మృతజీవులు – 11

“ఏమమ్మా, మేము ప్రయాణీకులం. ఈ రాత్రికి కాస్త తల దాచుకోనియ్యి”, అన్నాడు చిచీకవ్.

“మొత్తం మీద గట్టివాళ్ళేనే. ఇదేనా వచ్చేవేళ? ఇది వసతి గృహం కాదు, దొరసాని గారి ఇల్లు”, అన్నది ముసలిది.

“మేమేం చెయ్యాలి, చెప్పూ. మేం దారి తప్పాం. ఇది ఆరుబయట గడిపే రాత్రేనా? వాతావరణం చూడూ!”

“అవును వాతావరణం చాలా చీకటిగ ఉంది. మంచి వాతావరణం కాదు”, సేలిఫాన్ వంతపలికాడు.

“నోరు ముయ్యరా, వెధవా!” అన్నాడు చిచీకవ్.

“మీరెవరేమిటి?” అన్నది ముసలిది.

“ఒక కామందును”

కామందు అనే మాట చెవినిబడగానే ముసలిది ఆలోచించి, “క్షణం ఉండండి, యజమానురాలితో చెబుతాను”, అని రెండు నిమిషాలలో లాంతరు పట్టుకుని తిరిగి వచ్చింది. గేటు తలుపులు తెరుచుకున్నాయి. ఇంకొక కిటికీలో కూడా వెలుతురు కనిపించింది. బండి లోపలికి వెళ్ళి ఒక చిన్న భవంతి ముందు ఆగింది. చీకటిలో ఇంటి స్వరూపం తెలియరావటం లేదు. కిటికీలోంచి వచ్చే కాంతి ఇంటి ఒకవేపునే పడుతున్నది. ఆ కాంతి ఒక నీటి మడుగుమీద పడటం వల్ల అది కూడా కనిపిస్తున్నది. వాన ఇంటి కప్పు మీది చెక్కల పైన పడి చప్పుడు చేస్తున్నది. నీళ్ళ గొట్టం గుండా నీరు దొణదొణా ప్రవహిస్తున్నది. ఇంతసేపూ కుక్కలు అన్ని స్థాయిలలోనూ అరుస్తున్నాయి. ఒక కుక్క మోర ఎత్తి ఎవరో బాగా డబ్బిస్తున్నట్టు ఎంతో శ్రమపడి దీర్ఘంగా కూస్తున్నది; మరొకటి చర్చిలో పవిత్ర పాత్రలను సంరక్షించే వాడిలాగా అతి వేగంతో కంయి కంయి మంటున్నది; ఈ రెంటికీ మధ్యగా టపాబండీ గంట లాగా తారాస్థాయిలో అరుస్తున్నది, బహుశా కుక్కపిల్ల అయి ఉంటుంది, దీనితో ఒక మందరస్థాయికుక్క పోటీ చేస్తున్నది. బహుశా దృఢమైన శునకత్వం గల ముసలికుక్క అయి ఉంటుంది. చర్చిలో బృందగానం జోరుగా సాగేటప్పుడు బొంగురుగా పాడేవాడి గొంతు ఇలాగే ఉంటుంది. ఉచ్ఛస్థాయిలో పాడేవాళ్ళంతా మునివేళ్ళపై నిలబడి స్థాయి అందుకోవడానికి మోరలెత్తి సాగుతూ ఉంటారు. వీడు మటుకు చతికిలపడి నేలకు అంటుకు పోయేవాడిలా కూచొని మాసిన గడ్డాన్ని మెడపట్టీలోకి దూర్చుకుని భోం అని ఒక్క స్వరం పలికేసరికి కిటికీల అద్దాలన్నీ దద్దరిల్లిపోతాయి. ఇటువంటి కుక్కల బృందం మొరుగునుబట్టే ఇది మంచి గ్రామమని అనుకోవచ్చు.

కాని మన కథానాయకుడు తడిసి చలికి బిగుసుకు పోయి ఉండటాన పక్కను గురించి తప్ప మరి దేన్ని గురించీ ఆలోచించలేదు. బండి ఆగీ ఆగక ముందే అతను బయటికి దూకి తూలినంత పనిచేశాడు. మెట్లమీదికి మరొక ఆడది వచ్చి అతన్ని లోనికి తీసుకుపోయింది; ఈ మనిషి ముసలిదానికన్నా చిన్నది, కాని ముసలిదాన్ని పోలియున్నది. చిచీకవ్ గదిని ఒకటి రెండు సార్లు సంగ్రహంగా చూచాడు. గదిగోడలకు పాతరకం చారల కాగితం అంటించారు. పక్షుల చిత్రాలున్నాయి. కిటికీల మధ్య భాగంలో పాతకాలపు అద్దాలు, ఆకుల ఆకారంలో చేసిన నల్లటి చట్రాలు గలవి, ఉన్నాయి. ప్రతి అద్దం వెనకా ఒక ఉత్తరమో పాత చీట్లపేకో, కాలి తొడుగో కుక్కి ఉన్నది. గోడన ఒక గడియారం ఉన్నది, దాని మొహాన పూవులు వేసి ఉన్నాయి. అతనికి అవి తప్ప ఇంకేమీ కనిపించలేదు. అతని కళ్ళనెవరో తేనె పూసినట్టుగా రెప్పలు అంటుకుపోతున్నాయి. మరొక నిమిషానికి ఇల్లుగలావిడ స్వయంగా వచ్చింది. వయసు మళ్ళిన మనిషి, తొందరపాటుగా నెత్తికొక కుళాయి తగిలించుకున్నది. మెడకు ఫ్లానల్ చుట్టుకున్నది. చిన్న ఎస్టేట్లకు హక్కుదార్లయిన ఇలాటి బుద్ధిమంతురాళ్ళు, తలలు ఒక పక్కకు కొద్దిగా ఒరగేసి, తమ పంటలు పాడయిపోయాయో, నష్టం వచ్చిందో అని లబలబలాడుతూ, కాస్త కాస్తే డబ్బుచేర్చి, వేరు వేరు సొరుగుల్లో దాచిపెడ్తూంటారు. తాము పోగుచేసిన రూబుళ్ళనన్నిటినీ ఒక సంచిలో వేస్తారు. మరొక సంచీలో అర్థరూబుళ్ళూ, మూడోదానిలో కాలు రూబుళ్ళూ చేరుస్తూ ఉంటారు. వాళ్ళ సొరుగుల్లో చిన్నచిన్న ఉడుపులూ, రాత్రి దుస్తులూ, దారపు ఉండలూ, కుట్టని తొడుగూ తప్ప ఏమీ ఉండదనుకుంటాం. పాత తొడుగు వంట చేసేటప్పుడు నిప్పంటుకుని కాలిపోవడమో, చినిగిపోవడమో జరిగితే తప్ప కొత్తది కుట్టడం జరగదన్నమాట; కానీ ఆ పాతది ఎంతకాలానికీ కాలనూ కాలదు, చినగనూ చినగదు. కొత్త తొడుగు ఏళ్ళ తరబడి అలాగే కుట్టకుండా ఉండి, చివరకు మిగిలిన చెత్తతోబాటు వారసురాలికి పోతుంది.

అనుకోకుండా ఇలావచ్చి ఆమెకు శ్రమ కలిగించినందుకు చిచీకవ్ క్షమాపణ చెప్పుకున్నాడు.

“పరవాలేదు, పరవాలేదు” అన్నదావిడ. “ఎంతవానలో పంపాడు దేవుడు మిమ్మల్ని! ఏమిగాలి, ఏమివాన… ప్రయాణం చేసి వచ్చారు, మీరేదైనా తినటం భావ్యంగా ఉంటుంది, కాని ఈ అపరాత్రి వేళ వంట చేయటానికి లేదు.

ఆమె మాట్లాడుతుండగానే పెద్ద బుస వినబడేసరికి చిచీకవ్ గాబరా పడ్డాడు. ఆ చప్పుడు వింటే గది నిండా పాములున్నాయనిపించింది. కాని తలయెత్తి చూసేసరికి అతని గుండె కుదుట పడింది. గడియారం గంటలు కొట్టబోతోందని అతను తెలుసుకున్నాడు. బుసవెంట మూలుగు లాటిది వినబడింది. చివరకు అతిప్రయాస మీద గడియారం రెండు కొట్టింది. ఆ దెబ్బలు ఓటికుండ మీద కర్రతో కొట్టినట్టున్నాయి. గంటలు కొట్టటం కాగానే పెండ్యులం అటూ ఇటూ ఆడుతూ ఎప్పటి లాగ టిక్కి టిక్కు మనసాగింది.

చిచీకవ్ ఆవిడతో తనకేమీ అవసరం లేదనీ, తనకోసం ఎలాటి శ్రమ పడవద్దని, తనకు కావలసినదల్లా పక్క మాత్రమేననీ, తాను చేరిన గ్రామం ఏదో తెలుసుకోవాలని ఉన్నదనీ, సబాకవిచ్ ఉండే గ్రామం సమీపంలోనే ఉన్నదా అనీ అన్నాడు. ముసలావిడ తాను ఆ పేరెన్నడూ వినలేదనీ, అటువంటి భూస్వామి ఆ ప్రాంతాల లేడనీ చెప్పింది.

“పోనీ మీకు మానిలవ్ తెలుసా?” అన్నాడు చిచీకవ్.

“మానిలవ్ ఎవరేమిటి?”

“భూస్వామి”

“లేదు, ఎన్నడూ వినలేదు. అలాటి పేరుగల భూస్వామి ఈ ప్రాంతాల లేడు.”

“ఈ ప్రాంతాల ఉండే భూస్వాములెవరు?”

“బబ్రోవ్, స్వీన్విన్, కనావత్యెవ్, ఆర్పాకిన్, త్రిపాకిన్, ప్లేషకీన్”

“మంచి సంపన్నులా?”

“లేదు బాబూ, అంత సంపన్నులు కారు. ఇరవై మందీ, ముప్పైమందీ కమతగాళ్ళు కలవారు. నూరు మంది గలవాళ్ళు ఒక్కరూ లేరు.

తాను వచ్చి పడినది ఉత్త అడవీ ప్రాంతమని చిచీకవ్ తెలుసుకున్నాడు.

“అయితే పట్నం చాలా దూరమా?”

“నలభై మైళ్ళుంటుంది. నేను మీకేమీ యివ్వలేకపోతినే! ఒక కప్పు తీసుకోరా బాబూ?”

“వద్దండి. నాకు పక్క తప్ప ఇంకేమీ వద్దు.”

“ఇటువంటి ప్రయాణం చేసినాక విశ్రాంతి అవసరమే. మీరిలా ఈ సోఫా మీద పడుకోండి, బాబూ! ఏమేవ్ ఫితీన్యా, ఈకల పరుపూ, దిళ్ళూ, దుప్పటీ పట్టుకురా. ఏమి వాన తెప్పించాడు దేవుడు! ఒకటే ఉరుములూ — దేవుడి దగ్గర తెల్లవార్లూ దీపారాధన ఉంచా. అయ్యొ బాబూ, మీ వీపునా, పక్కనా ఈ బురదేమిటి, పందిలాగా? ఈ బురదంతా ఎక్కడ చేసుకున్నారు?”

“ఇంకా నయం, బురదతో పోయింది. ఎముకలు విరగనందుకు సంతోషించాలి”

“ఓరి దేవుడా, ఎంత ఘోరం! మీ వీపు ఏదన్నా పెట్టి తుడవొద్దూ?”

“వద్దండీ. మీరేమీ హైరానా పడకండి. నా బట్టలు ఆరబెట్టి, బ్రష్‌తో తుడవమని మీ పనిమనిషికి మటుకు చెప్పండి.”

“విన్నావా ఫితీన్యా!” అన్నది ముసలావిడ మెట్ల మీదికి వచ్చిన ఆడమనిషితో. ఆ మనిషి ఇప్పుడు ఒక ఈకల పరుపును గది లోకి ఈడ్చుకు వచ్చి, దాన్ని రెండు పక్కలా బాది, గది అంతా ఈకలమయం చేసింది. “ఈ బాబు గారి కోటూ అవీ తీసుకుని, మీ అయ్యగారి దుస్తులు ఆరబెట్టే దానివే, అలాగే మంట దగ్గర ఆరబెట్టి, ఆ తరవాత వాటిని దులిపి, బ్రష్‌తో తుడిచెయ్యి” అన్నది యజమానురాలు దాసీతో.

-కొడవటిగంటి కుటుంబరావు

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.