ఎటు వైపు…?

నిర్మాణాలను స్వప్నించే వారిని,

ఉన్నతానికై ఉద్యుక్తులయ్యే వాళ్ళనీ

‘ధ్వంసాన్ని తలపోయని, నేలకు కూలిపోని’

దృఢమైన దృక్పధం వెన్నంటి నడిపిస్తూ ఉండాలి.

కానీ,
 

లేశమాత్రపు వికృతం చాలు ,

నిర్మలమైన కలల పాలు కల్లలై విరిగిపోవడానికి ,

ధ్వంస విధ్వంసాలై కూలిపోడానికి,

పగిలి రగిలి తగలబడడానికి.


గుజ్జన-గూడైన చిన్నారి అంకితభావాన్ని

అబ్బురపడి హత్తుకునే లోపలే,

ఆకతాయి అసూయ అడుగులకింద

శిధిలమై వెక్కిరిస్తానంటుంది.


సింహం కోపాన్ని నిలువరించిన

చిట్టెలుక ప్రాణమంతటి ఆలోచనా నిర్మాణమే,

వలను ధ్వంసం చేసి మరీ

మృగరాజునే కాపాడిన ఎలుక బుద్ధికీ సాయపడింది.

ఎప్పుడు ఎవరు ఎందుకు ఎదురు తిరుగి కత్తులు దూస్తారో తెలియని

నిత్య జీవిత పద్మ వ్యూహం లో కూడా

నిర్మాణాలను స్వప్నించి ప్రయాణించడమే ఒక అసలు సిసలైన మహత్తర కార్యం.


ఇప్పుడు మనకి,

ధ్వంసాన్ని సైతం నిర్మాణంగా తలకెత్తుకున్న చిట్టెలుకల కధలూ,

గుజ్జన గూళ్ళు కట్టిన చిరుప్రాయపు దీక్షా సందేశాలు,

ఎడారుల నుండి పట్టుదలతో మొలకెత్త గలిగిన అడవుల కబుర్లూ కావాలి.

వెయ్యి ధ్వంసాల గురించిన విస్పోటనపు ప్రయత్నం కన్నా

ఒక్క నిర్మాణపు అలోచన చెయ్యడానికే కొండంత సాహసం కావాలి.

About గరిమెళ్ళ నారాయణ

ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ , ఆత్మీయులతో కబుర్లు కలబోసుకునే అమూల్యమైన సందర్బాలను పరవశిస్తున్నంత లోనే వర్తమాన సమాజం, దాని పోకడలు, వైరుధ్యాలు, సమస్యలూ కొరడాతో కొట్టినట్టవుతూ ఉంటే ప్రశ్నించు(కో)కుండా ఉండలేనితనమే నా రచనలకు డ్రైవింగ్ ఫోర్సెస్(చోదక శక్తులు) అని గరిమెళ్ళ నారాయణ గారు అంటారు. నారాయణ గారి మొట్ట మొదటి కధ 1991 లో ఆంధ్రజ్యోతి-న్యూ జెర్సీ రాజాలక్ష్మీ వారి కధల పోటీలో బహుమతిని పొందింది. ఆ తరువాత ఆంధ్రజ్యోతి, రచన, అమృత్ కిరణ్, కోకిల, అమెరికా తెలుగు కధానిక లలో పది వరకూ కధలు ప్రచురితమయ్యాయి. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం లో ప్రసారంతో పాటు ’రచన’ లాంటి పత్రికలలో, కౌముది, ఈమాట, సుజనరంజని లాంటి ఆన్లైన్ పత్రికలలో ఇరవై వరకూ నారాయణ గారి కవితలు ప్రచురితమయ్యాయి. కధలూ, కవితలతో పాటు, పాటలు వ్రాయడం/పాడటం, స్టేజి షోలు చేయడం నారాయణ గారి సాహిత్య/సాంస్కృతిక హాబీలు. వీరు రెస్టన్, వర్జీనియాలో నివాసముంటూ, బాల్టీమోర్ లో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్ గా ఉద్యోగం చేస్తున్నారు.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.