ఒక ‘అన్ రెడ్’ స్టోరి

కలలో కూడా ఊహించి వుండను. నేనిలాంటి దుస్థితిలో చిక్కుకుంటానని.

విధి ఎంత బలీయమైనదో..నాకిప్పుడు అర్థమవుతోంది. లేకపోతే, నేనేమిటి.. ఇలా హంతకురాలిలా బోనులో నిలబడటమేమిటీ!!
నిన్న రాత్రి జరిగిన ఒక భయానక దృ శ్యం నా కళ్ళ ముందు కదిలింది. అంతే. మళ్ళీ నిలువునా వొణికిపోయాను. అప్పటి దాకా బలహీనంగా కొట్టుకుంటున్న గుండె ఇక ఆగిపోతానంటోంది…కళ్ళు తిరిగి స్పృహ తప్పేలా వున్నా..తూలి పడిపోకుండా వుండటం కోసం…బోను చువ్వల్ని ఆధారంగా చేసుకుని నిలబడాలని విఫల ప్రయత్నం చేస్తున్నా..

కోర్ట్ హాలంతా నిశ్శబ్దమై పోయింది. జడ్జ్ తో సహా అందరూ నా వైపే చూస్తున్న సంగతి – నే కళ్ళు తెరిచి చూడకపోయినా, నాకు స్పష్టంగా తెలుస్తూనే వుంది,
ఆ గుండెలదిరే నిశ్శబ్దంలో – పాడై పోయిన సీలింగ్ ఫాన్ మోత చెప్పలేనంత భయాని రేకెత్తిస్తోంది.
ఇంతలో-

నాకు క్రమేపీ దగ్గరవుతూ అతి సమీపంగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తోంది. అవి ఎవరివో గ్రహించగలను. నల్ల కోటేసుకున్న మనిషివి. మరుక్షణంలో నే వినబోయే ప్రశ్న ఏమిటో కూడా నాకు బాగా తెలుసు.
‘మీరీ హత్య ఎందుకు చేసారు?’ అని..
తనేమని జవాబిస్తుంది?

నిజానికి తను దోషి కాదు. కనీసం ఒక పూట క్రితం దాకా కూడా..
తను హత్య చేయగలదని కానీ, తనో హంతకు రాలు అవుతుందన్న సంగతి తనకే తెలీదు.
అంతెందుకు, హత్య చేసాక కూడా..తనకు చంపడం వచ్చన్న నిజాన్ని తట్టుకోలేక బ్రతికి చచ్చిపోయినదైంది.. ఆ క్షణంలో చలనం లేని రాయి అయిపోయింది.
నిలువునా బిగుసుకు పోయి, నోటంట మాట రాక, వెక్కెక్కి ఏడ్చింది…మెదడు మీద పెద్ద మంచు ముద్ద పెట్టినట్టు.. పనిచేయడం ఎప్పుడోనే మానేసింది. తన ప్రమేయం లేకుండా..శరీరం మాత్రం పరుగులు పెట్టింది. తన అడుగులు ఎంత వేగంగా పడుతున్నా యంటే…పాదాలు భూమికి సరిగ్గా ఒక అంగుళం ఎత్తు లో ఎగురుతూ…చేతులు గాల్లో తేలుతూ..ఎలా ఇక్కడకొచ్చి పడిందో!

భగవాన్..ఏ స్త్రీకి ఇలాం టి దుస్ఠితి కలగ కూడదు. కాని, తనకు కలిగింది. కేవలం తనో స్త్రీ అయినందుకు మాత్రమే అలాంటి దారుణ మైన పరిస్థితి ఎదుర్కోవాల్సొచ్చింది.

“చెప్పండి. ఎందుకు చేసారు?” ఈసారి కొంచెం కఠినంగా అడుగుతోంది ఆ గొంతు.
ఎక్కణ్ణుంచి ప్రారంభించ మంటారు నా కథని!
నేను చెప్పడం అంటూ జరిగితే –
ఎన్ని తుఫాన్లు తిన్న సముద్రం సైతం, గుండె చీల్చుకుంటుంది.
వొరగడం రాని కొండ సైతం కుంగి, కరుగుతుంది..
కదలడం మాత్రమే తెల్సిన కాలం కూడా ఆగి, కరిగి కన్నీరవుతుంది.
అసలేం జరిగిందంటే..

ఆ రాత్రి ఎప్పట్లానే నైట్ షిఫ్ట్ చేసి, బయటకొస్తూ.. టైం ఆఫీస్ లో కార్డ్ పంచ్ చేసి, ఆఫీస్ కాబ్ లో ఇంటికి బయల్దేరాను. నాతో బాటే రావల్సిన ఆ ఇద్దరు ఆడ వాళ్ళూ రాలేదు. నేనూ, మరో అతను వున్నాం. అతన్ని నేనింతకు ముందు చూసినట్టు లేను. బహుశా, కొత్త గా జాయిన్ అయినట్టున్నాడు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చునున్నాడు.
వెనక సీట్లో నేనొక్కదాన్నే! సీట్ వెనక్కి వాలి, కళ్ళు మూసుకుని, రిలాక్సెడ్ గా కూర్చున్నా.
ఆరోజు ఒక కస్టమర్ తో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.
అసలు మరిస్తే కదా, మళ్ళీ గుర్తొచ్చిందనడానికి.
ఆ కస్టమర్ గొంతులో వినిపించే ద్వందార్ధాలు, తికమక పెట్టే మెలిక పాముల్లాంటి ప్రశ్నలు.
తను బదులివ్వలేక మౌనమైనప్పుడు నవ్విన ఆ నవ్వు..అన్నీ తనకు గుర్తున్నాయి. బాగా గుర్తున్నాయి.
వెంటనే మేనేజర్ మాటలూ గుర్తొచ్చాయి.

”అవతల వాళ్ళు ఏం మాట్లాడినా, ఎంత నోరు జారినా, గాల్స్! మీరు మాత్రం సహనంగానే వుండాలి. ఈ వుద్యోగంలో మీకుండాల్సిన మొదటి లక్షణం ఇదే. ఈ మొదటి సూత్రం మీరెప్పుడైతే అతిక్రమిస్తారో, ఆ తర్వాత మీరెన్ని విషయాలలో నిజాయితీగా వున్నా, లాభం వుండదు. వుద్యోగం లోంచి నిర్దాక్షిణ్యంగా గెంటేయ బడతారు. అందుకే, కస్టమర్ నుంచి మాకు ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఆ బాధ్యతని మీరెన్నాళ్ళు బాధ్యతాయుతంగా పాటిస్తే అన్నాళ్ళు మాత్రమే మీరీ వుద్యోగాన్ని కాపాడు కుంటారు.. అర్ధమైందిగా!”

హు! అంత బాగా చెప్పాక, అర్థం కాకుండా ఎలా వుంటుంది.
ఆ తర్వాత అతనితో తను చాలా మర్యాద గా మాట్లాడి, థాంక్స్ చెబుతూ.. టెక్నీషియన్ కి కాల్ ని డైవర్ట్ చేసింది.

సహనం! కొన్ని రకాల వుద్యో గాలు చేయడానికి వుండాల్సిన మొదటి లక్షణం అదే.
ఆడవాళ్ళు – బ్రతుకు చివరి వరకూ అలవరచు కోవాల్సిన లక్షణం కూడా అదే కాబట్టి, ఈ జాబ్స్ లో ఆడవాళ్ళు చాల చక్కగా ఇమిడిపోతారు. ముఖ్యంగా ఇక్కడ ఫిమేల్ వాయిస్ కి క్రేజ్ కూడా వుండటం మా లాంటి వారి పాలిట వరమే.
అప్పుడప్పుడు శాపం కూడా..అని అప్పుడు నాకు తెలీలేదు. అది తెలీడానికి నా కప్పటి కింకా కేవలం కొన్ని నిముషాల వ్యవధి మాత్రమే వుంది.

మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి.
పగలు కుంభకర్ణినిలా నిద్ర పోయి, రాత్రిళ్ళు నిశాచరినై అర్థరాత్రి దాటే ఈ వేళప్పుడు ఇంటికి వెళ్తూ….
ఇలా ఎంత కాలమని పని చేయాలి?.. తెలీదు. కాని, తప్పదు. చేయాలి.

ఒక మంచి (?) మొగుణ్ని కొనుక్కునేంత డబ్బు కూడ బెట్టుకునే దాకా చేయాలి. అదేం మాటబ్బా? మంచి వాడైతే డబ్బుకెందుకు దొరుకుతాడు? ‘డబ్బెట్టి కొనుక్కునేది మంచి తన మెలా అవుతుంది?’
‘అవును. నిజమే. కాదు. ఇక్కడ మంచి అంటే..మంచి ఆర్ధిక పరిస్థితి గలవాడు అని అర్థం. అంతే.
అంటే..డబ్బెట్టి, డబ్బున్న వాణ్ని శాశ్వతంగా కొనుక్కోవడాన్నే పెళ్ళి అని, అతన్ని మొగుడనీ అంటారా! సుఖ జీవనానికి అంత కష్టపడే బదులు.. పోని.. నాకున్న డబ్బుతో నేనే సుఖంగా కాలం గడిపిస్తే పోలా? ఏమంటావ్?’
‘అబ్బ! నీతో వాదించలేను తల్లీ..సరే అలాగే అనుకో. నిన్ను నువ్ పోషించుకోడానికి..ఆ తర్వాత వృధ్ధకన్యాశ్రమంలోమిగిలిన జీవితం సుఖంగా గడపడానికైనా. నువ్విలా కష్టపడక తప్పదు.
“అదీ అలా చెప్పు. నేనొప్పుకుంటా..”
తనతో తను నెగ్గలేనితనానికి తనలో తనే నవ్వుకుంది.

ఆలోచనలు.. అర్థం పర్థం లేని ఆలోచనలు ఇలా అప్పుడప్పుడు ఎక్కడికో తీసుకెళ్ళి, తీసుకొస్తుంటాయి. ఆలోకనం లోంచీ..ఈ లోకంలోకొస్తూ..గట్టిగా నిట్టూర్చాను. నా నిశ్వాసం నన్నే భయ పెడుతోందంటే..ఎంత కటిక నిశ్శబ్ద వాతావరణమో అది ఊహించ వచ్చు.

కళ్ళిప్పి చూశా…
చుట్టూ చీకటి. చిమ్మ చీకటి.
కార్ స్పీడ్ గా దూసుకెళ్తోంది.
ముందు సీట్లో అతడూ లేడు ఎప్పుడు దిగి పోయాడో..తను గమనించ లేదు.

రోడ్ కనిపించడం లేదు. సిటీ పొలిమేరలు దాటి చాలా సేపే అయినట్టుంది. వెలుగుతూ వీధి లైట్లూ లేవు. కాని, కాబ్ పరిగెడుతూ వుంది. చాలా వేగంగా పరుగెడ్తోంది. నేను పని చేసే ఎలెక్ట్రానిక్ సిటీ -నగర శివార్లలో చిట్టచివర వుంటుంది. నిజమే కాని, ఇదేమిటీ..ఈ ప్రదేశం తనకెప్పుడు తగల్లేదే!?.. విండో అద్దాలు దించి చూసా. కారు చిట్టడవిలోంచి వెళ్తున్నట్టు గ్రహించా. నల్లటి ఆకాశాన్ని కప్పేస్తూ కొమ్మలు చాచుకున్న ఎత్తైన వరస వృక్షాలు.. గాలికి జుట్టు విరబోసుకుని, నన్ను చూసి వికృతంగా నవ్వుతున్నాయి. నా మనసు కీడు శంకించింది. ఆ మరుక్షణం లోనే అంతా అర్థమై పోయింది. నేనొక పెద్ద ప్రమాదంలో చిక్కుకోబోతున్నానని.
వెంఠనే..అరిచా..
“డ్రైవర్? ఏమిటిది..ఎక్క్..ఎక్కడికి తీసుకెళ్తున్నావ్..!” మాటలు తడబడ్డాయి..
“హ్హా..హ్హ్హా..”
“ఆపు..కారాపు..ఆపుతావా, అరవనా..”
“అరు..బాగా..అరు. ఎవ్వరూ రారు”
“హెల్ప్..హెల్ప్..”

“ఆ..ఆ! నువ్వంత తొందర పడితే ఆపకుండా ఎలా వుంటా? అరవకు..” అంటూ.. సర్రున కారాపాడు. . అది ఎక్కడాగిందంటే… ఆ అడవిలో ప్రవహిస్తున్న ఓ నిండు కాలవ పక్కన.

“ఇదే..మిటి..ఇక్క..డాపావ్?” మాట పెగలడం లేదు భయంతో.
“ఆపమన్నావుగా. ఆపా. దిగు. దిగవే..” అంటూనే వాడు తన సీట్ డోర్ తెరుచుకుని దిగాడు. బలంగా తలుపు మూసి, నా వైపు కొస్తున్నాడు.

ఐపోయింది. తన జీవితం మరి కొన్ని క్షణాలలో అధోగతి కాబోతోంది. వాడు తాగి వున్నాడు. తూల్తున్నాడు. వాడిప్పుడెంత కైపులో వున్నాడో వాడి మాటలే చెబుతున్నాయి. ఈ నిర్జనమైన ప్రదేశానికి తీసుకొచ్చి అతనేం చేయబోతున్నాడో ఒక్క క్షణంలో అర్థమై పోయింది. ముందు అత్యాచారం.. ఆ తర్వాత హత్యాచారం చేసి అదిగో ఆ కాలవలో విసిరేసి పోతాడు. తనిప్పుడెంత అరిచినా ఎవ్వరూ రారు. తను ఎంత దారుణంగా చచ్చిందీ.. ఎవరికీ తెలీదు. ఐపోయింది. తన జీవితం సర్వనాశనం కాబోతోంది.

వొళ్లంతా చల్లబడి పోయింది. గుండె ఐసు ముక్కలా వుంది.
ఇంతలో చావు ధైర్యం ముంచుకొచ్చింది. అర సెకనులో మెరుపులా తట్టింది. అప్పటికే వాడి చేయి డోర్ మీద పడ బోతోంది.
ఇక క్షణంలో వెయ్యిన్నర వంతైనా ఆలస్యం చేయకుండా, నా హాండ్ బ్యాగ్ కోసం చూసాను. అందులో ఒక చిన్న చాకు వుంటుంది. అది పళ్ళు కోసుకునే చాకు. ప్రస్తుతానికి అదే నా ఆయుధం. బ్యాగ్ వొళ్ళో లేదు. కింద పడి పోయినట్టుంది. వొంగి, చేత్తో బ్యాగ్ ని తడుముతున్నా.. నా చేతికి మెత్తని బ్యాగ్ బదులు కసుక్కు మంటూ ఒక ఇనప వస్తువేదో తగిలింది ..అది పెద్ద చాకు..పొడుగ్గా..పదునుగా. చేతిలోకొచ్చింది.

అప్పటికే వాడు డోర్ తెరిచి, నా చేయి పట్టి బయటకు లాగడం కోసం నా మీదకు వొంగ బోతున్నాడు…..గుఫ్ మంటూ నాటు మందు కంపు కొట్టింది.
అంతే.. వెనకా ముందూ ఆలోచించలేదు. అప్పటికే చేతిలోని చాకుని గురి చూసి..కసిగా..ఒక్క పోటు పొడిచా వాడి కడుపులోకి..
నా చేతుల్లోకి అంత బలం ఎక్కణ్నుంచి వచ్చిందో ఏమో..అది సూటిగా లోతుకల్లా గుచ్చుకుంది. నాకు తెలుస్తునే వుంది. లేకపోతే వాడంత చావు కేక వేసే అవకాశం లేదు.

అంత టెన్షన్ లోనూ నే విన్న మరో సంగతి ఏమిటంటే.. వాడు ఆర్త నాదాలు చేస్తూ వెనక్కి పడ్డప్పుడు.. రాయికి తగిలిన ఆ గట్టి చాకు కొస చప్పుడు నా చెవులకు స్పష్టంగా వినిపించింది. అంటే.. ఆ చాకు.. అది వాడి పొట్ట లోంచి వెనక వీపులోకి దిగబడి పోయిందన్న మాట!
వాడు గిల గిలా కొట్టుకుంటూ.. కుడి చేయి జాపుతూ..కార్ వైపుకు జరుగుతూ వస్తున్నాడు.
కెవ్వున అరవబోయిన కేక తన గొంతులోనే ఆగి పోయింది.

కారు మరో వైపు డోర్ తెరుచుకుని పరుగు మొదలు పెట్టా. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని.. పరుగు తీస్తున్నా…
వాడి వికృతమైన కేకలకి అడవి దద్దరిల్లుతోంది..నాకైతే..గుండెలదిరిపోతున్నాయి..
పరుగు..పరుగు..పరుగు..
నే ముందుకు పరెగెత్తు తున్న కొద్దీ..వాడి అరుపులు దూర మౌతున్నాయి..క్రమంగా..క్రమ క్రమంగా.. దూర మౌతున్నాయి..

నేనింకా ముందుకి.. పరిగెడ్తూనే వున్నా..
ఆ అడవి పక్కన పల్లె అనుకుంటా..అప్పుడే మేలుకుంటోంది….తెల్లవారుఝామున లేచిన జనం వెళ్తున్నారు. వాళ్ళ చేతుల్లో లాంతర్లున్నాయి..
చలికి నిండా ముసుగులు కప్పుకుని నడుస్తున్నారు..
చీకట్లోంచి కదిలి..నేనూ ఆ వరస లోకెళ్ళి చేరా. నేను కొత్త దాన్నని వాళ్ళకి తెలికుండా వుంటం కోసం..నిండా చెంగు కప్పుకుని వారి తో కలిసి నడుస్తున్నా..

అలా నాలుగడుగులు వేసానో లేదో..
ఒకతను నన్ను గుర్తు పట్టి.’.ఎవరు?’ అని అడిగాడు.
నేనేం జవాబు చెప్ప లేదు.
“ఎవరంటే మాట్లాడవేం?” అంటూ నా ముఖం మీద టా ర్చ్ లైట్ వేసాడు.
గభాల్న చేతులు అడ్డు పెట్టుకున్నా, ఆ కాంతి కళ్ళ ల్లోకొచ్చి పడుతూ వుంటే..భరించ లేక.

అతను నన్ను చూసి అరిచాడు. “ఆ!.రక్తం!!.వొంటి నిండా రక్తం. ఇన్ స్పెక్టర్! ఈమె ఎవర్నో చంపేసింది..”
“ఆ!? ఇందాక మనం విన్న కేకలు ఈమె చంపేసిన వాడివే….పట్టుకోండి..పట్టుకోండి..”
నేను నిర్ఘాంతపోయాను. జరుగుతున్న సంఘటనలతో నాకు మతి పోతోంది..వొంటి మీద స్పృహలేని దానిలా..అసలు నేను బ్రతికున్నానా లేక ఇదంతా పీడకలా అనే.. మతి తప్పీతప్పని ఒకానొక అయోమయావస్థలో వున్నా..

వాళ్ళు నన్నుపట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు..
తర్వాతేమైందంటే…
‘ ……………………………….’

కథ రాయడంలో పడి రాత్రి గడచి పోయిందన్న సంగతే తెలీలేదు..సుమీ!

ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రి నుండీ టేబుల్ పైన ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంది.

కథ పూర్తి కావాలంటే..మళ్ళీ రాత్రి కావాల్సిందే, తప్పదు!

***********

నవంబరు 2011 సమస్యకు స్పందనగా వచ్చిన కథ

Posted in కథ | Tagged | Comments Off on ఒక ‘అన్ రెడ్’ స్టోరి

కోత

[dropcap style=”font-size: 60px; color: #9b9b9b;”]రెం[/dropcap]

డు ఏకాంతాల మధ్య నిర్లిప్తంగా పరుచుకున్న నది

రెండో? మరెన్నో!

ఇదిగో ఈ ఒక్క ప్రహేళికను దాటి నిన్ను చేరుకుంటాను

రోడ్డు మీద ఒక్కో మనిషి ఇద్దరుగానో ముగ్గురుగానో

చీలిపోయి కనిపిస్తాడు. ఎవరు ఎవరో గుర్తు పడితే గెలుపు

ఇద్దరు ముగ్గుర్నలుగురిలో ఎవరితో మాట్లాడాలి?

చాల తలలు, చాల చేతులున్న అతృప్త దేవతలా

తలలు, చేతులు ఊపుతున్న ఊరు

ఏ చేతి ఊపు అంగీకారమో ఏది తిరస్కారమో?

ముఖం మీద ఏది చిరునవ్వో ఏది ఏడుపో?

చాల అలలు, లోతులు, చాలా తీరాలు వున్న నది

ఏ ఒడ్డు నుంచి ఏ ఒడ్డుకు ఈదితే నిన్ను చేరగలను?

పొద్దు పొడుస్తుంటే కొంచెం ఆకలేస్తుంది

సంతోషం వేయదు, ఆకలి తీరకముందే రాత్రవుతుంది

ఈ నది ప్రవహించదు, విడదీస్తుంది

ఒక్కొక్కర్ని రెండు, మూడు లేదా నా‍లుగయిదు గట్లుగా కోస్తుంది

ఎవరూ తనను తాను చేరుకోలేరు ఒకరినొకరు చేరుకోవడమెప్పుడు?

Posted in కవిత్వం | 2 Comments

చివరివరకూ

[dropcap style=”font-size: 60px; color: #9b9b9b;”]వే[/dropcap]

 డి సెగ తగిలినపుడే  నిను వేడుకోలేదు

అగ్నిగుండంలో అడుగు పడేవరకూఅహాన్ని కాల్చుకోలేదు

 

మొదటి చినుకు తాకినపుడే మేలుకోలేదు

మూడుసంద్రాలూ పొంగేవరకూ

మాయను జార్చుకోలేదు

 

చిరుగాలి వీచినపుడే తేరుకోలేదు

అది ప్రచండమై నను వూపేవరకూ

రాగాలను రాల్చుకోలేదు

 

ఇంద్రధనువు అందంగా వంగినపుడే తెలుసుకోలేదు

మిన్నే విరిగి మీదపడేవరకూ

సత్యాన్ని తలదాల్చుకోలేదు

 

అమ్మలా అవని నను మోసినపుడే నేర్చుకోలేదు

మట్టిలో నను కప్పేవరకూ

నా దృష్టిని మార్చుకోలేదు

Posted in కవిత్వం | Comments Off on చివరివరకూ

‘మతిచెడిన’ మేధావులు

మన సంప్రదాయంలో లేదుగాని పాశ్చాత్య సంస్కృతిలో ఒకప్పుడు చంద్రుడి కళలకూ, మనుషుల చిత్త చాంచల్యానికీ సంబంధం ఉన్నట్టుగా భావించేవారు. పౌర్ణమి రోజున పిచ్చి బాగా ముదురుతుందని నమ్మే ధోరణి అప్పట్లో ఉండేది. పద్ధెనిమిదో శతాబ్దంలో ఇంగ్లండ్‌లో కొందరు మేధావులు తమ సహజ హాస్యవైఖరితో తమ బృందాన్ని పిచ్చివాళ్ళుగా అభివర్ణించుకునే ప్రయత్నం చేశారు. ఎటొచ్చీ వారు సామాన్యస్థాయికి చెందినవారు మాత్రం కారు. దీనికి కొంత నేపథ్యముంది.

ఏ యుగంలోనైనా మనుషులు తమకున్న జ్ఞానసంపదను వేరువేరువిషయాలుగా విభజించుకుని, వాటన్నిటినీ ఒకదానితో ఒకటి సంబంధంలేనివిగా పరిగణిస్తూవచ్చారు. మనుషులు పోగుచేసుకున్న జ్ఞానమంతా ఈనాడు వృక్షశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం మొదలైనవీ, ఆర్థికశాస్త్రం, చరిత్ర వగైరాలూ, మరొకవంక కవిత్వం, నాటకం, అలాగే రాజనీతిశాస్త్రం, ధర్మశాస్త్రాలూ, న్యాయచట్టాలూ ఈ పద్ధతిలో వేరువేరు సముదాయాలుగా కనిపిస్తుంది. ఇందుకు భిన్నంగా క్రీ.శ. పదోశతాబ్దంలో అనేకమంది ఇస్లాం తత్వవేత్తలు హకీమ్‌లుగా పేరుపొంది, తమ బహుముఖప్రజ్ఞద్వారా భాషాశాస్త్రం, వ్యాకరణం, రాజనీతి, విజ్ఞానవిశేషాలు ఇలా పరస్పరం సంబంధంలేవనిపించే విషయాలలో గొప్ప కృషి చేశారు.

ఇటువంటి ధోరణి మళ్ళీ 1770 ప్రాంతాల ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హం పరిసరాల్లో పొడచూపింది.

ఆ రోజుల్లో కొందరు మేధావులు కలిసి లూనార్ సొసైటీ (చంద్రసమాజం) అనేదాన్ని స్థాపించి, నెల కొకసారి పౌర్ణమి రాత్రిళ్ళు సమావేశం అయేవారట. వారు తమను తాము ‘మతిచెడినవారు’ (లూనటిక్స్) గా అభివర్ణించుకున్నారు. వీరిలో ఆవిరియంత్రం కనిపెట్టిన జేమ్స్ వాట్, ఆక్సిజన్ ఒక మూలకమని కనిపెట్టిన జె.బి.ప్రీస్ట్‌లీ, ప్రసిద్ధ అమెరికన్ రాజనీతిజ్ఞుడుగా, విద్యుత్తు గురించిన పరిశోధనలు చేసినవాడుగా పేరుపొందిన బెంజమిన్ ఫ్రాంక్లిన్, జీవపరిణామవాదాన్ని ప్రతిపాదించిన డార్విన్ తాతగారు ఇరాజ్మస్ డార్విన్ (వైద్యుడు, కవికూడా), పారిశ్రామికవేత్త బోల్టన్ తదితరు లుండేవారు (పటం). లేతవయసులోనే పరిశ్రమలో పనిచెయ్యనారంభించిన బోల్టన్‌కు అప్పట్లో అధునాతనమైన విద్యుత్తు, లోహాల లక్షణాలు వగైరాలపట్ల వైజ్ఞానిక కుతూహలం ఉండేది.

ఈ ‘మతిచెడిన’ మేధావులు గుర్రపుబగ్గీలలో ప్రయాణించేవారు కనక వెన్నెలరాత్రులు గుర్రాలకు దారి కనబడేది. అంతా కలిసి రాత్రి భోజనం చేశాక (మద్యం ముట్టని) ఈ చింతకులు అనేక విషయాలను చర్చించుకునేవారు. చర్చకు వచ్చే విషయాలమీద పరిధులూ, ఆంక్షలూ ఉండేవికావు. ప్రతిదాన్నీ స్వేచ్ఛగా విశ్లేషించి నిశితంగా ప్రతిపాదనలు చేసేవారు. అందరూ ప్రవీణులే కనక ఒకరి తెలివితేటలవల్ల మరొకరికి లాభం చేకూరుతూఉండేది. అంతేకాక ఏ విషయానికైనా సంబంధించనివారి సూచనలూ, అభిప్రాయాలూ అందులో నిష్ణాతులైనవారి బుద్ధికి పదునుపెడుతూఉండేవి. జేమ్స్ వాట్ బ్రిటిష్ రాజువద్ద ఖగోళవేత్తగా పనిచేసే విలియం హర్షల్ తదితరులతో రాజకీయాలూ, కవిత్వం గురించి చర్చించేవాడు. ఇతరులు ప్రీస్ట్‌లీతో వాయువుల మిశ్రమాలను రసాయనికంగా ఎలా వేరుచెయ్యవచ్చో మాట్లాడేవారు. ఇంజనీరింగ్ పరిశ్రమల వివరాలూ, సాహిత్యవిశేషాలూ, రాజకీయాలూ ఏవీ చర్చకు అనర్హం అనిపించుకునేవికావు. ఈ మేధావుల చింతనా ధోరణివల్లనే తరవాతికాలంలో ఇంగ్లండ్‌లో పారిశ్రామికవిప్లవం సాధ్యమైందని అంటారు.

అంతకుమునుపు ప్రతి విషయాన్నీ ప్రత్యేకమైనవిగా భావించి, చట్రాల్లో బిగించే ఆనవాయితీ ఉండేది. అలాకాకుండా వివిధవిషయాల్లో నిష్ణాతులైనవారందరూ ఒకేచోట కూర్చుని చర్చించుకోవడం ఆలోచనాత్మకపరిధిలో పెనుమార్పులు కలగడానికి దోహదం చేసింది. ఆ రోజుల్లో బ్రిటన్ రాజకీయంగా, సామాజికంగా మార్పులకు లోనయింది. జేమ్‌స్ కుక్ ఆస్ట్రేలియాను వశపరుచుకునే ప్రయత్నాలు చేశాడు. అమెరికాలోని బోస్టన్ రేవులో తేయాకుమీద బ్రిటిష్ ప్రభుత్వం విధించిన సుంకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన మొదలయింది. 1776లో అమెరికా స్వతంత్రదేశంగా వేరుపడడానికి ఇది ప్రేరణ నిచ్చింది. మరి కొద్దికాలానికే స్వయంగా పెనువిప్లవానికి లోనయిన ఫ్రాన్స్ కొత్తదేశంతో సంఘీభావం ప్రకటించింది. అదే ఏడాది జేమ్‌స్ వాట్ ఆవిరియంత్రం పనిచెయ్యసాగింది.

చంద్రసమాజం సుమారు 50 ఏళ్ళపాటు నడిచింది. ఇందులోని సభ్యులు స్వయంగా ప్రతిభావంతులూ, ఇతర ప్రముఖులకు శిక్షణనిచ్చినవారూకూడా. ఉదాహరణకు వైద్యవిజ్ఞానశాస్త్ర అధ్యాపకుడైన విలియం స్మాల్ అమెరికాకు తొలి ఉపాధ్యక్షుడైన ఠామస్ జెఫర్సన్‌కు గురువు. సభ్యులలో వృక్షశాస్త్రవేత్తలూ, తుపాకుల తయారీదారులూ ఇలా రకరకాల రంగాల్లో కృషి చేసినవా రుండేవారు. వీరిమధ్య సంపర్కం ఏర్పడడం అనేక కొత్త ఆవిష్కరణలకు కారణమయింది.

బోల్టన్ నడిపే పరిశ్రమకు దగ్గరలో ఉన్న సెలయేటి నీటిప్రవాహం సహాయపడేది. అయితే సెలయేరు ఎండినప్పుడూ, అందులో నీరు తగ్గినప్పుడూ యంత్రాలు తిరిగేవికావు. అప్పుడాయన చంద్రసమాజం సహసభ్యుడైన వాట్‌ను సంప్రదించి అతని ఆవిరియంత్రం గురించి వాకబుచేశాడు. ఈ సందర్భంలోనే వాట్ కార్బన్ డయాక్సైడ్ వాయువును కనిపెట్టిన జోసెఫ్ బ్లాక్‌నుకూడా సంప్రదించి గుప్తోష్ణం గురించిన వివరాలు తెలుసుకున్నాడు. గుప్తోష్ణం (లేటెంట్ హీట్) గురించిన సమాచారం ద్వారా త్వరలోనే ఆవిరిపంప్ తయారీ సాధ్యపడి బోల్టన్ పరిశ్రమకూ, ఇంకా ఎన్నో పెద్ద పరిశ్రమలు నడవడానికీ దోహదపడింది.

గుప్తోష్ణం అనేది ఏదైనా పదార్థం ఘనద్రవవాయురూపాల్లోకి పరివర్తనం చెందుతున్నప్పుడు ఉష్ణోగ్రత మారని పరిస్థితికి సంబంధించినది. ఉదాహరణకు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న మంచు అదే స్థితిలో నీరుగా కరుగుతున్నప్పుడు గ్రాముకు 80 కేలరీల ఉష్ణం విడుదల అవుతుంది. లేదా నీరు గడ్డకట్టినప్పుడు అంతే ఉష్ణం పీల్చబడుతుంది. అలాగే నీరు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆవిరౌ తున్నప్పుడు 540 కేలరీలు అవసరమౌతాయి. ఇదంతా బృహదణువులకు అందే శక్తి కనక పైకి కనబడని గుప్తోష్ణంగా పరిగణించబడుతుంది.

ఈ వివరాలు తెలిశాక జేమ్‌స్ వాట్ అతికొద్ది మోతాదులోని నీరు ఎక్కువ మొత్తంలో ఆవిరిగా మారుతుందని అర్థంచేసుకున్నాడు. అంతేకాక కొద్దిపాటి ఆవిరిలో ఉండే గుప్తోష్ణంద్వారా ఎక్కువ మొత్తంలో నీటిని వేడెక్కించవచ్చని తెలుసుకున్నాడు. ఆ తరవాత అతను నిర్మించిన ఆవిరి యంత్రంలో ఈ విశేషాలన్నీ ఉపయోగపడ్డాయి. వేడిమిని కోల్పోకుండా ఉండేందుకు అతను చెక్కతో కవచాలను తయారుచేసుకున్నాడు. యంత్రంలో ఉత్పత్తి అయిన వేడిమిని పొదుపుగా, తెలివిగా ఉపయోగించుకోవడంతో వాట్ నిర్మించిన ఆవిరియంత్రం విప్లవాత్మకమైన మార్పులు కలగజేసింది. రైలుబళ్ళూ, నేతమిల్లులూ ఇలా ఇంగ్లండ్ యావత్తూ ఒక్కపెట్టున పెద్ద పారిశ్రామికదేశంగా మారగలిగింది. ఇది యూరప్ చరిత్రనే మార్చేసిన పరిణామం. అంతేకాక చవకలో వినియోగానికి అనేక వస్తువులు తయారవడంతో భూస్వామ్యసంస్కృతి అంతరించిపోయింది. ఇదంతా కొందరు మేధావులు తరుచుగా కలుసుకుని ముచ్చటించడంవల్లనే సాధ్యపడిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.

ఈ రోజుల్లో విజ్ఞానసాంకేతికరంగాలు పూర్తిగా భిన్నమైన పద్ధతిలో నడుస్తాయి. ప్రతిదానికీ ధనం సమకూర్చడం, వాటిద్వారా తయారైన వస్తువుల విక్రయంవల్ల కలిగే లాభాలూ అన్నిటినీ సక్రమంగా, ప్రణాళికాబద్ధంగా చేపడతారు. శాస్త్రవేత్తలమధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు తరుచుగా ప్రపంచమంతటా సమావేశాలూ, వారి పరిశోధనల గురించిన వివరాలను ప్రచురించి, పంపిణీ చేసేందుకు ఎన్నో పత్రికలూ ఉంటాయి. ఇంటర్నెట్ వచ్చాక ఈ సమాచారవినిమయం మరింత విస్తృతంగా, ఎక్కువగా జరుగుతోంది. ఇదంతా జరుగుతున్నప్పతికీ పదునైన బుద్ధిగలవారు పరస్పరం జరుపుకునే పిచ్చాపాటిలో ఎన్నో కొత్త ఊహలు మెరుపుల్లా మెరుస్తాయనే విషయంలో మటుకు సందేహంలేదు. ఇవి ఎన్నో సందర్భాల్లో ఉన్నతమైన ప్రగతికి దారితీశాయి.

Posted in వ్యాసం | Tagged | 3 Comments

అత్తరు గానాలు

[dropcap style=”font-size: 60px; color: #9b9b9b;”]గా [/dropcap] యమైన గుండే గజలౌతుంది

విషాద గానాల ఖజానా అవుతుంది.

 

నడుచుకుంటూ పోయే కాలపు నల్ల నీడల దారులు

కన్నీటి పైన మాయమయ్యే అలల అడుగులు

సప్త వర్ణాల తనువుల మబ్బు వస్త్రాలు

నిశ్శబ్ద నీరవాలు – గజళ్ళు.

 

నువ్వెళ్ళిపోయిన దారి మలుపులు

తారట్లాడే చీకటి వెలుగుల చారలు

మెలిపెట్టే జ్ఞాపకాల ఆనవాళ్ళు

గొంతు కొసల చిట్లిన జీరలు – గజళ్ళు

 

నీ అరిపాదాల అద్దకాల ముద్రలు

ఎదకెత్తుకున్న మట్టిజన్మ జాడలు

వలపు పరిమళాల విలాపాలు

పగిలి రాలిన మొగలిరేకుల గుత్తులు – గజళ్ళు.

 

నీ తలపుల తెమ్మెర తెరలు వీచి

మత్తైన విషాదపు పువ్వులు విచ్చినపుడు

కనులలొలికిన కన్నీరుబుడ్డి జల్లి పొయే

మధుర వేదనా అత్తరులు

– గజళ్ళు.

 

ఎడబాసిన కరకుతనపు కరవాలాలు

హృదయ కుత్తుకని మెత్తగా నొక్కుతున్నప్పుడు

మడత పడ్డ ప్రాణాలు మెలికలు పోతుంటే

గాలి – నా బాధను పాడే గానాలు గజళ్ళు.

 

సఖా!

నువ్ వెనుదిరిగేసరికి నే వుందునో లేనో..

అందుకే ఇక్కడ గుమ్మరించి పోతున్నా

నీకై నిశ్శబ్దించిన నా గుండె చప్పుళ్ళు

– గజళ్ళు

 

Posted in కవిత్వం | 12 Comments

మీ కందం – రమణీయార్థప్రతిపాదకము

“రమణీయార్థప్రతిపాదకః శబ్దః కావ్యమ్|”

– రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించే శబ్దమే కావ్యమట. ఇది జగన్నాథపండితరాయలవారి రసగంగాధరంలో మొదటి కారిక. రమణీయమైన అర్థం – ఇందుకు ప్రామాణికత ఏది? ఎవరికి తోచిన అర్థం వారివరకూ రమణీయమైనదనే అనుకోవచ్చుగా? అంటే ఆయన వ్యాఖ్యానం చెబుతాడు.

– ఏ శబ్దం తాలూకు అర్థం అయితే “లోకోత్తర” మైన (అలౌకిక) సౌందర్యంతో భాసిస్తూందో, అది రమణీయత్వమట!

ఆహా, లోకోత్తరమైన సౌందర్యం అన్నావు, బావుంది. ఇది కూడా ఎవరికి వారు తమకిష్టమైన అర్థాన్ని లోకోత్తరమైందని చెప్పుకోవచ్చుగా? అని మరో ప్రశ్న ఎవరైనా అడిగితే అందుకూ లాక్షణికుడు సమాధానం చెబుతాడు.

ఏ భావన అయితే మనస్సును పరవశింపజేయడం మాత్రమే కాక, మరీ మరీ మనసును వెంటాడుతుందో అది అలౌకికత్వమట! సాహిత్యదర్పణకారుడి మాట – “సచేతసామనుభవః ప్రమాణం తత్ర కేవలమ్” – ఇక్కడ అన్వయించుకోవాలి.

********************************************************

నాకు నచ్చిన కందం –  ఈ శీర్షికలో ఉటంకించిన కందమే. ఆ పద్యం మరోసారి.

కం ||

మృగమదసౌరభవిభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుతమొలసెన్.

“కస్తూరి, పచ్చ కర్పూరపు పరిమళాల తాలూకు చిక్కటి సౌరభము ఇతర సువాసనలను కప్పివేస్తూ, ఒకానొక అమ్మాయి జాడను తెలిపే గాలితెమ్మెర … అలా …వీచిందిట!”

పెద్దనామాత్యుని స్వారోచిషమనుసంభవం కావ్యంలో నాయిక వరూధిని అనే అప్సరసను పరిచయం చేసే సందర్భంలో ఆమె గురించిన మొట్టమొదటి పద్యం అది.

అంతకు ముందు పద్యాలలో పెద్దన గారంటారు. ఆత్రావు చెంగలువలున్న వఱిమడియట.మామిళ్ళు గోరంటలున్న త్రోపట అది. (తావుల్‌ క్రేవలజల్లు చెంగలువ కేదారంబు…)ఆ పక్కన ఱాతికంబంతో కట్టిన పందిరికి ద్రాక్షతీగలూ, పూలతీగలూ అల్లుకున్నాయట. ఆ సౌభాగ్యం చూసి అచ్చెరువొంది (కాంచి తదీయ విచిత్రోదంచిత సౌభాగ్యగరిమ కచ్చెరువంది..) ప్రవరుడు అక్కడికెళ్ళాడు.

ఈ వర్ణన రాయలవారి వేసవి విడిది పెనుగొండ తాలూకుదట.(కావ్యంలో హిమాలయాలని చెప్పినప్పటికిన్నీ ) అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ… అంచేత ’మన’ దైన ప్రాంతాన్ని ఇష్టపడని వాడు ఎవడు?

అక్కడికెళితే – ఆ పూల, ద్రాక్షల, మామిళ్ళ, చెంగలువల సువాసనను కప్పివేస్తూ మృగమదకర్పూరమిళిత సౌరభం తాలూకు గుబాళింపు!

ఆ పరిమళాన్ని అనుసరిస్తూ ప్రవరుడు ఆ మంటపాన్ని చేరుకుంటాడు. అక్కడ విద్యుల్లతావిగ్రహ, శతపత్రేక్షణ, చంచరీకచికుర, చంద్రాస్య, చక్రస్తని – ఒకమ్మాయి కూర్చుని వీణ వాయిస్తూ ఉన్నది.

– మొదట ఘ్రాణేంద్రియం, ఆ తర్వాత శ్రవణ, చక్షురింద్రియాలు, ఆ తర్వాత స్పర్శ, ఆ తర్వాత రుచి (వరూధిని అధరం) – ఒక్కొక్కటినీ వరూధిని అనే అమ్మాయి ఎలా ఆకర్షిస్తుందో – ఆ విషయాలను  చిక్కగా అల్లుకుంటూ వెళ్తాడు ఆంధ్రకవితాపితామహుఁడు. కావ్యాస్వాదకులు తన్మయులౌతారు కానీ కావ్యనాయకుడు – ప్రవరుడు చలించడు!

అమ్మాయి జాడ తెలుస్తే “జనాన్విత మిచ్చోట” ఉందేమోనని (మాత్రమే) వెళతాడు ప్రవరుడు. ఆ తర్వాత – ప్రవరుని ఆలోచనల గురించి చెప్పకుండా,  అమ్మాయి ప్రవరుని చూపి ఎలా మరులుగొంటుందో వివరిస్తాడు కవి. అంతా చేసి “ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ!” అనిపిస్తాడు అతనిచేత. ఆమె కనులసోయగంలో “భయపడినజింక” తాలూకు లక్షణాలు కనిపిస్తాయాయనకు. ఇదీ ప్రవరుని చిత్తస్థిరత్వం, ఇంద్రియనిగ్రహమూనూ.

మొదట “శతపత్రేక్షణ” గా ఆమెను తిలకించిన ప్రవరుడు తర్వాత  “భీతహరిణేక్షణ” ఎందుకన్నాడు? ప్రవరుడు సౌందర్యారాధకుడు. (అయితే కాముకుడు కాదు.) మొదట  అమ్మాయిని చూసి ఆమె సౌందర్యాన్ని గుర్తించి ప్రశంసించినాడు. అయితే వరూధినికి మాత్రం అతడిని చూడగానే కోర్కె పడగవిప్పింది. (చూచి ఝళంఝళత్‌ కటకసూచిత..)ఆమె కనులలో కోర్కె చూసిన ప్రవరుడు ఆమెకు పాడి గాదని హెచ్చరిస్తూ, తనొక భూసురుడనని నచ్చచెబుతూ “ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ” అంటాడు. (ఈ పద్యం వస్తుధ్వనికి ఉదాహరణగా శ్రీ రాజన్నశాస్త్రి గారు వివరించారు)

ఇలా ఒక సన్నివేశం వివరిస్తూ, ఆ సన్నివేశంలో వరూధిని వంటి అందాలభరిణెను కనులకు కట్టేట్టూ చేస్తూ, ఆ మగువపొలుపును పాఠకులతో ఆఘ్రాణింపజేస్తూ, ఆమె రూపవర్ణనతో తన్మయులను చేస్తూ, ఆమె కౌగిలింత (తాలూకు పద్యం – ప్రాంచద్భూషణ బాహుమూలరుచితో ..)తో గగుర్పాటుకు గురి చేసి చివరకు పాఠకుణ్ణి, తన నాయకుడు ప్రవరుణ్ణి వేఱు చేసి చూపుతాడు పెద్దన. ఈ ప్రకరణం లోని పద్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క అప్సరస అని ఒకరిద్దరు విశ్లేషకుల వింగడింపు. అందులో మొదటి అప్సరస అయిన ఈ కందపద్యం నాకు ఇష్టమైనది.

ఈ పద్యం మనసులో అనుకున్న వెంటనే పద్యం తాలూకు సందర్భం, ఉపాఖ్యానం మధ్యలో ఈ పద్యం తాలూకు సౌరభం మొత్తం – గుప్పెడు మల్లెలతో మనసును కొట్టినట్టు – అలవోకగా తాకుతుంది.

**********************************************************

రమణీయార్థప్రతిపాదకమైన శబ్దం కావ్యం – ఈ మాటకర్థం పై పద్యం ద్వారా తెలుస్తుంది.

**********************************************************

Posted in కవిత్వం | Tagged | 1 Comment

కథ చెబుతారా?!

కథ చెబుతారా - పొద్దు

వీపు మీద గోనె సంచీతో శ్రీరాం కాలనీలో ప్రవేశించాడు పైడితల్లి. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని మించి ఎరుపెక్కిన కళ్ళతో వెతుకుతున్నాడు.. ఆ తరువాత ఏం జరిగింది? –

ఒక అక్క, ఒక బావ, ఒక హీరో, ఒక విలన్, మధ్యలో వ్యాంపు 🙂 .. పాత్రలు మేమిస్తాం, 

చనిపోయిన భార్య స్మృతులని, కలిసి జీవించిన క్షణాలని, మరపురాని సంఘటనలని గుర్తు చేసుకుంటున్న మానవ్ కు భార్య డైరీ దొరికితే.. అవే సంఘటనలు, విభిన్న కోణాలలో –

“కుక్కల బండి” ; “అనాహత నాదాలు”.. శీర్షికనిస్తే 

అవినీతిని అంతం చేయ్యాలి

“మీరూ సరితా ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు” అడిగాడు హరీష్.
దీర్ఘంగా నిట్టూర్చాడు వినయ్. “మీరూ సరితా ఎందుకు విడిపోయారో.. అందుకే” అన్నాడు.
“కానీ ఈ విషయం మీకు ముందే తెలుసుగా” అసహనంగా అడిగాడు హరీష్.
“మీకూ ముందే తెలుసు.. కాదనగలరా?” సూటిగా అడిగాడు వినయ్.

ఈ సంభాషణకు తగ్గ..

——————-

పొద్దు పాఠకులకు, కథా రచయితలకు ఇదే మా ఆహ్వానం. రకరకాల అంశాలతో ప్రతీ నెల మీ ముందుంటాం. ఇచ్చిన అంశానికి తగిన కథను వ్రాయండి. రచనాసక్తిని కలిగించడానికి, రచనాశక్తిని పెంపొందించడానికి ఇది ఒక చక్కని ప్రక్రియ అని మా భావన. కథకులలో వైవిధ్యాన్ని పాఠకులకు పరిచయం చెయ్యాలని మా కోరిక.

కథ పంపడానికి గడువంటూ లేదు. అయితే ప్రతీ నెలా క్రొత్త అంశం మీ ముందుంటుంది కనుక పాత అంశాలపై కథలు పంపేటప్పుడు అది ఏ నెలదో సూచించండి. editor@poddu.net ఐ.డి కి మీ కథను పంపండి. ఈమెయిలు సబ్జెక్టులో “కథ చెబుతారా?!” అని తప్పక రాయండి. ఎన్నిక చేసిన వాటిని పొద్దులో ప్రచురిస్తాం.

 

కథ చెబుతారా?! — 2011 నవంబరు

ఈ నెల ఇస్తున్న అంశం:
ముగింపు మేమిస్తాం..

ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రి నుండీ టేబుల్ పైన ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంది.

ఆలోచించండి. ఈ ముగింపుకి సరిపోయే కథను పంపండి. నేపథ్యం మీ ఇష్టం. పాత్రలు, సన్నివేశాలు ఏవైనా అభ్యంతరం లేదు. హాస్యం, హారర్.. ఎటువంటివైనా బాధలేదు. ముగింపు మాత్రం సరిపోవాలి.

Posted in కథ | Tagged , | 6 Comments

సత్యప్రభ – 2

3 వ ప్రకరణం.

మన కథకు సంబంధించిన కొన్ని గత చరిత్రాంశాలను ఇక్కడ ఉదహరిస్తున్నా.

కౌండిన్య గోత్ర సంభవుడైన కమలేశ్వరుడనే వానికి ముగ్గురు పిల్లలు.. పర్వత స్వామి, మేఘ స్వామి, సౌదామిని.. కుత్స గోత్ర సంభవుడైన శివనాథుడు సౌదామిని భర్త.

పర్వత స్వామి తపోబలం వల్ల దివ్య క్షాత్రతేజాన్ని పొంది, జ్వలించాడు. ఆంధ్రేశ్వరుడైన కాకుల నాగేంద్రుడును, చిత్రకూటేశ్వరుడైన మందనాథ నాగేంద్రుడును, మగధ రాజ మహాపద్మనందునిచే ఓడింపబడిన పిమ్మట ఆంధ్ర చిత్రకూట రాష్ట్రాలను మగధుల నుండి లాగుకొని, క్రొత్త రాజవంశాన్ని  స్థాపించాడు పర్వత స్వామి. ఈ కార్యంలో వానికి మేఘ స్వామి , శివనాధుడు సహాయం చేసారు.

పర్వత స్వామి ఆంధ్ర  సింహాసనాన్ని అధిష్టించాడు. తన తమ్ముడు  మేఘ స్వామిని  చిత్రకూట  రాష్ట్రంలో మాండలిక రాజుగా నిలిపాడు. ఈ కాలపు పశ్చిమ గోదావరి , కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, జిల్లాలే అప్పుడు పర్వత స్వామి వశపరచుకొన్న ఆంధ్ర రాజ్యం. దాని రాజధాని కృష్ణాతీరం లోని  శ్రీకాకుళ నగరం. దానిని కట్టించిన వాడు కాకుళుడు కాబట్టి దానికా పేరు వచ్చింది.

ఈ కాలపు బస్తరు, జయపుర సంస్థానాలే ఇంచుమించుగా అప్పటి చిత్రకూట రాష్ట్రం. ఇంద్రావతీ నదీతీరం లోని చిత్రకూట నగరం దానికి రాజధాని. రాజధాని నామం చేత రాష్ట్ర నామం ప్రసిధ్ధికి వచ్చింది.

పర్వత స్వామికి తన ఏలుబడి కడపటి రోజుల్లో, కుంతలేశ్వరుడైన అనంత సేనునితో ఘోర యుధ్ధం తటస్థించింది. ఆ సంగ్రామంలో అనంత సేనుడు ఓడిపోయి సంధి చేసుకొన్నాడు. ఆ సంధి ప్రకారంగా పర్వత స్వామికి  తన రాజ్యంలో కొంత  భాగం ఇచ్చుకోవలసి వచ్చింది. ఇంచుమించుగా ఇప్పటి రాయలసీమయే ఆ ప్రదేశంగా ఉండింది. ఆ ప్రదేశాన్ని ఒక మాండలిక రాజ్యంగా చేసి, తన భగినీపతి శివనాథుని మాండలిక రాజుగా స్థాపించాడు పర్వత స్వామి.

మన కథాకాలంలో  శివనాధ పుత్రుడు సత్యకర్మ అచ్చట మహామండలేశ్వరునిగా, మహానంది పురంలో ఉన్నాడు.

పర్వత స్వామి  ఇరువది సంవత్సరాలు ప్రజారంజకంగా రాజ్యం చేసి, కీర్తి శేషుడయ్యాడు.వాని అనంతరం  వాని ఏకైక పుత్రుడు సుచంద్రుడు ఆంధ్ర సామ్రాజ్య సింహాసనాన్ని అలంకరించాడు. అతనికి తండ్రి కూర్చిన  భార్య – సేనాపతి వాధూల రణంధరుని కొమారితె  చారుమతి. పట్టాభిషేకానంతరం  తాను ప్రేమించి పెండ్లి యాడిన రమణి, గౌతమ సునందుని  కూతురు లీలావతి. శక్తిధరుడను కుమారుడు, రథినీ అను కుమారియును  సుచంద్రునికి చారుమతి యందు కలిగినారు. లీలావతి వడసిన పుత్రుడు భోగనాధుడు. వాడు శక్తిధరుని కన్న కొన్ని మాసములే పెద్ద. రథిని శక్తిధరుని కంటె రెండేళ్లు చిన్నది. మన కథాకాలానికి రథిని పదునెనిమిది సంవత్సరాల ప్రౌఢ.

చారుమతీ దేవి శైశవ ప్రాయం లోనే గతించింది. పార్థివుని అనుమతిచే చారుమతి పిల్లలను మాతామహ దంపతులు పెంచారు. మన కథారంభ కాలంలో రాజ ప్రసాదానికి వచ్చేసాడు. రథినీ కుమారి మాత్రం ఇంకా తాత గారింటి లోనే ఉంది.ఆ విషయంలో రణంధరుని అనురోధమే కారణం కాని సుచంద్రుని ఉపేక్ష ఏమియు లేదు.

మేఘ స్వామికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య సూర్యప్రభ, చిన్న భార్య చంద్రప్రభ. సూర్యప్రభ కనిన కూతురు శాంతి సేన. చంద్రప్రభ పెంచిన అపవిధ్ధ పుత్రుడు వీరేశ్వరుడు. లీలావతీ దేవి చెల్లెలు పద్మావతి వీరేశ్వరుని భార్య. ఆంగీరస విమలుడు శాంతి సేన భర్త. ఇతడు మహా వీరుడే గాని ఎట్టి రాజ వంశానికిని చెందినవాడు కాడు.

మన కథారంభ కాలంలో వీరేశ్వరుడు చిత్రకూట మండలేశ్వరునిగా ఉన్నాడు. అతని కుమారుడు రణేశ్వరుడు శ్రీకాకుళంలో రాజకీయ సేన యందు దండ నాయకునిగా పని చేస్తున్నాడు.

మేఘస్వామి అనంతరం తన నుల్లంఘించి, అతని అపవిధ్ధ పుత్రునికి సింహాసనాన్ని ఇచ్చివేసినందున అలిగి శాంతిసేన తన భర్తతో కూడా రాజధాని విడిచి పరారి అయింది. ఆమెకు విదేశంలో పూర్ణ అను ఒక కుమార్తె కలిగిందట. శాంతిసేనా విమలులు రాజధానిని విడిచినది మొదలు ఎచ్చట ఉన్నదీ ఎవరికీ తెలియదు. వారి పిల్ల పూర్ణను గురించి కూడా తెలియలేదు. ఆ మువ్వురి గురించి కల్పిత కథలెన్నో ప్రచారంలో ఉన్నాయి.

మహారాజ సుచంద్రునికి లీలావతీ దేవిపై అనురాగం ఎక్కువ. ఆ అవకాశాన్ని ఆమె తీసుకొని రాజకార్యాల్లో హస్తక్షేపం చేస్తూండేది. ప్రేమ వశంవదుడయిన నరపతి తన ప్రేయసి కెదురాడలేక ఆమె మతాన్ని అనుసరించే ప్రాయికంగా రాజ కార్యాలను చేస్తూ ఉన్నాడు. లీలావతీ దేవి తండ్రి సునందుడే మహామంత్రి కాబట్టి, రాజకీయ నిబంధనం ఆమె చర్యలకు అడ్డుపడ జాలకుండెను. ఆ రాజకీయ నిబంధనం ఎట్టిది? మహారాజును, మహామంత్రియు, నిర్ధారణీయ విషయ శాఖా మంత్రియు చేరిన మువ్వురి సభకి రాజకులం అని పేరు. రాజకులమే కార్యనిర్వాహక ప్రభుత్వము రాజకులంలో ఇద్దరు మంత్రులు ఐకమత్యంతో చేసిన సూచనను  మహారాజు తిరస్కరించ గూడదు. కాని మంత్రులు భిన్నాభిప్రాయులయి నప్పుడు  మహారాజు తనకు సమ్మతమైన మంత్రి మతంతో  ఏకీభవించి  కార్యాన్ని  అమలు పరచ వచ్చును. మహారాజ  మహామంత్రులు తన వశ వర్తులైనందున  లీలావతి చెప్పినట్లు ప్రభుత్వం ఆడుతూ ఉండేది.

సుచంద్రుని రెండవ రాజ్య  వర్షమున  మేఘస్వామి స్వర్గస్థు డయ్యాడు. కాబట్టి చిత్రకూట రాష్ట్ర  సింహాసనోత్త రాధికారి సమస్య ప్రభుత్వ దృష్టికి వచ్చింది. శాఖా మంత్రి మహాప్రాడ్వివాక హరీత సత్యవ్రతుడు, శాంతిసేనయే ఉత్తరాధికారిణి అని వాదించాడు. మహారాజు లీలావతి ప్రేరితుడై మహామంత్రి మతంతో ఏకీభవించి, అపవిధ్ధ పుత్రునికి అనుకూలంగా నిర్ణయం చేసాడు! అపవిధ్ధ పుత్రుడు లీలావతీ దేవి చెల్లెలి భర్త అన్న విషయం పాఠకులు గ్రహించాలి!

సుచంద్రునికి అయిదవ రాజ్య వర్షంలో చారుమతీ వియోగం తటస్థించింది. ఆ దుఃఖము ఆరిపోక ముందే కళింగేశ్వరుడు శృతసేనుడు ఆంధ్రరాష్ట్రంపై దండెత్తాడు. సుచంద్రుడు నిర్భయంగా ఆ దండయాత్రను ఎదుర్కొన్నాడు. ఆ యుధ్ధంలో సుచంద్రుడే జయించాడు. ఆ జయం వల్ల ఆంధ్ర చిత్రకూట రాష్ట్రముల సంధిలో ఉన్న వన ప్రదేశాలు సుచంద్రుని వశమయ్యాయి. అవి ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకో బడ్డాయి. క్రొత్తగా చేరిన ఆ కొండల ప్రాంతానికి పార్వతీయ ప్రాంతమని  పేరు పెట్టబడింది.

పర్వత స్వామి కాలమందు స్థాపించబడిన శస్త్ర శాస్త్ర విద్యా గురుకులాలు రెండును సుచంద్రుని సాదర పోషణ క్రింద  మిక్కిలి అభివృధ్ధి పొందాయి. కౌండిన్య విషమ సిధ్ధి  శస్త్ర విద్యా గురుకులానికిని, భారద్వాజ భావనంది  శస్త్ర విద్యా గురుకులానికిని  ఆచార్యులుగా  ఉన్నారు.

తక్కిన సుచంద్రుని రాజకీయ చరిత్రలో  ఏ పుటను చూసినా  లీలావత్యారాధనా  విశేషాలే కనిపిస్తాయి.శ్రీకాకుళ  నగర  సంస్కరణ , అంతః పుర  వైభవాతిశయం , అనేక రమణీయోద్యాన  ప్రతిష్ట,  స్త్రీ విద్యా గురుకుల  స్థాపనం లీలావతి ఏలుబడిలో ప్రశంసింప తగినవి. సుచందుని కాలంలో  పర్వతస్వామి కాలం నాటి కంటె  ప్రజలపై  ఎక్కువ పన్నులు వేయబడ్డాయి.ఈ పన్నుల  వల్ల  వచ్చే ఆదాయం  చేతనే నగర సంస్కరణాది  కార్యాలు చేయ బడ్డాయి.కార్యానంతరం రాజు పన్నులు తగ్గించ వలసి వున్నది. కాని రాణి లీలావతీ దేవి దానికడ్డుపడి  కానిచ్చింది కాదు. అందువలన  సాధారణ ప్రజలు సుచంద్రుని పరిపాలనాన్ని  అంతగా మెచ్చుకోలేక పోయారు.

ప్రేమ పరతంత్రుడైన ఆ రాజేంద్రుని రాజకీయ చరిత్ర ఎలాగున్నా వ్యక్తిగత చరిత్ర మాత్రం నిర్దుష్టం ! నిర్దుష్టమే కాక ఉదారం కూడ !

రాజ దంపతులు స్థాపించిన స్త్రీ విద్యా గురుకులానికి పరివ్రాజిక శుభ్రాంగి  ఆచార్యురాలు. ఈమె భర్తృ వియోగా నంతరం పరివ్రాజిక అయింది. ఆమె కుమారుడు ఇప్పుడు బ్రహ్మ కుల పరిషత్పతిగా ఉన్నాడు, అతని పేరు ధర్మ పాలుడు.

మన కథారంభ కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో పరంతప సంఘమనే విప్లవ సంఘము ఉదయించింది. నిశుంభుడనే నాగేంద్రుడు ఆ సంఘానికి అధినేతగా ఉన్నాడని వినికిడి.వాడు గత  చిత్రకూటేశ్వరుడైన  మంథనాధుని పౌత్రుడు ! ఆ సంఘము  భయంకర  చోర  కృత్యాదులచే  రాష్ట్రంలోని శ్రీమంతులకు నిత్య భయదాయకంగా ఉంది.సంఘ సేన సంఖ్య దిన దిన ప్రవర్థమానంగా ఉందని  వదంతి. ఆ సంఘస్ఠులు ప్రాయికంగా  నాగులు., రాజ్యాక్రమణమే వారి ఉద్దేశము !

ఇంచు మించుగా పరంతప సంఘోత్పత్తి  కాలం లోనే, శివంకర సంఘమనే ఒక దేశాభిమాన సంఘం రాష్ట్రంలో పుట్టింది. అది విప్లవ చేష్టలు చేయక పోయినా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాజ్యంలో ఆందోళన లేవ దీసింది.దానిలో అధిక సంఖ్యాకులు బ్రాహ్మణులు. వారిలో చాలమంది వీరులు కూడా ఉన్నారు. ఆ కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో  ఆర్య క్షత్రియులు అరుదు బ్రాహ్మణులలో చాల మంది  శస్త్ర విద్యలను అభ్యసించి , వీరులై  రాష్ట్రంలో ఆర్యుల పురాతన  వీర కీర్తిని పోషించు చున్నారు. ప్రభుత్వాన్ని సంస్కరించడమే శివంకర సంఘ లక్ష్యం. గజ వీరుడనే బ్రాహ్మణ వీరుడు సివంకర సంఘ నేతగా ఉన్నాడని వదంతి. అతనిని చూసిన వారు మాత్రం ఎవరునూ లేరు.శివంకర సంఘాన్ని కూడా ప్రభుత్వం విప్లవ సంఘంగా ప్రకటించింది.

4 వ ప్రకరణం

సత్యప్రభలో లేఖాపఠనం - పొద్దు

లేఖాపఠనం

సత్యప్రభ వీరసింహుని పొడిచిన నాటి రాత్రి మహారాజు సుచంద్రుని సన్నిధానంలో సచివుడు (అంతరంగ మంత్రి) రూప చంద్రుడు, పార్థివుని పేర వచ్చిన మూడు జాబులను చదివి వినిపించాడు. మహామంత్రి సునందుడు కూడా సన్నిహితుడై ఉన్నాడు.

అది ప్రాసాదావరణ లోని సప్త భూమిక విమానం పంచమ భూమిక. అక్కడే రాజకులం కూడుతుంది. ఆ భూమికలో పడమరన పుస్తకాలయం ఉంది. మధ్య శాలలో మధ్యభాగము నందు  పర్వత స్వామి భట్టారకుల శిలా విగ్రహం కలదు. తక్కిన  భాగమంతా  వ్యాఘ్ర చర్మాస్తరణముతో భీషణంగా కనిపిస్తుంది. తూర్పు గది ఆలోచనా మందిరం. అందు మూడు సమున్నతాసనములు ఉన్నాయి. మహారాజు కూర్చుండు కనకాసనం ఉత్తర ముఖంగా ఉంది. దాని కెదురుగా ఇరువైపులా రెండు రజతాసనములు ఉన్నాయి. దక్షిణ పార్శ్వమున పశ్చిమాభిముఖంగా మహామంత్రి  ఆసనముంది. వామ పార్శ్వమున పూర్వాభిముఖంగా శాఖా మంత్రి ఆసనముంది. ఆసనములన్నీ పట్టు పరుపుల తోను, పట్టు దిండ్లతోను సుఖోపవేశనార్హములై శోభిస్తునాయి. నేలంతా రత్న కంబళం పరచి ఉన్నది. రాజాసనము దిగువున పాద పీఠం కలదు.

మహారాజు సుచంద్రుడు సుమారేబదేండ్ల వయసు కలవాడు. సర్వకృష్ణ కేశుడై, పటిష్ట కాయుడై, యువకుని వలె కన్పడుతున్నాడు. వ్యక్తి పక్షపాతంచే కాబోలు సౌందర్య కళ అతనిని విడువ కుండ ఉంది. అతడు సార్థక నాముడై ధవళ ప్రభతో వెలుగుతున్నాడు. అతడు తండ్రికి సమానమైన రాజనీత్యభిఙ్ఞుడు కాకపోయినా, తండ్రిని మించిన మహా వీరుడు. అతనికి పరమ శత్రువైన కుంతలాశ్మక, దక్షిణ కోసల, కళింగేశ్వరులు సీమోల్లంఘన చేయజాల కుండుట అతని పరాక్రమానికి భయపడినందు వలన అని చెప్పవచ్చు. కాంతా ప్రీతి,  జీవ కారుణ్యము -ఇవే ఆ నరపతి లోపాలని నయవేత్తలలో అగ్రగణ్యుడైన  దూత సామంతుడు (విదేశాంగ మంత్రి) భార్గవ విశాలాక్షుడు చెప్పడం కద్దు. వృధా రక్త పాతం కూడదనే, అతడు జైత్ర యాత్రలకు పూనుకోలేదు.

మహామంత్రి అరవై అయిదు సంవత్సరాల వృధ్ధుడు. సర్వ పలిత కేశుడు, సువర్ణ కాయుడు. అతడు తన కుమార్తె లీలావతీ దేవి చేతి కీలుబొమ్మగా  ఉన్నప్పటికీ, ఆమె మతాన్ని రాజకులంలో సాధించడానికి కావలసిన యుక్తి ప్రయుక్తులను అల్లడంలో అసాధ్యుడే అగును. పరోపకార గంధ వర్జితుడైనా, గర్వ వర్జితుడు. మహా సంపన్నుడైనా నిరాడంబరుడు. శౌర్యమావంతయు లేని కార్యవాది, పేరు పడ్డ ద్రవ్య రక్షకుడు.

సచివుడు రూపచంద్రుడు రాజాంతఃకరణ ఎరింగి నడుచు కొనడంలో, మహా నిపుణుడు. అతని తండ్రి గవల్గణుడు పర్వత స్వామి భట్టారకుని యొద్దను, సుచంద్ర భట్టారకుని సన్నిధానం లోను, అనేక సంవత్సరాలు పని చేసి, మిక్కిలి పేరు సంపాదించుకొన్న రాజనీతిఙ్ఞుడు. రూపచంద్రుడు కూడ తండ్రితో సమానుడు. కులంలో వీరు సూతులు. సూత జాతీయులను అంతరంగ మంత్రులుగా ఉంచుకొనడం ప్రాచీన నరపతుల ఆచారం కాబోలు. దశరథుని అంతరంగ మంత్రి సుమంత్రుడును, ధృతరాష్ట్రుని అంతరంగ మంత్రి సంజయుడును సూతులే కదా! రూపచంద్రుని  వయస్సు ముఫ్ఫై అయిదు సంవత్సరాలు. రూపంలో ఇతడు అన్వర్థ నాముడు.

మహారాజు మహామంత్రులు కూర్చొని ఉన్నారు. సచివుడు లేచి జాబులు చదువుతున్నాడు.

మొదటి జాబు.

“మహారాజ కౌండిన్య సుచంద్రునకు-

పరంతప సంఘ నాయకుడు కార్కోటక నిశంభువు  స్నేహ పూర్వకంగా వ్రాసుకొన్న లేఖ,

మా పితామహుడు మహారాజ మందనాథుడును, మా మేనత్త భర్త మహారాజ కాకులుడును శతృ వశీకృతులై ఉండిన ఛిద్రంలో మీ తండ్రి పర్వత స్వామి వారి రాష్ట్రాలను ఆక్రమించుకొన్నాడు. ఆ నష్ట రాజ్యాలను తిరిగి సంపాదించుకోవడానికి, నేనున్నూ, కాకుల  మహారాజ వంశంలో పరిశిష్టయై నిలిచి ఉన్న అతని దౌహిత్రి ఇరావతిన్నీ, కలిసి పరంతప సంఘాన్ని స్థాపించితిమి. ఆ నష్ట రాజ్యాలను పొందడానికి తగిన బలం మాకుందని ఋజువు పరచడానికి మేమిద్దరం సిధ్ధంగా ఉన్నారము. అయినప్పటికిని సర్వ జాతులకును సమాన పూజ్యుడైన భగవాన్ జటాముని “సుచంద్రునితో నీవు సంధి చేసుకో” అని నన్నాఙ్ఞాపించారు కాబట్టి, మేము మా లక్ష్యాల్లో నుంచి చాల వరకు తగ్గి ఆచరణ సాధ్యమైన సంధిమార్గాన్ని మీ ప్రభుత్వానికి సూచించుతున్నాము. మేము ఈ క్రింది సంధి షరతులను సూచించు చున్నాము.

౧. మా మాతామహుని చిత్రకూట రాష్ట్రాన్ని నాకు తిరిగి స్వతంత్రంగా ఇచ్చివేయవలెను.

౨. మీరు కళింగుల నుండి జయించిన పార్వతీయ ప్రాంతాన్ని కాకుల దౌహిత్రి ఇరావతీ కుమారికి స్వతంత్ర రాష్ట్రంగా ఇచ్చివేయవలెను.

౩. ఆంధ్ర రాష్ట్రంలో మీ తండ్రిగారి కాలం నాటి కంటె మీరు అధికంగా వేసిన పన్నులను తీసివేయవలెను.

ఈ సంధి నియమాలను మీరు అంగీకరించినప్పుడు మేము మీతో సంపూర్ణముగా విరోధాన్ని విడిచి మిత్రులుగా ఉందగల వారము. మా సంధి సూచనలను తిరస్కరించునెడల భయంకరమైన మా శత్రుత్వానికి కుండినుల ప్రభుత్వం గురి కాగలదు. శ్రీ జటాముని శిష్యురాలైన యోగీశ్వరి ధవళాక్షి ఈ సంధి రాయబారంలో ఉభయ పక్షాలకు దూతగా ఉండడానికి అంగీకరించింది. కాబట్టి మీ ప్రత్యుత్తరాన్ని ఆమెకు అందజేస్తే మాకు మీ అభిప్రాయం తెలుస్తుంది.

చిత్తగించవలెను.

విజయ సంవత్సర జ్యేష్ట శుధ్ధ పంచమీ భానువారము.

కార్కోటక నిశంభువు వ్రాలు.”

రెండవ జాబు.

“మహారాజ పరమేశ్వర శ్రీ కౌండిన సుచంద్ర భట్టారకుల వారి దివ్య సన్నిధికి –

శివంకర సంఘ నాయకుడు ఆంగీరస గజవీరుడు వినయ పూర్వకంగా వ్రాసుకొన్న విఙ్ఞప్తి. శ్రీవారు స్వయంగా రాజకార్యాల పట్ల తగినంత శ్రధ్ధ తీసుకొనక పోవడం వల్ల, మహామంత్రి రాష్ట్రాన్ని నిరంకుశంగా ఏలుతున్నాడు. స్వార్థపరుడున్నూ, ప్రజాహిత చింత లేని వాడున్నూ, లంచగొండిన్నీ అయిన అతని ఏలుబడిలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. వాటిని సహింపకయే శ్రీవారి దయగల శ్రోత్రాలకి ఎక్కునట్లు సక్రమాందోళన చేయడానికి దేశం పైనా, కుండిన వంశాధికారం పైనా భక్తి గల ఆంధ్ర యువకులచే మా శివంకర సంఘం స్థాపించబడింది. మహామంత్రి అట్టి సంఘాన్ని విప్లవ సంఘంగా ప్రకటింప చేసినాడు. ఇప్పుడు మా సంఘస్థులు ఎలాంటి నేరాలను చేయక పోయినప్పటికిన్నీ, మమ్మల్ని కనిపెట్టి మా ప్రాణాలను ఉరికంబాలకు అప్పగించడానికి, మహామంత్రి కుమారుడు రాష్ట్రీయుడు (పోలీసు మంత్రి) వీరనందుడు సర్వ విధములచే ప్రయత్నించు చున్నాడు. ఆ ప్రయత్నంలో ఎప్పుడైనా సంఘర్షణ ఏర్పడ వచ్చును. అప్పుడు మేము మా ఆత్మ రక్షణ కొరకు అవలంబింప బోవు ప్రతిఘటన వలన శ్రీవారి రక్షక జనులకు గాని నష్టం ఏమైనా కలిగే పక్షంలో దానికి మేము భాద్యులము కాజాలం. మా మొరలను ఆలకించడానికి శ్రీవారి దయగల చిత్తానికి ఇష్టమున్నచో, శ్రీవారిచే ఆఙ్ఞాపించబడు స్థలానికి మా ప్రతినిథిని నిరాయుధునిగా పంపగలం. ఈ విషయంలో మా పక్షానికి దూతగా ఉండడానికి కాణ్వ శుకనాసుడు అంగీకరించినాడు. కాన శ్రీవారు మా ప్రతినిధితో మాట్లాడడానికి అంగీకారం ఉన్నదీ లేనిదీ తెలియ జేయ గోరుతున్నారము.

చిత్తగించ వలెను.

విజయ సంవత్సర జ్యేష్ట శుధ్ధ పంచమీ భానువారము.

ఆంగీరస గజవీరుడు వ్రాలు.”

మూడవ జాబు.

“మహారాజ పరమేశ్వర శ్రీ కౌండిన్య సుచంద్ర భట్టరకుల వారి భ్రాతృ చరణ సన్నిధికి,

చెల్లెలు కీర్తిశేష మహామండలేశ్వర శ్రీ కౌండిన్య మేఘస్వామి భట్టారకుల వారి కుమార్తె శాంతిసేన నమస్కార పూర్వకంగా వ్రాయు విఙ్ఞాపనము.

తమ ప్రభుత్వం నన్నుల్లంఘించి మా పినతల్లి చంద్రప్రభా దేవి పెంచిన అపవిధ్ధ పుత్రునికి సింహాసన మిప్పించి వేసింది. అది అన్యాయమనే నా అంతరాత్మ  చెప్పుతున్నప్పటికీ నా పూజ్య సోదరి ఆఙ్ఞను ఉల్లంఘించ నేరక వీరేశ్వరుని దారి నుండి తొలగి పోయాను. గౌతముల ఇంటి పిల్ల (సునంద పుత్రి) చిత్రకూట ప్రాసాదంలో తన అక్కయ్య విజయ పతాక వలె ఆడుతున్నది. కుండినుల ఇంటి పిల్ల తన అన్నయ్య చేతగాని తనానికి దృష్టాంత భూతురాలై అతని యశోంధకార మధ్యలో ప్రఛ్ఛన్నయై కూలబడి ఉంది. ఆమరణాంతం ఎవరికిని తెలియకుండా తన ఆయుశ్శేషాన్ని గడపాలని ఉద్దేశించింది. కాని ఈ మధ్య ఒక సమాచారం తెలిసింది. కాబట్టి ఉండబట్టలేక తిరిగి రాజకీయ రంగంలో దూకింది.

పరమ భట్టారక! ఆ సమాచారాన్ని మీ చరణ సన్నిధిలో నివేదించుట యుక్తమని నేను తలంచాను. మా పినతల్లి  పెంచిన కుమారుడు వాస్తవంగా దయాపాత్రుడైన  అపవిధ్ధుడు కాదట! చంద్రప్రభా దేవి ప్రేరణ వల్ల ఆమె చెల్లెలు చంద్రముఖి తనకప్పుడే జన్మించివున్న శిశువుని ఒకచోట పారవేసిందట! ఆ శిశువుని చూచి దయార్ద్ర హృదయ భావాన్ని నటిస్తూ, తాను (చంద్రప్రభా దేవి) తన భర్త మనసును కరిగించి, ఆ మగ శిశువును అపవిధ్ధ పుత్రునిగా పెంచుకొన్నాదట! ఈ గూఢమైన మోసాన్ని రుజువు పరచుకోతగ్గ ఆధారాలు మాకున్నాయి. కాబట్టి శ్రీవారు న్యాయం పట్ల పక్షపాతం వహించి, ఈ విషయాన్ని పునః న్యాయస్థానంలో విచారణ చేసి, నాకు న్యాయం కలుగ జేస్తారని, ఆశిస్తున్నాను. తమరు గాని మా విన్నపాన్ని పెడచెవిని పెట్టినప్పుడు, కుండినుల కులపుత్రి శాంతిసేన ఊరకుండుటకు నిశ్చయించుకొన లేదు. మోసగత్తె అయిన సవతి తల్లి రహస్యముగ తీసుకొని వచ్చిన కుమారుని తన తల్లి తండ్రుల ఇంటికి గెంటివేయుటకు నా భర్త తోను, రాజభక్తులగు చిత్రకూట రాష్ట్ర వీరులతోను కలసి, నేను ప్రయత్నించి తీరెదను. అనంతరము జయించిన మా కత్తులతో మేము మా సార్వభౌమునికి సేవచేయగల వారము!

అన్నయ్యా! శ్రీవారి కొక మేనకోడలున్నది. ఆ పిల్ల నమస్కారాలు నా ద్వారా తన మామయ్యకు అందజేయ బడుతున్నది.

అన్నయ్య పంపవలసిన సందేశమును బ్రహ్మకుల పరిషత్పతి కౌండిన్య ధర్మపాలుని వద్దకు పంపిన నా కందును.

చిత్తగించ వలెను.

విజయ సంవత్సర జ్యేష్ట శుధ్ధ పంచమీ భానువారము.

ఆంగీరస్సుల కులస్నుష శాంతిసేన వ్రాలు.”

Posted in కథ | Tagged | Comments Off on సత్యప్రభ – 2

ఆదివారం మధ్యాహ్నాలు

అదోలా వుంటాయి
ముందురోజు
హడావిడి మతలబులన్నీ
ముడి వీడి
కళ్ళ మీద మత్తుగా

వాలుతుంటాయి,
యుద్ధానంతరం సాగే
విరామంలా తోస్తూనే

మరో మహాసంగ్రామానికి
సిద్ధమయే భ్రమలో

అదోలా వుంటాయి

ఆదివారం మధ్యాహ్నాలు!

అంత వెలుగులోనూ
నలుపూ తెలుపుల్లో
నలిగిన
ఛాయాచిత్రపు లోతుల్ని

గ్రహించలేనంత తీరిగ్గానూ,
సగంలో ఆపబడిన పుస్తకంలా
సుదీర్ఘంగానూ సాగుతుంటాయి,
గుమ్మం ముందు
ఎండ పొడలో అదోలా
ఆదివారం మధ్యాహ్నాలు!
ఆకులు కదలవు
గాలి వీచదు
సందేహాత్మక నిశ్చలత్వాన్ని
ఆపాదించుకుని
ఆరుబయట అంతా
అదో మాదిరిగా వుంటుంది
కనిపించని వేడిని వెంటేసుకుని

సమాధానపడని
ఓ నగ్నజ్ఞాపకంలా
గుండెని సర్రున కోస్తూ,

స్రవిస్తున్నదేమిటో
భారమో…భావమో

తెలీకుండా!

నిజంగానే….

అదోలా వుంటాయి

ఆదివారం మధ్యాహ్నాలు!

Posted in కవిత్వం | 8 Comments

సమస్యాపూరణములో అర్థశక్త్యుద్భవధ్వని చర్చ

ధ్వని సిద్ధాంతములో అవివక్షితవాచ్యధ్వని అని ఒకటి ఉన్నది. వాచ్యార్థముచేత మాత్రమే కాక లక్ష్యార్థము వల్ల అర్థాంతర స్ఫూర్తి కలిగితే అది అవివక్షితవాచ్యధ్వని అంటారు(ట). అది రెండు విధాలు. అర్థాంతరసంక్రమితవాచ్యధ్వని, అత్యంతతిరస్కృతవాచ్యధ్వని అని ధ్వన్యాలోకం.

అర్థాంతరసంక్రమితవాచ్యధ్వని కి ఉదాహరణగా ఒక శ్లోకం చెబుతాడు సూత్రకారుడు. రామ శబ్దానికి సాధారణంగా ఉన్న అర్థంలో కాక, ఇంకో అర్థంలో (మాటలలో చెప్పలేని రాజ్యభ్రంశాది అనేక దుఃఖములను పొందిన రాముడను – అని శ్లోకంలో రాముడంటాడు) లక్ష్యార్థాన్ని చెబుతాడు కాబట్టి ఇది అర్థాంతరసంక్రమిత వాచ్యధ్వని అట.

శివున్ స్మరింప….కు కామేశ్వరరావు గారి పూరణ:

శివమ్మటన్న వేదమౌను శ్రీశుభప్రదాయియౌ
నవాంబుజాక్షు నా సహస్రనామవార్ధి గల్గదే
శివాయటన్న భవ్యనామశీకరమ్ము! విష్ణువౌ
శివున్ స్మరింప పాపముల్ నశించు, నాయబద్ధమే!

పై పద్యంలో “శివుని” వాచ్యార్థంలో కాక లక్ష్యార్థంలో విష్ణువును సూచిస్తున్నారు కనుక ఇది కూడా ధ్వనికి ఉదాహరణగా పరిగణించవచ్చని నా అనుకోలు. ఇది సమంజసమేనా?-రవి

రవీ,

ఒకటి – లక్షణార్థం ఉన్నంత మాత్రాన అక్కడ “ధ్వని” ఉంటుందని లేదు. ఉదాహరణకి – “అన్నం ఉడుకుతోంది.” అన్న వాక్యం తీసుకుందాం. “అన్నం” అంటే ఉడికిన బియ్యం, ఆహారం ఇలాంటివి వాచ్యార్థాలు. కాని ఈ వాక్యంలో ఆ అర్థాలు పొసగవు. ఎందుకంటే అక్కడ ఉడుకుతున్నది బియ్యమే. ఆ వాక్యంలో “అన్నం” అనే పదానికి లక్షణార్థం బియ్యం. అయితే యీ వాక్యంలో ఎలాంటి ధ్వని లేదు. అలాగే “ఈ రైలు విజయవాడ మీదగా హైదరాబాదు వెళుతుంది” అన్న వాక్యంలో “మీద” అనే పదానికి వాచ్యార్థమైన “పైన” (above) అన్న అర్థం పొసగదు. హైదరాబాదు వెళ్ళే దారిలో విజయవాడ ఉంటుంది అనే లక్షణార్థాన్ని యిక్కడ గ్రహించాలి. ఈ వాక్యంలో కూడా “వ్యంగ్యం” కాని “ధ్వని” కాని ఏదీ లేదు. లక్షణార్థం వలన వ్యంగ్యం కలిగే ఉదాహరణ చూద్దాం. ఒకావిడ ఉదయాన్నే ఇంటి ముందు చిమ్మి ముగ్గుపెడుతోందనుకుందాం. పక్కింటావిడ, “పిన్నిగారు, ఏమిటివాళ మీ కోడలుకాకుండా మీరు ముగ్గేస్తున్నారు?” అని అడిందనుకుందాం. దానికావిడ, “ఆఁ, మా కోడలికింకా తెల్లవారలేదమ్మా” అని అన్నాదనుకోండి. ఇక్కడ “తెల్లవారలేదు” అన్నదాన్ని ఉదయం అవ్వడం అనే వాచ్యార్థంలో తీసుకోడం కుదరదు. ఎందుకంటే ఉదయం అన్నది అందరికీ ఒకేసారి అవుతుంది. ఆవిడ కోడలికి ప్రత్యేకంగా అవ్వడముండదు. “మా కోడలికింకా తెల్లవారలేదు”, అంటే “మా కోడలింకా నిద్రలేవలేదు” అని అర్థం. ఇది లక్షణార్థం. అయితే “మా కోడలింకా నిద్రలేవలేదు” అని అనడానికి బదులు, “మా కోడలికింకా తెల్లవారలేదు” అని అనడంలో ఒక ఆక్షేపణ ధ్వనిస్తోంది. ఆ అత్తగారికి కోడలిమీద కాస్త తిరస్కారభావం ఉందని తెలుస్తుంది. ఇది వ్యంగ్యార్థం. ఆ వాక్యంలో నేరుగా కనిపించని అర్థమది. కాబట్టి ఇక్కడ లక్షణ వ్యంగ్యానికి దోహదమయ్యింది.

ఇప్పుడు చెప్పండి, నా పద్యంలో, “శివుడు” అన్నది మాములుగా వాడే “పార్వతీపతి” అనే అర్థంలో కాక “శుభాలనిచ్చేవాడు” అనే అర్థంలో వాడినందువల్ల ఇందులో “ధ్వనిస్తున్న” (నేరుగా కనిపించని) విషయం వేరే ప్రత్యేకంగా ఏదయినా ఉందా? నాకలాంటిది ఏదీ కనిపించడం లేదు. కాబట్టి అందులో “ధ్వని” అంటూ ఏమీ లేదు.

రెండు – ఇక్కడ “శివ” అనే పదానికి “శుభములనొసగేవాడు” అనే అర్థం అసలు లక్షణార్థమే కాదు. అది దాని వ్యుత్పత్తి మూలంగా వచ్చిన అర్థం. “పార్వతీపతి” అన్నది రూఢ్యర్థం (అంటే ప్రజా వ్యవహారంలో ప్రసిద్ధి పొందినది). ఈ రెండర్థాలూ ఆ పదానికి వాచ్యార్థాలే. వాడిన సందర్భాన్ని బట్టి ఒకో అర్థాన్ని మనం తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకి “రాజు” అనే పదానికి “ప్రజలని పాలించేవాడు”, “చంద్రుడు” అనే రెండర్థాలు ఉన్నాయి. ఆ రెండూ వాచ్యార్థాలే. ప్రయోగించిన వాక్యాన్ని బట్టి ఏ అర్థం తీసుకోవాలన్నది నిర్ణయమవుతుంది. వాచ్యార్థానికీ, లక్షణార్థానికీ తేడా తెలుసుకోడానికి ఒక సులువైన పద్ధతి ఏమిటంటే – పదానికి ఒక అర్థం నిఘంటువులో ఉంటే అది కచ్చితంగా వాచ్యార్థమే అవుతుంది. లేదంటే అది లక్షణార్థం అవుతుంది. “శివుడు” అనే పదానికి నిఘంటువులో “పార్వతిపతి”, “శుభములనిచ్చేవాడు” అనే రెండర్థాలూ ఉంటాయి. అదే “అన్నం” అనే పదానికి “బియ్యం” అనే అర్థం కాని, “తెల్లవారడం” అంటే “నిద్రలేవడం” అనే అర్థాం కాని నిఘంటువుల్లో ఉండదు.

సరే, మీరు అలంకారశాస్త్రాన్ని తిరగేస్తున్నట్టున్నారు కాబట్టి, మీకొక చిన్న పరీక్ష. :)

నా పద్యంలో “అర్థశక్త్యుద్భవ అలంకారకృత వస్తుధ్వని” ఉంది. అదేమిటో చెప్పగలరా? అలంకారశాస్త్రం తెలిసిన పెద్దలింకెవరయినా కూడా చెప్పవచ్చు. దాని ద్వారా నా పరిజ్ఞానమెంతో కూడా నేను తెలుసుకోగలుగుతాను. -కామేశ్వరరావు

కామేశ్వరరావుగారు, నాకు అలంకారశాస్త్రం బొత్తిగా తెలియదు. కానీ నాకు తట్టిన ఒక విషయం చెపుతాను. సరియో కాదో మీరే నిర్ణయించాలి. మొదటి పాదంలో బ్రహ్మను, రెండవపాదంలో విష్ణువును, మూడవ పాదంలో శివుణ్ణీ స్ఫురించేలా ఉన్నది మీ పద్యము. ఆఖరి పాదం, వారందఱూ ఒక్కరే అని చెప్పే విధంగా ఉన్నది – గిరి

గిరి గారూ,

అర్థశక్త్యుద్భవ ధ్వని” – అంటే ప్రయోగించిన శబ్దం (శబ్దాలు) ధ్వనన వ్యాపారాన్ని (మాత్రమే) బోధిస్తూ, తాత్పర్యాన్ని బోధించలేక, తాత్పర్యార్థం (లోక వ్యవహారాదుల) వల్ల బోధపడితే అట్టి ధ్వని అర్థశక్త్యుద్భవ ధ్వని(ట).

ఉదాహరణ తెలిస్తే అవగతమవుతుంది. (ధ్వన్యాలోకం)

ఏవంవాదిని దేవర్షౌ పార్శ్వే పితురధోముఖీ
లీలాకమలపత్త్రాణి గణయామాస పార్వతీ.

(-కుమారసంభవం)

దేవర్షి ఆంగీరసుడు ఇలా పలుకుచుండగా, తండ్రిపక్కన నుంచుని ఉన్న పార్వతి తలను వంచి విలాసార్థములైన తమ్మి రేకులను లెక్కపెడుతూంది.

-అంటే పార్వతి లజ్జ చెందుతూంది అని తాత్పర్యార్థం. ”లజ్జ”, “వ్రీడ” ఇత్యాది శబ్దాలు శ్లోకంలో ఉపయోగించకుండా లజ్జను ఉద్యోతించాడు కాబట్టి ఇది అర్థశక్త్యుద్భవ ధ్వని. నాకు రఘువంశం షష్టస్సర్గలో ఇందుమతీ స్వయంవరంలో రాజులు పడే పాట్లు గుర్తొస్తున్నాయి. ఆదిభిక్షువు వాడినేది కోరేది? ..బూడిదిచ్చేవాడినేది అడిగేది? – ఈ సినిమా పాట కూడా అర్థశక్త్యుద్భవ ధ్వనికి ఉదాహరణ అని అనుమానంగా ఉంది.

కామేశ్వరరావు గారు మరో రెండు ఉపమలు జోడించి – “అర్థశక్త్యుద్భవ అలంకారకృత వస్తుధ్వని” అంటున్నారు. :) (పూర్తి అర్థమేమిటో అర్థం కాలేదు) అంటే ఆ పద్యంలో శబ్దం (పదముల) ద్వారా కాక, వేరే ఏదైనా తాత్పర్యం కనిపిస్తుందా అని చూడాలి.

ఈ విషయంలో గిరి గారు చెప్పినదే ఎక్కువ సమంజసంగా అనిపిస్తున్నది. – రవి.

రవీ, “అర్థశక్త్యుద్భవ అలంకారకృత వస్తుధ్వని” అన్న పదాన్ని అట్నుంచి నరుక్కురావాలి. :-)

ఇది ముందుగా “వస్తుధ్వని” – అంటే వస్తువుని ధ్వనిస్తుంది. ధ్వనించే విషయం వస్తువు కాని, అలంకారం కాని, భావం కాని, రసం కాని కావచ్చు. ఏదైతే అది ఆ
ధ్వని. ఇక ఇది అలంకారకృతము – అంటే అలంకారం చేత వచ్చిన ధ్వని. అంటే ఒక అలంకారం ఒక వస్తువుని ధ్వనిస్తోందన్న మాట.

ధ్వని “శబ్దశక్తి” వలన కాని, “అర్థశక్తి” వలన కాని ఉత్పన్నం కావచ్చు. కేవలం శబ్దాల వలన ఉత్పన్నమయితే అది “శబ్దశక్తి-ఉద్భవం”. అంటే ఉదాహరణకి “ఆ దుష్యంతుడు అనంతసత్త్వుడు” అని అన్నప్పుడు, “అనంతసత్త్వుడు” అనే పదం రెండర్థాలని ఇస్తుంది. అనంతమైన బలం కలవాడు అని ఒకటి. అనంతుని వంటి (ఆదిశేషువువంటి) బలం కలవాడు అని మరొకటి. దీని వలన దుష్యంతుడు బలంలో అనంతుడివంటి వాడు అనే అలంకారం ధ్వనిస్తోంది. ఇక్కడ ధ్వనిస్తున్నది అలంకారం కాబట్టి ఇది అలంకారధ్వని. ఈ ధ్వనికి కారణం “అనంత” శబ్దం. కాబట్టి ఇది “శబ్దశక్తి ఉద్భవ అలంకార ధ్వని”.

ప్రత్యేకమైన ఒక శబ్దం ప్రధానం కాక, చెపుతున్న అర్థం ద్వారా ఒక విషయం ధ్వనిస్తే అది “అర్థశక్తి ఉద్భవ” ధ్వని అవుతుంది. ఒక అలంకారములోని అర్థంశక్తి ద్వారా ఒక వస్తువుని ధ్వనింప చేస్తే అది “అర్థశక్త్యుద్భవ అలంకారకృత వస్తు ధ్వని” అవుతుంది.

“నవాంబుజాక్షుని సహస్రనామవార్థిన్” – విష్ణువునకున్న సహస్రనామాలనే సముద్రంలో”కల్గదే శివాయటన్న భవ్యనామశీకరము” – శివా అన్న పవిత్రనామం అనే  బిందువు ఉన్నది కదా. విష్ణు సహస్రనామాలని సముద్రంతోనూ, శివ నామాన్ని అందులోని ఒక బిందువుతోనూ పోల్చిన రూపకాలంకారం. ఇది విష్ణు తత్త్వం యొక్క మహత్వాన్ని, ఆ మహాతత్త్వంలో “శివ” తత్త్వం కేవలం సముద్రంలో ఒక బిందువంత చిన్నది అనీ ధ్వనించడం లేదా?
శ్రీవైష్ణవుల దృష్టిలో విష్ణువే పరమాత్మ, పరమేశ్వరుడు. ఇతర దేవతా స్వరూపాలన్నీ అతనివే, అతనిలోనివే. శివ స్వరూపం కూడా అందులో భాగమే. విష్ణుభక్తి పరంగా పూరించాలని అన్నారు కదా అని విష్ణు తత్త్వ మహత్వాన్ని ధ్వనించాలని అలా సహస్రనామాలని సముద్రంతోను, అందులో శివ నామాన్ని ఒక బిందువుతోనూ పోల్చాను. ఇది అర్థాలంకారం, అంటే అందులోని అర్థమే కాని వాడిన శబ్దాలకి ప్రాముఖ్యం లేదు. “శీకరము” అని వాడింది యతికోసమే కాని ఆ శబ్దానికి ప్రత్యేకమైన ప్రయోజనం వేరేదీ లేదు.

ఈ అలంకారం ధ్వనిస్తున్న విషయం విష్ణు మహత్వం. అది వస్తువే కాని అలంకారమో, రసమో కాదు. కాబట్టి ఇది వస్తుధ్వని. అర్థశక్తి ఉద్భవ అలంకారకృత వస్తుధ్వని అని నా ఉద్దేశం. -కామేశ్వరరావు

Posted in కవిత్వం | Tagged , | 2 Comments