చరిత్రలో రాయలసీమ

రాయలసీమ చరిత్ర గురించిన సంక్షిప్త వ్యాసాన్ని సమర్పిస్తున్నాం. భూమన్ రచించిన ఈ వ్యాసం  మొదట రాయలసీమ ముఖచిత్రం అనే భూమన్ గారి వ్యాసాల సంకలనం లో ప్రచురితం అయింది. భూమన్ గారి అనుమతితో ఆ వ్యాసాన్ని  "రాయలసీమ వైభవం"లో ప్రచురించారు. కె.ఎస్.రూరల్ మీడియా మరియు రాయలసీమ ఆర్ట్ థియేటర్స్ తరపున తవ్వా ఓబుల్ రెడ్డి సంపాదకత్వంలో 2008 లో వారు ప్రచురించిన గ్రంథమే రాయలసీమ వైభవం.

అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కంభం, తాలూకాలు రాయలసీమగా వ్యవహరింపబడుతున్నాయి. చరిత్రలో ఈ ప్రాంతాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.


తెలుగు ప్రజల ఆదిమ నివాస స్థలం రాయలసీమ. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపాన ఉన్న రాళ్లకాల్వ వద్ద, కర్నూలు జిల్లాలో అనేక చోట్ల జరిగిన తవ్వకాలలో అతి ప్రాచీన మానవుని ఉనికికి సంబందించిన అనేక ఆధారాలు లబించినట్లు ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ హెచ్‌.డి. సంకాలియా తెలియజేసినారు. ''మద్రాసు చుట్టు పట్లా, కర్నూలు జిల్లాలో వున్న అనేక గుహలు అన్నిటికన్నాముఖ్యమైన స్థలాలని నా అభిప్రాయం. దాదాపు అరవయ్యేళ్ల క్రితం రాబర్ట్‌ బ్రూస్‌పుట్‌ ఆ ప్రదేశాలలో అనేక పరికరాలనూ, ఎముకల మీద చెక్కబడ్డ కళానైపుణ్యాన్ని కనుగొన్నాడు. ఆ పనితనాన్ని ఆయన అదే రోజుల్లో ఫ్రాన్స్‌ గుహల్లో కనుగొన్న పనితనంతో పోల్చినాడు. ఆ కాలాన్ని పురావస్తు శాస్త్రజ్ఞుల 'పాత రాతియుగం ఉన్నతి దశ' అంటారు.

దురదృష్టవశాత్తూ పుట్‌ సేకరించినవేవీ నేడు లభ్యం కావటం లేదు. అయితే ఆ తవ్వకాలలో దొరికిన సమాచారం ఆధారంగా మనం గట్టి ప్రయత్నం చేస్తే అభివృద్ది చెందిన వేటగాడి దశలోని మానవుని ఉనికి గురించి అనేక ముఖ్యమయన ఆధారాలు కర్నూలు గుహల్లో తప్పక దొరుకుతాయని, ఈ కృషిలో చిత్తూరు, మద్రాసు పరిసరాల గుహలు కూడా ఉపయోగపడవచ్చనని నాకు గట్టి నమ్మకం' (హెచ్‌.డి. సంకాలియా) కర్నూలు జిల్లాలోని నదులు, వాగుల వెంబడి పాతశిలా యుగపు పనిముట్లు ఎన్నో దొరికినాయి. బెలుంగుహల్లో పాత శలా యుగపు ఉత్తర దశకు సంబంధించిన జనావాసాలు దొరికినాయి. ఇక్కడ మెల్లో వేసుకునే దంత హారాలు, కొన్ని వంపటెముకలు దొరికినాయి. కడప జిల్లా రాయచోటి తాలూకా సరస్వతిపల్లె, ముక్రావులపల్లె, ఇతర ప్రాంతాలకు చెందిన కనుమలోపల్లె, చిట్వేల్‌, కలసపాడులలోను, అనంతపురం జిల్లా గుంతకల్లు స్టేషన్‌లో నైరుతి దిక్కుగా వున్న దిబ్బలోను విడపనకల్లు కోటలో, వేల్పుమడుగు గుట్టల్లో, లత్తవరం, కరుకు ముక్కల కొత్తకోటకు పడమరగా వున్న మిట్టమీద, ఉరవకొండ ప్రాంతంలోను పాత శిలాయుగపు పనిముట్లు దొరికినాయి. గుంతకల్లు రైల్వేస్టేషన్‌ సమీపంలోని పుట్‌ స్నేహతులొకరికి ఒక కర్రాపన్నె దొరికింది. ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకూ లభించని ప్రాచీన కుడ్య చిత్రాలు బెలుం గుహల్లో వున్నాయి. రాయదుర్గం కొండ మీద చెక్కడపు పనులు చిల్రేఖనం లభించినాయి. కర్నూలు జిల్లాలోని బెలుంగుహల్లో ఆనాటి మానవునికి నిప్పు చేయటం తెలిసివుందనటానికి కావల్సిన కొన్ని సాక్ష్యాధారాలు కూడా దొరికినాయి.
 

1765 లో నిజాం పాలనలో రాయలసీమ (Imperial Gazatteer of India నుండి సేకరించినది. 1909 http://dsal.uchicago.edu/reference/gaz_atlas_1909/fullscreen.html?object=33"అనంతపురం జిల్లాలో 25 జనావాసాల్ని బ్రూస్‌పుట్‌ బయటికి తీసినాడు. లత్తవరం కొండమీద పిండి విసరడాానికి వుపయోగించిన అనేక బండలు కనిపించినాయి. గింజల్ని నూరేందుకు అక్కడి ప్రజలు మంచి అందమయిన రంగుగల ఒక పిస్టసైట్‌ రాయి మీద ఎక్కువ మోజు చూపినారు. అక్కడికి కొంచెం దూరంలో కొండ కింద ఒక పొడవాటి రాతి బండ వుంది. దాని మీద , అరిగి, లొత్తబడి నునుపుదేరిన 14,15 పెద్ద గుట్టలున్నాయి. ఇక్కడ జనం ధాన్యం దంచుకుంటూ వుండి వుంటారు. (పుట్‌) కొండ మీద పెద్ద తిరుగలి రాళ్లు కనిపించినాయి. విడపనకల్లు కొండ మీద కత్తులు, ఉలులవంటివేగాక చెకుముకి రాయితో తయారు చేసిన పరికరాలు కూడా దొరికినాయి. ఈ గుట్ట మీద వెడల్పయిన పట్టాకత్తి, ఉలి, ఎర్రచెకుముకి రాతితో తయారు చేసిన వడిసెలరాయి, జాస్పర్‌ రాతితో చేసిన కోరం దొరికినాయి. తాడిపత్రి దేవాలయం వద్ద వన్నె చిన్నెలు గల మంచి రకం కుండ పెంకులు, నలుపు, పసుపు, ఎరుపు జాస్టర్‌ రాళ్ల పెద్ద పోగు కనిపించాయి. కలమెడె నూరు కొండ మీద నూతన శలాయుగపు జనావాసం కనిపించింది. ఇనుపు యుగం ప్రారంభమవుతున్న ఛాయలు అక్కడ కనిపించినాయి. అక్కడ లాంటి ఆయుధాలే వజ్రకరూరు, ఉరవకొండ, కరకుముక్కల, భోగసముద్రం, హావలిగెమిట్ట, ముచ్చుకొట, జంబులదిన్నె మిట్ట, ఎర్రగుడిమిట్ట, అనంతపురం పట్టణాలలో కూడా దొరికినాయి.


పులివెందుల తాలూకా వేములలో, కడప సమీపంలోని వెల్లటూరులో, కదిరి తాలూకా ముండ్లవారిపల్లె దొరిగల్లులో అనేక తరహాల పనులకుపయోగపడే నూతన శిలాయుగపు పనిముట్లు దొరికినాయి. వెల్లటూరులో దొరికిన చిన్న తోటలో సున్నం లాంటి పదార్థం కనిపించింది. దానిని బట్టి ఆనాడు తాటి కల్లు పరిశ్రమ వుండేదని వూహిస్తున్నారు. ముండ్ల వారి పల్లెలో శంకు చిప్పల కంకణాల పరిశ్రమ గుర్తులు కనిపించినాయి.

About భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి

మేధావిగా, వక్తగా, రచయితగా, రాయలసీమ ఉద్యమకారుడిగా చిరపరిచితుడైన భూమన్ చిన్నతనంలోనే సాహిత్యం పట్ల మక్కువనూ, సమాజం పట్ల ప్రగతిశీల దృక్ఫథాన్నీ పెంచుకున్నారు. తన 18వ ఏటనే చలం ప్రభావంతో కొంతకాలం తిరువన్నామలైలో గడిపారు. 19వ ఏట నక్సల్బరీ, విప్లవ రాజకీయాల పట్ల ఉత్తేజితులై ఎందరో ప్రగతిశీల నాయకులకు సన్నిహితులయ్యారు. 1970 లో విరసం సభ్యుడై ఆ సంస్థ బాధ్యుడిగా కూడా కొంతకాలం వ్యవహరించారు. భారత చైనా మిత్రమండలి లో కూడా ఉన్నారు.

వీరి కవితలు “లే”, “విప్లవం వర్ధిల్లాలి” అనే కవితా సంకలనాల్లోనూ, “రాయలసీమ” పత్రికలోనూ ప్రచురితం అయ్యాయి. 1974లో చిత్తూరు కుట్ర కేసులోనూ, 1975లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) లోనూ అరెస్టు అయి జైలు నిర్భంధానికి గురయ్యారు. 1978లో జనసాహితి స్థాపక సభ్యులయ్యారు. 1984లో రాయలసీమ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు ఆ ఉద్యమ కార్యాచరణ కమిటీకి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రాయలసీమ గొంతుకగా వెలువడుతున్న “కదలిక” పత్రిక సంపాదక సభ్యులుగా ఉన్నారు.

రాయలసీమ ఉద్యమంలో భాగంగా పోతిరెడ్డిపాడుకు సాగిన పాదయాత్ర బృందంలో ప్రముఖ భూమికను పోషించారు. 1990 లో రాయలసీమ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కన్యాశుల్కం నూరేళ్ళ పండుగ, చలం శతజయంతి సభలను ఘనంగా నిర్వహించారు. సీమసాహితి పత్రిక, సంస్థ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు. రాయలసీమ సమస్యలపై వివిధ పత్రికల్లో వందలాది వ్యాసాలను రచించారు. భూమన్ రచించిన రాయలసీమ వ్యాసాల సంకలనం “రాయలసీమ ముఖచిత్రం” అత్యంత ప్రజాదరణను పొందింది. వృత్తి రీత్యా తిరుపతి ఎస్.వి. ఆర్ట్స్ కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకులుగా, శ్వేత డైరెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలను నిర్వహించారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.