స్వాప్నికం

జయసింహుడు అచిరకాలంలోనే అది సాధించాడు. "గురుదేవా! ఆతని చిత్తం అతి విచిత్రంగా ఉంది. ఒకసారి నిశ్చలంగా, ఇంకొకసారి అతి చంచలంగా, ఒకసారి శూన్యంగా మరొకసారి సజీవ చైతన్యంగా, అత్యున్నత శిఖరాలను తాకుతూ అథః పాతాళాలు జారుతూ నిరంతరం మారుతూ ఉన్నది."

జయసింహుని మాటలకు శుకపాదానందుల వారు చిన్నగా నవ్వి "అతను కళాకారుడు. మరో సృష్టికర్త. కనుక సృష్టిలో ఉన్న సమస్త భావనలు అతనిలో నిరంతరం సాగుతూ ఉంటాయి. అయితే అవి అతనిని అంటవు. అందుకే ఏ భావమైనా పరిపూర్ణంగా ఉంటుంది. అంతే పూర్ణంగా శూన్యమైపోతుంది." అన్నారు.

జయసింహుని మనసులో చిన్న శంక. "మరి ఆతని ఊహలలో యువతి కూడా…", ఆగిపోయాడు.

"జయసింహా ! ఇప్పటికి కేవలం ఆతని చిత్తస్థితిని మాత్రమే తెలుసుకున్నావు. ఆతని ఊహాలోకంలోకి వెళ్ళాలంటే అతని హృదయముపై సంయమనం సాధించాలి. హృదయే చిత్త సంవిత్ ’ " . చెప్పి వెళ్ళిపోయారు శుకపాదానందులు. 

జయసింహుడు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ఒకనాడు. అతడు ధ్యానంలో ఉండగా…


ఎదురుగా హిమాలయ పర్వతాలు. అదిగో కైలాసం. మబ్బులనే గజచర్మాన్ని నడుముకు చుట్టుకున్న పరమేశ్వరుడై వెలుగుతున్న కైలాస పర్వతం. అటుగా నడుస్తున్నాడు జయసింహుడు. చెవులలో .. కాదు, హృదయంలో పంచాక్షరి మెల్లగా, మంజులంగా వినిపించసాగింది.  కైలాసానికి దగ్గరవుతున్నా ఆ ద్వనిలో మార్పులేదు. భౌతిక శాస్త్రాలకు అతీతమైన ప్రదేశం అది. ఆ గిరి పాదం వద్దకు చేరుకున్నాడు. అంతలో అక్కడ శిల్పి కనిపించాడు. శిల్పి తనను చూశాడు. అంతే ఒక్కసారి చీకటి ఆవరించింది.

కనులు తెరిచాడు జయసింహుడు. జరిగిందేమిటో అర్థంకాక శుకపాదానందులవారి దగ్గరకు పరుగు తీశాడు. అంతా విన్న శుకపాదానందులు ` "జయసింహా! నీ సంయమనం ఫలించింది. అతని ఊహాలోకంలో నీవు అడుగు పెట్టగలిగావు. అదీ అతను కైలాసాన్ని ధ్యానిస్తున్న సమయంలో నీవు వెళ్ళడం ఒక శుభ పరిణామం. అయితే అతని ఊహాలోకంలో నీ అస్థిత్వం ఆ లోకాన్నే అస్థిరం చేసింది. అందుకే ఆ చీకటి."

జయసింహుని కనులముందు ప్రపంచం గిర్రున తిరుగుతోంది. తను.. ఒక ఊహ…! తన ప్రపంచం, తనలోకం.. అన్నీ స్వాప్నికమైనవి. ఈ శిల్పి స్వప్నజనితమైనవి! అంతా అస్తవ్యస్తంగా మారిపోతోంది. అంతా మెల్ల మెల్లగా అదృశ్యమైపోతోంది.

"మరేమిటి మార్గం గురుదేవా?!" అడిగాడు జయసింహుడు.

"దీనికి ఒకమార్గం ఉంది. అయితే ఇది ఇంకాస్త ప్రమాదకరమైనది." కాస్త ఆగి కొనసాగించారు శుకపాదానందులు. "’కాయ రూపసంయమాత్తద్గ్రాహ్యశక్తి స్తంభే చక్షుః ప్రకాశాసంయోగేన్తర్థానం’ శరీరంపై సంయమనం చేసి దాని దృగ్గోచరశక్తిని వేరుచేసి, ఆ రూపానుభూతిని నిరోధించిన ఆ వ్యక్తి అదృశ్యుడై మనగలడు. నీవు అతని ఊహాలోకంలో అదృశ్యుడవై చరించిన నీ వలన ఆ లోకము అస్థిరము కాకుండ ఉండవచ్చు. కానీ… ".

"సందేహమేమిటి గురువర్యా?!"

"నీవు అదృశుడవై ఊహాలోకములో తిరుగునప్పుడు. మరల నీవు ఈ లోకమునకు వచ్చు వరకూ ఇచ్చట నీ శరీరము కూడ అదృశ్యముగానే ఉండును కదా. ఇది ప్రమాదకరమైన స్థితి. నీవు వేరొక లోకములో ఉన్నావు. అక్కడే ఉండిపోవ అనిపించవచ్చు. ఇక్కడ నీ శరీరము అదృశ్యముగా ఉండును. దాని యొక్క అనుభూతి కూడా ఎవరికీ తెలిసే అవకాశము లేదు. అటువంటి స్థితిలో ఈ లోకములో నీ ఉనికి ప్రమాదములో పడును. కనుక జాగ్రత్త వహించుము. ఎక్కువకాలము ఊహాలోకములో చరించుట మంచిది కాదు."

 


గురూపదేశము చేత, కఠోర సాధనచేత జయసింహుడు అదృశ్యశక్తిని పొందాడు.


జయసింహుడు నిరంతరం శిల్పి ఊహాలోకాలలో వెదుకుతున్నాడు. శిల్పి యొక్క అనంతమైన ఊహాశక్తికి విభ్రాంతుడౌతున్నాడు. శుకపాదానందులవారి రక్షణ చేత, శిక్షణచేత, పర్యవేక్షణ చేత లోకాలోకాలమధ్య, దృశ్యాదృశ్యల మధ్య సునాయాసంగా వెళ్ళివస్తున్నాడు జయసింహుడు. అయితే అతని లక్ష్యం దృగ్గోచరం కాలేదు. ఆ శిల్పి తన ప్రేయసిని తన ఊహలలో స్మరించుటలేదు.  అతనికి శిల్పిని కలవాలని అనిపించింది. అతనిని ప్రార్థించి ఆ శిల్పసుందరిని ఊహించమని కోరాలని అతని ఉబలాటం. అయితే తనకు గురువుగారి ఆశ్రమాన్ని విడిచి వెళ్ళేందుకు అనుజ్ఞ లేదు. కొద్ది రోజులు గడిచాయి. శుకపాదానందులవారు ఆశ్రమంలో లేని సమయం. యధావిధిగా అదృశ్యరూపుడై శిల్పి ఊహలలోకి వెళ్ళే ప్రయత్నాంలో ఉన్నాడు జయసింహుడు. హటాత్తుగా అతని శరీరం బరువెక్కింది. శ్వాస భారమైంది. కనులకు అస్పష్టంగా అనేక దృశ్యాలు కదిలిపోసాగాయి. మేనిలో స్వేదం ఉబుకుతోంది. జయసింహునికి తెలిసింది. శిల్పి మరణసమయం ఆసన్నమైంది.  ఆగలేకపోయాడు.  అదృశ్య రూపంలో ఆశ్రమాన్ని విడిచి శిల్పి కొరకు ప్రయాణమయ్యాడు. అతని సంయమన శక్తి ఫలితంగా, శిల్పి యొక్క ఉనికిని సులువుగానే గుర్తించాడు. ఆ ప్రదేశానికి క్షణకాలంలో చేరుకున్నాడు. శిల్పి పడి ఉన్నాడు. జయసింహుడు అతనిని సమీపించాడు. తన ఒడిలో తీసుకుని సపర్యలు చేయసాగాడు.


శిల్పి కనులు మెల్లగా తెరుచుకున్నాయి. జయసింహుని చూశాడు. చిన్నగా నవ్వు ఆతని పెదవులపై విరిసింది.  "జయసింహా! ఇక ఆ సుందరి నీకు కనిపించే అవకాశమేలేదు. శాశ్వతంగా నాతో నా ఊహలు కూడా అంతరించిపోతాయి. ఇక నీ సంయమనం, సాధనా నిరుపయోగాలు. ఇక నీవు వెదుకటానికి నా ఊహలు ఉండవు"

శిల్పి మాటలకు విస్మయమందిన జయసింహుడు, "మహానుభావా! ఈ విషయాలు మీకెలా తెలుసు? నేను మీ ఊహలలో తిరిగితినని మీరెలా గ్రహించారు?" అని అడిగాడు.

శిల్పి నవ్వుతున్నాడు. "ఊహించాను… " బిగ్గరగా నవ్వుతున్నాడు. "నిన్ను .. ఊహించాను… నన్ను .. ఊహించాను…ఈ లోకాన్ని ఊహించాను. శుకపాదానందులు … ఊహించాను " నవ్వుతూనే ఉన్నాడు శిల్పి.


జయసింహుని కనులముందు ప్రపంచం గిర్రున తిరుగుతోంది. తను.. ఒక ఊహ…! తన ప్రపంచం, తనలోకం.. అన్నీ స్వాప్నికమైనవి. ఈ శిల్పి స్వప్నజనితమైనవి! అంతా అస్తవ్యస్తంగా మారిపోతోంది. అంతా మెల్ల మెల్లగా అదృశ్యమైపోతోంది. తన ఊహ తనకే అందకుండా ఆవిరైపోతోంది. అనంతమైన అగాధంలోకి `నేను’ అనే భావన జారిపోతోంది. పైకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఒక వెల్లువ ముంచేస్తోంది. తన శరీరం, ఊహ, ఆలోచన, అనుభూతి … అన్నీ తమ అస్థిత్వాలకోసం పెనుగులాడుతున్నాయి. ఆ క్షణంలో….


ఒక్కసారిగా గావుకేక పెట్టి లేచాడు జయషింహుడు. పరుగు పరుగున సేవకులు వచ్చి నిల్చున్నారు. భటులు ఏమైందోనని అప్రమత్తులై చుట్టు వెతికారు. హుటాహుటిని రాజవైద్యులు విచ్చేశారు. యువరాజులకేం కాలేదని, పీడకల ప్రభావమని, శాంతి చేయిస్తే సరిపోతుందని శెలవిచ్చారు. ఇదంతా … కల… తన కల. అంటే ఆ శిల్ప సుందరి, శిల్పి, తన సంయమన శక్తి…అన్నీ కేవలం కలలేనా? ఆలోచించసాగాడు జయసింహుడు. లేదు! అది తన స్వప్నమైనా, అందులో తన రూపం నిజముకాకపోయినా, ఇక్కడ ఇప్పుడు తను ఉన్నాడు. ఇది నిజం. శుకపాదానందులువారు తమ గురుదేవులు. ఇది నిజం. కానీ ఆ స్వప్నంలో తను ఇదేవిధంగా తనను నిజమని భావించాడు. అది అసత్యమైపోయింది. శిల్పి నిజం కాదు. శిల్పి కేవలం తన కల్పన. కల. కానీ.. ఆ కలలో తాను శిల్పి ఊహని. అతని కపోలకల్పనని!  మరి ఈ నా వాస్తవం ఎవరి ఊహయో?! నా అస్థిత్వం నిజమా? కల్పనా?  ఈ తన ఈ సత్యం మాత్రం నిజమా? కావచ్చు .. కాకపోవచ్చు. ఏది ఏమైనా ఆ శిల్పసుందరిని సాక్షాత్కరించుకోవాలి. ఎలాగైనా… ఏం చేసైనా… ఉదయాన్నే బయలుదేరి శుకపాదానందులవారి ఆశ్రమం చేరాడు.
 

జరిగినదంతా సావధానంగా విన్నారు శుకపాదానందులు. "గురువర్యా! ఎలాగైనా ఆ ఊహాసుందరిని ఈ లోకంలోకి రప్పించాలి. నా కలలో మీరు యోగవిద్యను నాకు అనుగ్రహించారు. ఈ సారి నిజంగా అనుగ్రహించండి. ఎలాగైనా ఆమెను తీసుకువస్తాను." వేడుకున్నాడు జయసింహుడు.

చిన్నగా నవ్వారు శుకపాదానందులు. "జయసింహా! నీకు నామీద ఉన్న అపారమైన భక్తి విశ్వాసాల వలన నీ స్వప్నంలో ఆ విధంగా నేను యోగవిద్యను అనుగ్రహించినట్లు వచ్చి ఉండవచ్చు. అయితే నిజానికి అటువంటి యోగవిద్యను ఇంతవరకూ నాకుకూడా పట్టుబడలేదు. నీకెట్లొసంగగలను? కనుక ఆ ఆలోచన విడిచిపెట్టు."

"గురువర్యా! మీరే అట్లంటే నాకు దిక్కెవరు. మీరు సర్వ శక్తిమంతులు. నా మీద జాలిగొని అనుగ్రహించండి" అని కాళ్ళపై బడ్డాడు.

"జయసింహా! ఏమిటీ  మొండితనము. నా కసాధ్యమైన దానిని నా నుండి ఆశించెదవేల?" అని లేవదీశారు శుకపాదానందులు.

"సరే ! గురుదేవా! మీ అనుగ్రహానికి నోచుకోని నా ఈ బ్రతుకు అర్థరహితమైనది. వ్యర్థమైనది. దీనిని ఈ క్షణమే త్యజిస్తాను." అంటూ కత్తి తీయబోయాడు జయసింహుడు.

"శాంతించు! జయసింహా! శాంతించి. నాకు కొంత సమయము ఇవ్వు. మా గురుదేవులను ధ్యానించి వారి అనుగ్రహాన్ని పొంది నీకు కర్తవ్యబోధ చేగలను. నేటికి విశ్రమించుము." అని సమాధాన పరచారు శుకపాదానందులవారు.
 

జయసింహుడు వెళ్ళిన తరువాత శుకపాదానందుల వారి శిష్యుడు అతనిని సమీపించి "గురువర్యా! ఇప్పుడేమి కర్తవ్యం? జయసింహులు స్వాప్నికమైన ప్రేయసిని ప్రత్యక్షం చేసుకుంటే అసలు సత్యానికి, స్వప్నానికి తేడా ఏముంటుంది? మన అస్థిత్వానికి అర్థమేముంటుంది?" అని ప్రశ్నిచాడు.

"నాయనా! స్వప్న ప్రభావం ఎంతో కాలం ఉండదు. మనం నిరంతరం ఎన్నో ఆలోచనలతో, ఎన్నో ఊహలలతో , ఎన్నో లోకాలలో విహరిస్తుంటాం. అందు ఏది సత్యమన్న ప్రశ్నకు సమాధానం తెలియుట అసాధ్యం. ఒక్క విశ్వాసం మాత్రమే ఒక సత్యమనుదానిని నిర్థారిస్తుంది. అది స్థిరము కానినాడు మనిషి ఉన్మత్త స్థితిని పొందుతాడు. ఆ విశ్వాసం నిజానికి ఒక మాయ మాత్రమే. ఆ నమ్మికకు పునాది భ్రాంతి తప్ప వేరుకాదు. ఇది సృష్టి వైచిత్రి. భ్రాంతిని పొందినవాడు స్థిరంగా ఉండును. వివిధ కారణాల వల్ల ఆ భ్రాంతిని సడలినవాడు అస్థిరమైన మానసిక స్థితిని పొందును. కేవలం సరియైన మార్గంలో ఆ భ్రాంతిని పూర్తిగా తొలగించుకున్న నాడు సచ్చిదానందం లభించును.' అని ఉపదేశించాడు.

"మరి జయసింహుని గతి…?" శిష్యుని ప్రశ్నకు చిరునవ్వు నవ్వారు శుకపాదానందులు. "రాజవైద్యుల ఔషధ ప్రభావం, రాచరికపు పని ఒత్తిడి, వినోదకాలక్షేపాలు యువరాజువారిని త్వరలో మామూలు మనిషిని చేయగలవు. దానికి ఏర్పాట్లు చేయించెదను."

"మరి స్వప్న సుందరి?"

"శిష్యా! నీకుకూడా మతి భ్రమిస్తున్నట్లున్నది. ఆ శిల్పము జయసింహుల వారి స్వప్నములోని శిల్పి యొక్క ఊహకు ప్రతిరూపం. దాని గూర్చి ఏమి ఆలోచించి ఏమి ప్రయోజనం. ఆ విషయమును వదిలేయి" అని కసిరారు. ఇంకా ఆలోచిస్తూ వెళుతున్న శిష్యుని గాంచి  శుకపాదానందులవారి మోవి పై చిన్న నవ్వు తొణికిసలాడింది.
 

"ఈ సత్యం కన్నా జయసింహుని స్వప్నమే బాగుంది.. ఇంకాసేపు ఉండి ఉంటే బాగుండేది…ఎన్ని అద్భుతాలు…ఎన్ని మాయలు.. ఎన్ని మలుపులు….  ఏమి కథ.." అని గొణుగుకుంటూ బయటకు వచ్చిన శిష్యుడు, ఆ ప్రక్కన చిరిగిన దుస్తులతో నిద్రిస్తున్న వ్యక్తిని గమనించకుండా వెళ్ళిపోయాడు. ఆ పడుకున్న వ్యక్తి ప్రక్కన ఒక మాసిన సంచీ, అందులో ఒక ఉలి ఒక సుత్తి …. ఏ స్వప్నాలను చెక్కుతున్నాయో!

About భైరవభట్ల విజయాదిత్య

’చిన్నప్పటినుండీ ఇంట్లో ఉన్న వాతావరణం వల్ల సాహిత్యంలో కలిగిన ప్రవేశం, కుదిరినంతవరకూ నాలో కలిగే భావాలను అక్షరాలలో ఆవిష్కరింపజేయాలనే తాపత్రయం, ఇతరుల ప్రోత్సాహం … ఇవి నా చేయి పట్టి అడుగులు వేయిస్తున్నాయి.’ అని చెప్పే భైరవభట్ల విజయాదిత్య గారు విజయనగరానికి చెందిన వారు.

ఆంద్రభూమి లో మూడు కథలు ప్రచురితమయ్యాయి. రంజని – నందివాడ భీమారావు కథల పోటీలో ప్రత్యేక బహుమతి, బొబ్బిలి రచన సంస్థవారి కవితల పోటీలో ద్వితీయ బహుమతీ అందుకున్నారు. సంపుటిలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి. కృష్ణబిలం (krishnabilam.blogspot.com) అనే బ్లాగు రాస్తూంటారు.

This entry was posted in కథ. Bookmark the permalink.