పులికంటికి ‘నాలుగ్గాళ్ళ మండపం’ నివాళి

-రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

(గమనిక: ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డి గారి రచనల గురించి రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు రాసిన ఈ వ్యాసం ఈభూమి వారపత్రిక 6 డిసెంబర్, 2007 సంచికలోనిది)

కథానిక ప్రక్రియలో ఒక ప్రయోగం ఒకే పాత్ర చుట్టూ అనేక కథలు రాయడం. చింతా దీక్షితులు రాసిన వటీరావు కథలు, శ్రీశ్రీ రాసిన కోనేటిరావు కథలు, భానుమతీ రామకృష్ణ అత్తగారి కథలు వంటివి ఇందుకు ఉదాహరణలు.అలాగే ఒక ప్రాంతం కేంద్రంగా కథలు రాయడం మరో ప్రయోగం. సత్యం శంకరమంచి అమరావతి కథలు, పి. రామకృష్ణారెడ్డి పెన్నేటి కతలు మొదలైనవి ఇందుకు ఉదాహరణలు. కథానికలో లాగే కథనప్రక్రియలో కుడా ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు, మిట్టూరోడి కథలు వంటివి. పులికంటి కృష్ణారెడ్డి “నాలుగ్గాళ్ళ మండపం” తెలుగు కథనప్రక్రియలో అలాంటి ప్రయోగం. పులికంటి కృష్ణారెడ్డి రాసిన 200 కథానికలు ఒక ఎత్తయితే, ఆయన నాలుగ్గాళ్ళ మండపం ఇంకో ఎత్తు. కథానికకు చెందకుండా, స్కెచ్ కు చెందకుండా రెండింటినీ మేళవించుకున్న ఒక ప్రక్రియ, కథన ప్రక్రియ. ఈ ప్రక్రియకు పులికంటి నాలుగ్గాళ్ళ మండపం ద్వారా స్థిరమైన రూపాన్ని సాధించి పెట్టారు.

‘నాలుగ్గాళ్ళ మండపం’ తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఒక స్థలం. పులికంటి ఇంటికి కూతవేటు దూరం ఉంది. ప్రతిరోజూ ఉదయాన్నే దినకూలీలంతా అక్కడ పోగవుతారు. కూలీ కుదిరేదాకా లోకం విషయాలు మాట్లాడుకొని కూలి దొరగ్గానే వెళ్ళిపోతారు. ఆ ముఖ్యస్థలాన్ని కార్యస్థానంగా చేసుకుని పులికంటి వర్తమాన సమాజ పరిణామాల మీద తనవైన వ్యాఖ్యానాలు చేస్తూ, చేయిస్తూ రాసిందే ‘నాలుగ్గాళ్ల మండపం’. ఈ కథనాలలోని విషయమంతా వర్తమానం. విధానం మాత్రం జానపదం. ఈ కథనాలలో 1978 ప్రాంతాల నుంచి 1995 ప్రాంతాలదాకా మన రాష్ట్రంలో, మన దేశంలో వచ్చిన పరిణామాలు, వాటిపట్ల రచయిత అభిప్రాయాలు స్వచ్ఛమైన చిత్తూరు జిల్లా జానపదభాషలో వ్యక్తం చెయ్యబడ్డాయి. కథనం తిరుపతి పట్టణానిదైనా విషయం మాత్రం చిత్తూరు జిల్లా గ్రామీణ రైతాంగ జీవితానిదే. రచయిత భార్య, తల్లి, స్నేహితుడు అరుణాచలం, మరో మిత్రుడు ముత్తా రెడ్డెన్న నాలుగు పాత్రలు, నాలుగు స్తంభాలుగా నడిచిన ప్రక్రియ నాలుగ్గాళ్ళ మండపం. రచయిత అన్నిటా కనిపిస్తాడు. ఒకటి ఒకటిన్నర దశాబ్ది కాలంలో వచ్చిన ఆర్థిక, రాజకీయ పరిణామాల వ్యాఖ్యానాలుగా సాగిన నాలుగ్గాళ్ళ మండపంలో పులికంటి భావజాలం, ఇష్టాయిష్టాలు, ఆయనకు తెలిసిన చరిత్ర అన్నీ స్వస్వరూపాలతో దర్శనమిస్తాయి.

“అసలీ రాయలసీమలో పుట్నోళ్ళే కర్మ చేసుకోని పుట్నోళ్ళేమో! చేసేదానికి సెగితుండాది. దున్నుకుండేదానికి జానడో, బెత్తెడో కయ్యలుండాయి. అయినా నీళ్ళేడుండాయి?” ఇదీ రాయలసీమ ముఖచిత్రం మీది ప్రశ్న. నాలుగ్గాళ్ళ మండపమంతా ఈ అంశాన్ని ఆవరించిన ఆర్థిక సాంఘిక రాజకీయాంశాలతో వ్యాఖ్యానించబడ్డాయి. “కాంగ్రెసోళ్ళ చేతుల్లో పెత్తనం ఉన్నపుడు ఎక్స్ పార్టీలోళ్ళు రాయలసీమో అని మొత్తుకుంటే కాంగ్రెసోళ్ళకు చీమకుటినట్టనిపించిందా? లేదు. ఇప్పుడు కాంగ్రెసోళ్ళూ సీమ, అయ్యో రామా! అంటూ కాకిశోకంగా అరస్తా ఉంటే ఇప్పుడూ పెత్తనం చెలాయిస్తా ఉండే తెలుగుదేశం వాళ్ళ చెవికెక్కతా ఉండాదా? లేదు… ఎవుడు పెత్తనం చేసినా మనకు మాత్రం ఇత్తనాల గింజిలకు లాట్రీయే గదా!” వంటి వ్యాఖ్యలు ఈ నాలుగ్గాళ్ళ మండపానికి బలం. పాఠకులకు ఆసక్తినేగాక ఆలోచనల్ని కూడా కలిగించే వ్యాఖ్యలివి. పులికంటి తనకు వాదాలు, ఇజాలు తెలియవని చెప్పుకున్నా ఆయనకు ఖచ్చితమైన రాజకీయ దృష్టి ఉందని ఈ మండపం తెలియజేస్తుంది.

ఈ మండపంలోని రాజకీయాలెలా ఉన్నా, వాటికతీతంగా పాఠకులు బాగా ఆస్వాదించేది ఇందులోని ప్రవాహసదృశమైన భాష, వాక్యం మీద వాక్యం దొర్లుకుంటూ పోయే శైలి. చిత్తూరు జిల్లా ప్రజల భాషల్లోని సారమంతా ఈ కథనాలలో ప్రదర్శించారు పులికంటి. సభా, రాజారాం గార్ల తర్వాత చిత్తూరు జిల్లా భాషకు పండిత గౌరవం కల్పించిన రచయిత పులికంటి. బాశాలి, తావరం ఈడ్చి కొడితే, నీమయ్య నాయాలి ముండా, సిగ్గూ సెరము, కారికొడి, వక్క కొరికినంత సేపు, వొళ్ళు రగులు, యామారించు, ఎద్దలగొట్టి ముద్దలు తినాల్సిన బతుకు, కసువు చెక్కేసిన బీడు మాదిరి తలకాయ వంటి మాటల పోహళింపుతో నాలుగ్గాళ్ళ మండపం స్థానిక పరిమళంతో శోభిల్లుతూ ఉంటుంది. ముత్తా రెడ్డెన్న ఒక కామన్ సెన్స్ ఉన్న గ్రామీణ మేధావి. భార్య సహజమైన కోపతాపాలు, ప్రేమానురాగాలు గల మహిళ. ఈ మండపంలో ప్రసక్తికి వచ్చేవాళ్ళంతా ఇంతే.

నాలుగున్నర ఐదు దశాబ్దాల సాహిత్య జీవితం గల పులికంటి సహజ కథకుడు. ఇప్పుడు ఆయన లేడు. ఆయన నాలుగ్గాళ్ల మండపం ఉంది. ఆయనకు నివాళి దానిని చదవడమే.

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

2 Responses to పులికంటికి ‘నాలుగ్గాళ్ళ మండపం’ నివాళి

  1. NAMASTE,
    PULIKANTI GARI GURUNCHI… SRI GOLLAPUDI MARUTHI RAO GARU… CHALA CHAKKAGA… NIVALI ARPINCHARU ‘ANDHRA JYOTHI’ DAILY LO. ENTHO GOPPA RACHAYITA SRI PULIKANTI GARU. SAHITYAM KOSAM JOB KI RESIGN CHESINA GOPPA MANISHI. EE PANI CHESINA VARU INKA EVARU LERU ANI ANUKONTUNNANU. EVARYNA UNTE.. TELIYA CHEYANDI. NIVALULU/NEERAJANAALU ARPINCHUDAM.

    MEE… J KRISHNA RAO GUNTUR AP
    CELL: 9949517103

  2. Pingback: Eric

Comments are closed.