తామస విరోధి -ఏడవభాగం (తర్ ‘ కవిత ‘ర్కాలు)

స్వాతి:
నా సందేహాలు కొన్ని..
*నామకరణం:
*ఒక కవిత రాశేశాక దానికి పేరు పెట్టే విషయం లో సమస్య వస్తుంది. అసలు శీర్షిక ఎలా ఉండాలి? కవితలోని సారం పేరు చూడగానే అర్ధమవ్వాలా లేదా ఆ శీర్షిక తో కలిపి చూస్తేనే కవిత పూర్తయినట్టు అనిపించాలా? అసలు శీర్షిక ఉండకపోతే నష్టమా.
*సమకాలీన అంశాలు:*
సమకాలీన అంశాలపై రాసే కవితలు కొన్ని ఉంటాయి. వార్తా పత్రిక లో సంఘటనల హెడింగ్ లు చదివినట్టు ఉంటుంది. సంఘటనలని సూటిగా రిఫర్ చేస్తూ కవిత రాయటం ఎంతవరకూ బావుంటుంది. అసలలాంటి అంశాలను కవితా ప్రక్రియ లో చూపదలచుకుంటే యెలా రాయాలి.

త.య.భూషణ్:

స్వాతి కుమారి గారు చక్కని ప్రశ్నలే వేశారు. ప్రశ్నను బట్టే సమాధానం !!

*నామకరణం:
కవిత్వం రాయడం హృదయానికి సంబంధించిన విషయం. కానీ, కవితకు పేరు పెట్టడం బుద్ధికి సంబంధించినది. కాబట్టి, చక్కని కవితకు తలతిక్క పేరు, తలతిక్క కవిత్వానికి చక్కని పేరు (ఉదా: విశ్వంభర) సంభవమే. కవిత్వానికి / కావ్యానికి యుక్తమైన పేరు పెట్టడం ప్రాచీన సంప్రదాయం. కొన్ని కావ్యాలకు ఒకటి కన్నా ఎక్కువ పేర్లు ఉండటం మన ఎరుక లోనిదే ( విష్ణుచిత్తీయం / ఆముక్తమాల్యద (ఎంత చక్కని పేరు!))
భావకవిత్వం రోజుల్లో కవిత్వానికి సంబంధంలేని తలతిక్క పేర్లు పెట్టి కొందరు భావకవులు అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులచే అక్షింతలు వేయించుకున్నారు. ఆధునిక కవుల్లో చాలా మంది తమ తమ కవిత్వాలకు తగిన పేర్లే ఎన్నుకున్నారు. తిలక్ -అమృతం కురిసిన రాత్రి, బైరాగి -నూతిలో గొంతుకలు, శ్రీ శ్రీ -మహాప్రస్థానం, అజంతా -స్వప్నలిపి, ఇస్మాయిల్-రాత్రి వచ్చిన రహస్యపు వాన; పేరు పెట్టడం అంత బ్రహ్మ విద్యేమి కాదు, అది, పాఠకునికి కవితాత్మను పట్టివ్వాలి; అలా కాని పక్షంలో కవితకు పేరున్నా ఒకటే /లేకపోయినా ఒకటే.

*సమకాలీన అంశాలు:*
వార్తలకోసం ఎవరూ కవిత్వాన్ని చదవరు. ఆత్మప్రత్యయం లేనివారు కవిత్వం రాయడానికి అనర్హులు.
ఎందుకంటే, ఆత్మ ప్రత్యయం వల్లే, అనుభవ బలం సిద్ధిస్తోంది; అదే అసలైన కవిత్వానికి జీవగఱ్ఱ; ఎక్కువ భాగం, సమకాలీన అంశాల మీద కవిత్వాలు వెలిగించే వారిలో అనుభవ శూన్యత, ఆత్మ ప్రత్యయం లేక పోవడం గమనించవచ్చు. కాబట్టే, తెలుగు కవుల్లో అత్యధికుల కవితలకు మూలాలు వార్తా పత్రికల పతాక శీర్షికల్లో కనిపిస్తాయి. ఒక్కొక్క సారి, కవిత్వానికి వార్తలకు మధ్య తేడా లేకుండా పోతుంది. చావుకు కాచుకున్న రాబందుల్లా కవులు రక్తం అంటిన వార్తలను కవితలుగా చుట్టబెట్టడం, ఇంకు తడి ఆరక ముందే పాఠకులు వాటిని చదివి మరచిపోవడం మనభాషలో జరుగుతూనే ఉంది.

ఈ పరిస్థితి ప్రపంచంలో ఇతర భాషల్లో లేదు. మనకు మాత్రమే పరిమితమైన అంటురోగం ఇది. దీనికి కారణం మన సంపాదకులకు బాధ్యత లేకపోవడమే; అంతేకాక, వారిలో చాలా మందికి కవిత్వ ప్రక్రియ లో ఓనమాలు తెలియకపోవడమే. ఇతరదేశాల్లో, దిన పత్రికల్లో కవిత్వాలు ప్రచురించరు. లెక్కలేనన్ని -వార, పక్ష, మాస, త్రైమాసిక -పత్రికల్లో కవిత్వాన్ని ప్రచురించుకోవచ్చు. అంతే కాకుండా, పేరొందిన పత్రికల్లో సంవత్సరం పొడుగునా కవితలను పరిశీలించరు. ప్రచురణార్థం కవితలు పంపేవారు నిర్దుష్టమైన కాలంలో పంపవలసి వుంటుంది; హడావుడిగా ఎవరి కవితలూ ప్రచురించరు; ఈ రకంగా , జర్నలిస్టు వేషధారణలో కనిపించే కవులకు పెద్ద ఆదరణ లేదు.

మన భాషలో సాహిత్యానికి చోటు కేటాయించేది దినపత్రికలే కావడం మూలాన వార్తల్లో కవిత్వాలు, కవిత్వాల్లో వార్తలు-కలగాపులగంగా దర్శనమిస్తాయి. ఈ పరిస్థితిని నివారించడానికి, సంపాదకులు దినపత్రికల్లో వార్తలను చూసి స్పందించి రాసే కవితలు ప్రకటించడం మాని వేయాలి. అలా వీలు కాని పక్షంలో, వీరి అఘాయిత్యపు కవిత్వాలను పాఠకుల అభిప్రాయాలు /ఉత్తరాలు శీర్షికల్లో పడవేయాలి. లేదంటే, అటు వార్తల్లో స్పష్టత కరవై, ఇటు కవితల్లో అనుభవం శూన్యమై రెంటికీ చెడ్డ రేవడిలా అయిపోతుంది మన సాహిత్య వాతావరణం.

నిషిగంధ:
ప్రశ్నలు, సమాధానం రెండూ చాలా ఆసక్తికరంగా, ఉపయోగకరంగా ఉన్నాయి.. ధన్యవాదాలు..
భూషణ్ గారు, నాదొక సందేహం..
తెలుగు కవితల్లో పరభాషలు (ఆంగ్లం, సంస్కృతం లాంటివి) వాడటం సమంజసమేనా? ముఖ్యంగా ఆంగ్ల పదాలు కవితల్లో విరివిగా కనిపిస్తాయి.. కొన్నిసార్లు సన్నివేశానికి సరిపోయినట్లనిపించినా కృత్రిమంగానే అనిపిస్తుంది కదా!?

కత్తి మహేష్:
కవిత్వం భావనల వెల్లువ గనక, మూలభావన(ఉద్దేశం) తెలిసొచ్చేలా పేరు పెడితే అర్థవంతంగా ఉంటుంది. సమకాలీన అంశాలలోని “విషయాలను” కాకుండా, వాటిని మానవీయ అనుభవాలుగా మారిస్తేనే అది కవిత్వం అనిపించుకుంటుంది.

బాబా:
భూషణ్ గారికి
నిషిగంధగారి అనుమానమే నాదీనూ,

ఇంగ్లీషు లేదా పరభాషా పదాలను కవిత్వంలో వాడటం తప్పా? కొన్ని సందర్భాలలో వాడబడే ఇంగ్లీషు పదం భావపరిధిని పెంచేవిధంగానో లేక ఒక తూగు తెచ్చే విధంగానో ఉన్నప్పుడు, అలా వాడటం తెలుగు భాషకు చేసే ద్రోహమవుతుందా?

దానికి తెలుగు సమానార్ధకం ఆ సమయంలో కవి ఆలోచించి వేయలేకపోవటం, లేదా వాని మనో పరిధిలో లేకపోవటం కూడా జరగవచ్చు.

ఈ పరిస్థితిపై మీ అభిప్రాయాలను తెలుసుకోగోర్తాను.

కత్తి మహేష్:
నిత్య జీవితంలోని కొన్ని భావప్రకటనలుకూడా ఇంగ్లీషులో ఉంటున్నాయి. అలాంటప్పుడు కవితల్లో వాటికి తెలుగు సమానార్థాలు వెతకడం అనవసరం. అలా “అనువదించేస్తే” భావహత్యకూడా జరగొచ్చు. ఉదాహరణకు “నా లవ్యూ కు తన సారీయే సమాధానమయ్యింది” అనే వాక్యంలో లవ్ బదులు ప్రేమ, సారీ బదులు నన్ను క్షమించు అనే పదాలు పెడితే తెలుగు భాషకు ద్రోహం సంగతి దేవుడెరుగు, నేను చెప్పాలనుకున్న భావం భస్మమవుతుంది.

భూషణ్:
ఇటువంటి వాక్యాలు కథలు / నవలల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కథన కవిత (narrative poem)లో కనిపించవచ్చు. కల్పనా శక్తి ప్రధాన బలంగా వెలువడే కవిత్వాల్లో ఇటువంటి వాక్యాల ప్రమేయం తక్కువ. కాబట్టి, అటువంటి ప్రత్యేక సందర్భాలలో ఈ వాక్యాన్ని యథాతథంగా వాడుకోవడానికి ఇబ్బంది లేదు. కానీ, మన చర్చ కవిత్వంలో పరభాషా పదాల వాడుక; కావున ఈ వాక్యం మన ప్రధాన చర్చ పరిధిలోకి రాదు.


భూషణ్:
పరభాషాపదాల విషయంలో తెలుగుకు సహనమెక్కువ. తెలుగు చారిత్రకంగా ఎన్నో భాషల నుండి పదాలను స్వీకరించింది తనదైన పద్ధతిలో (సంస్కృతం నుండి కోకొల్లలుగా స్వీకరించింది తెలుగు తద్భవాలు/తత్సమాలు గానో; అంతేకాక ప్రాకృతాలనుండి కూడా లెక్కలేనన్ని పదాలు తెలుగులోకి వచ్చి చేరాయి. ఐరోపా దేశస్థులతో లావాదేవీలు ఉన్నభాష కావున -వాటిల్లో ఆంగ్లం నుండి అధికంగా, ఇతర ఐరోపా భాషలనుండి పరిమితంగా పదాలను ఏరుకున్నాము, అదీ మన నుడికారం దెబ్బ తినకుండానే. (బాతు,బాల్చీ,ఇస్త్రీ పోర్చుగీసు పదాలు అంటే నమ్మగలరా?) ఏదైనా ఇదివరకు మనమెరుగని భావం /వస్తువు తారస పడినప్పుడు ,దానికి మన భాషలో తగిన పేరు లేనప్పుడు పరభాషా పదాలను తీసుకోవడంలో తప్పు లేదు. (ఉదా :రైలు,వాచీ,పెన్ను,ఇంజను,కారు,జీపు,ట్రక్కు) మన భాషకు విస్తారమైన పద సంపద ఉంది. వీలయినంత వరకు మన భాషాపదాలను ఉపయోగించుకోవాలి. చారిత్రకంగా మనభాషలో కలిసిపోయిన పదాలను వాడటంలో మనకు అభ్యంతరాలు ఉండకూడదు. అలాగని చెప్పి ఎడాపెడా ఆంగ్ల ప్రయోగాలు చేయడం సోమరితనం తప్ప మరొకటి కాదు. భాష విషయంలో మడి కట్టుకొని కూర్చోరాదు. అలాగని చెప్పి మన నుడికారం సొంపు చెడగొట్టే అడ్డాదిడ్డపు ఆంగ్ల ప్రయోగాలు పరిహరించవలసిందే.

సమకాలీన అంశాలు కవిత్వం చర్చలో ఉదాహరణగా , మార్చి 1 నాటి మహె జబీన్ కవితకు లింక్ :
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=21338&Categoryid…

ఈ కవయిత్రి రాసిన ఈ కవిత ఎందుకు చెత్త కవిత ??

కవిత్వంలో పరభాషా పదాలు అన్న చర్చకు కూడా ఈ కవిత పనికి వస్తుంది.
(ఇలా ఉభయతారకంగా రాయడం అంత సామాన్యమైన విషయం కాదు !!)

ఈ కవయిత్రి ఏకంగా ఒక ఇంగ్లిష్ వాక్యాన్నే దించి వేసింది.
అంతే కాక ఎన్నో ఇంగ్లిష్ పదాలు ఎడా పెడా గుప్పించింది.

ఏ ఇంగ్లిష్ పదాలకు తెలుగు వాడి ఉంటే బావుంటుంది ??
ఏ ఇంగ్లిష్ పదాలను మీరు అనుమతిస్తారు ??

పై రెండు విషయాలను చర్చించి మీ అవగాహనకు పదును పెట్టండి.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాడవచ్చు.

ఉదాహరణకు ఇస్మాయిల్ కవిత (మొత్తం ఉటంకించడం లేదు)

ఆడదన్నా కొండలన్నా
——————–

కొండొక ఊళ్లో కొన్నాళ్లు
కొండ పక్క కాపురమున్నాం.
మిత్రుడొకతను మాట్లాడుతుంటే
చిత్రంగా మారే కొండకేసి చూస్తున్నా:
‘obsession (ఆ) నీకు ?’
అన్నాడతను విసుగ్గా.
అంతే ననుకుంటా—
ఆడదన్నా,కొండలన్నా

——————–
ఈ కవిత చివరికి ఇలా ముగుస్తుంది.

ఇరు obsession లూ ఒకేమారు
తరువాత పుట్టాయనుకుంటా.

——————-
తిలక్ లో కూడా అక్కడక్కడ ఆంగ్ల పదాల వాడకం కనిపిస్తుంది. ఉదా:
నవత-కవిత
————

కవిత్వంలో అబ్స్ క్యూరిటీ కొన్ని సందర్భాలలో ఉండొచ్చును
కాని, పాఠకుడికి నీ అనుభూతి ఆకారం అందాలి, హత్తుకోవాలి
అది ట్రాన్స్ పరెంట్ చీకటై ఉండాలి, నిన్ను పలుకరించాలి.
కవిత కొత్త అనుభవాల కాంతి పేటిక తెరవాలి, కదిలించాలి
ప్రతి మాటకు శక్తి ఉంది, పదును ఉంది
ప్రతి చిత్రణకు అర్థం ఉంది, ఔచిత్యం ఉంది.

———————-

కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే తిలక్, ఇస్మాయిల్ ఆంగ్ల పదాల వాడుక చేశారు.
ఒకరకమైన సంభాషణా శైలిలో దొర్లినటువంటివి, ఈ పదాలు కూడాను.

ఇటువంటి అవసరం ఎప్పుడో కానీ కలగదు. మన భాషకు సుదీర్ఘమైన కవిత్వ సంప్రదాయం ఉంది. దాన్ని కొనసాగించడం కవుల చేతుల్లోనే ఉంది. అంత గురుతరమైన బాధ్యతను తలకెత్తుకొన్నప్పుడు, తప్పకుండా సరైన పదం కోసం పడిగాపులు పడక తప్పదు.

———————————————————
మూలా సుబ్రహ్మణ్యం:
భూషణ్ జీ,
మీరు కథన కవిత అనగానే నాకు కొన్ని మౌలిక సందేహాలొచ్చాయి. అసలు ఈ కథన కవిత ఏమిటి? ఏమైనా ఉదాహరణలు ఇవ్వగలరా? కథనం ఉంటే కవితెలా అవుతుంది? ఈ కథన కవితకీ , బుచ్చి బాబు, చలం నవలల్లో కనిపించే కవితాత్మక వచనానికీ తేడా ఏమైనా ఉందా?

బాబా:
భూషణ్ గారికి
నమస్కారములు
మీ సమాధానం బాగుంది. మీరు చెప్పిన కవిత చదివాను. మీరన్నట్లు కొన్ని పదాల వాడుక సమంజసమనిపించినా, కొన్ని పదాల వాడుక అనవసరమనిపించింది.

ఎన్ కౌంటర్లను హత్యలుగా పరిగణించాలన్న హైకోర్టు తీర్పునకు స్పందిస్తూ మహజబిన్ వ్రాసిన కవితలో దొర్లినటువంటి వివిధ ఆంగ్లపదాలు ఈ విధంగా ఉన్నాయి. వాటిపై నా అభిప్రాయాలు.

లెటజ్ సెలబ్రేట్, ఋతువు మారింది.

పై వాక్యాన్ని, వేడుక చేసుకొందాం, ఋతువు మారింది అని చదువుకొంటూంటే, కొంత ఫీల్ తగ్గినట్లు గా అనిపిస్తుంది. బహుసా ఒక పాంపస్ పార్టీ వాతవరణం ఊహలోకి తెచ్చుకోవటానికి ఆ ఇంగ్లీషు పదాలు సహకరిస్తున్నాయేమో.

ఇప్పుడిక ఎన్ కౌంటర్ ల కాలం లేనట్టే

ఎన్ కౌంటర్ అనే పదానికి ఎదురు కాల్పులు అని కొన్ని చోట్ల వాడబడుతున్నా, ఇంగ్లీషు పదం ఆ చర్యను మదిలో ఆవిష్కరించినట్లుగా తెలుగుపదం చేయలేకపోతున్నది. కనుక ఈ పదం కూడా ఆమోదయోగ్యంగానే అనిపిస్తున్నది.

కొత్తగాలి వీస్తున్న ఫీలింగ్
ఇక్కడ ఫీలింగ్ అన్న మాట బదులుగా భావన, అనుభూతి అనే పదాలను వాడినా అభ్యంతరమేమీ కనిపించటం లేదు. కవిత ఫీల్ లో తేడా ఏమీ తెలియటం లేదు. ఏదో వ్యావహారిక భాషను కవితలో చొప్పించాలన్న ప్రయత్నమే తప్ప మరే ప్రయోజనం కనిపించటం లేదు.

రాజ్యాంగం సాక్షిగా ఫ్రెష్ ఎయిర్
ఇక్కడకూడా అదే పరిస్థితి. కొత్తగాలి, కొత్తఊపిరి లేక మరొక ఇతర పదాలను వాడి ఉండవచ్చు.

ఫేక్ ఎన్ కౌంటర్
బూటకపు ఎన్ కౌంటర్ అన్న పదమే ఎక్కువ సమర్ధవంతంగా భావాన్ని పలికించగలుగుతుంది. మరి ఈ ఫేక్ ఇంగ్లీషు ఎందుకో ?

లాకప్ డెత్
ప్రత్యాన్మాయం లేదేమో, ఉన్నా ఈ పదం మన భావప్రపంచంతో మమేకమయినంతగా ఉండదేమో. కనుక ఈ పదం వాడుక సమంజసమే.

ప్రేమ కవిత్వం రాస్తుంటే ఎన్ కౌంటర్లు డిస్ట్రబ్ చేస్తాయి.

ఈ పదం గురించి ఆలోచిస్తుంటే, కొన్ని కొన్ని ఇంగ్లీషు పదాలు భావానికి విస్త్రుతమైన అర్ధాలు ఇస్తాయేమో ననిపించింది.
చికాకు, విసుగు, వంటి పదాలు ఒక భౌతికమైన వాతావరణాన్నే తప్ప మానసికమైన స్థితిని ప్రతిబింబించటం లేదనిపిస్తుంది. కనుక ఈ పదం ఆమోదయోగ్యంగానే అనిపిస్తుంది.
స్వాతి:
భూషణ్ గారూ,
నాక్కూడా పొయెటిక్ వ్యాసాల గురించి కొన్ని సందేహాలు. కొన్ని సార్లు కవితాత్మకమైన భావాల్ని ఒక ఉత్తరం ద్వారానో, మరో మనిషి తో చెబుతున్నట్టు గానో, లేదా పరస్ఫర సంభాషణ లాగా రాస్తే బావుంటుంది అనిపిస్తుంది. అలా రాయటం వల్ల కవితలో చిక్కదనం, క్లుప్తత లోపిస్తాయా, అసలా ప్రక్రియ ఎంతవరకూ వైవిధ్యం గా వినూత్నం గా ఉంటుంది?
భూషణ్:
రాయవచ్చు. ఇబ్బంది లేదు. poetic వ్యాసమనే సరికి నాకు భయం పట్టుకుంది. వచనంలో రాయగలిగిన భావాన్ని కవిత్వంలోకి లాక్కురావడం వల్ల హాని, ఆత్మగ్లాని; ప్రక్రియా పరమైన భేదాలను చక్కగా గుర్తెరిగిన తర్వాతే ఇవన్నీ.
స్వరూప్ కృష్ణ:

కవిత్వం గురించిన నిర్వచనం తెలిస్తే ఈ సందేహానికి ఆస్కారం ఉండదు. ఏ భావాన్నైనా శిల్పాత్మకంగా చెప్పేదే కవిత్వం. అది వచనం కావచ్చు. పద్యం కావచ్చు. సంభాషణాత్మకం కావచ్చు కూడా. కుటుంబరావు కథల్లో కవితాత్మక ధోరణి ఉంది. రావి శాస్త్రి కథల్లో కూడా ఈ కవితాత్మక ధోరణి ఉంది. నిజంగా కన్యాశుల్కాన్ని లోనారసి చదివితే గురజాడలో మంచి కవి కనిపిస్తాడు. రామప్పంతులు ఇంట్లో ఉత్తరం చదివే సీనులో మధురవాణి లొట్టిపిట్టలు అన్న పదాన్ని పట్టుకుని తెగనవ్వే సీనులో ఈస్థటిక్ సౌందర్యాన్ని గమనిచండి.
వచనంలో కవిత్వాన్ని కురిపించిన మరో మహా వ్యక్తి చలం. మహాప్రస్థానానికి చలం రాసిన ఇంట్రో శ్రీ శ్రీ కవిత్వం కంటే ఆలోచనాత్మకంగా లేదూ. చలం రాసిన కథల్లో కూడా ఈ ఆలోచనాత్మక ధోరణి కనిపిస్తుంది.
అందుకే నా అభిప్రాయంలో అలోచిమపచేసేది అది పద్యాత్మకమైన, సంభాషనాత్మకమైనా, వర్ణనాత్మకమైనా కవితాత్మకమే. అందుకే కవనం అంటే వర్ణనీయం అని.
వచనాత్మకంగా రచిస్తే కవితలో చిక్కదనం, క్లుప్తత లోపిస్తాయా?
ఇది కవిత్వానికో, లేదా మరే సాహిత్య ప్రక్రియకో మనం, మన విమర్శకులు గీసుకున్న పరిధి వల్ల వచ్చింది. రెండు మాటల్లో అనంత అర్థాన్ని చెప్పొచ్చు. ” ప్రపంచమొక పద్మవ్యుహం, కవిత్వమొక తీరని దాహం” అన్న కవి మాటలకు ఎన్ని పుటల భాష్యం రాయొచ్చో ఊహించండి.
చిక్కదనం , క్లుప్తత వంటివి తీసుకున్న వస్తువును బట్టి ఉంటాయి, ప్రక్రియను బట్టి కాదు.
రాకేశ్వర రావు:

నాకైతే సింపుల్గా వామిట్ వచ్చిందండి ఆ పోయమ్ రీడిన తరువాత. ఎవరైనా ఎనిమీస్ని టార్చర్ చేయాలంటే ఆ పోయమ్ దట్ పెర్సన్స్కి సెండ్ చేయవచ్చు. నాకు ఇంగ్లీషు నుడికారం బాగా పట్టు వుండేది. (తెలుగు నేర్చుకోవాలని సంకల్పించేముందు). అందుకేననుకుంట ఎవరైనా ఇలా తెలుఁగు నుడికారంతో ఆంగ్లం మాట్లాడితే నిజంగా అసహ్యంగా అనిపిస్తుంది. తెలుఁగు మీద ప్రేమవలన కాకపోయినా ఆంగ్లం మీద అభిమానంతో.

కానీ కవితలు వ్రాసేటప్పుడు నాకు క్లిష్టమయిన ఆంగ్లపదాలకు తెలుగు పదాల వెదుకులాట చాలా శ్రమతో కూడిన పని అనిపిస్తుంది. కానీ కష్టే ఫలే కదా! తిలక్ కవితల్లో ఆంగ్లపదాలు చూసినా నాకు గిట్టదు.

భూషణ్:
కథనం ఉన్న కవిత కథన కవిత. శ్రీ శ్రీ భిక్షు వర్షీయసి, తిలక్ రాసిన చాలా కవితలు ఈ కోవలోకి వస్తాయి. కవితాత్మక వచనం రాయడం వేరు, అసలు సిసలు కవిత్వం రాయడం వేరు. చలంకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది (మ్యూజింగ్స్ లో ఈ విషయం మీద ఎక్కడో ఒక పేరా ఉంది)

కథన కవితలో, కథ నడిపే నేర్పుతో పాటు కవిత్వంలోని లఘువు బిగువులన్నీ కనిపిస్తాయి. మనకు ఈ ప్రక్రియ కొత్తదేమీ కాదు. మన ప్రబంధాలు ఈ కోవలోవే కదా. మరీ ముఖ్యంగా కళా పూర్ణోదయం. ఈ కాలంలో కూడా ఇటువంటి ప్రయోగాలు చేసినవారున్నారు. విక్రం సేథ్ రాసిన The Golden Gate, Novel in verse అనగా కథా కావ్యమే.

ఈ ప్రక్రియను ఇంకా ఉచ్చ స్థాయికి తీసుకువెళితే అదే ఇతిహాసం. మహాభారతం గురించి తెలియని వారెవరు ?

పాత రోజుల్లో కథ చెప్పేవాడు, కవిత్వం కట్టే వాడు ఒకడే కాబట్టి ఇతిహాసాలు, కావ్యాలు అధిక సంఖ్యలో వచ్చాయి.కాలక్రమేణా ,కథ కవిత్వం నుండి విడివడింది. కథానిక, నవల లాంటి ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. ఇన్ని మార్పులొచ్చినా పాతపద్ధతుల మీద మమకారం చావని వారు కవిత్వంలోని లఘువు బిగువులను కథనానికి జోడించి novel in verse అనో narrative poem అనో రాయడం మాన లేదు.

దీని వెనుక ఇంత తతంగం వున్నదని తెలియక కథ రాయలేని వారు, కవిత్వం రాయలేని వారు ఇందులోకి దూకి ఉభయ భ్రష్టత్వం పొంది ఉన్నారు (ఉదా: సినారే :విశ్వంభర) మీ అభిప్రాయాలతో నేను చాలా వరకు ఏకీభవిస్తున్నాను. కానీ disturb అన్న పదంతో నాకు ఇబ్బంది వుంది. వచ్చీరాని ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో ఎందుకు రాయాలి. శుద్ధంగా తెలుగులో రాయరాదా??యధాలాపంగా ఉండే సంభాషణల స్థాయికి కవిత్వాన్ని దించివేయరాదు. disturb కు అనువాదాలు వెదికే అవసరం లేదు.
కవయిత్రికి కలిగిన భావావస్థను సూచించే పదం తెలుగులో తట్టక పోతే వేచివుండటం వినా మరో మార్గం
లేదు. వార్తాకవిత్వానికొచ్చిన తొందరపాటు వల్ల ఎన్ని అనర్థాలు ??

భై. కామేశ్వర్రావు:
కళాపూర్ణోదయాన్ని కథనకవితకి మంచి ఉదాహరణగా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది! నా ఉద్దేశంలో అది అచ్చమైన నవలే. మనుచరిత్ర ఇంకా మంచి ఉదాహరణ. “ఖాళీ సీసాలు” వంటి కథలు కథా రూపంలో ఉన్న కవితలని నాకనిపిస్తుంది. ఈ నెల ఈమాట వ్యాసంలో పరిశీలించబడ్డ “అతడు, నేను, లోయ చివరిరహస్యం” కథ కూడా ఇలాటిదే.
భూషణ్:
కామేశ్వర రావు గారు,
నేను విస్తృతార్థంలో ఆ మాట వాడాను. కళాపూర్ణోయం novel in verse, అందులో రెండవ అభిప్రాయం లేదు.

కత్తి మహేష్:
తమ్మినేని గారు,
“యధాలాపంగా ఉండే సంభాషణల స్థాయికి కవిత్వాన్ని దించివేయరాదు” అనే మీ భావనతో నేను ఏకీభవించలేకున్నాను. అంతేకాక తెలుగులో ఆంగ్ల పదాల వాడకం మరియూ కవిత్వాన్ని సంభాషణల్లో సరళంగా ప్రాసతో భావాన్ని పలికించడం అనేవి “స్థాయిని దించడం” గా నేను భావించలేను. నా కవితా జ్ఞానం బహుతక్కువైనందున సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘మనీ’, ‘మనీమనీ’ సినిమాల్లో రాసిన గేయ కవితల్ని ఇందుకు ఉదాహరణగా చూపచ్చనుకుంటున్నాను. ఇందులో ఉదాత్తమైన వేదాంతాన్ని కూడా సంభాషణల భాషలో ఆంగ్లాన్ని కలగలిపి జనబాహుళ్యానికి అందించడం జరిగింది. దీన్ని పెద్ద స్థాయిలో
ఆస్వాదించడమూ జరిగింది.
“లేచిందే లేడికి పరుగు
కూచుంటే ఏమిటి జరుగు
తోచిందే వేసెయ్ అడుగు..
డౌటెందుకు?
లేడల్లే ఎందుకు ఉరుకు
పడిపోతే పళ్ళు విరుగు
చూడందే వెయ్యకు అడుగు
జోరెందుకూ?”

రవి శంకర్:

తెలుగులో వాడుకలో ఉన్న పదాలు ఉన్నప్పుడు వాటిని వాడటమే మంచిది. ఏదైనా ప్రత్యేకమైన ప్రభావం సాధించటానికి ఇతరభాషలోని పదాలు ఒకటి రెండు వాడితే తప్పులేదు. కవితాత్మకమైన అంశాలుండటం, కవి ఆశించిన భావం పాఠకుణ్ణి చేరటం ముఖ్యం. అలాగే, పదాల ఎంపికలో, కూర్పులో శ్రద్ధ కనబడాలి. మహె జబీన్ కవితలో ఆంగ్లపదాల ప్రయోగంలోనే కాదు, తెలుగు పదాల కూర్పులో కూడా అశ్రద్ధ స్పష్టంగా తెలుస్తోంది.
కుందుర్తి ప్రోద్బలంతో శీలా వీర్రాజు వంటివారు కొన్ని కధా కావ్యాలు రాసారు. చదవటానికి బాగానే ఉంటాయి గాని, అంతగా ప్రాచుర్యం పొందలేదు. బహుశ కధను, కవిత్వాన్ని వేరుగా చూడ్డానికి మనవారు పూర్తిగా అలవాటు పడిపోవటం వల్ల కావచ్చు. అంతేకాకుండా, కధను చందస్సులో ఒప్పించినట్టు, వచన కావ్యాల్లో ఒప్పించటం అంత తేలిక కాదనిపిస్తుంది ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇటీవల రాసిన “సుపర్ణ” కధా కావ్యంగా చెప్పుకోవచ్చు. కాల్పనికమైన కధాంశాలు లేకపోవటం వల్ల ఆధునిక మహాభారతం,విశ్వంభర,సహస్రవర్ష,పునర్యానం వంటివాటిని దీర్ఘ కవితలు/కావ్యాలుగా చెప్పవచ్చుగాని, కధా కావ్యాలుగా పరిగణించలేమని నా అభిప్రాయం.

భూషణ్:
మీరు ఉదహరించిన గేయాన్ని కవిత్వంగా గుర్తించలేము. ప్రాసతో చక్కని నడకతో సాగినంత మాత్రాన ఇది కవిత్వమైపోదు. సినీకవులకు పరిమితులెక్కువ. ఎవరో ఒక సంగీతం వరుస అందిస్తారు.దానికి సరిపోయేలా వీరు నాలుగు మాటలు కూరుస్తారు. చమత్కారమున్నంత మాత్రాన ఇది కవిత్వమైపోదు. సినీగీతాల్లో సంగీతానికి పెద్ద పీట; సాహిత్యం దాన్ని అనుసరించవలసిందే. ఇది రాసిన వాడికే ఇది కవిత్వం కాదన్న విషయం తెలుసు కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ వివరాల్లోకి పోవడం లేదు. వేదాంతం కోసం చదవవలసింది వేదాంత గ్రంథాలను; కవిత్వం పరిధి వేరు. “జన బాహుళ్యం” అన్నది ఒక జారుడుబండ. అందరికీ అర్థమవడం /కాకపోవడం కవిత్వానికి గీటురాయి కాదు. కవిత్వ తత్వ విచారాలు చాలా వున్నాయి.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.