తెలుగు కలాలు

ఆరుద్ర

ఆరుద్రభాషా సాహిత్యాలు లేని జాతి ఇవాళ ప్రపంచంలో ఎంత వెతికినా ఎక్కడా కనబడదు. క్రీస్తు శకం ప్రారంభానికి ముందుగా ఎన్నో శతాబ్దాలనుంచే తెలుగువారు వివిధ ప్రాంతాలలో జీవించిన దాఖలాలు వున్నాయి. శాతవాహనులు సామ్రాజ్యాన్ని స్థాపించి కొన్ని వందల ఏళ్ళు పాలించారు. వీరు తెలుగువారే. వీళ్ళ కుదురు తెలుగు ఏకగణాలలోనే ఉంది. రాజులు ప్రాకృత సంస్కృత భాషలకు ఎగబడినా నాటి సామాన్య ప్రజానీకం తెలుగులోనే నిత్యవ్యవహారాన్ని జరుపుకొనేవారు. తమకు కావలసిన సాహిత్యాన్ని సృష్టించుకొన్నారు.

ప్రాకృత జనుల సాహిత్యం మౌఖికంగానే వుంటుంది. సామెతలు, పొడుపు కథలు, పని పాటలు, వీరగీతాలు మొదలైనవి వాటిలోని భాగాలు. మతవిశ్వాసాలూ, మంత్రచర్యలకు వాడే మాటలూ కూడా సంస్కృతిలోని భాగమే. తెలుగుగడ్డ మీద ఆదిలో బౌద్ధ, జైనమతాలు చాలా బలపడ్డాయి. జనాభాలో అత్యధికసంఖ్యాకులు ఇతర మతాలవైపు ఆకర్షితులు కావడం చూసి బ్రాహ్మణ్యం ప్రాబల్యం కోసం ప్రయత్నాలు చేసింది. జనుల ఆచార వ్యవహారాలకు ఆస్కారం కలిగించే పాడిపంటలకు అవసరమైన పశుసంపదను యజ్ఞయాగాదులలో బలికాకుండా ఈ అహింసామతాలు కాపాడడంచేత జనసామాన్యానికి, వాణిజ్య వర్గాలకు ఈ మతాలు అభిమానపాత్రమయ్యాయి. మతాధికారులకు ప్రజలు కానుకలు, దానాలు, ధర్మాలు చేయసాగారు. ఆరామాలు1, బసదులు2 ఐశ్వర్యవంతాలయ్యాయి. మాన్యాలూ, తోటలూ వృద్ధి చెందాయి. రైతాంగం వీటిమీద బతికేవారు. జీవనాధారమైన మతం ప్రజలకు అభిమతం.

ఆదిలో వైదికమతం యజ్ఞయాగాదులనే అంగీకరించింది. విగ్రహారాధన, గుళ్ళు, నోములు, వ్రతాలు నిషేధించింది. స్త్రీలనూ, శూద్రులనూ నిరక్షరాస్యులను చేసింది. మతాన్ని సృష్టించింది. ఇది వేదోక్తమని అధర్వవేదం సాక్ష్యాలతో ప్రచారం చేసింది. బ్రాహ్మణ్యం శంఖంలో పోస్తేనే గాని రాచరికం తీర్థం కాదు. అందుచేత రాజులు వైదికమతాన్ని ఆదరించారు. రాణులు బౌద్ధ, జైనులను పోషిస్తూనే వచ్చారు.

ప్రజల భాషలోకాక సంస్కృత ప్రాకృత భాషలలో శాసనాలు వేయించడం పాలకులకు అలవాటు. అయితే ఆ శాసనాలలో స్థలనామాలు, వ్యక్తుల పేర్లు తెలుగులోనే ఉంచక తప్పదు. క్రీస్తు శకం తొలి శతాబ్దాలలో తెలుగు మాటలు ఎలా వుండేవో ఈ శాసనాల వల్ల తెలుస్తోంది. రేనాటి చోళులు తెలుగులోనే తమ శాసనాలను వేయించారు. వీటిలో కొన్ని అస్పష్ట ఛందస్సులో ఉన్నాయి. ఆనాడు ఒకరకమైన సాహిత్యం లిఖిత రూపంలో కూడా వుండేదన్న భావనకు ఆస్కారం ఉంది.

విద్యావంతులు మార్గరీతులలోనే సాహిత్యాన్ని సృష్టించుకొనేవారు. తూర్పు చాళుక్యుల ఏలుబడిలో కవితలకు కూడా దేశి కవితలకు కూడా రాజాదరణ లభించింది. ఈ సంగతిని నన్నెచోడుడు ఇలా చెప్పాడు.

మును మార్గ కవిత లో
కంబున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం
గున నిలిపి రంధ్ర విషయం
బున జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్‌

దేశికవితను పుట్టించినవాళ్ళు పలువురు ఉన్నా వాళ్ళు నిలిపిన కవితలు ఆట్టే కాలం నిలువలేదు. తూర్పు చాళుక్యులలో రాజరాజనరేంద్రుడు నేటికి రమారమి వెయ్యేళ్ళ కిందట వైదికమత ప్రచారం కోసం మహాభారతంలోని నిరూపితార్థాన్ని తన కులబ్రాహ్మణుడు నన్నయభట్టు చేత తెలిగింపచేశాడు. ఇదే మన ఆదికావ్యం. అంతకు ముందున్నవన్నీ నశించాయిగాని, ఆ రోజుల్లో కవులూ వుండేవారు, రచనలు చేసేవారు. వేంగీదేశంలో విద్వత్సభలు వుండేవి. నన్నయ రెండున్నర పర్వాలే ఆంధ్రీకరించాడు. మిగతా భాగాన్ని ఎవరైనా పూర్తి చేయాలని సంకల్పించడానికే రెండు శతాబ్దాలు పట్టింది. నన్నయ సారమతిని కవీంద్రులు మెచ్చుకోవడానికి భారతాన్ని తెలిగించితే తిక్కన మాత్రం భారతామృతాన్ని “కర్ణపుటంబుల నారగ్రోలి” ఆంధ్రావళి మోదం చెందడానికి పూర్తిచేశాడు. జనంలో అధికభాగం అక్షరాస్యులు కానప్పుడు కావ్యాలను ఎవరైనా చదివి వినిపిస్తేనే దానిని ఆరగ్రోలడం వీలవుతుంది. మహాభారతమే కాదు రామాయణం కూడా ఇంతే.

భాస్కర రామాయణం చంపూకావ్యం. రంగనాథ రామాయణం ద్విపదకావ్యం. ఇది గానం చేయడానికి అనువైనది. అందుకే దీనినే ఈనాటికీ తోలుబొమ్మలాటలో గాయకులు పాడుతూ ఉంటారు. తెలుగులో రామకథలు ఎన్నెన్నో ప్రక్రియలలో వెలువడ్డాయి. అయితే ఏ ఒక్కటీ బహుళ ప్రచారాన్ని పొందలేదు. రామాయణ భారతాలను తెనిగించి భాగవతం జోలికి ఎవరూ వెళ్ళకపోవడం బమ్మెర పోతరాజుగారు తమ అదృష్టంగా భావించారు. దానిని భక్తితో, అంతకు మించిన ఆవేశంతో రచించారు. పోతరాజుగారి భాగవతం ఎంత ప్రసిద్ధమైనదంటే దానికి వరవడి పెట్టిన ఎర్రాప్రగడగారి హరివంశం ఆట్టే కనబడకుండా కాలగర్భంలో ఒక మూలపడి వుండిపోయింది.

ఎర్రాప్రగడగారిని ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. ఈయన భారతంలో నన్నయగారు వదిలివేసిన అరణ్యపర్వ భాగాన్ని పూర్తి చేయడమేకాక హరివంశంతో బాటు నృసింహ పురాణం కూడా రచించారు. ఈ పురాణంలోనే ప్రబంధాల తొలి రూపురేఖలు కనబడతాయి. ఎర్రాప్రగడగారి సమకాలికుడు నాచనసోమన నిజంగా నవీనగుణ సనాధుడు. సాహిత్య రచనలో సమకాలీన సమాజాన్ని ప్రతిఫలింపచేయడం ఇతనితోనే ప్రారంభమైంది. ఇతని “ఉత్తర హరివంశం” అనే కావ్యం పురాణకథలకు ఎలా నగిషీలు పెట్టాలో తెలియజేస్తుంది.

నన్నయ్య, తిక్కన, ఎర్రన మన కవిత్రయం. తెలుగు కవిత వారి భిక్ష. వ్యాసభారతం తెలిగింపును శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో…అంటూ ప్రారంభించి నన్నయ్య రెండున్నర పర్వాలు వ్రాయగా, శ్రీయన గౌరి నాబరగు చెల్వకు…అంటూ తిక్కన 15 పర్వాలు, స్ఫురదరుణాంశు రాగరుచి బొంపిరివోవ…అంటూ ఎర్రన అరణ్యపర్వశేషాన్ని పూర్తిచేశారు. తెలుగువారి ఇష్టకవి పోతన. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట… అంటూ పోతన తెలిగించిన భాగవతం ఆంధ్రుల ఇష్ట గ్రంథం. “కలయో వైష్ణవ మాయయో” వంటి పోతన పలుకుబడులెన్నో తెలుగువారి నిత్యవ్యవహారంలో స్థిరపడ్డాయి.

మార్గపద్ధతులను అనుసరించే కవులు పురాణేతిహాసాలను సనాతన వైదిక మత నిర్దేశాలకు అనువుగా రచిస్తూ ఉంటే వీరశైవులు దేశి ఛందాలలో, దేశీయమైన ఇతివృత్తాలను కొత్త పురాణాలుగా భక్తుల చరిత్రలుగా రూపొందించారు. ద్విపద ప్రచార సాధనమైంది. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, దక్షిణ భారతంలోని చారిత్రక పురుషుల జీవితగాథలు, కుల వర్గ భేదాలను రూపుమాపి, ఆడా, మగా అందరూ సమానులే అన్న మతస్థాపనకు వీరశైవులు ఉద్యమాలను నడిపారు. జన సాహిత్యానికి చేరువలో ఆ రూపాలకు సన్నిహితమైన వచనాలను రచించారు. ఆదిలో వచనాన్ని పాడేవారు. ఇప్పటికీ యాగంటివారి రచనలను రాయలసీమలో ముఖ్యంగా గానంచేస్తారు.

వీరశైవులలాగే వైష్ణవులు కూడా వచనాలను రచించారు. కృష్ణమాచార్యుడు కాకతీయుల కాలంలో సింహగిరి వచనాలు నాలుగు లక్షలు రచించాడు. వీటిలో అధికభాగం రాగిరేకులపై చెక్కించి శ్రీరంగం పంపించాడు. తాళ్ళపాక కవులు కృష్ణమాచార్యులనే అనుసరించారు. అన్నమయ్య పాటకు సాహిత్య గౌరవాన్ని కల్పించాడు. ముప్ఫయిరెండువేల సంకీర్తనలలో తెలుగు జీవితాన్ని, ఆచార వ్యవహారాలను భద్రం చేశాడు. భక్తీ, దానిని మించిన రక్తీ ఈ సంకీర్తనలలో సజీవంగా వున్నాయి. భక్తి బంగారానికి రక్తి శృంగారం రస సౌరభాన్ని పూసింది.

సంస్కృత సాహిత్యంలో శృంగారం వెర్రితలలు వేశాక అష్టరసాలలో ఇదే ఇష్టరసమయ్యాక ఆ ఉన్మాదం తెలుగులోకి కూడా దిగుమతి అయింది. హర్ష నైషధాన్ని శ్రీనాథుడు శృంగార నైషధంగా ఆంధ్రీకరించాడు. ప్రౌఢి పలుకు, నుడికారం సమపాళ్ళలో వున్న శ్రీనాథుడు కొత్త వరవళ్ళు పెట్టాడు. ఇతని తర్వాత ఎందరో తమ కావ్యాలలో “శృంగార” అనే విశేషణం తగిలిస్తూ వచ్చారు.

ఏదో ఒక పురాణగాథను తీసుకొని, అష్టాదశ వర్ణనలు సందర్భశుద్ధి వున్నా లేకున్నా జొప్పించి, నాయిక అంగాంగవర్ణన చేసి, నాయికా నాయకుల సంభోగ శృంగారచేష్టలను అతిగా వర్ణించడం తెలుగులో సర్వసామాన్యమైంది. పుణ్యక్షేత్రాల మాహాత్మ్యాలు కవులకు ముడిసరుకులయ్యాయి. ఎంత నీచంగా బతికినా, ఎన్ని పాపాలు చేసినా, కడ శ్వాస వరకు పంచ మహాపాతకాలు చేస్తున్నా, దివ్యక్షేత్రంలో మరణించినవానికి ముక్తి రెడీమేడ్‌గా దొరకడం అన్నది ఈ గ్రంథాలు చాటుతాయి. ఈ మూసకథలలోకూడా కొందరు ప్రతిభావంతులు వున్నంతలో తమ నేర్పు చూపగలిగారు. పదగుంభనం వాళ్ళ ప్రౌఢత్వానికి చిహ్నం.

కేవలం కల్పనాకథలు కృత్రిమ రత్నాలనీ, ఆద్యసత్కథలు గనిలో తీసిన శుద్ధిచేయని మణులని, ఈ రెండింటినీకాక నచ్చిన పాతకథను సానపట్టి ప్రజలకివ్వాలని నాటి కవులు భావించారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన అష్ట దిగ్గజాలలో పెద్దపీటలవాళ్ళు. ఇంతటి ఉద్దండుల రచనల ముందు ఇతరుల కావ్యాలు సూర్యుని ముందు దివిటీలే. అందుకే తరువాత వచ్చిన పింగళి సూరన్న, భట్టుమూర్తి, ముందు రెండర్థాల కావ్యాలు రాసి తమ గొప్పతనం చాటుకున్నారు. తర్వాత కళాపూర్ణోదయం, వసుచరిత్ర రాశారు. సూరనగారి కళాపూర్ణోదయం అంత గొప్ప కావ్యం కన్యాశుల్కం వచ్చేదాకా ఇంకేదీ పుట్టలేదు. వసుచరిత్రకు వెనువెంటనే ఇమిటేషన్లుగా పిల్ల వసుచరిత్రలు కోకొల్లలుగా వచ్చాయి. భట్టుమూర్తి శ్లేషలతో తెలుగు సాహితిని ఆశ్లేషించాడు. ఆ కౌగిలి విడిపించుకొందికి చాలా కాలం పట్టింది.

శివకవులు దేశ సాహిత్యానికి ఎంత సేవ చేశారో శతక కవులు ఆత్మాశ్రయ కవిత్వానికి అంత ప్రాణంపోశారు. చాటుకవులు కొత్త బాటలు వేశారు. తెలుగు సాహిత్యం అంతా గాలించినా వేమనగారి వంటి “సామాజిక స్పృహ” గల రచయిత ఇంకెవరూ కనబడడు. కనబడ్డా అంత ఉన్నతునిగా కంటికి ఆనడు. ఆధునికులలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారొక్కరే వేమన ఆలోచనా విధానాలకు అత్యంత సన్నిహితులు.

కడపటి రాజుల యుగం నాటికి కవుల కక్కూర్తి స్పష్టంగా వెల్లడవుతూ వచ్చింది. పోషకుడు మెచ్చి ఇచ్చాడో “చంద్రరేఖా విలాసం”, ఇవ్వకపోతే “చంద్రరేఖా విలాపం” అల్లడానికి పూనుకొనే స్థితికి సాహిత్యం దిగజారింది.

“కావ్యం యశసే, అర్థకృతే” అన్న నిర్వచనాల దగ్గరే ప్రబంధకవులూ, వారి తరువాతవారు ఆగిపోయారు. వ్యవహారాన్ని విదితం చేయడం, శివేతరమైనదానిని ఛేదించడం, మొదలైన లక్షణాలను పందొమ్మిదో శతాబ్దపు ఉత్తరార్థంలోనే రచయితలు గాఢంగా విశ్వసించారు. సంఘసంస్కారం కోసం వీరేశలింగంగారు, గురజాడ అప్పారావుగారు సాహిత్యమే ఉత్తమ సాధనంగా భావించారు. ప్రజలను చైతన్యవంతులను చేశారు. మేలుకొంటున్న ప్రజలను జోకొట్టే ఉద్యమాలు భావకవిత్వం రూపంలో వచ్చినా అవి గురజాడ ప్రభావం ముందు ఉత్తరోత్తరా నిలబడలేకపోయాయి. గేయం ధ్యేయమైంది.

గురజాడ అప్పారావుగారు దేశి ఛందస్సులను చేపట్టి ప్రజలకు చేరువగా కవిత్వాన్ని తీసుకువచ్చారు. అక్షరాస్యులు అల్పసంఖ్యలో ఉన్నప్పుడు ప్రచార సాధనం నాటకమే అని గుర్తించారు. శ్రవ్య కావ్యాలను ప్రదర్శన కళలుగా మార్చగలిగే వీలు కల్పించారు. గురజాడ దేశమంటే మనుష్యులన్నాడు. శ్రీశ్రీ మనుష్యులంటే శ్రమజీవులే అని స్పష్టపరిచాడు. అభ్యుదయ దృక్పథమే సాహిత్యంలో ప్రజలను సాయుధులను చేయగలదు. ఇదే నిజమైన వారసత్వం.

————
1. ఆరామం = బౌద్ధుల ప్రార్థనాలయం
2. బసది = జైనుల ప్రార్థనాలయం

————-
ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర వేసిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. వందలాదిగా గేయాలు, గేయ నాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ్య వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు రాశాడు. ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన….. ఇంత వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు. త్వమేవాహమ్, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలతో పాటు అనువాద రచనలు, అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం (14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ఠ. సాహిత్య విమర్శనా గ్రంథాలే కాకుండా రాముడికి సీత ఏమౌతుంది?, గుడిలో సెక్స్ వంటి రచనలు, డిటెక్టివ్ రచనలు, చదరంగంపైన ఒక పుస్తకమూ కూడా రాశాడు. తెలుగులో ఆరుద్ర మార్కు గళ్లనుడికట్టు సుప్రసిద్ధం.
(పరిచయం, ఫోటో తెవికీ నుంచి)

(ఈ రచనను యూనికోడ్ లో పొద్దుకు పంపిన డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి, పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన శ్రీమతి రామలక్ష్మి గారికి నెనర్లు.)

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

One Response to తెలుగు కలాలు

  1. Dr,Kodi.Rama says:

    chala bagundi

Comments are closed.