ప్రపంచ పక్షి

సృష్టి నాటి నుంచి చూస్తున్నా
సూర్యుడెప్పుడూ తూర్పునే ఉదయిస్తున్నాడు
దశాబ్దాలనీ శతాబ్దాలనీ
గుర్తుల కోసం నువ్వే ఋతువుల పేర్లైనా పెట్టుకో
కాలం మాత్రం అనంతం నుంచి అనంతంలోకి
సాగే జీవన ప్రవాహం
మనిషి అందులో ఒక అల
 

నదులూ , సముద్రాలూ, పర్వతాలూ,
అగాధాలూ, అడవులూ, ఎడారులూ,
మహా సముద్రాలనీ
నేలనీ, నీటినీ ముక్కలు ముక్కలు చేస్తున్నావ్!


జాతులనీ, రంగులనీ, మతాలనీ , కులాలనీ,
బానిసలనీ,
నిన్ను నీవే నిలువుగా, అడ్డంగా
నరుక్కుంటున్నావ్!


నిజమే….
నడక మాత్రమే తెలిసినవాడివి- నదులు
నీకడ్డమే మరి!


శతాబ్దానికవతల ఏముందో వినలేని
చెవిటి వాడివి
కంటికి కనిపించనిదంతా నీకు దగా!
నీ గుళ్ళూ, గోపురాలూ, పిరమిడ్లూ, ప్యాలెస్ లూ
నగరాలూ, నాగరికతలూ
కాలం తీరాల వెంట శిధిలాల్లా పడి ఉన్నాయ్!


నత్త గుల్లలే నీ చరిత్రకు గుర్తులుగా మిగిలున్నాయ్!
అణువును ఛేదించి అస్త్రాలను చేసేవాడా
జీవాన్ని మమ్మీ గా మార్చి పిరమిడ్ బొడ్డులో దాచేస్తావా?
కరువులూ, కాటకాలూ, వరదలూ, తుఫానులూ,
భూకంపాలూ, సునామీలు చాలకా …
మధ్యలో పుట్టి మధ్యలో పోయే ఓ మనిషీ!
మళ్ళీ యుద్ధాలను సృష్టిస్తున్నావ్!


నీ అధికారం, ఉగ్రవాదం, యు యెన్ వో వీటో పవరూ,
ప్రభుత్వాలూ, పహరాలూ డాలర్లు పేటెంట్లు
అణువుపగిలితే అంతా మసి!
విశ్వాన్ని జయించాలని విర్రవీగిన నియంతలు
బాత్రూముల్లో జారిపడి చచ్చిన ఉదంతాలు
వినలేదా!


క్యాలెండరుకు ముందేముందో తెలీనివాడివి
నీ కన్న పిట్ట నయం!
చినుకు కోసం నేలపడే తపన దానికి తెలుసు
ఉనికి కోసం జీవిపడే ఆరాటం తను చూడగలదు


తల్లడిల్లే పిల్లవాడు తల్లి నాలుకతో 'అమ్మా!'
అనే ఏడుస్తాడు ఏ ఖండంలోనైనా
తల్లి నాలుకలు వేరైనా తల్లి మాత్రం ఒక్కటే
బాధలకూ, భయాలకూ రంగులు వేరైనా వాసన ఒక్కటే అయినట్లు
జపానుకైనా ఇరానుకైనా
చెక్కిళ్ళ మీద జారే కన్నీళ్లు ఎప్పుడూ ఉప్పగానే ఉంటాయి


ఆఫ్రికా అడవులైనా, అలప్స్ కొండలైనా,
నైలునది నీళ్ళయినా, దార్ ఎడారి ఇసుకైనా
ఎవరెస్టు శిఖరమైనా మృత్యులోయ లోతైనా
పిట్ట కొక్కటే!


మనిషి ముక్కలు చేసిన ఆకాశాన్ని
తన రెక్కలతో కుట్టుకుంటూ
రవ్వంత వసంతం కోసం దిగంతాల అంచుల దాకా
ఎగరటమే దానికి తెలుసు


నేను
అలుపెరగని ఆ వలసపక్షిని
ప్రపంచ పక్షిని


ఖండాల జెండాలన్నీ ఒక్కటేనని మనిషి
నమ్మేదాకా దేశదేశాలకు
ఈ సందేశాన్ని పంచటమే నా పని!

About కర్లపాలెం హనుమంతరావు

రచన వ్యాసంగం లో కర్లపాలెం హనుమంతరావు గారిది పాతికేళ్ళ పైబడిన అనుభవం. వందకు పైగా చిన్న కథలు,వందన్నరకు పైగా వ్యంగ్య గల్పికలు (అన్నీ ప్రచురితాలే), డజనుకు పైగా నాటికలు, ఆకాశవాణికి రచనలు... వారి సాహిత్య రికార్డు. సినిమాలకు రచన చేసిన 3 ఏళ్ల అనుభవం అదనం. "శైలజ కృష్ణమూర్తి-వాళ్ళకింకా పెళ్లి కాలేదు ", "ఫోటో" చిత్రాలకు రచన విభాగంలో పనిచేసారు. మరికొన్ని చిత్రాలకు రచనా సహకారం అందించారు. ఈనాడు ఆదివారం ఎడిటోరియల్ కు కూడా రచనలు అందిస్తుంటారు. "ఒక్క నవల మీద తప్ప అన్ని ప్రక్రియల మీద చెయ్యి చేసుకున్నపాపం నాది. స్థిరంగా వుండక కొంత, చేసిన బ్యాంక్ మేనేజర్ వృత్తి వుండనీయక కొంత.. మొత్తం మీద పెద్దగా సాధించినదేమీ లేదు. వారం వారం ఈనాడులో మాత్రం గత నాలుగేళ్ళుగా ఎవరినో ఒకరిని సాధిస్తూ కాలక్షేపం చేస్తున్నాను. మధ్యలో ఆంధ్రభూమి వెన్నెల సినిమా పేజీలో కొత్త సినిమాలను సాధిస్తూ కాలక్షేపం చేశాను. కవిత్వం అంటే మరీ ఎక్కువ ఇష్టం కాబట్టి దాన్ని చదువు కోవటం తప్ప సాధించింది తక్కువ .మరీ తప్పనప్పుడు, మనసు మరీ సాధిస్తున్నప్పుడు తప్ప కవితామ తల్లి జోలికి పోయే సాహసం చేయను. " అని అంటారాయన.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.