ఆధునిక తెలుగు సాహిత్యం లో నవీన్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ” అంపశయ్య ” తో మొదలై ఇప్పటికీ సాగుతూ నవల , కథ , విమర్శ ఇలా వేర్వేరు పాయలు గా చీలినా ఒకటే అంతరాత్మ తో ఇంకా గలగలమంటూ ప్రవహిస్తున్న నది నవీన్. నేను సాహిత్యం, అందునా తెలుగులో, చదివింది తక్కువ. కానీ చదివినంత మటుకు ఇటీవలి కాలం లో విరివిగా చదివింది నవీన్ నే. నవీన్ గారు చలాన్ని గురించి రాసిన వ్యాసాలు చదివాక నేనూ నవీన్ గురించి రాయడానికి ప్రయత్నిస్తాను అనుకున్నా. ఆ ఆలోచనకి అక్షరరూపమే ఈ వ్యాసం.
మొదట నవలల సంగతి: ” అంపశయ్య ” గురించి , అది సృష్టించిన సంచలనం గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ” చైతన్య స్రవంతి” ని సామాన్యుల ముంగిట నిలిపి అందులోని అందాన్ని ఆవిష్కరించడమేగాక , జీవితమొక చైతన్య స్రవంతి అన్న భావాన్ని కలిగించారు ఆ నవలతో. సాధారణ మైన భావాలకు సాధారణమైన భాష లోనే అక్షరరూపం ఇవ్వడం, అక్కడక్కడా తొంగి చూసే కవితాత్మకత ఈ అంపశయ్యను చదివింపజేస్తాయి. అయితే అతిగా ఆంచనాలు వేసుకున్నందువల్లో ఏమో మరి నన్ను ఈ నవల అంతగా తృప్తి పరచలేక పోయింది.
ఇక ” కాలరేఖలు ” త్రయం. 1940 ల నుంచి 1990 ల దాకా తెలంగాణా ప్రజా జీవితాన్ని చిత్రిస్తూ రాసిన నవలా త్రయం. వీటిలో ” కాలరేఖలు” మొదటిది. కథానాయకుడు రాజు స్కూల్ రోజుల్లో నడిచిన కథ. “చెదిరిన స్వప్నాలు” రెండోది. “బాంధవ్యాలు” మూడోది. మూడింటిలోనూ నేను ప్రధానంగా గమనించినది – సామాజిక చిత్రణా , ఒక వ్యక్తి కుటుంబ చిత్రణా , జనం ఆలోచనా విధానం వెరసి ప్రజా జీవితమూ. సామాన్యులే ఈ త్రయంలో నాయకులు. వాళ్ళ కష్ట -నష్టాలు , కోప – తాపాలు , భయాలు , నవ్వులూ , మాటలు , చేతలూ , నమ్మకాలూ – ఇవన్నీ కలిపితే “కాలరేఖలు” , “చెదిరిన స్వప్నాలు” , “బాంధవ్యాలు” – మూడు నవలలు అవుతాయి. వరుసగా ఇవి మూడూ చదివితే కథానాయకుడు మన కళ్ళ ముందు పెరిగిపెద్దవాడైన అనుభూతి…. రాజు (బాంధవ్యాలు లో నరేందర్) జీవితంలో ప్రతి మెట్టు నూ చదువరి రాజుకి సన్నిహితంగా అనుభవించిన అనుభూతి కలుగుతుంది. ఇంతకంటే సామాన్యుడి పదజాలంలో గొప్పరచన అన్న పదానికి మంచి అర్థం ఉంటుందా ?? బాంధవ్యాలు కి వచ్చేసరికి పట్టు తగ్గి కాస్త నిరాశ కలిగించినా అది కూడా చదివించే నవలే.
” రక్తకాసారం” – ఓ ప్రయోగం లా తోస్తుంది. ఆసక్తి కరమైన చర్చలు , అక్కడక్కడా కాస్త వ్యంగ్యం , ఆలోచింపజేసేలా ఉన్న శైలి , రచయిత ఎక్కడా తన అభిప్రాయాలు మనపై రుద్దడానికి ప్రయత్నించకపోవడం నాకు నచ్చాయి ఈ పుస్తకంలో. ఇదే నవీన్, ఇన్ని మంచి నవలలు రాసిన నవీన్ “సంకెళ్ళు”, “చెమ్మగిల్లని కన్నులు”, “తీరని దాహం”, “సౌజన్య”, “మౌన రాగాలు” – లాంటి నవలలు రాసారు అంటే ఓ పట్టాన నమ్మాలనిపించదు. “తారు – మారు”,”విచలిత” వంటి నవలల్లో సమస్య ని బాగా చర్చించినా చూపిన పరిష్కారం అంత హర్షింపదగ్గదిగా తోచదు నాకు. ఈ రెంటిలోనే ఎందుకో నాకు నవీన్ పై చలం ప్రభావం ఎక్కువేమో అనిపించింది. ఆయన చలం పై రాసిన వ్యాసాలు చదివాక అది నిజమే అని అనిపించింది.
“చీకటి రోజులు” నవల ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల పై రాసిన నవల. అనుకుంటా నవీన్ రచనల్లో నేను ఆంగ్లానువాదం చదివింది ఇదొక్కటే. పూర్తిగా డైరీ లా అనిపించింది. అయినా కూడా చదవడానికి బానే ఉండింది. కానీ, ఎందుకో దీన్ని గురించి ప్రత్యేకంగా తలుచుకునేంత గొప్పగా అనిపించలేదు.
కథలు – నవీన్ కథలలో నవలల్లో ఉన్నంత పట్టు లేదు అనిపించింది. కొన్ని కథలు డాక్యుమెంటరీల్లా ఉన్నాయి. వస్తు వైవిధ్యం లేక పోవడం దీనికి ఓ కారణం అయి ఉండవచ్చు. అయితే ఇవి అన్నీ కూడా తెలంగాణా జీవితం పై నవీన్ కి ఉన్న స్పష్టమైన అవగాహన ను తెలియజేస్తాయి.
వ్యాసాలు – నవీన్ వ్యాసాలు అద్భుతంగా రాస్తారు. సాహిత్యం ధోరణుల గురించీ, ప్రముఖుల శిల్పం గురించీ – ఇలా ఎన్నో విషయాల గురించి చక్కని పరిచయం కలుగజేస్తాయి. నవీన్ విశ్లేషణలు ఆయన ఎంతగా చదివారో, ఎంతగా గమనించారో చెప్పకనే చెబుతాయి. నవలల్లో లేని చమత్కారం, వ్యంగ్యం వ్యాసాల్లో చాలనే ఉన్నాయి. ఈ విమర్శలు సాహిత్యాభిమానులకు , కొత్తగా చదవడం మొదలుపెట్టిన వారికీ – ఇద్దరికీ చాలా ఉపకరిస్తాయి.
అయితే ఆద్యంతమూ నేను గమనించింది నవీన్ హాస్యానికి తగిన స్థానం ఇవ్వకపోవడం. నిజ జీవితంలో సందర్భవశాత్తూ తొంగి చూసే హాస్యమైనా కనబడదు ఆయన నవలల్లో. ఈ కారణం వల్లే నవలలు రాసిన నవీన్, వ్యాసాలు రాసిన నవీన్ ఒకరేనా అని సందేహం వచ్చింది – వ్యాసాల్లోని చమత్కారమూ వ్యంగ్యమూ చూసాక. వర్ణనల్లో కొన్ని వర్ణనలు మిగతా వర్ణనల మీద ఎక్కువ స్థానం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ప్రతి నవల లోనూ సమాజం గురించి ఆలోచనలూ , సమస్యల గురించిన ఆవేదనలూ, పరిష్కారం కోసం అన్వేషణా కనిపిస్తాయి. చక్కని అబ్జర్వేషన్ కనిపిస్తుంది చాలా చోట్ల. కొన్ని చోట్ల అర్థం కాని వర్ణనలూ ఉన్నాయి … ఉదాహరణ కి “మనోరణ్యం” లోని “…ఎందుకనో గానీ ఆమె కళ్ళల్లో విపరీతమైన అలసటా విసుగూ కనిపిస్తాయి. అలా కనిపించడం వల్లనేమో ఆమె మామూలు స్త్రీలకంటే కొంత ఉన్నతమైన సంస్కారం కల్గినదానిలా కనిపిస్తుంది. ” వంటివి.
మొత్తానికి నేను పట్టుబట్టి వరుసగా నవీన్ వి చదవాలి అనుకోకపోయినా కూడా ఒక దశ లో వరుసగా అవే చదివాను. బోరు కొట్టించినవి ఉన్నా కూడా ఇదో మంచి అనుభవం. విమర్శకుడిగా నవీన్ రచనలు ఎంతగా చదువరులకి ఉపకరిస్తాయో చాలా వరకు ఆయన నవలలు అంతగా చదివిస్తాయి. నా అనుభవంలో నేను నవీన్ ని నాలుగు రకాలుగా చూస్తున్నాను – చదువరి, విమర్శకుడు, నవలారచయిత, కథకుడు. ఇదే వరుస నాకు నచ్చిన వరుస కూడా.
తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రచనల్లో 2 కథలు పొద్దులో, 2 కథలు ఈమాటలో, మరికొన్ని కథలు, కవితలు తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి.
సమీక్ష పర్వాలేదు. ఐతే మరింత సమగ్రంగా రాయొచ్చు. ఆ దిశగా కృషి చెయ్యండి.
మీ బ్లాగులో నవీన్ పుస్తకాల పరిచయం చూశాకే నాకు అంపశయ్య గురించీ, “చైతన్య స్రవంతి” రచనా పద్దతి గురించీ తెలిసింది.
నేనింకా ఆయన వ్యాసాలు, విమర్శలూ చదవలేదు. “అంపశయ్య” నచ్చింది గానీ మీరన్నట్లే దానిపై అతిగా ఆశ పెట్టుకోవడం వల్లనో లేక కాలేజీ జీవితం ముగిసిన చాలా ఏళ్ళకు చదవడం వల్లనో మరీ అంత బాగా వుందనిపించలా.
అయితే తెలంగాణా చరిత్ర యొక్క నవలాత్రయం మీద నాకు పూర్తి భిన్నాభిప్రాయం. వీటిలో మొదటి “కాలరేఖలు” చాలా బోర్ కొట్టించింది. ఇదీ మరీ తన చిన్నప్పటి జీవితం గురించి కాబట్టి ఆయనకు సబ్జెక్టు మీద అంత పట్టులేకుండా రాశారా అనిపించింది. అయితే “చెదిరిన స్వప్నాలు”, “భాంధవ్యాలు” అదే క్రమంలో చాలా ఆసక్తిని కలిగించాయి. విడువకుండా చదివించాయి.
నవీన్ కథలైనా, నవలికలైనా నాకు బాగా నచ్చాయి. తెలంగాణా సమస్యలనీ ఏ పక్షపాతం లేకుండా రాశారు అనిపించింది.
“చీకటి రోజులు” కేవలం కొద్దిరోజుల్లో జరిగిన ఒక సాధారణ వుపాద్యాయుడి ఎమర్జన్సీ రోజుల అరెస్టు గురించే అయినా అందులో నాకు ఎటువంటి ఉత్ప్రేక్షలూ, అలంకారాలూ లేకుండా కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు అనిపించింది. దీని ఆగ్లానువాదం ఎలా వుందో గానీ మీరు తెలుగులోనే చదివి వుంటే నచ్చేదేమొ!
హాస్యం గురించి మీరన్నదే నేనూ గమనించాను.
సుబ్రమణ్యం గారన్నట్లు ఇంకా మీరు సమగ్రంగా రాయాల్సింది.
–ప్రసాద్
http://blog.charasala.com
I use to read Mr.Ampashaiah Naveen`s Serial “Premonmadulu” in Nadi Magazine..
Some how I could get his Phone number & appreciated his Serial..