నిర్మాణాలను స్వప్నించే వారిని,
ఉన్నతానికై ఉద్యుక్తులయ్యే వాళ్ళనీ
‘ధ్వంసాన్ని తలపోయని, నేలకు కూలిపోని’
దృఢమైన దృక్పధం వెన్నంటి నడిపిస్తూ ఉండాలి.
కానీ,
లేశమాత్రపు వికృతం చాలు ,
నిర్మలమైన కలల పాలు కల్లలై విరిగిపోవడానికి ,
ధ్వంస విధ్వంసాలై కూలిపోడానికి,
పగిలి రగిలి తగలబడడానికి.
గుజ్జన-గూడైన చిన్నారి అంకితభావాన్ని
అబ్బురపడి హత్తుకునే లోపలే,
ఆకతాయి అసూయ అడుగులకింద
శిధిలమై వెక్కిరిస్తానంటుంది.
సింహం కోపాన్ని నిలువరించిన
చిట్టెలుక ప్రాణమంతటి ఆలోచనా నిర్మాణమే,
వలను ధ్వంసం చేసి మరీ
మృగరాజునే కాపాడిన ఎలుక బుద్ధికీ సాయపడింది.
ఎప్పుడు ఎవరు ఎందుకు ఎదురు తిరుగి కత్తులు దూస్తారో తెలియని
నిత్య జీవిత పద్మ వ్యూహం లో కూడా
నిర్మాణాలను స్వప్నించి ప్రయాణించడమే ఒక అసలు సిసలైన మహత్తర కార్యం.
ఇప్పుడు మనకి,
ధ్వంసాన్ని సైతం నిర్మాణంగా తలకెత్తుకున్న చిట్టెలుకల కధలూ,
గుజ్జన గూళ్ళు కట్టిన చిరుప్రాయపు దీక్షా సందేశాలు,
ఎడారుల నుండి పట్టుదలతో మొలకెత్త గలిగిన అడవుల కబుర్లూ కావాలి.
వెయ్యి ధ్వంసాల గురించిన విస్పోటనపు ప్రయత్నం కన్నా
ఒక్క నిర్మాణపు అలోచన చెయ్యడానికే కొండంత సాహసం కావాలి.