-మధురవాణి
బాల్కనీ రెయిలింగ్ మీద రెండు చేతులూ ఆన్చి, నిలబడి చూస్తూ ఉంటే చక్కగా తీర్చిదిద్దిన వెనకింటివాళ్ల తోట కనిపిస్తూంది. సాయంకాలపు నీరెండలో ఆ తోటలో విరిసిన పూవులన్నీ మెరుస్తూ గాలి తెమ్మెరలు వచ్చినప్పుడల్లా తలలు ఊపుతున్నాయి. Continue reading
-మధురవాణి
బాల్కనీ రెయిలింగ్ మీద రెండు చేతులూ ఆన్చి, నిలబడి చూస్తూ ఉంటే చక్కగా తీర్చిదిద్దిన వెనకింటివాళ్ల తోట కనిపిస్తూంది. సాయంకాలపు నీరెండలో ఆ తోటలో విరిసిన పూవులన్నీ మెరుస్తూ గాలి తెమ్మెరలు వచ్చినప్పుడల్లా తలలు ఊపుతున్నాయి. Continue reading
-వెంపటి హేమ
-స్వాతి కుమారి
తాను చదివిన పుస్తకాల వివరాలూ, రివ్యూలు, నచ్చిన సినిమా పాటల విశేషాలే కాకుండా ఇతర భాషా కథల అనువాదాలూ, సొంత రచనా ప్రయోగాలూ అన్నిటినీ Sowmya writes అంటూ తన బ్లాగులోనూ, వెబ్ పత్రికల్లోనూ కుమ్మరించే వి.బి.సౌమ్య ఇప్పుడు కొన్ని సరదా కబుర్లని కూడా మనతో పంచుకుంటుంది.
(కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు “ఈ తరానికి ప్రశ్నలు” సంధించిన దరిమిలా తెలుగు భాష మనుగడ గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆ వ్యాసంపై వచ్చిన కొన్ని స్పందనలపై భైరవభట్ల కామేశ్వర రావు గారి ప్రతిస్పందన ఇది. -సం.)
– భైరవభట్ల కామేశ్వర రావు
Dear Telugu readers who cannot read this letter or who cannot understand all the words in this letter, please don’t feel bad about it (in fact you have to be proud!). The fault is not yours, but mine. It is my fault of sticking to the same old rotten stinking language instead of writing it completely in English, or upgrading myself to the current Telugu language that can be understood by everyone. It is my disability. So please pardon me. In fact this letter is precisely to do this. To seek a public apology from you and those who are aspiring to embrace the change like you. Please.. please excuse me.
You may opt out of reading this further.
పాఠకులారా,
నేను తప్పు చేసాను. తప్పుడు ఆలోచనలు చేసాను. తప్పుడు ప్రచారం చెయ్యడానికి ప్రయత్నించాను. అందికే ఇప్పుడిలా అందరినీ క్షమాపణ వేడుకొంటున్నాను. దాసుని తప్పులు దండంతో సరి. మీకందరికీ కోటికోటి దండాలు. నన్ను క్షమించేయండి.
భాషంటే కేవలం వ్యక్తీకరణ సాధనమని, it is just a tool for communication అనీ, అంతకుమించి మరేదీ కాదనీ తెలుసుకోలేక తప్పుచేసాను. భాషకీ ఒక చరిత్ర ఉంటుందనీ, దానికొక సంస్కృతి ఉంటుందనీ, వాటి అవసరం ఆ భాష మాట్లాడేవాళ్ళకి ఉంటుందనీ భ్రమపడి తప్పుచేసాను. కేవలం ఒక ఏభై సంవత్సరాల ముందు వెలువడిన రచనల్లోని భాషని ఈ కాలపు చదువుకున్న తెలుగువాడు అర్థం చేసుకోలేకపోవడం నామోషీ అని పొరబడ్డాను. మనకు కూడు పెట్టే భాషలో, విస్తృతంగా ప్రచారమయ్యే సాహిత్యాన్ని చదవకపోవడమే అతి పెద్ద నామోషి అని నేను గ్రహించలేకపోయాను. దానికి నన్ను క్షమించండి.
అమ్మమ్మా తాతయ్యలు వాళ్ళ మనవలు మనవరాళ్ళతో “కమ్యూనికేట్” చెయ్యాలని ఆత్రపడతారనీ, వాళ్ళ ఆర్తిని పట్టించుకొనే బాధ్యత మనవలు మనవరాళ్ళకీ ఉందనీ అపోహపడ్డాను. అమ్మమ్మలూ తాతయ్యలూ పాతకంపు కొట్టే ముసలిపీనుగలనీ, వాళ్ళని పట్టించుకుంటూ కూర్చుంటే మనం ముందుకు సాగలేమనీ తెలుసుకోలేక తప్పుచేసాను. నన్ను క్షమించండి.
వారసత్వంగా పిల్లలకు కావలసింది డబ్బూ దస్కమే తప్ప మరేవీ కాదన్న కటిక నిజాన్ని కళ్ళుండీ చూడలేకపోయాను. “సంపద” అంటే మనిషి భౌతిక అవసరాలని తీర్చే ఆర్థిక విలువ కలిగిన ధనమూ ఇతరత్రా నగలూ నట్రే తప్ప, సాహిత్యమూ భాషా సంస్కృతీ, సంపద కాదన్న అతి చిన్న విషయాన్ని గ్రహించలేని మందబుద్ధినయ్యాను. దీనికీ నన్ను క్షమించెయ్యండి.
భాష మార్పుచెందుతూనే ఉంటుందని తెలిసినా, ఆ జరిగే మార్పు ప్రజల వల్లనే (అంటే మనందరి వల్లనే) జరుగుతుందని అనుకున్నాను. అంచేత ఆ మార్పుని నిర్దేశించగల శక్తి ప్రజలకుందని నమ్మాను. ఈ మార్పుకి కారణం “ప్రకృతి” అనీ, దానిమీద మనకి ఏ విధమైన అజమాయిషీ లేదనీ, చట్టం తనపని తాను చేసుకుపోయినట్టే అదికూడా తనపని తను చేసుకొనిపోతుందనీ, మనం చేవచచ్చిన చవటల్లా దానితోపాటు సాగిపోవడమే తప్ప మరేమీ చెయ్యలేమనీ నేను తెలుసుకోలేకపోయాను. తప్పు చేసాను. నన్ను క్షమించండి.
మారుతున్న భాష తన రచనలని (సాహిత్య, సాహిత్యేతర రచనలన్నీనూ) తానే సృష్టించుకోగలదనీ, ఒకవేళ అంతగా అవసరమైతే ఆ రచనలేవో మరొకరు మనకి సృష్టించిపెడితే వాటిని డబ్బిచ్చి కొనుక్కొని చదువుతామనీ గ్రహించలేకపోయాను. మన వెనకతరం రచనలు మనకు అనవసరమనీ, ఒకవేళ అంతగా అవసరం అనుకుంటే మరో భాషవాడు మన పాతభాష నేర్చుకొని అవి మనకి వచ్చిన భాషలోకి అనువదిస్తాడనీ, అప్పుడే అవి మనకి అవసరమవుతాయనీ, అప్పుడు అలా అనువదించిన వాటిని హాయిగా డబ్బిచ్చి కొనుక్కొని చదువుకోవచ్చుననీ తెలుసుకొనే సామర్థ్యం నా చిన్ని మెదడుకి లేకపోయింది. దానికీ నన్ను క్షమించండి.
చదువుకున్నోళ్ళ భాష చదువుకోనోళ్ళ భాషకి మరీ దూరమైపోతోందేమో, వాళ్ళ మధ్య ఇదికూడా అంతరాలకి దారితీస్తుందేమోననీ భయపడ్డాను. అంచేత చదువుకున్న గొప్పోళ్ళు ప్రజలందరికీ తెలిసిన తెలుగుభాషకి దూరం కాకూడదనీ, అదే ప్రజాతంత్రీకరణ అనీ అనుకున్నాను. కాని చదువుకోని వాళ్ళని (లేదా చదువుకున్న పేదోళ్ళని) కూడా, వాళ్ళకొచ్చిన భాషకి దూరం చేసి, చదువుకున్నోళ్ళకి వచ్చిన వేరే భాషని మాత్రమే నేర్పించడం అసలైన ప్రజాతంత్రీకరణ అని అర్థం చేసుకోలేకపోయాను. తప్పే మరి! క్షమించండి.
తిండిపెట్టని భాష మనకి అక్కరలేదు. తిండిపెట్టే భాషొక్కటే మనకి కావాలి. అంచేత తిండిపెట్టని భాష ఎంత మనదైనా, దాన్ని తిండిపెట్టే భాషకి బానిసని చేస్తే తప్పేంటి? అసలు తిండిపెట్టని భాష ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? ఈ మాత్రం కూడా ఆలోచించలేకపోయాను. ఏఁ, మన భాషనే తిండిపెట్టే భాషగా ఎందుకు చెయ్యకూడదూ అని వెఱ్ఱిమొఱ్ఱి అభిప్రాయాలు వ్యక్తం చేసాను. తప్పే. మళ్ళీ క్షమించేయండి.
పైనున్న బెంగాలీవాళ్ళనీ కిందనున్న తమిళులనీ పక్కనున్న మళయాళం వాళ్ళనీ చూసి వారి భాషాభిమానానికి ఆశ్చర్యపోయాను. ఎందుకు వాళ్ళంతగా వాళ్ళ భాషని ప్రేమిస్తున్నారో తెలియక తికమకపడ్డాను. అయినా మురిసిపోయాను. వాళ్ళనుంచైనా మనం నేర్చుకోలేమా అని ఆశపడ్డాను. కానీ వాళ్ళది భాషా దురభిమానమనీ, అది వాళ్ళ మానసిక రోగమనీ, వాళ్ళని చూసి మురిసిపోవడం వాళ్ళనుంచి నేర్చుకోమనడం నేను చేస్తున్న పెద్ద ద్రోహమనీ, నాదికూడా దురభిమానమే అనీ అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి.
ఈ కాలపు కృష్ణభగవానులు, “నువ్వేమీ చెయ్యలేవు. ఈ మార్పు జరిగి తీరుతుంది. నువ్వు యుద్ధం చేసి ప్రయోజనవేమీ లేదు. అంచేత నీ ప్రయత్నాన్ని విరమించుకో, నీ ఉత్సాహాన్ని చల్లార్చుకో, నీ ఆలోచనలని మార్చుకో” అని ఎంతగా గీతాబోధ చేసినా వినలేదు. విషాదం ఆవరించిన అర్జునుడికున్నపాటి తెలివైనా నాకు లేకపోయింది, అస్త్ర సన్యాసం చెయ్యడానికి. మనసు ఊరుకోక ఉద్రేకపడింది. ఆ ఉద్రేకంలో ఏవో అవాకులూ చెవాకులూ పేలుంటాను. నన్ను క్షమించండి.
అన్నట్టు అసలు విషయం. ఇదంతా నన్ను నేను ప్రమోట్ చేసుకోడానికీ, నా ఆభిజాత్యాన్ని ప్రదర్శించడానికీ, తద్వారా అఖండ కీర్తిప్రతిష్ఠలు సంపాదించెయ్యడానికీ, ప్రభుత్వం వారు తెలుగు భాషాభివృద్ధికోసం ఇచ్చే కోట్ల రూపాయల్లో అధికవాటా కొట్టేయడానికీ చేసానన్న రహస్యం కూడా నాకు తెలీలేదు. తద్వారా మిమ్మల్నందరినీ మోసం చెయ్యడమే కాకుండా నన్ను నేను కూడా మోసం చేసుకున్నాను. నన్ను మనసారా క్షమించండి.
ఇకపై నేనూ నాలాంటి కొందరూ సగం కాలిన శవం వాసన కొట్టే పాత తెలుగు భాషా సాహిత్యాల గురించి ఎక్కడైనా మాట్లాడితే మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించేయండి. ముక్కుమూసుకొని మీదారిని మీరు దూరంగా వెళ్ళిపోండి.
నా మనసు కుక్కతోక లాంటిది. అంచేత ఇంత జరిగీ ఇంతగా కనువిప్పయిన తర్వాత కూడా మళ్ళీ నేను ‘తెలుగుభాష మరుగున పడుతుందేమో, మనకి తెలీనంతగా మారిపోతుందేమో, జరుగుతున్న మార్పువల్ల మనం మనం కాకుండా పోతామేమో’ లాంటి భయమూ బాధా ఎప్పుడైనా ఎక్కడైనా వ్యక్తం చెయ్యవచ్చు. దయచేసి దాన్ని మీరు పట్టించుకోవద్దు. దానిక్కూడా ముందుగానే యిప్పుడు నన్ను క్షమించెయ్యండి.
దయచేసి, దయచేసి, దయచేసి క్షమించండి.
సెలవు.
– శారద
చలి గజగజ వణికిస్తూంది. బయట ఈదురుగాలి తల తలుపులకేసి బాదుకుంటున్న చప్పుడు గుయ్యిగుయ్యిమని వినిపిస్తూంది. భుజాల చుట్టూ వున్న షాల్‌ని గట్టిగా దగ్గరకి లాక్కున్నాను. చలిమంటకి ఇంకా దగ్గరగా జరిగాను. ఇంత చలిలో, గాలిలో బయట కాకుండా ఇంట్లో సురక్షితంగా, వెచ్చగా వున్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను మనసులోనే.
వున్నట్టుండి చినుకుల చప్పుడు మొదలైంది. దీనికి తోడు వర్షం కూడానా!
పిల్లికూన నా వొళ్ళోకి వచ్చి పడుకుంది. కుక్కపిల్ల దాని వంక గుర్రుగా చూసింది. పిల్లలు వెళ్ళిపోవటంతో ఇల్లంతా ఆక్రమించుకున్న ఒంటరితనాన్ని తరిమేయటంకోసం నేను దగ్గరికి తీసిన నేస్తాలు, ఈ జంతువులు. ఆఫీసుపని మీద ఊరెళ్ళిన ఆయన తిరిగొచ్చేవరకూ నాకీ ఒంటరితనం తప్పని శిక్షే!
ఇంతలో బయట ఏదో గీరుతున్న శబ్దం. భయంతో వొళ్ళంతా నిక్క బొడుచుకుంది. ఈ గాలీ వానా, ఇంత వేళ గాని వేళ, ఎవరై వుంటారు? దొంగాడేమో! కుక్కపిల్ల చెవులు రిక్కించి వింటోంది. సన్నగా ఏదో టప టపా మన్నట్టుంది. మళ్ళీ ఎవరో గీరుతున్న శబ్దం.
బయటికెళ్ళి చూస్తే సరి. భయాన్నీ బద్ధకాన్నీ వదుల్చుకొని బయటకొచ్చి, తలుపు తెరిచి చూసాను. చిక్కటి చీకటింకా అవలేదు గానీ, మెల్లిగా చాప కింద నీరులా ఆకాశాన్ని ఆక్రమించుకుంటూంది చీకటి. రాబోతున్న చీకటినీ, చలినీ తలుచుకుని ముహం ముడుచుకుని వున్నట్టుంది, ఆకాశం. చలి మాత్రం తట్టుకోలేనంతగా వుంది. వాకిట్లో ఎవరూ లేరు. మరా చప్పుడేమిటి?
గాలికి విరిగిపడిన చెట్టు కొమ్మ కిటికీ రెక్కల మీద రాసుకుంటోంది. నవ్వుకుని దాన్ని తీసి అవతల పారేసాను. ఇంట్లోకి వెళ్ళబోతూ యధాలాపంగా కిందికి చూసాను.
ఎక్కణ్ణించి వచ్చి పడిందో, చిన్న చిలక, నేల మీద సొమ్మసిల్లి పడి వుంది. దెబ్బలేమైనా తగిలాయో ఏమో! మెల్లిగా దాన్ని వీలైనంత మృదువుగా ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చాను.
“మళ్ళీ ఇదేమిటీ?” అన్నట్టు పిల్లికూన ఆ చిన్న చిలక వైపు కౄరంగా చూసింది. దాని చూపులని లెక్క చేయకుండా, వెచ్చటి, మెత్తటి టవల్ తెచ్చి ఆ చిలకని దాన్లో పడుకోపెట్టాను. వెచ్చటి నీళ్ళూ, పాత నూలుచీరతో దాని వొళ్ళూ రెక్కలూ తుడిచాను.
రెక్కలకింద దాగి వుంది, చిన్న ముల్లు. అందుకే అది ఎగరలేక పడిపోయింది. నేర్పుగా ఆ ముల్లుని పీకి పారేసాను. రెక్కలూ మెడా సవరిస్తూ చాలా సేపు ఉండిపోయాను. నా వొళ్ళో తన స్థానం పోయిందని కోపంగా పిల్లికూనా, దాని వైపు వేడుకగా కుక్క పిల్లా చూస్తున్నాయి. ఒక పాత సామాన్ల డబ్బాలో పాత చీరొకటి పరిచి దాన్ని అందులో పడుకో పెట్టాను. ఇన్ని గింజలూ, ఒక ఆపిల్ ముక్కా చిలక ముందు పెట్టి, చిన్నపళ్ళెంలో కొన్నినీళ్ళు పోసివుంచాను. కానీ అది కళ్ళు తెరవటానికైనా ఓపిక లేనట్టు సొమ్మసిల్లి పడి వుంది.
రాత్రి నేను భోజనం చేసి వచ్చి చూసేసరికి అదింకా అలానే పడి వుంది. దాని ముందు వేసిన గింజలూ, నీళ్ళూ ఏదీ ముట్టుకోలేదు. నా పక్కమీదికి చేరాను. నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నాను. ఆ చిన్నారి చిలకా, దాని తడిసిపోయిన రెక్కలు, అందమైన పచ్చటి శరీరం, తలచుకుంటేనే ముద్దొస్తుంది. లేచి. హాల్లోకి వెళ్ళి లైటు వేసి చిలక వైపు చూసాను. అదింకా అలాగే నిద్ర పోతుంది. ఒక్క సారి చేతుల్తో దాని రెక్కలు సవరించాలనిపించింది. కానీ నిద్రలో భయపడుతుందేమోనని ఊరుకున్నాను.
********************
తెల్లవారి నేను లేచేసరికి చిలక కొంచెం తేరుకున్నట్టు కనిపించింది. తనున్న డబ్బాను ముక్కుతో పొడుస్తూ పరీక్షిస్తోంది. మెల్లిగా దాన్ని చేతిలోకి తీసుకున్నాను, భయపడుతుందేమోనని భయపడుతూనే. కానీ నా చేతి స్పర్శ బాగా పరిచయమైనట్టు, కదలకుండా ఒదిగిపోయింది.
ఆ రోజు వెటర్నరీ డాక్టరుకి ఫోన్ చేసి పిలిపించాను. దాన్ని పరీక్ష చేసి, ఏమీ లేదని, ముల్లు బలంగా దిగటంతో రెక్కలో బాగా గాయమైందనీ, ఆ గాయం మానగానే ఎగరగలుగుతుందనీ చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చేతుల్లో మాత్రం ఎక్కువసేపు వుండలేకపోయింది. కిచకిచమంటూ నా దగ్గరకొచ్చింది. దానికి నా మీదున్న నమ్మకానికి నాకు కొంచెం గర్వం అనిపించింది.
రెండు రోజుల్లో అది నాకు బాగా చేరికైంది. ఆ చిలకని దువ్వుతూ, దానితో కబుర్లు చెప్పటం, దానికి పాటలు పాడి వినిపించటం బాగా అలవాటైంది. మెల్లిగా దాన్ని తోటలోకి కూడా తీసుకెళ్తున్నాను. నా భుజం పైన వాలి కూర్చుంటుంది. నా భుజం మీద దాని బరువు నాకేమీ భారంగా అనిపించలేదు. బహుశా ఇతరుల బరువు మొయ్యటం తల్లిగా, భార్యగా నాకలవాటైపోయిందేమో! దాని వాడి గోళ్ళు నా భుజంలోకి గుచ్చినా నాకేమీ నొప్పి కలగలేదు. ఆ నొప్పికంటే కబుర్లు చెప్పుకోవటానికి నేస్తం దొరికిందనే సంతోషం ఎక్కువైందేమో! నేను చెప్పే కబుర్లన్నీ శ్రద్ధగా విన్నది.
“నీకా చిలక వచ్చిందగ్గర్నించీ మా మీద ప్రేమ తగ్గిపోయింది, దాన్ని బయటికి పంపించేయి” అని చెప్తున్నట్టు కుక్క పిల్లా, పిల్లి కూనా నా వైపు నిష్టూరంగా చూస్తున్నాయి.
“అది కాదర్రా! దెబ్బ తగిలి కదలలేని పరిస్థితిలో అది మనింటికొచ్చింది. ఇలాటప్పుడు మనం దానికివ్వాల్సింది ప్రేమా, అభిమానమూ. మనం దానికి బలం రాకముందే బయట వదిలేస్తే, అది చచ్చిపోదూ?” అనునయంగా చెప్పాను వాటికి.
పిల్లీ కుక్కలని ఇంటి వెనక వైపు ఉంచేసాను. వీలైనంతవరకూ ముగ్గురినీ వేరు వేరుగానే వుంచుతున్నాను. అయితే అది నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండ గలిగేది కాదు. ఇలా అయితే అది ఎగరటం ఎలా మరి?
అందుకే ఒక రోజు దాన్ని మొదటిసారి తోటలో ఒంటరిగా వదిలేసాను. అటూ ఇటూ నడుస్తూ తోటంతా కలియ తిరుగుతోంది. లోపల పని చేసుకుంటూ కూడా ఒక కన్ను దాని మీదే వేసి వుంచాను.
కలకలమని గోల వినిపించటంతో తోటలోకి ఒక్క పరుగున వెళ్ళాను. పక్షుల గుంపేదో తరుముతున్నట్టు వుంది, చిలక తొందర తొందరగా అడుగులేస్తూ వస్తుంది. నాలుగైదు పెద్ద చిలకలు దాన్ని ఎగిరి ఎగిరి పొడుస్తున్నాయి. అది భయంతో గజగజా వణికి పోతోంది. ఒక్క ఉదుటున దాన్ని చేతుల్లోకి తీసుకుని లోపలికొచ్చి తలుపేసాను. నా చేతుల్లో ముడుచుకుపోయింది. దాని భయాన్ని చూసి నాకు జాలేసింది.
“పోనీలే! ఇప్పట్లో నిన్ను బయటకి పంపించను. నా దగ్గరే వుందువుగాని.” బుజ్జగించాను.
ఎంత భయపడిందో ఏమో కానీ తేరుకోవటానికి చాలాసేపే పట్టింది. నేను కొంచెం ఆశ్చర్యపోయాను. అది ఎగరలేదెందుకా అని. ఇంకా రెక్కల్లో నొప్పిగా వుందా?
మర్నాడు మళ్ళీ వెట్ దగ్గరికి తీసికెళ్ళాను. ఆయనా ఆశ్చర్యపోయాడు. దెబ్బ తగిలి అయిదారు రోజుల పైనే అయింది. ఇంకా ఎగరలేక పోవటం ఏమిటా అని.
ఆయన చేతుల్లోకి తీసుకోబోయాడు. గబగబా టేబిల్ మీద నడుచుకుంటూ నా దగ్గరకొచ్చి ఎగిరి చేతుల్లో దూరింది. నాకు నవ్వూ, కించిత్తు గర్వమూ కలిగాయి. నోరులేని జీవి నామీద ఎంత నమ్మకమూ ప్రేమా పెంచుకుందో కదా అని. దాన్నలా నా చేతుల్లో వుంచే ఆయన పరీక్ష చేసారు.
“రెక్కలు బలంగానే వున్నాయి మరి. ఎందుకెగరటం లేదో. ఇంకొక నాలుగైదు రోజులు చూద్దాం,” అన్నారు.
ఇంటికొస్తూ దానికెంతో బోధ పరిచాను. “అందమైన పక్షివి, రెక్కలూ వున్నదానివి, ఎగరలేకపోవటం ఏమిటీ? నామోషిగా లేదూ?” మందలించాను. “నా బాధ నీకేం అర్థమవుతుందిలే,” అన్నట్టు నా చెంపమీద తల ఆనించింది. మళ్ళీ రెండు రోజులు నా చుట్టుపక్కలే వుంది. ఒంటరిగా బయట వదిలేస్తే ఏమాత్రం వుండలేదు. నన్నే వెతుక్కుంటూ వచ్చేస్తుంది.
ఇలా ఎన్నిరోజులు? తలచుకుంటే దిగులుగా వుంది. పక్షి తన స్వభావసిద్ధంగా ఆకాశపుటంచులు వెతుక్కుంటూ, రివ్వురివ్వుమని రెక్కలు సాచి, మేఘాలమధ్య తేలిపోవాలేగానీ, ఇలా మనుషులమీద అభిమానం పెంచుకుని మిగతా ప్రపంచానికి భయపడి దూరంగా వుటే ఎలా? ఈ ఆలోచనతో నాలుగైదు రోజులు నిద్ర పట్టలేదు.
దానికి నాతోటలో వుండే మూలమూలా చూపించాను. ప్రతీచెట్టూ, ప్రతీఆకూ, ప్రతీపువ్వూ పరిచయం చేసాను. ఏ మొక్క ఎప్పుడు నాటానో వివరించాను. పిల్లల గురించీ, మావూరి గురించీ ఎన్నో కబుర్లు చెప్పాను. మెల్లిగా చెట్టు కొమ్మపైకెక్కించాను ఒక రోజు దాన్ని. ఇదెంత వింతపక్షి, ఎగరటానికింత భయపడుతుందేమిటి అనుకుంటూనే. కానీ ఆరోజు అది ఎక్కువ భయపడలేదు. కొంచెం సేపాగి, కొమ్మమీంచి రివ్వుమంటూ ఎగిరి నా భుజం పైకొచ్చి వాలింది. సంతోషంగా, మళ్ళీ కొమ్మ మీదికెక్కించాను. ఈ ఆట ఆ రోజంతా ఆడుతూనే వున్నాము.
వారం రోజులు గడిచాక, ఒక రోజు తనంతట తనే కొంచెం రెక్కలు విదిలించి మామిడి కొమ్మపైకెగిరింది. పట్టరాని సంతోషం కలిగింది నాకు.
“అదీ! అలా ఎగరాలి! ఈ జామ కాయ ముక్కని తిను”, అభినందించాను. కొంచెం కొంచెం ఎగరటం మొదలు పెట్టింది. రెండు రోజుల తరువాత మళ్ళీ ఒంటరిగా తోటలో ఒదిలేసాను. ఈ సారి ఏ ప్రమాదమూ జరగలేదు. రెండు మూడు గంటలైంతరువాత ఇంట్లోకి తీసుకొచ్చాను. ఇంకొక చిలకల గుంపుతో స్నేహమైనట్టుంది. అన్నీ కలిసి గుంపుగా కిచకిచమంటూ కబుర్లాడేవి. అన్నిటికీ కలిపి కొంచెం తిండి గింజలూ ఇన్ని మంచి నీళ్ళూ పెట్టి లోపలికొచ్చాను. వాటన్నిటితో కబుర్లయ్యాక చిలక లోపలికొచ్చి నా భుజం మీది కెక్కి కూర్చుంది, ఎప్పట్లానే.
ఇంకొక నాలుగు రోజులు గడిచాయి. ఇప్పుడు, రోజూ పొద్దున్నే దాన్ని తోటలో వదిలిపెడుతున్నాను. తన స్నేహితులందరితో కలిసి బాగానే ఎగురుతోంది. కానీ మూడు నాలుగు గంటలకంటే ఎక్కువ వుండలేదు. అయిదోరోజు పొద్దున తోటలో వొదిలేసిన చిలక సాయంత్రమైనా రాలేదు. ఏదో ఆందోళన మనసుల్లో! చీకట్లు పడేవేళకి ఇల్లు చేరుకుంది. “ఇదా నువ్వు ఇంటికొచ్చే టైం?” విసుక్కుంటూనే జామకాయ ముక్కని పెట్టాను. ఎక్కడ ఏం తిన్నదో కాని, పండు ముక్క కొంచెం కొరికి వదిలేసింది. ప్రేమగా నా మెడలో తల దాచుకుంది. నా మనసెందుకో బాధ పడింది.
అలా రోజూ పొద్దున వెళ్ళి సాయంత్రం రావటం మొదలు పెట్టింది. ఇలా ఏదో ఒకరోజు జరగక తప్పదని తెలిసినా, అది కనపడక పగలంతా ఏదో వెలితిగా వుండేది. తోటలో తిరుగుతున్నా, పుస్తకం చదువుతున్నా, పాటలు వింటున్నా ఏదో తెలియని ఒంటరితనం చుట్టుముట్టినట్టే వుండేది.
ఇంకొక నాలుగు రోజుల తరువాత చిలక సాయంత్రమైనా ఇంటికి రాలేదు. అసలు ఆ తరువాతెప్పుడూ రాలేదు. నాకే.. తోటా, ఇల్లూ, నా మనసూ అన్నీ ఖాళీగా అనిపిస్తున్నాయి. తోటంతా తిప్పి చిలకకి చూపించాననుకున్నా కానీ, నా మనసంతా విప్పి పంచుకున్నానుకోలేదు.
ఆరునెలల తరువాత సాయంత్రం తోటలో పూల వైపు చూస్తున్నాను. కుక్కపిల్లా పిల్లికూనా ఆడుకుంటున్నాయి. రివ్వున వచ్చి వాలింది చిలక, నా చిలక! ఒక్కసారి దాన్ని దువ్వాలన్న ఆశని అణుచుకున్నాను.
“బాగున్నావా?” దగ్గరికెళ్ళి పలకరించాను. రివ్వున ఎగిరి నా భుజం మీద వాలింది. రెండు నిమిషాలుండి మళ్ళీ ఎగిరి, ఆకాశంవైపు దూసుకెళ్ళిపోయింది.
నేనూ నా ఒంటరి తోటా మిగిలిపోయాము. కుక్కపిల్లా, పిల్లికూనా, “ఎంత కృతఘ్నతో చూడు! నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది” అంటూ తోకలూపుతున్నాయి. “మరది పక్షి కదా? ఎగరకుండా మనతో పాటే ఎలా వుండగలదు? అయినా మీరుండగా నేను ఒంటరినెందుకవుతాను?” ఇద్దరికీ నచ్చచెప్పాను. నాకేం కోపం లేదు, నా చిలక మీద. ఎగురుతుందని చిలక మీద కోపగిస్తారా ఎవరైనా? అయినా, ఆకాశంలో వెళ్ళే చిలకల గుంపు వైపు ఆశగా చూస్తూనే వుంటాను, నా చిలక ఎప్పుడైనా కనిపిస్తుందేమోనని.
2009 జూన్ గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి
పాత గడులు
మే నెల గడిని నింపి పంపిన వారు – వెన్నెల_డిబి, jyothi, రాధిక, వేణు, సుజాత(మనసులోమాట), BK, ఆదిత్య, వెంకట్ దశిక, కామేశ్వర రావు, స్వరూప కృష్ణ, మైత్రి, సంచారి, కంది శంకరయ్య గార్లు. వీరిలో రాధిక ఒక తప్పుతో, కామేశ్వరరావుగారు రెండు తప్పులతో పూరించారు. వర్ణక్రమ దోషాలే ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని సరిచూసుకుంటే సరిగ్గా నింపినవాళ్ళ సంఖ్య పెరుగుతుంది.
వివరణలు:
1 శ్రద్ధాత్రయ విభాగ యోగం: శ్రధ్ధావాన్ లభతే జ్ఞానం అని కదా గీతా వాక్యం. మూడు శ్రధ్ధలంటే శ్రద్ధాత్రయ, అయినా ఎవరి గీతెలా ఉందో అనడం ద్వారా భగవద్గీతలో అధ్యాయం అని సూచించాం.
8 భాకర్: భాకర్ అంటే జొన్న రొట్టి. మహారాష్ట్రీయుల కిష్టమైనది. ఈటీవీ సుమన్ స్నేహితుడు ప్రభాకర్ అని చెప్పక్కర్లేదుగా.
10 చిలక: మాటలు ముద్దుగా తిరిగి పలికితే చిలక పలుకులంటాం కదా.
11 జిగిలి: జిగిలి అంటే చిక్కని కాంతి.
12 రణం: గోపీచంద్ సినిమా.
13 ణంగ: వృత్తపద్యం గణంలేకుండా అవ్వదుగా.
15 నార: చచ్చేముందైనా ఆనారాయణుడిపేరు స్ఫురిస్తుందని బంధువులు నార చూపిస్తే ఓ పిసినారి పీచు అన్నాడట.
16 కవి: భారవి ప్రవృత్తి పరంగా కవే గా.
17 త ణ గ ము: తణగము అంటే నీళ్ళుమోయడానికి వాడే తోలుసంచీ.
18 జిలేబీ: చుట్టలు చుట్టలుగా ఉండేదిదేగా.
22 తీతా: అందాలరాముడిలో అల్లు ని రాజబాబు తీతా -తీసేసిన తాసిల్దారు అని ఏడిపించే వాడు
24 తలుపు చెక్క: తమలపాకుతో తను ఒకటిస్తే తలుపు చెక్కతో నేరెండిచ్చా అని మోటు సరసం.
27 గోర్కి: అమ్మ అనగానే గుర్తొచ్చే రచయిత మాక్సిం గోర్కీ.
28 లోకలే: ఇక్కడివాళ్ళే అంటే లోకలే అని.
29 నకనక: కలవారి కోడలై న కనక మాలక్ష్మిలో ఇంత ఆకలి బాధ ఉందా? ప్రస్ఫుటపరిచిన అక్షరాలు చూడండి.
30 లేపనము: ప్రవరాఖ్యుడిని కష్టాల్లో పడేసిన జెల్లీ పాద లేపనము
33 సిసి: ఇంజను కెపాసిటీని, ఇంజెక్షన్ కెపాసిటీని సిసి లలో చెప్తాం కదా.
34 లుక: ఎలుక చేసే శబ్దం కాదిది, రెట్టిస్తే – అంటే లుకలుక – అంటే పురుగులు చేసే సందడి అని.
36 లుసుకుమారు: మంచికుమారులు – సుకుమారులు – కొడుకుల కాలు నెత్తిమీదకొచ్చింది అంటే లు ముందుకొచ్చిందని.
38 తీద్ధాం: ఇక్కడినుండి తీసేయమన్నారని చెప్తే తీద్దాం అని మామూలుగా చెప్పకుండా తీద్ధాం అని వత్తి చెప్పడం.
39 గునపం: గుండెల్లో గునపాలు గుచ్చడం అని కదా ప్రయోగం.
42 రుతంమా: మారుతం – అక్షరాలు తారుమారయ్యాయి.
44 కంది: కంది పప్పు అంత తేలికగా ఉడకదు కదా. కందడం అంటే చర్మం నలుపయిపోవడం అని కూడా.
45 కబళము: పూర్వం ముష్టివాళ్ళు ఓ ముద్ద అడిగే వారు. ఇప్పుడో చిల్లరడుగుతున్నారు.
46 స్టావి: మైక్రోసాఫ్ట్ వాళ్ళ కొత్త ఓయెస్ విస్టా. తికమక పెడ్తోందంటే తిరగేయమని.
48 వానపాము లు: వెర్మీకంపోష్ట్ చేయడానికి వానపాములనుపయాగిస్తారు.
51 ఎవరూ నీవారు కా రు: ఎవరూ నీవారు కారు, ఎవరూ నీతోడు రారు. ధర్మదాత సినిమాలో ఘంటసాల పాటయిది.
52 కరివి: కరి అంటే ఏనుగు అని. కోతి అని కూడా అర్ధం.
నిలువు
1 శ్రవణం: నవవిధభక్తుల్లో శ్రవణం ఒకటి. వినిపించుకోవచ్చుగా అని సూచించాం.
2 త్రచి: ఇక్కడెలా ఉన్నా అంటే తిరగబడిందని.
3 యలనా గ: ఎలనాగ అంటే అందంగా ఉన్న అమ్మాయి. అమ్మాఏ అని ఏ బదులు య అని వాడామని సూచించాం.
4 వికరము: వికారం అని కాక వికరం అని రాయాలని ఆఫీలింగుకూడా దీర్ఘంగా రాలేదు అని సూచించాం.
5 గజిబిజి: సందడి – బిజీ బిజీ – వెరసి గజిబిజి.
6 యోగి: ఒక యోగి ఆత్మ కథ పరమహంస పరమానందగారు రాసిన పుస్తకం.
7 గంలి: లింగం -శివాలయంలో కనిపించేదే. అనుస్వారం జారిపోయి తిరగ బడి గంలి అయింది
8 భారవి: తండ్రి మెచ్చుకోలేదని చంపబోయిన సంస్కృత పండితుడు భారవి – కిరాతార్జునీయం కర్త.
9 కర్ ణం: కర్ణం – అంటే చెవి, రేఖాగణితంలో మూలలని కలిపే రేఖ.
14 గతతార్కికసిద్ధాంతం: గతితార్కికసిధ్ధాంతం – పాతబడిందని గత వాడాం.
19 లేత మనసులు: కుట్టిపద్మిని బాలనటిగా ముద్దుగా వేసినసినిమా
20 బీలు: హడావిడిగా తిరిగేవాళ్ళని బిజీ బీ అంటాంకదా.
21 చక్కనమ్మ: చక్కనమ్మ చిక్కినా (చేతికి), చిక్కకపోయినా అందమే కదా.
22 తీగోనసితీరువఎ: ఎవరుతీసిన గోతిలో వారే పడతారని కదా – మరీ ఇంత …తుగా తవ్వితే, ‘తీ’ సిన వాళ్ళే తలకిందులుగా పడతారు అనడం ద్వారా చివర తీ వస్తుందని సూచించాం.
23 లేలేలే: లేలేలే… లేలేలే… నారాజా అన్న ఎల్లారీశ్వరి పాట మరచిపోలేదుగా.
25 పుట్ట: వల్మీకం (పుట్ట) లో తపస్సు చేసుకున్నాడు కాబట్టి వాల్మీకికాపేరుట.
28 లోకలుగు: దగ్గరలోఉన్నా(లోకలు) , ఎలకింటి (కలుగు) కెళ్ళి వేలెట్టమంటే భయం కలుగుతుందిగదా
32 పలు: పలు వరుస తిన్నగా లేదంటే మీకు నవ్వెలా వస్తోంది -నవ్వు అని ఇచ్చి పళ్ళకి సంబంధం ఉన్న పదం అని సూచించాం. .
33 ముకు: లక్ష్మణుడు ముక్కు కోసేసిన తర్వాత శూర్ఫణఖకి ముకు మిగిలింది
36 కనకం: కీర్తీ, కాంతా, కనకం .
38 మారుబలుక: మారుబల్క కున్నావేమిరా – మామనో రమణ. అన్నది శ్రీరంజనిలో త్యాగయ్యగారి కృతి
41 పందివారు: పందివారు అంటే నాకుతెలియదుకానీ – ఆకాశవాణి ధరవరలలో ఇది తప్పక చెప్పేవారు.
42 పాముచెవి: బాగా వినికిడి ఉంటే పాముచెవులతో పోలుస్తారు కదా
44 మాస్టారూ: చిరంజీవి వేసిన సినిమా మాస్టారు. ప్రస్తుతం జనాలు పాఠాలు నేర్పారాయనకి
46 కము: పలు తో కలిస్తే మాట్లాడం అనే కదా
48 వినీ: నీవి తిరగేస్తే వినీ,
50 నకా: కాన అంటే అడివి.
51 పారు: దేవదాసుకి ప్రియమైనది పారు కదా
స్వాతి:
నా సందేహాలు కొన్ని..
*నామకరణం:
*ఒక కవిత రాశేశాక దానికి పేరు పెట్టే విషయం లో సమస్య వస్తుంది. అసలు శీర్షిక ఎలా ఉండాలి? కవితలోని సారం పేరు చూడగానే అర్ధమవ్వాలా లేదా ఆ శీర్షిక తో కలిపి చూస్తేనే కవిత పూర్తయినట్టు అనిపించాలా? అసలు శీర్షిక ఉండకపోతే నష్టమా.
*సమకాలీన అంశాలు:*
సమకాలీన అంశాలపై రాసే కవితలు కొన్ని ఉంటాయి. వార్తా పత్రిక లో సంఘటనల హెడింగ్ లు చదివినట్టు ఉంటుంది. సంఘటనలని సూటిగా రిఫర్ చేస్తూ కవిత రాయటం ఎంతవరకూ బావుంటుంది. అసలలాంటి అంశాలను కవితా ప్రక్రియ లో చూపదలచుకుంటే యెలా రాయాలి.
Continue reading
– స్వాతీ శ్రీపాద
కొత్త దుప్పటి కథాసంపుటిలో నాలుగో కథ ‘ఒక్కవానచాలు’. అచ్చ రాయలసీమ నుడికారంతో మొదలవుతుంది – ‘రాత్రి పదిగంటలు దాటినా మా యవ్వారం ఆగలేదు’ అంటూ. కథలు పురి విప్పడం, పద్యాలు గొంతుసవరించుకోడం, ఆకాశాన్ని ఎండిపోయి గవ్వలు బైటపడిన చెరువుతో పోల్చడం, దుప్పటి పొడవున్న నల్లటి మేఘపు తునక చందమామ వెన్నెల నవ్వుల్తో బయటకు రావడం లాంటి మాటల్లో రచయిత భావుకత్వం వెల్లడౌతుంది.
ఒక్క వాన చాలు
వాన మాట విన్పిస్తే చాలు
చెవులు – అలుగుల్ని సవరించుకొనే చెరువులవుతున్నాయి
మేఘాల నీడలు కదిలితే చాలు
కళ్లు – పురివిప్పే నెమళ్ళవుతున్నాయి
కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై
పైరు చెక్కిళ్లమీద జాలిగా జారుతోంది
ఉత్తర ప్రగల్భాల ఉరుముల్తో ఉత్తర కూడ దాటింది
ఒక్క వాన వొంగితే చాలు
ముక్కాలు పంటన్నా చేతికొస్తుంది
ఎన్ని సాయంత్రాలు రేడియోల ముందు సాగిలబడ్డామనీ !
ఎన్ని సార్లు – జలరేఖల్ని లెక్కగట్టే ముసలాళ్ళ ముందు
బీడీ ముక్కలమై మినుకు మినుకుమన్నామనీ !
ఎన్ని రాత్రిళ్ళు – ఆరుబైట మంచమేసికొని
ముద్ద ముద్దగా తడిసి మంచాన్ని ఇంట్లోకి మార్పించే వాన కోసం
పడిగాపులు కాశామనీ !
రిక్త హస్తాలతో హస్తకార్తె కూడ దాటింది
ఒక్క పదనయితే చాలు
సగం పంటన్నా చేతికొస్తుంది
వాడి మాడే పైరు | మా గుండెలపై
కదిపిన కందిరీగల పట్టు అవుతోంది
నెర్రెలెత్తి వెర్రిదైన భూమి- మా నొసటిపై
రక్తపింజర్ల కలివెతుట్టె అవుతోంది
ఆకుల మీది మచ్చలు ఏ పోషకాల లోపంవల్లా కాదు
పొడి ఆహారానికి వేరు నోరంతా పిడచగట్టుకు పోవటంవల్లే
చిత్తాన్ని చిత్తు చిత్తుజేస్తూ చిత్తకార్తె కూడ దాటింది
ఒక్క వాన మోదు చాలు
పాతిక పంటన్నా చేతికొస్తుంది
బాగున్న చెరువులుండవు – నీరున్న బోరుబావులుండవు
నదుల గుండె తడిని విన్పించే చిట్టి కాలువలుండవు
ఓట్లకు తప్ప మరెందుకూ పనికిరాని యీ గడ్డమీద
వరుణదేవుడికి కూడ శీతకన్నే
మోరపైకెత్తిన యీ ఆరడుగుల ఆశలకుప్ప
రోజుల తరబడి శిలావిగ్రహమవుతోంది
చురుక్కుమని పొడిచే ఎండముల్లులు తప్ప
ఒక్క చినుకు కూడా రాలదు –
మాడి మసై పోతోన్న పైరు కన్నీటి చుక్కలై
నా కళ్ళు మేఘాల్లోంచి జారటం తప్ప
స్వాతిశయపు నిర్లక్ష్యంలో స్వాతికార్తె కూడా దాటింది
ఇప్పుడయినా ఓ చినుకురాలితే
విత్తనాలయినా దక్కుతాయి
కథలోనూ ఉత్తర కార్తె ఊసెత్తి కాలమానాల్ను తెలియబరచడం, తూర్పుగాలుల ప్రసక్తి తేవడంలో ప్రకృతి పట్ల రచయిత శ్రద్ద వ్యక్తమవుతుంది. ఉత్తమ పురుషలో సాగిన కథలో రచయిత ఆరంభంలోనే ‘ఒక్కవాన కురిస్తే’ బాగుండుననుకుంటాడు.
సుక్కలు ఇరగబడి కాయడం, ఒక్క మబ్బుతునకన్నా లేకపోవడం, వానకోసం పంటకోసం రైతుల పడిగాపులు, ఆత్రుత, వాన రాకపోతేనన్న నిరాశ రైతుకు వానకు ఉన్న అవినాభావ సంబంధాన్ని స్పష్టం చేస్తాయి. చేలకు కాపలా కాసే నేపథ్యంలో ఊరి రైతు యువకులు వాన కోసం ఆరాటంగా ఎదురుచూడడం కథామూలం.
పంటపొలాలపై పందుల దాడి — అర్ధరాత్రి నిద్రలో లేచినా వాన కోసం పలవరించే తీరు మనసును కదిలిస్తుంది. ఉత్తర, హస్త కార్తెలు దాటినా వాన ఒంగకపోవడం, ఈలోగా చెరువు తెగిపోవడం, రాజకీయ ముష్టియుద్ధాలు, కరువు తెగులు అన్ని తెగుళ్ళనుమించి పంటను ఆక్రమించడం, అటు ఉద్యోగ ప్రయత్నంలో ఓడిపోయి ఇటు కులవృత్తీ కలిసిరాక యువత నిరాశకు లోనవడం ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది. చిత్తకార్తెలోనూ నీటిచుక్క కురవకపోవడం, వేరుశనగ పైరు ఎండిపోవడం, ఎండ తీవ్రతను వాన లేమిని వరుస క్రమంలో చూపుతుంది. వాన వస్తుందా రాదా అనేది తెలుసుకోవడం కోసం గుడ్డపీలిక తీసుకుని బొమ్మాబొరుసు వేసి వాన వస్తుందని సంబర పడటం రైతు అల్పసంతోషాన్ని ఉదాహరిస్తుంది. వాములు ఖాళీ అవటం, మేపలేక ఎద్దుల్ని అమ్మితే ఆ డబ్బుతో తన బాకీలు తీర్చమంటూ వ్యాపారి ఒత్తిడి, వాన కోసం పిచ్చివాడిలా పలవరింతలు…
అర్ధరాత్రి కలగా మొదలైన వాన పెద్దదవాలని, కుంభవృష్టి కావాలనుకున్న ఆశలు కల్లలైపోతాయి. ఇక వాన రాదేమోనన్న స్థితికి వచ్చాక..
– ఊపిరి సలపని వాన,
– వాగులూ వంకలూ ఏకం చేసే వాన,
– ఇళ్ళంతా కురిసి కురిసి మడుగులైపోయేంత వాన,
– పైరంతా కుళ్ళి పోయి చేనంతా నలుపు రుద్దిన వాన.
– ఆఖరికి, పైరుమొక్కల చెత్తను ఎద్దులకు గడ్డి కింద కూడా పనికిరాకుండా చేసిన వాన.
ఒక్క వానకోసం ఎదురు చూసి ఎదురుచూసి ఆ వాన క్రౌర్యానికే బలైన రైతుల కథ “ఒక్క వాన చాలు”. అందుకే అంటాడు ఈ కథలో –
అని.
ఏ భావాన్నయినా కవితగా వ్రాసుకుని దాన్ని కథగా మలచటం అనే ప్రక్రియకు ఆదిగా రూపమిచ్చినది సన్నపురెడ్డి. ఒక్క వాన చాలు లాంటి కవితను కథగా మలిచి అనూహ్యమైన ముగింపు చిత్రించి మనసును తట్టి లేపగల చైతన్యాన్ని సాధించగలగడం మామూలు విషయం కాదు.
ఈ కథలోని ప్రతి అక్షరంలోనూ రైతు మనసును, రైతు జీవితాన్ని పొందికగా పొదిగి సీమ కరువు దృశ్యాలను కళ్ళముందుంచటంలో కృతకృత్యుడైన కథకుడు సన్నపురెడ్డి.
కళ్ళకు నీళ్ళు తెప్పించే కథ ఒక్క వాన చాలు.
అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.
-నిడదవోలు మాలతి
ఉధృతంగా మంచు కురుస్తుంటే కిటికీలోంచి చూస్తూ కూర్చుంది ధరణి. ఆదివారం కనక సరిపోయింది. లేకపోతే నానా తిప్పలూ అవును, ఆఫీసు చేరడానికి. నిన్న దినకర్తో వచ్చిన తగువు ఇంకా పచ్చిగానే వుంది. అతనికి మాత్రం పట్టినట్టు లేదు. రాత్రి మంచంమీద వాలినవాడు వాలినట్టే పడి నిద్ర పోతున్నాడు. తొమ్మిదయినా లేచే జాడల్లేవు.
ధరణి చిన్నబుచ్చుకుంది. “నువ్వు చూసుకోలేవన్నానా? ఏదో చూస్తుంటే కనిపించింది. చెప్పేను.”
“నేను చూడలేదని ఎందుకనుకున్నావు?”
వుండీ వుడిగీ, కువకువలాడుతూ ఆకాశంలో కొంగలు బారులు బారులుగా దక్షిణానికి తరలిపోతున్నాయి “శిశిరం ప్రవేశించనున్నదహో” అని చాటుతూ. తను వాటిని ప్రతియేడూ చూస్తూనే వున్నా ఎప్పటికప్పుడు కొత్తే. ప్రతిసారీ ముచ్చటే ఆ బారుల తీరు. చక్కగా సైనికులు కవాతు చేస్తున్నట్టు వరసలు ఎలా కడతాయో! ధరణి కళ్లు ఆకాశం మీంచి భూమ్మీదకి తిరిగేయి. ఇంటిముందు చెట్లకింద ఉడతలు హడావుడిగా పుట్టల్లోకి కాయలు చేరేస్తున్నాయి. అవి ఒక్క శిశిరానికి చాలినంత మాత్రమే పోగు చేసుకుంటాయిట. వాటికున్నపాటి జ్ఞానం మనిషికి లేదేం? మనిషిని rational animal అనడం అన్యాయం అనిపిస్తోంది చూస్తుంటే. అయినా ఆమాట అన్నది మాత్రం ఎవరు కనక? మనిషే కదా! మనకి మనమే కితాబులిచ్చుకోవాలి మరి! మనం ఇలా అనుకుంటున్నాం అని తెలిస్తే ఆ కొంగలూ, ఉడతలూ నవ్వుకోవా?
ధరణికి తాను అమెరికాకి వచ్చిన తొలిరోజులు గుర్తొచ్చేయి. “నీకేం కావాలేం కావాలి? నీకు ఏమిటి ఇష్టం? ఏమి నీ కోరిక?” అంటూ పదే పదే అడుగుతూ, తన ఇష్టాయిష్టాలు కనుక్కుంటూ దినకర్ సకలం అమరుస్తూంటే పొంగిపోయింది. కొత్త బల్లలూ, కుర్చీలూ, మంచాలూ కొన్నాడు. కిటికీలకి కొత్త కర్టెనులు అమర్చేడు. ఊళ్లో అందరికీ “మై మిసెస్” అంటూ గొప్పలు పోతూ చూపించేడు. “అబ్భ, ఇతడికి నేనంటే ఎంత ప్రేమా” అనుకోకుండా వుండలేకపోయింది మనసులోనే.
అతను రోజుకి పదిసార్లు చెప్తాడు ఆమె ఎంతో అందంగా వుందనీ, చీరెల్లో రంగారు మెరుపులకి కళ్లు బైర్లు కమ్ముతున్నాయనీ. “ఐ లవ్ యూ” అంటూ ఏకధాటిగా తిరుమంత్రం జపిస్తూనే వుంటాడు. ఓరోజు “నువ్వు చెప్పవేం? డు యూ లవ్ మీ?” అని కూడా అడిగాడు.
“ఏమో నాకు అలా మాటాడడం రాదు. మనం అలా మాటాడం కదా” అంది ధరణి తేలిగ్గా నవ్వేస్తూ.
గృహలక్ష్మి అమెరికనింట అడుగు పెడుతూనే, అతనికి పెద్ద ప్రోజెక్టు తగిలింది. అతను ఎగిరి గెంతేసి, “ఐ లవ్యూ సోఓఓఓ మచ్” అన్నాడు ఆ “సో”ని బారెడు సాగతీస్తూ. “ఇదంతా నీ అదృష్టమే. నువ్వు ముందెప్పుడో బంగారుపూలు పూజ చేసుకుని పుట్టేవు. అంచేతే నాలాటి మేధావి నీకు లభించేడు.” అని కూడా అన్నాడు బోరవిరుచుకుని, ఎదనిండా గాలి పీల్చుకుని.
ధరణి అతనిమాటలకి నవ్వింది మనస్ఫూర్తిగానే.
ఆ ఘనతర ప్రోజెక్టు నాలుగునెలల్లో అంతమయిపోయింది. మరో మంచి ప్రోజెక్టుకోసం వెతకడం మొదలుపెట్టేడు. ఇక్కడ “మంచి” అన్నపదం మనం గుర్తుపెట్టుకోవాలి. తన మేధాసంపత్తిని సవ్యంగా ఉపయోగించుకోగల ప్రోజెక్టు అయితేనే చేపట్టడానికి నిశ్చయించుకున్నాడు. దానికోసం ఎదురుచూస్తున్నాడు.
ధరణికి మొదట్లో ఏమీ అనిపించలేదు కానీ రోజులు గడుస్తున్నకొద్దీ తన ఆలోచనలు మరో దిక్కున సాగేయి. చిన్నబెరుకు మొలకెత్తి, నెమ్మదిమీద ననలు తొడిగి, రెమ్మలు తేరి, మహావృక్షమయి ఎదుట నిలిచి వుంది ఇప్పుడు. మొదట్లో రెండో, మూడో ప్రోజెక్టులు ఏవో కారణాలు చెప్పి దాటేసినప్పుడు అది అంతగా బాధించలేదు. “అవున్లే, ఎవరికి మాత్రం వుండదు తమ సామర్థ్యాన్ని సవాలు చేయగల ఉద్యోగం కావాలని? అలా ఆశించడంలో తప్పేం లేదు” అనుకుంది. క్రమంగా రోజులూ, వారాలూ, నెలలూ గడుస్తున్నకొద్దీ … అతను “పని చెయ్యనికాలం” ఎక్కువయేకొద్దీ రాగల అవకాశాలు మరీ తగ్గిపోతాయన్న వాస్తవం కళ్లముందు కదులుతూ గుండెల్ని పిండేస్తోంది. అంత మేధావి దినూకి ఆమాత్రం తెలీదా అన్న సంశయం కూడా కొరుక్కుతినేస్తోంది లోలోపల.
అలాటిరోజుల్లోనే, మైక్రోసాఫ్టు కంపెనీవాళ్లు పిలిచారు ఇంటర్వ్యూకి రమ్మని.
దినూ వెళ్లలేదు.
“అదేం?” అడిగింది ధరణి కళ్లు చికిలించి. మరొకరయితే ఎగిరి గెంతేద్దురు ఇంటర్వ్యూకే.
“ఆ మేనేజరు నాతో పదోక్లాసు చదివేడు. నా ఐక్యూలో సగం లేదు వాడికి. వాడికింద నేను పని చెయ్యడం ఏమిటి? అబ్సర్డ్,” అన్నాడు.
ఇంటర్వ్యూకే వెళ్లలేదు. వుద్యోగం వచ్చేసినట్టు మాటాడతాడేం అనిపించింది కానీ అడగలేదామాట. నాలుగువారాలు పోయేక, మరో కంపెనీవారు పిలిచారు. దానికీ వెళ్లలేదు. ఏం అంటే, తన క్లాస్మేటు అన్నగారు సి.యి.వో.ట అక్కడ. మరోసారి, ఆస్టిన్లో ఇంటర్వూకి వెళ్లేడు కానీ ఊరు బాగులేదన్నాడు.
అతని ధోరణి రాను రాను అయోమయం అయిపోతోంది. అసలు అతనికి ఉద్యోగం చేసే వుద్దేశం వుందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఉద్యోగం పురుషలక్షణం అని నానుడి. నిజానికి ఈరోజుల్లో పురుషులే కాదు స్త్రీలు కూడా నాలుగ్గోడలమధ్యా వూరికే గోళ్లు గిల్లుకుంటూ కూర్చోడం లేదు. ఒంటిమీద చొక్కాలాగ తలకాయల్ని గోడని కొక్కేలకి తగిలించేసి, బేఖతర్గా కూర్చోడంలేదు. అసలు అలా ఎవరు గానీ కూర్చోగలరని ధరణి ఊహించను కూడా లేదెప్పుడూ. తనకి సాధ్యం కావడంలేదు.
చూస్తూండగానే ఏడాది దాటింది. తనకి ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తోంది. అత్యవసరంగా. ఉద్యోగం అనండి, కాలక్షేపం అనండి ఏదో ఒకటి చెయ్యాలి. పైగా దినకర్కి కూడా మరో ప్రోజెక్టు కనుచూపుమేరలో లేకపోవడంతో, ఇద్దరూ మొహమొహాలు చూసుకుంటూ ఇంట్లో కూర్చోడం కాస్త చిరాగ్గానే వుంటోంది కూడాను. “ఇదెంత కాలం సాగుతుందో తెలీదు. ఇలా మరో నెల రోజులయిందంటే నాకు పిచ్చెక్కిపోవడం ఖాయం. ఏదో చూసుకోవాలి” అనుకుంది. ఆతరవాత, రెండో ప్రశ్న, దినకర్ ఒప్పుకుంటాడా? అన్నది.
ధరణి అనుకున్నట్టే, అతను మొదట, “ఎందుకంత తొందర? నాకు మంచి ప్రోజెక్టు వస్తుంది. చూస్తూండు. ఇప్పుడేం తిండికి జరక్కుండా పోలేదు కదా.” అన్నాడు.
“తిండికి జరగడంలేదని కాదు. నాకిలా ఊరికే కూర్చుంటే పిచ్చెత్తిపోయేలా వుంది. ఏమాత్రమో బుర్రుంది కదా దానికేదో పని ఒప్పచెప్పాలి. అందుకూ” అంది క్షమాపణలు చెప్పుకుంటున్నట్టు.
వాదనలు రెండు రౌండులయేక, సరే నీఇష్టం అన్నాడు అతను.
యమ్మెస్సీ చేసింది కనక పి.హెచ్.డీ చేద్దాం అనుకుంది మొదట. కానీ ముందు యమ్మెస్సీ కోర్సులు కొన్ని మళ్లీ చెయ్యాలన్నారు. దాంతో, అది వదిలేసి, ఉద్యోగాలు చూసుకోడం మొదలుపెట్టింది. తనవిద్యని సద్వియోగం చేసుకునే వుద్యోగాలు షికాగోలోనూ, మినియాపోలిస్లోనూ వచ్చేయి కానీ ఆవిడవెంట అతను వెళ్లడానికి సిద్ధంగా లేడు. తనకి న్యూయార్కులోనే కాకపోతే న్యూజెర్సీలో మరో వుద్యోగం వచ్చితీరుతుందని హామీ ఇచ్చేడు. అంచేత భర్తొకచోటా, భార్యొకచోటా వుండి, వారాంతాల్లో మాత్రం కలుసుకుంటూ చేసుకునే కాపురానికి ఇద్దరూ సిద్ధంగా లేరు. అలా మరో ఆర్నెల్లు గడిచేయి. వున్న వూళ్లోనే ఒక బాంకులో కస్టమర్ రెప్ అవకాశం వచ్చింది. గొప్ప సంతృప్తినిచ్చే వుద్యోగం అని కాదు. తన చదువుకి తగిన పని కాదు. ఆసక్తి అసలే లేదు. కానీ .. నాలుగ్గోడలమధ్య కులాసాజైలు జీవితం గడపలేక చేరిపోయింది, ఆ అమ్మాయి చురుకుదనమూ, తెలివితేటలూ గమనించి, మూడునెలలు తిరక్కుండా, బాంకువాళ్లు ఫుల్ టైం సూపర్వైజరుగా చేసేరు. ఆదాయం బాగుంది.
దినూ అభిప్రాయం మాత్రం ధరణి sold herself short అనే. తాను చచ్చినా అలా చెయ్యలేడు. అలా సరిపెట్టుకోడం అతని తత్త్వంలో లేదు. ధరణి బాంకులో చేరుతున్నానని చెప్పినప్పుడు చిరాకు పడ్డాడు. “నేనయితే చేరను అలాటి కొరగాని పనిలో” అన్నాడు. అతని దృష్టిలో అది పరమహీనం.
ధరణికి మనసంతా గందరగోళంగా వుంది. చిరాగ్గా వుంది. అస్తమానం ఐలవ్యూ అంటూ జపించే ఈమనిషికి తనబాధ ఎందుకు అర్థం కాదు? అసలు ప్రయత్నం కూడా చెయ్యకపోతే ఏం అనుకోడం? ఉన్నఉద్యోగాలే ఊడిపోతున్న ఈరోజుల్లో చేతులు ముడుచుకు ఇంట్లో కూర్చున్న ఈమనిషిని వెతుక్కుంటూ వచ్చి, ఉద్యోగాలిచ్చే కంపెనీలుంటాయా?
ఓరోజు ధరణి పేపరు చూస్తుంటే, ఓ ప్రకటన కనిపించింది. “ఇదుగో. ఇది చూసావా?” అంది పేపరు అతనికి అందిస్తూ, మామూలుగానే.
“ఏంకథ? నువ్వు నాకు ఉద్యోగాలు చూసేదాకా వచ్చింది వ్యవహారం. నేను అంత చేతకానివాణ్ణి అనా?” అన్నాడు దినూ ఉరిమి చూస్తూ.
ధరణి చిన్నబుచ్చుకుంది. “నువ్వు చూసుకోలేవన్నానా? ఏదో చూస్తుంటే కనిపించింది. చెప్పేను.”
“నేను చూడలేదని ఎందుకనుకున్నావు?”
“ఇప్పుడే కదా పేపరొచ్చింది. నేను ముందు తీసుకున్నాను కదా”
“అసలు నీమనసులో వున్నమాట చెప్పరాదూ? పనీ పాటూ లేకుండా కూర్చోడం నాకు సరదా అని నీ అభిప్రాయం. అవునా?”
“ఎందుకలా పెడర్థాలు తీస్తావు? నేనేం అన్నానిప్పుడు?”
“మరేమిటో చెప్పు నీబాధ? నేను ఎదురుగా కనిపిస్తుంటే నీకు కష్టంగా వుందా? చూస్తూ వుండు. నీకిప్పుడు ఇలా వుంది కానీ తరవాత నేను హైరాంక్ జాబ్ తీసుకుని, బిజీ బిజీ అయిపోయినప్పుడు, నేను ఇంట్లో కనిపించడమే లేదంటూ బాధ పడిపోతావు. అసలు ఎందరాడాళ్లు ‘మావారు ఇంట్లో వుండనే వుండరు’ అంటూ ఆరాటడిపోతున్నారో తెలుసా నీకు?”
“సరేలే. నాదే పొరపాటు. నేనింక మాటాడను.”
ధరణి లేచి పక్కగదిలోకి వెళ్లిపోయింది. మాటకి మాట తెగులు. తనే ఊరుకుంటే సరి అని ఎంత సర్ది చెప్పుకున్నా గానీ ఎదలో ముల్లయి కెలుకుతూనే వుంది. సంసారం అన్నతరవాత మంచీ, చెడ్డా వుంటాయి. “అరమరికలు లేకుండా” అంటే మనసిచ్చి మాటాడుకోడమే కదా. మరి ప్రతిమాటకీ పెడర్థాలు తీస్తూంటే ఎలా వేగడం? నన్ను అడుగుతాడు కదా నీకేం కావాలి? అని. మరి నాకు మాత్రం అలా వుండదా? అతనికేం కావాలన్న తపనా, అవి తీరడానికి తనకి చేతనయిన సాయం చెయ్యాలన్న కోరికా? అందులో తప్పేమిటి?
ఆలోచనలయితే సవ్యంగానే వున్నాయి కానీ అవి అతనికి ఎలా బట్వాడా చెయ్యాలో తెలీడం లేదు ఆ అమ్మాయికి. అమెరికాలో talk, talk, అంటారు కానీ చెప్పేవారికి చెప్పాలని వుంటే చాలదు. ఎదటివారికి విందాం అన్న దృష్టి కూడా వుంటేనే ఆ “టాకు” సాగేది. అది దినూ తత్త్వంలో లేదు.
దినూ ఓ గంట తరవాత శాంతించేడు. “పాపం, ఒఠ్ఠి అమాయకురాలు, అమ్మాయికి లోకజ్ఞానం అస్సలు లేదు,” అనుకుంటూ గదిలోకి వచ్చి “సారీ” చెప్పాడు. “నీకే నా సామర్థ్యంలో నమ్మకం లేకపోతే ఎలా చెప్పు?” అన్నాడు తన బాధనంతా గొంతులో పలికిస్తూ.
“నాకు నమ్మకం లేదన్నానా?” అంది ధరణి నెమ్మదిగా.
“అసలు నాపేరే దినకర్. అంటే ఏమిటనుకున్నావు? లోకాన్ని తన దివ్యప్రభలతో చైతన్యవంతం చేసేవాడు. నా తెలివితేటలూ, సామర్థ్యమూ గుర్తించినవాళ్లు, వాటి విలువ తెలుసుకున్నవాళ్లు – వాళ్లే నన్ను వెతుక్కుంటూ వస్తారు, చూస్తూ వుండు. అప్పుడు నువ్వే విచారిస్తావు, అనవసరంగా అబ్బాయిగారిని ఎంత బాధ పెట్టేనూ నా అజ్ఞానం మూలంగా అని.” అన్నాడు నవ్వుతూ.
ధరణికి అందులో హాస్యం కనిపించలేదు. పైకి హాస్యానికి అంటున్నట్టున్నా, అతడు ఆ మాటలు మనసా నమ్మి చెబుతున్నట్టే వినిపించాయి ఆ అమ్మాయికి.
మళ్లీ దినూయే అన్నాడు, “లేదులే. నువ్వు సదుద్దేశ్యంతోనే చెప్పావని నాక్కూడా తెలుసు. నేనలా విసుక్కోడం పొరపాటే. మళ్లీ ఎప్పుడూ అననులే” అన్నాడు మృదువుగా. ఆ సాయంత్రం “వంట చెయ్యకు. బయట తిందాం” అన్నాడు ఓదార్పుగా. “లే, బట్టలు మార్చుకు రా. హిల్టన్లో రిజర్వేషను చేయిస్తాను”. ఆపూట భార్యకి హైక్లాసు హోటల్లో ఖరీదయిన భోజనం పెట్టించాలని మహ సరదా పడింది అతడి మనసు.
ధరణి లోపలికెళ్లి తనకి ఎంతో ఇష్టమయిన డ్రెస్ వేసుకుంది – పాలనురుగలాటి తెల్లటి బ్లౌజుమీద నీలినీడల్లా లేతనీలిరంగు పూలు, దానికి తగిన లేతనీలిరంగు పాంటు. తనకి ఆ రంగులు ప్రశాంతంగా ఉంటాయి. మనసు ఉల్లాసంగా వుంటుంది.
అందంగా అలంకరించుకుని వచ్చిన భార్యని రెండు క్షణాలు తేరి చూసి, దినూ “నైస్” అన్నాడు. ఆ అనడం నైసుగా లేదు. ఏదో మొక్కుబడికి అన్నట్టు వుంది.
“ఏం బాగులేదా?” అంది ధరణి అతనివేపు చూడకుండా.
“కెంపురంగు డ్రెస్లో నువ్వెంతో అందంగా వుంటావు. అది వేసుకోరాదూ?”
ధరణికి కెంపురంగు ఇష్టంలేదు. … “మొన్న ప్రకాష్ వాళ్లింటికి వెళ్లినప్పుడు వేసుకున్నాను కదా. అసలీమధ్య ఎక్కడికి వెళ్లినా అదే వేసుకుంటున్నాను అని ఇవాళ ఇది వేసుకున్నాను. సరేలే, మార్చుకొస్తాను. ఏదయితేనేమిటి?” అంది ధరణి లోపలికి వెళ్తూ.
అంతరాంతరాల ఎక్కడో అదే మాట – “ఏదయితేనేమిటి? మార్చుకోనక్కర్లేదులే” అని అతనంటే బాగుండును అనిపించింది. … అంత సరదా వుంటే మరో డ్రెస్సు తనకిష్టమయిన రంగుడ్రెస్సు కొనివ్వొచ్చు కదా! ఆమాటే ఒకసారి అతనితో అంది కూడాను.
“ఏం, నా ఎంపిక బాగులేదా?” అన్నాడతను. అందం విషయంలో తనకి తెలిసినంతగా మరెవరికీ తెలియదని అతని అభిప్రాయం. ఆ కెంపురంగు డ్రెస్ నెలరోజుల క్రితం, ఇలాటి తగువే వచ్చినప్పుడు “సర్ప్రైజు” బహుమతిగా కొన్నాడు. ఈ నెల రోజుల్లోనూ చాలాసార్లే వేసుకుంది అది. ఇదే సంభాషణ చాలాసార్లే అయింది ఇద్దరిమధ్యా.
ధరణి లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని, దానికి నప్పిన జోళ్లేసుకుని, చేతిసంచీ పుచ్చుకు బయల్దేరింది.
“చూడు ఈ డ్రెస్లో ఎంత అందంగా వున్నావో. రెస్టారెంటులో జనాలు భోజనాలు మానేస్తారు నిన్ను చూస్తూ.”
“సరేలే. మాటలు నేర్చావు.”
మర్నాడు కూడా బోల్డుసార్లు ‘సారీ’లు చెబుతూనే వున్నాడు. ఆ సాయంత్రం “ఇవాళ వంట నేను చేస్తాను. వంకాయ వేపుడు నీకు ఇష్టం కదా, చేస్తాను.”
“నీకూ ఇష్టమే కదా. నేనే చేస్తాలే, మెంతికారం పెట్టి” అంది ధరణి లేస్తూ.
“రెండు రకాలుగానూ చేసుకుందాం,” అన్నాడు దినూ హుషారుగా.
వంకాయ వేపుడూ, మెంతికారం పెట్టీ – కూర రెండురకాలుగానూ చెయ్యొచ్చు. రెండు డ్రెస్సులు ఒక్కసారే వేసుకోగలిగితే ఎంత బాగుండు అనుకుంది ధరణి మనసులో.
ఆమె వంట పూర్తి చేసి, అధికంగా, అతనికి ఇష్టం అని కేరట్ హల్వా కూడా చేసి, బల్లమీద వంటకాలూ, కంచాలూ పెట్టి “రా, భోంచేద్దాం” అని పిలిచింది.
“కూర ఎంతో బాగా కుదిరింది.” అని మెచ్చుకున్నాడు. “నీకు కోపం వచ్చినప్పుడు మరీ బాగుంటాయి సుమా నీ వంటలు” అంటూ మేలమాడేడు.
అతనిమాటలకి ఆమె పొంగిపోయింది. ఆమె వంటలకి అతను ఆనందించాడు. వాన వెలిసింది.
***
ధరణి గుండెలు కూడదీసుకుని ఓరోజు అంది, “నీకు ఎవరికిందా పని చెయ్యడం ఇష్టంలేదు. నీ అర్హతలకి తగిన ఉద్యోగం చూపించే కంపెనీలు లేవు. వాళ్లెవరో నీ తెలివితేటలు గుర్తించడం లేదని విచారించడం ఎందుకు? నువ్వే ఓ కంపెనీ పెట్టి, ముల్లోకాలకీ నీ సామర్థ్యం వెల్లడి చేసేయొచ్చు కదా. అప్పుడయితే నువ్వు ఎవరికీ జవాబు చెప్పుకోనక్కర్లేదు సరికదా మరో నలుగురికి నువ్వే పని చూపించినవాడివి అవుతావు,” అంది.
దినూ ఠక్కున తలెత్తేడు కోడెతాచులా. తను చేతకానివాడని ఎత్తిపొడుస్తోందా? ఇంతలు కళ్లు చేసుకుని ఆమెవైపు చూశాడు. తన భార్య తనని హేళన చేస్తున్నట్టు అనిపిస్తోంది. అతనికి ఒళ్లు భగ్గున మండింది.
“షటప్” అని అరిచాడు.
ధరణి వణికిపోయింది లేమావి చివురులా. గుండెలు దడగడ కొట్టుకున్నాయి. అతనిలో అంత ఔద్ధత్యం ఏనాడూ చూడలేదు. అతనికి ఇంత కోపం వుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆమాటకొస్తే అసలు తన జీవితంలోనే ఎరగదు అలాటి కోపం. అమ్మా, నాన్నా తనని ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు పుట్టి, బుద్ధెరిగి. కసురుకోడందాకా ఎందుకు, గట్టిగా మాట కూడా అన్నవాళ్లు లేరు. నాన్నకి తనంటే ప్రాణం. ఆయనని తను ఎంతో విసిగించినప్పుడు కూడా “ఇంత పట్టుదల అయితే ఎలా అమ్మా?” అంటూ ఎంతో నెమ్మదిగా చెప్పేవారు. సాటిపిల్లలు “మానాన్న చీరేస్తాడు, మాఅమ్మ కొడుతుంది,” అని చెప్పినప్పుడు తనకి ఆశ్చర్యంగా వుండేది. స్కూల్లో టీచర్లందరికీ తనంటే ఎంతో ఇష్టం తను చాలా తెలివైనదీ, బుద్ధిమంతురాలూనని.
ధరణి అతనివేపు కళ్లప్పగించి చూడసాగింది. కాళ్లలో రక్తం గుండెలకి ఎగదన్నింది.
దినూ భార్యకి దగ్గరగా వచ్చి, మొహంలో మొహం పెట్టి, “నాకు నీసలహాలు అక్కర్లేదు, అర్థమయిందా? మళ్లీ ఎప్పుడూ నాతో అలా చెప్పకు, నెవర్, నెవర్,” అన్నాడు కరుగ్గా.
అతను అలా మీదమీదకి వచ్చేసి మాటలంటుంటే భూమండలం గిరగిరా తిరిగింది కళ్లముందు. గబుక్కున లేచి పక్కగదిలోకి వెళ్లిపోయింది.
దినూ చేతిలో కాఫీకప్పు విసురుగా బల్లమీద పడేసి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీధిలోకి వెళ్లిపోయాడు. కాఫీ ఒలికి కాగితాలు తడిసిపోయేయి. కాఫీ కార్పెట్మీద పడి మరకలయేయి.
దినూ ఎక్కడెక్కడో తిరిగి, అర్థరాత్రి దాటింతరవాత ఇల్లు చేరేడు. అప్పటికి కాస్త మనసు స్థిమితపడింది. గంటన్నరసేపు “సారీ, పొరపాటయిపోయింది, సారీ, ఠెరిబ్లీ సారీ” అంటూ వదలకుండా విచారం వెలిబుచ్చాడు మళ్లీ. అసలు తనకంత కోపం వుందని ఇంతవరకూ తనకే తెలీలేదన్నాడు. “మళ్లీ జన్మలో ఎప్పుడూ ఇలా జరగదు, జరగనివ్వను” అన్నాడు.
ధరణి “సరే” అంది ముభావంగా.
***
ఆఫీసులో పరధ్యానంగా వున్న ధరణిని చూసి, “ఏం, అలా వున్నావు?” అనడిగింది స్టెల్లా.
స్టెల్లా ఈమధ్యనే కొత్తగా చేరింది ఆఫీసులో. తనకి తెలీని విషయాలు ధరణిని అడిగి తెలుసుకుంటోంది. ఆవిడకి ఈ తెలుగుఅమ్మాయి అంటే మంచి గురి ఏర్పడిపోయింది అచిరకాలంలోనే. భారతీయ సంస్కృతి మహోన్నతమయినదని ఆవిడ వింది. అప్పుడప్పుడు మన సాంప్రదాయాలగురించి అడుగుతూ వుంటుంది తనని.
“ఏం, అలా వున్నావు?”
ధరణికి ఆమాట చల్లగా, సూటిగా మనసుకి తగిలింది. స్టెల్లా ఎంతో ఆత్మీయురాల్లా కనిపించింది. అమ్మా, నాన్నా, అన్నా, చెల్లీ, ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్న నేస్తులూ – అందరూ వున్నారు కానీ వాళ్లున్నది భూగోళానికి ఆవలితీరంలో. ఇక్కడ … ఇప్పుడు …, ఈక్షణంలో “అలావున్నావేం? ఏమయింది?” అని అడిగేవాళ్లు లేరు. అలా అడగగల ఒకే ఒక మనిషికి ఆ ధ్యాస లేదు.
ధరణి మనసు కిటకిటలాడింది. తలొంచుకుని “ఏం లేదు. బాగానే వున్నాను” అంది నెమ్మదిగా.
“లంచి టయిమవుతోంది. Early lunch తీసుకుందాం, వస్తావా?” అని అడిగింది స్టెల్లా.
ధరణి నెమ్మదిగా తలూపి, లంచిబాక్సు తీసుకుని లేచింది. ఇద్దరూ కాఫీరూంలో ఓమూల కూర్చున్నారు. ఇంకా లంచిటైం కాలేదు కనక ఎవరూ లేరు ఆ చుట్టుపట్ల.
ధరణి ముందురోజు సాయంత్రం జరిగిన తగువు నాలుగుముక్కల్లో చెప్పి, “నాకేం చెయ్యాలో తోచడంలేదు. మంచి పరువంలో వున్న కుర్రాడు, ఎన్నదగ్గ చదువూ, అర్హతలూ వున్న మనిషి, నిశ్చింతగా నెలలతరబడి ఇంట్లో ఎలా కూర్చోగలుగుతున్నాడో, అతనితత్త్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు.” అంది ధరణి తనలో తను మాటాడుకుంటున్నట్టు.
“మీదేశంలో అలా పెద్దచదువులు చదువుకున్నవాళ్లు ఏం చెయ్యకుండా ఇంట్లో కూర్చోడం చేతకానితనం అనుకోరా? తప్పుగా భావించరా? అందులోనూ మగాళ్లు?”
“అదేం లేదు. రెండుతరాల పూర్వం మీకూ అంతే కదా. మాక్కూడా మగాళ్లు breadwinners, ఆడవాళ్లు homemakers అనే సాంప్రదాయం. ఇప్పుడిప్పుడే మారుతోంది. మా అమ్మమ్మ అయితే ‘ఉద్యోగం పురుషలక్షణం అనీ, ఆడదానిసంపాదన కూచుని తింటావుట్రా’ అనీ దులిపేసి వుండేది వెనకటిరోజులయితే. మాఅమ్మ కాలం వచ్చేసరికి కొంత మారింది. మాఅమ్మ ఉద్యోగం చేస్తున్నా, ఇంటిబాధ్యతలన్నీ ఆవిడవే. ఇప్పుడు మగవాళ్లు కూడా ఇంటిపనుల్లో ఓ చెయ్యేస్తున్నారు. అయితే మీలాగ ఇంకా వేరు వేరు ఎకౌంట్లు లేవు. కనీసం ఇప్పటికి లేదు, నీడబ్బూ, నాడబ్బూ అని.” అంది ధరణి. ఇలా మాటాడుతుంటే తనకే కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి అనుకుంది ఆశ్చర్యపోతూ!
“ఇక్కడ మగాళ్లు ఇంట్లో వున్నా ఏదో ఓ పని చూసుకుంటారు కానీ వూరికే కూర్చోరు, ఏది కానీ తమకి తాము సమకూర్చుకోవాలి కానీ వాటంతట అవే సమకూడుతాయనో, ఎవరో చేసి పెడతారనో ఎదురుచూస్తూ కూర్చోరు. ఈమధ్య stay at home dads సంఖ్య పెరుగుతోంది. అదీ పిల్లలుంటేనూ, భార్యలకే మంచి వుద్యోగాలు అయితేనూ అలా చేస్తున్నారు. అప్పుడు కూడా వూరికే కూర్చోరు. తమ తెలివితేటలు ఉపయోగించుకోగల పని ఏదోఒకటి చూసుకుంటారు సాధారణంగా,” అంది స్టెల్లా రెండుతరాల పూర్వంమాట తప్పించేసి.
ధరణి కొంచెంసేపు ఊరుకుని, నెమ్మదిగా ఎటో చూస్తూ, “నేను క్షమాపణలు చెప్పుకున్నాను,” అంది.
“అతను ఏమన్నాడు?”
ధరణి అడ్డంగా తలూపింది ఏమీ లేదు అన్నట్టు. “మళ్లీ తరుచూ చెప్తాడు నేనంటే చాలా లవ్వుందని.”
“మాటంటే ఏం లాభం? క్రియలో కూడా కనిపించాలి కదా. మీద వాన పడితే కింద నేల తడి కాదా?” అని ఓ క్షణం ఆగి “నేనయితే కౌన్సిలింగుకి వెళ్దాం రమ్మంటాను” అంది స్టెల్లా.
“అది కుదిరేది కాదు. తనకంటే మేధావి లేడు అనుకునేవాడికి మరొకరిని సలహా అడగడానికి కూడా నామోషీయే కదా. అహం అడ్డొస్తుంది.”
“క్రమంగా అతనికే తెలుస్తుందిలే” అంది స్టెల్లా ఓదార్పుగా.
ధరణి తలూపింది. ఇద్దరూ లేచారు.
ఆ సాయంత్రం పని అయింతరవాత ఇంటికి బయల్దేరింది. కానీ వెళ్లాలంటే వుత్సాహంగా లేదు. దారిలో వున్నపెద్ద లేక్ పక్కనించి కారు పోతుంటే కాస్సేపు ఆగుదాం అనిపించింది. నెమ్మదిగా కారు రోడ్డువారకి తీసి, దిగి, నీళ్లకి కొంచెం ఎడంగా కూర్చుంది. దూరాన నీళ్లలో తెరచాపలెత్తి పడవల్లో షికార్లు కొడుతున్నారు కొందరు. అట్టే లోతు లేనిచోట పిల్లలు ఈతలాడుతుంటే, తల్లులూ, తండ్రులూ నిలబడి, వాళ్లమీద ఓ కన్నేసి, కబుర్లు చెప్పుకుంటున్నారు.
ధరణి ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతోంది. నిన్నరాత్రి దినూ పడుకోబోతూ, “ఇదంతా ఎవరికోసం? నీకోసం కాదూ?” అన్నాడు. నాకోసమేనా? జీవితంలో నేను కోరుకుంటున్నది ఏమిటి? నిఝం నిఝంగా?
అమెరికాకి రాకుండా, దేశంలోనే వుండివుంటే, ఏమయేది? ఈసరికి ఏకాలేజీలోనో రీడరయివుండును. ఈ బొచ్చెలు కడుక్కోడం, బట్టలుతుక్కోడం లేకుండును. అవే తనకి కావలసినవి అని అనుకుందా ఎప్పుడయినా? రీడరయితే, అధికంగా ఏం వొచ్చును? సంఘంలో పేరూ, డబ్బుతో వచ్చే సౌఖ్యాలూ వచ్చును, … తరవాత? ఏమో. ఇక్కడ మాత్రం తను పొడిచేస్తున్నది ఏమిటి? బాంకులో చేరింది. తను చదివిన బయాలజీకి ఏసంబంధం లేకపోయినా, మాస్టర్సు డిగ్రీ చూసి, తనకి ఆస్థాయి మెదడు వుందని ఇచ్చేరు.
ధరణి బాంకులో చేరినకొత్తలో లంచిరూంలో నలుగురు చేరేరు. ధరణి కూడా అక్కడే వుంది. మాటలసందర్భంలో “మీవారు ఏంచేస్తున్నారు?” అని ఎవరో అడిగేరు.
“ఏంలేదు” అంది తేలిగ్గా.
“హా?”
ఆ మనిషిమొహం చూసి, వెంటనే అర్జెంటుగా వివరించవలసిన అవుసరం వున్నట్టు గుర్తించి, “అంటే ప్రస్తుతం ఏంలేదు అంటున్నాను. అతను ఇంజినీరు. చాలా మంచి ప్రోజెక్టులలో పనిచేశాడు. మరో మంచి ప్రోజెక్టుకోసం చూస్తున్నాడు ఇప్పుడు.” అంది గబగబా. మనహాస్యాలు వీళ్లకి అర్థం కావు అని ధరణికి అర్థమయింది అప్పుడే.
“ఓ అలాగా” అంది ఆవిడ.
“Who’s wearing the pants?” అంది మరొకావిడ. ధరణికి అది అర్థం కావడానికి రెండు క్షణాలు పట్టింది. కోపం వచ్చి, అక్కడినుండి వెళ్లిపోయింది. ఆతరవాత “లైటెన్ చెయ్యడానికి, వూరికే అలా అన్నాన”ని అంది ఆవిడ కానీ ధరణికి మాత్రం ఆమాట మర్చిపోడం సాధ్యం కాలేదు.
తరవాత వాళ్లలో వాళ్లు మాటాడుకుంటున్నా, తనని ఉద్దేశించి మాటాడుతుట్టే అనిపిస్తోంది.
“టామ్ ఇలాగే ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో కూర్చుంటే తగిలేశాను. అలాటి మగాడు వుంటే ఎంత, లేకపోతే ఎంత.”
“మావారు ఇలాగే పిచ్చికారణాలు చెప్తూ ఇంట్లో కూర్చుంటే, ఇంటిపని పూర్తిగా ఒప్పజెప్పేశాను. ఇప్పుడు నేనే నిజభర్తని. నన్ను కార్లో ఆఫీసుకి తీసుకురావడం, మళ్లీ ఇంటికి తీసుకెళ్లడంతో సహా.”
“పెళ్లి చేసుకున్నది ఆయన్ని నేను సాకడానికా? అంతకంటె ఓ కుక్కపిల్లని పెంచుకోడం నయం.”
“ఏదో లోపం వుండి వుండాలి, లేకపోతే ఇంతకాలం ఉద్యోగం దొరక్కపోవడమేమిటి? Personality సమస్యేమో.”
“సోషల్ స్కిల్స్ తక్కువో, ఫెయిలవుతానన్న భయమో.”
“నిజంగా అంత తెలివితేటలుంటే ఈపాటికి ఏదో ఓ వుద్యోగం రాకపోనా?”
“ఈదేశంలో ఎవరూ మనని వెతుక్కుంటూ వచ్చి టాప్ రాంక్ ఉద్యోగం వెండికంచంలో తెచ్చి అందించరు, ముందు తన అర్హతలకి తగినఉద్యోగం చేస్తూ నిరూపించుకోవాలి సామర్థ్యం. ఒకస్థాయి ఉద్యోగానికి తగినవాడని ముందు నిరూపిస్తే తరవాత అంతకంటే మంచి అవకాశాలు వస్తే రావచ్చు.”
“ఏమో, ఇండియాలో చెల్లుతుందేమో అనీ అమెరికాలో అయితే దాన్ని అసమర్థత అనే అంటారు.”
ఈమాటలు వినడం ధరణికి కష్టంగా వుంది.
రాను రాను చిరాకు ఎక్కువవుతోంది. నిజమే మరి, బాగా చదువుకున్నవాడూ, మంచి తెలివితేటలున్నవాడూ తెల్లారి లేస్తూనే హడావుడిగా ఆఫీసుకి టైమయిపోతూందని పరిగెట్టాలి, పదిమందిలో దర్జాగా “ఇవాళ మా ఆఫీసులో ఏం జరిగిందో తెలుసా” అంటూ కథలు చెప్పాలి గానీ, తీరిగ్గా ఎనిమిది గంటలకి లేచి … …. ఏ భార్యకి మాత్రం ఆ దినచర్య ఆనందదాయకం? తనఎదటా, వెనకా కూడా ఆఫీసులో అందరూ ఏమనుకుంటున్నారో తనకి తెలుస్తునే వుంది.
అతనికి మాత్రం తెలీదా అమెరికాలో ఎలాటి అర్థాలు తీస్తారో?
***
అదే సమయంలో ఇంటిదగ్గర ఆఫీసురూంగా అమర్చిన రెండో పడగ్గదిలో కంప్యూటరుముందు కూర్చుని ఆలోచనల్లో పడిపోయాడు దినూ. అతనికి ధరణి ఇంకా ఇంటికి రాలేదన్నమాట తోచలేదు. ఆవిడ తనని ఎందుకు అర్థం చేసుకోలేకపోతోందో అంతుబట్టక గింజుకుంటున్నాడతను.
తనకి మాత్రం తెలీదూ అత్తింటివారు ‘పెళ్లాన్ని పోషించుకోలేని అసమర్థుడనీ, ఆడదానిసంపాదన తింటున్నాడని అంటున్నార’ని. నిజానికి తాను ‘ఉద్యోగం చెయ్యను’ అనలేదు. తనకి తగిన ఉద్యోగంకోసం చూస్తున్నాడంతే. అలా చూడ్డం తప్పా? తనరంగంలో తాను రాణిస్తే ఆవిడకి మాత్రం గొప్ప కాదూ? తను నిదానిస్తే, కాస్త ఓపిక పడితే, తన జ్ఞానసంపదకి తగిన అవకాశం వస్తే, మంచి ఆదాయం వుంటుంది. ఎవరికోసం? ఆవిడకీ, పుట్టబోయే పిల్లలకే కదా! ఏదో ఒకటి అని మామూలు ఉద్యోగంలో చేరిపోతే, తన మేధాసంపత్తి అంతా నిరుపయోగం అయిపోదూ? ఏ పనికిమాలినపనికో తలపడితే, తన ఆధిక్యత ఎలా ఋజువవుతుంది? ఉద్యోగం వుంటే చాలనుకుని కొరగానిపనికి సిద్ధపడితే తరవాత పుట్టగతులుంటాయా? అందులోనూ ఈదేశంలో ఇలాటి విషయాల్లో పట్టింపులు మరీ ఎక్కువ. ఎక్కళ్లేని అర్థాలూ తీస్తారు మనం చేసే ప్రతి పనికీను.
“నువ్వు నిజంగా అంత మేధావివి అయితే ఈ పనికెందుకు ఒప్పుకున్నావూ?” అంటారు.
“నీకు తగనిపని ఇంతకాలం ఎలా చేస్తున్నావు?” అంటారు.
“నీకు నిజంగా సామర్థ్యం వుంటే, ఆకంపెనీలోనే ఈపాటికి నీకు డైరెక్టరుపదవి రాకపోనా?” అంటారు.
ఇవన్నీ ధరణికి తెలీవు. అసలు తెలుసుకోడానికేనా ప్రయత్నించదు. తన సామర్థ్యానికీ, మేధాసంపత్తికీ తగిన, తన అసమాన ఐక్యూని ఋజువు చేసుకోగల అవకాశం వస్తే తాను వెంటనే అందిపుచ్చేసుకోడా? తనభర్తకి నోబెల్ బహుమానం అందుకోగల మేధ గలదని తన స్నేహితులతో సగర్వంగా చెప్పుకుతిరిగేరోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు తను ఆవిడతో చెప్పడా, ‘భామామణీ, చూసేవా, ఇదంతా నీకోసం’ అనీ. తనముందు ఒప్పుకోకపోవచ్చు కానీ ఆవిడకి మాత్రం మనసులో లేదూ? ‘ఫలానా బహుమతులు గెల్చుకున్న మేధావి, కీర్తిప్రతిష్ఠలు గడించుకున్న మహాపురుషుడు నానాథుడు,” అంటూ తన స్నేహితులతోనూ, పుట్టింటివారితోనూ గర్వంగా చెప్పుకోవాలని?
ఇదే ఇండియాలో అయితే ఏమో కానీ అమెరికాలో ఎవరిష్టం వారిదే కదా. నాకు ఉద్యోగంలేదని నన్ను ఎవరూ చిన్నచూపు చూడరు అనుకుంటూ తన్ని తాను సమర్థించుకున్నాడు అతను.
***
ఏడు దాటింది ధరణి ఇంటికి వచ్చేసరికి, “కాఫీ తాగేవా?” అనడిగింది చెప్పులు గుమ్మందగ్గర వదిలి, వంటింటివేపు నడుస్తూ.
దినూ లివింగ్రూంలో కూర్చుని ఏదో చదువుతున్నాడు. “లేదు”.
ధరణి లోపలికి వెళ్లి కాఫీ పెట్టి, రెండుకప్పుల్లో తెచ్చింది, తనకో కప్పూ, అతనికో కప్పూ. “నేను రావడం ఆలస్యం అవుతుందని ఫోను చేసేను కదా. నువ్వు తాగేయవలసింది.”
“నువ్వొచ్చేక ఇద్దరం కలిసే తాగొచ్చని.” కప్పు అందుకుంటూ అన్నాడు, కళ్లు పుస్తకంమీంచి మరల్చకుండా.
ధరణి కాఫీ కప్పు పుచ్చుకు అతనికి ఎదురుగా కూర్చుంది. స్టెల్లా మాటలు మనసులో మెదలుతున్నాయి. అందులో వాస్తవం అర్థమవుతోంది. తను ఏదో చెయ్యాలి. మాటలు కాదు క్రియలో కనిపించాలి. మీద వాన పడితే కింద తడి కనిపించాలి. “ఇదంతా నీకోసమే!” అంటాడు అతను. అలా అంటే చాలదు. క్రియలో కనిపించాలి.
“ఉద్యోగాలేమయినా చూశావా?”
దినూ ఆశ్యర్యంగా తలెత్తి చూశాడు. “చెప్పేనుకదా అదే వస్తుందని. ఇప్పుడేమయింది?”
ముందులాగే కొంచెంసేపు వాదనలయేయి. “ఎవరికోసం నేను గొప్పఉద్యోగంకోసం చూస్తున్నాను? నీకోసమే కదా. నీభర్త అంత గొప్ప ఉద్యోగస్థుడని నువ్వు గర్వపడాలని. నీకోసం కాదూ ఇదంతా.”
ముందులాగ ఈసారి వూరుకోలేదు ధరణి. “నాకోసంలా లేదు. నాకలా అనిపించడంలేదు. నువ్వు ఇలా పనీ పాటూ లేకుండా కూచోడం, నీకోసమే, నూటికి నూరు పాళ్లూ నీకోసమే, అర్థంలేని ‘ఈగో’తో ఇలా ప్రవర్తిస్తున్నావు. ఎవరో వచ్చి నీకు వెండిపళ్లెంలో ఉద్యోగం తెచ్చి చందనతాంబూలాలతో సమర్పిస్తారన్నది stupid excuse. చేతనయినవాళ్లెవరూ ఎవరో వచ్చి నాకు ఉద్యోగం ఇస్తారని ఎదురు చూస్తూ కూర్చోరు. అమెరికనులెవరూ అలా చెయ్యరు. నిజంగా నాకోసమే అయితే క్రియలో చేసి చూపించు. లేచి ఉద్యోగం చూసుకోగలను అని నిరూపించు,” అని, ఒక్కక్షణం ఆగి, మళ్లీ అంది, “ఈనెలాఖరున నేను స్టెల్లాతో carabbean cruise వెళ్తున్నాను.”
“ఆవిడతో ఎందుకూ? మనిద్దరం వెళ్దాం. Second honeymoon,” అన్నాడు దినూ మాట మార్చడానికి సందు దొరికినందుకు ఆనందపడిపోతూ.
“లేదు. నేను స్టెల్లాతో వెళ్తాను. నేను తిరిగొచ్చేవేళకి నువ్వు వుద్యోగం చూసుకోవాలి.” అంది ధృఢంగా.
“లేకపోతే?”
“Guess” ధరణి హుందాగా లేచి వంటింటివేపు నడిచింది.
దినకర్ అప్రతిభుడయి కూర్చుండిపోయేడు. ధరణి అలా మాటాడగలదని అతను కలలోకూడా అనుకోలేదు. హుమ్. అమెరికా నీళ్లా? అన్న సందేహం తలెత్తింది అతనిమనసులో!
(22 ఏప్రిల్ 2009)
***

గత ముఫ్పైమూడేళ్లగా అమెరికాలో నివసిస్తున్న నిడదవోలు మాలతి తెలుగు కథలను ఆంగ్లపాఠకులకి పరిచయం చేయడానికి తూలిక.నెట్ 2001లో ప్రారంభించారు. ఈమధ్య Telugu Women Writers, 1950-1975, A Unique Phenomenon in the History of Telugu Fiction, అనే పరిశీలనాత్మక గ్రంథాన్ని ప్రచురించారు. వారి ఇతర సంకలనాలు A Spectrum of My People, From My Front Porch (సాహిత్య ఎకాడమీ ప్రచురణ). తెలుగు తూలిక అనే బ్లాగు రాస్తూంటారు.