“ఒక కథకుడికి రచనాసామర్థ్యం లేకపోయినా సరిచెయ్యవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవరివల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కాదని కాదు. అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూలపరికరాలు. ముడిపదార్థం జీవితం.”
-ఈ వాక్యాలను రాసింది మానవజీవితాన్ని బహుముఖంగా పరిశీలించి ఆ ముడిపదార్థంతో ఎన్నో అద్భుతమైన కథలను, నవలలను, నాటికలను, గల్పికలను మలిచిన అక్షరశిల్పి కొడవటిగంటి కుటుంబరావుగారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
1909-80 సంవత్సరాల మధ్యగల సుమారు 72 సంవత్సరాల జీవితకాలంలో 1931-80 మధ్యగల సుమారు అర్ధశతాబ్ది సాహిత్య జీవితకాలంలో – కుటుంబరావుగారు సమకాలీన ప్రజాజీవితాన్ని కుదిపేసిన ఎన్నో సంఘటనలకు వ్యక్తిగా, రచయితగా ప్రతిస్పందించాడు. భారతదేశ ఆర్థిక, సాంఘిక, రాజకీయ చరిత్రపై బలమైన ముద్రను వేసిన ఎన్నో సంఘటనలకు ఆయన ప్రత్యక్షసాక్షి. రెండు ప్రపంచయుద్ధాలు, ఆర్థిక మాంద్యం, జాతీయోద్యమం, స్వాతంత్ర్య సాధన, దేశవిభజన, కాంగ్రెస్ పరిపాలన, నిరాశనే మిగిల్చిన స్వాతంత్ర్యం, మతోన్మాదం, కులతత్వం, పెరిగిన దారిద్ర్యం – నిరుద్యోగం, అపహాస్యంగా మిగిలిన ప్రజాస్వామ్యం, రష్యాలో జరిగిన విప్లవం రేకెత్తించిన కొత్త ఆలోచనలు, ఆదర్శాలు – వీటన్నిటి ప్రభావమూ వ్యక్తిగా, రచయితగా కుటుంబరావుగారిపై ఉంది. ఈ నేపథ్యంలోంచి కొ.కు. సాహితీ ప్రస్థానాన్ని అవగతం చేసుకోవలసి ఉంది.
సంప్రదాయ నీతులను వ్యతిరేకించినా, మూఢనమ్మకాలను ఎద్దేవా చేసినా, స్వాతంత్ర్యానంతరం గద్దెనెక్కిన ప్రభువుల పాలనను హేళన చేసినా, సమసమాజ స్థాపనకై పరితపించినా, రచయితగా కుటుంబరావు ‘జీవిత వాస్తవికత’ను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. “అన్నింటికన్నా కష్టసాధ్యమైనది జీవిత వాస్తవికత. వాస్తవ జీవితం వేరు, జీవిత వాస్తవికత వేరు. వాస్తవ జీవితం అందరికీ అనుభవంలోకి వచ్చేదే.”
“మానవజాతి ఎటు పోతున్నది? ఎటు పోవాలి? దారిద్ర్యము, అనారోగ్యము, సంకుచితత్వము, కులతత్వము, మతతత్వము, ఇటువంటి సాంఘిక పీడలు నిర్మూలనమై ప్రజలు స్వేచ్ఛగా, తమ ఆర్థిక, నైతిక జీవితాలను గట్టి పునాది మీద నిర్మించుకొనడానికి మార్గమేది? యిటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న కొద్దీ కథలు జీవితానికి దగ్గరగా వచ్చి జీవితసత్యాలను తెలుసుకోగలుగుతాయి.” అని ప్రకటించిన కుటుంబరావుగారు ఏ భావజాల ప్రభావంతో ఏ రచనలు చేసినా ఈ ‘జీవిత వాస్తవికత’ను అన్వేషించేందుకే పరితపించారు.
1931 సంవత్సరంలో కథకుడుగా కుటుంబరావు కలంపట్టేనాటికి చింతాదీక్షితులు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చలం, వేలూరి శివరామశాస్త్రి, కొడవటిగంటి వెంకట సుబ్బయ్య, పూడిపెద్ది వెంకటరమణయ్య, వఝుల బాబూరావు, రాయసం వెంకట శివుడు ప్రభృతులు కథలు రాస్తున్నారు. గురజాడవారి ‘దిద్దుబాటు’ కథ వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. కొ.కు.గారికి కథలు రాయాలనే కోరిక కొడవటిగంటి వెంకటసుబ్బయ్య ‘సుకుమారి’, ‘ఏప్రిల్ ఫూల్’, – చింతా దీక్షితులు ‘సాహితికి కథ’ వంటివి చదివాక బాగా కలిగినప్పటికీ – కథకుడుగా తొలినాళ్ళలో ఆయనకు మార్గనిర్దేశకత్వం చేసింది గురజాడ, చలం అని చెప్పాలి. వీరిద్దరిలో గురజాడ ప్రభావం చివరిదాకా ఉన్నప్పటికీ – చలం ప్రభావం మాత్రం ఆయన తొలినాటి కథల్లో గణనీయంగా కనబడుతుంది.
“Though art is my master, I have a duty to society” అనే గ్రహింపుతో చురుక్కుమనిపించే వ్యంగ్యస్ఫూర్తితో రచనలు చేసిన గురజాడ – సమకాలీన ప్రపంచంలో అమలులో ఉన్న విలువలు మానవుని శ్రేయస్సుకు దోహదకారిగా లేకపోతే వాటిని ప్రశ్నించవలసిన బాధ్యత కలం పట్టిన రచయితకు ఉన్నదనే విషయాన్ని తెలియజెప్పాడు. అవి సామాజికపరమైనవైనా, లేక ఆర్థిక రాజకీయ రంగాలకు సంబంధించినవైనా, వాటిని ప్రశ్నించే అలవాటును అభ్యుదయ దృక్పథం గల రచయితలు గురజాడ అడుగుజాడ నుండి తెలుసుకున్నారు. ఇలాంటి గురజాడ స్ఫూర్తి చివరివరకూ కొ.కు. రచనల్లో కనబడడంలో ఆశ్చర్యం లేదు.
ఇక – చలం విషయానికి వస్తే, నీతికీ అవినీతికీ మధ్య గీతగీసి, దాన్ని గురించి బెంగపెట్టుకుని బుర్ర పాడు చేసుకోవలసిన అవసరం లేదనీ, దానికన్నా ముఖ్యమైన విషయాలు మరికొన్ని జీవితంలో వున్నాయనీ చెప్పడం వరకూ కుటుంబరావు చలానికి సన్నిహితంగా కనబడతాడు. కుటుంబరావు తాను రచించిన ‘చెడిపోయిన మనిషి’ కథలో లేడీడాక్టర్ నోట చెప్పించినట్టు
“మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారము, తక్కువ అపకారము జరిగేటట్లు చూచుకొనడమే సరి అయిన ప్రవర్తన. మిగిలినవి బూటకపు నియమాలు” అనేదే ఆయన ఆలోచన. ఈ పనిని సాధించే క్రమంలో ఎదుటివారు, ప్రక్కవారు, ఏమనుకుంటారు అనికాకుండా నీ మనసు ఏం చెబుతున్నది అనే విషయానికి ప్రాధాన్యతను యివ్వాలని చలం కోరుకున్నట్లుగా – కొడవటిగంటివారు కూడా కోరుకున్నారు.
ప్రపంచప్రఖ్యాత తత్త్వవేత్త రసెల్ రెండు తరహాల ‘మంచిపనులు’ వుంటాయి అని అంటాడు. ఒకటి subjective rightness, రెండోది objective rightness. చట్టం, సంప్రదాయ నీతులు, చర్చి మొదలైనవి ఏం చెయ్యాలని చెబుతున్నాయో అది objective rightness అయితే, ఇతరులు ఏమంటారు అని కాకుండా మనసు దేనిని మంచి పని అంటుందో దానిని subjective rightness అంటారు. ఈ రెండింటిలో మనిషి అనుసరించాల్సింది ‘సబ్జెక్టివ్ రైట్నెస్’ అని చెప్పిన నేరానికి – సమకాలీన సమాజం రసెల్ వంటి గొప్ప మేధావిని దారుణమైన అవమానాలకు గురిచేసింది. “మనిషి పాపం చేసినా ఫరవాలేదు. మానవత్వం వదులుకోకూడదు.” అని చెప్పిన నేరానికి (యిక్కడ పాపం అనే మా టను చర్చి చెప్పే మూఢనమ్మకాలకు, తిరోగమన ధోరణులకు వర్తించేదిగా అర్థం చేసుకోవాలి) అతడిపై ఆస్తికులు, సంప్రదాయవాదులు కత్తిగట్టారు.
సంప్రదాయ నీతులను, పురుషాధిక్య సమాజంలోని రెండునాల్కల ధోరణిని నిరసించి వ్యక్తిస్వేచ్ఛకు పట్టాభిషేకం చేసిన చలం గారిలో కూడా ఇలాంటి తిరుగుబాటు ధోరణే ఉన్నది. కుటుంబరావుగారిని ఇది బాగా ఆకట్టుకుంది. కుటుంబరావుగారి ‘అపనమ్మకం’ కథలోని రాజ్యం “నాకు నిజంగానే నీతి పై నమ్మకం లేదు.నీతి కంటే ముఖ్యమైనవి జీవితంలో ఉన్నట్లు అదివరకే నిర్ధారణ చేసుకున్నాను. ఇక, ఆత్మగౌరవము, పవిత్రత అంటావా? దీర్ఘంగా ఆలోచిస్తే అవి అణచిపెట్టిన అహంకారాతిశయాలేగాని, ఇంకేమీ కాదు” అనడాన్ని – “పెళ్ళి వ్యవహారం” కథలోని సులోచన తన స్నేహితురాలి అన్న జగన్నాథంతో వివాహం లాంటి ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారాన్నీ, “పాప ఫలం” కథలోని పంకజాక్షి పంకంలోంచి బయటపడిన తీరునూ, “సద్యోగం” కథలోని సూర్యనారాయణ నీతిని పట్టుకుని వేళ్లాడి నిరుద్యోగిగా ఉండిపోవడం కంటే తన ‘పురుష లక్షణానికి’ తగిన (?) వ్యాపకాన్ని సంపాదించుకుని బ్రతుకుదెరువును వెదుక్కోవడాన్నీ, కుహనా నీతులతో ‘అరణ్యం’లా మారిపోయిన ఈ సమాజంలోంచి బ్రతికి బయటపడడానికి ‘అరణ్యం’ కథలోని వివాహిత చేసిన తెగింపునూ గమనిస్తే – చలం ప్రభావంతో సమకాలీన సమాజాన్ని దుఃఖమయం చేసిన సంప్రదాయనీతులపై కుటుంబరావు ఎగరేసిన తిరుగుబాటు బావుటా తెలుస్తుంది.
అయితే చలాన్ని కుటుంబరావు ఏనాడూ గుడ్డిగా అనుసరించలేదు. చలంలో వుండే మితిమీరిన వ్యక్తివాద ధోరణి గానీ, వివాహవ్యవస్థ పట్ల విముఖత గానీ, కుటుంబరావు కథల్లో సార్వత్రిక రీతిలో కనబడవు. అదిన్నీగాక – చలంగారి పాత్రల్లా కొ.కు. కథల్లోని పాత్రలు లౌకిక దృక్పథం లేనివి కావు. లౌక్యం పండిన పాత్రలవి. సంప్రదాయంతో అవి ఢీకొనేవి – కేవలం ‘నిజమైన’ ఆనందం సాధించడానికీ, తమను తాము అన్వేషించుకోవడానికీ కాదు. లౌకికంగా ఏ ప్రమాణాలతో చూసినా హాయిగా సుఖపడడానికీ – బ్రతుకుదెరువును సాధించుకోవడానికీ అవి సంప్రదాయంపై తిరుగుబాటు చేస్తాయి. ఇందుకు కావలసిన తెగువ, గడుసుదనం ఆయన స్త్రీపాత్రల్లో మరింతగా కనబడుతుంది. వ్యక్తి చేసే తిరుగుబాటును లౌకిక దృష్టితో అవలోకించినందువల్లనే ఆయన కాలక్రమంలో ఆ గీతను పొడిగించి సామాజిక అభ్యున్నతికి దానినొక మార్గంగా చూడగలిగారనిపిస్తుంది.
ఇక – “సెక్సు అనేది ఒక సున్నితమైన విషయం. అది ఒక సహజమైన ప్రవాహంలా సానుభూతి, ఉదారత, వెచ్చని తాదాత్మ్యతలతో కూడిన ధారావాహికలా ఉండాలి. హృదయంలేని లైంగిక సంయోగంలా ఉండకూడదు. ఏదో ఒక తాత్కాలిక ఆవేశంతో తొందరలో అయిపోయే వ్యవహారంలా ఉండకూడదు.” అనే డి.ఎచ్. లారెన్స్ భావాలకు చలంగారిలా కుటుంబరావు సన్నిహితుడు కాదు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ మధ్య ఒక సావనీర్ వ్యాసంలో (కొడవటిగంటి సాహిత్య సమాలోచన – ఢిల్లీ ఆంధ్ర సంఘం) నండూరి రామమోహనరావు గారు చేసిన వ్యాఖ్యలు మనోవీధిలో మెదులుతున్నాయి.
“చలం తన ప్రపంచానికి కేంద్రంలో స్త్రీని నిలబెట్టాడు. స్త్రీ స్వాతంత్ర్యం ముఖ్యంగా సెక్స్ స్వాతంత్ర్యం దృష్టి నుంచి సకల సామాజిక సమస్యలనూ పరిశీలించాడు. కథారచనలో ఒక విధంగా ఆయన వారసుడు కొడవటిగంటి .” కాని చలం ప్రారంభించిన భావ విప్లవాన్ని ఈయన విశ్వతోముఖంగా విస్తరింపజేశాడు. మార్క్సిస్టు సామాజిక దృక్పథాన్ని సంపూర్ణంగా స్వీకరించాడు. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణలోని సంకుచితత్వాన్ని నిరాకరించి ఆ ప్రక్రియను మానవుని సామాజిక వ్యక్తిత్వావగాహనకు వర్తింపజేశాడు. మానవుడి ఆర్థిక, రాజకీయ, లైంగిక తదితర సమస్యా సామస్త్యాన్ని తన సాహిత్య వస్తువుగా తీసుకుని హేతువాద దృక్పథం నుండి నిశితంగా, నిర్దాక్షిణ్యంగా విశ్లేషిస్తూ రచనలు సాగించాడు – ” అంటారాయన ఆ వ్యాసంలో.
ఇందులో నండూరి వారు ప్రస్తావించిన ‘ఫ్రాయిడ్’కు సంబంధించిన అంశాన్ని కూడా (సంక్షిప్తంగా నయినా) అవలోకించవలసి వుంది. ఇరవయ్యవ శతాబ్దంలో మానవుని ఆలోచనలను అత్యంత ప్రభావితం చేసిన మేధావుల జాబితాను చెప్పవలసి వస్తే – అందులో ఫ్రాయిడ్ పేరు ప్రముఖంగా కనబడుతుంది. ఒకప్పుడు ఛార్లెస్ డార్విన్ సిద్ధాంతం చేసిన అలజడీకి మించిన అలజడిని సిగ్మండ్ ఫ్రాయిడ్ ‘సైకో ఎనాలిసిస్’ సిద్ధాంతం సృష్టించింది. దీని ప్రభావం పలురంగాలపై పడినట్టుగానే సాహితీ సృజనపై కూడా పడింది. పాత్ర చిత్రణలో క్రొత్తపుంతలు తొక్కేందుకు రచయితలకు వీలు చిక్కింది.
దీని ప్రభావం కొ.కు. కథలపై కూడా కొంతవరకూ కనబడుతుందిగాని, కొందరు రచయితల్లా – ఈ సిద్ధాంతాల అవగాహనతో ప్రయోగాత్మకమైన రీతిలో కథలు రాసి ప్రత్యేకతను చూపుదామనే తపన కుటుంబరావుగారికి లేదు. ఆయన దృష్టి అంతా ‘జీవిత వాస్తవికత’ను అన్వేషించడం మీదనే! ఇందుకుగాను ఈ అవగాహన ఎంతవరకూ తోడ్పడగలదో అంతవరకే దానిని ఉపయోగించుకున్నారు.
ఉదాహరణకు కుటుంబరావు గారి ‘అమాయకురాలు’ కథనే తీసుకుందాం. ఒక కథను మనోవైజ్జానిక దృక్పథంలోంచి చెప్పబడిన కథగా పేర్కొనేందుకు కావలసిన లక్షణాలన్నీ ఈ కథలో ఉన్నాయి. కానీ – ఈ కథను చెప్పడంలో కథకుడి లక్ష్యం అంతటితో ఆగిపోదు. ఈ కథలోని భ్రమరకు యుక్తవయస్సు వచ్చిన తొలిరోజుల్లోనే వైధవ్యం సంప్రాప్తించినప్పుడు సంప్రదాయాన్ని కాదని జుట్టు తీసుకోవడానికి నిరాకరించడానికీ, ఆ తర్వాత ఇంటిలో వాళ్ళు వద్దంటున్నా తనకు తానుగా జుట్టు తీసుకోవడానికీ గల కారణాన్ని ఆమె అంతరంగపు లోలోపలి పొరల్లో వెదికి పట్టుకోవలసి ఉంటుంది. వెంకటేశ్వర్లు పట్ల ఆమె గుండెల్లో కోరిక గూడుకట్టుకుని వున్నందునే మొదటిలో ఆమె జుట్టు తీయించుకోడానికి అంగీకరించలేదు. చివరకు వెంకటేశ్వర్లుకు మరొక అమ్మాయితో వివాహం జరుగుతున్నప్పుడు అందమైన తన కురులను బీభత్సదాయకమైన రీతిలో కత్తిరించుకుని ‘ మెసోకిక్‘ ప్రవర్తన ద్వారా అంతరంగంలోని తన కోరికకు ఉపశమనం కలిగించుకోవలసి వచ్చింది.
ఈ కథలో భ్రమర అంతరంగంలోని సంఘర్షణ మాత్రమే కాదు – ఆమెలాంటి బాల వితంతువులు ఆనాటి సమాజంలో ఎదుర్కోవలసివున్న సామాజిక సమస్య కూడా ఆవిష్కరించబడడం విశేషం. ఇదే విషయాన్ని ‘కాలప్రవాహపు పాయలు’ కథ విషయంలో కూడా చెప్పవచ్చు. ఈ కథలోని పురుషోత్తం ఒకప్పుడు సోషలిస్టు. మార్క్స్, లెనిన్ రచనల పట్ల వల్లమాలిన అభిమానాన్ని చూపినవాడు. సంఘాన్ని మరమ్మత్తు చేసి, పేదల బ్రతుకులు బాగుచెయ్యాలని పరితపించినవాడు. అయితే చిత్రమైన విషయం ఏమిటంటే – అతని గుండె లోపల వున్న అసలు పురుషోత్తం అతడికి మానసిక సంక్షోభం కలిగిస్తూ ఉంటాడు. అతడి ఒకనాటి ప్రియురాలినీ, అతడు ఒకనాడు నమ్మిన ఆదర్శాలనూ జ్ఞాపకానికి తెచ్చి చికాకును కలిగిస్తూ ఉంటాడు.వీటన్నింటి ఫలితంగా ఆతడు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెప్పే “ఆడిటరీ హెల్యూసినేషన్స్”కు, “విజువల్ హెల్యూసినేషన్స్”కు గురి అవుతూ ఉంటాడు. ఇట్లాంటి ఒక ఉదంతాన్ని ఈ కథలో కుటుంబరావుగారు మనసుకు హత్తుకునేలా చెబుతారు. అవకాశవాద రాజకీయాలు ఇవ్వగల స్వల్పకాల ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ – దానివలన వ్యక్తికి మనశ్శాంతి కరువుకాక తప్పదని హెచ్చరించే కథ యిది.
ఇలాంటి ఉదాహరణలు కొ.కు. కథల్లో మరికొన్ని కూడా కనబడతాయి. కొందరు కథకుల్లా లైంగికప్రవృత్తి, అంతరంగంలో అణచివేయబడిన శృంగారభావనలు వంటి కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా – మనిషి కథను పలు డైమెన్షన్లలో చూపేందుకు మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాల అవగాహనను సమర్థవంతంగా ఉపయోగించుకున్న కథకుడు కుటుంబరావు.
ఈ విషయానికి సంబంధించిన చర్చ అలా ఉంచి, కుటుంబరావుగారిపై గల ఇతర ప్రభావాల గురించి చెప్పేటప్పుడు జార్జి బెర్నార్డ్ షా, హెచ్.జి. వెల్స్, అనటోల్ ఫ్రాన్స్, మొదలైనవారి పేర్లు మనోవీధిలో మెదులుతాయి.
రచనలో సామాజిక ప్రయోజనానికి పెద్దపీట వేసిన బెర్నార్డ్ షా నాటకాల్లో భావావేశపరులైన హీరోలు, హీరోయిన్లు కనబడతారు. వ్యంగ్యం, హాస్యం వీటన్నింటితో తాను చెప్పదలిచిన విషయాన్ని పాఠకుడి బుర్రకు గట్టిగా పట్టేలా చెబుతాడాయన. ఈ వ్యంగ్యస్ఫూర్తి కుటుంబరావుగారికి చాలా అభిమానపాత్రమైన విషయం.
నిరాడంబరమైన శైలిలో ఉండే ఆయన రచనలకు ఈ వ్యంగ్యస్ఫూర్తే ఒక ప్రత్యేకతను సమకూర్చి పెట్టిందంటే అందులో అతిశయోక్తి లేదు. ప్రేమకథను రాసినా, వర్గపోరాటం గురించి చెప్పినా, మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి పెళ్ళికథను రాసినా, ఆఖరికి సినీ ‘మాయాలోకం’ గురించి రాసినా, ఆయన కథలన్నింటిలోనూ ఈ వ్యంగ్యస్ఫూర్తి తళుక్కుమంటూనే ఉంటుంది. ఏ విషయాన్నయినా ఘాటయిన పదజాలంతో విమర్శించకుండా – చురుక్కుమనిపించే వ్యంగ్యంతో చెప్పడం ఆయన ప్రత్యేకత. తన జీవితకాలంలో ఆయనకు చికాకు కలిగించిన చౌకబారు సినిమాలను, – తాడు, బొంగరం లేని ‘సైన్స్ ఫిక్షన్’నూ – అధమస్థాయి అభిరుచిని పెంపొందించే డిటెక్టివ్ సాహిత్యాన్ని – ఇట్లాంటి సాహిత్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకునే వ్యాపార రచయితలనూ – కుటుంబరావుగారు తమ కథల్లో ఆటపట్టించిన తీరు ఆయన రచనలు చదివినవారందరికీ గుర్తుంటుంది.
వ్యంగ్యరచనా చమత్కృతిలో కొందరు కుటుంబరావుగారిని ప్రఖ్యాత రష్యన్ రచయిత చెహోవ్ తో పోలుస్తూ ఉంటారు. చెహోవ్ లాగానే కుటుంబరావుగారికి కూడా పాఠకులను గిలిగింతలు పెట్టడం ప్రధానధ్యేయం కాదు. సరి అయిన రీతిలో ప్రశ్నను పాఠకుడి ముందు ఉంచి అతడిని ఆలోచింపచెయ్యడమే ఇద్దరికీ ఇష్టమైన విషయం. “ఉపదేశం వ్యక్తిత్వాన్ని పరాభవిస్తుంది. ఆలోచనను రేకెత్తించే గుణం వ్యక్తిత్వాన్ని నిద్రలేపుతుంది-” అనే కుటుంబరావుగారి సాహితీ దృక్పథం చెహోవ్ ఆలోచనకు సన్నిహితమైందే.
అంతేకాదు – “కథారచయితగా చెహోవ్ ఇతివృత్తం మీదా, ఏదో ఒక ఆశ్చర్యదాయకమైన విషయం మీద కాక – మొత్తం వాతావరణం మీదా – ఒకసంఘటన ప్రాతిపదికగా జీవితానుభూతినంతటినీ పట్టుకోగలగడం మీద ఆధారపడతాడు.” అంటూ చెహోవ్ గురించి ‘మార్టిన్ సేమూర్-స్మిత్’ చేసిన విశ్లేషణ (‘గైడ్ టు మోడరన్ వరల్డ్ లిటరేచర్’ అనే గ్రంథంలో) కుటుంబరావుగారికి కూడా చాలా వరకూ వర్తిస్తుంది.
వ్యంగ్యాన్ని అభిమానించే కుటుంబరావుగారు ఒక సందర్భంలో ఇలా అన్నారు:
“నన్నడిగితే కసికొద్దీ, మంటకొద్దీ రాసేది నాకు బాగుంటుంది. కసి అంటే పళ్ళు కొరకడమూ, చిందులుతొక్కడమూ అనుకోనక్కరలేదు. ఆ కసి వీరేశలింగం గారి రచనల్లో ఉన్నట్లే ఉండనవసరం లేదు. ‘కన్యాశుల్కం’లో ఉన్నట్లు కూడా ఉండవచ్చును. చలంగారి కథల్లో కసి ఉంది. ఆయనలో సౌందర్యదృష్టి ఒకపాలు తగ్గి, కసి ఇంకో పాలు పెరిగితే ఇంకా బాగుండునేమో అనిపిస్తుంది. రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి కథల్లో ఉన్నదా కసి. భమిడిపాటి వారి హాస్యంలో పళ్లు పటపటలాడించే కసి ఉండేది. సెటైరంతా కసి సాహిత్యమే.”
(సాహిత్య వ్యాసాలు – పే. 313)
-ఇలాంటి ‘కసి’తోనే కుటుంబరావుగారు తన సాహితీ ప్రస్థానంలో అన్ని దశలలోనూ రచనలు చేస్తూ వచ్చారు. రాసిన ప్రతిసందర్భంలోనూ సంఘటనల ప్రాతిపదికగా మొత్తం జీవితానుభూతినీ, వాతావరణాన్నీ సమర్థవంతంగా పట్టుకున్నారు.
“నేను మామూలుగా బుద్ధిమంతుణ్ణే.” (రాజకీయ వ్యాసాలు – పే.366) అని చెప్పుకున్న కుటుంబరావుగారు ఏప్రిల్ 1931లో ‘గృహలక్ష్మి’లో ‘ప్రాణాధికం’ అనే మొదటి కథను రాసేనాటికి తెలుగుసాహిత్యానికి మరో ‘బుద్ధిమంతుడయిన’ రచయిత వచ్చాడని పెద్దలు భావించారు. ఆ పత్రిక సంపాదకులు ఆండ్ర శేషగిరిరావుగారు ఈ కథకొక ప్రస్తావికను రాస్తూ –
“భారతమహిళ శీలవిషయమున అగ్నిశిఖ. నియమ పాలనమున వజ్రభిత్తి. భర్తృ సేవ ఆమెకు ప్రాణాధికము. ఈ విషయమునే ఈ కథ నిర్వహించుచున్నది. ఇది భారతమహిళా సతీత్వమును ప్రదర్శించు చక్కని చిన్నకథ.” – అని మెచ్చుకున్నారు కూడా.
కాని, మరో ఆరేళ్ళు గడిచేసరికి “తాతయ్య”, “అరణ్యం”, “కాలభైరవుడు” లాంటి కథలు రాసి, ఆ ‘బుద్ధిమంతతనాన్ని’ చాలావరకూ పోగొట్టుకున్నాడు! కుసంస్కారి అయిన ముసలి మొగుడితో సంసారం చెయ్యలేక సవతికొడుకుతో వెళ్ళిపోయిన ఓ అభాగ్యురాలి కథను “అరణ్యం”లోను, ఒక ఊరకుక్కను కాలభైరవుడి అవతారంగా భావించి పూజాదికాలు, భజన సంకీర్తనలు, మొక్కుబడులు, వగైరా కార్యక్రమాలన్నీ జరిపించి ఖంగుతిన్న మూఢభక్తుల కథను “కాలభైరవుడు”లోనూ – రాసి విమర్శకులకు చికాకు కలిగించాడు! బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం అనే విమర్శకుడు “కాలభైరవుడు” కథను విమర్శిస్తూ ‘ఈ కథ ఎందుకు వ్రాసినట్లో తెలియడం లేదు’ అని విసుక్కున్నాడు కూడా. అంతటితో ఆగకుండా ‘రావణుడికి న్యాయం చేస్తాను’ అని బయలుదేరి ‘అశోకవనం’ అనే కథను రాసి సీతను ‘బొత్తిగా సౌందర్య దృష్టిలేని వ్యక్తి’గా చిత్రిస్తే* – విమర్శకులు ఇది ‘రావణుడికి న్యాయం చెయ్యడం కాదు. సీతకి అన్యాయం చెయ్యడం’ అంటూ గుండెలు బాదుకోవలసి వచ్చింది!
ఇక – కుటుంబరావుగారు ఆ రోజుల్లో రాసిన కథల్లో తనకు బాగా తృప్తి కలిగించిన కథ అని చెప్పుకున్న ‘తాతయ్య’ కథ సంప్రదాయవాదులకు మరింత ‘బాధ’ కలిగించింది.
“మనుషులందరిలోకీ బ్రాహ్మలెక్కువ. బ్రాహ్మల్లో నియోగులకంటే వైదీకులెక్కువ. బ్రాహ్మణ పిల్లలు శూద్దర వాళ్ళ ఇండ్లలో మంచినీళ్ళు కూడా తాగకూడదు. అందులో ఒక మజ్జిగ చుక్క వేస్తే తాగవచ్చు. నియోగులు మంచి బ్రాహ్మణులు కారు. కాని, వాళ్లను శూద్దర వాళ్ల ను చూసినట్లు చూడరాదు. నీళ్ళల్లో మజ్జిగ చుక్క వెయ్యమని అడగకూడదు! మాలవాళ్ల దగ్గరగా పోతే మనం మైలపడతాం. దొరలు కూడా మాలవాళ్ళే – వాళ్ళు స్నానాలు చెయ్యకపోయినా తెల్లగా ఉంటారు. ఇంటి దగ్గర కూడా ఇంగ్లీషు మాట్లాడతారు. వాళ్ళు గొప్పవాళ్ళు!”
-ఇలా, ఒక బాలుడి స్వగతాన్ని కుహనా విలువలతో నిండిన సంప్రదాయభావాల పట్ల ‘కసి’తో – మన ముందుంచుతారు కుటుంబరావుగారు ‘తాతయ్య’ కథలో. ఇలాంటి చురకలు ‘కొంతమందికి’ ఆగ్రహం తెప్పించడంలో ఆశ్చర్యం ఏముంది?
సుమారుగా ’40ల వరకూ సామాజిక సమస్యలపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చిన కుటుంబరావుగారి ఆలోచనల్లో ’40ల తర్వాత చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. దీనికి కారణం సామ్యవాద దృక్పథంతో పరిచయం ఏర్పడడం, ఒకప్పుడు Keynes లాంటి అర్థశాస్త్రవేత్తలు – “It is an obsolete economic text book which I know to be not only scientifically erroneous but without interest or application for the modern world” అని భావించిన కారల్ మార్క్స్ ‘డాస్ కాపిటల్’లో కుటుంబరావుగారికి గొప్ప వెలుగు కనబడింది. (ఆర్థికమాంద్యం సమయంలో మరణశయ్యమీద కెక్కిన పెట్టుబడిదారీ వ్యవస్థను బ్రతికించి సోవియెట్ రష్యా ఒరవడిలో ప్రపంచం ‘ఎర్రబడిపోకుండా’ ‘రక్షించిన’ కీన్స్ వంటి అర్థశాస్త్రవేత్తలకు మార్క్స్ ఆలోచనలు రుచించకపోవడంలో ఆశ్చర్యం లేనట్టే – పీడితుల పక్షాన నిలబడాలని కోరుకునే కొ.కు. వంటి వారిని మార్క్స్ దృక్పథం ఆకట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు.)
“-1942లో మార్క్స్ రాసిన ‘కేపిటల్’ చదివిందాకా నాకు కమ్యూనిజం యొక్క ఆధారమేమిటో తెలియలేదు. ఒక మిత్రుడు యథాలాపంగా అన్నమాట నామీద బండెడు ప్రభావం కన్నా ఎక్కువ పని చేసింది. దొరికిన మార్క్సిస్టు సాహిత్యం చదివాను. భవిష్యత్తు మార్క్సిజంకే ఉన్నట్లు నమ్మకం కుదిరింది.” – (“రాజకీయ వ్యాసాలు” నుండి)
“మార్క్స్ కేపిటల్ చదవడంతో సహా మార్క్సిజం గురించి చదవడం నాకు మేలు చేసింది. సంఘవ్యాధి గురించి కొంత అర్థం చేసుకోగలిగాను. ఈపాటి జ్ఞానోదయం కలగగానే నేను చేసిన మొదటిరచన ‘కులం గాడి అంత్యక్రియలు’, – అటుతర్వాత రాసిన కథల్లో మనస్తత్వం గురించి గాలికబుర్లు రాయడం మానేసి ఆ మనస్తత్వాన్ని ఆడించే సాంఘికశక్తులను చిత్రించడం ప్రారంభించాను. ‘నీ కథలు వెనుక ఉన్నట్లుగా లేవు. అవే బాగున్నాయి’ అని కొందరు అభిమానులు నన్ను హెచ్చరించారు.”
– (“సాహిత్య వ్యాసాలు” నుండి) అంటూ కుటుంబరావుగారు వ్యక్తిగా, రచయితగా తనపై మార్క్స్ ఆలోచనలు చూపిన ప్రభావాన్ని చెప్పుకున్నారు. కుటుంబరావుగారు ఏ ఆలోచనలతో కథలను రాసినా, దాని ఆవిష్కరణకు మధ్యతరగతి కుటుంబీకుల జీవితచిత్రాన్నే నేపథ్యంగా తీసుకునేవారనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరి మనస్తత్వాన్ని, ప్రవర్తనను చిత్రించడంలో కుటుంబరావుగారికి గొప్ప నిపుణత ఉంది. మార్క్సిస్టు దృక్పథంతో రచనలు చేసినప్పుడు కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తూ కుటుంబరావుగారు ఇలా అన్నారు.
“- నేను మధ్యతరగతి సంస్కారం కలవాణ్ణి. ఈ సంస్కారంతో నేను అభ్యుదయ రచనలు చేయగలను కానీ, – శ్రామిక సాహిత్యసృష్టి చెయ్యలేను. అందుచేత నా రచనలు జనసామాన్యాన్నీ, శ్రామికులను, ఉత్తేజపరచలేవు. కాని, మధ్యతరగతి వారిలో ప్రజాజీవితానికి అనుకూలించే పరివర్తన తెచ్చే అవకాశం ఉంది. ఈ పని ఎంత విజయవంతంగా చెయ్యగలిగితే అంత ఉత్తమ కథకుణ్ణి అనిపించుకుంటాను.” –
ఇలా అంటూనే – “రచయిత తన వర్గాన్ని గురించే రాయాలని లేదు. అనేకమంది సుప్రసిద్ధ కథకులు తమకు దూరంగా ఉండే వర్గాలను గురించి కూడా కథలు రాసి ఆయా జీవితాల్లోని సత్యాన్ని ప్రదర్శించగలిగారు -” అని కూడా అంగీకరించారు.
రచయిత తాను ఏ వర్గానికి చెందినవాడో ఆ వర్గాన్ని గురించి రాసినప్పుడు జీవితసత్యాన్ని మరింత స్పష్టంగా పట్టుకునేందుకు – దానిని శక్తివంతంగా కథల్లో ఆవిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో తాను ఏ వర్గాన్ని గురించి రాస్తున్నాడో ఆ వర్గంతో కొంత సన్నిహిత సంబంధం ఉండాలి. కేవలం ఊహించుకుని జీవితసత్యాన్ని అన్వేషించగలగడం సాధ్యంకాదు.
మరొక వర్గానికి చెందిన రచయితకు శ్రామికుల జీవితాలతో సన్నిహిత సంబంధం ఉన్న సందర్భాలలో కూడా ఎంతకాదనుకున్నా తన వర్గస్వభావం రచనలో చోటుచేసుకునే ప్రమాదం ఉంటుంది.
ఇది చెబుతుంటే – మార్క్సిస్టు సాహిత్యవిమర్శ గురించి చెబుతూ లూనకార్స్కీ –
“- రచయిత సృష్టించే సాహిత్యం ఉద్దేశపూర్వకంగానయితేనేమి, అట్లాంటిది లేకుండానయితేనేమి, అతడు ప్రాతినిధ్యం వహించే వర్గానికి ఎప్పుడూ ప్రతిబింబంగా ఉంటుంది. అలాకానప్పుడు సర్వసాధారణంగా జరిగేదేమంటే – రచయితపై వివిధ వర్గాల ప్రభావం జమిలిగా అ సాహిత్యంలో కనబడుతుంది. దీనిని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది.” అనడం జ్ఞాపకానికి వస్తుంది.
ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్నా, ’40ల తర్వాత కొ.కు. రాసిన కథల్లో – స్వాతంత్ర్యానంతరం దేశంలో పెచ్చుపెరిగిన దారిద్ర్యం, నిరుద్యోగం, కమ్యూనిజమ్ ను అణచివేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన శ్రద్ధ ఆకలి దారిద్ర్యాలను నిర్మూలించడం విషయంలో చూపకపోవడం, కులం పేరుతో మతం పేరుతో పెరిగిన దోపిడీ ప్రవృత్తి, మొదలయిన విషయాలను సార్వత్రిక ధోరణిలో చర్చిస్తూ – మధ్యతరగతి కుటుంబాల్లో పలు రూపాల్లో చోటుచేసుకునే ‘జంకులు’ వారినెలా శక్తిహీనులను చేస్తున్నాయో, చిన్నపాటి సంపద లభించే అవకాశం ఏర్పడినా మధ్యతరగతి కుటుంబాల్లో కూడా పెట్టుబడిదారీ ప్రవృత్తి ఎలా తలెత్తుతుందో – అద్భుతంగా చిత్రించడం జరిగింది అనేది విస్మరించరాని సత్యం. ఇందుకుగాను ఆయన వ్యంగ్యాన్ని చిలకరిస్తూ “కసి” సాహిత్యాన్ని రాయవచ్చు. లేదా సింబాలిక్ ధోరణిలో కథను అల్లవచ్చు. లేదా – మామూలుగానే కథను చెబుతూ మనుషుల ప్రవర్తనలోని సంకుచితత్వాన్ని ఎద్దేవా చేయవచ్చు. అదీకాదనుకుంటే ఒక ‘సైన్స్ ఫిక్షన్’గా మన ముందు ఉంచవచ్చు. ఏధోరణిలో ఎలా రాసినా ఆయన అరాటం మనిషి మనిషిగా జీవించాలని మాత్రమే!
“రోడ్డు ప్రక్కన శవం” కథలో కుటుంబరావుగారు “-మనిషి ఫాలాక్షుడు. ఫాలం విప్పి ఏ సమస్యకేసి చూసినా ఆ సమస్య యొక్క స్వరూపం మారిపోతుంది. అయితే – తాను ఫాలాక్షుణ్ణన్న సంగతి మనిషికి తెలియదు. అందుచేత ఫాలం విప్పడు. శివోహం అనుకోడు -” అని వ్రాశారు. పాఠకుల చేత ‘శివోహం’ అనిపించేలా చెయ్యాలన్నదే కొ.కు. తపన!
తాను నమ్మిన విషయాన్ని ఆచరించే విషయంలో వున్న ‘జంకు’ వ్యక్తికీ, దేశానికీ, మంచిదికాదు అనేది కుటుంబరావుగారి అభిప్రాయం. ఈ విషయాన్నే మనం ‘యావజ్జీవ శిక్ష’, ‘బకాసుర’ వంటి కథల్లో ఛూడవచ్చు. ఈ రెండూ ’60లలో రాయబడిన కథలే – ( ‘బకాసుర’ను నవలగా భావించడం వున్నదిగాని, ఒక ప్రక్రియగా చెప్పాల్సి వచ్చినప్పుడు అది కథే అని నా అభిప్రాయం)
‘యావజ్జీవ శిక్ష’లోని శేషు ఒక ఆదర్శవాది. హేతువాది. అతగాడికి జంఝెప్పోగు మీద, బ్రాహ్మణత్వం మీద, పరలోకం మీద బొత్తిగా నమ్మకం లేదు. కాని, బ్రతుకుతెరువు కోసం – ఆదెమ్మత్త ఆదరణను పొందడం కోసం – ఈ బూటకపు విలువలన్నింటికీ తలవంచవలసి వచ్చింది. ఆఖరికి తద్దినాలు కూడా పెట్టవల్సి వచ్చింది. “నేను ఎంత వాజమ్మనో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది” అనే శేషు స్వగతంతో ఈ కథను ముగిస్తారు కుటుంబరావుగారు. ఇట్లాంటి “రాజీ”లు మధ్యతరగతి కుటుంబీకుల జీవితాల్లో కోకొల్లలుగా కనబడతాయి. వీరిలోని -‘జంకు’ ఈ పరిస్థితికి మూలకారణం. ఈ ‘జంకు’ వల్లనే పెట్టుబడిదారు కూడా స్వేచ్ఛగా ప్రజలను దోచుకోగలుగుతున్నాడు అనే విషయాన్ని ‘బకాసుర’లో అత్యద్భుతంగా చెబుతారు కుటుంబరావుగారు.
ఈ కథలో భీముడు చంపిన బకాసురుడు (రాక్షసుడు నిజానికి – భయంకరుడేమీ కాదు! వంట్లో జవసత్వాలు లేకపోయినా (వార్ధక్యం కారణం వల్ల) తన ఏజెంట్ల పబ్లిసిటీ ద్వారా “రాక్షసత్వాన్ని” నిలబెట్టుకుంటూ ప్రజల్ని హడలగొడుతున్న ముసలి రాక్షసుడు! – ప్రజల అజ్ఞానమే – ప్రజల పిరికితనమే – అతడి శక్తి. “కేపిటలిజమ్”కు ఉన్న ముద్దుపేర్లన్నింటికీ ఇతడూ బదులు పలుకుతాడని చెప్పవచ్చు.)
ఈ కథలోని భీముడు మరో ప్రపంచపు మరో లెనిన్ అనుకున్నప్పటికీ, ఇంతకు మించి గుర్తుపెట్టుకోదగిన పాత్రలు ఈ కథలో ఉన్నాయి. అవి – బలభద్రుడు, వేదాంతి, బండివాడు. ‘బకాసుర వ్యవస్థ’కు బలియైపోయిన బలభద్రుడి మరణంలో త్యాగం ఉంటే – ముసలి రాక్షసుడి సంగతి తెలిసీ, రాజుగారి క్రౌర్యాన్ని స్వయంగా చవిచూసీ, బ్రతుకుతెరువుకు తలవంచి రోజుకో ప్రాణాన్ని బకాసురుడికి అప్పజెప్పిన బండివాడిలో బానిసత్వపు పిరికిదనం ఉంది. యిక – వేదాంతి గారిలో తిరోగమనతత్వానికి ఊపిరి అయిన అవకాశవాదం ఉంది! భీముని అవతారానికి ముందు ప్రతి ‘బకాసుర వ్యవస్థ’లోనూ ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలే! “బకాసురుణ్ణి భయపెట్టగలిగిన వాడినై ఉండి కూడా వాణ్ణి చూచి హడలిపోయే మంత్రి వగైరాలకు తాను లొంగవలసి వచ్చింది” అని బండివాడనుకున్న మాటల నేపథ్యంలోంచి ఈ కథను చదివే పాఠకులు ఆత్మపరిశీలన చేసుకొనవలసి ఉంది.
‘జాంబవంతుని కల’లో కూడా ఇలాంటి సింబాలిక్ ధోరణి కనబడుతుంది. ఈ కథలోని జాంబవంతుడు ఓ వానర ప్రభువు కొలువుకూటంలోని మంత్రి మాత్రమే కాదు. ప్రజల అభ్యుదయం కోసం ఆరాటపడిన ఓ మహనీయుడు. కిష్కింధ ప్రజలకు వాలి పాలన పోయి సుగ్రీవుడి పరిపాలన వస్తే దేశం స్వేచ్ఛా, సమానతలతో అభివృద్ధి చెందుతుందనీ, ప్రజలకు హాయి కలుగుతుందనీ ఆయన కలలు గన్నాడు. కానీ, – సుగ్రీవుడి పాలనలో ఆ కలలేవీ నిజం కాకపోవడమేకాకుండా – దేశంలో రాక్షసరాజ్యం విజృంభించడం చూసి కృంగిపోయాడు. ఋష్యమూకం మీద ఉన్న విప్లవకారులు దేశానికి మంచి చేద్దామనే పట్టుదలతో ఉన్నారని విని – వాళ్ళమీద ఆశలు పెంచుకున్నాడు. దర్బారులో “విప్లవం వర్ధిల్లాలి” అని కలవరించి ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. ఈ కథ చదివినప్పుడు మనదేశంలో ప్రజల కలలు కల్లలుగా మారిన స్వాతంత్ర్యానంతర పరిస్థితులు మాత్రమే కాదు – అవకాశవాదులతో సహజీవనం చెయ్యలేక, ఆత్మను చంపుకోలేక కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన కొందరు వృద్ధ నాయకులు కూడా జ్ఞాపకానికి రావడం సహజం.
స్వాతంత్ర్యానంతరం మనదేశంలో అధికారం స్వార్థపరుల హస్తగతం కావడంతో దేశం ‘దిబ్బరాజ్యం’గా మారిపోయిందని భావించిన కుటుంబరావుగారు ‘దిబ్బరాజ్యం’ కథలు రాశారు.
దిబ్బరాజ్యానికి స్వాతంత్ర్యం వచ్చిందని విని మనకు కథను చెప్పే వ్యక్తి ఆ రాజుగారిని కలుసుకోవడానికి అక్కడకు వెళ్ళే సరికి రాజుగారి దర్బారు ‘శాసనసభ’గా పేరు మార్చుకుందనీ, దానికి రాజావారు అధ్యక్షులయిపోయారనీ, జమీందారులందరూ మంత్రులుగా మారిపోయారని తెలుస్తుంది! – రాజుగారు మాటల మధ్యలో తమ దేశంలో జమీందారీలు రద్దయిపోయాయని చెబితే – మన కథానాయకుడు చాలా సంతోషించి, ఆ వివరాలు చెప్పమంటాడు.
-జమీందారీలు లేవుగానీ, ఒక్కటే చింత, – జమీందార్లకు నష్టపరిహారం రొక్కరూపంలో ఇవ్వలేకపోయాం. పరిహారం క్రింద చాలా భూములు వారికిచ్చేసి – మిగిలిన వాటిని రైతులు నాలుగేళ్ళపాటు ఎలాంటి ప్రతిఫలం పొందకుండా సాగు చేసేటట్లు నిర్ణయించాం” అంటారు రాజుగారు!
యిక, – మరోకథలో దిరుగుండం రాజ్యాన్ని ఏలుతున్న దిబ్బరాజుగారు దేశంలో దారిద్ర్యం పెరిగిపోయిందని విని దరిద్రుల పీడ వదిలించుకోవడానికి వాళ్ళందరినీ ఉరితీయాలని ఆదేశిస్తారు! దీని ఫలితంగా దేశంలో పనిచేసేవారే లేకుండా పోయారు. ధనికులకు భూమ్మీద కాలు నిలవని పరిస్థితి ఏర్పడి దేశం అల్లకల్లోమైపోయింది. అప్పటికిగాని శ్రీశ్రీ రాజావారికి, వారి ఆశ్రితులయిన ధనికులకు, తాము ఇన్నాళ్ళు బ్రతికింది బీదల కష్టం మీదనేనని తెలిసిరాదు!
ఇట్లాంటి కథలను కుటుంబరావుగారు ఏ వ్యవస్థపట్ల ‘కసి’తో రాశారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇలాంటి ‘కసి’తో రాసినదే ‘కరువొచ్చింది’ అనే కథ కూడా –
“-కరువొచ్చింది. పంటలు పండినై, – గింజలు కళ్ళాలు దాటగానే మాయమయినై. పైరు పచ్చగా పెరిగినప్పుడూ, కంకులు బరువుగా వొంగి, తమను ఏపుగా పెంచిన భూదేవికి జోహార్లు చేసినప్పుడూ, బంగారు గింజలు కనక వర్షంలా జలజల రాలినప్పుడూ, కళ్ళపండువుగా చూచిన పేదప్రజలకు కన్నుపొడుచుకున్నా గింజ కనిపించలేదు. రైతుల తపఃఫలితాన్ని గద్దలు తన్నుకుపోయినై. కాటకం వచ్చింది.” అంటూ మొదలయ్యే ఈ కథలో కరువు నివారణకు ఏర్పాటు చేయబడిన సభలో – దేశమంతటా కరువు నివారణ హోమాలు, యజ్ఞాలు చెయ్యాలనీ, రామభజనలు చేయాలనీ, పేదప్రజలు రోజూ గీతాపారాయణం చెయ్యాలనీ – బ్రహ్మచర్యం పాటించి సంతానోత్పత్తిని తగ్గించాలనీ – పూటకు పావుశేరుకన్నా ఎక్కువ బియ్యం అన్నంగా వండుకోకూడదనీ (తర్వాత దీన్ని అర్ధశేరుగా సవరించారు) తీర్మానాలు ఆమోదించబడడమూ, – ఆ కథ చదివినవారికి గుర్తు ఉంటుంది. అయితే – కథ చివరకు వచ్చేసరికి, – పేదవాళ్ళందరూ ఏకం కావడం వల్ల లక్షల కొద్దీ బస్తాల ధాన్యం చీకట్లోంచి బయటకు రావడమూ, కరువు పటాపంచలు కావడమూ, జరుగుతుందనుకోండి – అది వేరే విషయం!
ఈ కథ గురించి చెబుతూ వుంటే, – బిజెపి ప్రభువుల పాలనలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన వింత ఒకటి జ్ఞాపకానికి వస్తున్నది. ఆ సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అంతకు ముందు సంవత్సరంతో పోల్చి చూస్తే కాస్త పెరిగింది. అప్పటికే ఫుడ్ కార్పొరేషన్ వారి గిడ్డంగుల్లో టన్నులదాకా ఆహారధాన్యాలు మూలుగుతున్నాయి. ఇప్పుడు ఈ క్రొత్త దిగుబడి కూడా జతచేరితే వాటిని గిడ్డంగుల్లో నిలవ చెయ్యడానికి పెద్దమొత్తంలో వ్యయం అవుతుంది. ఏం చెయ్యాలి అనే సమస్య వచ్చింది. ఇది ఇలా ఉండగా, ఆహారధాన్యాలు ఖర్చు కాకుండా ఎందుకిలా పేరుకుపోతున్నాయి అనే సందేహం కూడా వచ్చింది.
ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా వెంటనే మన ‘మేధావులు’ కనిపెట్టారు. పేదప్రజలు ఇప్పటికే తగినంత ఆహారధాన్యాలను వినియోగం చేస్తున్నారు. అందుచేత వారు అదనంగా ఆహారధాన్యాలను వినియోగం చెయ్యడానికి ఇష్టపడడం లేదు. చేపలు, మాంసం ఇలాంటి వాటిపైన వ్యయం చెయ్యడానికీ, ఆహారేతర వస్తువుల వినియోగం చెయ్యడానికీ మొగ్గుచూపిస్తున్నందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని వారు తేల్చి చెప్పారు! దాదాపు 50 కోట్ల మంది ప్రజలు రోజుకు ఒకపూట కూడా కడుపునిండా తినడానికి నోచుకోని స్థితిలో ఉన్న దేశంలో – ప్రజలకు ఆహారధాన్యాలు అదనంగా అవసరం లేదని ఆ ‘మేధావులు’ ఎలా తేల్చి చెప్పారో అర్థం కాదు! ఇంతకన్నా విచిత్రం మరొకటి కూడా ఉంది. ఆహార సబ్సిడీలపై చేస్తున్న వ్యయం బాగా ఎక్కువగా వుంటున్నది కాబట్టి – ఆహారధాన్యాల నిల్వలపైనా, రవాణాపైనా ఉన్న నియంత్రణలన్నీ ఎత్తివేసి – వీటిని ‘సద్వినియోగం’ చేసే బాధ్యత ప్రయివేటు రంగానికి అప్పజెప్పమని మరో అర్థశాస్త్రవేత్తగారు సలహా ఇచ్చారు.
ఫుడ్ కార్పొరేషన్ గోడవున్లలో పేరుకునిపోయి ఉన్న నిల్వలలో ‘పనికి ఆహారం’; పథకం క్రింద అదనంగా మరికొన్ని పనులు చేపడితే పేదప్రజలకు మేలు సమకూరడం మాత్రమే కాకుండా దేశ ఆర్థికప్రగతికి అది దోహదం చేస్తుందని ఈ ‘మేధావులకు’ తెలియదనుకోవాలా? – గిడ్డంగుల్లోని ఆహార ధాన్యాలు వినియోగం కాకపోవడానికి కారణం ప్రజలకు వినియోగశక్తి లేకపోవడం అనే కనీస అవగాహన వారికి ఉండదనుకోవాలా? లేక పెట్టుబడిదారీ మనస్తత్వానికి ఇది పరాకాష్ఠ అనుకోవాలా? అనే ప్రశ్నలకు సమాధానం ఆ మేధావులకే తెలియాలి!
-ఇలా ఆలోచించినప్పుడు – కొ.కు. గానీ 2002 వరకూ జీవించి వుంటే ‘కరువొచ్చింది’ కథను ఇంతకు మించిన ‘కసి’తో రాసివుండేవారేమో అనిపిస్తుంది.
-పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థకు మూలాధారమైన విషయాల్లో ‘దోపిడీ’ అనేది ముఖ్యమైనది. ఈ దోపిడీ అనే ప్రక్రియ అవతలి వ్యక్తికి తెలిసీ, తెలియకుండా కూడా ఎలా జరుగుతుందో – సాధారణ ప్రజాజీవితంలో ఇది ఎలా ఆమోదాన్ని పొందుతుందో కుటుంబరావుగారు ‘నువ్వులు – తెలగపిండి’, ‘ట్యూటర్’ అనే రెండు కథల్లో చాలా అద్భుతంగా చెబుతారు.
“తెలగపిండి ఎట్లా వస్తుందో అందరికీ తెలుసు. నువ్వులు అట్టే నాగరికత లేని సరుకు. అది పొలాల్లో కష్టజీవుల చేతిలో పెరిగి మధ్యవాళ్లకు అమ్ముడై బస్తీ చేరుతుంది. అక్కడ దాన్ని గానుగ ఆడి నూనె తీస్తారు. ఆ నూనె అందమైన సీసాలకూ, డబ్బాలకూ ఎక్కి అనేక వంటిళ్ళను అలంకరిస్తుంది. తెలకపిండి చక్కను నువ్వులు ఒకవేళ చూచినా పోల్చలేవు. అది గొడ్లకూ, పేదవాళ్లకూ ఆహారం అవుతుంది.” అంటూ ప్రారంభిస్తారు కొ.కు. ‘నువ్వులు – తెలగపిండి’ కథను (రచనాకాలం – 1950).
కొందరికి లాభాలను ఆర్జించిపెట్టడానికి మరికొందరు ఎలా గానుగ ఆడబడి వ్యర్థపదార్థంగా ఎలా మిగిలిపోతారో – పెట్టుబడిదారీ పారిశ్రామిక నాగరికతలో ఉత్పత్తి కారకంగా శ్రామికుడి స్థానం ఏమిటో ఒక మధ్య తరగతి కుటుంబం కథగా ఇందులో చెబుతారు కుటుంబరావుగారు. ఈ ‘నువ్వులు – తెలగపిండి’ వ్యవహారంలో గానుగ ఆడించేవాడు పారిశ్రామికవేత్త. ఆడబడేవాడు శ్రామికుడు, అనే నియమం ఏదీ లేదు. దగ్గర బంధువుల విషయంలో కూడా ‘స్వార్థం’ అనేది చొరబడినప్పుడు మనషులు నువ్వుల గానుగ ఆడబడుతూనే ఉంటారు. చివరకు తెలకపిండిలా మారి వ్యర్థపదార్థంగా మిగిలిపోతూ ఉంటారు అనేదానికి ఈ కథలోని సోమయాజులు అనబడే ఇంటల్లుడే తార్కాణం. అతడికి భగవంతుడు ఇచ్చిన చక్కని గాత్రమే అతడి బ్రతుకును తెలకపిండి చక్కలా మార్చేసింది.
ఇక ‘ట్యూటర్’ కథలోని రాజశేఖర్ – ‘నువ్వులు – తెలగపిండి’ కథలోని సోమయాజులు మాదిరిగా నోట్లో నాలుక లేనివాడు కాదు. ‘దోపిడీ’ అనేది ఎలా జరుగుతుందన్న విషయంలో అవగాహన ఉన్నవాడు. ‘వాణి’ అనే ఓ ధనవంతుడి కూతురు (టెక్స్ టైల్ ఫ్యాక్టరీ అధినేత కూతురు. ఓ మందుల కంపెనీ అధినేత కుమారునికి కాబోయే భార్య) అ న్నట్టు – ‘చాలా నాస్టీమేన్. రిచ్ క్లాస్ అంటే చాలా ఎన్వీ. – ఎప్పుడూ కమ్యూనిజమే మాట్లాడతాడు. ‘
-ఇలాంటి రాజశేఖర్, వాణికి కేవలం వందరూపాయలకు ట్యూషన్ చెప్పడానికి రోజూ ఎందుకు వాళ్ళ ఇంటికి వెడుతున్నాడు? ఓ సినిమా కంపెనీ వాళ్లకు చాలా తక్కువ పారితోషికం అని తెలిసి కూడా తన నాటకాన్ని ఎందుకు అమ్మాడు?
“- నెస్సెసిటీ. నా బోటివాళ్ళకు నెస్సెసిటీ అనేది ఒకటి ఉంటుంది. నాకు మీ డాడీ (వాణి తండ్రి) వంద రూపాయలు జీతం ఇస్తున్నారు – ఇలాంటి ట్యూషన్స్ రోజుకు మూడు చెబితే నెలకు మూడు వందలు వస్తాయి. డుయు థింక్ ఇట్ ఈజ్ ఎ డీసెంట్ ఇన్కం? – అయితే నేను వంద రూపాయలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాను? – నెస్సెసిటీ. నేను సర్వైవ్ కావాలంటే ఈ ఎక్స్ ప్లాయిటేషన్ కు ఒప్పుకోవాలి.” అనే రాజశేఖర్ ఆవేదనలో ఎక్స్ప్లాయిటేషన్ జరగడానికి గల అసలు కారణం తెలుస్తుంది. దీనిని నిర్మూలించాలన్నదే ‘సోషలిజమ్’ ధ్యేయం.
-కుటుంబరావు కథల గురించి చెప్పేటప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో కేపిటలిస్ట్ ప్రవృత్తులు ఎలా చోటుచేసుకుంటాయో ఆయన చెప్పే తీరు గురించి తప్పకుండా ప్రస్తావించవలసి ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులకు ఆర్థికపరంగా ఏమాత్రం అవకాశం దొరికినా పెట్టుబడిదారీ వ్యవస్థలోని బడాబాబులను మించిన అవలక్షణాలను అతి సునాయాసంగా సంతరించుకుంటారనేది కొ.కు. అభిప్రాయం. “మారిన జీవితం”, “అంతరాత్మ”, “కొత్తజీవితం” మొదలైన కథలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
“మారిన జీవితం” కథలోని లీల ఒక ఆదర్శవాది కూతురు. హెచ్చు, తగ్గులనే తేడాలు కృత్రిమంగా కల్పించబడినవేననీ, మనుషులందరూ ఒకటేననీ వాళ్ళ నాన్న వాళ్ల అమ్మకు ప్రతిరోజూ ఇంటిలో ఇచ్చే ఉపన్యాసాలను ఆమె తరచూ వింటూండేది. అయితే – ఆమెకు డబ్బున్న పల్లెటూరి సంబంధం కుదరడంతో – తండ్రి ఇచ్చే ‘ఉపన్యాసాలు’ జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం లేకుండా పోయింది. బడుగువర్గాలకు చెందిన ప్రజలను పీడించడానికి కావలసిన హంగులన్నీ సునాయాసంగా ఆమెకు సమకూరాయి. మొదట్లో అత్తింటి వారు ఈమెను పరాయి పిల్లగా చూశారు గానీ, ఆమెకూ తమ తరహా ప్రవృత్తే ఉన్నదని రూఢి కావడంతో ఆమెను స్వంత మనిషిగా చూడడం ప్రారంభించారు! ఒక ప్రక్క కూలిజనాన్ని (“తిండికి లేని వెధవలు”) అణిచిపెడుతూ – మరో ప్రక్కన బ్రాహ్మణులకు సంతర్పణలు చేయిస్తూ – “పెద్దమనుషు”లకు ఉండవలసిన హంగులన్నిటినీ సముపార్జించుకుంది. ఓ విధంగా చెప్పాలంటే “ఐశ్వర్యం” నవలలోని డాక్టరు కూతురు వంటిదే లీల కూడా.
ఇదే విషయం “అంతరాత్మ” కథలో మరొకవిధంగా ఆవిష్కరించబడింది. ఈ కథలోని సుదర్శనం అనే యువకుడి తండ్రి ఒక ఆదర్శవాది. వీరేశలింగం గారితో కాస్త పరిచయం ఉన్నవాడు. అయితే – అతడు చనిపోయిన తర్వాత – అతడు చేసిన 13 వేల రూపాయల ఇన్సూరెన్స్ మొత్తానికి సుదర్శనం తల్లి ‘అధిపతి’ కావడంతో ఆమెలో తలెత్తిన ‘కేపిటలిస్ట్’ ప్రవృత్తిని – మున్నెన్నడూ లేని విధంగా జ్యోతిష్యం, హస్తసాముద్రికం, అంకెలశాస్త్రం, వారాలు, వర్జ్యాలు మొదలైనవాటికి ఆ ఇంటిలో ప్రాధాన్యత లభించిన వైనాన్ని, అకారణంగా ఆ ఇంట్లోని మనుషులు ఒకరినొకరు ద్వేషించుకోవడాన్ని ఈ కథలో చాలా ఆసక్తికరమైన రీతిలో చెబుతారు కుటుంబరావుగారు.
“నేను సమ్మెలు చూశాను. పోలీసుల లాఠీచార్జీలు చూశాను. కానీ, మా ఇంట్లో జరిగే పోట్లాటలంత అర్థరహితమైన సంఘటనలని ఎక్కడా చూడలేదు. ఇంట్లో ఇంత తిండి వుండి బతకడం చేతకాని మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడు తప్ప ఈ కొట్లాటలను ఊహించుకోలేరు. ఇంట్లో డజను మంది ఉంటే ఏ ఇద్దరి మధ్యనైనా శత్రుత్వం ఉండేది. ఇవాళ కొంపలో ఎవరికి ఏ ఎదురుదెబ్బ తగిలినా మిగిలినవారంతా ఏకగ్రీవంగా నవ్వడానికి సిద్ధంగా ఉన్నారు”.
-అంటూ ఈ కథలోని సుదర్శనం లోనయిన ఆవేదనను పాఠకులు మరిచిపోలేరు. ‘ధనంగాడి’ లీలలకు తార్కాణాలే ఇవి అన్నీ!
కుటుంబరావుగారి “కులంగాడి అంత్యక్రియలు” కథలో (మార్క్స్ ‘కేపిటల్’ చదివిన తర్వాత కలిగిన అవగాహనతో తాను రాసిన తొలికథగా దీనినే కొ.కు. పేర్కొన్నారు) దిక్కులేని చావుచచ్చిన కులంగాడి కథ, ఆ తర్వాత వచ్చిన అధికారం గాడి కథల తర్వాత ధనంగాడి కథ కూడా వున్నది.
పరమ కర్కోటకుడు అయిన ధనం గాడు అమలుపరిచే నిశ్శబ్ద అలిఖిత శాసనాన్ని గురించి చెబుతారు కుటుంబరావుగారు ఈ కథలో. “వాడి మహత్యం ఏమిటోగాని వాడికోసం ప్రతీతరంలోనూ అనేక కోట్లమంది మనుషులు మనస్ఫూర్తిగా బలి అయ్యారు. కేవలం వాడి అనుగ్రహం పొందలేకా, కోల్పోయీ, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ సంఖ్య పెద్దది” అని అంటారాయన.
– ఇలాంటి ధనం గాడి ‘ఘనత’ గురించి ఎంతమంది ఎన్ని కథలు రాసినా ఇంకా కొంత ‘వ్యథ’ మిగిలిపోతూనే ఉంటుంది!
– కుటుంబరావుగారు ‘రోడ్డుప్రక్కన శవం’ అనే కథ ఒకటి రాశారు. అవడానికి ఇది రోడ్డుప్రక్కన దిక్కులేని చావు చచ్చిన ఒక వ్యక్తి కథే అయినా – ఆ కథలో కొ.కు. బ్రతికుండగా ఒక ముష్టివాడికి వచ్చిన రెండు కలల గురించి చెబుతారు.
మొదటి కలలో – పూరిపాక. పాక మీద సొరపాదు. ఆ పాదుకు కాయలు. పాకలో వంటచేసే ఆడకూతురు. అన్నం వాసన – పులుసు వాసన – పొయ్యి క్రింద ఎర్రెర్రగా మండుతున్న చితుకుల మంట ఉంటాయి.
ఇక, రెండో కలలో ఒక పెద్ద ఇల్లు. దానికి గోడలు, వాకిళ్ళు ఉండవు. అందులో చాలా కుటుంబాలుంటాయి. అందరూ కలిసి అందరికోసం అందులో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య స్నేహం, చుట్టరికం, ఇలాంటివి ఉన్నాయో లేదోగాని – అంతకన్నా సహజమైన, విశాలమైన, బంధం ఏదో వాళ్ళ మధ్యన ఉంది. వాళ్ళందరికీ రోడ్డుప్రక్కన దిక్కులేని చావు చచ్చిన ముష్టివాడి మీదా, ఆ ముష్టివాడికి వాళ్ళ మీదా, అపారమైన విశ్వాసం ఉంది.
– ఇవి ఫ్రాయిడియన్ కలలు కావు. అంతరంగపు లోతుల్లోంచి దీన్ని విశ్లేషించవలసిన అవసరం లేదు. ఇవి అచ్చంగా మనిషి బాహ్యజీవితానికి కనీస అవసరాలకు సంబంధించిన కలలు. మనిషికి ఆహారం ఉండాలి – దానిని వండుకోడానికి కావాల్సిన ఆర్థిక స్తోమత, అవకాశం ఉండాలి. అతడికంటూ ఒక సంసారం ఉండాలి – అనే కోరికలు మొదటి కలలో కనబడుతున్నాయి. ఆకలితో మాడి చనిపోయిన ముష్టివాడికి ‘నా’ అంటూ ఎవరూ లేని ముష్టివానికి – అలాంటి కల రావడంలో ఆశ్చర్యం లేదు. ఈ కలకు వ్యక్తిపరమైన ఆకాంక్ష మూలం.
రెండో కలకూ అవసరాలు తీరడం అనేదే ప్రాతిపదిక విషయం గాని – ఆ ప్రాతిపదిక వ్యక్తిపరమైన ఆకాంక్షకు సంబంధించింది కాదు. సామాజిక ఇచ్ఛకు, సామూహిక శ్రేయస్సుకు సంబంధించినది. ఒక్కమాటలో absolute communism చెప్పే లక్ష్యాన్ని చెబుతున్నది ఈ కల.
ఈ కలలు నిజమై మానవుడు వ్యక్తిపరంగాను, సమాజపరంగానూ, అభ్యున్నతి సాధించగలగాలనే తపనతో కుటుంబరావు గారు వందలాది కథలను, గల్పికలను రాశారు. ‘గల్పిక’ అనే ప్రక్రియను తనదైన రీతిలో రచించి సాహిత్యంలో దానికొక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన ఘనత కొ.కు. గారిది. కథకూ, గల్పికకూ, కొంత పోలిక ఉన్నప్పటికీ తేడా కూడా ఉంది. కథకు ఇతివృత్తం అనేది ఎంతో కొంత మేరకు తప్పనిసరిగా ఉండాలి. గల్పికకు ఆ అవసరం లేదు. ఇందులో పాత్ర చిత్రణ అనేదానికి అవకాశమే లేదు. గిలిగింతలు పెడుతూ, చురుక్కుమనిపించే వ్యంగ్యంతో – మన విలువలలోని లేకితనాన్ని, చిత్తశుద్ధి లేమినీ, అవకాశవాదాన్నీ ఎద్దేవా చేస్తూ ‘సున్నితంగా’ మొట్టికాయలు మొట్టేందుకు (!) నిర్దేశించబడిన ప్రక్రియ ఇది! కథతో పోలిస్తే దీని నిడివి బాగా తక్కువే గాని – ఇంచుమించుగా కథ సాధించే ప్రయోజనాన్ని ఇది కూడా సాధించేందుకు అవకాశం ఉంది.
– ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్నా, ఒక విషయాన్ని మాత్రం మరచిపోకూడదు. కుటుంబరావుగారు కథలు రాసినా, గల్పికలు రాసినా, మరేది రాసినా, అన్నింటి వెనుకా ఒక లక్ష్యం ఉన్నమాట వాస్తవమేగాని – సిద్ధాంతాల ఆవిష్కరణ కోసం జీవితాన్ని ఆయన వక్రంగా ఎన్నడూ చిత్రించలేదు. అన్ని సందర్భాలలోనూ – సిద్ధాంతాల కన్నా జీవితాన్నే ఆయన ప్రమాణంగా భావించాడు.
“- రచయిత ఆగ్రహానికి బలమైన కారణం జీవితంలో ఉండాలి. జీవితంలో లేని లోపాలను సంస్కరించి పారేస్తూ రచన చేస్తే ఆ రచనకు రెండు కాళ్ళూ ఉండనట్టే – జీవితంలో లేని విషయం మీద ఆగ్రహావేశం తెచ్చుకుని రచన చేస్తే అదో సుడిగుండంగా తయారై ఊరుకొంటుంది…” అంటారాయన.
ఇక – కథారచనలో శిల్పానికి అవాంఛనీయమైన ప్రాధాన్యతను ఇవ్వడాన్ని కుటుంబరావుగారు అంగీకరించలేదుగాని – కథకు ఆయువుపట్టు అని చెప్పదగ్గ అంశాలలో శిల్పం ముఖ్యమైనది అని ఆయన పలు సందర్భాలలో చెప్పారు. అంతేకాదు – “ఈనాటి యువకులు తమ కథల ద్వారా పరిస్థితులను మార్చాలని చూస్తున్నారుగానీ కథ యొక్క వాస్తవికత శిల్పం మీద ఎంత ఆధారపడి ఉంటుందో గ్రహించడం లేదు” అని కూడా అన్నారు.
నేటి కథా రచయితలు కొ.కు. చెప్పిన ఈ అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొనవలసిన అవసరం ఎంతయినా ఉంది.
– కథలు రాయడం తగ్గించుకున్న తర్వాత కూడా కుటుంబరావుగారు తన సమకాలీన పరిస్థితులపై పలు సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు.
‘- మనదేశంలో ప్రజాస్వామ్యం ఎన్నికలతో ప్రారంభమై అక్కడే ఆగిపోతున్నది’
“- మనం తలక్రిందులుగా నిలబడి వ్యవసాయం అనే పునాది లేకుండా పారిశ్రామికంగా పైకి రావాలని చూస్తున్నాం”.
“- ఈనాటి ప్రపంచ రాజకీయాలను సంక్షోభంలోకి నెడుతున్న అంశాలలో ఒకటి ఆహారధాన్యాలు, రెండోది పెట్రోలు. తిండిగింజలు అమెరికా పాలకుల చేతిలో ఒక అస్త్రం లాంటిది. ఒక వంక ఆహారసమస్య ప్రపంచ సమస్య అయి కూర్చున్నా కూడా అమెరికా ఆహారాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించే ఆలోచన కట్టిపెట్టలేదు”
“…తలసరి రాబడిలో అయిదుశాతం కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా తిండిపోతులుగా పౌరులు జీవించే అవకాశం ఉన్న దేశాలలో సైతం ఆహార పదార్థాలకు ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చే స్థితిలో ఉండగా – మనదేశంలో లక్షలాది ప్రజలకు ఆదాయం కడుపు నిండా తినడానికే చాలడం లేదు.
(‘రాజకీయ వ్యాసాల’ నుండి)
– వివిధ సందర్భాలలో ’70 లలో కుటుంబరావుగారు రాసిన వ్యాసాల్లోని కొన్ని వ్యాఖ్యలు ఇవి. కాలగమనంలో కొన్నిమార్పులు, చేర్పులూ, ఏర్పడినా ఈనాటికీ ఈ వ్యాఖ్యలు చాలావరకు వర్తిస్తాయి.
ఒకప్పుడు కుటుంబరావూగారు “గ్రహశకలం” అనే సైన్స్ ఫిక్షన్ కథలో చీకటి ప్రపంచంలోని వెలుగుకు, వెలుతురు ప్రపంచంలోని చీకటికి, మధ్య జరిగే సంఘర్షణ గురించి రాశారు. ‘చీకటి’ అనేదానిని పెట్టుబడిదారీ వ్యవస్థ స్వరూపానికి – ‘వెలుగు’ అనేదానిని సామ్యవాద వ్యవస్థకు ప్రతీకలుగా తీసుకుంటే ఒకనాటి రష్యా, అమెరికా విధానాలకు సంబంధించిన ఘర్షణగా దీనిని చెప్పుకోవచ్చు.
కాని, – ఇవాళ సోవియట్ యూనియన్ లేదు. రష్యాలో పెట్టుబడిదారీ ధోరణులకు చోటు దొరికింది. దీనితో సామ్యవాద ధోరణికి సంబంధించిన శకం ముగిసిపోయిందనే ‘ఆనందం’ కొందరికి లభించింది! -‘ప్రపంచీకరణ విధానాల’ పేరుతో పెట్టుబడిదారీ దేశాలు బహిరంగంగా, నిస్సిగ్గుగా, పేదదేశాలను దోచుకోవడం మొదలుపెట్టాయి. ప్రయివేటీకరణ మంత్రం పేదదేశాలలో కొందరిని మరింత ధనికులను చేస్తే – పేదవారి పరిస్థితి మరింత దయనీయమైపోయింది. ఈ సమకాలీన చరిత్రను మూడు దశాబ్దాల కిందటి కొ.కు. వ్యాఖ్యలలోంచి అవలోకిస్తే మనం ముళ్ళబాటలో చిక్కుపడిపోవడానికి గల కారణాలు అవగతం అవుతాయి.
– కొద్ది మాసాల క్రితం (2004 సం.లో) ఐక్యరాజ్యసమితి వారి మానవాభివృద్ధి నివేదిక వెలువడింది. ఈ నివేదికలో 177 దేశాలకు సంబంధించిన వివిధ మానవాభివృద్ధి అంశాలలో జరిగిన ప్రగతి ప్రాతిపదికగా ‘రేంకు’లను ఇవ్వడం జరిగింది. అందులో మన రేంకు 127 అని ప్రకటించడం జరిగింది. అంటే – అర్థశతాబ్దికి పైగా ప్రణాళికలను అమలు చేస్తూ – ఆర్థిక ప్రగతిని సాధించేస్తున్నామని డాంబికాలు పోతున్న మనం – ప్రపంచంలో (మానవాభివృద్ధి విషయంలో) అట్టడుగు స్థాయిలో ఉన్న 50 దేశాలలో ఒకటిగా ఉన్నాం!
– అదే విధంగా యు.ఎన్.డి.పి. వారి అంచనా ప్రకారం మన దేశానికి ‘హ్యూమన్ పావర్టీ ఇండెక్స్’ (మానవ దారిద్ర్య సూచిక), మహిళా అభ్యున్నతిని గురించి తెలిపే ‘జెండర్ డెవెలప్మెంట్ ఇండెక్స్’ , మొదలైనవాటి విషయంలో కూడా పరిస్థితి ఎంతమాత్రము గౌరవప్రదంగా లేదు !-
– ఏదో ఒక సంవత్సరంలో కాస్త వర్షాలు పడి పంట దిగుబడి పెరిగిన కారణంగా ఆర్థిక అభివృద్ధి రేటు (జిడిపి) పెరిగితే – ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ డంబాలు పలికితే సరిపోదు. మానవాభివృద్ధికి దోహదం చెయ్యని సంపద వృద్ధి ఏ దేశానికీ ఎంతమాత్రమూ మేలు చెయ్యదు.
ఇలాంటి స్థితిలో ఉన్న మనం – మన గురించి మరొకసారి ఆలోచించుకోవడానికి ‘కొ.కు.’ కథలు ఇవాళ్టికి కూడా ఎంతగానో ఉపకరిస్తాయి. అంతేకాదు, కథకుడిగా కలం పట్టినవారి బాధ్యతను కూడా గుర్తు చేస్తాయి.
కుటుంబరావు గారే అంటారు ఒకచోట –
“- జీవితం చాలా విశాలమైంది. సంఘంలో అనేక వర్గాలవారు, వృత్తులవారు, ప్రాంతాలవారు ఉన్నారు. వీరందరికీ అనేక వందల సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించుకునే నేపథ్యంలో వారు చిత్రవిచిత్రమైన నైతిక, ఆర్థిక పరిస్థితులకు గురి అవుతున్నారు. విస్తృతమైన ఈ జీవితాన్ని ప్రతిబింబించడానికి ఎన్ని కథలైతే చాలేటట్టు?
జీవిత వైవిధ్యంతో బాటు మార్పుకూడా చాలా వేగంగా జరుగుతున్నది. రెండేళ్ళ క్రితం ఒక సమస్య ఏరూపంలో ఉన్నదో ఈనాడది ఆ రూపంలో ఉండడం లేదు. దీనిని సాహిత్యంలో చిత్రించవలసిన ఆవశ్యకత ఉన్నది.
యివాళ్టి తెలుగు కథాసాహిత్యాన్ని అవలోకిస్తే, – ప్రపంచంలోనూ భారతదేశంలోను వచ్చిన, వస్తున్న, – మార్పులను నేటికథకులు నిశితంగా పరిశీలించడమే కాదు – పలు సందర్భాలలో వాటిని సమర్థవంతంగా కథల్లో ఆవిష్కరిస్తున్నారు. వైవిధ్యభరితంగా ఉన్న సమస్యలను, వాటి లోతులను, గమనించి కథల్లో అక్షర రూపం ఇస్తున్నారు. ఈ కృషి బహుముఖంగా జరుగుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ, వాణిజ్య పోకడల తాకిడిని తట్టుకుని జరగవలసి ఉన్నది.
ఒకనాడు గురజాడ – ఆ తర్వాతి కాలంలో కొడవటిగంటి కుటుంబరావు – వంటి ఎందరో మహనీయులు పెంచి పోషించిన ఈ ప్రక్రియ మరింతగా పురోగమించేందుకు యథాశక్తి కృషిచెయ్యడమే కుటుంబరావుగారికి నిజమైన నివాళి.
(2004 సంవత్సరం ఆగస్టు నెలలో విశాఖలో ‘వెలుగు’ సాహిత్య సంస్థ నిర్వహించిన సెమినార్ లో సమర్పించిన ప్రసంగ పత్రం.)
(తెలుగు కథంటే ఏ మాత్రం ఆసక్తి ఉన్నవారికైనా కోడూరి శ్రీరామమూర్తి గారి పేరు తెలియకుండా ఉండదు. తెలుగుకథలపై ఆయనది సాధికార స్వరం. తెలుగులో వచ్చే మంచి కథలను విశ్లేషిస్తూ ఆయన చాలాకాలం వివిధ పత్రికల్లో అనేక శీర్షికలు నిర్వహించారు. “తెలుగు కథ: నాడూ నేడూ”, “తెలుగు నవలల్లో మనోవిశ్లేషణ” మొదలైన పుస్తకాలు రాశారు. తెలుగు కథ: నాడూ నేడూ పుస్తకంలోని ఈ వ్యాసాన్ని పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన కోడూరి శ్రీరామమూర్తిగారికి కృతజ్ఞతలు.)
———————-
* ’అశోకవనం’ లో సీత కేవలం సౌందర్య దృష్టిలేని వ్యక్తి మాత్రమే కాదు, ఇంకా చాలా ’కథ’ ఉంది. -సం.
చాలా సమగ్రమైన ఈ వ్యాసంలో రచయిత ఎన్నో విషయాలు సమర్థవంతంగా చర్చించగలిగారు.
అనేకమంది విమర్శకులు ఉందని చెప్పినప్పటికీ చలం ప్రత్యక్ష ప్రభావం తన మీద ఉండేది కాదని కుటుంబరావుగారు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
ఆయన మధ్యతరగతివారి గురించి ఎంత రాసినా అది దున్నపోతు మీద వర్షంలాగానే పరిణమించింది. తరవాతి దశలో ఆయన విరసం వేపు ఆకర్షితుడవడానికి కారణం అదే.
ఇక ఈనాటి సమాజం తొండగా ప్రారంభమై కాలంతో బాటు ముదిరినటువంటి ఊసరవెల్లి అనిపిస్తుంది. మధ్యతరగతివారికి social consciousness, political correctness మొదలైనవి లేశమాత్రం కూడా ఉండనవసరం లేదని రుజువైపోయింది. అందినంత దండుకోవడంలో తప్పేమీ లేదనే మెసేజ్ చిన్నతనం నుంచే అందుతూ ఉంటుంది. ఈ దోపిడీలో భాగం పంచుకోలేని దిగువ మధ్యతరగతివారు రాజీపడి, అణిగి ఉండడమో, తిరుగుబాటు చెయ్యడమో తేల్చుకోవాలి.
గొప్ప వ్యాసం!
ఒకానొక వ్యక్తి సాహిత్యం పై ఓ వ్యాసం రాయాలంటే ఎలా రాయాలో ఈ వ్యాసం చదివాక అర్థమైంది నాకు. ఈ వ్యాసం ద్వారా నేను తెలుసుకున్నన్ని విషయాలు బహుశా ఏ వ్యాసం ద్వారానూ తెలుసుకోలేదు ఏమొ. ఈ వ్యాసం లో చెప్పిన కథల్లో చాలా మటుకు నేను చదవలేదు. ఎప్పుడో చదివితే, మళ్ళీ ఈ వ్యాసం చదువతాను.
““కథారచయితగా చెహోవ్ ఇతివృత్తం మీదా, ఏదో ఒక ఆశ్చర్యదాయకమైన విషయం మీద కాక – మొత్తం వాతావరణం మీదా – ఒకసంఘటన ప్రాతిపదికగా జీవితానుభూతినంతటినీ పట్టుకోగలగడం మీద ఆధారపడతాడు.” అంటూ చెహోవ్ గురించి ‘మార్టిన్ సేమూర్-స్మిత్’ చేసిన విశ్లేషణ (’గైడ్ టు మోడరన్ వరల్డ్ లిటరేచర్’ అనే గ్రంథంలో) కుటుంబరావుగారికి కూడా చాలా వరకూ వర్తిస్తుంది.”
– చెహోవ్ గురించిన ఈ విశ్లేషణ కు నా వోటు కూడా.
““నన్నడిగితే కసికొద్దీ, మంటకొద్దీ రాసేది నాకు బాగుంటుంది. కసి అంటే పళ్ళు కొరకడమూ, చిందులుతొక్కడమూ అనుకోనక్కరలేదు. ఆ కసి వీరేశలింగం గారి రచనల్లో ఉన్నట్లే ఉండనవసరం లేదు. ‘కన్యాశుల్కం’లో ఉన్నట్లు కూడా ఉండవచ్చును. చలంగారి కథల్లో కసి ఉంది. ఆయనలో సౌందర్యదృష్టి ఒకపాలు తగ్గి, కసి ఇంకో పాలు పెరిగితే ఇంకా బాగుండునేమో అనిపిస్తుంది. రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి కథల్లో ఉన్నదా కసి. భమిడిపాటి వారి హాస్యంలో పళ్లు పటపటలాడించే కసి ఉండేది. సెటైరంతా కసి సాహిత్యమే.”
– బాగుంది ఈ వ్యాఖ్య 🙂