“నేర్చుకో” కథపై విశ్లేషణ

-స్వాతీ శ్రీపాద

“సన్నపురెడ్డి అనగానే మనకి చనుబాలు, కొత్తదుప్పటి, కన్నీటి కత్తి, పాటల బండి, ప్రతిమల మంచం వంటి కొన్ని మైలురాళ్ళు గుర్తుకొస్తాయి. ఈ సంపుటి చదివాక అన్పించింది అతడి ప్రతి కథా ఒక మైలురాయేనని.”

– వి.ప్రతిమ, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, కథాసాహిత్యంలో చేసిన కృషికి గాను కేతు కథాపురస్కారం -2006 గ్రహీత.

కొత్తదుప్పటి కథా సంపుటిలోని రెండవ కథ నేర్చుకో.
కథ గురించి మాట్లాడుకునేముందు రెండు విషయాలు చర్చించుకోవడం ఎంతైనా అవసరం.
అవినీతి కోరల్లో మానవాళి విలవిలలాడుతున్న ఈ రోజుల్లో ఏది ఏమైనా రెండు రంగాల్లో మాత్రం దీని ప్రమేయం తక్షణం అరికట్టకపోతే మందేలేని మహమ్మారిలా మానవతనే కబళించి వెయ్యడం అనివార్యం.
ఆ రెండు రంగాలూ – ఒకటి విద్యారంగమైతే మరొకటి వైద్యరంగం. ఒకటి భవిష్యత్తుకు బంగారు బాటవేసే రాచమార్గమయితే మరొకటి మానవాళికి అస్తిత్వాన్ని కూర్చే ఆహ్లాదపు తోట. అయితే ఈ రెండు రంగాలనూ కూడా అవినీతి చీడ పట్టిపీడించడం ఈరోజుల్లో అందరికీ తెలిసిన విషయమే. అక్కడే మొదలవుతోంది ఒక మారణ హోమానికి నాంది. ఒక మరణశాసనానికి పునాది. చరిత్ర అంతానికి తొలి అడుగు.
కొత్త దుప్పటి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథలు
ఆ ఆవేదనతో అక్షర రూపంఇచ్చిన కథే నేర్చుకో. కథ అంతా ప్రథమ పురుషలో సాగుతుంది. కథానాయకుడు ఒక కంపౌండర్. పని నేర్చుకునేందుకు డాక్టర్ సుబ్బరాజు వద్ద చేరిన వ్యక్తి. మొదటి వాక్యం లోనే సుబ్బరాజు వ్యక్తిత్వం పూర్తిగా పాఠకుడికి అర్థమవుతుంది – “పిండ వలసిన మేరకు పిండి జేబులో కుక్కుకునే కక్కుర్తి వ్యక్తిత్వం” అని. అయితే ప్రతి దుశ్చర్య చేస్తూనే ‘నేర్చుకో’మని కథకుడికి డాక్టర్ సుబ్బరాజు ఇచ్చే సలహా, నేర్చుకోవలసినదేమిటో అర్థం కాలేదనే కథకుడి విశ్లేషణ కథంతా సాగుతూనే వ్యంగ్యానికి చోటు కలిపిస్తాయి.

పదిమందికి పెట్టేంత సొమ్ము లేకున్నా చేసాయమన్నా చేద్దామన్న తపన మొదటి నుండీ వున్న వ్యక్తి కథకుడు. చదువు సాగక పల్లెరోగులకు కాస్తైనా ఉపకరించే ఉద్దేశంతో కాంపౌండర్ పని నేర్చుకుందుకు చేరతాడక్కడ. బాధపడే రోగులకోసం తెల్లవార్లూ మేలుకోవడం,వాళ్ళకోసం ఏదో చెయ్యాలని తపన పడిపోవడం-కథకుడి ఈ ప్రవర్తన పేషంట్ల చేత అనవసరంగా మందులు తెప్పించి, అందినంత నొక్కేసే డాక్టర్ గారికి సెన్స్ లెస్ ప్రవర్తన. పవిత్రమయిన వైద్య వృత్తిని మూడు సెలైన్ లు ఆరు ఫీజులుగా సాగే వ్యాపారంగా పరిగణించే వైద్య యముడు డాక్టర్ సుబ్బరాజు. ఆయన ఏం నేర్చుకోమంటున్నాడో ఇతనికి అర్థంకాదు. ఇతను నేర్చుకోవాలనుకున్నది రోగులకు సేవ చెయ్యడం.

ఈ నేపథ్యంలో ఓరోజు ఏడుపు కేకల మధ్య అరవై ఏళ్ళ ఓ వృద్ధురాలిని – మరేం లాభం లేని స్థితిలో వాంతులు విరేచనాలవల్ల సొమ్మసిల్లిపోయిన అస్థిపంజరాన్ని – మోసుకు వస్తారు. హడావిడి, సెలైన్ ఎక్కించటం మామూలే. కూలికెళితేగాని కడుపు నిండని స్థితిలో చచ్చే ముసలిదానికంటే పెరిగే పిల్లలు ముఖ్యం అల్లుడికి.

బ్రతికితే అంతో ఇంతో పనిచేస్తుందన్న ఆశ. సాయంత్రం వరకూ అదీ ఇదీ చెప్పి పెదవి విరిచిన డాక్టర్ డబ్బుంటే డెబ్బయి ఐదురూపాయల మందు తెమ్మంటాడు. తల్లిని బ్రతికించుకోవాలనే కూతురి తపన కళ్ళకు కట్టినట్టుగా అక్షరాల్లో పొదిగారు కథారచయిత. కథకుడు డాక్టర్ని సూటిగా అడిగేస్తాడు, ఖరీదైన
మందువల్ల లాభం లేక పోతే ఈ బీదవాళ్ళతో ఖర్చు పెట్టించడం ఎందుకని.

అయితే కొత్త బాటిల్ తెచ్చాక అంతకు మునుపు మిగిలిన బాటిల్ లో నీళ్ళు కలిపి కథకుడి కన్నుగప్పి అబద్ధాలతో దాన్ని ముసలిదానికి ఎక్కించడం – అదీ ముసలిది బ్రతకదని తెలిసీ, ముసలిది చనిపోవడం జరుగుతాయి. ఆఖరి ప్రయత్నమని అందరినీ నమ్మించగలుగుతాడు డాక్టర్. కాని మన కథకుడికి బాటిల్ తీసి స్టోర్ రూం లో పారేసే సమయంలో ఏదో అసహజత్వం తోచింది. అప్పటికే ఆమె శవం బయటకు
వెళ్ళిపోతుంది.

బాటిల్ లో రంగు వెలిసిన ద్రావణం – ఎంత ప్రయత్నించినా దొరకని నిజం తెల్లారి డాక్టర్ మెడికల్ షాప్ కి కొత్త మందు బాటిల్ ఇచ్చి రమ్మన్నప్పుడు అర్థమై తన అసహనాన్ని వ్యక్త పరుస్తాడు. నీళ్ళుకలిపిన ద్రావణం కాకుండా అసలు మందు ఇచ్చివుంటే ఆమె బ్రతికేదేమో అన్న నిజాన్ని సూటిగా ప్రశ్నించినప్పుడు “ఆమె చచ్చాక ఫీజెవరిస్తారు – దానికి ఇదే మార్గమని, చూసి నేర్చుకో”మని గద్దిస్తాడు డాక్టర్.

కొత్త దుప్పటి కథాసంపుటి గురించి ప్రసంగిస్తున్న వి.ప్రతిమ

కొత్త దుప్పటి కథాసంపుటి గురించి ప్రసంగిస్తున్న వి.ప్రతిమ. వేదికపై మధురాంతకం నరేంద్ర, శశిశ్రీ, కేతు విశ్వనాథరెడ్డి తదితరులు


సహనం కోల్పోయిన కథకుడు బాటిల్ భళ్ళుమనేలా విసిరి కొట్టి ‘వైద్యం నేర్చుకుందుకు వచ్చాను గాని శవాలతో వ్యాపారం చేసేందుక్కాదు. దీనికన్న అడుక్కుతినడం నయ’మంటూ విసవిసా నడిచి వెళ్ళిపోతాడు.

ఇది నిజంగా వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్న వైద్యులకు చెంపపెట్టు. అవినీతి పట్ల రచయిత వెలిబుచ్చిన బలమైన ఛీత్కారం. మానవ సంబంధాలు మృగ్యమయి ఆర్థిక వ్యాపారాలు వాటి చోటునాక్రమిస్తున్న పరిణామంలో ఈ ఛీత్కారం ఒక్క సుబ్బరాజుకే కాదు సమాజంలో అవినీతిలో కుళ్ళిపోతున్న ప్రతిఒక్కరికీ.

ఈ కథ ద్వారా రచయితగా తనదైన బాధ్యతను విశిష్టమైన పద్ధతిలో విడమరచ గలిగారు రచయిత. అక్కడా ఇక్కడా కవిత్వపు ఛాయలు మామూలే. వానాకాలం నీళ్ళమందు అమ్ముకునే ఆసుపత్రులను ఎండాకాలం నీళ్ళమ్ముకునే కూల్ డ్రింక్ షాప్ లతో పోల్చడం, అస్థిపంజరానికి చర్మపు తొడుగేసి కందెన పూసినట్టుండటం… ఇలాంటివే మరికొన్ని కవనపు భావాలు ఈ సీరియస్ కథలోనూ కనిపిస్తాయి.
ప్రస్తుత అవినీతి భరిత సమాజం పట్ల, హేయమైన అవినీతిపరుల పట్ల అసహ్యంతోపాటు మనం చెయ్యవలసినదేమిటో కూడా రచయిత చూచాయగా వివరించారు. ప్రతివారూ చదవవలసిన కథ ఇది.

————————–

స్వాతీ శ్రీపాద అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

About స్వాతీ శ్రీపాద

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో 'మానస సంచరరే' శీర్షిక నిర్వహించారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

6 Responses to “నేర్చుకో” కథపై విశ్లేషణ

  1. జాన్ హైడ్ కనుమూరి says:

    బాగుంది
    ఇదే వూపు కొనసాగిస్తారని అశిస్తూ అభినందిస్తున్నాను

  2. devara says:

    నేర్చకో కధ విశ్లేషణ బాగుఁది. మంచిని మాత్రమే కాదు జీవుల ప్రాణాలతో కూడా వ్యాపారం చేసి డబ్బు ఎలా సంపాదించాలో గురువు చెప్తే తిరస్కరించిన శిష్యుని కొసమెరుపు డైలాగు బాగుంది. నిజానికిప్రాణం నిలిపే మందు (మెడిసిన్) ద్వారా కూడా తన ఫీజు రాబట్టుకునే జలగల్లాంటి వైద్యులున్నంతవరకు నిరుపేదల ప్రాణాల విలువ ఒక మందు సీసా ఖరీదంత…..

  3. వైద్యం వృత్తి…………వ్యాపారంగా మారడం బాధాకంరం….. మన సమాజానికి శాపం
    మనిషిని మనిషిగా చూపించే నేర్చుకో కథకు వందనం.

  4. sujatha says:

    makubaganachindi

  5. ramanarasimha says:

    Dear Sir/Madam,

    This story is very very heart-touching.

    Once i telephoned to Mr.Sannapureddy garu..

    When his story was pblshed in Andhrajyothy Sunday Magagine..

    E-mail: RPUTLURI@YAHOO.COM

Comments are closed.