వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – రెండవ భాగం

కొత్తపాళీ: ఈ సారి కొత్తగా ఫణి ప్రసన్న, సనత్ శ్రీపతి సభలో పాల్గొంటున్నారు. వారిద్దరికీ ఆహ్వానం, అభినందనలు. పెద్దవారు నరసింహారావు గారు కూడా దయచేశారు. స్వాగతం

ఫణి: ధన్యవాదాలు

సనత్ కుమార్: నమస్సభాయై

రాకేశ్వరుఁడు: అకారేకారోకారసంధులు అంటూ తెలుఁగు సంధుల పేర్లకు సంస్కృత సంధి చేసావేమయ్యా రాఘవా ??

రాఘవ: రాకేశ్వరా, అక్కడ సంస్కృతం చెల్లుతుంది మఱి.

గిరి: తెలుగుకీ, సంస్కృతానికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచించడానికేమో

(క్రిందిది ఆశువుగా చెప్పిన పద్యం -సం.)
విశ్వామిత్ర:

తాంబూలప్రియుడ, వ్యాకర

ణంబది అందనను ద్రాక్ష నాకు తమసహా

యంబున వ్రాతును, మరియున్

రాఘవ:

కంబుగ్రీవునిఁ గొలువుడు కైతలు వచ్చున్

విశ్వామిత్ర:

అంబుజ నయనలనుగనగ అమ్మో భయమౌ

విశ్వామిత్ర: @రాఘవ 🙂

గిరి: ఆశుపద్య ధారలు ప్రవహిస్తున్నాయి

ఫణి: 🙂

సనత్ కుమార్: అంతర్జాలంలో అంబుజ నయనలు ఎక్కడ కనిపిస్తున్నారో

కొత్తపాళీ: సనత్ .. ఆయన విశ్వామిత్రుడు కదా, దివ్యదృష్టితో చూసి ఉంటారు

కొత్తపాళీ: ముందుగా .. గరికయొ గడ్డియో మెసవి గైకొనవచ్చు గవిత్వ సంపదల్. రాఘవ కవిని ఈ సమస్య పూరించమని కోరుతున్నాను

రాఘవ:

ఉరమున కౌస్తుభప్రభలు యుక్తములై వెలుఁగొందఁ దెల్పఁగాఁ

బరమరహస్యముల్ విధిశివాచ్యుతరూపుఁడు కృష్ణమూర్తియై

మురళినిఁ జేతఁ బట్టి సురమోహనగానముఁ జేయ నాలమై

గరికయొ గడ్డియో మెసవి కైకొనవచ్చుఁ గవిత్వసంపదల్

విశ్వామిత్ర: ఆహా

కొత్తపాళీ: అవును, చెవులకి మురళీ సుధారవళి సోకుతుంటే, కడుపుకి ఏమి తింటే నేమి?

రాకేశ్వరుఁడు: కొత్తపాళీ గారు దయచేసి కడుపు తిండి అనే మాటలు ఎత్త వద్దు। శనివార్రప్పస్తులుంటున్నాం

కామేశ్వరరావు: చాలా బాగుంది పూరణ!

చదువరి: చక్కటి పద్యం

విశ్వామిత్ర: పోతన గారి మాగాయ గుర్తుకొచ్చింది

రాఘవ: కృష్ణార్పణం

శ్రీరామ్: మురళీమోహనమైన పద్యం!

రాఘవ: పోతనగారి మాగాయ?

కామేశ్వరరావు: నాదొక చిన్న సందేహం. గరికకీ గడ్డికీ ఏమిటి తేడా?

రాఘవ: కామేశ్వరరావుగారూ, గరిక కొందఱు పచ్చడి చేసుకుంటారండీ. గడ్డి ఎందుకూ ఉపయోగపడదు.

సనత్ కుమార్: నాలమై అంటే ఏమిటి రాఘవా ??

రవి: విధిశివాచ్యుతరూపుడు – వివరించాలండి

నరసింహారావు: శివాచ్యుత రూపుడు అన్నచోట శివ అనే పదానికి అర్థం ఎలా గ్రహించాలి

రాఘవ: విధి బ్రహ్మగారు, శివ పరమేశ్వరులవారు, అచ్యుత విష్ణువులవారు. ముగ్గురి రూపమూ అని.

కొత్తపాళీ: ఫణి ప్రసన్న గారు కూడా ఈ సమస్యని పూరించారు .. ఫణీ కానివ్వండి

ఫణి:

ఎరుగను మున్ను ఎన్నడును ఏర్పడ వ్రాయగ వృత్త పద్యముల్

కరతల మయ్యె భాగవత గానము సేసిన నేడు వ్రాయుటల్

హరిచరితంబు యా మధుర అద్భుత కావ్య మహా వనమ్ములో

గరికయొ గడ్డియో మెసవి గైకొనవచ్చు కవిత్వ సంపదల్

కొత్తపాళీ: ఆహా, మీరూ పోతన బాటనే పట్టారు, బాగుంది

రాకేశ్వరుఁడు: చాలా బాగుంది।

కామేశ్వరరావు: పోతన పేరెత్తగానే భాగవత గానం వచ్చేసిందే! బాగుంది!

కొత్తపాళీ: అసలు ఆ సమస్యలోని మహిమే అదేమో?

ఫణి: కృష్ణుడు, కృష్ణ కథ అంతా ఒకటే కదండీ.

రాఘవ: కావ్యమహావనం… భలే.

చదువరి: ‘గరిక’పాటి వారు !

రాఘవ: గడ్డిపాటివారు లేరంటారా ఏమిటి?

విశ్వామిత్ర: గరిక పచ్చడి ఎలా చేసుకుంటరో తెలియాలంటె గరికపాటి వారిని అడగాల్సిందే

రాకేశ్వరుఁడు: అన్నట్టు నాదింకో సందేహం – గరిక గరికి ఒకటేనా

రాఘవ: గఱిక అన్నదే సాదురూపం అనుకుంటాను.

సనత్ కుమార్: ఇంతకీ గరికకీ గడ్డికీ తేడా ఉందా???

విశ్వామిత్ర: @సనత్ ఉంది, గడ్డితినే వాళ్లకి గరికతినే వాళ్లంత గౌరవం లేదు

కొత్తపాళీ: గరిక అనేది, అనేక రకాల గడ్డి మొక్కల్లో ఒకటి

రాకేశ్వరుఁడు: నాకు గరికిపాటివారు స్వయంగా ఇచ్చిన visiting card లో గరికి అనివుంది పేరు।

కామేశ్వరరావు: “గరికి” లేదు. “గరిక” పదమే వారింటిపేరులో “గరికి”గా మారిందని గరికిపాటివారు చెప్పారు.

కొత్తపాళీ: గడ్డి అనేది జాతి నామం – name of a genus

గిరి: గడ్డిలో ఎన్ని రకాలో మేస్తే కానీ తెలియకపోవచ్చు

రాకేశ్వరుఁడు: కామేశ్వరులు – గరికకి గరికి షష్ఠీ విభక్తి అయివుంటుంది

కామేశ్వరరావు: 🙂

రాఘవ: రాకేశ్వర… ఏం చదువుతున్నారు మహాశయా ఈ మధ్యన?

సనత్ కుమార్: తినేదొకటే అయినప్పుడు చెప్పుకునేది మంచి పేరున్నదాన్నే చెప్పుకుంటే పోలా??

కామేశ్వరరావు: ఇంతకీ కృష్ణభక్తినీ, భాగవత గానాన్నీ వదిలేసి గడ్డి మీద పడ్డామందరమూ! 🙂

రవి: కామేశ్వర్రావు గారు, అలా “గడ్డి” పెట్టండి.

పుష్యం: నేల మీదకంటే గడ్డి మీద పడడం మంచిది కదా.. దెబ్బ తగలదు 🙂

రాఘవ: కామేశ్వరరావుగారూ, నిజమేనండీ. త్రాళ్లు పోసి గట్టిగా లాగాలి.

…………………………………………..

కొత్తపాళీ: ఇష్టాగోష్టి పూర్తయితే, తరవాతి సమస్యకి వెళ్దాము.. లావొక్కింతయు లేదు … ఈ పదాలతో మొదలయ్యే గజేంద్ర మోక్షం తెలుగునాట బహు ప్రసిద్ధం. సమస్య ఏమిటంటే, ఈ పదాలతో మొదలు పెట్టి, పోతన కవిత్వ ఛాయ పడకుండా రాయాలి

ఫణి: నేనెంత కష్టపడినా పోతన శైలి రాదు కనక ధైర్యంగా రాశాను.

విశ్వామిత్ర: “లావొక్కింతయు లేదు” …ఇప్పటి నాయికా మణులందరిదీ ఇదే జపం

రాఘవ: విశ్వామిత్రులవారూ, జీరో సైజు గుఱించా మీరు చెబుతున్నది! అన్నా, మేనక బాధపడుతుంది సుమండీ!

రాకేశ్వరుఁడు: రాఘవ – జీరోసైజ్ గుఱించి మాట్లాడుతున్నారు మీరు। కాంతిపుంజాల గుఱించా?

రాఘవ: మెఱుపుతీగల గుఱించి

నరసింహారావు: ” లా ‘ వొక్కింతయు లేదు అనే పద్యమొకటి ఎప్పుడో చదివాను.

గిరి: బాపు గారు తనగురించి చెప్పుకునేటప్పుడు వాడారు – లా చదివినా ‘లా’ వొక్కింతయు లేదని

విశ్వామిత్ర: నాల్గో పాదంలో ఈశ్వరా బదులు మానినీ వాడిన O అనుకరణ పద్యాన్ని నేను చూసాను

రాఘవ: Oహో!

కొత్తపాళీ: ఫలానా ఛందస్సని నియమం పెట్టలేదు, దాంతో తెలివైన మన కవులందరూ, ఆహా చక్కగా కందంలో ఇమిడిపోతుందని, కందాలు చులాగ్గా లాగించేశారు. ఈ సమస్యకి దాదాపు అందరూ స్పందించారు. అందరి పద్యాలూ ఇక్కడ చెప్పడానికి సమయం చాలదు. అంచేత దయచేసి నేను పిలిచిన వారు మాత్రం తమ పద్యాలు వినిపించమని ప్రార్ధన

కొత్తపాళీ: పుష్య కవీ .. ముందుగా మీ పూరణ

పుష్యం: ‘లా’ ఒక్కింతయు లేదన్నారుగా మీ రూలు ఎందుకు పాటించాలి? 🙂

పుష్యం: ఒక తల్లి తనకు నచ్చిన అమ్మాయిని చూడమని కొడుకునుద్దేశించి:

పుష్యం:

లావొక్కింతయు లేదుర,

జీవితమున నీకుమంచి చేదోడగురా.

పావని చక్కని పిల్లర,

నీవామెను చూడకున్న నేనొప్పనురా!!”

నరసింహారావు: బాగుందండి.

కామేశ్వరరావు: బాగుంది! చేదోడైతే చాలు, వాదోడైతేనే కష్టం 🙂

చదువరి: 🙂

విశ్వామిత్ర: ఇప్పుడు అదేమీ చూడటం లేదు ..ఒక్క జే(బు)తోడే

రాఘవ: మొత్తానికి జీవితంలో హాయిగా ఉండాలంటే పావని లాంటి చక్కటి పిల్ల కావాలీ అని తల్లి చెప్పిందంటారు!

పుష్యం: పణి గారు చెప్పినట్టు పోతన ఛాయలు వెదికినా కనబడవు 🙂

రాకేశ్వరుఁడు: పుష్యం – ఈ మామ్ ఎవరో చాలా కూల్ మామ్ లా వుందే 🙂

రవి: శ్యాం గారు, కట్నమెంతిస్తారటండీ?

సనత్ కుమార్: ఆ అమ్మాయి మరి పాయింటు బ్లాంకులో గన్నెట్టి మరీ ఫోను చేయించి ఉంటుంది…

రాకేశ్వరుఁడు: 🙂

పుష్యం: లావు లేకపోటే కట్నం తగ్గించొచ్చండి, ఈ రోజుల్లో 🙂

ఫణి: జీతములో చేదోడవకుండా ఉంటే చాలు.

కొత్తపాళీ: సనత్ గారూ, మీ పూరణ

సనత్ కుమార్:

సనత్ శ్రీపతి చెప్పిన ఈ పద్యం ఆయన స్వరంలోనే

‘లా’ వొక్కింతయు లేదుట !

గావగ పోలీసు, కోర్టు, కనమాఫ్ఘనిలో !

చేవని చూపి లగెత్తెద

మావల బలుసాకు తినెద మాయువు నొందన్ !!

రాఘవ: ఆఫ్ఘనిలో భలే బాగుందండీ ఈ ప్రయోగం

సనత్ కుమార్: ఆప్ఘనిస్తాన్లో మనవాళ్ళ కష్టాలు…

విశ్వామిత్ర: మొదటి పాదం చూసి ఇంటి సంగతి అనుకున్నా.., కాదు రచ్చ గురించి అన్నమాట

ఫణి: పోతనగారికి ఆంగ్లం రాదు కదండీ

కొత్తపాళీ: అంతేకాక, బతికుంటే బలుసాకు తినొచ్చు అనే చక్కటి తెలుగు నుడికారం కూడా

రాకేశ్వరుఁడు: గని అనాలా ఘని అనాలా?

రాఘవ: గని

గిరి: పలు సాకులు చెప్పి అఫ్గాన్లో బలగాన్ని పెంచుతున్న అమెరికన్లు మాత్రం కాదు

కామేశ్వరరావు: “లగెత్తడం” కూడా 🙂

రాఘవ: 🙂

పుష్యం: ఇందాక గడ్డి తినమన్నారు, ఇప్పుడు బలుసాకు.. ఎవరిక్కి ఇంట్లో సరిగా తిండి దొరుకుతున్నట్టు లేదు 🙂

రాకేశ్వరుఁడు: ఇవాళంతా గడ్డి ఆకూ పెడుతున్నారన్నమాట

సనత్ కుమార్: మరే బతికుంటే బలుసాకు కదా.. లగెత్తుదాం… అని

విశ్వామిత్ర: శాకాహారం – సాత్వికం ఆరోగ్యప్రదం

కామేశ్వరరావు: ఇందాకే ఎవరో శనివారం అన్నారు కదా, అందుకే గడ్డీ ఆకులే ఇవాళ ఆహారం 🙂

కొత్తపాళీ: పుష్యం .. కాదులే .. అందరికీ లావులు పెరిగి, డయెటింగు

రాకేశ్వరుఁడు: కొందరికి ఆ బలుసాకు భాగ్యం కూడా వుండదండి। పులావొక్కింతా లేదు అనుకుంటూ…

విశ్వామిత్ర: అదేదో డిలైట్ అని ఈ మధ్య కొనుక్కొని కూడా తింటున్నారు జనులు

కొత్తపాళీ: ఇదే సమస్యకి గిరిధర్ పూర్తిగా వేరే యెత్తు యెత్తారు .. గిరిధర్, మీ పూరణ

గిరి: ఇదిగో

గిరిధర్ సమర్పించిన ఈ పద్యాన్ని ఆయన స్వరంలోనే వినండి

“లావొక్కింతయులేదు, డస్సితిని, వెళ్ళాలింటికే, తిండికే…”

“ఏవోఁయ్ కాస్త తినేందుకేమి పెడతావ్?” “ఏ రొట్టెలో పెట్టి చె

ట్నీవేస్తే సరిపోను మీ కనుకొనే, నే నట్లు పిట్లా పడే

స్తే, వీళ్ళందరు వేడి చల్లబడకే జిర్రంచు జుర్రేయ, పి

ట్లావొక్కింతయు లేదు రొట్టెలును గుల్లై పోయె స్వామీ” “ఉసూర్”

(పిట్లా అంటే సెనగపిండితో చేసే పచ్చడి-సం)

గిరి: భార్యాభర్తల మాటలు

రాకేశ్వరుఁడు: ఉసూర్ – రోజువారీ ఉసూరా లేదా

కామేశ్వరరావు: వ్యావహారిక పద్య ధురంధరా, గిరిధరా! భళి భళీ!

రాకేశ్వరుఁడు: స్వానుభవము కాకపోతే చాలుఁ

రాఘవ: ఇంత వ్యావహారికభాషలోనా! :O

గిరి: నల వారీ ఉసూర్

విశ్వామిత్ర: “ఉసూర్” అనిపించటం వారికి అలవాటే, రుచిగా చేసైనా, చేయకైనా

రాకేశ్వరుఁడు: అంటే రోజూ ఉసూరు మనిపించరుగా సతీమణి అని అంతే…

రాఘవ: గిరిగారూ, అబ్బురపఱచడం అంటే ఇదేనేమో!

రాఘవ: భలే

కొత్తపాళీ: రాఘవ .. హ హ హా. ఆయన ఏ హిందీలోనో, ఇంకా సింగపూరు భాషలోనో రాయలేదు సంతోషించండీ

రాఘవ: కొత్తపాళీవారూ, మఱే! నిజమేనండోయ్… అంత గడుసువాడే ఈ గిరిధరుడు.

మురళి: లావొక్కింతయులేదుతో మొదలవ్వలేమో గిరిధర్ గారూ!

విశ్వామిత్ర: ఆద్యంతమ్ములేకమై ఆట్లు ఆరగిస్తూంటే మురళి గారు… అడ్డు తగలకండి

ఫణి: పద్యంలాగా కూడా అస్సలు లేకుండా రాశారు. పోతన వరకూ పోకుండా. భాగుంది.

గిరి: ధన్యవాదాలు, ఫణీ నిజమే 🙂

రాకేశ్వరుఁడు: కొన్ని రోజులు పోతే మలాయి చైనీసు పద్యాలు వ్రాస్తారేమో

(గిరధర కవి ప్రస్తుత నివాసం సింగపూరు -సం)

కామేశ్వరరావు: అదీ ఏ కందంలోనో అయితే సులువే, ఇలా శార్దూలంలో వ్రాయడమింకా అద్భుతం!

సనత్ కుమార్: ఇప్పటికే రాస్తున్నారేమో.. మనకర్ధం కాదు కదా అని ఇక్కడ చెప్పకపోతూ ఉండవచ్చు కదా

విశ్వామిత్ర: తమిళ పద్యాలు నే జూశాను – గిరిగారివి

గిరి: వివేవారుంటే ఎవరైనా చెప్పవచ్చు 🙂

……………..

చదువరి: కామేశ్వరరావు గారూ.. లావు + ఒకింత = లావొకింత ఏ సంధి అవుతుందండి?

రాకేశ్వరుఁడు: హహ। కన్నడిగులు ఈ అకారోకరేకార సంధులకు చక్కగా క్లుప్తంగా లోపసంధి అని పేరు పెట్టారు. అచ్చునకచ్చు పరమైన మొదటిది లోపిస్తుంది – సింపుల్. ఉదా – ఌ + ౠ = ౠ

కామేశ్వరరావు: “చలం” సంధి అవుతుంది 🙂 అవునండి. “ఒ”కారానికి “వొ”కారాన్ని ఎక్కువగా ప్రయోగంలోకి తెచ్చింది చలమే!

రాకేశ్వరుఁడు: ఈ పాయింటు కూడా గుర్తు పెట్టుకోండి – అయితే కామేశ్వర రావు గారు – వ కి రాక్షసికొండి పెట్టిరిలో కొ కి యతి చెల్లుతుందన్నమాట

సనత్ కుమార్: అయినా విడ్డూరం కాకపోతే లావు ఒకింత ఎక్కడైనా ఉంటుందా? ఉంటే లావు, లేకపోతే సన్నం అంతే కానీ … 😉

పుష్యం: @సనత్: ‘ఒకింత’ లావు చూడాలంటే నడుము దగ్గర తడుముకోండి.. 🙂

సనత్ కుమార్: నాదా… మీరు మరీను…

గిరి: సనత్ 🙂 ఒకింత కూడ లేకపోవడం ఉంటుంది – జీరోసైజని ఇందాక రాఘవ చెప్పినది అదే

రాకేశ్వరుఁడు: గిరి – జీరోసైజంటే వ్యాకరణభేదమా – ధన్యుడను – అర్థమవ్వక చచ్చాను

కామేశ్వరరావు: రాకేశ్వరుఁడు:🙂

రాకేశ్వరుఁడు: కామేశంగారు, 🙂 అంటే సరిపోదు। అమీ తుమీ తేల్చండి – నేను ప్రయోగింపబోతున్నాను।

విశ్వామిత్ర: @రాకేశ్వరుండు అమీ తుమీ తేల్చాలంటే కోల్కతా వెళ్లాలి

కామేశ్వరరావు: రాక్షసికి “కొండి” పెట్టకూడదు 🙂

రాకేశ్వరుఁడు: పెట్టకూడదా .. నేనొప్పుకోను – చలం సంధి అని మీరే చెప్పారు !!!

పుష్యం: ఇష్టా గోష్టి అన్నారుకదా, మనం ఇష్టంవచ్చినట్టు గోష్ఠి లోకి దిగుతున్నట్టున్నాము 🙂

రాకేశ్వరుఁడు: అర్థమయ్యింది – రాక్షసి కొండి పెట్టవచ్చు కాని రాక్షసికి కొండి పెట్టకూడదన్నమట

కామేశ్వరరావు: మీరు చలాన్ని తిరగేస్తానంటే ఎలా? 🙂

కామేశ్వరరావు: అతను “ఒ” ని “వ” చేస్తే మీరు “వ” ని “ఒ” చేస్తారా!

రాకేశ్వరుఁడు: అది చలమ సంధి అయితే ఇది అచలమసంధి 🙂

గిరి: రాకేశా, దాన్ని లంచ సంధ అనవచ్చు

విశ్వామిత్ర: కాస్త “లంచ” మి స్తే చలం ని కూడా తిరగేయవచ్చు

గిరి: లంచ సంధి అనవచ్చు – చలం ని తిరగేసి

రాకేశ్వరుఁడు: తమిళ లంచా తెలుగు లంచా? –

రాఘవ: ఇంగ్లీషు లంచి

సనత్ కుమార్: తిరగేస్తానంటే ఎలా ఏముంది? లంచమే గా .. 😉 ఇంగ్లీషు లంచు …

కొత్తపాళీ: ఇంకా నయం, పరుషాన్ని సరళం చేశారు కాదు,

గిరి: తమిళంలో పరుషాలకీ, సరళాలకీ తేడా లేదు

గిరి: అలా చూస్తే సంధి పేరులో తేడాలొస్తాయి

విశ్వామిత్ర: సనత్ గారూ యత్ భావం తత్ భవతి – లావు అంటే ఇష్టమైన వాళ్లు అయ్యొ లావు లేదే అనుకుంటారు .. సన్నం అంతే ఇష్టమైన వాళ్లు సన్నమె అనుకుంటారు

రాఘవ: ఔనూ, జీరోసైజుకూ వ్యాకరణానికీ ముడి పెట్టారేమండీ

రాకేశ్వరుఁడు: చక్కనమ్మ సిక్కినా అందమేనట

రాకేశ్వరుఁడు: లావొక్కింతయూ లేదా రాఘవా ?

ఫణి: ఇక్కడ ఇష్టాగోష్టీ మా లావుగా జరుగుతోందండీ.

కొత్తపాళీ:: ఫణి గారూ, మీ లావొక్కింత పద్యం కూడా చెప్పండి

ఫణి:: తప్పకుండా నండీ.

లావొక్కింతయు లేదు వేళ్ళ కొనలన్ లాస్యంబుగా పట్టగా

సావొచ్చే పనియౌను దట్టపు పొగల్ సర్దాగ సృష్టింపగా

రావే కమ్మని కైపులెంత కసిగా లాగించి నే పీల్చినా?

పోవో! ఈ సిగరెట్టు ఎందు సరిపోబోదోయి నా చుట్టతో

కొత్తపాళీ:: ha ha ha.

చదువరి:: హ హా.. భలే!

రవి:: హ్హహ్హహ్హా..

సనత్ కుమార్:: భలే..

శ్రీరామ్:: హ హ హ హా

రవి:: బ్రాండు మార్చి చూడండి

మురళి:: ఫణీ ఈ చుట్టలతో చుట్టరికం ఎప్పట్నుంచీ?:)

ఫణి:: (పొగ తాగి ఎరుగను. అది వేరే సంగతి లెండి)

కొత్తపాళీ:: లంక ఇంటి పేరిటి వాడు గిరిధర్ కే తట్ట లేదు

కామేశ్వరరావు:: “పోవో” చాలా బాగుంది!

పుష్యం:: భలే!!

గిరి:: 🙂

విశ్వామిత్ర:: భలే!!

ఫణి:: నెనర్లు

కొత్తపాళీ:: పొగ చుట్టలెన్ని యైనను సిగరెట్టుకి సాటి రావు అన్నాడు శ్రీశ్రీ – మీరు దాన్ని పూర్వపక్షం చేశారు

కామేశ్వరరావు:: కొత్తపాళీగారు బాగా చెప్పారు!

చంద్రమోహన్:: సావొచ్చే … చావొచ్చే అంటే బాగుంటుందేమో

రాకేశ్వరుఁడు:: ఏదేమైతేనేం – పొగతాగక దున్న పోతవ్వకపోతే చాలు

ఫణి:: పోతన గారికి దూరంగా..

రాకేశ్వరుఁడు:: మా పొగాకు ధర బాగుంటే చాలుఁ

…………………………………

కొత్తపాళీ: మరొక్క సమస్య .. కుసుమములెల్ల జిత్తమున కోరికలై మురిపాలు గ్రోలగా

కొత్తపాళీ: దీనికి శ్రీరాముడొక్కడే పూరణ పంపాడు, కానియ్యి శ్రీరామా

శ్రీరామ్: చిత్తం

వెసబడినట్టి జీవికను వేసవిరేయిని చల్లగాలిలా

విసుగును దీర్చు కావ్యసభ వీనులవిందున నాదు భావనా

కుసుమములెల్ల జిత్తమున కోరికలై మురిపాలు గ్రోలగా

ముసుగునుదీసి మత్కలము ముందుకుసాగెను నేటి రాతిరిన్!

చదువరి: ఓహో ఆ విధంగా మళ్ళీ మన లోకంలోకి వచ్చారన్నమాట!

కొత్తపాళీ: శ్రీరాముడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రవాసమున్నాడు, అందుకని ఇది వేసవి రేయి అయింది

రాకేశ్వరుఁడు: శ్రీరాంగారు బ్రిసుబేను బాగుందా?

విశ్వామిత్ర: మళ్లీ శ్రీకారం జుట్టారు .. సంతోషం

కామేశ్వరరావు: ఆహా వేసవి రేయిలో చల్లగాలిలాగే హాయిగా ఉంది మీ పద్యం!

రవి: ఇక్కడ ఇండియాలో కూడా వేసవి లానే ఉంది లెండి.

శ్రీరామ్: నెనర్లు

రాఘవ: చక్కగా హాయిగా కుసుమ గంధంలాగ బాగుందండీ.

పుష్యం: శ్రీరాముని దయచేతను – శ్రీరాముడు ముసుగుతీసి శీఘ్రమె వ్రాసెన్

ఫణి: పద్య ధారా ప్రవాహం బాగుంది.

రాఘవ: పు.శ్యాం.గారూ, భలే

గిరి: శ్రీరామా, బావుంది పూరణ

కామేశ్వరరావు: జోరైన మంచి పద్యము

శ్రీరామ్: నెనర్లు
—————————————
పై సమస్యలకు ఇతర పూరణలు కూడా వచ్చాయి. సమయాభావం చేత సభలో ఆ పద్యాలు చదవలేకపోయినప్పటికీ సభాధ్యక్షుడు ఆ పద్యాలను కూడా ప్రచురించేందుకు నిశ్చయించారు. ఆ పూరణలివి:

లావొక్కింతయు లేదు

రవి:
కం.

లావొక్కింతయు లేదిక
ఆవిష్కృతమౌ ఉరమును అంసద్వయమున్
గ్రీవము కంబువు భంగిన్
జీవము సత్వము నొసగెడి జిమ్ముఁ సేయగన్

లంకా రవీంద్ర:
కం.

లావొక్కింతయు లేదు, ప
లావులు పదిప్లేట్లపైనె లాగించినదే!
బావురు మనబోకు పతీ,
ఆవిడ యాకలి కనుగొని ఆలస్యముగా

ఫణి ప్రసన్న కుమార్:
శా.

లావొక్కింతయు లేదు వేళ్ళ కొనలన్ లాస్యంబుగా పట్టగా
సావొచ్చే పనియౌను దట్టపు పొగల్ సర్దాగ సృష్టింపగా
రావే కమ్మని కైపులెంత కసిగా లాగించి నే పీల్చినా?
పోవో! ఈ సిగరెట్టు ఎందు సరిపోబోదోయి నా చుట్టతో

చదువరి:
కం.

లావొక్కింతయు లేదని
యా విరిబాలను వివాహ మాడిన యంతన్
ఆవిరి కుడుము వలె కలికి
లావెక్కిన నేమి మిగులు లావణ్యమునన్

నల్లాన్ చక్రవర్తుల కిరణ్ (నచకి):
శా.

“లా” వొక్కింతయు లేదు, దుంప తెగ, ఈ రాష్ట్రాల కాష్టాలలో
చావొచ్చింది గదా, వినాశమున బేజారైన ఆంధ్రావనిన్
రావచ్చన్న పరిశ్రమల్ మనకు రాం, రామంటు పోతుండగా
భావావేశములెక్కువైనవటగా, భ్రాతృత్వమేమైనదో!?

రాకేశ్వరుడు:
శిఖరిణి.

‘ప’లావొక్కింతా లేదు పెరుగును పాలూ పులుసు లే-
వు లేవే జొన్నల్ లేవు శెనగలు వుప్మా అసలు లే-
దు లేవే పచ్చళ్ళున్ పులుసులును తోడెం చలిది కూ-
టి ‘లేశ్యం’ లేదయ్యో కలదు యొకటే యాకలి హరా

కృష్ణ కొండూరు (ఆత్రేయ బ్లాగరి):
కం.

‘లా ‘ ఒక్కింతయు లేదురు
చావొచ్చి పడినది చూడు చావడి గదిలో
బ్రోవగ కరిగావు హరికి
కావగ తనసతి గతి ఇక కాలము మారెన్ !

(కోర్టుల్లో లా అనేది లేదు, కాసిని కాసులతో పని జరుపుకోవచ్చు అన్న మాట )

రాఘవ:
శా.

లా వొక్కింతయు లేదు శాస్త్రములఁ కల్పాద్యంగముల్ నేర్వగా
శ్రీవేదాన్తమయస్వరూప ధిషణాచేతో೭న్య చిత్సత్ప్రభో
నీవే జ్ఞానము నిచ్చి కావవలెఁ గానీ వేఱుదిక్కున్నదా
నీవే నేనను భావమున్ నిలుపవే నిష్కర్షగాఁ బుద్ధిలోన్

సందీప్:
శా.

“లా”వొక్కింతయు లేదు, నాయకులు వేలం వేసె రాజ్యాన్ని హా!
“మావాడొక్కడు బాగుగున్న, మిగతా వారెట్లు పోతేను యేఁ?”
ఈవాదంబును నమ్మినట్టి బుధులున్, దేశాన్ని ముం”చెత్తగా”
సేవాదృక్పథమేది పౌరులకు? దూషించేటి ప్రాఙాళికిన్!

గరికయొ గడ్డియో మెసవి గైకొనవచ్చు గవిత్వ సంపదల్
నచకి:
చం.

సిరులవి యెన్నియో గలిగి, చెప్పగ గొప్ప చరిత్ర యుండియున్
వరుసగ శత్రువర్గములు వచ్చిట నచ్చినవన్ని దోచగా
విరసుల పాదఘట్టనల బీడయె సాహితి, నేటికిచ్చటన్
గరికయొ గడ్డియో మెసవి గైకొనవచ్చు గవిత్వ సంపదల్
Posted in కవిత్వం | Tagged , | 2 Comments

క’వికృతి’ – ౨

ముందుగా కవికృతి మొదటి భాగంలో ప్రచురించిన కవితపై గరికపాటి పవన్ కుమార్ గారి విశ్లేషణ:

భావాలు ఒద్దికగా వచనంలో ఇమడకపోవడం వలన ఈ కవిత పాఠకుడిలో అయోమయాన్ని నింపుతోంది

ఉదా 1:

డిజిటల్ డోల్బీ ఊయలలొ పురుడు పోసుకుని
ఏడువేల ఓల్టుల సమ్మోహన శబ్ద తరంగాల మధ్య
ఇప్పుడు మనం తప్పటడుగుల్లోనే వున్నాం..

పురుడు పోసుకొవడం అనే పదాన్ని ఆవిడ పురుడు పోసుకుంది అని తల్లి వైపు నుంచి వాడతాము, ఊయలలో పురుడు పోసుకున్నదెవరు? తల్లా? పిల్లా?
ఇప్పుడు మనం తప్పటడుగుల్లోనే ఉన్నాం? – దీన్నే నేను భావాలు ఒద్దికగా లేకపోవడం అంటున్నాను.
డిజిటల్ డోల్బీ ఊయల – ఇది మంచి ఊహ
ఏడువేల ఓల్టుల సమ్మోహన శబ్ద తరంగాలు – ఇంకొక మంచి ఊహ, అవే కవితయిపోవు గదా.. ఆ ఊహలతో అయోమయం లేని ఒక వచనాన్ని ఆవిష్కరించాలి, పదునుగా అలోచించాలి. ఇటువంటి అయోమయమే ఈ వచనమంతా కనిపిస్తోంది:

పర్యావరణాన్ని నడిరోడ్డుపై హత్య చేస్తున్న
శబ్ద ఖననాన్ని కోరుకుంటున్నాడు
ప్రశాంతతను మరచి పోతున్నాడు

హత్య చేసేది శబ్దమా? అయితే శబ్దపు ఖననాన్ని అని ఉండాలి.
మరి ఆ శబ్దపు ఖననాన్ని ప్రశాంతతను మరిచిపొయేవాడెందుకు కోరతాడు? మళ్ళీ అయోమయమే.

శబ్ద రొద (రొద అంటేనే శబ్దయుక్తమని, శబ్దరొద అంటే అనవసరమైన పునరుక్తి,
ఎబ్బెట్టుగా కూడా ఉంది.)

శబ్ద రహిత ప్రపంచాన్ని వెదికాను
కనుచూపుమేరలో లేదు
ఎందుకంటే..
శబ్ద రహిత మానవుడిప్పుడు కరువయ్యాడు కనుక
మనిషి లోపల కూడా శబ్దమే ధ్వనిస్తుంది కనుక…!

ఇన్ని పంక్తులా? కవిత చివర ఈ వివరణ అనవసరం.

——————————————————————————————

బొల్లోజు బాబా:

వచ్చి చెప్పనులే నీతో
ఈ మధ్య
నక్షత్రాల్లా
ఒంటరినై పోయానని

వచ్చి చెప్పనులే నీతో

ఈ మధ్య
నా శ్వాసలో
గాజు పెంకులుంటున్నాయని

నాలోని ఒక పాత వ్యధని
రేపటానికి దేవుళ్లు
ఒకరి వెనుక ఒకరు కదులుతున్నారని

ఈ మాంసం క్రింద నా ఆత్మ
ఓ తప్పుకొన్న ఎముకల్లె దాక్కుందనీ

ఒకప్పుడు నాలో ఎగిరిన పిచ్చుకలు
అలసిపోయాయనీ
అవి వాలటానికి, చెట్టు పంజరం ఇంటికప్పు
వంటివేవీ అక్కడ లేవనీ

తొంగి చూస్తున్నట్లుండాల్సిన గోరు
పాదాన్ని మించి ఎదిగిపోయిందనీ

వచ్చి చెప్పనులే నీతో

మూలం: I WON’T COME AND TELL YOU by GAGAN GILL

పవన్ కుమార్ విశ్లేషణ:
హిందీ కవితను ఆంగ్లంలోకి అనువదించేప్పుడే ఎన్నో తప్పులు దొర్లుతాయి. ఆ తప్పులను మళ్ళీ తెలుగులోకి ఎక్కించడం వ్యర్థం గదా? మూలాన్ని చదవకుండా రాస్తే ఎంత దారుణమైన తప్పులు చేస్తామోనన్న దానికి ఉదాహరణగా ఈ కవితానువాదం పనికొస్తుంది.

బొల్లోజు బాబా అనువాదం, హిందీ మూలం, తెలుగులో ఉరామరికగా అర్థం చదివితే అన్ని పంక్తులూ శుద్ద తప్పుగా వచ్చాయని విశదమవుతుంది. మూలంలోని భావం, విరుపూ అన్నీ అనువాద మంత్రానికి ఉష్ కాకీ అయ్యాయి.

బొల్లోజు బాబా అనువాదం (కొన్ని పంక్తులు):

వచ్చి చెప్పనులే నీతో
ఈ మధ్య
నక్షత్రాల్లా
ఒంటరినై పోయానని

వచ్చి చెప్పనులే నీతో
ఈ మధ్య
నా శ్వాసలో
గాజు పెంకులుంటున్నాయని

హిందీ మూలం:

హం నహీ ఆయేంగే తుంసే కహనే
కి ఇన్ దినో మైన్ హం నక్షత్ర్ హై
నక్షత్రోంకి తరహ్ అకేలా
హం నహీ ఆయేంగే తుంసే కహనే
కి ఇన్ దినో మైన్ సాస్ మైన్
టూటా హువా హైన్ ఎక్ కాచ్

తెలుగులో ఉరామరికగా అర్థం:

నేను రాను నీతో చెప్పేందుకు
ఈ రోజుల్లో నేనొక నక్షత్రాన్నని
నక్షత్రాల్లా ఒంటరిని

నేను రాను నీతో చెప్పేందుకు
ఈ రోజుల్లో శ్వాసలో
గాజు ఒకటి పగిలిందని

పూర్తి మూలం ఈ కింద లంకెలో:
http://india.poetryinternationalweb.org/piw_cms/cms/cms_module/index.php?obj_id=11064&x=1

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

వికృతి నామ ఉగాది పద్యకవితా సదస్సు – మొదటి భాగం

విఘ్ననాయకుడు

కొత్తపాళీ: అందరికీ పెద్దవారు, ఆచార్యులు, చింతా రామకృష్ణారావు గారు చక్కటి గణపతి ప్రార్ధన పద్యం పంపారు.

ఉ:

శ్రీ గణ నాయకా! వికృతిఁ జేర్పను వచ్చెదొ? విశ్వతేజ! రా

వేగమిటున్. ప్రభా కలిత విశ్వ పరిజ్ఞత కావ్య జాల స

ద్యో గుణ సద్విధమ్ మలర; దుర్గుణ బాహ్య మహత్వమొప్ప; రో

జూ గనరా! కృపన్ నగుచు శోభిల జేయుమ! ఆది పూజ్యమై!

కొత్తపాళీ: ఇందులోనే, ఒక కందము, ఒక తేటగీతి గర్భితమై1 ఉన్నాయని వారు సెలవిచ్చారు.

కం:

గణ నాయకా! వికృతిఁ జే

ర్పను వచ్చెదొ? విశ్వతేజ! రావేగమిటున్.

గుణ సద్విధమ్ మలర; దు

ర్గుణ బాహ్య మహత్వమొప్ప; రోజూ గనరా!

కొత్తపాళీ: ఇక తేట గీతి2

వికృతిఁ జేర్పను వచ్చెదొ? విశ్వతేజ!

కలిత విశ్వ పరిజ్ఞత కావ్య జాల

మలర; దుర్గుణ బాహ్య మహత్వమొప్ప;

నగుచు; వర్ధిలఁ జేయుమ! ఆది పూజ్య!

కొత్తపాళీ: ఇందులో, సందర్భానికి తగినట్టు తేటగీతిలో జాల మలర అనడం నాకు బాగా నచ్చింది

రాఘవ: శ్రీమహాగణాధిపతయే నమః

గిరి: కడుపుతో ఉన్న పద్యమెలా ఉంటుందో – ఒక పద్యానికి కడుపునిచ్చి మరీ చూపిన రామకృష్ణ గారికి ధన్యవాదాలు

కామేశ్వరరావు: ఇంత అలవోకగా గర్భ కవిత్వం చెప్తున్నవారిని ఛందస్సు గ్రూపులో మోహన గారిని చూసాను. మళ్ళీ రామకృష్ణగారిని చూసాను!

రాఘవ: బంధకవిత్వం జాలంలో శ్రీ చింతావారు మాత్రమే వ్రాస్తున్నారండీ

చంద్ర: చిత్ర కవితతో చైత్రం ప్రారంభం

కామేశ్వరరావు: వారు ప్రత్యక్షంగా సభలో లేకపోవడం పెద్ద లోటే!

కొత్తపాళీ: కామేశ్వర .. తరవాతైనా చేరుతారని ఆశిద్దాం. ఇంకా నాలుగ్గంటలు ఉన్నాయి కదా

రాఘవ: మోహన గారంటే జెజ్జాల కృష్ణమోహనరావు3 గారేనాండీ?

కామేశ్వరరావు: అవును వారే.

చంద్ర: వినాయకుని ‘జూ’ చూపించారు చింతా వారు!

రాఘవ: గిరిగారూ, కడుపుతో ఉన్న పద్యమా! 😀

ఫణి: ఇలాంటి గర్భ పద్యాలు నేను మొదట చూట్టం రామకృష్ణారావు గారి బ్లాగులోనే

కొత్తపాళీ: కామేశ్వర.. మోహన గారి పద్యాలకీ చింతావారి పద్యాలకీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. మోహన గారి ఆసక్తి ముఖ్యంగా, అక్షరాలలో, గణాలలో ఉండే అమరికలు patterns మీద. అందుకని వారి పద్యాల్లో కవిత్వ భావం కంటే ఆ పద్యపు నడక ఎక్కువగా వెలుగుతుంది. చింతా వారి పద్యాల్లో, భావ చమత్కృతులు, వింత వాడుకలు చమక్కు మనిపిస్తాయి. కవిత్వ భావానికే ప్రాధాన్యం చింతా వారి పద్యాల్లో.

ఫణి:
కం:

వినుతించిరి గణనాథుని

తనువంతయు పులకరించె ధైర్యము వచ్చెన్

తనియగ కవిజన గణమున

వినిపించును శ్రావ్య కవిత వికృతికి వేడ్కన్

రాఘవ: ఫణిగారూ, భలే

కొత్తపాళీ: ఫణీ, బాగు బాగు

ఫణి: ధన్యవాదాలు.

కామేశ్వరరావు: ఫణిగారు, కందం మంచి జోరందుకుంది!

గిరి: అంటే, మోహన గారి పద్యాలు చైనా అమ్మాయిల్లాంటి వన్నమాట

రాఘవ: గిరిగారూ, వసంతానికి మధ్యలో చైనా అమ్మాయిలేండంటీ? మన్మథుడు ఈసారి చైనా మీదినుండి వచ్చాడా ఏమిటీ?

కొత్తపాళీ: కామేశ్వర్రావు గారు, సరస్వతీ నమస్తుభ్యం అంటారా?

కామేశ్వరరావు: తప్పకుండా

వాగ్దేవి
ఈ ప్రార్థన కామేశ్వరరావు స్వరంలోనే వినండి

సీ:

ఆదివేదము నందు “అగ్ని మీళే పురో హిత”మంచు నే దేవి యిలను వెలసె

ఏ దేవి తా “మానిషాద” శ్లోకమ్మున నాదిగా దిద్దె కావ్యాక్షరమ్ము

వాసి నే దేవి “శ్రీవాణీ” స్వరూపాన అడుగిడె తెలుగు కావ్యంపుటింట

జానపదమ్ముగా జాతి గుండియలోన నాదిగా ఏ దేవి నాట్యమాడె

తే.గీ

అట్టి యా దేవి కళలకు నాటపట్టు

విద్యలన్నియు నొసగెడు వెల్లచెట్టు

మనిషి మనుగడ కామెయే యునికిపట్టు

కరుణ జూచుత సభ రక్తికట్టునట్టు

చంద్ర: భళీ!

గిరి: చరిచితి చరిచితి నేను మీకొరకు చప్పట్టు

రాఘవ: లేరు ఇట్టి కవిత వ్రాయలేరు బెట్టు

గిరి: చాల బావుంది కామేశ్వరరావు గారు

సనత్: భళీ కామేశ్వర కవీ, భళీ!

చదువరి: చాలా బావుంది.

కొత్తపాళీ: ఋగ్వేదం నించి, సంస్కృతాంధ్రాల్లో ఆది కావ్యాల్ని స్పృశిస్తూ .. చాలా చాలా బావుంది

కామేశ్వరరావు: 🙂 కృతజ్ఞతలు, నెనరులు.

శ్రీరామ్: మధురమైన పద్యం

ఫణి: చాలా బాగుందండీ.

గిరి: “అగ్ని మీళే పురోహిత ” గురించి వివరిస్తే బావుంటుంది

పుష్యం: వెల్ల చెట్టు == కల్ప తరువు??

కామేశ్వరరావు: అవునండి. వెల్లచెట్టు అంటే కల్పతరువు. సరస్వతి కూడా “సర్వ శుక్ల” కదా మరి!

కొత్తపాళీ: ఋగ్వేదంలో మొదటి ఋక్కు .. అగ్నిమీళే పురోహితం యజ్ఞత్వ దేవ వృత్విజం .. దేవతలకి పురోహితుడు అయిన అగ్నికి నమస్కారం అని అర్ధం

సనత్: అగ్ని మీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్న ధాతమం అని మంత్రం…

కొత్తపాళీ: మనకో శ్రీరాముడు సభలోనే ఉన్నాడు .. ఈతడు బ్లాగుల్లో సమస్యాపూరణలకి తొలి అడుగు వేసిన భగీరథుడని చెప్పుకోవచ్చు.

కొత్తపాళీ: రాఘవ, మీ శ్రీరాముణ్ణి మా కళ్ళముందు సాక్షాత్కరింప చెయ్యండి

రాఘవ: సరేనండీ. మా రాముడు ఆత్మారాముడు.

కామేశ్వరరావు: రాముని ప్రస్తావన రాగానే విశ్వామిత్రులవారు వేంచేశారు!

కోదండరాముడు

రాఘవ:
శా:

అవ్యక్తంబయి వ్యక్తమై తనరి మాయాకల్పితాజాణ్డమై

నవ్యవ్యాహృతియై పరార్థమయి ప్రాణంబై మహావాక్యమై

కవ్యాలాపసుధాకరాబ్ధియయి నైకైకత్వచిహ్నంబునై

దివ్యానన్దము రాముఁడై స్వరససిద్ధిన్నిచ్చుతన్ నిచ్చలున్

శ్రీరామ్: ఏమి ధార!

కామేశ్వరరావు: ఆత్మారాముడే కాదు అద్వైత రాముడు కూడానూ!

రవి: కవ్యాలాపసుధాకరాబ్ధి – ఇటువంటి సమాసాలు రాఘవ గారి పేటెంట్ !

కొత్తపాళీ: ఆహాహా, ఖరహరప్రియలో త్యాగరాజకృతి విన్నంత హాయిగా ఉంది. మాయాకల్పితాజాణ్డమై, నవ్యవ్యాహృతియై – దయచేసి వివరించండి

గిరి: నా నోటి ముందు ప్రశ్నని లాగేసుకున్నారు కొత్తపాళీ గారు

రాఘవ: ఏ దేని మాయచేత నైతే బ్రహ్మాండములు కల్పించబడుతున్నవో ఆ దివ్యానందము

రాఘవ: గుణాతీతమైన అవస్థాతీతమైన దివ్యానందస్వరూపం

శ్రీరామ్: అలాగే మహావాక్యాలు మనకి మూడు కదా…మీరు ప్రస్తావించింది ఏది?

రాఘవ: అటువంటి ఆనందస్వరూపపు మాయచేత బ్రహ్మాండసృష్టి జఱుగుతూంటే… కవిలో నవ్యమైన పదముల సృష్టి జఱుగుతుంది

రాఘవ: అలాంటి నవ్యవ్యాహృతిగా కూడ ఆ దివ్యానందమే వెలుగుతోంది. అందుకే పరార్థమయి, పరా పశ్యన్తీ మధ్యమా వైఖరీ అని మాట నాలుగు రకాలు. అందులో పరా రూపంగా తొలుత నెలకొన్నదీ అదే అని

కొత్తపాళీ: బాగుంది. త్యాగరాజస్వామే ఒక కృతిలో .. నాద బ్రహ్మానంద రూపా .. అన్నారు

రాఘవ: ఔనౌను

సనత్: పరా పశ్యన్తీ మధ్యమా వైఖరీ అని “వాక్కు” నాలుగు రకాలు

రాఘవ: ఔనండీ సనత్‌గారూ

రాఘవ: తర్వాత అలాంటి వెలుగు రాముడై వచ్చి స్వరససిద్ధిన్ ఇవ్వాలీ అని మంగళాశాసనం

మురళి: రాఘవగారూ మీ వివరణ అద్భుతం

కామేశ్వరరావు: “నైకైకత్వచిహ్నంబునై” అద్భుతమైన పదం!

గిరి: బావుంది – ఇంతలా అడిగితే ఎందుకు ఇవ్వడాయన

రాఘవ: ఇక్కడ స్వరస అన్నది కూడ స్వర-స స్వర-స అన్న శ్సేషతో

ఫణి: శ్రీ రామ తత్వాన్ని చక్కగా చూపారండీ.

రాఘవ: ఇక్కడ స్వరస అన్నది కూడ స్వర-స స్వర-స అన్న శ్లేషతో. నైకైకత్వచిహ్నం… ఏకం కానిదానిలో కూడ ఏకత్వాన్ని సూచించే అద్వైతపరంబ్రహ్మస్వరూపం

కామేశ్వరరావు: రామ”చంద్రుడు” కాబట్టి సుధాకరాబ్ధి!

కొత్తపాళీ: నాకు కర్నాటక సంగీతమంటే ఉన్న అభిమానం వల్ల నాకు రాముడంటే ఒక ప్రత్యేకమైన “ఇది”

రాకేశ్వరుఁడు: నాకు అదే కారణం చేత నంతే ఇది!

సనత్: నాకు రాముడంటే ఉన్న అభిమానం వల్ల నాకు కర్నాటక సంగీతమంటే ఒక ప్రత్యేకమైన “ఇది”

రాఘవ: పద్యంలో మాత్రం కవుల ఆలాపమనే సుధాకరునికి తండ్రి అన్న అర్థం ముఖ్యం

రాఘవ: రాముడు అందఱికీ హృదయేశ్వరుడు

సనత్: ఆత్మేశ్వరుడు కూడా..

రాఘవ: ఆ రాముడికీ, రామబంధువులకీ నమస్కారం

కొత్తపాళీ: గిరిధరా మీరు సిద్ధమైతే, మీ మంగళాశాసనంతో ముందుకి వెళ్దాం.

గిరి:
సీ:

చైత్రము కావాలి శాత్రవ నాశని వైశాఖ తేవాలి పైడివెలుగు

జ్యేష్ఠము కావాలి కాష్ఠమత్యాశకు ఆషాఢమాసమ్ము ఐశ్వరియము

శ్రావణమున కొనసాగాలి సందళ్ళు భద్రాయుతే యౌగ భాద్రపదము

ఆశ్వీయుజము తెచ్చు నాశీర్వచనములు కార్తీక కురిపించు కనక వృష్టి

తే.గీ

మార్గశిరపుష్యములు, అల మాఘఫాల్గు

ణములు, జనుల కొసగ సద్గుణపు నిధులను,

మానవాళికి శోభాయమానమైన

వత్సరమ్ము ప్రసాదించు పదుమనాభ

కొత్తపాళీ: నేను లెక్క పెట్టలేదు, పన్నెండు నెలలూ వచ్చేశాయా?

రాఘవ: ఎనిమిదీ నాలుగూను… ఆఁ వచ్చేశాయండీ

మురళి: గిరిగారు నెల తప్పరు లెండి

చదువరి: 🙂

రాఘవ: మురళిగారూ, 😀

కామేశ్వరరావు: 🙂

రవి: 🙂

కొత్తపాళీ: మురళీ .. హహ్హహ్హా

గిరి: పదిపాదాలలోనే వచ్చేసాయి

కొత్తపాళీ: భలే భలే

గిరి: హ హ హ

రాఘవ: పది… నెలలు

చదువరి: సరిగ్గా పదేనని అంటున్నారు గిరిగారు 🙂

రాఘవ: అదేనండీ నేనూ అంటున్నది

గిరి: నిజానికి తొమ్మిదిలోనే వచ్చాయి

పుష్యం: పది పాదాలలో 12 ని ఇరికించారు.. అధికమాసాలు వస్తాయనుకున్నాను ఆఖరి పాదాల్లో 🙂

గిరి: అక్కడా నెల తప్పలేదు

కొత్తపాళీ: ఎంతైనా లెక్కల్లో ఘటికులు కదా

రాకేశ్వరుఁడు: అసలే ఈ చైత్రంతోఁబాటూ అధికం వస్తుందఁట

విశ్వామిత్ర: నూత్నత్వం కోసం తెలుగు నాట ఉపయోగిస్తున్న పేర్లను చూసి మీరు కూడ కార్తీక అన్నట్టున్నారు

గిరి: సభ్యులకో విన్నపము – నా పద్యంలో కార్తీక అన్న చోట కార్తిక అని అచ్చువేసుకోమని మనవి

రాఘవ: ఔనండీ గిరిగారూ, చైత్రంలో శత్రువులు ఎక్కడుంటారండీ?

రవి: ఈసారి వైశాఖం వెలుగుతో బాటు భీకరమైన ఎండనూ తెచ్చేలాగుందండి

కామేశ్వరరావు: విరహార్తులకి, వసంతమే పెద్ద శత్రువు 🙂

విశ్వామిత్ర: ఏ నెలలోనైనా శత్రువులు మనలోనే ఉంటారుట ఆరుగురు

గిరి: రాఘవ గారు ప్రస్తుత పరిస్థితుల్లో శత్రువులు ఎక్కడలేరు!

సనత్ కుమార్: ఇన్‍కంటాక్సు కట్టాకా… కొత్త బడ్జెట్టుతో దాడి జరిగేది చైత్రంలోనే కదండీ…

కొత్తపాళీ: రాఘవ, చైత్రంలో ఉన్నారని కాదు, ఎక్కడో ఉన్నవారు ఈ చైత్రంతో నశించిపోవాలని

రాకేశ్వరుఁడు: అన్నమయ్యయొక్క ఇన్నిరాశులయునికి కీర్తనలా వుంది।

రాఘవ: ఓహో శత్రువులందఱూ వర్షారంభంలోనే నాశనమవ్వాలనా.. బాగు

రాకేశ్వరుఁడు: విశ్వామిత్ర – ఆ ఆరుగురి మాట గుర్తుపెట్టుకోండి 🙂

నరసింహారావు: అందరికీ వందనాలు.

కొత్తపాళీ: సరే, ముందుకి వెళ్దాం. విశ్వామిత్రులు సిద్ధమైనట్టు ఉన్నారు. విశ్వామిత్రుల వారూ, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకండి.

విశ్వామిత్ర: చిత్తం
శా:

శ్రీకారమ్మును జుట్టగా మరలనే శేషాధికోత్కృష్టమౌ

ఆకాంక్షాతతికిన్ ముహూర్త మిదనిన్ అవ్యక్తరూపంబెదో

నాకుంబల్కెను, యంత నిద్ర చెదరెన్; నాందీవచోఘోషలన్

వాకల్సాగెనువేడినెత్తురులు, జీవమ్మొందె నూత్నద్యుతిన్

కొత్తపాళీ: ఎంతైనా విశ్వామిత్రులనిపించారు, వేడి నెత్తురు పొంగిందిట .. ఇంకా ఉన్నట్టుంది మీ పద్యధార?

విశ్వామిత్ర:
సీ:

నాల్గునెలలవాన నదులనిండానీరు, కలుగుగా కదలిరా కర్మ భూమి

గ్రీష్మతాపముతగ్గి రెట్టిభూతాపమున్, తరలిరా తపనులా ధర్మ భూమి

ఎల్లఋతువలందు చల్లగా జనులంత, బ్రతుకగా నడచిరా భరత భూమి

వృక్షజంతుచయము వృద్ధినొందమిగుల, అడుగిడుము రయము ఆర్ష భూమి

ఆ.వె

వికృతములకు వికృతి వీవుగానిలచియే

ప్రకృతి ప్రేమి వయ్యి ఫలములొసగ

విశ్వశాంతి గోరి విడిదిజేయుముస్వామి!

స్వాగతమ్ము నీకు సరస గతిని.

రాఘవ: త్రేతాయుగంలో తపస్సు చెదిరింది. కలియుగంలో నిద్ర చెదిరింది. ప్రమోషన్ అన్నమాట. 🙂

కొత్తపాళీ: బాగు బాగు, పనిలో పనిగా పర్యావరణ రక్షణ అనే లోకకళ్యాణ ఉద్యమాన్ని కూడా ఇందులో తల్చుకున్నారు

ఫణి: హరితాహ్వానం బాగుందండీ.

కామేశ్వరరావు: బాగుంది. విశ్వశాంతిని కోరి మీ విశ్వామిత్ర నామాన్ని సార్థకం చేసుకున్నారు!

విశ్వామిత్ర: స్వామి కార్యం కదా అని “స్వామి” అన్నాను 🙂 3వ పాదం లో

కొత్తపాళీ: విశ్వశాంతిని కోరడం కూడా ముదావహం, సముచితంగా ఉంది

రాఘవ: స్వామ్యలంకారం 🙂

రాకేశ్వరుఁడు: విశ్వామిత్ర గారు, పర్యావరణ పాయింటు కూడా గుర్తు పెట్టుకోండి 🙂

గిరి: బావుంది బావుంది

విశ్వామిత్ర: ఎలాంటి భూమి మీద అడుగుపెడుతున్నావో తెలుసుకో అని ఓ హెచ్చరిక కూడానూ

చదువరి: హెచ్చరిక -ఔను!

రాకేశ్వరుఁడు: నాదో వ్యాకరణ సందేహం

కొత్తపాళీ: రాకేశ్వర, అడగండి

రాకేశ్వరుఁడు: తెలుఁగన్నడల లోప సంధులలో అచ్చుకి అచ్చు పరమైతే మొదటిది నశిస్తుందిగా… ఎల్ల + ఋతువులు = ఎల్లృతువులు అవుతుందా ?

నరసింహారావు: అవదు

కామేశ్వరరావు: అవ్వదండి.

రాఘవ: ఋ అచ్చ తెలుగులో లేదు

విశ్వామిత్ర: రాకేశా – రసపట్టులో వ్యాకరణం కూడదు

చదువరి: 🙂

కొత్తపాళీ: విశ్వామిత్ర .. హ హ్హ హ్హా

నరసింహారావు: తర్కం కూడా కుదరదు

రాకేశ్వరుఁడు: రసపట్టులో రసపట్టైన (వర్తించని) వ్యాకరణం కూడుతుంది, గుణకారం కూడా చేస్తుంది 😀

శ్రీరామ్: అకారానికి సంధి నిత్యం కాదు కదా!

రాఘవ: అచ్చ తెలుఁగు భాషలో ఋ కారం లేదు. అందువల్ల ఋకారం వచ్చిందీ అంటే అది తెలుగు సంధి అవ్వదు. అంటే అకారేకారోకారసంధులు ఏవీ చెల్లవు.

రాకేశ్వరుఁడు: ఋ అచ్చు తెలుఁగులో లేకపోతేనే… కన్నడ వారు ఎల్ల + ఋ + బన్ని = ఎల్లౄ బన్ని అని సంధి చేస్తారే 🙂

కొత్తపాళీ: బాగుంది. అవతారికలకే గంట పట్టింది. ఇంక అసలు కార్యక్రమంలోకి వెళ్దాము

గిరి: కన్నడ వారి వ్యాకరణలోపాల్ని కన్నడించి ముందుకు సాగుదాం

~~~~~

పొద్దు నిర్వహించిన గత కవి సమ్మేళనాల విశేషాలను చదవండి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1. బంధ కవిత్వం, గర్భ కవిత్వం, చిత్ర కవిత్వం గురించి పరిచయం కోసం ఈమాటలోని ఈ లింకు చూడండి.
2. కందంలో ఇమిడ్చిన మరో మూడు కందాల గురించిన టపా చింతా రామకృష్ణారావు గారి బ్లాగులో చూడండి.
3. జెజ్జాల కృష్ణమోహనరావు గారు వందలాది గర్భకవిత్వ పద్యాలను రచించిన కవి. ఛందస్సులో వారు చేసిన కృషికిగాను 2009 సంవత్సరపు సి.పి.బ్రౌను పురస్కారం అందుకున్నారు.

——–

(బొమ్మల శ్రేయస్సు: ఆంధ్రావిలాస్)

Posted in కవిత్వం | Tagged , | 5 Comments

క’వికృతి’ (ఉగాది వచన కవి సమ్మేళనం) – ౧

వికృతి నామ సంవత్సరాది సందర్భం గా పొద్దు పత్రిక నిర్వహించిన వచన కవి సమ్మేళనం లోని కవితలను పాఠకులకు అందిస్తున్నాము. ఈ కవితలపై మీ సద్విమర్శలనూ, విశ్లేషణలనూ ఆశిస్తున్నాం. ఏందుకంటే వీటిపై పత్రిక ఎడిటింగ్ లేకుండా నేరుగా ప్రచురిస్తున్నాం. ఇక పాఠకులే ఎడిటర్లూ,విమర్శకులూ, విశ్లేషకులూ అన్నీ!

కవితాగానం

శబ్ద ఖననాన్ని కోరుకుంటున్నా..!
-పెరుగు.రామకృష్ణ, నెల్లూరు

డిజిటల్ డోల్బీ ఊయలలొ పురుడు పోసుకుని
ఏడువేల ఓల్టుల సమ్మోహన శబ్ద తరంగాల మధ్య
ఇప్పుడు మనం తప్పటడుగుల్లోనే వున్నాం..
గుండె డమరుకం పగిలి ఊగిసలాటల్లో ఉడుకుతుంది దేహం

శరీరం చిగురించదు
ప్రశాంత సముద్రంలో నావలా
బ్రతుకు ఊసులాటల్లేవు
శబ్ద రొదల్లో మనిషి గుండె పుండై పూసి
శిరసు లేని మొండెమై తిరుగుతుంది

శబ్ద సమూహమే అంతా
నిశ్శబ్దాన్ని మాయం చేస్తూ
మనిషి శబ్ద సమూహాన్ని విడవడం లేదు
పర్యావరణాన్ని నడిరోడ్డుపై హత్య చేస్తున్న
శబ్ద ఖననాన్ని కోరుకుంటున్నాడు
ప్రశాంతతను మరచి పోతున్నాడు

పాదాలకు అబ్బిన నాట్యం..
పదాల భుజాల మీద రాకాసి ధ్వనై కూర్చుంది
ఇప్పుడు అక్షరం కూడా నిశ్శబ్దం కోల్పోయి అలజడి చేస్తోంది
ఒక పురాతన స్వప్నం పునరాలోచనమౌతుంది నాకు
పిట్టలేని లోకాన్ని చూస్తున్న నేను
శబ్ద రహిత ప్రపంచాన్ని వెదికాను
కనుచూపుమేరలో లేదు

ఎందుకంటే..
శబ్ద రహిత మానవుడిప్పుడు కరువయ్యాడు కనుక
మనిషి లోపల కూడా శబ్దమే ధ్వనిస్తుంది కనుక…!

*Wishing for the burial of noise..!*

Delivered in the digital Dolby cradle
Amidst 7 KV enchanted sound waves
We are still toddlers now
The heart, Shiva’s drum, broken, oscillates the boiled body
Doesn’t break into fresh leaf
No small talk now as in a boat in the quiet sea
Boiling, man wanders like a headless torso
Silence disappeared as though by magic
Man is not able to escape the hubbub of din
Wishes to inter the killing noise
That is murdering environment openly in broad day light
He is forgetting calm and peace and the dance his feet imbibed
Noise becoming an ogre sits on the shoulders of the word
Now even the alphabet, having lost its silence, is agitating
I relive an ancient dream
Watching a world without fauna
I searched for a noise-free world
Nowhere within sight now

Since –
There is the dearth of a noiseless man

Since
Even within man it’s only noise that rings and rumbles

Telugu Original: Perugu Ramakrishna

English rendering:Dr. V.V.B. Rama Rao, Newdelhi

~~~~~~~~

పొద్దు నిర్వహించిన పూర్వ కవిసమ్మేళనం విశేషాలు చదవండి.

—————————————–

బొమ్మ శ్రేయస్సు

Posted in కవిత్వం | 6 Comments

వికృతి నామ ఉగాది కవి సమ్మేళనాలు

వికృతి నామ సంవత్సరాది సందర్భంగా పొద్దు రెండు కవిసమ్మేళనాలను నిర్వహించింది. ఒకటి వచన కవితా సదస్సు కాగా రెండోది ఛందోబద్ధ పద్యకవిత్వ సదస్సు. పూర్తిగా అంతర్జాల మాధ్యమంలో జరిగిన ఈ సదస్సులలో కవులు ఎంతో ఆసక్తితో పాల్గొని కవిత్వ ధారలు కురిపించారు.

వచన కవుల సమ్మేళనం: వచన కవుల సదస్సును పొద్దు సంపాదకవర్గ సభ్యులు స్వాతి కుమారి గారు నిర్వహించారు. ఈ సదస్సు ఫిబ్రవరి 16 న మొదలై మార్చి 10 వరకూ జరిగింది. కవులు తమ స్వీయ కవితలను ఈమెయిళ్ళ ద్వారా పంపారు. కవిత్వంలోని క్లుప్తత, అనువాద కవిత్వం వంటి అంశాలపై చర్చలు కూడా జరిగాయి.

పాల్గొన్న వారు

  1. పెరుగు రామకృష్ణ
  2. చావా కిరణ్
  3. స్వాతీ శ్రీపాద
  4. జాన్ హైడ్ కనమూరి
  5. హేమ వెంపటి
  6. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి
  7. కత్తి మహేష్ కుమార్
  8. బొల్లోజు బాబా
  9. దామోదర్ అంకం
  10. ఎం ఎస్ నాయుడు
  11. ఆత్రేయ కొండూరు
  12. రాకేశ్వరరావు

———————————–

పద్య కవుల సమ్మేళనం: పద్య కవుల సమ్మేళనం కొత్తపాళీ గారి ఆధ్వర్యంలో 11 మంది పద్యకవులతో జరిగింది. మార్చి 3 న సన్నాహకాలతో మొదలై మార్చి 13 వతేదీ శనివారం నాడు జరిగిన సభతో విజయంతంగా ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటలపాటు రసోల్లాసంగా జరిగిన ఈ సభలో కింది కవులు, రసజ్ఞులు పాల్గొన్నారు.

సభాధ్యక్షుడు: నారాయణస్వామి (కొత్తపాళీ)

పాల్గొన్న కవులు:

  1. లంకా గిరిధర్
  2. భైరవభట్ల కామేశ్వరరావు
  3. ఫణి ప్రసన్న కుమార్
  4. పుష్యం
  5. రాఘవ
  6. రాకేశ్వరుఁడు
  7. రవి
  8. సనత్‌ కుమార్
  9. విశ్వామిత్ర
  10. శ్రీరామ్
  11. చదువరి

ప్రేక్షకులు:

  1. చంద్రమోహన్
  2. నరసింహారావు
  3. కోడిహళ్ళి మురళీమోహన్
  4. సురేష్
  5. జ్యోతి

కొత్తపాళీ గారు ఎప్పటిలానే ఈ సభను కూడా ఆద్యంతమూ చక్కగా నిర్వహించారు. ముందుగా వారిచ్చిన సమస్యలు:
————————————————-
సమస్యలు

  1. ఓటది నాయిష్టమనుచు వోటరు పలికెన్
  2. రాట్నము చేతబట్టుకొని రాక్షస కృత్యము చేసినాడహో
  3. గరికయొ గడ్డియొ మెసవి గైకొనవచ్చు గవిత్వ సంపదల్
  4. కుసుమములెల్ల జిత్తమున కోరికలై మురిపాలు గ్రోలగా
  5. లావొక్కింతయు లేదు … ఈ మాటలతో మొదలు పెట్టి పోతన ఛాయ కనబడకుండ రాయండి
  6. ఎదుటన్నిల్చె సహస్రభోగములు మేలేసేయు వ్యాపారముల్
  7. కుందేళులు రెండు వచ్చి కుచముల గరచెన్
  8. వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్
  9. రాణ్మహేంద్రవరమ్ము చేరెను రత్నగర్భుని చెంతకున్
  10. దారను విడనాడ సుఖము తథ్యమగును
  11. అక్షప్రౌఢిమ మీర ఆ శకుని లంకాధీశుతో బోరెడిన్
  12. ఒకటి ఒకటి కూడి ఒకటెయగును
  13. పేరు గొప్పకాని ఊరు దిబ్బ

దత్తపదులు:

  1. బీరు, విస్కీ, రమ్ము, జిన్ను – గాంధేయవాదం గొప్పదనం
  2. పిల్ల, జెల్ల, ఇల్లు, గుల్ల – ఒకో పదం ఒకో పాదంలో. ఆదర్శ దాంపత్యం
  3. మాసు, బాసు, కింగు, కేడీ – మన్మథుని గురించి
  4. కోతి, నాతి, రీతి, జ్యోతి – ఒక్కొక్క పాదంలో అదే వరసలో
  5. గిల్లీ, దండా, అష్టా, చెమ్మా – వసంతకాల వర్ణన
  6. మాలిక, తూలిక, చాలిక, పోలిక – ఉత్పలమాల మొదటి పదాలుగా వాడుతూ
  7. కూడలి, హారం, జల్లెడ, పొద్దు – బ్లాగుల ప్రశస్తి గురించి సీసం
  8. నవాబు జవాబు కవాతు తవాయి

వర్ణనలు

  1. ద్రౌపది – 3-5 పద్యాల్లో
  2. మీరొక రైల్లో వెళ్తున్నారు. ఎదురుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళీద్దరూ కనీసం పరిచయస్తులు కూడా కాదు, కానీ ఆ అబ్బాయి కళ్ళల్లో ఆ అమ్మాయి పట్ల ఆరాధన. బయటికి చెప్పలేడు. ఇదంతా మీ కళ్ళకి కనిపిస్తోంది. వర్ణించండి.

ఆనువాదాలు

Robert Frost
Nature’s first green is gold,
Her hardest hue to hold.
Her early leaf’s a flower;
But only so an hour.
Then leaf subsides to leaf.
So Eden sank to grief,
So dawn goes down to day.
Nothing gold can stay.

William Wordsworth – on Westminster Bridge
Earth has not anything to show more fair:
Dull would he be of soul who could pass by
A sight so touching in its majesty:
This city now doth, like a garment, wear
The beauty of the morning; silent, bare.
Ships, towers, domes, theaters, and temples lie
Open unto the fields, and to the sky;
All bright and glittering in the smokeless air.
Never did sun more beautifully steep
In his splendor, valley, rock or hill;
Ne’er saw I, never felt, a calm so deep!
The river glideth at his own sweet will:
Dear God! the very houses seem asleep;
And all that mighty heart is lying still!

(ఈ కింది రెండు సంస్కృత మూలాలు నాగమురళిగారికి ధన్యవాదాలతో)
చాటువు
నపుంసకమితి ఙ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మన:
తత్తు తత్రైవ రమతే హతా: పాణినా వయం ||

కుమారసంభవం నించి శివుని వర్ణన
భుజఙ్గమోనద్ధజటాకలాపం కర్ణావసక్తద్విగుణాక్షసూత్రం
కణ్ఠప్రభాసఙ్గవిశేషనీలాం కృష్ణత్వచం గ్రంథిమతీం దధానం ||

సర్పంతో తన జటలను కట్టుకొని ఉన్నాడు. చెవిపైన రెండు పేటలుగా రుద్రాక్ష మాలను ధరించి ఉన్నాడు. ఆయన కంఠం నుంచి నీలిమలు ప్రసరించడం చేత మరింత నల్లనైన కృష్ణ జింక చర్మాన్ని ధరించి వున్నాడు.

కిఞ్చిత్ప్రకాశస్తిమితోగ్రతారై
ర్భ్రూవిక్రియాయాం విరతప్రసఙ్గై:
నేత్రైరవిస్పందితపక్ష్మమాలైర్
లక్ష్యీకృత ఘ్రాణమధోమయూఖై: ||

ఉగ్రములైన ఆయన కంటి పాపలు స్తిమితములై కొంచము ప్రకాశిస్తూ ఉండగా (అర్ధ నిమీలిత నేత్రాలు అన్నమాట) భ్రూ చలనము లేని రెప్పల స్పందన లేని ఆయన కళ్ళు అధోముఖంగా కాంతులు ప్రసరిస్తూ ఆయన ముక్కును తమ లక్ష్యంగా చేసుకున్నట్టుగా ఉన్నై.

అవృష్టిసంరంభమివాంబువాహ మపామివాధారమనుత్తరఙ్గం
అంతశ్చరాణాం మరుతాం నిరోధాన్నివాతనిష్కంపమివ ప్రదీపం ||

వాన అలజడి లేని మేఘం లాగా, తరంగాలు లేని సముద్రం లాగా ఉన్నాడాయన. తన అంతర్వాయువులను (ప్రాణములను) నిరోధించడంచేత గాలి లేక నిశ్చలంగా ఉన్న దీపం లాగా ఉన్నాడు.

——————————————-
అంతర్జాలంలో జరిగిన ఈ కవిసమ్మేళనాల విశేషాలను వివరంగా పొద్దు పాఠకులకు సమర్పిస్తున్నాం. ఈ వ్యాసాల్లోని మొదటి భాగాలు ఉగాది పర్వదినాన మీకోసం.

పై సమస్యలను పూరించే ఆసక్తి గల పాఠకులు తమ పూరణలను పొద్దు (editor@poddu.net) కు పంపవచ్చును. ప్రచురణయోగ్యమైన వాటిని వ్యాసాలతోపాటు అనుబంధంగా ప్రచురిస్తాం.

Posted in వ్యాసం | 7 Comments

గుండె చప్పుళ్ళు

-తులసీ మోహన్

జ్ఞాపకాలు…
వాటికేం!? వచ్చిపోతుంటాయి
గాలి వీచినప్పుడో, గులాబీలు పూసినప్పుడో
కానీ కంటి నిండా నీళ్ళే వెతుక్కుంటాయి
తుడిచే వేళ్ళ కోసం.

నిన్నలా నేడుండనివ్వదు
ప్రకృతికెంత పౌరుషం!
మెరుపు చూపిస్తూనే
ముసురు కమ్ముతుంది.

సందెపొద్దులు, శ్రావణమేఘాలు
మధుర రాత్రులు, మౌనరాగాలు
ఎద అంచుల్లో జోడు విహంగాలు
ఏదయినా ఏకాంతం కాసేపే

తిరిగే ప్రతి మలుపులో
కొన్ని తలపులు దడి కట్టుకుంటాయి
యే జోరువానకో గండి పడి
గుండె లయ తప్పుతుంది

నిశ్శబ్దాన్ని నింపుకుని కలం
రాత్రి రంగు పులుముకుని కాగితం
ఎప్పుడో యే అర్ధరాత్రికో
కలతనిద్రలోకి జారతాయి

గుండెచప్పుళ్ళన్నిటినీ
అక్షరాలు గుర్తించాలనేం లేదుగా!

——————————————

లక్ష్మీ తులసి రామినేని

లక్ష్మీతులసి రామినేని, సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ, కుటుంబంతో చికాగోలో ఉంటున్నారు. కవితలు చదవడం-వ్రాయడం, పెయింటింగ్, సంగీతం వినడం, స్నేహితులతో గడపడం వీరి హాబీలు.

Posted in కవిత్వం | 15 Comments

సమానత్వం

– చావా కిరణ్

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

బీయీడీలు యంయీడీలు అయినా ఖాలీగున్నాం
పదయింది, పన్నెండయింది తరువాత ఏంటి?
బీడుభూములన్ని ఆవురావురమంటున్నాయి
శమంతకముంది గాని స్వర్ణమే నిలవడంలేదు.

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

బీయీడీలకు యంయీడీలకు ఉజ్జోగాలిత్తాడు
పదికి పన్నెండుకు విజ్ఞాన్నిస్తాడు
బీడు భూములకు నీళ్లిస్తాడు
శమంతకం పట్టి స్వర్ణం నిలుపుతాడు.

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

ఎండకు వానకు నే మగ్గుతుంటే
ఆ రాజ్యపోడికి తాటాకు గుడిసెలు
అయోమయాన నే నిలబడితే
వాడేమో పరుగెడతాడా.

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

వాడి గుడిసె పీకి
నాకు పందిరేస్తాడు
వాడి కాళ్లిరిచి
సమానత్వం తెస్తాడు.

నిద్ర పోతున్న మారాజు మేల్కొంటాడు
కొలువు దీరి కలతలన్ని బాపుతాడు.

Posted in కవిత్వం | 6 Comments

జనవరి 2010 గడి ఫలితాలు – వివరణలు

-కొవ్వలి సత్యసాయి

జనవరి 2010 వివరణలు

ముందుగా గడి సులభంగా ఉందని చెప్పినవారందరికీ నా కృతజ్ఞతలు. చాలా సులభంగా ఇచ్చానని అనుకున్నప్పుడల్లా చాలా కష్టంగా ఉందని పూరకులనుకున్నప్పుడు కాస్త ఆశ్చర్యమేసేది. మా ఇస్టూడెంట్ పిలకాయలు ప్రశ్నాపత్రం ఎంత ఈజీగా ఇచ్చాననుకున్నాకష్టంగా ఉందని వగర్చడంగుర్తొచ్చేది. ఒకే కూర్పరి గడి కొన్ని సార్లు చేస్తే దాన్లోని నాడి పట్టుకోవచ్చు. ఆనక సులభం అనిపిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోందనుకోవచ్చు. ఇంకో విషయం, గడినింపేవాళ్ళు, ముఖ్యంగా కొత్తవారు, పెరగడం ముదావహం. వారందరికీ నాఅభినందనలూ, అభివాదాలూ.

ఈసారి గడికి 29 పూరణలు 24 మందినుండి వచ్చాయి. ఒకే తప్పుతో నాగార్జున, ఆదిత్య, కామేశ్వర రావు, శుభ గార్లు, రెండు తప్పులతో రాగమంజీర, కోడీహళ్లి మురళీమోహన్, శ్రీలలిత, శ్రీలు, సుభద్ర వేదుల గార్లు, మూడు తప్పులతో బుడుగాయ్, నాగేశ్, వల్లీసునీత గార్లు పూరించారు. ఆవెనుకనే ఉన్నవారు జ్యోతి, సుధారాణి, శైలజ, అపరంజి, భమిడిపాటి ఫణిబాబు, భమిడిపాటి సూర్యలక్ష్మి, రాజేశ్వరి, రాధిక, అరిపిరాల, అపురూప గార్లు. చిత్తి గారికి పూరించడం కొత్తఅనుకుంటా అందుకని వర్ణక్రమదోషాలు, ముద్రా రాక్షసాలు ఎక్కువ కనిపించాయి. క్రమంగా అలవాటైపోతుంది, పూరిస్తూఉండండని వారికి మనవి.

1 గ్ర

2 ణం

X

3 ర

X

X

4 చు

5 లు

తొ

డం

6 కాం

ద్ద

X

X

7 వి

8 సు

గు

X

క్కు

X

X

తం

X

9 న

10 ము

X

డో

X

11 శ

X

12 చం

ద్రి

13 ర్త

ము

X

14 కు

సు

మం

X

X

15 భ

రా

X

16 క్షు

X

X

X

17 క

X

త్రు

X

వు

X

18 ఉ

X

X

X

ము

19 ప

లు

20 ప

లు

X

X

21 మ

22 ద

ని

ద్య

X

ళ్ళ

X

23 ప్రి

24 మ

ణి

X

లై

X

మా

25 కా

26 క

27 కా

X

X

28 హ

లా

X

ణి

29 వ్య

సా

ము

X

30 మ

ట్టి

లో

మా

ణి

క్యం

31 ము

లు

X

X

ని

X

బా

X

X

X

X

ము

X

ష్టం

X

32 మూ

షి

వా

ము

అడ్డం పదం ఆధారం
1 గ్రహణం ఇంద్రగంటి మోహనకృష్ణ చలం రాసిన గ్రహణం కధని సినిమాగా తీసాడని తెలుసుగా.
4 చులుతొడంకాం కాండం తొలుచు (బోరింగ్) పురుగు ఆశిస్తే కాండం కుళ్ళిపోతుంది …. వెనకనుండి అనడంవల్ల తిరగేసిరాయమని.
7 విసుగు ఎంత ఆలోచించినా పదం తట్టకపోతే మీకొచ్చేది విసుగే కదా
9 నభము ఆకాశానికి పర్యాయపదం కదా
12 చంద్రిక అంటే వెన్నెల. శరదృతువులోవచ్చేదిదే కదా. వెన్నెల్లో హాయ్ హాయ్ పాట హింట్ కోసం.
13 ర్తవఆము ఆవర్తం అంటే ప్రదక్షిణ. మెలికలు తిరుగుతూ చేసినది అనడం వల్ల అక్షరాలటూ ఇటూ అయ్యాయని సూచన.
14 కుసుమం కు తీస్తే సుమం అవుతుంది అంటే పువ్వే
15 భరా భరాఆలూ వంటకం తెలుసుగా
16 క్షుధ అంటే ఆకలి. ఈబాధ తీర్చగల అన్నదానం అత్యుత్తమమైనదంటారుగా
17 కవల కుశలవులు కవలపిల్లలుకదా
18 ఉదక ఊటీని ఉదకమండలం అని కూడా అంటారుకదా
19 పలుపలు పలు అంటే అనేకం అని.
21 మదదమని మదంఅంటే గర్వం. దమని అంటే అణచేది. ఈపదంలో అన్నీ సప్తస్వరాక్షరాలే.
23 ప్రియమణి పెళ్ళైనకొత్తలో అని సూచించడం ప్రియమణి కోసమే J
25 కాకరకాయ చేదనగానే గుర్తొచ్చేది, చూడగానే గగుర్పొడిచేది కాకరకాయకాక ఇంకేంటి
28 హలా ఆహా! ఏమి హాయిలే హలా అని కాక ఇంకేమైనా పదం తడుతుందా
29 వ్యవసాయము రైతులు చేసేది వ్యవసాయమే కదా
30 మట్టిలోమాణిక్యం మురికివాడల్లో ముత్యంలాంటి మనిషిని మట్టిలోమాణిక్యం అంటాంకదా
31 మునలుక నీళ్ళలో వేసేవి మునకలు. సగం బాగానే వేయడం అంటే మొదటి రెండక్షరాలు సరిగ్గా ఉన్నాయి, వెనుదిరుగడం చివరి అక్షరాలు తిరగబడ్డాయనడానికి సూచన
32 మూషికవాహనము గుజ్జురూపుడు (వినాయకుడు) ఎలక వాహనమెక్కితే సుమో యోధుడు లూనా మీదెక్కినట్లుంటుంది కదా
నిలువు
1 గ్రద్ద గ్రద్ద కున్న దూరదృష్టి తెలిసినదేకదా.
2 ణంరభఆ అంటే నగ. వెనకనుండి రాస్తే రణం (యుద్ధం) కూడా వెనకనుంచి రాయబడుతుందికదా..
3 రవి 11 నిలువులో శమంతకమణి సూర్యుడు ప్రసాదించినదే
5 లుక్కు అంటే భ్రౌణ్యం ప్రకారం లోపం అని. ఇంగ్లీషులో చూడడమని.
6 కాంతంకథలమునిమాణిక్యం కాంతంకథలు ఆయన పుస్తకం పేరు. ఇంటిపేరుగా చేసి ముందురాస్తే కాంతంకథలమునిమాణిక్యం అనే కదా రాయాలి
8 సుడోకు వమనం అంటే డోకు. అందులో మంచి రకం సుడోకు J
9 నవరాత్రులు కమల్‌హసన్ సినిమా దశావతారం. అక్కినేనిది నవరాత్రులు
10 ముముక్షువులు అన్నివదలదల్చినవారిని ముముక్షువులంటారు.
11 శమంతకమణి కృష్ణుడు శమంతకమణి వెతుకుతూ వెళ్ళి జాంబవతితో సహా వెనక్కిరావడం గుర్తుకు తెచ్చుకోండి
12 చంపక 19 నిలువులో ఉన్నవి పద్యకావ్యాలు. చంపకమాలలు లేకుండా వ్రాయగలరా?
13 ర్తభ భరించేవాడు భర్త. తిరగబడితే ర్తభ.
18 ఉదయ 18 నిలువు (ఉదయ) +3 నిలువు (రవి) + 12 అడ్డం (చంద్రిక) = ఉదయ రవి చంద్రిక. ఇది ఒక రాగం పేరు. “ఎంతవారలైనా కాంతదాసులేగా” అన్న కీర్తన ఈరాగంలో ఉంది. . అర్ధం కాదు వెనకున్న అను రాగం అంటే తెలిసిందనుకుంటా.
19 పద్యకావ్యము ‘నాలుగేసి పాదాల’ వి పద్యాలు. అవి వందల కొద్దీ ఉండేది పద్యకావ్యము కదా.
20 పళ్ళరసాలు నమిలేవి పళ్ళు …వాటిని పిండితీసేవి పళ్ళరసాలు. తాగితే ఆరోగ్యమేకదా
22 దలైలామా దలైలామా అరుణాచల్ వెళ్ళనివ్వకూడదని మనకి చైనా చెప్పింది. టిబెట్టుకి రానిచ్చేప్రశ్నే లేదు.
23 ప్రియము ప్రియము అంటే ఇష్టం అనీ ఖరీదు అనీ కూడా అర్ధం
24 మరమనిషి యంత్రాల (మరలు) మయమైన వాడు మరమనిషే కదా
26 కవనము క ‘వనం'(తోట) అంటే కవిత్వం
27 కాయకష్టం కార్మికులూ, కర్షకులూ కాయకష్టం చేసుకునే కదా బతికేది
28 హలోబావా ఫోన్లో అత్తకొడుకు (బావ) ని పలకరించే పధ్ధతిదే.
Posted in గడి | Tagged | 7 Comments

2010 మార్చి గడిపై మీమాట

2010 మార్చి గడిపై మీ అభిప్రాయాలను, సూచనలను ఇక్కడ రాయండి.

Posted in గడి | Tagged | 10 Comments

అరెస్ట్ వారెంట్

– శ్రీనివాసరావు. గొర్లి

మా మేనేజర్ మొఖం అంత దిగులుగా వుండటం నేను గత నాలుగేళ్ళ కాలంలో ఎప్పుడూ చూడలేదు.

ఆయనే కాదు, అంతకు ముందు నా సర్వీసు లో నలుగురు మేనేజర్లను చూశాను గాని ఎవరినీ మొఖాలు ఇంత దిగులుగా ఉండే ఇటువంటి పరిస్థితులలో చూడలేదు. అసలు అది దిగులు కాదు. అంత కంటే బాధాకరమైన ఫీలింగ్. ఒక్కసారిగా ఇంటి పై ఆదాయపన్ను శాఖ అధికారులు రెయిడింగ్ చేస్తే, రెండు చేతులా సంపాదించే అధికారి మొఖం లో కనిపించే లాంటి ఫీలింగ్ అది. వరదలొచ్చి వున్నదంతా వూడ్చిపెట్టుకుపోతే ఎందుకీ వెధవ బ్రతుకు అనిపించే ఫీలింగ్ అది. Continue reading

Posted in కథ | 13 Comments