఎప్పుడో జరిగిపోయిన సంఘటనల చిట్టాలాగా అనిపిస్తుంది. కాని అది నిజం కాదు. జరిగిన విషయాల పూర్వాపరాలను సకారణంగా వైజ్ఞానిక పద్ధతుల్లో విశ్లేషించవచ్చు. ఎందుకంటే చరిత్రలో ఒకదాని వెంట ఒకటిగా జరిగిన సంఘటనలకు సామాన్యంగా కార్యకారణ సంబంధాలుంటాయి. ఈ సంఘటనలన్నీ ఒకే ప్రాంతంలో జరగాలని కూడా లేదు. జరిగిన ప్రతిదానికీ ఎన్నో కారణాలుంటాయి. వీటి వెనక ఉన్న వ్యక్తిగత ప్రేరణలు ఎటువంటివైనా మొత్తం మీద అనేక సందర్భాల్లో బాహ్య పరిస్థితులే బలవత్తరంగా పనిచేసి ఉంటాయని చెప్పవచ్చు. వాటన్నిటినీ సహేతుకంగా, అనేక వైజ్ఞానిక పద్ధతుల్లో అధ్యయనం చేసి అర్థం చేసుకుంటున్నారు.
కేవలం పురాతత్వశాస్త్రానికి పనికొచ్చే అవశేషాలూ, శాసనాలూ మొదలైన ప్రత్యక్ష ఆధారాలే కాక భూగోళశాస్త్రం (జాగ్రఫీ), సామాజికశాస్త్రం (సోషియాలజీ), మానవ పరిణామ శాస్త్రం (ఆంత్రోపాలజీ) మొదలైనవన్నీ చరిత్ర గమనాన్ని విశ్లేషించడానికి పనికొస్తాయి. అలాగే మనిషి ఆవిర్భావానికి ముందు జరిగినవాటిని అర్థం చేసుకోవడానికి పురావృక్షశాస్త్రం (పేలియో బోటనీ), పురాజంతుశాస్త్రం (పేలియో జువాలజీ) మొదలైన ప్రత్యేక విజ్ఞాన పద్ధతులున్నాయి. ఆధునిక చారిత్రక విశ్లేషణలో భాషాశాస్త్రం నుంచి వాతావరణశాస్త్రం దాకా అనేక విషయాలలో కృషి చేస్తున్న ప్రజ్ఞావంతులు పాల్గొంటూ ఉంటారు. వీరందరి సహకారమూ లేకపోతే చరిత్రను గురించిన సమగ్రమైన దృక్పథం ఏర్పడదు. అందువల్ల ఒక్కొక్కప్పుడు చరిత్ర కూడా విజ్ఞానశాస్త్రంలాగే తయారవుతుంది.
విజ్ఞానం మరికొన్ని సంగతులను కూడా పరిశీలిస్తుంది. సమాజానికి సంబంధించినంతవరకూ మనిషి నైజం ఎటువంటిది? ఇతరులతో మెలిగే పద్ధతీ, స్త్రీపురుషుల సంబంధాలూ, పిల్లలూ, కుటుంబం గురించిన భావనలూ ఎలా రూపొంది, మార్పులు చెందాయి? మానవ సమాజాలు ఏర్పడిన తొలి దశల్లో వారి ప్రవర్తనకూ, మానసిక అనుభూతులకూ సంబంధం ఉండేదనీ, సమాజపు కట్టుబాట్లూ, నీతినియమాలూ వాటివల్లనే రూపుదిద్దుకుని ఉంటాయనీ కొందరి అభిప్రాయం. ఈ అనుభూతులకు శారీరక కారణాలను విశ్లేషించే సామాజిక జీవశాస్త్రం (సోషియో బయాలజీ) మొదట్లో కొంత వివాదాస్పదం అయింది కూడాను.1 ఇందులో ఎన్నో విషయాలు విశ్లేషణకు లోనవుతాయి. ఉదాహరణకు ఎన్ని వేల ఏళ్ళు గడిచినా ప్రజలు సముదాయాలుగా ఏర్పడి జాతి, మతం, కులం, శాఖ వగైరా సాకులతో పరస్పరం కలహించుకోవడానికి కారణం ఆదిమానవులు వందా, రెండు వందలకు మించని తెగలుగా ఎంతో కాలం జీవించడమే కారణం అయి ఉండవచ్చనే ఒక అభిప్రాయం ఉంది.2 సర్వమానవ సౌభ్రాతృత్వం అనేది ఒక మంచి ఆదర్శమే అయినప్పటికీ ఆచరణలో మనుషులు సంఖ్యాపరంగా ఒక స్థాయిని మించి ఇతరులను “అస్మదీయులు”గా భావించలేకపోవడానికి కారణం ఇదేనేమో.
మానవజాతి చరిత్ర ఎప్పుడు మొదలయిందో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ఎందుకంటే అది ఆదిమానవుల ఆవిర్భావం మీదా, ఇంకా చెప్పాలంటే అంతకు ముందు జరిగిన ప్రాణుల, క్షీరదాల జీవపరిణామం మీదా ఆధారపడే విషయం. మరొకటేమిటంటే ఈ చరిత్ర, లేదా దానికి పూర్వరంగం ఎక్కడెక్కడ, ఎప్పుడు, ఎలా మొదలయిందో అర్థం చేసుకోవాలంటే వివిధ ప్రాంతాల్లో యుగాలవారీగా జరిగిన భౌగోళిక మార్పులూ, వాతావరణపు వ్యత్యాసాలూ, నైసర్గిక పరిస్థితులూ అన్నీ లెక్కలోకి తీసుకోవాలి. వీటిని అధ్యయనం చేస్తే చరిత్రకు పునాదులు ఎలా ఏర్పడ్డాయో తెలుస్తుంది. ఇది మరొక రకమైన శాస్త్రీయ అధ్యయనం.
చరిత్ర మొదలవుతున్న తరుణంలో ప్రభావం కలిగించిన బాహ్య పరిస్థితులెటువంటివి? మానవుల నివాస స్థావరాలు ఏర్పడుతున్న దశలో ప్రాంతాలవారీగా మొక్కలూ, జంతువులూ పెరగడం అనేది పరోక్షంగా చరిత్రను నిర్దేశించిందని జారెడ్ డయమండ్‌వంటి పరిశోధకుల అభిప్రాయం.3 ప్రాచీన నాగరికతలు ప్రపంచంలో కొన్ని స్థలాల్లోనే ఎందుకు మొదలయాయో, వేటవంటివి మానుకుని పొలం సాగు చెయ్యగలిగిన అవకాశాలు అక్కడే ఎందుకు ఏర్పడ్డాయో శాస్త్రవేత్తలు చెప్పగలరు. అంటే హిస్టరీకి మూలకారణం జాగ్రఫీయే. ఇటువంటి పరిశీలనలవల్ల పంటమొక్కల్లోని జన్యుజాతులూ, అవి ఏపుగా పెరగగలిగేందుకు అవసరమైన పరిస్థితులూ శాస్త్రీయంగా వివరించబడ్డాయి.
మానవజాతి ఆవిర్భావం మొదట ఆఫ్రికా ఖండంలోనే జరిగింది గనక తొలి మానవులకు అంతకంతకూ వేటలో పెరుగుతున్న నైపుణ్యం అక్కడి వన్యప్రాణులకు అవగతం అయింది. అందువల్ల అవి పూర్తిగా అంతరించిపోకుండా నిలదొక్కుకోగలిగాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో అలా కాకుండా తొలి మానవులు చాలా ఆలస్యంగా ప్రవేశించారు. రకరకాల ఆయుధాలను ప్రయోగించ నేర్చిన వారి ధాటికి అక్కడ అనాదిగా ఉంటున్న జంతువులన్నీ త్వరలోనే బలి అయిపోయాయి. వేటాడదగిన జంతువులు తగ్గిపోవడం, మనుషుల జనాభా పెరగడం వగైరా కారణాలవల్ల ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో అప్పటిదాకా కేవలం వేటా, ఆహారసేకరణ పద్ధతుల మీదనే ఆధారపడ్డ మానవులకు క్రమంగా పొలం సాగు, జంతువులను మందలుగా పెంచడంవంటి ప్రత్యామ్నాయ పద్ధతులు తప్పనిసరి అయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
భౌగోళికంగా ఒక్కొక్క ప్రాంతంలోనూ వన్యజాతి మొక్కల్లో సాగుపంటలుగా పరిణమించి, తగిన పోషణ నివ్వగలిగిన ధాన్యాలూ, మనుషులకు పనికొచ్చిన పెంపుడు జంతువులూ కొన్నే కనిపిస్తాయి. మాంసానికీ, పొలం దున్నడానికీ, రవాణా బళ్ళకు పూన్చడానికీ, ఉన్ని వంటి పదార్థాలను సరఫరా చెయ్యడానికీ కొన్ని జంతువులే సాధువులుగా తయారై, మందలలో పెరగగలవు. ఈ జంతువులూ, మొక్కలూ అన్నీ పశ్చిమాసియాలోనే మనుషులకు ముందుగా తారసిల్లాయి. ఎందుకంటే ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లా కాకుండా అప్పట్లో సస్యశ్యామలమైన ఒక్క పశ్చిమాసియాలోనే అటువంటి జంతువులూ, ధాన్యాలూ పెరిగేవి.

ఒకప్పటి సస్యశ్యామల పశ్చిమాసియా ప్రాంతం
అందుచేత గొర్రెలూ, మేకలూ, పశువులవంటివి ఇతరులకన్నా ముందుగా పశ్చిమాసియావాసులకు మచ్చికకు ఎందుకు పనికొచ్చాయో మనకు ఈనాడు తెలుస్తోంది. ముఖ్యమైన ఆహారధాన్యాల వ్యవసాయంతో బాటు స్థిరనివాస క్షేత్రాలూ, అదనపు ఆహారోత్పత్తీ తలెత్తాయి. ఇవి మనుషుల జీవితాల్లో అపూర్వమైన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. ఇటువంటి జంతువులూ, ధాన్యాలూ పెరగగలిగిన ప్రాంతాల్లోనే తొలి నాగరికతలకు బీజాలు పడ్డాయంటే అది యాదృచ్ఛికం కాదు. బేబిలోనియా (నేటి ఇరాక్), ఈజిప్ట్ మొదలైన నాగరికతల సామర్థ్యమంతా త్వరలోనే ఇతర పరిసర ప్రాంతాలకూ, పడమటి దిశగా యూరప్‌కూ పాకిపోయింది.
తూర్పు పడమరలుగా ఎక్కువ వైశాల్యం కలిగిన ఆసియా, యూరప్ ఖండాల్లో నాగరికతలు విస్తరించిన పద్ధతిలో అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో జరగకపోవడానికి వాటి నైసర్గిక స్వరూపం, వాతావరణ పరిస్థితులే కారణం. ఆసియా, యూరప్ ఖండాల్లో జంతువుల, ధాన్యాల పెంపకం పద్ధతులు త్వరలోనే అన్ని చోట్లకూ వ్యాపించగలిగాయి. అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో మచ్చికకు పనికొచ్చే జంతువులూ, ధాన్యాలూ పెరగడమే తక్కువ; దానికి తోడుగా సమాచార వ్యాప్తికి ఎన్నెన్నో భౌగోళిక అవరోధాలు తోడయాయి. ఉత్తర, దక్షిణ దిశల్లో ఎక్కువ వైశాల్యం ఉన్న ఈ ఖండాల్లో అక్షాంశాన్ని బట్టి రుతువుల్లో కలిగే పెద్ద మార్పులూ, వివిధ ప్రాంతాలకు అడ్డుగా నిలిచిన ఎడారులూ, పర్వతాలూ మొదలైనవన్నీ అప్పటి ప్రజల మధ్య సంపర్కం పెంపొందడానికి ఆటంకాలుగా పరిణమించాయి.
మొత్తం మీద నాగరికత అనేది మొదలై, కాలూనుకుని మెరుగుపడడంలో తీవ్రమైన ప్రాంతీయ వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. ఇది శతాబ్దాల పాటు కొనసాగడంతో కొందరిది మాత్రమే పైచెయ్యి అయింది. నాగరికదశకు ముందుగా చేరుకున్న ఆసియా, యూరప్ ప్రజలకు ఇతర “ఆదిమ”తెగలను లోబరుచుకోవడం కష్టం అనిపించలేదు. మరొకవంక ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలన్నీ వెనకబడినవిగానే కొనసాగుతూ వచ్చాయి. వివిధ నగరాలూ, సామ్రాజ్యాలూ, సైన్యాలూ, యుద్ధాలూ తప్పనిసరిగా తలెత్తుతూ వచ్చాయి. తరవాతి కాలంలో ఉన్నతమూ, బలవత్తరమూ అయిన సామ్రాజ్యాలు విస్తరించడానికి ఇదే కారణమయింది. ఇదంతా చరిత్రకు భూమిక.
తరవాతి కాలంలో కూడా ప్రతి సంఘటనకూ భౌతిక ఆధారాలు కనబడతాయి. ఫలానా దేశంలో ఫలానా వంశపు రాజ్యపాలన ఎలా మొదలయింది వగైరా ప్రశ్నలకు శాస్త్రీయవివరణ దొరకవచ్చు. బాబర్‌వంటి ఫలానా రాజు మనదేశం మీదికి దండెత్తి వచ్చాడని చరిత్ర చెపుతుంది. ఎంత గొప్పగా వర్ణించినప్పటికీ యుద్ధాలన్నీ పెద్ద ఎత్తున జరిగిన సాయుధ దోపిడీలే. ఇలాంటివన్నీ కేవలం “పుర్రెకో బుద్ధి” అన్న పద్ధతిలో జరిగి ఉండకపోవచ్చు. మనం గుర్తుంచుకోవలసినదేమిటంటే బాబర్ అయినా, చెంఘిజ్‌ఖాన్ అయినా తన ప్రాంతంలో తలెత్తిన సామాజిక పరిస్థితులవల్లనే దండయాత్రలు చెయ్యవలసి వచ్చింది. వీటికి సామాన్యంగా వ్యక్తిగత కారణాలు ఉండవు. ఉన్న పరిస్థితులు అసంతృప్తికి దారితీసినప్పుడే మార్పులు అవసరమౌతాయి. కూడూ, గుడ్డా వగైరాలకు లోటు కలిగితే తప్ప ప్రాణాలకు తెగించి ఎవరూ పోరాడరు. ప్రజలను కదిలించటానికి మతవైషమ్యాలూ, జాతివైరాలూ పనికొచ్చినప్పటికీ నిజమైన కారణాలన్నీ భౌతిక అవసరాలకు సంబంధించినవే. భౌగోళిక ప్రతికూలతలవల్లనే వనరుల్లో ఇబ్బందులు కలిగేవి. జనాభా పెరిగి, అంతకంతకూ పరిమితమైపోతున్న వనరుల కోసం ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ట్రోయ్ నగరాన్ని గ్రీకులు ముట్టడించడానికి కేవలం ఒక “రాణీ ప్రేమపురాణం” కారణం కాకపోవచ్చు. ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఆహారోత్పత్తి తగినంతగా జరగకపోవడం, జనాభా పెరగడం మొదలైనవన్నీ భౌగోళిక కారణాలవల్లనూ, వాతావరణంలో కలిగిన మార్పులవల్లనూ తలెత్తుతాయి. ఆధునిక విజ్ఞానం ద్వారా అప్పటి భౌతిక పరిస్థితులను మనం అంచనా వేసుకోవచ్చు. ప్రజల మధ్య జరిగిన (జరగనటువంటివి కూడా) సంఘర్షణల వల్లనే చరిత్ర రూపొందుతూ వచ్చింది. అలాంటప్పుడు చరిత్ర అనేదాన్ని కూడా విజ్ఞానశాస్త్ర పద్ధతిలోనే విశ్లేషించాలి.
చరిత్ర అంటే గతాన్ని గురించే కదా అనుకోవచ్చు కాని సామాజికశాస్త్ర దృక్పథంతో పరిశీలిస్తే ఉన్న పరిస్థితులనుబట్టి భవిషత్తులో ఏమవుతుందో ఊహించబుద్ధి అవుతుంది. ప్రపంచపు షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టదలుచుకున్నవారు ఏ దేశం పరిస్థితి ఎలా మారబోతోందో వీలున్నంత ఖచ్చితంగా అంచనా వేసేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఒక్కొక్కప్పుడు స్థానిక ఎన్నికల ఫలితాలు అనుకున్నట్టుగా రాకపోవడం, అధికారంలోకి వచ్చిన వ్యక్తి అనూహ్యమైన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపడం జరుగుతూ ఉంటుంది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ముందు జరిగిన భారత పాకిస్తాన్ యుద్ధ కాలంలో ఇందిరా గాంధీ రాజకీయ వైఖరీ, ఆ తరవాత ఆమె హత్యా చరిత్రని ఎలా మార్చాయో మనకు తెలిసినదే. మరొకవంక పశ్చిమదేశాల ఉద్యోగాలు కొన్ని మన దేశానికీ, ఇతర ప్రాచ్య దేశాలకూ రెక్కలు కట్టుకు వెళుతున్న ధోరణినిబట్టి ఎటువంటి మార్పులు కలుగుతాయో కొంతవరకూ చెప్పవచ్చు.
ప్రాచీన అవశేషాలను గురించిన పరిశోధనల్లో శాస్త్రవిజ్ఞానం అనేకరకాలుగా పనికొస్తుంది. వేల ఏళ్ళనాటి శవాలు అరుదుగా మంచుకొండల్లో దొరికాయి. ఈజిప్ట్ పిరమిడ్లలో ప్రాచీన వ్యక్తుల కళేబరాలు లభించాయి. వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి ఎక్స్‌రే యంత్రాలు మొదలైన ఆధునిక పరికరాలెన్నో ఉపయోగపడుతున్నాయి. అనేక రకాల వైజ్ఞానిక పద్ధతులను ఒకేసారి ఉపయోగించి, చరిత్రను అవగాహన చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అవశేషాలు సేంద్రియ పదార్థాలు కలిగినవైతే వాటి వయసును కార్బన్ డేటింగ్ మొదలైన పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు. భూమిమీది వాతావరణం ఎల్లప్పుడూ ఒకేలా ఉండేది కాదు. వేల సంవత్సరాల క్రితం అందులో ఎటువంటి వాయువులుండేవో తెలుసుకోవాలంటే అవి కరిగిన నీటిని పరిశీలించాలి. ఈ సాక్ష్యాలన్నీ ఆనాటి నీరు ఘనీభవించి దిగబడిపోయిన ధ్రువప్రాంతపు మంచుదిబ్బల అంతర్భాగాల్లో దొరుకుతాయి. అక్కడ లోతుగా తవ్వి తీసిన మంచుకడ్డీలను పరిశీలించినప్పుడు గతాన్ని గురించిన ఎన్నెన్నో వాతావరణ విశేషాలు తెలుస్తాయి.

1991లో ఆల్ప్స్ మంచుకొండల్లో లభించిన 5200 ఏళ్ళనాటి శవం, వైజ్ఞానిక పరిశీలనలు
భౌతిక పరిణామాలే జీవపరిణామాలకు ప్రేరణ. వీటిలో స్థానికంగా ప్రకృతి వైపరీత్యాలని కలిగించిన అగ్నిపర్వతాల పేలుళ్ళూ, భూకంపాలూ, వరదలేకాక, ఆకస్మికంగా భూమిమీదికి వచ్చిపడిన ఉల్కలూ మొదలైనవన్నీ మొత్తం జీవరాశి మీద తీవ్రమైన ప్రభావాలని కలిగించాయి. ఇంత అకస్మాత్తుగా కాకుండా భూమి సగటు ఉష్ణోగ్రత తగ్గుతూ పోయే పరిస్థితులను కలిగించేవి హిమయుగాలు. వాటివల్ల భూమి ఉపరితలం 10 నుంచి 30 శాతం దాకా మంచుతో కప్పబడిపోతుంది. 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భవించాక దాని మొత్తం చరిత్రలో 15 నుంచి 20 శాతం హిమయుగాలుగానే గడిచింది. వీటిలో కొన్ని హిమయుగాలు కోట్ల సంవత్సరాలూ, మరికొన్ని ఎన్నో వేల సంవత్సరాల తరబడి కొనసాగాయి. గతంలో 80-60, 46-43, 35-25 కోట్ల సంవత్సరాల కిందట ఇవి కనీసం నాలుగుసార్లు వచ్చాయి. ఒక్కొక్కసారి వచ్చినప్పుడల్లా వీటిలో కాస్త హెచ్చుతగ్గులు కలుగుతూ ఉండేవి కాని మొత్తంమీద శీతలస్థితే ఎక్కువ. మంచు హిమానీనదాల రూపంలో (గ్లేసియర్స్) ఇతర ప్రాంతాలకు చొచ్చుకువస్తూ ఉండేది. హిమయుగాల్లో ఈ హిమానీనదాలు భౌగోళికంగా పెద్ద మార్పులు కలిగించేవి.

హిమయుగాల చరిత్ర (కోట్ల సంవత్సరాలలో)
హిమయుగాల్లో చివరిది 16 లక్షల ఏళ్ళ క్రితం మొదలై 10 వేల ఏళ్ళ క్రితం అంతమైంది. ఇది సరిగ్గా మానవుల పరిణామ కాలానికి సరిపోతుంది. హిమయుగాలు వచ్చినప్పుడల్లా దాటరాని కొన్ని జలసంధులూ, జలాశయాలూ గడ్డకట్టుకుపోవడంతో వాటిపై నడిచి వెళ్ళడం వీలయేది. మంచు ఎక్కువగా ధ్రువాల్లో పేరుకుపోవడంతో సముద్రమట్టాలన్నీ తగ్గిపోతూ ఉండేవి. ప్రస్తుతం పడవలు లేకుండా దాటరానివిగా అనిపిస్తున్న కొన్ని ప్రాంతాలు అప్పట్లో లోయలలాగా అనిపించేవి. అందుచేత వానరాలకు భిన్నంగా రెండుకాళ్ళ నడక మొదలుపెట్టిన తొలిమానవులు ఎంత దూరమైనా కాలినడకన వెళ్ళగలిగారు. యూరప్ ఉత్తర ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడటంతో మనుషుల, జంతువుల సంచారం సులువుగా జరిగి ఉంటుంది. ఈ వలసలవల్ల అనేక ప్రాంతాలు మనుషులకూ, జంతువులకూ కూడా నివాసయోగ్యం అయాయి.

హిమయుగాలలో మంచుతో కప్పబడిపోయిన ఉత్తర యూరప్
ఆ తరవాత మంచు కరిగి, మధ్యనున్న ప్రాంతాలు జలమయం కావడంతో కొన్ని సందర్భాల్లో తిరుగు ప్రయాణాలు వీలవలేదు. ఇటువంటి సంఘటనలన్నీ తరవాతి చరిత్రను కొంతవరకూ మార్చగలిగాయి.
ఆహారసేకరణకై ఆదిమానవుల బృందాలు సగటున ఎనిమిది సంవత్సరాల కొక మైలు దూరానికి కదులుతూ క్రమంగా భూఖండాలన్నిటినీ ఆక్రమించారు. అప్పట్లో తూర్పు ఆఫ్రికానుంచి పశ్చిమాసియాకూ, అరేబియానుంచి మనదేశానికీ కాలినడకన వెళ్ళడం వీలయేది. మహా అయితే కొన్ని రుతువుల్లో చిన్నచిన్న తెప్పలు అవసరమయేవేమో. అలాగే నేటి ఇండో చైనా ద్వీపకల్పం, ఇండొనేషియా ప్రాంతాలూ అన్నీ ఒకటిగా ఉండేవి. తూర్పుకేసి నడిచిన తొలి మానవులు న్యూగినీ, ఆస్ర్టేలియా మొదలైన ప్రదేశాలన్నిటినీ సులువుగా చేరుకోగలిగారు. హిమయుగం అంతమై సముద్రజలాల మట్టం పెరిగిన తరవాత ప్రస్తుతపు తీరరేఖలన్నీ రూపుదిద్దుకున్నాయి. అప్పటికే వివిధ ప్రదేశాలకు చేరుకున్న ప్రజలు నౌకాయానాలూ, ఇతర రవాణా సౌకర్యాలూ కనిపెట్టినదాకా ఎక్కడికక్కడే బందీలలాగా మిగిలిపోయారు.

హిమయుగాలలో మరింత విస్తృతంగా ఉండిన ఆస్ట్రేలియా
సముద్రాలు అడుగంటటంతో ఈనాడు ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉన్న న్యూగినీ ద్వీపాలూ, దక్షిణాన ఉన్న టాజ్మేనియా అన్నీ ఒకే విస్తృత భూఖండంగా ఉండేవి. ఇప్పటిలాగా మధ్యలో సముద్రాలుండేవి కావు. అటు తూర్పు ఆసియాలో వియత్నాం, చైనా తూర్పు తీరప్రాంతాలూ, బోర్నియో అన్నీ ఒకే విస్తృత భూఖండంగా ఉండేవి. విస్తృత ఆసియా తూర్పు కొసకూ విస్తృత ఆస్ర్టేలియా పడమటి ప్రాంతాలకూ మధ్య సముద్రం చిన్నదిగా ఉండేది. అలాగే ఆసియా ఈశాన్య ప్రాంతపు కొసకూ అలాస్కాకూ మధ్య బెరింగ్ జలసంధి ఉండేదికాదు. ఈ కారణంగా కొన్ని ప్రాంతాలకు ప్రజలు కాలినడకన వలసపోగలిగారు. మరికొన్ని చోట్ల పడవల తయారీ జరిగినదాకా సంపర్కం ఏర్పడలేదు. ఇవన్నీ నాగరికత అభివృద్ధినీ, వ్యాప్తినీ చాలా ప్రభావితం చేశాయి. ఈ విషయాలన్నీ వైజ్ఞానిక పద్ధతుల్లో పరిశీలించి తెలుసుకున్నవే.

బెరింగ్ జలసంధి – నాడు, నేడు
పెద్ద హిమయుగాలేకాక గత కొన్ని శతాబ్దాలుగా మరికొన్ని చిన్న హిమయుగాలు కూడా తలెత్తుతూ వచ్చాయి. ఇవి కొన్ని శతాబ్దాలపాటు కొన్ని ప్రాంతాలకే పరిమితమైనట్టుగా తెలుస్తోంది. వీటిలో కొన్ని రెండు మూడువందల ఏళ్ళపాటు కొనసాగుతాయనీ శాస్త్రవేత్తలు అంటారు. ఉదాహరణకు క్రీ.శ. 1150-1460 మధ్యలోనూ, 1560-1850 మధ్యలోనూ యూరప్‌లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. 1816లో యూరప్‌లో వేసవి అనేది రానేలేదట. 1812లో రష్యాపై నెపోలియన్ సేనలు జరిపిన దాడి విఫలం కావడానికి విపరీతమైన చలి కూడా ఒక ముఖ్యకారణమయింది. చిన్న హిమయుగాలవల్ల వ్యవసాయంలో మార్పులూ, ప్రజల ఆరోగ్యం, ఆర్థిక, రాజకీయ, సామాజిక ఒత్తిళ్ళూ, వలసలు వెళ్ళడాలూ, కళలూ, సాహిత్యంలో పరిణామాలూ ఇలా ఎన్నో పరివర్తనలు కలిగాయి. ముఖ్యంగా తిండిగింజల ధరవరలూ, తాత్కాలికంగా ఏర్పడిన కొరతలూ, కరువులూ సామాన్యులను చాలా బాధించాయి. తమ జీవితాలు ఎందుకిలా అస్తవ్యస్తం అవుతున్నాయో అప్పటివారికి అర్థం కాలేదు. ప్రకృతి పగబట్టినట్టుగా మాత్రమే అనిపించింది. ఇవన్నీ తరవాతి కాలంలోని వివిధ పరిణామాలకు కారణమయాయి.
చరిత్రను విజ్ఞానంగా పరిగణించగలమా? అసలు శాస్త్ర విజ్ఞానానికీ చరిత్రకూ తేడాలేమిటి? విజ్ఞానశాస్త్రాలకు కొన్ని సూత్రాలుంటాయి. అవి సర్వత్రా వర్తిస్తాయి; లేదా పరిస్థితులనిబట్టి కొన్ని మినహాయింపులుంటాయి. అందువల్ల ప్రయోగ ఫలితాలను నిక్కచ్చిగా ఊహించి చెప్పవచ్చు. పైకెగరేసిన బంతి భూమిమీదా, చంద్రుడిమీదా ఎంత వేగంతో వచ్చిపడుతుందో లెక్క కట్టవచ్చు. భౌతిక, రసాయనశాస్త్రాలకిది వర్తిస్తుంది కాని, జీవశాస్త్రం వంటివాటిలో పెద్ద ఎత్తున సేకరించిన సమాచారాన్ని బట్టి స్థూలంగా మాత్రమే అంచనా వెయ్యవచ్చు. ఎందుకంటే అటువంటి నమూనాల్లో మార్పు చెందగలిగిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మూల భౌతిక ప్రేరణల్లోని స్వల్ప వ్యత్యాసాలు విభిన్న ఫలితాలని కలిగిస్తూ ఉంటాయి. చరిత్రవంటి విషయాల్లో ఇది మరీ అసాధ్యం అనిపిస్తుంది. వీటిలో సామాన్యంగా గడిచిపోయిన విషయాలని శాస్త్రీయంగా వివరించడం సులువుగా అనిపిస్తుంది గాని, ముందుగా ఊహించి చెప్పడం కష్టమే. జరిగిన సంఘటనల్లో వ్యక్తుల పాత్ర లేదని కాదు. ఉదాహరణకు దండయాత్రలు ఏ కారణంవల్ల జరిగినప్పటికీ వాటిని ముందుండి నడిపిన అలెగ్జాండర్, చెంఘిజ్‌ఖాన్, నెపోలియన్, హిట్లర్ తదితరుల సాహసం, స్వభావం, శక్తిసామర్య్థాలూ మొదలైనవన్నీ చరిత్రని తీవ్రంగా ప్రభావితం చేసినమాట నిజమే.
రాజకీయ నాయకులూ, ముఠాలూ పాతకాలపు సంఘటనలను గుర్తు చేసి, వాటిని ఈనాటి పరిస్థితులకు ఏదోలా అన్వయించి, విద్వేషాలు రగిల్చి, ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉండడం చూస్తాం. ఇందులోని అశాస్త్రీయ అంశాలేమిటో మనం తెలుసుకోవాలి. సంఘర్షణలు అనివార్యమైనవే అనుకున్నప్పటికీ వాటికి గల భౌతిక కారణాలేమిటో శాస్త్రీయవిజ్ఞానం మాత్రమే సరిగ్గా తెలియజెయ్యగలదు.
1. E. O. Wilson, Sociobiology: The New Synthesis, Belknap Press, 1975
2. Robert Wallace, The Genesis Factor (New York: Morrow and Co., 1979)
3. Jared Diamond, Guns, Germs, and Steel: The Fates of Human Societies, W. W. Norton & Company (1999)