ఉత్పరివర్తనం

“ఆకస్మికముగా సంభవించే గుణాత్మక వైవిధ్యములను ఉత్పరివర్తనములు అందురు..” నిశ్శబ్దంగా ఉన్న క్లాసు రూములో ఖంగుమంటోంది మధు సార్ గా పిలవబడే రాజా మధుసూదన వరప్రసాద రావు గొంతు. పల్లెకి ఎక్కువ, పట్టణానికి తక్కువగా ఉన్న ఆ ఊరి ఎయిడెడ్ స్కూల్లో ఏడో తరగతి లోకి అడుగు పెట్టబోతున్న పిల్లలంతా తల వంచుకుని శ్రద్ధగా నోట్సు రాసుకుంటున్నారు. అప్పుడప్పుడూ పిల్లలు నోట్ పుస్తకాల పేజీలు తిప్పుతున్న సవ్వడి వినిపిస్తోంది. ఎండ ప్రచండంగా ఉంది. మే నెల మధ్యాహ్నం కావడంతో సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. అప్పుడప్పుడూ వడగాలి కెరటంలా వచ్చి వెళ్తోంది.

ఇరవై ఎనిమిదేళ్ళ మధు ఆలోచనలు డార్విన్ పరిణామ సిద్ధాంతం దాటి మరెటో వెళ్ళిపోయాయి. “వస్తుందా? రాదా?” గత కొద్ది రోజులుగా అతన్ని వేధిస్తున్న ప్రశ్న దగ్గర ఆ ఆలోచనలు మరోసారి ఆగాయి. కొద్దిగా మాసినట్టుగా అనిపించే నీలంరంగు జీన్స్ ఫ్యాంట్ లో, అదే రంగు నిలువు చారలున్న చొక్కాని ఇన్ చేశాడు . టేబిల్ కి ఆనుకుని నిలబడి పాఠం చెబుతున్నా, అలవాటు చొప్పున భుజాలని కొద్దిగా ముందుకు వంచి నేల వైపు చూస్తున్నాడు.

ఐదడుగుల పదకొండంగుళాల పొడవుండే మధు భుజాలువంచిన తీరు చూసేవాళ్ళం దరికీ “భూభారం అంతా ఇతనే మోస్తున్నాడా?” అనిపిస్తుంది.  నోట్సు రాయడం పూర్తి చేసిన పిల్లలు అతను చెప్పబోయే పాఠం కోసం ఎదురు చూస్తున్నారు. సమ్మర్ క్లాసులు మొదలైనప్పటి నుంచీ మేష్టారలా ఉన్నట్టుండి ఆలోచనల్లోకి  వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు.  వెనుక బెంచీల్లో కలకలం మొదలవ్వడంతో ఈ లోకంలోకి వచ్చాడు మధు.  నోట్సు ఆగిపోవడం తో వెనుక బెంచీ పిల్లలు కబుర్లలో పడ్డారు.

‘ఉత్పరివర్తనము’ గురించి ఇప్పుడు తను వివరించినా పిల్లలు పాఠం వినే మూడ్ లో లేకపోవడం గమనించి “ఈ పాఠం రేపు చెప్పుకుందాం..” అంటూ పిల్లలకి భోజనాలకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చేసి, తను ప్రిన్సిపాల్ గది వైపు బయలుదేరాడు మధు. అలవాటు చొప్పున గది బయట ‘ఎస్. త్రినాధ మూర్తి, ప్రిన్సిపాల్’ అన్న నీలం రంగు బోర్డు కేసి ఒక్క క్షణం తదేకంగా చూసి లోపలికి అడుగుపెట్టాడు. ఒక సేవా సంస్థ, ప్రభుత్వ సాయంతో నడుపుతున్న ఆ ఎయిడెడ్ స్కూల్లో ఇంగ్లీష్ మేష్టారుగా చేరి, పదోన్నతిపై ప్రిన్సిపాల్ అయిన యాభయ్యేళ్ళ త్రినాధ మూర్తిది స్వతహాగా జాలిగుండె.

ఆ స్కూల్లో చదివే పిల్లల్లో ఎక్కువ మంది రోజు కూలీల పిల్లలే కావడం, తల్లిదండ్రులు సెలవుల్లో తమ పిల్లలని పనికి పంపే ప్రయత్నాలు చేస్తుండడం గమనించి, వేసవి సెలవుల్లో పిల్లలకి బడిలోనే లెక్కలు, ఇంగ్లీష్, సైన్సు క్లాసులు చెప్పే ఏర్పాటు చేశాడాయన. కొద్దిమంది సీనియర్లకి మినహా, మిగిలిన టీచర్లకి సెలవుల్లో జీతాలు చెల్లించే అవకాశం లేకపోవడంతో, ఈ ఏర్పాటు వల్ల మధు లాంటి మేష్టార్లకి కొంత వెసులుబాటు ఉంటుందన్నది ఆయన ఆలోచించిన మరో విషయం.

గదిలోకి అడుగుపెట్టగానే ఫ్యాను గాలి ఒక్కసారిగా తాకి వెన్నులో వణుకు వచ్చినట్టు అనిపించింది మధుకి. ఎప్పటిలాగే తల వంచుకుని మౌనంగా నిలబడ్డాడు ప్రిన్సిపాల్ ముందు. ఇంటర్నెట్ లో సులభంగా పిల్లలకి చెప్పే ఇంగ్లీష్ పాఠాల వివరాలు వెతుకుతున్న త్రినాధ మూర్తి అలికిడికి తలెత్తారు. “ఒకే మధూ.. రేపు మొదటి క్లాసు మీరే తీసుకోవాలి. ‘బి’ సెక్షనే చూసుకోండి. సాయిరాం ‘ఏ’ సెక్షన్ వాళ్లకి మేథ్స్ చెబుతారు.. పది గంటలకల్లా వచ్చేయండి..,” అనగానే, ఆ మాటకోసమే ఎదురు చూస్తున్నట్టుగా  వెను తిరిగాడు మధు.

పచ్చని పసిమి చాయతో మెరిసిపోయే ఆ కుర్రాడు, ఎండ వేడికి కందిపోవడం చూసి చివుక్కు మనిపించింది త్రినాధ మూర్తికి. వెళ్తున్న మధుని చూసి ‘పూర్ ఫెలో’ అనుకున్నారు. రెండేళ్లుగా మధు ఆ స్కూల్లో పని చేస్తున్నా, అతను ఆయనతో మాట్లాడింది తక్కువ. తను అతని తండ్రికి స్నేహితుడూ, ఇదే స్కూలు నుంచి తండ్రి రిటైరయ్యాక బీయీడీ క్వాలిఫికేషన్ లేకపోయినా పిలిచి ఉద్యోగం ఇచ్చిన వాడూ అవడం వల్ల తనంటే అతనికి భయంతో కూడిన గౌరవం అనుకుంటారు త్రినాధ మూర్తి.

స్ట్రాపాన్ బ్యాగ్ భుజాన తగిలించుకుని తల వంచుకుని నడుస్తూ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ చేరుకునేసరికి, ట్రైన్ వస్తోందన్న ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. ఎర్రటి ఎండలో ఆ పది నిమిషాల నడకా ఎన్నో గంటల శ్రమలా అనిపించిందతనికి. అక్కడినుంచి గంటసేపు రైల్లో ప్రయాణం చెయ్యాలి, అతను కలవాలనుకుంటున్న వ్యక్తిని చేరుకోడానికి.. ఇది అతను తరచూ చేసే ప్రయాణమే.

ఎప్పటిలాగే ఖాళీగా ఉంది ఆ పాసింజరు బండి. కిటికీ పక్క సీట్లో కూర్చున్నాడు మధు. ఎదుటి సీట్లో ఓ పల్లెటూరి దంపతులు, వాళ్ళ కాళ్ళ దగ్గర కోళ్ళ గంప. ఎండ వేడికి నిద్రావస్తలో ఉన్నాయి ఆ గంపలో ఉన్న రెండు కోళ్ళూ. వాటిని చూడగానే మధుకి తన బాల్యం గుర్తొచ్చింది, అప్రయత్నంగా. మధుకి ఊహ తెలిసిన నాటినుంచి వాళ్ళింట్లో ప్రతి ఆదివారం ఉదయం కనిపించే దృశ్యం ఒకటే. కొడుకుని దగ్గర కూర్చోపెట్టుకుని, బజారు నుంచి తెచ్చిన కోడిని ముక్కలుగా కోసేవారు మధు తండ్రి, అప్పటికే  రంగారావు మేష్టారుగా మారిన రాజా రంగారావు.

తమ వంశపు పూర్వ వైభవానికి గుర్తుగా ఆయన దగ్గర మిగిలిన పాతకాలం నాటి పిడిబాకుతో యెంతో కష్టపడి కోడిని కోసేవారు రంగారావు మేష్టారు. వెండి పిడిమీద బంగారు లతల డిజైన్లో ఉన్న ఆబాకు,  కోడిని కోసేందుకు ఏమాత్రం అనువుగా లేకపోయినా, దానిని ఉపయోగించ గలగడమే అదృష్టంగా భావించేవారాయన. “మా తాతగారు, అంటే మీ ముత్తాతగారైన శ్రీ రాజా మధుసూదన వరప్రసాద రావు గారు వేటకి ఉపయోగించిన పిడి బాకు ఇది. దీనితో వారు ఏకంగా పెద్ద పులినే చంపేశారు,” అంటూ గుర్తు చేసుకునే వారు తన్మయంగా.

నిజానికి రంగారావు మేష్టారికి తన తాతగారు అంతబాగా తెలీదు. ఈయనకి జ్ఞానం వచ్చేసరికే ఆ పెద్దాయన కాలంచేశాడు. అయితే ఆయన వీరగాధలు జనం నోళ్ళ నుంచి విని, అంతటి గొప్పవాడికి మనవడిగా పుట్టినందుకు గర్వపడ్డారు.. ఇద్దరు ఆడపిల్లలకి మధ్యలో పుట్టిన తనకొడుక్కి ఆయన పేరే పెట్టుకున్నారు. ఉన్న జమీని విందువినోదాలకీ, వేట సరదాలకీ, మేజువాణీలకీ ఖర్చు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేసినా, ఆ తాత గారంటే వల్లమాలిన గౌరవం రంగారావు మేష్టారికి.

తను ఎంత గొప్ప వంశానికి వారసుడో కొడుక్కి తెలియాలని ఆయన తాపత్రయం. ఆదివారపు ఉదయాన్ని అందుకోసం వెచ్చించేవారు. అయితే తండ్రి చెప్పే కథలకన్నా, కోడి శరీర భాగాలు ఎక్కువ ఆకర్షించేవి మధుని. “అన్ని పక్షులు, జంతువుల శరీర నిర్మాణం ఒకేలా ఉంటుందా?” లాంటి సందేహాలెన్నో వచ్చేవి. అలా తనకి తెలియకుండానే జీవ శాస్త్రం మీద మక్కువ పెంచుకున్నాడు  మధు. ఇంటర్మీడియట్  రోజుల్లో  జువాలజీ మీద అతనికున్న ఆసక్తి లెక్చరర్లని ఆశ్చర్య పరిచింది.

మెజారిటీ స్టూడెంట్లు అయిష్టతతోనో, తప్పనిసరి అన్నట్టో చేసే డిసెక్షన్ని చాలా ఇష్టంగా చేసేవాడు మధు. డిసెక్షన్ టేబిల్ మీద అతని పొడవాటి వేళ్ళ కదలికల్ని ప్రత్యేకంగా చూసేవారు జువాలజీ లెక్చరర్ “నీవి సర్జరీ చేయాల్సిన వేళ్ళు మధూ.. నువ్వు మెడిసిన్ లో చేరాల్సిందే,” అనే వారు ప్రతిసారీ.. ఇంటర్మీడియట్ పరిక్షలు అయ్యాక ఓ ఆదివారం ఉదయం కోడిని కోస్తుండగా, తనకి మెడిసిన్ లో చేరాలని ఉందని తండ్రికి చెప్పాడు మధు.

రంగారావు మేష్టారు మొదట ఆనంద పడ్డారు.. ఆ తర్వాత బాధ పడ్డారు. “అంతా తాతగారి పేరు మహత్యం.. అందుకే అంత గొప్ప ఆలోచన వచ్చింది..” అంటూ చాలా సేపు ఆ తాతగారిని తలుచుకుని,  “మనకి ఆస్తులు ఉంటే వాటిని అమ్మైనా మెడిసిన్లో చేర్చేవాడిని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నావల్ల కాదు,” అని తేల్చేశారు చివరికి.

బుట్టలో పడుకున్నరెండు కోళ్లలో ఒకటి నిద్ర లేచి ‘కొక్కోక్కో..’ అని గొంతెత్తి కూయడంతో ఉలిక్కిపడి, ఆలోచనల నుంచి బయటకి వచ్చాడు మధు. పల్లెటూరి ఆసామీ సీసాలో నీళ్ళని ఓ చిన్న గిన్నెలోకి వంచి కోళ్ళ ముందు పెట్టగానే ఆ గిన్నెని ముక్కుతో పొడవడం మొదలు పెట్టాయి ఆరెండు కోళ్ళూ. అది చూడగానే తనకీ దాహం వేస్తున్నట్టు అనిపించింది మధుకి. బ్యాగులో ఉన్న ప్లాస్టిక్ సీసా తీస్తుంటే, నీళ్ళ సీసాతో పాటు ఉన్న స్టీలు బాక్స్ కనిపించి, తను ఏమీ తినలేదన్న విషయం గుర్తొచ్చింది.

ముందుగా గొంతు తడుపుకుని, లంచ్ బాక్స్ మూత తీశాడు. ఉదయం స్కూలికి బయలుదేరేటప్పుడే మధ్యాహ్నం టౌనుకి వెళ్ళే పని ఉందని చెప్పగానే తల్లి ఇచ్చిన బాక్సు అది. మూత తీయగానే వచ్చిన ఘాటైన వాసన, కనిపించిన ఎర్రటి ఆవకాయ అన్నాన్ని చూడగానే తల్లి మీద కోపం ముంచుకొచ్చింది.. అది కూడా ఒక్క క్షణం మాత్రమే.

ముప్ఫై ఐదేళ్ళ క్రితం రాజా రంగారావుని (అప్పటికింకా ఆయన మేష్టారు కాదు) పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చిన ఆమె బయటి వాళ్ళతో మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళతోనూ మాట్లాడేది అంతంత మాత్రమే. అద్దె కట్టడం ఆలస్యం అవుతోందని ఇంటి ఓనరు వచ్చి కేకలేసినా, జన్మానికో శివరాత్రి అన్నట్టుగా భర్త కొత్త చీర తెచ్చినా ఆవిడ స్పందన ఒకటే, నిశ్శబ్దంగా చూడడం.

రెండేళ్ళ క్రితం ఆ ఇంటి రెండో ఆడపిల్ల పెళ్లి జరగడం, రంగారావు మేష్టారు రిటైరవ్వడం ఒకేసారి జరగడంతో ఆ ఇంటి ఆర్ధిక పరిస్థితి మరికొంచం దిగజారింది. రంగారావు మేష్టారు మాత్రం తమకి పూర్వ వైభవం ఉండి ఉంటే  జమిందార్లంతా వచ్చి తన కొడుక్కి పిల్లనిస్తామంటూ తన ఇంటి ముందు నిలబడే దృశ్యాన్ని అప్పుడప్పుడూ ఊహించుకుంటూ తన్మయులవుతున్నారు.

ఓ చిన్న స్టేషన్లో రైలాగడం, మజ్జిగ పొట్లాలమ్మే ఓ కుర్రాడు బోగీలోకి రావడం ఒక్కసారే జరిగింది. వాడిని చూడగానే ప్రాణం లేచొచ్చింది మధుకి. ఆవకాయ కారానికి మండుతున్న నోటిని మజ్జిగతో శాంతింప జేశాడు. ఎదుటి సీటు పల్లెటూరి ఆసామీ భార్య మజ్జిగ పేకెట్ ని నేరుగా తాగకుండా తనతో తెచ్చుకున్న గ్లాసులో వంపుకోడం  చూసిన మధుకి మేరీ సువార్త కళ్ళముందు మెదిలింది. అతను మొదటిసారిగా ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు  ఇలాగే షాపు నుంచి తెప్పించిన మజ్జిగ పేకెట్ ని గాజు గ్లాసులోకి వంపి ఇచ్చింది మేరీ సువార్త.

డిగ్రీ నుంచి కలిసి చదువుకున్నా, మధుకి ఆమె పరిచయమైంది యూనివర్సిటీ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే. అది కూడా తనంతట తానుగా ఆమె వచ్చి పరిచయం చేసుకున్నప్పుడు. ఎమ్మెస్సీ లో గోల్డ్ మెడల్ కి మధుతో పోటీ పడి, రెండో స్థానం తో సరిపెట్టుకుంది సువార్త. ఆమె  బహూకరించిన ‘ది సెవెన్ హేబిట్స్ అఫ్ హైలీ ఎఫిక్టివ్ పీపుల్’ పుస్తకాన్ని బ్యాగ్ లోనుంచి తీసి, అందులో లీనమైపోయాడు మధు. మరి కాసేపట్లో ఒక్క కుదుపుతో గమ్యస్థానంలో ఆగింది రైలు. దిగడానికి కంగారు పడుతున్న పల్లెటూరి దంపతులని దిగనిచ్చి, వాళ్ళ వెనుక తను నింపాదిగా రైలు దిగాడు మధు.

అక్కడినుంచి కోచింగ్ సెంటర్ కి పదినిమిషాల నడక. అన్నిరకాల పోటీ పరీక్షలకి శిక్షణ ఇచ్చే సెంటర్ అది. సువార్త కనిపిస్తుందేమో అని వెతుకుతూ, తనకి బాగా పరిచయమైన క్లాసు రూముల్ని దాటుకుని డైరెక్టర్ గది వైపు వెళ్ళాడు మధు. ఆమె కనిపించక పోవడంతో కొంచం రిలీఫ్ గా అనిపించింది. అంతలోనే తనకి కావాల్సిన వ్యక్తి కనిపించడంతో  అప్పటివరకూ తను పడ్డ శ్రమంతా మర్చిపోయి “హాయ్ శివా..” అంటూ పలకరించాడు మధు.

ఐదారేళ్ళ స్నేహం  వాళ్ళిద్దరిదీ.. అప్పుడే మొదలైన బట్టతల, నలుపు తెలుపు కలగలిసిన గడ్డం, సర్వకాలాల్లోనూ కళ్ళని అంటిపెట్టుకుని ఉండే కళ్ళజోడూ.. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ నలభై ఏళ్ళ శివకుమార్ ని చూడగానే ఎవరికైనా ‘ఇంటలెక్చువల్’ అనిపించక మానదు. అతని కళ్ళలో విజ్ఞానం తొణికిసలాడుతూ ఉంటుంది. భౌగోళిక శాస్త్రాన్ని అతనిలా చెప్పగలిగే వాళ్ళు ఆ చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో లేరంటారు. ప్రపంచంలో ఏ దేశాన్ని గురించైనా నిద్రలో లేపి అడిగినా మ్యాప్ గీసి మరీ వివరించగలడు అతను.

“ఒకటి రెండు రోజుల్లో మీ రిజల్ట్స్ రావొచ్చట..” శివ మాట వినగానే అప్పుడే ఆగిన టెన్షన్ మళ్ళీ మొదలయ్యింది మధుకి. “ఇప్పుడింక మళ్ళీ ప్రిలిమ్స్ రాసే పని కూడా లేదు..” అన్నాడు మధు. మెడిసిన్లో చేర్చనందుకు తండ్రి మీదా, తమ ఆర్ధిక పరిస్థితి మీదా కోపం వచ్చింది మధుకి. తన దగ్గర డిసెక్షన్  నేర్చుకున్న మిత్రులు మెడిసిన్లో చేరితే బాధ పడకుండా ఉండడం అతని వల్ల కాలేదు. చాలా రోజులు తండ్రితో మాట్లాడలేదు కూడా. డిగ్రీలో చేరాక తను అందరిలాంటి ఉద్యోగం చేయకూడదు అనుకుని, కలెక్టర్ కావడాన్ని తన లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. ఐదేళ్లుగా తను పడుతున్న శ్రమ కళ్ళముందు సినిమా రీలులా తిరిగింది మధుకి. తనకెంతో ఇష్టమైన జువాలజీ, శివకి కొట్టిన పిండైన జాగ్రఫీ ఆప్షన్స్ గా సివిల్ సర్వీసు పరిక్ష రాస్తున్నాడు.

పీజీ తర్వాత రెండేళ్ళ పాటు కష్టపడి చదివి, ప్రిలిమ్స్ రాసి విజయం సాధించినా మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాడు. ఏడాది గ్యాప్ తీసుకుని చేసిన రెండో ప్రయత్నంలోనూ అంతే. . ఈలోగా ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. త్రినాధ మూర్తి గారి మంచితనం వల్ల, ఉద్యోగంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, ప్రిపరేషన్ కి మునుపటి సమయం కేటాయించడం కష్టమయ్యింది. ఆ టైములో మధుకి మోరల్ సపోర్ట్ ఇచ్చినవాడు శివ. మూడోసారి ఇంటర్వ్యూ వరకూ వెళ్ళినా ఫలితం అనుకూలంగా రాలేదు. ఈ మధ్యనే నాలుగోదీ, చివరిదీ అయిన ప్రయత్నంలో ఇంటర్వ్యూకి వెళ్లి వచ్చాడు.

“నువ్వూ, సువార్త ఇద్దరూ సెలక్ట్ అవుతారులే..” అన్నాడు శివ. ఇరవై మంది సివిల్ సర్విస్ స్టూడెంట్స్ బ్యాచిలో ఇంటర్వ్యూకి వెళ్ళింది వాళ్లిద్దరే. సువార్త ప్రస్తావన రాగానే, గత సంవత్సరం ఇంటర్వ్యూ ఫలితాలు వచ్చినప్పుడు శివతో జరిగిన వాగ్వాదం గుర్తొచ్చింది మధుకి. సువార్త మెయిన్స్ క్వాలిఫై కాలేదు అప్పుడు.

“నాకున్నది ఇంకొక్కటే అవకాశం శివా.. లైఫ్ అండ్ డెత్.. ఆమెకి అలాంటి సమస్య లేదు.. రాస్తూనే ఉండొచ్చు.. ఇది అన్యాయం కాదూ?” మధు ప్రశ్న వినగానే అతని మానసిక సంఘర్షణ అర్ధమయ్యింది శివకి.  “జనరల్ స్టడీస్ కోసం పాలిటీ చదివావ్.. రిజర్వేషన్లు ఎందుకు పెట్టారో మర్చిపోయావా?..”  అంటూ క్లాసు తీసేసుకున్నాడు శివ.

“రాజ్యాంగం రాసిన నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు.. ఇద్దరం చదువుతున్నాం.. ఇద్దరం పరిక్ష రాస్తున్నాం.. పైగా నాకన్నా ఆమెది ఆర్ధికంగా ఉన్నత స్థితి. ఆమెకి అవకాశాలు ఇచ్చి నాకు ఇవ్వకపోవడం అన్యాయం కాదూ?”  శివ దగ్గర మిగిలింది ఇక ఒకటే అస్త్రం, దానినే  ప్రయోగించాడు. “ఒక్కసారి ఆమె తాత ముత్తాతలు ఎలా బతికారో, మీ వాళ్ళు ఎలాంటి జీవితం గడిపారో ఆలోచించు.. నీకే అర్ధం అవుతుంది..”  శివ నుంచి తాత ముత్తాతల ప్రస్తావన వచ్చేసరికి ఒక్కసారిగా పట్టరాని కోపం వచ్చింది మధుకి.. బలవంతాన అదిమి పట్టాడు.

జరిగిందంతా గుర్తొచ్చి, సువార్త గురించి ఏమీ మాట్లాడలేదు మధు. ఇంటర్వ్యూ నుంచి వచ్చాక మధు, సువార్తని కలవలేదని తెలుసు శివకి. ఆ టాపిక్ మళ్ళీ తీసుకు రాకుండా, మధుకి మరోసారి ధైర్యం చెప్పాడు.. “తప్పకుండా సర్విస్ తెచ్చుకుంటావు మధూ.. మన కోచింగ్ సెంటర్ పేరు రాష్ట్రమంతా మారుమోగుతుంది,” ఈ మాటలు వినగానే చాలా రిలీఫ్ గా అనిపించింది మధుకి. కాసేపు శివ తో కబుర్లు చెప్పి సాయంత్రం రైలుకి ఇంటికి బయలుదేరాడు.

“రిజల్ట్స్ వచ్చేస్తాయి” అన్నమాట పదే పదే గుర్తొచ్చి ఆ రాత్రి చాలాసేపటి వరకూ నిద్ర పట్టలేదు మధుకి. మొట్ట మొదటిసారిగా సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టి పొరపాటు చేశానా అన్న ఆలోచన తొలిచేసింది అతన్ని. మరేదైనా మంచి ఉద్యోగం ప్రయత్నించి ఉంటే జీవితం ఈ పాటికే మరికొంచం బాగుపడేది కదా అనిపించింది. వంటింటి నుంచి వినిపిస్తున్న గిన్నెల చప్పుడుకి కలత నిద్ర నుంచి మెలకువ వచ్చింది మర్నాడు ఉదయం.  “మా తాతగారిది పెద్ద చెయ్యి.. దాన ధర్మాలకి లోటు చేయలేదు వారు..” ఎదురింట్లో కొత్తగా వచ్చిన వాళ్లకి తన వంశం గొప్పదనాన్ని కథలు కథలుగా వర్ణిస్తున్నారు రంగారావు మేష్టారు.

ఎందుకో ఒక్కసారిగా నీరసం ఆవహించింది మధుకి. స్కూలికి వెళ్లాలనిపించక పోయినా బలవంతంగా సిద్ధమయ్యాడు. ముందురోజు వేసుకున్న షర్ట్ కొంచం మాసినట్టుగా అనిపించడంతో, బీరువా తీసి చేతికందిన బూడిద రంగు టీ షర్ట్ తీసుకున్నాడు. భుజాలు కొంచం గూనిగా వంచే అలవాటు వల్ల, అతని వంటిమీద ఆ నలిగిన టీషర్ట్ అచ్చం చిలక్కొయ్యకి తగిలించినట్టుగా ఉంది.

ఎప్పటిలాగే స్కూలికి నడక మొదలు పెట్టాడు. ఉదయపు ఎండైనా వంటిమీద మంటలు పుట్టిస్తోంది. మోటార్ సైకిళ్ళమీద వెళ్తున్న వాళ్ళని చూసినప్పుడు తనూ ఒక మోటర్ సైకిల్ కొనుక్కోగలిగితే బాగుండేది అని మరోసారి అనిపించింది మధుకి. ఇంతలో అతని పక్కనుంచే మోటర్ సైకిల్ మీద వెళ్తూ కనిపించాడు మేథ్స్ టీచర్ సాయిరాం. ప్రిన్సిపాల్ ని మినహాయిస్తే, ఆ స్కూల్లో మోటర్ సైకిల్ ఉన్న టీచర్ అతనొక్కడే. అతని భార్య రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఎల్డీసీ గా పనిచేయడం, అతను ఇంటి దగ్గర ట్యూషన్లు చెబుతూ ఉండడం వల్ల ఆ వెసులుబాటు కలిగింది.

సహోద్యోగి తన పక్కనుంచే వెళ్తున్నా నోరు తెరిచి లిఫ్ట్ అడగలేకపోయాడు మధు. ఎప్పుడూ మధు పరోక్షంలో అతని మీద జోకులేసే సాయిరాం లిఫ్ట్ ఆఫర్ చేసే ప్రయత్నం చేయలేదు. ప్రిన్సిపాల్ కి ఒకసారి కనిపించి, నేరుగా తన క్లాసుకి వెళ్ళాడు.మధు.  క్లాసు కోలాహలంగా ఉంది. తన అలవాటు ప్రకారం ముందు బెంచీలో కూర్చున్న అమ్మాయిని క్రితం రోజు రాసిన నోట్సు చదవమన్నాడు మధు. ఆ అమ్మాయి పేరు చంద్రిక. అదే పేరుతో ఒక సౌందర్య సబ్బు మార్కెట్లో ఉండడంతో, మిగిలిన పిల్లలంతా ఆమెని ‘సబ్బూ’ అని పిలుస్తూ ఉంటారు. ఆ క్లాసులో మధుకి ఇష్టమైన స్టూడెంట్ ఆమె.

లేచి నిలబడి, క్లాసందరి వంకా ఒకసారి గర్వంగా చూసి, తను రాసుకున్న నోట్సు చదివింది సబ్బు.. “ఆకస్మికముగా సంభవించే గుణాత్మక వైవిధ్యములను ఉత్పరివర్తనములు అందురు..”  అంటూ..   ముందుగా  నోట్సు చెప్పి తర్వాత పాఠం చెప్పడం అలవాటు మధుకి.

“హ్యూగో డివ్రిస్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఈ ఉత్పరివర్తన సిద్ధాంతం ప్రకారం చుట్టూ ఉండే వాతావరణం లో వచ్చే మార్పులకి అనుగుణంగా జీవులు  మనుగడ  సాగించడం కోసం వాటి శరీర నిర్మాణంలో మార్పులు జరుగుతాయి..” తను యెంతో ఇష్టంగా చదువుకున్న సబ్జెక్టుని పిల్లలకి అర్ధమయ్యేలా వివరించడాన్ని ఒక చాలెంజ్ గా తీసుకున్నాడు మధు. వాళ్ళ ముఖాలు చూడడం తోనే తను చెప్పింది పిల్లలకి కొద్దిగానే అర్ధంయ్యిందనీ, మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందనీ గమనించాడు.

జీవశాస్త్రం మీద అతనికి ఉన్న ప్రేమ కారణంగా చాలాసార్లు పాఠాలు సిలబస్ పరిధిని దాటేస్తూ ఉంటాయి.  ఇంగ్లండ్ లో మాత్ లపై వందేళ్ళ పాటు జరిగిన పరిశోధనని వివరించేందుకు సిద్ధమయ్యాడు.  “ఇంగ్లండ్ లో మన సీతాకోక చిలుకలని పోలిన మాత్ లు చెట్ల కాండాలపై నివాసం ఏర్పరచుకుని ఉంటాయి. అక్కడి చెట్ల కాండాల్లాగే ఈ మాత్ లు కూడా తెల్ల రంగులో ఉండేవి. ఇంగ్లండ్ అభివృద్ధి చెంది పరిశ్రమలు పెరగడంతో, కాలుష్యం పెరిగి చెట్ల కాండాలు నలుపు రంగులోకి మారడం మొదలయ్యింది. దీనితో నల్లగా మారిన కాండాలపై నివాసం ఏర్పరచుకున్నతెల్లని మాత్ లు సులువుగా వాటి శత్రువుల కళ్ళలో పడి ప్రాణాలు పోగొట్టుకునేవి..”  పిల్లలంతా పాఠంలో లీనమై పోవడం గమనించాడు మధు. అతనికి ఉత్సాహం పెరిగింది.

“ఇక మాత్ జాతి అంతరించిపోతుందా  అనిపించే సమయంలో ఒక విచిత్రం జరిగింది. మాత్ ల సంతతిలో నలుపు రంగు మాత్ లు కనిపించడం మొదలయ్యింది. కాలక్రమంలో తెల్ల మాత్ ల సంఖ్య తగ్గుతూ, నల్ల మాత్ ల సంఖ్య పెరిగింది. ఇలా జరగడానికి కారణం ఉత్పరివర్తనం. ఉత్పరివర్తనమే జరగక పోతే మాత్ జాతికి మనుగడ ఉండేది కాదు,” క్లాసులో సూది పడితే వినిపించేతంత నిశ్శబ్దం. . “ఇది ఇక్కడితో  అయిపోలేదు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని గురించి ప్రజలు ఆందోళనలు చేయడంతో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాతావరణంలో మార్పులు జరిగి చెట్ల కాండాలు మళ్ళీ తెల్లగా మారడం మొదలయ్యింది..” అప్పటికే పిల్లలంతా ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచేశారు.

“అప్పటికి తెల్ల మాత్ ల సంఖ్య బహు స్వల్పంగా ఉంది. చెట్ల కాండాలు తెల్లబడడంతో నల్ల మాత్ ల మనుగడకి ముప్పు వచ్చింది. తెల్లని కాండంపై నల్లని మాత్ లు దాగి ఉండలేక శత్రువుల కళ్ళ పడేవి. దీనితో నల్ల మాత్ ల సంఖ్య తగ్గి తెల్ల మాత్ ల సంఖ్య పెరగడం మొదలయ్యింది. ఈ మొత్తం ప్రక్రియ వంద సంవత్సరాల కాలంలో జరిగింది..” అక్కడివరకూ చెప్పి ఆగాడు మధు అతని బుర్రలో మ్యూటేషన్స్ థియరీ, హ్యారిసన్ పరిశోధన, దానిపై వచ్చిన భిన్నాభిప్రాయాలు గిర్రున తిరుగుతున్నాయి. పిల్లలకి మాత్రం పాఠం విన్నట్టుగా కాక ఏదో చందమామ కథ విన్నట్టుగా అనిపించింది.

“సార్ నాకో డౌటు..” అంటూ లేచి నిలబడింది సబ్బు. “జాతులు అంతరించిపోతున్నప్పుడు మాత్రమే ఉత్పరివర్తనాలు జరుగుతాయా సార్?” ఆమె ప్రశ్నని మధు అర్ధం చేసుకునే లోపునే “అంటే.. ఇంక వేరే ఏ కారణానికీ జరగవా?” అంటూ తన ప్రశ్న పూర్తి చేసింది. జవాబు చెప్పడానికి మధు సిద్ధ పడుతుండగానే ఓ వడగాలి కెరటం బలంగా తాకి వెళ్ళింది. పరుగులాంటి నడకతో త్రినాధ మూర్తి గారు క్లాసుకి వచ్చారు. ఉన్నట్టుండి ప్రిన్సిపాల్ రావడంతో పిల్లలంతా లేచి నిలబడ్డారు. “ఫిఫ్టీంత్ ర్యాంక్ మధూ.. ఐఏఎస్..కంగ్రాట్స్..” ఎప్పుడూ సీరియస్ గా ఉండే త్రినాధ మూర్తి, ఆక్షణంలో తన ఉద్వేగాన్ని దాచుకునే ప్రయత్నం ఏదీ చేయలేదు.

మధుకి విషయం అర్ధం కావడానికి అర నిమిషం పట్టింది. అర్ధం కాగానే నిటారుగా నిలబడ్డాడు. భుజాలు వెనక్కి వెళ్లి చాతీ ముందుకు పొంగడం తో టీ-షర్ట్ శరీరానికి అతుక్కుపోయిందా అనిపించేలా అయింది.  కళ్ళెత్తి సూటిగా చూశాడు త్రినాధమూర్తి వైపు. ఇంకా ఉద్వేగంలోనే ఉన్న త్రినాధ మూర్తి గారు మధు చేతులు పట్టుకోబోతుండగా, వారించి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బలంగా. మధూ సార్ కలక్టర్ కాబోతున్నారని అర్ధమయ్యింది పిల్లలకి. వాళ్ళంతా అభినందన పూర్వకంగా చప్పట్లు కొట్టడంతో, ఆ సందడికి పక్క రూంలో క్లాసు చెబుతున్న సాయిరాం, ఆ సెక్షన్ పిల్లలూ, స్టాఫ్ రూం లో ఉన్న టీచర్లు, స్టాఫ్ అంతా అక్కడికి చేరిపోయారు. అందరి అభినందనలనీ హుందాగా అందుకున్నాడు మధు.

“ఇంటికి వెళ్లి మీ నాన్నకి చెప్పు మధూ.. చాలా సంతోషిస్తాడు,” అన్నారు త్రినాధ మూర్తి. ఏకవచన ప్రయోగానికి చురుక్కున చూశాడు మధు. ఇప్పుడతని శరీరంలో శ్రీ రాజా మధుసూదన వరప్రసాద రావుగారి రక్తం పరవళ్ళు తొక్కుతోంది. “శివకి ఈ వార్త చెప్పడం ఎలా?” అన్న ఆలోచన ఒక్క క్షణంలో వచ్చి మాయమయ్యింది. “రిజల్ట్స్ చూసి తనే వస్తాడులే..” అనుకున్నాడు.

మోటార్ సైకిల్ తెచ్చి క్లాసు ముందు ఆపి వినయంగా ఆహ్వానించాడు సాయిరాం “రండి..ఇంటిదగ్గర దింపుతాను..” అంటూ. ఎవ్వరివైపూ చూడకుండా, ఏమీ మాట్లాడకుండా ఠీవిగా వెళ్లి మోటార్ సైకిల్ వెనుక సీటుమీద కూర్చున్నాడు మధు. మేష్టర్లే కాదు, పిల్లలు కూడా వింతగా చూశారు ఆ దృశ్యాన్ని. “జాతులు అంతరించిపోతున్నప్పుడు మాత్రమే ఉత్పరివర్తనాలు జరుగుతాయా సార్?” అని అడిగిన సబ్బు కూడా వాళ్ళలో ఉంది.

* * *
Posted in కథ | 20 Comments

చివ్వరి చరణం

– శ్రీరమణ

“ఇట్నించి పొద్దున ఫ్లైట్ లేదు. అట్నించి మర్నాడు సాయంత్రం గాని లేదు. సో, ప్రయాణంలో రెండ్రోజులు. . . అంటే యిక్కడ కనీసం పది రికార్డింగులు ఆగిపోతాయి. పైగా అక్కడ గాలిమార్పు, తిండిమార్పు, స్ట్రెయిను సరే సరి. మీరేమో యీ అంకెకే ‘అమ్మో’ అంటున్నారు. అంతకు తగ్గితే నాకు వర్కౌట్ కాదు,” రికార్డింగ్ థియేటర్ కారిడార్‌లో చంద్రశేఖరాన్ని వాళ్ళు వినయంగా వింటున్నారు. వాళ్లు ముగ్గురూ మ్యూజికల్ నైట్ నిర్వాహకులు. చంద్రశేఖర్ వర్ధమాన నేపథ్యగాయని లలిత భర్త.

ఆ ముగ్గురూ సైగలతోనే తీవ్రంగా చర్చించుకుంటున్నారు. థియేటర్ లోపల్నించి రకరకాల వాద్యాలు వేర్వేరు శ్రుతుల్లో లీలగా వినిపిస్తున్నాయి. చంద్రశేఖర్ సెల్‌ఫోన్ టకటకా నొక్కి, వినయంగా పొందికగా నాలుగు మాటలు మాట్లాడి ఫోను కట్టేసి జేబులో పడేశాడు. ఆ ఫోను అప్పుడే చెయ్యాల్సినంత ముఖ్యమైంది కాకపోయినా, యిలాంటి సందర్భాలలో మూడ్‌ని సరిచేసుకోవడానికి ఇదొక చిన్న చిట్కా.

ఆ ముగ్గురి పెదాలు కదుల్తున్నాయి గాని, ఒక గొంతే వినిపిస్తోంది. “. . .అంటే ఆర్కెస్ట్రా, వాళ్ళ ట్రావెలూ. . .  యివన్నీ వున్నాయి కదండీ”

“పోనీ ఓ పని చెయ్యండి”

“… … …”

ఆ మాటతో ఆశగా మూడు మెడలూ చంద్రశేఖర్ వైపు ఒక్కసారి సాగాయి.

“ఆర్కెస్ట్రా లేకుండా లాగిస్తే పోలా. . .” అవసరం లేనంత స్థాయిలో పొడిపొడిగా నవ్వాడు లలిత భర్త.

ఉక్రోషాన్ని దిగమింగుతూ ఆర్గనైజర్లు వెనక్కు తగ్గారు.

చంద్రశేఖర్ చేతిలో వున్న మినరల్ వాటర్ సీసా మూత తీసి నోటి నిండా నీళ్ళు పోసుకుని మూత బిగించాడు. నీళ్ళని మూడు గుక్కలుగా మింగాడు. కొత్త సంగతిలోకి వెళ్ళడానికి విరామ చిహ్నాల్లా –

“మైకు, స్టేజి, ఆర్కెస్ట్రా అంటే ఎట్లాగండీ. అన్నీ కలిస్తేనే కదా ప్రోగ్రాము. అయినా, డబ్బు కాదండీ. . . ఇక్కడ నా ప్రొడ్యూసరు సఫరవకూడదు. నాకది ముఖ్యం.”

ఎవరో తలుపు తీశారు. ఒక్కసారి లోపల్నించి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో వెళుతున్న మ్యూజిక్ ట్రాక్ “గిర్ర్… డ్రుమ్… గిజగిజ… క్రీచ్… కిచ కిచ”మని రకరకాల వింత ధ్వనులను వినిపించింది. ఇంతలో ఠక్కున నోరు నొక్కేసినట్టు తలుపు మూసేశారు. ఆ కీచురాళ్ళ శబ్దం టక్కున తెగిపోయింది.

పక్కనే వున్న కాబిన్‌లో కూచుని పాడబోయే పాటని తన డైరీలో రాసుకుంటోంది లలిత. అసిస్టెంట్ డైరెక్టరు లిరిక్ కాగితాలు పట్టుకుని మేడమ్‌కు సాయం చేస్తున్నాడు. పాడడం కాగితం చూసి పాడినా, నొటేషన్‌తో సహా పాట డైరీలో వుండాలి. ఎవరో ఎక్కడో ఏ కచేరీలోనో ఆ పాట పాడమని అడిగితే…! అందుకే సిద్ధంగా వుండాలి. లలిత ఆ పాటలో మాటలని మననం చేసుకుంటూ, మధ్య మధ్య ట్యూన్ ప్రకారం హమ్ చేస్తూ రాస్తోంది.

కాబిన్‌లోంచి, వేరే అద్దాల గదిలోకి నడిచింది లలిత. ఎదురుగా విశాలమైన హాలు కనిపిస్తోంది. అందులో అక్కడక్కడ సంగీత వాయిద్యాలు ముసుగుతన్ని నిద్రపోతున్నాయి. చెవులను దాటి చెంపల దాకా విస్తరించిన ఇయర్ ఫోన్‌ని తగిలించుకుంది లలిత. ఎదురుగా వున్న మైకుని సరిచేసి హడావిడిగా వెళ్లాడు హెల్పరు.

“ట్రాక్ ఒకసారి విందాం మేడమ్” రికార్డింగ్ కాబిన్‌లోంచి మ్యూజిక్ డైరెక్టర్ గొంతు చెవులకు సోకింది.

“యస్సార్”

“వన్ టూ త్రీ ఫోర్. . .” మ్యూజిక్ ట్రాక్‌తో సహా పాట ఇయర్ ఫోన్స్‌లో వినిపిస్తోంది. లలిత అప్రయత్నంగా కాలుతో తాళం వేస్తోంది. పెదాలు కదులుతున్నాయి. పాటని ఆమె వేళ్ళు తడుముతున్నాయి. అక్షరాలను బాగా మచ్చిక చేసుకుంటేగాని పాట హాయిగా నడవదు.

తనిప్పుడు డమ్మీ వాయిస్‌ చోటులో తన పాటని అమర్చాలి. ఆ పెన్సిల్ గీతని చెరిపేసి తన రంగుల గీతని ట్రాక్ మీదకు ఎక్కించాలి.

“వాయిస్ కట్ చేసి ఒకసారి విందామా” సౌండ్ రికార్డిస్టు మాట ఇయర్ ఫోన్‌లో వినిపించింది.

“సార్, విందాం సార్”

మ్యూజిక్ ట్రాక్ మాత్రమే వినిపిస్తోంది. లలిత మనసులో పాటని పాడుకుంటూ, సాహిత్యాన్ని ట్యూనుతో సరిపెట్టుకుంది.

“ఓకే సార్. రెడీ. ఒక టేక్ ట్రై చేద్దాం సార్” లలిత మాటకి రికార్డింగ్ థియేటర్ ఎలర్ట్ అయింది.

అప్పటిదాకా సరుకు సరంజామా నిండిన బుట్టతో బయట నిలబడిన అమ్మాయి గాజు గదిలోకి వెళ్ళింది. రికార్డింగ్ కాబిన్‌లోంచి సూచనలు అందుతున్నాయి లలితకి. “సరే సార్, యస్సార్” అంటోంది మాటమాటకి.

బుట్టమ్మాయి మినరల్ వాటరు సీసా, ఫ్లాస్క్‌లోంచి కప్పులో వొంపిన వేడి పానీయం అందించింది. వాటిని ఒక్కో గుటక తాగి లలిత ఇయర్ ఫోన్స్ ఒకసారి సర్దుకుంది.

లలిత తన చేతి గాజులు దూసి పక్కన పెట్టింది. ఒక్కసారి కళ్ళు మూసుకుని మనసులోనే దణ్ణం పెట్టుకుంది.

తలుపులు మూసిన చప్పుడు.

ఎర్రదీపం వెలుగు.

ముసురుకుంటున్న టెన్షన్‌ని తరిమేసి, వీలైనంత రిలాక్స్ అవడానికి ప్రయత్నిస్తోంది లలిత.

“రోలింగ్. . . వన్ టు త్రీ ఫోర్”

నడుస్తున్న ట్రాక్‌కి తన గొంతుతో పాటను పెనవేస్తోంది.

“ఓకే మేడమ్, ఓకే. . . ఒకసారి విందాం. . .”

“సర్, ఎక్స్‌క్యూజ్‌మి సార్. రెండో చరణం మొదటి లైనులో కొంచెం హెజిటేషన్ వచ్చింది సార్. . . వన్ మోర్ సార్, ప్లీజ్ సార్” లలిత ప్రాధేయపడుతుంటే, రికార్డింగ్ కాబిన్ అణువణువు ఆత్మీయతా భావంతో చెమ్మగిల్లింది. నిర్మాత కృతజ్ఞతతో ముడుచుకుపోయాడు. ఆ చిరుచీకట్లో.

హెల్పర్ హడావిడిగా సౌండ్ బాక్స్‌లోకి వెళ్ళి మైక్ అడ్జస్ట్ చేసి, బ్లో రాకుండా కట్టర్‌ కూడా ఫిక్స్ చేశాడు. అసలు అతనెప్పుడూ అక్వేరియమ్‌లో చేపలా హడావిడిగానే కనిపిస్తాడు.

యస్ రెడీ, రెడీ అంటుండగానే మళ్ళీ మ్యూజిక్ ట్రాక్ మొదలైంది. ఏడుపాయల జడ పొందికగా అల్లిక పూర్తి చేసుకుంది.

“ఓకే” అని ఉత్సాహంగా వినిపించింది కాబిన్ లోంచి.

“అద్భుతం” అన్నాడు నిర్మాత.

గాజులు తగిలించుకుంటూ, ఒక్క అడుగులో రికార్డింగ్ కాబిన్‌లోకి వచ్చింది లలిత. నల్లగా వస్తాదులా నిలబడివున్న స్పీకర్లలోంచి తనిప్పుడు పాడిన పాట ఆర్కెస్ట్రా‌తో సహా విన్నది లలిత. అందరి ముఖాల్లో సంతృప్తి చిరునవ్వులుగా వ్యక్తమైంది. పేరు పేరునా థాంక్స్ చెప్పి బయలుదేరింది లలిత. అప్పటికే స్వామి పోర్టికోలో ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసేశాడు. స్వామి మున్నూట అరవై రోజులు అయ్యప్ప దీక్షలోనే కనిపిస్తాడు. చేతిలో సైతం నల్లరంగు బ్రీఫ్ కేసే వుంటుంది. అతని వయసునిగాని, మనోభావాలను గాని పైనున్న పరమేశ్వరుడు కూడా పసికట్టలేడు. లోపల్నించి “ఓకే” అన్న రెండక్షరాలు వినిపించగానే పాట తాలూకు వాళ్ళ ఎదురుగా వుంటాడు స్వామి. అతని సెల్‌ఫోన్లో స్టాప్‌వాచ్ కూడా వుంటుంది. నిడివిని బట్టి పాట ఖరీదుని తెలుపు నలుపులతో సహా తేలుస్తాడు. మినరల్ వాటర్‌తో కారు అద్దాలు తుడుస్తున్న డ్రైవరు, మేడమ్ రాకను గమనించి కారు డోర్ తీశాడు. బుట్టమ్మాయి, స్వామిలతో కారు కదిలింది. కారు మంచులో తడిసిన పోతుపావురంలా వుంది. ఈ గేటు లోంచి బయటపడి మరో ప్రాకారంలో అడుగుపెట్టింది పావురం.

వరండాలో లలితకి ఆర్కెస్ట్రాలో వయొలిన్ వాయించే వాళ్లిద్దరు ఎదురుపడ్డారు. దణ్ణం పెట్టి సౌఖ్యమా అని అడిగారు. లలిత తలూపి ముందుకుసాగింది. వాళ్లిద్దరూ మెట్ల మీద నిలబడి “మా జానకి సెట్టపట్టగ — మగారాజు వైతివి” కృతిని, కాంభోజి ఆరోహణ, అవరోహణ క్రమాన్ని చర్చిస్తున్నారు. చంద్రశేఖర్ వాళ్లిద్దర్నీ ఎగాదిగా ఓ చూపు చూసి, చరచరా తన దారిన తాను వెళ్లి పోయాడు.

గుహ తలుపులా రికార్డింగ్ కాబిన్ డోర్ భారంగా తెరుచుకుంది. భంమ్మని గుండెలదిరేలా కాంగో డ్రమ్స్ వినిపించాయి. లోపల మంద్రంగా వెలుగు పరుచుకుని వుంది. కాబిన్ విమానం కాక్‌పిట్‌లా వుంది. ట్రాక్ బోర్డు ముందు సౌండ్ రికార్డిస్టు, మ్యూజిక్ డైరెక్టరు కూచుని వున్నారు. వాల్యూమ్ నాబ్స్‌ని అటూయిటూ రెండు చేతులా జరిపేస్తున్నారు. అనుగుణంగా రంగుదీపాలు మెదులుతున్నాయి. లలిత లోపలకు వస్తూనే దణ్ణాలు పెడుతూ, అందుకుంటూ కొత్తపాటకు గొంతు సవరించుకుంది.

మళ్ళీ అదే వరస — లిరిక్ రాసుకోవడం, యస్సార్, వన్ టూ త్రీ ఫోర్, ఓకే సార్, ఓకే, గలగలలాడే గాజులు తీయడం, బుట్టమ్మాయి యిచ్చినవి తాగడం, మండ్రగబ్బల్లా చెవుల నుంచి చంపలదాకా పట్టేసే ఇయర్ ఫోన్స్‌ని సర్దుకోవడం. . .

పాట విని అందరూ బావుందన్నారు. వెళుతూ వెళుతూ మ్యూజిక్ డైరెక్టర్‌ని “సార్, స్కోర్‌లో ఫ్లూట్ బిట్‌ వేరేగా మిక్స్ చేశారే, అది ఏ రాగం సార్” అడిగిందిలలిత. సంగీత దర్శకుడి మొహం మసక దీపాల మధ్య తొలకరి మెరుపులా మెరిసింది. “. . .మాల్‌కోస్, జస్ట్ ఫ్లేవర్, ఛాయ, దట్సాల్” అన్నాడు. “సింప్లీ సుపర్బ్, అలాంటి ప్రయోగాలు మీరొక్కరే చేయగలరు సార్” అంటూ లలిత తల వంచి ఆయన పాదాలను చేతులతో అద్దుకుంది. పెద్దాయనకు మాట పెగలకపోవడం గమనించి “దీని ఫీడింగ్‌కి త్రీ ఫుల్‌డేస్ పట్టింది సార్‌కి. . .” అన్నాడు పక్కనే వున్న అసిస్టెంటు. ఈ తతంగాలన్నీ అయేలోగా బయట స్వామి పుచ్చుకోవడాలు పూర్తి చేశాడు. ఆ ఫ్లూట్ బిట్‌ని యథాతథంగా హమ్ చేస్తూ లలిత బయటకు నడిచింది. రికార్డింగ్ కాబిన్ చక్కిలిగిలికి లోనైంది.

బయటకు రాగానే బాబాయ్‌ని చూసేసరికి లలితకు ప్రాణం లేచి వచ్చింది. “ఎలా వున్నావే చిట్టి తల్లీ. . .” అంటూ తల నిమిరాడు. చిన్నప్పుడు ఎత్తుకు పెంచాడు. అమ్మ పోయాక తనే అమ్మ అయాడు. చిన్నాన్నకి సినిమాల పిచ్చి వల్ల చదువు పెద్దగా అంటలేదు. చివరకు నాన్న వాళ్లు తెలిసిన వాళ్ల ద్వారా సినిమా హల్లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పెట్టించారు. తెగ సంబరపడిపోయాడు, హాయిగా రోజూ సినిమాలు చూడచ్చని. రెండో వారానికల్లా మొహం మొత్తింది. “సరదాలు వృత్తిగా మారకూడదే చిట్టితల్లీ” అని ఇప్పుడు స్వానుభవాన్ని ఏకరువు పెడుతుంటాడు. లలితని చూడాలనిపించినప్పుడు రికార్డింగ్ థియేటర్ దగ్గర మాటు వేస్తుంటాడు బాబాయ్.

పావురం మందీ మార్బలంతో మరో చోట వాలడానికి రెక్కలు విదిల్చింది. అక్కడ కంఠ ధ్వని ముద్రణ పూర్తి చేసింది. ఆ పాట పల్లవికి శిరసు వంచి నమస్కరించింది. నిర్మాత అభిరుచిని వారి పరోక్షంలో అభినందించింది. ఆ థియేటర్‌లోనే మరో పాట పాడాల్సి వుంటే — “క్షమించండి, యింత గొప్ప పాట పాడాక యివాల్టికి యింక నోరు విప్పలేను. మీ రికార్డింగ్ రేపు పెట్టుకోండి. . . ప్లీజ్” ప్రాధేయపడింది లలిత. ఆ మాటలు శ్రుతిశుద్ధంగా అమిరాయి.

పావురం గూటికి చేరింది.

మర్నాడు ప్రముఖ నేపథ్య గాయని లలిత ఆ పాటకు యిచ్చిన కితాబు పత్రకలకు ఎక్కింది. మంచి బాక్స్ ఐటమ్!

“చిత్రమైన సినీ కైలాసంలో ప్రతివారూ నటరాజులే!” — తనలో తను నవ్వుకుంది లలిత.

“మా చంద్రశేఖరానికేం తక్కువ. లాయరీ చదివాడు. నోట్లో పలుకుంది. నాలుగక్షరాలు రాయించి బోర్డు కడితే, కనకవర్షం కురవకపోతుందా. ససేమిరా అని పెళ్ళాం కారు వెనకపడి తిరుగుతాడు. పిల్ల ఒక చాయ తక్కువైనా, తల్లి లేదన్నా, అబ్బాయి యిష్టపడ్డాడని సరే అన్నాం. ఇప్పుడు నలుగురూ ఆడదాని సంపాదన మీద బతుకుతున్నాడని అనుకుంటారా, లేదా? ఏవిటో ఎవడి పిచ్చి వాడికి ఆనందం. . .” అత్తగారు వంటావిడ దగ్గర వేష్టపడుతోంది. ధాటీగా వినిపిస్తున్న ఆమె మాటలకు మరోసారి నవ్వుకుంది లలిత — జాలిగా.

*     *     *

విశాలమైన హాల్లో గోడలన్నీ అద్దాల బీరువాలే. వాటి నిండా రకరకాల షీల్డులు, పతకాలు. గొప్పవాళ్ల సరసన లలిత ఫోటోలు. “మన స్కూల్లో చదువుకున్న నువ్వు యింత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం మా అందరికీ ఆనందమమ్మా” అన్నారు హెడ్మాస్టారు వాటిని వివరంగా చూస్తూ. ఎంతో వాత్సల్యం తొణికిసలాడింది ఆయన మాటల్లో. మాస్టారు, కూడా ఆ వూరి పెద్దలు ముగ్గురు కలిసి వచ్చారు. ఆ మాట యీ మాట అయాక, కాఫీలు తాగుతూ వచ్చిన పని చెప్పారు. “నువ్వు చదివేటప్పుడు హైస్కూలుగా వుండేది. తర్వాత జూనియర్ జాలేజీ చేశారు. ఇప్పుడు డిగ్రీ కాలేజీ అయింది. కాని, అవే రేకుల షెడ్లు వాటిలోనే నడుపుతున్నాం. కనీసం పది గట్టి గదులన్నా అవసరం. అప్పటి స్కూలు నీకు గుర్తుంటే… తూర్పు వైపు…” అని ఆయన చెబుతుంటే అడ్డుపడి, “మాస్టారూ! అక్కడ పెద్ద నేరేడు చెట్టు వుండాలి, అది బావుందా” — కళ్లింతవి చేసి ఆత్రంగా అడిగింది లలిత.

“ఓ! నిక్షేపంలా వుంది. యింకా అంతైంది. దాని నీడలో ఒక తరగతి నడుస్తోంది యిప్పుడు” — అన్నారు మాస్టారు.

లలిత స్కూలు రోజులు గుర్తొచ్చాయి. టెన్త్ క్లాసు దాకా సొంత వూళ్లోనే చదివింది. తర్వాత అందరి చదువుల వంకన బస్తీకి, బతుకుతెరువుకి నగరానికి కొట్టుకు వచ్చింది కుటుంబం.

… ఇప్పుడేమిటంటే మేడమ్, మనం అయిదారు లక్షలు

… అంతకంత గ్రాంట్ వస్తుంది….

… ఏం లేదమ్మా ఒక్క కచేరీ నువ్వు యిచ్చావంటే, యీ సమస్య పాటలా పరిష్కారం అవుతుంది. అన్నట్టు పూర్వ విద్యార్థులందరినీ పిలుస్తున్నాం. అందరూ తలో చెయ్యి వేస్తామన్నారు. ఏదో ఒకసారి మీరంతా కలిసినట్టూ వుంటుంది. ఒక విద్యాసంస్థని నిలబెట్టినట్టు అవుతుంది.

– తలో ముక్కా మాట్లాడి వచ్చిన సంగతి వివరించారు.

“దానికి యింత చెప్పాలా మాస్టారూ! మన వూరు. మన స్కూలు. మీరు బెత్తం పుచ్చుకు అడగచ్చు, నే రాకపోతే బెంచీ ఎక్కించచ్చు….”

ఆయన చెమర్చిన కళ్లు కండువాతో వత్తుకున్నారు. “బెంచీ వద్దమా! స్టేజీ ఎక్కిస్తా, గొంతెత్తి నాలుగు పాటలు పాడు. విద్యా దానం అనుకున్నా సరే, గురుదక్షిణ అనుకున్నా సరే” అని హాయిగా నవ్వారు. “లలిత నా స్టూడెంటు” అనే కించిత్ గర్వం ఉంది ఆ నవ్వులో. చంద్రశేఖర్‌ని పరిచయం చేసింది. వినయంగా నమస్కరిస్తూ — “లలిత ఎప్పుడూ చెబుతూనే వుంటుందండీ మీ గురించీ, తన స్కూలు ముచ్చట్లూ” అన్నాడు. “మేము మళ్లీ కలుస్తామమ్మా” అంటూ అంతా లేచారు. మెట్లు దిగి వాళ్లు వెళ్తుంటే స రి గ మ ప ద ని అన్నాయి అవరోహణ క్రమంలో. వాళ్లు విస్తుపోయి చూసారు.

“మా వారి సరదా…” చిరునవ్వుతో అంది లలిత.

“ఏదైనా అభిరుచి వుండాలి. హార్మణీ మీద నడిచినట్టుంది” అన్నారు మాస్టారు. చంద్రశేఖర్ వాళ్లని కారులో తమ బస దగ్గర డ్రాప్ చేసే ఏర్పాటు చేశాడు.

లలిత మనసు కుబుసం వదిలిన కోడె త్రాచులా వుంది. తను యిలా పాటలు పాడతాననీ, పేరు వస్తుందనీ కలలో కూడా వూహించలేదు. సిటీకి వచ్చి డిగ్రీలో చేరాక, సుందరి టీచర్ తనతో మొదటిసారి పాట పాడించింది. “నీ గొంతులో జరీపోగు లాంటి జీర వుంది. అది నీ జాతకాన్ని మారుస్తుంది లలితా!” అనేది ఆవిడ. రేడియో, టీవి ఆడిషన్లకి ఆవిడే తీసుకెళ్లేది. మైకు దొరికిన చోటల్లా పాడించేది. స్టేజీ ఫియర్ పోవడం ఆవిడ పుణ్యమే. పోటీలో బహుమతి రాకపోతే, “నువ్వు అద్భుతంగా పాడావు. కావాలని వాళ్లవాళ్లకి యిచ్చుకున్నార్లే” అని వోదార్చేది. అందరినీ గమనించాలి గానీ ఎవర్నీ అనుకరించకూడదు; మన దారి మనదిగా వుండాలి; అప్పుడే గుర్తింపు వస్తుంది — యిలాంటి పైసంగతులు నూరి పోసేది సుందరి టీచర్. మనోధర్మంతో పాడడమే గాని, తనెక్కడా సంగీతం నేర్చుకోలేదు. తర్వాత రాగాలు, రాగ లక్షణాలు పైపైన నేర్పింది టీచర్. కాస్త పేరు రావడం మొదలుపెట్టాక భయం పట్టుకుంది. ఈమెకు సాపాసాలు కూడా రావని ఎద్దేవా చేస్తారని శ్రమించి సాధన చేసింది. సక్సెస్‌తో గ్రహణశక్తి పెరిగింది. నలుగురి ప్రశంసల్లోంచి ఆత్మవిశ్వాసం పొంగింది. శ్రోతల ఆమోదం కొండంత మనోధైర్యాన్నిచ్చింది. పేరు ప్రఖ్యాతి వచ్చాయని హెడ్మాస్టారే స్వయంగా చెప్పారు కదా. ఇప్పుడు తను చదువుకున్న బడికి సాయం చేసేంత అయింది! తన అదృష్టానికి మురిసిపోయింది లలిత.

*     *     *

ఊళ్లో, స్కూల్లో స్వాగత తోరణాలు కట్టారు. లలిత మనసు తేలిపోతోంది. తను వెళ్లేసరికి కాలేజీ కాంపౌండులో తను పాడిన పాటలే శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులు తనని సాదరంగా పలకరించి గుర్తు చేస్తున్నారు. ఎన్ని పొగడ్తలు, ఎన్ని దీవెనలు… మోయలేనన్ని! పిల్లలు, పెద్దలూ ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడుతున్నారు. తను పుట్టి పెరిగిన నేల మీద యింతటి మర్యాద జరగడం “గొప్ప వరం” అనుకుంది లలిత.

కోయిల తంత్రులు మీటుతుంటే, వీణ మెట్ల మీద రామచిలక గమకాలు వొలకబోస్తోంది. కీబోర్డ్ రీడ్స్ మీద గువ్వల దండు కవాతు చేస్తోంది. గాలి పోసుకుంటున్న పిల్లన గ్రోవి మీద గోరింక అడ్డంగా అడుగులు వేస్తూ తీపి సంగతులు వినిపిస్తోంది. తబలా మీద అల్లోనేరేళ్లు వడగళ్లలా రాలుతుంటే, చిత్ర విచిత్ర గతులలో ఎగిరిపడుతున్న శబ్దాలకు తను దోసిలి పట్టింది. సీతాకోక చిలకలు రెక్కల చప్పట్ల మధ్య తేలిపోతున్న లలిత, సెల్‌ఫోన్ రింగ్‌టోన్ విని తుళ్లిపడింది. కమ్మటి కల చెదిరిపోయింది. “ప్చ్…”

“… అంతేనండీ, మనం నానా అగచాట్లు పడి ఒక పొజిషన్‌కి వస్తాం. ఇక అంతే, ఎక్కడెక్కడి వాళ్లకి మనం గుర్తొచ్చేస్తాం. చుట్టాలు, ఫ్రెండ్సు, గురువులు, వూరివాళ్లు, కానివాళ్లు… నిజంగా యీ బేవార్స్ గాళ్లతో చస్తున్నాను సార్. గుడి అంటాడొకడు. బడి అంటాడొకడు. చివరకు నా బతుకు ఫ్రీ సేవా కేంద్రం అయిందంటే నమ్మండి. అబ్బ! వీళ్లతో పెద్ద న్యూసెన్స్ అయిపోయిం…” — భర్త సెల్ భాషణని అంతవరకే వినిపించుకుంది లలిత. వాళ్ల స్కూలు ప్రోగ్రాం లేదని స్పష్టమైంది. ఇక దాని మీద చర్చ కూడా అనవసరం. కన్నీళ్లు, కంఠశోషలు తప్ప జరిగేదేమీ వుండదని లలితకు గత అనుభవాలు నేర్పాయి.

స్వగతాలు మాత్రం ఇలాంటప్పుడు నిర్భయంగా వాదించేస్తాయి. అసలు నేనెవరు? అతనెవరు? పెళ్లాడింది ఎవరు – ఎవర్ని? తాళి కట్టింది తన మెడకా? గొంతుకా? ఒక గొప్ప సాములారు “తప్పుకో” అంటే — “సామీ, తప్పుకోమంటోంది నా శరీరాన్నా, ఆత్మనా” అని అడిగాడు ఒక కటిక పామరుడు. సాములారి తిక్క కుదిరింది. తనేమీ ప్రేమించి పెళ్లాడలేదు. అతను అసలే వరించలేదు. కట్నాలు లాంఛనాలతో పెళ్లి జరిగింది. పెళ్లంటే ఏమిటి? గొంతు పిసికెయ్యడంతో సహా సర్వాధికారాలు మొగుడికి యివ్వడమా? స్తబ్ధుగా బుర్రలో పడున్న పాములు ఒక్కోసారి తోక తొక్కినట్టు లేచి, ప్రశ్నార్థకాలై నిలబడుతుంటాయి. వాటిని సముదాయించి మళ్లీ నిద్రపుచ్చుతుంది. లలితకు యిది అలవాటే! ఉక్రోషంతో గతం రివైండ్ అయింది –

పెళ్లి చూపుల్లో ఎవరో అడిగారు పాట పాడమని. తను నాన్న వంక చూసింది. “నీ యిష్టం” అన్నాయి నాన్న కళ్లు. ఇంతలో ప్రస్తావన కట్నాలు లాంఛనాల మీదకి మళ్లింది. పాట పక్కకి తప్పుకుంది. మొదటి రాత్రి ఆయన మాట మాత్రం అడిగితే పాడాలనుకుంది. ఏ పాట పాడాలో కూడా అనుకుంది. కాని ఆయనా వూసే ఎత్తలేదు. పాటలెన్ని పాడిందీ, పాటకి ఎంతిస్తారు, బ్లాకెంత వైటెంత… అన్నీ యిలాంటివే అడిగాడు. నిజానికి అప్పటికీ తను ఇంత యివ్వాలని డిమాండ్ చేసే స్థాయిలో లేదు. ఒకటీ అరా అవకాశాలు రావడం, వచ్చినట్టే వచ్చి జారిపోవడం, తను పాడాక కూడా తన గొంతు చెరిపేసి మరొకరితో పాడించడం లాంటి చిరు చేదు అనుభవాలే ఎక్కువ. అవకాశాల కోసం పెద్దగా తపించిందీ లేదు. అందలాలెక్కాలని ఆశ పడిందీ లేదు. అమ్మ లేదు. నాన్నకి యివేమీ తెలియవు.

తన పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. అప్పటికి సినిమారంగంలో తనకున్న పరిచయాలు చాలా కొద్ది. పెళ్లిసందడి అయీ కాకుండానే సుందరి టీచరు “అమ్మాయ్ లలితా! శుభమా అని పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీలో మన వాళ్లకి నలుగురికీ చెప్పకపోతే ఎట్లా? పాపం, మగ పెళ్లి వాళ్లేదో కట్టడి చేశారనుకుంటారు, లేనిపోంది” అంటూ ఉచిత సలహా పడేసింది. “… అయితే, మన స్థాయిలో కాదు, వాళ్ల దీవెనలు తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్లకి తగ్గట్టే వుండాలి” అన్నాడు చంద్రశేఖర్. స్టార్ హోటల్‌లో వందమందికి విందు ఏర్పాట్లు జరిగాయి. సుందరి టీచర్ లలితని వెంటే తీసుకు వెళ్లి, మ్యూజిక్ డైరెక్టర్లనీ, కొందరు నిర్మాతలనీ, రైటర్స్‌ని, ముఖ్యులనిపించిన మరికొందరినీ పిలిపించింది. “కొత్త పెళ్లి కూతురివి, నువ్వే వచ్చావా… తప్పకుండా వస్తాం” అన్నారు అందరూ. అన్నమాట నిలబెట్టుకున్నారు. “దీవెనల తోపాటు తలొక పాట యివ్వండి — మా పెళ్లి కూతురికి. లలిత నా మాటని, మీ పాటని నిలబెడుతుంది” అన్నది సుందరి అక్షింతలు వేస్తున్న అతిథులతో. ఆ సమయంలో ఎవరు మాత్రం కాదంటారు?

ఫంక్షన్ బాగా జరిగిందని చంద్రశేఖర్ సంతోషించాడు. లలితకి సుందరి టీచర్ అలా దేబిరించడం ఏదోలా అనిపించింది. “అడగందే అమ్మయినా పెట్టదు లలితా” — సమర్థించింది టీచర్. ఆవిడకో మంచి పట్టుచీర పెట్టి, కొత్త దంపతులు ఆమె కాళ్లకు మొక్కారు. సుందరి టీచర్‌ని గౌరవించాలన్న ఆలోచన పెళ్లికొడుకుదే! అలాంటి మొగుడు దొరికినందుకు లలిత తెగ మురిసిపోయింది. కాని, సుందరి టీచర్‌కి తనేమీ చేయలేకపోయింది. మొదట్లో కోరస్‌కి సిఫార్స్ చేసేది. “అలా మొహమాట పెడితే అది మన కెరీర్‌కే దెబ్బ. గోరంతలు కొండంతలు చేస్తారు. కొంచెం నిలబడ్డాక కాంక్రీట్‌గా ఏదైనా చేద్దాంలే, డోంట్ వర్రీ లల్లీ” అన్నాడు చంద్రశేఖర్. లలిత వూరటపడి వూరుకుంది.

“బయలుదేరా… ఆన్ ది వే… సారీ…. పది నిమిషాల్లో అక్కడ వుంటా…” చంద్రశేఖర్ సెల్‌ఫోన్ హెచ్చరికను అర్థం చేసుకుని రివైండింగ్ కట్టి పెట్టి బయలుదేరడానికి సిద్ధమైంది లలిత.

*     *     *

రోజుకి రెండు పాటలు పాడేటంత బిజీ అయింది లలిత. పెళ్లి కానుకలు చెల్లడానికి నెల రోజులు పట్టింది. దాదాపు యాభై పాటలు పైగా జనంలోకి వెళ్లాయి. వాటిలో అయిదు సూపర్‌హిట్ అయినాయి. దాంతో లలిత పాటకి రేటు ఖరారు అయింది. మళ్లీ పెళ్లి రోజు వచ్చేసరికి ఆమె పాడిన పాటలు వెయ్యి దాటాయి. తెలియకుండానే లలితకు ప్రొఫెషనలిజమ్ వంటబట్టింది. మరు సంవత్సరం ఒకరిద్దరు పరభాషా నాయికలకు డబ్బింగ్ చెప్పింది. గాత్రదానం చేసిందన్నాయి పత్రికలు. దానానికీ ధరలు ఫిక్స్ చేశాడు లాయర్ చంద్రశేఖర్.

చంద్రశేఖర్ విమానం ఎగురుతోంది కదా అని ఇంజను ఆపేసే రకం కాదు. గాలి అనుకూలంగా వున్నప్పుడే చుక్కానిని జాగ్రత్తగా పట్టాలంటాడు. బాతు నీళ్ల మీద రయ్యిన వెళ్లిపోవడమే మనం చూస్తాం గాని, నీళ్లడుగున కాళ్లతో ఎంత సాము చేస్తుందో మనకి కనిపించదు. ఇదీ అంతే. ఒకదాకా మనం మైకు ముందు నిలబడటానికి కష్టపడాలి. ఆ తర్వాత మరొకరు రాకుండా శ్రమపడాలి. ఈ ఫీల్డే అలాంటిది. రేప్పొద్దున కాస్త తేడా వస్తే, ఇదే కోయిలని ట్రాక్ పాడ్డానికి కూడా పనికిరాదనేస్తారు. ఇంత సూటిగా కాకపోయినా డొంకతిరుగుడుగానైనా యీ సూక్తులు పదేపదే లలిత చెవిలో వేస్తుంటాడు చంద్రశేఖర్.

*     *     *

“ఈసారి మా ప్రైవేట్ ఆల్బమ్ పాడినందుకు పైసా కూడా యివ్వను” — తెగేసి చెప్పాడు ఆడియో కంపెనీ యజమాని.

చంద్రశేఖర్ ఆ మాటకు షాక్ తిన్నట్టు చాలా సహజంగా నటించాడు. చిత్ర ప్రపంచంలో యిలాంటి షాక్ ట్రీట్‌మెంట్లన్నీ మామూలే.

వారం తర్వాత కొత్త కారు తాళాలు పువ్వుల్లో పెట్టి యిచ్చాడు ఆడియో కంపెనీ యజమాని. ఇదొక వ్యాపార సరసం! కారుకి ఫ్యాన్సీ కమ్ లక్కీ నెంబర్ తెచ్చే బాధ్యత కూడా తనే నెత్తిన వేసుకున్నాడు. “మీరు చొరవ చేయకపోతే యిప్పట్లో కారు తీసే వాణ్ణే కాదు. మీ చలవతో వస్తువు అమిరింది…” తర్వాత మాటలు గద్గదమై చెదిరిపోయాయి లాయర్ గారి గొంతులో.

డిప్రిసియేషన్ క్లెయిమ్ చెయ్యచ్చనీ, ఒక లగ్జరీ కారు కొనమనీ చాలా రోజులుగా ఆడిటర్ చెబుతూనే వున్నాడు. కలిసొచ్చే రోజు వస్తే అదే నడిచి వస్తుందని ఆగాడు. లలిత మొగుడు భార్యతో కంటే ఆడిటర్‌తోనే ఎక్కువసేపు గడుపుతాడు. మనసు విప్పి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెబుతాడు.

పేరు, ప్రఖ్యాతి పెరుగుతున్న కొద్దీ ఇంటి విస్తీర్ణం, వైభవం కూడా విస్తరిస్తోంది. ఖరీదైన బంగళాకి వుండాల్సిన హంగులన్నీ సమకూరాయి. నిరంతరం వచ్చే ఫోన్లు తీయడానికి, తోటకి నీళ్లు పోయించడానికి, నిత్యం వచ్చే వివిధ రిపేర్లకు హాజరవడానికి, మేనేజర్ హోదాలో ఒక పెద్దాయన చేరాడు. జాతికుక్క డాబర్‌మాన్ యోగ క్షేమాలు వాచ్‌మాన్ చూసుకుంటాడు. అతని మంచీచెడూ, వేళాపాళా గమనించడం మేనేజర్ వంతు. వరండాలో ఓ మూల రెండు పాత బీరువాల చాటున వాటికి మాచింగ్ బల్ల – కుర్చీ. ఇదీ ఆయన ఆఫీసు.

లాయర్‌గారు ఆయన చేత నాలుగు నిలవ జవాబులు వల్లెవేయించారు ఫోన్‌లో చెప్పడానికి. అమ్మగారు యింకా నిద్ర లేవలేదు. మేడమ్ పూజలో వున్నారు. సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడే రికార్డింగ్‌కు వెళ్లారు. ఇలా రాత్రి ఎనిమిదింటిదాకా చెబుతూ వుంటాడు. మేనేజర్ ఆ కుర్చీలో చేరాక ఒక్కసారి కూడా వేరే సమాధానం చెప్పిన పాపాన పోలేదు. కనెక్షన్ యిచ్చిన పుణ్యమూ కట్టుకోలేదు.

పెళ్లయిన ఆరేళ్లలో లలిత ఆరోహణలే తప్ప అవరోహణలు ఎరుగదు. కాని, తనకు తనే తోడు కాలేని ఒంటరి బతుకులో ఆకర్షణ ఇంకిపోయింది. మధ్యాహ్నపు ఎడారిలో తోడుగా చిన్న నీడ కావాలి. తన బతుకు పాటకి ఆధార షడ్జమం కోసం లలిత తెగ ఆరాటపడుతోంది. లలిత మనసెరిగి కూడా చంద్రశేఖర్ ఇంత తాత్సారం చేయడానికి బోలెడు కారణాలు. స్పెషలిస్టులని సంప్రదిస్తే తల్లి అయే క్రమంలో వాయిస్ మారే అవకాశం లేకపోలేదన్నారు. మరి, తన ప్రొడ్యూసర్ సఫరవకూడదు కదా. లలిత తల్లి అవడానికి ఎట్టకేలకు ఆమె భర్త త్రికరణ శుద్ధిగా అనుజ్ఞ యిచ్చాడు.

*     *     *

“సినిమా పాటకి సీమంతం” అన్నదొక పత్రిక — లలిత తల్లి కాబోతోందని ఫ్లాష్ చేస్తూ.

“అంటే మా చిట్టితల్లి తల్లి కాబోయే సంగతి కూడా మేము పేపర్లు చదివి తెలుసుకోవాలన్నమాట” బాబాయ్ పలకరింతతో పులకరించింది లలిత మనసు. లలితకి యిష్టమని చెట్టున పండిన నేరేడు పళ్లు అస్తార్పితంగా తెచ్చి, మూట కట్టి యిచ్చాడు. “తల్లీ, రోజుకి యాభైవేలు సంపాయించే శమంతకానివి నువ్వు. అయినా యీ చిన్నాన్న యిచ్చే పది రూపాయలతో గాజులు చేయించుకోవాలి” అంటూ మడతలు పెట్టిన నోటుని లలిత చేతిలో పెట్టి, ఆప్యాయంగా తల నిమిరాడు. లలితకు పుట్టింటి గడపలో వున్నట్టుంది. బాబాయి గుండెల మీద తల పెట్టి బావురుమంది. “వూరుకో తల్లీ… నీ పాటలు వింటానికి మీ అమ్మ రాబోతుంటే, నవ్వుతూ తుళ్లుతూ వుండాలి గాని యిదేంటిది…” అంటూ తడి కళ్లతో చిట్టితల్లి కన్నీళ్లు తుడిచాడు చిన్నాన్న.

ఇంటికి వెళ్తూనే పుట్టింటి నేరేళ్లు తినాలని వువ్విళ్లూరింది లలిత. కాని వాటిలో యాసిడ్ గుణాలు వున్నాయని గొంతు పట్టేయచ్చనీ డాక్టర్ అనుమతి ఇవ్వలేదట. అందుకని అవి లలిత కంటకూడా పడలేదు. భార్య శ్రేయస్సు చూసి, తన శ్రేయస్సు చూసుకుంటాడు ఆమె భర్త.

ప్రముఖ నేపథ్య గాయని తన గళాన్ని కోటి రూపాయలకు ఇన్సూర్ చేసిన వైనం టీవి చానెల్‌లో వచ్చింది. ఇది ఏడాది పాటు వర్తిస్తుందని భీమా కంపెనీ వాళ్లు చెప్పారు. లైఫ్ కూడా కవర్ అవుతుందా అని అడిగారెవరో. “పెద్ద తేడా ఏముందండీ, ఆమెకి వాయిసే కదా ప్రాణం” అనాడు చంద్రశేఖర్. లలితకి తన ప్రాణం గుట్టు మొదటిసారి తెలిసిపోయింది.

సింగి నీలాడితే సింగడు ఇంగువ మింగినట్టు, చంద్రశేఖర్ సెల్‌ఫోన్లో వేవిళ్లు పడుతున్నాడు.

“…లేదండీ, యివ్వాళ రికార్డింగ్ కాన్సిల్ చేసుకోండి. నీరసం, కళ్లు తిరగడం… నా వల్ల కాదండి…. క్వాలిటీ సఫరవకూడదు కదండీ”

“… కులాసాండీ… థాంక్సండీ… తినాలని లేదండీ”

“… అబ్బే చీటికి మాటికి స్కానింగ్ అంటే ప్రాబ్లం… చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేస్తున్నానండీ”

చంద్రశేఖర్ యిలా అందరినీ సమాధానపరుస్తూ వుండగా… వుండగా ఒక శుభోదయాన లలితకి అమ్మాయి పుట్టింది. పెర్కుషన్ సందళ్లలోంచి జాలువారిన క్లారినెట్ స్వరంలా వుంది పాపాయి. “అమ్మ.. మా అమ్మ” అనుకుంది లలిత. ఆమె వాయిస్ ఏమాత్రం జీర పోలేదు. వుండేటి జరీ జీర పోలేదు. ఆమె తరపున అతను హాయిగా వూపిరి పీల్చుకున్నాడు.

చంద్రశేఖర్ సెల్‌ఫోను యిప్పుడు బిజీ అయిపోయి త్వర త్వరగా డిశ్చార్జ్ అవుతోంది.

“…ఔనండీ, కాని నా సమస్య కూడా కాస్త వినండి. నేను గొంతెత్తి నెల రోజులైంది. డాక్టరు నిజానికి యింకో పది రోజులు రెస్ట్ తీసుకోమంది. పాపాయికి బ్రెస్ట్ ఫీడింగు అయినా వచ్చి పాడుతున్నానంటే… నో నో… డబ్బు ప్రశ్న కాదండీ. రిలీజ్ పిక్చర్స్ వున్నాయి… కేవలం నా డెలివరీ గురించి వాయిదా వేసుకున్నారు. నా ప్రొడ్యూసర్ సఫరవకూడదు.”

చంద్రశేఖర్ పేరుకుపోయిన ట్రాక్‌లతో సతమతమవుతున్నాడు. “… సార్, పాట పోతే పాట వస్తుందండీ. మాటపోతే రాదండీ, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అవసరమైతే రోజుకి పదహారు గంటలు పని చేస్తా. నా ప్రొడ్యూసర్ సఫరవకూడదు.” భర్త ట్యూను, ఫోను టోను అర్థమైంది లలితకి.

మనసుని పాపాయి పొత్తిళ్లలో పరచి లలిత రికార్డింగ్స్‌కి తిరుగుతోంది. పాటకోసారి వచ్చి బుజ్జి అమ్మని గుండెలకు హత్తుకు వెళుతోంది.

*     *     *

ఆ పూట రెండు ట్రాక్‌లు చాలా త్వరగా పూర్తయినాయి. లలిత మూడో పాటకి మరో థియేటర్‌కి ముందుగానే వెళ్లింది. కోరస్‌ సింగర్స్ యిద్దరు విశ్రాంతిగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

“పిల్లి చేత పనస పిక్కలు తీయించడం ఆ లాయర్‌కి బాగా తెలుసు. సుందరి, అదే మేడమ్ టీచరమ్మ చెప్పింది. లలిత పెళ్లి కాగానే అందర్నీ విందుకి పిలిచి, పాటలు అడుక్కోవడం ఆయనగారి ఆలోచనేట. అయితే కథంతా సుందరమ్మతో నడిపించాడు.”

“ఈయమ్మకు టీచరమ్మ మాటంటే వేదం కదా…”

“ఏవైతేనేం, అక్కడనించేగా యీవిడ గారి దశ తిరిగింది…”

మైకు ఆన్ చేసి వుండడంతో వాళ్ల మాటలు స్టీరియోలో లలిత గూబలదిరేలా వినిపించాయి. భళ్లున అద్దం పగిలిన చప్పుడు. వులిక్కిపడింది ఒక్కసారి. ఆరేళ్ల నాటి దృశ్యాలు స్పష్టంగా కళ్ల ముందు కదిలాయి. “తనకే చెప్పచ్చు కదా. తనకు మాత్రం తన కెరియర్ మీద ధ్యాస వుండదా? నాటకాలతో నడిచే కాపరాలు చూసే వాళ్లకి వినోదంగా వుండచ్చుగాని చేసే వాళ్లకి వికారంగా వుంటాయి” అనుకుంది. అసలు నేనెవరు, తనెవరు… మెదడులో లేవబోయిన ప్రశ్నార్థకాలను మందలించి అణిచేసింది లలిత. మనసు వికలమైంది.

స్థిమిత పడి, పాటకు రెడీ అయింది. షరా మామూలే! ఒకసారి పాడింది. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఏ మాత్రం నచ్చినట్టు లేదు. సౌండ్ బాక్స్‌లోకి స్వయంగా ఆయనే వచ్చి, పాట సిచువేషన్ వివరించాడు. “ఇది బ్యాగ్రౌండ్‌లో వినిపించే పాట… హీరోయిన్‌కి చిన్న పాప… హస్బెండ్ లేడు. పాప సచ్చిపోతది. నిండా పాథోస్… వాయిస్ డల్ చేసుకో.. కొంచెం ఫోక్ టచ్ వుండాలమ్మా…”

“సరే సార్…. ఓకే సార్” చెవులకు చంపస్వరాలు తగిలించుకుంది.

“టేక్ – టు, రెడీ… వన్ టూ త్రీ ఫోర్…”

పల్లవి కాగానే ట్రాక్ ఆగింది.

“ఎక్కిళ్ళు బీట్‌లో రావాలమ్మా. రిథమ్ చూసుకో. బిగినింగ్‌లో హాఫ్ నోట్ చాలు..”

“ఓకే సార్”

“ఏడుపు కొంచెం బ్రైట్ చేసుకో, తర్వాత ఎక్కిళ్లు వేరేగా రిథమ్‌‍లో రికార్డ్ చేసి మిక్స్ చేద్దాం… యస్ రెడీ రెడీ”

నాలుగు టేకులు తిన్నాక అతికష్టం మీద ఓకే అనిపించుకుంది లలిత.

రికార్డింగ్ కాబిన్‌లో అకూస్టిక్స్ గోడల్ని కరుచుకున్న మొసళ్లలా వున్నాయి. వాటి ముట్టెల మీద గుడ్లగూబల్లా రేడియమ్ కళ్లు వెలుగుతున్నాయి. ఎర్రదీపాల మధ్య సౌండ్ లెవెల్స్‌ని సూచిస్తున్న మానిటర్ ఇసిజిలా పడుతూ లేస్తూ భయపెడుతోంది. భయంతో లలిత గొంతు తడుముకుంది. ఇందాక మెడకి గట్టిగా చుట్టుకున్న పాము యిప్పుడు లేదు. అది పాటై, సౌండ్ నెగెటివ్‌ని పట్టుకుంది. లలిత తేలిగ్గా శ్వాస పీల్చుకుంది.

యమకింకరుల్లా నిలబడ్డ స్పీకర్లలోంచి ఏడుపు పాట మాంచి టెంపోలో వినిపిస్తోంది. అద్దాలలోంచి తిరుగుతున్న స్పూల్స్ కనిపిస్తున్నాయి. స్పూల్స్‌లోంచి కరెన్సీ వరసగా బయటకు వచ్చి, బొత్తిగా నల్ల బ్రీఫ్‌కేసులోకి వెళ్తున్నాయి. అంతా మాయగా వుంది లలితకి. రోజూ చూసేదే. కాని తనేదో మాంత్రికుడి గుహలోకి చిక్కుపడ్డట్టు యివ్వాళ గుండె గుబగుబలాడుతోంది. క్షణమొక యుగంగా గడుస్తోంది. “పాపాయి…  పాలివ్వాలి…” గుండె చప్పుడు. కాబినెట్ అనుమతిస్తే గాని భయంకరమైన ఆ గుహ తలుపు తెరుచుకోదు. “పాపాయి… పాలివ్వాలి…” అకూస్టిక్స్ లేని అమ్మ గుండె ప్రతిధ్వనిస్తోంది. తొట్రుపాటుని కప్పిపుచ్చి మర్యాద మాటలు పూర్తి చేసి, బయటపడింది లలిత.

ఎదురుగా చంద్రశేఖర్! చుట్టూ నలుగురు గొప్పవాళ్లు, కొందరు ఆడవాళ్లు, పిల్లలు. లలిత గుండెలు ఝుల్లుమన్నాయి. ఇన్‌కమ్‌టాక్స్ అధికారిని, ఓ కార్పొరేట్ ఛైర్మన్‌నీ, వారి సతీమణులను, పిల్లలను పరిచయం చేశాడు చంద్రశేఖర్. ఆమెలో నవ్వు వొట్టిపోయింది. అతికష్టం మీద చిరునవ్వు పుట్టించి, దణ్ణాలు పెట్టింది లలిత.

వాళ్లు అడ్డదిడ్డంగా అధికారిని పొగిడేస్తున్నారు. భజన పాటలతో ఆయన చుట్టూ కోలాటం ఆడుతున్నారు. నోరు నో ఫార్మాలిటీస్ అంటున్నా ఆయన నొసలు ఆనందిస్తున్నాయి. “టాక్స్ సకాలంలో సక్రమంగా కట్టమని జన సామాన్యానికి సందేశమిస్తూ, వారే స్వయంగా ఒక స్లోగన్ రచించారు. దాన్ని మ్యూజికల్‌గా ప్రెజంట్ చేయాలన్నది వారి అభిలాష. మ్యూజిక్ ట్రాక్ రెడీగా వుంది. వాయిస్ కలిపేస్తే…” యిదీ విషయం.

లలితకు పాప ఏడుపు తప్ప మరేమీ వినిపించడం లేదు. ఆ ముఖప్రీతి మాటలు, హావభావాలు, అతివినయాలు చాలా వెగటుగా తోచాయి.

చంద్రశేఖర్ సెల్ నొక్కి — “నేనే సార్, సారు వచ్చార్సార్…. మరి స్ట్రెయిన్ అయినా తప్పదండీ, పాపం టైం స్లాట్ తీసుకుని డబ్బు కూడా ఛానెల్స్ అన్నిటికీ కట్టేశార్ట… వాయిస్ యిచ్చేస్తే మిగతాది వాళ్లే ఫినిష్ చేసుకుంటారు. నోనో… యిది నా సొంత పని….” ఆడిటర్‌తో మాట్లాడి ఫోన్ కట్టేశాడు.

లలిత కళ్లతో “ఛీ” కొట్టి గుహలోకి నడిచింది. బయటి ప్రపంచంతో సంబంధాలు లేని జలాంతర్గామిలో ఒంటరిగా ఆమె నిలబడి వుంది. అద్దాల్లోంచి చుట్టూ కనిపిస్తున్న సొరచేపలు… తేళ్లు, జెర్రెలు గొంతుని మళ్లీ బిగించాయి. ఆ తల్లి గుండెలు రాళ్లయినాయి. విధిలేక చంటి పాప ఆకలిని మర్చిపోడానికి అమ్మ ప్రయత్నిస్తోంది. ఆవు తన బిడ్డకి పాలిచ్చి వస్తానంటే, సరే, వెళ్లి రమ్మని పంపిన పులి ఎంత దయాళువో కదా అనుకుంది. ఆ పులి పంజాకి మనసులోనే దణ్ణం పెట్టింది లలిత.

“రెడీ… ట్రాక్ రోలింగ్.”

లలిత గొంతు మీద కత్తి తళతళలాడుతోంది.

మైకు వికృతంగా పసిబిడ్డ పుర్రెలా కనిపిస్తోంది. పాడాల్సిన అక్షరాలు పురుగుల్లా లుకలుకలాడుతున్నాయి. వచ్చిన వాళ్లందరూ కోక్‌లు తాగుతూ, ఐస్‌క్రీమ్‌లు చప్పరిస్తూ, లలిత పడుతున్న నరకయాతననను ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె మనసు, వొళ్లు చలవలు కమ్ముతున్నాయి.

అధికారి తన సంగీత జ్ఞానాన్ని తెలుగు ఇంగ్లీషు భాషల్లో కలగలిపి వేరే ట్రాక్‌లో వాయించేస్తున్నాడు. మ్యూజిక్ ట్రాక్‌లో వాయిస్తున్నాడు. మ్యూజిక్ ట్రాక్‌లో సితార్ శ్రుతి పెంచమని సాధికారికంగా సూచించాడు. “అలాగేనండి…, కాని అది సితార్ కాదండీ… వయొలిన్ సార్” అన్నాడు కంపోజరు, “దెన్ యాడ్ అండ్ మిక్స్ సితార్” అన్నది దెబ్బతిన్న పులి.

వాయిస్ ట్రాక్ పూర్తయింది. లలిత వారి కుటుంబ సభ్యులకు ఫోటోగ్రాఫ్‌లు, ఆటోగ్రాఫ్‌లు యిచ్చింది. సార్‌గారి పెద్ద పాప ముద్దుమాటలతో అన్నమయ్యని పాడితే, తాపీగా విని మెచ్చుకుంది. లలిత చింత నిప్పుల మీద నిలబడి వుంది. ఆమె గుండె భాస్వరం మింగినట్టుంది. మూడు సంజెలూ ముడిపడ్డాయి.

లలిత ఎట్టకేలకు బయటపడింది. కారు గేటు దాటింది. ఇందాక పాడిన ఎక్కిళ్ల పాట కారు స్టీరియోలో మొదలయింది. “ఆపు” అన్నది చిరాగ్గా లలిత. డ్రైవర్ వులిక్కి పడ్డాడు. పాట ఆగింది. నీరసంగా వెనక్కు వాలి, కళ్లు మూసుకుంది లలిత. ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టి పత్తా లేకుండా రాలిపోయే రాకెట్‌లా సుందరి టీచర్ కళ్లముందు కదిలింది. రాను రాను తను పాడే యంత్రమైంది. కరెన్సీ పూసే చెట్టయింది. బంగారు గుడ్లు పెట్టే బాతు అయింది. “నాలుగక్షరాలు రాయించి, బోర్డు కొడితే యీపాటి రాకపోదురా అంటే వినడు…” అత్తగారి ఎత్తిపొడుపులు, “దానం అనుకో దక్షిణ అనుకో…” హెడ్మాస్టారి చిన్న కోరిక. అసలు తనెవరు? అతనెవరు? తాళి కట్టింది తనకా, తన గొంతుకా? ప్రశ్నార్థకాలు మెదడులో పడగలు విప్పి బుసలు కొడుతున్నాయి. వాటిని జోకొట్టే సహనం కోల్పోయి అలాగే వదిలేసింది. దేవుడు తలుచుకుంటే మనిషిని వరంతో కూడా హింసించగలడని లలితకు యెరుకైంది.

కారు ఇంటి పోర్టికోలో ఆగింది. కారు డోర్ దురుసుగా పడింది. లలిత లోపలికి వెళుతుంటే, ఓ నవరాగపు ఆరోహణ క్రమాన్ని హడావిడిగా పలికాయి మెట్లు. హాల్లో, విశాలమైన తెర ముందు ఇంట్లో యావన్మందీ కూర్చుని టీవీక్షిస్తున్నారు. తనదే ఇంటర్వ్యూ వస్తోంది. “… పెళ్లిలో స రి గ మ ప ద ని బాస చేసి ఏడగులు కలిసి వేశాం. దానికే నేటికీ కట్టుబడి, సంగీత సరస్వతికి నిత్యార్చన చేస్తున్నాం…” హాల్లోంచి మేడపైకి నడిచింది. “శ్రీవారిచ్చిన స్వేచ్ఛ, సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం యివే నాకు రక్ష. నా కృషి ప్రతిభ కంటె… నిజం చెప్పాలంటే…”

పైన గది తలుపు విసురుగా తీసింది. పాపాయి గుక్కలు పెట్టి ఏడుస్తోంది. టీవీలో తను కూస్తున్న దొంగ కూతలు భరించలేక, గది తలుపు మూసేసింది.

లలిత అపరాధిలా లోపలికి నడిచింది.

చిందరవందరగా గది నిండా బొమ్మలు. వాటి మధ్య పసితనం చేసిన మడుగుల తడిలో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న పాపాయి. దూరంగా విసిరేసిన పాల సీసా. అమాంతం పాపాయిని ఎత్తుకుంది. తడిని పైట కొంగుతో వత్తింది. పాపాయి అమ్మలో అమ్మగా వొదిగిపోయింది. అవిసిపోయిన తల్లి గుండెలు కుదుట పడ్డాయి. మోదుగ మొగ్గల్లాంటి చిట్టి చేతులు అమ్మ బుగ్గలు తడుముతున్నాయి. గుప్పెళ్లతో బుల్లి చేతులు జుట్టు రేపుతుంటే ఆ తల్లికి ఓపలేనంత హాయి!

“హాయి…. హాయి… ఉళుళుళూ… ఉళుళుళూ… హాయి”

పాపాయి నవ్వులతో భూమి ఆకాశం ప్రతిధ్వనిస్తున్నాయి.

“హాయమ్మ హాయి… ఆపదలు గాయి…”

మైకులు, ట్రాకులు, ఇయర్‌ఫోన్లు లేవు. కట్టుడు మెట్లు లేవు. మేకు బందీలు, పెండెకట్లు, ఇరుకు సందులు లేవు. ఆరోహణల నిచ్చెనలు లేవు. అవరోహణల పాములు లేవు. సువిశాలమైన రాజవీధిలో శ్రుతిలయలకు అతీతంగా అమ్మపాడే జోల పాట వూరేగుతోంది. పాట స్వచ్ఛంగా వుంది. పాలపొదుగు ధారలా కమ్మగా, అమ్మలా వుంది. జాగృతమైన పాట ఆనంద స్థితిలో ఓలలాడి అమృతమై చినికింది.

జలజలా రాలునే తేనె వడగళ్లు

కన్నులా అవి కావు పాల కావిళ్లు

ళుళుళూ హాయీ…

మబ్బుల మీదుగా జాబిల్లిలో కుందేలు దిగివచ్చింది. అది చెంగనాలు వేస్తుంటే పాపాయి కేరింతలు కొడుతోంది.

పిండారబోసినట్టు వెన్నెల. ఆ వెన్నెలని దోసిళ్లతో చిమ్ముకుంటూ, తల్లి పిల్ల ఆడుకుంటున్నారు. చందమామ పాపాయి ఎగరేసిన గాలిపటంలా వుంది. “నీ పాట వినడానికి మీ అమ్మ వస్తుందే చిట్టి తల్లీ” చిన్నాన్న దీవెన మెరుపై మెరిసింది. పాలపుంతలో నక్షత్రాలు అక్షరాలై దిగివస్తున్నాయి. ఆమె పాడే పాట త్రివిక్రమించి సర్వత్రా ఆవరించింది. అగరు పొగై రోదసి దాకా కమ్ముకుంది.

కన్నమ్మ నవ్వుల్లు పాల వరదల్లు

పాపాయి చెక్కిళ్లు తేనె బుడగల్లు

శివాలెత్తినట్టు, నురగలై వరదలై, పాట పరవళ్ళు తొక్కుతోంది. సుళ్లు తిరుగుతోంది. ఆ జోల పాటలో ఏళ్ల తరబడి అణచేసిన ఆవేశం వుంది. ఆక్రోశం వుంది. కట్ట తెగిన వురవడి వుంది.

భూమి సన్నటి పేగుకి కట్టుబడి లోలకంలా వూగుతోంది. అంతు దొరకని కదురు నుంచి కాలం ఆసు పోసుకుంటూంది. తల్లి బిడ్డ యిద్దరే ఆ వుయ్యాలలో వూగుతున్నారు.

వెయ్యి కన్నుల జూడ తీరదాపేక్ష

లక్ష చేతుల తడమ తీరదా ముద్దు

ళుళుళూ… ళుళుళూ…

అమ్మ నాలిక నోరంతా చిలికేస్తూ, చిత్రంగా పలికిస్తుంటే పాపాయి నవ్వుకి హద్దే లేదు. నవ్వి నవ్వి, నిలువెల్లా నవ్వై, సోలిపోయింది. పాపాయి ఆదమరచి నిదరపోయింది. బుల్లి పాదాలు తాకి ముద్దెట్టుకుంది. అమ్మ కుతి తీరింది. అనాదిగా రగులుతున్న అలజడి సద్దుమణిగి, ఆమె మనసు మంచుముద్ద అయింది.

*     *     *

అప్పటికే చంద్రశేఖర్ గది చుట్టూ తిరుగుతూ అతలాకుతలం అవుతున్నాడు. తలుపులు బాదుతున్నాడు. లలితని కోపంగా, లాలనగా నవరసాలలో పిలుస్తున్నాడు. లలిత పూనకం వచ్చినట్టు అలా పాడడం అతనెప్పుడూ వినలేదు. పెనుగాలికి వూగుతున్న రావి చెట్టు హోరులా గోడల్ని చీల్చుకుని పాట వినిపిస్తోంది. అసలంత హైపిచ్‌లో పాడడానికి అతను వొప్పుకోడు. పైగా రేపు ఆరు రికార్డింగ్స్ వున్నాయి. ఎంతసేపు అరిచినా లోపల్నించి మాటా పలుకూ లేదు.

“లలితా, తలుపు తియ్… ఏదో గొప్ప పాటకత్తెనని రెచ్చిపోకు. నాకు తిక్కరేగిందంటే నీ లైఫ్ లో నోరెత్తకుండా చేయగల్ను. ముందే చెబుతున్నా తెగేదాకా లాగొద్దు….” చంద్రశేఖర్ రోషంగా వార్నింగ్ యిచ్చాడు. ఆ మాటల్లో మగతనం వుంది.

నిశ్శబ్దం…. సడీ చప్పుడూ లేదు.

లాయర్‌కి భూమి ఆగిపోయినట్టుంది. కాలం కరడు గట్టి కదలడం లేదు. కసిగా వేళ్లు నలుపుతూ, పిడికిలి బిగిస్తూ విప్పుతూ — అసలు పాయింటు అర్థంకాక అయోమయంలో పడ్డాడు.

చమటలు కక్కుతూ అతను రొప్పుతున్నాడు. జుట్టు చెదిరిపోయి వుంది. అతని చుట్టూ కాంతి! కళ్లు చెదిరిపోయే కాంతి. వున్నట్టుండి చిన్న మాంసపు ముద్ద ముఖానికి తగిలి, కిందకి జారింది. చంద్రశేఖర్ వులిక్కి పడ్డాడు. అది నెత్తురోడుతూ పాలరాతి గచ్చు మీద పడింది. భయంభయంగా దాని వంక చూశాడు. అప్పుడే తెగిపడ్డ నాలిక! నెత్తుటి మడుగులో అది కొలిమిలో బొగ్గులా కణకణలాడుతోంది. ఆందోళన, భయం అతన్ని ఆవరించాయి. “లల్లీ…. లల్లీ….” నిస్సహాయంగా చంద్రశేఖర్ అరుస్తున్నాడు. ఎంత అరచినా మాట పైకి రావడం లేదు. కిందపడింది తన నాలికేనేమోనని సందేహం వచ్చింది. కాదు… తన నాలిక తడారిపోయి ఎండుటాకులా తన నోట్లోనే వుంది. ఎంత పని చేసింది…. అన్యాయం! ఏదో మాట వరసకి అంటే, యింత సాధింపా… టూమచ్ — అంటూ భారంగా నిట్టూర్చాడు.

దూరంగా అంబులెన్స్ కూతలు వినిపిస్తున్నాయి. బంగ్లా పునాదులు కదులుతున్నాయి. “పసిపిల్ల ఏడిస్తే దానికింత రాద్ధాంతం చెయ్యాలా? టీవీలో ఆవిడ మాటలే వింటున్నాం. ఆవిడగారినే చూస్తున్నాం. మనకివన్నీ వద్దురా, నాలుగక్షరాలు రాయించి బోర్డు కట్టుకో అంటే విన్నాడా” తల్లి మాటలు లోపల్నించి.

చేతులతో తల పట్టుకుని, చూడలేక చూడలేక నెత్తుటి మడుగులో నాలికను చూస్తున్నాడు.

టీవీ తెరపై “మూగవోయిన సినిమా పాట” శీర్షికన లలిత తాలూకు క్లిప్పింగ్స్ చూపిస్తున్నారు. మధ్య మధ్య సినీ ప్రముఖులు ఆమె కంఠ మాధుర్యాన్ని పొగుడుతూ, నాలిక తెగిపోవడం తెలుగుజాతికి తీరని లోటు అంటున్నారు. మహిళా సంఘాలు కుటుంబ హింసగా, పురుషాధిక్య చర్యగా అభివర్ణించి, తీవ్రంగా గర్హించాయి.

నిస్త్రాణగా చంద్రశేఖర్ గోడకి జేరబడ్డాడు. ఇప్పుడు గచ్చు మీది నాలిక నీలంగా, నిర్జీవంగా కనిపిస్తోంది.

గది తలుపు క్లిక్ మంది. అతను తుళ్లిపడి లేచి, మోకాళ్ల మీద కూచున్నాడు. తలుపు తెరుచుకుంది. మూర్తీభవించిన కాంతిలా వుంది లలిత. ఆమె ముఖంలో ఏ భావాలు, ప్రభావాలు లేవు. అతను మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. మెదడు సంకేతాలు పంపినా, పలకాల్సిన భాగాలు వాటిని అందుకోలేకపోతున్నాయి. తల దించుకున్నాడు. వెలుగులో గచ్చు మీద తన సెల్‌ఫోన్ మిలమిలలాడింది. కళ్లు విప్పార్చి చూశాడు. తన కళ్లని తనే నమ్మలేకపోయాడు లాయర్ చంద్రశేఖర్. మరి నాలికలా కనిపించిందేమిటి? ఎంత భ్రమ! నెత్తుటి చార కూడా లేదు. అంతా పీడకల! ఒక్కసారి ప్రాణం లేచి వచ్చింది. వెన్ను నిమురుకున్నాడు.

లలిత గది గుమ్మం దాటి బయట అడుగుపెట్టింది. సెల్‌ఫోన్‌లోంచి రింగ్‌టోన్ వినిపిస్తుంది. నున్నటి గచ్చు మీద ఫోన్ వైబ్రేట్ అవుతూ పాకుతోంది. చంద్రశేఖర్ చటుక్కున మోకాళ్ల మీద వాలి ఫోన్ అందుకున్నాడు.

చేతి గాజులు గలగలమంటుంటే తలెత్తి చూశాడు చంద్రశేఖర్. ఠీవిగా చెయ్యి చాపింది లలిత. ఫోన్ యిమ్మని అయిదు వేళ్లు అయిదు నాలికలై శాసిస్తున్నట్టు తోచింది. ఆమె ముందు మోకరిల్లి వున్న లాయర్ చంద్రశేఖర్ అసంకల్పితంగా ఫోన్ ఆమె చేతిలో వుంచాడు. ఆమెని అణువణువూ అనుభవించిన చేతులు, అదుపు చేసిన చేతులు పూర్తిగా పట్టు కోల్పోయాయి. పేరుకి సెల్‌ఫోనే కాని, వేలాది ఆజ్ఞలు జారీ చేసిన తన భర్త నాలిక అది. ఇప్పుడది పూర్తిగా లలిత అధీనంలో వుంది. ఇక ఎప్పటికీ వుంటుంది.

భూమి లోలకంలా వూగుతోంది. కాలం కదులుతోంది.

చేవ తేలిన లలిత మెదడులో యింక ప్రశ్నార్థకాలకు చోటు లేదు.

– సమాప్తం –

ప్రథమ ముద్రణ: “నవ్య” వార పత్రిక 3-8-2005

(ఒక సినీ నేపథ్య గాయని జీవితాన్ని క్లోజప్‌లో చూపించిన తెలుగు కథ)

Posted in కథ | 3 Comments

మృతజీవులు – 31

-కొడవటిగంటి కుటుంబరావు

తొమ్మిదవ ప్రకరణం

ఉదయాన, ఆ నగరంలో ఒకరినొకరు చూడబోవటానికి ఏర్పాటై ఉన్న వేళ ఇంకా కాకముందే, ఒక స్త్రీ పసందయిన గళ్ళ పైదుస్తు కప్పుకుని, నీలం రంగు గల స్తంభాలూ, వంగపండు రంగు పూతా కలిగిన ఒక ఇంట్లో నుంచి గబగబా వెలువడింది. ఆమె వెంట ఒక బంట్రోతు ఉన్నాడు, వాడి టోపీకి సరిగ పట్టీ ఉన్నది. ఆమె శరవేగంతో వచ్చి, ఇంటి ముందు నిలబడి ఉన్న బండిలోకి ఎక్కింది. వెంటనే బంట్రోతు బండి తలుపు దబాల్న మూసి, ఆవిడ బండిలోకి ఎక్కటానికి ఉంచిన మెట్టు తీసేసి, బండి వెనక భాగంలో ఉన్న తోలు పట్టీ పట్టుకుని నిలబడి, బండివాడికి “పో!” అని కేక పెట్టాడు. ఆవిడ ఇప్పుడే ఒక కబురు విన్నది, దాన్ని మరొకరికి చెప్పిన దాకా ప్రాణం నిలిచేటట్టు కనబడక దాన్ని మోసుకుని బయలుదేరింది. ఆవిడ క్షణ క్షణానికీ కిటికీలోంచి బయటికి చూస్తూ, ఇంకా సగం దారిలోనే ఉన్నట్టు తెలుసుకుని రోత చెందింది. ప్రతి ఇల్లూ మామూలు కన్న చాలా పొడుగుగా ఉన్నట్టు కనిపించింది. చిన్నచిన్న కిటికీలు గల తెల్లని ధర్మసత్ర భవనం ఎంతకీ అయిపోకపోవటం చూచి ఆమె, ఈ దిక్కుమాలిన యిల్లు ఎంతకూ తరగదేం? అనుకున్నది. “త్వరగా పద, త్వరగా పద; అంద్రూష్క. ఏం, అలా పాకుతున్నావు?” అని అప్పటికే రెండు సార్లు బండివాణ్ణి హెచ్చరించటం జరిగింది. చిట్టచివరకు గమ్యస్థానం వచ్చింది. బండి ఒక కర్రడాబా ముందు నిలిచింది. డాబాకు ముదురు బూడిదరంగు వేసి ఉన్నది. కిటికీలకు ఎగువగా కొద్దిగా చెక్కడం పని చేశారు. కిటికీలకు ముందు బద్దీల తడికెలున్నాయి. ఇంటి ముందున్న చిన్నతోటలో సన్నటి చెట్ల మీద నగరపు దుమ్ము తెల్లగా పడివున్నది.

కిటికీలలో పూలతొట్లున్నాయి, పంజరంలో ఒక చిలక ఊగుతున్నది, రెండు బుల్లికుక్కలు ఎండలో పడుకుని వున్నాయి. ఈ ఇంట్లో ఈ స్త్రీ యొక్క ప్రాణస్నేహితురాలు ఉంటున్నది. ఈ స్త్రీలకు ఏం పేరు పెడితే ఎవరికి ఆగ్రహావేశం వస్తుందో అని కథకుడు తికమక పడుతున్నాడు. ఎందుకంటే, లోగడ అలా జరిగింది. వాళ్ళకు ఊహించిన పేర్లు పెట్టటం ప్రమాదకరం. ఏ ఇంటిపేరు ఆలోచించినా, విస్తృతమని చెప్పబడే సామ్రాజ్యంలో, ఎక్కడో ఒకరికి ఆ పేరు ఉండనే ఉంటుంది. వాడికి అంతా ఇంతా కాని ఆగ్రహం వచ్చేస్తుంది. తాను ఎలాటి వాడో, ఎలాటి గొర్రెచర్మాలు ధరిస్తాడో, ఏ అగ్రఫేన ఇవానవ్నతో పోతాడో, తనకు ఏమేమి తినటం ఇష్టమో ఆరా తీయటానికి గాను కథకుడు పనిపెట్టుకుని రహస్యంగా ప్రాంతాలకు వచ్చి వెళ్ళాడని ఆరోపణ చేస్తాడు. సైన్యంలో వారి హోదాలు కూడా పేర్కొన్నామంటే, బాబో-ఇంకా ప్రమాదం. ఇప్పుడు అన్ని హోదాలవాళ్లూ ఎంత తామసంగా ఉన్నారంటే, వాళ్ళకు పుస్తకంలో ఏది కనిపించినా ఎవరో ఒకరిమీద రాసినట్టే తోస్తుంది; ఈ తామసం సర్వత్రా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫలాని పట్టణంలో ఒక మందమతి అయిన మనిషి ఉన్నాడంటే చాలు, అది ఎవరికో ఒకరికి తగులుతుంది; పెద్దమనిషిలాగా కనపడేవాడొకడు లేచి “నేను మనిషినే; అయితే, నేను మందమతి నన్నమాట!” అంటాడు. అంటే, నిజం ఇట్టేపట్టేస్తాడు. ఆందుచేత ఈ చిక్కులన్నీ లేకుండా ఉండగలందులకు ఈ ఇంట్లో వుండే ఆవిడను, నగరంలో ఉండే అందరూ అన్నట్టే, ఒప్పుల కుప్ప అందాం. అంతులేని పరోపకారపారీణత ద్వారా ఆవిడ ఈ పేరు సంపాదించుకున్నది. అయితే అంత మంచితనంలోనూ-ఏమైనా ఆడవాళ్లు గద! -ఎంత తియ్యని మాటల సందున కూడా ఒక ముల్లు తగలనే తగులుతుంది! ఇక, ఎవరైనా ఆమె దారికి అడ్డుతగిలి ఆగ్రహం తెప్పించారో వారికి మూడిందన్న మాటే. అయితే ఆ ఆగ్రహం కూడా పైకి ఎంతో నాగరికంగానూ, మర్యాదకు భంగం కలగకుండానూ ఉంటుంది; అదీ మారుమూల బస్తీలలోని రివాజు. ఆవిడ ఏం చేసిన ఎంతో ముచ్చటగా ఉండేది, ఆవిడకు కవిత్వమంటే కూడా ఎంతో ఇష్టం, ఆలోచనా నిమగ్నురాలిగా తలను ఉంచటం ఆమెకు చాతనవును, అందరూ ఆమె నిజంగా ఒప్పులకుప్పేనని ఒప్పుకున్నారు.

రెండవ యువతి, అంటే చూడవచ్చిన ఆవిడ, ఇంత సమగ్ర లక్షణపతి కాదు, అందుచేత ఆమెను తేలికలో ఒయ్యారి భామ అందాం. ఎవరో రావటంతో, ఎండలో నిద్రపోయే కుక్కలు కాస్తాలేచి, కొత్త మనిషితో బాటు హాలులోకి వచ్చి గుండ్రంగా తిరగసాగాయి. ఆమె హాలులోకి వస్తూ పై దుస్తు తీసేసింది. ఆమె లోపలి దుస్తులు నాజూకుగా ఉన్నాయి. ఆమె మెడ నుంచి రంగురంగుల పట్టీలు వేళ్లాడుతున్నాయి. హాలంతా మల్లె అత్తరు వాసనతో నిండిపోయింది. ఒయ్యారిభామ రాక వింటూనే ఒప్పులకుప్ప హాలులోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇద్దరూ చేతులు పట్టుకుని, ఒకరినొకరు ముద్దుపెట్టుకుని, శలవుల అనంతరం కలుసుకున్న విద్యార్థినుల్లాగా పొలికేకలు పెట్టారు. ఆ తరవాత ఆ పిల్లలను తల్లులు, వారిలో ఒకతె రెండవ దానికన్న పేదదని చెప్పటం జరుగుతుంది. వీరి ముద్దుల చప్పుడుకు కుక్కలు మొరిగాయి. వాటిని చేతిరుమాలుతో విదిలించి, ఇద్దరూ డ్రాయింగ్ రూములోకి వెళ్ళారు. ఆ గది తేలిక నీలంరంగులో వున్నది. అందులో ఒక సోఫా, ఒక కోడిగుడ్డు ఆకారంగల బల్లా, ఐవీ తీగ పాకే ఒక స్క్రీనూ కూడా వున్నాయి. రెండు కుక్కలూ వారి వెనకనే పరిగెత్తుకుంటూ వచ్చాయి. “ఇటు, ఇటు, ఈ మూల కూచోవాలి!” అంటూ ఇంటావిడ తన స్నేహితురాలిని సోఫా మూల కూచోబెట్టి “ఆఁ, అలాగా! ఇదుగో దిండు,” అని ఆమె వీపు వెనక ఒక మెత్త దోపింది; దానిమీద ఊలుతో కుట్టిన ‘వీరుడి ‘ బొమ్మ వున్నది. అలాటి బొమ్మలను చిత్రించేటప్పుడు ముక్కును నిచ్చెనలాగానూ, పెదవులను పలుచదరంగానూ చిత్రిస్తారు. “వచ్చింది నువ్వేమో, బతికిపోయాను… బండి వచ్చి ఆగటం విని ఇంత పెందలాడే ఎవరు వచ్చి ఉంటారా అనుకున్నాను. ఉపాధ్యక్షుడి భార్య అయివుంటుందని పరాష అన్నది. ఆ వెలికిది వచ్చి జిడ్డుపట్టిస్తుంది గామాలనుకుని ఇంటోలేనని చెప్పమందామని కూడా అనుకున్నాను.”

వచ్చిన మనిషి వెంటనే అసలు విషయం చెప్పేద్దామనుకుంటుండగా ఒప్పులకుప్ప ఆశ్చర్యంతో చిన్నకేక పెట్టి సంభాషణను మరొకదారి పట్టించింది.

“ఈ అద్దకం గుడ్డ ఎంతబాగుందో!” అన్నది ఒప్పులకుప్ప ఒయ్యారిభామ దుస్తుకేసి చూసి.

“అవును, బాగుంది. కాని గళ్ళు చిన్నవిగా వుండి చుక్కలు నస్యం రంగుకాక తేలిక నీలంరంగుగా వుంటే ఇంకా బాగుంటుందని ప్రస్కోవ్య ఫ్యదురోవ్న అంటుంది. మా చెల్లికి ఒక గుడ్డ పంపించాను. అది ఎంత బాగుందో చెప్పలేను. తేలిక నీలంరంగు మీద సన్నసన్నని గీరలు, మనం ఊహించలేమన్నమాట, ఆ గీరలమీద చుక్కలూ ఈనెలూ, చుక్కలూ ఈనెలూ, చుక్కలూ, ఈనెలూ… అద్భుతం! అటువంటిది ప్రపంచంలో ఎక్కడా ఉండదనుకోవలిసిందే.”

“మరీ కొట్టవచ్చినట్టుంటుంది లెస్తూ!”

“ఎబ్బే, కొట్టవచ్చినట్టుండదు!”

“కొట్టవచ్చినట్టు ఉండే ఉంటుంది.”

ఒప్పులకుప్ప భౌతికవాది అని మనం తెలుసుకోవాలి, ఆవిడ కన్నీ శంకలూ, సందేహాలూనూ, ఎన్నో విషయాలను ఆమె నమ్మేది కాదు.

ఒప్పులకుప్ప కొట్టవచ్చినట్టు ఉండనే ఉందని చెప్పి, “ఓ భలే బాగా చేశావే, అరుకుటంచులు పెట్టగూడదు!” అన్నది.

“పెట్టగూడదూ?”

“వాటి బదులుగా చిన్నచిన్న తోరణాలు పెడుతున్నారు.”

“బాగుండదే-చిన్నచిన్న తోరణాలా?”

“చిన్నచిన్న తోరణాలు, అంతా తోరణాలే: తోరణాలతో ఆడవాళ్ళు పైతొడుగులు చేస్తున్నారు, చేతులమీదా, భుజాలమీదా, కింది భాగంలోనూ, అంతటా తోరణాలే.”

“అంతా తోరణాలే అయితే ఏం బాగుంటుంది. సోఫ్య ఇవానివ్న?”

“చాలా బాగుంటుంది అన్నా గ్రిగోర్యెవ్న; ఎంత బాగుంటుందో ఊహించలేవు. దానికి రెండంచులుంటాయి, చేతులు దూర్చేటందుకు రెండు పెద్దకంతలు వదల్తారు, పైనా… ఇక చూడూ నువ్వాశ్చర్యపడతావుగదా… మహాచిత్రంలే: నడుములు ఎన్నడూ లేనంత పొడుగనుకో, ముందువేపు కోసగా వస్తాయి. ముందుబద్దీ చాలా పొడుగు పెడతారు. లంగా, పాతకాలపు ఫార్దింగేల్ లాగా చుట్టూ ఎత్తుకుంటుంది. బొద్దుగా కనిపించటానికి వెనక మదువు కూడా పెడతారు.”

“ఇంకా నయం… అడగక్కర్లేదు!” అన్నది ఒప్పులకుప్ప, దర్పంగా తలవిసురుతూ.

“అవును, మరి; అడగనే అక్కర్లేదు” అన్నది ఒయ్యారిభామ.

“ఎన్నయినా చెప్పు, నాకా ఫాషను అవసరంలేదు.”

“సరిగా నాకూ అలానే అనిపించింది–ఒక్కోసారి ఈ ఫాషన్లు చూస్తేనే…అన్నిటినీ మించిపోతాయి! ఊరికే తమాషాకు ఒక నమూనా పంపించమని మా చెల్లెల్ని అడిగాను; మా మిలాన్య దాన్నిబట్టి కుట్టిపెడతానన్నది.”

“ఏమిటీ? నిజంగా నమూనా సంపాదించావూ?” అన్నది ఒప్పులకుప్ప. ఆవిడ గుండె వేగంగా కొట్టుకోవటం పైకే తెలుస్తున్నది.

“ఆ, మా చెల్లెలు తెచ్చింది.”

“చూడవమ్మా, నాకొకసారి ఇస్తావా, నీకు పుణ్యముంటుంది.”

“అయ్యో, ప్రస్కోవ్య ఫ్యదోరవ్నకు ఇస్తానని మాట ఇస్తినే. ఆవిడ పని అయినాక ఏమన్నా”

“ప్రస్కోవ్య ఫ్యదోరవ్న తరవాత ఎవరు వేసుకుంటారేమిటి? నువు స్నేహితురాళ్ళకన్న పరాయివాళ్ళను ఎక్కువగా చూడటం ఏమీ బాగాలేదు.”

“ఆమె మా బంధువురాలే గద, నీకు తెలీదూ?”

“ఏం బంధువులే, అత్తవారి వేపు బంధుత్వమేగా… లేదు, సోఫ్య ఇవానీవ్న, నాతో మాట్లాడకసలు; నీకు నేను లోకువైనట్టున్నాను… నా మీద నీకు విసుగెత్తినట్టుంది, నాతో స్నేహం మానెయ్యాలనుకుంటున్నావులే.”

పాపం, సోఫ్య ఇవానీవ్నకు ఏం చెయ్యాలో తోచలేదు. అటునుయ్యీ, ఇటుగొయ్యీ అయినట్టయింది ఆమె గతి, దంభాలు పలికితే ఊరికేపోదు! ఆమెకు నాలుక కోసేసుకోవాలనిపించింది.

“ఇంతకూ, మన పెద్దమనిషి వార్తలేమిటి?” అని ఒప్పులకుప్ప అడిగింది.

“అయ్యొ రాతా! నే నిలా కూచుండి పోయానేమిటీ? నా మతి మండా! నేనసలు ఎందుకు వచ్చానో తెలుసా, అన్నా గ్రిగోర్యెవ్న?” చూడవచ్చినావిడ దీర్ఘంగా ఊపిరి పీల్చింది. ఆవిడ నోటినుంచి మాటలు ఒక్కొక్క డేగ లాగా ఎగిరి రావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆవిడ ప్రాణస్నేహితురాలు కౄరంగా ఆమెకు అడ్డువచ్చింది.

“ఆయన్ని నువు మెచ్చుకుంటే మెచ్చుకో, ఆయన్ను గురించి ఎంత తియ్యటి కబుర్లయినా చెప్పు, నేనుమాత్రం ఖండితంగా చెబుతున్నాను. కావలిస్తే ఆయన మొహానే అనేస్తాను, అతను వట్టి పనికి మాలినవాడు, పనికిమాలినవాడు,” అన్నదామె ఉద్రేకంతో.

“అవునా, నేను చెప్పేది కూడా కాస్తవిను…”

“ఎంతో మంచివాడని పుకారు వేశారు, కాని అతను మంచి వాడేకాడు, ఆయన ముక్కు… వట్టి అందవికారమైన ముక్కు.”

“కాస్త నన్ను చెప్పనీ, నన్ను చెప్పనీ…అన్నా గ్రిగోర్యెవ్న తల్లీ, నన్ను చెప్పనీ! ఎంత అప్రతిష్ఠ పని అనుకున్నావ్? పెద్దకథ, ‘స్కోనాపెల్ ఈస్ట్యా’,” అన్నది వచ్చినావిడ, ఏదో వేడుకుంటున్నట్లుగా గొంతూ, దాదాపు నిరాశచెందినట్లు మొహమూ పెట్టి.

ఆడవాళ్ళు తమ సంభాషణలో ఎన్నో విదేశీ మాటలూ, ఫ్రెంచి వాక్యాలూ ప్రవేశపెట్టేవారని చెప్పటం నా విధి.

రష్యాకు ఎంతో మహోపకారం చేసినందుకు ఫ్రెంచి భాషపైన ఈ రచయితకు ఎంతో గౌరవం ఉన్నప్పటికీ, మా నాగరిక జనులు కేవలం దేశాభిమానం కొద్దీ అస్తమానం ఆ భాషలోనే మాట్లాడటం అలవాటు చేసుకోవటమనేది మెచ్చుకోదగిన ఆచారమని ఒప్పుకున్నప్పటికీ, ఈ రష్యను వాక్యంలోకి ఇతర భాషా వాక్యాలు ప్రవేశపెట్ట సాహసించలేడు. అందుచేత రష్యను భాషలోనే పనిసాగిస్తాం.

“ఏం కథ?”

“ఓ నా బంగారు అన్నా గ్రిగోర్యెవ్న! నా స్థితి నువు ఊహించుకున్నట్టయితేనా! నువు ఊహించు చూస్తాం, ఇవాళ పొద్దున ఫాదర్ కిరివ్ భార్య నా దగ్గిరికివచ్చి-ఏమిటనుకున్నావు? మహాసాధువు లాగా కనపడే ఈ పెద్దమనిషి, మొత్తానికి భలేవాడు కాడూ?”

“ఏమిటీ, ఆయన ప్రీస్టు పెళ్ళాంతో కలగజేసుకున్నాడా?”

“అయ్యొ, అన్నాగ్రిగోర్యెవ్న! అంతకంటె లేకపోతే ఇక లేనిదేం? ఆవిడ నాతో ఏం చెప్పిందని అడుగూ! కరబోచ్క సతి అని పల్లెటూరినుంచి ఒకావిడ వాళ్ళింటికి వచ్చిందట, వచ్చి మతిపోయిన దానిలాగా, మొహాన రక్తం చుక్క లేకుండా కథంతా చెప్పిందట, ఏం కథ! నువు విను అంతే, నవల అనుకోవలసిందే! అకస్మాత్తుగా అర్థ రాత్రివేళ అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో మనం ఊహించలేనంత భయంకరంగా గేటు తట్టి ఎవరో, ‘గేటు తెరుస్తారా? పగల గొట్టమా?’ అన్నారుట… నీ కెట్లా ఉంటుందీ? అంత చేసినాక అతను చాలా మంచివాడు కాడూ?”

“మరి ఈ కరబోచ్క ఏరకం మనిషీ, చిన్నదీ, అందగత్తేనా?”

“ఎబ్బే, ముసలావిడ.”

“ఏం చిత్రం! ముసలిదానివెంట పడ్డాడూ? మన ఆడవాళ్ళ అభిరుచులకు చెప్పుకోవాలి! ప్రేమించటానికి భలేవాణ్ని సంపాదించుకున్నారు!”

“అదేమీకాదు, అన్నా గ్రిగోర్యెవ్న. నువు పెడదారిలో ఉన్నావు. నువే ఆలోచించు, ఈ మనిషి ఏ రినాల్డో రినాల్డినీ లాగానో కత్తులూ, కటార్లూ ధరించివచ్చి, ‘చచ్చిపోయిన నీ కమతగాళ్ళందర్నీ నాకు అమ్ము.’ అన్నాట్ట. ‘చచ్చిపోయినవాళ్ళను ఎలా అమ్మేది?’ అన్నదట కరబోచ్క మంచిగా. ‘లేదు, వాళ్ళు చావలేదు, వాళ్ళు నా సొత్తు. వాళ్ళు చచ్చినదీ లేనిదీ నాకు తెలుసు,’ అన్నాట్ట. ‘వాళ్లు చావలేదు, చావలేదు,’ అని కేకలు పెట్టాట్ట. అతనుచేసిన అల్లరికి ఊళ్ళో వాళ్ళంతా పరుగెత్తుకొచ్చారుట, పిల్లలు ఏడవసాగారుట, అందరూ ఒక్కసారిగా మాట్లాడి నానా గందరగోళమూ, బీభత్సూ అయిందట… ఇదంతా విని నాకు ఎలా మతిపోయిందో, నువు ఊహించలేవు, అన్నాగ్రిగోర్యెవ్న. ‘అమ్మగారూ, అద్దంలో ఒకసారి చూచుకోండి, మీ మొహం ఎలా పాలిపోయిందో,” అంటుంది మా మాష్క. ‘ఇప్పుడద్దం మాట ఎత్తకే. నేను వెళ్ళి అన్నా గ్రిగోర్యెవ్నను చూడాలి.’ అన్నాను నేను, వెంటనే నా బండిని పట్టుకురమ్మని కబురుపెట్టాను. మా బండివాడు అంద్య్రూష్క ఎక్కడికి పోవాలంటే నా నోటమాట వస్తేనా? పిచ్చిదానిలాగా వాడికేసి తేరిపారచూశాను. నాకు మతిపోయిందని తప్పక అనుకుని ఉంటాడు. అయ్యొ, అన్నాగ్రిగోర్యెవ్న, నేనెంత బెంబేలు పడిపోయానో నువు ఊహించగలిగితేనా!”

“విచిత్రంగానే ఉంది. ఈ చచ్చిపోయిన మనుషులకు అర్థమేమిటై ఉంటుంది? నా మటుకు నాకేమీ పాలుపోవటం లేదుమరి. ఈ చచ్చిపోయిన కమతగాళ్ల ప్రసక్తిరావటం ఇది రెండోసారి. నజ్ ద్ర్యోవ్ చెప్పినదంతా పచ్చి అబద్ధమని మా ఆయన ఇంకా అంటూనేఉన్నారుగాని, అందులో ఏదో ఉండాలి.”

“ఇదంతా విన్నప్పుడు నే నే స్థితిలో ఉన్నానో ఊహించుకో. కరబోచ్క అంటుందిగదా, ‘నా కిప్పుడేం చెయ్యాలో తెలీదు. నాచేత ఏవో తప్పుడు కాగితాలమీద సంతకం పెట్టించి, పదిహేను రూబుళ్లనోట్లు పారేశాడు. నేను అనుభవంలేని విధవరాలిని ‘ అంటుంది… ఎటువంటి పనులు జరుగుతున్నాయో చూశావా? నేనెంత గందరగోళ పడ్డానో నీకు తెలిస్తేనా!”

“నువ్వేమైనా చెప్పు, ఇది చచ్చిపోయిన మనుషుల విషయం కానేకాదు, దీనికంతకూ వెనక ఇంకేదో ఉంది.”

“నాక్కూడా అలానే అనిపించింది చెప్పొద్దూ, అన్నది ఒయ్యారిభామ ఆశ్చర్యపడుతూ. మరుక్షణమే ఆమెకు ఆ వెనక ఉన్నదేమిటో తెలుసుకోవాలని తహతహ పుట్టింది. ఆవిడ కొంచెం అనుమానిస్తూ, దీనికంతకీ వెనక ఏమిటుంటుందంటావేం?” అనికూడా అన్నది.

“ఇంతకూ నీ ఉద్దేశమేమిటి?”

“నా ఉద్దేశమా? నాకంతా అయోమయంగా వుంది.”

“అయితే అయింది, నువు ఏమంటావో తెలుసుకోవాలని వుంది.”

కాని ఒయ్యారిభామ ఏమీ అనలేకపోయింది. ఆవిడకు కంగారు పడటమైతే చాతనవునుగాని, దేన్ని గురించి కూడా ఇది ఇలాగూ అని విస్పష్టంగా చెప్పగల సమర్థత లేదు. అందుకే ఆవిడకు అందరికన్నా అధికంగా అడుగడుగునా ఆపేక్షచూపేవాళ్ళూ, ఆలోచన చెప్పేవాళ్లు కావాలి.

“అయితే, ఈ చచ్చిపోయిన కమతగాళ్లకు అర్థమేమిటో చెబుతా విను,” అన్నది ఒప్పులకుప్ప. ఈమాటలు వినగానే చూడ వచ్చిన మనిషి వినటానికి ఆత్రంగా కూచున్నది. ఆమె చెవులు నిక్కబొడుచుకున్నట్టుగా అయాయి. ఆమె గాలిలోకి లేచి సోఫాకు అంటీ అంటకుండా కూచున్నది. వస్తుతహా ఆమె కాస్త ఒళ్ళుగల మనిషే అయినా చిక్కిపోయి, ఈకలాగా అయి, కాస్త గాలి వీస్తే చాలు కొట్టుకుపోయేదానిలాగా అయిపోయింది.

ఇదే విధంగా వేటగాళ్ళు చుట్టిముట్టి కుందేలు అడివిలోనుంచి బయటికి రాగానే, గుర్రంమీద ఎక్కి కొరడా పట్టుకుని ఉన్న వేటగాడు నిప్పు అంటుకోవటానికి సిద్ధంగా వున్న పేలుడు మందులాగా అయిపోతాడు.

అతను మకిలగా ఉన్న గాలిలోకి చూస్తూ గురిగా జంతువును కొట్టి చంపుతాడు

, తన మీద పడే వెండి నక్షత్రాల లాటి మంచును కూడా లక్ష్య పెట్టడు, అది అతని పెదవుల మీదా, మీసాలమీదా, కళ్లమీదా, కనుబొమలమీదా, టోపీమీదా పడుతూ ఉంటుంది.

“ఆ చచ్చిపోయిన వాళ్లు…” అన్నది ఒప్పులకుప్ప.

“ఏమిటి, ఏమిటి?” అన్నది చూడవచ్చినావిడ.

“ఆ చచ్చిపోయిన వాళ్లు…”

“చెప్పుదూ, చంపకా!”

“వాళ్లు కేవలమూ మిష. అతను నిజంగా చేయదలచిన దేమిటంటే, గవర్నరు కూతురితో లేచిపోవటం.”

ఇది బొత్తిగా ఊహించరాని విచిత్ర పరిణామం. ఈ మాట వింటూనే ఒయ్యారిభామ కొయ్యబారి పాలిపోయింది, చచ్చేటట్టు పాలిపోయింది. ఈసారి ఆమె కంగారు పూర్తిగా వాస్తవమైనది. ఆమె తన చేతులను ఒక దానితో ఒకటి పట్టుకుని, “అమ్మో, నేను కలలో కూడా అనుకుని వుండను!” అన్నది.

“నువు నోరు మెదిపేసరికల్లా నాకు అసలు సంగతి తెలిసే పోయింది” అన్నది ఒప్పులకుప్ప.

“ఇంత అయాక వసతి పాఠశాలల చదువు గురించి ఏమనుకోవాలి, అన్నాగ్రిగోర్యెవ్న! వాళ్ళ బుద్ధిమంతనం ఇదా!”

“బుద్ధిమంతనమో, ఇంకానయం! ఆ అమ్మాయి కొన్నిమాటలంటుందిగదా, నేను నోటంట తిరిగి అనలేను!”

“మనుషులిలా తెగబడిపోవటం చూస్తే గుండె తరుక్కుపోతుంది అన్నాగ్రిగోర్యెవ్న!”

“ఆ పిల్ల కోసం మగవాళ్ళు ఒకటే వెర్రెత్తి పోవటం. నామటుకు నాకామెలో ఏమీ కనిపించదు… తగని నిక్కులు పోతుంది.”

“అయ్యొ, అన్నాగ్రిగోర్యెవ్న తల్లీ, వట్టి రాతిబొమ్మ, మొహాన కొంచమైనా కదలిక వుంటేనా!”

“ఏమి నిక్కులు పోతుంది! ఏమి నిక్కులు! అమ్మయ్యో, ఏమి నిక్కులు! ఎవరు నేర్పారో తెలీదు. నా మటుకు నేను అంత నిక్కులు పోయే పిల్ల నెక్కడా చూడలేదు.

“వట్టి బొమ్మేనోయ్, పాలిపోయి వుంటుంది.”

“నాకు చెప్పకు, సోఫ్య ఇవానీవ్న, ఎరువు ఇంత మందాన మెత్తుకుంటుంది.”

“ఏమిటి నువ్వనేది, అన్నాగ్రిగోర్యెవ్న? ఆమె సున్నం లాగా వుంటుంది, సున్నమే!”

“నే నామె పక్కనే కూచున్నానోయ్. ఎర్రరంగు నావేలి మందాన వుండి, పెళ్లలూడి వస్తున్నది, తల్లిని చూసి నేర్చుకుంటున్నది. ఆవిడ ఒక కులుకులాడి, కూతురు తల్లిని మించిపోయింది.”

“క్షమించాలి. చూడూ, ఎంతైనా పందెం వేస్తాను, నా పిల్లల్నీ, భర్తనీ, నా ఆస్తి అంతా కూడా పందెం ఒడ్డుతాను, ఆ పిల్ల మొహాన ఒక్క చుక్క కూడా ఎరుపు రంగు లేదు.”

ఒప్పులకుప్ప తన రెండు చేతులూ కలిపేసుకుని, “ఏమిటి నువ్వనేది, సోఫ్య ఇవానీవ్న?” అన్నది.

“నువు నిజంగా ఏం మనిషివి, అన్నాగ్రిగోర్యెవ్న! నిన్ను చూస్తే ఆశ్చర్య మేస్తున్నది!” అన్నది ఒయ్యరిభామ, తానుకూడా చేతులు కలిపేసుకుని.

ఈ ఇద్దరూ ఏక కాలంలో తాము స్వయంగా చూసిన విషయం గురించి భిన్నాభిప్రాయాలు ప్రకటించటం చూసి పాఠకుడు ఆశ్చర్యపడరాదు. ఒక ఆడదానికి తెల్లటి తెలుపుగానూ, మరో ఆడదానికి ఎర్రటి ఎరుపుగానూ కనబడగలిగినవి ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.

“ఆ పిల్ల పాలిపోయి ఉన్నదనటానికి ఇంకో సాక్ష్యం చెబుతా చూడు. ఇప్పుడు జరిగినట్టుగా జ్ఞాపకం ఉన్నది, మానిలవ్ పక్కనే కూచుని, ‘ఆ పిల్ల ఎలా పాలిపోయి ఉన్నదో చూశారా?’ అన్నాను. మన పెద్దమనిషి లాటి బుద్ధి తక్కువవాళ్లు తప్ప ఆమెను చూసి మోహించరు. మన పెద్దమనిషేమో… ఆయన్ను చూసి ఎంత అసహ్యించుకున్నాను! ఎంత అసహ్యించుకున్నానో నువు ఊహించలేవు, అన్నాగ్రిగోర్యెవ్న.”

“అయినా ఆయన్ను చూసి మూర్ఛపోయిన వాళ్ళున్నారు.”

“నేనా, అన్నాగ్రిగోర్యెవ్న? అలా ఎన్నటికో అనుకోకు, ఎన్నటికీ, ఎన్నటికీ!”

“నేను నీ విషయం అనటం లేదే, నువు తప్ప ఇంకెవరూలేనట్టు!”

“ఉత్తది, ఉత్తది, అన్నాగ్రిగోర్యెవ్న! నాసంగతి నాకు బాగానే తెలుసులే! కొండెక్కి కూచున్నట్టు ప్రవర్తించే కొందరు స్త్రీలకేమైనా అలాటి వికారం కలిగితే కలిగి ఉండవచ్చు.”

“క్షమించాలి, సోఫ్యఇవానీవ్న! నన్ను గురించి ఎన్నడూ ఇంత చిన్న అపవాదుకూడా లేదనుకో. ఇతరుల మాట తెలీదుగాని, నన్ను గురించి లేదు నీ దయవల్ల”.

“నువ్వెందుకు ఉడుక్కుంటున్నావు? అక్కడ ఇంకా ఎందరో స్త్రీలున్నారే, అతని ప్రక్కన కూచోవటానికని వాకిలి దగ్గిర ఉన్న కుర్చీల మీదికి ఎగబడినవాళ్ళు”.

ఒయ్యారిభామ ఇంతమాట అన్నాక దుమారం సాగితీరుతుందనుకోవలిసిందేగాని, వింత ఏమిటంటే, ఇద్దరాడవాళ్ళూ ఒక్కసారిగా చప్పబడిపోయారు, ఏమీ జరగలేదు. కొత్త ఫాషను నమూనా ఇంకా తన చేతికి అందలేదన్న సంగతి ఒప్పులకుప్ప జ్ఞాపకం చేసుకున్నది, తన ప్రాణస్నేహితురాలు ఇంతకుముందే బయలుపెట్టిన విషయం తాలూకు వివరాలింకా తనకు తెలియలేదని ఒయ్యారి భామ స్మరించింది, అంతతో ఇద్దరికీ మధ్య శాంతి నెలకొన్నది. అయితే ఈ ఇద్దరు స్త్రీలలో ఏ ఒకరికీ ఇతరులపట్ల అసహ్యంగా ప్రవరించే స్వభావం ఉన్నదనటానికి వీల్లేదు. వాళ్ళది కుళ్లుబుద్ధి కాదు, మాట్లాడుకునేటప్పుడు అలా ఒకరి నొకరు గిచ్చుకోవాలన్న బుద్ధి అప్రయత్నంగా పుడుతుంది. “నీకు అంతేకావాలి!” అన్నట్టుగా ఒక ములుకు లాటి మాట అవతలిమనిషి మీద ప్రయోగించటంలో కాస్త ఆనందం ఉంటుంది, అంతకంటె మరేమీ లేదు. మగవాళ్ళ తత్వంలోలాగే ఆడవాళ్ళ తత్వంలోనూ అనేక రకాల ప్రేరణలుంటాయి.

“నాకు అర్థం కానిదల్లా ఏమిటంటే, ఎక్కడినుంచో ఊడిపడిన ఈ చిచీకవ్ ఇంత సాహసానికి ఎలా ఒడి గట్టాడా అని. ఈ వ్యవహారంలో ఇతరులు కూడా ఇరుక్కుని ఉండాలి!” అన్నది ఒయ్యారిభామ.

“లేరనుకున్నావా ఏం?”

“అతనికి ఎవరు సహాయం చేస్తున్నారేం?”

“నజ్‌ద్ర్యోవ్ ఒకడు కనిపిస్తూనే ఉన్నాడు.”

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 31

అద్వైతం

మూలా సుబ్రహ్మణ్యం

౧. అద్వైతం
పౌర్ణమి నాడు
పరిపూర్ణతనొందే
రాత్రి ఆత్మ

అమావాస్య నాడు
శూన్యంలోకి
అదృశ్యమౌతుంది

ఏం ఏకత్వాన్ని దర్శించిందో
ఒకేలా ఎగసిపడుతూ
పిచ్చి సముద్రం!

౨. నక్షత్రాల దుఃఖం

ప్రయాణించి ప్రయాణించి
ఒక్క కన్నీటిబొట్టు లోతుల్లోకి
చేరుకుంటాను

మంచుబొట్టు తాకిడికే
ముడుచుకుపోయే
అత్తిపత్తి ఆకుల నిశ్శబ్దం
నాలో ప్రవేశిస్తుంది

రాత్రంతా దుఃఖించే
నదీ నక్షత్రాలూ
నాకిప్పుడు బోధపడుతున్నాయి!

౩. వెదురుపొద — నది
నదితో వెదురుపొద :

పాటకోసం తూట్లుపొడిచేవాళ్ళే తప్ప
నా గురించి పాడేవాళ్ళే లేరు
పక్కన కూచోబెట్టుకుని
చక్కగా పాడతావు

యుగాలుగా
అలుపెరుగక

కొండగాలికి నే పాడే పాట
నిజానికి నువ్వు నేర్పిందే

వెదురుపొదతో నది :

దాహం తీర్చుకుని
కలుషితం చేసేవాళ్ళే తప్ప
గుండె కరిగి పాడుతున్నా
వినే గుండె లేదు

అంగీకారంతో తలూపుతూ
ఆనందంగా వింటావు

నిరంతరం నీ నీడ
నాలో ప్రతిఫలిస్తుంది

మనల్ని బంధించిన పాట కోసమే
మనిద్దరం

ప్రపంచంతో
పనేమిటీ?

౪.కన్నీటి పూలు

మేఘం కార్చిన
రెండు కన్నీటి బొట్లు
భూమి తన గుండెల్లో
దాచుకుంది

తనని తాను
వెతుక్కునే ప్రయత్నంలో
లోతుల్లోని తడిని
తాక గలిగింది చెట్టు

చిరునవ్వు నవ్వుతూ
చెట్టుకి పూసాయి
రెండు కన్నీటి పూలు!

Posted in కవిత్వం | Tagged | 11 Comments

డిసెంబరు 2009 గడి ఫలితాలు – వివరణలు

ఈసారి 23 మంది నుంచి 27 పరిష్కారాలు అందాయి. చాలామంది (దాదాపు) అన్నీ సరిగా పూరించినా నిలువు 4 ఆధారంలోని అనాగ్రామ్ ను గుర్తించలేక తడబడ్డారు. అందువల్లేనేమో ఈసారి గడి సులభంగానే ఉన్నా అన్నీ సరిగా పూరించినవారెవరూ లేరు! అడ్డం 7లో వీరనారి కూడా చాలా మందిని తిప్పలు పెట్టింది. ఒక తప్పుతో పూరించినవారు భమిడిపాటి సూర్యలక్ష్మి, వల్లీ సునీత, నగేష్, ఆదిత్య, వేణు, శుభ, జ్యోతి. రెండేసి తప్పులతో కోడీహళ్లి మురళీమోహన్, సౌమ్య, రాజేశ్వరి, భమిడిపాణి ఫణిబాబు, అపరంజి, రాధిక. మూడేసి తప్పులతో మైత్రేయి, వెంకట్ దశిక, స్నేహ, సుభద్ర వేదుల. అందరికీ అభినందనలు. ఇక వచ్చే నెల గడి ఒక వినూత్న ప్రయోగంతో మీ ముందుకు రానుంది.

వివరణలు

అడ్డం:

1 సమైక్యాంధ్ర, సెపరేటాంధ్ర రెండూ తలలు బాదుకున్నది దీనిచుట్టూనే (5)
‘బాదు’కున్నది హైదరా’బాదు’ చుట్టూనేకదా!

7 అల్లెతాడు బిగించిన ధీర(4)
వీరనారి. ధీర అంటేనే వీరనారి. అల్లెతాడు బిగించడాన్ని నారి సారించడమంటారు కదా!

9 ఆలపించనా జహాపనా.. అప్‌నా గానా.. (5)
రాగాలాపన. ఈ పదం మాదిరే పై ఆధారంలో నాలుగు పదాలూ నా అనే అక్షరంతో ముగుస్తున్నాయి. ఆలపించు, జహా’పనా’, అ’ప్‌నా’, ‘గానా’లతో శబ్ద సారూప్యం.

10 పగలబడి సగమే నవ్వితే శబ్దం ఇలాగే వస్తుంది (2)
పక. పగలబడి (పకపక) నవ్వితే అందులో సగం పక.

12 పూబాణాల తాళని బాల మిస్సమ్మ చెల్లెలి స్వపరిచయం (3+1+3)
బాలనురా మదనా. విఖ్యాతమైన మిస్సమ్మ సినిమాలోని పాట. విరి తూపులు వేయకురా… మదనా బాలను రా మదనా… అనే పాటను వినేవుంటారు.

15 కృష్ణునితో తలపడిన బలిపుత్రుడు (3)
బాణుడు – బలిచక్రవర్తి కుమారుడైన బాణుడు… అతని కూతురు ఉష… ఉష వలచిన అనిరుద్ధుని (కృష్ణుని మనుమని) బంధించబోయిన సందర్భంలో కృష్ణునితో తలపడతాడు.

16 భయమూ లజ్జాలేని నాన్ స్టాప్ పంక్చువేషంగాడు (2)
కామా. కామాతురాణాం న భయం న లజ్జా అన్నారుకదా! ఇక ఆంగ్ల పంక్చువేషన్ మార్కు ‘కామా’… దీన్ని నాన్ స్టాప్ అని ఎందుకన్నానో తమకు తెలిసినదే!

17 పరులసొమ్ము తినీతినీ.. ఇక చెప్పేదేముంది శ్రీరంగా! (2)
నీతి. పరులసొమ్ము తినీతినీ అనడంలోనే అవి’నీతి’ వుంది. చెప్పేవి శ్రీరంగనీతులు … అనే సామెత మీకు తెలుసు.

18 మకారం లేని చాలీచాలని వల (2)
జాల. వలను జాలం అంటాం కదా. చాలీ’చాల’ని అనడంలోనే మకారంలేని ‘జాల’మ్ వుంది.

19 తిరగబడ్డ కొయ్యపలక (3)
కలప. పలకను తిప్పితే కలప. కలప అంటే కొయ్య.

22 రంగస్థలం మీద కృష్ణుడు కళ్లు నులుముకొని దుర్యోధనుణ్ణి చూసి యేమన్నాడయ్యా అంటే.. (2+3+4)
బావా ఎప్పుడు వచ్చితీవు… అన్నాడు. రంగస్థలం మీద కృష్ణ, దుర్యోధన పాత్రలమధ్య పలికే జగద్విదితమైన పద్యం.

23 ఈ ఫెన్స్ వుంటే దాడి చేయడం కష్టం (2)
దడి. ఆంగ్లంలో ఫెన్స్ ‌అనే పదానికి తెలుగులో అర్థం కంచె. కంచెలో ఒక రకం వెదురుబద్దలతో వెదురుకర్రలతో వేసే కంచె. దీన్ని దడి అంటాం. ‘దాడి’చేయడం కష్టం అన్నది ‘దడి’ శబ్దాన్ని స్ఫురింపజేయడానికే.

24 చిక్కులు తొలగాలంటే ఇది కాస్త వుండాలి (2)
లక్కు. ఈ ఆధారం శబ్దాశ్రయం.

25 ఏడుచేపల కథలో విలనూ హీరో కూడానూ .. ఎవరు చెప్మా! (2)
చీమ. పిల్లోణ్ణి కుట్టడం వల్లనే కదా వాడు ఏడ్చి, వాణ్ణి సముదాయిస్తూ అవ్వ పాలేరుకు అన్నంపెట్టక, వాడు ఆవుకు గడ్డివెయ్యక… ఇలా అన్ని గొలుసు సమస్యలూ? అందుకే అది విలన్. బంగారు పుట్టలో వేలు పెడితే ఏమైనా సరే సహించేది లేదనే సందేశం బలంగా వినిపించిన హీరో కూడా చీమే కదా!

26 ఎడాపెడా కాదండీ దడదడా కొట్టుకుంటుందిది (3)
ఎడద. ఎడాపెడా దడదడా లలో దాగిన పదం ఎడద. ఆదుర్దాలో గుండె దడదడా కొట్టుకుంటుందంటారు కదా!

27 ఎదురుగాలి (3)
త్తురుమ. గాలిని మారుతం అంటారు, మారుతానికి మూలరూపం మరుత్తు. ఎదురుగాలి అన్నదెందుకో మీకు తెలుసు.

30 పాతకముల హరియించు రెండక్షరములు (2)
హరి. హరియను రెండక్షరములు హరియించును పాతకముల అనే పద్యం మీకు తెలిసిందే.

32 సగం మహాకవి, సిరి అంశతో (1)
శ్రీ. లక్ష్మిని సిరి అంటారు. సిరి అనే వికృతికి శ్రీ ప్రకృతి. మహాకవి శ్రీశ్రీ పేరులో సగం.

33 కోరగానే సరిపోదు .. కొనుక్కో సరిపోతుంది (4)
కోరుకొను. దీనికి ఇంతకంటే వివరణ అనవసరం.

34 పెద్దలెవరైనా ఆ ఒడ్డు నుంచి రంతిదేవుణ్ణి పిలవండీ (2)
తీరం. రంతిదేవుణ్ణి పెద్దలు పిలిస్తే ‘రంతీ’ అని పిలవొచ్చు. ఆ ‘ఒడ్డు’ నుంచి అంటే ఆ ‘తీరం’ నుంచి.

36 కొంచెములో కొంచెము (4)
లవలేశం. లవము అంటే కొంచెము. లేశము అన్నా కొంచెమే. ఈ పదం చుట్టూ వున్న మిగతా పదాలమీద కూడా ఆధారపడి వుంది.

38 నిషాదషడ్జమ స్వనం .. నస కాదు నాయనా (2)
నిస. సప్తస్వరాలలో ‘ని’ని నిషాదమనీ, ‘స’ను షడ్జమమనీ అంటారు. ఈ రెండూ పక్కపక్కన చేరితే వచ్చే స్వనం అంటే శబ్దం.

40 అవిశపూవులు అందని ఘంటసాల పల్లెపడుచు పిలుపు (3+3+2)
రావోయి బంగారి మావాఁ

41 మామూలు సముదాయమే కదా .. దంభమేముందీ (3)
కదంబం. అంటే సముదాయం. దంభం యేముందీ అన్నది క’దంబం’ శబ్ధాన్ని స్ఫురింపజెయ్యడానికే.

నిలువు:

1 హిందీలో వుంది రమ్మంటావా? (3) హైరానా. హిందీలో వుంది – హై. రమ్మంటావా – రానా?.

2 మోసం … తగాదా కాదా? (2) దగా. తగాదా కాదా అనడంలోనే మోసానికి సమానార్థకం దగాను వెతుక్కోవాలి.

3 తిరగబడ్డ విండీస్ వీరుడు వచ్చాడా? (2) రాలా. వచ్చాడా? అంటే ‘రాలా’ అనేది సమాధానం. ‘రాలా’ తిరగబడితే ‘లారా’. వెస్టిండియన్ బ్రయాన్‌లారా తెలుసు కదా?

4 ద్విజుడను బాపడును కలడు (4) బాపనుడు.

5 గట్టిగా దున్నలేకపోయిన దున్న (2) దున

6 చెదరి పలచబారిన చిత్తం (3) చపల. ‘పలచ’బారిన‌లోనే వుంది. చెదరిన చిత్తమె ఇక్కడ చపల చిత్తం.

8 దేవగాయకులే నిక్వణింపజేయాలా (3+3+3+3) దేవగాయకుడు నారదుడు. ఆయన తన వీణ మహతిని నిక్వణింపజేస్తే వచ్చేది మహతీనినాదం.

11 తిరిగొచ్చిన బహుమానం (3) కనుకా. కానుక తలకిందులుగా తిరగరాయండి.

13 సీతాపతీ నువు మారావురా (4) రామారావు

14 రాతిని కాను స్త్రీ నే (2) నాతి

15 బ్రహ్మ నుడివినదే లక్కు, బావా! (4) బాలవాక్కు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. నుడువటం అంటే మాట్లాడటం, వాక్రుచ్చడం.

18 జాబిలమ్మ లాంటి అరబ్బీ మేషము(4) జాబాలము అంటే మేక. సిరియా దేశంలోని కొండమేకలను జాబాలి అంటారు. సిరియా అరబ్బు దేశం కాబట్టి అరబ్బీ మేషము జాబాలము. (జాబాలుడు అంటే మేకలుకాసేవాడు).

19 కడుపారగ కూడులేని బీదకు వున్నది ఏడుపేకద! (4) కడుపేద. ‘ఏడుపేకద’లో దాగిన పదం.

20 జాలములో అడ్డంగా దొరికిన సీతాపుత్రుడు(2) లవ. జాలములో అంటే ‘వల’లో అడ్డంగా దొరికివాడు ‘లవ’కుమారుడు.

21 గడ్డకట్టని రక్తము (2+3) పచ్చినెత్తురు

28 కోరుకుంటే ఉత్తరాదిన ఠక్కున ఆగమని కోరుకోవాలి (2) రుకొ. ‘కోరుకొం’టేలోనే వుంది రుకో. ఠక్కున ఆగితే రుకో కాస్తా రుకొ.

29 మగడను మాటలోనే వుంది బతుకుబండిని లాగడం (4) మనుగడ. మగడను లోనే దాగుంది.

31 కాంక్ష .. కామాంశ (3) రిరంస. అంటే రమించాలనే కోరిక.

33 శోకమేల, నిధి ఉందిగా (2) కోశం.

35 డ్రీమురా అంటే రంగుదా అనడిగిన రసజ్ఞుని అతిసారం (3) కలరా. డ్రీము(కల)రా! రంగుదా (కలరా)? అతిసారం అంటే కలరా.

36 బడాయి కి పోతే ఇలానే గొడవలౌతాయి (3) లడాయి.

37 గాలేరు నగరి గాలించాం సరే .. ఉన్నారా? (3) లేరుగా. గాలేరులోనే వుందీ పదం. ఉన్నారా? అనే ప్రశ్నకు లేరుగా అనేది సంభావ్యతగల ఒక సమాధానం.

39 వెనకనుంచి పిలిస్తేవచ్చే లేతసరుకే అయినా.. స్త్రీని లెమ్మని పిలిచినట్టు పిలవాలమ్మా (2) లేమా… లేమ అంటే పడచు. ‘లేమా’ వెనుకనుంచి ‘మాలే’. మాల్ అంటే సరుకు అనే అర్థముంది కదా!

Posted in గడి | Tagged | Comments Off on డిసెంబరు 2009 గడి ఫలితాలు – వివరణలు

2010 జనవరి గడిపై మీమాట

2010 జనవరి గడిపై మీ అభిప్రాయాలను, సూచనలను ఇక్కడ రాయండి.

Posted in గడి | Tagged | 3 Comments

కాళ్లు పరాంకుశం

నా రాజమండ్రి ప్రయాణానికి మా ఇంట్లో పాత, కొత్త సామెతల మేలు కలయిక రివాజు.

”పని లేని బార్బర్‌కి పిల్లి తల. నీకు రాజమండ్రి” అంది బామ్మ.

”పుల్లయ్యకి వేమవరం. నీకు రాజమండ్రి. అన్నట్ల వేమవరం రాజమండ్రికి దగ్గిరే కదా! పని లేకపోవడంలో పని లేకపోవడంగా ఓ సారి వేమవరం కూడ వెళ్లొచ్చేయ్‌” అంది అమ్మ.

”ఇంట్లో ఉంటే స్పాం మెయిల్. ఇల్లు దాటితే రాజమండ్రి” అంది చెల్లి.

”ఒబామాకి హోప్‌ నోబెల్‌ తెచ్చింది. రాజమండ్రి నీకెప్పుడు తెస్తుందో” అన్నారు నాన్న.

పాపం మా ఆవిడొక్కతే ఏమీ అనదు. మా పిల్లల్నీ అననివ్వదు. ఆ పైన మిగతావాళ్లమీద తనకి అదుపు లేదని నొచ్చుకుంటుంది కూడా. Continue reading

Posted in కథ | 5 Comments

శ్రీ రమణీయ చానెల్- రెండవ భాగం

ప్రతి మనిషికీ తను పుట్టి పెరిగిన ఊరు, బాల్యం లోని సంఘటనలు, వ్యక్తులు – వీటన్నిటి ప్రభావం తర్వాతి జీవితం లోని అభిరుచులూ, అలోచనా విధానం పై తప్పక ఉంటుంది. అదీ రచయితల విషయం లో ఐతే ఆ చిన్నతనపు జ్ఞాపకాలు ఎప్పటికీ తరిగిపోని ప్రేరణా, పెన్నిధీ కూడా. అటువంటి తమ పా’తలపోతల్ని’ మనతో కలబోసుకుని తర్వాత్తర్వాత ఆ చిన్న అలవాట్లే ప్రవృత్తిగా,వృత్తిగా, సర్వస్వం గా తన జీవితం తో పెనవేసుకుపోయిన వైనాన్నిరమణీయమైన రెండవభాగం లో మిథునం కథల మాయావి మాటల్లో చదవండి.

తొలిరోజుల్లో పఠనం

చిన్న చదువులో బాల పత్రిక నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. ఆ నాటి విద్యా విధానం, ఉపాధ్యాయులు మా తరం యువతని ఎంతగానో ప్రభావితం చేశాయి. హైస్కూల్లో స్థాయికి తగిన జనరల్ పుస్తకాలు వుండేవి. ఒక్కొక్కటి 40 ప్రతులు.

పంచతంత్రం, బొమ్మల భారతం, రామాయణం లాంటివి వుండేవి. పెద్ద తరగతుల వాళ్ళకి శరత్ అనువాదాలు, రాజు – పేద, కాంచన ద్వీపం లాంటి పుస్తకాలు యిచ్చేవారు. డిక్ష్నరీ ఎలా చూడాలో నేర్పించేవారు. మా తెలుగు మాస్టారు స్కూల్ ఫైనల్ స్థాయి వరకు సరిపడే నిఘంటువుని కూర్చారు. సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు తను రాసిన ఖండ కావ్యాన్ని (పెనుగొండ లక్ష్మి) తనే పాఠ్యాంశంగా చదువుకున్నారట!

విశ్వనాథ, కరుణశ్రీ లాంటి మన కవులు తాము రచించిన కావ్య ఖండికలను తామే బోధించడం వింత విశేషం! ఆ విద్యార్థులు ఎంత అదృష్టవంతులు!

ఫిజిక్స్‌లో పోస్ట్ డాక్టరేట్ చేసి, పురావస్తు శాస్త్రం, తెలుగు సాహిత్యం, జానపద సాహిత్యంపై సాధికారత సాధించిన శ్రీపాద గోపాల కృష్ణమూర్తి పాఠాలు విన్నాను. వూరూరు తిరిగి ఆయన సేకరించిన జానపదాలు వారే పాడగా విన్నాను. పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి “కౌసల్య” నవల సీరియల్‌గా వచ్చే రోజుల్లో ఆయన మాకు ఇంగ్లీషు పాఠాలు చెబుతూండేవారు. కౌసల్య నవల భారతీయ భాషలన్నింటిలోకి అనువదితమైంది. తల్లిదండ్రులు సినిమాగా వచ్చింది. స్కూలు రోజుల్లోనే సారస్వత పరిషత్ పుణ్యమా అని చాలా బరువైన పుస్తకాలు భట్టీయం వేయాల్సి వచ్చింది. తోచెంచుక్కలు, పూచెంగలువలు లాంటి సంథి సూత్రావళిని వల్లించాను. ఉదాహరణలు కూడా చిన్నయసూరి ఎంత అర్థవంతంగా యిచ్చారోనని తరువాత తెలిసింది. వ్యాఖ్యని “రమణీయం” పేరుతో రాసిన దువ్వూరి వెంకట రమణ శాస్త్రిని చూశాను. ఆయన వచనం చాలా బావుంటుంది. “చంద్రవంక” లాంటి వాగు కఠినశిలల్ని సైతం “నీటికింబల్చన” చేస్తూ లేడిపిల్లలా దూకినట్టు వుంటుంది దువ్వూరి వచనం. దేవులపల్లి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, ఎస్వీ భుజంగరాయశర్మల వచనం కవితాత్మతో కస్తూరి పరిమళంతో సాగుతుంది. ముగింపులు నెమలి పురివిప్పి ముడిచిన చందంగా వుంటాయి. ఎప్పటికైనా వాళ్ళ రీతిలో ఒక్క వాక్యం రాయగలనా అని కలలు కనేవాణ్ణి.

పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి నాకో వ్యసనం. దాదాపు యాభై ఏళ్ళ క్రితం, అడవి బాపిరాజు నవలలు, విశ్వనాథ రచనలు, ముద్దు కృష్ణ వైతాళికులు, పానుగంటి సాక్షి, తాపీ ధర్మారావు “విజయోల్లాస వ్యాఖ్య”, పోతన భాగవతం, శతక సాహిత్యం, మధుకలశమ్ (ఉమర్ ఖయ్యాం అనువాదం – ఫిట్జ్‌గెరాల్డ్ ఆంగ్లానువాదం నుంచి) కరుణశ్రీ ఉదయశ్రీ, బారిష్టర్ పార్వతీశం — యిలా కొన్ని పుస్తకాలు తప్పనిసరిగా చాలా యిళ్ళలో వుండేవి. మా ఇంట్లో యింకొంచెం ఎక్కువగా వుండేవి. కాలేజీలో చేరేనాటికి, చేరాక డిగ్రీలో వుండగా ఆంధ్ర వార పత్రికలో నా మొదటి కథ వచ్చింది. ఎమెస్కో ఇంటింటా సొంత గ్రంథాలయమంతా వచ్చి చేరింది. ఇష్టమైన రచయితలను మళ్ళీ మళ్ళీ చదవడం, కొత్త అందాలను పట్టుకోవడం నా అలవాటు.

తెనాలి/ బాపట్ల ప్రముఖులు

తెలుగునాటకం అనగానే స్ఫురించే డా. కొర్రపాటి గంగాధరరావు; స్త్రీ జనాభ్యుదయాన్ని కాంక్షించి సేవాకార్యక్రమాలతో బాటు, శారద లేఖలు ద్వారా రచయిత్రిగా వాసికెక్కిన కనుపర్తి వరలక్షుమ్మ; 70, 80 సంవత్సరాల క్రితమే తెలుగులో రచనలు చేసిన మహిళలను గుర్తించి, “ఆంధ్ర కవయిత్రులు” పుస్తకాన్ని వెలువరించిన ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ మా ఇరుగు పొరుగు. ఆమె తండ్రి మధురకవి నాళం కృష్ణారావు సాహితీ లోకంలో లబ్ధ ప్రతిష్టులు. జీవితాన్నీ, ఆస్తిపాస్తులను హేతువాద వుద్యమానికి ధారపోసిన మల్లాది దంపతులు (ఎమ్.వి.రామ్మూర్తి, మల్లాది సుబ్బమ్మ) మా గుమ్మానికి మూడు గుమ్మాల దూరంలో వుండేవారు.

నా కంటె సీనియర్. అప్పటికి బాపట్ల కాలేజి లేదు. చీరాల కళాశాల ప్రోడక్టు. సినిమా హీరోగా, రాజకీయనేతగా, గవర్నర్‌గా ఎల్లలెరిగిన కోన ప్రభాకర రావుది మా వీథి. దీక్ష సినిమాతో “దీక్ష రాంగోపాల్”గా వాసికెక్కిన పిల్లవాడు లాయర్ కాళిదాసు గారి అబ్బాయి. ఆడ వేషాలలో అగ్రస్థానం పొందిన స్థానం నరసింహారావు బాపట్లవాసి. నాకు వేలు విడిచిన తాతయ్య. సత్యభామ, రోషనార వేషాలలో స్థానం అద్భుతంగా వుండేవారని చెప్పుకునేవారు. నేను వారిని మఫ్టీలో చూడటమే గాని చీరకట్టులో చూడలేదు. “మీర జాల గలడా…” పాట మాత్రం పలుసార్లు ప్రత్యక్షంగా విన్నాను.

బాపట్లలో లాయర్లు ఎక్కువ. దాదాపు వందమంది. అప్పట్లో చెన్నపట్నం సంస్కృతి కొంచెం కనిపిచేది. భావనారాయణ స్వామి గుడి ప్రాచీనమైంది. దాని వల్ల భావపురిగా పుట్టి, బ్రిటిష్ హయాంలో బాపట్ల అయింది. అయిదారు మైళ్ళలో సముద్రం వుంది. వాతావరణం అన్ని కాలాల్లోనూ బావుండేది. నేను పెరిగిన వాతావరణం ఇది.

వేమూరి గగ్గయ్యని వినడమే గాని చూడలేదు. వాళ్ళబ్బాయి వేమూరి రామయ్యని ఎరుగుదును. వేమూరులో వారి ఇంటి కాంపౌండ్‌లోనే ఓపెనెయిర్ నాటకశాల వుండేది. రామయ్యకి కర్ణుడు వేషం బాగా నప్పేది. వేమూరు హైస్కూల్లో చదివేటప్పుడు హార్మోనియం నేర్చుకున్నాను. నాకు అంత యిష్టం లేదు గాని మా నాన్నకి సరదా. ఆరేళ్ళ రామయ్య (నిజంగానే ఆయన రెండు చేతులకు ఆరేసి వేళ్ళుండేవి. బొటన వేళ్ళకి అంటుకుని చిన్న వేళ్ళు) తెనాలి పౌరాణిక నాటకాలకి పెట్టింది పేరు, కాశీ క్షేత్రం. ఓగిరాల, శనగవరపు, విష్ణుంభొట్ల, రామయ్య, పంచనాధం అప్పట్లో డబల్‌రీడ్ హార్మోనియంలో ప్రసిద్ధులు. అంబా ప్రసాద్‌ని చూశాను హార్మణీ రీడ్స్ మీద ఆయన పది వేళ్ళూ పాతికలా నాట్యం చేయడం విన్నాను. పెద్ద ఆర్టిస్టులకు వ్యక్తిగత హార్మనిస్టులు వుండేవారు. కళ్యాణం (ఈలపాట) రఘురామయ్య, పీసుపాటి నరసింహమూర్తి, అద్దంకి, మాధవపెద్ది వీరంతా తెనాలిలోనే వుండేవారు. ఒక పేటంతా ద్రౌపదులు, సీతలు, చింతామణులు, చిత్రలు వుండేవారు. నేను మా గురువుగారితో వెళ్ళాలి కనుక గొప్ప గొప్ప కాంబినేషన్లతో పౌరాణిక నాటకాలు వందలాదిగా చూశాను. చింతామణి అయితే లెక్కే లేదు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (ఇప్పుడు వృద్ధులై భక్తి టివిలో ప్రవచనాలు చేస్తున్నారు) చింతామణిగా ప్రేక్షకుల్ని పరవశింపచేసేవారు. మాధవపెద్ది, పిఠాపురం బిల్వమంగళుడు భవానీశంకరుడుగా తరచు కనిపించేవారు. “తాతల నాటి క్షేత్రముల్ తెగనమ్మి దోసిళ్లతో ధారవోసినాను… అత్తవారిచ్చిన అంటుమామిడి తోట…” అనగానే చప్పట్లు మొదలై, ఆనక ఈలలు వన్స్‌మోర్‌లు దద్దరిల్లేవి. ఉద్యోగ విజయాల్లో జెండాపై కపిరాజుకి, హరిశ్చంద్రలో కాటిసీన్‌కి వన్స్‌మోర్‌లు పడకపోతే నాటకం రక్తి కట్టలేదని లెక్క. కాటిసీన్‌లో “ఇచ్చోట ఏ లేత ఇల్లాలు నల్లపూసల సౌరు…” తో సహా నాలుగైదు పద్యాలు కవి జాషువావి. వాటిని తెచ్చి యిక్కడ కలిపేశారు. “ముదురు తమస్సులో”, “భస్మ సింహాసనం” లాంటి మాటలు నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత నాకిక పద్య పాదాలు కాదు, కవి పాదాలే కన్పించేవి. ఇప్పటికీ కళ్ళు చెమ్మగిల్లే భావం. అనితర సాధ్యమైన మాట కట్టు. నిజం, నవ్యాంధ్ర మహా రాష్ట్రానికి పీష్వా మా జాష్వా అన్నది సత్యం పునఃసత్యం. ఆ కవి కోకిలను నేను చూశాను. వేమూరికి సరిగ్గా మైలు దూరం రావికంపాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు స్వగ్రామం. మేము స్కూలుకి వెళ్ళే రోజుల్లో ఆయనని వేమూరులో చూసేవాళ్ళం. అప్పటికే ఆయన సినిమాల ద్వారా సుప్రసిద్ధులు. మద్రాస్ నుంచి సొంత వూరు వచ్చినప్పుడు వేమూరులో ఒక కిళ్ళీ కొట్లో సాయంత్రం పూట వచ్చి కూచునేవారు. ఆ కొట్టు యజమాని గుమ్మడి బాల్యమిత్రుడు. చాలా అందంగా వుండేవాడు. గుమ్మడి కూచుంటే ఆ సెంటరంతా సందడి సందడి అయిపోయేది. ఇంక మేం సరేసరి. తర్వాత సినిమా రంగానికి నేను దగ్గరయాక ఆనాటి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. గుమ్మడి మంచి మాటకారి. అంటే చమత్కారంగా మాట్లాడడం కాదు. ఒక సంఘటనని చూసినట్టు చెప్పగలరు. వ్యక్తుల్ని చక్కగా విశ్లేషించగలరు. దశరథుడు అచ్చం యిలాగే వుంటాడని యావత్ ప్రపంచాన్ని తన వేషభాషలతో నమ్మించారాయన. “సీతా కళ్యాణం” చికాగో ఫెస్టివల్‌లో ప్రదర్శించినపుడు అక్కడి వారిని అధికంగా ఆకర్షించింది దశరథుడే!

దేశ పర్యటన

పర్యటన, సత్సాంగత్యం జీవితంలో కొత్త వెలుగులు నింపుతాయని ఆర్యోక్తి. ఒక రోజు వున్నట్టుండి చిన్నసంచీ తగిలించుకుని ప్రత్యేకమైన ప్రణాళిక లేకుండా బయలు దేరాను. కలకత్తా, లక్నో, బొంబాయి, ఢిల్లీ లాంటి నగరాలని ముఖ్యంగా అక్కడి సంస్కృతి సంప్రదాయాలను గమనించాలని వుత్సాహపడ్డాను. ట్రావెలర్స్ చెక్కులు, క్రెడిట్ కార్డులు లేని రోజులు. ఎక్కడ డబ్బులు అయిపోతే అక్కడ నుంచి అడ్రస్‌తో ఇంటికి టెలిగ్రాం యిస్తే వెంటనే టెలిగ్రాం మనియార్డర్ వచ్చేది. నచ్చిన చోట వారాల తరబడి వుండిపోయేవాణ్ణి. అలా నచ్చిన ప్రదేశాల్లో లక్నో ఒకటి. చాలా ప్రదేశాల్ని చూశాను. ప్రముఖుల్ని కలిశాను. నేషనల్ హెరాల్డ్ పత్రిక కోటంరాజు రామారావు సంపాదకత్వంలో అక్కడ నుంచే నడిచేది. బొంబాయిలో ముల్క్‌రాజ్ ఆనంద్ “మార్గ్” పత్రిక చాలా ప్రసిద్ధి. కలకత్తా సరేసరి. వంగసాహిత్యంలో గంగానదికి వారెంత ప్రాముఖ్యం యిచ్చారో? కథ చదివినా, కవిత చదివినా, వ్యాసం నవల ఏది చదివినా గంగ ప్రస్తావన వుండి తీరుతుంది. ఢిల్లీ వీథులు భారతీయ చరిత్రని చెబుతాయి. ఢిల్లీ కోటలో పాగా వేసిన ముంగండ అగ్రహారీకుడు పండిత రాయలు గుర్తుకు వస్తాడు. పర్యటనల్లో చెట్లు, గుట్టలు, శిథిలాలు, వీథులు, నదులు, వారథులు, భవనాలు అన్నీ మనకు బోలెడు సంగతులు చెబుతాయి.

ఉజ్జయిని వీథుల్లో ఒక నెలరోజులు తిరిగితే ఎందరు మహామహులు మదిలో మెదుల్తారు? దాదాపు రెండేళ్ళ తర్వాత మా వూరు చేరాను. ఇంకా రెండు దక్షిణాది రాష్ట్రాలు చూడనే లేదు. తగళి శివశంకరం పిళ్ళైని (చెమ్మీన్ నవలని “రొయ్యలు” పేరుతో పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు చేశారు) శంకరాచార్యుల పుట్టిన కాలడి గ్రామాన్ని తర్వాత చూశాను. తర్వాత దశాబ్దాలు గడిచాక నా మిథునం కథని ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ కాలడిలో చిత్రీకరిస్తానన్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు.

రామకృష్ణమిషన్ (అద్వైత ఆశ్రమ్) ప్రచురణలు కొంతమేర చదివి కొద్దిగా అర్థం చేసుకుని వున్నాను. అద్వైత సిద్ధాంతకర్త, జగద్గురువు శంకరుడు ప్రతిపాదించిన మాయావాదాన్ని, స్వామి వివేకానంద నవీకరించి కాలానుగుణంగా భాష్యం చెప్పాడు. ముఖ్యంగా యువతకి అనుగుణంగా సనాతన ధార్మిక సూత్రాలను నవీనీకరించాడు. ఆకొన్నవాడికి అన్నం కావాలి గాని తత్త్వం కాదన్నాడు. ఆ తర్వాత దాన్ని మరోసారి వర్తమాన కాలానికి అనుగుణంగా జిడ్డు కృష్ణమూర్తి కొనసాగించాడని నాకు గల కొద్ది పరిజ్ఞానంలో అనిపించేది. శ్రీశ్రీ, “రోల్స్ రాయ్స్ కారు మిథ్యంటావా మాయంటావా నా ముద్దుల వేదాంతీ” అని ప్రశ్నించాడు. తప్పకుండా మాయే! తిరుగులేని ప్రజాభిమానం, రాష్ట్రం పట్టనంత అధికారబలం, అచంచల విశ్వాసం — యిన్నీ వున్న ఒక ముఖ్యమంత్రి కేవలం పది నిమిషాల్లో మాయం అవడం చూశాం. వేల కోట్ల రూపాయలు ఆర్జించి, లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహారాజు కటకటాలు లెక్కించడం చూస్తున్నాం. పలాయనవాదాన్ని ఆశ్రయించనంత వరకు ముద్దుల వేదాంతి చెప్పినవన్నీ శిలాక్షరాలు. “పదండి ముందుకు” గీతాన్ని భజగోవిందం అనుస్టుప్ ఛందంలో రాసి, “భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ” అని తిరగేయడం నచ్చిందన్నాడు శ్రీ శ్రీ. శంకరుని అద్వైత వాదం వజ్ర సంకల్పంతో ప్రతిపాదించింది. కనుక కాలం గడిచిన కొద్దీ వజ్రం మరింత గట్టిపడుతుంది. పరంపరలో సానలు తీరి ప్రకాశిస్తుందని చాలామందిలా నేనూ నమ్ముతాను.

పేరడీలు/ జ్యోతి కాలమ్స్

5th photoనా లైబ్రరీలో “ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా” వచ్చి చేరింది. రాండమ్ హౌస్ డిక్ష్నరీ నా కల. అరవిందుని సావిత్రి యింకా మరికొన్ని. సంఖ్య కోసమో, చాలా కనిపించాలనో పుస్తకాలు చేర్చడం అనవసరపు ప్రయాస అని తొలినాళ్ళలోనే గ్రహించాను. బాపిరాజు, విశ్వనాథల నవలలు, జాషువా కవిత్వం, ముద్దుకృష్ణ వైతాళికులు, శ్రీశ్రీ, తిలక్, చలం పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదువుకునేవాణ్ణి. కుటుంబరావు, బుచ్చిబాబు, శ్రీపాద, ముళ్ళపూడి, ఆనాటి పాప్యులర్ రచయిత్రుల్ని రంగనాయకమ్మని చదివాను. “రామాయణ విషవృక్షం” చదివాక ఆమెలో కొంత అయోమయం వుందనిపించింది. మనం సృష్టించని పాత్రల్ని మనం సవరించే బాధ్యత మీద వేసుకోకూడదు. గిరీశం అలా ప్రవర్తించలేదు, యిలా ప్రవర్తించివుంటాడని వందేళ్ళ తర్వాత మనం చెబితే గిరీశం కంటే హాస్యాస్పదంగా తయారవుతాం. ప్రజల నమ్మకాలు విశ్వాసాలు ముడిపడివున్న వాటి జోలికి పోవడం మర్యాద కూడా కాదు.

సొంత శైలి గల రచయితల్ని చదివాక, అప్పుడప్పుడు పేపర్ చదువుతూ — యిదే వార్తని గురజాడ రాస్తే, విశ్వనాథ లేదా బాపిరాజు రాస్తే… అని వూహించేవాణ్ణి. నాకే తమాషాగా అనిపించింది. అప్పుడు వచ్చింది పేరడీ ఆలోచన. వచనంలో అప్పటికి పేరడీ ఒక ప్రక్రియగా రాలేదు. జరుక్, మాచిరాజు దేవీ ప్రసాద్ గురించి తెలుసు. ఒకటి రాసి ఆంధ్రజ్యోతి (డైలీ)కి పంపాను. నాలుగు రోజుల్లో నండూరి రామమోహనరావు ప్రచురిస్తున్నామనీ, బావుందనీ, రాయండనీ పెద్ద ఉత్తరం రాశారు. 21, 22 ఏళ్ళ వయసులో ఆ వుత్తరం ఎంత నిషా! ఇక చూస్కోండి! వరసపెట్టి రాసేశాను. ఆయన వేసేశారు. పైగా ప్రతిసారీ ఒక పెద్ద ఉత్తరం అందులో మెచ్చుకోళ్ళు. నా ఆప్తమిత్రులు బాపు రమణ కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారని రాశారు. అలా గాలి మీద నడుస్తూ, నేను ఆంధ్రజ్యోతిలో కాలమ్ రాస్తాన్సార్ అని జాబు రాశాను. భలే వారే, రాయండి అన్నారు. “రంగుల రాట్నం” పేరుతో ఆంధ్రజ్యోతి డైలీలో ప్రతి మంగళవారం ఎడిట్ పేజిలో వచ్చేది. మొదటి పేజిలో చిన్న బాక్స్‌లో “రంగుల రాట్నం” ప్రకటన వుండేది. ఈ విధంగా వారానికి రెండుసార్లు “శ్రీరమణ” పేరు పెద్దక్షరాలలో అచ్చులో కనిపించేది. ఆ రోజుల్లో విజయవాడ నుంచి ఒకే ఎడిషన్‌గా ఆంధ్రజ్యోతి వెలువడేది. అయితే దీనికి యీవెనింగ్ ఎడిషన్ కూడా వుండేది. అదే రాయలసీమకు మర్నాటి ఉదయపు ఎడిషన్‌గా వెళ్ళేది.

సంజీవదేవ్‌తో…

ప్రఖ్యాత సాహితీవేత్త, చిత్రకారులు అన్నిటినీ మించి గొప్ప మానవతావాది, అతిధేయుడు అయిన సంజీవదేవ్‌తో అప్పటికే పరిచయం వుంది. వారానికి కనీసం ఒక్కసారైనా తుమ్మపూడి వెళ్ళడం, వారింట (“రసరేఖ”) కమ్మని భోజనం ఫలహారాలు ఆరగించడం ఒక వ్యసనం అయింది. నేను కేవలం ఇంటావిడ సులోచన వండి వడ్డించే ప్రశస్థమైన భోజనం కోసం వస్తున్నానని ఇంటాయన పసికడతాడేమోనని కొంచెం సాహిత్య విషయాలు కూడా ప్రస్తావించేవాణ్ణి. చివరిదాకా పట్టుబడకుండా లాగించాను. ఇది నా క్రియేటివ్ టాలెంట్‌కి గీటురాయి! మా యిద్దరికీ ఒక బాదరాయణ సంబంధం వుంది. సంజీవదేవ్ 17, 18 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా హిమాలయాలకు పారిపోయారు. నేను కూడా అదే వయసులో రామకృష్ణమిషన్ ప్రత్యేక ఆహ్వానంపై హిమాలయాలకు వెళ్ళాను. ఆల్మోరా జిల్లాలో “మాయావతి” అని ఒక ప్రదేశం. అక్కడ మాయావతి పేరుతో చిన్న నది వుంది. అక్కడ బ్రిటిష్ దంపతులు కెప్టెన్ సేవియర్, మదర్ సేవియర్ తమ ఎస్టేట్‌ని వివేకానందకు సమర్పించారు. వారు స్వామి వివేకానంద శిష్యులు. అక్కడ మిషన్ హెడ్‌ క్వార్టర్స్, ఒక ఉచిత హాస్పిటల్ వుండేవి. అక్కడ అయిదారుగురు స్వామిజీలు మాత్రం వుండేవారు. మిషన్ నడిపే ప్రబుద్ధ భారత (Awakened India) మంత్లి ఎడిటోరియల్ బోర్డు అక్కడ వుండేది. దాని ప్రింటింగ్ వగైరా కలకత్తా (నరేంద్రపూర్) నుంచి నిర్వహించేవారు. అక్కడ స్వామీజీల తోబాటు, వారి ప్రత్యేక ఆజ్ఞపై వెళ్ళి వున్నాను. అదొక గొప్ప అనుభవం. వరసగా ఆరేళ్ళు వివేకానందునిపై వేర్వేరు వ్యాసాలు రాసి బహుమతి పొందాడని నన్ను పిలిచారు. అక్కడికి దేశవిదేశాల నుంచి బోలెడు పత్రికలు వచ్చేవి. అక్కడ “త్రివేణి” కనిపిస్తే ప్రాణం  లేచి వచ్చింది. బందరు నుంచి వచ్చే ఆంగ్ల “త్రివేణి”కి ఎంతో పేరుండేది. భావరాజుని చూశావా అని అడిగారు స్వామీజీలు. చూశానని నిజం చెప్పాను. ఆశ్రమంలో నాకో సువిశాల భవనంలో బస. కొయ్య పలకలతో నిర్మించిన భవంతి. అందులో మునుపెప్పుడో రవీంద్రనాథ్ ఠాగోర్, జె.సి. బోసు లాంటి మహానుభావు కొంతకాలం వున్నారట. వృక్షాలకు ప్రాణం వుందని తెలియచెప్పిన జె.సి.బోసు — పొద్దున పూట, సాయంత్రం వేళ అలా నడిచి వెళ్తుంటే చెట్లు తలవంచి నమస్కరించేవట! ఇది కొంచెం అతిశయోక్తే కావచ్చుగాని ప్రాణమున్న చెట్లకి ఆయన పట్ల ఆమాత్రం గౌరవం వుండి వుండచ్చు కదా. అక్కడ చాలా గొప్ప లైబ్రరీ వుంది. ఠాగోర్, వివేకానంద లాంటి మహనీయుల చేతి రాతలు అక్కడ చూశాను. రవీంద్రుని “Home Coming” కథ ఆయన దస్తూరితో చదివాను. చాలదా యీ జీవితానికి?

సంజీవదేవ్ యిల్లు గొప్ప సాంస్కృతిక కేంద్రంగా వుండేది. మా తెనాలికి పదిహేను మైళ్ళలో తుమ్మపూడి. ఊరి పక్కనుంచి బకింగ్‌హామ్ కాలవ. ఆ కాలవ దాటితే చిన్నపాలెం, పెద్దపాలెం. అక్కడే మోరంపూడి. కొంగర జగ్గయ్య స్వగ్రామం. రాహుల్ సాంకృత్యాయన్ నుంచి ఎందరో విశ్వవిఖ్యాతులు “రసరేఖ”లో సేద తీరారు. నేను నిలయ మరియు నిలవ విద్వాంసుణ్ణి కనుక అక్కడ పెద్దవాళ్ళతో పరిచయాలు అయేవి. పలు సందర్భాలలో నేమ్ డ్రాపింగ్‌కి వుపయోగపడేవి. వారింట వుండటమేగాక ఎప్పుడూ వూళ్ళు తిరిగే సరదావున్న సంజీవదేవ్‌తో కూడా వెళ్ళడం అలవాటు చేశాను. కొన్నాళ్ళకి వెంట నేను లేకపోతే ఆయనని ప్రజానీకం గుర్తుపట్టని పరిస్థితి కల్పించాను. బెంగుళూరులో, శాండల్‌‍వుడ్ ఎస్టేట్ యజమానులుగావున్న సెతల్వొ రోరిక్ (నికొలస్ రోరిక్ కుమారుడు) దేవికారాణి గారింట ఆయనతో గడిపాను. నికొలస్ రోరిక్ ప్రసిద్ధ రష్యన్ చిత్రకారుడు. ఆయన హిమాలయాల్లో స్థిరపడి, వందలాది చిత్రాలు హిమాలయ థీమ్ మీదనే వేశారు. సంజీవదేవ్ ఆయనతో కొంతకాలం వున్నారు. పెళ్ళికానుకగా సంజీవదేవ్‌కి పంపిన “దిగంగ” అనే రోరిక్ మాతృక తుమ్మపూడిలో వుంది. కొన్ని సంవత్సరాల సాన్నిహిత్యంలో ఆయన పరిచయాలన్నీ నాకూ కాస్తో కూస్తో అంటుకున్నాయి. పైన మనవి చేసినట్టు ఇప్పటికీ నేమ్ డ్రాపింగ్‌‍కి ఎంతగానో ఉపయోగపడే అవకాశం వచ్చింది. ప్రముఖ చిత్రకారుడు ఎస్వీ రామారావుని, వి.ఆర్. నార్లని యిలాంటి అనేకానేక ప్రముఖుల్ని అక్కడే చూశాను. సంజీవదేవ్ కూడా మా యింటికి వచ్చేవారు. ఆయన వస్తున్నారని చాలామంది సాహితీ ప్రియులు కూడా వచ్చేవారు. మా వూరంతా సందడిగా మారేది. ఇలా కాలక్షేపం జరుగుతూ వుండగా —

ఆంధ్రజ్యోతి నుంచి జాబు

పోజు లేని గొప్ప ప్రోజు రైటర్. అందగాడు. యాభైల్లో వున్న నండూరి ఓ పదేళ్ళు తొక్కేసి చెబితే ఎవ్వరూ అనుమానించరు.

ఆంధ్రజ్యోతి నుంచి నండూరి రామమోహనరావు ఒకసారి రమ్మని జాబు రాశారు. కొన్నేళ్ళుగా ఆంధ్రజ్యోతికి రాస్తున్నా నేను వారిని కలవలేదు. వారు నన్ను చూడలేదు. ఆంధ్రజ్యోతి ఆఫీస్‌కి వెళ్ళాను. “మీ రాతలు చూసి మినిమమ్ అరవై అనుకున్నా…” అని ఆశ్చర్యపోయి అభినందించారు. ఆయనని నేను ఒకటి రెండు సందర్భాలలో దూరం నుంచి చూశాను. పోజు లేని గొప్ప ప్రోజు రైటర్. అందగాడు. యాభైల్లో వున్న నండూరి ఓ పదేళ్ళు తొక్కేసి చెబితే ఎవ్వరూ అనుమానించరు. సాయంత్రం దాకా కబుర్లు చెప్పి, వెళుతూ వెళుతూ ఇంటికి తీసికెళ్లారు. రేడియో స్టేషన్ ఎదురు సందులో (పున్నమ్మ తోట) మేడ మీద వుండేవారు. మేము కొత్తగా మూడు పేపర్లు పెట్టాలనుకుంటున్నాం. “వనితా జ్యోతి, బాల జ్యోతి, యువ జ్యోతి — మీరు వస్తే సంతోషిస్తాను” అన్నారు. ప్రస్తుతం జీవితం బావుంది. స్వేచ్ఛగా కాలం గడుస్తోంది. సంజీవదేవ్ పరిచయం మరింత ప్రభావితం చేసింది. ఉత్తరాలు రాస్తూ, అందుకుంటూ; చదువుకుంటూ; ఇష్టమైన మిత్రుల్ని కలుస్తూ పిలుస్తూ; పొలం గట్లన తిరిగివస్తూ; వెళ్ళాలనిపించిన చోటికి సంచి సర్దుకు వెళ్ళిపోతూ ఎంతో బావుంది. కొంచెం ఆలోచించుకుని చెబుతానన్నాను. మొత్తం మీద ఆ పూటే “సరే” అనిపించేలా చేశారు నండూరి. నండూరి, పురాణం చాలా బలమైన సూదంటురాళ్లు. నాలాంటి గుండు సూదిని లాగలేరా! నండూరి “కాంచనద్వీపం” “టామ్‌సాయర్” ఆ వచనశైలి చిన్నప్పుడు ఎంత అలరించాయి. తరువాత రాసిన “నరావతారం”, “విశ్వరూపం” అనితరసాధ్యం. “విశ్వదర్శనం” రాసే నాటికి నేను సలహాలిచ్చేంత పెద్దవాణ్ణి అయాను. కాని ఒక్కటి కూడా స్వీకరించకపోవడం వారి విజ్ఞతకి తార్కాణం. అలాగ ఆంధ్రజ్యోతి సంపాదకవర్గంలో నేను సైతం ఒక కలం అయాను. జీవనశైలి మారింది. పురాణం, నండూరి కోసం ఎందరో గొప్ప గొప్ప వాళ్లు వస్తూండేవారు. బాపురమణ ముఖ్యులు. ఆరుద్ర, రావిశాస్త్రి, కాళీపట్నం, చాసో, సోమసుందర్, సినారె, భమిడిపాటి జగన్నాథరావు, భరాగొ, విజయవాడ ఆకాశవాణి మొత్తం, ఐజె రావు, జ్యేష్ట, ఆదివిష్ణు, గొల్లపూడి. . . ఒకరేమిటి, యు నేమిట్. వడ్డెర చండీదాస్ “హిమజ్వాల”, శంకరమంచి సత్యం “అమరావతి కథలు” అచ్చులోకి రాకముందు నుంచి నేనెరుగుదును. ఎన్నో “ఇల్లాలి ముచ్చట్లు” పురాణం చెబుతుంటే నేను రాశాను. తర్వాత పెట్టాలనుకున్న మూడు మాసపత్రికల్లో రెండు పెట్టారు. “యువ జ్యోతి” ప్రారంభించలేదు. అప్పటికే “జ్యోతి చిత్ర” వస్తోంది. నేను ఆ పత్రికల కంటే ఆంధ్రజ్యోతి వీక్లీ పని, జ్యోతి డైలీ, ఆదివారం సాహిత్యానుబంధం ఎక్కువ చూసేవాణ్ణి. తెగ రాసేవాణ్ణి. ఒకసారి బాపు రమణ వచ్చి “శరత్ కథా చంద్రిక” అని టైటిల్ చెప్పి, శరత్ నవలల్ని సంక్షిప్తంగా రాయించండి అని సలహా యిచ్చారు. వెంటనే నండూరి ఆ పని నాకు అప్పగించారు. ఆఖరికి “శ్రీకాంత్” లాంటి భారీ నవలను కూడా ఎనిమిది కాలాల్లోకి దించాను. ఒక ఫైన్ మార్నింగ్ నండూరికి మద్రాస్ నుంచి వుత్తరం వచ్చింది. కొడవటిగంటి రాశారు. “అన్యాయం, వుత్సాహం వుందని అంతలా రాయించకూడదు. శ్రీరమణని చూడాలని వుంది. తీసుకు రాకూడదూ” అని కార్డు రాశారు. కొ.కు ఆంధ్రవారపత్రికలో నండూరికి పైవారు. గురుతుల్యులు. వెంటనే మద్రాస్ వెళ్ళాం. అప్పుడాయన విజయ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకుంటున్నారు. మేమంతా తెనాలి వాళ్ళమేనని తెలుసుకుని మరింత ఆనంద పడ్డాం. తెనాలిలో ఎంతమంది జీనియస్‌లు పుట్టారు? అదో పెద్ద గ్రంథం.

బాపు రమణలు — సినిమా

ఓ రోజు బాపురమణ విజయవాడ వచ్చినపుడు, ఆంధ్రజ్యోతి ఆఫీస్‌కి వచ్చారు. నా టేబుల్ దగ్గర కొచ్చారు. బాపు, “నా కార్టూన్స్‌ని నవోదయా వారు పుస్తకంగా వేస్తామన్నారు. ఇదే నా మొదటి బుక్కు. మీరు ముందుమాట రాస్తే సంతోషం” అన్నారు. అరె! తప్పకుండా… ఎప్పటిలోగా యివ్వాలన్నాను ఆదుర్దాగా. బాపు నవ్వేసి అంత కంగారు లేదు, టేక్ యువరోన్ టైమ్ అని స్థిమిత పరచారు. నిజానికి అలా అనకూడదట. నేనేంటి, మీ పుస్తకానికి రాయడమేంటి, అని కొంచెం మొహమాటం ప్రదర్శించాలిట. నాకేం తెల్సు. వెంటనే రాసిచ్చేశాను కూడా. తర్వాత ఓ ఫైన్ యీవెనింగ్ బాపురమణలు అన్నారు కదా — “ఇంక యింతే, పేపర్లు రోజూ అలా గుద్దేస్తూ వుంటారు. ఇలా అయిపోతూ వుంటాయ్. ఇదొక రొటీన్. మీరు మద్రాస్ వచ్చెయ్యండి” అని ఆశపెట్టారు. అప్పటికే సింగీతం శ్రీనివాసరావు సినిమాకి (“గందరగోళం”) మాటలు రాశాను. ఇంకా కొన్ని కథా చర్చల్లో పరుపుల మీద కూచున్న అనుభవం వుంది. “జై పరమేశ్వరా” అని మద్రాసు చెక్కేశాను.

పొలం గట్ల మీద తిరుగుతూ, అందమైన సూర్యాస్తమయాలను చూస్తూ వుండేవాణ్ణి మద్రాస్ మెరీనా బీచ్‌లో పైకి లేచే సూర్యుణ్ణి చూస్తున్నాను. బావుంది. ఇదొక కొత్త అనుభవం. పైగా వున్నది బాపురమణలతో. వారిల్లు ఒక టోల్ గేట్. సినిమా ప్రముఖులే కాదు, సాహిత్య సంగీత కళారంగాలకు చెందిన వారందరినీ అక్కడ ప్రత్యక్షంగా దర్శించుకునే భాగ్యం కలిగింది. దాదాపు ఇరవై ఏళ్ళకు పైబడి అక్కడే వారితోనే వున్నాను. మధ్యలో ఎన్.టి.ఆర్ వీడియో పాఠాలు తీయమంటే తరచు హైదరాబాదు వస్తుండే వాళ్లం. ఎక్కువగా నేను రమణగారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో బస. ఎర్రదీపం కారులో తిరిగేవాళ్లం. హైదరాబాదు వచ్చినపుడల్లా యాదగిరి గుట్ట వెళ్లేవాళ్లం. సినిమాలు ఒక ఎత్తు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను చిత్రీకరించి, వ్యాఖ్యానంతో మంత్ర సంగీత సహితంగా వాటిని రూపొందించడం ఒక ఎత్తు. ఎంత చిన్నపని అయినా శ్రద్ధాసక్తులతో దీక్షగా చేయడం బాపురమణల స్కూలు. శ్రీ భాగవత కథలు స్క్రిప్ట్ వర్క్ సగానికి పైగా పూర్తయేదాకా మద్రాసులోనే వారితోనే వున్నాను. భాగవతానికి ఆరుద్ర, వేటూరి, జొన్నవిత్తుల పాటలు రాశారు. ధృవోపాఖ్యానం, రామలాలి పాట జొన్నవిత్తుల గొప్పగా రాశారు.

క్షీరసాగర మథనంకి వేటూరి రాసిన పాట అమృత తుల్యం. సుందరకాండని సంపూర్ణంగా ఆరుద్ర రాసి పుణ్యం కట్టుకున్నారు.

మళ్ళీ హైదరాబాద్‌కి

6th photoహైదరాబాదు వచ్చేశాను. అయినా ఇప్పటికీ బాపురమణలతో వున్నట్టే లెక్క. ఇక్కడికి రాగానే మిత్రులు శ్రీకాంత శర్మ ఆంద్రప్రభ వీక్లీ ఎడిటర్‌గా వున్నారు. షరా మామూలే అన్నట్టు కాలమ్ రాయించడం, తర్వాత నాతో పాటు మీరు కూడా. . . అన్నారు. వుద్యోగ అవసరం కూడా వుంది జై అంటూ జాయిన్ అయ్యాను. ఆంధ్రప్రభ వీక్లీలో రెండేళ్ళపాటు ఎంతో ఆనందంగా నడిచింది. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సంస్కృతాంధ్రాలు, ఆంగ్లంలో కూడా తగిన పరిశ్రమ చేసిన వారు. నాకు ఏనాటి మిత్రుడు! “కృష్ణావతారం” (సాంఘికం) సినిమాలో తొలి సినిమా పాట ఆయనతో బాపు రమణలే రాయించారు. ఆనక జంధ్యాల దర్శకత్వంలో, యింకా అక్కడక్కడా 40 పాటలు దాకా రాశారు. ఆంద్రప్రభలో ఆయన నాలుగేళ్ళ కాల పరిమితి ముగియగానే విరమించుకున్నారు. నేనూ విరమించుకున్నాను.

అప్పుడే “వెబ్‌సైట్ల” బూమ్ మొదలైంది. నీహార్ ఆన్‌లైన్ వారిదే సరసమ్ పోర్టల్. ఆ పోర్టల్‌ని నేను నింపాలి. మోహన్ బొమ్మలు. మొత్తం హాస్యం. దాదాపు వంద వారాలు మేమిద్దరం అనేకానేక హాస్యప్రయోగాలు చేశాం. పోర్టల్ 60 దేశాల్లో లక్షల క్లిక్స్‌తో క్లిక్ అయింది. సైట్ మాత్రం నిలవలేదు. మా లోపం లేదు. ఇంతలో ఆంధ్రజ్యోతి (అప్పటికి మూతపడి రెండేళ్ళు) పునఃప్రారంభం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐ. వెంకట్రావ్ (ఐ.వి.ఆర్) కొత్త యాజమాన్యానికి, యజమానులకు మధ్య సంధానకర్తగా వుండి సెటిల్ చేశారు. నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో వుండగా ఐ.వి.ఆర్ చీఫ్ రిపోర్టర్. నండూరి నమ్మే ఒకరిద్దరిలో ఐవిఆరే ఒకరిద్దరు! కొత్త ఆంధ్రజ్యోతికి కె. రామచంద్రమూర్తి ఎడిటర్‌గా పగ్గాలు పట్టారు. ఐ.వి.ఆర్ పట్ల నాకు గౌరవం, నా పట్ల ఆయనకు అభిమానం — అప్పట్నించీ (1974). ఐ.వి.ఆర్ తర్వాత అంధ్రజ్యోతి ఎడిటర్ అయారు. అనేక ఎడిషన్లుగా విస్తరించింది. ఐ. వెంకట్రావ్ ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి స్వీకరించారు. సంస్థకి గుర్తింపు, సొంతభవనం ఆయన హయాంలోనే సంక్రమించాయి. సరిగ్గా తొమ్మిదేళ్ళ క్రితం “పత్రిక” (మన మాస పత్రిక) పేరుతో ఒక మాస పత్రిక ప్రారంభించారాయన. ఐదురూపాయల వెలతో ఇప్పటికీ అది రెగ్యులర్‌గా వస్తూనే వుంది. దానికుండే పాఠకులు దానికున్నారు. అయితే, ఆయన ఆంధ్రజ్యోతికి రమ్మని పిలిచారు. మాతృసంస్థ కదా. పైగా ఏదో ఒకటి చెయ్యాల్సిన అవసరం వుంది. ఆంధ్రజ్యోతిలో “రిసోర్స్ ఎడిటర్” పేరు మీద చేరిపోయాను. అన్నట్టు, మర్చిపోయాను. తొలి ఆంధ్రజ్యోతి హయాంలో పెళ్ళైంది. నేను పుట్టిన సంవత్సరం పెద్ద గాలివాన వచ్చి మా పాతికెకరాల అరటితోట కోతకి వచ్చింది పడిపోయిందట! పెళ్ళి కాగానే (దివిసీమ అత్తవారి వూరు) దివిసీమ  తుఫాను వచ్చి దేశ చరిత్రలో గొప్ప బీభత్సంగా నమోదైంది. అదీ మన కాళ్ల మహత్యం!

రెండేళ్ళ క్రితం ఐ.వి.ఆర్ అమెరికా నుంచి ఫోన్ చేసి న్యూస్ ఛానెల్ పెడుతున్నట్టు చెప్పారు. ఆయన మాటతో పని లేకుండానే నేను ఛానెల్‌లో వుంటానని, వున్నట్టే భావించాను. నిజానికి నేను లేకపోయినా ఛానెల్ నడిచిపోతుంది. అప్పటికే ఆంధ్రజ్యోతి సంస్థ వీక్లీ ప్రారంభించింది “నవ్య” పేరుతో. దాని సంపాదకత్వ బాధ్యతలు నాకు అప్పగించారు. ఎప్పుడూ నా వృత్తిని, బాధ్యతని గౌరవించాను. అందుకు నాకు దక్కాల్సిన గౌరవం దక్కింది. ఏడాది క్రితం మహా ఛానెల్‌కి వచ్చాను. ఈ కొత్త లోకం చూడాలని ఆశ. ఇద్దరు అబ్బాయిలు. చదువులు పూర్తి చేసి యిప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. పత్రికలు, సినిమాలు, వెబ్‌సైట్స్, న్యూస్ ఛానెల్ దాదాపు ప్రముఖ మాధ్యమాలన్నీ చూశాను. కొన్ని సంగతులు తెలుసుకున్నాను. కొంత సందడి చేశాను.

కథలు

7th photoమిఠాయి కొట్లో పొద్దస్తమానం వుండే వాళ్లకి మిఠాయి మీద యిష్టం పోతుంది. అలాగే, నేను ఆంధ్రజ్యోతిలో చేరడం వల్ల ఆఘ్రాణ దోషం అంటుకుంది. అరవైదశకంలో రా.వి. శాస్త్రి, కాళీ పట్నం ముమ్మరంగా రాస్తున్నారు. జ్యేష్ఠ, హవిస్, దనిష్ఠ, భజరా, స్మైల్, మధురాంతకం, ఆదివిష్ణు, విహారి-శాలివాహన, శాయి – రాంబాబు, చంద్ర, ద్వివేదుల విశాలక్షి, డి. వెంకట్రామయ్య, భరాగో, ద్విభాష్యం, వాకాటి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, సత్యం శంకరమంచి అద్భుతమైన కథలు రాస్తున్న రోజులు. ప్రతి రోజూ ఆఫీస్‌కి వచ్చేవారి కథల్ని వేడి వేడిగా వారి దస్తూరిలో చదివే అదృష్టం పట్టింది. పురాణం మంచి కథకులు. “ఇల్లాలి ముచ్చట్లు” సరేసరి. పురాణం “శివకాంత”, “సంతకం”, “ఉప్పు బస్తాలు” అప్పుడు రాసినవే. అందుకని నాకు కథలు రాయాలనే తాపత్రయం వుండేది కాదు. పైగా “కాలమ్” రాసేటప్పుడు బుర్రలోంచి చాలా సరుకు ఖాళీ అయిపోతుంది. నాలాంటి సామాన్య రచయితకి ఆలోచనల కరువు తీవ్రంగా వుండేది. పైగా ఇంతమంది యిన్ని గొప్ప రచనలు చేస్తుండగా నా రంగ ప్రవేశం అవసరమా అనే ఆలోచన నన్ను కథ, నవల రచనల నించి నిలవరించేది.

నీతి చంద్రిక కథలు నాకు చాలా యిష్టం. అందునా చీమ – పావురం; పాము – రత్నాల హారం లాంటి కథలు మరీమరీ యిష్టం. తరువాత ఎప్పటికో తెప్పరిల్లి, “బంగారు మురుగు” కథ రాశాను. చాలామందికి నచ్చింది. ఏడాదికో కథ అన్నట్టు “ధనలక్ష్మి”, “షోడానాయుడు”, “పెళ్ళి” యిలా కొన్ని రాశాను. 1998లో “మిథునం” కథ రాశాను. ఇది కూడా చాలామందికి నచ్చింది. కొందరు ఆక్షేపించినవారూ వున్నారు. “బ్రాహ్మణ వంటలు, తిండి, తప్ప అందులో ఏముంది. పైగా వివాహ వ్యవస్థని పల్లకీలో వూరేగించడం కడు ధూర్తము” అని కొందరు చివాట్లు పెట్టారు. దీనికి కథా సంపుటాలలో చేర్చేటంత దృశ్యం లేదని తెలుగు కథకి గార్డియన్‌లుగా చెలామణి అవుతున్న కథావులు (కథ + మేధావులు) తేల్చారు. మనకి స్వాతంత్ర్యం వచ్చి 50 యేళ్ళు అయిన సందర్భంగా, తెలుగులో వచ్చిన మంచి కథల్లోంచి 50 కథల్ని ఎంపిక చేసి “బంగారు కథ” సంపుటిని సాహిత్య అకాడెమీ ప్రచురించింది. అందులో “బంగారు మురుగు” కథ వేశారు. అది అన్ని భారతీయ భాషలలోకి అనువాదితమైంది.

ఇక “మిథునం” గురించి. కథ చదివి అభిప్రాయం చెప్పండని బాపుకి యిచ్చాను. తెల్లారి పొద్దున అన్ని పేజీలు తన దస్తూరిలో రాసిచ్చారు బాపు. కథకి జరిగిన మొట్టమొదటి గొప్ప గౌరవం యిది. దాన్ని “దస్తూరి తిలకం”గా రచన – యింటింటి మాస పత్రిక రెండుసార్లు ప్రచురించింది. “కథ” జాతీయ అవార్డ్ లభించింది. పలు భారతీయ భాషలతో బాటు నాలుగు విదేశీ భాషల్లోకి కూడా వెళ్లింది. అమెరికాలో వుండే సాహిత్యాభిమాని డాక్టర్ జంపాల చౌదరి బాపు దస్తూరిలో వున్న కథని కోరిన వారందరికీ జిరాక్స్ కాపీలు పంపారు. బోలెడు అభినందనలు. రేడియో నాటికగా, స్టేజ్‌ప్లేగా వచ్చింది. ప్రముఖ రచయిత, దర్శకులు, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత ఎమ్.టి. వాసుదేవన్ నాయర్ మళయాళంలో (ఉరు చిరు పుంజరి / A slender smile) సినిమాగా తీశారు. వారి వాతావరణానికి కావల్సిన మార్పులు చేసుకున్నారు. ఏషియా ఫిలిమ్ ఫెస్టివల్‌లో, మరికొన్ని చోట్ల బహుమతులు వచ్చాయి. అవన్నీ వాసుదేవన్ ప్రతిభకి వచ్చినవే గాని కథకి కాదని నా నమ్మకం. “మిథునం” కథా సంపుటి చాలా ఎడిషన్లు పడింది. ఈ పదేళ్లలో ఎన్నో మంచి మాటలు ఆ కథ గురించి విన్నాను. [ఎవరైనా చేయూతనిస్తే, “మిథునంకి పదేళ్లు” అని పది సెంటర్లలో దండోరా వేసి దండలు వేయించుకోవాలని వుంది. కాని ఇటీవలి వరదల్లో మా ప్రాంతం ఆర్థికంగా దెబ్బతిన్నది. కనీసం పుష్కరానికైనా దీని సంగతి చూడాలి.]

ఎక్కువమందికి చేరి, ఎక్కువ మందికి అర్థమై, ఆరోగ్యకరమైనదే గొప్పరచన అనుకుంటాను. నాకు బొత్తిగా అర్థం కానప్పుడు ఎందరు మెచ్చుకున్నా నాకేమీ ప్రయోజనం వుండదు. సందేశాల మీద నమ్మకం లేదు. ఇప్పటికీ నాకు రాయడం కన్నా మహానుభావుల రచనలు చదువుకోవడంలోనే ఆనందం ఎక్కువ. ఎందుకంటే మనం మన సొంత ఆలోచన అనుకున్నది ఎవరో ఎక్కడో ఎప్పుడో రాసే వుంటారు. జగద్గురువు శంకరుని మిథ్యావాదాన్ని ఆరాధిస్తాను. దానివల్ల నా మనసుకెంతో సాంత్వన. భారతీయ ఇతిహాసాలను అర్థమైన మేరకు గౌరవిస్తాను. మానవ నైజాలను వేదికపై చూపించే రామాయణ భారతాలను మనసుకి అద్దుకోవాలనుకుంటాను. భారతంలో “ఒరులేయవి యొనరించిన…” పద్యాన్ని మహాసూక్తిగా భావిస్తాను. దేవుడంటే భ్రమ లేదు గాని నమ్మకం వుంది. దయని మించిన దేవుడు లేడనుకుంటాను. సింప్లిసిటీని మించిన మానవత లేదనుకుంటాను. ఎక్కడైనా కొన్ని అతిశయోక్తులు చాపల్యం కొద్దీ దొర్లివుంటే పెద్దమనసుతో మన్నించండి. సెలవు.

శ్రీరమణ
తేదీ: 01 జనవరి, 2010
ఫోన్: 040 – 23514358

X —— X —— X

రచనా సంచయం

అచ్చయిన పుస్తకాలు:

శ్రీరమణ పేరడీలు
ప్రేమ పల్లకి (నవల)
రంగుల రాట్నం (కాలమ్)
శ్రీఛానెల్
హాస్య జ్యోతి
నవ్య మొదటి పేజి
గుత్తొంకాయ్ కూర – మానవ సంబంధాలు
శ్రీకాలమ్
మిథునం (కథా సంపుటి)
శ్రీరామాయణం

రావల్సినవి:

మహాభారతం (విరాట వుద్యోగ పర్వాలు)
మొదటి పేజి (II)
మానవ సంబంధాలు
సరసమ్.కామ్ (5 సంపుటాలు)
శ్రీరమణీయం
సింహాచలం సంపెంగ (కథా సంపుటి)
బొమ్మ – బొరుసు (రూరల్ ఎకానమీ కథా కమామిషు)
ఇతరత్రా
—— ఇవన్నీ కలిసి సుమారు ఇరవై చిన్న సంపుటాలు రావల్సి వుంది.

నడిపిన శీర్షికలు (కాలమ్స్):

రంగుల రాట్నం
జేబులో బొమ్మ
టీ కప్పులో సూర్యుడు
శ్రీఛానెల్
శ్రీకాలమ్
పూలు – పడగలు
వెంకట సత్య స్టాలిన్

ప్రస్తుతం:

మహాటీవిలో రిసోర్స్ ఎడిటర్
“పత్రిక” – మాసపత్రిక సంపాదకత్వం
మునిమాణిక్యం మోనోగ్రాఫ్ (కేంద్ర సాహిత్య అకాడెమీ కోసం)
మరో విస్తృత ప్రాజెక్టు

కృతజ్ఞతలు: ఈ ఇంటర్వ్యూ గురించి అడిగిందే తడవుగా రమణ గారిని సంప్రదించి ఒప్పించటమే కాక విలువైన సంగతులు జారిపోకుండా రాబట్టాలని తపన పడి, మొత్తం పాఠాన్ని టైపించి మరీ సహకరించిన ఫణీంద్ర గారికి పొద్దు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

Posted in వ్యాసం | Tagged , | 14 Comments

శ్రీ రమణీయ చానెల్ – మొదటి భాగం

ఆయన కథలు… శ్రావణ మాసపు నోముల్లో ఆది దంపతులు పోటీలు పడి పంచుకు తిన్న తాలింపు శనగలంత కమ్మగా ఉంటాయి.

కవితల్నీ వచనాల్నీ ఆత్మలోకంటా చదివేసి పారడీ చేస్తే అసలు రచయితలు పెన్నులు తడుముకునేలాగుంటాయి.

కొంటెగా చమత్కార చమక్ తారల్ని నిశ్శబ్దపు చీకట్ల మీద చల్లితే, నవ్వుల వెన్నెల్ని ఆరబోయించే చెకుముకి పత్రికా ఫీచర్లూ నడిపారాయన.

“బాల్యం చూసేవారికి బావుంటుంది. యవ్వనం అనుభవించే వారికి బావుంటుంది.” అని కన్ఫ్యూజన్ లేకుండా అనెయ్యగలరు.
“ఏ ప్రక్రియైనా ఒకే మూసలో వేసి తీసిన కజ్జికాయల్లా ఉండకూడదు. వేటికి అవి స్వేచ్చగా చేతితో వేసిన పకోడీల్లా ఉండాలంటాను.” అంటూ రుచిగా రచయితల వీపు చరచగలరు.

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారన్నట్టు మన పేర్లు చెప్పకుండా మన ఫోటోల నెగెటివ్ లని, మన రక్తమాంసాల వెనకున్న అసలు రూపాల్ని మనకే చూపించే గడసరి.

గచ్చు మీద కుప్పగా పోస్తే గుప్పెట నిండుగా గుండెకు హత్తుకోవాలనిపించే నీలపు గోళీల్లాంటి అక్షరాల ఆటలో నేర్పరి.

ఇన్ని కథలు రాశారు, మీ కథ చెప్పరూ అని అడగడానికి ఫోన్ చేస్తే ఏ భేషజమూ లేకుండా “నేనండీ రమణ ని” అంటే ఆ సింప్లిసిటీకి ఒక్క క్షణం రాంగ్ నంబరేమో అనిపించింది. తలాతోకా లేకుండా, ఒకదానికోటి సంబంధం లేకుండా అడిగిన ప్రశ్నల్ని చూసి, వాటినో వరస క్రమంలో తన జీవితానికి అన్వయించుకుంటూ ఓపిగ్గా పొద్దు కోసం తన ఆలోచనల్నీ, అనుభవాల్నీ, అభిప్రాయల్నీ పంచుకున్న ’శ్రీ రమణ’ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో..

-పొద్దు

————-

నా గురించి నేను — శ్రీరమణ

1st photoమా వూరు వరహాపురం – అగ్రహారం. వేమూరు మండలం తెనాలికి చాలా సమీపంలో వుంది. తెనాలి – రేపల్లె బ్రాంచిలైనులో వేమూరు స్టేషన్ వుంది. వేమూరికి మైలున్నర దూరంలో వుంది మా వూరు. నాన్న పేరు సుబ్బారావు, అమ్మ అనసూయ. నాన్న మా వూరి స్కూల్ టీచర్, మేనేజర్ కూడా. ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ వుండేవి. ప్రభుత్వం గ్రాంట్ యిచ్చేది. ఎయిడెడ్ స్కూల్ అనేవారు. మా ఇంటిని ఆనుకునే ఎలిమెంటరీ బడి వుండేది. పదిమంది టీచర్స్ వుండేవారు. దాదాపు యాభై ఏళ్ళ క్రితం మాట యిది. అప్పటికి రోజూ సాయంత్రాలు చైత్రము వైశాఖము, ప్రభవ విభవలు తరగతులన్నిటినీ కలిపి చెప్పించే సంప్రదాయం వుంది. సుమతి, వేమన; పాటలూ పాడించేవారు.

నేను వెళ్ళినపుడల్లా ఒకటి రెండు ఫోటోలు తీసేవాడు. పెద్దవాణ్ణి అయాక తెల్సింది బౌనా అంటే ఆయనేనని. సినిమాలో చేరాలనుకున్న వారందరికీ ఆయనే ఫోటోలు తీసేవారు. అగ్రశ్రేణి తారలకు తీశారు. మద్రాసు మకాం మార్చారు.

అప్పట్లో ఫస్ట్‌ఫారమ్‌లో అంటే హైస్కూలులో అడుగుపెట్టాలంటే ప్రవేశ పరీక్ష వుండేది. మా వూళ్ళో అయిదో క్లాసు వరకే (ప్రాథమిక విద్య – ఎలిమెంటరీ) వుండేది. మా బడి పేరు శ్రీరామ హిందూ ప్రాథమిక పాఠశాల. న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య, అక్కయ్య) ఆంధ్ర బాలానందం పక్షాన నడిపే “బాల” మాస పత్రిక మా బడికి తెప్పించేవారు. గృహలక్ష్మి, భారతి మా యింటికి వచ్చేవి.

నాన్నకి చాలా యిష్టాలుండేవి. మొక్కలన్నా చెట్లన్నా, పశువులన్నా ప్రాణం. పూనేలో పెస్టంజీ.పి.పోచా అని పెద్ద అగ్రి కల్చరల్ ఫారం వుండేది. విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, ఆధునిక వ్యవసాయ సూచనలు, హైబ్రీడ్స్, క్రాస్‌బ్రీడ్స్ అన్నీ వారు తయారు చేసేవారు. అక్కణ్ణించి మా ప్రాంతానికి టమేటాని మొట్ట మొదట తీసుకొచ్చింది మా నాన్నే! దీన్నే “రామ ములగ” అంటారు. మా సువిశాలమైన పెరట్లో రంగురంగుల గులాబీలు, ఎర్ర మల్లెలు పూసేవి. పెద్ద తులసి మొక్క వుండేది. ఎంత పెద్దదంటే ఆ చెట్టు కొమ్మల్లో నేను కూచునే వాణ్ణి.

వ్యవసాయంలో కూడా బోలెడు కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారు. మంచి ఎడ్ల జతలు వుండేవి. చిన్న ఆవుదూడలు చెంగనాలతో సావిడి దొడ్డిని సందడిగా వుంచేవి. తువ్వాయిలతో ఆడుకోవడం ఎంత ఆనందం? తెనాలిలో యేజళ్ళ శ్రీరాములని ప్రసిద్ధ పశు వైద్యులుండేవారు. ఆయనకు “అభినవ సహదేవ” అని బిరుదు వుండేది. “గోసేవ” అని ఒక పత్రిక నడిపేవారు. బహుశా తెలుగులో కేవలం పశుగణంపై వచ్చిన మొదటి పత్రిక అదేనేమో! నాన్న ఎప్పుడైనా నన్ను కూడా వాళ్ళింటికి తీసుకు వెళ్ళేవారు. తెనాలి రైలు గేట్ల మధ్య వాళ్ళ యిల్లుండేది. అక్కడ చిన్న చిన్న జింక పిల్లలు, కుందేళ్ళు, రామచిలకలు వుండేవి. వాటితో ఆడుకుంటుంటే పొద్దే తెలిసేది కాదు. తిరిగి రావాలంటే బలే బాధ అన్పించేది. ఇది నా బాల్య జ్ఞాపకాలలో మర్చిపోలేనిది.

ఒకసారి బుజ్జి జింకపిల్లని పెంచుకోవాలని తెచ్చుకున్నాం. కొన్నాళ్ళు బానే వుంది. తర్వాత ఏమైందో పాపం చచ్చిపోయింది. దాన్ని మా పొలం దిబ్బ మీద పూడ్చి పెట్టడం, మా పాలేరు దాని మీద కల్లు ఉప్పు పోయడం నాకు యిప్పటికీ గుర్తొస్తే కలుక్కుమంటుంది. జింకపిల్ల ఇంట్లో నాపరాతి గచ్చు మీద తన గిట్టలతో నడవలేక జారిపోయి పడిపోతూ వుండేది. పట్టుకుచ్చులాంటి లేత పచ్చిక తెచ్చి దాని చేత తినిపించేవాణ్ణి. అది పోయాక ఇల్లంతా బోసి పోయింది. చాలా రోజులు దిగులు ఆవరించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా యిలాంటి పెంపుళ్ళు వద్దని ఇంట్లో అందరూ తీర్మానించారు.

నాన్న తెనాలిలో మరో యింటికి కూడా వెళ్తుండేవారు. కొల్లా కాశయ్య, తాయారమ్మల ఇల్లు. ఆయన ఆ రోజుల్లో తెనాలికి “ది హిందూ” రిపోర్టర్‌గా వుండేవారు. తాయారమ్మ అనాథాశ్రమం, స్కూలు నడిపేవారు. సుప్రసిద్ధ మిమిక్రీ విద్వాంసులు నేరెళ్ళ వేణుమాధవ్ వారి అల్లుడు. సువిశాల ప్రాంగణంలో కొల్లా వారిల్లు వుండేది. రెండుమూడు పొగడ మానులు, వాటి కింద రాతి అరుగులు వుండేవి. నాన్న ఆయనతో వ్యవహారం చేస్తుంటే, నేను బోలెడు పొగడపూలు ఏరి కుప్ప పోసేవాణ్ణి. వచ్చేటప్పుడు నాన్న ఉత్తరీయంలో మూట కట్టుకుని ఇంటికి తెచ్చేవాణ్ణి. వాటిని చూసి అమ్మ చాలా మురిసిపోయేది. బట్టల బీరువాలలో, మడతల్లో జల్లేది. ఆ పొగడ పరిమళం యిప్పటికీ మా బీరువాలలో మూల మూలల చిక్కుకునే వుంది.

మరో తెనాలి ఆకర్షణ ఒక ఫోటో స్టుడియో. అక్కడ చందమామ, పెద్ద కారు, తాజ్‌మహల్ పొరాటు చెక్కతో (ప్లైవుడ్) చేసి, రంగులేసి వుండేవి. ఫోటోల్లో అవి అచ్చం నిజంవిలాగే కనిపించేవి. ఆయన తీసే ఫోటోలే కాదు, ఆయన కూడా అందంగా వుండేవాడు. నేను వెళ్ళినపుడల్లా ఒకటి రెండు ఫోటోలు తీసేవాడు. పెద్దవాణ్ణి అయాక తెల్సింది బౌనా అంటే ఆయనేనని. సినిమాలో చేరాలనుకున్న వారందరికీ ఆయనే ఫోటోలు తీసేవారు. అగ్రశ్రేణి తారలకు తీశారు. మద్రాసు మకాం మార్చారు. విజయచిత్ర కవరు పేజీలు, కలర్ పేజీలు ఆయన ఫోటోలతోనే పాఠకుల్ని అలరించేవి.

నాన్న కాసేపు వెంకట్రామ అండ్ కో దగ్గర, కవిరాజా పబ్లిషర్స్ దగ్గర ఆగేవారు. అప్పట్లో చిన్న తరగతుల పాఠ్య పుస్తకాలు వాళ్ళే అచ్చువేసేవారు. తెనాలి స్టేషన్‌లో హిగిన్ బాదమ్స్‌లో చందమామ కొనిపెట్టేవారు నాన్న. స్టేషన్‌లో ఓ చివరగా ఆర్‌ఎమ్మెస్ (రైల్వే మెయిల్ సర్వీస్) వుండేది. గ్రామాల నుంచి, బస్తీల నుంచి పోస్టు బ్యాగ్‌లు అక్కడికి వచ్చేవి. వాటిని ప్రాంతాల వారీగా విడగొట్టి ఆయా దిక్కులకు వెళ్ళే రైళ్ళలో వేసేవాళ్ళు. కొన్ని గొప్ప రైళ్ళలో ఆర్‌ఎమ్మెస్ భోగీ వుండేది — గూళ్ళు గూళ్ళుగా రైలు ప్రయాణిస్తున్నా అందులో జాబుల సార్టింగ్ జరుగుతూ వుండేది. అన్నట్టు చెప్పనేలేదు నాన్న మా వూరి పోస్టు మాస్టర్ కూడా. ఇప్పటికి సరిగ్గా 75 సంవత్సరాలుగా పోస్టాఫీసు మా ఇంట్లోనే వుంది. ఇంకా యిప్పటికీ రెండో తరంలో. గ్రామీణ పోస్టాఫీసుల్ని ఇ.డి. అంటారు. అంటే ఎక్స్‌ట్రా డిపార్ట్‌మెంటల్ అని. ఇది వుద్యోగం కాదు, కేవలం సేవ. ఆ రోజుల్లో నెలకి నాలుగైదు రూపాయల భృతి యిచ్చేవారట. ఆయన దాదాపు యాభై ఏళ్ళు పనిచేశారు. వారసత్వంగా అది యిప్పటికీ మా కుటుంబాన్ని వదల్లేదు.

మా చిన్నతనంలో పోస్టాఫీసుల్లో క్వినైన్ మాత్రలు అమ్మేవారు. మలేరియాకి మందు. ఒకసారి పోస్ట్‌బ్యాగ్‌లో పెద్ద త్రాచుపాము వచ్చింది. అప్పుడు చాలా పెద్ద పెద్ద గోతపు సంచులు వుండేవి. చాలా రోజులు దీన్ని కథలా చెప్పుకునేవాళ్ళం. నాకు ఒకందుకు గర్వంగా వుండేది. మనియార్డర్ ఫారం పూర్తి చేయడం మా మేష్టారికి కూడా వచ్చేది కాదు. నేను నిమిషంలో పూర్తి చేసేవాణ్ణి. ముద్దర్లు వేయడం, తారీకు, నెల మార్చడం నాకు వెన్నతో పెట్టిన విద్య. మంచి స్టాంప్ కలెక్షన్ వుండేది. పెద్దయాక కూడా స్మారక తపాలా బిళ్ళలు, ఫస్ట్‌డే కవర్లు, కాన్సిలేషన్‌తో సేకరించేవాణ్ణి. వయసుతో కొన్ని వుత్సాహాలు సన్నగిల్లుతాయి. ఒక వుత్సాహవంతుడికి అప్పగించి చేతులు దులుపుకున్నాను.


పెద్దబడి

2nd photoఈ ఉపాఖ్యానాలకేం గాని, అడ్మిషన్ పరీక్ష నెగ్గి వేమూరు హైస్కూలు‌లో ఫస్ట్‌ఫారమ్‌లో చేరాను. అప్పుడు నాకు ఏడేళ్ళు. రోజూ వేమూరు వెళ్ళి రావాలి. కవిరాజా జిల్లా పరిషత్ హైస్కూల్. త్రిపురనేని రామస్వామి చౌదరిది తెనాలి. కవిరాజు పేరు అందుకే పెట్టారు. తెనాలి వుద్యమాల పురిటిగడ్డ. తెనాలి దగ్గర్లో కూచిపూడిలో పండిత గోపదేవ్ కులవ్యవస్థ మీద, సంప్రదాయాల మీద తిరగబడ్డారు. ఒక వుద్యమంగా నడిపి, అన్ని కులాల వారు ఉపనయనం చేసుకోవచ్చు, గాయత్రి మంత్రం పఠించవచ్చని కొందరు ఔత్సాహికులకు జంధ్యాలు వేశారు. మా వూళ్ళో కూడా పదిమంది దాకా జంధ్యాలవారైనారు. నిజంగానే వాళ్ళ ఇళ్ళ పేర్లు మరుగున పడి జంధ్యాల బసవయ్య, జంధ్యాల సుబ్బయ్యగా వాసికెక్కారు. కొందరికి కలిసి రాలేదని వాటిని తెంపిపోశారు. కొందరు భయపడి తీసేసారు. గుంటూరులో ఒక పీఠాధిపతి వారికి ప్రాయశ్చిత్తం చేసి, భయం పోగొట్టారని చెప్పుకునేవారు.

థర్డ్ ఫారమ్‌లో జనరల్ మాథ్స్ తీసుకోవాలో, కాంపోజిట్ మాథ్స్ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. జనరల్ వారంతా డాక్టర్లు అవుతారని, కాంపోజిట్లు ఇంజనీర్లవుతారని ఒక ఆశ. రోజూ పొద్దున్నే అన్నం తిని, చిన్న క్యారేజీ పుస్తకాల సంచి తీసుకుని వేమూరు వెళ్ళడం, సాయంత్రం యీసురోమంటూ తిరిగిరావడం. దారిలో రెండు ఆకర్షణలు. ఒకటి పంట కాలవ, రెండోది రైల్వే లైను. లైను పక్కన టెలిఫోన్ తీగెలుంటాయి. అవి జుమ్మని నిరంతరం రోదిస్తుంటాయి. ఆ తీగెని గురి చూసి రాయితో కొడితే చాలా పెద్ద శబ్దం వచ్చేది. ఔటర్ సిగ్నల్ దగ్గర కావల్సినంత కాలక్షేపం. మా వూరి నుంచి నలభై మందిమి వేమూరు స్కూలుకి వెళ్ళేవాళ్లం. మా బ్యాచ్ ఇరవై. రైలు పట్టాల మీద తీగె ముక్కలు, పిన్నీసులు పెట్టి చాకులు చెయ్యడం, అర్థణా బిళ్ళ పెడితే బేడ కావడం మాకు తెలుసు. మా రైలు వ్యవహారాలు మా కంటే ముందు మా ఇళ్ళకు చేరేవి. ఎవడికి వాడే పక్కవాడి పేరు చెప్పి తప్పుకునేవాళ్ళు.

పధ్నాలుగేళ్ళు వచ్చేసరికి ఎస్సెల్సీకి వచ్చాను. స్కూల్ ఫైనల్ అని కూడా పిలిచేవారు. అయితే పరీక్ష రాయడానికి పదిహేనేళ్ళు నిండాలి. నాన్న గుంటూరు వెళ్ళి డి.ఇ.ఒ దగ్గర స్పెషల్ పర్మిషన్ తెచ్చారు. ఫస్ట్ ఛాన్స్‌లో ఎస్సెల్సీ ప్యాస్ అవడంతో జీనియస్సుల లిస్టులో పడిపోయాను.

“సాధించినవి లేకపోలేదు”

3rd photoస్కూలు రోజుల్లో నేను సాధించిన సంగతులు బొత్తిగా లేకపోలేదు. రామకృష్ణ మిషన్ ఆశ్రమ్, నరేంద్రపూర్, 24 పరగణాల జిల్లా వారు స్వామి వివేకానందునిపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. ఏ ఏ పుస్తకాలు చదివితే వారిచ్చిన అంశంపై వ్యాసం రాయవచ్చో వారే సూచించారు. ఇందులో తప్పక పోటీ చేయాలన్పించింది. చేశాను. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇలా వరసగా ఆరేళ్ళు ప్రథముడిగా నిలిచాను. ఇందులో మూడేళ్ళు హైస్కూల్ స్థాయిలో, మూడేళ్ళు కాలేజి దశలో. స్కూల్లో వుండగా పేపర్లో నా ఫోటోతో వార్త పడింది. రేడియో డిల్లీ వార్తల్లో చెప్పారు. జెండా వందనం దగ్గిర నన్ను నిలబెట్టి మా హెడ్మాస్టారు నన్ను పొగడడం, స్కూలుకి పేరు తెచ్చావోయ్ అనడం గొప్ప ఆనందాన్నిచ్చింది. పన్నెండేళ్ళ వయసులో విజయవాడ ఆకాశవాణి నుంచి నా ఇంటర్వూ వచ్చింది. కందుకూరి వీరభద్రరావు నన్ను ప్రశ్నలడిగారు. యువజనుల కార్యక్రమంలో ప్రసారం చేశారు. అప్పట్లో స్కూల్స్‌లో రేడియోలు, ప్రతి రూమ్‌లో స్పీకర్లు వుండేవి. నా కార్యక్రమాల్ని అందరికీ వినిపించారు. మా తరగతి పిల్లలంతా నా రేడియో అనుభవాల్ని అడగడం, నేను గొప్పగా చెప్పడం.. యిప్పటికీ తల్చుకుంటే ఆనందంగా వుంటుంది.

అగ్రహారం అరుగుల మీద చదరంగం నడుస్తూ వుండేది. నాటి ప్రసిద్ధ చదరంగపు ఆటగాళ్ళు దీక్షిత్, తిలక్ మావూరు వచ్చేవాళ్ళు. పెద్ద పోటీలలో ఆడేవారు రకరకాల వాళ్ళతో ఆడాలి. కొత్త ఎత్తులు తెలుస్తాయి. మస్తు, నిర్మస్తు అనేది ముందే నిర్ణయించుకుంటారు. రాజుకి అండగా వున్న బలాన్ని మస్తులో చంపరాదు. నిర్మస్తు అంటే నిర్మొహమాటం. చెక్, తెరచి రాజు, షా లాంటి మాటల్ని రాజుకి గడిలేనప్పుడు అంటారు. నేను ఎందుకో శ్రద్ధ పెట్టలేదు. చాలా ఆసక్తి వుండేది. నాన్న, నాయనమ్మ, మేనత్తలు బాగా ఆడేవారు. అందమైన చెస్ బోర్డ్‌లు, చదరంగపు బలాలు వాటిని కట్టిపెట్టే కళాత్మకమైన చందన భరిణెలు వుండేవి. గౌరవ మర్యాదలు, సంప్రదాయాలు కలిగిన మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. దాంతో బోలెడు ఆశలు, తీరని కోరికలు నాతో పాటూ పెరుగుతూ వచ్చాయి.

కాలేజీ

4th photo

బాపట్ల మాతామహుల ఊరు. అప్పుడే బాపట్లలో కళాశాల స్థాపించారు. దాని స్థాపనలో మా తాతగారి ప్రమేయం వుంది. కనుక నేను బాపట్లలో పియుసి చదవడం నిర్ణయమైపోయింది. బాపట్ల కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో పి.యు.సిలో చేరాను. మా ప్రిన్సిపాల్ డా. శ్రీపాద గోపాల కృష్ణమూర్తి, పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి ఇంగ్లీష్ హెడ్, బొడ్డుపల్లి పురుషోత్తం తెలుగు శాఖాధిపతి. బి.ఎస్.సిలో ఎమ్.పి.సి గ్రూప్‌లో చేరాను. కళాశాల దాదాపు సొంతదిలా వుండేది. పైగా విద్యార్థి యూనియన్‌లో ప్రముఖపాత్ర. వీటన్నిటితో చదువు పూర్తిగా కొండెక్కలేదు గాని, యూనివర్శిటీ స్థాయిలో మొదటి రెండు మూడు స్థానాల్లో వుండాల్సినవాణ్ణి. వుండకుండా పోయాను. వుండి వుంటే ఎమ్మెస్సీ ఫస్టున ప్యాసై మా కాలేజీలోనే ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఎదిగి, శాఖాధిపతినై… అదేం నై నై. మిడిల్ డ్రాప్‌గా మిగిలిపోయాను.

అప్పుడప్పుడే (1967-70) గోడల మీద రాతలు యువతరాన్ని ఆకర్షిస్తున్నాయి. నక్సల్‌బరీ, చారుమజుందార్, బులెట్టా-బ్యాలెట్టా లాంటి మాటలు యువకుల బాతాఖానీలో వినిపిస్తున్నాయి. బాపట్లలో వ్యవసాయ కళాశాల వుంది. మేము స్థానికులం కాబట్టి స్థానబలిమి వుండేది. బాపట్ల లాంటి చిన్న టౌన్‌లో తెలియని వ్యవహారం వుండేది కాదు. మా తాతగారికి ఆడపిల్లలే గాని మగ పిల్లలు లేరు. పి.యు.సిలో వుండగా నన్ను దత్తత చేసుకున్నారు. సరిగ్గా దత్తుడు ఎలా వుంటాడో అలాగే వుండేవాణ్ణి. ఇక్కడ నా పేర్ల గురించి చెప్పాలి. పుట్టిన చోట రాధాకృష్ణ. ఇంటిపేరు వంకమామిడి. దత్తపుత్రుణ్ణి అయాక రామారావు. ఇంటిపేరు కామరాజు. తాతగారితో సంక్రమించిన పొలాలు, ఇళ్ళు, దొడ్లు గొడ్లు యివన్నీ పర్చూరు దగ్గర ఉప్పటూరులో, ఇంకొల్లు సమీపంలోవున్న నూతలపాడులో వుండేవి.

మళ్ళీ ఒకసారి ఆ సర్టిఫికెట్‌పై ఆయన సంతకం చేయించుకోవాలనుకున్నాను. జరగలేదు. దేనికైనా ప్రాప్తం వుండాలి. ఆయన స్వీయచరిత్రకి కేంద్రసాహిత్యఅకాడెమీ అవార్డ్ వచ్చింది. అప్పుడు పత్రికా సంపాదకునిగా వారిని ఇంటర్వూ చేశాను. ఇది నా బతుక్కి ఒక గొప్ప అనుభవం.

వాగుకి యిద్దరిన ఉప్పటూరు, అద్దరిన కారంచేడు. మా మామయ్యలు అక్కడ ఆరేడు వూళ్ళకి కరణాలు. వర్జీనియా పొగాకు పండే పొలాలు. నాలుగు డబుల్ బ్యారన్లు వుండేవి. దీన్ని బట్టి ఎకరాల లెక్క తెలుస్తుంది. పర్చూరులో ఐ.ఎల్.టి.డి (ఇప్పుడు ఐ.టి.సి) ఎన్.టి.సి, అగ్రింకార్, సులేమాన్ ఖాన్, కొసనం, చాగంటి కోనయ్య మొదలైన పొగాకు కంపెనీలు వుండేవి. పర్చూరులో రీడ్రైయింగ్ ఫ్యాక్టరీలు కూడా వుండేవి. కంపెనీలు పొగాకు కొని, గ్రేడింగ్ చేసి, కాడలు తీసి, నీటిని తీసి అనవసరపు బరువు తగ్గించి బేళ్ళు కట్టి — కలకత్తా రేవు నుంచి విదేశాలకు రవాణా చేసేవారు.

చాగంటి వాళ్ళ కంపెనీ చాగంటి భాస్కరరావు కుటుంబానిది. భాస్కరరావు మా కంటె సీనియర్. చీరాల వి.ఆర్.ఎస్.వై.ఆర్.ఎన్ కళాశాలలో చదివాడు. మంచి కబడ్డీ ఆటగాడు. మితభాషి. ఆడంబరం తెలియదు. రాజకీయ పాఠశాలలు నడిపేవాడు. ఒకానొక సాయంకాలం అండర్‌గ్రౌండ్‌కి వెళ్ళాడు. “మీరు మాతో ఎక్కువ దూరం నడవలేరు. అయినా నడిచినంత కాలం నడుద్దాం” అనేవాడు గంభీరంగా. డా. ఎ.పి. విఠల్ పెళ్ళి సందర్భంగా భాస్కరరావు మా వూరు (వరహాపురం)వచ్చాడు. డా. విఠల్ ప్రజాశక్తితో వున్నాడు. పుచ్చలపల్లి జీవిత చరిత్ర రాశాడు. భాస్కరరావు లాంటి, చిత్తశుద్ధిగల దేశాభిమానిని నేను చూడలేదు — పూర్వపు తరాలలో వున్న వారి గురించి వినడం తప్ప. ఇప్పుడు భాస్కరరావు లేడు. ఎక్కువ రాయకూడదు. సాక్ష్యాలు దొరకనిచోట సొంత అనుభవాలను విస్తరించకూడదు. “స్వోత్కర్ష” అవుతుంది. రెండు పేర్లు, రెండు ఇంటిపేర్లు — ఈ తికమక నుంచి బయటపడాలని శ్రీరమణ పేరు పెట్టుకున్నాను.

చాలా చిన్నతనంలో హిందీ రాష్ట్రభాష పూర్తి చేశాను. బహుశా ఫస్ట్‌ఫారం (ఆరోతరగతి)లో వుండగా అనుకుంటాను. ఆంధ్ర సారస్వత పరిషత్తువారి పెద్ద పెద్ద పరీక్షలు కూడా ప్యాస్ అయ్యాను. మహాభారతంలో ఆది, సభాపర్వాలు, దివాకర్ల వెంకటావధాని గారి ఆంధ్రభాగవతోపన్యాసాలు, చిన్నయసూరి వ్యాకరణం యింగా బోలెడు ఉద్గ్రంథాలు సిలబస్‌లో వుండేవి. ఆ వయసులో ఆ ఉత్తీర్ణత ఒక రికార్డు. గడియారం రామకృష్ణశర్మ, నరోత్తమరెడ్డిగార్ల సంతకాలతో సర్టిఫికెట్ యిచ్చారు. మెట్రిక్ ప్యాసై, యీ పరీక్ష పూర్తి చేస్తే హైస్కూల్లో జూనియర్ తెలుగు పండిట్ ఉద్యోగానికి అర్హులు. నేను మూడు నాలుగేళ్ళ క్రితం గడియారం రామకృష్ణ శర్మగారిని పలుసార్లు కలిశాను. మళ్ళీ ఒకసారి ఆ సర్టిఫికెట్‌పై ఆయన సంతకం చేయించుకోవాలనుకున్నాను. జరగలేదు. దేనికైనా ప్రాప్తం వుండాలి. ఆయన స్వీయచరిత్రకి కేంద్రసాహిత్యఅకాడెమీ అవార్డ్ వచ్చింది. అప్పుడు పత్రికా సంపాదకునిగా వారిని ఇంటర్వూ చేశాను. ఇది నా బతుక్కి ఒక గొప్ప అనుభవం.

వరసగా ఆరు సంవత్సరాలు రామకృష్ణ మిషన్ వారి జాతీయ స్థాయి వ్యాస రచన పోటీలో ప్రథముడిగా రావడంతో, వారు వారి ప్రచురణలు మొత్తం బహుమతిగా యిచ్చారు. నాటి రాష్ట్రపతి వి.వి. గిరి గుర్తింపుగా వాత్సల్య సత్కారాన్ని అందించారు. నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పట్టం థాను పిళ్ళై రాజభవన్ (హైదరాబాద్) అతిథిగా ఒక రోజు నన్ను భరించారు. 17, 18 ఏళ్ల వయస్సులో గవర్నర్ దంపతులతో రాజభవన్‌లో టిఫిన్లు భోజనాలు చేయడం చాలా గొప్ప అనిపించింది. అప్పుడు మొదటిసారి టై కట్టుకున్నాను. ఎలా డ్రెస్ వెసుకోవాలో ఏమిటో వివరంగా ఎయిడ్ డిక్యాం (ఎడిసి) ముందస్తుగా లేఖ రాశాడు. తీరా వెళ్ళాక ఆ పెద్ద దంపతులు చాలా సాదాసీదాగా బోలెడు కబుర్లు చెప్పారు. చెప్పించుకున్నారు. పెద్దయాక అనేక సందర్భాలలో రాజభవన్‌కి వెళ్ళాను. కాని ఆనాటి భయం, ఆత్మవిశ్వాసం, ఉత్కంఠ తరువాత లేనే లేవు. ఆ ఆనందమూ లేదు. ఇటీవల రాజభవన్‌పై విశ్వాసమూ సన్నగిల్లింది.

ఇప్పుడు వుందో లేదో గాని అప్పుడొక ప్రఖ్యాత పథకం వుండేది. కల్చరల్ ఎక్స్‌ఛేంజ్ (ఆదాన్ ప్రదాన్) స్కీమ్‌లో ఎంపిక చేసిన యువతీయువకుల్ని వివిధ దేశాలలో పర్యటించడానికి భారత ప్రభుత్వం పంపేది. భారత్ నుంచి ఎంపికైన పాతికమందిలో నేను కూడా వున్నాను. 22 దేశాలు దాదాపు నాలుగు నెలల పర్యటన. యూనివర్శిటీ దీనికి ప్రత్యేక అనుమతి కూడా యిచ్చింది. తాతగారు అనారోగ్యంతో వున్నారు. ఏ క్షణానైనా ఏమైనా జరగచ్చు. కన్నకొడుకైతే ఏమో గానీ, దత్తపుత్రుణ్ణి కాబట్టి యిలాంటి స్థితిలో వదిలి వెళ్ళడం గొప్ప నేరం. అలాగని నాకు అనిపించలేదు, పెద్దవారికి ప్రాజ్ఞులకి అనిపించింది. వెళ్ళలేదు. అట్లాగని పెద్ద బాధా లేదు. ఏడాది తర్వాత తాతగారు పోయారు. అమ్మమ్మ అప్పుడెప్పుడో పోయింది. మా వూరు వచ్చేశాను. కొన్ని సంఘటనల్ని ప్రత్యక్షంగా చూశాక ఉద్యమాల మీద నాకెందుకో నమ్మకం సన్నగిల్లింది. నినాదాలు ఎగజిమ్మినా మనిషి మామూలుగానే వుంటాడనిపించింది. భాస్కరులు కోటికి ఒకరైనా వుండరని అర్థమైంది.

(ఇంకా ఉంది)

Posted in వ్యాసం | Tagged , | 17 Comments

2009 డిసెంబరు గడిపై మీమాట

2009 డిసెంబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి.

———————————-

Posted in గడి | Tagged | 5 Comments