సాలూరు చినగురువుగారు

తన జీవితం మొత్తాన్ని తననుండి దూరంగా వీక్షిస్తూ పరమాత్మలో లీనం కావడానికి కావలసిన అర్హత సంపాదించుకొనే ప్రయత్నం చేయకుండా మంచి వయసు, శక్తి ఉన్న ప్రాయంలో కేవలం లౌకికసుఖాలకే ప్రాధాన్యం ఇచ్చిన తన ప్రవర్తనకు బాధ పడుతూ, దీనివలన సాధించినదేమిటని తనను తానే ప్రశ్నించుకోవడంలో ఆ శాశ్వతానందాన్ని పొందడానికి చేయవలసిన ప్రయత్నం గురించి వివేచించడం కనిపిస్తుంది.

ఏ జీవికైనా జన్మము, మృత్యువు అనే దశలు తప్పవు. కానీ జీవి తనకు తానై జీవితం నుండి, అది అందించే సుఖాలనుండి దూరంగా తొలగి పోవాలని మృత్యువును ప్రేమగా ఆహ్వానించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ జీవి మానసిక వేదనని గమనించిన వారికి ఎంతో దుఃఖం, బాధ కలుగుతాయి. వైరాగ్యానికి పరాకాష్టగా కనిపించే శాస్త్రిగారి ఈ పద్యం జీవుని వేదనని శోక రసంతో ఆవిష్కరిస్తుంది.
సీ.

ధన ధాన్య భోగ వర్తనము బాయకమున్నె భ్రామికంబులు వీడబడకమున్నె
దారపు త్రాది బంధనము ద్రెంపకమున్నె సంఘ సంపర్కముల్ సనకమున్నె
కరుణార్ద్ర హృదయంబు కఠినమొందకమున్నె కోర్కెలెల్లను కోసి కొనకమున్నె
అంత్రేంద్రియములెల్ల నణగి చావకమున్నె కష్టకాలమ్మును గనక మున్నె

తే.గీ.

దుష్టజాలంబు లెల్లను దొలగి పోవ
పాపకర్మంబులెల్లను బడలిపోవ
శాంతరసమెల్ల కాలంబు స్ధాయి గొనఁగ
మృత్యువా వేగవచ్చి కాన్పింపుమమ్మ

ప్రముఖ గాయకుడు, శాస్త్రిగారి శిష్యుడు ఘంటసాలగారిపై గురువుగారి ప్రభావం అపారం. ఘంటసాల జీవిత పర్యంతం ఆయన ప్రవర్తనలో నడవడికలో మాటతీరులో గురువుగారిని స్మృతికి తెచ్చే ఏవో లక్షణాలు కనిపించేవని ఇద్దరినీ ఎరిగినవారు భావించేవారు. పై పద్యాన్ని ఘంటసాలగారు తన కచేరీలలో తరచు ఆలపించేవారుట.

తరువాతి కాలంలో ఘంటసాల ప్రైవేటు రికార్డుగా ఇచ్చిన తన స్వీయరచన -మృత్యువంటే భయంలేని ఒక వ్యక్తి పాడుకున్న పాట అంటూ ఆలపించిన బహుదూరపు బాటసారీ గేయం పైన గురువుగారి గేయం ప్రభావం ఉందేమో అనిపిస్తుంది.

ఇలాటి వైరాగ్యమే కనిపించే మరొక పద్యంలో మానవులను సృష్టించిన బ్రహ్మ ఏప్రాణికి ఏ సుఖదుఖాఃలను రాసిపెట్టాడో తెలియదుకదా అని అంటారు శాస్త్రిగారు.

తే.గీ.

ఏ స్థలమ్మున ఏ ప్రాణికెప్పుడెట్టి
కష్టసుఖములు గలుగునో కమలభవుడె
వ్రాసి నుదురను పెట్టెలో భద్రపఱచె
వెలుపలను తోలు సీలుంట తెలియరాదు

బ్రహ్మ తాను ప్రాణుల నుదురుమీద వ్రాసిన విషయాలను నుదురు అనే పెట్టెలో పెట్టి బయట తోలుతో సీలు చేసాడట. అందుకే ప్రాణులకు ఎక్కడ సుఖం, దుఃఖం కలుగుతాయనే సంగతిని ముందుగా ఎవరూ తెలుసుకోలేముట. ఎంత చమత్కారమయిన భావం!

బతుకు గడపడంకోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ధనసంపాదన చేయవలసిరావడం, అందుకు ఉద్యోగమనే బానిస జీవితం గడపడం, తుచ్ఛమైనదని తెలిసినా డబ్బు కోసం వెంపర్లాడక తప్పని స్థితి సీతారామశాస్త్రిగారికి దుర్భరమైన వేదన కలిగించేవేమో! ఆయన పద్యాలలో ఈ వేదన కనిపిస్తుంది.

చం.

అనుభవమింత లేని పరిహాస విధాయక నీచకార్య సా
ధన రచనాదులన్ కుజన దాస్యముతో జతచేసి లోకమో
హనకర గానశాస్త్రమకటా వికటంబుల పాలు జేసి జీ
వనమును బుత్తువా దురిత భారము నెత్తిని మోసి మూర్ఖుడా

అని ఒక పద్యంలో స్వీయనిందకు పాల్పడతారు.

మరొక పద్యంలో సొత్తు కోసం తాను ఇంతగా పాటుపడవలసిన పరిస్థితి కల్పించిన భగవంతుడిని ఆక్షేపిస్తారు. అంతూ, దరీ కనిపించని దుఃఖసాగరంలో తనను తోసేసి, బాధలనే అగ్నులతో కాల్చేసి తనని పరీక్షిస్తున్న భగవంతుడిని కరుణతో దయచూసి రక్షించి చేరదీయవలసినదిగా ప్రార్థిస్తూ శరణు వేడుతారు.
మ.

దరిలేనట్టి విచార సాగరమునందా ద్రోసి బాధించి నా
చరితంబింతయు దుఃఖ వహ్నినిడి వ్రేల్చన్ జూచితే సొత్తుకై
అరరే యింతటి ద్రోహచింత తగునా హా పాహిమాం పాహిమాం
కరుణా సాగర మమ్ము బ్రోవుమిల రంగా దీన సంరక్షకా

ఉద్యోగధర్మం శాస్త్రిగారి ప్రవృత్తికి వ్యతిరేకం. స్వేచ్ఛగా, సంతోషంగా జీవితం గడపాలని ఆశించే తనలోని కళాకారుడిని ఉద్యోగం, కుటుంబం వంటి సంకెళ్ళతో బంధించడానికి చూడడం భగవంతుడి ద్రోహచింతనగా భావిస్తారు.

అంతలోనే-

శా.

శరణంటిన్ కడు దీనుడన్ జడుడనాశాపాశ బద్ధుండ వేరొ
క్కరు లేని దుఃఖితాత్ముడను నీవే నన్ను రక్షింపగా
తెరవూహింపకయున్నవే మరి ఏదీ దిక్కు తర్కింపగా
కరుణా సాగర మమ్ము బ్రోవుమిల రంగా దీన సంరక్షణా

అంటూ నీవేతప్ప ఇతఃపరంబెరుగ అనే శరణాగతి మార్గాన్ని అవలంబించి రక్షించమని ప్రార్థిస్తారు.

చం.

సరసత లేని కీర్తనలసంఖ్యలు పాడి సునాదలీననం
బెరుగక కంఠనాళముల నెత్తి బిగింపగనేల, భక్తితో
హరహర పాపనాశ భవహారి శివా మహదేవ శంకరా
సరగున బ్రోవుమంచు మనసా హరునెంచి తరింప జూడుమా

అంటూ ఆ పరమేశ్వరుని అత్యంత భక్తితో కీర్తిస్తారు. గానానికి పరమావధి సంగీతంతో మహాదేవుని స్మరించడంలోనే ఉందని గుర్తుచేస్తారు.

సీతారామశాస్త్రిగారి కృతులు -కీర్తనలు

సీతారామశాస్త్రిగారు అనేక కీర్తనలు రచించారు. కృతి, కీర్తన రెండూ కర్ణాటకసంగీత ప్రక్రియలే. అయితే కృతులు సంగీత ప్రధానంగాను, కీర్తనలు సంగీతంతో పాటు సాహిత్యం కూడా ప్రధాన భూమికగా ఉండి భావ ప్రధానంగా భక్తిరసంతో కూడి భగవంతుడిని కీర్తించేవిగా ఉంటాయి. శాస్త్రిగారు భగవంతుడిని భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గములలో కీర్తిస్తూ అనేక కీర్తనలు రచించారు. వాటిని స్వరపరిచేరు. వీటిలో కొన్ని శ్రీరాముడిని ఆరాధిస్తూ పరమ భక్తుడుగా కీర్తనలు రచించడం చూడవచ్చు. అంతేకాక వీటిలో సంగీత సంబంధమయిన లక్షణాలను వివరించే లక్ష్యరచనలు కూడా ఉన్నాయి. సంగీతంలో స్వరజతులు, వర్ణాలు, కీర్తనలు, కృతులు వంటి ప్రక్రియలలో రచనలు చేసారు.

సంగీతంలోనూ, నాట్యంలోను వర్ణం అనే ప్రక్రియకు చాలా ప్రాముఖ్యం ఉంది. రాగ స్వరూపాన్ని నేర్చుకోవడం కోసం సంగీతంలో వర్ణం ఉపయోగిస్తుంది. వర్ణాలు తానవర్ణాలు, పదవర్ణాలు ఉంటాయి. పదవర్ణాలు నాట్యంలో ఎక్కువగా కనిపిస్తాయి. తాన వర్ణాలలో పల్లవి, అనుపల్లవి, చరణం ఉంటాయి.

వీణకుప్పయ్యర్ వంటి విద్వాంసులతో ప్రసిద్ధి చేయబడిన వర్ణ సంప్రదాయాన్ని అనుసరిస్తూనే మరిన్ని క్లిష్ట నియమాలను ఏర్పరుస్తూ కళ్యాణి రాగం ఆదితాళంలో శాస్త్రిగారు ఒక వర్ణ రచన చేసారు. షడ్జమ పంచమాలను విడిచి త్రిస్థాయిలలో రాగసంచారము చూపి, ఆవృత్తి చివర ఖండ మొదలైన జాతిమోరాలను అమర్చినట్టు చెప్పారు. చరణంలో మాత్రం షడ్జపంచమములను ఉపయోగించి రాగము సంపూర్ణము చేసి, రాగనామము చెప్పి, జంత్రగాత్రములు సాధన చేసే ప్రాజ్ఞులకు ఈ వర్ణము మిక్కిలి ఉపకరించునని తలచెదను అని ఈ వర్ణం గురించి చెప్పారు శాస్త్రిగారు. ఈ వర్ణాన్ని స్వరపరచి ఎందరో రసికులైన ప్రేక్షకులకు పరవశమయిన స్థితిని కలిగించి నాదానందములో కరిగించారు.

ఈ వర్ణం లోని సాహిత్యం –

పల్లవి

నెఱజాణవని సామి నెఱ నమ్మినది నీకై

అనుపల్లవి

మరుని బారికోర్వలేక సరసిజేక్షణ నిను రమ్మనె జగన్మోహనా

చరణం

నిండు జవ్వని సుమా కళ్యాణి

సంప్రదాయాన్ని అనుసరిస్తూనే క్లిష్టమయిన నియమాలను విధించుకొని త్రిస్థాయిలలో రాగసంచారం చేస్తూ శాస్త్రిగారు ఈ వర్ణం ఆలపిస్తే సంగీత ప్రియులంతా ఆనందంతో పరవశించి పోయేవారు.

About పట్రాయని సుధారాణి

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు - హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు - ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు. సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు. సుధారాణి గారు ఇల్లాలి ముచ్చట్లు పేరుతో ఒక బ్లాగును నిర్వహిస్తున్నారు.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

11 Responses to సాలూరు చినగురువుగారు

  1. సుధా రాణి గారూ ! సాలూరు చిన గురువు గారి గురించి ఎంత చక్కగా విలువయిన సమాచారం అందించేరండీ … అభినందనలు. నేను ఉద్యోగ రీత్యా కొన్ని ఏళ్ళు సాలూరులో గడిపాను. ఆ రోజులలో చిన గురువు గారి శత జయంతి వేడుకలు మా మిత్రులంతా కలిసి, ఏదో మాకు ఉన్నంతలో జరిపించుకుని సంబర పడ్డాం.

    చిన గురువు గారు కొంత కాలం నివసించిన సాలూరులోని ఇల్లు సంగీత పాఠశాల , ఆరోజుల తీపి గుర్తుగా ఇప్పుడూ ఉంది.

  2. సాలూరి చిన్న గురువుగా గణుతికెక్కిన పట్రాయుని సీతారామ శాస్త్రి గారిని గురించి సమగ్రంగా తెలిపారు. వ్యాసకర్త సుధారాణి గారికి అభినందనలు. ఈ వ్యాసం చదివి.. త్యాగరాజుల వారు అన్నట్లుగా.. ” ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు” అని మనసులో నమస్కరించుకున్నాను.

  3. Rohiniprasad says:

    అంతంతమాత్రమే అనిపించే తెలుగువారి సంగీతచరిత్రలోని ఒక ముఖ్యఘట్టపు వివరాలను ఈ వ్యాసం చక్కగా తెలియజేసింది.
    ఇందులో ప్రస్తావించిన కొన్ని అంశాలు నాకు తెలిసిన కొన్ని హిందుస్తానీ సంగీతజ్ఞుల విశేషాలతో పోల్చదగినవిగా ఉన్నాయి.
    @”భోగంకుటుంబాల ఆడపిల్లలకు చినగురువుగారు సంగీతం చెప్పేవారు.”
    మహా విద్వాంసులుగా పేరు పొందిన తరవాత కూడా బడేగులాం అలీఖాన్, అమీర్ ఖాన్‌వంటి గాయకులు కొంతకాలంపాటు బొంబాయిలోని రెడ్ లైట్ ఏరియాలలోనే నివసిస్తూ అక్కడి వేశ్యలు కొందరికి గాత్రం నేర్పేవారట. పాతరోజుల్లో ఇలా నేర్పేవారిది మిరాస్‌దార్ సంప్రదాయం అనేవారట. కళకు సంబంధించినంతవరకూ ఇదేమీ సిగ్గుపడవలసిన విషయం కాదని భావించేవారు.
    @”ప్రభుత్వంవారు హార్మోనియం వాయిద్యాన్ని నిషేధించారు. ”
    కేస్కర్ సమాచారమంత్రిగా ఉన్నప్పటి సంగతి ఇది. తన కచేరీలలో హార్మోనియం పక్కవాద్యంగా ఉపయోగించిన అమీర్‌ఖాన్ రేడియోలో పాడేటప్పుడు గాయకులతో పోటీపడుతూ, అడ్డొచ్చినట్టుగా వినిపించే సారంగీని ఉపయోగించలేదు. తన రేడియో కచేరీలలో కేవలం తబలా మాత్రమే ఉపయోగించి కచేరీలు చేశాడు. హార్మోనియంమీద కర్నాటక గమకాలు ఎంత బాగా పలుకుతాయో సంగీతరావుగారు చక్కగా చూపేవారు. బాగా వాయించే కళాకారుడుంటే వాయిద్యపు పరిమితులు లెక్కలోకి రావు.
    @”గాయకులు సాహిత్యభావాన్ని పోషిస్తూనే, నాదంలో లీనమై గానం చేయాలని, ఆ ఆదర్శాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన శాస్త్రిగారు జీవితపర్యంతం దాన్ని ప్రచారం చేసారు.”
    సీతారామశాస్త్రిగారికి సాహిత్యం గురించిన స్పృహ ఎక్కువేనని ఈ వ్యాసంవల్ల మనకు తెలుస్తుంది. నిజానికి శాస్త్రీయసంగీతంలో సాహిత్యానిది చిన్నపీటే. తమిళపద్ధతిలోనో, మరొక వికృతరూపంలోనో పదాలను ఉచ్చరిస్తూ ఎవరైనా గాత్రకచేరీ చేసినప్పుడే తెలుగువారికి బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ వంకర్లు వాద్యసంగీతంలోనూ ఉన్నప్పటికీ మాటల ఉచ్చారణ ఉండదు కనక కష్టం అనిపించదు. లలితసంగీతంలో మటుకు సాహిత్యానికి సగం ప్రాముఖ్యత ఉంటుంది కనక అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా సహించడం కష్టం. గజల్ పాడుతున్నప్పుడు ఉచ్చారణలో తప్పులు చేసినవారిని తీవ్రంగా కోప్పడే ఉర్దూ ప్రేమికులను నేను చూశాను.
    @”ఘంటసాల తెలుగు చిత్రసంగీతంలో ప్రవేశించే నాటికి చిత్రసీమ పై మహారాష్ట్ర సంగీత ప్రభావం కనిపించేది.”
    రఘురామయ్య గాత్రం అమోఘమైనది. అయితే ఆయన తెలుగు పాడితే ఏ మరాఠీవాడో పాడుతున్నట్టుంటుంది. ఇది కొంతవరకూ తెచ్చిపెట్టుకున్నదే కనక అదొక మెచ్చుకోదగ్గ లక్షణమని ఆయన అనుకుని ఉంటాడు. అలాగే రాజేశ్వరరావు ఎంత బాగా పాడినప్పటికీ అందులో బెంగాలీ పోకడలను పక్కనపెట్టలేకపోయాడు. తెలుగువాడు పాడినట్టుగా తొలిసారి పాడినది ఘంటసాలే. అందుకనే ఆయనకు ఎదురులేకుండాపోయింది. సాహిత్యం, శాస్త్రీయసంగీతం రెండూ అర్థం చేసుకుని, వాటి సంస్కారాన్ని జీర్ణించుకున్న గొప్ప గాయకుడు ఘంటసాల. ఆయనకు ఆ స్పృహను పెంపొందించినవాడుగా శాస్త్రిగారు చిరస్మరణీయుడు. లలిత సంగీతంలో తెలుగు ఎలా పాడాలో ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఘంటసాలనూ, సుశీలనూ వినాలి. పలుకుతున్న తెలుగుమాటల్లో ఏదో value addition చెయ్యాలని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంవంటివారు పడే అవస్థలు నాకు చాలా కృత్రిమంగా అనిపిస్తాయి.
    @”శాస్త్రిగారు శిష్యులకు పాఠం చెప్పిన తర్వాత రోజులో చాలాసేపు గానం చేస్తూనే ఉండేవారుట.”
    కిరానా ఘరానా గాయకులలో కరీం ఖాన్ తరవాత ప్రసిద్ధుడైన అబ్దుల్ వహీద్ ఖాన్ 1949లో చనిపోయేదాకా పాకిస్తాన్‌లోనే ఉండిపోయాడు. ఈయన హీరాబాయి బడోదేకర్ తదితరులకు గురువు. ఈయన కరాచీ రేడియో స్టేషన్‌కు వచ్చి, తన కచేరీ అయిపోయాక కూడా రోజంతా అక్కడే కూర్చుని పాడేవాడట. పెద్దాయన సంగతి ఇంజనీర్లకు కూడా తెలుసు కనక తలుపులు మూసేసి ఆయనకు ఇబ్బంది కలగకుండా చూసేవారట. సంగీతాన్ని తపస్సులాగా పరిగణించినవారికి కాలపరిమితులుండవు.
    ఇటువంటి పత్రికలు చదివేవాళ్ళలో సంగీతాభిమానులు ఎందరుంటారో చెప్పటం కష్టం. ఈ వ్యాసంలో ప్రస్తావించిన విషయాలకు సంబంధించిన ఆడియో లింకులేవైనా జత చెయ్యగలిగితే వెబ్ పత్రిక సదుపాయాలను వినియోగించుకున్నట్టవుతుంది.

  4. chavakiran says:

    వ్యాసం చాలా బాగుంది. నెనర్లు.

  5. P.H. Thyagaraju says:

    My sincere compliments for the great article. This makes me proud of musical heritage of Andhra Pradesh. This should be expanded and brought out in the form of a book-let. Warm regards.

  6. Rohiniprasad says:

    శాస్త్రిగారి శైలి ద్వారం నాయుడుగారికి అంతగా రుచించకపోవడంవల్లనే నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణవంటివారిని గాత్రం నేర్చుకోవడానికి డాక్టర్ శ్రీపాద పినాకపాణి వద్దకు పంపారట. ఇదొక చారిత్రక పరిణామం.
    తెలుగునాట ‘ఘరానా’లనేవి ఉన్నాయనుకుంటే సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రిగారిదీ, పట్రాయనివారిదీ, వాసావారిదీ, పినాకపాణిగారిదీ ఇలా కొన్ని సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి. తమిళనాడులో త్యాగరాజు శిష్యవర్గానికి చెందినవీ, చెందనివీ కూడా కొన్ని ఉండేవి. అలాగే కేరళ, కర్నాటక ప్రాంతాలలో కూడా.

  7. voleti srinivasa bhanu says:

    1970..in the month of April, I had the great opprtunity to visit the falicitation to Swargeeya Ghantasala and also to attend the concert given by Sri Sangeetarao garu in the music school established by the great Saluru Chinna Guruvu garu. Out of my devotion towards Ghantasala I drew Sri Tyagaraja Swamy sketch and resented to the great person. At the end of the meetinh Ghantasala announced my name and conveyed thanks to me. Even after 40 years I am able to isten the golden voice which blessed me.

  8. ఉష says:

    సంగీతంలో నాకు ప్రవేశం లేదు అయినా అభిమానం. ఆస్వాదించే అభిరుచి. ఇటువంటి వ్యాసాలు చదవటం పట్ల ఆసక్తి. ఘంటసాల గారి గురువుగా కొన్ని వ్యాసాల్లో చదవటమే కానీ శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారిని గూర్చి పరిపూర్ణ వ్యాసం చదవటం ఇదే.

    “సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, స్వరరచనలో స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ పద్య, గేయరచనలు చేస్తూ, వాటిని పారవశ్యంతో గానంచేస్తూ వాగ్గేయకారుడిగా రామభక్తిలో తరించిపోయిన ఒక పోతన, ఒక త్యాగయ్య కలిసిన మూర్తిమంతంగా సంగీత సాహిత్య మేళవింపుగా కనిపిస్తారు -సాలూరు చిన గురువుగారు, పట్రాయని సీతారామశాస్త్రిగారు.”

    పైమాటలు కవుల్లోనే కాదు సంగీతకారుల్లోనూ స్వాతంత్ర్యాన్ని కోరుకుని, స్వేఛ్ఛాయుత సాధన, జీవితం గడిపినవారున్నారు అనిపించింది. కనుక ఈ మార్పులు, చేర్పులన్నవి అన్ని కళలకీ తప్పని పరిణామక్రమాలనేగా.

    అలాగే పైన ప్రసావించిన,

    “సీతారామశాస్త్రిగారు స్వకీయ అయి గృహిణిగా ఉండే నాయికకు సంబంధించిన అంశాలతో సాహిత్యాన్ని కూర్చి జావళీ వంటి రచన చేసారు. జావళీలో ఒక కొత్త ప్రయోగం ఇది.

    వగల వయ్యారి అదిరా…
    ఆ చిన్నారి వగల వయ్యారి అదిరా”

    ఆ గీతానికి పూర్తి సాహిత్యాన్ని వ్యాసకర్త అందించగలిగితే బాగుండు.

    సంగీతం అభ్యసిస్తున్న పదేళ్ళ మా అమ్మాయికి ఈ కళ పట్ల మరింత అవగాహన పెంచాలన్న అభిప్రాయంతో ఆసక్తికన్నా, ఈమధ్య అవసరంగా చదవటంతో – “ఈమాట” పత్రికలో చదివిన కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, విష్ణుభొట్ల లక్ష్మన్న గార్ల వివిధ వ్యాసాలకి పొడిగింపుగా ఈ వ్యాసం చాలా బావుంది. వ్యాసకర్తకి, పొద్దువారికి ధన్యవాదాలు.

  9. voleti srinivasa bhanu says:

    On March 24th, 2010 I attended a marriage at Annavaram. Sri Sangeeta Rao garu’s younger brother’s daughter from Yaanam also attended the same function. On my request she sang some of the great keertanas written and composed by Swargeeya China Guruvu garu for an hour or so. I was so thrilled and happy.

  10. మొన్ననే ఇక్కడ చెన్నైలో సీతారామశాస్త్రిగారి 110వ జయంత్యుత్సవ సభ జరిగింది. దానికి వెళ్ళగలిగే అదృష్టం నాకు చిక్కింది. బాలమురళీకృష్ణగారు ముఖ్య అతిథిగా వచ్చిన ఆ సభ చాలా బాగా జరిగింది. సీతారామశాస్త్రిగారి గురించి చక్కని డాక్యుమెంటరీ తయారుచేసారు. మొత్తం పట్రాయనివారి కుటుంబమంతా కళా కుటుంబంలా అనిపించింది! సీతారామశాస్త్రిగారి మనుమరాళ్ళు, మునిమనుమరాళ్ళు అతని కృతులని ఆలపించారు, నాట్యం కూడా చేసారు!

    ప్రియా సిస్టర్స్, సీతారామశాస్త్రిగారి పద్యాలను పాటలనూ ఆలపించారు. పద్యాన్ని పాటకి ఆలాపనగా పాడడం చాలా కొత్తగా అద్భుతంగా నాకు అనిపించిన విషయం!

  11. dhavala Bhaskara Rao says:

    My Born at Saluru, Naidu Veedhi, near by Sangeeta Pathasala. At my education time somebody family stayed in sangeeta pathasaala. so many time we enjoyed with them at that place.

    Dhavala Bhaskara Rao
    Mobile :+919912038993
    Hyderabad

Comments are closed.