జయసింహుడు నడుస్తున్నాడు. ఎటుచూసినా శిలలు.. కాదు శిల్పాలు! జీవం ఉట్టిపడుతున్న శిల్పాలు. అద్భుతమైన ఆకృతులు, సన్నివేశాలు. శిలలను చెక్కడంతో పాటు సందర్భానుగుణంగా రంగులు అద్దుటచే అవి సజీవమైనవే అన్న భ్రమను కలిగిస్తున్నాయి. పైగా వాటినుండి ఒక వింత సుగంధం వ్యాపిస్తోంది. మనసుని చైతన్యపరుస్తోంది. ఆ శిలల నుండి పెల్లుబుకుతున్న రసాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ ముందుకు నడుస్తున్నాడు. ఎవరీ శిల్పి? ఎంతటి నైపుణ్యము?! ఆ శిల్పాలకనుగుణంగా తనలో భావాలు ప్రవహిస్తున్నాయి. అంతలో..
ఒక్కసారిగా ప్రవాహం ఉవ్వెత్తున ఎగసింది. ఎదురుగా ఉన్న శిల్పం! … ఆమె..! .. ఎవరు?! బాహ్య స్మృతి కోల్పోయి ఉండిపోయాడు జయసింహుడు. మేలిముసుగులో దాగి, కనీ కనిపించకుండా ఉన్న ఆమె మోము, ఆమె ఓరకంటినుండి ప్రసరిస్తున్న చంద్రకాంతి వల్ల ప్రకాశవంతమైనట్లు భ్రాంతి కలిగిస్తోంది. లేత పెదవులపై తొణికిసలాడుతున్న చిరుహాసం ఎప్పటికప్పుడే క్రొత్తగా!, చూస్తుండగానే, సిగ్గుచే ఎరుపెక్కుతున్నట్లు ఆమె చెక్కిలి. ఆ క్షణంలో జయసింహుని చుట్టు ఆ మేలి ముసుగు క్రమ్మేసింది. అనంతమైన కాంతిలో మమేకమైపోయాడు. వెనుక వస్తున్న సైన్యాధ్యక్షుడు కదిలించేవరకూ జయసింహుడు ఈలోకానికి అతీతంగా .. ఎక్కడో విహరిస్తున్నాడు. తన జీవితానికి ఒక లక్ష్యం ఏర్పడింది. అది ఈ శిల్పములోని యువతి. ఈ శిల్పిని కలవాలి. స్వయంగా వెతకాలి … మాట్లాడాలి. ఆమె ఎవరో తెలుసుకోవాలి.
ఎన్నో రోజులుగా తిరిగి తిరిగి అలసిపోయాడు జయసింహుడు.. తన లక్ష్యసాధనకోసం, ఒంటరిగా! ఒకనాడు నదీతీరంలో నిరాశ నిస్పృహ ఆవరించి పడిపోయిన జయసింహునిపై అలా చల్లగాలి వీచి పోయింది. ఆ తెమ్మెరలో అదే సుగంధం! అతని మనసు గ్రహించింది. ఆ శిల్పి ఈ దాపునే ఎక్కడో ఉంటాడని జయసింహునికి అనిపించింది. ఆ ఆలోచన అతని శరీరానికి నూతనోత్తేజాన్ని కలిగించింది. లేచాడు.. పరుగెడుతున్నాడు. అతని పాదాలు అతని గమ్యాన్ని చేర్చాయి. ఎదురుగా మాసిన బట్టలతో, జటలు కట్టిన వెంట్రుకలతో ఒక పిచ్చివాడు. చెక్కుతున్నాడు. శిలల గుండెలకు అమృతాన్ని పూస్తున్నాడు.
"ఆ శిల్పం ఎవరిది?" అడిగాడు జయసింహుడు. శిల్పి చూశాడు. అతని ముఖంలో చిరాకు.
"నువ్వెవరు?" అడిగాడు జయసింహుడు. సమాధానం లేదు. ఎదురు చూశాడు జయసింహుడు. గంటలు… రోజులు! శిల్పిని నీడలా అనుసరించాడు, తిండి తిప్పలు మాని. శిల్పి కదిలాడు. నడుస్తున్నాడు. వెనుకనే జయసింహుడు. ఆ శిల్పం దగ్గరకు వచ్చి ఆగాడు. జయసింహునిలో ఉద్వేగం మిన్నంటుతోంది. ఆత్రంగా శిల్పి వైపు చూశాడు.
"ఆమె ఎవరు?" అతి ప్రయత్నం మీద అడిగాడు. "తెలియదు!" శిల్పి నోటినుండి తను విన్న మొదటి మాట.
గుండె అనంతమైన లోయలలోకి జారిపోయింది జయసింహునికి. అంతలోనే తేరుకున్నాడు. "ఆమెను ఎక్కడ చూశారు?" అడిగాడు.
"ఇక్కడే!" శిల్పి జవాబు.
"ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది?"
శిల్పి మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. చేతిని ఎత్తి తన కపోలాన్ని, హృదయాన్ని చూపించాడు. హతాశుడయ్యాడు జయసింహుడు. "అంటే ఆమె నిజంగాలేదా?" వణుకుతున్న గొంతుకతో అడిగాడు.
శిల్పి నవ్వాడు.. మళ్ళీ నవ్వాడు. బిగ్గరగా నవ్వుతున్నాడు. "నేను నిజంగానే ఉన్నానా?" అడిగాడు శిల్పి.
ఇదేం ప్రశ్న? అనుకున్నాడు జయసింహుడు. "ఉన్నారు! నాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు కదా!" అన్నాడు.
"నేనున్నానన్న అనుభూతి నీ మస్తిష్కంలో ఉంది, అంతే. అదే నీకు నిజం. ఆ అనుభూతి నీకు కలగనంతవరకూ నేను నీకు లేను. ఆమె కూడా అంతే. ఒక అనుభూతి. ఒక ఊహ. ఒక భ్రాంతి. ఒక నిజం!"
శిల్పి మాటలు అర్థం అయ్యీ కాకుండా ఉన్నాయి జయసింహునికి. అతడు తన గురుదేవులైన శుకపాదానందులవారిని స్మరించుకున్నాడు. "మీరన్నది ఒప్పుకుంటున్నాను. కానీ మిమ్మల్ని నేను చాలా మందికి చూపించి, ఆ అనుభూతిని వారికి కూడా కలిగించగలను. కనుక మీరున్నారనేది నిజం. మరి ఆమెను… నాకు చూపగలరా?" అడిగాడు జయసింహుడు.
జయసింహునివంక తదేకంగా చూశాడు శిల్పి. "నీవు నన్ను ఎవరికి చూపిస్తావు? నీ చుట్టూ వాళ్ళకి. నీ దృష్టిలో… నిజం అయినవాళ్ళకి. అంటే .. నీ అనుభూతులకి. నీలోకంలో, నీ ప్రపంచంలో ఉన్నవాళ్ళకి. నేను నీ ఊహగా ఉన్నప్పుడు, నీ వేరొక ఊహకు నన్ను చూపుతున్నావు. నువ్వూ నా అనుభూతులలోకి వస్తే, నా ఊహాప్రపంచంలోకి వస్తే అప్పుడు ఆలోచిస్తా."
"నేనిప్పుడు మీ అనుభవంలో ఉన్నాను కదా. మీ ప్రపంచంలో ఉన్నట్లే కదా!" ప్రార్థనా పూర్వకంగా అడిగాడు జయసింహుడు.
"ప్రపంచం ఒకటే అయితే నిజం ఒకటే అవుతుంది. అనంతమైన ఊహాప్రపంచాలలో ఆమె ఒకదానిలో ఉంది. నీవు ఇంకొకదానిలో ఉన్నావు." శిల్పి వాత్సల్యంగా చెప్పాడు. జయసింహునికి తెలిసింది. శిల్పి మాటలలో తనపై ఉన్న కరుణను గుర్తించాడు. ఆ వెనుక అంతర్లీనంగా వ్యక్తం చేసిన అశక్తతను గమనించాడు. శిల్పి వద్ద శెలవు తీసుకుని తన రాజ భవనానికి పయనమయ్యాడు.
జరిగినదంతా శుకపాదానందులకు తెలిపాడు జయసింహుడు. "గురుదేవా ! ఎలాగైనా నేను ఆమెను కలుసుకోవాలి. అనుగ్రహించండి. దారి చూపండి." ప్రాధేయపడ్డాడు జయసింహుడు.
"నాయనా! ఇది నీకు తగదు. ఒక పిచ్చివాని మాటలు, చేతలు పట్టుకుని మనసుని కకావికలం చేసుకోవద్దు. ఈ రాజ్యానికి నీ అవసరం ఎంతో ఉంది. అది పూర్తి చేయవలసిన బాధ్యత నీ పై ఉన్నది. నీ తండ్రిగారైన వజ్రసింహ మహారాజుల అభీష్టం కూడా అదే. కాలగమనంలో ఇటువంటి కెరటాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటికి చెదరక స్థిరంగా మనసుని ఉంచుకోగలిగిననాడే…"
శుకపాదానందుల మాటల పూర్తి కాకుండానే జయసింహుడు అందుకున్నాడు. "ఏం సాధిస్తాను గురుదేవా! ఎటువంటి కదలికా లేని రాయినై పడియుండి ఏం సాధిస్తాను? రాజ్యమా? కీర్తి ప్రతిష్టలా? ఇవి మాత్రం కెరటాలు కావా? నిజానికి ఇవి సహజమైనవి కూడాకావు! మనకి మనం సృస్టించుకున్న ఆటుపోటులు. ప్రతీ మనిషికీ ఒక లక్ష్యం ఉండాలని అది చేరుకునే మార్గమే జీవితమని మీరు అంటుండేవారు. ఇప్పుడు నాకు నా లక్ష్యం తెలిసింది. ఆ శిల్పాన్ని చూసిన క్షణంలోనే తెలిసింది."
"నాయనా! అసాధ్యమైన లక్ష్యాలు ఉన్నా ఏం ఉపయోగం? ఆ శిల్పిని వెతికేందుకు అనుమతి కోరినప్పుడు నా ఆశీసులు నీకిచ్చాను. కానీ ఇప్పుడు ఒక ఊహ వెంట పరుగెడుతుంటే ఎలా ఊరుకోగలను?" అనునయంగా అడిగారు శుకపాదానందులు.
"గురుదేవా! ఆ శిల్పి మాటలు వింటున్నప్పుడు .. సరిగా అర్థంకాక, ఏంచెయ్యాలో తెలియక మిమ్మల్ని స్మరించుకున్నాను. అంతే! అలజడి తగ్గింది. అతనిమాటల స్పష్టమయ్యాయి. ఆలోచనలు ఒక త్రోవలోకి వచ్చాయి. మీరు నేర్పిన శాస్త్రజ్ఞానం జ్ఞప్తికి వచ్చింది. అందుకే వెంటనే మిమ్మల్ని కలుసుకుందామని వచ్చాను. యోగవాశిష్టాన్ని ఔపోసనపట్టి, అణువణువునా ఆ సారాన్ని నింపుకున్న యోగిపుంగవులు మీరు. మీ శిష్యుని కరుణించలేరా? ఊహాలోకంలో బందీయైన ఆమెను ఈ ప్రపంచలోకి స్వేచ్ఛగా, సజీవంగా తీసుకు వచ్చే దారి చూపలేరా?" జయసింహుని కంట అశ్రుధార.
శుకపాదానందులు ఆలోచించారు. జయసింహుడు ఉత్తమ శిష్యుడు. ఏకసంథాగ్రాహి. ధర్మాచరణలో, కార్యదీక్షలోనేకాక, మానసిక పరిపక్వతలో, వ్యక్తిత్వంలో అతను ఉన్నతుడే. కానీ సత్వగుణాచరణ యోగ్యమైన యోగ విద్య, రజోగుణము వీడని జయసింహునికి అనుగ్రహించుట ఎంతవరకూ సమంజసము? అతని ప్రేమలో స్వచ్ఛత ఉండవచ్చు గాక! అయినప్పటికీ యోగ విద్య యొక్క లక్ష్యం ఇది కాదుగా! ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళిపోయారు శుకపాదానందులు. కొద్దిసేపటికి కనులు తెరిచి "జయసింహా ! నీకు నేను యోగవిద్యను నేర్పుతాను. ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉన్న ఈ విద్యను, పతంజలి మహర్షి సూత్రీకరించారు. నీవు జ్ఞానవంతుడవు. ఉత్తముడవు. ’తపఃస్వాధ్యాయేశ్వరప్రణిధానాని క్రియాయోగః’ అని సూత్రం. తపస్సు, అధ్యయనము, ఈశ్వర సమర్పణము యోగవిద్య సాధనకు ముఖ్యోపకరణాలు. వీటి ద్వారా మనలోని కలుషాలను నిర్మూలించుకోవాలి. ఆపై ’యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధయోష్టాంగాని ’. ఈ ఎనిమిది పద్ధతులను అనుసరించాలి. అది కైవల్య ప్రాప్తికై సాగే ఈ యానం, మన స్వార్థం కోసం ఉపయోగించడం సమంజసంకాదు. దానివలన విపరీతాలు జరిగి మనిషి పతనానికి, వినాశనానికి దారి తీస్తుంది. ఈ విషయం ఎల్లెప్పుడూ గుర్తుంచుకుని జాగరూకతతో ప్రవర్తించు". జయసింహుడు శుకపాదానందులవారి పాదాలకు నమస్కరించాడు. భూతభవిష్యద్వర్తమానాలను దర్శించగల ధ్రష్టయైన వశిష్టుల వారి మూర్తిత్వాన్ని పుణికిపుచ్చుకున్న శుకపాదానందులవారి కనులు నిర్లిప్తమైనాయి.
రోజులు గడుస్తున్నాయి "తీవ్ర సంవేగానామాసన్నః " యోగస్థితిని పొందడానికి కాల నియమంలేదు. క్షణమాత్ర పరిశ్రమచే కూడా రావచ్చు. అది అతని తీవ్రత బట్టి ఉంటుంది. మనిషి పూర్వ కర్మలు అతన్ని పట్టి లాగుతుంటాయి. జయసింహుడు అతి త్వరలో అత్యున్నత ప్రగతిని సాధిస్తున్నాడు. ఒకనాడు శుకపాదానందులు పిలిచి "అష్టాంగయోగ పద్ధతిలో ధారణాధ్యాన సమాధులను ’త్రయమేకత్ర సంయమః ’ అంటారు. వీటిద్వారా సిద్ధులను సాధించవచ్చు. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఏమాత్రం మనసు కలుషితమైనా భ్రష్టత్వాన్ని మిగిల్చి అథఃపాతాళానికి దిగజారుస్తుంది. నీ మానసిక స్వచ్ఛత మీది నమ్మకంతో నీకు నేర్పుతున్నాను. వీటిద్వారా నీవు నీ ఊహాప్రేయసిని కలవవచ్చు. ఈ ప్రపంచంలోకి రప్పించవచ్చు." అన్నారు.
"ధన్యుణ్ణి గురుదేవా! చెప్పండి నన్నేం చెయ్యమంటారు?" అడిగాడు జయసింహుడు.
" ’ప్రత్యయస్య పరచిత్తజ్ఞానం’ . ఒక వ్యక్తి చిత్తాన్ని తెలుసుకోవాలంటే అతనిగూర్చి సంయమనం చేయాలి. ముందు అతనినే ఎల్లప్పుడు తలచుకోవాలి. అతని రూపు మనసులో స్థిరపరుచుకోవాలి. అతనిని ధ్యానించాలి. అతనిలో లీనమవ్వాలి. అదే సంయమనం. ఆవిధంగా చేస్తే అతని చిత్తతత్వం మనకు అవగతమవుతుంది."
శుకపాదానందులవారి మాటలు విన్న జయసింహుడు "గురుదేవా ! అయితే నేను ఆ శిల్ప సుందరినే ధ్యానించ వచ్చునా?" అని అడిగాడు.
"లేదు నాయనా. పాంచభౌతికమైన వస్తువుల పై సంయమనం చేయుట రాకుండా ఊహాత్మకమైన వాటిపై చేయుట అసాధ్యము. ముందు ఆ శిల్పి పై సంయమనం చేసి ఆతని చిత్తాన్ని తెలుసుకో, ఆపై ఆతని ఊహాలోకంలోకి వెళ్ళే మార్గం చెబుతాను."