రాజకీయ రైలు

– కాజా సురేష్

పెరిగిపోతున్న జనాభా భారాన్ని మోస్తున్న భరతమాతలా, రాజకీయ రైలు మరో ఎలక్షను స్టేషనులోకి నెమ్మదిగా వచ్చి ఆగింది. పెళ్ళిళ్ళ సీజనులో జనరలు కంపార్టుమెంటులా, ఆంధ్ర దేశపు బోగీ, పదవీవ్యామోహపరులతో క్రిక్కిరిసి ఉంది.

చెన్నైలో రజనీకాంత్ కొత్త సినిమా విడుదల సందర్భంలోలా, రంగురంగుల నాయకుల పోస్టరులు, కరపత్రాలు, మైకుల శబ్దాలతో స్టేషనంతా గందరగోళంగా ఉంది. మీకిష్టమైన (అభి)రుచులలో, వేడి వాడి కబుర్లు దైవ”సాక్షి”గా, “ఈనాడు” మీకందించి మీలో “జ్యోతి”, “ప్రభలు” వెలిగిస్తామని రకరకాల పేపరు కుర్రాళ్ళు అరుస్తూ బోగీ చుట్టూ కలియ దిరుగుతున్నారు.

ఇక స్టేషను టీవీలలో సరేసరి – త్రివర్ణము, పసుపు, గులాబి, పచ్చ లాంటి వివిధ రంగులలెన్సుల నుండి వస్తున్న గాలిమేడల సీరియలు కబుర్లు, ఉచిత తాయిలాల వర్ణనలు, వెన్నుపోట్ల విశేషాలు, వాత్సాయనుడు సైతం సిగ్గుపడేలాటి అసభ్యపు మాటల తూటాలను, నోట్లో వేలేసుకొని, అతి శ్రద్దతో తమను తాము మర్చిపోయి చూస్తున్నారు వెర్రి జనం.

పంచె, లాల్చీ తొడుక్కుని, గాంధీ టోపీ పెట్టుకున్న ఒక ముసలి ఆసామి – ఏడు పదుల వయస్సు ఉండవచ్చు – తన ఇద్దరు కొడుకులతో రైలు దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళలో ఏదో తెలియని తేజం, పోరాటాలు జరిపిన పట్టుదల, తోటి మనుషుల పట్ల అంతులేని కరుణ, భావి తరాల పట్ల ఆశాభావం ప్రస్ఫుటమవుతున్నాయి.

కొడుకులిద్దరు కొంచెం నాగరికమైన (?) బట్టలు వేసుకున్నా, వాళ్ళంతా దారిద్ర్యరేఖకి దిగువున ఉన్నవాళ్ళే అన్న సంగతి ఇట్టే తెలుస్తున్నది. సినిమాహాలులో బాల్కనీ టికెట్టు ‘అయ్య’వారు ‘నేల’బ్బాయిని చూసినట్టు, మిగతా ప్రయాణికులు పెట్టిలోకి ఎక్కుతున్న వీళ్ళను అసహనంగా, చిరాకుగా చూశారు.

మరి కాసేపటిలో, TC నింపాదిగా బోగీలోకి అడుగుపెట్టాడు, అతని కోటు జేబుమీద తెలుగులోను, ఇంగ్లీషులోను, “మీ సగటు అమాయకపు వోటరు” అని రాసి ఉన్నది. మెట్ల దగ్గర, కింద కూర్చున్న వృద్దుని కుటుంబం వంక ఓరకంటనైనా చూడకుండా, బెర్తులలో దర్జాగా బైఠాయించిన బడాబాబుల దగ్గరికి నేరుగా వెళ్ళాడు.

కూపేలో కూర్చునివున్న ‘సార్రాజు’, “ఏమిసారూ బాగున్నారా?” అని కులాసాగా పలకరించాడు TCని. “మిమ్మలిని కలిసి అప్పుడే ఐదేళ్ళు అయిందా” అని విపరీతమైన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. “క్రితంసారి మల్లే ఈతూరి కూడ నాకు మా పోరగాళ్ళకు కిటికీ కాడ సీటు ఇవ్వాలి మళ్ళా” అని, TC చేతిలో రెండు వారుణి పొట్లాలు ఒక సీమసారా సీసా పెట్టాడు. TC విపరీతమైన ఆనందంతో తూలుతూ, కొంచెము ఎదరగా, ఏదో గొడవ జరుగుతున్నచోటికి వెళ్ళాడు.

అక్కడ “రౌడీ రంగడు” నాటు బాంబులు, తుపాకులతో వీరంగం చేస్తూ కనబడ్డాడు. కిందపడ్డ రక్తపు మరకలు చూస్తే అప్పటికే రెండు మూడు మర్డరులు జరిగిఉండవచ్చునని సులభంగా తెలిసిపోతోంది. తన కండలు చూపిస్తూ, మీసాలు మెలేసి, కరుకుగా “ఏమి సారు ఇక్కడ కూర్చోవచ్చా?” అని ఉరుముతున్న గొంతుతో TCని అడిగాడు. “అంతకంటేనా” అని నీళ్ళు నములుతూ బదులిచ్చాడు TC.

“ఆడితో మనకెందుకుగాని ఓపాలి ఈడకి రారా” అని TCని పిలిచాడు అతనికి దూరపు చుట్టపు
వరసైన సుబ్బారావు. “మన కులపోళ్ళంటే బొత్తిగా ఈళ్ళకి ఇలువ లేకుండా పోయిందిరా. అందుకని నువ్వు నాతోపాటు మనోళ్ళందరికి సీటు ఇవ్వాలి” అని అవేశంతో గట్టిగా గొంతు బొంగురుపోయేట్టు అరిచాడు.

“నా కులపోళ్ళేనా తక్కువ తింది?” అని TC, వాళ్ళందరికి సీట్లే కాదు, మంచి మంచి బెర్తులుకూడా ఇచ్చి, ఆ సంతోషంలో కళ్ళవెంట వస్తున్న అనందబాష్పాలు తుడుచుకుంటూ ఇంకొంచెం ఎదరకి వెళ్ళాడు.

అక్కడ, మంద్రస్వరంలో వస్తున్న పాశ్చ్యాత్య సంగీతానికి అనుగుణంగా, కట్టేబట్ట కూడా బరువైన ఒక నాజూకు సుందరి, లయబద్దంగా ఆడుతూంటే, విలాసంగా చూస్తున్నాడు, తాబేదారు అప్పారావు. అశోకుడు రోడ్లు వేయించాడో లేదో, భగీరధుడు సురగంగను తెచ్చాడో లేదో తెలియదుగాని, ఈ ప్రబుద్దుడు మాత్రం నిస్సందేహంగా అనేక ప్రాజెక్టు పనులు పూర్తిచేశాడని సర్కారీ రికార్డుల కథనం.

“ఇదిగో టీసీ, నీకీ యాతనెందుకు గాని, ఈ కట్ట ఉంచుకొని సగము సీట్లు, బెర్తులు మాకిచ్చి ఇవాళ్టికి నువ్వు పండగ చేసుకో” అని ఒక నోట్ల కట్ట, యజమాని కుక్కకు ప్రేమతో బిస్కెట్టు విసిరినట్టు, TC వైపు విసిరాడు. మెరిసే కళ్ళతో ఆ డబ్బు తీసికొని, తన చొక్కాతో బెర్తులు తుడిచి, “సార్, మీరు ఇక్కడ కూర్చోండి” అని చెప్పి, బోగీ చివరి, మెట్ల దగ్గిరికి బరువైన జేబులతో నెమ్మదిగా వెళ్ళాడు TC.

అక్కడ, కింద గొంతుక్కూచునివున్న వృద్ధుడిని చూసి “నీ దగ్గర సారాగాని, డబ్బుగాని ఏమైనా ఉందా? కనీసం నువ్వు మా కులపోడివేనా?” అని చిరాకుగా అడిగాడు. బిత్తరపోయిన చూపులతో ముగ్గురూ తల అడ్డంగా ఊపారు.

“ఐతే దిగిపోండి” అని కటువుగా (ఓ బూతు పదం జోడించి) చెప్పి, వాళ్ళు చెప్పేది వినకుండా దించేశాడు. రైలు ‘కూ చికు చికు చికు’ అనుకుంటూ చీకటిలో గమ్యము తెలియని భవిత వైపుకు వేగంగా వెళ్ళిపోయింది. ప్లాటుఫారం మీద ఒంటరిగా మిగిలిపోయారు, వాళ్ళు ముగ్గురు.

ప్రపంచంలోని అతి పెద్ద Democracy ఏవిధంగా పనిచేస్తుందో తెలుసుకోవటానికి వచ్చిన ఓ విదేశీ ఔత్సాహికుడు, “ఎవరు మీరు?, ఆ వోటరు మిమ్మల్ని ఎందుకు దించేశాడు?” అని అడిగాడు వాళ్ళను. “నా పేరు ‘దేశ భక్తి’, వీళ్ళిద్దరు ‘నీతీ నిజాయితీ’, ‘సమాజ సేవ’ అనే నా బిడ్డలూ”, దీనంగా బదులిచ్చాడు ఆ వృద్దుడు. అయోమయుంలో పడ్డ ఆ విదేశీయుడు తన డైరీలో ఇలా రాసుకున్నాడు –

“ఇలాంటి వోటర్లు(TCలు), రాజకీయనాయకులు ఉన్న ఈ దేశపు ప్రజాస్వామ్యానికి ఆ దేవుడే దిక్కు”.

———————

కాజ సురేష్

సురేష్ కాజా స్వస్థలము కృష్ణా జిల్లా నూజివీడు. పిలాని, కాన్పూర్, డల్లాస్‌లలో ఉన్నత విద్యనభ్యసించి, ప్రస్తుతం డల్లాస్‌లో Software Consultant గా పని చేస్తున్నారు. తన ఆలోచనలను http://naazaada.wordpress.com అనే బ్లాగులో చూడవచ్చు.

About సురేష్ కాజా

పేరు సురేష్ కాజా. స్వస్థలము కృష్ణా జిల్లా నూజివీడు. పిలాని, కాన్పూర్, డల్లాస్ లో ఉన్నత విద్యనభ్యసించి ప్రస్తుతం డల్లాస్ లో Software Consultant గా పని చేస్తున్నారు. ”నా పిచ్చి రచనలు, పోలికేకలు, ఆలోచనలు చదవదలచిన http://naazaada.wordpress.com అనే నా బ్లాగుకు దయచేయగలరు”, అని అంటున్నారు సురేష్ గారు.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

7 Responses to రాజకీయ రైలు

  1. chavakiran says:

    బాగుంది. చివరి లైను తప్ప. విదేశీలందరూ(కొందరైనా) పవితులంటారా:)

  2. Pingback: సమకాలీన రాజకీయ పరిస్థితి « మ్యూజింగ్స్

  3. rahamthulla says:

    ఏకగ్రీవ ఎన్నిక
    ఈ పద్దతి వలన లాభాలు

    1. ఎన్నికల కోసం అభ్యర్దులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
    2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
    3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
    4. అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.
    5. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.
    మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

    * 1952 : షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం
    * 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం
    * 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
    * 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి
    * 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
    * 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
    * 1952 : పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం
    * 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం
    * 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి
    * 1955 : రామారావు కామారెడ్డి
    * 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి
    * 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
    * 1957 : సీతాకుమారి బన్స్ వాడ
    * 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
    * 1957 : పి.మహేంద్రనాద్ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం
    * 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
    * 1962 ,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల
    * 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం
    * 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు
    * 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
    * 1962 : కె.రాంభూపాల్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
    * 1962 : కే.వి.రెడ్డి బోదన్
    * 1962 : ఎ.రామస్వామి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
    * 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
    * 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు
    * 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్
    * 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
    * 1972 ఎస్.భూపాల్ అమరచింత
    * 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం
    * 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం
    * 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
    * 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 జి.గడ్డెన్న ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 డి.మునుస్వామి కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
    * 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం
    * 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు
    * 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు
    * 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
    * 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
    * 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు
    * 1981 టి.అంజయ్య రామాయంపేట
    * 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి

  4. sridharam says:

    chaala bavundhi!koncham negative touch ekkuva vundhi..kani nijam prathibimbinchindhi

  5. Pingback: ఆగండి..ఆలోచించండి…ఓటెయ్యండి.. « మ్యూజింగ్స్

  6. ఈ కథ చదివి వ్యాఖ్యలు పంపిన వారందరికి ధన్యవాదములు. నైరాశ్యము పాలు ఎక్కువ అన్నారు కొందరు. అది నా ఆక్రోశము అంటాను.
    అవకాశము కుదిరితే ఈ బ్లాగు ఎంట్రీ (http://naazaada.wordpress.com/2009/03/30/ఆగండిఆలోచించండిఓటెయ్య/) తప్పక చదవగలరు..

  7. sandeep says:

    I am very impressed with your articles in “poddu”

Comments are closed.