తెలు’గోడు’

కాజ సురేశ్  (surkaja@gmail.com)

ఏ కులము, ఏ మతముర నీది
దుడ్డులెన్నిన్నుయ్ ర నీకు
ఈ చెక్కలు చాలవురా ఓరి తెలుగోడ
యాస బాసల ముక్కలంత
అవసరమా, ఓరి ఎర్రిబాగులోడ

గోచీ వేమనా, ఆడెవ్వడు
మాకు నీతులుచెప్పెటోడా
ఆదికవి మీ గోదాటొడ్డువాడా
మీ పోతన మా రాయల కొలవునుండెటోడా
కాళోజీ!! కాడు వాడు మా సీమపక్కోడు
శ్రీశ్రీ!! హూ వాడు వట్టి ఉత్తరాంధ్రవాడు

‘ఇజాలు’లేని దాశరథిదేమి కవితరా
వాడు మెచ్చిన ఆ ‘ఎఎన్ఆర్’దేమి నటనరా
కృష్ణమూర్తి వేమి ‘జిడ్డు’రాతలురా
మీ ‘సినారె’దేమి బడాయి
ఆడి కంటెముందె మా ‘విశ్వనాథు’డు
‘గ్యానపీట’ నెక్కెనోయి

క్షేత్రయ్య, ఘంటసాల గొంతులు మావొంతు
బద్రాద్రి రామదాసు ఆడి వొంతు
తాళ్లపాక అన్నమయ్య ఈడి వొంతు
త్యాగయ్యను ఇసిరి పారెయ్యరా
ఆడు ఎప్పుడో తమిళోడివంతు.

ఇయ్యన్నీ పచ్చినిజాలు
కాదు గీదు మనమంత ఒకటని గింజుకుంటనంటే,
పోయి దూకరాదె గోదాట్లోన
పారుతున్నాదది ఏ నడిబొడ్డులోన
సన్నబడిపోయి ‘బాబ్లీ’ మూలాన

అటు పోరాటాల పురిటిగడ్డ
త్యాగాల తెలంగాణ
ఇటు రోసాల రాయలసీమ
అటు కొమరము భీమన్న
ఇటు ఉయ్యలవాడ నరసింహ
మన మన్నెం దొర అల్లూరి
పోరలేదా వీరంతా నా ఛాతి పొంగిపోయేల!!
నైజాము నిరంకుశాన్ని
తెల్లోడి సామ్రాజ్యవాదాన్ని
మీసం మెలెయ్యలేనా ఇంకా, ఏం
వాడు మా ప్రాంతపోడు కాదు గదాని?

సుబ్బారాయుడు, పైడితల్లి, తిమ్మప్పలదేమి బంధము
యాదగిరితో లేని అంత పెద్దచుట్టరికము?
పాలమూరు పాలెగాడ్నినేను
అంబలైన లేని అన్న అనంతపురమునుండ
కరీమునగరు దొరెట్టా నావోడు?
కల్లు తీసెటోడ్ని, బట్టలుతికెటోడ్ని,
కాళ్లు పట్టెటోడ్ని, బొగ్గు గనుల్లో నలిగెటోడ్ని
‘అబ్బా అమ్మా’ అది ఏ యాస అయితేమి
నా తమ్మి అన్నిప్రాంతాలా పడే ప్రయాస ఒకటె గాదా!!

కాకా హోటలెట్టి, కప్పులన్ని కడిగికడిగి
కోరినన్ని ఇడ్డెనులెట్టి కాయకష్టము
చేసెటోడి మీద ఎందుకన్న అంత గుస్సా?
ఫ్లోరైడు నీళ్లు తాగి, నడుము నిక్కిపోయి,
నీ వళ్ళుగుల్లైతే, ఏడ తొంగున్నాడన్నా
ఆ ఎమ్మెల్లే, ఎంపీఓడు?
నీ సొమ్మంతా దోచిదోచి, గోచీగూడ
మిగలకుండా జేసిన నీ ఇలాక ఏలేటోడ్ని
నిగ్గదియ్యరాదే అన్న
ఆడెక్కడ పండినాడో గదన్న!!
మంత్రులు, సిఎమ్ములు, పియమ్ములు
ఎందరిని పంపలేదే అన్న
వాళ్లేమి ఊడబొడిసారే అన్న
మార్చకుంటే ముందుముందు
ఏలేటోళ్లు ఆళ్లే గదన్నా!!

రియలుదందాలెన్నో జేసి, గనులన్నీ కొల్లగొట్టి
సొమ్ములేన్నో కూడబెట్టారీ ఘనులు
ఆ దోపిడి చాలలేదా
ఎందుకన్నా ఆళ్లకోసం నీ బస్సుల తగలెట్టడం?
ప్రాజెక్టులు, ఫాక్టరీలు
పక్క రాష్ట్రపోడు పట్టుకెళ్తె మౌనం
రైలు, రక్షణ, హోము, విత్త
మంత్రి పదవులన్ని వేరేటోళ్లకెళ్తె ఆమోదం
హస్తి’నమ్మ’కు తెలుగు గౌరవం
తాకట్టు పెట్టినప్పుడులేని పౌరుషం
ఇప్పుడెందుకు ఈ కొత్త’రాగం’?
ఎందుకీ నిరసనలు ఈ నిరాహారదీక్షలు
ఎంతవరకు నిజమీ ఉపవాసం
ఎవరికోసమీ ఆయాసం?
ఈ మరుగుజ్జులా మన భావి ‘పొట్టి’ శ్రీరాములు?

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నారు
మేలుకో తమ్ముడా!!!
ఇనపడలేదా ఆ వెక్కి వెక్కి ఏడ్పులు
గుచ్చే గునపాల హోరులో
ఆ మాయ మాటల మోతలో?
కనపడలేదా ఆ కన్నీళ్లు
ఈ కాళ నిశీధిలో?

ఎందుకమ్మా ఆ కన్నీరు ఓ మాయమ్మ
ముగురమ్మల మూలపుటమ్మ
మా మేటి తెలుగు పెద్దమ్మ
సింహాద్రి అప్పన్న
యాదగిరి నరసన్న
చిత్తూరు ఎంకన్న
నీ బిడ్డలనింక చల్లగా ఆళ్లే చూడాల
ఈ కాళరాత్రి గడిచిపోవాల!!!

Posted in కవిత్వం | Tagged | 18 Comments

2009 నవంబరు గడి ఫలితాలు

నానాటికీ గడి సాధకుల సంఖ్య పెరగడం సంతోషకరమైన విషయం. ఈసారి గడి ప్రత్నించిన వాళ్ళు మొత్తం ఇరవయ్యొక్క మంది! అయితే చాలామంది ఒకటి రెండు అచ్చుతప్పులు చేసారు. అచ్చుతప్పులని తప్పులుగానే పరిగణించాను. మొత్తం అన్నీ సరైన సమాధానాలు వ్రాసి పంపినవారు పట్రాయని సుధారాణిగారు. వారికి ప్రత్యేక అభినందనలు. రెండు తప్పులతో పంపినవారు శ్రీలు, వేణు, వెన్నెల_డిబి, ఆదిత్య, వెంకట్ దశిక, మైత్రేయి, కోడీహళ్లి మురళీమోహన్. గడి పంపిన ఇతరులు రామారావు.యం, జ్యోతి, శైలజ, భమిడిపాటి ఫణిబాబు, రాగమంజీర, భమిడిపాటి సూర్యలక్ష్మి, అపరంజి, కామేశ్వ్ర్రరీ దేవి.ఆర్.వి, వల్లీ సునీత, రాధిక, స్నేహ, సురభి, వేమన. గడి పంపిన అందరికీ అభినందనలు.

— కామేశ్వర రావు

కం

దు

కూ

రి

వీ

రే

లిం

గం

పం తు లు

1 వా

2 వి

3 సు

రే

4 కా

5 రం

6 టీ

7 పా

8

ర్పు

డు

వా

9

గీ

10 కా

కీ

11

12 కీ

ర్త

13 నా

14 లా

15 తు

ల్హా

16

17

తి

18

19 మీ

మా

తి

ర్వాం

20 సు

లు

రా

ము

21 హి

22 సు

ధా

ము

డు

23 జా

బు

24

ర్యా

25

వ్వ

స్మి

26 పూ

27

ర్గా

మి

28 ట్ట

29

నా

రం

30

31 లు

ము

32 పు

ల్లా

రే

33 గం

34 రా

35 శ్రీ

నా

36

క్కి

37

38 రా

కు

39

ర్మం

40 మా

41

వి

కీలక పదానికి ఆధారం:

ఆంధ్రుల హితాన్ని కోరిన తెలుగు మాష్టారు వీరే. నూటికే కాదు కోటికే ఒకడు. అయినా అదే చాలు. – కందుకూరి వీరేశలింగం పంతులు. కందుకూరి ‘హితకారిణి’ అనే పత్రికని నడిపేరు. మాస్టారుకి తెలుగు పదం పంతులు. ‘కొట్టుకొని పోయె కొన్ని కోటి లింగాలు, వీరేశలింగ మొకడు మిగిలెను చాలు’ అని ఆరుద్ర ‘వేదంలా ఘోషించే గోదావరీ’ అన్న పాటలో వ్రాసారు.అడ్డం
======
1.   వరుసకి ముందు రమ్మంటే వినవా – వావి.
3.   కారంగా ఉండే ఉప్పు దీపావళికి పనికొస్తుంది – సురేకారం. ఇదొక రకమైన ఉప్పు. దీపావళి టపాసులలో ఉపయోగిస్తారు.
6.   వెనక్కి తిరిగితే మాత్రం తమిళ మామ్మగారిని పోల్చుకోవడం ఏపాటి – పాటీ తిరగబడింది. అంటే తమిళంలో మామ్మగారు.
8.   అంత గర్వం వద్దనంగా వింటివా మరి శ్రీకుమారా? – కందర్పుడు. అంటే మన్మథుడు. కం కీలకపదంలోని అక్షరం. వద్దు+అనంగాలో అనంగా అంటే మన్మథుడు. అలాగే శ్రీకుమారా అన్నా, లక్ష్మీ పుత్రుడు మన్మథుడనే అర్థం. కుమారాలో మారా కూడా మన్మథుడనే అర్థాన్నిస్తుంది!
9.   ఎంత పొగరైతే మాత్రం అంత తలతిరుగుడా! – గీర తిరగబడింది.
10. కేకికా? – కాకికా. కాకీక కాకికికాక కేకికా అన్నది ఒక ఏకాక్షర చమత్కార వాక్యం.
12. తనకి పేరుతెచ్చే భక్తిగీతమా? – కీర్తనా.
14. పరాయివాళ్ళెప్పుడూ చివరదాకా ఉండరు. విలాయతులలో ఉండిపోతారు. – లాతు. లాతులు అంటే పరాయివాళ్ళు. చివరిదాకా ఉండరు కాబట్టి చివరి అక్షరం లేదు.
16. పతి రక్షణలో ఉన్నామెతో సరసం కూడదు – పరసతి. మొదటి చివర అక్షరాలు కలిపితే పతి కాబట్టి పతి రక్షణలో ఉన్నట్టు.
18. కాస్త తడబడినా ఇంచుమించు అదేరామరి! – రమారమీ తడబడింది.
20. మోడ్రన్ అశ్వమేథయాగాల గురించి తెలియకపోతే శ్రీశ్రీ నడగండి – రేసులు. రే కీలకపదంలోని అక్షరం. శ్రీశ్రీ రేసుల గురించి అశ్వమేథయాగం అనే కథ రాశాడు.
22. తలిదండ్రుల హితాన్ని కోరేది కూతురేనట – దుహిత. అంటే కూతురు. దు కీలకపదంలోని అక్షరం.
23. ఇల్లు చక్కగానే ఉంటే ఇతనికి అటుకులతో పనుండేదా? – సుధాముడు. కుచేలుని మరో పేరు. సుధాముడు అంటే మంచి ఇల్లు కలవాడు అని అర్థం.
24. పసిడిగుడికి పుట్టినిల్లు ఏదో ఉత్తరాన్ని మోసుకొచ్చింది – పంజాబు. పం కీలకపదంలో ఉంది.
26. లాడుకి ముందు నిప్పుకి వెనకాలా వస్తుంది – రవ్వ. రవ్వలాడు, నిప్పురవ్వ అన్న పదాలలో ఉంది.
28. ముళ్ళపూడి ముబారక్ చెప్పిన కతలు – దర్గామిట్ట. దర్గామిట్ట కథల పుస్తకానికి ముళ్ళపూడి ముబారక్ అనే ముందు మాట రాశారు.
30. అహ తనా! అతనికి ఏ అడ్డూ లేదు – అనాహత. అంటే అడ్డు లేనిది అని అర్థం. అహా తనలో అనాగ్రాం.
31. పెన్ను మధ్యలో కొమ్ము మొలిచిందేమిటి! – కలుము. కలము మధ్యలో ‘ల’కి కొమ్ము వచ్చింది.
33. తియ్యని రెడ్డిగారు – పుల్లా. పుల్లారెడ్డిగారు అందరికీ తెలుసుకదా!
34. సనిపమరిస అంటూ వెనకనుంచి చేసావేం ఆరోహణ? – శ్రీరాగం వెనకనుంచి. సరిమపనిస అన్నది ఆ రగం అవరోహణ.
37. చక్కిలములో మీ అదృష్టం దొరుకుతుందేమో వెతకంది – లక్కి.
38. అంబకి దేవికి కూచిపూడివాళ్ళు ఇలా జాగ్రత్త చెప్తారు – పరాకు. అంబ పరాకు, దేవీ పరాకు అన్నది కూచిపూడివాళ్ళ ప్రార్థనా గీతం.
40. న్యాయమైన విల్లు ఈ కాలంలో కుంటుతోంది – ధర్మం. ధర్మం అంటే విల్లనే అర్థం కూడా ఉంది.
41. వనమాతని సరిగా ప్రార్థిస్తే మనిషికి కావలసిందేమిటో చెపుతుంది – మానవత. వనమాత అనాగ్రాం.
42. కనిపించకుండా వినిపించేవాడు – కవి.

నిలువు
=====.
1. వంటకి జంట – వార్పు.
2. విలుకాడు కాలు విరగ్గొట్టుకున్నాడు.  ఇంక వదిలేయ్. – విడు. విలుకాడులోంచి కాలు తీసేస్తే మిగిలేది విడు. అంటే వదిలెయ్యమనే కదా.
3. మతం పుచ్చుకుంటే మంచి కబురు వినవచ్చు – సువార్త.
4. శవాకారములో కనిపించే రాజుగారి బామ్మరిది గురించి శూద్రకుణ్ణే అడగాలి – శకార. శ కీలకపదంలోని అక్షరం. శూద్రకుడు రచించిన మృచ్ఛకటికం అనే సంస్కృత నాటకంలో రాజుగారి బావమరది పాత్ర పేరు ఇది.
5. ఊర్మిళ నిద్రపోకుండా అయ్యో రామా అంటోంది, ఇదేం చిత్రమో! – రంగీలా. ఈ ఊర్మిళ రామాయణంలో ఊర్మిళ కాదు, రంగీలాలో ఊర్మిళ (రౌడీగారు ఈవిడ ఫాను :-). రంగీలా సినిమాలో ఊర్మిళ పాడే పాట హై రామా యే క్యా హువా.
6. చిన్నప్పడు వేసుకునే సూదిమందుకి అంత వ్యాఖ్యానం దేనికి? – టీకా. టీక అంటే వ్యాఖ్యానం అని కూడా అర్థం.
7. తాళంచెవి పాతిపెట్టు, ఆ తర్వాత తిరిగ తియ్యి. పేలకపోతే నన్నడుగు – తుపాకీ. తు కీలకపదంలోని అక్షరం. తాళం చెవి పాతిపెట్టు అంటే కీ పాతు. దాన్ని తిరగేస్తే తుపాకీ.
8. రజనీకాంతుని సూర్యునిగా మెరిపించే శక్తి మణులలో రత్నానికే ఉంది – దళపతి. రజనీకాంతుడు అంటే చంద్రుడు. మణులలో రత్నం మణిరత్నం.
11. ఎర్ర తామరకి హారమెక్కడినుంచి వచ్చింది? – కల్హారము. ఇది నిజానికి ఎర్ర కలువ. క్లూలో చిన్న పొరపాటు జరిగింది.
12. ఇంతకీ తిరి తిరిగితేనే ఇంత యశస్సు వస్తుందంటావ్! – కీరితి. రి కీలకపదంలోని అక్షరం. ఇంతకీ తిరిలో తిరి తిరిగితే వచ్చేది ఇంత కీరితి.
13. కోదండము రాగమైతే మరి కోదండ రాముడేమవుతాడు? రాగరాజుగారినే అడగండి – నాదసుధారసము. నాదసుధారసంబిలను అనే కీర్తనలో రాముడిని నాదసుధారసమని కీర్తిస్తారు త్యాగరాజు. ఇందులో ‘స్వరములు ఆరొక ఘన్టలు వర రాగము కోదన్డము’ అని వస్తుంది.
14. గుఱ్ఱం ఒకటే గంతు వేస్తోంది – తురగం. ‘ర’ కీలకపదంలోని అక్షరం. తురగంలో ఒక ‘గంతు’ ఉంది కదా.
17. ఇందుగలడందులేడను సందేహము లేదు – సర్వాంతర్యామి.
19. మల్లెపూవు ధరించిన కృష్ణ భక్తురాలా? గోరింటాకు పెట్టుకుందా? – మీరా జాస్మినా.
21. అందెలెందుకలా చెదిరిపోయాయి – మువ్వలు చెల్లాచెదరయ్యాయి.
25. ఆ విశ్వనాథుని క్రీడ భలే చతురం కదూ – చదరంగం. విశ్వనాథుడు, విశ్వనాథ్ ఆనంద్.
27. పూలను చుట్టుకున్న కాగితపు మిఠాయిలు – పూతరేకులు. లు కీలకపదంలోని అక్షరం.
29. ఆనకట్ట తన ఒట్టు తీసి గట్టున పెట్టి తిరగబడింది! – కట్ట తిరగబడింది. ఆనకట్టలో ఉన్న ఒట్టు ఆన. అది తీసేస్తే మిగిలేది కట్ట.
30. అదేమల్లా! ఆది అంతమూ ఆ దేవుడే అంటే వినవేం? – అల్లా. అదేమల్లాలో మొదలు చివరా కలిపితే వచ్చే దేవుడు.
32. తెలుగు విల్లులో ఎంత వీలుందో! – వీలునామా. వి కీలకపదంలోని అక్షరం.
33. అయిల్ పుల్లింగంటే ఇంతుందా! – పుక్కిలింత. లిం కీలకపదంలోని అక్షరం. ‘Oil Pulling’లో చేసేది పుక్కిలించడమే కదా. పుక్కిలింతలో ‘ఇంత’ ఉంది.
35. కూతురు కూడా హీరోయినయ్యిందని సమారాధనలో ములిగింది కాబోలీవిడ – రాధ. రాధ కూతురు జోష్ సినిమాలో హీరోయిన్ గా పరిచయమయ్యింది.
36. మాంచి మసాలా కూరలాంటి దేవుడికున్న ఒకే ఒక్క గుడి – శ్రీకూర్మం. కూ కీలకపదంలోని అక్షరం.
37. సరిగా చూడండి, కవలలోని వాడే – లవ. కుశలవులలో ఒకడు. కవల అన్న పదంలో కూడా ఉన్నాడు.
38. రెట్టించి పలుకగా హాయిగా నవ్వినట్టే – పక.
39. ఓ కథకుడు పట్టుకు వేళ్ళాడే చెట్టు – రావి. కథకుడు రావిశాస్త్రి.

Posted in గడి | Tagged | 4 Comments

మృతజీవులు – 30

ఈ లోపల తనకు లేఖరాసిన యువతీమణిని ఎంతమాత్రమూ గుర్తించలేక తికమక పడ్డాడు. అతను తీక్షణంగా చూడటంలో అవతల స్త్రీలుకూడా దీనమానవుడి హృదయంలో తీయనైన బాధ రేకెత్తించ జాలిన చూపులు పరవటం కానవచ్చింది. అతను చివరకు, “ఉఁహు! ఊహించటానికి లేదు!” అనుకున్నాడు. అయితే ఇందువల్ల అతని ఉల్లాసం భంగంకాలేదు. అతను విశృంఖలంగా కొంతమంది స్త్రీలతో సరసోక్తులాడుతూ అండుగులో అడుగు  వేసుకుంటూ ఈ స్త్రీ దగ్గిరికి నడిచాడు; కొంతమంది పొట్టి, ముసలి షోకిలాలు – వాళ్లని “పొట్టిగిత్తలు” అంటారు – ఆడవాళ్ల మధ్య చలాకీగా తిరుగుతూ ఇలాగే నడుస్తారు. అతను ఒక కాలిని తోకలాగా నేలమీద ఈడుస్తూ, కుడిపక్కకూ, ఎడమపక్కకూ గిరుక్కున తిరుగుతూ ముందుకు సాగాడు. స్త్రీలు అతన్ని ఎంతో ఆదరంతో చూడటమేగాక, అతనిలో ఎన్నో మంచిగుణాలూ, ఆనంద దాయకమైన గుణాలూ ఉన్నట్టు తెలుసుకోవటమేగాక, అతని ముఖభంగిమలో ఒక విధమైన వీరలక్షణంకూడా ఉన్నట్టు కనిపెట్టారు; వీరలక్షణం స్త్రీలను ఎంత బాగా ఆకర్షించేదీ మనకు తెలుసు. అతన్ని గురించి వారిలో తగాదాలుకూడా బయలుదేరాయి. అతను ఎక్కువగా వాకిలి ప్రాంతాల నిలబడి ఉండటం గమనించి కొందరు స్త్రీలు ఆకస్మాత్తుగా కొందరు స్త్రీలు ఆకస్మాత్తుగా వాకిలి సమీపంలో ఉండే ఆసనాలలో చేరటానికి ఎగబడ్డారు, వారిలో ఒకతె ముందు ఆసనం సంపాదించేసరికి అసహ్యకరమైన పోట్లాట జరిగినంత పని అయింది; తాము చేయదలచిన పనే ఇతరులు చేసేయ్యటం చూసి కొందరు, ఇంత వెలికితనమా అని చీదరించుకున్నారు కొందరు.

మన కథానాయకుడు వెంటనే గవర్నరు భార్యకేసి తిరిగి, ఫాషనులో ఉన్న నవల్లోని జ్వోన్ స్కీలూ, విన్ స్కీలూ, లీదిన్లూ, గ్రేమిన్లూ, తదితర సమర్థులైన సైనికాధికారులూ ఉచ్చరించే భాషకు ఏ మాత్రమూ తీసిపోని భాషలో జవాబివ్వబోతూ కళ్ళెత్తి చూసి నుంచున్న వాడు నుంచున్నట్టే కొయ్యబారిపోయాడు.

చిచీకవ్ స్త్రీలతో సంభాషించటంలో నిమగ్నుడై ఉన్నాడు, అంతకంటె, స్త్రీలే అతన్ని తమ సంభాషణలో నిమగ్నుణ్ణిచేసి పరవశుణ్ణి చేశారనటం యుక్తం. వారు తమ సంభాషణలో ఎన్నో నర్మోక్తులూ, ద్వంద్వార్థాలతో కూడిన మాటలూ చొప్పించారు; వాటి అంతరార్థం గ్రహించే ప్రయత్నంలో అతని నుదుట చెమటలుపోశాయి. ఈ గొడవలో అతను ఇంటి యజమానురాలిని పలకరించటం తన ధర్మమన్న సంగతికూడా మరిచాడు. కొన్ని నిమిషాలుగా అతని దగ్గిరనే నిలబడివున్న గవర్నరుగారి భార్య  గొంతువినపడినాకనే అతనికాసంగతి స్ఫురణకు వచ్చింది. ఆవిడ కొంటెగా తలపంకించి, మృదువుగానూ నిష్ఠురంగానూకూడా, “ఓహో, మీరిక్కడే ఉన్నారన్నమాట పావెల్ ఇవానవిచ్!” అన్నది. తరువాత ఆవిడ అన్న మాటలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పటం నాకు సాధ్యంకాదు. కాని, గొప్పవాళ్ళ పద్ధతులు తమకు తెలుసునని గర్వపడే సాంఘిక నవలా రచయితలు తమ రచనలలో డ్రాయింగ్ రూమ్ సన్నివేశాలు చిత్రించేటప్పుడు గొప్ప స్త్రీలూ, పురుషులూ సంభాషించే విధంగా, ఆమె అత్యంత మర్యాదగా ఏదో అన్నది; అది ఈ ధోరణిలో ఉండవచ్చు- “మీరు నిర్దయతో స్మరించటం మానుకున్న వారికి ఏ మాత్రమూ, ఒక మూల ఇంత చిన్నస్థానమైనా లేకుండా మీ హృదయాన్ని వారు అంత సమగ్రంగా తస్కరించారా?” మన కథానాయకుడు వెంటనే గవర్నరు భార్యకేసి తిరిగి, ఫాషనులో ఉన్న నవల్లోని జ్వోన్ స్కీలూ, విన్ స్కీలూ, లీదిన్లూ, గ్రేమిన్లూ, తదితర సమర్థులైన సైనికాధికారులూ ఉచ్చరించే భాషకు ఏ మాత్రమూ తీసిపోని భాషలో జవాబివ్వబోతూ కళ్ళెత్తి చూసి నుంచున్న వాడు నుంచున్నట్టే కొయ్యబారిపోయాడు.

అతని ఎదట ఉన్నది గవర్నరుగారి భార్య ఒక్కతే కాదు, ఆవిడ చేతిమీద చెయ్యివేసి ఒక పదహారేళ్ళ పిల్లకూడా ఉన్నది. మిసమిసలాడే ఆ పిల్ల జుట్టు తేలికరంగుగా వున్నది, ఆమె ముఖాంగాలు సుకుమారంగానూ, నాజూకుగాను ఉన్నాయి. గడ్డం కోసగా ఉన్నది. ముఖం అండాకృతిగలిగి ఆకర్షణీయంగా ఉన్నది. ఆవర్తులమైన ముఖాన్ని ఏ చిత్రకారుడైనా మెడోనా చిత్తరువు చిత్రించటానికి  నమూనాగా తీసుకుని ఉండవచ్చు; కొండలూ, అడవులూ, మైదానాలూ, ముఖాలూ, పెదవులూ, పాదాలూ, సమస్తమూ విశాలంగా ఉండే రష్యాలో అలాటి ముఖం అరుదని చెప్పాలి. అతను నజ్ ద్రోవ్ ఇంటినుంచి వచ్చేటప్పుడు బండివాడి బుద్ధి తక్కువవల్ల నైతేనేం గుర్రాలబుద్ధి తక్కువవల్ల నైతేనేం బళ్లు ఒకదాని కొకటి తాకి, జీనుల చిక్కుపడి మిత్యమామా; మిన్యాయ్ మామా సహాయం చెయ్యటానికి వచ్చారే అప్పుడు కనిపించిన పిల్లే ఈ పిల్ల.

చిచీకవ్ ఎంతగా వివశుడైనాడంటే అతనిచోట అస్పష్టంగా ఏ మాటలు వెలువడ్డాయో దేవుడికే తెలియాలి; ఒక గ్రేమిన్ గాని, జ్వోన్ స్కీ గాని, లీదిన్ గాని అలా ఒక్కనాటికి మాట్లాడి ఉండరు. “మీకు మా అమ్మాయి తెలియదా? ఇప్పుడే బడి పూర్తి చేసింది” అన్నది గవర్నరు భార్య. కాకతాళీయంగా అదివరకే తనకు ఆమె పరిచయభాగ్యం కలిగినట్టు చిచీకవ్ చెప్పాడు. అతను ఇంకా ఏదో అందామనుకున్నాడు కాని ఆ అనుకున్నది పైకిరాలేదు. గవర్నరుగారి భార్య మరి రెండు మూడు  మాటలు మాట్లాడి ఇతర అతిథులను పలకరించటానికి గది రెండో చివరకు తన కుమార్తెతో సహా వెళ్ళిపోయింది. షికారుకని బయలుదేరి వీథిలోకి వచ్చిన మనిషి అన్నివైపులా చూసేసమయంలో ఏదో మరిచాననుకుని కొయ్యబారి నిలబడిపోయిన వాడిలాగా చిచీకవ్ అక్కడే నిలబడిపోయాడు. అటువంటిమనిషి పరమచవటలాగా కనిపిస్తాడు, అంతలోనే అతని ముఖాన ఉండిన నిర్విచారభావం కాస్తా మారి పోతుంది; తాను మరిచినదేమిటా అని తన్నుకుంటాడు; చేతిరుమాలా? చేతురుమాలు జేబులోనే ఉంది; డబ్బా?-డబ్బుకూడా జేబులో ఉంది; అన్నీ దగ్గిర ఉన్నట్టే ఉన్నాయి, కాని ఏదో అశరీరవాణి ఏదో మరచిపోయినట్టు చెబుతుంది. అతడు అర్థంలేకుండా, పరధ్యానంగా కదిలే జనంకేసీ, పరిగెత్తేబళ్ళకేసీ, మార్చ్ చేస్తూ వెళ్ళే సైనికుల టోపీలకేసీ, తుపాకీలకేసీ, దుకాణాలమీది సైన్ బోర్డుల కేసీ చూస్తాడు; దేన్నీ స్పష్టంగా చూడడు. అదేవిధంగా చిచీకవ్ తన చుట్టూ జరిగేదానికంతకూ దూరమైపోయాడు. ఈ లోపుగా స్త్రీల సుగంధితాధరాలు నవనాగరికతతోనూ, మర్యాదతోనూ నిండిన సూచనలు పలుకుతున్నాయి, ప్రశ్నలు వేస్తున్నాయి; అవి ఈ ధోరణిలో ఉన్నాయి: “ఈ ప్రపంచంలో ఉండే సామాన్యమనుషులం మీరు దేన్ని గురించి కలలుకంటున్నారో అడగ సాహసించటానికి అనుమతిస్తారా?” “మీ భావన ఏ సుఖమయ ప్రపంచంలో విహారం చేయబోయినదీ తెలుసుకో వచ్చునా?” “మిమ్మల్ని ఆనందసాగరంలో ఓలలాడించే ధన్యురాలెవరో!” అయితే ఇంత చక్కని కవిత్వమూ వృధాఅయిపోయింది, అతను ఒక్కముక్కా వినలేదు. పైపెచ్చు అతను అమర్యాదగా అక్కడి నుండి కదిలి, గవర్నరుగారి భార్య తన కుమార్తెతో సహా ఎటువెళ్ళినదీ చూడటానికి గది అవతలి వేపు వెళ్ళిపోయాడు. అయితే ఆ స్త్రీలు అతన్ని అంతసులువుగా వదిలిపెట్టదలచలేదులాగుంది, వారిలో ఒకతె పురుషుల మనశ్శాంతిని భంగపరిచే ప్రతి ఒక అస్త్రాన్నీ ప్రయోగించి, తనలోగల ఆకర్షణలనన్నిటినీ సమగ్రంగా ఉపయోగించ నిశ్చయించుకున్నది. ఒక్క విషయం చెప్పాలి: కొందరు స్త్రీలు-కొందరు మత్రమే, అందరూ కాదు-ఒక దౌర్బల్యాన్ని ప్రదర్శిస్తారు. తమలో తమకు ఏదైనా ఒక అందం-పెదవులో, నుదురో, చేతులో-ఉన్నదనితోస్తే, దాన్ని అందరూ చూస్తున్నారనీ, ముక్తకంఠంతో, “చూడు, చూడు, ఆమె ముక్కు గ్రీకు ముక్కులాగా అందంగా ఉంది కాదూ?… ఎంత చక్కని పాలరాతి వంటి నుదురో?” అని చెప్పుకుంటున్నారనుకుంటారు. చక్కని భుజాలు గలది, యువకులంతా వాటిని చూసి సమ్మోహితులవుతున్నారనీ,  తాను పక్కగా వెళ్ళినప్పుడల్లా, “ఆమె భుజాలెంత అద్భుతంగా ఉన్నాయి!” అనుకుంటున్నారనీ, వాళ్ళు తన మొహం కేసి గాని, జుట్టుగాని, ముక్కుగాని, నుదురుగాని చూడటంలేదనీ, ఒకవేళ చూసినా వాటిని పరిగణించరనీ అనుకుంటుంది. కొంతమంది స్త్రీలు అలా అనుకుంటారు. నృత్యాలప్పుడు సాధ్యమైనంత ఆకర్షణీయంగా ఉండాలనీ, తనలో విశిష్టంగా ఉన్న వాటిని జేగీయమానంగా ప్రదర్శించాలనీ ప్రతి స్త్రీ కూడా తన మనస్సులో శపథం చేసుకున్నది. వాలెట్జ్ నృత్యం చేస్తూ పోస్టుమాస్టరు భార్య తన తలను ఒక పక్కకు ఎంత ఒయ్యారంగా వంచిందంటే ఆమె ఇంకో ప్రపంచం నుంచి దిగి వచ్చిన దానిలాగా కనబడింది. పాపం, ఒక ఇల్లాలు నృత్యం చెయ్యాలనుకుని రాలేదు, ఎందుకంటే ఆమెకుడిపాదంమీద కాయి రూపంలో చిన్న “ఇబ్బంది” ఏర్పడింది, అందుకని ఆవిడ మెత్తని పాద రక్షలు ధరించింది కూడానూ అయినా ఈ యిల్లాలు, కేవలం పోస్టుమాస్టరు భార్య తాను గొప్పదాన్ననుకుని పోకుండా ఉండగలందులకు ఆ మెత్తని పాదరక్షలతోనే నృత్యంలో చేరిపోయి కొద్దిచుట్లు తిరిగింది.

కాని ఇవేవీ చిచీకవ్ మీద పారతాయనుకున్న విధంగా పారలేదు. అతను ఆడవాళ్ళు చుట్లుతిరగడం కూడా గమనించలేదు, తనను ఆకర్షించిన సుందరి ఎక్కడ ఉన్నదోనని అతను చీటికీ మాటికీ మునివేళ్ళ మీద నిలబడి మనుషుల తలలమీదుగా చూస్తున్నాడు; వీపులమధ్యగా భుజాలమధ్యగా చూడటానికి వంగుతున్నాడుకూడా. చివరకు అతని అన్వేషణ ఫలించింది, తల్లి కూతుళ్ళు ఒకచోటకూచుని కనిపించారు, తల్లి నెత్తినపెట్టుకున్న తలపాగా, అందులోఉన్న ఈకా దర్జాగా ఆడుతున్నాయి. అతను వారిమీదికి దండయాత్ర చేసేవాడులాగా బయలుదేరాడు. వసంతకాల ప్రభావమో, అతన్ని ఎవరన్నా వెనకనుంచి తోశారోగాని, అతను ఏదీ లక్ష్యపెట్టకుండా ముందుకు తోసుకుంటూ వెళ్ళాడు. అతని తోపుతో సారాపన్ను కంట్రాక్టరు పడినంతపని అయి ఒంటికాలిపైన బాలెన్సు కాపాడుకున్నాడు, ఆయనే పడితే ఆయనతో బాటు చాపకట్టగా ఇంకా ఎందరో పడి ఉండేవారు. పోస్టుమాస్టరు సమయానికి వెనక్కు తగ్గి దారి ఇచ్చి అతనికేసి వింతగానూ, కొంచెం వ్యంగ్యంగానూ చూశాడు. కాని అతను వీళ్ళను గమనించనేలేదు; అతనికి దూరాన ఉన్న ఆ అందమైనపిల్ల తప్ప ఇంకేమీ కనపడటం లేదు. ఆమె చేతికి పొడుగుపాటి తొడుగు వేసుకుంటున్నది, బహుశా నృత్యం చెయ్యాలని ఆమె హృదయం తహతహలాడుతూ ఉండి ఉంటుంది.

అప్పటికే నాలుగుజంటలు మడమలతో తాళం వేస్తూ మజుర్కా నృత్యం చేస్తున్నారు. ఒక మిలటరీ కాప్టెను దీక్షగా నృత్యంచేస్తూ, ఎవరూ కలలోకూడా చెయ్యలేనివిధంగా పాదవిన్యాసాలు చేస్తున్నాడు. చిచీకవ్ మజుర్కా నృత్యాలుచేసే వాళ్ళకాళ్ళను దాదాపు తొక్కుకుంటూ గవర్నరుగారి భార్యా, కుమార్తే కూచుని ఉన్న చోటికి చేరుకున్నాడు.

అప్పటికే నాలుగుజంటలు మడమలతో తాళం వేస్తూ మజుర్కా నృత్యం చేస్తున్నారు. ఒక మిలటరీ కాప్టెను దీక్షగా నృత్యంచేస్తూ, ఎవరూ కలలోకూడా చెయ్యలేనివిధంగా పాదవిన్యాసాలు చేస్తున్నాడు. చిచీకవ్ మజుర్కా నృత్యాలుచేసే వాళ్ళకాళ్ళను దాదాపు తొక్కుకుంటూ గవర్నరుగారి భార్యా, కుమార్తే కూచుని ఉన్న చోటికి చేరుకున్నాడు. అతను వారిని సమీపించటం మాత్రం పిరికిగానే ఉన్నది, షోకిలాలాగా అడుగులో అడుగు వేస్తూ, నడవటం ఏమీ లేదు. అతను కాసేపు ఒక కాలిమీద, కాసేపు రెండో కాలిమీద బరువు వేస్తూ ఏమీసరిగా చేయటం చాతగాని వాడిలాగా కూడా కనిపించాడు.

మన కథానాయకుడి హృదయాన్ని ప్రేమభావం ఆవహించిందని నమ్మకంగా చెప్పటానికి లేదు. ఆ మాటకు వస్తే అతనిలాటి మనుషులు, లావూ సన్నమూ కూడా కానివాళ్లు, ప్రేమించగలరనేది అనుమానాస్పదం. అయినప్పటికీ ఇదేదో వింతవికారం, అది అతనికే సరిగా అర్థం కాలేదు. ఈ నృత్యోత్సవమూ, సందడీ, సంభాషణలూ కొన్ని నిమిషాలసేపు అతనికి ఎక్కడో దూరాన ఉన్నట్టుగా తోచింది, ఈ సంగతి తరవాత అతనే తెలుసుకున్నాడు; ఫిడేళ్ళూ, ట్రంపెట్లూ దూరంగా మోగుతున్నట్టనిపించింది, అజాగ్రత్తహా చిత్రించిన బొమ్మలో దూరపు వివరాలు అలుక్కుపోయినట్టుగా, అంతా మంచు తెరకప్పిన విధంగా కనబడింది. కెలుకుడుగా చిత్రించిన ఈ మసక దృశ్యంలో స్పష్టంగా కనిపించినది ఆ సుందరాంగి సుకుమారముఖాంగాలే: చిన్న కోలముఖమూ అప్పుడే బడి చదువు మానేసిన ఆడపిల్లల కుండదగిన సన్నని, సుకుమారమైన శరీరమూ, అందమైన ఆమె అవయవాలను కప్పి, వాటి ఆకారాన్ని ప్రస్ఫుటం చేసే తేలికైన తెల్లని, దాదాపు నిరాడంబరమైన దుస్తులూనూ. ఆమె దంతంమలిచి చేసిన ఆటవస్తువులాగా ఉన్నది; కళాకాంతులు లేని ఆమూక మధ్య ఆమె ఒక్కతే తెల్లగా, స్వచ్ఛంగా, కాంతులీనుతూ కనబడింది.

ఇది కూడా సాధ్యమేలాగ కనిపిస్తుంది; చిచీకవ్ లుకూడా తమ జీవితంలో కొద్ది క్షణాలపాటు కవులై పోతారులాగుంది; కాని “కవి” అన్నమాట అతిశయోక్తి కావచ్చు. ఏమైనా అతను యువకుడు లాగా, దాదాపు అశ్విక సైనికుడిలాగా, అయిపోయాడు. వారి పక్కన ఖాళీకుర్చీ ఉండటం చూసి చప్పున అందులో కూచున్నాడు. మొదట్లో సంభాషణ సాగలేదు, కాని తరవాత పరిస్థితి కొంచెం బాగుపడింది. అతనికి ఆత్మ విశ్వాసంకూడా తిరిగి రాసాగింది… ఈ సందర్భంలో నేను విచారపూర్వకంగా ఒక విషయం చెప్పవలసి ఉంది; అదేమంటే పెద్ద హోదాలలో ఉన్న గొప్పవాళ్లు ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు కాస్త భారీ ప్రసంగాలు చేస్తారు; ఈ విషయంలో లెఫ్టినెంటులు చాలా సమర్థులు, కాప్టెనుకు మించిన హోదా గలవాడు ఇందుకు పనికేరాడు. వాళ్లకది ఎలా చాతనయేదీ దేవుడికే తెలియాలి: వాళ్లు మామూలుగానే మాట్లాడుతున్నట్టుంటారు, కాని వినే యువతి పట్టలేకుండా నవ్వేస్తూ ఉంటుంది. అదే ఏ సివిలు కౌన్సిలరో అయితే రష్యను సామ్రాజ్యంయొక్క విస్తృతిని గురించి ప్రసంగిస్తాడు, ఒకవేళ చమత్కారంగా ఆమెను ప్రశ్నిస్తున్నా ననుకుని మాట్లాడినా  అది పుస్తకాలలో రాసినట్టుంటుంది; నిజంగానే హాస్యంగా ఏదన్నా అన్నాడంటే వినేమనిషికన్న తానే గట్టిగా నవ్వేస్తాడు. మన కథానాయకుడు మాట్లాడుతుంటే గవర్నరుగారి కుమార్తె ఎందుకు ఆవలించినదో పాఠకుడికి అర్థం కాగలందులకు ఈ విషయం ఇక్కడ ప్రస్తావించటమయింది. అయితే అతను ఈ సంగతి గమనించక, అతను ఎన్నోచోట్ల ఎన్నోసార్లు చెప్పిఉండిన అనేక తమాషా సంగతులు ఏకరువు పెట్టాడు; వాటిని అతను లోగడ సింబిర్ స్క్ రాష్ట్రంలో సోఫ్రన్ ఇవానవిచ్ బేజ్ పెచ్నీ ఇంటివద్దా, అది లాయిదా సోఫ్రనన్నా ముగ్గురు ఆడబిడ్దల ఎదటా, ర్యజాన్ రాష్ట్రం లో ఫ్యదోరవిచ్ పెరిక్ట్రోయెవ్ ఇంటా, అతని తమ్ముడు ప్యోతర్ వసీల్వెనిచ్ ఇంటివద్దా, అతని వదినె మొదలైన స్త్ర్రీల ఎదటా, వ్యాత్క రాష్ట్రంలో ప్యోతర్ వర్సనో ఫ్యెవిచ్ ఇంటా, అతని చెల్లెలు వగైరా స్త్ర్రీల ఎదటా చెప్పి ఉన్నాడు.

చిచీకవ్ ప్రవర్తన మహిళలెవరికీ కొంచెం కూడా నచ్చలేదు. ఈ విషయం అతనికి తెలిసిరాగలందులకు ఒక మహిళ పనిపెట్టుకుని అతని పక్కగా నడిచిపోవటమేగాక, గవర్నరు కుమార్తెను అలక్ష్యంగా రాసుకుంటూ వెళుతూ, తన భుజంమీదుగా వెళ్ళాడే స్కార్ఫ్ ఆమె ముఖానికి కొట్టుకునేటట్టు చేసింది, అదే సమయంలో అతనివెనకనున్న ఒక స్త్రీనుంచి “ఊదా” పూలవాసనతో బాటు ఏవో మత్సరపు మాటలు కూడా వెలువడ్డాయి. అతను ఆ మాటలను వినలేదో, వినికూడా వినినట్టు నటించాడోగాని, ఎలాగైనా పొరబాటేచేశాడు; ఎందుకంటే ఆడవాళ్ళ అభిప్రాయాలను పాటించాలి; ఇందుకతను తరువాత పశ్చాత్తాప పడ్డాడు, కాని అప్పటికి మించిపోయింది.

మామూలుగా స్త్రీ పురుషుడి కంటె బలహీనురాలూ, అసహాయురాలూ అయినప్పటికి, కొన్నికొన్ని పరిస్థితుల్లో మగవాడి కన్నా, మరి దేనికన్నా కూడా దృఢంగా తయారవుతుంది. చిచీకవ్ అనుకోకుండా చూపిన తృణీకారభావం మూలాన, అతని సమీపంలో ఆసనాలు సంపాదించటానికి పోటీ పడటంలో తమ మధ్యగల ఐక్యతా సామరస్యాలను దాదాపు నాశనం చేసుకున్న మహిళలు వాటిని తిరిగి నిలబెట్టుకున్నారు.

చాలామంది ముఖాలలో ఆగ్రహం కనిపించింది, అందుకు తగిన కారణంవుందికూడానూ. చిచీకవ్ కు సంఘంలో గొప్పపలుకుబడే ఉండుగాక, అతను కోటీశ్వరుడుగాని, అతని ముఖంలో వీరుల లక్షణాలుంటే ఉండనీ, ఎవడిలోనైనా స్త్ర్రీలు క్షమించలేని విషయాలు కొన్ని వున్నాయి; వాళ్ళు క్షమించకపోయిన ఆ మనిషిని ఖర్చు రాయ వలసిందే! మామూలుగా స్త్రీ పురుషుడి కంటె బలహీనురాలూ, అసహాయురాలూ అయినప్పటికి, కొన్నికొన్ని పరిస్థితుల్లో మగవాడి కన్నా, మరి దేనికన్నా కూడా దృఢంగా తయారవుతుంది. చిచీకవ్ అనుకోకుండా చూపిన తృణీకారభావం మూలాన, అతని సమీపంలో ఆసనాలు సంపాదించటానికి పోటీ పడటంలో తమ మధ్యగల ఐక్యతా సామరస్యాలను దాదాపు నాశనం చేసుకున్న మహిళలు వాటిని తిరిగి నిలబెట్టుకున్నారు. అతను మామూలుగా అన్న మాటలలో వెటకారం ఉన్నట్టు అర్థాలు తీశారు. దీనికితోడు  నృత్యంచేసిన వారిమీద కొందరు యువకులు వ్యంగ్యకవిత్వం చెప్పేసరికి ఆ పద్యాలను చిచీకవ్ కు అంటగట్టారు. (మారుమూల పట్టణాల్లో నృత్యోత్సవాలు జరిగినప్పుడు ఇటువంటి వికటకవిత్వం సృష్టి అవుతూనే ఉంటుంది.) అంతకంతకూ ఆగ్రహం రెచ్చిపోయింది. మూలమూలలచేరి స్త్రీలు అతన్ని గురించి అమర్యాదగా మాట్లాడుకున్నారు. ఇక ఆ పసిదాని సంగతి వేరే చెప్పనవసరం లేదు, ఆమె అదివరకే వారి శాపానికి గురిఅయింది.

ఇప్పుడు మనకథానాయకుడికి అత్యంత విషాదకరమైన అనుభవం తటస్థించనున్నది. ఆ పిల్ల ఒకవంక ఆవలిస్తూఉంటే అతను తనకు అనేక సందర్భాలలో కలిగిన అనుభవాలను చెప్పుకుపోతున్నాడు. ఒక సందర్భంలో గ్రీకు వేదాంతి అయిన డయోజినిస్ నుకూడా ప్రస్తావించాడు. ఇంతలో దూరాన ఉన్న గదినుంచివస్తూ నజ్ ద్ర్యోవ్ కనిపించాడు. అతను తాగే చోటినుంచి తెంచుకుని అయినా వచ్చి ఉండాలి, జోరుగా భారీఎత్తున పేకాట సాగుతున్న మరొక గదినుంచి తనకు తానైగాని, ఇతరులచేత గెంటబడిగాని వస్తూ ఉండవచ్చు. ఏమైనా అతను భలే జలసాగా ఉన్నాడు, ప్రాసిక్యూటరు చెయ్యిపట్టుకుని వేళ్లాడుతున్నాడు. అయినను పాపం అతను అలా ఎంతసేపటినుంచీ అంటిపెట్టుకుని తిరుగుతున్నాడో గాని, ఈ చెట్టపట్టావదిలించుకుని ఎలా బయట పడదామా అని చూస్తున్న వాడిలాగా ప్రాసిక్యూటరు తన కనుబొమలు అన్ని వైపులకూ ఆడిస్తున్నాడు. నిజానికి ఆయనది దుర్భర పరిస్థితే. నజ్ ద్యోవ్ రెండుకప్పుల టీతో బాటు రమ్ కూడా కలిపి తాగి ఉత్సాహం తెచ్చుకుని అడ్డమైన కట్టుకథలూ చెబుతున్నాడు. చిచీకవ్ అతన్ని అంతదూరాన చూస్తూనే త్యాగం చెయ్యటానికి తలపడ్డాడు, అంటే ఆనందదాయకంగా ఉన్న ఆస్థలంనుంచి శీఘ్రంగా పరారీ అయిపోదామని నిర్ణయించుకున్నాడు; రానున్న సమావేశం అతనికి శుభప్రదంగా తోచలేదు. కాని దురదృష్టవశాన సమయానికి గవర్నరుగారు చక్కావచ్చి, ఎలాగైతేనేం పావెల్ ఇవానవిచ్ ని పట్టుకునేందుకు హర్షం వెలిబుచ్చాడు; స్త్ర్రీలప్రేమ చంచలమా, అచంచలమా అనేదాన్ని గురించి తనకూ, మరి ఇద్దరు మహిళలకూ జరుగుతున్న వాగ్వాదంలో అతన్ని తీర్పు చెప్పమని కోరాడు. ఇంతలో నజ్ ద్ర్యోవ్ అతన్ని చూసి దగ్గిరికి రానేవచ్చాడు.

“ఓహో, ఖెర్యోన్ భూస్వామిగారే, ఖేర్యోన్ భూస్వామిగారే!” అని అతను కేకలు పెడుతూ సమీపించి, పెద్దపెట్టున నవ్వుతూంటే, గులాబీల్లాటి అతని బుగ్గలు అదిరాయి. “ఏం చాలామంది చచ్చిన కమతగాళ్ళనుకొన్నావా ఏమిటి? మీకు తెలీదనుకుంటాను. గవర్నరు గారూ, ఇతను చచ్చిన కమతగాళ్ళబేరం చేస్తాడు! ఒట్టు! ఇదిగో. చిచీకవ్! నే చెబుతున్నాగదా, ఇక్కడ అందరమూ నీ మిత్రులమే గవర్నరుగారుకూడా ఇక్కడే ఉన్నారు-నిన్ను నిజంగా ఉరితీయాలి, ప్రమాణపూర్తిగా, ఉరితీయాలిసిందే!”

“ఓహో, ఖెర్యోన్ భూస్వామిగారే, ఖేర్యోన్ భూస్వామిగారే!” అని అతను కేకలు పెడుతూ సమీపించి, పెద్దపెట్టున నవ్వుతూంటే, గులాబీల్లాటి అతని బుగ్గలు అదిరాయి. “ఏం చాలామంది చచ్చిన కమతగాళ్ళనుకొన్నావా ఏమిటి? మీకు తెలీదనుకుంటాను. గవర్నరు  గారూ, ఇతను చచ్చిన కమతగాళ్ళబేరం చేస్తాడు! ఒట్టు! ఇదిగో. చిచీకవ్! నే చెబుతున్నాగదా, ఇక్కడ అందరమూ నీ మిత్రులమే గవర్నరుగారుకూడా ఇక్కడే ఉన్నారు-నిన్ను నిజంగా ఉరితీయాలి, ప్రమాణపూర్తిగా, ఉరితీయాలిసిందే!”

తాను తలమీద నిలబడి ఉన్నదీ, కాళ్లమీద నిలబడి ఉన్నదీ కూడా చిచీకవ్ కు తెలియలేదు.

“చెబితే నమ్మరుగాని, యువర్ ఎక్సెలెన్సీ, నాతో ఇతను చచ్చి పోయిన నా కమతగాళ్లను కొంటానన్నప్పుడు నవ్వలేక చచ్చాను. ఇతను ముప్ఫై లక్షల ఖరీదుచేసే కమతగాళ్లను కొని ఎక్కడో పెట్టబోతున్నాడని వస్తుంటే తెలిసింది. బలే కమతగాళ్లు! మరి అతను నాతో బేరమాడింది చచ్చినవాళ్లకోసం. ఇదుగో, చిచీకవ్, నువు వట్టి పశువ్వి, ప్రమాణపూర్తిగా నువు పశువ్వి! ఇదుగో గవర్నరు గారు కూడా ఇక్కడే ఉన్నారు…ఉన్నారు గదూ, ప్రాసిక్యూటర్?” అన్నాడు నజ్ ద్యోవ్.

కాని ప్రాసిక్యూటరూ, చిచీకవ్, గవర్నరుగారుకూడా ఎలా దిగ్భ్రాంతులయిపోయారంటే, వారికి ఏమనాలో తెలియలేదు. నజ్ ద్ర్యోవ్ వారిస్థితి గమనించకుండా సగం నిషాలో మాట్లాడుకుపోయాడు.

“ఇదుగో, అబ్బీ,  నువు, నువు…చచ్చిన కమతగాళ్లను ఎందుకు కొంటున్నావో తెలిపినదాకా నిన్ను వదలను. ఇదుగో, చిచీకవ్, నిజంగా నువు సిగ్గుపడాలన్నమాట, నాకంటె నీకు ఆప్తమిత్రుడు లేడు, ఆ సంగతి నీకూ తెలుసు…ఇరుగో, గవర్నరుగారు కూడా ఇక్కడే ఉన్నారు…ఉన్నారుగదూ, ప్రాసిక్యూటర్? మే మెలాటి స్నేహితులమో మీరు ఊహించలేరు, యువర్ ఎక్స్‌లెన్సీ. వాస్తవం అంతే, మీరు నాతో ఇక్కడున్న నాతో, ‘నజ్ ద్ర్యోవ్, నిజం చెప్పు, నీకు మీ నాన్న ఎక్కువా, చిచీకవ్ ఎక్కువా?’ అంటే చిచీకవే అంటాను. ప్రమాణపూర్తిగా… బుగ్గమీద ఏదీ ఒక్క ముద్దు! యువర్ ఎక్స్‌లెన్సీ, అతన్ని ముద్దు పెట్టుకొనటానికి మీరు అనుమతిస్తున్నారు. అవును చిచీకవ్, మొరాయించి లాభంలేదు, నీ పాల బుగ్గమీద ఒక్క చిన్న ముద్దుకావాలి.”

నజ్ ద్ర్యోవ్ ముద్దు ఎంత తీవ్రంగా ప్రతిఘటించబడిందంటే అతను దాదాపు నేలపై పడపోయాడు. అతని సంభాషణ వినటం ఇష్టంలేక అందరూ ఎడంగా వెళ్లిపోయారు. కాని అతను చచ్చిపోయిన కమతగాళ్ళ కొనుగోలు గురించి అతను ఎంతగట్టిగా అరిచి, నవ్వాడంటే అది ఆగదిమారుమూలల కూచున్న వాళ్ళుక్కూడా స్పష్టంగా వినపడింది. ఈ విడ్డూరమైన వార్త చెవిని పడేసరికి అందరికీ చెక్క మొహాలుపడి, వాటిలోనుంచి మతిమాలిన ప్రశ్నార్థకపు చూపులు వెలువడ్డాయి. అనేకమందిస్త్రీలు కసిగా, ఒకరినొకరు చూసుకుని వికటంగా మందహాసాలు చేసుకోవటం చిచీకవ్ గమనించాడు; కొందరి ముఖాలలోగల అర్థంగాని చూపులు అతని కంగారు మరింత చేశాయి. నజ్ ద్ర్యోవ్ వట్టి ఝాఠాఖోరని అందరికీ తెలుసు, అతను ఎంత అసంగతమైన విషయాలు చెప్పినా ఎవరూ ఆశ్చర్యపడరు. అయినా మనుష్యమాత్రుడు-మనుష్యమాత్రుణ్ణి దేనితో చేస్తారో ఊహించటం కష్టం. మనుష్యమాత్రుడు ఒక కొత్తసంగతి విన్నట్టయితే, అది ఎంత మతిమాలిన కబురైనా సరే, కొత్తసంగతి అయితే చాలు, వెంటనే ఇంకొక మనుష్యమాత్రుడికి చెప్పేస్తాడా; అంతా చెప్పినా, “చూశావా, ఎలాటి వెర్రికబుర్లు పుడతాయో!” అంటాడే అనుకోండి. ఆప్పుడు రెండో మనుష్యమాత్రుడేం చేస్తాడంటే, అంతా ఆత్రంగా వినేసి తానుకూడా, “అవును, వట్టి పిచ్చికబురు , మనం పట్టించుకోవాలిసిందే కాదు”, అనేసి, మూడో మనుష్యమాత్రుణ్ణి వెతుకుతూ బయలుదేరతాడు-వాడితో ఈ కబురు చెప్పి, “ఎంత పిచ్చికబురో చూశావా?” అనటానికి. ఇలా ఈ వార్త ఊరు ఊరంతా చుట్టేసి, ప్రతివాడిచేత విసుగుపుట్టేదాకా చర్చించ బడుతుంది. ప్రతి ఒక్కడూ చర్చించి ప్రాణం విసిగాక అందరూ దాన్ని అర్థంలేని వార్త అనీ, పట్టించుకోనవసరం లేదనీ ఒప్పుకోవటం జరుగుతుంది.

పైకి అర్థరహితంగా కనబడే ఈ సంఘటన మన కథానాయకుణ్ణి చాలా కలవరపరిచింది. మూఢుడి మాటలు ఎంత పిచ్చిగా ఉన్నప్పటికీ ఒక్కొక్కప్పుడు అతి బుద్ధిమంతులనే కలవరపరుస్తాయి. చక్కగా పాలిష్ చేసిన బూట్లు ధరించి మురికిగుంటలోకి దిగినవాడిలాగా అతను అసంతృప్తిచెంది ఆరాట పడసాగాడు – ఇది అతనికి పరమ అసహ్యకరంగా తోచింది. అతను ఆ విషయం ఆలోచించ వద్దనుకున్నాడు, తన అలోచనలను మళ్లించటానికి ప్రయత్నించాడు, తన మనసును అన్యాయత్తం చేద్దామని పేకాటకు కూచున్నాడు, కాని అతని మనస్సు మెలితిరిగిన చక్రంలాగా వంకరగా నడుస్తున్నది; రెండుసార్లు ముక్కలుంచుకుని కూడా రంగు అందించలేదు, ఒకసారి మరచిపోయి మూడో చేతిన కోతపెట్టాడు, మంచిముక్కలు తగలేసి తన ఆట పాడు చేసుకున్నాడు. ఆట చాలానేర్పుగా ఆడగల పావెల్ ఇవానవిచ్ ఇలాటి తప్పులు ఎలాచేశాడో, తాను ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్న ఇస్పేటురాజు మీద ఎందుకు కోతపెట్టాడో అధ్యక్షుడికి కొంచెం కూడా బోధపడలేదు. సహజంగా, పోస్టుమాస్టరూ, అధ్యక్షుడూ, చివరకు పోలీసు అధిపతి కూడా చిచీకవ్ ను కొంచెం వేళాకోళం పట్టించారు: ప్రేమలో పడ్డావా అని అడిగాడు; పావెల్ ఇవానవిచ్ హృదయం గాయపడిందన్నారు, అతన్ని గాయపరిచిన బాణం ఎవరు వేసినదో తమకు తెలుసులెమ్మన్నారు; ఇదంతా వింటూ అతను నవ్వటానికీ, హాస్యం తిప్పికొట్టటానికీ ప్రయత్నించాడుగాని అందువల్ల అతనికి సుఖం లేకపోయింది. రాత్రి భోజనాలదగ్గిరకూడా అతను కోలుకోలేదు. నిజానికి అతని పంక్తినకూచున్న వారంతా బుద్ధిమంతులే, నజ్ ద్ర్యోవ్ ను అంతకుమునుపే సాగనంపారు, ఎందుకంటే అతను బొత్తిగా దుష్టుగా ప్రవర్తిస్తున్నాడని ఆడవాళ్ళు ఆక్షేపించారు. ఒక నృత్యం మధ్యలో అతను నేలపై చతికిలబడి నృత్యం చేసే స్త్రీల లంగాలు పట్టుకు లాగ సాగాడు. స్త్రీలు అన్నట్టు అది “అన్నిటినీ మించిపోయింది.”

భోజనాల దగ్గిర మహావైభవంగా ఉన్నది. మూడుకొమ్మల కొవ్వొత్తి స్టాండ్లముందు కదిలే ముఖాలలోను, మిఠాయీలలోనూ, బుడ్డీలలోనూ సంతృప్తి వెల్లివిరుస్తుంది. ఆఫీసర్లూ, స్త్రీలూ, డ్రెస్ కోట్లు ధరించిన పెద్దమనుష్యులూ – సమస్తమూ మర్యాద ఓడుతున్నది. పెద్ద మనుషులు ఎగిరి గంతేసి నౌకర్లవద్దనుండి వంటకాలుగల పళ్లాలు అందుకుని వాటిని స్త్రీ జనానికి అందించారు. ఒక కర్నలుగారు కత్తిదూసి, దానిచివర ఒక పళ్ళెంపెట్టి ఒక స్త్రీకి అందించాడు. వయసుమళ్లిన పెద్దమనుష్యుల మధ్య చిచీకవ్ కూచున్నాడు; వారు గట్టిగా వాదోపవాదాలు చేస్తూ, ఆవగుప్పించిన చేపలతో, మాంసంతో బాటు వ్యవహార విషయాలుకూడా ఆరగించారు. అతను చర్చించిన విషయాలన్నీ మాములుగా అతనికి ఇష్టమైనవే, కాని అతను దీర్ఘప్రయాణంతో సొలసి, ఏ విషయమూ ఆలోచించకలేక, ఏ చర్చలోనూ పాల్గొనలేని స్థితిలో ఉన్న వాడిలాగా అయిపోయాడు. భోజనాలు పూర్తి అయిన దాకానైనా ఉండకుండా అతను మామూలుకన్న త్వరగా ఇంటికి వెళ్లిపోయాడు.

తలుపుకు అడ్డంగా పెట్టిన సొరుగులపెట్టే, మూలనుంచి తొంగిచూసే బొద్దింకలూగల చిచీకవ్ గది అదివరకే పాఠకులెరుగుదురు. అందులో ఒక వాలుకుర్చీలో కూచున్న చిచీకవ్ మనస్సు కుర్చీలాగే సౌఖ్యరహితంగా ఉంది. అతని మనస్సులో అసహ్యంతో కూడిన అయోమయస్థితి ఏర్పడి ఉన్నది. అతని హృదయం డొల్ల అయినట్టుగా వుంది. అతను కోపావేశంతో ఇలా అనుకున్నాడు: “ఈ నృత్యోత్సవం ఏర్పాటుచేసిన వాళ్ళు కూలిపోను! ఆ పిచ్చిముండా కొడుకులకు ఏం చూసుకుని ఆనందం? రాష్ట్రమంతటా పంటలు పాడయాయి, క్షామంగా వున్నది, వీళ్ళను చూడబోతే నృత్యోత్సవాలు! మంచి పనే! ఆడంగి రేకులాళ్ళలాగా  దుస్తులూ వీళ్ళూనూ! ఆడది వెయ్యి రూబుళ్ళు దుస్తులుకోసం తగలెయ్యటం దారుణం! కమతగాళ్ళు సంపాదించుకుంది కొల్లగొట్టటమే, లేదూ, అంతకంటె మరీఘోరం మనమిత్రుల అంతరాత్మలనే కొల్లకొట్టటం.  మనుషులు తమ అంతరాత్మల నోళ్ళుకట్టేసి లంచాలెందుకు గుంజుతారో మనకందరికీ తెలుసు; తన భార్యకు ఒక శాలువో, పైన కప్పుకున్నదో, వల్లకాడుది మరేదో కొనటానికి! అది మాత్రం దేనికీ? ఎవతో నీచురాలు పోస్టుమాస్టరు భార్య ఇంకా మంచిదుస్తులు వేసుకున్నదని పోతుందేమోనని వెయ్యి రూబుళ్లు ధారపొయ్యటమే. “నృత్యోత్సవం, నృత్యోత్సవం! బలే బలే!” అని చంకలెగరేస్తారు! నృత్యోత్సవం వట్టి చెత్తది, అది రష్యను జాతీయతకూ, రష్యను స్వభావానికీ అనుగుణమైనదికాదు. దాన్ని చూసి ఏమనుకోవాలి? గ్రాహికంవచ్చినవాడు వయస్సుమళ్లుతున్న నల్లటి దుస్తులుధరించి, చెంగునదూకి కాళ్లు విసరటం మొదలు పెడతాడు. జంటలు జంటలుగా ఏర్పడ్డప్పుడు ఒక మనిషి ఇంకొకడితో ఏదో ముఖ్యవిషయం ముచ్చటించనారంభిస్తాడు, కాని అతని కాళ్ళు మేకకాళ్ళలాగా కుడిపక్కకూ, ఎడమపక్కకూ గెంతుతూనే ఉంటాయి…అనుకరణ, అంతా అనుకరణ! ఫ్రెంచివాడు పదిహేనో ఏట ఎంత కుర్రగాఉంటాడో, నలభయ్యో ఏటకూడా అంతకుర్రగానూ ఉంటాడు గనక మనమూ అలాగే ఉండాలి! అవును, నిజంగా, ఈ నృత్యోత్సవం అయినాక ఏదో పాపంచేసినట్టనిపిస్తుంది, దాన్ని గురించి ఆలోచించ బుద్ధిపుట్టదు. సంఘంలో ఈ పెద్దవాళ్లతో మాట్లాడినాక బుర్ర ఎంతఖాళీగా ఉంటుందో అంత ఖాళీగానూ ఉంటుంది. వాళ్ళు అన్నిటినీగురించీ ప్రసంగిస్తారు, అన్నిటిని పైపైన తడువుతారు, పుస్తకాలలోనుంచి కాజేసినదంతా తెలివిగానూ, ఆకర్షవంతంగానూ వప్పగిస్తారు, కాని వాళ్ళ బుర్రల్లో ఏమీఉండదు. ఈ పోచుకోలు రాయుళ్లతో మాట్లాడినదానికన్న తన వర్తకంగురించి క్షుణ్ణంగా తెలిసిన ఒక మామూలు బేరగాడితో మాట్లాడటం లక్షరెట్లు నయం.

ఈ నృత్యోత్సవంలో దక్కుటేమిటో చెప్పు చూస్తాం! ఏ రచయితలయినా దాన్ని ఉన్నదున్నట్టుగా వర్ణిస్తే ఏమవుతుంది? అది వాస్తవంగా ఎంత నిరర్థకంగా ఉంటుందో పుస్తకంలో కూడా అంత నిరర్థకంగానే ఉంటుంది. అందులో నీతా, అవినీతా, దాన్ని గురించి ఏమనుకోవాలో దేవుడికే తెలియాలి. చదివేవాడు ఛీ అని పుస్తకం మూసేస్తాడు.”

చిచీకవ్ నృత్యోత్సవాలన్నిటినీ ఈవిధంగా ఖండించాడు; అయితే అతని ఆగ్రహానికి మరొక కారణంకూడా ఉన్నదనుకుంటాను. అతని చిరాకుకు కారణం నృత్యోత్సవంకూడా కాదు, తనకందులో మర్యాద దక్కకపోవటం, తన గతి ఎలా కావాలో అలాకావటం, తాను వహించినపాత్ర అనుమానాస్పదంగా పరిణమించటం. ఇంగితం గలవాడుగా ఆలోచిస్తే అదంతా అర్థంలేనిదేమరి; తన పని విజయవంతంగా ముగిసింది గనక బుద్ధి తక్కువమాట వచ్చినా అందువల్ల నష్టం ఏమీలేదు కూడానూ. కాని – మానవస్వభావం చిత్రమైనది. తాను గౌరవించని మనుషులు తనపట్ల అమర్యాదగా ప్రవర్తించారని అతను ఎంతో నొచ్చుకున్నాడు; వాళ్ళ అతిశయమూ, దుస్తుల వ్యామోహమూ తాను నిరసించాడుకూడానూ. కొంచెం ఆలోచించినమీదట తనవల్ల కూడా తప్పు కొంత ఉన్నట్టు స్పష్టమైనాక అతనికోపంమరింత అయింది. అతనికి కోపంవచ్చినది తనమీదకాదు – కాకపోవటం సబబేకూడానూ. మనని మనం నిందించుకోకపోవట మనే దౌర్బల్యం మన ఆగ్రహానికి గురిచెయ్యటానికి మరెవరినైనా మాటవరసకు మనకందరికీ వున్నది. మన నౌకరునో, ఆఫీసులో సమయానికి ఎదురైన మనకింది ఉద్యోగినో, పెళ్ళాన్నో, ఆఖరుకు ఒక కుర్చీనో చూసుకుంటాం. మన ఆగ్రహానికి కుర్చీయే గురికావటం జరిగితే దాన్ని ఎక్కడికి తన్నేస్తామో మనకే తెలియదు, అది ఏ తలుపుకో తగిలి, కోడో, వీపో విరిగి చక్కాపోతుంది – మన ఆగ్రహాన్ని దానికి రుచిచూపిస్తాం. అందుచేత చిచీకవ్ తన ఆగ్రహాన్ని వెళ్ళబోసుకునేటందుకు త్వరలోనే ఒకణ్ణి సంపాదించాడు. అది నజ్ ద్ర్యోవ్. అతను ఘోరమైన శాపనార్థాలన్నిటికీ గురిచేయబడ్డాడని వేరేచెప్పనవసరం లేదు. అలాటి శాపనార్థాలకు సాధారణంగా గురి అయ్యేది లుచ్ఛా పనులు చేసే గ్రామ పెద్దలూ, ఆరితేరిన సైనికాధికారులు ప్రయాణాలు చేసేటప్పుడు బళ్ళు తోలేవాళ్ళూనూ; ఈ సైనికాధికారులు అనాదిగా అమలులో ఉన్న తిట్లను మాత్రమేగాక అనేక కొత్తవికూడా ప్రయోగిస్తారు. వాటిని సృష్టించినకీర్తి న్యాయంగావారికే దక్కాలి. నజ్ ద్ర్యోవ్ బంధువర్గానికంతకూ అక్షింతలు పడ్డాయి, అతని కుటుంబంలో వారు ఘోరమైన శాపనార్థాలకు గురి అయారు.

మన కథానాయకుడు గట్టి వాలుకుర్చీలో చేరగిలబడి, నిద్రలేమితోనూ, తన ఆలోచనలతోనూ బాధపడుతూ, నజ్ ద్ర్యోవ్ నూ అతని వంశాన్నీ శాపనార్థాలు పెడుతున్నాడు; అతని ఎదట వెలుగుతున్న కొవ్వొత్తి కొడిగట్టి ఏ క్షణానఅయినా ఆరిపోయేలాగున్నది; కిటికీలోనుంచి కనిపించే నల్లని ఆకారం నీలంరంగుకు మారే సూచనలు తెల్లవారబోతున్నట్టు తెలియజేస్తున్నాయి, దూరాన కోళ్ళు ఒకదాన్నొకటి పిలుచుకుంటున్నాయి; నిద్రావస్థలో ఉన్న నగరంలో రహదారి వెంబడి ఒక అభాగ్యుడు తన దారితప్ప మరొకటి తెలియకుండా నడుస్తున్నాడు – రష్యాలో ఉండే త్రిమ్మరులు నడిచి అరగదీసిన రహదారి. ఇదేసమయంలో నగరం ఇంకోమూల మరొకసంఘటన జరుగుతున్నది, ఈ సంఘటన మన కథానాయకుడి కష్టాలను మరింత చెయ్యనున్నది. ఈ సంఘటన ఏమంటే: నగరంలోని మారుమూల వీధులగుండా, గొందులగుండా కిరకిరలాడుతూ ఒక వింతవాహనం వస్తున్నది, దానికొక పేరుపెట్టటంకూడా కష్టమే. అది ఒక కోచికాదు; బండికాదు, బగ్గీకాదు, బుగ్గలు వెళ్ళుకొచ్చిన పుచ్చకాయకు చక్రాలు తగిలిస్తే ఎలా ఉంటుందో ఆ వాహనం అలాఉన్నది. ఈ పుచ్చకాయ బుగ్గలు, అనగా తలుపులు, పచ్చరంగు జాడలు కలిగిఉండి, సరిగా మూసుకోవటం లేదు-ఎందుకంటే వాటి బందలూ, బీగాలూ శిథిలావస్థలో ఉన్నాయి; వాటిని తాళ్లువేసి బిగించారు. ఈ పుచ్చకాయనిండా అనేక మొత్తాలున్నాయి, వీటిలో కొన్ని సంచుల్లాగా, మరికొన్ని అప్పడాలకర్రల్లాగా, మరికొన్ని దిళ్ళలాగా ఉన్నాయి; వాటిమీద గోతాలలో రకరకాల రొట్టెలూ, అప్పచ్చులూ ఉన్నాయి. వీటిపైన చేపలతోనూ, కోడి మాంసంతోనూ తయారు చేసిన వంటకాలు తొంగిచూస్తున్నాయి. బండి మెట్టుమీద ఒక బంట్రోతు ఉన్నాడు. అతని గడ్డంమాసి, అక్కడక్కడా నెరసిఉన్నది; అతను పొట్టి చేనేతజాకెట్టు, మెరిసేరంగుది ధరించాడు. ఈ బండిచేసే రణగొణధ్వనికి నగరం అవతలిచివర ఉండే పహరావాడు తన ఈటెగొడ్డలి చేతిలోకి తీసుకుని నిద్రమత్తులో, “ఎవరావెళ్ళేది?” అరిచాడు; కాని ఎవరూ వెళ్ళటంలేదని గ్రహించి, చప్పుడు ఎక్కడో దూరాన అవుతుందని తెలుసుకొని, తన మెడమీద వాలిన ఏదో ప్రాణిని పట్టుకుని, లాంతరుస్తంభందగ్గరికి తీసుకొనిపోయి, దానిమీద పెట్టి ఆ ప్రాణిని తన గోటితో హత్యచేసి, ఈటెగొడ్డలి కిందపెట్టి, తన వీరధర్మాన్ని అనుసరించి మళ్ళీ నిద్రపోయాడు. బండి గుర్రాలకు లాడాలు లేనందున అవి పడుతూ లేస్తూ నడుస్తున్నాయి. అదీగాక అవి నగరపు వీధులలో పరచిన రాళ్ళకు అలవాటు పడినవికావు. ఈ విడ్డూరమైన వాహనం ఒక వీధిలోనుంచి మరొక వీధిలోకి అనేకసార్లు తిరిగి, చిట్టచివరకు సంత్ నికోలై చర్చి పక్కన గల ఒక చీకటి సందులో ప్రవేశించి, పెద్ద ప్రీస్టువాకిలి ముందునిలిచింది. పొట్టి చలిజాకెట్టు తొడుక్కుని, నెత్తికి రుమాలు చుట్టుకున్న ఒక పిల్ల బండిలోనుంచి దిగి, తలుపుమీద రెండు చేతులతోనూ ఎవరో మనిషిని కొట్టుతున్నట్టుగా కొట్టింది. (బంట్రోతు గాఢనిద్రలో ఉండటం చేత వాణ్ణి తరవాత కాళ్లుపట్టుకుని జరజరా కిందికి ఈడ్చారు.) కుక్కలు మొరిగాయి; తలుపులు బార్లా తెరుచుకున్నాయి. వికారమైన బండి చిట్టచివరకు లోపలికి అంతర్థానమయింది.

ఆవరణ ఇరుకుగా వున్నది. దానినిండా కట్టెల గుట్టలూ, కోళ్ళ కొట్టాలూ ఉన్నాయి. అందులో బండి ప్రవేశించింది. అందులోనుంచి ఒక ఆవిడ దిగింది; ఆవిడ మరెవరో కాదు, కరబోచ్క సతి. మన కథానాయకుడు వెళ్ళిపోయాక, ఆవిడకు పెద్ద బెంగ పట్టుకున్నది: అతను తనను మోసగించాడేమో! ఈ బెంగతో ఆవిడ మూడురాత్రులు నిద్రపోక, గుర్రాలకు లాడాలు వెయ్యలేదన్నదికూడా లక్ష్యపెట్టకుండా పట్నానికి బయలుదేరింది. చచ్చినవాళ్లు ఏ ధరకు అమ్ముతున్నారో, కొంపతీసి తాను న్యాయమైన ధరలో మూడోవంతుకే అమ్మిందేమో కనుక్కుందామని ఆవిడ ఉద్దేశం. ఈ సంఘటనయొక్క ప్రభావం పాఠకుడికి ఇద్దరు స్త్ర్రీల మధ్య జరిగిన సంభాషణ స్పష్టం చేస్తుది. ఈ సంభాషణ – దీన్ని గురించి మరొక ప్రకరణంలో తెలుసుకుందాం.

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 30

బెల్లం టీ

-నెమలికన్ను మురళి
చిన్నప్పుడు నన్ను ‘మనవడా’ అనీ, నేను కొంచం పెద్దయ్యాక ‘మనవడ గారా..’ అనీ పిలిచేది. నేనేమో ఆవిణ్ణి మరీ పసితనంలో ‘వెంకాయమ్మా..’ అనీ కొంచం జ్ఞానం వచ్చాక ‘నానమ్మ గారూ..’ అనీ పిల్చేవాడిని.

“బాబూ.. మొహం కడుక్కుని రా. తల దువ్వుతాను. నాన్నగారు నిన్ను వెంకాయమ్మ గారింటికి తీసుకెళ్తారుట…” తల దువ్వించుకోవడం నాకు చాలా చిరాకైనా పనైనా, ఆ చివరి మాటలు వినగానే మంత్రించినట్టుగా నూతి దగ్గరకి పరిగెత్తే వాడిని చిన్నప్పుడు, మొహం కడుక్కోడం కోసం. వెంకాయమ్మ గారింటికి వెళ్ళడం అంటే ఒక చిన్న సైజు పండుగ అప్పట్లో.

బెల్లం పాకం తో చుట్టిన జీడిపప్పు ఉండలు, బెల్లం పూతరేకులు, గోర్మిటీలు, మడత కాజాలు.. వీటిలో కనీసం రెండు రకాల మిఠాయిలని ఇత్తడి పళ్ళెంలో పెట్టి అందిస్తారా.. అవి తినడం పూర్తి కాకుండానే ఓ పేద్ద ఇత్తడి గ్లాసు నిండా నురుగులు నురుగులుగా బెల్లంటీ ఇచ్చేస్తారు. మనం ఇంకేమీ అనడానికి ఉండదు. బుద్ధిగా తాగేయ్యడమే.. పైగా నాన్న కూడా ‘వద్దు’ అనరు.

రెండు చేతులతోనూ గ్లాసుని గట్టిగా పట్టుకుని, ఊదుకుంటూ తాగుతుంటే బెల్లంటీ ఎంత బాగుంటుందంటే.. ఆ రుచి వర్ణించడానికి రాదు. తియ్యగా, వగరుగా, అదోలాంటి వాసనతో.. అంత పేద్ద గ్లాసు చూడగానే అస్సలు తాగ గలమా? అనుకుంటాం.. కానీ తాగుతుంటే ఇంకా తాగాలని అనిపిస్తుంది.. మన ఇంట్లో పాలు తాగినట్టు బెల్లంటీ చివరి చుక్కవరకూ తాగ కూడదు.. ఎందుకంటే గ్లాసు అడుగున నలకలు ఉంటాయి.. అందుకని కొంచం వదిలెయ్యాలి.

వెంకాయమ్మ గారు.. మా ఊళ్ళో పరిచయం అక్కర్లేని పేరు. ఆవిడ మామూలుగా మాట్లాడిందంటే నాలుగు వీధులు వినిపిస్తుంది.. ఇంక కోపం వచ్చిందంటే ఊరంతటికీ వినిపించాల్సిందే. యాభయ్యేళ్లు పైబడ్డ  మనిషైనా అంత వయసులా కనిపించేది కాదు. నల్లని నలుపు, చెయ్యెత్తు మనిషి. జరీ నేత చీర, ఐదు రాళ్ళ ముక్కు పుడక, బేసరి, చెవులకి రాళ్ళ దిద్దులు, మెడలో నాంతాడు, చంద్రహారాలు, కంటె, కాసుల పేరు, చేతులకి అరవంకీలు, కాళ్ళకి వెండి కడియాలు, పట్టీలు.. ఆవిడ పేరంటానికి వచ్చిందంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి నడిచొచ్చినట్టు ఉందని అనేది అమ్మ. వీటిలో సగం నగలు నిత్యం ఆవిడ వంటిమీద ఉండాల్సిందే..  మా ఊరి గుళ్ళో అమ్మవారి మెడలో మంగళ సూత్రాల తర్వాత, మళ్ళీ అంత పెద్ద సూత్రాలు ఆవిడ మెడ లోనే చూశాను నేను.

వాళ్ళ ఇల్లు చూస్తే కోనసీమ మొత్తాన్ని చూసేసినట్టే. వీధివైపు కొబ్బరి చెట్లు. మల్లె పొదలు, జాజితీగలు,  బంతి, కనకాంబరం మొక్కలు. దాటి లోపలి వెళ్తే పేద్ద పెంకుటిల్లు. పెరటి వైపున వంటకి ఇంకో చిన్న వంటిల్లు. ఓ పక్కగా కోళ్ళ గూడు, మరో పక్క వంట చెరకు. కాస్త దూరంలో నుయ్యి. నూతి గట్టుని ఆనుకుని వాళ్ళ కొబ్బరి తోట, కొంచం ముందుకెళ్తే వాళ్ళదే వరి చేను. ఈవిడ  వంటగదిలో నుంచి కేకేసిందంటే పొలంలో కూలీలు ఉలిక్కి పడి, మాటలు ఆపి పని మొదలు పెట్టాల్సిందే.

నేనూ, నాన్నా ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ పెరటి అరుగు మీద కూర్చునే వాళ్ళం. ఆవిడ వంట ఇంట్లో పని చేసుకుంటూనే, ఓ పక్క నాన్నతో మాట్లాడుతూ మరో పక్క పొలంలో పనిచేసే కూలీల మీద అజమాయిషీ చేసేది. చిన్నప్పుడు నన్ను ‘మనవడా’ అనీ, నేను కొంచం పెద్దయ్యాక ‘మనవడ గారా..’ అనీ పిలిచేది. నేనేమో ఆవిణ్ణి మరీ పసితనంలో ‘వెంకాయమ్మా..’ అనీ కొంచం జ్ఞానం వచ్చాక ‘నానమ్మ గారూ..’ అనీ పిల్చేవాడిని. నాన్నని ‘అబ్బాయి’ అనీ అమ్మని ‘కోడలు గారు’ అనీ అనేది. నేనంటే భలే ముద్దు ఆవిడకి.

మా ఊరివాడైన నరసింహ మూర్తి గారిని పెళ్లి చేసుకుని తన పన్నెండో ఏట మా ఊరికి కాపురానికి వచ్చిందట వెంకాయమ్మ గారు. ఆవిడ పుట్టిల్లు మా ఊరికి నాలుగైదు ఊళ్ళు అవతల ఉన్న మరో పల్లెటూరు. జీడి తోటలకీ, మావిడి తోటలకీ ప్రసిద్ధి. కలిగినింటి ఆడపడుచు కావడంతో భూమి, బంగారం బాగానే తెచ్చుకుందని మా ఇంట్లో అనుకునే వాళ్ళు. ఆవిడ వచ్చాకే నరసింహ మూర్తి గారికి దశ తిరిగిందిట. ఆయన స్వతహాగా అమాయకుడు. కష్టపడతాడు కానీ, వ్యవహారం బొత్తిగా తెలీదు.

నలుగురు పిల్లలు బయలుదేరగానే ఇంటి పెత్తనం మొత్తం వెంకాయమ్మగారు తన చేతుల్లోకి తీసుకుందిట. వాళ్లకి ఆరుగురు ఆడపిల్లలు, ఒక్కడే మగపిల్లాడు. మొదటి నుంచీ ఆవిడకి ఆడపిల్లలంటే చిన్నచూపు, ఆస్తి పట్టుకుపోతారని. కొడుకంటే విపరీతమైన ప్రేమ. ఆవిడ పెత్తనం తీసుకున్నాక అప్పటివరకు ఖాళీగా పడున్న పోరంబోకు భూమిని మెరక చేసి కొబ్బరితోట గా మార్చింది. ఉన్న పొలానికి తోడు, మరికొంత పొలం కౌలుకి తీసుకుని వరి, అపరాలు పండించడం మొదలు పెట్టింది. పాడికి పశువులు, గుడ్లకి కోళ్ళు సర్వకాలాల్లోనూ ఇంట్లో ఉండాల్సిందే.

చివరి సంతానానికి నీళ్ళూ, పాలూ చూడడం అయ్యేసరికి పెద్ద కూతురి పిల్లలు పెళ్ళికి  ఎదిగొచ్చారు. అంత సంసారాన్నీ ఈదుతూనే ఊరందరికన్నా ముందుగా తన ఇల్లంతా గచ్చు చేయించింది వెంకాయమ్మ గారు. “ఎదవ కోళ్ళు.. కొంపంతా నాసినం చేసి పెడతన్నాయి..వందలు తగలేసి గచ్చులు సేయించినా సుకం లేదు” అని విసుక్కుందోసారి. “మరెందుకు కోళ్ళని పెంచడం? తీసేయొచ్చు కదా?” అని నేను జ్ఞానిలా సలహా ఇచ్చాను, ఆవిడ పెట్టిన లడ్డూ కొరుక్కుంటూ.

“మీ మావలొచ్చినప్పుడు కోడి గుడ్డట్టు కంచంలో ఎయ్యకపోతే మీ అత్తలు ముకం మాడ్సరా నాయినా? ఈటిని తీసేత్తే గుడ్లెక్కడినుంచి అట్రాను?” అని అడిగిందావిడ. “మా ఆడపడుచుల చేత ఇల్లలికించారు.. మా తోటికోడలు కష్ట పడకూడదని గచ్చులు చేయించేశారు అత్తగారు” అని వేళాకోళం చేసింది అమ్మ. ఊళ్ళో వాళ్ళు ఆవిడ నోటికి జడిసినా, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మొదట తొక్కేది ఆవిడ గడపే. ఇంటికి వచ్చిన వాళ్ళని వట్టి చేతులతో పంపదని పేరు. “అవసరం రాబట్టే కదా మన్ని ఎతుక్కుంటా వచ్చారు.. మనకి మాత్తరం రావా అవసరాలు?” అనేది ఆవిడ.

పొలం పనుల రోజుల్లో వాళ్ళిల్లు పెళ్ళివారిల్లులా ఉండేది. పెరట్లో గాడి పొయ్యి తవ్వించి పెద్ద పెద్ద గంగాళాల్లో ఉప్మా వండించేది.. ఓ పెద్ద ఇత్తడి బిందెలో బెల్లం టీ మరుగుతూ ఉండేది. “కడుపు నిండా ఎడతాది.. మారాత్తల్లి” అనుకునే వాళ్ళు కూలీలు. పని కూడా అలాగే చేయించేది. గట్టున నిలబడి అజమాయిషీ చేయడమే కాదు, అవసరమైతే చీరని గోచీ దోపి పొలంలోకి దిగిపోయేది. సాయంత్రానికి కూలీ డబ్బులు చేతిలో పెట్టి పంపించేది. “ఆళ్ళని తిప్పుకుంటే మనకేవన్నా కలిసొత్తాదా” అంటూ.

వెంకాయమ్మ గారికి భక్తి ఎక్కువే. కార్తీక స్నానాలకీ, మాఘ స్నానాలకీ సవారీ బండి కట్టించుకుని గోదారికి బయలుదేరేది. ఎప్పుడైనా సినిమా చూస్తే అది భక్తి సినిమానే అయ్యుండేది. ఆవిడ సవారీబండి కట్టించిందంటే అది మా ఇంటి ముందు ఆగాల్సిందే. మేము బండిలో కూర్చోవాల్సిందే. నాన్నని నోరెత్తనిచ్చేది కాదు. “ఆయమ్మని నువ్వూ ఎక్కడికీ తీస్కెల్లక, నన్నూ తీసుకెళ్ళనివ్వక.. ఎట్టా నాయినా?”  అని గదమాయించేది.

ఎప్పుడైనా నాన్న ఊరికి వెళ్ళాల్సి వచ్చి, ఇంట్లో మేము ఒక్కళ్ళమే ఉండాల్సి వస్తే రాత్రులు మాకు సాయం పడుకోడానికి వచ్చేది ఆవిడ. పనులన్నీ ముగించుకుని ఏ పదింటికో తలుపు తట్టేది. “ఉడుకు నీల్లతో తానం చేసొచ్చాను కోడలగారా.. మా మనవడు సెవటోసన అనకుండా” అనేది. అది మొదలు అమ్మా, ఆవిడా అర్ధ రాత్రివరకూ కష్టసుఖాలు కలబోసుకునే వాళ్ళు. నేను నిద్రపోయానని నిశ్చయం చేసుకున్నాక, ఆవిడ బయటికి వెళ్లి అడ్డ పొగ పీల్చుకుని వచ్చేది. నాకు తెలిస్తే నవ్వుతానని ఆవిడ భయం. నాకు తెలిసినా తెలీనట్టు నటించే వాడిని. ఆవిడ సాయానికి వచ్చినప్పుడు అమ్మ నిద్రపోయేది కాదు. దొంగాడెవడైనా వెంకాయమ్మ గారి నగల మీద కన్నేసి, ఆవిడ మా ఇంట్లో ఉండగా పట్టుకుపోతే ఆ పేరు ఎప్పటికీ ఉండిపోతుందని అమ్మ భయం.

నాకు జ్వరం వస్తే టీ కాఫీలు తరచూ ఇమ్మని చెప్పేవారు డాక్టరు గారు. నేనేమో బామ్మ తాగే కాఫీ అయినా, వెంకాయమ్మ బెల్లం టీ అయినా కావాలని గొడవ చేసేవాడిని. అమ్మకేమో అంతబాగా చేయడం వచ్చేది కాదు. ఒక్కోసారి వారం పదిరోజుల వరకూ జ్వరం తగ్గేది కాదు. అలాంటప్పుడు ఖాళీ చేసుకుని నన్ను చూడ్డానికి వచ్చేది వెంకాయమ్మ గారు. “వెంకాయమ్మ ఇచ్చే టీ లాంటిది కావాలని గొడవ చేస్తున్నాడు మనవడు. నాయనమ్మగారు ఏం మందు కలిపి ఇస్తారో మరి” అనేది అమ్మ.

“అదేవన్నా బాగ్గెవా బంగారవా నాయినా.. మీ సిన్నత్త సేత అంపుతానుండు..” అనడమే కాదు, మర్చిపోకుండా వాళ్ళ చిన్నమ్మాయికిచ్చి పంపేది. ఎప్పుడు జ్వరం వచ్చినా “వెంకాయమ్మ బెల్లం టీ తాగితే కానీ నీ జ్వరం తగ్గదురా” అని ఏడిపించేది అమ్మ. టీ ఒక్కటేనా? పత్యం పెట్టే రోజున వాళ్ళ పెరట్లో బీరకాయలో, ఆనపకాయో ఎవరో ఒకరికి ఇచ్చి పంపేది.

“టీ తాగి వెళ్ళు బాబూ..” అంది అమ్మ. “నీ టీ ఎవరిక్కావాలి.. నేను బెల్లం టీ తాగుతాను,” అని అమ్మ చెప్పేది వినిపించుకోకుండా వాళ్ళింటికి బయలుదేరాను. “రండి మనవడ గారా.. రండి” ఆవిడ ఎప్పటిలాగే ఆహ్వానించింది.

ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాగానే వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూడడం మొదలు పెట్టింది  వెంకాయమ్మ  గారు. అతనికి పెద్దగా చదువు అబ్బలేదు. వ్యవసాయం పనులు గట్టు మీద నిలబడి అజమాయిషీ చేయడం కూడా అంతంత మాత్రం. వెంకాయమ్మ గారు బలపరిచిన ఆస్తి పుణ్యమా అని సంబంధాలు బాగానే వచ్చాయి. ఆవిడ అన్నలే పిల్లనిస్తామని ముందుకొచ్చారు. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలున్న ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకుంటే కొడుక్కి ముచ్చట్లు జరగవని తన తమ్ముడి ఏకైక కూతురితో కొడుకు పెళ్ళికి ముహూర్తం పెట్టించింది.

ఆవిడ పుట్టిన ఊళ్ళో, పుట్టింట్లోనే కొడుకు పెళ్లి. మా ఊరి నుంచి ఎడ్ల బళ్ళు బారులు తీరాయి. కేవలం మాకోసమే ఒక సవారీ బండి ఏర్పాటు చేసింది వెంకాయమ్మ గారు. పెళ్లింట్లో మాకు ప్రత్యేకమైన విడిది.. మాకు కావలసినవి కనుక్కోడానికి ప్రత్యేకంగా ఒక మనిషి. అంత సందట్లోనూ ఆవిడ మమ్మల్ని. మర్చిపోలేదు. మధ్యలో తనే స్వయంగా వచ్చి ఏం కావాలో కనుక్కుంది. పుట్టి బుద్దెరిగిన ఆ పదేళ్ళ లోనూ అంతటి పెళ్లి నేను చూడలేదు. పెళ్లి కాగానే ముత్యాల పల్లకీలో ఊరేగింపు. పల్లకీ మా ఊళ్లోకి రాగానే కొడుకునీ, కోడలినీ మా ఇంటికి తీసుకొచ్చింది ఆవిడ.

ఆవిడ కోరుకున్నట్టే అల్లుడిని బంగారంతో ముంచెత్తడమే కాక, కొత్త మోటారు సైకిల్ కొనిచ్చాడు మావగారు. మా ఊళ్ళో కొత్త మోటర్ సైకిల్ నడిపిన మొదటి వ్యక్తి వెంకాయమ్మ గారి అబ్బాయే. మూడు బళ్ళ మీద సామాను వేసుకుని కాపురానికి వచ్చింది కొత్త కోడలు. పందిరి మంచం, అద్దం బల్లా, బీరువా.. ఇలా..   అందరిలా ఊరికే ఒక లడ్డూ, మైసూరు పాక్, అరటిపండూ కాకుండా సారె కూడా ఘనంగా తెచ్చుకుంది. మొత్తం తొమ్మిది రకాల మిఠాయిలు. ఊరందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా అన్ని మిఠాయిలు సారె తెచ్చుకునే అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అమ్మకి కచ్చితంగా చెప్పేశాను.

నేను పొరుగూరు హైస్కూలు చదువులో పడడంతో వాళ్ళింటికి పెత్తనాలు తగ్గాయి. అదీ కాక ఆ కొత్త కోడలంటే తెలీని బెరుకు. పాపం ఆవిడా బాగానే మాట్లాడేది. అయినా మునుపటి స్వేచ్చ ఉండేది కాదు. కాలం తెలియకుండానే గడిచిపోతోంది.

ఒకరి తర్వాత ఒకరు వెంకాయమ్మ గారికి ఇద్దరు మనవరాళ్ళు బయలుదేరారు. ‘మగ పిల్లలు కావాల్సిందే’ అని పంతం పట్టడమే కాక, ఆ పంతం నెగ్గించుకుంది ఆవిడ. తర్వాత వరుసగా ఇద్దరు మనవలు. “సొంత మనవలు వచ్చేశారు.. నానమ్మగారికి ఇంక ఈ మనవడు ఏం గుర్తుంటాడు లెండి” వాళ్ళ చిన్న మనవడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు అన్నాను. “ఎంత మాట నాయినా.. నీ తరవాతోల్లే నీ తమ్ముల్లు” అందావిడ ఆప్యాయంగా.

నేను కాలేజీలో చదవడం ఆవిడకి ఎంత సంతోషమో. “మీరూ అన్నయ్య గారిలా సదుంకోవాలి” అనేది తన మనవల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని. వయసు పెరగడం, ఆవిడకి ఓపిక తగ్గడం తో వ్యవహారాల్లో కొడుకు జోక్యం పెరిగింది.. ఆవిడ జోక్యం క్రమంగా తగ్గింది. చేతినిండా డబ్బు ఆడుతుండడంతో అతను వ్యసనాలకి అలవాటు పడ్డాడు. ఒకటీ రెండూ కాదు, వ్యసనాల జాబితాలో ఉండే వ్యసనాలన్నీ అతనికి అలవడి పోయాయి. విపరీతమైన ప్రేమ కొద్దీ కొడుకు మీద ఈగని కూడా వాలనిచ్చేది కాదు వెంకాయమ్మ గారు. ఎక్కువరోజులు పుట్టింట్లోనే ఉండడం మొదలు పెట్టింది ఆవిడ కోడలు.

ఉద్యోగం వెతుక్కుంటూ నేను ఇల్లు విడిచిపెట్టాను. ఇంటికి రాసే ఉత్తరాల్లో మర్చిపోకుండా వెంకాయమ్మ గారి క్షేమం అడిగేవాడిని. జవాబులో ముక్తసరిగా ఒకటి రెండు వాక్యాలు రాసేది అమ్మ. దొరికిన ఉద్యోగం చేస్తూ, మంచి ఉద్యోగం వెతుక్కునే రోజుల్లో ఇంటికి రాకపోకలే కాదు, ఉత్తర ప్రత్యుత్తరాలూ తగ్గాయి. ఫలితంగా కొన్నాళ్ళ పాటు ఆవిడ విషయాలేవీ తెలియలేదు నాకు. కొంచం కుదురుకున్నాక ఊరికి వెళ్లాను, రెండు రోజులు సెలవు దొరికితే. వెళ్ళినరోజు సాయంత్రం ఇంటికి వచ్చిందావిడ. “మనవడు గారికి ఈ నానమ్మ గుర్తుందో లేదో అని ఒచ్చాను నాయినా..” అనగానే నాకు సిగ్గనిపించింది. “రేపు నేనే వద్దామనుకుంటున్నానండీ,” అన్నాను.

ఆవిడెందుకో ఇబ్బంది పడుతోంది అనిపించింది కానీ, విషయం పూర్తిగా అర్ధం కాలేదు. “పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయేమో చూసిరా బాబూ,” అంది అమ్మ. నేనక్కడ ఉండకూడదని అర్ధమై, అక్కడి నుంచి మాయమయ్యాను. ఆవిడ వెళ్ళిపోయాక కూడా అమ్మెందుకో ఆ విషయం మాట్లాడడానికి పెద్దగా ఇష్ట పడలేదు.. “వాళ్ళ పరిస్థితి ఇదివరకట్లా లేదు” అంది అంతే.. మళ్ళీ ఏడాది వరకూ ఊరికి వెళ్ళడానికి కుదరలేదు నాకు. ఊళ్లోకి అడుగు పెట్టగానే చిన్నప్పటి జ్ఞాపకాలతో పాటు నానమ్మగారి బెల్లం టీ కూడా గుర్తొచ్చింది. ఈసారి మిస్సవ్వకూడదు అనుకున్నాను.

మర్నాడు మధ్యాహ్నం ప్రయాణమయ్యాను వెంకాయమ్మగారింటికి. “టీ తాగి వెళ్ళు బాబూ..” అంది అమ్మ. “నీ టీ ఎవరిక్కావాలి.. నేను బెల్లం టీ తాగుతాను,”  అని అమ్మ చెప్పేది వినిపించుకోకుండా వాళ్ళింటికి బయలుదేరాను. “రండి మనవడ గారా.. రండి” ఆవిడ ఎప్పటిలాగే ఆహ్వానించింది. ఆవిడలోనే కాదు, వాళ్ళింట్లో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. పాత చీరలో, మెళ్ళో పసుపు తాడుతో ఉందావిడ. నేను చూడడం గమనించి కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. మనిషి బాగా వంగిపోయినా మాటలో కరుకుదనం తగ్గలేదు. నరసింహ మూర్తిగారు మంచంలో ఉన్నారు. కొంచం ఇబ్బందిగా అనిపించిది నాకు ఆ వాతావరణం.

“ఉజ్జోగం సేత్తన్నారంటగా.. అబ్బాయి సెప్పేడు. జాగర్త నాయినా.. అమ్మా, నాయినా జాగర్త.. ఆళ్ళ పేనం నీమీదే ఉన్నాది.. నువ్వే దాటించాలి..” ఆవిడ గొంతులో నేనెప్పుడూ వినని వైరాగ్యం. ఇది నేను ఊహించని వాతావరణం. కోడలు ఎక్కడా కనిపించలేదు. “అమ్మాయ్.. మనవడగారొచ్చేరు.. టీ ఎట్టియ్యి.. పనజ్దారెయ్యకు.. ఆరికి బెల్లం టియ్యంటే ఇష్టం..” అన్నేళ్ళ తర్వాత కూడా ఆవిడ నా ఇష్టాన్ని గుర్తు పెట్టుకోడం కదిలించింది నన్ను. అంతకు మించి లోపలి గదిలో నుంచి ఎలాంటి స్పందనా రాక పోవడం ఆలోచనలో పడేసింది. అప్పుడు చూశాను వంటింటికి తాళం. పరిస్థితి పూర్తిగా అర్ధమయ్యింది.

“అమ్మిచ్చిందండీ.. ఇప్పుడే తాగేను.. ఇంక ఇప్పుడేమీ తాగలేను” అన్నాను నమ్మకంగా.. కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చేశాను. ఆవిడా, నరసింహ మూర్తిగారూ వాళ్ళ గంజి వాళ్ళు వేరుగా కాచుకుంటున్నారుట. మిగిలిన కాసింత భూమినైనా తన పిల్లలకి మిగల్చాలని మొత్తం పెత్తనం కోడలు తీసుకుందిట. పరిస్థితి అంతవరకూ వచ్చినా వెంకాయమ్మగారు కోడలినే తప్పు పడుతోంది తప్ప, కొడుకుని పల్లెత్తు మాట అనడం లేదుట.. వంటి మీది నగలన్నీ కరిగిపోవడంతో ఇల్లు కదిలి రాలేకపోతోందిట. తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైనా రాత్రి వేళ మా ఇంటికి వచ్చి నాన్న దగ్గర చేబదులు పట్టుకెడుతోందిట. నేను గుచ్చి గుచ్చి అడిగితే అమ్మ చెప్పిన సంగతులివి.

బస్సులో వెళ్తున్నాను కానీ ఆలోచనలన్నీ వెంకాయమ్మ గారి చుట్టూనే తిరుగుతున్నాయి. ఎలాంటి మనిషి..ఎలా అయిపోయింది.. ఊరందరి అవసరాలకీ ఆదుకున్న మనిషికి ఇప్పుడు ఒకరి ముందు చెయ్యి సాచడం ఎంత కష్టం? “నాన్నగారు వాళ్ళింటికి వెళ్ళడం కూడా ఆవిడ ఇష్ట పడడం లేదు.. ఎప్పుడో ఓసారి తనే వస్తోంది.. కొబ్బరి తోట దింపుల మీద వచ్చే డబ్బులతో ఆయనా, ఆవిడా కాలక్షేపం చేస్తున్నారుట,” అమ్మ చెప్పిన మాటలు పదే పదే గుర్తొచ్చాయి. బాధ పడడం మినహా  ఏం చేయగలను నేను?

కొడుకు ఇక ఎప్పటికీ ఇంటికి అతిధి మాత్రమే అనే నిజం నెమ్మదిగా అర్ధం కావడంతో కష్టపడి మా ఇంట్లో ఫోన్ పెట్టించారు నాన్న. టెలిఫోన్ కనెక్షన్ కోసం జనం ఏళ్ళ తరబడి తపస్సు చేసిన రోజులవి. వారానికో ఉత్తరం, ఒక ఫోన్.. అలా ఉండేది కమ్యూనికేషన్. ఓ ఆదివారం సాయంత్రం ఇంటికి ఫోన్ చేసినప్పుడు “ఉదయాన్నే నరసింహ మూర్తి గారు పోయార్రా.. నాన్నగారింకా వాళ్ళింటి దగ్గరే ఉన్నారు” అని అమ్మ చెప్పిన వార్త పిడుగు పాటే అయ్యింది నాకు. అమ్మతో సహా అందరూ వెంకాయమ్మ గారి పసుపు కుంకాల గురించి మాత్రమే బాధ పడుతున్నారు.. కానీ అంత పెద్ద వయసులో, రాజీ పడ్డం అలవాటు లేని మనస్తత్వం ఉన్న ఆవిడ ఒంటరిగా ఎలా బండి లాగించగలదు?

దేవుడు ఆవిడకి తీరని అన్యాయం చేశాడనిపించింది.. డక్కామక్కీలు తినగలిగే వయసులో చేతినిండా భాగ్యాన్నీ, అధికారాన్నీ ఇచ్చి, సాఫీగా సాగాల్సిన చివరి రోజుల్లో ఇన్ని పరిక్షలు పెట్టడం ఏమి న్యాయం అనిపించింది.. ఏ పని చేస్తున్నా నా ఆలోచనల నిండా వెంకాయమ్మ గారే. కేవలం కొడుకు మీద చూపించిన అతి ప్రేమకి ఇంత శిక్ష అనుభవిస్తోందా? అనిపించింది. మూడు రోజుల తర్వాత, ఆఫీసుకి ఫోనొచ్చింది. ఇంటినుంచి అమ్మ.. “వెంకాయమ్మ గారు చనిపోయారు.. ” అదిరి పడ్డాను నేను.

“నరసింహమూర్తి గారు పోయినప్పటి నించీ తిండి తినలేదు, నీళ్ళు తాగలేదు.. నిద్ర అన్నది అసలే లేదు.. పొద్దున్నే ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. డాక్టరుని తీసుకొస్తే ఆయన చెప్పాడు ఆవిడ చనిపోయిందని… అదృష్ట వంతురాలు.. పసుపుకుంకాలతో పార్వతీదేవిలా…” అమ్మ చెబుతూనే ఉంది కానీ నాకు వినిపించడం లేదు.. తర్వాత ఇంకెప్పుడూ నాకు బెల్లం టీ తాగాలనిపించలేదు.

Posted in కథ | 38 Comments

మగ దీపం

— ఎం. ఎస్. నాయుడు

ఒక చెట్టు,

మధ్యాన్నం తార్రోడ్డుపై సముద్రపు గాలినో,

నదిలో కలిసే సముద్రపునీటి గాలినో

వెంటబెట్టుకొని నవ్వుతో కూర్చుంది.

ముడతలు లేని కొమ్మలపై వాలని
నక్షత్రాలని, సూర్యుణ్ణి నిద్ర పొమ్మంది.

ఇంతలో, ఎక్కడికీ చేరలేని గడియారపు
సాలిగూడులోంచి ప్రయాణిస్తుంటే,

ఇల్లు ముక్కలైంది.

మునుపటి మొక్కలూనూ.కీటకాలూనూ.

ఎవరి కుబుసమో తోడుకుంటున్న ఇల్లుకాని ఇల్లిది.

దారిలేని చీకటి బిందువులు అభయమివ్వవు.

భయపెట్టే అవిభాగ కపట పదాలే ఆత్మీయులు. నిద్ర ఒద్దులే.

లిప్ స్టిక్ లిపిలో దాగున్న ప్రేమలు తుడుసుకుంటున్నా,

కొన్ని మరకలు అరమరికలు లేకుండా నవ్వుతాయి.

కాగి ఎగిరే వయసే, వికృత హస్తాలతో ఆహ్వానిస్తోంది.

అందుకునే కలల పాదాలపైన ఉరితాళ్ళు.

అంతరించని పగటి ప్రగతి పులివేషాలు.

స్మరణార్ధుల సమాధుల్లో ఉండకే,

అంత్యక్రియలు లేవు వాటికి.

చీలిన కంటిపాపల్లో బొడ్డులేని కన్నీళ్ళు.

నర్తించు మూస మనుగడలో అని

చెట్టు లోపలి రాత్రి

ఒక మధ్యాన్నపు గాలిని ఎగరగొట్టింది.

Posted in కవిత్వం | Tagged | 3 Comments

ఒక చిన్నబడ్జెట్ కథ

— సిద్ధార్థ గౌతం

ఇది నేను కల్పించిన ఒక నిజమైన కథ. ఈ కథ లోని పాత్రలు డబ్బున్న వాళ్ళా, మధ్య తరగతి వాళ్ళా, పేద వాళ్ళా అన్న విషయం నాకు కూడా తెలియదు.

పుట్టిన పదకొండవ రోజు వరకు నామకరణం చెయ్యరాదటగా – అందుకే ఇప్పుడే పుట్టిన ఈ కథలో ఎవ్వరికీ పేర్లు పెట్టలేదు. కథలోని అన్నదమ్ములిద్దరూ పన్నెండేళ్ళలోపు పిల్లలు. వినటానికి ఎబ్బెట్టుగా ఉన్నా, వాళ్ళిద్దరినీ పెద్దాడు, చిన్నాడు అని పిలుద్దాం.

అసలు దీపావళికి రెండు రోజుల క్రితం వరకు వీళ్ళెవ్వరూ నాకు పరిచయం కూడా లేరు. పిల్లలిద్దరూ వాళ్ళమ్మకు బాణాసంచా తీసుకురావాలన్న విషయం గుర్తుచేస్తున్నప్పుడు మొదటిసారి కలిసాను వీళ్ళను.

ఆ రోజు సాయంత్రం ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చాడు వాళ్ళ నాన్న. టపాకాయల గురించి అడగటానికి వాళ్ళమ్మ పక్కన్నే కూర్చున్నారు పిల్లలిద్దరూ.

“ఇంత ఆలస్యమయ్యింది. ఎక్కడికెళ్ళారు?” అడిగింది అమ్మ.

“వల్లకాటికి” అరిచాడు ఆయన.

పిల్లలిద్దరికీ ఆ అరుపు అర్థమయ్యి పక్క గదిలోకి వెళ్ళారు. అక్కడే ఉంటే బాగోదని నేను కూడా వెళ్ళాను. అక్కడ వాళ్ళ తాతయ్య TV9 చూస్తూ ఉన్నాడు. పక్క గదిలోంచి వినిపించీ వినిపించకుండా ఏవో మాటలు వినిపించాయి. ఆ తరువాత ఏమి జరిగిందో అందరికీ బాగా వినిపించింది –

అమ్మాయిలిద్దరూ ఒకే కాకరొత్తిని ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు పట్టుకుని రోడ్డు మధ్యలో ఉంచిన చిచ్చుబుడ్డి వైపు నడుస్తున్నారు. వారి వెనకాలే ఒక పెద్దాయన – వాళ్ళ నాన్ననుకుంటా – చేతిలో cease fire సిలిండర్ పట్టుకుని నుంచున్నాడు. అమ్మాయిలు వెలుగుతున్న కాకరొత్తిని మెల్లిగా చిచ్చుబుడ్డి దగ్గరకు తీసుకెళ్ళారు…

నాన్న అమ్మను చాచి చెంప మీద కొట్టాడు…

అది విన్న వాళ్ళ తాత సౌండు తగ్గించి, తల పట్టుకుని కూర్చున్నాడు.

పెద్దాడు బయటికి పరిగెట్టాడు. వాడి వెనకాలే చిన్నాడు కూడా పరిగెట్టాడు. ఇంటి పక్కనున్న శివాలయం లోకి వెళ్ళి, రావి చెట్టు కింద కూర్చున్నారు.

” ‘వల్లకాటికి ‘ అంటే ఏంట్రా?” అడిగాడు చిన్నాడు.

“అంటే ఈ దీపావళికి మనకు టపాకాయలు లేవు అని అర్థం” సూక్ష్మం వివరించాడు పెద్దాడు.

అసలు ఇంట్లో వాళ్ళ నాన్న అమ్మను ఎందుకు కొట్టాడో, దానికీ దీపావళి బాణసంచాకు సంబంధం ఏమిటో అర్థం కాలేదు చిన్నాడికి.

“అయినా..నాన్న అమ్మను కొడితే, అమ్మ తిరిగి నాన్నను నాలుగు పీకితే సమస్య తీరిపోతుంది కదా. దీపావళి మళ్ళీ నేను ఐదో క్లాసు చేరాక గాని రాదు..ఛ…” అని బాధపడుతూనే ఉన్నాడు చిన్నాడు.

కాస్సేపయ్యాక ఇద్దరూ రాళ్ళతో రావి చెట్టు మీద తమ పేర్లు రాసి ఇంటికి బయలుదేరారు.

ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న భోంచెయ్యలేదు (ఇంట్లో). అమ్మ పిల్లలిద్దరికీ, ముసలాయనకు భోజనం పెట్టి ఏడుస్తూ పడుకుంది.

మరుసటి రోజు తాతయ్య సౌండు లేకుండా TV9 చూస్తున్నాడు. పెద్దాడు తను పొగు చేసిన కోల్గేట్ టూత్ పేస్టు డబ్బాలతో ఇంట్లో ఈశాన్యం మూల వాస్తు ప్రకారం ఏడు స్థంబాల చార్మినార్ కడుతున్నాడు. ఆడుకోవటానికి బయటకెళ్ళిన చిన్నాడు ఇంటికొచ్చాడు. నేరుగా పెద్దాడు కడుతున్న చార్మినార్ దగ్గరకు వెళ్ళి, పక్కన్నే కూర్చున్నాడు.

“ఏరా అప్పుడే వచ్చేసావు?” అడిగాడు పెద్దాడు.

“సుబ్రహ్మణ్యం వాళ్ళింటికెళ్ళాను. వాడు టపాసులు ఎండబెడుతున్నాడు”

“మనము ఎందుకు ఎండబెట్టట్లేదు అని అడిగాడా వాడు?”

“వాడడక్కముందే నేనే చెప్పేసా – ‘ ఈ సారి మేము ఎండబెట్టద్లేదు ‘ అని..వాడీసారి కొన్న వంకాయ బాంబులు గుత్తొంకాయ బాంబుల్లా ఇంతింత ఉన్నాయి….ఒక్కటి..ఒక్కటంటే ఒక్కటి – వంకాయ బాంబు కొనివ్వమని నాన్నను అడుగుదామేంట్రా? నేనడుగుతా… ఏమంటావ్?..” అన్నాడు చిన్నాడు

“అప్పుడు నిన్ను ఎండబెడతాడు నాన్న – బాగా ఉతికాక. అయినా సుబ్రహ్మణ్యం వాళ్ళింటికెందుకెళ్ళావు? వాడు సోమవారం నుండి టపాసులు ఎండబెడుతూనే ఉన్నాడు. దీపవళి రోజు కూడా కాలవకుండా అలా ఎండబెడుతూ ఉంటాడు…ఆ వెళ్ళేదేదో శీను-సుధాకర్ వాళ్ళింటికెళ్ళుందాల్సింది..వాళ్ళింట్లో ఈ సారి పండగ జరుపుకోవట్లేదు..”

“వాళ్ళ నాన్న కూడా వల్లకాటికి వెళ్ళాడేంటి?”

“వెళ్ళింది వాళ్ళ నాన్న కాదు..నాన్నమ్మ..” (ఇందులో నా ప్రమేయమేమీ లేదు. నేను కథ రాయటం మొదలెట్టక ముందే మొన్నీమధ్యనే ఆవిడ పోయారు)

“అవునా…అయితే ‘ఎందుకు ఎండబెట్టట్లేద’ని శీనూసుధాకర్లను ఎవ్వరూ అడగరన్నమాట….” అని రెండు నిముషాలు మౌనం పాటించి..”మన నాన్నమ్మ బ్రతికుండి, ఇప్పుడు పోయుంటే ఎంత బాగుండేది రా..నాన్న అమ్మను కొట్టల్సిన అవసరం లేకుండా దీపావళి క్యాన్సిలయ్యేది” అని పక్కనున్న టూత్పేస్టు డబ్బా తీసి చర్మినార్ కు ఇంకో స్తంబం తగిలించాడు.

అబ్రకం ముక్కలు ఏరుకొద్దామని ఇంటి నుంచి బయటకొచ్చి వెంకన్న బావి వైపు నడవటం మొదలెట్టారు ఇద్దరూ. దారిలో ఎర్ర బోరింగు దగ్గర ఐదుగురు పిల్లలు నుంచుని – పట్టపగలు రోడ్డు మధ్యలో చిచ్చుబుడ్డి వెలిగించబోతున్న ఇద్దరు అమ్మాయిలను చూస్తున్నారు.

అన్నదమ్ములిద్దరూ ఈ వింతను చూద్దామని వెళ్ళి బోరింగు పక్కన నుంచున్నారు. ఈ చిచ్చుబుడ్డి కార్యక్రమం అయిపోగానే తమ దారిన వెళ్ళి అబ్రకం ముక్కలు ఏరుకుని, వాటితో గనులు తయారుచేసుకుని పేపర్లోకి ఎక్కుదామని వీళ్ళ ఆలోచన.

కాని అబ్రకం గనులను మించిన కుంభకోణం ఇక్కడ జరగబోతోందని తెలియదు వీళ్ళకు.

అమ్మాయిలిద్దరూ ఒకే కాకరొత్తిని ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు పట్టుకుని రోడ్డు మధ్యలో ఉంచిన చిచ్చుబుడ్డి వైపు నడుస్తున్నారు. వారి వెనకాలే ఒక పెద్దాయన – వాళ్ళ నాన్ననుకుంటా – చేతిలో cease fire సిలిండర్ పట్టుకుని నుంచున్నాడు. అమ్మాయిలు వెలుగుతున్న కాకరొత్తిని మెల్లిగా చిచ్చుబుడ్డి దగ్గరకు తీసుకెళ్ళారు. కాకరొత్తి చిచ్చుబుడ్డి కి అర సెంటీమీటర్ దూరం లో ఉందనగా బోరింగు బ్యాచి లో ఒకడు “ఢాం” అని 24 ఫాంటు సైజు లో గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు అమ్మాయిలిద్దరూ కాకరొత్తి గాల్లోకి విసిరి, అది కింద పడేలోగా వాళ్ళింట్లోకి పారిపోయారు. సీస్ ఫైర్ పెద్దాయన రోడ్డు మీద బోర్లా పడుకుని, “లై డౌన్…లై డౌన్” అని ఇంగ్లీషులో శోకాలుపెట్టుకుంటున్నాడు.

ఈ దొంగవిస్ఫోటనానికి కారకుడైన బోరింగుబ్యాచి కుర్రాడు వెళ్ళి ఆ చిచ్చుబుడ్డి తీసుకుని లగెత్తాడు. అక్కడి జనానికి ఏమి జరిగిందో అర్థమయ్యేలోగా వాడు దేశ సరిహద్దు దాటేసాడు. అసలు ఇలా జరుగుతుందని నేనే ఊహించలేదు..ఇక పాపం కథలోని పిల్లలేమి ఊహిస్తారు? అబ్రకం విషయం మర్చిపోయి ఇంటికెళ్ళారు.

సాయంత్రం ఇద్దరూ కొత్త చొక్కాలేసుకున్నారు. వీళ్ళింట్లో దీపావళి సమయంలో ఇలాంటి గొడవేదయినా వస్తుందని ముందుగానే అనుమానమొచ్చి..దశరా టైంలోనే నరకచతుర్దశికీ దీపావళికి కూడా కలిపి చెరో మూడు స్కూల్ యూనిఫార్మ్ చొక్కాలు కుట్టించింది వీళ్లమ్మ..!

లక్ష్మీ వెంకటేశ్వర స్టోర్స్ వాళ్ళ కొట్టులో పూజకు పిలిచారు వీళ్ళను. వాళ్ళమ్మ పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని బయలుదేరింది. చిన్నాడు అమ్మ చెయ్యి పట్టుకుని నడుస్తున్నాడు. పెద్దాడు రెండు చేతులు వెనక్కు కట్టుకుని నడుస్తున్నాడు. కాని ఇద్దరి తలల్లోనూ ఆలోచనొక్కటే – ఉదయం చిచ్చుబుడ్డి చోర్ గురించి.

ఆ కొట్టు దగ్గరకు చేరగానే పిల్లలిద్దరినీ మెట్ల మీద కూర్చోబెట్టి లోపలికెళ్ళింది వాళ్ళమ్మ. మెట్ల పక్కన ఉన్న స్టూలు మీద టపాకాయలు ఉన్న పెద్ద డబ్బా ఉంది.

కొట్టు ఓనరు, ఆయన పిల్లలు ఆ డబ్బా లోంచి ఒక్కొక్కటీ తీసి కాలుస్తున్నారు. రోడ్డు మీద వెలుగుతున్న, పేలుతున్న వాటికన్నా డబ్బా లో ఉన్న టపాకాయలనే చూస్తున్నారు ఇద్దరూ. ఇంతలో కొట్టు ఓనర్ వచ్చి పెద్దాడి చెయ్యి పట్టుకుని..

“రా..భూచక్రం కాలుద్దువుగాని” అని తీసుకెళ్ళాడు.

“ఇది ఇంకోటుందా అండి..మా తమ్ముడు కూడా వచ్చాడు ” అన్నాడు పెద్దాడు

“అయ్యో లేదమ్మ..ఇక మిగిలినవన్నీ పేలే టపాసులే..చిన్నపిల్లలు.. మీరు కాలవలేరు అవి..పర్లేదు..నువ్వు ఈ భూచక్రం వెలిగించు ” అని వెలిగే ఒక కాకరొత్తి ఇచ్చాడు. పెద్దాడు అది తీసుకుని, భూచక్రం వెలిగించి, ఆ వెలుగుతున్న కాకరొత్తి పరిగెట్టుకుంటూ వెళ్ళి చిన్నాడి చేతికిచ్చాడు.

“త్వరగా…అలా వీధిలోకి వెళ్ళు..చెయ్యి ఊపుకుంటూ” అన్నాడు.

అప్పటికే ఆ కాకరొత్తి కాస్త కాలి ఉంది. సరిగ్గా ఇంకో 28 సెకెండ్లు కాలుతుంది (ఔను….టైం సెట్ చేసాను). చిన్నాడు దాన్ని చేతిలోకి తీసుకుని..గుడి దగ్గరి లౌడ్స్పీకర్ లో వచ్చే పాట కన్నా గట్టిగా అరుస్తూ ఆ 28 సెకండ్లలో వీధి ఇటు చివరి నుంచి అటూ చివరి దాక పరిగెట్టాడు. మొహం మీద చిరునవ్వు, నుదుటి మీద చమటతో పెవీలియన్ కు తిరిగొచ్చాడు. పక్కన్నే ఉన్న నీళ్ళ చెంబు లో కాలిన ఆ కాకరొత్తి వేసాడు..”చుర్ర్ర్” అని శబ్ధం చేసిందది..

‘ఈ సారి టపాసులు కాలవలేము ‘ అని అనుకున్న చిన్నాడు ఇప్పుడు నెత్తురు రుచిచూసిన పులిలా అయ్యాడు. బాణా సంచా డబ్బ నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. అన్నయ్య భుజం మీద గోకుతూనే ఉన్నాడు. ఆ గోకుడికి అర్థం తెలిసిన పెద్దాడు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఓ పది నిముషాలు అలా గోకించుకున్న తరువాత కొత్త చొక్క చిరిగిపోతుందేమో అని

“సరే.. కాని ఈ విషయం ఇంట్లో చెప్పావనుకో….” అని చిన్నాడి తల మీద ఒక మొట్టికాయ వేసాడు..

“కొడతావేంట్రా…నేనెందుకు చెబుతాను?” అన్నాడు తల మీద రుద్దుకుంటూ..

“ఒక వేళ చెబితే ఇలాంటివి 50 మొట్టుతాను ” అన్నాడు..

“నేనెళ్ళి ఆ డబ్బా పక్కన్నే నుంచుంటాను. వాళ్ళు కాలవటానికి అటు వెళ్ళినప్పుడు తీస్తాను. నేను తీసేది వాళ్ళెవరయినా చూసారనుకొ..నువ్వు అమ్మ దగ్గరకు వెళ్ళిపో – సరేనా?” అన్నాడు పెద్దాడు.

“ఎవ్వరూ చూడకపోతే?”

డబ్బానే చూస్తూ కూర్చున్నారు ఇద్దరూ. కొట్టు ఓనర్ కొడుకొచ్చి డబ్బలోంచి వంకాయబాంబు తీసుకున్నాడు..”అది మాది” అని అరవబోయాడు చిన్నాడు. ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని కళ్ళతో నవ్వుకుని నోటితో ఊరికే ఉన్నారు.

“ఇక మనమే మన ఊరికి క్లాస్ లీడర్లము. ఆ వంకాయ బాంబుని ఇష్టమొచ్చినన్ని సార్లు కాల్చుకోవచ్చు..” అని గాలిలో టూత్పేస్టు డబ్బాలతో మేడలు కట్టాడు.

మెట్లమీద నుంచి రణరంగం లోకి దూకబొయ్యేలోపు వాళ్ళమ్మ బయటకొచ్చింది..

“పదండ్రా” అని చిన్నాడి చెయ్యి పట్టుకుని మెట్లు దిగింది..ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని అలా మౌనంగా నడిచారు..

ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న ఇంట్లోనే భోంచేసాడు. వాళ్ళమ్మ కూడా ఏడవలేదనుకుంటా – వంట లో ఉప్పు ఎక్కువ కాలేదు.

తాతయ్య దర్జాగా సౌండు పెట్టుకుని చూసాడు TV9. ఇంట్లో పరిస్థితి మామూలుగా ఉంది – దీపావళికి టపాసులు మాత్రం లేవు.

మరుసటి రోజు దీపావళి. పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నారు పిల్లలిద్దరు . TV లో పండగ ప్రత్యేక కార్యక్రమాలు వస్తున్నాయి – కార్యక్రమం మొదట్లో, చివర్లో “దీపావళి శుభాకాంక్షలు” అని చెప్పి మిగతా సమయమంతా “అబ్బో మా సినిమా గొప్ప హిట్టు..దయచేసి చూడండి” అని వేడుకుంటున్నారు..పండగ కాబట్టి టిఫిన్ లేదు. “పన్నెండింటికి భోజనం” అంది అమ్మ..

ఊరంతా బాణా సంచా హోరు. వీళ్ళిద్దరికి మాత్రం అవేవీ వినబడట్లేదు. వీళ్ళ చెవులు, మనసు లక్ష్మీ వెంకటేశ్వర స్టోర్స్ బయట ఉన్న డబ్బా మీద…ఆ డబ్బాలోని వంకాయబాంబుల మీద ఉన్నాయి.

పదిన్నరకు కొట్టుకి బయలుదేరారు ఇద్దరూ. అప్పటికే అక్కడ జనం డ్యూటీ ఎక్కేసారు. తిండి, తిప్పలు మాని ఒళ్ళు తెలియకుండా టపాసులు కాలుస్తున్నారు.

డబ్బా మునుపటి రోజు రాత్రి ఉన్న చోటే ఉంచారు. ఇద్దరూ వెళ్ళి మెట్లదగ్గరే కూర్చున్నారు. రాత్రి చల్లగా ఉండటం వల్ల తెలియలేదు కాని..ఇప్పుడు ఎండ కాస్తోంటే మెట్లకు జ్వరమొచ్చినట్టు విపరీతంగా కాలిపోతున్నాయి. వెళ్ళి నీడలో కూర్చుందామా అంటే డబ్బాలోంచి వంకాయబాంబు తీయటం కష్టం. “కాస్సేపు నిక్కరు మనది కాదు అనుకుందాం” అనుకుని..అలాగే కూర్చున్నారు. (వీళ్ళ కష్టం చూడలేక సూర్యుడికి రెండు, మూడు మేఘాలు అడ్డు పెడదామనుకున్నా..కానీ రూల్స్ ఒప్పుకోవు..)

డబ్బానే చూస్తూ కూర్చున్నారు ఇద్దరూ. కొట్టు ఓనర్ కొడుకొచ్చి డబ్బలోంచి వంకాయబాంబు తీసుకున్నాడు..”అది మాది” అని అరవబోయాడు చిన్నాడు. ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని కళ్ళతో నవ్వుకుని నోటితో ఊరికే ఉన్నారు.

టైము పన్నెండున్నరయ్యింది. డబ్బాలో ఒక్కో టపాకాయ తగ్గుతోంది. సూర్యుడు మిగతా భూగోళాన్నంతా వదిలేసి ఉన్న శక్తినంతా వీళ్ళు కూర్చున్న మెట్లమీదనే ప్రయోగిస్తున్నట్టున్నాడు. ఇక నిక్కర్లు తగలబడిపోతాయేమో అన్న పరిస్థితి వచ్చాక పైకి లేచాడు చిన్నాడు. కంటి నిండా నీళ్ళు..

“ఏరా ఆకలేస్తోందా?” అడిగాడు పెద్దాడు అలా కూర్చునే..

లేదన్నట్టు తలూపాడు చిన్నాడు..

“సరే..నువ్వింటికెళ్ళు..ఇంకాస్సేపట్లో ఎలాగోలా పట్టుకొచ్చేస్తా”

“నువ్వు కూడా రా..”

“నీకు వంకాయ బాంబు కావాలా వద్దా?”

“వద్దు..పోదాం రా” అని పెద్దాడి చొక్కా పట్టుకుని లాగాడు..

పెద్దాడు పైకి లేచి రెండు మొట్టికాయలేసి – “నువ్విప్పుడెళ్ళకపోతే ఇలాంటివి 50 పడతాయి. ఇంటికెళ్ళి భోంచెయ్యి..ఇంకో అరగంట లో వచ్చేస్తా..” అని చిన్నాడిని పంపేసాడు..

నాది ఏమీ చెయ్యలేని పరిస్థితి. పోనీ సాంటా క్లాస్ లాగ ఒక బ్యాగు నిండా వీళ్ళకు టపకాయలు తెచ్చిద్దామా అనుకుంటే…ఇది చిన్న బడ్జెట్ కథ. అలా చూస్తూ ఉన్నానంతే..

అరగంట అనుకున్నది గంటయ్యింది..పెద్దాడు మెట్ల మీద అలానే కూర్చునున్నాడు. మెట్లు కాలుతున్నాయి…అంతకన్నా ఎక్కువ కడుపు కాలుతోంది..

డబ్బాలో ఇక నాలుగైదు టపాకాయలు మిగిలున్నాయి. ఇంకాస్సేపైతే ఇవి కూడా మిగలవని…తెంపు చేసాడు. మెల్లిగా డబ్బా దగ్గరకు జరిగి, దాని అంచు మీద చెయ్యి వేసాడు. ఎవరయినా చూస్తున్నారేమోనని అటూ, ఇటూ చూస్తున్నాడు..కాని వీడికి డబ్బా అంచు మీద తన చెయ్యి తప్ప ఇంకేమీ కనబడట్లేదు..

గుప్పిట విప్పాడు –

వంకాయ బాంబే!!!!!!

గబుక్కున గుప్పిట మూసేసాడు. మెల్లిగా నడవటం మొదలెట్టాడు. సంఘటనా స్థలం నుండి దూరంగా వెళ్తున్న కొద్దీ భయం తగ్గుతూ ఆనందం పెరుగుతూ ఉంది..మరొక్కసారి గుప్పిట తీసి చూసాడు – మళ్ళీ వంకాయ బాంబే!!!

“ధైర్యే సాహసే..” అని డబ్బాలో చెయ్యిపెట్టబోయాడు..ఇలా సగం సగం మంత్రాలు చదివితే పాపమొస్తుందని…”ధైర్యే సాహసే లక్ష్మి” అని ఈసారి పూర్తిగా చదివి చెయ్యి డబ్బాలో పెట్టాడు. చేతికి ఏదో తగిలింది. దాన్ని గుప్పిట పట్టుకుని, మెల్లిగా పైకి తీసాడు. ఒళ్ళంతా చమటలు. ఎండవల్ల పట్టిన చమట కన్నా భయం వల్ల పట్టిన చమట ఎక్కువ గా కారుతోంది..చెయ్యి డబ్బా బయటకొచ్చాక గుప్పిట విప్పాడు –

వంకాయ బాంబే!!!!!!

గబుక్కున గుప్పిట మూసేసాడు. మెల్లిగా నడవటం మొదలెట్టాడు. సంఘటనా స్థలం నుండి దూరంగా వెళ్తున్న కొద్దీ భయం తగ్గుతూ ఆనందం పెరుగుతూ ఉంది..మరొక్కసారి గుప్పిట తీసి చూసాడు – మళ్ళీ వంకాయ బాంబే!!!

ఇక పరుగు మొదలెట్టాడు. మొదలెట్టిన పరుగు ఆపలేదు. వీధి చివర ఎడమ వైపు తిరిగాడు..వేగం పెరిగింది. ట్రాఫిక్కు కాన్స్టబుల్ చౌరస్తా దగ్గర కుడి వైపుకు తిరిగాడు. పూల మార్కెట్టు పక్కనున్న సందు వైపు పరిగెడుతున్నాడు..అక్కడొక పెద్ద రాయి..

కథ మొదలెట్టినప్పటినుండి పిల్లలిద్దరికీ ఏ సహాయమూ చేయలేకపోయానే అన్న బాధ తినేస్తున్న సమయంలో ఈ రాయి కనబడింది నాకు. పెద్దాడు ఈ రాయిని చూడడు అని ఖచ్చితంగా తెలుసు నాకు. అందుకే వాడు అక్కడికి చేరేలోపు నేనెళ్ళి ఆ రాయి తీసి దూరంగా విసిరేసాను. పరిగెట్టుకొస్తున్నవాడికి నేనెందుకు అడ్డు అని పక్కకు జరిగాను. అప్పుడు చూసాను….

ఆ రాయి కింద తారు రోడ్డు లో పెద్ద చీలిక..ఆ చీలిక లో నీళ్ళు.అందులో ఎవ్వరూ కాలువెయ్యకుండా రాయి పెట్టినట్టున్నారు. నాకెలా తెలుస్తుంది??

పెద్దాడు అక్కడకు రానే వచ్చాడు…అందులో కాలు వేసాడు. బొర్లా పడ్డాడు. చేతిలోని వంకాయ బాంబు గుప్పిట్లోంచి బయటకు దొర్లింది..అప్పుడు చూసాడు – దానికి వొత్తి లేదు……..

మెల్లిగా పైకి లేచి, ఆ వొత్తి లేని వంకాయ బాంబు చేతిలోకి తీసుకుని..పక్కన్నే ఉన్న సోడా బండి కి తగిలించిన బక్కెటులోని నీళ్ళతో కాలు కడుక్కున్నాడు. డబ్బాలోంచి తీసిన టపాకాయ తన చేతిని దాటి ఎంతోదూరం వెళ్ళలేదని తెలిసినా…వొత్తి కోసం తన జేబుల్లో వెతికాడు.

వీడు కిందపడటం చూసిన సోడాబండివాడు “దెబ్బ తగిలిందా..ఏది.. కాలు చూపించు” అన్నాడు..దానికి సమధానంగా “దీనికి వొత్తి కావాలి” అన్నాడు పెద్దాడు. “అరెరే..ఏడవకు” అని వాడి బుగ్గలమీద జారుతున్న కన్నీళ్ళు తుడిచాడు సోడాబండివాడు. అప్పటిదాకా తను ఏడుస్తున్నానని తెలియలేదు వాడికి. ఇంతసేపు తెలియని ఆకలి, అలసట ఒక్కసారిగా మీద పడ్డాయి. బండి వాడు ఒక నిమ్మకాయ రెండు ముక్కలుగా కోసి, సగం ఇచ్చాడు. చిన్నాడికిద్దామని ఆ ముక్క జేబులో వేసుకుని ఇంటి వైపు నడక మొదలెట్టాడు.

కాంపౌండు గేటు తెరిస్తే ఆ చప్పుడుకు చిన్నాడు పరిగెట్టుకుంటూ వస్తాడు..ఈ వొత్తి లేని టపకాయ వాడికెలా ఇవ్వాలో అర్థం కాక గేటు దగ్గర అలా నుంచున్నాడు..ఆ తరువాత ఏమి జరుగుతుందో చూడటానికి నాకు మనసొప్పలేదు. కళ్ళు మూసేసుకున్నాను.

~~*~~

సిద్ధార్థ గౌతంరెండురెళ్లుఆరు‘ బ్లాగును నిర్వహిస్తున్న ‘తోటరాముడు’గా సిద్ధార్థగౌతం తెలుగు బ్లాగుపాఠకులకు సుపరిచితులు. ప్రస్తుత నివాసం బెంగుళూరులో. ‘పొద్దు’ గత సంవత్సరం ఇదే నెలలో సిద్ధార్థగౌతంతో ముఖాముఖిని ప్రచురించిన విషయం మా పాఠకులకు గుర్తుండేవుంటుంది.

Posted in కథ | Tagged , , | 24 Comments

ఆమె… ఓ ఆల్కెమీ!

-‘నానీ’

తెలీడానికి చూడడమెందుకు? చూస్తే ఏం తెలుస్తుంది? ఎన్ని జన్మల నుంచి, కలలలోంచి వెదుకుతున్నావు నాకోసం నువ్వు…
-ఊర్వశి

*** *** *** ***

నాకు తెలిసి, మా తెనాలి అమ్మాయిలు బహుశా ఆంధ్రదేశంలోనే ఒక జనరేషన్ ముందుంటారనుకుంటాను. ఒక తరం ముందే సైకిళ్లు తొక్కాం, ఓణీల మీద ఒంపులారబోయకుండా,..

ఆమె ఏమంత పరిచయం లేదు నాకు. నిజానికి నేనావిడ్ని చూడనేలేదు. ఏదో గుంపు ఫొటోలో చటుక్కున మెరవడం చూసి, స్త్రీ మీద నాకుండే సహజమైన, కుతూహలం అనిపించే ఆసక్తిని మించిన ఆపేక్షతో ఒక అసందర్భ టెలిఫోన్ సంభాషణకి సన్నివేశాన్ని కుదుర్చుకున్నాను.

ఏదో రాజకీయ పార్టీలో మరేదో పదవి ఆమెకుండటం ఒక సాకు! ఒక దినపత్రికలో ఛద్మవేషం లాంటి ఓ ఉద్యోగం నాకుండటం ఒక అవకాశం! …అంతే. సమయానుకూల సాన్నిహిత్యాలతో తప్పనిసరై అక్కరకొస్తున్న నవ్వుల్ని తెంపి, ఒక కాగితప్పూల బొకేతో సిద్ధమయ్యాను.

నా ప్రశ్నలకి చివుళ్లుండవు. ఎండు చితుకులు చిటుక్కుమంటున్నాయి టెలిఫోన్ తీగల్లోంచి. ప్రతిగా వినిపించే బదుళ్లకు ఈకలుండవు. ఉన్నా కనిపించవు. ఉన్నట్టు నాకనిపించదు. ఊరికినే ఉండలేని నోరు ‘ఊ’ కొడ్తుందంతే.

అవును, నా ప్రశ్నలకి ప్రాణం లేదు… అందుకే ఆమె బదుళ్లకీ అర్ధంలేదు. కాని యింత అబద్ధంలోను నన్ను వివశుడ్ని చేసిన నిజమొకటుంది…

….. ఆమె నవ్వు!

గుది గుచ్చిన గులాబి దండలోంచి స్వీయ సౌందర్యభారంతో పూరేకులు రాలినట్లు ఆమె నవ్వు. ఓ storm petrel అలల మీద అంగలేస్తూ రెక్కలల్లార్చినట్టు ఆ నవ్వు.

కచ్చితంగా అది అక్కరకొచ్చిన అరువు నవ్వు కాదు. కార్చిచ్చులా మొదలేదో అంతుచిక్కని నవ్వు. తేనెటీగలు మూసిన తుట్టెలో ఆదమరచి తొణికే తియ్యందనాల నవ్వు.

ఈ రాజకీయ కీకారణ్యంలో ఓ బ్రహ్మజెముడు ముల్లు కాదు. నాగరికతల కుండీలో రంగుమారిన cactus సౌందర్యం కూడా కాదు ఆమె. ఎవరీమె?

ఈ మోకాల్లోతు బురదల్లో విరిసిన కెందామరా?

ఎడతెగని సందేహాన్ని వదలేసి నాతో, ఆగిపోయిందా నవ్వు, ఇంటర్వ్యూన్నూ-

*** *** *** ***

హెడ్ ఆఫీసులో నా తలదన్నిన సౌందర్య కాముకుడెవ్వరో ఇంటర్వ్యూని మించి ఆమె ఫోటోని పరిచాడు. స్వయం ప్రకాశిక దీప్తితో వెలుగుతున్న ఆమె చిర్నవ్వుని ఇప్పుడిప్పుడే మసకబారుతున్న mid-career కళ్లతో చూసాను తేరిపార. ఆమెని పలకరించడానికి అంతకు మించి అవకాశమేముంది? నా ఆలోచన కొసను తాకకముందే మోగింది ఫోన్ కృతజ్ఞతగా…

ఇక అదొక ప్రారంభం-

అప్పుడప్పుడూ ముసిరే కార్మబ్బులా పలకరిస్తుందామె. తొలిదశలోని రంగుల్లేని ఆసక్తి, పరిచయాలు తట్టే విప్పపూల వ్యామోహం, కొత్త చనువులు రేపే చెకుముకి ఆర్భాటాలు……

… అన్ని క్రమేణా మాయమయిపోయాయి, ఆమె మాటల్లో తడుస్తుంటే. ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే సంభ్రమంలాంటి విస్మయాన్ని పోలిన బెరకు వంటి భావన, ఆమెకి శ్రోతనైనప్పుడు.

ఏ ఎండుటాకు కిందో గుట్టుగా ఉన్నప్పుడు, ఆకు తొలగి చంద్రకిరణం సోకితే గత్తరపడే గండుచీమ స్థితి నాది. ఇంతా చేసి ఆమె మాట్లాడేది తీరని దాహాల కవిత్వాలు కాదు, hanging gardens లా చకితుల్ని చేసే తాత్విక ప్రభోదాలు కావు.

శతకోటి నీటి బుడగలు తుంపర్ల్లై పక్కు మన్నట్లు తోచే ఆమె మాటలన్నీ నైరూప్యాలు. పునఃసృష్టికి, కనీసం పునఃశ్చరణకీ కూడా సాధ్యంకాని ఒట్టి అనుభవాలు. మట్టి మూకుడులో కాగిన పాలమీగడ, కాదు.. పాల మీగడల వాసనలు.

ఇందాక చెప్పిన బెరకులాంటి బిడియం వంటి భక్తి అనిపించే నా ధ్యానంలో నన్ను వుక్కిరి బిక్కిరి చేస్తూంది ఒకటే సందేహం-

….. ఈ మహోధృత గంగోత్రి, ‘తెనాలి’ అనే చిరు కమండలంలో ఎలా ఒదిగింది?

ఉప్పటి సముద్ర ఘోషని వేనవేల మునివేళ్లతో అలవోకగా వెనక్కి నెట్టిన అమెజాన్ – ఆమె!

ఆమెతో నా అజ్ఞాత స్నేహాలు, intuitive జ్ఞానాల ప్రేరణతో నైవేద్యంలా పంపిన నా కవిత్వాలు, ఆమె ప్రశంసల ప్రతి స్పందనకి నా అనామోదాలు …. ఇవేవీ యీ నా కథకి సందర్భాలు కావు. ఈ మధ్య నా అతి సాధారణ వ్యాఖ్య ఒక నెపంగా, ఆమె విప్పిన విప్పపూల అనుభవమే ఈ కథకి ప్రాణం… ప్రణవం.

*** *** *** ***

“నేను కాఫీ, టీ తాగను”


ఏదో టెలీఫోన్ మాటల మధ్య చెప్పానామెకి. అదేదో మహా బుద్దిమంతనం అనుకొనే నా primitive మూర్ఖత్వాన్ని ఆదిలోనే తుంచేసిన నా హర్షూని గుర్తుతెచ్చుకుంటూ, ఏ భావానికీ తావులేని నిర్లిప్త స్వరంతో అన్నాను… “జస్ట్ అలవాటు కాలేదంతే. అందుకే తాగను”.

ఆమె నవ్వింది…

అప్రయత్నంగా చేయి చాచాను, ఆ వాన పాయల నవ్వుతో జడలల్లాలని.

కొన్ని అలవాట్లు లేకపోవడమే నేను asocial కావడానికి కారణమయిందని నేనామెకు చెప్పలేదు. కానీ, ఒక అలవాటు కావడానికీ, కాకపోవడానికీ మన innate rigidity కారణమవడంలోఉన్న రసహీనతను చెప్పకనే చెప్పిందామె.

ఆమె చెబుతోంది……. కొన్నేళ్ల నాటి ఆల్కెమీ వంటి ఓ అనుభవం… కలవరింతలా-

*** *** *** ***

“…ఇన్నేళ్ల క్రితం…” అని మొదలెడడానికి చిత్రమైన అయిష్టం కలుగుతోంది. వేళ్ల సందున జారిపోతున్నాయో… గుప్పెట్లో నిలిచిపోతున్నాయో అర్థం కానట్టు చక్కిలిగింతలు రేపే పొడి పొడి రేణువుల ఇసుక వంటి గతం. అది కొన్ని సంవత్సరాల నాటి మాటగా చెప్పాలంటే అయిష్టంగా వుంది.


…ఏమిటి? నా గొంతు మారుతోందా… మీ కవిత్వ పరిభాషలో- గద్గదంగా…

అవును. చక్కిలిగింతలు రేపిన ఇసుక రేణువులే జ్ఞాపకాల సుడికి రేగి కంట్లో పడ్డాయి. అదంతా ఏమోగానీ, “ఇన్ని సంవత్సరాల క్రితం…” అని చెప్పి నా వయస్సును మీకు పట్టివ్వకుండా దాయడంలో ఏదో గమ్మత్తైన మురిపెం కూడా వుంది.

మెట్రిక్యులేషన్ పాసై కాలేజీలో చేరిన కొత్త మోజుల రోజులు!

‘ఆంధ్రా ప్యారిస్’ అని ఎందుకంటారో మా తెనాలిని నాకు తెలియదు కానీ, ప్యారీస్ reference తో మా తెనాలిని గుర్తించడం మాత్రం నాకిష్టం లేదు. మా తెనాలి మీకు తెలుసనుకుంటారు గానీ, మీకు తెలిసింది తెనాలి అనే పేరుతో మిగిలిన అవశేషం మాత్రమే. ఇప్పుడు సెల్ ఫోన్లు, సైబర్ కెఫేలు ఆకాశాల్ని అమాంతంగా తెంపి అరచేతిలో పెడ్తుండొచ్చు. కానీ, అప్పటి తెనాలి, ఆజానుబాహుడైన మా నాన్నలా ఉండేది. చుట్టూ పల్లెలన్నీ బారెడు చేతుల భరోసా కింద నిశ్చంతగా ఒదిగి వుండేవి. నలుగురికి నిష్కామంగా సాయపడ్తున్నందుకు తృప్తిగా మెరిసే మా నాన్న కళ్లే చూసాను. అలానే, ఏటికేడాది పారే తెనాలి కాల్వల మిలమిలలే చూశాను. ఇంకో పోలిక ఏమిటంటే, సంప్రదాయమైన వేషం, ఆధునికమైన పోకడ. నాకు తెలిసి, మా తెనాలి అమ్మాయిలు బహుశా ఆంధ్రదేశంలోనే ఒక జనరేషన్ ముందుంటారనుకుంటాను. ఒక తరం ముందే సైకిళ్లు తొక్కాం, ఓణీల మీద ఒంపులారబోయకుండా, పంజాబీ డ్రస్సుల పేరుతో మగాళ్ళ visual feastలని కొంతవరకూ రద్దు చేసేశాం.

వణుకుతున్న గొంతుతో అతనేం మాట్లాడాడో నేనిప్పుడు చెప్పలేను. అతను చటుక్కున నా చేతుల్ని పట్టుకొని తన ప్రేమ సత్యమని చెప్పినప్పుడు నా ఆపాదమస్తకం ఎందుకు కంపించిందో చెప్పలేను. నా ఎంగిలి కాఫీని అమాంతం తాగేసి ఎందుకు అదృశ్యమైయ్యాడో కూడా సరిగా చెప్పలేను. కానీ,..

కానీ, మాకు నాలుగు ఇళ్ళ అవతల ఉండే పరిమళక్క మాత్రం ఒక జనరేషన్ వెనుక ఉండేది. నేను ఇంటర్మీడియట్ చేరినప్పుడు అక్క డిగ్రీఫస్టియర్. అక్కకు తోబుట్టులు ఎవరూ లేరు. అయినా అల్లారు ముద్దుగా పెరగలేదు. క్రమశిక్షణల కత్తుల బోనులో ఎప్పుడూ బిక్కు బిక్కు మనేది. ఆకర్ణాంతలోచనాలని వర్ణించినట్టు అక్కకి చారడేసి కళ్ళు, సిగ్గుతో, సంకోచంతో, క్రమశిక్షణల కర్కశత్వం విధించిన భయంతో కళ్ళు నేలకే అంకితమయ్యేవి. రెప్పల కప్పు కింద తెలిసిన వాళ్ళ ముందైనా ఎప్పుడోగాని మెరవని చిరునవ్వు, చప్పున కందిపోయే చెంపలు, అదే కెంజాయ రంగులో తళుక్కుమనే ముక్కుపుడక, అర్ధంకాని నల్లని ప్రశ్నలు పాయలుగా అల్లుకుపోయినట్టుండే బారెడు జడ. ..పరిమళక్క దాచేసినా దాగని అందాలు.

విరగదీసిన పసుపు కొమ్ము రంగు ఛాయలో ఉండే అక్కకి, నాకు ఒంటి రంగులో తప్ప మరెక్కడా పొంతన లేదు. నా లేత గోధుమ బాబ్డ్ హెయిర్ వర్ణాలు, నా మార్నింగ్ షో సినిమాలు, నా సైకిల్ చక్కర్లు…… వెరసి కాలేజికి ఎగనామాలు…. అన్నీ అక్కకి మహా చోద్యాలు. స్లీవ్ లెస్ టీషర్టు వేసుకున్న నా భుజాల్ని తడుముతుంటే, ఆకాశం అంచులకి ఎగిరే రెక్కల్ని దువ్వినట్టుగా ఉండేదట అక్కకి. అక్క ఏ కొంచెం ప్రపంచమైనా చూసిందంటే అది నావల్లే. తనని అడపాదడపా నాతో తీసుకెళ్తుంటే కాదనే ధైర్యం వాళ్ల చండశాసనుడికి ఉండేది కాదు. డబ్బు, అధికారాల మీద నాకు ఇప్పటికీ వ్యామోహం లేకపోయినా, అది అందించే advantages ని ఆమోదిస్తాను, పరిమళక్క నాన్నగారి లాంటి వారిని వంచడానికి.

అక్కకి ఎంతో కొంత స్వేచ్ఛా ప్రదాయినిని నేనని మురుస్తున్న కొత్తల్లో, తన ప్రేమ వ్యవహారం తెలిసి షాకయ్యాను. తనకి ప్రేమించడం తెలియదని కాదు; తనను ప్రేమిస్తున్నామని, తన తోడులేని జీవితం -తమలపాకు లేని తాంబూలమని.. ఇంకా ఎన్నెన్నో తలతిరిగే ఉపమానాలతో పుంఖానుపుంఖంగా శుక, పిక, మేఘ సందేశాలందించే డజన్లకొద్ది కుర్రాళ్ల మధ్య, తనంతట తాను ఒక్కడిని ఎంచుకో గలిగినందుకే ఆశ్చర్యపోయాను. నాతో కలసి వస్తున్నా, నేలకు అతుక్కుపోయే ఆ కళ్లు, ఏడాది పాటు ఆమె నీడై వెంటాడి, డజన్లకొద్ది ఉత్తరాలై చుట్టుముట్టిన అతని ప్రేమని చదవకుండానే అర్థం చేసుకున్న జాణతనానికి డంగై పోయాను.

పంజరం ఊచలమీద తళుక్కుమంటున్న వెన్నెల తరగల్ని చూసి మురిసిపోతున్న అక్కతో ఇచ్చకాలు పోతూ అడిగాను- చందమామను అసలెప్పుడైనా చూశావా కలువ బాలా, తేరిపార- అని. అవును, కాదుల మధ్యలో తలూపింది. అతను డిగ్రీ ఫైనలియర్. అక్కకి రెండేళ్ళు సీనియర్. పెద్ద అందగాడేం కాదు గానీ, కళ్ళు మాత్రం చాలా అల్లరివి. సిగ్గు…. బిడియం… వంటి స్త్రీత్వపు సహజాభరణాల విషయంలో కడు పేదదానినైన నేను కూడా, అతని కళ్లలోకి చూసి మాట్లాడలేకపోయేదాన్ని. ఏది ఏమైనా, పుణ్యమో, పాపమో, నా రాయబారాలు, ఆరిందా మధ్యవర్తిత్వాలు వాళ్లు మాటలు కలుపుకునేలా చేశాయి.

వేనవేల దివ్వెల ఉల్కాపాతమంటే, అనంతమైన చీకటి – అనావృతమైన ఆకాశాల ప్రణయ ఫలితమని నాకా వయసులో తెలియదు. కోటి పచ్చభాస్వరాల నక్షత్ర వెలుగులు నేలను తాకినట్టే, ఈ నేల మీద స్వచ్ఛంగా వెలిగే ప్రేమదివ్వెల దీప్తి కూడా ఆకాశాన్ని చేరుతుందని మాత్రం నమ్మేదాన్ని. ఈ దీపాల్ని వెలిగించడంలో నా పాత్ర ఉండటం నాకు గర్వమనిపించేది. ఆకాశంలో కొంగల బారుని చూసి, గుప్పిళ్ళు బిగించి గుండ్రంగా తిప్పి, గోరు మీద తెల్లమచ్చ ఉంటే అది కొంగరెట్ట వేసిందని, మహా అదృష్టమని మురిసిపోయే చిన్ననాటి నమ్మకాలకు తర్కంతో పనిలేదు.

గుప్పిళ్లు మూసిన చేతుల్ని ఒకదాని చుట్టూ ఒకటి ‘రిమ్ జిమ్’గా తిప్పడంలో ఓ ఉత్సాహముంది. …కొంత ఉత్సుకత ఉంది. గోరు మీద కొంగరెట్టల్ని ఆశించే ఆనందక్షణాలతో ఇట్టే సంవత్సరం దొర్లిపోయింది. కానీ, గుప్పిట తెరిస్తే అక్క గోరు మీద తెల్ల మచ్చలేదు. అక్క ప్రేమ వ్యవహారం తెలిసి, అరచి యాగీ చేయడం కన్నా, మరింత నేర్పైన క్రమశిక్షణ ప్రకటించాలనుకొన్నాడు వాళ్ల నాన్న. ఫలితంగా పరిమళక్క చదువాగిపోయింది అర్థాంతరంగా; పెళ్లయిపోయింది గోప్యంగా….

పెళ్లయ్యాక ఆషాఢమాసంలో ఒక్కసారి మాత్రం మా ఇంటికి వచ్చింది. ముఖాన పులుముకున్న పెళ్లి కళల ప్లాస్టిక్ నవ్వుల్ని చెరుపుకొని, తనివితీరా ఏడ్చింది నన్ను కావలించుకొని.

నాలుగు నూతుల లోతుల్లోంచి ఎగసి కన్నీళ్లై జారి, వెక్కిళ్లై నాగది గోడల్ని ప్రకంపించిన అక్క దుఃఖం- ఆమె నిష్ఫల ప్రేమకి ప్రతీకగా అనిపించలేదు; స్ఫటిక స్వచ్ఛమైన అనుభవానుభూతులకు పలికిన శాశ్వతమైన వీడ్కోలుగా తోచింది. ఓదార్చే పరిణితి వచ్చినా, ఆ పని చేయబుద్ధికాలేదు. నిజానికి మా మధ్య మాటలే లేవు. కళ్లు తుడుచుకొని, ఏ భావమూ కనిపించని తెల్లతామర ముఖంతో వెళ్లిపోయింది. తొందరలోనే వాళ్ల నాన్న transfer చేయించుకొని ఎక్కడికో వెళ్లి పోయాడు. కనుక, మరెప్పుడూ పరిమళక్క నాకు కనిపించలేదు.

అక్కని చదువుమానిపించినప్పుడే, అతను కూడా అదృశ్యమైపోయాడు. వాళ్లది తెనాలి – గుంటూరు మధ్య ఏదో పల్లెటూరట. తెనాలి నించి రైలులో వెళితే తగులుతుందట… మరో ఏడాది గడిచి నేను డిగ్రీ ఫస్టియర్లో చేరిన కొత్తల్లో, దాదాపు పరిమళక్క ఊసు మరచి పోతున్నపుడు, అతను మళ్లీ కనిపించాడు. నన్ను చూడగానే కనుబొమ్మలెగెరేసే కొంటెతనంలేదిప్పుడు. ఆ కళ్లలో అల్లరి కూడా ఆవిరయిపోయింది.

‘బాగున్నావా’ అని పలకరిస్తే, చెప్పలేనంత రోషం వచ్చింది. ఊతకర్రల సాయం లేకుండా నిటారుగా నిలబడగలిగే ధీరత్వం మగాళ్లలో చాలా తక్కువని ఇప్పటికీ నా నిశ్చితాభిప్రాయం. ఇక ప్రేమికుల విషయమైతే చెప్పనక్కర్లేదు. ప్రేమ గాలాలతో తచ్చాడే వాళ్లు, ఉబుసుపోక ప్రేమించేవాళ్లు, అలవికాని self-pityని ప్రేమగా భ్రమపడి దేబిరించేవాళ్ల గురించి కాదు. ప్రేమొక ధ్యానమని, ప్రేమే ధ్యాస అని బీరాలు పోయే ఆత్మవంచకుల గురించే నేనంటుంది. అతనికి బదులివ్వలేనంత ఆవేశం కమ్మి, తప్పుకొని వచ్చేశాక అనిపించింది, అతన్ని ద్వేషించేంతగా పరిమళక్కని ప్రేమించానా అని. నిజానికి, మాట్లాడలేనితనం నాకు స్వాభావికం కాదు. ‘ఏమైపోయావూ’, ‘ఎందుకు పారిపోయావు’….. వంటి కనీస ప్రశ్నలతో నిలదీయకపోవడం అసలు నా నైజమే కాదు. కానీ, అతను ఎదురై పలకరిస్తే, తప్పుకు వచ్చేశాను, నా స్వభావానికి విరుద్ధంగా-

ఆ తర్వాత దాదాపు ఏడాది పాటు కనిపిస్తూనే ఉన్నాడు. తను నన్నే అనుసరిస్తున్నాడని అర్ధం కానట్టు నటించే హిపోక్రటిక్ జాణతనం, అప్పుడు, ఇప్పుడు కూడా లేవు. కానీ, ఆ ఆలోచనే మరింత రోతగా ఉండేది కాబట్టి, తను నా వెనుక పడుతున్నాడని తలుచుకోవడానికి కూడా నేను ఇష్టపడలేదు. కానీ, తన నుంచి అందిన ఉత్తరాన్ని చదువకూడదన్న నా బెట్టు మాత్రం పట్టులేక జారిపోయింది. ‘ప్రేమ’ అనే పదం వాడాలంటే జంకుతున్నానని, పరిమళకి తనకి మధ్య రాయబారాలు నడిపినప్పుడే నా మీద ఇష్టం కలిగి తన మనస్సు ద్వైదీభావంతో సతమతమయ్యేదని, ఆ ఊగిసలాట నుంచి తప్పుకోవడానికి నెలలతరబడి ఏకాకిలా తిరిగానంటూ… సాగిందా ఉత్తరం. ‘నీ ఉత్తరాన్ని కాల్చి పారేశాన’నైతే చెప్పానే గాని, గొంతులో చూపిన కరుకుదనం గుండెల్లో లేదు, వెన్నెల వలలో చిక్కిన కోనేటి కలవరం తప్ప-

అతని చుట్టూ అల్లుకున్న నా జ్ఞాపకాలకి నిర్థిష్టమైన రూపంలేదు. కానీ, అస్పష్టంగా మెదిలే కలల తుంపుల్లా కదలాడతాయవి. నాలోలోపల ఎప్పుడైనా అలజడి కలిగిందీ అంటే, కచ్చితంగా అది అతని అల్లరి కళ్ల పలకరింపుకే. తరచూ పరిమళక్కతో అతని గురించి వెక్కిరిస్తూ మాట్లాడేదాన్ని. ఆటపట్టించే నా మాటల్ని సరదాగా కొట్టిపారేస్తున్న సంతోషంతో, సిగ్గుతో ఎరుపెక్కే ఆమె బుగ్గల్ని చూడటం బాగుండేది నాకు. బహుశా, అంతకుమించి, అతని ఊసు పదేపదే ప్రస్తావించడంతో ఒక అజ్ఞాతమైన ఆరాటం కూడా ఉండేదేమోనని అనిపిస్తుంది నా జ్ఞాపకాలని నెమరేస్తుంటే-

అతను పరిమళక్క నేస్తం మాత్రమే కాదు. ఎన్నో పరిచిత రహస్యాలు వయసుపొదల మాటున దారికాసిన విషయాన్ని నా యవ్వనారంభంలో నాకు చెప్పకనే చెప్పిన తొలిపురుషుడతను.

షటిల్ బ్యాట్మింటన్ ఆటలో ఏమారిన నా స్కర్ట్ చాటు ఒంపుల్ని దాచే ప్రయత్నంలో అతని గొంతులో మందలింపుల సాధికారం…….

తన డొక్కు లాంబ్రెట్టా నడిపే ప్రయత్నంలో నా మోచేతులు దోక్కుపోతే, అతని ముఖంలో బేలతనం….

….ఇవేవి నేను గుర్తించనివి కాదు. కానీ, నేను వాటిని అప్రధానం చేసి, మరుపు మాళిగల్లోకి తోసేశాను. తను రాసిన ఈ ఉత్తరంతో పైకి ఉబుకుతున్న ఆ జ్ఞాపకాల పెనుగులాటని నిర్థాక్షిణ్యంగా అణిచేశాను, పరిమళక్కతో నాకున్న ఆత్మబంధం వల్ల. మరెప్పుడూ అతని నుంచి ఏ ఉత్తరంలేదు. ఉంటే బాగుణ్ణని ఆశించానేమో చెప్పలేను.

డిగ్రీ అయిపోయి, నేను యూనివర్శిటీలో చేరడానికి వెళ్లేంతవరకూ, నన్ను చూడటం అతనికొక దినచర్య. కనీసం ఒక్కసారి కూడా పలకరింపుగానైనా నేను నవ్వలేదు. తెనాలి విడిచి యూనివర్శిటీ చదువులకి వెళ్ళబోతున్న రోజుల్లో ఒకసారి అడిగాడు… ‘కనీసం కలసి కాఫీ తాగుదామ’ని. నాలుగుసార్లు అడిగాక, ‘సరే’నన్నాను.

వ్యక్తావ్యక్తమైన బాధని రంగుతెలీని ఆవిర్లుగా కక్కుతున్న కాఫీ..

కెఫేలో ఓమూల ఏకాంతంగా తనతో కూర్చొని పింగాణి కప్పులో ముదురుగోధుమ ద్రవాన్ని స్పూనుతో సుడితిప్పుతూ ఉండిపోయాను, మౌనంగా. వణుకుతున్న గొంతుతో అతనేం మాట్లాడాడో నేనిప్పుడు చెప్పలేను. అతను చటుక్కున నా చేతుల్ని పట్టుకొని తన ప్రేమ సత్యమని చెప్పినప్పుడు నా ఆపాదమస్తకం ఎందుకు కంపించిందో చెప్పలేను. నా ఎంగిలి కాఫీని అమాంతం తాగేసి ఎందుకు అదృశ్యమైయ్యాడో కూడా సరిగా చెప్పలేను. కానీ, అదంతా ఓ వీడ్కోలు అని తెలుసు. నేనతన్ని చూడటం అదే చివరిసారి కాబోతుందని కూడా తెలుసు.

తర్వాత చాలా మంది ఇప్పటికీ అడుగుతుంటారు, అంత ఇష్టమైన కాఫీ ఎందుకు మానేశావని. నేనేం మానేయలేదు. ఒక సిప్ మాత్రమే చేశాను. అతని జ్ఞాపకాల మల్లే కప్పు ఇంకా వేడిగానే ఉంది.

ఒక కప్పు ఉన్నప్పుడు వేరే కప్పు ఎందుకు?

*** *** *** ***

Posted in కథ | 13 Comments

2009 నవంబరు గడిపై మీమాట

2009 నవంబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి.

———————————-

Posted in గడి | Tagged | 7 Comments

2009 అక్టోబరు గడి ఫలితాలు

ఈసారి గడికి అపూర్వ స్పందన లభించింది. గడువు 25 రోజులే ఇచ్చినా ఏకంగా 31 పరిష్కారాలు అందాయి. వాటిలో ఆల్ కరెక్టు పరిష్కారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గడి పట్ల పాఠకుల్లో ఆసక్తి, అవగాహన పెరుగుతున్నందున గడిని ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కించడానికి కృషిచేస్తున్నాం.

ఈసారి ఆల్ కరెక్ట్ సమాధానాలు పంపినవారు:
భైరవభట్ల కామేశ్వరరావు, కోడీహళ్లి మురళీమోహన్, వల్లీ సునీత, సుజాత (మనసులో మాట), భమిడిపాటి సూర్యలక్ష్మి, జ్యోతి, వేణు, కంది శంకరయ్య, సుధాంశు పట్రాయని, కామేశ్వరీ దేవి, ఆదిత్య, కిరణ్ కుమార్ మండవ, రామారావు, సుభద్ర.

పాల్గొన్నవారందరికీ అభినందనలు!

-త్రివిక్రమ్

1

ధు

2రా

3

రి

4లో

X

5తే

6గీ

7తి

రీ

X

8

ది

X

X

9పా

వు

10లు

X

11

12చి

13లు

ము

X

14

ము

X

15కా

16సు

X

X

17

లా

X

18

X

X

ద్ర

X

19టు

గా

20

21మం

X

22

23

దే

24శం

X

25ప్రా

X

26త్రి

27

ము

ము

X

28పా

29నీ

30ము

X

31

పా

సే

X

నం

X

32

కా

పు

రి

X

33

లు

34తు

35

X

36వి

X

37వా

యు

38సే

X

39హి

40

X

X

41పా

డు

X

విం

X

X

42మా

X

43

44

ము

X

45కం

చు

46

47ము

X

రా

X

48

తి

49తి

X

X

50చు

క్క

లం

X

51లు

ప్త

ము

X

52

రు

త్మం

తు

డు

X

అడ్డం

1. తలలేదు విధురా! మరి నగలో? సరిగా చూస్తే యమునాతీరంలో. (7)
తలలేదు – మొదటి అక్షరం లేకుండా
విధురా! మరి నగలో? – అనాగ్రాం
సరిగా చూస్తే – అనాగ్రాం సూచన
యమునాతీరంలో – యమునాతీరంలో గల మథురా నగరం
సమాధానం: “మధురానగరిలో”
5. ఒక్కోసారి సీసం వెంట తిన్నగా వచ్చేది కోనలేని కోతి గీతే (4)
సీస పద్యం తర్వాత విధిగా ఆటవెలది లేదా తేటగీతి పద్యం వస్తుంది.
తిన్నగా – అనాగ్రాం సూచన
కో,న లేని కోతి గీతేట – తేటగీతి
8. నాలుగు గోడలు, ఒక కప్పు (2)
గది
9. పాలిచ్చే ఆవు తల, తోకలు పట్టుకుని ఆడించవచ్చు (3)
తల, తోక – మొదటి, చివరి అక్షరాలు
పావులు
11. శిరస్సు కోసం పెనదిరిగిన లత (2)
తల
12. చిన్న ములుకులో ఇనుమును హరించేది (3)
చిలుము
14. మొండికి తోడు సులభంగా పగలని కుండ (3)
ఘటము అంటే కుండ. మొండిఘటం అని వాడుక
15. రూక కోసం తల తాకట్టు పెట్టే తిరకాసు (2)
కాసు అంటే రూక. తల – పదంలోని మొదటిభాగం. తాకట్టుపెట్టడం – వదిలిపెట్టడం.
కాసు
17. మధ్యలో తిరిగిచూస్తే అలా కరిగిపోయేది ఊహేనా?
లాక – అనాగ్రాం
కలా
19. పదాల మధ్య సరిగా ఒద్దిక కూర్చే మంగ గాటు పెట్టింది (4)
తెలుగు సంధుల్లో పదాల మధ్య ఒద్దిక కూర్చేవి ఆగమాలు: నుగాగమం, టుగాగమం, మొ.
సరిగా – అనాగ్రాం సూచన
మంగగాటు – అనాగ్రాం
టుగాగమం
22. దేవన యశం కోరి మారిన ఏథెన్స్ రాజ్యం (5)
గ్రీసు రాజధాని ఏథెన్స్. ఏథెన్స్ రాజ్యం – గ్రీసు (యవన)దేశం.
దేవన యశం – అనాగ్రాం
మారిన – అనాగ్రాం సూచన
యవనదేశం
26. శ్రీరామ విజయం గురించి కలగన్న విశ్రవసు మనవరాలు (3)
అశోకవనంలో సీతకు కాపలాగా ఉన్న రాక్షసస్త్రీలలో త్రిజటకు రాముడు లంకను జయించినట్లు కలవస్తుంది. ఆమె విశ్రవసు కుమారుడైన విభీషణుడి కూతురని అంటారు.
త్రిజట
27. ముదము ఆ విధముగా జారుటకు కారణము (4)
జారుటకు కారణము ఆముదము.
ముదము ఆ – అనాగ్రాం
28. ద్వైపాయమునీ! సేవించండి (4)
సేవించునది పానీయము – అనాగ్రాం
31. సున్నా ఒకటి సున్నా (2)
వపా గా ప్రసిద్ధుడైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య సంతకం రెండు వృత్తాల మధ్య ఒక నిలువుగీతతో 010 లా ఉంటుంది.
వపా
32. ఉత్తరాన అలరి కాపు గాసే యక్షుడి నగరం (5)
అష్టదిక్పాలకుల్లో ఉత్తరదిక్కుకు అధిపతైన కుబేరుడు ఒక యక్షుడు. ఆయన నగరం అలకాపురి.
అలరి కాపు – అనాగ్రాం
33. ద ఒకటైతే తక్కువ, ఎన్నైనా ఎక్కువకావు (2)
ఒకటి కంటే ఎక్కువ ‘ద’లు – దలు
34. మొదలు చివరయేందుకు తల మారిస్తే తోక రాలిపోయింది (2)
మొదలు అనే పదంలో చివరి అక్షరం (తోక) తొలగించి, చివర అని అర్థం వచ్చేలా మొదటి అక్షరం (తల) మార్చాలి.
తుద
36. ఒక వనిత. 52 అడ్డం కన్నతల్లి (3)
అనూరుడు, గరుత్మంతుల కన్నతల్లి వినత.
వనిత – అనాగ్రాం
vinata
37. పైనుంచి దాడి సేయు వాన (4)
సేయు వాన – అనాగ్రాం
వాయుసేన
39. మహికి మనుమరాలు (3)
హిమజ – హిమవంతుడి కూతురు.
41. ఛీ …! షండుడికి తలాతోకా లేవు. పాషండుడి తల తగిలించండి (2)
‘ఛీ పాడు!’ లో చుక్కల స్థానంలో లోపించినది ‘పాడు’.
షండుడిలోని మధ్యాక్షరానికి ముందు ‘పా’ చేర్చగా వచ్చేది పాడు
42. చాలు తప్పిన వనమా మనిషికి సంబంధించినది ? (3)
వనమా – అనాగ్రాం
చాలు తప్పిన- అనాగ్రాం సూచన
మనిషికి సంబంధించినది – మానవ
43. సరిగా వాడుకుంటే మునగకొయ్యే కొండంత! (3)
మునగ – అనాగ్రాం
సరిగా – అనాగ్రాం సూచన
కొండ – నగము
45. కుబుసం పాము తొడుక్కునే లోహపు రవికా? (4)
కంచుకము = కుబుసం, రవిక.
కంచు – లోహమిశ్రమం
48. తిరపతిలో దారితప్పిన మన్మథుడు (4)
తిరపతి – అనాగ్రాం
దారితప్పిన – అనాగ్రాం సూచన
రతిపతి – మన్మథుడు
50. చక్కని బిందువు (2)
బిందువుకు సమానార్థకం చుక్క. అని అందమైన అమ్మాయిని చక్కని చుక్క అంటాం.
చుక్క
51. క్లుప్తములో లోపించినది (3)
లుప్తము
52. 36 అడ్డం కొడుకు (5)
గరుత్మంతుడు

నిలువు

1. మకరీ! చిన్నబోకు, అవి నీళ్ళు కాదు (4)
నీళ్ళు లేకపోయినా ఉన్నట్లు కనిపించేది మరీచిక లేక ఎండమావి.
మకరీ! చి – అనాగ్రాం

2. వార్ధక్యాన్ని వదిలించుకుని సర్దుకున్న ముదిగారము కర్ణపేయము (3)
వార్ధక్యం – ముది(మి)
రాగము
3. దినచర్యలో ఎదురేగిన ప్రవాహం (2)
నది
4. మహర్షి పాముద్రలో సహధర్మచారిణి (4)
లోపాముద్ర – అగస్త్య మహర్షి భార్య
5. విషప్పురుగు కాలుమీటుతే నొప్పి భరించలేం (4)
తేలుకాటు
6. రాతతో రైము కలిపే రేఖ గురించి పార్థసారథి చెప్పాడు (2)
రేఖ, భగవద్గీత అనే రెండు అర్థాల్లో వాడే పదం గీత.
7. అలతిగా దానమియ్యొచ్చు, నీళ్ళలో కలపొచ్చు (2)
తిలలు (తిలదానం, తిలోదకాల గురించి ప్రస్తావన)
13. యములాలు ఎక్కి తిరిగేది (4)
లులాయము అంటే దున్నపోతు. యముడి వాహనం.
16. స్లిప్పుల బ్లాగరి ఏమయ్యారో శాలీనుడినడగాలి! (3)
పొద్దు గడికి తన బ్లాగులో చాలాకాలం స్లిప్పులు అందించారు సుగాత్రి. కళాపూర్ణోదయంలోని సుగాత్రి – శాలీనుల కథ ప్రసిద్ధం.
18. యమున వడ్డున గల తోట (3)
మునవ – అనాగ్రాం
వనము
20. వనజ గదను సవరిస్తే వినాయకుడు ప్రత్యక్షం (5)
వనజ గద – అనాగ్రాం
గజవదన
21. అగ్గిపాలైన కట్టడాలు (4)
మంటపాలు!
23. రుణుడి వడ నంది తలలు కలిసిన ముఖం (3)
వదనం (తలలు – మొదటి అక్షరాలు)
24. తొడపాశం సరే! అందగత్తె తిరగబడి తలపాశం పెడుతుందట! (4)
తలపాశం అనాగ్రాం శంపాలత. అంటే మెరుపుతీగె.
25. యువకుడు కోమలాంగి ప్రాపు బాయడు (5)
ప్రాయపువాడు
27. సిమాచలం తుహినమయమా? ఆసే ఉంది గానీ దేశమంతా వెదికినా సినమామయ లేడు (7)
‘సిమాచలం తుహినమయమా? ఆసే’ లో సి,న,మా,మ,య అనే అక్షరాలు తొలగించి సర్దగా వచ్చేది ఆసేతుహిమాచలం. అంటే భారతదేశమంతటా అని.
29. తిరగబడ్డ పాత డబ్బు నాకు కాదు. మరి …? (2)
నీకా? (పాతకాలపు కరెన్సీ ‘కానీ’)
30. మరియకు కొమ్ములు మొలిచినంత సంతోషం (3)
మురియు
32. వరస మార్చి వ్యర్థంగా పేర్చితే వరస అనము (6)
వ్యర్థం అంటే అనవసరం. వరస అనము – అనాగ్రాం
వరస మార్చి – అనాగ్రాం సూచన.
అనవసరము
35. గతి తప్పిన మతి నీదని అణచిపెట్టిన నీతి (3)
గతి తప్పి – అనాగ్రాం సూచన
న మతి నీద – అనాగ్రాం
అణచివేసే నీతి – దమననీతి
38. సేవ తరువాత ఇంచుకైనా తాగాలిలే (3)
సేవించు
40. వజ్రాలు సరళంగా రాసిపోసినంత! (4)
వజ్రాలరాశి జవరాలు 🙂
41. జ్ఞాపకశక్తి లేనిదానికి ప్రతీకారేచ్ఛ అంటగట్టడం పాపముగదా! (4)
పాపముగ – అనాగ్రాం
పాముపగ
44. ఖతి సరి గమనం (2)
సరి – సరి (2,4) స్థానాల్లోని అక్షరాలు: గ,తి
గమనం – గతి
46. జవరాలి ప్రేమను తిరస్కరించు కడు కఠినాత్ముడు (3)
జవరాలి (దేవయాని) ప్రేమను తిరస్కరించినవాడు కచుడు.
చుకడు – అనాగ్రాం
47. ముసలినక్కకు కావలసిందేమిటో దాన్ని చుట్టుకునే ఉంది (2)
ముక్క
49. శ్రీ (2)
తిరు

Posted in గడి | Tagged | 5 Comments

మృతజీవులు – 29

-కొడవటిగంటి కుటుంబరావు

ఎనిమిదవ ప్రకరణం

చిచీకవ్ చేసిన క్రయం గురించి మాట్లాడుకున్నారు. నగరంలో చర్చలు జరిగాయి. ఒకచోటకొన్న కమతగాళ్లని మరొకచోటికి తరలించటం లాభసాటి బేరము కాదా అన్న విషయమై ఎవరికి తోచినట్టు వారు చెప్పారు. వాగ్వాదాల ధోరణినిబట్టి చాలామందికీ విషయం క్షుణ్ణంగా తెలిసినట్టు స్పష్టమయింది. “అది సరి అయిన పనేలెండి. ఇది మాత్రం నిజం: దక్షిణాది పొలాలు మంచివీ, సారవంతమైనవీనూ, కాని చిచీకవ్ మనుషులు నీరు లేకుండా ఎలా జరుపుకుంటారా అని! “అక్కడ నదిలేదు, తెలుసా?” అన్నారు కొందరు.

“నీరు లేకపోతే ఏమీ ఫరవాలేదు. ఏమీ ఫరవాలేదు, స్తిపాన్ ద్మీత్రెవిచ్. కమతగాళ్లని అక్కడికి చేర్చటంలోనే ఉంది చిక్కంతా. కమతగాళ్ళ సంగతి మనకు తెలుసుగా. వాళ్ళకి ఒక గుడిసెగాని, వంట చెరుకుగాని ఏమీ ఏర్పాటు చెయ్యకుండా కొత్త పొలాలమీద పెట్టి దున్నమంటే, ఇంకేముందీ, కాలికి బుద్ధిచెప్పి అయిపూ అంతూ లేకుండా అదేపోత పోతారు.”

“కాదు, అలెక్సేయ్ ఇవానవిచ్, క్షమించాలి. చిచీకవ్ మనుషులు పారిపోతారంటే నేను ఒప్పుకోను. రష్యను ఉన్నాడే ఏదైనా సాధించగలడు, ఏ ఎండకైనా తట్టుకోగలడు. వాణ్ణి కంచాత్క పంపి చేతులకు చలితొడుగు లిచ్చారంటే, చేతులు చరుచుకుని, గొడ్డలి తీసుకుని, కొత్త ఇల్లు కట్టుకునేందుకు కలప కొట్టుకు రాబోతాడు.”

“కాని, ఇవాన్ గ్రిగెర్యెవిచ్, మీరొక విషయం మరిచిపోతున్నారు: చిచీకవ్ కమతగాళ్లు ఎలాటివాళ్లూ అన్నది మీరు ప్రశ్నించుకోలేదు; ఏ యజమాని అయేది మంచి మనుషులను చచ్చినా అమ్మడన్న సంగతి మీరు మరిచారు. చిచీకవ్ కమతగాళ్లు దొంగలూ, వట్టి తాగుబోతులూ, సోమరిపోతులూ, అల్లరివెధవలూ కాకపోతే తల తీసేయించుకుంటాను!”

“సందేహం లేదు, సందేహంలేదు. మీరన్నది నిజమే. మంచి కమతగాణ్ణి ఎవరూ అమ్మరు. చిచీకవ్ మనుషులు తాగుబోతులే. కాని ఇందులో ఒక నైతిక విషయంకూడా ఉన్నదని మీరు గమనించాలి, ఇది నైతిక సమస్య; వాళ్ళు ఇప్పుడు పనికిమాలిన వెధవలే, కాని కొత్తచోట పెట్టాక వాళ్ళు మంచి పనివాళ్ళుగా మారిపోవచ్చు. అలాటి నిదర్శనాలు నిత్యజీవితంలోనూ, చరిత్రలోనూ కూడా కనిపిస్తాయి.

గవర్నమెంటు ఫ్యాక్టరీల సూపర్నెంటు, “వట్టిది, వట్టిది! నా మాటనమ్మండి, అలా ఒక్కనాటికి జరగదు. చిచీకవ్ మనుషులకు రెండు ప్రబల ప్రమాదాలెదురవుతాయి: ఒకటేమిటంటే చిన్న రష్యా అక్కడికి చాలాదగ్గిర, అక్కడ సారా వర్తకంమీద కంట్రోలు లేదు. నే చెబుతున్నా, ఒక్కపక్షంలోపల వాళ్లంతా తప్పతాగేస్తారు. రెండో ప్రమాదమేమిటంటే, వాళ్ళు ప్రయాణం మూలంగా చరజీవితానికి అలవాటయిపోతారు. అందుచేత చిచీకవ్ విడవకుండా వాళ్లని వెయ్యికళ్ల కనిపెట్టి ఉంటూ గట్టి అదుపులో ఉంచాలి, ప్రతి చిన్న తప్పుకూ గట్టిగా శిక్షించాలి. ఈ పనివాళ్ళకీ, వీళ్లకీ వదిలి లాభం లేదు. అవసరమైనప్పుడల్లా తన చేత్తోనే వాళ్ళ మొహాలు పగలగొట్టాలి, మాడు పగలగొట్టాలి” అన్నాడు.

“చిచీకవ్ తన చేత్తోనే వాళ్లను కొట్టవలసిన అగత్యమేమిటీ? మేనేజరును పెట్టుకుంటాడు!”

“అలాగేం? మేనేజరును తీసుకురండి! అంతా దొంగ వెధవలు!”

“యజమానులు ఏదీ పట్టించుకోకపోతే వాళ్లు దొంగ వెధవలే అవుతారు.”

“అదీ సంగతి. యజమానికి నిర్వహణ చాతనయి, మనుషులను అర్థంచేసుకోగలవాడయితే మేనేజరు మంచివాడు దొరుకుతాడు,” అన్నారు అనేకమంది.

“అయితే, అయిదువేల రూబుళ్ళయినా పోస్తేనేగాని మంచి మేనేజరు దొరకడని సూపర్నెంటు అన్నాడు. మూడు వేలిస్తే చాలు వస్తాడన్నాడు అధ్యక్షుడు. “వాడెక్కడ దొరుకుతాడు? ముక్కు సూటిగా లేడుగా?” అనిసూపర్నెంటు అభ్యంతరం చెప్పాడు.

“ముక్కు సూటిగా లేకపోతేనేం? జిల్లాలోనే ఉన్నాడు. నా మనసులో వున్నాడు ప్యోతర్ పెత్రోవిచ్ సమాయిలవ్. చిచీకవ్ మనుషులకు సరి అయిన నిగామాను అతనే!” అన్నాడు అధ్యక్షుడు.

చాలామంది తామే చిచీకవ్ స్థానంలో ఉన్నట్టు భావించుకుని ఇంతమంది మనుషులను తరలించటంలోగల చిక్కులను తలుచుకుని ఎంతో కంగారుపడ్డారు. చిచీకవ్ మనుషుల్లాటి దుడుకుపిండాలు ఏకంగా తిరగబడవచ్చునని వారికి భయం కలిగింది. అలా తిరుగుబాటు జరిగే భయం ఏమీలేదనీ, పోలీసు అధిపతికి అధికారాలున్నది అలాటివి జరక్కుండా ఆపటానికేననీ, పోలీసు అధిపతి స్వయంగా వెళ్ళవలసిన అవసరంకూడా లేదనీ, ఆయన టోపీని పంపితే అదే వాళ్ళను కొత్తచోటికి తీసుకుపోతుందనీ పోలీసు అధిపతి అన్నాడు. చిచీకవ్ మనుషులలో రగిలే తిరుగుబాటుతత్వాన్ని అరికట్టడానికి అనేకమంది సూచనలు చేశారు. అవి నానారకాలుగా ఉన్నాయి. కొన్ని కేవలం మిలిటరీధోరణిలో కర్కశంగానూ, క్రూరంగానూ ఉన్నాయి, మరికొన్ని సౌమ్యంగా ఉన్నాయి. చిచీకవ్ పాటించవలసిన పవిత్రధర్మం ఒకటివున్నదనీ, అతను తన కమతగాళ్ళపట్ల తండ్రిలాగా ఉండి, వాళ్ళకు జ్ఞానోదయం కలిగించటం తన కర్తవ్యంగా పెట్టుకోవాలనీ, ఈ సందర్భంలో లంకాస్టర్ విద్యావిధానం ఎంతైనా ప్రశంసనీయమనీ పోస్టుమాస్టరు చెప్పాడు.

ఈవిధంగా నగరంలో చర్చలుసాగాయి. చాలామంది ఎంతో సానుభూతితో యీ సలహాలు కొన్నిటిని చిచీకవ్ కు అందజేశారు. కమతగాళ్ళను గమ్యస్థానం చేర్చటానికి తోడు పంపుతామని కూడా కొందరు మాటఇచ్చారు. సలహా లిచ్చినవారికి చిచీకవ్ ధన్యవాదాలు తెలిపి, అవసరమైతే ఆ సలహాలను అమలుచేస్తానన్నాడు. తోడుమాత్రం అవసరంలేదన్నాడు. ఎందుకంటే తాను కొన్న మనుషులు అమిత సాత్వికులు, వలసవెళ్ళాలని వాళ్ళకీ ఎంతో ఉబలాటంగా ఉన్నది. వాళ్ళలో విద్రోహబుద్ధి ఏ మాత్రమూ లేదు.

అయితే ఈవాగ్వాదాల ఫలితంగానూ, చర్చల ఫలితంగానూ చిచీకవ్ ఊహించగలిగినదానికన్న కూడా ఎక్కువలాభమే కలిగింది: అతను కోటీశ్వరుడన్న పుకారుపడింది. నగరంలోని వాళ్ళు చిచీకవ్ ను ఎంతో ఆదరభావంతో చూసినట్టు మనం మొదటనే తెలుసుకున్నాం. అతను కోటీశ్వరుడని విన్నాక వారి ఆదరం మరింత అయింది. నిజానికి వాళ్ళంతా చాలా మంచివాళ్ళు, కలిసికట్టుగా ఉండేవాళ్ళు, సఖ్యతగా ప్రవర్తించేవాళ్లు; వారి సంభాషణలో కూడా ఎంతో సుహృద్భావమూ, ఆప్యాయతా వుండేవి: “మిత్రమా, ఇల్యా ఇల్యాయిచ్”, “ఇదుగో, ఏమోయ్, అంతీపతర్ జఖార్యెవిచ్”…ఇంతెందుకు, అందరూ ఏక కుటుంబంలాగా ఉండేవారు. వారిలో చాలామందికి అంతో ఇంతో సంస్కారం వుంది. న్యాయస్థానాధ్యక్షుడికి ఝుకోవ్ స్కీ రచించిన “లుద్మిలా” కంఠతావచ్చును. అందులోనుంచి ఆయన చాలా భాగాలు చక్కగా చదివి వినిపిస్తుండేవాడు; ముఖ్యంగా “కనులు మూసిన అడవి, కలలు గనులోయ” అని చదివితే అడవీ లోయా నిద్రలో ఉన్నట్టే తోచేది, ఈ భావం మరింత బాగాకలగటాని కాయన ఆ పంక్తి చదువుతూ తానే కళ్లు మూసుకునేవాడు. పోస్టుమాస్టరుకు తాత్వికవిషయాలంటే చాలా ఇష్టం. ఆయన రాత్రివేళ కూడా యంగ్ రచించిన “నిశాభావములు,” ఎక్కార్జ్ హౌజెన్ రచించిన “ప్రకృతి రహస్యపరిశోధిని” శ్రద్ధగా చదవటమేగాక, వాటిలోనుంచి పేజీలతరబడి కాపీచేసుకునే వాడుకూడా; కాని వాటిలో ఉన్న విషయమేమిటో ఎవరికి తెలియదు. అయితే ఆయన మంచి మాటకారి, అలంకారయుక్తంగా, మాటలలో “మసాలా” చేర్చి మాట్లాడేవాడు. ఇందుకుగాను ఆయన వివిధరకాల ఊతపదాలు చేర్చేవాడు: “అయ్యా, మీకు తెలుసు, మీరు గ్రహించగలరు, ఊహించుకోవచ్చు, ఆయొక్క సందర్భంలో, వతుగా ఒకవిధంగా చూస్తే ఇత్యాదిప్రయోగాలు విరజిమ్మేసేవాడు. ఆయన తన సంభాషణలో చేర్చే “మసాలా” కింద సమయోచితంగా కన్నుకొట్టి, ఒక కన్ను చిలికించి, తన వ్యంగ్యప్రసంగానికి మరింత పదును పెట్టేవాడు. మిగిలినవాళ్లు కూడా కొద్దో గొప్పో సంస్కారంగలవాళ్ళే; ఒకడు “కరమ్‌జిన్” చదివేవాడు, మరొకడు “మాస్కోవార్త” చదివేవాడు, ఏమీ చదవనివాళ్ళుకూడా కొందరు ఉండేవారు. కొందరు తావు తగిలితేగాని లేచి కదిలేవారు కారు. మరికొందరు యెలాటి సోమరిపోతులంటే, సామెతచెప్పినట్టు అస్తమానం ఒకేపక్క పడుకునేవారు; వాళ్ళని లేపి నిలబెట్టటంకూడా వృథా, ఏమంటే వాళ్లు చచ్చినా నిలబడేరకం కాదు. ఆరోగ్యానికీ, ఆకారాలకూ మళ్ళీ ఏలోటూ లేదు. వారిలో ఒక్కడూ క్షయాపాత్తుకాడు. భార్యలు ముద్దుగా సరసాలాడేటప్పుడు తమ భర్తలకు “బొద్దు”, “లావు”, “దిబ్బ”, “కుడుము”, “జవజవ” అనే మాటలు వాడతారే, ఆరకం మనుషులు వాళ్ళందరూ. కాని మొత్తంమీద అందరూ మంచివాళ్లె, అతిథులను ఎంతో బాగా చూసేవారు. ఒకసారి వాళ్ళ ఉప్పుతిన్న వాళ్ళూ, ఒకసాయంకాలం వారితో పేకాడినవాళ్ళూ వారికి ఎంతో ఆప్త స్నేహితులయిపోయేవాళ్ళు. చిచీకవ్ విషయం చెప్పనే అక్కర్లేదు, అతను ఆకర్షణీయమైన లక్షణాలూ, నడవడీ గలవాడు. ఇతరులను సంతోషపెట్టే విద్య అతనికి బాగా తెలుసు. వాళ్ళకి అతనిపైన ఎలాటి మమకారం ఏర్పడిందంటే, ఆ ఊరునుంచి తెంచుకుపోవటం ఎలాగో చిచికవ్ కు బోధపడలేదు. ఎవరిని చూచినా, “కనీసం ఇంకొక్కవారం ఆగండి పావెల్ ఇవానవిచ్! అనేవాళ్ళే, బ్రహ్మరధం పట్టటమంటారే, అలా అయిందతనికి. ఇంతకన్న కూడా చెప్పుకోదగినది (నిజంగా అద్భుతమే!) స్త్రీలకు చిచీకవ్ మీద ఏర్పడిన గురి. దీన్ని కొంతవరకైనా సమర్థించాలంటే ఆ స్త్రీలను గురించీ వారి సమాజ పరిసరాలనుగురించీ ఎంతో చెప్పాలి, వారి ఆధ్యాత్మిక గుణాలను సజీవమైన రంగులతో చిత్రించాలి; ఇది ఈ రచయితకు సాధ్యమయే పనికాదు. ఒకవంక అతడికి ఈ అధికారుల భార్యలపట్ల గల గౌరవభావం అడ్డుతగులుతుంది, ఇంకొకవంక… ఇంకొకవంక అది చాలా కష్టమైనపని. ఈ నగరపు మహిళలు…వద్దు, నిజంగా నావల్ల కాదు: నాకు చెడ్డసిగ్గుగా ఉన్నది. ఈ నగరపు మహిళలలో ఘనంగా చెప్పుకోదగిన విశేషమేమంటే…నా కలం కదలకపోవటం చాలా వింతగాఉన్నది. పోనివ్వండి, ఈ స్త్రీలను చిత్రించేపని మరొకడికి, మంచిమంచి రంగులు గలవాడికి వదిలేస్తాను; నేనుమాత్రం వారిని బాహ్యంగా వర్ణించి, వారిలోని అముఖ్యలక్షణాలను పేర్కొంటాను. ఈ నగరపు మహిళామణులు “చూడ ముచ్చటైన” వారుగా చెప్పదగినవారు, ఈ విషయంలో వారిని ఇతరులకు ఆదర్శంగా చూపవచ్చు. నడవడికలో, గొతెత్తటం విషయంలో, మర్యాదలు పాటించటంలో, నాగరికసమాజంలో ఉండే సవాలక్ష నియమాలు పాటించటంలో, అన్నిటినీమించి సరికొత్త ఫాషనులను తూచాతప్పకుండా అనుసరించటంలో పీటర్స్ బర్గు స్త్రీలుగాని, మాస్కో స్త్రీలుగాని వారికి ఈడు రాలేరు. వారు చక్కని అభిరుచిగల పద్ధతిలో దుస్తులు వేసుకుని, బళ్ళలో నగరం వెంబడి తిరిగేవారు, వెనక ఒక బంట్రోతు ఉద్యోగదుస్తులు ధరించి ఉండేవాడు. వాడి దుస్తులకు సరొకొత్త ఫాషను అనుసరించి సరిగ ఉండేది. వాళ్లవెంట విజిటింగ్ కార్డులు-ఏ కళావరు రెండుముక్కమీదనో, డైమను ఆసుమీదనో రాసినవే అవుగాక- అతిముఖ్యంగా ఉండేవి. కార్డు కారణంగా, ఎంతో మైత్రీ, బంధుత్వమూగల ఇద్దరాడవాళ్ళమధ్య, ఎదురుపిలుపు లేనందు చేత ఎడబాటు సంభవిస్తూండేది. ఇద్దరిలో ఏ ఒకరో కార్డుఇచ్చి వెళ్ళటం జరగనందున ఇద్దరిమధ్యా స్పర్థేకలగాలిగాని, వారిని రాజీపరచటానికి వారి భర్తలూ, బంధువులూ తల్లకిందుగా తపస్సుచేసికూడా ఫలితం ఉండదు-అదితప్ప ఇంకేదైనా సాధించవచ్చు. ఆ తరువాత ఆ ఇద్దరు మహిళలూ ఒకరినొకరు “సుస్తీ”గా ఉంటారు, అది ఆ నగరపు సంఘంలో అమలులో ఉన్నమాట. ఎవరుముందు, ఎవరు తరువాత అనే సమస్యను గురించికూడా తీవ్రమైన ఘర్షణలు జరిగేవి, ఒక్కొక్కప్పుడు వారిభర్తలు వారిని సమర్థించటం తమ ఉత్తమ ధర్మంగా భావించటంకూడా జరిగేది. ఆ పెద్దమనుషులు సివిలు ఉద్యోగస్తులు కావటంమూలాన ద్వంద్వయుద్ధాలు జరిగేవికావు, కాని వాళ్ళు ఒకరిమీద ఒకరు అవకాశం దొరికినప్పుడల్లా దుష్కర్మలు చేసుకునేవారు. అంతకంటె ద్వంద్వయుద్ధాలే నయం. నీతి నియమాల పట్ల ఈ నగరపు మహిళలు మహాపట్టుదల గలవారై, అవినీతి అన్నా, వెలికితనమన్నా మండిపడి, ప్రతి దౌర్బల్యాన్నీ నిర్దయగా శిక్షించే వాళ్ళు. ఏదైనా “ఒకటీ, అరా” సంభవించటం జరిగితే, అది జరిగినట్టు పైకి తెలియరాకుండా కప్పిపెట్టేవాళ్ళు, బెట్టు నిలబెట్టేవాళ్లు; భర్త కూడా ఎలాటి తరిఫీదు తిని ఉంటాడంటే అతను కళ్ళారా “ఒకటీ, అరా” చూసినా, లేక విన్నా, ఆటే తొణకక, బాప్తిజం చేయించిన తండ్రి బాప్తిజం చేయించిన తల్లితోపోతే ఇతరులకేమిటి అన్న సామెతతో సరిపెట్టుకునేవారు.

ఈ నగరపు మహిళలనుగురించి చెప్పుకోదగిన మరొకవిషయమేమంటే వారు, పీటర్స్ బర్గ్ మహిళల్లాగే అనుచితమైన మాటలు గాని, నుడికారాలుగాని నోటంట ఎన్నడూ రానివ్వక మహా నాజూకుగా మాట్లడేవారు. “నేను చీదాను, నాకు చెమటపోసింది, ఉమ్మేశాను” అని ఎన్నడూ అనేవారుకారు; దానికి మారుగా “చేతిరుమాలు ఉపయోగించుకున్నాను” అనేవారు లేదా అలాటిదే మరొకటి ఏదన్నా అనేవారు. ఎట్టి పరిస్థితులోకూడా “ఈ గ్లాసు, లేక ప్లేటు కంపుకొడుతున్నది” అనరాదు, “ఈ గ్లాసు కొంచెం ఇబ్బందిగా ఉంది” అనిగాని, అలాటిదే మరోటిగాని అనాలి. రష్యనుభాషను శుద్ధి చేసిపైకి తీసుకురావటానికిగాను వారు భాషలోనుంచి పూర్తిగా సగం మాటలను లాగిపారేశారు. అందుచేత వారు తరుచు ఫ్రెంచిభాషను ఆశ్రయించవలసి వచ్చేది. ఫ్రెంచిదారి ఎలాగైనా వేరు; పైనచెప్పిన భావాలకన్న కూడా మొరటైనవి ఫ్రెంచిలో పలకటానికి వారికి అభ్యంతరం ఉండేదికాదు. ఈ నగరపు మహిళలను గురించిన పై పై విషయాలివి. లోతుగా చూసే పక్షంలో ఇంకా అనేకవిషయాలు కనిపిస్తాయనుకోండి, కాని స్త్రీ హృదయంలోకి మరీలోతుగా చూడటం ఎంతైనా ప్రమాదకరం.

అందుచేత మనం పై పై విషయాలకే అంటిపెట్టుకుని ఉపక్రమింతాం. లోగడ ఈ మహిళలు, చిచీకవ్ నలుగురిలోనూ ప్రవర్తించే పద్ధతిని మెచ్చుకున్నప్పటికీ, అతన్నిగురించి విశేషంగా చెప్పుకోలేదు, కాని అతను కోటీశ్వరుడని పుకారుపుట్టినది లగాయతు వారు అతనిలో ఇతర సుగుణాలను కనిపెట్టసాగారు. అయితే నిజానికి ఈ మహిళలు డబ్బుపై వ్యామోహం గలవారు కారు. తప్పంతా కోటీశ్వరుడనే మాటదేగాని, కోటీశ్వరుడిది కాదు. డబ్బు సంచుల ప్రమేయం లేకుండానే ఆ మాటలోనే ఏదో ఉంది; దాని ప్రభావం దుర్మార్గుల పైనా, ఏదీ కాని వాళ్లపైనా, సజ్జనులపైనా కూడా, అనగా అందరి పైనా ఉంటుంది. కోటీశ్వరుడైనవాడికి ఎప్పుడూ అడుగులకు మడుగులొత్తే వాళ్ళు తటస్థ పడతారు. వారి దాస్యబుద్ధి స్వార్ధరహితమైనది, స్వచ్ఛమైనది. దానివెంట ఎలాటి ఆశయాలూ ఉండవు. అతనినుంచి తమకు చిల్లిగవ్వ ముట్టదని, ముట్టాలని ఆశించే హక్కు తమకులేదనీ స్పష్టంగా ఎరిగికూడా అనేకమంది అతనికి కావలసి రాబోయేది ముందరే అందిస్తారు. అతని హాస్యపుమాటలకు నవ్వుతారు, టోపీలు తీసేస్తారు, అతను ఏ విందుకైనా వెళుతున్నాడని తెలిస్తే ఆ విందుకు ఆహ్వానం ఎలాగో సంపాదిస్తారు. ఇలాటి దాస్యబుద్ధి స్త్రీలలో ఉంటుందనటానికి వీల్లేదు. అయినప్పటికీ అనేక డ్రాయింగ్ రూములలో చిచీకవ్ గొప్ప మన్మధుడు కాకపోయినప్పటికీ, మనిషంటే అతనిలాగే ఉండాలనీ, అతను ఇంకొంచెం బలిసినా, లావెక్కినా బాగుండదనీ నలుగురూ అనుకోవటం జరిగింది. ఇదే సందర్భంలో ఇంకొక మాట కూడా పుట్టింది-ఇది సాధారణంగా సన్నగా ఉండేవాళ్లమీద సొడ్డు-వాళ్లు మనుషులల్లే ఉండక పళ్ళు గుచ్చుకునే పుల్లలాగా ఉంటారని. ఆడవాళ్ల దుస్తులలో అనేక రకాల కొత్త సొబగులు కానవచ్చాయి. వాహ్యాళి బజారు (ఆర్కేడ్)లో గుంపు, ఇంచుమించు తొక్కిడి, ఏర్పడింది. అక్కడికి వచ్చి చేరే బళ్లు ఒక ఊరేగింపులాగా తయారయాయి. సంతలో ఖరీదు పెట్టుకొని హెచ్చుధర మూలాన అమ్ముడు కాకుండా ఉన్న కొన్ని సరుకులు ఆకస్మికంగా గిరాకీవచ్చి అంతులేని ధరలకు అమ్ముడుపోవటం చూసి దుకాణాల వాళ్లు నిర్ఘాంతపోయారు. ఒకనాడు చర్చిలో ఆరాధనల సమయంలో ఒక ఆవిడ తన పావడా అంచుకు ఎలాటి గట్టిపట్టీ వేసుకున్నదంటే ఆమె దుస్తు ఆమె చుట్టూ చాలాదూరం పరుచుకున్నది. ఆ పేటకు చెందిన పోలీసు అధికారి సమయానికి అక్కడ తటస్థించి, ఆవిడగారి దుస్తు పగిలిపోకుండా ఉండగలందులకు జనాన్ని వెనక్కు జరగమన్నాడు. చిచీకవ్ కూడా తనపట్ల అందరూ చూపే శ్రద్ధాసక్తులు గమనించాడు. ఒకనాడతను ఇంటికి తిరిగివచ్చి బల్లమీద పెట్టి ఉన్న ఒక ఉత్తరం చూసుకున్నాడు. అది ఎవరు పంపినదీ, ఎవరు తెచ్చినదీ, అతనికి అంతుచిక్కలేదు. అది పంపిన వాళ్ళు తమ ఆచూకీ తెలపవద్దని తెచ్చిన మనిషికి ఉత్తరు విచ్చినట్టు వెయిటరు చెప్పాడు. ఆ ఉత్తరం గొప్పతీర్మానంతో, ఈవిధంగా ఆరంభమయింది. “అవును, నేను మీకు ఇది రాయకతప్పదు.” ఆ తరువాత ఆత్మలమధ్య ఉండే అనిర్వచనీయమైన అనుబంధం గురించి ఏదో రాసివున్నది. ఈ పరమసత్యాన్ని ధ్రువపరచటానికి సగం పంక్తి చుక్కలతో నించి ఉన్నది. ఆ తరవాత ఎలాటి గొప్పసత్యాలు ప్రవచించబడ్డాయంటే వాటిని ఉదహరించటం అవసరమని తోస్తుంది. “మన జీవితం ఏమిటి? దుఃఖం నివాసం ఏర్పరచుకున్న ఒకలోయ. ప్రపంచం ఏమిటి? జాలి లేని మూక.” ఆతరవాత రచయిత్రి, ఇరవై అయిదుసంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయిన తన మాతృ దేవతకొరకు స్రవించే అశ్రువులతో ఈ పంక్తులకు అభిషేకం చేస్తున్నానన్నది. అధ్యాత్మిక గోడలమధ్య ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చటానికి లేని ఈ పట్టణం విడిచి పెట్టి ఏ ఎడారికో పారిపొమ్మని లేఖకురాలు చిచీకవ్ ను హెచ్చరించింది. లేఖయొక్క చివరిభాగం బొత్తిగా నిరాశాపూరితంగా ఉండి ఒక పద్యంతో ఆఖరయింది. దాని భావం ఏమంటే:

“జంటగువ్వలు చూపుతాయి నా చల్లని అస్థికలుండే చోటు నీకు. గాద్గదికంగా నీతో చెబుతాము నేను అశ్రువులతో నే నెలా మరణించానో”.

ఈ పద్యంలో ఆఖరుచరణంలో ఛందస్సుపోయింది. అయినా ఫరవాలేదు; ఆ ఉత్తరం ఆనాటి ధోరణిలో రాయబడింది. ఉత్తరానికి సంతకం లేదు, పేరులేదు, ఇంటిపేరులేదు, తేదీకూడా లేదు. కాని ఒక”తాజాకలం” ఉన్నది: ఆ ఉత్తరం ఎవరు రాసినదీ అతని హృదయమే గ్రహిస్తుందనీ, తాను మర్నాడు గవర్నరుగారింట జరగబోయే నృత్యోత్సవానికి హాజరవుతుందనీ అందులో ఉన్నది.

ఇదంతా అతనికి చాలా ఆసక్తికలిగించింది. అది ఎవరు రాసారో తెలుసుకోవాలనే తహతహవల్లా, అందులో ఉన్న ఆకర్షణవల్లా అతను ఆ ఉత్తరాన్ని పైనుంచికిందికి రెండోసారీ, మూడోసారీ చదివేసి చివరకు, “ఇది ఎవరురాశారో తెలిస్తే బాగుండును!” అనుకున్నాడు, నిజానికి వ్యవహారం ముదురుపాకాన పడుతున్న సంగతి తెలుస్తూనే ఉంది. అతను దీన్ని గురించి గంటకుపైగా ఆలోచించాడు. చివరకు చేతులు ఎగరేసి తల ఆడించి, “ఇది చాలా తమాషాగారాసిన ఉత్తరం!” అనుకున్నాడు. తరవాత అతను ఆ ఉత్తరాన్ని మడిచి పెట్టెలో, ఏడేళ్ళుగా అందులో పడిఉన్న ఒక ప్రకటనతోనూ, విందు ఆహ్వానంతోనూ కలిపి పెట్టేశాడు. తరవాత నిజంగానే గవర్నరుగారింట నృత్యోత్సవానికి అతనికి ఆహ్వానం అందింది. ఇలాటి నగరాలలో అది రివాజే; గవర్నరంటూ ఉన్నాక నృత్యోత్సవాలుండాలి, లేకపోతే కులీనులు ఆయనను ఖాతరు చెయ్యరు.

మిగతా ఆలోచనలన్నీకట్టిపెట్టి పక్కకునెట్టేసి అతను తన మనస్సునంతా నృత్యోత్సవానికి సిద్ధంకావడంపైన కేంద్రీకరించాడు, ఎందుకంటే ఈ నృత్యోత్సవంతో ఎన్నో సరదాసంగతులు ముడిపడి ఉన్నాయి. ముస్తాబుకావటానికి భూమిపుట్టాక ఎవరూ అంతశ్రమగాని కాలంగాని వ్యయంచేసి ఉండరు. అద్దంలో ముఖం చూసుకోవటానికే ఒక గంటపట్టింది. రకరకాల ముఖభంగిమలు పెట్టటానికి ప్రయత్నాలు జరిగాయి. ఒకసారి గంభీర భంగిమా, మరొకసారి మర్యాదతో గూడిన మందహాసమూ మరొకసారి మందహాస రహితమైన మర్యాదా. అతను అద్దంముందు అనేకసార్లు వంగి ఫ్రెంచిలాగా ధ్వనించే అస్పష్టమైన శబ్దాలు పలికాడు, కాని నిజానికతనికి ఫ్రెంచి భాష ఏమీరాదు, అతను కొన్ని కొత్తట్రిక్కులూ, వింతట్రిక్కులూ కూడా ప్రయత్నించి చూశాడు: కనుబొమలనూ, పెదవులనూ వంకరతిప్పాడు, నాలుకతో కూడా ఏదో చెయ్యటానికి ప్రయత్నించాడు, ఏకాంతంగా ఉన్న సమయంలో, తాను అందంగా ఉంటాననుకుంటే మనిషి, కంతల్లోనుంచి తనను ఎవరూ గమనించటంలేదని రూఢిగా తెలిశాక చేసే పనులకు అంతుండదు మరి. చిట్టచివరకు అతను తనగడ్డంమీద కొట్టుకుని, “ఓయబ్బ, ఏం మొహం!” అనుకుని దుస్తులు వేసుకోనారంభించాడు. డ్రెస్ చేసుకుంటున్నంతసేపూ అతను మహాగొప్ప హుషారులో ఉన్నాడు. అతను చాలా చలాకీగా వంగాడు, పాదాలు నేలమీద ఈడ్చాడు. జన్మలో ఎన్నడూ నృత్యం చేసిన పాపానపోకపోయినా, గెంతాడు. ఈ గెంతుమూలంగా జరిగేదేమంటే సొరుగులపెట్టె అదిరి బ్రష్ కిందపడింది.

నృత్యోత్సవానికి అతనిరాక అక్కడ గొప్ప సంచలనాన్ని కలిగించింది. అందరూ అతనికేసి తిరిగి పలకరించబోయారు; ఒకరి చేతిలో పేకముక్కలున్నాయి, మరొకరు అతి ముఖ్యఘట్టం మాట్లాడుతూ, “అందుకు దిగువకోర్టు ఏమంటుందంటే…” అంటున్నారు. కాని ఆ మనిషి దిగువకోర్టు ఏమన్నదీ తేల్చక, మాట్లాడడం కట్టిపెట్టి, చిచీకవ్ ను పలకరించటానికి వచ్చేశాడు. “పావెల్ ఇవానవిచ్! అరెరే, పావెల్ ఇవానవిచ్! ప్రియమైన పావెల్ ఇవానవిచ్! ఘనమైన పావెల్ ఇవానవిచ్! నాప్రాణం, పావెల్ ఇవానవిచ్! వచ్చారా, పావెల్ ఇవానవిచ్? ఇరుగో, పావెల్ ఇవానవిచ్ వచ్చారు! ఒక్క కౌగిలి ఇవ్వండి, పావెల్ ఇవానవిచ్! నా వరహాల పావెల్ ఇవానవిచ్ పంపించండి, ఒక్కమంచి ముద్దుతీసుకుంటారు!” వెంటనే చిచీకవ్ అనేకమంది బహుబంధాలలో చిక్కిపోయాడు. అతను అధ్యక్షుడి ఆలింగనంనుంచి పుర్తిగా బయటపడ్డాడో లేదో పోలీసు అధికారికి చిక్కిపోయాడు; పోలీసు అధిపతి అతన్ని మెడికల్ బోర్డు ఇంస్పెక్టరుకు అందించాడు; మెడికల్ బోర్డు ఇంస్పెక్టరు అతన్ని సర్కారు కంట్రాక్టరుకు అందించాడు. ఆ పెద్ద మనిషి వాస్తుప్రవీణుడికి అందించాడు… ఆ సమయానికి గవర్నరు కొందరు స్త్రీల చెంత నిలబడి, ఒక చేతిలో ఏదో కాగితంముక్కనూ, రెండో చేతిలో బుల్లి కుక్కనూ పట్టుకొని ఉన్నాడు, అతన్ని చూస్తూనే రెంటినీజారవిడిచాడు. కుక్క కంయో మన్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చిచీకవ్ అపరిమితమైన ఆనందోత్సాహానికి కేంద్రమైనాడు, ప్రతిఒక్క ముఖానా సంతోషమో లేక అందరి సంతోషం తాలూకు ప్రతిబింబమో కనిపించింది. తమ ఆఫీసులను తణిఖీ చెయ్యటానికి ఉన్నతాధికారులు వచ్చినప్పుడు సర్కారు గుమస్తాల మొహాలు ఇలాగే ఉంటాయి: మొదట్లో కలిగిన గాభరా తగ్గిపోతుంది, ఆయన అంతాచూచి తృప్తిపడి, కాస్త దిగి వచ్చి ప్రసంగంలో పడిఏదో ఛలోక్తి విసురుతాడు, అంటే ఇకిలిస్తూ కొద్ది మాటలంటాడు, ఆయనకు దగ్గిరిగానిలబడి ఉన్న గుమాస్తాలు దానికి ఇబ్బడిగా నవ్వుతారు. ఆయన ఏమన్నదీ సరిగా వినపడనివాళ్లు కూడా మనస్ఫూర్తిగా నవ్వుతారు, చిట్టచివరకు దూరంగా ద్వారం వద్దనిలబడి ఉన్న పోలీసువాడు జన్మలో ఎన్నడూ నవ్విన పాపాన పోనివాడే అయినా దాటరాని ప్రతిఫలన సూత్రానికి కట్టుబడి వాడిముఖంకూడా ఒక చిరునవ్వును ప్రదర్శిస్తుంది. అప్పుడు వాడి ముఖం ఘాటైన పొడుంపట్టు పీల్చి తుమ్మబోతున్నట్టుగా అవుతుంది.

మన కథానాయకుడు ప్రతి ఒక్కరి పరామర్శా స్వీకరించాడు. అతని మనసు ఎంతో తేలికగా ఉన్నది. అతను అటూ ఇటూ తిరిగి, తన అలవాటు ప్రకారం కొంచెం ఒక పక్కగా వంగాడు. అతని సోయగం అందరినీ ముగ్ధుల్ని చేసింది. అందాలు వెల్లివిరుస్తూ ఆడవాళ్ళు అతనిని చుట్టుముట్టారు. వారి ఘుమఘుమ అంతటా ఆవరించింది. ఒకతె గులాబీల వాసన, మరొకతె “వసంత”పుష్పాల వాసన, “ఊదా”పూల వాసనా, మరొకతె ‘మిన్యోవెట్’ అత్తరవులో మునిగి తేలుతూంది. చిచీకవ్ తప్పనిసరి అయి ముక్కు పైకెత్తి సువాసనలను ఆఘ్రాణించాడు. వారి దుస్తులు ఎంతో రమ్యంగా ఉన్నాయి, మజ్లిన్ వలిపెములూ, శాటిన్లూ, షిఫాన్లూ ఎలాటి నాజూకై తెలికరంగుల్లో ఉన్నాయంటే వాటికి పేర్లు పెట్టటం కూడా సాధ్యంకాదు; ఈనాటి ఫాషన్లు అంత నాజూకైనవి! వారి దుస్తులపైన అక్కడక్కడా రిబ్బను “పూలూ”, పూల గుత్తులూ ఒక పద్ధతిలేకుండా అమర్చి ఉన్నాయి; అయితే ఇలా పద్ధతిలేకుండా వాటిని అమర్చటానికి పద్ధతి తెలిసినవాళ్ళు ఎంతో శ్రమపడవలసి వచ్చింది. వారు తలలలో ధరించిన తేలిక ఆభరణాలు వారి చెవులకు మాత్రమే తగిలి ఉండి, “ఏయ్, నేను పారిపోతున్నాను, చిక్కేమిటంటే ఈ అందగత్తెను ఎత్తుకుపోవటం నాకు సాధ్యంకాకుండా ఉంది!” అంటున్నట్టుగా ఉన్నాయి. వారి నడుములు బిర్రుగా బిగించి, ఎంతో బిగువుగానూ, పొంకంగానూ ఉన్నాయి. (ఈ నగరపు మహిళలు సాధారణంగా కొంచెం బొద్దుగా ఉంటారు, అయితే నడుములు బిగించి ఎంత ఒయ్యారంగా మసులుతారంటే వారు లావనిపించరు.) వాళ్ళు ప్రతి చిన్న విషయం గురించీ ఎంతో ఆలోచించి శ్రద్ధ తీసుకున్నారు; మెడలూ, భుజాలూ ఎంతవరకు ప్రదర్శించ వచ్చునో అంతకుమించి ప్రదర్శించలేదు, ప్రతి స్త్రీకూడా తన శోభను ఎంతగా వ్యక్తంచేస్తే తన పురుషుడి ప్రాణాలట్టిట్టవుతాయని తన అంతరాత్మలో అనిపిస్తే అంతగానే వ్యక్తం చేసింది. మిగిలిన శరీరాలు వింతవింత అభిరుచులను వ్యక్తం చేస్తూ కప్పబడ్డాయి. కొందరు నాజూకుగా మెడలకు రిబ్బను పట్టీలు పెట్టుకున్నారు, మరికొందరికి భూజాలవెనకగా దుస్తుల అడుగు నుంచి “బాడీ”లు కనిపిస్తున్నాయి. ఈ “బాడీ”ల చాటున మగవాళ్ళ హృదయాలను తలకిందులు చేసేదేమీ లేనప్పటికీ, అసలు ఆకర్షణ అంతా అక్కడే ఉన్నట్టు భ్రమకలిగిస్తాయి. పొడుగైన చేతి తొడుగులకూ జాకెట్ల చేతులకూ మధ్యకొంత ఖాళీ ఉంచబడి, మోచేతికి ఎగువ నుండే ఆకర్షణీయమైన జబ్బలు కనిపించేలాగు చేయబడ్డాయి. ఇంతెందుకు? ఎక్కడ చూసినా, “ఇది మారుమూల పట్టణం కాదు; ఇది పీటర్స్ బర్గ్, ఇది పారిస్!” అని లిఖించినట్టుగా ఉన్నది.అయితే అక్కడక్కడా ఒక కుళాయి, ప్రపంచంలో మరెక్కడా కానరానిది, లేక ఒక ఈక, ఏ నెమలిదో, ఫాషనును ధిక్కరించి, “వ్యక్తిగత” మైన అభిరుచిని వ్యక్తం చేస్తూ కనపడింది. అయితే ఇది అనివార్యం; మారుమూల పట్టణంలో ఈ వ్యక్తిత్వం ఎక్కడో ఒకచోట బయటపడి తీరుతుంది. చిచీకవ్ స్త్రీల ఎదుట నిలబడి, వారిలో తనకు లేఖరాసిన మనిషి ఎవరో అని ఆశ్చర్యపడ్డాడు. అతను మెడనిక్కించి ఇంకా బాగా కలయ చూద్దామనుకునేటంతలో అతని పక్కగా మోచేతులూ, “కఫ్”లూ, చొక్కా చేతులూ, రిబ్బన్ల అంచులూ, సువాసనలు వెదజల్లే ఆడవాళ్ల షిమీజులూ పరిగెత్త సాగాయి. పరుగు మహా తీవ్రంగా ఉన్నది. పోస్టుమాస్టరు భార్యా, పోలీసు అధికారీ, తేలిక నీలం ఈకపెట్టుకున్న యువతీ, తైల ఈక ధరించిన యువతీ, జార్జియా రాజకుమారుడు చిఫాయిఖిలిద్జెవ్, ఒక పీటర్స్ బర్గు అధికారి, ఒక మాస్కో అధికారీ, కూకూ అని పేరుగల ఒక ఫ్రెంచి పెద్దమనిషీ, పెర్ఖూనవ్ స్కీ, బెరెబేందవ్ స్కీ, అందరూ పైకీ కిందికీ ఎగురుతూ పక్కగా పరిగెత్తారు…

“అయింది, అందరూ సాగించారు!” అనుకుంటూ చిచీకవ్ నృత్యంచేసే వాళ్లకు ఎడంగా తొలిగాడు. స్త్రీలంతా వచ్చి యథా స్థానాలలో మళ్ళీ కూచున్నాక అతను తన అన్వేషణ సాగించి, ఏ స్త్రీ మొహంలోగాని, కళ్లలోగాని తనకు లేఖరాసిన మనిషి జాడలు తెలుస్తాయోమోనని పరికించాడు. కాని ముఖభంగిమనుబట్టీ, చూపును బట్టీ తనకు లేఖ రాసిన మనిషిని పోల్చటం అసాధ్యమయింది. ఎవరికేసిచూసినా ఏదో వ్యక్తమవుతున్నట్టే ఉంది, ఏదో అంతుచిక్కని సూక్ష్మం-అమితసూక్ష్మం!…

“లాభం లేదు. ఈ ఆడ వాళ్ళుందే…భలేవాళ్ళు…” అనుకుని చిచీకవ్ అసహాయుడల్లే చెయ్యి ఉపాడు “మాటలు చెప్పటం కాదు, వాళ్ళ మొహాలలో మెదిలే భావాలూ, వాళ్ళ డొంకతిరుగుడు ధోరణీ నర్మోక్తులూ చాతనయితే వర్ణించు…నీతరంకాదు. వాళ్ళకళ్ళే అంతులేని అగాధాలు, వాటిని తరచటానికి దిగినవాడు మరిపైకిరాడు! వాణ్ణి గాలాలు వేసి కూడా పైకి చేదటం సాధ్యంకాదు. వాళ్ళకళ్ళలో ఉండే కాంతిని మాత్రమే వర్ణించి చూడు తెలుస్తుంది; మృదువుగా, మధురంగా కరిగిపోయే లాగుంటుంది; క్రూరంగా, సాధువుగా, బద్ధకంగా కూడా ఉంటుంది: కొందరన్నట్టు సమ్మోహనకరంగా ఉంటుంది. లేదాసమ్మోహనకరంగా ఉండదు, కాని అది ప్రత్యేకించి సమ్మోహనకరంగా ఉన్నప్పుడు-గుండెను పట్టేసి ఫిడేలు కమానులాగా దాన్ని పలికిస్తుంది. దాన్ని వర్ణించటానికి మాటలు చాలవు-మానవ కోటిలో సగం “ఫైన్ ఫ్ల్యూర్”, అంతే!”

నన్ను క్షమించాలి! అంతకుముందే వీధిలో వినపడిన మాటలు నా కథానాయకుడి నోటంట వెలువడ్డాయిలాగుంది. నేనేం చేసేది? రష్యాలో ఇదే రచయితల దుర్గతి! నిజానికి, వీధిలో వినిపించిన మాటలు పుస్తకంలోకి దొర్లితే అది రచయిత తప్పు ఎంతమాత్రమూ కాదు, పాఠకులది, ముఖ్యంగా ఉత్తమ కుటుంబాలకు చెందిన పాఠకులది; మిగిలిన వాళ్ళకంటె కూడా వారినోటనే ఎన్నడూ ఒక ముచ్చటైన రష్యనుమాట వినిపించినిది; వద్దు బాబో అంటున్నా వాళ్ళు ఏకధాటిగా ఫ్రెంచి, జర్మను, ఇంగ్లీషు పదజాలం ఏకరువు పెట్టేస్తారు; ఉచ్చారణకూడా నానారకాలుగా ఉంటుంది-ఫ్రెంచి మాటలను ముక్కుతో మాట్లాడుతూ తొస్సుగా పలుకుతారు, ఇంగ్లీషు మాట్లాడితే అచ్చగా పిట్టలు కిచకిచలాడి నట్టుంటుంది, ఆ సమయంలో వాళ్ళ మొహాలు పిట్టలల్లే ఉంటాయి కూడానూ, అలా పిట్ట మొహాలు పెట్టలేని వారిని చూసి వాళ్ళు నవ్వుతారు. వాళ్ళకి రష్యను సంప్రదాయాలేవీ పట్టవు. వారి జాతీయాభిమానం మహావెళితే, తమ వేసవికుటీరాలను రష్యను పద్ధతిలో కట్టుకునేవరకూ పోతుంది. గొప్పకుటుంబాలకు చెందిన పాఠకులు అలాటివాళ్ళు, తాముకూడా వారి అంతవాళ్ళమే అనుకునే వాళ్ళు వారిని అనుకరిస్తారు. మళ్ళీ వీళ్లే ఎన్నో కట్టుబాట్లు పెడతారు! ప్రతి రచనా నిర్దుష్టంగా, స్వచ్ఛంగా, నాజూకైన భాషలో రచించబడాలంటారు-అంటే, రష్యను భాష శుద్ధిపొంది మబ్బుల్లోనుంచి దిగివస్తే వారు శ్రమలేకుండా నోళ్ళు తెరిచి, నాలుకలు తెరిచి ఆస్వాదిస్తారన్న మాట. మానవ కోటిలో అర్థభాగమైన స్త్రీలను అవగాహన చేసుకోవటం సులభంకాదన్న మాట నిజమేగాని, మన పాఠక మహాశయులు ఒక్కొక్కసారి మరింత అర్థంకాకుండా ఉంటారు.

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 29