చదరంగం

-ఒరెమూనా

జీవితం ఎప్పుడూ ఇంతే,

ఒక కిటికీలో మోయలేని విషాదం

ఒక కిటికీలో భరించలేని ఆనందం.

..

మరో ఉదయం అస్తమించింది,

రాతిరి చీకటిని తలుచుకుంటూ

కన్నీటి ప్రవాహం సాక్షిగా,

యద రోదన సాక్షిగా,

నిరాశ, నిస్పృహ, నిర్లిప్త,

నిజ శరీర సాక్షిగా

మరో ఉదయం అస్తమించింది.

రాతిరి చీకటిని తలుచుకుంటూ.

తుఫానులో కలిసిపొయిన వారి జ్ఞాపకాల సాక్షిగా,

విరిగిన తెరచాప, మరుగయిన నీరాహారాల సాక్షిగా,

అనుచరులందరి అయోమయ చూపుల సాక్షిగా,

ఓటమిని గుర్తుచేస్తున్న సముద్రం సాక్షిగా,

మరో ఉదయం అస్తమించింది.

రాతిరి చీకటిని తలచుకుంటూ.

మరో ఉదయాగమనం,

రాతిరి పరిమళాలతో

నవ్వుల జల్లుల సాక్షిగా,

యద కేరింతల సాక్షిగా,

ఆనంద, మాధుర్య, సగర్వ,

సమ్మోహ స్వ శరీర సాక్షిగా

మరో ఉదయాగమనం,

రాతిరి పరిమళాలతో

కోమలి చెవిలో గుసగుసలాడుతుండగా,

దేవదూత రెండు కొత్త రెక్కలు తొడుగుతుండగా,

సూర్యుడు పంపిన ఏడు గుర్రాలు వేచిచూస్తుండగా,

వర్షం వెలసిన అందమైన అడవి పిలుస్తుండగా,

మరో ఉదయాగమనం.

రాతిరి పరిమళాలతో.

జీవితం ఎప్పుడూ ఇంతే,

ఒక కిటికీలో మోయలేని విషాదం

ఒక కిటికీలో భరించలేని ఆనందం.

————————-

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

17 Responses to చదరంగం

  1. Subrahmanyam Mula says:

    good one!

  2. Purnima says:

    బాగుంది! నాకు నచ్చింది!

  3. అబ్బూరి రామకృష్ణారావుగారనుకుంటాను, ఆయన స్వీయచరిత్రలోనో లేక ఏదో రచనలోనో సరిగ్గా జ్ఞాపకం లేదు – ఆయన తనకు పద్యం అల్లటంలో మెళకువలు తన అన్నగార్ల పద్యాలు వాటిలోని చిలిపి చేష్టల వల్ల నేర్చుకున్నానని అన్నారు…

    అలాటి ఒక చిలిపి పద్యం ఎందుకో ఈ “చదరంగం” చూస్తే జ్ఞాపకం వచ్చింది…ఈ కవితకి “చదరంగం” అని కిరణ్ పేరెందుకు పెట్టాడో అర్థం కాకపోయినా…అయినా చదరంగానికి కిటికీలు ఎప్పుడు పట్టించారబ్బా…just kidding..:)…

    “బందరు పటణం దగర
    బంచిన సొమ్మున కంతులేదు”

    ఇదీ పద్యంలో ఒక భాగం…

    ఇది చూసి అబ్బూరి వారు “దగర” ఏమిటి నీ పిండాకూడు? ఇదేం పద్యం అని అంటే – వాళ్ళ అన్నగారు – ఓరి వెధవాయి దీంట్లో బ్రహ్మాండమయిన శబ్దాలంకారం ఉందిరా , చూడు అని పద్యాన్ని ఇలా విరిచి చెప్పారట

    బం-దరు పట్టణం దగర
    బం-చిన సొమ్మున
    కం-తు లేదు

    ఇంతే సంగతులు చిత్తగించవలెను…:)…:)..

  4. కవిత బావుంది!
    బహుశా “గడి” బదులు “కిటికి” అన్నట్టున్నారు.
    వంశి గారిచ్చిన పద్యంలో శబ్దాలంకారమేమిటో నాకు బోధపడలేదు కాని, “దగ్గర”ని మాత్రం ఛందస్సు (అది ఉత్పలమాల పాదం) కోసం తేల్చినట్టున్నారు!

  5. chavakiran says:

    వంశీ,

    చదరంగం టైటిల్ కి ఈ కవిత వప్పదు, కావీ కవితకు చదరంగం టైటిల్ నప్పుతుందని ఉంచాను.

    మూలా, పూర్ణిమా, కామేశ్వర రావు లకు
    నెనర్లు.

  6. జీవితం ఎప్పుడూ ఇంతే
    ఒక కిటికీలో మోయలేని విషాదం
    ఒక కిటికీలో భరించలేని ఆనందం…

    అద్భుతంగా చెప్పారు.

  7. ఎందుకో ఒక వృత్తం తిరిగిన భావన…

  8. కామేశ్వర రావు గారు, నాకు ఆ పద్యం నడ్డి ఎలా విరిచినా అందులో ఉన్న చిలిపితనం అర్థం అయి చావకే (చదరంగానికి కిటికీలు పెట్టించింది ఎలా అర్థం కాలేదో అలాగన్నమాట) అందుబాటులో ఉన్న “రథ” సారథులు చర్నాకోలతో వివరిస్తారని ఈ పొద్దులో పొడిపించా….

    ఇందులో “శ్లేషా”లంకారం ఏమీ లేదండోయ్, ప్రవరాఖ్యుడికిచ్చిన మాయాలేపనం మీద ఒట్టు….మన “కిరణం” అబ్బూరి వారంతో, వారి అన్నగారంతో అవ్వాలి అన్న ఆశ తప్ప…

    కిరణ్ – :)….కవిత బాగుంది, వస్తువు అద్భుతం…మేలి ముసుగు లో ఉన్నట్టు ఉంది..

    ఇంతే సంగతులు చిత్తగించవలెను…

    భవదీయుడు

  9. chavakiran says:

    >> కిరణ్ – :)….కవిత బాగుంది, వస్తువు అద్భుతం…మేలి ముసుగు లో ఉన్నట్టు ఉంది
    మరీ ఇన్ని అబద్దాలా, ఎంత వడ్డించే నువ్వు మా వాడివయితే మాత్రం 🙂

  10. chavakiran says:

    Vamsi,

    probably this might help a bit.

    చదరంగం అంటే చదరంగం కాదు
    చదరంగం అంటే ఆట కాదు
    చదరంగం అంటే జీవితమో మరేదో
    చదరంగం అంటే నలుపు తెలుపో మరేదో
    చదరంగం అంటే ఓటమీ తర్వాత, గెలుపు తర్వాత జరిగే పోరాటమో మరేదో
    చదరంగం అంటే మళ్లా మళ్లా జరిగే పోరాటమో మరేదో
    చదరంగం అంటే నువ్వు నేను లోక మరెవరో

    ఉదయమంటే ఉదయమో లేక మరేదో
    ఉదయమంటే రేపో లేక మరేదో
    ఉదయం అంటే భవిష్యత్తో మరేదో
    చీకటంటే చీకటో మరేదో
    ……………

  11. కిరణ్ గారూ – మీ మొదటి కవితే బాగుంది…నిఝ్ఝంగా…వస్తువు నిజంగానే బాగుంది…అబద్ధమేమీ లేదు…

    ఇక రెండో కవిత గురించి నిజం చెప్పమన్నారా / అబద్ధం చెప్పమన్నారా మహారాజా అంటే – మొహమాటం లేకుండా నేను నిజమే చెపుతున్నా – ఈ రెండో కవిత అవధానంలో గంటలకు బదులు సైకిలు బూరాలు ఊదినట్టు ఉంది !!

    నా బుఱ్ఱలో శేషప్రశ్న ఒకటి మాత్రం ఎప్పటినుంచో మిగిలిపోయింది…. ఇప్పుడు ఇక్కడ ఈరకంగా….”చదువుతున్న కవిత్వం మనిషికి తనంతట తానే తెలియాలా, లేకపోతే మనిషే తెలుసుకోవటనికి ప్రయత్నించాలా” అన్నది ఆ శేషప్రశ్న ..ఇప్పటిదాకా నేను ఆ రాసిన కవిమీద ఉంటుంది అన్న సమాధానంతో సరిపెట్టుకుంటున్నాను……మరి …

  12. chavakiran says:

    వంశీ,

    రెండోది కవిత కాదు. అది కేవలం మొదటి కవితకు సహాయ వ్యాఖ్యానం మాత్రమే.

    మనిషి తెలుసుకోటానికి ప్రయత్నించాలి, అప్పుడే దానిలో అందాలు ఒకటొకటి మనసులోకి వెళ్తాయి.

  13. “నేను కథో కవితో రాయడం లేదు. కల రాస్తున్నాను…కల సంగతి మాటల్లో చెప్పడం కష్టం. గొప్ప కళ ఎప్పటికీ గొప్ప కలే!..కష్టమయినా, కలలో కనపడి అస్పష్టంగా తెలిసేదాన్ని మనకే కాకుండా ఇతరులకి తెలియచెయ్యగలగడమే కళ. అదే కథ అదే కవిత. అలా వ్యక్తం చెయ్యలేకపోతే మన జ్ఞాపకాల్లోనే ఉంచడం మేలు” అని శ్రీశ్రీ అన్నది గుర్తుచేసుకోవలె… :)…

  14. కొడవళ్ళ హనుమంతరావు says:

    కిరణ్ కి అభినందనలు.

    అప్రస్తుతమైనా, వంశీ గారు ప్రస్తావించారు కనుక, అబ్బూరి వ్యక్తిత్వం యువతకి కొంత స్ఫూర్తినివ్వ వచ్చుననే ఆశతో ఇది రాస్తున్నాను.

    1974లో రేడియో ప్రసారం కోసం అబ్బూరిని బాలాంత్రపు రజనీకాంతరావు ఇంటర్వ్యూ చేసి రికార్డు చేసిన భాగం, “ఆకాశవాణి” లో పై ప్రస్తావన ఉంది. అది ఏమంత చెప్పుకోదగ్గది కాకపోయినా మిగిలిన సంభాషణా, ఇతర వ్యాసాలూ అబ్బూరి విశిష్టత్వాన్ని తెలుపుతాయి. పుస్తకం, నాట్యగోష్ఠి వాళ్ళు 1988లో ప్రచురించిన “అబ్బూరి సంస్మరణ.”

    కొడవళ్ళ హనుమంతరావు

  15. ఆహా – చాలా రోజులకు కనపడ్డారు…చక్కగా గుర్తు చేసారు KHR గారు ఆ పుస్తకం పేరు…మీలాంటివాళ్ళ వల్లయినా, కామధేనువు మీద నల్లమబ్బు చాయలు ఆవరించినట్టు మనమధ్య బ్రతుకుతున్న యువతలో అందరూ కాకపోయినా కొంతమంది అయినా ఆ పుస్తకంలోనుంచి, “పద్యాల్లో విచిత్రాల” లాగా కాకుండా , నేర్చుకునేది ఏమున్నా లేకున్నా చదివితే చాలు….

  16. John says:

    చదువుతున్నప్పుడల్లా ఒక కొత్త కోణం కనిపిస్తుంది.
    అభినందనలు

  17. చదరంగం శీర్షిక కోంచెం obscure గా నప్పుతుందనే అనిపిస్తోంది నాకు.

Comments are closed.