ఒక్కవానచాలు

– స్వాతీ శ్రీపాద

కొత్త దుప్పటి కథాసంపుటిలో నాలుగో కథ ‘ఒక్కవానచాలు’. అచ్చ రాయలసీమ నుడికారంతో మొదలవుతుంది – ‘రాత్రి పదిగంటలు దాటినా మా యవ్వారం ఆగలేదు’ అంటూ. కథలు పురి విప్పడం, పద్యాలు గొంతుసవరించుకోడం, ఆకాశాన్ని ఎండిపోయి గవ్వలు బైటపడిన చెరువుతో పోల్చడం, దుప్పటి పొడవున్న నల్లటి మేఘపు తునక చందమామ వెన్నెల నవ్వుల్తో బయటకు రావడం లాంటి మాటల్లో రచయిత భావుకత్వం వెల్లడౌతుంది.

ఒక్క వాన చాలు

వాన మాట విన్పిస్తే చాలు
చెవులు – అలుగుల్ని సవరించుకొనే చెరువులవుతున్నాయి
మేఘాల నీడలు కదిలితే చాలు
కళ్లు – పురివిప్పే నెమళ్ళవుతున్నాయి

కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై
పైరు చెక్కిళ్లమీద జాలిగా జారుతోంది
ఉత్తర ప్రగల్భాల ఉరుముల్తో ఉత్తర కూడ దాటింది
ఒక్క వాన వొంగితే చాలు
ముక్కాలు పంటన్నా చేతికొస్తుంది

ఎన్ని సాయంత్రాలు రేడియోల ముందు సాగిలబడ్డామనీ !
ఎన్ని సార్లు – జలరేఖల్ని లెక్కగట్టే ముసలాళ్ళ ముందు
బీడీ ముక్కలమై మినుకు మినుకుమన్నామనీ !
ఎన్ని రాత్రిళ్ళు – ఆరుబైట మంచమేసికొని
ముద్ద ముద్దగా తడిసి మంచాన్ని ఇంట్లోకి మార్పించే వాన కోసం
పడిగాపులు కాశామనీ !

రిక్త హస్తాలతో హస్తకార్తె కూడ దాటింది
ఒక్క పదనయితే చాలు
సగం పంటన్నా చేతికొస్తుంది

వాడి మాడే పైరు | మా గుండెలపై
కదిపిన కందిరీగల పట్టు అవుతోంది
నెర్రెలెత్తి వెర్రిదైన భూమి- మా నొసటిపై
రక్తపింజర్ల కలివెతుట్టె అవుతోంది

ఆకుల మీది మచ్చలు ఏ పోషకాల లోపంవల్లా కాదు
పొడి ఆహారానికి వేరు నోరంతా పిడచగట్టుకు పోవటంవల్లే

చిత్తాన్ని చిత్తు చిత్తుజేస్తూ చిత్తకార్తె కూడ దాటింది
ఒక్క వాన మోదు చాలు
పాతిక పంటన్నా చేతికొస్తుంది

బాగున్న చెరువులుండవు – నీరున్న బోరుబావులుండవు
నదుల గుండె తడిని విన్పించే చిట్టి కాలువలుండవు
ఓట్లకు తప్ప మరెందుకూ పనికిరాని యీ గడ్డమీద
వరుణదేవుడికి కూడ శీతకన్నే

మోరపైకెత్తిన యీ ఆరడుగుల ఆశలకుప్ప
రోజుల తరబడి శిలావిగ్రహమవుతోంది
చురుక్కుమని పొడిచే ఎండముల్లులు తప్ప
ఒక్క చినుకు కూడా రాలదు –
మాడి మసై పోతోన్న పైరు కన్నీటి చుక్కలై
నా కళ్ళు మేఘాల్లోంచి జారటం తప్ప

స్వాతిశయపు నిర్లక్ష్యంలో స్వాతికార్తె కూడా దాటింది
ఇప్పుడయినా ఓ చినుకురాలితే
విత్తనాలయినా దక్కుతాయి

కథలోనూ ఉత్తర కార్తె ఊసెత్తి కాలమానాల్ను తెలియబరచడం, తూర్పుగాలుల ప్రసక్తి తేవడంలో ప్రకృతి పట్ల రచయిత శ్రద్ద వ్యక్తమవుతుంది. ఉత్తమ పురుషలో సాగిన కథలో రచయిత ఆరంభంలోనే ‘ఒక్కవాన కురిస్తే’ బాగుండుననుకుంటాడు.
సుక్కలు ఇరగబడి కాయడం, ఒక్క మబ్బుతునకన్నా లేకపోవడం, వానకోసం పంటకోసం రైతుల పడిగాపులు, ఆత్రుత, వాన రాకపోతేనన్న నిరాశ రైతుకు వానకు ఉన్న అవినాభావ సంబంధాన్ని స్పష్టం చేస్తాయి. చేలకు కాపలా కాసే నేపథ్యంలో ఊరి రైతు యువకులు వాన కోసం ఆరాటంగా ఎదురుచూడడం కథామూలం.

పంటపొలాలపై పందుల దాడి — అర్ధరాత్రి నిద్రలో లేచినా వాన కోసం పలవరించే తీరు మనసును కదిలిస్తుంది. ఉత్తర, హస్త కార్తెలు దాటినా వాన ఒంగకపోవడం, ఈలోగా చెరువు తెగిపోవడం, రాజకీయ ముష్టియుద్ధాలు, కరువు తెగులు అన్ని తెగుళ్ళనుమించి పంటను ఆక్రమించడం, అటు ఉద్యోగ ప్రయత్నంలో ఓడిపోయి ఇటు కులవృత్తీ కలిసిరాక యువత నిరాశకు లోనవడం ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది. చిత్తకార్తెలోనూ నీటిచుక్క కురవకపోవడం, వేరుశనగ పైరు ఎండిపోవడం, ఎండ తీవ్రతను వాన లేమిని వరుస క్రమంలో చూపుతుంది. వాన వస్తుందా రాదా అనేది తెలుసుకోవడం కోసం గుడ్డపీలిక తీసుకుని బొమ్మాబొరుసు వేసి వాన వస్తుందని సంబర పడటం రైతు అల్పసంతోషాన్ని ఉదాహరిస్తుంది. వాములు ఖాళీ అవటం, మేపలేక ఎద్దుల్ని అమ్మితే ఆ డబ్బుతో తన బాకీలు తీర్చమంటూ వ్యాపారి ఒత్తిడి, వాన కోసం పిచ్చివాడిలా పలవరింతలు…

అర్ధరాత్రి కలగా మొదలైన వాన పెద్దదవాలని, కుంభవృష్టి కావాలనుకున్న ఆశలు కల్లలైపోతాయి. ఇక వాన రాదేమోనన్న స్థితికి వచ్చాక..
– ఊపిరి సలపని వాన,
– వాగులూ వంకలూ ఏకం చేసే వాన,
– ఇళ్ళంతా కురిసి కురిసి మడుగులైపోయేంత వాన,
పైరంతా కుళ్ళి పోయి చేనంతా నలుపు రుద్దిన వాన.
ఆఖరికి, పైరుమొక్కల చెత్తను ఎద్దులకు గడ్డి కింద కూడా పనికిరాకుండా చేసిన వాన.

ఒక్క వానకోసం ఎదురు చూసి ఎదురుచూసి ఆ వాన క్రౌర్యానికే బలైన రైతుల కథ “ఒక్క వాన చాలు”. అందుకే అంటాడు ఈ కథలో –

ఈ సీమ ఎడారిగా మారినా బావుండు –
రాని వసంతం కోసం ఎదురుచూస్తూ
క్షణ క్షణం చావకుండా వుండేందుకు

అని.
ఏ భావాన్నయినా కవితగా వ్రాసుకుని దాన్ని కథగా మలచటం అనే ప్రక్రియకు ఆదిగా రూపమిచ్చినది సన్నపురెడ్డి. ఒక్క వాన చాలు లాంటి కవితను కథగా మలిచి అనూహ్యమైన ముగింపు చిత్రించి మనసును తట్టి లేపగల చైతన్యాన్ని సాధించగలగడం మామూలు విషయం కాదు.

ఈ కథలోని ప్రతి అక్షరంలోనూ రైతు మనసును, రైతు జీవితాన్ని పొందికగా పొదిగి సీమ కరువు దృశ్యాలను కళ్ళముందుంచటంలో కృతకృత్యుడైన కథకుడు సన్నపురెడ్డి.

కళ్ళకు నీళ్ళు తెప్పించే కథ ఒక్క వాన చాలు.

————————–

స్వాతీ శ్రీపాదఅసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

About స్వాతీ శ్రీపాద

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో 'మానస సంచరరే' శీర్షిక నిర్వహించారు.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

3 Responses to ఒక్కవానచాలు

  1. bhavani says:

    okka vaana chalu. adbhuta avedanani panchindi. gundeni kadilinchindi.. bhavani

  2. M.Munna Swamy says:

    వర్శాబావం వల్ల గ్రామీణ ప్రజల అగచాట్లు కళ్ళకు గట్టినట్లుగా చూఇంచారు స్వాతి శ్రీపాద గారు

  3. pratap says:

    Mee ‘okka vaana chalu’ chadivanu.. its realstic situation.. nice..

Comments are closed.