చండశాసనుడు రా.రా

రాచమల్లు రామచంద్రారెడ్డి గారు 1959-63 మధ్య ఒకే సమయంలో రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా వృద్ధిచెందారు. ఆయన – పైన తెలిపిన కాలంలో 'సవ్యసాచి' అనే పక్షపత్రిక నడిపారు. ఆ పత్రిక నిర్వహణ ఖర్చు కడప జిల్లా కమ్యూనిస్టు పార్టీ భరించేది. ఎడిటరేమో రా.రా గారు. 'ఎదురు తిరిగిన కథానాయకుడు' అనే కథానిక తప్ప ఆయన రాసిన కథలన్నీ సవ్యసాచిలోనే అచ్చయ్యాయి. ఆ పత్రిక్కు కొడవటిగంటి కుటుంబరావు, కె.వి. రమణారెడ్డి లాటివారు వ్యాసాలు అవీ పంపేవారు. ముఖ్యంగా ప్రత్యేక సంచికలకు వారిద్దరు తప్పకుండా పంపేవారు. అప్పుడప్పుడు సొదుం జయరాం కథలు, బంగోరె సమీక్షలు, నేను గేయాలూ రాసేవాళ్లం. 'సవ్యసాచి'లో వచ్చిన ప్రతి రచనపైనా ప్రతి ఆదివారం గోష్ఠిలాటిది జరిగేది. ఈ గోష్ఠుల్లో కేతు విశ్వనాథరెడ్డి, నల్లపాటి రామప్పనాయుడు, బంగోరె, నేను తప్పకుండా పాల్గొనేవాళ్లం. రా.రా. ఎంత సౌమ్యంగా మాట్లాడేవారో బంగోరె అంత దబాయించేవాడు. బంగోరె సహకార బ్యాంకిలో ఉద్యోగం చేసేవాడు. బుచ్చిబాబును ఎవరేమన్నా సహించేవాడు కాదు. ముఖ్యంగా 'చివరకు మిగిలేది' అంటే చచ్చేంత అభిమానం. చాలా తరుచుగా కథాశిల్పంపై చర్చలు సాగేవి. చర్చల్లో రా.రా., బంగోరె – వీరిద్దరి డామినేషన్ స్పష్టంగా కనిపించేది. కవిత్వం మీద జరిగే ప్రతి గోష్ఠికి గజ్జల మల్లారెడ్డి తప్పకుండా హాజరయ్యేవాడు. చర్చలు చాలా లైవ్లీగా సాగేవి. చర్చల సారాన్ని సవ్యసాచిలో ప్రచురించేవారు కూడా. ఆ రిపోర్టింగ్ బాధ్యత కేతు విశ్వనాథరెడ్డి, రామప్పనాయుడు చూసుకునేవారు. రా.రా. గారు కావలిలో ఉన్న కె.వి. రమణారెడ్డి గారినుంచి పుస్తకాలు తెప్పించి మాకు సర్క్యులేట్ చేసేవారు. ఇటాలియన్ రచయిత పిరాండెలో రాసిన Six Characters in search of an author అనే నాటకంపైన ఒకసారి చాలా సీరియస్ గా చర్చలు సాగినట్లు గుర్తు. ఇది 1961లో కావచ్చు. అంతవరకు నేను పిరాండెలో పేరు ఎరుగను. అలాగే ఒకసారి (నాజీ బాధితురాలు) 'అన్నా ఫ్రాంక్ డైరీ' మీద కూడా రసవత్తరంగా చర్చ సాగింది. దేనిమీదనైనా సరే చర్చ మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో సాగేది. ఒక్క బంగోరె (లిబరల్ డెమోక్రాట్) తప్ప మిగతావారంతా కమ్యూనిస్టులు లేదా సానుభూతిపరులు.

చర్చల్లో కొ.కు. ప్రస్తావన వస్తే 'అంత గొప్ప రియలిస్టు ఇప్పట్లో పుట్టడు' అనేవారు రా.రా. రొమాంటిక్ రచయితలకూ, రియలిస్టు రచయితలకూ ఉండే భేదం గురించి మేమంతా ఆయన ద్వారానే తెలుసుకున్నాం. గోపీచంద్ ప్రస్తావన వస్తే, ఆయన మంచి రచయితే కానీ కొ.కు. మీదున్నట్లు ఆయన మీద నాకు 'గురుత్వం' లేదు అనేవారు. గోపీచంద్ గారి 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా' ఏదో పత్రికలో సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే కొ.కు. గారి "ఎండమావులు" విశాలాంధ్రలో సీరియల్ గా వచ్చినట్లు గుర్తు. వారిద్దరిపైనా ఒకటి రెండుసార్లు చర్చలు జరిపాం కానీ ఒక అంశం మాత్రమే గుర్తుంది. గోపీచంద్ గారి ఇంటలెక్చువల్ ఆనెస్టీ మీద తనకు నమ్మకం లేదు అన్నారు రారా. ఇంటలెక్చువల్ ఆనెస్టీ అంటే ఏమిటి? అన్నాన్నేను. ఆయనేదో పొడిమాటల్లో చెప్పారు కాని అది 'అందీ అందని చేలాంచలము' లాగా నా అవగాహనా పరిధిలోకి రాకుండా తప్పించుకుంది. రా.రా. మంచి స్పీకర్ కాదు. నట్లు నట్లుగా మాట్లాడేవారు. తనకు స్పష్టమైన అవగాహన లేని అంశంపై రాయడానికి కానీ, మాట్లాడేదానికి కానీ సాహసించేవారు కాదు. 1962 ఎన్నికల్లో ఒకసారి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కడప వచ్చారు. ఆ సందర్భంగా రా.రా. గారు 'సవ్యసాచి'లో 'నెహ్రూ వస్తున్నాడు అడగండి!' శీర్షికలో చక్కటి వ్యాసం రాశారు. చాలా శక్తిమంతంగా రాశారది. దాన్ని'విశాలాంధ్ర' పునర్ముద్రించింది. అయితే వాళ్లు చివరన 'సవ్యసాచి నుంచి' అని అకనాలెడ్జి చేయడం మరచారు. ఆ అంశంపై కూడా అయిదారు నిమిషాలు చర్చించాం. 'నిరసన లేఖ పంపండి సార్' అంటూ బంగోరె సూచించినట్లు గుర్తు. రా.రా. గారు నవ్వుతూ ఆయన సూచనను కొట్టిపారేశారు. రా.రా. గారు 'సవ్యసాచి' దశలో సాహితీ చర్చల్లో శిల్పానికీ, సాహిత్య ప్రయోజనానికీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. నేనోసారి చాలా ఉత్సాహంగా 'కాలాతీత వ్యక్తులు' (డాక్టర్ శ్రీదేవి) ఎంత గొప్పగా ఉందో! అన్నాను. 'గొప్పగా కాదు ఇంటరెస్టింగ్ గా ఉందను. ఇంటరెస్టింగ్ గా ఉండడం కంటె – సాహిత్యానికి ప్రయోజనమే ఎక్కువ ముఖ్యం' అన్నారాయన. కథకానీ నవలకానీ కవితకానీ ఏదైనా పాఠకుని సంస్కారాన్ని తీర్చిదిద్దడానికీ సమాజాన్ని అభ్యుదయ పథంలో నడిపించడానికీ ఉపయోగపడాలి అనేవారు. అయితే అదే సమయంలో రచన విధిగా కళాత్మకంగా వుండాలనేవారు. సాహిత్యంలో చౌకబారు ప్రచారాన్ని ఆయన ఏవగించుకునేవారు. నేను రెండు మూడుసార్లు వర్ధిష్ణువులవి రచనలు ఇచ్చి కాస్త దిద్ది 'సవ్యసాచి'లో వేయండి అన్నాను. ఆయన వేశారు కానీ, అవి అచ్చయ్యాక ఒక మాట అన్నారు. 'మనం దిద్ది వేస్తే ఓస్ రచన అంటే ఇంతే కదా అనుకుంటారు బిగినర్స్. అలా అనుకోవటం మన పత్రిక కంటే వాళ్లకే ఎక్కువ హాని' అన్నారాయన. ఆ మాట నిజమే మరి.
 


 

గరిమెళ్ళ నారాయణఆయన నడిపిన 'సవ్యసాచి'కీ 'సంవేదన'కూ చాలా తేడా వుంది. సవ్యసాచి 'రాజకీయ, సాంస్కృతిక' పక్షపత్రిక. సంవేదనేమో ఫక్తు సాహిత్య త్రైమాసిక. మొదటి దాని ఖర్చు కమ్యూనిస్టు పార్టీ భరిస్తే రెండోదాని ఖర్చు యుగసాహితి అనే సాహిత్య సంస్థ భరించేది. 'సంవేదన'కు వచ్చిన ప్రతి రచననూ విధిగా రా.రా.తో పాటు ఆర్వియార్, నల్లపాటి రామప్పనాయుడు కూడా పరిశీలించేవారు. రచన స్వీకారానికి కానీ తిరస్కారానికి కానీ ఉమ్మడి నిర్ణయాన్నే అమలు పరిచేవారు. ఎల్.పి.రావు అనే రచయిత 'ఓ బూతు కథ' పేరుతో సంవేదనకు ఓ కథానిక పంపారు. పేరులోనే వుంది తప్ప కథలో బూతే లేదు. చాలా చక్కటి కథ అది. ఎల్.పి.రావు అనే ఎల్. పుల్లోజీరావు ఇప్పుడు తెలంగాణాలో ఎక్కడున్నారో కానీ ఆయన తర్వాత కథలు గట్రా రాసినట్లు లేదు. సంవేదనలో అచ్చయిన ఆ కథ మాత్రం ఫెంటాస్టిక్. 'సంవేదన' అక్షరాలు రాసిస్తానని బాపు హామీ ఇచ్చాడు కానీ రాయలేకపోయారు. తర్వాత ఆ అక్షరాలు చలసాని ప్రసాదరావు (ఈనాడు) రాశాడు. సంవేదన, సంపాదకుడు, రాచమల్లు రామచంద్రారెడ్డి ఈ మూడూ ఆయనే రాశాడు. సంవేదన తొలిసంచికకు వేగుంట మోహన్ ప్రసాద్ గేయం పంపితే అది అస్పష్టంగా ఉంది, ఇంకొంచెం స్పష్టంగా రాసి పంపండి అంటూ రా.రా. ఉత్తరం రాసినట్లు గుర్తు. ఆయన రా.రా. మాట మన్నించి ఆ గేయాన్ని తిరగరాసి పంపాడు. రచనా ప్రమాణం విషయంలో చాలా కచ్చితంగా వుండేవారాయన. మంచి రచనలు రాకపోతే ఆయనే వ్యాసమో, సమీక్షో రాసేవారు. 'నాకు తెలుసు. వన్ మాన్ షో అనే విమర్శ వస్తుందని. అయినా ప్రమాణం విషయంలో రాజీ పడదల్చుకోలేదు' అనేవారు. ప్రతి రచనా ఒకటికి రెండుసార్లు ప్రూఫులు చూసేవారు.1968లో విశాలాంధ్ర వారు చాసో కథలు వేశారు. ఒక కాపీ సంవేదనకు సమీక్ష కొచ్చింది. రా.రా. గారు దాన్ని వెంటనే సమీక్ష కోసం కొ.కు. గారికి పంపారు. 'కథలు చాలా బాగున్నాయి కానీ ఇంతవరకు ఆయన పేరే నేను విన్లేదు' అన్నారు రా.రా. నాతో. వెనకబడిన ప్రాంతం వాళ్లం కదా ఎలా వింటాం అన్నాన్నేను. ఆయన నిండుగా నవ్వారు.
 

రా.రా. గారు కథలో ఇతివృత్తానికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చేవారో, శిల్పానికి అంతే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఒకసారి 'సృజన'లో ఆర్. వసుంధర గారి కథ ఒకటి (మాతృదేవోభవ) అచ్చయింది. అందులోని ఇతివృత్తంలో విశేషమేమీ లేదుగానీ గొప్ప శిల్పం వుందంటూ మురిసిపోయారు ఆయన. ఆ కథ విశిష్టతపైన ఒక సాహితీ మిత్రుడికి ఆ రోజుల్లో ఆయన ఉత్తరం రాశారు. అది 'రా.రా. లేఖల్లో' వుంది. మనం రా.రా. వ్యాసాలు ప్రచురిస్తే బాగుంటుందని విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకుడు ఏటుకూరి బలరామమూర్తి గారికి సూచించింది నేనే. ఆయన వెంటనే ఒప్పుకుని వ్యాసాలు తెప్పించే బాధ్యత కూడా నాకే అప్పగించారు. ఆ వ్యాసాలే 'సారస్వత వివేచన'. ఆ పుస్తకానికి పేరు పెట్టింది కూడా నేనే. తర్వాత కొన్నేళ్లకి త్రిపురనేని మధుసూదనరావు ఆ పేరుపై దాడిచేసి ఆ పేరులోనే ప్రతీప ధోరణి వుందన్నారు. (sic) ఉత్తరం రాసి రా.రా. నుంచి వ్యాసాలు తెప్పించాను. అందులో వున్న దిగంబరకవులపై సమీక్ష తీసేసి వరవరరావు 'చలినెగళ్ళు' (జీవనాడి?)పై సమీక్ష ప్రచురిస్తే బాగుంటుందని నేను సూచిస్తే ఆయన విన్లేదు.దిగంబర కవులపై సమీక్ష వుండి తీరాల్సిందే అన్నారు. నేను మళ్లీ రాస్తూ దిగంబరకవుల్లో బూతే కాదు సామాజిక నిరసన కూడా వుంది కదా, దాన్ని మీరు విస్మరిస్తే ఎలా అంటూ కాస్త అతిగా వాగినా చివాట్లేమీ పెట్టలేదు. 'సారస్వత వివేచన'కు సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటన వెలువడగానే ఆ విషయం తెలుపుతూ నాకు ఉత్తరం రాశారాయన.

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.