– కొడవటిగంటి రోహిణీప్రసాద్
మనుషులకూ, తక్కిన ప్రాణులకూ తమ గురించీ, పరిసరాలను గురించీ కొంత అవగాహన ఉంటుంది. ఏ జంతువైనా చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలను గమనిస్తూ, తన పిల్లలను ప్రమాదాల నుంచి కాపాడే ప్రయత్నంవంటిది చేస్తుంది. పక్షులు గుడ్లు పెట్టేముందు గూడు కట్టడం మొదలు పెడతాయి. వీటిలో కొన్ని చర్యలు సమయానుసారంగా యాంత్రికంగా జరిగిపోతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో కొంత ఆలోచన అవసరమౌతుంది. జంతువులుకూడా కొన్ని పరిస్థితుల్లో రెండు మూడు పద్ధతులో, మార్గాలో ఎదురైనప్పుడు వాటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవలసివస్తుంది. కానీ ఇవన్నీ అప్పటికప్పుడు జరిగే ప్రక్రియలు. ముందుగా ఆలోచించి ఆ ప్రకారంగా ప్రవర్తించడం మనుషులు మాత్రమే చెయ్యగలరు. ఉదాహరణకు రాబోయే చలికాలానికి అవసరమైన జంతువుల చర్మాలు సేకరించి ముందుగానే దాచుకోవడంవంటి పనులు మనుషులకే సాధ్యమయాయి. ఇటువంటి ప్రత్యేకత మనుషులకు శరీరధర్మాలవల్ల అబ్బలేదు. ప్రకృతి కలిగించే ఇబ్బందుల ఒత్తిడివల్ల కలిగింది.
గుహల్లో తలదాచుకుంటూ, చలిలో నిప్పుచేసి ప్రాణాలు కాపాడుకుంటూ బతకసాగిన తొలి మానవులు తమను గురించీ, ప్రకృతిని గురించీ ఆలోచించసాగారు. మనుగడ కోసం ప్రకృతిని పరిశీలించడం అలవాటు చేసుకున్నారు. రాత్రికీ, పగటికీ తేడాలనూ, సూర్యచంద్రుల కదలికల్లో భేదాలనూ, రుతువులను బట్టి చెట్లూ చేమలూ, పక్షులూ, జంతువులూ వగైరాలలో కలిగే మార్పులనూ గుర్తించసాగారు. ముప్ఫైరెండున్నర వేల ఏళ్ళనాటి ఒక చిన్న దంతపు ఫలకంమీద అప్పటివారు నమోదు చేసిన చంద్రుడి కళలు కనిపిస్తాయి. ఇదొక పంచాంగంవంటిది. స్త్రీ పురుషుల్లో తేడాలనూ, వయసుతో తమ శరీరాల్లో కలిగే పరిణామాలనూ, పిల్లలు పుట్టే పద్ధతినీ క్రమంగా అర్థం చేసుకోసాగారు. ప్రకృతిలో తమకు లోబడేవీ, లోబడనివీ ఉన్నాయని తెలుసుకున్నారు. కార్యకారణ సంబంధాలు అవగాహనకు వచ్చాయి.
ముప్ఫైరెండున్నర వేల ఏళ్ళనాటి కేలండర్
తిక్కరేగిన జంతువు తిరగబడుతుంది. అటువంటి లక్షణాన్ని మనకు అనువుగా చేసుకో వచ్చుకూడా. కానీ “కారణం లేకుండా” ఉరిమే ఉరుములూ, మెరుపులూ, కురిసే వానలూ, మంచూ, వడగళ్ళూ, కార్చిచ్చులూ వగైరాల మాటేమిటి? కనబడని శక్తిమంతుడెవరికైనా తిక్కరేగిందా? అమాయకులైన తొలి మానవులకు ఇలాంటివన్నీ అతీంద్రియశక్తులుగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ప్రకృతిని “శాంతింప”జెయ్యగలిగితే బతుకుజీవుడా అని ఊరుకోవచ్చు. మతపరమైన భావనలకు ఇదే నాంది అయింది. చలినుంచి వెచ్చగా కాపాడే సూర్యుడే ఒక్కొక్కప్పుడు వడదెబ్బకు కారణం కావచ్చు. “ఓర్పు”తో “అన్నీ సహించే” భూమాత ఉన్నట్టుండి అగ్నిపర్వతాలూ, భూకంపాలూ సృష్టించి “కోపాన్ని” ప్రకటిస్తుంది. తమకు అదుపులో లేని ఇలాంటి శక్తులే ఆదిమానవులకు తొలి దేవతలుగా రూపొందాయి. జొరాస్ట్రియన్‌లకూ, పార్శీవారికీ, తొలి ఆర్యులకూ అగ్నిదేవుడు ముఖ్యం. నిప్పూ, వానలూ, నదులూ వగైరాలమీద ఆధారపడడం తగ్గగానే దేవతలుగా ఈ ప్రకృతిశక్తుల ప్రాధాన్యత తగ్గిపోయింది.
తొలి మానవులు అనాగరికదశలో ఉన్నప్పటినుంచీకూడా వారు పోగుచేసుకున్న సైన్స్, జ్ఞానం, విజ్ఞానం వగైరాలన్నీ ఉత్పత్తికి సంబంధించినవిగానే ఉంటూ వచ్చాయి. చలి కాచుకునేందుకు నిప్పు చేసుకున్నా, ఒళ్ళు కప్పుకునేందుకు జంతువుల చర్మాలను కుట్టుకున్నా ఆ విద్యలన్నీ వారి మనుగడకు అవసరమైనవిగానే ఉండేవి. వారి అవగాహనకు తోడ్పడే సాధనాలేవీ లేని ఆ దశలో ప్రకృతిని అర్థం చేసుకునేందుకు వారికి ఉపయోగపడినవల్లా వారి బుద్ధీ, మనసూ మాత్రమే. మృగ ప్రాయమైన జీవితాలనుంచి బైటపడేందుకు ఎన్నో కష్టాలు పడుతున్న ఆ యుగంలో బలమైన ప్రకృతి శక్తులకు ఎదురొడ్డి నిలవడానికి అటువంటి అవగాహనకై వారు ఎంతో ఆరాటపడవలసివచ్చింది. ఈ పరిస్థితి ఏదో ఒక రూపంలో అనేక శతాబ్దాలు కొనసాగింది. (“సత్యకాలం” గురించి మనవాళ్ళు ఎన్ని ఊహించుకున్నా, పురాణాల గురించిన అబద్ధపు టీవీ సీరియల్ దృశ్యాల్లో అట్టతో చేసిన తామర పువ్వు మధ్యలో బ్రహ్మ కూర్చుని వరాలిచ్చినట్టు ఎన్నిసార్లు చూపినా గడిచిపోయిన మానవచరిత్ర మాత్రం చెప్పరాని కష్టాలతో కూడుకుని ఉండేదనేదే నిజం). ఏది ఏమైనా దేవుళ్ళ గురించిన భావనలు మొదటగా అంకురించినది ఆ చీకటియుగంలోనే. (పౌరాణిక చిత్రాలు తీసేనాటికి ఇంకా చీకటియుగం అయిపోలేదని అనుకోవాలి). ఎవరో తత్వవేత్త చెప్పినట్టు ఒక చిన్న పేడపురుగునైనా సృష్టించలేని మానవుడు లెక్కలేనంతమంది దేవుళ్ళని సృష్టించుకున్నాడు!
పురాణాలన్నీ మనిషి ప్రకృతిశక్తులను ఓడించినట్టు అభూతకల్పనలు చేసే పరిస్థితిలోనే ఉద్భవిస్తాయనీ, నిజంగా వాటిని లోబరుచుకున్నప్పుడు వాటితో పనితీరిపోతుందనీ మార్క్స్ అన్నాడు. (మరి సీరియల్ నిర్మాతలు ఏమంటారో?). ఇంద్రుడు తలుచుకుంటే కుండపోతగా వర్షం కురిపించగలడు. అప్పుడు అందరూ తడిసిపోకుండా కృష్ణుడు అమాంతంగా గోవర్ధనపర్వతం ఎత్తేస్తాడు. అగస్య్తుడి బాటకి అడ్డొచ్చిన వింధ్యపర్వతం తల వంచేస్తుంది. మునులకి కోపం వస్తే దేన్నైనా భస్మీపటలం చెయ్యగలరు. సముద్రాలు ఇంకిపోతాయి. ఇలాంటివి పశ్చిమ సంస్కృతుల్లోనూ ఉన్నాయి. మశూచివంటి రోగాలను “అమ్మవారు”గా భావించినది మనదేశంలోనే కాదు. గ్రీస్, క్రీట్, రోమ్ మొదలైన ప్రాచీన నాగరికతల్లోనూ, దక్షిణ, మధ్యఅమెరికా సమాజాల్లో కొన్ని దేశాల్లో మధ్య యుగాల్లోనూ నరబలి ఇవ్వడం ఆచారంగా ఉండేది. ప్రాచీనకాలంలో వందలమంది చిన్నపిల్లలను బలి ఇచ్చిన భయంకరమైన సంఘటనలకు సాక్ష్యాలు కనబడతాయి. తిండి పెడితే తృప్తి చెందనివారుండరని ఆటవికదశలోనే మనిషికి తెలుసు కనక ఏవో నైవేద్యాలుపెట్టి ప్రచండమైన శక్తులను మంచిచేసుకునే ప్రయత్నాలు ఆదిమసంస్కృతులన్నిటిలోనూ జరిగాయి. ఈనాటికీ దేవుడికి పెట్టకుండా భోజనం చెయ్యనివారున్నారు. అది ఎంత ఆటవిక సంప్రదాయమో వారికి తెలియక పోవచ్చు. ఇదంతా “సింబాలిక్” అనీ, దీని వెనక ఉండే ఆధ్యాత్మికభావాలనే మనం స్వీకరించాలనీ నేటి ఆస్తికులు మనని నమ్మిస్తూ ఉంటారు. ఎవరెన్ని చెప్పినా ఈ అభూతకల్పనల్లోనూ, మూఢ నమ్మకాల్లోనూ కనబడేది అపరిపక్వమైన మానవ మేధస్సు ఒక్కటే.
జంతువులకి లేని స్పృహ, చైతన్యం, కాన్షస్‌నెస్ అన్నీ మనిషికి ఉన్నాయని తొలి రోజుల్లోనే ప్రజలు గుర్తించారు. వివేచన, వివేకం, ముందుచూపు, తరతరాలుగా పోగైన అనుభవం, ఇన్‌స్టింక్ట్‌పై ఆధారపడకుండా ఆలోచించి మరీ ముందుకు సాగడం ఇవన్నీ జంతువులవల్ల అయేపని కాదని వారు గ్రహించారు. “జంతువులకు మతాలూ, మంత్రాలూ ఉండవు. మనిషికీ గొడ్డుకీ అదే తేడా. ఇవన్నీ లేనివాడు గొడ్డుతో సమానం” అనే వైఖరి ప్రాచీనయుగంలోనే ఏర్పడింది. అందుచేతనే మనసుకు సంబంధించిన మేధో ప్రక్రియలన్నింటికీ తొలినుంచీ ప్రాముఖ్యత ఉండేది. (జరిగిపోయినది ఎవరికైనా గుర్తుంటుంది. జరగబోయేదాన్ని గురించి తెలిసినట్టుగా దబాయించి మరీ చెప్పగలిగేవాడు త్రికాలజ్ఞాని!). పాతరాతియుగానికి చాలా ముందుగానే తొలి మానవజాతులకు తమకు గల తెలివితేటలపట్ల అవగాహన ఉండేది. అలాంటి పరిస్థితిలో కాల్పనికప్రపంచంలో విహరిస్తూ, ఉన్నవీ లేనివీ ఊహించుకోవడమే ఉన్నతమైన మానవజాతి లక్షణం అని వారనుకుని ఉంటే అందులో ఆశ్చర్యం లేదు.
జంతువులని చిన్నచూపు చూడడం తప్పని తెలిపినది ఆధునికవిజ్ఞానమే. శరీర నిర్మాణంలోనూ, వివిధ జీవప్రక్రియల్లోనూ మనకూ, జంతువులకూగల తేడాలు చాలా స్వల్పమైనవని మనకీనాడు తెలుసు. జన్యువుల్లో మనకూ చింపాంజీలకూ కేవలం 2 శాతం భేదం ఉంటుంది. అందుకనే వాటి తెలివి మన చిన్నపిల్లల స్థాయిలో ఉంటుంది. కానీ వాటికి ఎంత శిక్షణ ఇచ్చినా అవి మనలాగా మాట్లాడలేవు, ఆలోచించలేవు. దీనర్థం ఏమిటంటే కేవలం జన్యువులుండగానే సరిపోదు. పరిస్థితుల ప్రాబల్యంవల్ల మనిషిజాతి కొన్ని లక్షల ఏళ్ళపాటు రకరకాలైన శరీరశ్రమ చెయ్యవలసి వచ్చింది. దాని ఫలితంగా మనిషి మెదడులో అంతకంతకూ ప్రత్యేకమైన మార్పులు కలుగుతూ వచ్చాయి. అవి మనిషిజాతిలో అనూహ్యమైన పరిణామాలకు దారితీశాయి. ఎంత తెలివైన కోతి అయినా సరే, ఆ స్థాయిని అందుకోగల ప్రసక్తే ఉండదు. ఇందులో సృష్టికర్త ప్రమేయం ఏమీ లేదు.
>> ఉదాహరణకు రాబోయే చలికాలానికి అవసరమైన జంతువుల చర్మాలు సేకరించి ముందుగానే దాచుకోవడంవంటి పనులు మనుషులకే సాధ్యమయ్యాయి.
చాలా జంతువులు కూడా అలా ప్రవర్తించగలవు, ఉదాహరణకు, చీమలు ఆహారాన్ని చలికాలం కోసం దాచుకోవటం.
>> ఇటువంటి ప్రత్యేకత మనుషులకు శరీరధర్మాలవల్ల అబ్బలేదు. ప్రకృతి కలిగించే ఇబ్బందుల ఒత్తిడివల్ల కలిగింది.
ఇటువంటి ప్రకృతి ఇబ్బందులు, ఒత్తిడులు మనుషులకు మాత్రమే పరిమితం కాదా, చాలా జంతువులకు కూడా అవే కండీషన్లు కదా, ఆ జంతువుల్లో చాలా లుప్తమై పొయ్యాయి కదా.
ప్రాణుల మేధస్సు మునుపు అనుకున్నదానికన్నా ఎక్కువ స్థాయిలో ఉందని ఆధునిక పరిశోధనలు తెలుపుతున్నాయి. అనేకరకాల పక్షుల విషయంలో ఇది రుజువయింది. కుక్కలకన్నా పందులు చాలా తెలివైనవనీ, వాటిని నిర్దాక్షిణ్యంగా కోసుకు తినడం తప్పనీ అంటున్నారు. ఒక ప్రాణి చూస్తూండగా సాటి ప్రాణిని (ఆహారం కోసమైనా) విచక్షణ లేకుండా చంపడం ఎంత trauma కలిగిస్తుందో వివరిస్తున్నారు. ఇవన్నీ శాకాహార అలవాట్లకు పురికొల్పే పరిశీలనలు.
ఇక చీమల మాటకొస్తే చీమలు రాబోయే చలికాలం గురించి ఊహించుకుని పనులు మొదలుపెడతాయని ఎవరూ కనిపెట్టలేదు. ఊహ అనేది లేకుండా చేపట్టే చర్యలకు సహజాతం (instinct) అనే కారణాన్ని చూపుతున్నారు. కాలక్రమాన ఇది imprecise వివరణగా పరిణమించవచ్చు.
తొలి మానవుల విషయంలో ముందుకాళ్ళు చేతులుగా ఉపయోగపడుతున్నకొద్దీ మెదడులోని అనేక భాగాలు ఎదిగి “బలుపు”ను చూపాయి. ముందాలోచనకూ, ఊహాశక్తికీ పనికొచ్చే మెదడుభాగాలు ప్రత్యేకంగా అభివృద్ధి అయినది మనుషుల్లోనే. అంతకుముందు ఎన్నిరకాల ప్రాణులు పుట్టి, అంతరించినా ఈ రకమైన మేధోవికాసానికి తగినంత ఒత్తిడి (ఇది ఎక్కువ, తక్కువ అని కాదు; ఏ రకమైన మానసిక ఒత్తిడి అనేది) వాటిమీద కలిగిందో లేదో చూడాలి.
రోహిణీ ప్రసాద్ గారూ..
http://www.eemaata.com/issue41/chandamama.html
ఈ లింకులో రెండేళ్ల క్రితం మీ ‘చందమామ జ్ఞాపకాలు’ రచన చదివినప్పటినుంచి చందమామపై మరింత మమకారం పెరిగింది. ఆ మమకారం ఎంత బలీయంగా మారిందంటే కోరకుండానే అవకాశం వస్తే ఎగిరి గంతేసి telugu.chandamama.com లో చేరిపోయేంత బలీయంగా అన్నమాట. గత రెండేళ్ల నుంచి మీ రచనలను ఈమాట, ప్రజాకళ, ప్రాణహిత, పొద్దు వంటి వెబ్‌సైట్ లలో చదువుతూనే ఉన్నాను. నాన్నగారి రచనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారా అనేంత చక్కగా సైన్స్ పై మీరు రాస్తున్న రచనలను మొత్తంగా డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకుంటూ, మిత్రులకు వాటిని పరిచయం చేస్తూ వస్తున్నా. కాని గత రెండేళ్లుగా ఓ వెలితి అలాగే ఉండి పోయింది. మీతో ఏ రకమైన మెయిల్ సంబంధం పెట్టుకోలేకపోయాను. నేను ఇటీవలి వరకు పనిచేసిన telugu.webdunia.com అన్ని రకాల ఈమెయిల్ కమ్యూనికేషన్‌ను నిరోధించడం, మాకు ఇంట్లో ఇంటర్నెట్ లేకపోవడం అనే రెండు కారణాలతో ఇతర బ్లాగర్లతో సంబంధం కోల్పోయాము. ఎలాగయితేనేం చందమామతో పేగు సంబంధం ఏర్పడ్డాక ఇన్నాళ్లకు మీతో సంబందంలోకి వస్తున్నాను. మాకూ ఓ చిరు స్వార్థం ఉంది.మేం కూడా మీ సైన్స్ తదితర రచనలను ఒడిసిపట్టుకోగలిగి ఆన్‌లైన్ చందమామకోసం ఉపయోగించుకోగలిగితే ఎంత బావుంటుందో..! మరీ పెద్ద స్వార్థం కాదనుకుంటున్నాము. తొలితరం తెలుగు పత్రికలకు ఒరవడి దిద్దిన కొడవటిగంటి కుటుంబరావు గారి రచనా వారసులు మీరు. ఆయనకు నివాళిగా telugu.chandamama.com కు మీరూ సైన్స్ రచనలు పంపితే చందమామ పేరు సార్థకమవుతుందని మా అబిప్రాయం. మిమ్మల్ని ఎలా సంప్రదించాలో తెలీక ఇన్నాళ్లుగా ఆగిపోయాను. ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం లభ్యమయ్యాక మా ప్రపంచం కూడా కాస్త విశాలమయిందేమో మరి.అసాధ్యమనుకున్నవి సాధ్యమవుతూ వస్తున్నాయి. చందమామ ఉద్యోగిగా గత మూడు రోజులుగా బ్లాగ్ మిత్రులతో పరిచయాలు మొదలయ్యాయి.
http://poddu.net/?p=1609&cpage=1#comment-5288
http://poddu.net/?p=1609&cpage=1#comment-5376
మూడో రోజుకే మీతో ఇలా సంప్రదించే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మీనుంచి సానుకూల స్పందనకోసం కొండంత ఆశతో ఎదురు చూస్తుంటాము.
80లలో విరసం క్లాసులకు మేం హాజరయ్యే నాటికి నాన్నగారు లేకుండా పోయారు. ఆయన ‘చదువు’తో, సైన్స్ వ్యాసాలు, చరిత్ర, సంస్కృతి వ్యాసాలు, తదితర రచనలతో కథలు, నవలలుతో ఉద్యమాల సహితంగా యవ్వన జీవితం గడిపిన తరం మాది. ఇప్పుడాయన సాహిత్య సర్వస్వాన్ని విరసం 16 బృహత్ సంపుటాలుగా అచ్చేస్తున్న విషయం మీకు తెలిసే ఉంటుంది. తొలి రెండు సంపుటాలను గత వారమే మేం తీసుకున్నాం కూడా.
మీరు ఆన్‌లైన్ చందమామతో రచనా సంబంధం ఏర్పర్చుకుంటే ముప్పయ్యేళ్ల క్రితం చందమామనుంచి తెగిన బంధం తిరిగి మీ వారసత్వ సాక్షిగా తిరిగి అతుక్కుంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ.. మీ నుంచి మంచి వార్తకోసం ఎదురు చూస్తూ,
K.Raja Sekhara Raju
Associate Editor
telugu.chandamama.com
Email krajasekhara@gmail.com
my new blog : chandamamatho.blogspot.com
my mobile: 9884612596 (chennai)
http://blaagu.com/mohana/2008/02/29/%e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2-%e0%b0%9a%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%a6%e0%b0%a8%e0%b0%82/
రోహిణీ ప్రసాద్ గారూ.. నాకూ ఓ చందమామ జ్ఞుపకం ఉందండీ. పై లింకును చూడండి.
http://blaagu.com/mohana
http://raju123.mywebdunia.com
పై రెండూ నా మనుపటి బ్లాగులు. ఈ మధ్యకాలంలో కొత్త రచనలు పోస్ట్ చేయలేదు.
[…]