మృతజీవులు – 17

-కొడవటిగంటి కుటుంబరావు

ఆటలో అతను నమ్మదగినవాడు కాదని మనం మొదట్లోనే తెలుసుకున్నాం; అతను చాలా రకాల మోసాలు చేసేవాడు. అందుచేత తరచూ పేకాట ఇంకొక ఆటగా పరిణమించేది. అతన్ని మెత్తగా తన్నేవారు. లేకపోతే పుస్తీలు పట్టుకుని పీకేసేవారు. ఒక్కోసారి అతను ఒంటిపుస్తీతో, అదికూడా కొంత పోగొట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడు. అయితే అతని దవడల ధర్మమా అంటూ కేశసమృద్ధి గలవి కావడం చేత, ఆ నష్టం త్వరలోనే పూడి అతని పుస్తీలు ఎప్పటికన్నా శోభగా తయారయ్యేవి. వీటన్నిటినీ మించిన వింత ఏమిటంటే ఇది రష్యాలో మాత్రమే సంభవం – త్వరలోనే అతనికి ఇంతా చేసిన మిత్రులు మళ్ళా తగిలేవారు; ఏమీ ఎరగనట్టుగా పలకరించుకునే వాళ్ళు; అతనిలోగాని, వాళ్ళలోగాని ఎలాటి వికారమూ కనిపించేది కాదు.

పెళ్ళిళ్ళనూ బేరాలనూ చెడగొట్టేవాడు. తాను ఆ మనిషిపట్ల శత్రువులా ప్రవర్తిస్తున్నానని ఐనా గ్రహించేవాడు కాదు. మీదుమిక్కిలి ఆ మనిషి కనిపించినప్పుడు మామూలుగానే పలుకరించి “ఎంత ఛండాలుడివి నన్ను చూడటానికి రావేం?” అని అడిగేవాడు.

ఒక విధంగా నజ్‌ద్ర్యోవ్ చారిత్రక పురుషుడు. అతను హాజరైన ఏ సమావేశమూ కొంత “చరిత్ర” సృష్టించకుండా ఉండటం జరగలేదు. ఏదో ఒక అప్రతిష్ట రానే వచ్చేది. నృత్యశాల నుంచి అతన్ని పోలీసులు అవతలికి పట్టుకుపోవటమైనా జరిగేది. అతని మిత్రులు స్వయంగా అతనిని బయటికి గెంటటమైనా జరిగేది. అలా జరగనప్పుడు మరెవ్వరికీ జరిగే అవకాశం లేనిదేదో ఒకటి అతనికి జరిగేది: తాగేచోటికి పోయి తప్పతాగి అచ్చగా నవ్వటమే చేసేవాడు, లేకపోతే ఘోరమైన కల్పనలన్నీ చేసి మాట్లాడి చివరకు తనను చూసి తానే సిగ్గుపడేవాడు. అతను ఉత్త పుణ్యానికి అబద్ధాలాడేవాడు; ఉన్నట్టుండి తనకు గులాబీ రంగు గుర్రమో, నీలం రంగు గుర్రమో ఉండేదని బుకాయించేవాడు. లేకపోతే ఇలాంటివే ఇంకేవో అనేవాడు. వినేవాళ్ళకు ఒళ్ళు మండిపోయి అతనితో మాట్లాడటం మానివేసి వెళ్ళిపోయేవారు, “కొయ్యరా బాబూ” అంటూ. ఇతరులను అకారణంగా “ఏడిపించటం” కొందరికి చాలా సరదా. మంచి హోదాలో ఉన్నవాడై ఉంటాడు, పెద్ద మనిషి లాగా కనబడతాడు. ఏవో పతకాలు తగిలించుకుని ఉంటాడు. మనకు షేక్‌హ్యాండు ఇచ్చి, ఎంతో లోతుగా ఆలోచిస్తే గాని అంతుబట్టని గంభీర విషయాలను గురించి మాట్లాడతాడు, మరుక్షణం మనం చూస్తూండగానే మనమీద ఏదో చిలిపితనం చేస్తాడు; అది ఎవరో పల్లెటూరి కాపీయిస్టు గుమాస్తాలు చెయ్యవలసిన పనిగా ఉంటుందిగాని, లోతుగా ఆలోచిస్తేగాని అంతుబట్టని గంభీర విషయాలు మాట్లాడేవాడు చెయ్యదగినదిగా ఉండదు. అందుచేత మనం విస్తుపోయి చూస్తాం. నజ్‌ద్ర్యోవ్‌కు ఇటువంటి జబ్బున్నది; అవతలివాడు ఎంతబాగా చనువున్నవాడైతే అంత ఉత్సాహంతో ఏడిపించేవాడు; ఎవడూ నమ్మటానికి వీల్లేని చౌకబారు అబద్ధాలు ప్రచారం చేసేవాడు. పెళ్ళిళ్ళనూ బేరాలనూ చెడగొట్టేవాడు. తాను ఆ మనిషిపట్ల శత్రువులా ప్రవర్తిస్తున్నానని ఐనా గ్రహించేవాడు కాదు. మీదుమిక్కిలి ఆ మనిషి కనిపించినప్పుడు మామూలుగానే పలుకరించి “ఎంత ఛండాలుడివి నన్ను చూడటానికి రావేం?” అని అడిగేవాడు. ఒక విధంగా నజ్‌ద్ర్యోవ్ బహుముఖ ప్రజ్ఞ కలవాడు, అంటే ఏదిబడితే అది చెయ్యటానికి సిద్ధమయేవాడు. ఒకేక్షణంలో అతను మనవెంట ప్రపంచంలో ఏమూలకైనా వస్తాననేవాడు. మనకు ఏ సహాయం కావాలన్నా చేసిపెడతాననేవాడు. మనతో ఏ వస్తువునైనా సరే మారకం వేసుకోవటానికి సిద్ధపడేవాడు. మార్చుకోవటానికి తుపాకులు, కుక్కలు, గుర్రాలు – ఏవైనా సరే, అతనికి లాభదృష్టి కూడా ఉండేది కాదు; అతని అంతస్సులో ఉండే చైతన్యమూ, అతని స్వభావమూ అతన్ని అలా ప్రేరేపించేవి. ఏ సంతలోనో పేకాట దగ్గర అతనికి అమాయకుడు తటస్థపడి డబ్బు గుంజుకోనిస్తే అతను దుకాణాల్లో తన కంటిని ఆకర్షించిన వస్తువులను కొల్లలుగా కొనేసేవాడు. గుర్రాల పట్టీలూ, ధూపం కొవ్వొత్తులూ, ఆయాకు రుమాళ్ళూ, మగగుర్రమూ, ఎండుద్రాక్షలూ, వెండితొట్టీ, హాలండు లినెనూ, తెల్లని గోధుమపిండీ, పొగాకూ, పిస్తోళ్ళూ, హెరింగ్ చేపలూ, చిత్తరువులూ, ఒక తరిమెణ యంత్రము, కుండలూ, బూట్లూ, పింగాణీ సరుకు – డబ్బు అయిపోయేదాకా కొనేవాడు. అయితే సాధారణంగా ఈ కొన్న సరుకంతా ఇంటికి చేరటమనేది ఉండేది కాదు; దాదాపు అదంతా ఆరోజే అదృష్టం గల మరో జూదగాడి చేతికి మారేది. ఒక్కొక్కప్పుడు అదనంగా అతని పైపూ, పొగాకు సంచీ, ఇంకొకప్పుడు అతని నాలుగు గుర్రాలూ, బండీ, బండీవాడు కూడా పోవటం జరిగేది; ఆ తరువాత అతను కట్టుబట్టలతో బయలుదేరి ఏ స్నేహితుని కాళ్ళో పట్టుకుని అతని బండిలో వచ్చేసేవాడు. నజ్‌ద్ర్యోవ్ అలాంటి మనిషి! ఇది కేవలం కల్పిత పాత్ర అనీ, ఈ రోజుల్లో నజ్‌ద్ర్యోవ్‌లు లేరనీ అనుకోగలరు. అది శుద్ధపొరపాటు. నజ్‌ద్ర్యోవ్‌లు నశించిపోవటానికి ఇంకా చాలా దీర్ఘకాలం పడుతుంది. వారు మనలో ఎక్కడబడితే అక్కడే ఉన్నారు; కాకపోతే వాళ్ళు ఇంకోమాదిరి కోటు వేసుకోవచ్చు; మనుషులు పరిశీలనగా చూసే అలవాటులేక ఇంకో కోటు వేసుకున్న మనిషిని చూసి ఇంకో మనిషి అనుకోవటం కద్దు.

ఇంతలో మూడుబళ్ళూ నజ్‌ద్ర్యోవ్ ఇంటిమెట్టు దగ్గరకు వచ్చి ఆగాయి. వీరికోసం లోపల ఎవరూ ఎదురుచూస్తున్నట్టు లేదు. భోజనాల నడిమధ్య ఇద్దరు కమతగాళ్ళు కర్రల మంచె మీద నిలబడి, అంతూ పొంతూ లేని పాట ఏదో పాడుతూ సున్నం కొడుతున్నారు.; నేల అంతటా సున్నం మరకలు. నజ్‌ద్ర్యోవ్ ఆ కమతగాళ్ళనూ, కర్రల మంచెలనూ తక్షణం బయటికి పొమ్మని ఆజ్ఞాపించి అవతలి గదిలోకి గబగబా వెళ్ళాడు. అతను వంటమనిషికి భోజనం గురించి హెచ్చరికలు చెయ్యటం అతిథులకు వినిపించింది. అప్పటికే కడుపులో ఆకలి రాచటం ప్రారంభించిన చిచీకవ్ మరి అయిదు గంటల దాకా తనకు భోజనప్రాప్తి లేదని తెలుసుకున్నాడు. నజ్‌ద్ర్యోవ్ తిరిగి వస్తూనే తన అతిథులను వెంటబెట్టుకుని తన కింద ఉన్న గ్రామమంతా తిప్పి, ప్రతిదీ చూపించి, రెండు గంటల చిల్లర కాలంలో వారు చూడవలసినది ఏదీ మిగలకుండా చేశాడు. ముందుగా వాళ్ళ గుర్రాలశాలకు వెళ్ళి రెండూ ఆడ గుర్రాలనూ, ఒక మగ గుర్రాన్నీ చూశారు. ఆడ గుర్రాలలో ఒకటి మచ్చలది, రెండవది బ్రౌను రంగుగా ఉన్నది. మగ గుర్రం చూడటానికి అంత ఇంపుగా లేదు, కాని నజ్‌ద్ర్యోవ్ దాన్ని పదివేల రూబుళ్ళు పోసి కొన్నానని ప్రమాణం చేశాడు.

“నువ్వు పదివేలు పోసి కొనలేదు. అది వెయ్యి కూడా చేయదు” అన్నాడు బావ.

“ప్రమాణపూర్తిగా పదివేలిచ్చి కొన్నాను” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“నువ్వు ఎన్ని ప్రమాణాలైనా చెయ్యి” అన్నాడు బావ.

“సరే పందెం వేస్తావా?” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

బావ పందెం వెయ్యటానికి ఇష్టపడలేదు.

తరవాత నజ్‌ద్ర్యోవ్ వాళ్ళకి గుర్రాలులేని ఖాళీ కొట్టాలు చూపించి అందులో మరికొన్ని గుర్రాలు ఉండేవని చెప్పాడు. అదే గుర్రపుశాలలో వారికి ఒక మేక కూడా కనిపించింది. గుర్రాల వెంబడి మేక ఉండటం మంచిదని పాత నమ్మకం. ఆ మేక గుర్రాలకు అలవాటు పడిపోయి, వాటి పొట్టల కిందుగా నడిచింది, స్వతంత్రంగా తరవాత నజ్‌ద్ర్యోవ్ వాళ్ళను తీసుకుపోయి కట్టేసి ఉన్న ఒక తోడేలు పిల్లను చూపించాడు. “ఇదుగో తోడేలు పిల్ల. అది పౌరుషంగా ఉండగలందులకు కావాలని దానికి పచ్చిమాంసం వేయిస్తాను.” అన్నాడతను. అక్కడినుంచి వారు చెరువును చూడబోయారు. నజ్‌ద్ర్యోవ్ చెప్పిన ప్రకారమైతే అందులో ఎంత పెద్ద చేపలున్నాయంటే ఇద్దరు మనుష్యులు పట్టుకుని లాగినా అవి సులువుగా బయటకు రావు. ఈ విషయం తాను నమ్మలేనని బావ అన్నాడు.

“చిచీకవ్ నీకు భలే కుక్కలను రెంటిని చూపించబోతున్నాను.వాటి బలం అద్భుతం. వాటి బొచ్చు సూదుల్లాగా ఉంటుంది” అంటూ అతను ఒక అందమైన ఇంటికేసి దారితీశాడు. ఆ ఇంటి చుట్టూ ఖాళీ ఆవరణ ఉండి, దానికి నలువైపులా కంచె ఉన్నది. వాళ్ళు ఆవరణలోకి పోగానే అనేకరకాల కుక్కలు కనిపించాయి, రకరకాల జాతులకు చెందిన తోడేలు కుక్కలు. వాటిలో అన్నివిధాల రంగులూ, కలగలుపులూ ఉన్నాయి – కాఫీ రంగువీ, నలుపూ గోధుమరంగు కలిసినవీ, నలుపూ-తెలుపువీ, తెలుపూ- గోధుమ రంగువీ, నల్ల చెవులవీ, బూడిదరంగు చెవులవీ.. వాటి పేర్లు కూడా చిత్రంగా ఆజ్ఞల్లాగా ఉన్నాయి: కొట్టెయ్యి, మూలిగెయ్యి, పరిగెత్తు, పీల్చు, మెల్లకన్ను, చూపుడుముల్లు, బాగామాడు, అగ్గి, మింగు, తొందర, నిధి, కాపలా. నజ్‌ద్ర్యోవ్ వాటిపట్ల కన్నతండ్రి కన్న ఎక్కువగా ఉన్నాడు. అవి శునక మర్యాదను అనుసరించి అతిథులను చూడగానే తోకలెత్తి ఆడిస్తూ ఎదురువచ్చాయి. ఒక డజను కుక్కలు తమ కాళ్ళను ఎత్తి నజ్‌ద్ర్యోవ్ భుజాల మీద పెట్టాయి. మూలిగెయ్యి చిచీకవ్ పైన చాలా ప్రేమ ప్రదర్శిస్తూ వెనక కాళ్ళపైన నిలబడి అతని మూతి నాకేసరికి, అతను పక్కకు తిరిగి ఉమ్మేశాడు. వాళ్ళు కుక్కలను చూశారు – మంచి కుక్కలే. తారవాత వాళ్ళు క్రిమియా దేశపు ఆడకుక్క నొకదాన్ని చూడబోయారు. అది గుడ్డిది. చావటానికి సిద్ధంగా ఉన్నదని నజ్‌ద్ర్యోవ్ చెప్పాడు. రెండేళ్ళ క్రితం అది మంచి కుక్కేనట. ఆడకుక్కను చూశారు; అది గుడ్డిదే. తరవాత వాళ్ళు నీటిమరను చూడబోయారు. అది ఇరుసుమీద తిరిగేటప్పుడు పైరాయి బరువుపడే రింగు కాస్తా పోయింది. “కమ్మరి కార్ఖానా దగ్గరే ఉంది” అన్నాడు నజ్‌ద్ర్యోవ్. కొద్ది దూరం ముందుకు వెళ్ళాక, కమ్మరం చేసే చోటు వచ్చింది. దాన్ని కూడా చూశారు.

“ఆ పొలం చూశారా? అందులో కుందేళ్ళు ఎన్ని ఉన్నాయంటే, నేల కనబడదు. నేను నా చేతులతో ఒకదాన్ని వెనకకాళ్ళు పట్టి పట్టుకున్నాను.” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“నయం; కుందేళ్ళను చేతులతో పట్టుకునేవు” అన్నాడు బావ.

“పట్టుకున్నానంటుంటేనే! కావాలని పట్టుకున్నాను. ఇప్పుడు మనం నా ఆస్తి సరిహద్దు దాకా వెళ్ళొద్దాం.” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

అతను తన అతిథులను వెంటబెట్టుకుని పొలాలకు అడ్డంగా తీసుకుపోయేవాడు. వాటిలో అక్కడక్కడా గుట్టలున్నాయి. అతిథులు ఎగుడుదిగుడు డొంకలకూ, దున్నిన పొలాలకూ మధ్యగా పోవాల్సి వచ్చింది. చిచీకవ్‌కు ఆయాసమనిపించసాగింది. చాలాచోట్ల కాళ్ళు నీళ్ళలోకి దిగబడ్డాయి. అది పల్లపు భూమి. మొదట్లో వాళ్ళు దారి చూసుకుంటూ జాగ్రత్తగా నడిచారు గాని, అందువల్ల లాభం లేదని తెలిశాక దారి చూడటం మానేశారు. చాలాసేపు నడవగా సరిహద్దు వచ్చింది. అక్కడ కర్రల కంచె, సన్నని కందకమూ ఉన్నాయి.

“ఇదే సరిహద్దు. దానికి ఇవతల ఉన్నదంతా నా భూమి. అవతల కూడా, ఆ దూరంగా కనిపించే అడవీ, దాని అవతల ఉన్నదంతా కూడా నాదే” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“అవునుగాని ఆ అడవి నీదెప్పుడయింది? ఇటీవల కొనలేదు గదా” అదివరకు అది నీది కాదే?” అన్నాడు బావ.

“అవును, ఈ మధ్యనే కొన్నాను.” అని నజ్‌ద్ర్యోవ్ జవాబు చెప్పాడు.

“ఇంతలో ఎప్పుడు కొనేశావు?”

“మొన్ననే కొన్నాను. చాలా ఖరీదుపెట్టి కొన్నానులే”

“మొన్న నువు సంత దగ్గర ఉంటివిగా?”

“మతిమాలినవాడా, సంత దగ్గర ఉంటే కొనటానికేం? నేను సంత దగ్గర ఉన్నాను. నేను లేని సమయంలో నా మేనేజరు కొనేశాడు.”

“మేనేజరు మటుకు ఎలా కొంటాడు?” అంటూ బావ అయోమయూంగా తల అడించాడు.

అతిథులు వెళ్ళిన దారినే తిరిగి వచ్చారు. నజ్‌ద్ర్యోవ్ వారిని తన చదువుకునే గదికి తీసుకుపోయాడు.ఆ గదిలో మామూలుగా వుండదగిన పుస్తకాలు గాని, పత్రికలు గాని లేవు. ఆ గది గోడలకు కత్తులూ, రెండు తుపాకులు వేళ్ళాడుతున్నాయి. వాటిలో ఒకదాని ఖరీదు మూడువందల రూబుళ్ళు, రెండవది ఎనిమిది వందలు. బావ వాటిని పరీక్షించి తల అడ్డంగా ఆడించాడు. తరవాత వాళ్ళు టర్కీ దేశపు బాకులు చూశారు. అందులో ఒకదాని మీద పొరపాటున ‘సవేలి సిబిర్యాకన్ తయారుచేసినది’ అని రాసివున్నది. తరవాత వాళ్ళు ఒక బేరల్ ఆర్గను చూశారు. నజ్‌ద్ర్యోవ్ పిడి పట్టుకుని తిప్పితే అది బాగానే మోగింది. కాని మధ్యలో ఏదో పొరపాటు జరిగి డాన్సు పాట కాస్తా ఇంకొక పాటలోకి మారి, మళ్ళీ అది ఇంకొక డాన్సుపాట అయి ఊరుకున్నది. నజ్‌ద్ర్యోవ్ పిడి తిప్పటం మానేశాడు. అయినా ఆర్గను గొట్టాలలో ఒకటి ఆగక చాలాసేపు మోత పెడుతూనే ఉంది.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.