మార్చి గడి సమాధానాలు – వివరణ

ముందుమాట:

తెలుగులో గతంలో ఆరుద్ర, శ్రీశ్రీ లాంటి మహామహులు గళ్ళనుడికట్లు తయారుచేసేవాళ్ళు. అవి కట్టుదిట్టంగా, చాలా చమత్కారాలతో నిండి ఉండేవి. ఆ స్థాయిలో తయారుచేసేవాళ్ళు లేకనో, పత్రికల అనాదరం వల్లో తర్వాత ఆ తరహా గళ్ళనుడికట్లు కనుమరుగైపోయాయి. ఒక్క రచన పత్రికలో మాత్రం దాదాపు పదేళ్ళ కిందట నేను ఆ పత్రిక చదవడం మొదలుపెట్టినప్పుడు ఆరుద్ర, శ్రీశ్రీ గళ్ళనుడికట్ల శాంపిల్స్ చూసే భాగ్యం నాకు కలిగింది. అప్పట్లో ఆ పత్రికలోని పజిలింగ్ పజిల్ ఛాలెంజింగ్ గా ఉండేది. (ఆ శీర్షికను డా. ఎన్.సురేంద్ర గారు అచ్చం ది హిందూ తరహాలోనే నిర్వహించేవారు. అప్పట్లో రచన పాఠకులు కొంత మంది అచ్చం ఇప్పటి పొద్దు పాఠకుల్లాగే “ఇది మరీ పజిలింగ్ గా ఉంది. ఎంతమాత్రమూ కొరుకుడుపడలేదు.” అని గోలపెట్టేవారు. 🙂 )

మేము పొద్దు పత్రిక పెట్టాలనుకున్నప్పుడే అనుకున్నాం.. గడి ఈ పత్రికకు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని. గడిని పూరించడానికి పొద్దు పాఠకుల్లో చాలా మందే తీవ్రప్రయత్నాలు చేశారు. కానీ ఈ తరహా గళ్ళనుడికట్టు తెలుగు నెటిజనులు, బ్లాగరులలో ఎక్కువమందికి పరిచయం లేనిది. అందువల్ల చాలా తక్కువ సమాధానాలు వచ్చాయి. ఐతే వీటినెలా పూరించాలో హింట్స్ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇకమీదట గడి పూరించడం ‘ఇంత’ కష్టం కాబోదు. అలాగే గడిని పూర్తిగా నింపకపోయినా అసంపూర్తి సమాధానాలను సైతం పంపగలిగే అవకాశం కల్పించనున్నాం కాబట్టి కొత్తపాళీ గారి లాగ ఎక్కడో ఒకటీ అరా తప్ప దాదాపు పూరించగలిగినవారు కూడా పంపుతారని ఆశిస్తున్నాం.

ఇక సమాధానాలు పంపినవారు – విజేతలు:

దాదాపు ఆల్ కరెక్టు సమాధానాలు పంపినవారు: పప్పు నాగరాజు గారు, చిట్టెళ్ళ కామేశ్ గారు, జ్యోతి వలబోజు గారు.
వీరు కాక ఆల్ కరెక్టుకు అల్లంత దూరంలో నిలచిన వీరబల్లె వీరుడు రానారె.

సమాధానాలు

సి రా గు వా ము కా మా
ని రు వి
ణీ రం తూ గు డు గు డు గుం చం భా
ప్రి బా డు షా
ష్టి బా టు లు సు భి
దూ సో పా మా
తి రు తి రు తి దే స్థా నం
కు వు పం
కి ని మా కో లా లం
సా ద్ర లా లం లే
కం కా సి
జం ఘా శా స్త్రి వి కీ పీ డి యా

అడ్డం:
1 రసికాగ్రేసరా! మాకాపాటి రసికత లేదా? (5+5+2) రసికరాజ! తగువారము కామా?
6 అడ్డం తిరిగిన అమ్ములపొది (3)
ఈ ఆధారంలో రెండుభాగాలున్నాయి: వాటిలో ప్రధానమైనది అమ్ములపొది. అంటే తూణీరం. (“మావి అక్షయతూణీరాలు” అని సాలభంజికలు నాగరాజు గారు ధిలాసా ప్రకటించడం మీకు గుర్తుండే ఉంటుంది.) ఇక్కడ ఆ తూణీరానికేమైంది? అడ్డం తిరిగింది! గళ్ళనుడికట్టు ఆధారాల్లో అడ్డం తిరగడం, అస్తవ్యస్తం కావడం, చెల్లాచెదరు కావడం లాంటివి కనిపిస్తే సమాధానం కోసం అక్షరాలను తారుమారు చెయ్యాలన్నమాట. ఏ అక్షరం ఎక్కడ పడాలో తెలుసుకోవడానికి 1 నిలువు, 2 నిలువు ఆధారాలను చూసుకుంటే సమాధానం ణీతూరం అని తెలుస్తుంది.
7 ఇది చిన్నప్పుడు ఆడుకున్న ఆట. “…గుర్తున్నదా?” అని గుర్తుచేస్తుందొక సినిమా పాట(6)
సమాధానం గుడుగుడుగుంచం. వివరణ అవసరం లేని ఆధారం. 🙂
10 జట్టిజాములోని పూర్వార్థానికి ప్రకృతి(2) ఇది కనుక్కోవడం చాలా కష్టం…అనుకోనవసరం లేదు. తెలుగువికీపీడియాలో జట్టిజాం అనే వ్యాసం లో చూస్తే తెలిసిపోతుంది. సమాధానం యష్టి .
11 వికీపీడియనులకందిస్తుందిది తోడ్పాటు(2)
వికీపీడియనులందరికీ తెలుసు – సమాధానం బాటు (bot) అని. మరిన్ని వివరాలకు ఎన్వికీ చూడండి.
12 రంగస్థలమ్మీద నూటపాతికేళ్ళ అమృతధార(3) రంగస్థలం అనగానే తెలుగువారికి స్ఫురించవలసింది ప్రపంచప్రఖ్యాత సురభి నాటకసమాజం. సురభి నాటకసమాజం పుట్టి నూటపాతికేళ్ళైంది. పైగా సురభి అంటే అమృతం.
15 కోటలో వెయ్యబోతే తోక కత్తిరించి పంపారు!(2)
కోటలో పాగావెయ్యడం అనేదొక నానుడి. ఇక్కడ కోటలో వెయ్యబోయింది పాగా అన్నమాట. తోక (పదం చివరి దీర్ఘం) కత్తిరిస్తే పాగ
17 పాత చందమామలను డిజిటైస్ చేస్తున్నది (4+4+4)
తిరుమల తిరుపతి దేవస్థానం
20 కినిసిన సినిమా పత్రిక కునుకేసింది శాశ్వతంగా(3)
ఈ ఆధారంలో ప్రధానమైన భాగం సినిమా పత్రిక. అదేమో శాశ్వతంగా కునుకేసింది అంటే మూతపడిందట. మూతపడిన సినిమాపత్రికల్లో కినిమా ఒకటి. (ఈ పత్రిక సంపాదకులు కొ.కు.) కినిసిన అని ఇచ్చింది ఆ పేరును సూచించడానికే!
22 సగం కూల్‌డ్రింకు, సగం విషం కలిసి సృష్టించిన కలకలం (4)
కోకకోలా అనేదొక కూల్ డ్రింకు, హాలాహలం అంటే విషం. దాంట్లో సగం కోలా. దీంట్లో సగం హలం. కలిస్తే కోలాహలం. కలకలమంటే అదే కద?
26 పేరలుకంజెందిన లలనామణి కోపాన్ని తగ్గించే మార్గం (3) బుజ్జగింపు అనుకుంటే మనక్కావలసింది దానికున్న సమానార్థకాల్లో లాలన అని సూచించడానికే లలనామణి అని ఇచ్చింది.

28 ఏమీ లేనప్పుడు మొదట చూడ్డం ఎందుకే? (2) “ఏమీ లేనప్పుడు” లోని పదాల మొదట చూస్తే ఏ,లే ఉన్నాయి. కలిపితే ఏలే. ఏలే అంటే ఎందుకే అనే కదా? అదే సమాధానం. గమ్మత్తుగా లేదూ?
32 పానుగంటివారి “సాక్షి”గా ఈ ఉపన్యాసకర్త వాగ్ధాటికి ఎదురులేదు (5) జంఘాలశాస్త్రి
33 ఇందులేనిదెందుగలదు? (5)
దీనికి స్టాండర్డు సమాధానం మహాభారతం. కానీ కాలం మారింది. ఇప్పుడు అన్నీ వికీపీడియాలోనే ఉన్నాయిష. 😉

నిలువు:

1 తాంబూలాదులు ఈమె తెచ్చి ఇస్తేగానీ రాసేమూడ్ రాదట పెద్దన్నగారికి (8) రమణీప్రియదూతిక (“నిరుపహతిస్థలంబు…”అంటూ మొదలయ్యే ఈ పద్యాన్ని ఈ పేజీలో చూడవచ్చు.)
2 ఈ రాళ్ళు బరువెక్కువై తిరగబడ్డాయి (3) తూనిక రాళ్ళు బరువు తూచే రాళ్ళే కాదు బరువైనరాళ్ళు కూడా. తిరగబడ్డాయి అంటే కిందినుంచి పైకి రాయాలి.
3 ఇదుంటే జ్వరమంత సుఖంలేదు(5) జరుగుబాటుంటే జ్వరమంత సుఖంలేదు అని సామెత
4 అస్పష్టంగా వినిపించే ఆమ్రేడితాలు (5) అస్పష్టంగా వినిపించేవి గుసగుసలు. ఒకే పదం వెంటవెంటనే రెండుసార్లు వస్తే అదే ఆమ్రేడితం.
5 కకావికలైనా చెదరని రంగు (2) కకావికలు లో కావి అనే రంగు దాగుంది. అది ఏ మాత్రం చెదరలేదు. చూశారా?
8 చూడ నల్లగుండు గుండ్రముగా నుండు (2) గుండు
9 మనకున్నదే..మా భాభి షానం కూ ఉంది (5) భాషాభిమానం
13 చంద్ర (2) చంద్రుడికే సోముడని పేరు. సోమవారం ఆయన పేరునుంచే వచ్చింది.
14 గురువుగారూ! పొరబడకండి. అది కంకరనేల (3)
గరువు అంటే కంకరనేల. గురువు గారినిందులోకి లాగింది ఈ పదాన్ని సూచించడానికే! గళ్ళనుడికట్టు ఆధారాల్లో వచ్చే “పొరబాటు” దాదాపు ఒకేలా ధ్వనించే పదాలను సూచిస్తుంది.
15 దీన్ని తలాపిడికెడు పంచబోతే చెల్లాచెదరైంది (4) తిలాపాపం తలాపిడికెడు అని ఒక నానుడి. పంచబోయిన తిలాపాపం చెల్లాచెదరైతే? ఏమౌతుందో తెలుసుకోవాలంటే అడ్డం ఆధారాలను బట్టి అక్షరాల అమరికను మార్చుకోవలసిందే!
16 బలాఢ్యులుపయోగించిన పూర్వకాలపు ఆయుధమే! (2) ఆ ఆయుధం గద. ఆయుధమే అంటున్నాం కాబట్టి సమాధానం గదే అవుతుంది
18 కులమా? కాదు. అటుదిటైన ఈ దేవి మంచి నర్తకి (3) కులమా లోని అక్షరాలను అటూఇటూ చేస్తే వచ్చే లకుమా + దేవి కర్పూరవసంతరాయలు అనే కావ్యంలోని గొప్ప నర్తకి పేరు.
19 జాగ్రత్త, వివాదాలం మేం! తలగొరిగి, సాచిన చేతులు నరికేస్తే వదుల్తామా? (3) వివాదాలం అనే పదంలో తల అంటే మొదటి అక్షరమైన వి ని తొలగించి మిగిలిన అక్షరాలకుండే దీర్ఘాలను తీసేస్తే (సాచినవాటిని నరికేస్తే) మిగిలేది వదలం. వివాదాలు ఒకంతట వదలవు కదా?
21 సుఖమెరుగని అవస్థ (2) అవస్థలు నాలుగు:

  1. జాగ్రత లేక మెలకువ,
  2. నిద్ర లేక సుషుప్తి,
  3. స్వప్న,
  4. ఈ మూడింటికీ అతీతమైన తురీయ.

ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదని సామెత.
22 కోనంగీ! ఈ చోటికి వెళ్ళదలిస్తే చొక్కా విప్పి వెళ్ళు! (2) అంగీ అంటే చొక్కా. కోనంగీ అంగీ విప్పితే మిగిలేది కోన. అదే పోదలచిన చోటు.
23 కలం పట్టిన చెయ్యి ఇది పట్టడం కష్టమే!(2) సమాధానం హలం (నాగలి)
24 ఈ దేశం మసిలేనిదయా(4) మసిలేనిదయా ను మసి + లేనిదని విడదీసి అర్థం వెదక్కూడదు. ఆ పదంలో దాగున్న దేశం మలేసియా .
25 సమాజం ఎలా నడచుకొన్నా దీని నడక మాత్రం చక్కనిది (3) సామజం (ఏనుగు) సామజ వర గమన అనే పోలిక సుప్రసిద్ధం కదా? అలాగే హంసగమనం (రాయంచ నడక), ఇభరాజగమనం (మళ్ళీ ఏనుగే), నెమలి నడకలాంటి నడకలు కూడా ఉన్నాయి. సామజం అనే సమాధానాన్ని సూచించడానికే ఆధారంలో సమాజం ప్రస్తావన.
27 తలతిరిగి పూలు పూసింది! (2) తల తిరిగితే (వ్యతిరేకదిశలో చదివితే) లత అవుతుంది. పూలు పూసేది లతే కదా? అదే సమాధానం.
29 ఆహారంలో మాంసం కానిది పైకి పెరుగుతుంది (2) మాంసం కానిది శాకం. (మాంసాహారం – శాకాహారం) శాకాలన్నీ పైకే పెరుగుతాయి. కానీ ఇక్కడ పైకి పెరగడమంటే కింది నుంచి పైకి రాయమని అర్థం.
30 దానమిచ్చింది అవి కాదు, ఇవి కాదు (2) ఈవి అంటే దానమిచ్చింది అని అర్థం.

14 నిలువు, 30 నిలువులలో ఉన్న పొరబాటు, కాదు లాంటి indicator పదాలు దాదాపు ఒకేలా ధ్వనించే పదాలను సూచిస్తాయి. (గురువు-గరువు, ఇవి-ఈవి).

31 ఉన్నదున్నట్లు పీకాలనుకుంటే తలతిప్పండి (2) ఉన్నదున్నట్లు చేస్తే అది కాపీ. తల అంటే [‘పీకాలనుకుంటే’ అనే పదం మొదట్లో ఉన్న రెండక్షరాలు] ‘పీకా’. దీన్ని తిప్పితే వచ్చేదీ కాపీయే!
—————————————————————
ఇంకోమాట: గళ్ళనుడికట్లలో నకారం పొల్లును విడి అక్షరంగా లెక్కించరు. ఉదాహరణకు ఫంక్షన్ అని రాయడానికి రెండు గళ్ళే ఇస్తారు.
***

మీకు ఇంగ్లీషు క్రాస్‌వర్డ్ పజిల్ పట్ల ఆసక్తి ఉన్నట్లైతే ఆర్కుట్ లో మీకోసం ఒక అద్భుతమైన కమ్యూనిటీ ఉంది. అక్కడ మీ చేత ‘ఆహా!’ అనిపించే ఆధారాలు – సమాధానాలు, వందలు కాదు వేలకొద్దీ (అవసరమైనవాటికి వివరణలతో సహా) ఉన్నాయి. చమత్కారం వాటి ప్రధాన ఆకర్షణ. మీరు చమత్కారప్రియులైతే తనివితీరా ఆస్వాదించవచ్చు. (రుచి మరిగారంటే మీకు ఎప్పటికీ తనివితీరదు. తర్వాత నన్ను తిట్టుకుని లాభం లేదు. ఇప్పుడే చెప్తున్నా.)

ది హిందూ క్రాస్‌వర్డ్ గురించి రీడర్స్ ఎడిటర్ కె.నారాయణన్ మరిన్ని వివరాలందిస్తున్నారిక్కడ.

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

7 Responses to మార్చి గడి సమాధానాలు – వివరణ

  1. అబ్బో!
    ఇంచుమించు ఓ అవధానికి తెలిసినన్ని విషయాలు తెలియాలి ఈ గడి పూరించాలంటే! “రసిక రాజ..” అన్నప్పుడే ఇదేదో మనది కాదు లెమ్మని వుసూరుమన్నా!
    వ్యాకరణ విషయాల నుండీ, పెద్దన కావ్యాల నుండీ, రాయల ఆస్థాన విషయల నుండీ, సినిమా, నాటకాల చరిత్రల నుండీ, ఇప్పటి వికీపీడియా వరకు తెలిసివుండటమంటే మాటలా మళ్ళీ అందులో చతురత!
    కూర్చిన వాళ్ళకు, పూరించిన వాళ్ళకు వేయిన్నొక్క దండాలు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. నాకు కొన్ని గడ్డిపోచలు దులిపి (35 మార్కులతో పాస్) పొద్దింటి దొడ్లో గాటనకట్టేశారు. ఇకముందు పూర్తిమేత (మెదడుకు) దొరకబుచ్చుకొనే దాక తింటూ ఇక్కడే ఉంటా.

  3. Sowmya says:

    ఈ గడి కూర్పు ఎవరిదో కాని … అద్భుతం అండి. తెలుగు నేర్చుకోవాలి అన్న తాపత్రేయం పెరుగుతోంది మీ గడి ని చూస్తూ ఉంటే.

  4. కొన్ని నింపి మిగిలినవి రేపంటే వినట్లేదు. మరురోజు మళ్ళీ వ్రాయి అని ఇంపోజిషన్ వ్రాయిస్తోంది. గడి పళంగా దాచుకొని రొజూ కొద్దికొద్దిగా మేసే ఏర్పాటు ఉంటే బాగుండును. ఏమిటీ? ఓ గడ్డి పరకేస్తే, మోపే అడుగుతున్నానను కొంటున్నారా? మేతేసే అమ్మనే కదా గడ్డి అడగమన్నారు.

    నేను ఏప్రిల్ నెల పజిల్ పంపేసా- ఒక గడి వదిలేసా- మళ్ళీ పంపిచ్చన్నారు కాదా అని. మొదటి పక్షికి ఏమైనా ప్రత్యేక ప్రశంశ ఉందా? 🙂

  5. నాగరాజు says:

    ఇందులో 13 నిలువు చాలా తికమక పెట్టింది. చంద్ర అనే ఆధారంలో ఒకటిన్నర అక్షరం మేం మింగేం కాబట్టి, పూరించేటప్పుడు ఒకటిన్నర అక్షరం మీరు మింగండి – అని చెప్పకుండా చెప్పడం చాలా తెలివైన పథకం. సామాన్యంగా చంద్రుడికి రెండక్షరాల పర్యాయ పదం కోసం వెదుకుతాం కదా. ఇలాటి ప్రయోగం నాకు తెలిసి ఇది మెదటి సారి.
    చాలా చక్కటి ఆధారాలు, అంతకు మించిన వివరణలు.
    జయహో పొద్దు, అదరహో త్రివిక్రమ్..

  6. కామేష్ says:

    మార్చి గడినుడి కన్నా ఏప్రిల్ పదునెక్కింది. అదరహో త్రివిక్రం అదరహో. ఇన్నాళ్ళకు మెదడుకు మంచి మేత వేస్తున్నారు. ఇలాగే సాగిపొండి (KEEP IT UP) అనాలని నా ప్రయత్నం.

  7. కామేశ్ గారూ!

    నేను కూర్చింది మార్చి నెల గడి ఒకటే! ఏప్రిల్ గడి సిముర్గ్ గారు కూర్చారు. గమనించండి.

Comments are closed.