ఉపజాతి పద్యాలు – ౨

తేటగీతి

— ముక్కు శ్రీరాఘవకిరణ్

మొన్నటి వ్యాసంలో ఆటవెలదులు ఎలా వ్రాయాలో చర్చించుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఆటవెలదుల్లోనే మాట్లాడుకుంటూ చర్చని కొనసాగిద్దామా? పూర్తిగా పద్యాల్లోనే ఎందుకు… నాకు గద్యం కూడా తెలుసంటారా? గద్యం కూడా వాడదాం.

ఆ.వె.

చక్కగా మొదలిడి ఛందస్సు నేర్వగా
నిరుడు ఆటవెలది నేర్చినాము
నేర్చుకొందమిపుడు నెమ్మదిగా చాల
తేలిక గతిలోన తేటగీతి.

ముందు ఉపజాతులే ఎందుకు ఎంచుకున్నానో చెప్పాను కదా. వృత్తాలు కావు, ప్రాస ఉండదు, యతి మాత్రమే ఉంటుంది, ప్రాసయతి కూడా వాడుకోవచ్చు… కాబట్టీ అని. ఆటవెలదుల తర్వాత ఉపజాతులలో తేటగీతుల్ని నేర్చుకోవడం తేలిక. మరి తేటగీతి పద్య లక్షణమేమిటో చూద్దామా?

ఆ.వె.

సూర్యగణము ఒకటి సూటిగా చెప్పాక
ఇంద్రగణములపుడు రెండు చెప్పి
సూర్యగణపుజంట జోడించి చెప్పాలి
తేటగీతి తీరుతెన్నులిట్లు.

ఆ.వె.

ఉండబోదు ప్రాస ఉపజాతి కాబట్టి
యతిని గాని ప్రాసయతిని గాని
మొదటి నాలుగు గణములకు చెల్లించి తీ
రాలి తేటగీతి వ్రాయుచుంటె.

తేటగీతి లక్షణం –

తేటగీతిలో ఆటవెలదికి కొంచెం తేడాలో ఒకేలాంటి గణాలు ఉంటాయ్. ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, మళ్లీ రెండు సూర్యగణాలు. ఉపజాతి కాబట్టి ప్రాస నియమం లేదు. మొదటి నాల్గవ గణాల మొదటి అక్షరాలకి యతి చెల్లించాలి. ప్రాసయతి కూడా చెల్లించచ్చు.

చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
యయు సత్యంబు లోనుగా లుపడేని
లుగనేటికి తల్లుల డుపుచేటు.

ఇది ఏ పద్యమో గమనించారా? ఆఁ… ఇది తేటగీతే. (ఇది పోతనామాత్యుడు వ్రాసిన శ్రీమద్భాగవతంలో మొదట్లోనే వస్తుంది.)

తేటగీతిలో నేనిప్పటి వరకూ శతకాలు చూడలేదు, అసలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ (శతకాలు లేకపోతేనేం) ఆటవెలదిలో లాగానే తేటగీతిలో కూడా లెక్కలేనన్ని పద్యాలు ఉన్నాయ్. మచ్చుకి మరొక రెండు తేటగీతులు చూడండి.

తే.గీ

అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేషమత్త
చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేల

తే.గీ

ల్లి యొడిలోన తలిరాకు ల్ప మందు
డుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
మ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!
హృదయమే లేని నీ పూజ లెందుకోయి?

ఇప్పుడు మనకి తేటగీతి లక్షణం తెలుసు. తేటగీతి ఉదాహరణలూ రెంటిని చూసాం. ఇంక తేటగీతులు వ్రాసేద్దామా… దేని మీద వ్రాయాలి? మళ్ళీ అమ్మ మీద వ్రాద్దామా?

భావనలు మీకు తెలుసున్నవే. అందరం అనుభవించేవే! అమ్మతనం గురించి, అమ్మ గొప్పతనం గురించి, అమ్మ అంటే ఉన్న ఇష్టం గురించి చెప్పచ్చు. “అమ్మ” అన్న పదమే ఒక సూర్య గణం. కాబట్టి దాన్ని అలాగే వాడచ్చు. ఇప్పుడు తర్వాతి ఇంద్రగణాల గురించి కొంచెం కసరత్తు చెయ్యాలి మరి. “నిను మించు దైవము” అన్నామనుకోండి. రెండు ఇంద్రగణాలూ వచ్చేసాయ్. ఇప్పుడు యతి సరిపోయేలా రెండు సూర్యగణాలు రావాలి. “అమ్మ” కాబట్టి యతి సరిపోయేలా “అవనిలోన” అనచ్చు. అప్పుడు వ్యాకరణం ఒప్పుకుంటుందా అన్నది చూసుకోవాలి. ఉకారానికి అచ్చు పరమైతే సంధి జరుగుతుంది అని చిన్నయ్యసూరి చెప్పారు కదా. అంటే దైవము, అవనిలోన కలిస్తే దైవమవనిలోన అవుతుంది. అప్పుడు గణాలు చెట్టెక్కుతాయి కదా. కాబట్టి ఇప్పుడు కొంచెం ఆలోచించి సంధి జరిగినా ఇబ్బందిలేకుండా పదాలు వాడాలి. అంటే “దైవము” బదులు మరో పదం వాడాలి. “దైవతము” అంటే పోలా అంటారా! (మీరు అంతటి సమర్థులనీ నాకు తెలుసు). ఇప్పుడు మొదటి పాదం పూర్తయ్యింది. “అమ్మ! నిను మించు దైవత మవని లోన”… తర్వాతి పాదం ప్రారంభంలో “లేదు” అని చెప్తాం.

రెండవ పాదం “లేదు” అని ప్రారంభమైంది. యతి సరిపోయేలా సూర్యగణాలు ముందు చూసేసుకుందామా? “లేదు” కి యతి సరిపోయే పదాలేమిటో అన్వేషించండి. ర-ఱ-ల-ళ లకి యతి చెల్లుతుంది కాబట్టి రీతి, రేపు, లేక … లాంటివి వాడచ్చు. లేదంటే “లేదు” అనే మళ్లీ వాడచ్చు కూడా.

లేదు… ఏం లేదు? “సాటి” లేదు. యతి సరిపోవాలి కాబట్టి “సాటి”ని చివరకి గెంటి “లేదు సాటి” అని చివరి రెండు సూర్యగణాలూ పూర్తిచేసాం. ఇప్పుడు ఏ విషయంలో సాటిలేదో రెండు ఇంద్రగణాల్లో చెప్పాలి. వాత్సల్యంలో ప్రేమలో కరుణలో జాలిలో సాటి లేదు. ఇక్కడ “వాత్సల్యమున నీకు” అని పూర్తి చేద్దామా? ఆ విధంగా రెండవ పాదం “లేదు, వాత్సల్యమున నీకు లేదు సాటి” అని పూర్తి చేసాం. ఇక్కడ వాక్యం పూర్తి చేసేసాం కాబట్టి మూడవ పాదం ఏమైనా వ్రాసుకోవచ్చు. ఉదాహరణకి “ఋణము నేమిచ్చి తీర్తును? తీర్చలేను” అని పూరించచ్చు. ఇలా మూడో పాదం చెప్పాక నాలుగో పాదంలో ఋణం తీర్చలేము కాబట్టి గౌరవిస్తాను నమస్కరిస్తాను అని చెప్పచ్చు. వందనములు చేతునమ్మ అంటే బావుంది. చేతులెత్తి అని ముందు కలిపితే ఇంకా అందం వస్తుంది. “చేతులెత్తి వందనములు చేతు నమ్మ”.

ఇప్పుడు పద్యం మొత్తం ఒకసారి సరిచూసుకుందామా?

తే.గీ

అమ్మ నిను మించు దైవత మవనిలోన
లేదు వాత్సల్యమున నీకు లేదు సాటి
ఋణము నేమిచ్చి తీర్తును తీర్చలేను
చేతులెత్తి వందనములు చేతునమ్మ

బానే ఉంది, వ్యాకరణకోణంలో చూస్తే వందనములు, చేతునమ్మ కలిసి “వందనములు సేతునమ్మ” అవుతుంది (గసడదవాదేశ సంధి). చివరికి పద్యం ఇలా తయ్యారైంది –

తే.గీ.

మ్మ! నిను మించు దైవత వనిలోన
లేదు, వాత్సల్యమున నీకు లేదు సాటి,
ణము నేమిచ్చి తీర్తును? తీర్చలేను
చేతులెత్తి వందనములు సేతునమ్మ.

ఏ పద్యమైనా చదవగా, అభ్యాసం చేయగా నడక చక్కగా అర్థమై బాగా వ్రాయడం అలవడుతుంది. కాబట్టి మీకు ఇస్తున్న హోం వర్కు (అ) తేటగీతులు చదవడం, (ఆ) చదివి కనీసం ఒకటి రెండు తేటగీతులు వ్రాయడం.

తే.గీ.

మొదట ఆటవెలది నేర్చి ముచ్చటైన
తేటగీతిని నేర్చాము తెలుగు పద్య
ములలొ సీసాలు కందాలు ముందు ముందు
నేర్చుకొందాము సెలవిక నెనరులండి.

—————————————————-

ముక్కు శ్రీ రాఘవ కిరణ్

ప్రథమ శ్రేణి పద్య బ్లాగరి ముక్కు శ్రీ రాఘవ కిరణ్ తన వాగ్విలాసము బ్లాగులో పద్యాలు రాస్తూంటారు. చిత్ర గీత సాహిత్యము, అనే బ్లాగు కూడా రాస్తూంటారు. గతంలో చిత్రోల్లాస అనే బ్లాగును కూడా రాసేవారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

6 Responses to ఉపజాతి పద్యాలు – ౨

  1. mitrama,

    chala goppaga undi mee yokka padya sampada.

    nizamgaa neenu chala santoshinchanu.

    neenu kooda eemaina sahayam ceddamanukontunnanu.

    ela ceyyalo ceppandi.

  2. ఆర్యా ! మీ వాగ్విలాసంలో నాన్న శీర్షికతో ” పితృదినోత్సవం సందర్భంగా వ్రాసిన పద్యాలలో ఉత్పలమాల వృత్త పద్యంలో 3 వ పాదంలో ప్రయోగించిన యతి పేరేమిటో దయ చేసి తెలియ జేయ గలరా ?
    నాకు తెలిసి అనుస్వారపూర్వక ట వర్గ త వర్గాలు అనుస్వార సంబంధ యతి పేర పరస్పరం చెల్లుతాయి తప్ప మరో విధంగా చెల్లవు. మీ ప్రయత్నంబాగుంది. మీ పద్యాలు మరీ బాగున్నాయి.
    నమస్తే.
    చింతా రామ కృష్ణా రావు.
    {ఆంధ్రామృతం బ్లాగు}

  3. RAMBABU.M says:

    MEE PADYALLU CHALA BAGUNNAIE

  4. రాఘవ says:

    వంశీగారూ, రాంబాబు గారూ,
    ధన్యోஉస్మి.

    వేంకటసుబ్బయ్య గారూ,
    మీరు సాహసం చేద్దామనుకుంటూంటే నన్నడిగితే పద్యాలు వ్రాయమనే చెప్తాను 🙂
    ఒకవేళ ఎలా వ్రాయాలంటారూ… ఈ వ్యాసాలు కొంత ఉపయోగపడొచ్చు. రామకృష్ణారావు, కామేశ్వరరావుగార్ల బ్లాగులు కూడ చూడగలరు.

    రామకృష్ణారావు గారూ,
    మీరు సూచించినదాని ప్రకారం యతి సరిపోలేదనే తెలుస్తోంది. నాకు మీరు చెప్పేవరకూ ఈ నియమం కూడ తెలియదు. క్రొత్తవిషయం చెప్పినందుకు కృతజ్ఞుణ్ణి. ఇక ఆ పద్యాలు ఎప్పుడో వ్రాసినవి కాబట్టి ఇప్పుడు యతికోసమని ప్రత్యేకంగా మార్చడంలేదు. ఇక ముందు ఈ తప్పు రాకుండ చూసుకుంటాను.

  5. Challa Ramalinga Sarma says:

    Can we share some of your poems [ with your name and with the name of your blog] in Facebook among our friends.?

    Hope my above query will bring a positive reply…

    Challa Ramalinga Sarma

Comments are closed.