చైత్రము కవితాంజలి – 2

స్నేహ వాసంతిక

-భైరవభట్ల కామేశ్వర్రావు

కాసేపు,
మాటల నట్టేపెట్టి
మౌనపుటత్తరు సీసా మూత విప్పుదాం


ఆ పరిమళం
ఇద్దరి ముకుపుటాలనీ
ఒకేసారి తాకుతుంది


ఎన్నో ఏళ్ళుగా కట్టుకున్న
అడ్డుగోడలకి
ఎన్నెన్ని కన్నాలో!
అప్పుడర్థమవుతుంది


గుండెల్లో విషవాయువు
మెల్లగా కరిగిపోతుంది


గాల్లో తేలుతూ వచ్చి
మధుమాసం
మనలని చుట్టేసినట్టవుతుంది


నిజం! నన్ను నమ్ము


ఇద్దరి పెదాలపైనా
మల్లె విచ్చుకుంటుంది

———————————–

వస్తావా నేస్తం

-కెక్యూబ్ వర్మ


ఎప్పుడూ వసంతం కోసం
ఎదురు చూపేనా?


ఎండమావిలో
చేద వేసి తోడే
ప్రయత్నం ఎన్నేళ్ళు??


కలల సాగరంలో
ఈదులాడి
ఉప్పగా మిగిలిన
తడి!


మోడు వారిన ప్రతిసారీ
చిగురించగలిగే కొమ్మలా
దీవించే వారెవరు?


ఎవరికి వారు
వెతుకులాటలో
అనామకులౌతున్నారు!


నిలువెల్లా గాయమైనా
ప్రణవ నాదం పలికే
వెదురు ముక్కను
చూస్తే ముక్కలైన
గుండె అతుక్కుంటుంది!


వస్తావా నేస్తం
తడిగా ఒక్కసారి
నా నుదుటిపై
చేయివేయగలవా?

—————————————

ఉగాది వచ్చేస్తోంది

-స్వాతీ శ్రీపాద


ఉగాది వచ్చేస్తోంది
ఎప్పట్లాగే ఉగాది సందడీ
ఉరుకుల పరుగులతో
ఏడాది ఎదురుచూపులను
మోసుకు వస్తూ ఉగాది వచ్చేస్తోంది


ప్లాస్టిక్ సంస్కృతిని మేసి
సిమెంట్ భవనాల జైళ్లలో బందీలైపోయాక
ప్రకృతి వికృతై ఒళ్ళువిరుచుకుని
ఆధునికతకు దాసోహమన్నాక
బోన్సాయి మొక్కలుగా జీవితాలు
నాలుగ్గోడలకు పరిమితమయ్యాక
ఏసీ రూములు అనుమతించవు
కోయిల కుహూరవాలు వినిపించేందుకు

మామిడి చిగుళ్ళ పరిరక్షణకు చల్లిన
పురుగులమందు ఘాటుకు
జాతి అంతరించిపోయింది
సమయం అనుమతించదు
గతం స్వర రాగాలను రికార్డ్ చేసుకున్న
ఆధునిక పరికరాలే గతి

వసంతం ఏమూలో తలదాచుకున్న ఈ క్షణాన
కాగితం పువ్వులదే రాజ్యమయ్యింది.
కాలగమనాల గతులు తప్పి
రెండు రోజుల మధ్య సంధి కాలంలో
సంకట దశలో ఉగాది
నేడా రేపా అనేది ప్రభుత్వానికే తెలియాలి

ఉగాది వచ్చేస్తోంది.

———————–

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

వసంతసుమశేఖరము – 2

“ప్రసవింతురు బావగారు పదిదినములలోన్”

రవి :  “ప్రసవింతురు బావగారు పదిదినములలోన్” – ఎలానో రాఘవ గారు చెబుతారు

విశ్వామిత్ర :  వారు సరే; రాఘవగారున్నారా ఇక్కడ?

రవి :  మరుగేల, రా, ఓ రాఘవా!

మిస్సన్న :  దండకారణ్యంలో ఉన్నారేమో

కామేశ్వరరావు :  అతనింకా పురిటినొప్పులు పడుతున్నట్టున్నారు 🙂

వసంత్ కిషోర్ : అంతఃపురంలో ఉన్నట్టుంది !

శ్రీపతిరాఘవగారికి కొంత సమయం పడుతుందిత… ఈలోపు కానివ్వమంటున్నారు

విశ్వామిత్రరాఘవ గారు – పదిదినముల ముందే  busyగా ఉన్నట్టున్నారు  ఈ లోపు మిగతావారివి వింటామండి – మీ అనుమతి ఐతే రవిగారూ

రవి :  సరే, ఈ లోపు శిరీష్ గారు, ప్రసవింపజేయడం మీ వంతు

చదువరి :  అవధరించండి..

 

కం ||

బుసకొట్టే డెడ్లైనట

వెసపెట్టిరి డెలివరింప వినుమిది యన్నా!

పసిబిడ్డౌ ప్రాజెక్టును

ప్రసవింతురు బావగారు – పది దినముల లోన్

 

రవి :  పాపం :))

కామేశ్వరరావు :  హహహ… “డెలివరింప” ప్రయోగం భలే ఉంది!

వసంత్ కిషోర్ : వ్వావ్!

విశ్వామిత్ర :  ముందు వరించటం , అక్కడినుంచి డెలివరించటం – పదాల డెలివరీ లో మీరు సిద్దహస్తులు

గన్నవరపు నరసింహమూర్తి :   చాలా బాగుంది

రవి :  ఎలాగైనా బావగారికి గర్భస్రావం జరుగకుండా చూసేబాధ్యత శిరీష్ గారిదే!

చదువరి :  🙂

శ్రీపతి :  గర్భ స్రావం కాదులెండి గానీ పసిబిడ్డౌ ప్రాజెక్టు – “నెలతక్కువ వెధవా’ అనిపించుకునే అవకాశం ఉందేమో…

నచకి :  పూరణకి మంచి ఆలోచన

కామేశ్వరరావు :  నా అనుభవంలో ప్రాజెక్టులు ఎప్పుడు “నెల తప్పుతాయి” కాని “నెల తక్కువ” కావు.

గన్నవరపు నరసింహమూర్తి :  సాఫ్ట్ వేరు కష్టాలు !

విశ్వామిత్ర :  నెలతక్కువ ప్రాజెక్టులను – సాకుతుంటే ( maintain) ఉంటాయి తిప్పలు

రాఘవ :  పెద్దలందరూ నన్ను మన్నింతురుగాక… ప్రస్తుతానికి కొంచెం హడావుడిలో ఉన్నాను.

చదువరి :  “నెల తప్పుతాయి” కాని “నెల తక్కువ” కావు. — అదరహో!

నచకి :  కామేశ్ జీ! 🙂

రవికామేశ్వరరావు గారూ, పుట్టిన తర్వాత – ఉపయోగించేవాడికి “నెలతక్కువ” విషయం అవుపిస్తుందేమోనండి.

శ్రీపతి :  అదే కదా ఆర్కిటెక్టు మహాశయులకూ ఐ.టీ.మేనేజరుకూ తేడా… తొమ్మిది నెలలు పట్టే గర్భాన్ని కూడా తొమ్మిది మంది చేత సాయం పట్టించేసి నెలరోజుల్లో చేసేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తాం, వీలైతే ఒకట్రెండు ప్రయత్నాలు కూడా చేసేసి.

కామేశ్వరరావుశ్రీపతిగారు 🙂

విశ్వామిత్ర :  ఇది అందరినీ ఆకట్టుకున్న సమస్య అనుకుంటా – వివిధములైన పూరణలు వచ్చినట్టున్నాయి

నచకి :  నేనెంత ప్రయత్నించినా మా బావగారు ప్రసవించలేదు, విశ్వామిత్రా!  🙁

రవివిశ్వామిత్ర గారూ, అలా అన్నిపిస్తుంది కానీ నిజానికి కాదండి.

కామేశ్వరరావు :  అధ్యక్షులవారు ఇంకెవరి చేతనయినా ప్రసవింప జేస్తారా?

రవి :  సరే రాఘవ గారు వచ్చేలోపు నా పూరణ కూడా పనిలోపనిగా కానిస్తాను

 

కం ||

పసజూపెను భోజనమున

నసలే పెనుగొప్ప బొజ్జ, యటపై నతిగా

పసిగొన్న వాఁడు! ఇకనేం!

ప్రసవింతురు బావగారు పదిదినములలోన్.

 

కామేశ్వరరావు :  మరోమారు మా భుజాలు… సారీ, బొజ్జలు తడుముకొంటిమి!

గన్నవరపు నరసింహమూర్తి :  తిండి తగ్గించ మంటున్నారు. ఈ సమస్య భారతములో కూడా వచ్చింది !

నచకి :  నా భోజనమిప్పుడే అయింది… కనుక అదేదో నన్నే అన్నట్టుగా ఉంది. 😀 (కాకపోతే నాకు పెనుగొప్ప బొజ్జ కాదు కదా, చిరుబొజ్జయినా లేదు ప్రస్తుతం!)

శ్రీపతి :  నచకి !! అన్నట్టుగా కాదు కన్నట్టుగా !!

కామేశ్వరరావు :  నా భోజనమింకా కాలేదు, అయినా నన్నే అన్నట్టుగా ఉంది!

నచకి :  సనత్ గారూ 🙂

కామేశ్వరరావు :  మూర్తిగారు, మీకిలాంటి సమస్యలు లేవని నాకు తెలుసులెండి 🙂

శంకరయ్య :  అలా వెళ్ళి ఇలా వచ్చాను. ఈలోగా రెండు పూరణలు …. చదువరి గారి పూరణ ప్రశంసనీయం. రవి గారి పూరణ హాస్యస్ఫోరకంగా ఉంది.

పుష్యం :  రవి గారూ , మనం భోజనాలనుండి లేవాలేమో?

రవి :  అవును తప్పదు.

రవి :  ఓ మారు అలా వర్ణనల వరకు వెళ్ళొద్దాం.

నచకి :  అవశ్యం

 

రవి: కింది బొమ్మను వర్ణించేపని సనత్ గారిది (ఈ బొమ్మను http://www.ravivarma.org/plog-content/images/raja-ravi-varma-paintings/peoples-and-portraits/raja_ravi_varma_24.jpg వద్దనుండి సంగ్రహించాం)

 
రవి :  “ఎదురు చూపుల పడతి” – అనుకోండి.

శ్రీపతి :  అవశ్యం… అవధరించండి.

 

ఉ ||

నల్లని ఆకసంబుపయి నాట్యమొనర్చెడి మేఘమాలికా

వల్లరి యందు గ్రుంకులిడు వారిజ మిత్రుడు నీవటంచు నా

ఉల్లము నందెవో చిలిపి ఊహలు రేగెను సాంధ్య రాగమై

చల్లని గాలిలో హృదయచక్షులు నీకయి వేచి జూడగా !!

 

కం||

మనసున మనసై మనమే

మనెదమ్మని మాటనిచ్చి మరచితివేమో

మనుజేంద్రా మునికాంతను

మనువాడుట నీదుధర్మ మరయగ లేవా?

 

శా||

నీవే నాథుడవంచు నిన్ను మదిలోనే నిల్పి, నీ తోడిదే

జీవమ్మంచు తలంచి నీకొరకు నే చింతించితిన్ ! నమ్మితిన్

నీవాగ్దానమునోయి ! నీ వలన నే నీళ్ళాడితిన్నింతకున్

నీవంశాంకురమందు ప్రేమ గొనలేవో ! నీకు మోమాటమో !!

 

కం ||

హేమంతపు శుభ వేళల

సీమంతము జేతురంట శీఘ్రము గా నీ

సామంతుల తో రాగదె !

ధీమంతా ! శ్రేష్ఠ గుణనిధీ ! దుష్యంతా !!

 

శ్రీపతి :  చిత్ర కవిత్వం అన్నారు కనుక ఇందులో ప్రత్యేకతను కనిపెట్టగలరు (ఖడ్గబంధం చిత్రం చూడండి పొద్దు)

 

పుష్యం :  చిన్నప్పుడు టూరింగు టాకీసులో రాయి మీద కూర్చుని సినిమాలు చూసేవాళ్ళం. మీ ప్రారంభం చూసి, ఈవిడది ఆ సీనేమో అనుకున్నాను 🙂

గన్నవరపు నరసింహమూర్తి :  వర్ణన చాలా బాగుంది,

నచకి :  సీమంతానికి సామంతులను ఆహ్వానించి రాజపత్ని అనిపించుకుంది! 🙂

వసంత్ కిషోర్ : చాలా బావుంది !

శ్రీపతి :  🙂

నచకి :  ఒక ప్రత్యేకత నేను గ్రహించాను: ఈవిడ ఖాళీగా కూర్చోవటమెందుకని మొదట సినిమాకెళ్ళింది. 😀

శ్రీపతి :  హ హ్హహ్హా

కామేశ్వరరావు :  రాజపత్ని కాబట్టి కత్తితో కబురంపినట్టుంది!?

చదువరి :  పెళ్ళాన్ని మర్చిపోవడం శ్రేష్ఠ గుణమని గ్రహించాను.

పుష్యం :  ‘కత్తి’ లాంటి పద్యం 🙂

కామేశ్వరరావు :  చదువరిగారు, 🙂 మీ ఆవిడ పక్కన లేరా?

శ్రీపతి :  చదువరిగారూ…. 🙂

చదువరి :  🙂

నచకి :  చదువరి గారు కూడా శ్రేష్ఠగుణనిధి అయిపోయారేమో అప్పుడే! 😀

శ్రీపతి :  కబురెట్టలేదు , ఖబడ్దారంది… కడుపుచేయటానికి లేని మొహమాటం, భార్యనని ఒప్పుకోడానికా అంది.. 😉

శ్రీపతి :  ఖాన్ తో గేమ్స్ ఆడితే శాల్తీల్లేచిపోతాయంది… కత్తిలా

నచకి :  కత్తిలా కాదు లెండి, కత్తితో!

కామేశ్వరరావు :  అవును సభక్తికంగా కాక “విభక్తికంగా” చెప్పింది!

పుష్యం :  knifeల గురించి మాని మనం wifeల గోష్టిలో పడ్డట్టున్నాము 🙂

నచకి :  మన గోష్ఠిలో ప్రసవం తఱువాత సీమంతం జఱిగిందండోయ్!

గన్నవరపు నరసింహమూర్తి :  వివాహము తర్వాత

శ్రీపతి :  అంటే అది లీగలూ, ఇది ఇల్లీగలూను.

కామేశ్వరరావు :  ప్రసవం మగవారికి, సీమంతం ఆడవరికీ జరిగింది 🙂

రాకేశ్వరుఁడు : ముందు మొగుడు నా పెండ్లాము పిల్లవాఁడూను అని ఒప్పుకుంటేగా తరువాత అత్తవారు శ్రీమంతం చేసేది. ఇది బెదిరింపా లేదా ఓ అబల కనే కలా?

శ్రీపతి :  అదేదో చిత్రం భళారే విచిత్రం సినిమాలో లాగ

కామేశ్వరరావు :  శకుంతల అబలేమిటీ సబలే

గన్నవరపు నరసింహమూర్తి :  జన్యు నిర్ధారణ ఉందిగా ! దుష్యంతా !

శ్రీపతి :  మెడకాయ మీద తలకాయున్నోడెవడైనా ‘కత్తి’ మీద సాము చేస్తాడుటండీ…

రాకేశ్వరుఁడు : క్షమించాలి సీమంతమఁట బ్రౌణ్యం ప్రకారమ్

నచకి :  రాకేశ్వరా, నేనూ చాలా కాలమిలాగే వైష్ణవప్రిల్లిని మ్ర్యావ్ మ్ర్యావ్‌మనిపించాను

కామేశ్వరరావు :  వసంత కిశోర్ గారు, దీనికి మీ పూరణ వినిపించండి. ఇది అధ్యక్షులవారి ఆదేశమే, నా చెవిలో ఊదారు.

వసంత్ కిషోర్ : తప్పకుండా !

పని జూసు కొస్తానని పట్న మెళ్ళిన బావ,కాబోయే భర్త కబురంపాడు గాదని , రోజూ ఊరి చివర చెరువు గట్టున ఎదురు చూస్తూ కనబడిన వాళ్ళందరినీ మా బావ ఎక్కడైనా కనుపించాడా ? అని అడుగుతూ

 

నన్ను మరచె నేమొ – నా రాజు , నాబావ

చూడ చక్కని వాడు – చూచి మూడు నెలలు

ఏడ బోయెనొ నేడు !  – ఎరుగ నైతి !

నిముస మైన విడచి – నిలువ జాలని వాడు !

తోడు నీడయు వాడె – జోడు  వాడె  !

చిన్న తనము నుండి – చెలిమి జేసిన వాడు !

ఏడ బోయెనొ వాడు !  – ఎరుక లేదు ! !

ఏడ నుండె బావ – ఎదురు చూపులు జూచి !

కళ్ళు కాయ గాచె – కాన రయ్య !

మరువ కండి స్వామి – మల్లి నా పేరండి !

మరచి బోకు డయ్య – మల్లి మాట !

పట్న మెళ్ళెను వాడు  – పని కోసమై నాడు !

గర్వ మసలు లేదు ! – కరుణ మెండు !

కాల మయ్యె బరువు ! – క్షణ మొక యుగమాయె !

ఏమి చేయుదు నేను ! – ఏది దారి !

భయము గలుగు చుండు ! – బాధ హెచ్చుచు నుండు !

బావ ఎక్కడ నున్న – భద్ర ముండు !

తోచ దేమియు నాకు –  తోడెవ్వరును రారు !

ఏమి చేయుదు నేను ! – ఏది దారి !

భార మాయె, బ్రతుకు – బావ లేకున్నను

గోడు వినగ నెవరు – తోడు లేరు !

బావ తోడ , బ్రతుకు ! – బావ తోనే చితికి !

జాలి చూపి బావ  – జాడ గనరె !

మరచి పోవుద మంటె – మరువ లేకున్నాను !

నిద్ర నైనను గాని – నిజము నైన !

గుర్తు వచ్చిన చాలు – గుండె నీరౌతాది !

ఏడ బోయెనొ నేడు !  – ఎరుగ నైతి !

మరిగి పోవుచు  నుండె – మల్లి గుండెలు నేడు !

బావ లేనిది నేను – బ్రతుక జాల !

బిక్క మొగము తోడ – బేజారు పడుతున్న !

ఏడ బోయెనొ వాడు !  – ఎరుక లేదు !

బావ లేక పోతె – బ్రతికి ఫల మదేమి !

నీరు ముట్ట లేను – నిదుర పోను !

బావ రాక యున్న – బావియే బావౌను !

జాలి చూపి బావ  – జాడ గనరె !

 

నచకి :  బావ రాక యున్న – బావియే బావౌను !

నచకి :  వాహ్! అసలు మొత్తం వర్ణన గేయరీతిలో అలతి పదాలో అందంగా సాగింది

కామేశ్వరరావు :  బాగుందండి. మల్లేశ్వరి, ఎంకి ఒక్కసారే కనపడ్డారు నాకు!

శ్రీపతి :  కిశోర్ గారూ…. 🙂

వసంత్ కిషోర్ : మల్లీశ్వరిని దృష్టిలో పెట్టుకొని వ్రాసినదే !

మిస్సన్న :  అయ్యో వర్ణనల కెళ్ళిన ప్పటినుంచీ నేను    గెంటి  వేయ  బడ్డాను

నచకిమిస్సన్న గారూ, పునఃస్వాగతం!

చదువరి :  చాల బాగుంది.

నచకి :  మీరు మల్లీశ్వరి అంటే కత్రినా గుర్తొచ్చింది! హతవిధీ!

కామేశ్వరరావు :  “బావ తోనే చితికి” – ఈ మాటలో మొత్తం ఈ వర్ణన ప్రాణమంతా దాగుంది!

వసంత్ కిషోర్ : ధన్యవాదములు !

మిస్సన్న :  కిశోర మహోదయా మనోహరమైన బావా మరదళ్ల అనురాగం.

కామేశ్వరరావు :  చాలా కాలంనుంచి నాకు సందేహం. “మల్లేశ్వరి”, “మల్లీశ్వరి” – రెంటిలో ఏది సరి?

వసంత్ కిషోర్ : అయ్యా ఇది భానుమతి మల్లీశ్వరి !

కామేశ్వరరావు :  పాత సినిమాలో మల్లేశ్వరి అని వేసినట్టు గుర్తు.

నచకి :  మల్ల_ఈశ్వరి కాదు కదండీ, మల్లి_ఈశ్వరి అనుకుంటాను యిక్కడ. కనుక సవర్ణదీర్ఘమే.

రవి :  నచకి: :))

గన్నవరపు నరసింహమూర్తి :  మరదలి అనురాగము, బావేమీ మాట్లాడడము లేదు. చాల బాగుంది

మిస్సన్న :  మల్ల యోధురాలైన ఈశ్వరి మల్లేశ్వరి అయిఉంటుంది.

రవి :  మల్ల ఈశ్వరి = గుణం కాదంటారు!

చదువరి :  అయితే దుర్గామల్లేశ్వర స్వామి కాదన్నమాట – దుర్గా మల్లీశ్వరస్వామియే!

శ్రీపతి :  ఆవిడకి నిజంగా మల్ల యుధ్ధం లో ప్రవేశమే ఉండి ఉంటే అట్లా కూర్చుని ఉంటుందా “నే తొడగొట్టి బిల్చెదను” అంటూ ఒక పద్యం వేస్కుని ఉండదూ !!

నచకి :  మల్ల or మల్లె malla. (from మల్లము.) n. A shallow earthen vessel. (Brown)

శంకరయ్య :  సనత్ కుమార్, వసంత్ కిశోర్ గారల వర్ణనలు మనోహరంగా ఉన్నాయి. ఇద్దరికీ అభినందనలు.

శ్రీపతి :  ధన్యవాదాలు

Posted in కవిత్వం | Tagged , | Comments Off on వసంతసుమశేఖరము – 2

తుది విన్నపం

శ్రీఖర ఉగాది కథలపోటీలో మొదటి బహుమతి పొందిన కథ.
————————————————————-

Continue reading

Posted in కథ | 11 Comments

కలసివచ్చిన ఇల్లు

అమ్మకి ఫోన్ చెయ్యగానే అమె అడిగిన మొదటి మాట – “ఏం తేల్చుకున్నారే?” అని. ఏమని చెప్పేది? ఇంకా ఏం తేలనిదే. గత నెల రోజులుగా దాదాపు ప్రతి రోజూ నాకు ఆయనకి మధ్య ఈ విషయమై చర్చ జరుగుతూనే వుంది. అయినా ఒక నిర్ణయానికి రాలేకపోయాము. మీకు చెప్తే నవ్వుతారేమో కాని విషయం మాత్రం చిన్నదే.
 

“అమ్మా.. నువ్వు ఏదైనా పత్రికలకి కథలు వ్రాయవే.. నేను అడిగింది అర్థం చేసుకోకుండా ఏదేదో చెప్తావు..” “కథలేమిటే కథలు.. అసలు ఆ ప్రశ్న ఎందుకడిగావో చెప్పు.. సమాధానం నేను చెప్తాను..” అంది అమ్మ చిరుకోపంతో.

ఇల్లు కొందామని నిర్ణయించుకున్న తరువాత, నేను రవి ఊరంతా తిరిగి, దాదాపు ఒక ఇరవై ఇళ్ళు చూసాము. తరువాత ఆ జాబితాను రెండు ఇళ్ళకు కుదించి, ఈ రెండింటిలో ఒకటి మన ఇల్లే అనుకున్నాం. కానీ సమస్యంతా అక్కడే వచ్చింది. నాకు, రవికి చెరొక ఇల్లు నచ్చింది. నచ్చటం అంటే నిజానికి నాకు రెండు ఇళ్ళూ నచ్చాయి. కాకపోతే అందులో ఒకటి వాస్తు ప్రకారం సరిగా లేదు. అదే మాట రవితో అంటే నవ్వేశాడు.


“చదువుకున్నదానివి.. ఇంకా వాస్తు జాతకాలు అంటే ఎలాగే.. “ అన్నాడు.

“అవును చదువుకున్నదాన్ని కాబట్టే ఆ వాస్తు పుస్తకాల్లో వ్రాసింది చదివి చెప్తున్నాను.. ఆ ఇంటి వాస్తు బాగోలేదు.. అందుకే వద్దు.. అంతే..” తేల్చేశాను నేను.


“ఇల్లు కొనేటప్పుడు చూసుకోవాల్సింది ఆఫీసులకి ఎంత దూరం, పిల్లల స్కూల్ కి ఎంత దూరం అని కానీ, ఆగ్నేయాలు వాయువ్యాలు కాదు… పైగా నువ్వు చెప్పే ఇంటికి ఇంకో నాలుగు లక్షలు ఎక్కువ పెట్టాలి.. నా వల్ల కాదు..” అన్నాడు రవి మొండిగా.

“అక్కడికి ఏదో అన్ని లక్షలు నువ్వే తెస్తున్నట్లు చెప్పద్దు? ఏదైనా బ్యాంక్ లోనే కదా..” అన్నాను నేను జగమొండిగా.

“అది కాదు ప్రియంవదా.. నాలుగు లక్షలు తేవడం కష్టం కాదు, తీర్చడం కష్టంకాదు.. పైగా నీకు నచ్చిన ఇల్లు కాబట్టి నాకూ ఇష్టమే.. వాస్తు సరిగా లేదని ఒకే కారణంతో మంచి ఇల్లు వదులుకోవడం ఎందుకు అని… ఆలోచించు..” బ్రతిమిలాడాడు.

“నాకు తెలుసు బాబు.. ప్రియ అని కాకుండా ప్రియంవదా అని పూర్తి పేరు పిలిచినప్పుడే తెలుసు ఇలాంటి లాజిక్ ఏదో చెప్తావని.. సరే అయితే ఇప్పుడు వాస్తు గురించి నిన్ను నమ్మించాలి అంతేనా?”


“ఇదుగో… నేనేమి వాస్తుని నమ్మడంలేదని చెప్పానా? వాస్తు కన్నా ముఖ్యమైనవి వేరే వున్నాయిని అంటున్నాను..” రవి సర్ది చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు.

“వుండచ్చు కానీ మూడేళ్ళ క్రితం మనం ఆ రావుగారి ఇంటిలో వున్నప్పుడు మీ వుద్యోగం పోయి.. ఎంత ఇబ్బంది పడ్డాం? గుర్తులేదా?”

“ఆ వుద్యోగం పోయింది అమెరికాలో రిసెషన్ వల్ల.. ఇక్కడేక్కడో నేను వున్న ఇల్లు వాస్తు కారణంగానే అమెరికాలో రిసెషన్ వచ్చిందంటావా?”  నవ్వుతూ అడిగాడు రవి.

“నవ్వండి నవ్వండి.. ఆ తరువాత అంత అద్దె కట్టలేక ఊరి చివర చిన్న ఇంటికి వెళ్ళాం అదైనా గుర్తుందా?”

“గుర్తులేకేం ప్రియా.. అది కూడా వాస్తు బాగాలేదని సణిగావు.. కానీ ఏమైంది?”

“ఏమైంది గుర్తులేదా? మీరు బీపీవో మొదలుపెట్టి.. క్లైంట్స్ దొరక్క బిజినెస్ అవ్వక ఎంత కష్టపడాల్సి వచ్చింది..”

“అవునవును.. ఒకరి మీద, ఒక వుద్యోగం మీద ఆధారపడకుండా సొంతంగా బ్రతకడం నేర్చుకున్నాను… కొత్త కంపెనీ అంటే ఆ మాత్రం కష్టం వుంటుంది.. కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. అంతా మంచే జరిగింది కదా..”

“మీరు బుద్ధభగవానుడు కాబట్టి కొంచెమే ఇబ్బంది పడ్డారు.. మొన్న మొన్నటి దాకా కనీసం నిద్ర కూడా పట్టలేదు నాకు.. తెలుసా..” అన్నాను కటువుగా. నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అది బ్రహ్మాస్త్రం. చాలాసేపటి వరకు రవి ఏం మాట్లాడలేదు.


“ఎందుకు అంత పట్టుదల నీకు.?” అడిగాడు చివరిగా.

“ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి.. నాన్న వాళ్ళు ఉన్న ఇల్లు… మీకు తెలుసుగా.. ఆ ఇంట్లో వున్నన్నాళ్ళు.. ఎలా కలిసొచ్చింది.. నాన్న ఏ వ్యాపారం చేస్తే అందులో లక్షలు సంపాదించారు.. అమ్మకి లోటంటే ఏమిటో తెలిసేది కాదు.. మేము వున్నది నలుగురమైనా ఎప్పుడూ పదికి తక్కువ కాకుండా విస్తరాకులు లేచేవి.. బంధువులు, స్నేహితులు…. ఆ వీధి పిల్లలంతా మా ఇంట్లోనే వుండేవాళ్ళు.. ఎంత సందడి..” మైమరచి చెప్తుంటే మధ్యలో ఆపేడు రవి.


“ఇదంతా ఆ ఇంటి వాస్తు వల్లే అంటావు..”

“కాకపోతే ఇంకేవిటి.. అన్నయ్య పెళ్ళి తరువాత ఇల్లు కొనుక్కోడానికి ఆ ఇల్లు అమ్మాడు కానీ, నాన్నైతే అసలు అమ్మేవాడే కాదు.. అమ్మిన తరువాత చూడు నాన్న, అమ్మ పరిస్థితి.. వ్యాపారం అంతా అన్నయ్య తీసేసుకున్నాడు… నాన్నకి షుగరు, అమ్మకి దాంతోపాటు ఇంకో నాలుగు.. ఏ పని లేకుండా నాన్న ఇంటి చూరు పట్టుకోని వుండాల్సి వచ్చింది..”

“పిచ్చిదానా.. ఏ పని లేకుండా ఇంట్లోనే వుండటం సుఖమౌతుంది కానీ.. కష్టమంటావే? పైగా ముసలితనంలో వచ్చే రోగాలు కూడా ఇంటి మహిమేనా?”

“ఇదుగో.. అనవసరమైన లాజిక్కులు చెప్పద్దు నాకు… నా మాట వినదల్చుకోక పోతే మీకు నచ్చిన ఇంటినే కొనుక్కోండి..” అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాను.

దాదాపు రెండు గంటలు గడిచాయి. ఇద్దరం మాట్లాడుకోలేదు. రవి ఆఫీసుకు తయారయ్యి, నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టిన వుప్మా మాట్లాడకుండా తినేసి, వెళ్తూ వెళ్తూ అన్నాడు –

“ఒక పని చేద్దాం ప్రియా.. సాయంత్రం త్వరగా వస్తాను.. మనిద్దరం మీ నాన్న పాతింటికి వెళ్దాం.. ఇప్పుడు ఆ ఇంట్లో వున్నవాళ్ళు కూడా మీ నాన్న లాగే సుఖంగా, సంతోషంగా వుంటే… నువ్వు చెప్పిన ఇల్లే కొందాం.. లేదంటే నేను చెప్పినట్లే వినాలి..” అలా చెప్పి ఇలా ఆఫీసుకు వెళ్ళిపోయాడు, నా సమాధానం వినకుండానే.


***


“మీరు సంతోషంగా వున్నారా అమ్మా” అడిగాను ఫోన్ లో.

“ఏమిటే ఆ ప్రశ్న… సంతోషంగా వున్నారా అంటూ..?? రోజూ మాతో మాట్లాడుతూనే వున్నావు కదా.. నీకు తెలియదా మేం సంతోషంగా వున్నామో లేదో..” ఎదురు ప్రశ్న వేసింది అమ్మ.

“అది కాదమ్మా.. ఇదివరకు మన పాతింట్లో వున్నప్పుడు వున్నంత సంతోషంగా వున్నారా అని అడుగుతున్నా..”

“అదొక రకం.. ఇదొక రకం.. అప్పుడు సంసారం మాది.. బాధ్యతలు మావి.. దేవుడి దయవల్ల అన్నీ సమకూరాయి కాబట్టి బాధ్యతలు నెరవేర్చాం.. పది మందికి సాయంచేశాం.. ఒక సంసారానికి పెద్దలుగా అప్పుడు చేయాల్సినవన్నీ చేయగలిగినందుకు సంతోషం వుండేది… ఇప్పుడు మేము పెద్దవాళ్ళమయ్యాము… ఇక బాధ్యతలు లేవు.. మేమే ఇంకొకరి బాధ్యత అయ్యాము.. వాడు, కోడలు ఆ బాధ్యత సక్రమంగానే నెరవేరుస్తున్నారు కాబట్టి.. ఇప్పుడూ సంతోషంగానే వున్నాం..” చెప్పింది అమ్మ.

“అమ్మా.. నువ్వు ఏదైనా పత్రికలకి కథలు వ్రాయవే.. నేను అడిగింది అర్థం చేసుకోకుండా ఏదేదో చెప్తావు..”

“కథలేమిటే కథలు.. అసలు ఆ ప్రశ్న ఎందుకడిగావో చెప్పు.. సమాధానం నేను చెప్తాను..” అంది అమ్మ చిరుకోపంతో.

“ఆయనా నేను.. ఈ రోజు సాయంత్రం మన పాతింటికి వెళ్తున్నాం..” చెప్పాను.

“పాతింటికా.. ఎందుకు?” అడిగింది అమ్మ ఒకింత ఆశ్చర్యంతో. నేను జరిగిన విషయం మొత్తం చెప్పాను.

“అదా విషయం.. అయితే వెళ్ళిరండి.. ఇంక నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం నేను చెప్పాల్సిన పనిలేదు… అక్కడే దొరుకుతుంది.. వెళ్ళిరండి” అంటూ ఇప్పుడు అక్కడ వుంటున్న వారి వివరాలు, అక్కడికి వెళ్తే కలవాల్సిన వ్యక్తుల గురించి చెప్పింది అమ్మ.


***

 

“ఒక్క చెట్టేమిటే తల్లి.. మీరు పెట్టిన పాదులు, పూల చెట్లు ఒక్కటి బ్రతకనిచ్చారా? మీ గోరింటాకు చెట్టు ఆకు ఎంత బాగా పండేది గుర్తుందా? దాని ఆకు కోసం అందరూ వస్తున్నారని తెగ సణిగేది ఆ మహా ఇల్లాలు.. ఇప్పుడు ఆ చెట్టు వున్నా ఒకటే లేకపోయినా ఒకటే.. ఒక్క ఆకు లేకుండా ఎప్పుడూ ఎండిపోయి వుంటుంది…” చెప్పింది అత్తయ్య వంటింటిలోనుంచే.

పద్మనాభంగారని, నాన్న పాత ఇంటికి రెండు వీధుల అవతల వున్న రెండతస్థుల డాబాలో వుంటారు. వ్యాపారం మొదలుపెట్టక ముందు నాన్న, పద్మనాభంగారు ఒకే ఆఫీసులో పని చేసేవారు. ఇద్దరూ మంచి స్నేహితులు కావటం మూలానేమో ఒకే చోట ఇళ్ళు కొనుకున్నారు. ఇదంతా నాకు వూహ తెలియకముందు సంగతి. నాకు తెలిసేటప్పటికే నాన్న సొంతగా ట్రాన్స్ పోర్ట్ కంపెనీ మొదలుపెట్టాడు. అయినా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే వుంది. నేను, అన్నయ్య, పద్మనాభంగారి పిల్లలు ఎప్పూడూ కలిసే ఆడుకునేవాళ్ళం. అమ్మ, పద్మనాభంగారి భార్య సావిత్రత్తయ్య ఎప్పుడూ అక్కచెళ్ళెళ్ళ మాదిరిగా కలిసి తిరిగేవారు. అందుకే నేను పాత ఇంటికి వెళ్తున్నానని చెప్పగానే అమ్మ ముందు సావిత్రత్తయ్య ఇంటికే వెళ్ళమని చెప్పింది.


వాళ్ళింటికి వెళ్తూనే అత్తయ్య ఎదురొచ్చి – “ఏమ్మా ఇన్నాళ్టికి తీరిందా? మీ పెళ్ళి తరువాత ఇదే చూడటం నిన్ను.. రండి..” అంటూ నాతో మాట్లాడుతూనే.. “మొదటిసారి వచ్చారు నాయనా.. వుండండి ఏదైనా స్వీటు చేసుకొస్తాను..” అంటూ రవిని పలకరిస్తూ ద్విపాత్రాభినయం చేసేసింది.


“ఏంటత్తయ్యా హడావిడి.. అవన్నీ తరవాత చూడచ్చు ముందు కాస్సేపు కూర్చో..” అంటూ బలవంతంగా కూర్చోపెట్టాల్సి వచ్చింది. కుశలప్రశ్నలు, ఉభయకుశలోపరిలు అయ్యాక నెమ్మదిగా విషయం మొదలుపెట్టాను –

“మా ఇంట్లో ఇప్పుడు ఎవరుంటున్నారత్తయ్యా..” అడిగాను.

“ఎందుకడుగుతావే అమ్మా.. మీరు ఆ గోవిదరాజులుగారికి అమ్మారా ఆ తరువాత ఎవరో పరమేశ్వరరావుగారట ఆయన కొన్నాడు.. ఎప్పుడో పేరు వినటం, అప్పుడప్పుడు చూడటమే కానీ ఒక్కసారి కూడా ఈ వీధిలో వాళ్ళతో మాట్లాడగా చూడలేదే…” చెప్పిందావిడ.

“కొత్తగా వచ్చారు కదా.. కొన్ని రోజులాగితే వాళ్ళే కలుస్తారేమో లెండి” అన్నాడు రవి సర్దుబాటుగా. నాకు మాత్రం ఎందుకో అది నిజం కాదని అనిపించింది. అదే మాట అత్తయ్య కూడ అంది.

“లేదు బాబూ.. వాళ్ళు వచ్చి కూడా ఆరు నెలలు దాటింది.. మొదట్లో ఒకసారి కొత్తగా వచ్చారు కదా అని పలకరించడానికి వెళ్ళాం… పొడి పొడిగా మాట్లాడి ఇంక వెళ్ళమన్నట్లు చూస్తే ఏం చేస్తాం చెప్పు.. ఆ తరువాత ఎప్పుడు చూసినా తలుపులేసుకోని వుంటారు.. అదో రకం మనుషుల్లే..” అంటూ లేచింది.. “కూర్చోండి ఏదన్నా చేసుకొస్తాను..” అంటూ వంటింట్లోకి వెళ్ళింది.


నేను రవి వైపు చూశాను.

“మీ సావిత్రి అత్తయ్య ఏదో భారీ ప్రోగ్రాం పెట్టినట్లుంది.. లోపలికి వెళ్ళి వద్దని చెప్పు” అన్నాడు.

“ఆవిడకి నేనన్నా అమ్మన్నా ఆపేక్ష…” అన్నాను నవ్వుతూ.

“ఆపేక్ష అనుభవించేది మనసుతో అయితే ఎంతైనా ఫర్లేదు.. అది పొట్టమీద దాడి చేస్తే కష్టం..” అన్నాడు పొట్టమీద చేతితో రుద్దుకుంటూ. నేను నవ్వుకుంటూ లేచానో లేదో గాయత్రి, వనజ వదినా వాళ్ళ పిల్లలతో బిలబిల మంటూ వచ్చేశారు.


“ఏమ్మా ఇదేనా రావటం.. అమ్మా నాన్నని పిల్చుకు రాకపోయావా.. ఈయనేనా మీ ఆయన? ఏదన్నా విశేషమా? ఇంకా ఎప్పుడే..” ఎవరు ఏ ప్రశ్న అడుగుతున్నారో అర్థం అయ్యే లోపలే పది పదిహేను ప్రశ్నలు దూసుకొచ్చాయి. సమాధానాలతో పని లేనట్టుంది వాళ్ళకి. రవిని వాళ్ళకి, వాళ్ళని రవికి పరిచయం చేశాను.

“ఆ ఏదో ఇరుగు పొరుగు అన్నట్టు కాదు రవిగారు.. మేమంతా వీళ్ళ ఇంటిలోనే వుండేవాళ్ళం. ఒక్క రోజు రాకపోయినా మీ అత్తగారు వూరుకునేది కాదు..” చెప్పింది వనజొదిన.

“ఇద్దరు ఒక సారి రండే.. నానమ్మ చాలా రోజుల్నించి చూడాలంటోంది..” అంది గాయత్ర్రి. ఆ మాట పూర్తికాక ముందే నానమ్మ నెమ్మదిగా వంగి నడుచుకుంటూ “ఏమే పిల్లా..” అంటూ లోపలికొచ్చింది.

“నువ్వెందుకు నానమ్మా ఇంత కష్టపడి రావటం? మేమే వద్దామనుకుంటే.. “ అన్నాను నేను.

“ఏమో తల్లీ.. ఈ ముసలమ్మ నీకు గుర్తుందో లేదో.. రాకండా పోతే మళ్ళీ చూడటానికి వుంటానో లేదో అని ఆత్రపడి వచ్చాను.. నిన్ను చూస్తే మీ అమ్మని చూసినట్టుందే పిల్లా.. కాకపోతే బాగా సన్నబడ్డావు..” అంది ఆప్యాయంగా నిమురుతూ.


రవి నవ్వేశాడు.
“ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి వస్తామండి..” అన్నాడు జనాంతికంగా.

“ఎవరున్నారని వెళ్తారు.. వీళ్ళు వచ్చిన తరువాత కళే పోయింది… ఆ బాదం చెట్టు కొట్టేసిన తరువాత ఆ ఇల్లే కొత్తగా వుంది..” అంది గాయత్రి.

“అయ్యో.. చెట్టు కొట్టేశారా?” అన్నాను అప్రయత్నంగా.. ఒక్కసారిగా నా బాల్యం కోల్పోయిన  బాధ కలిగింది నాకు.

“ఒక్క చెట్టేమిటే తల్లి.. మీరు పెట్టిన పాదులు, పూల చెట్లు ఒక్కటి బ్రతకనిచ్చారా? మీ గోరింటాకు చెట్టు ఆకు ఎంత బాగా పండేది గుర్తుందా? దాని ఆకు కోసం అందరూ వస్తున్నారని తెగ సణిగేది ఆ మహా ఇల్లాలు.. ఇప్పుడు ఆ చెట్టు వున్నా ఒకటే లేకపోయినా ఒకటే.. ఒక్క ఆకు లేకుండా ఎప్పుడూ ఎండిపోయి వుంటుంది…” చెప్పింది అత్తయ్య వంటింటిలోనుంచే.

“ఫర్లేదు లెండి.. ఒకసారి వెళ్ళి వెంటనే వచ్చేస్తాం..” అన్నాడు రవి లేస్తూ.

“వెళ్ళిరండి నాయనా.. ఆ అమ్మాయి పుట్టి పెరిగిన ఇల్లు.. చూసుకోవాలని వుండదూ..” అంది నానమ్మ.

“త్వరగా వచ్చేయండి.. మీ మామయ్య వచ్చేవేళ కూడా అయ్యింది.. ఒక్కసారే రాత్రికి భోజనం కూడ చేసి వెళ్ళచ్చు..” అంది అత్తయ్య గొంతు వంటింటిలోనించి.


భోజనం మాట వినగానే మేము ఇద్దరం ఒకరినొకరం ఇబ్బందిగా చూసుకోని నవ్వుకోని బయటపడ్డాం.


***


మా పాత ఇంటి కొత్త స్వరూపం చూడగానే బాధగా అనిపించింది. సావిత్రత్తయ్య వాళ్ళు చెప్పింది నిజమే. నేను పుట్టి పెరిగిన ఇల్లు అదే అని చెప్పడానికి ఏ ఆనవాలు మిగిలినట్టు లేదు. బాదం చెట్టు లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బావి మూసేసారు. గేటు ఇంతకు ముందున్న చోటు నుంచి కొంచం దక్షిణానికి జరిపినట్టున్నారు. మేము ఎంతో ముచ్చటపడి వేయించిన లేత గులాబిరంగుకు బదులుగా మాసిపోయిన తెల్లరంగుతో ఇల్లు వెలవెలబోతోంది.


తలుపుతీసి మమ్మల్ని చూసిన పెద్దమనిషి ప్రశ్నార్థకం మినహా ఏ భావం పలకకుండా ముఖం పెట్టాడు.

“పరమేశ్వరరావుగారు..??” అడగాలా వద్దన్న సంశయం రవి గొంతులో. ఆయన సమాధానం చెప్పలేదు. చిన్నగా వూపిన తల చూస్తే అది “అవును” అన్న సమాధానమో.. “అయితే ఏంటి” అన్న తిరస్కారమో అర్థం కాలేదు.


“ఈ ఇల్లు ఒకప్పుడు మాదేనండి.. నేను పుట్టి పెరిగిన ఇల్లు.. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాము..” చెప్పాను నేను.

“రండి..” అనే మాట ఆయన గొంతులో నుంచి తప్పదన్నట్లు వచ్చింది. లోపలికి వెళ్ళి బాగా దుమ్ము పట్టి వున్న కుర్చీలలో కూర్చున్నాం.

“బాదం చెట్టు కొట్టేసినట్లున్నారు..?” అడిగాను ఏమడగాలో తెలియక.

“ఏం చెట్టో.. ఇంటినిండా ఆకులు.. చెత్త.. చెట్టు నిండా పిచుకలు, గూళ్ళు..” అసహ్యంగా ముఖం పెట్టాడు.. “కాయలు కాస్తేచాలు.. పిల్లలంతా రాళ్ళు వేయడం, గోడలు దూకటం.. అందుకే కొట్టిచ్చేశాం..” చెప్పాడు. అంతసేపటికి అన్ని మాటలు మాట్లాడినందుకు సంతోషపడాలో, ప్రతి మాట గుచ్చుకున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు నాకు. బావి గురించో, గోరింటాకు చెట్టు గురించో అడిగే ధైర్యం లేకపోయింది.


“ఈ ఇల్లు వాళ్ళ నాన్నగారికి బాగా కలిసి వచ్చిందండి… తను ఎప్పుడూ ఈ ఇంటి గురించే చెప్తుంటుంది..” అన్నాడు రవి. సూటిగా మేము అనుకున్న విషయం రాబట్టడానికే ఆ మాట అన్నాడని నాకు అర్థమైంది. ఆతృతగా పరమేశ్వరరావుగారి వంక చూశాను.

“ఏం కలిసిరావటమో.. ఒక సుఖం లేదు సంతోషం లేదు.. ఎందుకు కొనుక్కున్నామా అని అనుకోని రోజు లేదు..” చెప్పాడాయన చప్పరిస్తూ. రవి ఇంకా ఏదో అడగబోతుంటే నేను మధ్యలో అందుకున్నాను –

“చాలా ధాంక్సండి.. వస్తాము..” అంటూ లేచాను.  రవి కొంచెం ఆశ్చర్యంగా చూసి తను కూడా లేచి నాతో బయటికి అడుగేశాడు.

“గేటు కూడా మార్చినట్లునారు..” అన్నాడు బయటపడుతూ.

“వాస్తు ప్రకారం..” అన్నాడు ఆయన.


***


మేము సావిత్రి అత్తయ్య ఇంటికి వచ్చేసరికి పద్మనాభం మామయ్య కూడా వచ్చేశాడు. ఆప్యాయంగా పలకరించి అన్ని విషయాలు అడిగాడు. రవి మేము వచ్చిన కారణం వివరించాడు.


“మీ మామగారు వున్నప్పుడు పరిస్థితి వేరు.. వాడికి, వాడి భార్యకి ఎప్పుడూ పది మంది చుట్టూ వుండాలి.. వీధిలో వున్నవాళ్ళందరిని పలకరించేవాడు… ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఇద్దరూ వెనక ముందు చూడకుండా చేసేవాళ్ళు.. పదిమంది మంచి కోరుకుంటే మనకి మంచే జరుగుతుందనడానికి వాడే వుదాహరణ..” చెప్పాడాయన.


ఆ రాత్రి భోజనం చెయ్యనిదే ఒప్పుకోలేదు మామయ్య, అత్తయ్య. రాత్రి పది దాకా మమ్మల్ని చూడాలని చుట్టుపక్కలవాళ్ళంతా వచ్చారు. అతి కష్టం మీద పదిన్నరకి బయలుదేరాము.


“ఈ ఏరియాలో మీరెవరైనా ఎలక్షన్లో నిలబడ్డా గెలిచేట్టున్నారు..” అన్నాడు రవి నవ్వుతూ. నేను నవ్వేశాను.

“అంతా నాన్న, అమ్మ గుడ్ విల్” చెప్పాను.

“అది సరే.. ఇంతకీ ఏం నిర్ణయించావు?” అడిగాడు అసలు విషయానికి వస్తూ.

“చెప్తాను.. కానీ మీరు వెక్కిరించకూడదు.. ఆ రెండు ఇళ్ళల్లో..” చెప్పబోతుంటే మధ్యలోనే ఆపేశాడు రవి.

“రెండు కాదు.. మూడు ఇళ్ళలో.. మీ పాతింటిని కొనుక్కుంటే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నాను..” అన్నాడు.

నేను సమాధానం చెప్పలేదు. అప్పుడే అమ్మ ఫోన్ చేస్తే తీసుకోని చెప్పాను – “నిర్ణయించుకున్నాం అమ్మా..” అని.

***

Posted in కథ | Tagged | 7 Comments

కథావసంతం 2011 – ఉగాది కథలపోటీ ఫలితాలు

పొద్దు పత్రిక అంతర్జాలంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ళలో కథలకు సంబంధించి పోటీని నిర్వహించడం ఇదే మొదటిసారి. తెలిసిన రచయితలను అడిగి రాయించుకోవడమూ, అభిమానంతో మరికొందరు తామే పంపడమూ మాత్రమే ఇప్పటిదాకా అలవాటు. మరి పోటీ ఎందుకు? తెలిసినవాళ్లందరికీ ఉగాది కథలకోసం ఆహ్వానాలు పంపితే సరిపోతుందిగా అనుకున్నాం మొదట్లో. ’తెలియని రచయితల్ని తెలుసుకోవచ్చుగా!’ అన్నారొకరు; ’నిజమే కొత్తవారితో పరిచయమూ, జాలం బయటి జనంతో అనుబంధమూ’ కలిసొస్తాయనిపించింది.

 

"ఉగాదికా! అన్ని పత్రికలూ వేలకి వేలు బహుమతులిస్తున్నాయి, ’మీరిచ్చే బహుమతులేమిటి? అసలు  పత్రికలన్నీ పోటీలు పెడుతుంటే మీకే ఎందుకు రాయాలి?" అన్నారు, సందేహనివృత్తి కోసం కొందరు. "మేము డబ్బులివ్వము. కథలకి తిరిగి కథలే ఇస్తాము. మంచి పత్రికలూ, పుస్తకాలూ, డిజిటల్ లైబ్రరీలో సభ్యత్వాలూ ఇస్తాము. అక్షర లక్షల కోసం రాసేవారుండకపోతారా? మనమీది అభిమానంతో పంపకపోతారా?" అని తిరిగి ప్రశ్నించుకున్నాం.

 

"ఐతే, ఎప్పట్లాగా మీరే ఎంపిక చేసి, ఎడిట్ చేస్తారనమాట!" -తప్పక రావల్సిన అనుమానమే! పోటీ అంటే పోటీయే. అనుభవజ్ఞులని అడిగాం, 'కొంచం కథలెంచిపెడతారా మాస్టారూ?' అని. ’నా పేరు బయట పెట్టకుంటే పని చేసిపెడతాను పోండ’ని నిరాడంబరంగా ఆశీర్వదించారు. ’మీ ఇమేజ్ కన్నా, అనుభవాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటాం ఆచార్యా’ అని సవినయంగా నమస్కరించాం.

 

———-

 

గడువు తక్కువ, ఆకర్షించే బహుమతుల్లేవు, పబ్లిసిటీ నామమాత్రమే, వృథాప్రయత్నమేమో అనుకునేంతలో మెల్లగా కథలొచ్చాయి. మెల్లగా మొదలై, జోరుగా సాగింది కథాధార. కొత్త రచయితలు ఎక్కువగా పాల్గొన్నారు. జాలంలో, పొద్దులో ఇదివరకు ఎప్పుడూ కనపడని వాళ్లనుండి ఎక్కువ స్పందన రావడం ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ అనిపించింది. పొద్దు జాలపత్రిక అని తెలియనివాళ్ళు కూడా కథలను పంపించారు. ఒక రచయిత అయితే, ’పొద్దు అనే పత్రిక ఉన్న సంగతే తెలియదు. వెంటనే నాకు పత్రిక పంపించండి. సంవత్సర చందా ఎంతో చెప్పండి ’ అంటూ కార్డు రాసారు.
 

నాణ్యత విషయంలో సహజంగానే తేడాలున్నాయి. కొందరు మంచి అంశాలని ఎంచుకున్నా శైలి, కథనాల్లో కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల నీరుగార్చినట్టు అనిపించింది. "చాలా మంది రచయితలు మంచి కథాంశాలను ఎంచుకుంటున్నారు గానీ, కథను ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమౌతున్నారు. ఈ పోటీలో కొన్ని కథలను ఆ కారణంగానే పక్కనపెట్టవలసి వచ్చింది" అని మా నిర్ణేతలలో ఒకరు చెప్పారు. మరికొందరు, కొత్త విషయాలకోసం ప్రయత్నించకుండా ఒక ఒరవడిలో పడి, మూస కథాంశాలను కథగా మలచడానికి ప్రయత్నం చేసినట్టు తోచింది.

 

ప్రచురణకు ఎంచుకున్నవాటిలో మూడు కథలు బహుమతికి అర్హమైనవిగా మా నిర్ణేతలు భావించారు. చిన్నపాటి సవరణలు అవసరమనిపించినా మొత్తం మీద ఫరవాలేదనిపించిన వాటిని సాధారణ ప్రచురణకు ఎంచుకున్నాం. ఈ కథలన్నిటినీ వరుసగా ప్రచురిస్తాం.

ఈ కథావసంతానికి స్పందించిన, సహకరించిన వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.  ఉత్సాహంతో పాల్గొన్న పాతకాపులకు, కొత్తవారికి,  అభినందనలు. మీ కథల్ని పంపడానికి పొద్దుని ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు. మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో ముందుముందు మరిన్ని పోటీలు నిర్వహించాలని భావిస్తున్నాం. రాబోయే పోటీలలో కూడా ఇనుమడించిన ఉత్సాహంతో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం, పాల్గొంటారని ఆశిస్తున్నాం.

ఈ కథలపోటీ వివరాలను తమ వెబ్ సైట్లలో ప్రచురించి ప్రచారం కల్పించినందుకు కూడలి, జల్లెడ, హారం, మాలిక సంకలినుల అధిపతులకు,  పుస్తకం నిర్వాహకులకు, సాక్షి దినపత్రికవారికి, సాక్షిలో ప్రకటించేందుకు సహకరించిన ప్రముఖ కవి, పాత్రికేయుడు పూదూరి రాజిరెడ్డి గారికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బహుమతులను స్పాన్సరు చేస్తున్న కినిగె.కామ్ వారికి కూడా మా కృతజ్ఞతలు.
 

బహుమతి కథలు:

 

                                              కథ పేరు             రచయిత/రచయిత్రి

మొదటి బహుమతి                తుది విన్నపం             రమ గమని

రెండవ బహుమతి                 స్వాప్నికం                 డా|| భైరవభట్ల విజయాదిత్య

మూడవ బహుమతి               కలసివచ్చిన ఇల్లు        అరిపిరాల సత్యప్రసాద్

 

సాధారణ ప్రచురణకు ఎంపిక చేసినవి

 

  1. అక్రమార్క సింహాసనం – వసుంధర
  2. ఏ బంధం కావాలి? – గంధం నాగసురేష్
  3. ఒక ఓదార్పు, ఒక నిట్టూర్పు – గంధం నాగసురేష్
  4. గమ్యం – తిరుమలశ్రీ
  5. థ్రిల్ – కౌండిన్య తిలక్
  6. నిశ్శబ్ధపు హోరు – శారదా మురళి
  7. మధు గీతం – జీ.వీ. రమణారెడ్డి

మిగిలిన కథలను తిరస్కరించడమైనది. ఈమెయిలైడీలు ఉన్న రచయితలు/రచయిత్రులకు సమాచారాన్ని తెలియజేస్తాం. ఇతరులు ఈ ప్రకటననే సమాచారంగా భావించవలసినది.

Posted in ఇతరత్రా | Comments Off on కథావసంతం 2011 – ఉగాది కథలపోటీ ఫలితాలు

చైత్రము కవితాంజలి -1

అంశం: పాతమాటలు – కొత్త కవిత:


స్వాతికుమారి: అమృతం కురిసిన రాత్రిలో ఒకచోట తిలక్ "తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక" అంటారు, ఉత్తారాలు పంచి
మౌనంగా తిరిగి వెళ్తున్న తపాలబంట్రోతుని ఉద్దేశించి..

అలా జీవన సాగరంలోకి వెళ్తున్న ఏకాకి నౌక ఎవరైనా కావచ్చు, సందర్భాలెన్నో ఉండొచ్చు. ఇదే కవితా పంక్తిని తీసుకుని మరొకరకంగా తమ సొంతశైలిలో కొత్త కవితను మిత్రులు ఎవరైనా రాయగలరా?


కర్లపాలెం హనుమంతరావు:


నడిసముద్రంలో ఒంటరి దిగులు నావ తెరచాప కొయ్య మీద  దిగంతాల అంచుల్లోకి రిక్కించి
చూస్తున్న ఏకాకి కాకి సిల్హౌట్టి …మీద ఎవరైనా గుబులు పెట్టుకోగలరా కవులారా మీ
మనసారా!


కత్తి మహేష్  కుమార్:


కలసికన్న కలల అలలు
పెనుతుఫానుకు తీరం చేరాయి
విడిపడితే కలువలేమని తెలిసీ
తడిని వీడి పొడిని కోరిన ఫలితం
కళ్ళ ఎదుటి మధురస్వప్నం మరకపడింది
నీ స్త్రీత్వపు తడి నా దుప్పటిపై ఇంకా తడారలేదు
కానీ నీ పాదాల పారాణి మాత్రం అరిపోయింది
నీ జ్ఞాపకాల ప్రవాహంలో చుక్కాని వీడి
తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌకనో
తుఫాను తాకిడికి తుత్తునీయలైన నావనో
విరిగి ఒంటరిగా మిగిలానని మాత్రం తెలుసు

స్వాతీ శ్రీపాద:

ఋతువులు విసుగెత్తిపోయాయి
ఎంత ఠంచనుగా ఆగమన నిష్క్రమణలను పాఠిద్దామన్నా
ఎదురౌవుతున్న ఆటంకాలకు వశమై
గాడితప్పి దారిదొరక్క
తిరిగిన చోటే తిరుగుతూ
అలసి సొలసి సేద దీర్చుకుంటున్న
ఋతువులు విసుగెత్తిపోయాయి
ఆహ్వానించని అతిధుల్లా
అకాల వర్షాలు
ఆహ్వానమే అవసరం లేని చొరబాటుదార్లుగా
వరదలూ ముంపులూ
శీతలం వేడెక్కితే
వేసవి బాధను వర్షిస్తూ
గ్రీష్మం గాఢ నిద్రలో పలవరిస్తూ
చైత్రం తెల్లబోయి ఆలోచిస్తోంది
"తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక"లా
ఏ వైపుకు సాగాలని.

పెరుగు రామకృష్ణ

                    

*కొలిమి.*..


గుండె కొలిమి
జ్ఞాపకాలతో మండుతుంది..
క్షణ క్షణం గాయపు ఊపిరితిత్తులతో
కలల్ని పండిచుకున్న  మనిషిలా..
పిట్టలేగిరిపోయి చెట్టు మాత్రమే మిగిలింది
వలసబోయిన పేగు బంధం
ఎడారిలో వచ్చిపోయే వసంతంలా  …
మనుషులందరూ
కాలం తీర్చిన యంత్రాలయ్యాక
విలువలన్నీ తెరలమీదనే ఆవిష్కరణ…
బతుకు చారికల చరిత్రతో ..
ముడుతలు పడిన ముఖంతో
ఒక సాయం సంధ్యా సమయాన
తీరం వదలి సముద్రంలోకి వెళ్తున్న
ఏకాకి నౌకలా నేను..

Posted in కవిత్వం | Tagged , | 32 Comments

విటప భంగము

2011 మార్చి 10న తెలుగువారి రాజధాని నడిబొడ్డున సాంస్కృతిక విధ్వంసం జరిగింది. జాతికి స్ఫూర్తిదాతలైన తెలుగువెలుగుల స్మృతి చిహ్నాలను ముష్కరులు ధ్వంసం చేసారు. ఈ సంఘటనపై కవి స్పందన, ఛందోబద్ధ పద్యాల్లో..

Continue reading

Posted in కవిత్వం | Tagged | Comments Off on విటప భంగము

వసంతసుమశేఖరము

రవి :  ఖరనామసంవత్సర జాలకవిసమ్మేళనం – వసంతసుమశేఖరానికి కవివర్యులందరికీ సుస్వాగతం

రవి :  ఆనవాయితీ ప్రకారం గణేశ స్తుతి, దుర్గాస్తుతులతో సభను ఆరంభించుదాము. పెద్దలు చింతా రామకృష్ణారావు గారు కంద, గీతి గర్భిత చంపకమాల పంపారు.


చం.

అతి కలకంఠి! యాశ్రిత జనావళిఁ బ్రోవుమ! శ్రీ గణేశ ప్రా

ర్థిత జననీ! సుధా మధుర ధీయుత సత్ కృతి మాకుఁ గొల్పి, స

ద్గతి వెలయించుమా. సుకవిగా నొలరించి, విశుద్ధ కీర్తి, ను

ద్ధతి నిడు మా కృపన్! సరసతన్, కలిగించుమ! సత్ స్వభావమున్.

 

గర్భిత గీతి:

శ్రిత జనావళిఁ బ్రోవుమ! శ్రీ గణేశ!

మధుర ధీయుత సత్ కృతి మాకుఁ గొల్పి,

సుకవిగా నొనరించి, విశుద్ధ కీర్తి

సరసతన్ కలిగించుమ! సత్ స్వభావ!

 

గర్భిత కందము:

కలకంఠి! యాశ్రిత జనా

వళిఁ బ్రోవుమ! శ్రీ గణేశ ప్రార్థిత జననీ!

వెలయించుమా. సుకవిగా,

నొలరించి, విశుద్ధ కీర్తి నుద్ధతి నిడుమా!

 

రవి :  పై పద్యంలో విశేషమేమంటే – చంపకమాల దుర్గాస్తుతి అయితే గర్భిత గీతం గణేశ స్తుతిగా కూర్చారు గురువుగారు

విశ్వామిత్ర :  చంపకంలో జనని ప్రార్ధన, గర్భం లో గణేశ ప్రార్ధన – బాగు బాగు

నచకి :  ఆహాహా!

కామేశ్వరరావు :  అద్భుతం! ఒకే కాన్పుకి ముగ్గురు రత్నాలని ప్రసవించారు చింతావారు! 🙂

మురళీమోహన్ :  చప్పట్లు

గన్నవరపు నరసింహమూర్తి :  అద్భుతం

వసంత్ కిషోర్ : అద్భుతం

శ్రీపతి :  జనని గర్భం నుండి రాలేదన్న వెలితి గణేశుడికి లేకుండా తీర్చారు చింతావారు . బాగు బాగు

మిస్సన్న :  నిజంగా అద్భుతమండీ

రవి :  ప్రసవింతురు గురువుగారు పదివే లైనన్ ..

మిస్సన్న :  అవును అందుకు సమర్థులు వారు.

కామేశ్వరరావు :  మరో విశేషం, "కలకంఠి" పదంతో పద్యం మొదలుపెట్టడం. కలకంఠి అంటే కోకిల అని కూడా అర్థం ఉంది కదా.

శంకరయ్య :  శ్రీ గణేశాయ నమ …. శ్రీ చింతా రామకృష్ణాయ నమః

గన్నవరపు నరసింహమూర్తి :  చింతా విజయ ఆయనేనండీ, లేక వారి సుతులా?

రవి :  చింతా రామకృష్ణారావుగారండి.శంకరయ్య :  "విజయ" వారి భార్య గారి పేరు.

కామేశ్వరరావు :  కోకిల కూజితంతో ఉగాదిసభ చక్కగా మొదలయ్యింది!


రవి :  కామేశ్వరరావు గారు, మీరు ఉగాదిని స్వాగతించండి

కామేశ్వరరావు :  అలాగే

ఉ.

శ్రీకరమై, రసజ్ఞవరచిత్త వశీకరమై, మనోజ్ఞ భా

వాకలితాంధ్రపద్య కుసుమాకరమై, సుకవీంద్ర భృంగ బృం

దా కృత ఝంకృతీ మధుసుధాకరమై, నవ వర్ష హర్షవ

చ్ఛీకరమై, వసంతసుమశేఖరమై సభ వెల్గు గావుతన్!

 

రవి :  నిజంగానే ఒక్క వెలుగు వెలిగిందండి.

శ్రీపతి :  అనుప్రాసతో పద్యం అద్భుతంగా ఉంది.

మిస్సన్న :  చక్కని స్వాగతం పలికేరండీ కామేశ్వర రావు గారూ

శ్రీపతి :  పోతన స్టైలు కాపీ…… 😉

గన్నవరపు నరసింహమూర్తి :  చాలా బాగుంది కామేశ్వరరావు గారూ

వసంత్ కిషోర్ : కిల కిలా రావాలు !! !

కామేశ్వరరావు :  నెనరులు. పూర్వకవులు పెట్టిన భిక్షే కదండీ ఇదంతా!

నచకి :  సభకూ, వసంతానికీ స్వాగతం పలికారు, శుభం!

పుష్యం :  రాకేశ్వరుఁడు, పుష్యం పున ప్రవేశం

కామేశ్వరరావు :  రాక రాక వచ్చారు రాకేశ్వరులు. స్వాగతం!

నచకి :  శ్యామ్ గారికి పునఃస్వాగతం, రాకేశ్వరునికి స్వాగతం!

గన్నవరపు నరసింహమూర్తి :  క్రొత్త సంవత్సరానికి స్వాగతము పలికేరు

రాకేశ్వరుఁడు : సభకు నమస్కారములు.

రవి :  చంద్రోదయం అయింది

మిస్సన్న :  అంతేగా మరి


రవి :  సనత్ గారు వసంతసుమశేఖరాన్ని సింహాసనారూఢను చేయబోతున్నారు. కానివ్వండి, సనత్ గారూ.

మిస్సన్న :  శుభం

శ్రీపతి :  తప్పకుండా

 

కం.

కవనమ్ముల సంతర్పణ

నవతర కవి సరసులీయ  నైవేద్యమయెన్ !!

భువినీ విశేష సభను ఖ

ర విభవమున్ తెలియ రండు కాంక్షలుతీరన్ !!

 

రవి :  పై పద్యం చూశాక ఈ బొమ్మ చూడండి.

 


(చిత్రంలో పద్యచివరి పాదంలోని యతిలోపం సవరించబడినది పొద్దు)

 

శ్రీపతి :  సింహాసన బంధంలో కందమిది

నచకి :  నవతరకవులు 🙂

విశ్వామిత్ర :    ఓహొహో అద్భుతం

వసంత్ కిషోర్ : అద్భుతం !

మిస్సన్న :  అత్యద్భుతమండీ

నచకి :  వచ్చే సభ నాటికైనా యీ బంధకవిత్వాన్ని ఓ పట్టు పట్టాలి… ఈసారి సమయాభావము, ప్రజ్ఞాభావము 🙁

గన్నవరపు నరసింహమూర్తి :  సింహాసనము అందంగా ఉంది

శంకరయ్య :  చివరి పాదంలో యతి తప్పినా మా మతి సమ్మతిని తెలుపుతున్నది.

విశ్వామిత్ర :  @నచకి మీరు తెరకవులని వారికి తెలియదనుకుంటా

నచకి :  ఇంకా తెఱ చిఱగలేదు లెండి!

శ్రీపతి :  అంటే ఆఖరు నిమిషంలో ఖగ వినుతుణ్ణి ఖర విభవంగా మార్చేసరికి

పుష్యం :  ఈ పద్యాన్ని విభవ సంవత్సరానికి కూడా వాడొచ్చనుకుంటా? 🙂

రాకేశ్వరుఁడు: బంధకవిత్వంలో కాలువేయడం అంత తేలికకాదండి!

కామేశ్వరరావు :  "తెలియ రండు రసముప్పొంగన్" అంటే సరిపోతుంది.

శ్రీపతి :  వహ్వా.. భేషుగ్గా ఉంది… అట్లానే మారుస్తా…

విశ్వామిత్ర :  రయముగ మీరల్ !

నచకి :  యతి సింహాసనంలో ఆసీనులైతేనే శుభం! ఇక్కడికి దిగి రాకున్నా…

కామేశ్వరరావు :  "ఖర విభవమే" బాగుంది. అధ్యక్షులవారిని కూడా అందులో బంధించారు కదా!

రవి :  అధ్యక్షుల వారెక్కడున్నారండి? :))

విశ్వామిత్రరవి దాగుండటమ్ వారికి నచ్చి ఉండవచ్చు

శ్రీపతి :  ఖర – రవి అవిభాజ్యులు కదండీ… 😉

నచకి :  రవిఁ గాంచని చోట కామేశ్ గారు రవిని చూపించారు 🙂

కామేశ్వరరావు :  ఖ"రవి"భవమున్

చదువరి :  కామేశ్వరరావు గారూ.. 🙂

రవి :  చిత్రకవిత్వంతో శ్లేషకవిత్వం చూపించారు కామేశ్వరులు 🙂

శ్రీపతి :  ఓకే. అయితే… సవరించిన పద్యపాదం "ర విభవమున్ తెలియ రండు రసముప్పొంగన్"

 

కం.

కవనమ్ముల సంతర్పణ

నవతర కవి సరసులీయ  నైవేద్యమయెన్ !!

భువినీ విశేష సభను ఖ

ర విభవమున్ తెలియ రండు రసముప్పొంగన్ !!

 

విశ్వామిత్ర :  వసంతం వచ్చీ రాగానే యతుల గురించి ఎందుకులేండి, ఆ సంగతి నాకొదలి, కాంక్ష దీర అడుగులు వేయండి


రవి :  సరేనండి. తరువాతి సమస్యకెళదాము.

కామేశ్వరరావు :  అలాగే

రవి :  శివుని గుణ గణనమున చెడు గుణము కలుగున్ – ఎలాగో శంకరులవారే చెప్పాలి


కంది శంకరయ్య:

అతివినయ వృత్తము:

భవహరము శుభకరము పరమపద మొసఁగన్

కవయు చిర సుఖము మన కవనమునను సదా

శివుని గుణ గణనమున; చెడు గుణము కలుగున్

భువి జనులు తమ వ్యసనములు వదల కునికిన్.

 

గన్నవరపు నరసింహమూర్తి :  గురువు గారి పూరణ చాలా సుందరంగా ఉంది

మిస్సన్న :  గురువుగారూ మనోజ్ఞంగా చెప్పారు.

కామేశ్వరరావు : అతివినయముగా అడిగిన అధ్యక్షులవారికి శుభకరముగా జవాబిచ్చారు శంకరులవారు! 🙂

పుష్యం :  అన్ని లఘువుల వలన 'అతివినయం' సార్ధక నామధేయం 🙂

రవి :  రెండవ పాదంలో – కవయు, కవనము చాలా అందంగా చెప్పారు.

విశ్వామిత్ర :  సదా – భలే గా కుదిరింది- రెండో పాదానికీ ఒప్పుతోంది, ఒక విరుపులో

నచకి :  నిజమే

పుష్యం :  పద్యం చాలా బాగుంది

పుష్యం :  కవయు??

శంకరయ్య :  అందరికీ ధన్యవాదాలు.

విశ్వామిత్ర :  భవహరము శుభకరము పరమపద -> ఈ వరుస కూడా – గమనించదగినది – జీవి – శివుని వైపు మళ్ళేది ఈ క్రమం లోనే

కామేశ్వరరావు :  విశ్వామిత్రులవారి దృష్టి అమోఘం!

శ్రీపతి :  బాగా సెలవిచ్చారు.

శంకరయ్య :  కవయు = కలియు, సంభోగించు

నచకివిశ్వామిత్ర సృష్టి మాత్రమే అనుకున్నాను, దృష్టీ అమోఘమే, అవును! 🙂

వసంత్ కిషోర్ : శలవిచ్చిందే !శంకరులు గదా !

రవి :  ఆయన విశ్వానికి మిత్రులు కదండి. పైగా అనుభవజ్ఞులు. ఇహము, పరము రెండూ ఆయనకు తెలుసు

శ్రీపతి :  అవునవును వారికి 'ఆ' అనుభవం కూడా ఉంది కదూ !!

నచకి :  పరానుభవం కూడానా! ఇహ చెప్పేదేముంది!

కామేశ్వరరావు :  ఈ పద్యంలో చక్కని లయ శివతాండవంలా వినిపిస్తుంది. "తకిటతక తకధిమిత" అని!

నచకి :  గణములలోని నడక గురువుగారి పదములతో అతివినయంగా నడిచింది


రవి :  సరేనండి, మిస్సన్న గారి పూరణను కూడా విందామా?

కామేశ్వరరావు :  తప్పకుండా!

మిస్సన్న :  చిత్తగించండి

అతివినయ వృత్తము:

భవము భవమని వలదు భయమిక నెవరికిన్

భువిని భవ తరణమును మునులు గనరె సదా

శివుని గుణ గణనమున! చెడు గుణము కలుగున్

శివుని మఱచిన యతడు చెడు నుభయములకున్

 

పుష్యం :  చెడుగుణాలను విఱిచేసారుగదా

నచకి :  భవతరణము, వాహ్!

వసంత్ కిషోర్ : భళి ! భళీ !

కామేశ్వరరావు :  "భవసాగరం" కాబట్టే తరణం. బాగుంది!

రవిశంకరయ్య మాస్టారు గారి ప్రభావం అనుకుంటాను, రెండవపాదం లో "సదా" వచ్చింది.

శంకరయ్య :  "చెడు నుభయ ములకున్" అనడం బాగుంది. మంచి పూరణ.

మిస్సన్న :  గురుకృప అందులో సందేహం లేదు

కామేశ్వరరావు :  ఈ మధ్యన వెండి తెర మీద కనుమరుగైనా, ఈ పొద్దు తెరపై కనిపిస్తోంది, సదా 🙂

విశ్వామిత్ర :     రవి గారి చూపు హీరోయిన్ల మీద పడినట్టుంది?

పుష్యం :  అంతేనా, 'సదా' సినిమా చూసారనుకున్నాను 🙂

నచకి :  ఒక్క సదా యేమిటి, అధ్యక్షులు తలచుకుంటే దుర్గాస్తుతిలో నలుగురు నవనాయికలు వస్తారు!

శంకరయ్య :  వాణీ "దాస" జనులం కదా ….  సదా రావడం సహజమే…

మిస్సన్న :  సదా అనే ఆవిడ హీరొయిన్ అని ఇప్పుడే తెలిసింది

నచకి :  అవకాశాలు పొద్దు వాలిన తఱువాతనే వచ్చింది లెండి  సదా మఱి

రవి :  రామరామ ! మరీ తెరమరుగైన హీరోయిన్లపైనా?:)

విశ్వామిత్ర :  మరుగుంటే మీకే మేలనుకున్నాం, తరువాత మీ ఇష్టం 🙂

రవి :  విశ్వామిత్ర :))

శ్రీపతి :  కొన్నిట్లకి తెర 'మరుగు' అవసరమే కదా…

కామేశ్వరరావు :  శంకరయ్యగారు, అవునండి సదా దాసులము

గన్నవరపు నరసింహమూర్తి :  మిస్సన్న గారూ మీ సినిమా జ్ఞానం నా లాగే ఉంది

నచకి :  ఇక్కడ రవి కాంచే దాకా యే కవి కాచుకునేలా కనబడటంలేదు!

వసంత్ కిషోర్ : అసలు విషయం మరుగవుతోంది

విశ్వామిత్ర :  శివుడిని వదిలి – చెడుగుణమునే పట్టుకున్నాము 🙂

నచకి :  :))

నచకి :  స్వధర్మే నిధనమ్ శ్రేయ (మఱో హీరోయిను, బాబోయ్!) శ్రేయా ధన్వంతరి, శ్రేయా రెడ్డి ఉన్నారండీ

రవి :  ఈ ప్రయత్నం (చెడు గుణగణన) లో మరింత ముందుకెళ్దామని మనవి చేసుకుంటున్నాను. (చంద్రబాబు స్వరంలో చదువుకోండి)

రవి :  రాఘవ గారు మౌనం వహించారు, ఆయనచేత ఒక పద్యం ప్రసవింపజేద్దాం.

చదువరి :  నచకి, కానివ్వండి కానివ్వండి ఉత్సాహంగా ఉంది 😉

పుష్యం :  శ్రియ అనుకుంటా

నచకి :  మరుగేలరా, ఓ రాఘవా!

శ్రీపతి :  హ హ్హహా

కామేశ్వరరావు :  సరే ముందుకు సాగుదాం.

Posted in కవిత్వం | 1 Comment

ఉగాది కవిసమ్మేళనాలు

శ్రీఖర నామ సంవత్సర ఉగాది సందర్భంగా పొద్దు తరఫున కవిసమ్మేళనాలను నిర్వహించాం. ఆనవాయితీకి అనుగుణంగా పద్యకవుల, వచనకవుల సమ్మేళనాలు విడివిడిగా రవి, పొద్దు సంవర్గ సభ్యురాలైన స్వాతికుమారిల ఆధ్వర్యంలో జరిగాయి. జాలంలో ప్రసిద్ధులైన  కవులెందరో ఈ సభలు జయప్ర్రదం కావడంలో తోడ్పడ్డారు.
 

చైత్రము కవితాంజలి


వచన కవిత్వంతో మరిన్ని వసంతకుసుమాలను పోగుచెయ్యడానికి కొందరు ఔత్సాహిక వచన కవుల సవినయ ప్రయత్నం ఈ ’చైత్రము కవితాంజలి’. ఈ విభాగంలో స్వీయ కవితలు, తేలికపాటి సమస్యలకి కవితా పరిష్కారాలతో పాటు కవిత్వం మీద కలగలుపు కబుర్లు కలబోసుకున్నాము.


ఇందులో పాల్గొన్నవారు:

1. భైరవభట్ల కామేశ్వర రావు

2 .కెక్యూబ్ వర్మ

3. స్వాతీ శ్రీపాద

4. గరిమెళ్ళ నారాయణ

5. పెరుగు రామకృష్ణ

6. హెచ్చార్కే

7. మూలా సుబ్రహ్మణ్యం

8. వేరెల్లి రవి

9. కర్లపాలెం హనుమంతరావు

10. కత్తి మహేష్ కుమార్

 

కవిసమ్మేళనంలోని అంశాలు:

  1. పాత మాటలు – కొత్త కవిత (తిలక్ కవితలోని ఒక పంక్తిపై సభ్యుల కవితలు)
  2. నేను – కవిత్వం (కవిత్వంతో వ్యక్తిగతమైన అనుబంధం, అభిప్రాయాలు
  3. నాకునచ్చిన కవి/కవిత (కవిమితృలకు ఇష్టమైన కవిత/కవి గురించి కొన్ని మాటలు)
  4. కవుల స్వీయ కవితలు

వీటికి కొనసాగింపుగా పాఠకులకు కొన్ని సమస్యలు;

పద్యం కవితాత్మకం : మందార మకరంద మాధుర్యాన్ని, నిర్మల మందాకినీ వీచికల్ని సాహిత్యజగతిలో వెదజల్లిన తెలుగు పద్యాలు అనేకం ఉన్నాయి. కొన్ని మనకెప్పుడూ మరపురానివి, మరికొన్ని తలపుకొచ్చినప్పుడల్లా కవితోన్మత్తతను కలిగించేవి. కవిత్వంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ అమితంగా ఇష్టపడే, ప్రేరణనిచ్చే పద్యం ఏదో ఒకటి తప్పకుండా ఉండే ఉంటుంది. అలా మీకు ఆత్మీయమైన పద్యంలోని భావంతొనో, దాని ప్రేరణతోనో వచనరూపంలో కవితను రాసి ఈ సమ్మేళనంలో పంచుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది.
* అనువదిద్దాం : T.S. Eliot రాసిన The Hollow man కవితను తెలుగులోకి అనువదించగలరా? పాల్గొన్న మిత్రులకు ధన్యవాదాలు. పాఠకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.

 

 

వసంతసుమశేఖరము

 

పద్య కవుల సమ్మేళనం "వసంతసుమశేఖరము" 12 మంది పద్యకవులతో జరిగింది. మార్చి 12 వ తేదీన సంరంభం మొదలై  27వ తేదీ ఆదివారం నాడు రెండు విడతలుగా జరిగిన ప్రత్యక్ష సభతో విజయంతంగా ముగిసింది. అనేక గంటలపాటు రసోల్లాసంగా జరిగిన ఈ సభలో కింది కవులు, రసజ్ఞులు పాల్గొన్నారు.

సంచాలకుడు: రవి

పాల్గొన్న కవులు:

1.     భైరవభట్ల కామేశ్వరరావు

2.     లంకా గిరిధర్

3.     రాఘవ

4.     సనత్‌శ్రీపతి

5.     కంది శంకరయ్య

6.     మిస్సన్న

7.     వసంత్ కిషోర్

8.     నచకి

9.     గన్నవరపు నరసింహమూర్తి

10.   పుష్యం

11.   విశ్వామిత్ర

12.   చదువరి

ప్రేక్షకులు:

1.    రాకేశ్వరుఁడు

2.    కోడిహళ్ళి మురళీమోహన్

3.    జ్యోతి


ఈ యేడాది కవులపై సంధించిన సమస్యాబాణాలు

 

సమస్యలు:

 

  • సంజ్ఞను చేయ పార్వతియె చక్కగ రావణుఁ జేరె నుద్ధతిన్.
  • రామా యన బూతు మాట యనుచున్ కాంతామణుల్ తిట్టిరే?
  • మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్.
  • వరుసలు జూడఁగా మధురవాణి గిరీశము కూఁతురౌఁ గదా!
  • ఫస్ట్ క్లాసున పయన మయ్యె భామా మణితో
  • ప్రసవింతురు బావగారు పదిదినములలోన్.
  • ధృఢసత్వంబునఁ జీమ తుమ్మెనహహా! దిగ్ధంతులల్లాడగన్.
  • భాస్కరునకు సీత ధర్మపత్నిగ నొప్పెన్..
  • మూడును మూడు మూడు మఱి మూడును మూడును మూడు మూడుగన్
  • వజ్రము చీలిపోయినది వారిజ పత్రము సోకినంతటన్
  • విస్ఫోటంబున దైవ శక్తి వెలుగున్ విద్వన్మనోజ్ఞంబుగా
  • శివుని గుణ గణనమున చెడు గుణము కలుగున్ (అతివినయ వృత్తము న  న  న  న  న  స – యతి ౧౧వ అక్షరము)
  • ఆంధ్ర భారతకర్తయౌ నల్లసాని.
  • హత్యా ప్రయత్నమున స్తుత్యుం డయెన్ దురితు డత్యుత్తముం డనఁబడెన్. (అశ్వధాటి)
  • కుక్కలు నక్క లేనుఁగులు కోఁతులు పందులు కొండమ్రుచ్చులున్.

 

దత్త పదులు.

 

1 వీరణము    తోరణము     ధారణము    ప్రేరణము.

ఉత్పల మాలలో ఆధునిక కవుల కవితాసక్తి వర్ణనము.

2) గోలకొండ, పూలదండ, కందిగుండ, కొత్తకుండ –

రామాయణార్థంలో

3) గాడిద     బూడిద      ఆడది     బోడిది.

ఖర వైభవ వర్ణనము.

4) సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి, సౌవర్ణకరణి –

భాను స్తుతి

5) చరణము – తరుణము – భరణము  – వరణము.

భారత కథాంశము.

6) రవీనా, కరీన, కంగనా, కతిరినా –

దుర్గా స్తుతి

7) మందార, తామర, చేమంతి, జాజి –

సైన్సు ప్రగతి

8) చిరు, అల్లు, బన్ని, చరణ్

కుటుంబ జీవితం

 

వర్ణనలు (అధికపక్షం మూడు పద్యాలు)

1) ఐటీ (సాఫ్ట్వేరు) మేనేజరు నరకానికి వెళితే, అతనికీ యమునికీ మధ్య సంభాషణ

2) ప్రవరాఖ్యుని స్థానంలో శ్రీకృష్ణుడు లేదా మరో దక్షిణనాయకుడు ఉంటే, వరూధినికి "ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో…" పద్యానికి మారుగా మరే సమాధానం/సన్నివేశం లభించి ఉండేది ఊహించి వ్రాయండి.

3) ఒక నడివయస్కుడు సినిమా టిక్కెట్ల క్యూలో నించుని ఉండగా ఒక నిండు జవ్వని రెండు టిక్కెట్లు కావాలని అడిగింది. ఆయన తబ్బిబ్బు పడి తన డబ్బుతోనే కొనిపెట్టాడు. చివరికి ఆ పిల్ల "థేంక్యూ అంకుల్" అని తన బాయ్ ఫ్రెండుతో లోపలికెళ్ళిపోయింది.

 

ఛాయాచిత్ర వర్ణన:

 

http://www.ravivarma.org/plog-content/images/raja-ravi-varma-paintings/mythological-characters/raja_ravi_varma_paintings_draupadi_carrying_milk_honey.jpg

 

http://www.ravivarma.org/plog-content/images/raja-ravi-varma-paintings/peoples-and-portraits/raja_ravi_varma_24.jpg

 

అనువాదం:

Rabindranath Tagore

 

THE FIRST JASMINES – Crescent Moon

AH, these jasmines, these white jasmines!

I seem to remember the first day when I filled my hands with these jasmines, these white jasmines.

I have loved the sunlight, the sky and the green earth;

I have heard the liquid murmur of the river through the darkness of midnight;

Autumn sunsets have come to me at the bend of a road in the lonely waste, like a bride raising her veil to accept her lover.

Yet my memory is still sweet with the first white jasmines that I held in my hand when I was a child.

Many a glad day has come in my life, and I have laughed with merrymakers on festival nights.

On grey mornings of rain I have crooned many an idle song.

I have worn round my neck the evening wreath of bakulas woven by the hand of love.

Yet my heart is sweet with the memory of the first fresh jasmines that filled my hands when I was a child.

 

Passing Breeze – Gitanjali

Yes, I know, this is nothing but thy love,

O beloved of my heart—this golden light that dances upon the leaves,

these idle clouds sailing across the sky,

this passing breeze leaving its coolness upon my forehead.

The morning light has flooded my eyes—this is thy message to my heart.

Thy face is bent from above, thy eyes look down on my eyes,

and my heart has touched thy feet.

 

సుభాషితమ్:

 

వ్యతిషజతి పదార్థాననన్తరః కో2పి హేతుః

నఖలు బహిరుపాధీన్ ప్రీతయః సంశ్రయన్తే

వికసతిహి పతఙ్గస్యోదయే పుణ్డరీకం

ద్రవతిచ హిమరశ్మావుద్గమే చన్ద్రకాన్తః ||

 

అన్తరః కో2పి హేతుః – నిగూఢమైన కారణమేదో

పదార్థాన్ – వస్తువులను

వ్యతిషజతి – కలుపుతుంది.

 

ప్రీతయః – ఇష్టములు

బహిరుపాధీన్ – భౌతికమైన ఉపాధులను

న సంశ్రయన్తే – ఆశ్రయించి ఉండవు

ఖలు – కదా.

 

పతఙ్గస్య ఉదయే – సూర్యుడు ఉదయించగానే

పుణ్డరీకం – పద్మము

వికసతి హి – వికసిస్తుంది కదా.

హిమరశ్మౌ ఉద్గమే – చంద్రుడు రాగానే

చన్ద్రకాన్తః – చంద్రకాంత శిల

ద్రవతి చ – ద్రవిస్తుంది కూడా.

 

కాళిదాసవిరచిత కుమారసంభవం నుండి హిమాలయవర్ణన

(క్రింది వర్ణనల నుండి అన్నిటిని కాక కొన్నిటిని మాత్రమే కూడా సభ్యులు స్వీకరించవచ్చు. రెండుమూడు వర్ణనలను గుదిగుచ్చి ఒకే పద్యంలో కూర్చవచ్చు)

 

అనన్తరత్నప్రభవస్య యస్య

హిమం న సౌభాగ్యవిలోపి జాతమ్

ఏకో హి దోషో గుణసన్నిపాతే

నిమజ్జతీన్దోః కిరణేష్వివాఙ్కః ||

 

అనన్తరత్నప్రభవస్య – అనంతమైన రత్నములకు పుట్టినిల్లైన

యస్య – (ఎవనికైతే) వానికి (హిమవంతునకు)

హిమం – మంచు

సౌభాగ్యవిలోపి – సౌందర్యమును పోగొట్టునదిగా (తగ్గించునదిగా)

న జాతమ్ – కాలేదు.

గుణసన్నిపాతే – అనేక సద్గుణముల సముదాయములో

ఏకో హి దోషః – ఒకే ఒక్క దోషము (ఉన్ననూ)

ఇందోః కిరణేషు – చంద్రుని కిరణములలోని

అఙ్కః ఇవ – మచ్చ వలె

నిమజ్జతి – మునిగిపోవును (అగుపించదు) ||

 

యశ్చాప్సరోవిభ్రమమణ్డనానాం

సంపాదయిత్రీం శిఖరైర్భిభర్తి

బలాహకచ్ఛేదవిభక్తరాగా

మకాలసన్ధ్యామివ ధాతుమత్తామ్ ||

 

యః – ఎవడైతే (అతడు / హిమవంతుడు)

అప్సరోవిభ్రమ మణ్డనానామ్ – అప్సరసలకు విలాససంబంధమైన/తొందరపడి చేసుకొన్నట్టి అలంకారములను  (తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టు)

సంపాదయిత్రీం – పొందచేయుచున్నట్టి

బలాహచ్ఛేద విభక్త రాగామ్ – మబ్బు తునకల (-లో ప్రతిబింబించుచూ, వాని-) చేత విడగొట్టబడిన రంగులు కలిగిన

ధాతుమత్తామ్ – గైరికాది ధాతువుల సంపదను

అకాలసన్ధ్యామివ – అకాల సంధ్యను వలె

శిఖరైః – శిఖరములచేత

బిభర్తి – కలిగి యున్నాడు (డో).

 

హిమవంతుని శిఖరాలపైన గైరికాది ధాతువులున్నాయి. అవి రంగురంగులుగా ఉంటాయి. వాటి రంగులు మబ్బుతునకలమీద పడి వేర్వేరుగా ప్రకాశిస్తున్నాయి. అది అకాల సంధ్యలాగా ఉన్నది. ఆ కాంతులని చూసి, సంధ్యాకాలం వచ్చేసిందని మోసపోయిన అప్సర స్త్రీలు తొందరపడుతూ అలంకారాలు చేసుకుంటూ ఉంటారు.

 

యః పూరయన్కీచకరన్ధ్రభాగాన్

దరీముఖోత్థేన సమీరణేన

ఉద్గాస్యతామిచ్ఛతి కిన్నరాణామ్

తానప్రదాయిత్వమివోపగన్తుమ్ ||

 

యః – ఎవడైతే (అతడు / హిమవంతుడు)

కీచకరన్ధ్రభాగాన్ – వెదుళ్ళ యొక్క రంధ్రములను

దరీముఖోత్థేన – తన గుహ అను నోటినుండి వెలువడిన

సమీరణేన – గాలిచేత

పూరయన్ – పూరించుచూ

ఉద్గాస్యతామ్ – ఎలుగెత్తి పాడుచున్న

కిన్నరాణామ్ – కిన్నరులకు

తాన ప్రదాయిత్వమ్ ఉపగన్తుమ్ – తానమును సమకూర్చుటకు

ఇచ్ఛతి ఇవ – కోరుచున్నట్లు (ప్రయత్నించుచున్నట్లు) ఉన్నాడు (డో).

 

లాఙ్గూలవిక్షేప విసర్పిశోభై

రితస్తతశ్చన్ద్రమరీచిగౌరై

ర్యసార్థయుక్తం గిరిరాజశబ్దం

కుర్వన్తి వాలవ్యజనైశ్చమర్యః ||

 

చమర్యః – చమరీ మృగములు

చన్ద్రమరీచిగౌరైః  – చంద్రకిరణములవలె తెల్లగా ఉన్న

ఇతః తతః – ఇటూ అటూ

లాఙ్గూలవిక్షేప విసర్పిశోభైః – తోకలను ఊపుటచేత ప్రసరించుచున్న కాంతులచేత

వాలవ్యజనైః – తోకలవిసనకర్రలచేత (చామరములచేత)

యస్య – ఎవనియొక్క

గిరిరాజశబ్దం – గిరిరాజు అను బిరుదును

అర్థయుక్తం – అర్థవంతముగా

కుర్వన్తి – చేయుచున్నవో.

 

సప్తర్షిహస్తావచితావశేషా

ణ్యధో వివస్వాన్పరివర్తమానః

పద్మాని యస్యాగ్రసరోరుహాణి

ప్రబోధయత్యూర్ధ్వముఖైర్మయూఖైః ||

 

యస్య – ఎవనియొక్క

అగ్ర సరోరుహాణి – శిఖరములపైనున్న సరస్సులలో పుట్టిన

సప్తర్షిహస్త అవచిత అవశేషాణి – సప్తర్షులు స్వయంగా తమ చేతులతో కోయగా మిగిలిన

పద్మాని – పద్మములను

వివస్వాన్ – సూర్యుడు

అధః – కింద

పరివర్తమానః – తిరుగుచున్నవాడై ( ఆ పర్వత శిఖరములకన్నా కింద ఉదయించినవాడై)

ఊర్ధ్వముఖైః మయూఖైః – ఊర్ధ్వముఖంగా/పైకి ప్రసరించిన కిరణములచేత

ప్రబోధయతి – నిద్రలేపుచున్నాడు / వికసింపచేయుచున్నాడు.
————————————————-

 

కవి సమ్మేళనాల విశేషాలు నేటితో మొదలయ్యే రాబోవు వ్యాసాల్లో చదవండి.

Posted in వ్యాసం | Comments Off on ఉగాది కవిసమ్మేళనాలు

ఈ యుగాది శుభ దినాన …

ఈ యుగాది శుభ దినాన – ఎద పొంగును సంబరాన
బ్రతుకే ఒక పండుగైన – భావనౌను లోలోన                                            ……… ఈ యుగాది ………..

 

వాసంతుడు ఒళ్ళు విరిచి వ్యాహ్యాళికి చను దెంచెను
శైత్య మంత చాప చుట్టి చల్లంగా జారుకొనెను                 //వాసంతుడు//
 

ప్రకృతి నూత్న శోభలతో పరవశించి హసియించెను
పల్లె పట్లు పట్టణాలు తిలకించుచు పులకించెను                                      ……… ఈ యుగాది ………..

 

గున్న మావి చివురించెను పికము గొంతు సవరించెను
వేప కొమ్మ కుసుమించెను మల్లె తావి సిరి పంచెను         //గున్న మావి // 
 

తీపి పులుపు చేదు వగరు నా రసనను నర్తించెను
షడ్రుచులను మిన్న ఏదో చెప్ప నలవి గాకుండెను                                    ……… ఈ యుగాది ………..

 

నా యెదలో ఆశా లత క్రొం జివుళ్ళు ధరియించెను
నా ఊహల పిల్ల గ్రోవి క్రొత్త పాట వినిపించెను                  //నా యెదలో//

 
సుఖదు:ఖము లహర్నిశలు జీవితాన సహజ మనెను
అన్నిటినీ సమబుద్ధిని ఆదరించ ధర్మమ నెను                                        ……… ఈ యుగాది ………..

 
నవ వర్షపు వాకిలిలో నవ శోభల రంగవల్లి
నవ వసంత వేళలలో నల్దిశలను పాలవెల్లి                   //నవ వర్షపు //

 
నవనవ లాడే ప్రకృతికి క్రొందావుల సుమ వల్లరి
నా జీవన గీతిక కొక నవ్యమైన అను పల్లవి                                            ……… ఈ యుగాది ………..

 
******************************************************************************************


రచన: మిస్సన్న

Posted in కవిత్వం | 1 Comment