తామస విరోధి- మొదటి భాగం

విరోధి నామ సంవత్సర ఉగాది సందర్భం గా పొద్దు పత్రిక నిర్వహించిన ఆన్లైన్ వచన కవి సమ్మేళనం “తామస విరోధి” కి స్వాగతం. సాధారణం గా సమ్మేళనాల్లో కవులు తమ స్వీయ కవితల్ని చదివి వినిపిస్తారు. ఈ కార్యక్రమం లో దానికి పొడిగింపుగా ఆ కవితలపై అనుభవజ్ఞుల విశ్లేషణలు, సూచనలూ కూడా చేర్చటం వల్ల నవ కవులకి మార్గదర్శకం గా ఉంటుందని భావించాము. ఇంతే కాకుండా “తర్ కవిత ర్కాలు” పేరు తో కవిత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిపేందుకు దీన్నొక వేదిక గా చేశాము.

తామస విరోధి మొదటి భాగం లో ఉగాది పై వసంతస కవితల్ని అందిస్తున్నాము. తర్వాతి అంకాల్లో మిగతా కవితలు, చర్చలను ప్రచురిస్తాము.

ఇక ఈ చైత్ర యాత్ర లో పాల్గొన్న వారి వివరాలు:

అతిధులు/కవిత్వ విశ్లేషకులు:

  • విన్నకోట రవిశంకర్: కుండీలో మర్రిచెట్టు ని తన కవితా సంకలనం లో బంధించిన రవి శంకర్ గారు కవితలూ, సాహితీ వ్యాసాల ద్వారా అంతర్జాలం లో సుప్రసిద్ధులు.
  • తమ్మినేని యదుకుల భూషణ్: ఆధునిక కవితా రీతుల్ని సశాస్త్రీయం గా చర్చించగల భుషణ్ గారు నేటి కాలపు కవిత్వం- తీరు తెన్నులు అనే విమర్శనాత్మకమైన పుస్తకాన్ని రచించారు.
  • భైరవభట్ల కామేశ్వర రావు: తెలుగు పద్యం బ్లాగు ద్వారా, కవి సమ్మేళనాల ద్వారా బ్లాగ్లోకం లోనూ .  గడి కూర్పరిగా పొద్దు లోను పాఠకులకి పరిచితులు.

పాల్గొన్న కవులు:

  • చావా కిరణ్:  ఆది తెలుగు బ్లాగరు, కవితలే కాక తన కథలతో నెట్‌లో హిరణ్యలోకాన్ని సృష్టించిన కిరణ్ తన నవలను సొంత బ్లాగులోనే అచ్చేసుకున్నారు కూడా.
  • బొల్లోజు బాబా: రవీంద్రుని “stray birds” ని తెలుగు అనువాదం చేసిన బాబా గారు సాహితీ-యానం బ్లాగరి.
  • నిషిగంధ: వివిధ అంతర్జాల పత్రికల్లో వ్యాసాలూ, కవితలూ, కథలూ సీరియల్సూ రాస్తున్న నిషిగంధ గారు మానసవీణ బ్లాగరు.
  • కత్తి మహేష్: పర్ణశాల బ్లాగులో ఎప్పూడూ కత్తి మొన లాంటి చర్చలు , విమర్శలూ సాగించే మహేష్ గారు కవితలూ, సినిమా రివ్యూ లు కూడా రాస్తున్నారీమధ్య.
  • శ్రీవల్లీ రాధిక: మహార్ణవం బ్లాగరిగా ఇంటర్నెట్‌లో కనపడే రాధిక గారు “రేపు చూడని వాన” అనే కవితా సంపుటే కాకుండా కొన్ని కథా సంకలనాలు కూడా ప్రచురించారు.
  • డా. జోగధేను స్వరూప్ కృష్ణ: ఇప్పుడో నది కావాలి (కవితాసంపుటి), Intangible cultural heritage of folk arts of Rayalaseema లను ప్రచురించారు.
  • తవ్వా ఓబుల్ రెడ్డి: వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన తవ్వా ఓబుల్ రెడ్డి ప్రవృత్తి రీత్యా కథారచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్టు.  20కి పైగా కథలు, 10 కవితలు, 200 వ్యాసాలు వివిధ పత్రికల్లో, ఆకాశవాణి ద్వారా ప్రచురితం, ప్రసారం అయ్యాయి.
  • స్వాతీ శ్రీపాద: అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు.
  • మూలా సుబ్రహ్మణ్యం: “ఏటిఒడ్డున” బ్లాగరి, అదేపేరుతో కవితా సంపుటిని ప్రచురించిన సుబ్రహ్మణ్యం గారు వివిద అంతర్జాల పత్రికల్లో కవితలు, కథలు, ప్రయోగాల ద్వారా సుపరిచితులు.
  • నూతక్కి రాఘవేంద్రరావు: తన పర్యాటక అనుభవాలూ, పిచ్చాపాటీ కబుర్లే కాకుండా కవితలు కూడా బ్లాగులో రాస్తున్న ఔత్సాహికులు.

ఆమని రాక

రచన: భైరవభట్ల కామేశ్వర రావు

ఎక్కడో అడవిలో
ఒక కొమ్మమాటు కోయిల పాట
వసంతమై వనమంతా పరుచుకుంటుందిట
ఇక్కడికది వినిపించదు
ఉగాది వచ్చిందని తెలిసేదెలా మరి?

మావిడాకులంత పవిత్రమైన ఆ చేతులతో
అమ్మ, పచ్చడి అందిస్తూ
తన పెదాలతో
శుభాకాంక్షల అక్షింతలు నాపై జల్లినపుడు
నా హృదయం పచ్చని అడవే అయిపోతుంది

ఉగాది వచ్చిందని
పాపం మరి తమ్ముడికెలా తెలుసేది?
అడవినీ అమ్మనీ వదిలి
వేరే ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపొయ్యాడే

చిగురించని వసంతం

రచన: కత్తి మహేష్

నీ తర్కం కాదనలేనని తెలుసు
అందుకే…
కారణం అడిగే ధైర్యం చెయ్యలేదు

నీ ప్రేమను ప్రశ్నించే సాహసం చెయ్యలేను
అందుకే…
నా ప్రేమను కాదన్నా నొచ్చుకోలేదు

నీ మౌనాన్ని ఛేధించాలనుకోలేదు
అందుకే…
నీ నిశ్శబ్ధాన్నినే  మౌనంగా విన్నాను

అయినా వసంతం రానేవచ్చింది
నా మదిలో కోయిల కాకున్నా
నీమౌనం కూసింది

మూగబోయిన మనసూ
ప్రాణం లేని తనువూ
వసంతం సాక్షిగా ఇక…
చిగురించే సాహసం చెయ్యలేవు

కామేశ్వర రావు: మంచి కవిత! తీసుకున్న అంశం బావుంది. కవిత పేరు ఇంతకుముందు విన్నదిలా ఉన్నా, కవితకి చక్కగా అతికింది. నాకు తోచిన కొన్ని విషయాలు:

“నీ ప్రేమను…” అన్న రెండో పేరా అక్కరలేదనిపించింది.

“నీ మౌనాన్ని ఛేదించాలనుకోలేదు
అందుకే…
నీ నిశ్శబ్ధాన్నినే  మౌనంగా విన్నాను”
అన్నప్పుడు అక్కడ పదాలు చర్విత చర్వణంగా అనిపించాయి. చివరి వాక్యం –
“నిన్ను నిశ్శబ్దంగానే విన్నాను” అంటే బావుంటుందేమో.
“ప్రాణం లేని తనువూ” బదులు “ప్రాణం లేని తరువూ” అంటే ఎలా ఉంటుంది?

స్వాగత గీతిక

రచన:నూతక్కి రాఘవేంద్ర రావు

ఆమని ఆగమన స్వాగత గీతిక
పాడేందుకు స్వర తంత్రులు
సవరించుకొంటూ కొయిల
పూదేనియ జుర్రుకొనే
ఆత్రంలో ఆ తుమ్మెద
తుండం సరిచేసుకొంటూ రెక్కలు అల్లార్చుతూ
ఆ ఝూంకార స్వర రసాస్వాదానందానురక్తితో
లేలేత చిగురుల్లో పూబాలిక
స్నిగ్దత్వం సింగారించుకొంటూ
ఆ వసంతాగమన వేళ
మదన కేళీ విలసిత
మదుర భావ సంజనిత
మనస్విని ఆ జవ్వని
అర్ధ నిమీలిత నేత్రాలతో
అనుభూతులనాస్వాదిస్తూ
ఆమనినాహ్వానిస్తూ

ఆమని వగపు
రచన: స్వాతీ శ్రీపాద

ఏమూలకు చూపుసారించినా
రాతి గోడల శిలావృక్షాలు
బీడంతా పరచుకున్న ఆకుపచ్చ
కలల
మయసభలు
కృత్రిమత్వాన్ని కడుపారా త్రాగిత్రాగి
భళ్ళున కక్కేసినట్టు
ఏమూల చూసినా చిందరవందర శకలాలే
చీకటి రాత్రికి ఉరివేసి
ఉదయం సంబరం చేసుకుందామంటూ
వెలుగుల్ను వలువలుగా అనువదించుకుంటూ
తలుపు తట్టిన ఆమని మూగవోయేలా
వెల్లువలుగా ప్రవహించే
స్వార్ధం రక్తపుటేరులు

కోయిల గొంతు మూగవోయింది
నగరం ఒడినిండా
వగలు పోతున్న కాలుష్యాల
కౌగిట్లో ఉక్కిరిబిక్కిరై
ఊపిరందక మాట పెగలక
ఎలా పాడుతుంది స్వాగతగీతిక?

జీతవెచ్చాల సమీకరణాల్లో
మునిగితేలే ఐటి జీవాలకు
ఉగాదులెందుకు ?
ఉషస్సులెందుకు?
ఎంత జీతం? ఎంత మదుపు , ఎంత పొడుపు
అదేకదా రేపటి సౌకర్యాలకు పెట్టని అదుపు
ఏం కోల్పోతున్నారో ఏం పోగొట్టుకుంటున్నారో
రేపెప్పుడో పిల్లల లెఖ్ఖల్లో
వృద్ధాశ్రమాల జమాఖర్చులు చూసాక కాని
కదిలిపోయిన ఉగాదులు కళ్ళల్లో వెలగవు.
ఆమని రోదనా మనసులో ప్రతిధ్వనించదు.

రహస్య సృష్టి
రచన: బొల్లోజు బాబా

అంతవరకూ విడివిడిగా
ఎగిరిన తూనీగలు
జంటగా అదృశ్యమయ్యాయి.

గులాబీ రేకలపై కూర్చొని లేచిన
కోతులు కూడా కిచకిచమంటో
వనమంతా తిరుగాడుతున్నాయి.

ఇరు తనువుల్లో ఎగసిపడిన
మోహకీల
తన్మయత్వపు మంచుకొండపై
వెన్నెల పూలు పూయించింది.
పారవశ్యపు మైదానాలపై
నిశ్శబ్ధ సౌందర్యాన్ని వర్షించింది.

రాత్రి పగిలి, ముక్కలు చెదిరి
చీకట్లో కరిగి, వేకువలో అదృశ్యమయ్యింది.
నీ జడలో మల్లియల్లా.

నెమలీక నీలి కనులు
సగం తెరచీ, సగం మూసీ
ఆదిమ లౌల్యాన్ని ఆఘ్రాణిస్తున్నాయి.

వసంతం తన రహస్య అందాలతో
సృష్టిని సుసంపన్నం చేస్తోంది.

రవిశంకర్: మీ పద్యంలో గాఢమైన అనుభూతి ఉంది. కాని, ఎక్కువ పదచిత్రాలు వాడటంవల్ల కొంత గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, మోహకీల మంచుకొండపై వెన్నెలపూలు పూయించిందన్నప్పుడు అందులో వాడిన వివిధ పదచిత్రాల మధ్య సమన్వయం అంతగా కుదరదు. తన్మయత్వాన్ని మంచుకొండగాను, పారవశ్యాన్ని మైదానంగాను భావించటం కూడా అటువంటిదే. పదాల లాగే పదచిత్రాల వాడుకలో కూడా పొదుపు పాటించటం మంచిదని నా అభిప్రాయం. తుమ్మెదలు జంటగా అదృశ్యం కావటం, నెమలీక కళ్ళు అరమోడ్పులు కావటం బాగున్నాయి.

బాబా: మొదటి చరణం, తుమ్మెదల ప్రేమాయణం. రెండవ చరణంలో కోతుల బ్రీడింగ్ సీజన్‌లో రంప్ ఎర్రగా మారుతుంది. ఆ విషయాన్ని చెప్పాను. మూడవ చరణంలో ఆక్సీమోరాన్ లు ఉపయోగించాలని ప్రయత్నించాను. ఆదిమ లౌల్యమంటే అమీబా నుంచి మానవుని దాకా జరిగిన సృష్టి కార్య రహస్యమే.

భూషణ్:

అంతవరకూ విడివిడిగా
ఎగిరిన తూనీగలు
జంటగా అదృశ్యమయ్యాయి.

గులాబీ రేకలపై కూర్చొని లేచిన
కోతులు కూడా కిచకిచమంటో
వనమంతా తిరుగాడుతున్నాయి.

—————–
మంచి ప్రతిభ కనిపిస్తోంది, పద చిత్రాల ఎంపికలో, ఎత్తుగడలో. విశేషణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. కవిత, వీలయినంత మూర్తం(concrete)గా ఉండాలి.
( ) లో ఉన్నవి అమూర్త విశేషణాలు: ఇవి ఎంత తగ్గితే అంత చిక్క బడుతుంది కవిత్వం.
[ ] లో ఉన్నవి ద్రుత పదబంధాలు: ఇవి తొలగిస్తే పాఠకుల ఊహకు పదును కలుగుతుంది.
{ } లో ఉన్నవి వ్యాఖ్యానాలు: కథ చివరలో నీతి, కవిత చివర వ్యాఖ్య వర్జ్యం.
[ } లో ఉన్నవి ప్రతిక్షేపాలు: విభక్తి ప్రత్యయాలు మార్చాలి (ఉదా:ల్లో–>లు)

కర్ణాటక సంగీతంలా, కలన గణితంలా కవిత్వాన్ని కూడా పాఠకులు, కవులు, విమర్శకులు
సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి కవి జీవిత కాలంలో ఒక్క నిర్దుష్టమైన, పరిపుష్టమైన కవిత రాయవలెనని ప్రతిజ్ఞ చేసుకోవాలి.దాని కోసం ఎంత దూరం పోవడానికైనా సంసిద్ధంగా ఉండాలి. అప్పుడు వద్దన్నా అద్భుత కవిత్వం జాలువారుతుంది.

మీలో ప్రతిభ ఉంది..వజ్రాన్ని సాన బెట్టాలి,మంచి కవిత్వం ,మంచి విమర్శ చదివి.
చివరి మాట: మీరు తక్షణమే ఒక మంచి కలం పేరు ఎంపిక చేసుకొండి.

తమ్మినేని యదుకుల భూషణ్.

—————————————-
ఇరు తనువు[ల్లో} ఎగసిపడి[న]
[మోహకీల]
(తన్మయత్వపు) మంచుకొండపై
వెన్నెల పూలు [పూయించింది.]
(పారవశ్యపు) మైదానాలపై
(నిశ్శబ్ధ సౌందర్యాన్ని) వర్షించిం[ది].

రాత్రి [పగిలి, ముక్కలు చెదిరి
చీకట్లో కరిగి, వేకువలో అదృశ్యమయ్యింది.]
నీ జడలో మల్లియ[ల్లా.]

నెమలీక నీలి కనులు
సగం తెరచీ, సగం మూసీ
(ఆదిమ లౌల్యాన్ని ) [ఆఘ్రాణిస్తున్నాయి.]

{వసంతం తన రహస్య అందాలతో
సృష్టిని సుసంపన్నం చేస్తోంది.}

బాబా: భూషణ్ గారికి, ఈమాట లోని మీ వ్యాసాలన్నీ చదివానండీ. నా కవితపై మీ వివరణ ద్వారా చాలా కొత్త విషయాలు తెలిసినయ్ అండి. కొన్ని సందేహాలు.. మీ కభ్యంతరం లేకపోయినట్లయితే తెలుప గలరు. ఇది మనిద్దరిమధ్య సంభాషణ మాత్రమే కాకుండా, ముందుముదు మరెందరికో కూడా విషయావగాహనకు దోహదపడగలదని నా నమ్మకం.

  1. అమూర్త భావనలు మీ విశ్లేషణ, ఇదివరలో ఆవకాయ.కాం లో అలోక్ గారి ఇచ్చిన వివరణలు నాబోటి వారికి ఎంతో ఉపయోగపడతాయి.
  2. ద్రుత పదబంధాలు తగ్గించటానికి మీ నుంచి మరిన్ని సూచనలు ఆశిస్తున్నాను సార్.
  3. వ్యాఖ్యానాలు తగ్గించుకోవాలని చేసే ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయో! 🙂
  4. ప్రతిక్షేపాలగురించి కూడా మీ నుంచి మరికొంత తెలుసుకోవాలని ఆశపడుతున్నాను సార్.

కలం పేరు పెట్టేసుకోవచ్చంటారా? అలానే సారూ. 🙂

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.