తుది విన్నపం

 

ఇర్ఫాన్ కి జనబలం ఉంది. ఏ సమాచారం కావాలన్నా అందించే మెరికల్లాటి కుర్రాళ్ళు అతడి చేతికింద ఉంటారు. శత్రువులకి దొరక్కుండా ఇర్ఫాన్ అండర్‌గ్రౌండ్‌లో ఉన్నప్పుడు సైతం కమ్యూనికేషన్‌ చేస్కునే నెట్ వర్క్ అతడిది. ఇర్ఫాన్ సమర్థత, నిస్వార్థగుణం, సేవాభావం, గాంధేయవాదం, భారతీయతత్త్వం, అతణ్ణి ఉజ్వలంగా తీర్చిదిద్దాయి.


బాబాజీ స్థావరం అడివిలో ఎటు ఉండవచ్చో సమాచారం సేకరించాడు ఇర్ఫాన్.  బాబాజీ ఇప్పుడు బీహార్ ప్రాంతంలో ఉన్నారని, రెండురోజులదాక రారని తెలుసుకునే వచ్చాడు.


* * * * * * *

 

తన వేషాన్ని మార్చుకున్నాడు ఇర్ఫాన్.  జడలు కట్టిన పొడవాటి జుత్తుని, తెల్లగడ్డాన్ని అమర్చుకున్నాడు.  నడుముకి కట్టుకున్న సంచిలో ఆయుర్వేదం పేర్లున్న సీసాల్లో దాచిన రకరకాల మందుల ద్రవాలు, పొళ్ళు ఉన్నాయి.  చిరుచీకట్లు ముసిరే వేళలో అడవి ప్రాంతంలో నడవసాగాడు.  ‘తన పథకం పారాలి.  దేశంలోని వివిధ స్థలాల్లో విధ్వంసం చేయడానికి బాబాజీ ముఠా సంసిద్ధమైంది.  వాళ్ల దగ్గరున్న ఆయుధాలు చేజిక్కించుకోగలిగితే, ఆ ప్రమాదాన్ని ఆపవచ్చు.  కానీ.. ఈ చిట్టడివిలో వాళ్ళెక్కడున్నారో?  తను చేరుకోగలడా?’

చాలా దూరం నడిచాక, అలుపు తీర్చుకోడానికి అక్కడున్న శిథిలాల మీద కూర్చున్నాడు ఇర్ఫాన్. చాల రాత్రి అయింది.  ఈ చీకట్లో తనెటు వెళ్తున్నాడో తెలీడం లేదు.  ఎక్కడో మూలుగు విన్పిస్తోంది.  చెవులు రిక్కించాడు ఇర్ఫాన్.  సందేహం లేదు. ఎవరో ఉన్నారు.  అటు నడిచాడు.  “ఎవరది” ఆ ప్రాంతం భాషలో అన్నాడు. 

మరుక్షణం కత్తిని ఝళిపించాడు అవతలి వ్యక్తి.  అతడి చేతిలోని లాంతరు వెలుతురు పెంచాడు.  ఇర్ఫాన్ చేతులు ఎత్తేశాడు.  ఆ వ్యక్తి కింద పడి ఉన్నాడు.  అరచేత్తో మరోచేతిని నొక్కి పట్టుకున్నాడు.  లాంతరు వెలుగు క్రమంగా వ్యాపిస్తోంది.  అతణ్ణి తదేకంగా చూసిన ఇర్ఫాన్ ఊపిరిబిగబట్టాడు.  మెడమీదికి ముడిపెట్టిన ఉంగరాల జుత్తు, గుండెల దాకా వేలాడే నల్లటి గడ్డం, కనుబొమ్మల మధ్యనుండి శిరస్సుదాక కుంకుమ బొట్టు. కళ్ళు తిప్పుకోలేని అందం.

‘సాధు!’ ఇర్ఫాన్ హృదయం బాధతో మూల్గింది.  సాధు కుటుంబం చనిపోవడం, రజియా వెళ్ళిపోవడం ఇర్ఫాన్ స్నేహితులద్వారా విన్నాడు.  సాధు సాయుధపోరాటంలోకి దిగాడన్న గాలి వార్త కూడ తెలుసు.  ఇర్ఫాన్ కళ్ళు సాధు మెడలోని బిళ్ళని చూశాయి.  అది బాబాజీ ముద్ర. ఇర్ఫాన్ అదిరిపడ్డాడు.  సాధూ బాబాజీ మనిషా’ ఎలాటి సాధు?

“ఓ! నువ్వు మావాడివేనా?”  సాధూ మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు ఇర్ఫాన్.  తన గడ్డాన్ని సవరించుకుంటున్నట్లు  మరింత నొక్కుకున్నాడు.  “ఉద్యమంలో ఉన్నావా”

సాధు ప్రశ్నకి కాదన్నట్లు తలాడించాడు. "దూరం నుండి వస్తున్నాను బాబాజీని చూడాలి, యీ మందులు అందజేయాలి."

“డాక్టరువా” అడిగాడు సాధు.

“ఆయుర్వేదం తెలుసు” క్లుప్తంగా అనేసి, సాధు చేతిని పరీక్షించాడు.  జబ్బమీద కత్తిపోటు. చకచకా శుభ్రం చేసి మందువేసి కట్టు కట్టాడు. 

సాధు లేచాడు. “ఎక్కు” అంటూ గుర్రం ఎక్కాడు.  వెనకే ఎక్కాడు ఇర్ఫాన్.  కళ్ళు పొడుచుకున్నా కానరాని చీకటిలో అలవాటుగా పరిగెడుతోంది గుర్రం.


* * * * * * *

 

ఇర్ఫాన్ కళ్ళు ఆ శిబిరాన్ని పరిశీలించాయి.  అక్కడ ఒక పదిమంది మాత్రమే ఉన్నారు.  గుర్రం దిగుతూ కావాలనే కిందపడ్డాడు ఇర్ఫాన్.  “అబ్బా! అలవాటులేదు.  కాలు విరిగినట్లుంది.”  కుంటసాగాడు.

“ఈ డేరాలో విశ్రాంతి తీసుకో.  ఉదయాన్నే బాబాజీ వస్తారు”

సాధు మాటకి గుండె ఆగినట్లైంది. ‘ఏం చేసినా ఈ రాత్రికే’! సాధు వెళ్ళాక పొంచి చూశాడు.  చిన్న లాంతరు వెలుగులో, సాధుతో ఆ పదిమంది కొంత దూరాన ఉన్న గుడి మండపంలో సమావేశమయ్యారు.  చీకట్లో పాకుతూ అక్కడికి చేరాడు ఇర్ఫాన్.  వాళ్ళు ఆయుధాలు సరి చూస్కుంటున్నారు.  తుపాకులు, కత్తులు రాశిగా పోసి ఉన్నాయి.  మరోపక్క కొన్ని బాంబులున్నాయి, ‘ఏ ప్రాంతానికి ఎవరు వెళ్ళాలని’ చర్చిస్తున్నారు.  ఆయుధాలు దాచిన స్థలాన్ని చూస్కున్నాడు ఇర్ఫాన్.  తన డేరా వంక వస్తుంటే కమ్మటి వాసన ముక్కుకి సోకింది.  చూశాడు.  పక్కగా పెద్ద గుండిగలో జావ కాస్తున్నాడు వంటవాడు.  ఇర్ఫాన్ అటు వెళ్ళాడు.  “సాయం చేయమన్నారు” అన్నాడు.

 

“కొత్తగా వచ్చావా! అదిగో, ఆ ఆకుడొప్పలు తీసుకో! ఈ జావ వాటిలోకి వడ్డించు” పురమాయించాడు. ఇర్ఫాన్ ఉత్సాహంగా ముందుకొచ్చాడు.  వంటవాడిని పరికించాడు తినుబండారాలు సర్దుతున్నాడతడు.  ఇర్ఫాన్ చేతిలోని సీసాని జావలోకి వంచాడు, కలియబెట్టి జావని వడ్డించాడు.  కాసేపటికి జావని తీసుకెళ్ళి వాళ్ళకిచ్చి లోనికొచ్చాడు వంటకాడు. “నువ్వెక్కడ…” అడగబోతున్న అతడి నోటని మూశాడు ఇర్ఫాన్.  మత్తుమందుని ముక్కుకి రాశాడు.  క్షణాల్లో కిందికి ఒరిగిపోయాడు, వంటవాడు.

 

కిందికి ఒరిగిపోయినవాళ్ళ ఒంటినుండి పంచెలు తీసి ముడులు కట్టాడు ఇర్ఫాన్.  ఆ పెద్ద బట్టలో ఆయుధాలని మూట కట్టాడు.  మరో పంచెలో బాంబులని జాగ్రత్తగా సర్దాడు.  చెరోచేత్తో మూటలని పట్టుకుని అడివిలోకి పరుగుతీశాడు.  ఇర్ఫాన్ కాలు, ఆఖరున పడి ఉన్న సాధు కాలు మీద పడింది. చువ్వలా లేచి “ఏదో జరుగుతోంది” మగతగా అంటూ ఒరిగిపోయాడు సాధు.


కాసేపటికి ఇర్ఫాన్ లోయవంక పరిగెత్తసాగాడు.  “ఆగు” వెనకే సాధు కంఠం.  తిరిగి చూశాడు ఇర్ఫాన్.  మగతలోనే తూలుకుంటూ వస్తున్నాడు సాధు.  ఇర్ఫాన్ లోయని చేరాడు.  కిందికి చూశాడు.  కళ్ళుతిరిగినట్లైంది.  వెంటనే రెండు మూటలని లోయలోకి జారవిడిచి, వేగంగా పక్కకి దొర్లిపోయాడు.  చెవులు బద్ధలయ్యే శబ్దం!  లోయనుండే నల్లని దట్టమైన పొగలు. 

“ఎవర్నువ్వు! మేమింత కాలంగా సేకరించిన తుపాకీలు, ఆయుధాలు లోయపాలు చేస్తావా” సాధు కేకలు!

పరిగెట్టే ఇర్ఫాన్ ఆగిపోయాడు.  అడుగు ముందుకు వేస్తే కింద ఉరకలేసే నది.  ఈ మధ్య కురిసిన వానలకి పొంగి పొరలుతోంది.  సాధు ఇర్ఫాన్ని ఒడిసి పట్టుకున్నాడు.  “ఎవర్నువ్వు? అబద్ధం చెప్పి నాతో ఎందుకొచ్చావు? ఏంటి నువ్వు చేసిన పని” కంఠం నులమబోతున్న సాధు చేతికి, ఊడిన గడ్డం చిక్కింది.  ఆశ్చర్యంగా చూశాడు. “ఇర్ఫాన్”!

 

* * * * * * *
 


“అవును. ఆనాటి సాధు ఇప్పుడు లేడు.  ఈ సాధు హైందవ జాతి రక్షణ కోసం అవతరించాడు.  మా జాతి అణచివేయబడ్తోంది, నిర్మూలించబడ్తోంది.  మా ఉద్యమాన్ని కొనసాగించడమే నాధ్యేయం.”

 

“మన జాతి భారతజాతి.  నీది ఉద్యమం కాదు, ఉన్మాదం.  ఉద్యమానికి మూలం వ్యక్తిగత కారణం కాకూడదు.  ఉద్యమఫలం ప్రజాసంక్షేమమై ఉండాలి.  ఆశాభావానికి, ప్రపంచశాంతికి దోహదం చేసేదై ఉండాలి.”  ఇర్ఫాన్ ఆవేశంగా అన్నాడు.

 

“నాది వ్యక్తిగత పోరాటమా” తీవ్రంగా అడిగాడు సాధు. 

“ముమ్మాటికీ! ఇప్పుడు రజియా నీతో ఉంటే, నీ కుటుంబం బ్రతికి ఉంటే.. నువ్వు కత్తి పట్టేవాడివా” సూటిగా వచ్చిన ఇర్ఫాన్ ప్రశ్నకి తడబడ్డాడు సాధు.

 

“సాధూ! ఈ మారణకాండ నీ ఆత్మ సమ్మతమేనా?  ముమ్మాటికీ కాదని గుర్తించు.  కళ్ళు తెరువు భయం, ద్వేషం పునాదులుగా నిలబడింది నీ పోరాటం.  దేశభక్తి, సౌభ్రాతృత్వం ఆధారంగా నిలిచింది మా పోరాటం.  రక్తపాతం, హత్యలు, దమన కాండలు మీ వైఖరి.  అహింస, పరమత సహనం, ఐకమత్యం మా వైఖరి.  నీ ఆయుధాలు పారేశాను.  ఇప్పుడు నువ్వు నిర్వీర్యుడివి.  నేను మొదటినుండి నిరాయుధంగానే ఉన్నాను.  అయినా పోరాటం చేయగలను”. 

ఇర్ఫాన్ మాటలకి చెవులు మూసుకున్నాడు సాధు. “ఆపు నీ గాంధేయవాదం! ఇదంతా అక్కడి నుండి వచ్చిన చిచ్చే! ఎక్కడ మీ గాంధీ? హిందువుల మరణాలు ఆయనకు కనపడవా? మా రక్తాన్ని చిందించే వాళ్ళే మా భాయీలా?  గాంధీ ఉనికి ఓదార్పుల్లోనా? సమావేశాల్లోనా? చర్చల్లోనా?” 

సాధుని చిరునవ్వుతో చూశాడు ఇర్ఫాన్. “నీ హృదయంలో!" సాధు తలెత్తాడు.  “అవును. ‘మతం కన్నా మానవత్వం ఎక్కువ’ అనే ఆనాటి సాధు హృదయంలో! భారతీయత మూర్తీభవించిన నీ రక్తంలో!  నా దేవుడు బాహ్యంలో కాదు, అంతరాత్మలో ఉన్నాడు అనే నీ జ్ఞానంలో! వెలికితీయి సాధూ! నీ లోని గాంధీని వెలికి తీయి. ఆక్షణాన నువ్వే గాంధీవౌతావు.”

సాధూ తలవిదిలించాడు. “నిన్ను చంపాలి” ఇర్ఫాన్ మీదికి లంఘించాడు.  ఇర్ఫాన్ కాలు జారింది.  ఇద్దరూ పై నుండి నదిలో పడ్డారు. 

“ఇర్ఫాన్! నాకు ఈత రాదు” పెద్దగా అరిచాడు సాధు.  ఇర్ఫాన్ సాధూని పట్టుకున్నాడు.  తన భుజం మీద వేస్కుని ఒడ్డుకి చేర్చాడు.  ఎత్తునుండి పడడం, నీళ్ళు మింగడంతో అచేతనస్థితిలో కదులుతున్న సాధుని తదేకంగా చూశాడు ఇర్ఫాన్, “అహింసా పరమోధర్మ, ధర్మ హింసాతథైవచ”

ఇర్ఫాన్ మాటలకి మత్తులోనే అలజడికి లోనౌతున్నాడు సాధు.

 

* * * * *

ఇర్ఫాన్ కలయిక సాధులో తీవ్ర సంచలనాన్ని కలిగించింది. “నిజమే, తనది వ్యక్తిగత కక్షేనా?  తన ఉద్యమ ఫలితం సంక్షేమం శాంతి కానేకావు.  తన చేతి ఒక్కో మరణం తనని మరింత రాక్షసుడిని చేస్తోంది.’


బాబాజీ వచ్చారన్న పిలుపు అందింది.  ఇర్ఫాన్ ఆయుధాలు మాయం చేసిన సంగతి విని మండిపడ్డాడు బాబాజీ.  సాధుకి ఇర్ఫాన్‌ని చంపమన్న ఆదేశం ఈయబడింది.  తన కలవరాన్ని అణిచేసి రంగంలోకి దిగాడు సాధు.

 

* * * * *

 

వైద్య శిబిరంలో అడుగుపెట్టింది రజియా.  ఆమె కళ్ళు ఇర్ఫాన్ ని  వెతకసాగాయి.  గ్రామంలో అంటురోగాలు ప్రబలడంతో క్రిక్కిరిసి ఉందా శిబిరం.  “రజియా.. నువ్వు.. నువ్వేనా..” నిర్ఘాంతపోయాడు ఇర్ఫాన్.  “ఇర్ఫాన్! నువ్విక్కడ ఉంటావని తెలిసి వచ్చాను.  ఈ ఉత్తరం ఆయన కందించాలి”

మాట్లాడలేకపోతున్న రజియాని ఆందోళనగా చూశాడు. “రజియా నీతో మాట్లాడాలి. నీకు ఆరోగ్యం బాలేదా? ఎక్కడున్నావ్” అడిగాడు ఇర్ఫాన్.

“నేను మా ఇంటికే వచ్చాను” అక్కడే కూర్చుండిపోయింది.

“డాక్టర్ ఇర్ఫాన్” -పిలుపు రావడంతో “నేను కలుస్తాను”  చెప్పేసి లోనికి వెళ్ళాడు ఇర్ఫాన్. 

“ఈ ఉత్తరం..” రజియా  మాట నోట్లోనే ఉండిపోయింది. 

రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది.  పగలంతా గడిచిపోయింది.  చీకటిపడింది.

 

సాధు శిబిరంలో ప్రవేశించాడు.  తలచుట్టూ బట్ట కప్పుకుని కుంటుతూ నడవసాగాడు.  అతడి కళ్ళు దూరాన ఉన్న ఇర్ఫాన్ ని చూశాయి.  నడవబోతుండగా వెనకనుండి ఎవరో పట్టుకున్నారు.  నడుం చుట్టూ చేతులు బిగించారు.  సాధు వదిలించుకుని ముందుకెళ్ళాడు.  “అమ్మా” పెద్దగా అరిచి కిందపడి గిలగిల కొట్టుకోసాగాడు.  నలుగురైదుగురు డాక్టర్లు ముందుకొచ్చారు.  సాధు లేచాడు.  ఐదారు ఆడుగుల దూరంలో ఉన్న ఇర్ఫాన్ కి గురిపెట్టాడు.  తుపాకీ పేలింది.  ఇర్ఫాన్ కుప్ప కూలాడు

“ఆగండి! ఎవరూ రావద్దు నాదగ్గర బాంబు ఉంది”. పెద్దగా అరిచాడు సాధు

“అతడిని వెళ్ళనీయండి, బాంబు పేలనీయొద్దు” ఆఖరి ప్రయత్నంగా అరిచాడు ఇర్ఫాన్. 

సాధు మాయమయ్యాడు.

* * * * *
 

About రమ గమిని

శ్రీమతి రమ గమిని 2003 లో రాసిన మొట్టమొదటి నవల ’నా తీర్పు’ కు స్వాతి వారపత్రిక వారి అనిల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత రెండు నవలలు నవ్య పత్రికలోను, ఒక నవల ఆంధ్ర భూమిలోనూ ప్రచురితమయ్యాయి. ’ద్వారం’ అనే కథకు అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ప్రథమ బహుమతి లభించింది. ’కారణం’ కథకు సి.పి. బ్రౌన్ అకాడమీ వారి బహుమతి పొందారు. ’నా తీర్పు’ నవల టీవీ సీరియల్ గా రాబోతోంది. వివిధ పత్రికలలో ఆమె కథలు ప్రచురితమయ్యాయి. రచనా వ్యాసంగంతో పాటు, సంగీతంలో కూడా రమ గారికి ప్రవేశం ఉంది. వయొలిన్ వాదనలో డిప్లొమా పొందారు. సంగీత దర్శకత్వం ఆమెకు హాబీ. రొటీన్ కథలకు భిన్నంగా ప్రయోజనాత్మక రచనలు చెయ్యాలని రమ గారి సంకల్పం.
This entry was posted in కథ. Bookmark the permalink.

11 Responses to తుది విన్నపం

  1. vbdmrao says:

    A great convincing fact. Keep good to people, your life will be alright.

  2. sarma says:

    Chaalaa baguMdi

  3. రాజేష్ మారం says:

    Excellent… Stunning story..

Comments are closed.