మృతజీవులు – 27

-కొడవటిగంటి కుటుంబరావు

ఏడవ ప్రకరణం

ప్రయాసపడి దీర్ఘ ప్రయాణం చేసి; దారిలో చలీ, వానా, బురదా, మజిలీల్లో అధికార్లను నిద్రలేవగొట్టటమూ, మువ్వల మోతలూ, మరమ్మత్తులూ, తగాదాలూ, బళ్లు తోలేవాళ్లూ, కమ్మరులూ, ఇతర మోసగాళ్లూ వీటితో వేగిన ప్రయాణీకుడు చిట్టచివరకు స్వగృహాన్ని చేరవచ్చేటప్పుడు ఎంతైనా ఆనందం పొందుతాడు. అతని మనోనేత్రం ముందు ఇంటి లోపలిభాగాలూ, సంతోషంగా అరుస్తూ తన నౌకర్లు ఎదురు రావటమూ, పిల్లల కేకలూ, పరుగులూ, వారిని ముద్దాడి తియ్యని మాటలు వినటమూ కనిపించి, శ్రమయావత్తూ తుడిచిపెట్టుకు పోతూంది. ఒక ఇల్లూ, పిల్లా జెల్లా గలవాడు ధన్యుడు, బ్రహ్మచారివాడు దౌర్భాగ్యుడు!

అలాగే, విసుగెత్తించే పాత్రలనూ, జుగుప్స కలిగించే పాత్రలనూ వదిలేసి, ఉన్నతాదర్శాలను అంటిపెట్టుకునే పాత్రలను, నిత్య జీవితంలో కనిపించే అసంఖ్యాకులలో అతి అరుదుగా ఉండే బహుకొద్ది మందిని చిత్రిస్తూ, తక్కువైన విషయాలను ఎన్నడూ ప్రస్తావించక, హీనమానవకోటికి ఎంతో ఎత్తున ఉండి, నేలకు దిగిరాకుండా ఉండే రచయిత ధన్యుడు. వాడు ప్రజలకళ్లు సరిగా కనపడకుండా ధూపం వేసేస్తాడు, జీవితంలోని చెడును కప్పిపుచ్చి ప్రజలను అద్భుతంగా జోకొట్టి, ఆదర్శమానవులను ప్రదర్శిస్తాడు. అందరూ హర్షధ్వానాలు చేస్తూ, అతని వెంటబడి, అతని విజయరథం వెనక పరిగెడతారు. అతన్ని మేటి జగత్కవి అంటారు; మిగిలిన పక్షులకంటె ఎత్తుగా ఎగిరే గద్దలాగా ఇతర కవులకు అతీతంగా సంచారం చేసాడంటారు. అతని పేరు వినగానే లేత హృదయాలు అభిమానంతో స్పందిస్తాయి, కళ్ళు చెమ్మగిల్లుతాయి… అతనికి సాటిలేరు -అతను దేవత! కాని, ప్రజల ఎదుట ఎల్లప్పుడూ ఉంటూ, వారి అనాసక్తి కారణంగా ఎన్నడూ వారి కంటబడని విషయాలను – జీవితపు రొచ్చు నిండా ఉన్న భయంకరమైన అల్పవిషయాలూ, దుర్గమమైన మన మార్గంలో తగిలే సాధారణ వ్యక్తులలో దాగి ఉండే విషయాలూ – సాహసించి పైకి తీసుకువచ్చి, పట్టుదలతో మంచి చిత్రించి స్పష్టంగా అందరికీ కనపడేలాగా చేసే రచయిత యొక్క గతి మరొకలాగుంటుంది. అలాటివాడు ప్రజాభినందనకు నోచుకోడు. అతని మాటలకు హృదయాలు స్పందించవు, కళ్ళు చెమ్మగిల్లవు; అతన్ని ఒక గొప్ప వ్యక్తిగా భావించి ఆవేశంతో ఏ పదహారేళ్ళపిల్లా పరిగెత్తుకుంటూరాదు. తానే ప్రేరేపించిన ప్రియవచనాలను సంతోషంగా ఆలకించే భాగ్యం అతడికి ఉండదు. ఆఖరుకు వాడు సమకాలిక విమర్శకుణ్ణి కూడా తప్పించుకోలేడు. కపటమూ, నిర్దాక్షిణ్యమూ గల ఈ విమర్శకుడు అతడి రచనలు హీనమైనవనీ, అల్పమైనవనీ, ఈ రచయిత అధమకవులలో ప్రథముడనీ అంటాడు, అతడి కధానాయకుడి లక్షణాలన్నీ అతడికి అంటగడతాడు, అతడికి హృదయంగాని, ఆత్మగాని, రచనాశక్తిగాని కొంచెం కూడా లేవంటాడు.

ప్లీడరు గుమాస్తాల ఫీజులతో నిమిత్తం లేకుండా క్రయదస్తావేజు తానే రాసి, దాన్ని కాపీ చెయ్యటానికి అతను నిశ్చయించాడు. అతనికి ఆ మతలబులన్నీ తెలుసు, పైన పెద్ద అక్షరాలతో తేదీ వేసి, దానికింద చిన్న అక్షరాలతో ఫలానా భూస్వామి అని రాసి, మిగిలినదంతా రాయవలసిన తీరుగా రాసుకుపోయాడు.

మనం సూర్యుణ్ణి పరిశీలించటానికి ఉపయోగించే టెలిస్కోపూ, సూక్ష్మకణాలను పరిశీలించటానికి ఉపయోగించే మైక్రో స్కోపూ కూడా అద్భుతమైన పరికరాలన్నది ఈ సమకాలిక విమర్శకుడికి తెలీదు. హేయమైన జీవితాంశాలు సమంగానే తీసుకుని దానితో కావ్యరత్నాన్ని సృష్టించటానికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి అవసరమని ఈ సమకాలిక విమర్శకుడెరుగడు. ఉత్తమ తరగతి హాస్యం శృంగార రసానికి ఏ మాత్రమూ తీసిపోదనీ, సంతలో హాస్యగాళ్ళు చూపించే వినోదానికీ, దీనికీ హస్తిమశకాంతరం ఉన్నదనీ సమకాలిక విమర్శకుడు ఒప్పుకోడు. ఈనాటి విమర్శకులిదంతా పట్టించుకోక అజ్ఞాత రచయితను ఖండించి అవమానిస్తారు. ఆ రచయిత సానుభూతీ, సహృదయతా, దాక్షిణ్యమూ సంపాదించలేక, రోడ్డుపక్క దిగబడిపోయిన బ్రహ్మచారి బాటసారిలాగా అయిపోతాడు. వాడు తన దురదృష్టానికీ, ఒంటరితనానికీ విచారిస్తాడు.

నా గ్రహచారంకొద్దీ నేను చాలా ఏళ్ళపాటు నా వింత కథానాయకులతో చెట్టపట్టాలు పట్టుకొని, విస్తృతమైన జీవిత చైతన్యాన్ని అవలోకిస్తూ, ప్రపంచానికి కనపడేలాగ నవ్వుతూ, ప్రపంచం చూడకుండా అశ్రువులు రాలుస్తూ తిరగవలసిన యోగం ఉన్నది. మళ్లీ ఎప్పటికో నాలో మళ్లీ ఆవేశం పొంగి తుఫానును రేగి, నా తల ఉరుములతోనూ, మెరుపులతోనూ నిండిపోయి, మరొక ప్రవాహం ఆవిర్భవించబోతుంది. అద్భుతమైన నా పదగర్జనకు మనుషులు మతులుపోయి గజగజలాడి పోతారు…చాలు, ముందుకు పోదాం! కనుబొమలు ముడి వెయ్యటమూ, కర్కశభావాలూ, నిరాశా కట్టిపెట్టి, జీవితంలోకి అడుగుపెట్టి చిచీకవ్ ఏం చేస్తున్నాడో చూద్దాం.

చిచీకవ్ నిద్రలేచి, కాళ్లూ చేతులూ చాచి, మంచినిద్ర పట్టిందనుకున్నాడు. రెండునిమిషాలపాటు వెల్లికిలా పడుకుని, చిటిక వేసి, తనకిప్పుడు దాదాపు నాలుగువందలమంది కమతగాళ్లున్నారని జ్ఞాపకంవచ్చి సంతోషంతో నవ్వుకున్నాడు. వెంటనే అతను పక్క మీదినుంచి లేచి అద్దంలో తన ముఖంకూడా చూసుకోలేదు. ఆ ముఖమంటే అతనికి చాలా ఇష్టం, తన గడ్డం అతనికి మహా సొంపుగా కనిపిస్తుంది లాగుంది. ఎందుకంటే ఎప్పుడన్నా స్నేహితుల దగ్గిర, ముఖ్యంగా తాను గడ్డం చేసుకోనేటప్పుడు ఎదురుగా ఉన్నవాళ్ల దగ్గిర దాన్ని మహా మెచ్చుకునేవాడు; తన గడ్డాన్ని చేత్తో నిమురుతూ, “నా గడ్డం ఎలా ఉంటుందో చూశారూ, గుండ్రంగా!” అనేవాడు. అయితే ఇప్పుడు తాను తన గడ్డాన్ని గాని, ముఖాన్ని గాని చూసుకొని, ఉన్న పళంగానే డ్రెసింగ్ గౌనూ, మొరాకో బూట్లూ వేసుకున్నాడు; వీటి పై భాగాలు అందంగా, అనేక రంగులు కలిగిఉంటాయి. తోర్ ఝోక్ పట్నంలో తయారయే ఈ బూట్లు, రష్యన్లు సుఖాలు మరిగినవాళ్ళు కావటాన, విరివిగా అమ్ముడవుతాయి. ఆ తరువాత అతను తన పరుపూ, నడివయస్సూ కూడా మరచిపోయి, స్కాట్లండువాడిలాగా గెంతులూ, ఎంతో నేర్పుగా తన మడమలతో వీపును కొట్టుకుంటూ, రెండు దూకుల్లో గది ఇటునుంచి అటు చేరాడు. తరువాత వెంటనే పనికి ఉపక్రమించాడు. నీతినియమం తప్పని జిల్లాజడ్జి మధ్యాహ్న భోజనానికి ఎంత ఆనందంగా బయలుదేరుతాడో అంత ఆనందంతో అతను చేతులు రుద్దుకుంటూ తన పెట్టెను సమీపించి అందులోనుంచి చప్పున కొన్ని కాగితాలు పైకితీశాడు. ఎంతమాత్రమూ జాప్యం లేకుండా ఈ వ్యవహారం పూర్తి చేయాలని అతని సంకల్పం. ప్లీడరు గుమాస్తాల ఫీజులతో నిమిత్తం లేకుండా క్రయదస్తావేజు తానే రాసి, దాన్ని కాపీ చెయ్యటానికి అతను నిశ్చయించాడు. అతనికి ఆ మతలబులన్నీ తెలుసు, పైన పెద్ద అక్షరాలతో తేదీ వేసి, దానికింద చిన్న అక్షరాలతో ఫలానా భూస్వామి అని రాసి, మిగిలినదంతా రాయవలసిన తీరుగా రాసుకుపోయాడు. రెండుగంటల్లో ఆ పని పూర్తి అయింది. తరువాత అతను కమతగాళ్ల జాబితాలకేసి చూసుకుంటే తనకే స్పష్టంగాని ఒక వింతభావం అతన్ని ఆవేశించింది. ఆ కమతగాళ్ళు ఒకప్పుడు నిజమైన పనివాళ్ళు, పనులు చేశారు, పొలాలు దున్నారు, తప్పతాగారు, బళ్లు తోలారు, యజమానులను మోసగించారు, లేదా మంచి కమతగాళ్ళు అయినా అయి ఉంటారు. ప్రతి జాబితాకూ ఒక ప్రత్యేకత వున్నది. కమతగాళ్లకు కూడా ఏదో వ్యక్తిత్వం ఉన్నట్టే ఉన్నది. కరబోచ్క సతి జాబితాలో వాళ్లందరి పేర్లూ పెట్టుడు పేర్లలాగా, వర్ణనల్లాగా ఉన్నాయి; ప్ల్యూష్కిన్ జాబితాలో అతి సంగ్రహంగా ఉండి, పేర్ల ముందు పొడి అక్షరాలు మాత్రమే ఉన్నాయి; సబాకివిచ్ జాబితా చాటభారతం, దానినిండా మనుషుల వర్ణనలూ, వివరాలూనూ; ఒకడు పెట్టెలు చెయ్యటంలో నిపుణుడట, మరొకడు తన పని చక్కగా గ్రహిస్తాడుట, సారా ముట్టడుట; వాళ్ల తల్లిదండ్రుల పేర్లూ, వాళ్ల ప్రవర్తనా కూడా వివరించి ఉన్నది; ఒక్క పిదోతన్ అనేవాణ్ణి గురించి మాత్రమే, “తండ్రి తెలియదు; కపితోలిన అనే దాసిపిల్లకు పుట్టినవాడు. అయితే బుద్ధిమంతుడు, దొంగ కాడు” అని రాసి ఉన్నది. ఈ వివరాలన్నీ చూస్తుంటే, వాళ్ళందరూ నిన్న కూడా బతికేవున్నట్టుగా ఉన్నది. ఈ పేర్లన్నిటినీ చాలాసేపు చూసుకున్నాక అతను “తస్సదియ్య, ఇందులో ఎంతమంది ఇరికివున్నారర్రా! మీ కాలంలో మీరంతా ఏంచేసేవాళ్ళు? ఎలా బ్రతికారు?” అన్నాడు. అప్రయత్నంగా అతని కన్ను ఒక పేరుపైన పడింది అది ప్యోతర్ సవిల్యేన్ (తొట్టెను లక్ష్య పెట్టనివాడు) అన్న పేరు. ఈ మనిషి ఒకప్పుడు కరబోచ్కసతి సొత్తని పాఠకులకు తెలుసు. అతను మళ్ళీ పైకి మాట్లాడుతూ “నీ దెంత పొడుగుపేరురా, పంక్తి అంతా నిండింది! నువు వృత్తి ఏదన్నా నేర్చినవాడివా, కూలిపనివాడివా? ఏం వచ్చి పోయావు? బీరు దుకాణం మూలాన పోయావా, లేక దారికి అడ్డంగా పడుకునివుంటే మీదుగా బండి వెళ్ళిందా? ‘ప్రోబ్కస్తిపాన్, వడ్రంగి, ఎన్నడూ తాగి ఎరగడు.’ ఒహో! వీడే, వీడే ప్రోబ్కస్తిపాన్. సైన్యంలో చేరదగిన ఆజానుబాహుడు! వాడు గొడ్డలి రొండిన పెట్టుకుని, బూట్లు భుజాన వేళ్లాడేసుకుని రొట్టెముక్కా, రెండు ఎండు చేపలూ తిని పొట్టనించుకుంటూ, దేశదేశాలూ తిరిగాడు. ప్రతిసారీ నూరు వెండిరూబుళ్ళ సంచితో ఇంటికి తిరిగివచ్చి వుంటాడు; సందేహం లేదు! ఇంతకూ నువ్వెక్కడ చచ్చిపోయావు! కూలిడబ్బులు బాగా ముట్టుతాయని చర్చి గోపురం మీద పని చెయ్యటానికి ఎక్కి శిలువ కూడా ఎగబాకి, అడ్డదూలం జారి దభాల్న కిందబడితే, పక్కనే నిలబడి ఉన్న మిల్హె మామ బుర్ర గోక్కుని, “అయ్యో, వాన్య. అనుకున్నంతా చేశావే!” అనుకుని, తాడు ఎగబాకి నీ స్థానంలో పని చెయ్యటానికి వెళ్ళి ఉంటాడు ‘మక్సీమ్ తిల్యాత్నికవ్, బూట్లు కుట్టేవాడు! బూట్లు కుట్టేవాళ్ళు బుడ్దికి దాసులని సామెత. నేను నిన్నెరుగుదునురా, అబ్బీ కావాలంటే నీ చరిత్ర అంతా చెప్పగలను. ఒక జర్మనుకింద నువు పనినేర్చుకున్నావు, వాడు మిమ్మల్నందరినీ కలిపి తిండిపెడుతూ, అజాగ్రత్తగా ఉన్నప్పుడల్లా తోలుపట్టాతో వీపులు పగలగొట్టేవాడు, మిమ్మల్ని వీధుల్లో బలాదూరు తిరుగనిచ్చేవాడు కాడు. నువు గొప్ప పనిమంతుడివి, మామూలుగా బూట్లుకుట్టే వాళ్ళలాటి మనిషివి కావు. జర్మను పెళ్లాం దగ్గిరా, తోటివాళ్ళదగ్గిరా నిన్ను తెగ మెచ్చుకునేవాడు. పని నేర్చుకోవటం అయాక నువు సొంతాన దుకాణం పెట్టాలనీ, జర్మనులాగా దమ్మిడీలు లాభంతియ్యకుండా, ఒక్కసారిగా ధనికుడై పోవాలనీ అనుకున్నావు. అందుకుగాను నువు నీ యజమానికి వెట్టికి బదులుగా పెద్దమొత్తంలో డబ్బిచ్చుకుని, ఆర్డర్లు పోగుచేసుకుని పనిసాగించావు. చీకిపోయిన తోలుముక్కలు సంపాదించి వాటితో బూట్లు తయారు చేసి, వాటి ఖర్చుకు ఇబ్బడిగా లాభం చేసుకున్నావు. ఒకటి రెండు వారాలకల్లా నీ బూట్లు పగిలిపోయేసరికి అందరూ నిన్ను బండబూతులు తిట్టారు.నీ దుకాణానికి రావటం మానేశారు.” నువు తాగుడు అలవాటు చేసుకుని, వీధుల వెంట తారట్లాడుతూ, “బతుకేమి బాగా లేదు. అడుగడుగునా జర్మనులు అడ్డం తగులుతుంటే రష్యనులు బతికేదెలా?” అనుకున్నావు. “అరె, ఇదేం కమతగాడు? ఎలిజవెత వరబేయ్! ఛీ. నీ తాడు తెగ, ఆడదానివా? ఇందులోకి ఇది ఎలా వచ్చింది? దొంగముండాకొడుకు సబాకివిచ్ చేసిన పనే!”

చిచీకవ్ పొరవడలేదు, ఆమె ఆడదే. ఆమె ఈ జాబితాలోకి ఎలా వచ్చిందో తెలియదు, కాని ఆమెను చాలా తెలివిగా, చప్పున చూస్తే మగవా డనిపించేలాగ ఇరికించారు. ఆమె పేరుకూడా ‘ఎలిజవెతా’ అని రాసి ఉండక ‘ఏలిజవెత్ ‘ అని రాసిఉంది. అతను ఆ పేరును వెంటనే కొట్టేశాడు. “గ్రిగోరీ ఎన్నటికీ చేరనివాడు! నువు ఎలాటి మనిషివి? నువు సరుకులు చేరవేసేవాడివా? నీకు మూడు గుర్రాలూ, గోతంకప్పిన బండీ ఉండేవా? నువు ఎన్నడూ ఇంటి మొహం చూడకుండా, వర్తకుల వెనకాడితే సంతలకు తిరుగుతుండే వాడివిగామాలు? నువు రోడ్దుమీదనే ప్రాణాలు వదిలి దైవసాన్నిధ్యం చెందావా లేక ఏ సిపాయి భార్యో అయిన ఎర్రబుగ్గల, బొద్దుపిల్ల కారణంగా నీ అనుచరులే నీ దీపం ఆర్పేశారా, లేక నీ తోలు చేతితొడుగుల మీదా, పొట్టికాళ్ల గట్టి గుర్రాలమీదా కన్నేసి ఏ అడవిలో ఉండే తిరుగుబోతో అంత పని చేశాడా, లేక నువే నీ చెక్కలమంచం మీద పడుకుని ఆటే ఆలోచించి ఉత్తపుణ్యానికి బీరు దుకాణానికి వెళ్ళి, అక్కడినుంచి తిన్నగా మంచంలో ఉండే కోంతకు నడిచి అందులోపడి మళ్లీ కనిపించకుండా పోయావా? ఆహా, ఈ రష్యను ప్రజలు! వీళ్లకు సహజంగా చావాలని ఉండదు గద! మరి మీ అందరి మాటా ఏమిట్రా, అబ్బాయిలూ?” అంటూ చిచీకవ్ పారిపోయిన ప్ల్యూష్కిన్ కమతగాళ్ళ జాబితాను పరిశీలించాడు. “మీరు బతికున్నారే గాని, ఏం ప్రయోజనం? చచ్చినవాళ్ళ లోపమే! మీ పిక్కబలం మిమ్మల్ని ఇప్పుడెక్కడికి చేర్చింది? ప్ల్యూష్కిన్ తో వేగ లేక పోయావా, లేక మీ అనందంకోసమే అడవుల్లో తిరుగుతూ, ప్రయాణీకులను దోచుకుంటున్నారా? మీరు ఖైదుల్లో పడ్డారా. లేక ఇతర యజమానుల అండచేరి వ్యవసాయం చేస్తున్నారా?” యెరేమి కర్యాకిన్, నికీట ఫ్లిట్టర్, వాడి కొడుకు అంతోన్ ఫ్లిట్టర్. వాళ్ళ పేర్లు చూస్తేనే పిక్కబలం గల వాళ్లని తెలుస్తున్నది . (‘కర్యేర్’ అంటే రష్యను భాషలో వేగమైన సవారి. ఫ్లిట్టర్ అనే మాట ఇంగ్లీషు అనువాదకుడి ప్రయోగంలాగా కనబడుతుంది, ఫ్లిట్ అంటే ఇంగ్లీషులో ఇంకొక చోటికి పోవడం, వేగంగా కదలటం అని అర్థం. — అనువాదకుడు) పపోన్, ఇంటి నౌకరు… చదవటమూ, రాయటమూ నేర్చినవాడై ఉండాలి. వాడెన్నడూ కత్తి చేతపట్టి ఉండడు, సందేహం లేదు, దొంగతనాలన్నీ పెద్దమనిషి తరహాగానే చేసిఉంటాడు. ఇంతలో నిన్ను పోలీసు అధికారి పట్టుకుని నీ దగ్గిర పాస్‌పోర్ట్ లేకపోవటం చూసి ఉంటాడు, వాళ్లు నిన్ను సోదా చేస్తుంటే నువు ధైర్యంగానే జవాబు చెప్పి ఉంటావు. పోలీసు అధికారి నీమీద సందర్భోచితమైన ఘాటుమాటలు కొన్ని ప్రయోగించి, ‘ఎవరి ఇలాకామనిషివి?’ అని అడిగి ఉంటాడు. ‘ఫలానా’. అని తడువుకోకుండా చెప్పి ఉంటావు. ‘ఇక్కడెందుకున్నావు?’ అంటాడు పోలీసు అధికారి, ‘సొమ్మిచ్చి సెలవుతీసుకుని వచ్చాను ‘ అని సంకోచించకుండా జవాబిస్తావు. ‘నీ పాస్‌పోర్ట్ ఏదీ?’ ‘నా యజమాని పిమేనీవ్ కిచ్చాను.’ ‘పిమేనీవ్ ను పిలు…’ మీరేనా పిమేనీవ్?’ ‘నేనే పిమేనీవ్ ను ‘. ‘వీడు తన పాస్‌పోర్ట్ మీ కిచ్చాడా?’ ‘లేదు, నా కివ్వనేలేదు ‘. ‘ఎందుకు అబద్ధమాడావు?’ అంటాడు పొలీసు అధికారి. నువు ధైర్యంగా, ‘నేను ఇంటికి ఆలస్యంగా వెళ్ళాను, అందుచేత ఆయన కివ్వలేదు. గంటవాయించే అంతీప్ ప్రఖోరవ్ కిచ్చా, భద్రంగా ఉంచమన్నాను ‘. ‘గంట వాయించేవాణ్ణి పిలు… వీడు నీకు తన పాస్‌పోర్టిచ్చాడా?’ ‘లేదు, వాడు నాకు పాస్‌పోర్ట్ ఏమీ ఇవ్వలేదు.’

‘మళ్లీ అబద్ధమాడుతున్నావూ?’ అంటాడు పోలీసు అధికారి. మరికొన్ని ఘాటుమాటలు ప్రయోగించి, ‘నీ పాస్‌పోర్ట్ ప్రయోగించి, ‘నీ పాస్‌పోర్ట్ ఎక్కడ?’ ‘నాకు ఉండేదే. ఒకవేళ దారిలో ఎక్కడన్నా పడిపోయిందేమో?’ పోలీసు అధికారి మరికొన్ని ఘాటైన మాటలు విసిరి, ‘అయితే సిపాయి వాడి పైకోటూ, రాగిడబ్బులతో సహా ప్రీస్టు పెట్టే ఎందుకు దొంగిలించావు?’ అంటాడు. నువు తొణకకుండా, ‘ఇంతవరకెన్నడూ నేను కూడనిపని చేసి ఎరగను ‘, అంటావు ‘అయితే మరి ఆ పైకోటు నీ దగ్గిరి కేలా వచ్చింది?’ ‘నేను చెప్పలేను. ఇంకేవరన్నా తెచ్చారేమో’ పోలీసు అధికారి రొండిన చేతులు పెట్టుకునిలబడి, తల ఆడిస్తూ, ‘ఓరి పశువా!’ అని, ‘వాడి కాళ్లకు సంకెళ్లు తగిలించి ఖైదులో పడెయ్యండి ‘ అంటాడు. ‘మరీమంచిది. అలాగే పోతాను ‘ అంటావు. నువు పొడుం డబ్బీ తీసి, నీ కాళ్లకు సంకెళ్లు తగిలించే ముసలి పోలీసులకు ఇస్తూ, వారు సైన్యాన్ని వదిలిపెట్టి ఎంత కాలమయిందనీ, ఏమేమి యుద్ధాల్లో పోరాడారని అడుగుతావు. తరువాత నీ విచారణ ఆరంభమయేదాకా ఖైదులో గడుపుతావు. నిన్ను త్సరేవొ-కొక్షాయ్కిన్ జైలునుంచి మరొక పట్నంలోని జైలుకు మార్చమని జడ్జి ఉత్తరు విస్తాడు, అక్కడినుంచి న్యాయస్థానంవారు నిన్ను వెస్వేగాన్స్క్ కు బదిలీ చేస్తారు. ఇలా నువు ఒక ఖైదుంచి ఇంకొక ఖైదుకు మారతావు, కొత్తచోటికి రాగానే, ‘వెస్యేగాన్స్క్ జైలు ఇంకా బాగున్నది. అక్కడ స్కిటిల్స్ ఆడుకునేటందుక్కూడా జాగా ఉన్నది. తోడు చాలామంది ఉన్నారు అనుకుంటావు.

“అబాకుమ్ ఫీరవ్! నీ సంగతి ఏమిట్రా అబ్బీ? ఇప్పుడెక్కడ సంచారం చేస్తూన్నావు? వోల్గా తీరాన్ని చేరుకుని, స్వేచ్ఛాజీవితం రుచిమరిగి, లాగుడు మనుషుల్లో చేరిపోయావా?” చిచీకవ్ ఈ ధోరణి కట్టిపెట్టి ఏదో ఆలోచనలో పడిపోయాడు. అతను ఆలోచించేది దేన్ని గురించి? అబాకుమ్‌ఫీరవ్ గతినిగురించా? రష్యనులందరూ, తమ వయసుతోనూ, హోదాతోనూ, పరిస్థితులతోనూ ప్రమేయంలేకుండా సాహసోపేతమూ, ఉత్సాహజనకమూ అయిన జీవితం గురించి పగటికలలు కనేతీరుగా ఇతనుకూడా తనను గురించే పగటికలలు కంటున్నాడా? నిజంగా ఫీరవ్ ఇప్పుడెక్కడ ఉన్నాడు? వాడు ధాన్యపురేవులో వర్తకులతో బేరాలు చేస్తూ సుఖంగానూ, సంతోషంగానూ జీవిస్తున్నాడు. టోపీలలో రిబ్బన్లూ, పూలూ పెట్టుకుని లాగుడు మనుష్యులంతా పరమానందంలో ఉన్నారు. పూసలపేర్లూ, రిబ్బన్లూ ధరించి, ఒడ్డు పొడవుగాఉండే తమ భార్యలవద్దా, స్త్ర్రీల వద్దా వీడ్కోలు తీసుకుంటున్నారు. ఆ ప్రదేశమంతా చాలా సందడిగా ఉన్నది. ఒక వంక అరుపులూ, తిట్లూ, ప్రోత్సాహవచనాలూ సాగుతూండగా కూలీలు, పన్నెండు పదమూడేసి మణుగుల బరువుగల బస్తాలు వీపుల్నెత్తుకుని తెచ్చి, పడవలలో బటానీలూ, గోధుమలూ పోసేస్తున్నారు. సంచులలో ఓట్లూ, మొక్కజొన్నా తెచ్చి పేర్చుతున్నారు. సరుకుల రేవులో ఎక్కడ చూసినా ఈ సంచులు ఫిరంగి గుండ్లలాగా పేర్చి కనిపిస్తున్నాయి. పడవల్లోకి ఎక్కంచేదాకా ఈ రాసులిలాగే ఉంటాయి. వసంతకాలంలో మంచు కరగటం ప్రారంభమయాక అంతులేని పడవలబారు కదిలి ప్రయాణమైపోతుంది. అప్పుడు లాగుడు మనుషులకు పనిపడుతుంది! అదివరకు ఆనందించినట్టే ఇప్పుడు అందరూకలిసి శ్రమిస్తూ, చెమటోడ్చుతూ తాడుపట్టి లాగుతూ, పాటపాడతారు. రష్యాకులాగే ఆ పాటకూ అంతుండదు.

చిచీకవ్ చివరకు గడియారం చూసుకొని, “ఓహో, పన్నెండయిందే! నే నెందుకిలా కాలయాపన చేస్తున్నానూ? పోనీ ఏదన్నా పనిమీద ఉంటే అనుకోవచ్చు, వట్టినే కూచుని స్వాగతం చెప్పుకుని, పగటికలలు కంటూ కూచుంటినే. ఎంత మతిమాలినవాణ్ణి!” అనుకున్నాడు. ఇలా అనుకుంటూనే అతను స్కాట్లండు ఉడుపు తీసేసి యూరోపియన్ దుస్తులు ధరించాడు, తన గుండ్రని పొట్టమీద బెల్టు గట్టిగా బిగించాడు, మీద ఉడుకులాం చల్లుకున్నాడు, తన చలిటోపీ తీసుకొని, కాగితాలు చంకనబెట్టుకొని తన క్రయదస్తావేజు పని పూర్తి చేసుకునేటందుకు ప్రభుత్వకచేరీకి బయలుదేరాడు. అతను తొందరపడింది టైము మించిపోతుందని భయంవల్లకాదు-టైము మించిపోతుందన్న భయం అతనికి లేదు, ఎందుచేతనంటే అతను అధ్యక్షుణ్ణి ఎరుగును. హోమర్ మహాకవి కావ్యాలలో దేవతల పెద్ద అయిన జియస్ తన అభిమాన వీరుడికి యుద్ధంలో అనుకూలపడేలాగా పగటి కాలాన్ని తగ్గించటమూ, పొడిగించటమూ చేసినట్టుగా ఈ అధ్యక్షుడు తన ఇష్టంవచ్చినట్టు కచేరి పనిచేసే కాలాన్ని తగ్గించగలడు, పొడిగించగలడు-కాని ఈ వ్యవహారం సాధ్యమైనంత త్వరలో తెముల్చుకోవాలనిపించింది; ఈ పని పూర్తి అయితేగాని అతనికి మనస్థిమితం కలిగేటట్టు కనుపించలేదు, ఈ కమతగాళ్ళు వాస్తవ వ్యక్తులు కారన్న భావం అతన్ని వేధిస్తూనే ఉన్నది, అలాటి బరువును తనమీదనుంచి ఎంత త్వరగా దించెచేసుకుంటే అంతమంచిది. ఇలా అనుకుంటూ, గోధుమవర్ణం గుడ్డ కప్పిన ఎలుగుబంటిచర్మపు పైకోటు భుజాలమీద సరిచేసుకుంటూ అతను వీధుల్లోకి వెళ్లి, పక్క సందులోకి తిరిగాడోలేదో, అతనికి మరొక పెద్దమనిషి, గోధుమవర్ణం గుడ్డ కప్పిన ఎలుగుబంటి చర్మపు పైకోటూ, చెవులకు అడ్డంగా మూతలూ ధరించి ఎదురయాడు. ఆ పెద్దమనిషి గట్టిగా అరిచాడు-అతను మానిలవ్, వెంటనే ఇద్దరూ గాఢాలింగనం చేసుకుని నడివీధిలో అయిదునిమిషాలపాటు అలాగే ఉండిపోయారు. వారిద్దరూ ఒకరి నొకరు ఎంత అప్యాయతతో ముద్దు పెట్టుకున్నారంటే ఆ రోజల్లా ఇద్దరి ముందుపళ్లూ సలుపుతూనే ఉన్నాయి. మానిలవ్ పొందిన ఆనందంలో అతని కళ్లు కాస్తా అదృశ్యమైపోయి, ఆయన ముఖంలో ముక్కూ, మూతీ మాత్రమే మిగిలాయి. ఒక పావుగంటసేపు ఆయన చిచీకవ్ చేతిని తన రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకొని విపరీతంగా వేడి ఎక్కించేశాడు. ఆయన అతినాగరీకంగా మాట్లాడుతూ చిచీకవ్‌ను ఆలింగనం చేసుకోవటానికి తాను ఎలా వేగంగా వచ్చి వాలాడో వర్ణించి, నృత్యాల సమయంలో యువతులను ప్రశంసించటానికి పనికివచ్చే మాటలతో అతన్ని ప్రశంసించాడు. ఆయనకు తన కృతజ్ఞత తెలుపుదామని చిచీకవ్ నోరు తెరిచాడుగాని ఏమనాలో అతనికి తెలియలేదు. అంతలోనే మానిలవ్ తన కోటు కిందనుంచి గులాబిరంగు రిబ్బను కట్టిన కాగితాల చుట్ట ఒకటి పైకి తీశాడు.

ఈ గుమాస్తాలకు అందరు గుమాస్తాల్లాగే ప్రతిదీ కావాలనీ, వారు తాము చేసేపనికి అధిక ప్రాముఖ్యం ఆపాదించుకుంటున్నారనీ చిచీకవ్ గ్రహించాడు.

“చూడండి, బాబులూ, కమతగాళ్ల అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ, ధరలతో నిమిత్తం లేకుండా, ఒక చోటే చూస్తారని నాకు తెలుసు. కనక ఆది ఏ బల్లవద్దో చూపించండి. మీ అఫీసులో ఏం జరిగేది మీకే తెలియకపోతే మరొకర్ని అడిగి కనుక్కుంటాను,” అన్నాడతను.

“ఏమిటది?”

“కమతగాళ్లు,”

“ఓహో!” అంటూ అతను చుట్టవిప్పి చూసుకుని, దస్తూరి అందాన్ని మెచ్చుకుంటూ, “చాలా బాగుంది, దీన్ని తిరగరాయను కూడా అక్కర్లేదు. అన్ని వైపులా మార్జిన్ల నిమిత్తం రూబుళ్ళున్నాయి. ఈ రూళ్ళను ఇంతచక్కగా వేసినది ఎవరు?”

“మీరలా అడగగూడదు” అన్నాడు మానిలవ్.

“మీరేనా ఏమిటి?”

“నా భార్య”

“అరెరే, ఎంత శ్రమ ఇచ్చానూ!”

“పావెల్ ఇవానవిచ్ కోసం ఎంత శ్రమ అయినా ఫరవాలేదు.”

చిచీకవ్ ఈ ఆదరణలను తలవంచి స్వీకరించాడు. క్రయంపని పూర్తిచేసుకునేటందుకు అతను కచేరీకి వెళుతున్నట్టు తెలుసుకొని మానిలవ్ తానుకూడా వెంటవస్తానన్నాడు. ఇద్దరూ చేతులుపట్టుకుని నడవసాగారు. గట్టయేది, మెట్టయేది, రోడ్డులు కొంచెం ఎత్తువచ్చినప్పుడల్లా మానిలవ్ చిచీకవ్‌కు ఊత ఇచ్చి, దాదాపు మనిషినే ఎత్తేసినంతపనిచేసి, తియ్యగా నవ్వుతూ పావెల్ ఇవానవిచ్ గారి బంగారుపాదాలు కందిపోరాదన్నాడు. చిచీకవ్‌కు చచ్చేసిగ్గేసిపోయింది, తన కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలీదాయె, తాను తక్కువ బరువు మనిషి కాడాయె. ఈవిధంగా ఒకరునొకరు సంబాళించుకుంటూ వారు చివరకు ప్రభుత్వ కచేరీలుండే కూడలి చేరారు. కచేరీలు పెద్ద మూడంతస్తుల ఇటుకల భవంతిలో ఉన్నాయి. లోపలి కచేరీల హృదయం నిర్మలంగా ఉంటుందిసుమా, అని చెప్పటానికి కాబోలు భవంతికి తెల్లని తెలుపురంగు వేశారు. ఆ వీధిలో ఉన్న ఇతర కట్టడాలు ఈ ఇటుకల భవంతికి ఈడు వచ్చేవికావు. వాటిలో ఒకటి కాపలా వాడు నిలబడే గూడు, అందులో ఒక సిపాయి తుపాకితో సహా నిలిచి ఉన్నాడు. మరొకటి బళ్లు నిలిచే చోటు. ఆ తరవాత ఒక నిడుపైన ప్రహరీగోడ; ప్రహరీగోడల మీద విధిగా కనిపించే బొగ్గుతో రాసిన అక్షరాలూ, బొమ్మలూ దీని మీద కూడా ఉన్నాయి. ఈ నిర్జన ప్రదేశంలో – కొందరు దీన్నే రమణీయ ప్రదేశం అంటారు – మరేదీలేదు. పై అంతస్తుల కిటికీల వద్ద న్యాయ దేవతార్చకుల నీతికి కట్టుబడిన తలలు కనిపించినట్టే కనిపించి మాయమయాయి. అప్పుడే పై అధికారి వారి గదిలోకి వచ్చాడు కాబోలు. స్నేహితులు మెట్లను ఎక్కారనటం కంటే ఎగపరిగెత్తారనటం భావ్యంగా ఉంటుంది. ఎందుకంటే, మానిలవ్ తనకు ఊతం ఇవ్వబోతాడేమోననే భయంతో చిచీకవ్ మెట్లను వేగంగా ఎక్కాడు. ఎలాగైనా చిచీకవ్‌కు ఊతం ఇద్దామనే సంకల్పంతో మానిలవ్ తరుముకుంటూ వచ్చాడు. ఇద్దరూ పైకి వచ్చి రొప్పసాగారు. పైనగల కారిడార్ గాని, గదులుగాని శుభ్రంగా ఉన్న సంగతి కొట్టవచ్చినట్టు కనిపించటం లేదు. అయితే ఆ రోజుల్లో దాన్ని గురించి ఎవరూ పట్టించుకోలేదు. అసహ్యంగా ఉన్నదాన్ని అసహ్యంగా ఉండనిచ్చారే తప్ప, పై మెరుగుల కోసం ఎవరూ ప్రయత్నించలేదు. అందుచేత న్యాయదేవత వారికి సాదా దుస్తులతోనే ఎదురువచ్చింది. మన కథానాయకులు గడచిన ఆఫీసు గదులను వర్ణించటం ధర్మమే, కాని రచయితకు అలాటి స్థలాలంటే చాలా భయం. అవి మెరుగు పెట్టిన గచ్చుతోనూ, బల్లలతోనూ, కళకళలాడుతూ ఉండినప్పటికీ ఈ కథకుడు తలవంచుకుని సాధ్యమైనంత శీఘ్రంగా వాటిని దాటుకుంటూ వెళ్లాడేతప్ప, అవి ఎంత వైభవంగా ఉన్నదీ, ఘనంగా ఉన్నదీ గమనించి ఉండలేదు.

అంతులేని కాగితాలు, చిత్తులూ, సాఫులూ, వంచినతలలూ, లావుపాటి మెడలూ, డ్రెస్ కోటులూ, ఫ్రాక్ కోటులూ, వీటన్నిటి మధ్యా విలక్షణంగా ఒక బూడిదరంగు జాకెట్టు దాన్ని ధరించిన మనిషి తల ఒక పక్కకు వంచి దాదాపు కాగితాన్ని తగిలేలాగ పెట్టి, పెద్ద అక్షరాలతో రాస్తూండడమూ మన కధానాయకుడికి కనబడింది; ఆ మనిషి రాసేది అక్రమంగా స్వాధీనపరుచుకున్న భూమి తాలూకు వ్యాజ్యం గెలిచిన బాపతు రిపోర్టు అయి ఉంటుంది. లేదా ఏదైనా ఎస్టేటు తాలూకు ఇన్వెంటరీ అయి ఉంటుంది; ఆ ఎస్టేటులో జీవించే పెద్ద మనిషి వట్టి అమాయకుడు, వ్యాజ్యం గొడవే పట్టించుకోకుండా తననూ, తన పిల్లలనూ, మనుమలనూ పోషించుకుంటూ వస్తుంటాడు. అప్పుడప్పుడూ బొంగురు గొంతులతో పలికే చిన్న చిన్న వాక్యాలు వినిపిస్తున్నాయి. “దయచేసి 368 నంబరు కేసిలా ఇవ్వండి, షిదోసెయి ఫిదోసెయిచ్”, “ఎప్పుడూ ఆఫీసు సిరాబుడ్డి మూత పట్టుకుపోతారేం?” మధ్యమధ్య మరింత గంభీరమైన గొంతు, బహుశా ఎవరో అధికారిది, దర్పంగా పలికింది; “దాన్ని మళ్లీ కాపీ చెయ్యి, లేకపోతే నీ బూట్లుకాస్తా లాగేసుకుంటారు; ఆరు పగళ్లూ, ఆరు రాత్రులూ తిండిలేకుండా ఇక్కడే పడి ఉండాలి!” కలాల బరుకుడు పెద్దగా వినపడింది. ఆ చప్పుడు చిట్టడవిలో ఎండుటాకుల మీదుగా బండి నడిచినట్లుగా ఉంది.

చిచీకవ్ మానిలవ్ లు మొట్టమొదటి బల్లవద్దకు వెళ్లి అక్కడ కూచున్న ఇద్దరు గుమాస్తా కుర్రాళ్లను, “క్రయదస్తావేజులు తీసుకునేది ఎక్కడో కాస్త చెబుతారా?” అని అడిగారు.

“మీకేం కావాలేం?” అని ఇద్దరు గుమాస్తాలూ వెనక్కు తిరిగి ప్రశ్నించారు.

“ఒక దరఖాస్తున్నది.”

“ఏం కొన్నారేం?”

“నాకు ముందు అమ్మకాల వ్యవహారం చూసేది ఎక్కడో చెప్పండి-ఇక్కడా, మరొక చోటా?”

“మీరేం కొన్నదీ, ఎంతకు కొన్నదీ తెలియజేస్తే ఎక్కడో చెబుతాం, లేకపోతే చెప్పలేం.”

ఈ గుమాస్తాలకు అందరు గుమాస్తాల్లాగే ప్రతిదీ కావాలనీ, వారు తాము చేసేపనికి అధిక ప్రాముఖ్యం ఆపాదించుకుంటున్నారనీ చిచీకవ్ గ్రహించాడు.

“చూడండి, బాబులూ, కమతగాళ్ల అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ, ధరలతో నిమిత్తం లేకుండా, ఒక చోటే చూస్తారని నాకు తెలుసు. కనక ఆది ఏ బల్లవద్దో చూపించండి. మీ అఫీసులో ఏం జరిగేది మీకే తెలియకపోతే మరొకర్ని అడిగి కనుక్కుంటాను,” అన్నాడతను. గుమాస్తాలు మాట్లాడలేదు. వారిలో ఒకడు వేలిని ఒక మూలకేసి విసిరాడు. ఆమూల ఒక ముసలాయన ఏదో రాసుకుంటున్నాడు. చిచీకవ్, మానిలవ్ బల్లల మధ్యనుంచి ఆయనవద్దకు వెళ్లారు. ముసలాయన తన పనిలో మరింత నిమగ్నుడై పోయాడు.

“అయ్యా, క్రయదస్తావేజుల తాలూకు దరఖాస్తులు తీసుకునేది ఇక్కడే నేమో దయచేసి చెబుతారా?” అని చిచీకవ్ వంగి అడిగాడు.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.